HCU
-
సీఎం రేవంత్‌ను కలిసిన రోహిత్ వేముల తల్లి
సాక్షి, హైదరాబాద్: రోహిత్ వేముల తల్లి రాధిక వేముల శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కొడుకు ఆత్మహత్య కేసులో తమకు న్యాయం జరిగేలా చూడాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. సమగ్ర విచారణ జరిపించాలని వినతి పత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన రేవంత్.. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.కాగా సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. అతని ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని హైకోర్టుకు పోలీసులు తెలియజేశారు. అలాగే అతను ఎస్సీ అనేందుకు ఎటువంటి ఆధారాలు కూడా లేవని, బీసీ వడ్డెర కులానికి చెందినవాడని పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్యకు వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు కోర్టుకు చెప్పారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు పలు పిటిషన్లలో విచారణను ముగించింది.మరుసటి రోజే రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. విచారణ, దర్యాప్తు విధానంపై రోహిత్ వేముల తల్లితోపాటు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారని, దీంతో కేసు విషయంలో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారుజతదుపరి దర్యాప్తును అనుమతించాలని మేజి్రస్టేట్‌ను అభ్యర్థిస్తూ సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని డీజీపీ పేర్కొన్నారు. -
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్!
రాయదుర్గం (హైదరాబాద్): 2047 నాటికి ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ గుర్తింపు పొందడం ఖాయమని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనర్(యూజీసీ) చైర్మన్, విద్యావేత్త ప్రొఫెసర్ ఎం.జగదీశ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. గచ్చిబౌలి లోని శాంతిసరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పట్టాల తోపాటు గోల్డ్‌మెడల్స్, ఫ్యాకల్టికి చాన్స్‌లర్స్ అవార్డుల ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగానే కాకుండా ఆర్థికంగా ఎదుగుతున్న దేశంగా భారత్ ప్రపంచంలోనే మూడోస్థానంలో నిలిచిందన్నారు. సోలార్ పవర్ ఉత్పత్తిలో 2030 నాటికి 100 మెగావాట్స్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశంగా గుర్తింపు పొందడం ఖాయమన్నారు. దేశంలోని అన్ని స్టేట్ యూనివర్సిటీలలో 70 నుంచి 80% ఫ్యాకల్టీ ఖాళీలు కొనసాగుతున్నాయని తెలుస్తోందని, వాటిని వెంటనే భర్తీ చేయా లని జగదీశ్‌కుమార్ సూచించారు. సెంట్రల్ వర్సిటీలలో భర్తీల ప్రక్రియ ఆరంభమైందని, త్వరలో పూర్తి స్థాయిలో భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. యువత నోబెల్ బహుమతి సాధించాలి: గవర్నర్ తమిళిౖసై నేటి తరం యువత నోబెల్ బహుమతి సాధించాలనే లక్ష్యంతో కష్టపడాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన జాతీయ విద్యావిధానం–2020లో ఎన్నో సంస్కరణలకు దారి తీసిందని, దీన్ని అందరూ స్వాగతించాలన్నారు. మాతృభాషలో విద్యాబోధన చేస్తే విద్యార్థులు మరింతగా రాణించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం హెచ్‌సీయూ చాన్స్‌లర్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ బీజేరావు కూడా మాట్లాడారు. రిజి స్ట్రార్ డాక్టర్ దేవే‹Ùనిగమ్, పలువురు ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులు, అధికారులు పాల్గొన్నారు. -
హెచ్‌సీయూలో కొలువుదీరిన కొత్త భవనాలు
రాయదుర్గం, శంషాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నూతనంగా నిర్మాణం చేసిన అయిదు భవనాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. రూ.81.27 కోట్ల వ్యయంతో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, సరోజినీ నాయు డు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్(అనుబంధం)కు భవనాలతో పాటు లెక్చర్ హాల్ కాంప్లెక్స్–3 భవనాన్ని ఆదివారం మహబూబ్‌నగర్ నుంచి వర్చువల్‌గా పీఎం ప్రారంభించారు. కేంద్ర విద్యాశాఖ, యూజీసీ మంజూరు చేసిన నిధులతో వీటి నిర్మాణం పూర్తి చేశారు. ఈ భవనాల నిర్మాణంతో ఆయా విభాగాల విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రావడమే కాకుండా సమావేశాల నిర్వహణ, తరగతుల నిర్వహణకు అవసరమైన లెక్చర్ హాల్–3 కూడా అందుబాటులోకి వచ్చింది. -
వరల్డ్ టాప్ వర్సిటీల్లోహెచ్సీయూ, ఐఐటీ–హైదరాబాద్
సాక్షి, న్యూఢిల్లీ: సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ (సీడబ్ల్యూయూఆర్)–2023లో తెలంగాణ నుంచి రెండు యూనివర్సిటీలు చోటు సంపాదించుకున్నాయి. మొదటి 2 వేల యూనివర్సిటీల్లో దేశం నుంచి 64 యూనివర్సిటీలు టాప్ ర్యాంకుల్లో ఉండగా, తెలంగాణ నుంచి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 1,265వ ర్యాంకు, ఐఐటీ–హైదరాబాద్ 1,373వ ర్యాంకు సాధించాయి. గత ఏడాది ర్యాంకులతో పోలిస్తే హెచ్‌సీయూ 7 ర్యాంకులు కిందకు పడిపోగా, ఐఐటీ–హైదరాబాద్ మాత్రం 68 స్థానాలు పైకి ఎగబాకింది. దేశంలో ఐఐటీ–అహ్మదాబాద్ 419 ర్యాంకుతో టాప్‌లో ఉండగా తర్వాతి స్థానాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐటీ–మద్రాస్ ఉన్నాయి. ఇక వరల్డ్ టాప్ వర్సిటీల్లో హార్వర్డ్ యూనివర్సిటీ నంబర్‌వన్‌గా నిలిచింది. విద్య నాణ్యత, ఉపాధి, అధ్యాపకుల నాణ్యత, పరిశోధన పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించింది. పరిశోధనల్లో వెనకబాటుతో పాటు నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం కారణంగా దేశ యూనివర్సిటీలు వెనకబడ్డాయని సీడబ్ల్యూయూఆర్ నివేదిక వెల్లడించింది. దేశంలో నాల్గోస్థానం రాయదుర్గం: దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిలిచింది. ‘ది వీక్ హన్సా’పరిశోధన సర్వే–2023లో దేశంలోని టాప్ 85 మల్టీ డిసిప్లినరీ వర్సిటీల్లో రాష్ట్ర, సెంట్రల్, ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల్లో హెచ్‌సీయూ నాల్గోస్థానంలో నిలిచింది. 2022లో ఐదో స్థానంలో ఉండగా ఈ సంవత్సరం ఒక స్థానం పైకి ఎగబాకింది. దక్షిణాదిలోని టాప్ మల్టీ డిసిప్లినరీ విశ్వవిద్యాలయాల్లో మొదటి స్థానంలో ఉంది. అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అధికార యంత్రాంగం, సిబ్బంది సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని, భవిష్యత్తులో టాప్‌లో నిలిచేందుకు ప్రయత్నం చేస్తామని వీసీ ప్రొఫెసర్ బీజేరావు తెలిపారు. -
