ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట ప్రాంతానికి చెందిన మేల్ నర్స్ మహ్మద్ గులామ్ నగరానికి చెందిన ఓ వృద్ధురాలిని టార్గెట్‌గా చేసుకున్నాడు. ఆమె వ్యక్తిగత వివరాలు సంగ్రహించిన అతగాడు వాటిని బయటపెడతానంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. బాధితురాలు నగర షీ–టీమ్స్‌ను ఆశ్రయించడంతో కటకటాల్లోకి చేరాడని అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ శుక్రవారం పేర్కొన్నారు. సదరు 55 ఏళ్ల మహిళ గతంలో కోవిడ్ బారినపడగా టెలీ మెడిసిన్ ద్వారా వైద్య సహాయం పొందారు.
అప్పట్లో మేల్ నర్సుగా ఈమెకు తరచు ఫోన్లు చేసి యోగక్షేమాలు తెలుసుకున్న గులామ్ ఆమెకు సన్నిహితంగా మారాడు. తరచు ఫోన్లు చేస్తూ ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నాడు. అతిగా స్పందిస్తున్నాడని, తన వ్యక్తిగత వివరాలు తెలుసుకుంటున్నాడని పసిగట్టిన ఆమె దూరంగా ఉంచడం మొదలెట్టారు. దీంతో తన వద్ద ఉన్న సమాచారాన్ని లీక్ చేస్తానని, ప్రశాంత జీవితాన్ని పాడుచేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు.
ఇతడిని వదిలించుకోవడానికి ఆమె కొంత మొత్తం చెల్లించినా పంథా మారలేదు. బాధితురాలు షీ–టీమ్స్‌ను ఆశ్రయించింది. విషయాన్ని పూర్తి గోప్యంగా ఉంచిన అధికారులు గులామ్‌ను పట్టుకుని, పూర్తి సాక్ష్యాధారాలతో కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం అతడికి 8 రోజుల జైలు విధించడంతో చంచల్‌గూడకు తరలించారు.
పెళ్లి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి వేధిస్తున్నాడంటూ..
►పెళ్లి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి వేధిస్తున్నాడని మరో బాధితురాలు షీ–టీమ్స్‌ను ఆశ్రయించింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న ఈ మహిళకు (26) స్పాలో పని చేసే ఎం.అర్జున్ అకౌంటెంట్ ఉద్యోగం ఇప్పించాడు. కొన్నాళ్ల తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని అడగడం మొదలెట్టాడు. వివాహితుడైన అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉండటంతో తిరస్కరించింది. బాధితురాలు ఆ ఉద్యోగాన్ని వదిలేసినా అర్జున్ నుంచి వేధింపులు తప్పలేదు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన షీ–టీమ్స్ అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఐదు రోజుల జైలు శిక్ష విధించారు.
యువకుడిపై పోక్సో కేసు నమోదు
►గాంధీనగర్ ప్రాంతానికి చెందిన బాలికను ఇన్‌స్ట్రాగామ్ ద్వారా వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మొత్తమ్మీద గత నెల్లో షీ–టీమ్స్‌కు 103 ఫిర్యాదులు వచ్చాయి. వీరిలో 52 మంది నేరుగా, 34 మంది వాట్సాప్ ద్వారా, మిగిలిన వాళ్లు ఇతర విధానాల్లో ఆశ్రయించారు. వీటికి సంబంధించి ఆయా ఠాణాల్లో 12 కేసులు నమోదు కాగా.. 26 ఫిర్యాదులు పెట్టీ కేసులుగా మారాయి. ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో 98 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. వేధింపులు ఎదురైనప్పుడు మౌనంగా ఉండవద్దని, 9490616555కు వాట్సాప్ చేయడం ద్వారా లేదా నగర పోలీసు సోషల్‌మీడియా ఖాతాల ద్వారా ఫిర్యాదు చేయాలని ఏఆర్ శ్రీనివాస్ కోరారు.
చదవండి: థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం.. హెచ్‌సీయూలో ఉద్రిక్తత
Comments
Please login to add a commentAdd a comment