నేను రోహిత్ను మాట్లాడుతున్నా!
• మాది గుంటూరు... నేను దళితుడిని
• ఆత్మహత్యకు ముందు వెలివాడ నుంచి మాట్లాడిన రోహిత్
• సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్
• రూపన్వాల్ కమిషన్‌కు ఈ వీడియో సమాధానం: ఏఎస్‌ఏ
సాక్షి, హైదరాబాద్: ‘‘నా పేరు రోహిత్, నేను గుంటూరు జిల్లాకు చెందిన వాడిని, నేను దళితుడిని, మా అమ్మ నన్ను పెంచి పెద్దచేసింది. హెచ్‌సీయూలో పరిశోధక విద్యార్థిని అయిన నాతోపాటు మరో నలుగురిని యూనివర్సిటీ పరిసరాల నుంచి, హాస్టల్ నుంచి యాజమాన్యం బహిష్కరించింది. ఈ పరిసరాల్లో మేము సంచరించడం కూడా వర్సిటీ నేరంగా భావించి మమ్మల్ని వెలివేసింది.’’ అంటూ రోహిత్ తనకు తానుగా దళితుడినని చెప్పిన వీడియో రోహిత్ కులంపై తలెత్తిన సమస్యకు సమాధానం చెబుతోందంటున్నారు విద్యార్థులు. ఇప్పుడీ వీడియో ‘రోహిత్ స్పీక్స్’ పేరుతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది.
గత జనవరి 17న హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడడానికి వారం పదిరోజుల ముందు వర్సిటీ షాప్‌కామ్ వద్దనున్న వెలివాడలో రోహిత్ మాట్లాడుతుండగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన వీడియో.. ఇప్పుడు అతని కులంపై కేంద్రం నియమించిన రూపన్వాల్ కమిషన్ రిపోర్టుకి సవాల్‌గా మారింది. తమ బహిష్కరణను వ్యతిరేకిస్తూ బాధిత విద్యార్థులు క్యాంపస్‌లోని ఉద్య మ వేదికకు ‘వెలివాడ’ అనే పేరుపెట్టుకున్నారు. రోహిత్ ఆత్మహత్యకు కొద్దిరోజుల ముందు బహిష్కరణకు గురైన విద్యార్థుల అభిప్రాయాలను రికార్డు చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో తీయగా..
ఇప్పుడు బయటపడడంతో చర్చనీయాంశమైంది. వీడియో తీసిన సెల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని.. వాటిని డిలీట్ చేయగా.. అనూహ్యంగా కంప్యూటర్‌లో ఇప్పుడు బయటపడినట్టు ఏఎస్‌ఏ నాయకుడు ప్రశాంత్ తెలిపారు. ఈ వీడియో రూపన్వాల్ కమిషన్‌కి సమాధానంగా భావిస్తున్నామని అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ కన్వీనర్ సన్నంకి మున్నా అన్నారు.
ఇంకా ఈ వీడియోలో.. తాను బయోటెక్నాలజీ విద్యార్థిగా క్యాంపస్‌లోకి అడుగుపెట్టినప్పటికీ సోషల్ సెన్సైస్ పట్ల ఉత్సుకతతో అందులోకి మారానని వివరించాడు. తాను దళితుడిని అయినప్పటికీ జనరల్‌లోనే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందడానికి అది తనకు ఉపయోగపడినట్లు వివరించాడు. ఏబీవీపీతో జరిగిన ఘర్షణ తనకు కొత్తకాదని, 2012లో ఏబీవీపీ కేసు పెట్టినప్పుడు రెండు రోజులపాటు తాను స్టేషన్‌లోనే ఉన్నానని మాట్లాడుతుండగా మధ్యలోనే వీడియో కట్ అయిపోయింది. విద్యార్థి సంఘ నాయకుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. తాను బహిష్కరణకు గురైన విద్యార్థులందరి సామాజిక నేపథ్యాన్ని గురించి రికార్డు చేయాలనుకున్నానని మధ్యలోనే రోహిత్ ఏదో పనిపై పక్కకి వెళ్లిపోవడంతో వీడియోను పూర్తిగా చిత్రించలేకపోయినట్లు వివరించారు.