హెచ్‌సీయూలో ఉద్రిక్తత.. మోదీ బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనతో టెన్షన్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. హెచ్‌సీయూలో ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన వల్ల ఏబీవీపీ-ఎస్ఎఫ్ఐ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో, పోలీసులు వారిని ఎంట్రీ ఇచ్చారు. వివరాల ప్రకారం.. హెచ్‌సీయూలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్యాంపస్‌లో గురువారం సాయంత్రం కశ్మీర్ ఫైల్స్‌ను ప్రదర్శించేందుకు ఏబీవీపీ ప్రయత్నించింది. ఈ సందర్భంగా మోదీ బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఎస్ఎఫ్ఐ నేతలు ప్రయత్నించారు. దీంతో, ఇరు వర్గాల విద్యార్థి సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో క్యాంపస్‌లో ఎలాంటి ప్రదర్శనలకు అనుమతిలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన కారణంగా హెచ్‌సీయూలో పోలీసులు భారీగా పోలీసులు మోహరించారు. -
HCU: విదేశీ విద్యార్థినిపై లైంగికదాడియత్నం.. ప్రొఫెసర్ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కాగా, ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రొఫెసర్ రవిరంజన్‌పై కేసు నమోదు చేశారు. ఈ సందర్బంగా పోలీసులు సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్నారు. ఈ క్రమంలో ఏసీపీ రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ.. బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నాము. హిందీ నేర్పిస్తానని థాయ్‌లాండ్ విద్యార్థిని ఇంటికి పిలిచి ప్రొఫెసర్ రవిరంజన్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. సాఫ్ట్ డ్రింక్‌లో లిక్కర్ కలిపి అత్యాచారం చేయబోయాడు. విద్యార్థిని ప్రతిఘటించి పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. మరోవైపు.. విద్యార్థినిపై అత్యాచార ఘటన నేపథ్యంలో హిందీ ప్రొఫెసర్ రవిరంజన్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఇక, దారుణ ఘటన నేపథ్యంలో సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గేట్ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. రవిరంజన్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
హెచ్‌సీయూలో 29 వరకు ‘సుకూన్–2022’
గచ్చిబౌలి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో శుక్రవారం నుంచి సందడి నెలకొననుంది. ప్రతిష్టాత్మకమైన ‘సుకూన్’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. హెచ్‌సీయూ క్యాంపస్‌లోని సుకూన్ గ్రౌండ్స్, కొమ్రమ్ భీమ్ ఓపెన్ డయాస్‌లో మూడు రోజులపాటు కార్యక్రమం కొనసాగనుంది. కార్యక్రమంలో భాగంగా కొలేజ్ పోటీలు, డ్యాన్స్ పోటీలు, పాటల పోటీలు, ఫేస్ పెయింటింగ్ పోటీలు, బైత్‌బాజీ కార్యక్రమం, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, రంగోలి, ముగ్గుల పోటీలను నిర్వహించనున్నారు. పోస్టర్ మేకింగ్ పోటీలు, మెహిందీ పోటీ, మొబైల్ ఫోటోగ్రఫీ, క్విజ్ పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గురువారం హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షులు అభిషేక్‌నందన్ మాట్లాడుతూ ఈనెల 27,28,29 తేదీల్లో ‘సుకూన్–2022’ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మొదటి రోజు డప్పు చందు కార్యక్రమం, ట్రైబల్ ఫోక్ షో, సూఫీ ఖవ్వాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. రెండో రోజు ఆర్కెస్ట్రా, రాక్ షోను నిర్వహించడం జరుగుతుందన్నారు. చివరిరోజైన మూడో రోజు డీజే నైట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. -
హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. పలుచోట్ల భారీగా ఈదురుగాలులు వీశాయి రాళ్ల వర్షం కురిసింది. పశ్చిమ హైదరాబాద్ ప్రాంతమంతా మేఘాలు కమ్ముకున్నాయి.గచ్చిబౌలి, హెచ్‌సీయూ, తెల్లాపూర్, నార్సింగి, మణికొండ, బంజారాహిల్స్, పుప్పాలగూడ, రాజేంద్రనగర్, హైదర్‌గూడ, అత్తాపూర్, గండిపేటతో పాటు సమీప ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గాలి దూమరానికి నాంపల్లిలోని ఆర్డీవో కార్యాలయ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం నుంచి ఇనుప రేకులు కొట్టుకు వచ్చాయి. ఈ ఘటనలో మూడు కార్లు ధ్వసం అవ్వగా.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ ఏరియాలో చాలా రోజుల తర్వాత కుండపోత వర్షం పడింది. చదవండి: Padamati Anvitha Reddy: ఎవరెస్టంత సంతోషం -
ప్రధాని హైదరాబాద్ పర్యటన: వ్యతిరేక ఫ్లెక్సీల కలకలం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ కంటే ముందుగా ఆయన హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం 12గం.50ని.కు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోదీ చేరుకుంటారు. ఆపై ఒంటిగంట నుంచి పదిహేను నిమిషాల పాటు బీజేపీ నేతలతో భేటీ అవుతారు. ఆపై బేగంపేట్ నుంచి హెలికాఫ్టర్‌లో హెచ్‌సీయూకి చేరుకుంటారు ప్రధాని. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో.. ఐఎస్బీకి వెళ్తారు. ఐఎస్బీ వార్షికోత్సవం, స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం ఆయన బేగంపేట్ చేరుకుని.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్తారు. బీజేపీ నేతలతో ప్రధాని మోదీ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. మోదీ వ్యతిరేక ఫ్లెక్సీలు ఇక ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా.. ఆయనకు స్వాగతం చెబుతూ బీజేపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే అక్కడక్కడ వ్యతిరేక ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. మొత్తం పదిహేడు చోట్ల ప్రధానిని ప్రశ్నిస్తూ.. ఆ ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణకు ప్రధాని మోదీ ఏం చేశారో చెప్పాలంటూ టీఆర్ఎస్ నేతలు వీటిని ఏర్పాటు చేసినట్లు సమాచారం. -
ఇంటర్నెట్లో అండర్ వరల్డ్‌గా డార్క్ వెబ్!
...ఇటీవల కాలంలో బయటపడిన ఈ రెండు ఉదంతాలే కాదు... నగరంలో జరుగుతున్న డ్రగ్స్ దందాలో సగానికి పైగా డార్క్ నెట్ ద్వారానే సాగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితం మహేష్ బ్యాంక్ కేంద్రంగా చోటు చేసుకున్న రూ.12.48 కోట్ల స్కామ్‌లోనూ డార్క్ వెబ్ పాత్ర ఉంది. ఈ నేపథ్యంలోనే దీనిపై పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. హెచ్–న్యూలో పని చేస్తున్న సిబ్బంది, అధికారులకు ఈ కోణంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించడానికీ సన్నాహాలు జరుగుతున్నాయి. సాక్షి హైదరాబాద్: మాదకద్రవ్యమైన ఎల్ఎస్డీ బ్లాట్స్ డార్క్ నెట్ నుంచి ఖరీదు చేసి, నగరంలో విక్రయిస్తున్న షాబాజ్నగర్, కూకట్పల్లి ప్రాంతాలకు చెందిన సయ్యద్ ఆసిఫ్ జిబ్రాన్, పి.