పంకజ రుతు, అరుణ పాల్వాయి, నీరజాక్షి
సేవకు విశ్రాంతి లేదు.. రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో నర్సులు చేసే సేవలూ అంతే ముఖ్యం. ‘నీకేం కాదు, ధైర్యంగా ఉండు’ అని నర్సు చెప్పే మాట రోగిలో భవిష్యత్తుపైన ఆశలు చిగురింపజేస్తుంది.
విధుల్లో ఉన్నా, లేకపోయినా తమ చుట్టూ ఉన్నవారికి నర్సమ్మగా సేవలు అందిస్తూనే ఉంటుంది. తన సేవాగుణాన్ని చాటుకుంటూనే ఉంటుంది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ముప్పై, నలభై ఏళ్లుగా రోగులకు సేవలు అందించిన వారిని కలిస్తే వారు పంచుకున్న విషయాలు ఇవి.
దేవుడిచ్చిన అవకాశం
ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్‌లో .. దాదాపు నలభై ఏళ్లు నర్సుగా, నర్సింగ్ టీచర్‌గా విధులు నిర్వర్తించాను. కర్నూల్‌లోనూ చీఫ్ నర్సింగ్ సూపరిండెంట్‌గా వర్క్ చేశాను. ఏడాది క్రితం రిటైర్ అయ్యాను. కొంత కాలం క్రితం మాకు తెలిసిన వారి అమ్మాయికి హార్ట్‌లో హోల్ ఉందని తెలిసింది. ఏ డాక్టర్‌ను కలిస్తే ఎలాంటి చికిత్స అందుతుంది,
ఎలాంటి గైడెన్స్ అవసరం అనే విషయాలు చెప్పడంతో పాటు కొన్ని నెలలు వారింట్లోనే ఉన్నాను. టైమ్‌కు మందులు, ఫుడ్ చార్ట్ ప్రకారం ఫాలో అవడంలాంటి జాగ్రత్తల మూలంగా ఆ అమ్మాయి సేవ్ అయ్యింది. ఇదొక్కటే కాదు హైదరాబాద్, రాం కోఠిలోని మా కాంప్లెక్స్, కాలనీలలో తెలిసిన వారు ఎవరికి ఆరోగ్య సమస్య వచ్చినా, ఏ డాక్టర్ని కలవాలి అని అడగడంతో పాటు, జాగ్రత్తలు చెప్పమని కోరుతారు.
ప్రెగ్నెంట్ ఉమన్ కనిపిస్తే చాలు – వారు అడగకపోయినా వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో కనుక్కుంటాను. ఇన్నేళ్లపాటు వర్క్‌లో ఉన్నాను కాబట్టి నాకు తెలిసినవారి జాబితా ఎక్కువ. ఇతర రాష్ట్రాలలోనూ ఉన్నారు. వారు కూడా ఏ రాత్రి ఏ వైద్య సలహా అవసరం వచ్చినా అడుగుతుంటారు.
సేవ అనేది దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తాను. అదే ఎంతో మంది రోగులకు స్వస్థత చేకూర్చేలా చేసిందనుకుంటాను. సేవకు ఎప్పుడూ రిటైర్‌మెంట్ ఉండదని నాకు ప్రతిరోజూ ఒక్క సంఘటనైనా రుజువు చేస్తుంటుంది.
– పంకజ రుతు, రాంకోటి, హైదరాబాద్
విధుల్లోలేని సమయాల్లోనూ..
నిమ్స్‌లో విధులను నిర్వర్తిస్తున్నాను. మరో రెండేళ్లలో రిటైర్‌మెంట్ ఉంది. అయితే, హాస్పిటల్ వరకే మా సేవలు ఉండవు. నర్సింగ్ సేవకు రోజుకు ఇన్ని గంటలే అనే నియమం ఉండదు. స్వచ్ఛందంగానూ మా కాలనీలోనూ, కాంప్లెక్స్‌లోనూ, తెలిసినవారికి అవసరమైన వారికి సేవలు ఇస్తుంటాను.
ఈ మధ్య కాలంలో మా కాంప్లెక్స్‌లో ఒక పెద్దాయనకు పక్షవాతం వచ్చింది. పూర్తిగా బెడ్‌కే పరిమితం అయ్యాడు. ప్రతిరోజూ డ్యూటీకి వెళ్లడానికి ముందు వారింటికి వెళ్లి, ఆ రోజు అతని పరిస్థితి ఎలా ఉందో కనుక్కొని, ఆ రోజు షెడ్యూల్‌ను కచ్చితంగా ఫాలో అయ్యారో లేదో అడిగి తెలుసుకుంటాను. ఆ రోజు ఎలాంటి కేర్ తీసుకోవాలో చెబుతాను. మిగతావాళ్లూ తమ ఆరోగ్యస్థితి గురించి అడిగితే చెబుతుంటారు.
అలాంటప్పుడు వారికి డాక్టర్ ప్రిస్కిప్షన్ చూసి ఇంజక్షన్స్ వంటివి అవసరం ఉన్నవారికి చేస్తుంటాను. ఎవరికి ఆరోగ్యసమస్య వచ్చి, సాయం కోరినా అందుబాటులో ఉండటం కూడా సేవగా భావిస్తాను.
– అరుణ పాల్వాయి, మియాపూర్, హైదరాబాద్
ఊరటనివ్వడమే ఆనందం
గాంధీలో స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో ట్యూటర్‌గా రిటైర్ అయ్యాను. ఆ తర్వాత ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగుల ఆరోగ్య సలహాల కోసం ఆరేళ్లు వర్క్ చేశాను. మూడేళ్లుగా ఇంటి వద్దే ఉంటున్నాను. కానీ, ఉద్యోగంలో లేను అనే ఆలోచన ఎప్పుడూ రాదు. మా ఏరియాలో నేను అందరికీ తెలుసు. నాకు దాదాపుగా అందరూ పరిచయమే. ఆ విధంగా మా ఏరియాలో ఎవరికి ఆరోగ్య సమస్య వచ్చినా పిలుస్తారు.
సలహాలు అడుగుతారు. హాస్పిటల్ నుంచి వారు వచ్చాక వెళ్లి కలుస్తాను. ఏ మందులు ఎలా వాడాలో చెబుతుంటాను. మా ఏరియాలో ఎవరికైనా చంటిపిల్లలు పుడితే, వారు పిలవకపోయినా వెళతాను. ప్రసవం అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చంటిపిల్లలను ఎలా చూసుకోవాలో సూచనలు ఇస్తుంటాను. ఎవరైనా చనిపోతే వెళ్లి, డెడ్‌బాడీని ఎలా కేర్ చేయాలో, ఎందుకు అవసరమో చెబుతుంటాను.
మా ఏరియాలో ఈ మధ్య ఒక అన్నకు యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది. హాస్పిటల్ నుంచి వచ్చాక నెల రోజుల పాటు రోజూ వారి ఇంటికి వెళ్లడం, కాలుకు వాపు రాకుండా జాగ్రత్తలు చెప్పడం, డ్రెస్సింగ్ చేయడం, మందులు వాడటం గురించి చెబుతుండేదాన్ని. ఇప్పుడు ఆ ఆన్న నడుస్తున్నారు. సమస్య నుంచి తేరుకున్నాక వారి మొహాల్లో కనిపించే రిలీఫ్ నాకు ఎంతో ఆనందానిస్తుంది.
– నీరజాక్షి, వికారాబాద్
Comments
Please login to add a commentAdd a comment