
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హెచ్‌సీయూ యూనివర్సిటీ వద్ద 400 ఎకరాల భూమి అమ్మకం వ్యవహారంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో 400 ఎకరాల భూమి వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ భూమి ప్రభుత్వానిదే అంటూ క్లారిటీ ఇచ్చింది.
నగరంలోని హెచ్‌సీయూ వద్ద 400 ఎకరాల భూ వ్యవహారంపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించారు. ఈ క్రమంలో..‘ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదు. ఆ భూమి యజమాని తామేనని న్యాయస్థానం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుంది. ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుంది. వేలం.. అభివృద్ధి పనులు అక్కడ ఉన్న రాళ్లను దెబ్బతీయవు. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు (లేక్) లేదు సర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా హెచ్‌సీయూది కాదని తేలింది అని క్లారిటీ ఇచ్చింది. అలాగే, విద్యార్థులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది.
మరోవైపు.. సెంట్రల్ యూనివర్సిటీలో నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇద్దరు పీహెచ్‌డీ స్కాలర్స్ విద్యార్థులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎర్రం నవీన్ కుమార్, రోహిత్‌పై 329(3), 118(10, 132, 191(3), 351(3) r/w 3(5) బీఎన్ఎస్ యాక్ట్ కింద గచ్చిబౌలి పోలీసులు కేసులు పెట్టారు.