తరుణ్‌లను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు గత నెల 24న పట్టుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందా గుట్టును హెచ్–న్యూ ఫిబ్రవరి 26న రట్టు చేసింది. దీనికి సూత్రధారిగా ఉన్న విద్యార్థి నిమ్మగడ్డ సాయి విఘ్నేష్ డార్క్‌నెట్ నుంచి ఎల్ఎస్డీ బ్లాట్స్ ఖరీదు చేసి విక్రయించాడు. అదో ‘అక్రమ’లోకం డార్క్ నెట్ లేదా డార్క్ వెబ్‌తో సమాజానికి, ఏజెన్సీలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. మాఫియా ప్రపంచంలో మాదిరిగానే ఆన్‌లైన్‌లోనూ అధోజగత్తు ఉంది. కనిపించే అండర్‌వరల్డ్‌లో మాఫియా డాన్లు రాజ్యమేలితే... ఇంటర్నెట్లోని డార్క్‌నెట్/వెబ్‌గా పిలిచే అండర్‌గ్రౌండ్ వెబ్‌లో డ్రగ్స్, ఆయుధాలు, మనుషుల అక్రమ రవాణా వంటి వ్యాపారాలు సాగుతుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటూ అక్రమ దందాలకు డార్క్ వెబ్ అడ్డాగా మారిపోయింది. నిఘాకు చిక్కకుండా ఉండేందుకు... కంప్యూటర్లలో వినియోగించే విండోస్ ఆపరేటింగ్ సిస్టం, వివిధ చిరునామాలతో ఇంటర్నెట్లో ఉండే వెబ్సైట్లు అందరికీ తెలిసినవే. ఇటీవల కాలంలో అనేక ఈ–కామర్స్ వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చి, అగ్గిపెట్టె నుంచి ఆడి కారు వరకు క్రయవిక్రయాలను ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చాయి. వీటి ద్వారా మాదకద్రవ్యాలు, ఆయుధాలు వంటివి విక్రయానికి పెడితే పోలీసు, నిఘా వర్గాలు గుర్తించి పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి నిఘాకు చిక్కకుండా, ‘తమ వినియోగదారుల’ మినహా మిగిలిన వారికి కనిపించకుండా అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాలు ఇంటర్నెట్లోని అండర్ వరల్డ్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. దీన్ని సాంకేతికంగా ‘డీప్ వెబ్’, ‘అండర్‌గ్రౌండ్ వెబ్’, ‘డార్క్ వెబ్’ అని పిలుస్తారు. ‘ఎంట్రీ’ సైతం ఈజీ కాదు.. ఏ వినియోగదారుడైనా విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ డీప్ వెబ్‌లోకి చొరబడటం సాధ్యం కాదు. ఈ అధోజగత్తులో అడుగుపెట్టాలంటే టెయిల్స్‌గా పిలిచే ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టంను ఇన్స్టాల్ చేసుకోవాలి. దీంతో పాటే టోర్స్ అనే ఆపరేటింగ్ సిస్టం సైతం ఇన్స్టాల్ అవుతుంది. వీటిని తమ కంప్యూటర్లలో ఏర్పాటు చేసుకుంటున్న పెడ్లర్లు తమ దందా కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ల్యాప్‌టాప్, కంప్యూటర్ ద్వారానే యాక్సస్ చేసే డార్క్ వెబ్‌ను ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల నుంచీ ఆపరేట్ చేసేస్తున్నారు. ఇందులో ఉండే అనేక వెబ్సైట్, గ్రూపులను సంప్రదించి డ్రగ్స్, మారణాయుధాల సహా ఏదైనా ఖరీదు చేసేయవచ్చు. పోస్టు లేదా కొరియర్ ద్వారా వచ్చే ఈ ‘మాల్’ను అందుకోవడానికి తప్పుడు చిరునామాలు ఇచ్చి నేరుగా ఆయా ఆఫీసులకు వెళ్లి..నకిలీ ధ్రువీకరణలు చూపించి డెలివరీ తీసుకుంటూ తమ ఉనికి బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బిట్ కాయిన్స్ రూపంలో చెల్లింపులు... డీప్ వెబ్‌లోని వెబ్సైట్లలో ఆర్డర్ ఓ ఎత్తయితే దీనికి సంబంధించిన చెల్లింపులు మరోఎత్తు. ఈ లావాదేవీలు సైతం ఆన్లైన్లోనే క్రిప్టోకరెన్సీగా పిలిచే బిట్‌కాయిన్స్ రూపంలోనే సాగుతాయి. దీనికోసమూ ఇంటర్నెట్లో కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. వాటిలోకి లాగిన్ కావడం ద్వారా ఓ ఖాతా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా నగదు చెల్లించి బిట్ కాయిన్స్‌ను తమ ఖాతాలోకి జమ చేసుకుంటారు. ‘డీప్ వెబ్’లో కొనుగోలు చేసిన ‘మాల్’కు అవసరమైన చెల్లింపులన్నీ ఈ బిట్‌కాయిన్స్ రూపంలోనే చేస్తారు. ఈ వ్యవహారంలో ఎక్కడా విక్రయిస్తున్న, ఖరీదు చేస్తున్న వ్యక్తుల వివరాలు వేరొకరికే కాదు... ఒకరికొకరికీ తెలిసే అవకాశం ఉండదు. హెచ్–న్యూకు చిక్కిన పెడ్లర్స్ ఈ రకంగానే దందా చేస్తూ ఎల్ఎస్డీని ఖరీదు చేసి నగరంలోని వారికి సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. సర్వర్లను కనిపెట్టడమూ అసాధ్యమే ‘డీప్ వెబ్’కు సంబంధించిన సర్వర్లు, వాటి చిరునామాలతో పాటు నిర్వహిస్తున్న వారి వివరాలూ బయటకు తెలిసే అవకాశాలు లేవు. ఇదే అసాంఘిక శక్తులకు కలిసి వస్తున్న అంశంగా మారిపోయింది. ఈ తరహా కేసులు గతంలో ఇతర నగరాల్లో ఎక్కువగా వెలుగులోకి వచ్చినా... ఇటీవల కాలంలో నగరంలోనూ పెరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఇలా ఆర్డర్ చేసిన డ్రగ్స్‌లో కొన్ని విదేశాల నుంచి మరికొన్ని ఉత్తరాది నుంచి వస్తున్నట్లు ఆధారాలు సేకరించామన్నారు. (చదవండి: డీజే.. డ్రగ్స్ రిస్క్!) -
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్.. వార్షిక వేతనాల్లో కోత
క్యాంపస్ ప్లేస్మెంట్లకు అడ్డా అయిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై కోవిడ్ ఎఫెక్ట్ పడింది. ఒకప్పుడు రికార్డు స్థాయిలో వార్షిక వేతనాలు దక్కించుకున్న విద్యార్థులకు నేడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ దేశంలో నైపుణ్యం, ప్రతిభ కలిగిన విద్యార్థులందరూ వచ్చి చేరే క్యాంపస్‌లలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి. ప్రపంచ స్థాయి కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ఇక్కడికి వస్తుంటాయి. విద్యార్థులు ఫైనల్ ఇయర్లో ఉండగానే లక్షల జీతాలు చెల్లించి తమ సంస్థలో చేర్చుకుంటామంటూ ఆఫర్ లెటర్లు ఇస్తుంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. ఈ ఏడాది ఇదే అధికం ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎంటెక్ విద్యార్థి సోమ్నాథ్పాల్ అత్యధిక వార్షిక వేతనం దక్కించుకున్న విద్యార్థిగా నిలిచారు, ఒక మల్టీ నేషనల్ కంపెనీ రూ. 17 లక్షల వార్షిక వేతనం చెల్లించే ఒప్పందం మీద సోమ్‌నాథ్‌కి అవకాశం పొందారు. అంతకు ముందు ఏడాది అత్యధిక వార్షిక వేతనం రూ. 43 లక్షలు ఉండగా కోవిడ్‌కి ముందు ఏడాది ఈ మొత్తం రూ. 45 లక్షలుగా నమోదు అయ్యింది. రూ. 20 లక్షల తేడా కోవిడ్ కారణంగా కంపెనీలు ఎక్కువ వేతనం చెల్లించేందుకు సిద్ధంగా లేవు. దీంతో ఏడాది వ్యవధిలోనే ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వంటి చోట అత్యధిక వార్షిక వేతనాల్లో ఏకంగా 20 లక్షల వరకు తగ్గిపోయింది. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ ప్లేస్మెంట్ సగటు వేతనం రూ. 8 నుంచి 10 లక్షల మధ్య ఉంటుండగా ఇప్పుడు అది రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పడిపోయిందని వర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రేరణ తెలిపారు. ఈ కోర్సులకే ప్రాముఖ్యత క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం వస్తున్న కంపెనీలు ఎక్కువగా డేటా ఎనలటిక్స్, బిజినెస్ ఎనలటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు పొందారు. చదవండి : రైతులకు వరం.. ఐఐటీ హైదరాబాద్ సరికొత్త ఆవిష్కరణ! -
కళ్లు లేకున్నా కాంతిని గ్రహిస్తాయి!
