మహాత్మాగాంధీకి జరిగిన అన్యాయమే రోహిత్‌కు జరిగింది
* హెచ్‌సీయూ దీక్షలో రాహుల్ గాంధీ
* ఆర్థిక, సామాజికాభివృద్ధిని వివక్ష అడ్డుకుంటోంది
సాక్షి, హైదరాబాద్: దేశంలోని విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న వివక్షకు రోహిత్ ఒక ఉదాహరణ అని.. వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించిన మహాత్మాగాంధీకి జరిగిన అన్యాయమే నేడు రోహిత్‌కు జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ వివక్ష వల్లే దేశం అభివృద్ధి చెందలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వివక్షకు వ్యతిరేకంగా తాను తల ఎత్తానని, ఉద్యమం చేపట్టిన విద్యార్థులకు అండగా నిలుస్తానని ప్రకటించారు.
ఆత్మహత్య చేసుకున్న రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ, సామాజిక న్యాయం కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ హెచ్‌సీయూలో జరుగుతున్న విద్యార్థి ఉద్యమానికి సంఘీభావంగా రాహుల్ గాంధీ దీక్షలో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన.. నేరుగా హెచ్‌సీయూకు వెళ్లి, రోహిత్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం రోహిత్ తల్లి రాధిక, విద్యార్థులు విజయ్, విశాల్, సుంకన్నలతో కలసి ‘వెలివాడ’ శిబిరంలో దీక్ష చేపట్టారు. శనివారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
విద్యార్థులకు అండగా ఉంటాం..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఒక్కటేనని... వారు విద్యార్థుల మీద బలవంతంగా తమ భావజాలాన్ని రుద్దుతున్నారని రాహుల్ మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం ఒక చట్టం తేవాలని, లేదంటే ఆ విషయాన్ని విద్యార్థులే చూసుకుంటారని ప్రధాని మోదీని హెచ్చరించారు. దేశంలో నివసించే వారంతా భారతీయులేనని, వారు జాతి విద్రోహులు కారని స్పష్టం చేశారు. కుల, మత, ప్రాంతీయ, లింగ వివక్షల వల్ల దేశం ముందడుగు వేయలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక, సామాజికాభివృద్ధిని వివక్ష అడ్డుకుంటోందని... రోహిత్‌లాంటి ఆలోచనాపరులు వివక్షకు బలైపోతున్నారని చెప్పారు.
ఇదే వివక్ష రేపు ప్రతి ఒక్కరికీ ఎదురుకావచ్చని, రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారికి కూడా జరగవచ్చని వ్యాఖ్యానించారు. కుల, మత, వర్గ విభేదాలకు తావులేని సమాజం కోసం రోహిత్ మరణించాడని... రోహిత్ గ్రహించిన వాస్తవాలను వెల్లడించడమే ఇక్కడ సమస్య అయిందని పేర్కొన్నారు. విద్యార్థులే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశం అభివృద్ధికి నోచుకోకపోవడానికి ఇక్కడి కులవ్యవస్థే కారణమని తనతో ఓసారి ప్రయాణించిన జపాన్ పౌరుడు అభిప్రాయపడ్డాడని రాహుల్ తెలిపారు. కులవివక్షను ఇంక అంగీకరించబోమని స్పష్టం చేశారు.
‘నేను హింసను బోధించను, అలాగే నేను తలవంచను..’ అన్న మహాత్మాగాంధీ సూక్తిని గుర్తు చేశారు. ఇప్పుడు తాను వివక్షకు వ్యతిరేకంగా తల ఎత్తానని... విద్యార్థులకు అండగా ఉంటానని చెప్పారు. ఈ ప్రసంగం అనంతరం సాయంత్రం ఆరు గంటల సమయంలో రాహుల్ గాంధీకి ప్రొఫెసర్ కంచ ఐలయ్య నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రాహుల్ గాంధీకి అందజేశారు. శనివారం దీక్షలో కాకి మాధవరావు, కంచ ఐలయ్య, జస్టిస్ చంద్రకుమార్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు. రోహిత్‌కు హెచ్‌సీయూ నుంచి రావాల్సిన స్టైఫండ్ రూ.లక్షా 70 వేలను వర్సిటీ చెల్లించలేదని.. దాంతో అదే మొత్తాన్ని ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరం తరఫున కాకి మాధవరావు, గెడ్డం ఝాన్సీ, సూరేపల్లి సుజాతలు రోహిత్ తల్లికి అందజేశారని విద్యార్థులు తెలిపారు.
ప్రధాన గేటు వద్ద గలాటా
హెచ్‌సీయూలో ఉద్యమానికి సంఘీభావం గా రాహుల్‌గాంధీ దీక్ష చేపట్టిన నేపథ్యం లో కాంగ్రెస్ పార్టీ నేతలు భారీగా రావడం.. రాహుల్ రాకకు నిరసనగా ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేయడం.. తదితర పరిణామాలతో యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీక్షలో ఉన్న రాహుల్‌ను కలిసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యే సంపత్, మల్లు రవి, పలువురు స్థానిక నేతలు శనివారం హెచ్‌సీయూ వద్దకు వచ్చారు. వారిని హెచ్‌సీయూ ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది.
దాంతో అక్కడే ధర్నా చేపట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా... పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు రాహుల్ హెచ్‌సీయూకు రావడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు వర్సిటీ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. రాహుల్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం దీక్షాస్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. చివరికి పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
ఈ అన్యాయం మరెవరికీ జరగకూడదు: రోహిత్ తల్లి
తన కుమారుడిని 27 ఏళ్లు పెంచి ఈ వర్సిటీకి అప్పజెప్పానని, త్వరలోనే ఉద్యోగం వస్తుందని రోహిత్ తనకు చెప్పాడని... కానీ విశ్వవిద్యాలయం తన బిడ్డ శవాన్ని అప్పగించిందని రోహిత్ తల్లి రాధిక కన్నీటిపర్యంతమయ్యారు. ఇంకెవరికీ ఇటువంటి పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. ఇక వర్సిటీలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన ముగ్గురు విద్యార్థుల ఆమరణ దీక్ష కొనసాగుతోంది.
రాజకీయం చేస్తున్నారు : కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: రోహిత్ ఆత్మహత్యను కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసి లబ్ధిపొందాలని చూస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. ఇది హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఏ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నాడో రోహిత్ తన లేఖలో రాశాడని, దానిపై సమగ్ర విచారణ జరపాల్సి ఉందని చెప్పారు.
వాస్తవాలు తెలుసుకుని వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై దృష్టి పెట్టకుండా రాజకీయం చేసి ప్రభుత్వంపై వ్యతిరేక ఉద్యమం చేయాలనుకోవడం సరికాదన్నారు. గతంలో వేర్వేరు వర్సిటీల్లో 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రధానిపై వ్యతిరేక ప్రచారంతో రాజకీయం చేయడం సరికాదని, బాధ్యతతో వ్యవహరించాలని కాంగ్రెస్, వామపక్షాలు, బీఎస్పీలకు వెంకయ్య నాయుడు సూచించారు.