
బంజారాహిల్స్(హైదరాబాద్): ఆ బాలుడికి 16 ఏళ్లు. అతడి తల్లిదండ్రులు జూబ్లీహిల్స్‌లోని ఓ బడా పారిశ్రామికవేత్త ఇంట్లో పని చేస్తూ అక్కడే ఉన్న సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. సదరు బాలుడు పదో తరగతి పరీక్షల కోసం గత జనవరిలో తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. అదే ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న మరో యువతి (28) వారు ఉంటున్న క్వార్టర్ పక్కనే మరో క్వార్టర్‌లో ఉంటోంది.
ఆ బాలుడితో పరిచయం పెంచుకున్న ఆమె తరచూ అతడిని తన క్వార్టర్‌లోకి పిలిపించుకుని అతడిపై లైంగిక దాడికి పాల్పడేది. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ తల్లి మీద దొంగతనం కేసు పెట్టించి ఉద్యోగం నుంచి తీసివేయిస్తానని బాలుడిని బెదిరించేది. తన తల్లి ఉద్యోగం పోతుందనే భయంతోనే అతను ఈ విషయం ఎక్కడా చెప్పలేదు.
ఐదు రోజుల క్రితం సదరు యువతి గదిలో తన కుమారుడు ఉండడాన్ని గుర్తించిన అతడి తల్లి అక్కడికి వెళ్లి చూడగా సదరు యువతి తన కొడుకును బలవంతంగా ముద్దు పెట్టుకుంటుండగా చూసింది.ఈ విషయమై తన కుమారుడిని నిలదీయగా అతను తల్లికి పూర్తి వివరాలు చెప్పాడు. దీంతో బాధితుడి తల్లి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన యువతిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.