సాక్షి, హైదరాబాద్/ రాయదుర్గం: కళ్లు లేకుండా కాంతిని గ్రహించవచ్చా? అంటే.. అవును అంటోంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిశోధన బృందం. కొన్ని క్రిములు (ప్లానేరియన్ ఫ్లాట్వారమ్స్) కళ్లు లేకుండానే కాంతిని గ్రహించగలుగుతున్నాయని హెచ్‌సీయూలోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లోని బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన డాక్టర్ ఆకాష్ గుల్యాని నేతృత్వంలోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రిమి శరీరం అంచుల్ని అంటిపెట్టుకుని ఉన్న ప్రొటీన్లతో కూడిన ఒక కంటి- స్వతంత్ర వ్యవస్థ (ఎక్స్‌ట్రాక్యులర్) ఇందుకు తోడ్పడుతున్నట్లు వారు గుర్తించారు. ఈ మేరకు హెచ్‌సీయూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తలను తొలగించినప్పటికీ ప్లానేరియన్లు బతికి ఉండగలవని, అంతేకాకుండా తక్కువ మోతాదుల్లో అతి నీలలోహిత వెలుగు పడినప్పుడు, ఆ కాంతి వనరు నుంచి పక్కకు వెళ్లిపోగలవని ఇంతకుముందు జరిగిన పరిశోధన స్పష్టం చేసింది. తాజాగా పరిశోధకులు.. దృష్టి లోపంతో బాధ పడుతున్నవారికి కంటి చూపునిచ్చేందుకు, అలాగే కాంతి సహాయంతో కణాల అంతర్గత పనితీరును నియంత్రించేందుకు, ఈ సహజ కాంతి గ్రాహక ప్రొటీన్లు ఉపయోగపడతాయా అని తెలుసుకోవడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఈ క్రిములు కళ్లు లేకుండా కాంతిని ఎలా గ్రహించ గలుగుతున్నాయి, అవి కాంతిని గ్రహించేందుకు ఇతర కాంతి గ్రాహక వ్యవస్థ ఏదైనా ఉందా? అనే విషయాలు తెలుసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే గుల్యానీ నేతృత్వంలోని బృందం.. ఫ్లాట్‌వార్మ్స్ శరీర అంచుల వెంబడి ఉన్న కంటి–స్వతంత్ర వ్యవస్థ (ఐ–ఇండిపెండెంట్ సిస్టమ్ (ఎక్స్‌ట్రాక్యులర్), తల లేని క్రిమి సైతం తల ఉన్న క్రిమి మాదిరి నమ్మశక్యంకాని సమన్వయంతో కదిలేలా చేస్తోందని కనిపెట్టినట్లు ప్రకటన వెల్లడించింది. -
హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల
రాయదుర్గం (హైదరాబాద్): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో 2021–22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశవ్యాప్తంగా 39 కేంద్రాల్లో ఆగస్టు/సెప్టెంబర్‌లో పరీక్షను నిర్వహించనున్నారు. వర్సిటీలో 17 ఇంటిగ్రేటెడ్, 46 పీజీ, 10 ఎంటెక్, 44 పీహెచ్డీ కోర్సుల్లో మొత్తం 2,328 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంటెక్(మోడలింగ్ అండ్ సిములేషన్), ఎంపీఏ(మ్యూజిక్), పబ్లిషింగ్‌లో సర్టిఫికెట్ కోర్సులను కొత్తగా ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఇదిలాఉంటే ఎంసీఏ, ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్సీ బయోటెక్నాలజీ తదితర కోర్సుల్లో నిమ్‌సెట్, గేట్, జేఈఈ, క్యాట్, జీఏటీ–బీ తదితర పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఎంటెక్(మోడలింగ్ అండ్ సిములేషన్) కోర్సులో గేట్ స్కోరు ఆధారంగా ప్రవేశాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. చదవండి: తెలంగాణ పోలీస్ విభాగం, భరోసా సొసైటీలో ఖాళీలు -
డీఎన్ఏ వెలికితీతకు కొత్త కిట్
సాక్షి,హైదరాబాద్/రాయదుర్గం: మానవులతో పాటు జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవుల నుంచి డీఎన్ఏను సులువుగా వేరు చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలోని అస్పైర్ బయోనెస్ట్లో పనిచేస్తున్న 30 ఎం జీనోమిక్స్ స్టార్టప్ కంపెనీ వినూత్నమైన కిట్‌ను అభివృద్ధి చేసింది. యాంప్‌రెడీ అని పిలుస్తున్న ఈ కొత్త కిట్.. ఇతర పరికరాలేవీ ఉపయోగించకుండానే 5సెకన్లలోనే డీఎన్ఏను వేరుచేయగలదు. డీఎన్ఏ ఆధారిత పరీక్షలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని, అతి తక్కువ నమూనా ద్వారానే డీఎన్ఏను వెలికితీయొచ్చని 30ఎం జీనోమిక్స్ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోని ప్రధాన పరిశోధన సంస్థలు యాంప్‌రెడీ పనితీరును ధ్రువీకరించాయని సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ బెన్నెట్ దాస్, పీఎస్‌కేఎన్ పావని, యశ్వంత్‌రెడ్డి తెలిపారు. చదవండి: గవర్నర్ తమిళిసైకి ఇందిరా శోభన్ లేఖ -
మన తీరాన ‘మరో చరిత్ర’
సాక్షి, హైదరాబాద్ : మన భూపాలపల్లికి కంబోడియాతో ఉన్న సంబంధం ఏంటి? భూపాలపల్లి జిల్లా దేవునిగుట్టపై ఉన్న బౌద్ధమందిరం అచ్చుగుద్దినట్టు ప్రపంచ ప్రఖ్యాత అంకోర్వాట్ దేవాలయ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. కంబోడియా నిర్మాణ విధానం భూపాలపల్లిలో ఎలా ప్రత్యక్షమైంది? చారి త్రక ఆధారాలు ఇప్పటికీ వెలికితీయలేదు. శ్రీకాకుళం జిల్లాలోని దంతపురానికి శ్రీలంకకు ఉన్న లింకేమిటి?. కళింగరాజుల హయాంలో దంతపురంలో బౌద్ధస్తూపం నిర్మితమైంది. ఆ స్తూపం కింద బుద్ధుడి అస్థికగా ఆయన దంతం ఉండేది. కానీ, ప్రస్తుతం ఆ దంతం శ్రీలంకలోని క్యాండీ సమీపంలోని ప్రముఖ బౌద్ధక్షేత్రం దవల మళిగవిలలో ఉంది. ఇక్కడి నుంచి అటెందుకు తరలింది? శ్రీకాకుళానికి శ్రీలంక దేశానికి మధ్య సంబంధం ఎలా కుదిరింది?.వేల కిలోమీటర్ల దూరంలోని దేశాల్లో తెలుగు వారు వందల ఏళ్లుగా ఎందుకుంటున్నారు? చరిత్రలో కచ్చితమైన సమాధానాల్లేని ప్రశ్నలెన్నో. కానీ వీటి వెనుక సహేతుక చారిత్రక కారణాలున్నాయి. వాటి తీగలాగితే మన దేశానికి–ఇతర దేశాలకు మధ్య వాణిజ్య, సాంస్కృతిక, విజ్ఞాన సంబంధ బాంధవ్యాల డొంక ఇప్పుడు కదులుతుంది. నాటి ఆధారాలు వెలికి తీస్తే ఇప్పుడు ఆయా దేశాలతో కొత్త మైత్రికి బాటలు వేయొచ్చు. ఇది వాణిజ్యపరంగా మన దేశానికి ఉపయోగపడొచ్చు. ఇప్పుడిలాంటి ఆలోచనలే కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. అందుకే సముద్ర మార్గం ఆధారంగా మన దేశం ఏయే దేశాలతో సంబంధాలు నెరిపిందో చారిత్రక ఆధారాలను వెలికితీయాలని నిర్ణయించింది. సముద్ర తీరం ఉన్న ప్రాంతాల్లో ‘ప్రాజెక్ట్ మౌసమ్’పేరుతో బృహత్తర అధ్యయనాన్ని నిర్వహించనుంది. ఈ బాధ్యతల్ని ప్రాంతాల వారీగా విభజించి కొందరు నిష్ణాతులకు అప్పగించింది. అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అధ్యయన బాధ్యతను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగాధిపతి ప్రొఫెసర్ కె.పి.