
స్నేహితుడిని నమ్మి వస్తే నట్టేట ముంచాడు
పోలీసులకు పట్టుబడిన థాయ్‌లాండ్ యువతి
బంజారాహిల్స్(హైదరాబాద్): స్నేహితుడిని నమ్ముకుని భారత్‌కు వచ్చిన థాయ్‌లాండ్ యువతి మోసానికి గురైంది. తిరిగి తన స్వదేశం వెళ్లేందుకు విమాన టికెట్‌కు డబ్బులు లేక వ్యభిచారంలోకి దిగి పోలీసులకు పట్టుబడింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. థాయ్‌లాండ్‌కు చెందిన యువతి (30)కి, చెన్నైకి చెందిన యువకుడికి ఇన్‌స్టాలో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది.
అతడు రమ్మనడంతో గత మార్చిలో యువతి చెన్నైకి వచ్చేసింది. ఆమెను చెన్నైలోని ఓ హోటల్‌లో ఉంచి అతడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ముఖం చాటేయడంతో యువతి హోటల్ బిల్లు చెల్లించలేక.. థాయలాండ్ వెళ్లలేక ఇబ్బందుల పాలయ్యింది. థాయ్‌లాండ్‌కు చెందిన స్నేహితురాలిని సంప్రదించింది. థాయ్‌లాండ్ నుంచి పలువురు మహిళలను వ్యభిచార వృత్తి కోసం భారత్‌కు పంపించే ఓ స్నేహితురాలు నగరంలోని యువతితో మాట్లాడించడంతో గత నెల 30న బాధితురాలు నగరానికి చేరుకుంది.
శ్రీనగర్ కాలనీలో ఓ ప్లాట్‌లో మరో యువతితో కలిసి వ్యభిచారానికి పాల్పడింది. విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దాడులు చేయగా బాధిత యువతి పట్టుబడింది. తనను బాయ్‌ఫ్రెండ్ మోసం చేశాడని, హోటల్ బిల్లు చెల్లించేందుకు, తిరిగి స్వదేశం వెళ్లిపోవడానికి విమాన చార్జీల కోసం తప్పనిసరి పరిస్థితుల్లోనే వ్యభిచార వృత్తిలోకి దిగినట్లు ఆమె తెలిపింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి ఆదివారం పునరావాస కేంద్రానికి తరలించారు.