
సికింద్రాబాద్: ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం ఒక యువతి మౌలాలి–చర్లపల్లి రైల్వేస్టేషన్ మధ్య గల రైల్వే ట్రాక్‌పైకి వచ్చింది.
ఆమెను గుర్తించిన కీ మ్యాన్ వారిస్తున్నా వినకుండా మౌలాలి నుంచి చర్లపల్లి వైపు వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకుని ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలంలో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతురాలు వరంగల్ ఉర్సుకు చెందిన రవికుమార్ కుమార్తె మాదారపు లత (30)గా గుర్తించారు. హన్మకొండలోని శ్రీలక్ష్మి ఆసుపత్రిలో ఆమె నర్సుగా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని, గతంలోనూ ఇంట్లో చెప్పకుండా మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లిందని, సమాచారం అందుకుని తాము తిరిగి ఇంటికి తీసుకువచ్చినట్టు తెలిపారు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటికి వచ్చిందని, చర్లపల్లి వైపు వెళుతుందని తాము ఊహించలేదన్నారు. ఇదిలా ఉండగా మృతురాలి హ్యాండ్‌బ్యాగులో లభించిన లేఖలో హిందూ సంప్రదాయం ప్రకారం తన అంత్యక్రియలు నిర్వహించాలని పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.