రావుకు అప్పగించింది. దేశాలతో కొత్త బాంధవ్యాలు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఓడరేవు బందరు నుంచి కాకతీయ రాజులు ఇతర దేశాలతో వాణిజ్యపరమైన సంబంధాలు కొనసాగించారు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఈ రేవు మీదుగా వస్తువుల ఎగుమతి, దిగుమతులు కొనసాగాయి. దాన్ని రూఢీచేసే శాసనాలు వెలుగు చూశాయి. అందుకే కాకతీయ శాసనాలు ఇప్పటికీ ఆంధ్ర సముద్ర తీరప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇలా ఆసియా నుంచి ఆఫ్రికా వరకు ఎన్నో దేశాలతో కాకతీయుల కంటే ముందు, కాకతీయుల తర్వాత కూడా వాణిజ్య సంబంధాలు కొనసాగాయి. మన ప్రాంతాన్ని పాలించిన అన్ని సామ్రాజ్యాలు ఈ సంబంధాల్ని కొనసాగించాయి. వ్యాపార వాణిజ్యాలనే ప్రధాన లక్ష్యంతో మొదలైన ఈ సంబంధ బాంధవ్యాలు సంస్కృతీ సంప్రదాయాలతోనూ పెనవేసుకున్నాయి. మన దేశంలోని చాలా ప్రాంతాల్లో అలనాటి చారిత్రక నిర్మాణాల్లో విదేశీశైలి దీనికి నిదర్శనం. అప్పట్లోనే తెలంగాణ ప్రాంతం నుంచి నల్లరాయి ఆఫ్రికా, యూరప్‌లకు చేరింది. ఇప్పటికీ చాలా దేశాల్లో అక్కడ మన శైలి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇక్కడి నుంచి ఇంజినీర్లు ఆయా దేశాలకు వెళ్లి నిర్మాణాల్లో పాలుపంచుకున్న దాఖలాలున్నాయి. ఇవి దేశాల మధ్య మైత్రికి దోహదం చేశాయి. క్రమంగా అవి కనుమరుగయ్యాయి. కానీ నాటి దోస్తీకి గుర్తుగా ఇప్పటికీ ఎన్నో చారిత్రక నిర్మాణాలు అలరారుతున్నాయి. ఆయా నిర్మాణాల ఆధారంగా నాటి మైత్రీజాడలను వెలికితీయాలని కేంద్రం నిర్ణయించింది. కొత్త వాణిజ్యానికి, స్నేహాలకు బాటలు ‘ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్’నోడల్ ఏజెన్సీగా కేంద్ర పర్యాటక శాఖ ఓ బృహత్తర కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇది సముద్ర మార్గం ద్వారా మన దేశంలోని ఏయే ప్రాంతాలు ఏయే దేశాలతో సంబంధాన్ని కలిగి ఉండేవో వెలికితీయబోతోంది. వాటిని ప్రతిఫలించే నిర్మాణాలు, చారిత్రక స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ప్రాధాన్యం ఏంటి, దానితో ఏయే దేశాలు సంబంధం కలిగి ఉన్నాయి, ఆ స్నేహానికి కారణంగా అసలు రెండు ప్రాంతాల మధ్య జరిగిన రవాణా ఏంటి, నాటి వాణిజ్యం, ఆర్థిక అంశాలు తదితర అన్ని వివరాలూ ఈ అధ్యయనంలో తేలనున్నాయి. ఆయా వివరాల ఆధారంగా ఆయా దేశాలతో ఇప్పుడు మనదేశం కొత్త మైత్రిని ఎలా పెంపొందించుకోవచ్చో ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇది మళ్లీ కొత్త వాణిజ్యానికి బాటలు వేస్తుందని కేంద్రం నమ్ముతోంది. యునెస్కో గుర్తింపునకు అవకాశం మన తీరప్రాంతాల్లో విలసిల్లిన సంస్కృతి, దానికి గుర్తుగా ఉన్న నిర్మాణాలు, అవి ఇతర దేశాల మైత్రిని ప్రతిఫలించే తీరును వెలికితీసి యునెస్కో ముందు నిలపవచ్చన్న మరో ప్రయత్నాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ప్రపంచ వారసత్వ జాబితాలో మనదేశంలోని కట్టడాలకు చోటు తక్కువే. ఆ గుర్తింపు పొందదగిన చరిత్ర ఉండి కూడా కొన్ని మరుగునపడ్డాయి. ఇప్పుడు చేపట్టబోయే కొత్త అన్వేషణ దానికి ప్రాణం పోస్తుందన్న ఆలోచన కేంద్రం మదిలో ఉంది. ఇది గొప్ప అధ్యయనం ‘ప్రాజెక్టు మౌసమ్’పేరుతో కేంద్ర పర్యాటక శాఖ నిర్వహించనున్న అధ్యయనం బృహత్తరమైంది. ఇది తీరప్రాంతాలతో గల విదేశీ సంబంధాల చరిత్రను వెలుగులోకి తెస్తుంది. మళ్లీ దేశాల మధ్య కొత్త సంబంధాలకు బాటలు వేయటమే కాక మన చరిత్ర యునెస్కో ముంగిట మెరిసేందుకు కారణం కానుంది. ఇందులో పాలుపంచుకునే అవకాశం నాకు దక్కడం గర్వంగా ఉంది. – ప్రొఫెసర్ కె.పి.రావు -
హెచ్‌సీయూ దేశంలోనే 2వ అత్యుత్తమ వర్సిటీ
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) మరో ఘనత సాధించింది. ఇండియా టుడే–మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్(ఎండీఆర్ఏ) సర్వే నిర్వహించి ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. దేశంలో అత్యుత్తమ యూనివర్సిటీల్లో హెచ్‌సీయూ ద్వితీయ స్థానం సంపాదించింది. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) మొదటిస్థానంలో నిలిచింది. దేశంలోని విశ్వవిద్యాలయాలను జనరల్ (ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్), సాంకేతిక, వైద్య, చట్టపరమైన నాలుగు విభాగాలుగా పరిశీలించారు. ఈ పరిశీలనలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు అందించే విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 995 వర్సిటీలపై అధ్యయనం ఇండియా టుడే ఉత్తమ విశ్వవిద్యాలయాల సర్వే కోసం దేశంలోని 995 విశ్వవిద్యాలయాల జాబితాను రూపొందించింది. అందులో 155 జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలు కూడా ఉన్నాయి. వీటిల్లో హెచ్సీయూకు ద్వితీయ స్థానం పొందింది. ఇండియా టుడే నాలెడ్జ్ పార్టనర్ ఎండీఆర్ఏ చేత అనేక మైలురాళ్లను నిర్దేశించింది. ఆబ్జెక్టివ్ ర్యాంకింగ్ సమయంలో విశ్వవిద్యాలయాల అత్యంత సమగ్రమైన, సమతుల్యమైన పోలికలను అందించడానికి ఎండీఆర్ఏ 120 ప్లస్ లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించింది. ఈ పనితీరే సూచికలుగా 5 అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అందులో కీర్తి, పాలన, అకడమిక్, రీసెర్చ్ ఎక్స్‌లెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లివింగ్ ఎక్స్పీరియన్స్, పర్సనాలిటీ, నాయకత్వ అభివృద్ధి, కెరియర్ పురోగతి, ప్లేస్మెంట్ వంటి అంశాలలో సాధించిన ప్రగతి ఆధారంగా ర్యాంకింగ్స్‌ను ప్రకటించారు. దేశంలోని 30 నగరాల్లో 300 మంది ప్రతినిధులు(32 మంది వైస్చాన్స్లర్లు, 75 మంది డైరెక్టర్లు, 193 మంది సీనియర్ ఫ్యాకల్టీ/ప్రొఫెసర్లు/హెడ్లతో వర్చువల్ సర్వేను నిర్వహించారు. చివరకు 130 విశ్వవిద్యాలయాలకు ర్యాంక్‌లను కేటాయించారు. పరిశోధకులు, గణాంక వేత్తలు, విశ్లేషకులు, సర్వే బృందాలతో కూడిన పెద్ద బృందం ఈ ప్రాజెక్టుపై 2019 డిసెంబర్ నుంచి 2020 జూలై వరకు పనిచేసి ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. టాప్‌లో నిలవడం.. పనితీరుకు నిదర్శనం పనితీరు మెరుగుపడడం, పరిశోధన రచనలకు గుర్తింపుగా హెచ్‌సీయూ దేశంలో ద్వితీయ స్థానం సాధించింది. 2017లో 5వ స్థానం, 2018లో 3, 2019లో 2, 2020లో మరోసారి 2వ స్థానాన్ని హెచ్‌సీయూ దక్కించుకుంది. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ గుర్తించడం, అత్యాధునిక మౌలిక సదుపాయాలతోపాటు నాణ్యమైన విద్య, పరిశోధనలను అందించడంపై పూర్తిస్థాయి దృష్టి పెట్టాం. దీంతో ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల లీగ్‌లోకి వెళ్లేలా సమష్టి కృషితో ముందుకు సాగుతాం. –ప్రొఫెసర్ పొదిలె అప్పారావు, హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్ -
హెచ్‌సీయూ విద్యార్థికి గ్రేస్ హోపర్ స్కాలర్షిప్
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఎంసీఏ విద్యార్థిని వాణిగుప్తాకు 2020 సంవత్స రానికి గ్రేస్ హోపర్ స్టూడెంట్ స్కాలర్షిప్ లభించింది.కాలిఫోర్నియాలోని అనితాబి డాట్ ఆర్గ్ ఈ స్కాలర్షిప్ను అందజేస్తుంది. ఇందులో భాగంగా 1200 డాలర్లు వార్షిక మొత్తంగా చెల్లిస్తారు. ఈ సందర్భంగా వాణిగుప్తాను పలువురు అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. -
కరోనా కొమ్ముల్లోని కొద్దిభాగమే వ్యాధికి కారణం
రాయదుర్గం: శ్యాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందిని కల్గించండం కరోనా ప్రధాన లక్షణమని హెచ్‌సీయూ విభాగం ప్రొ. లలితా గురుప్రసాద్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ఆమె చేస్తున్న పరిశోధనలను బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకజాతికి చెందిన గబ్బిలాలు ఈ వైరస్‌లకు కేంద్రస్థానాలని భావిస్తున్నామన్నారు. తరచుగా పొందుతున్న ఉత్పరివర్తనలతో ఈ వైరస్ ఇతర జంతువులకి వ్యాప్తిస్తోందన్నారు. కరోనా వైరస్ కొమ్ములాంటి ప్రోటీను నిర్మాణం ఉంటుందన్నారు. ఈ వైరస్ మనుషులలో రక్తపోటు కలిగించే ఎంజైమ్–2 గ్రాహకంగా మారుతోందన్నారు. అమెరికాలోని లాస్ ఆల్మాస్ జాతీయ ప్రయోగశాల పరిశోధకులు కూడా ఇలాంటి అభిప్రాయలనే వెలిబుచ్చారని గుర్తు చేశారు. -
హెచ్‌సీయూ అడ్మిషన్ల ప్రక్రియ షురూ
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ 2020–21 విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అడ్మిషన్ కోసం దరఖాస్తులను మే 3వ తేదీలోగా ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. హెచ్‌సీయూలో 2,400 సీట్లు వివిధ కోర్సులలో ఉన్నాయి. మొత్తం 128 కోర్సులలో 16 ఇంటిగ్రేటెడ్ కోర్సులు, 41 పొస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు, 15 ఎంఫిల్,10 ఎంటెక్, 46 పీహెచ్డీ కోర్సులు ఉన్నాయి. గతేడాది మొత్తం 119 కోర్సులలో 2,170 సీట్లు ఉండేవి. ఈ ఏడాది నుంచి కొత్తగా 17 కోర్సులు...182 సీట్లు హెచ్‌సీయూలో 2020–21 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా 17 కోర్సులు ప్రారంభిస్తుండగా వాటిలో 182 సీట్లు ఏర్పాటు చేశారు. అందులో ఎంఈడీ ఎడ్యుకేషన్ లో 50 సీట్లు, ఎంఏ జెండర్‌స్టడీస్–20, ఎంఏ కమ్యూనికేషన్ (మీడియాస్టడీస్) 25, ఎంఏ కమ్యూనికేషన్ (మీడియా ప్రాక్టీస్)–25, ఎంటెక్ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ వీఎల్ఎస్ఐ డిజైనింగ్–06, ఎంటెక్ మ్యానుఫాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్–18, పీహెచ్డీ మైక్రోబయాలజీ–04 (పునః ప్రారంభిస్తున్నారు), ఎంఫిల్ కంప్యూటర్ లిటరేచర్–08, ఎంఫిల్ సోషల్ ఎక్స్క్లూషన్ అండ్ ఇన్ క్లూజన్ పాలసీ–04, ఎంఫిల్ రీజనల్ స్టడీస్–04, పీహెచ్డీ థియేటర్ ఆర్ట్స్, కంపారిటివ్ లిటరేచర్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్‌లో నాలుగేసి సీట్లు, రీజినల్ స్టడీస్, కాంగ్ని టివ్సైన్స్లలో రెండేసి సీట్లు, ఫోక్ కల్చర్ స్టడీస్, సోషల్ ఎక్స్‌క్లూజివ్ అండ్ ఇన్ క్లూజివ్ పాలసీలో ఒక్కో సీటును కొత్తగా ఏర్పాటు చేశారు మరిన్ని కోర్సులలో అడ్మిషన్లు ఇలా.. ఎంసీఏలో అడ్మిషన్‌ను నిట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్ఐఎంసెట్ స్కోరు ద్వారా కేటాయిస్తారు. ఎంటెక్ కోర్సులో సీటును గేట్ ద్వారా సీసీఎంటీ లో ప్రతిభ చాటిన వారికి కేటాయిస్తారు. అయిదేళ్ళ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్)లో సీటును సెంట్రల్ సీట్ అలోకేషన్ బోర్డు (సీఎస్ఏబి) జేఈఈ ద్వారా కేటాయిస్తారు. ఎంబీఏ సీటును క్యాట్, ఎంఎస్సీ బయోటెక్నాలజీలో సీటును న్యూఢిల్లీ లోని జేఎన్ యూ ద్వారా నిర్వహించే సీఈఈబీలో ప్రతిభ చాటిన వారికి కేటాయిస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ http://acad.uohyd.ac.inను లాగిన్ కావాలి. -
ప్రసవ వేదన.. ప్రాణ తపన
రాయదుర్గం: ప్రసవవేదన వేళ ఓ జింకపై శునకాలు దాడి చేయడంతో గర్భస్థ జింక సహా తల్లి జింక మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల్లో ఆదివారం చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలోని చిట్టడవిలో వందలాది మూగజీవాలు జీవనం సాగిస్తున్నాయి. వాటికి అనువైన వాతావరణం కల్పించడంలోనూ హెచ్‌సీయూ పాలకవర్గం, విద్యార్థులు, వైల్డ్‌లెన్స్ గ్రూపు సభ్యులు కృషి చేస్తూనే ఉన్నారు. కానీ అప్పుడడప్పుడు కుక్కలు, వేటగాళ్ల బారిన పడి మూగజీవాలు మృత్యువాత పడుతూనే ఉన్నాయి. తాజాగా హెచ్‌సీయూ క్యాంపస్ పరిసరాల్లో చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో హెచ్‌సీయూ సెక్యూరిటీ సిబ్బంది క్యాంపస్‌లోని నల్లగండ్ల చెరువు ఫెన్సింగ్‌ను పరిశీలించేందుకు వచ్చారు. ఈ సమయంలో అక్కడ మృత్యువాత పడిన జింక కనిపించింది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో సెక్యూరిటీ అధికారులు అక్కడికి చేరుకొని జింకను పరిశీలించారు. ఇదే సమయంలో సమాచారం అందుకున్న వైల్డ్‌లెన్స్ ప్రతినిధులు కూడా చేరుకున్నారు. జింకను పరిశీలించగా.. అది ప్రసవ వేదన పడుతుండే సమయంలో కడుపులోపలి జింక తలభాగం బయటకు వచ్చిన సమయంలో కుక్కలు వెంబడించి దాడికి దిగాయని నిర్ధారించారు. అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చే సమయంలోనే ప్రసవమయ్యే అవకాశం ఏర్పడటంతో అది అటూఇటూ అనువైన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న తరుణంలోనే కుక్కలు వెంబడించగా నల్లగండ్ల చెరువు వైపు వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. ఇదే తరుణంలో అవి దాడి చేయడంతో తాను ప్రాణాలు వదలడంతోపాటు పుట్టబోయే జింకపిల్ల కూడా తల బయటకు వచ్చేస్తున్న తరుణంలో మృత్యువాత పడినట్లు గుర్తించారు. సమాచారం అందించినా.. జింక మృత్యువాత పడిన ఘటన వివరాలను చిలుకూరులోని అటవీ శాఖ అధికారులకు మధ్యాహ్నం 2 గంటలకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలోనే జింకను ఉంచి అక్కడే హెచ్‌సీయూ సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు, వైల్డ్‌లెన్స్ గ్రూపు ప్రతినిధులు సాయంత్రం 6.30 గంటల వరకు వేచి ఉన్నారు. కానీ అటవీశాఖాధికారులు అప్పటికీ చేరుకోలేదు. వారి నిర్లక్ష్యం పట్ల హెచ్‌సీయూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. హెచ్‌సీయూలో కుక్కల బెడద నుంచి మూగజీవాలను కాపాడాల్సిన అవసరం ఉందని వారు కోరారు. గతంలోనూ పలు సంఘటనలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. క్యాంపస్‌లోని పలు ప్రాంతాల్లో కుక్కలు సంచరిస్తున్నాయని, వాటిని క్యాంపస్ బయటకు వదలిపెట్టాలని సూచించారు. -
హెచ్‌సీయూలో రిక్షాల లొల్లి
గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ క్యాంపస్‌లో మొదటిసారిగా ఈ రిక్షాల రవాణా ప్రారంభమైంది. విద్యార్థులు నిర్ణీత చార్జీలు చెల్లించి క్యాంపస్‌లో రాకపోకలు సాగించాలి. ఇప్పటి వరకు క్యాంపస్‌లో ఉచిత బస్సు సౌకర్యం ఉంది. బస్సు సౌకర్యాన్ని కొనసాగిస్తూనే ఈ రిక్షాలను ప్రైవేశపెట్టారు. సాక్షి, రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ క్యాంపస్‌లో ప్రస్తుతం విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది కలిపితే 6 వేలకుపైగా ఉంటారు. రవాణా సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు ప్రైవేటు సంస్థకు అనుమతించారు. ఈ–రిక్షాలను బెంగుళూరుకు చెందిన మెజర్స్ ట్రాన్స్వాహన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ‘ఓన్, ఆపరేట్ అండ్ మెయింటెన్’ పద్ధతిన నిర్వహిస్తారు. అయితే రవాణాను ప్రైవేట్‌పరం చేసి విద్యార్థులపై భారం మోపడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ఏఏ మార్గాల్లో... ఈ రిక్షాలు హెచ్‌సీయూ క్యాంపస్‌లో రెండు ప్రాంతాలలో అందుబాటులో ఉంటాయి. మెయిన్‌గేటు నుంచి సౌత్ గేటు వరకు, సౌత్ క్యాంపస్ గేటు నుంచి మసీదుబండగేటు (స్మాల్ గేట్) వరకు ఉంటాయి. అక్కడి నుంచి తిరిగి అదేమార్గాల్లో అందుబాటులో ఉంటాయి. వేళలు... సోమవారం నుంచి శనివారం వరకు తిరుగుతాయి. ఆయా రోజుల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకే అందుబాటులో ఉంటాయి. డిజిటల్ మోడ్‌లోనే చెల్లించాలి... ఈ రిక్షాలకు డబ్బుల చెల్లింపులన్నీ డిజిటల్ మోడ్‌లోనే ఉంటాయి. ఒక ట్రిప్పునకు రూ. 10 చెల్లించాల్సి ఉంటుంది. వీటిని విద్యార్థులు, ఫ్యాకల్టీ, స్టాఫ్, సందర్శకులు కూడా వినియోగించుకొనే అవకాశం కల్పించారు. దివ్యాంగులకు ఉచితం ఈ రిక్షాలలో దివ్యాంగ విద్యార్థులు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. వారు యూనివర్శిటీ గుర్తింపు కార్డును చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ రిక్షాలను తిరగనివ్వం క్యాంపస్‌లో విద్యార్థులకు ఈ–రిక్షాలలో ఉచితంగా ప్రయాణం చేసేందుకు అనుమతించాలి. ఇతరులకు చార్జీలు వసూలు చేసినా అభ్యంతరం లేదు. విద్యార్థులపై భారం వేసే ఎలాంటి చర్యలనూ అంగీకరించం. ఇప్పటికే రిజిష్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్‌కు వినతిపత్రాలను సమర్పించాం. త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం. లేదంటే ఈ–రిక్షాలను వర్సిటీలో తిరగనివ్వం. – ఎం.శ్రీచరణ్, హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు విద్యార్థులపై భారం తగదు క్యాంపస్‌లో బస్సుల ట్రిప్పుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తుంటే ఆర్థిక భారం మోపేలా ఈ రిక్షాలను ప్రైవేశపెట్టారు. స్కాలర్షిప్ రూ. 750 మాత్రమే ఇస్తూ ఇలాంటి భారం మోపడం తగదు. ఒక్కో విద్యార్థి కనీసం నాలుగు సార్లు హాస్టల్ నుంచి బయట తిరిగితే రోజుకు రూ. 50 మేర రవాణా చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇక మెస్, ఇతర ఖర్చులను ఎలా భరిస్తారు? ఈ చర్యను వెంటనే ఉపసంహరించాలి. లేదంటే గత్యంతరం లేక ఉద్యమించాల్సి ఉంటుంది. – పి సందీప్, డీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి, హెచ్‌సీయూ -
హెచ్‌సీయూలో.. అందాల లోకం..
అందాలలో అహో మహోదయం.. హెచ్‌సీయూలో నవోదయం.. ఎటు చూసినా పచ్చదనం.. ఆహ్లాదపూరిత వాతావరణం.. ప్రకృతి రమణీయత. చెంగుచెంగుమంటూ గంతులు వేసుకుంటూ వెళ్లే జింకలు.. పక్షుల కిలకిలారావాలు.. జల సవ్వడిని తలపించే తటాకాలు. విభిన్న పుష్ప జాతుల వృక్షాలు.. ఇలా ఎన్నో అపురూప దృశ్య మాలికలకు కేరాఫ్‌గా నిలుస్తోంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సువిశాలమైన హెచ్‌సీయూ క్యాంపస్‌లో ఒక్కోచోట ఒక్కో అందం, పచ్చదనం,జంతుజాలం.. సొగసు చూడతరమా.. అన్నట్లుగా ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీ ప్రతి ఏటా రూపొందించే కేలండర్లో ఇక్కడి క్యాంపస్‌లోని అందాలతో కూడిన ఫొటోలను పెట్టడం ఆనవాయితీ. ఈ ఏడాది సైతం క్యాంపస్ అందాలతో కూడిన ఫొటోలతో కేలండర్‌కు రూపకల్పన చేసేందుకు సంకల్పించారు. ఇందుకోసం సెంట్రల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ప్రతినిధులు, విద్యార్థులు స్వయంగా తీసిన ఫొటోలను పంపాలని ఉన్నతాధికారులు కోరుతారు. ఆ ప్రకారం క్యాంపస్‌లోని వివిధ ప్రాంతాలలో ప్రకృతి అందాలతో కూడిన ఫొటోలను తీయడానికి ఫ్యాకల్టీ, విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది కూడా ఫొటోలు పంపాలని కోరగా 200 ఎంట్రీలను విద్యార్థులు, ఫ్యాకల్టీ ప్రతినిధులు పంపించారు. వీరిలో రఘు గణపురం, డాక్టర్ రవి జిల్లపల్లి, విజయభాస్కర్ మరిశెట్టి, జ్ఞానశేఖర్, కేఎన్ కృష్ణకాంత్, మోనికా, పి.కె.నవనీత్ కృష్ణన్, శశిశేఖర్రెడ్డి, సుష్మ నంద్యాల, అనోజ్, చందాని సింగ్, నిరంజన్ బసు తీసిన చిత్రాలను 2020 కేలండర్ రూపకల్పనలో వినియోగించారు. వీరంతా క్యాంపస్‌లోని అందాలను తమ కెమెరాల్లో బంధించి కేలండర్ అందంగా రూపొందేలా దోహదపడ్డారు. -
మళ్లీ టాప్-10లో హెచ్‌సీయూ
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరో ఘనత సాధించింది. క్యూఎస్ ఇండియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2020లో హెచ్‌సీయూ వరుసగా రెండోసారి టాప్‌టెన్ జాబితాలో నిలిచింది. మంగళవారం విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్ జాబితాలో మొదటి స్థానంలో ఐఐటీ–బాంబే, ఐఐఎస్సీ–బెంగళూరు రెండోస్థానం, ఐఐటీ–ఢిల్లీ–మూడోస్థానం పొందగా హెచ్‌సీయూ 8వ స్థానం సాధించింది. దేశంలోని వంద విద్యాసంస్థలను పరిశీలించి ర్యాంకింగ్స్ ఇచ్చారు. స్టాఫ్ విత్ పీహెచ్డీ కేటగిరీలో బెస్ట్ స్కోర్ ఇండికేటర్‌ను హెచ్‌సీయూ సాధించడం మరో విశేషం. ఈ ర్యాంకింగ్స్‌లో ముఖ్యంగా ఫ్యాకల్టీ–స్టూడెంట్స్‌లో 26.9 పాయింట్లు, సిటేషన్స్ ఫర్ ఫ్యాకల్టీ 40.5, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ 3.4, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ 2.5, ఎంప్లాయర్ రెప్యూటేషన్ 5.3, అకాడమిక్ రెప్యూటేషన్లో 10.8 పాయింట్లు సాధించింది. వీటి ఆధారంగానే ర్యాంకింగ్స్‌ను ఖరారు చేశారు. -
కోక్ టిన్‌లో చిక్కి నాగుపాము విలవిల
రాయదుర్గం: పరిశోధనలకు, పచ్చదనానికే కాదు పాములకు సంరక్షణ కేంద్రంగా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మారుతోంది. గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ క్యాంపస్ రెండువేలకు పైగా ఎకరాల సువిశాల స్థలంలో కొనసాగుతోంది. ఇందులో సగం భూభాగం వరకు అటవీ ప్రాంతంగా ఉంది. ఇందులో çసహజసిద్ధమైన భారీ బండరాళ్లు, చెట్లు, పచ్చదనం, సహజ సిద్ధంగా ఏర్పడిన చెరువులు, కుంటలున్నాయి. దీంతో దేశంలో కొన్ని అరుదైన పాములు తప్ప మిగతా అన్ని రకాల పాములు ఇక్కడ ఉన్నట్లు పలువురు పేర్కొంటారు. ఇందులో కొన్ని ఇప్పటి వరకు కనిపించిన వాటిలో విషసర్పాలు కూడా ఉండడం విశేషం. అయితే ఇప్పటి వరకు పాము కాటు వేయకపోవడం మరో విశేషం. అప్పుడప్పుడు ఈ పాములు విద్యార్థులుండే వసతిగృహాలు, ప్రధాన, అంతర్గత రోడ్లు, వివిధ కార్యాలయాలవైపు వస్తుంటాయి. అయితే సెక్యూరిటీ విభాగం, వైల్డ్‌లెన్స్ గ్రూపు ఈ పాముల సంరక్షణలో ముఖ్యభూమిక పోషిస్తున్నారు. కాగా గత ఆరు నెలల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో ఒక కొండచిలువ తీవ్రంగా కాలి గాయాలపాలుకాగా మరో రెండు పాములు మృత్యవాత పడిన ఘటన అందరినీ కలిచివేసింది. ఇక్కడ పాముల్ని చంపరు.. విద్యార్థులకు పలు చోట్ల పాములు అగుపించడం క్యాంపస్‌లో సర్వసాధారణం. పాము కనిపిస్తే సెక్యూరిటీ సిబ్బంది, వైల్డ్లెన్స్గ్రూపువారికి సమాచారం ఇస్తారు. వారు వెంటనే పాములను పట్టే ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీవారిని పిలిపించి వాటిని పట్టుకొని తిరిగి అటవీ ప్రాంతంగా ఉండే చోట పాములను వదిలి వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ పాములను చంపిన దాఖలాలు ఇప్పటి వరకు లేవంటేనే వీటి సంరక్షణ ఎలా ఉందో అర్థమవుతుంది. ఏది ఏమైనా పాము అనగానే సహజంగా అందరూ భయపడిపోతుంటారు. అందులో రకరకాల విష సర్పాలు కూడా ఉండడంతో మరింతగా వీటిని చూడగానే భయపడిపోయే వారూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో పాములను పట్టేవారిని అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల్పిన అవసరం ఉంది. జీవ వైవిధ్యానికి హెచ్‌సీయూ కేంద్రం హెచ్‌సీయూ క్యాంపస్ జీవ వైవిధ్యానికి కేంద్రం. అందులో రకరకాల పక్షులు, జంతువులు, పాములు, పచ్చనిచెట్లు ఉన్నాయి. వీటి పరిరక్షణలో హెచ్‌సీయూ యంత్రాంగం, సెక్యూరిటీ విభాగం చూపించే చొరవ, మా వైల్డ్‌లెన్స్ తోడ్పాటు నిరంతరంసాగే ప్రక్రియ. రకరకాల పాములు క్యాంపస్‌లో ఉన్నాయి. ఒక్కదాన్ని కూడా ఇప్పటి వరకు చంపలేదు. పట్టుకొని తిరిగి అటవీ ప్రాంతంలో వదిలేయడం జరుగుతుంది. – డాక్టర్ రవి జిల్లపల్లి,వైల్డ్‌లెన్స్ గ్రూపు వ్యవస్థాపకులు హెచ్‌సీయూ కోక్ టిన్‌లో తల చిక్కి నాగుపాము విలవిల రాయదుర్గం: ఖాళీ కూల్‌డ్రింక్ టిన్ బాక్సులో ఓ నాగుపాము దూరింది. దీంతో తల ఇరుక్కుపోయి ఇబ్బంది పడగా..హెచ్‌సీయూ విద్యార్థిని ఒకరు గమనించి ఆ పాముకు విముక్తి కలిగించారు. హెచ్‌సీయూ క్యాంపస్‌లో ఉర్దూ డిపార్ట్మెంట్లో పీహెచ్డీ చేస్తున్న విద్యార్థిని జునేరా అబ్రార్ గురువారం సాయంత్రం క్యాంపస్‌లోని వైట్రాక్స్ వైపు నుంచి వెళ్తుండగా పాము తల టిన్‌లో ఇరుక్కోవడం గమనించారు. వెంటనే వైల్డ్ లెన్స్ గ్రూపు వ్యవస్థాపకులు డాక్టర్ రవి జిల్లపల్లికి సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించినా ఫోన్ కలవలేదు. దీంతో మరికొందరు విద్యార్థులతో కలిసి ఆమె పామును రక్షించారు. దాన్ని చెట్ల పొదల్లోకి వదిలేశారు. ఈ సందర్భంగా జునేర్ అబ్రార్ మాట్లాడుతూ క్యాంపస్‌లో ఎవరూ ఖాళీ బాటిళ్లు, కోక్ టిన్లను బహిరంగంగా పారవేయవద్దని విజ్ఞప్తి చేశారు. -
హెచ్సీయూకు ఎమినెన్స్ హోదా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతోపాటు ఐదు ప్రభుత్వ విద్యా సంస్థలకు ఎమినెన్స్(ఐవోఈ) హోదా కల్పిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ హోదా దక్కిన మిగతా విద్యా సంస్థల్లో మద్రాస్ ఐఐటీ, ఖరగ్‌పూర్ ఐఐటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ వర్సిటీలున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గత నెలలో చేసిన ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. దీంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చే ఐదేళ్లలో కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్లు నిధులు అందనున్నాయి. వీటితోపాటు ప్రైవేట్ రంగంలోని తమిళనాడుకు చెందిన అమృత విద్యాపీఠమ్, వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఒడిశాలోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ, ఢిల్లీకి చెందిన జామియా హమ్దర్ద్ యూనివర్సిటీ, మొహాలీలోని సత్య భారతి ఫౌండేషన్ భారతి ఇన్స్టిట్యూట్లకు కూడా ఎమినెన్స్ హోదా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆయా సంస్థల అంగీకారం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఇంకా..నోయిడాలోని శివ్‌నాడార్ వర్సిటీ, సోనెపట్‌లోని ఓపీ జిందాల్ యూనివర్సిటీలకు ఎమినెన్స్ హోదా ఇవ్వాలని ఎంపిక కమిటీ సిఫారసు చేసిందన్నారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీ, అన్నా వర్సిటీల ఎమినెన్స్ హోదాకు సంబంధించి తమ వంతు నిధులు కేటాయించేందుకు బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు అంగీకారం తెలపాల్సి ఉందన్నారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, అశోకా యూనివర్సిటీ, అజీంప్రేమ్‌జీ యూనివర్సిటీ, తేజ్‌పూర్ యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, గాంధీనగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రమాణాలు అందుకోవడంలో విఫలమైన వాటిలో ఉన్నాయి. ఎమినెన్స్ హోదా ప్రకటించాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతోపాటు తమ వంతుగా కనీసం 50 శాతం నిధులను సమకూర్చాల్సి ఉంటుందని మంత్రి నిశాంక్ తెలిపారు. దేశంలో పలు విద్యా సంస్థలను ప్రపంచ స్థాయి బోధన, పరిశోధన సామర్ధ్యం కలిగినవిగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు 2016లో కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా 10 ప్రభుత్వ, 10 ప్రైవేటు విద్యార్థులను తీర్చిదిద్దుతామని ప్రకటించింది. ‘ఇప్పటివరకు 16 సంస్థలకు ఎమినెన్స్ హోదా ఇచ్చాం. మరో నాలుగు సంస్థలకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి కోసం ఎదురుచూస్తున్నాం’అని నిశాంక్ తెలిపారు. ఎమినెన్స్ హోదా కల్పించిన ప్రభుత్వ విద్యాసంస్థలైతే ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల వరకు సాయం అందజేస్తుంది. అదే ప్రైవేట్ సంస్థలకైతే ప్రభుత్వ నిధులు అందవు కానీ, మరింత స్వతంత్ర ప్రతిపత్తితోపాటు ప్రత్యేక కేటగిరీ డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభిస్తుంది.