భార్యను ఉరివేసి చంపిన భర్త
హత్యచేసి..ఆపై ఆత్మహత్యగా చిత్రీకరణ
కేసముద్రంలో ఘటన
కేసముద్రం: అనుమానం.. పెనుభూతమైంది. ఓ ప్రబుద్ధుడు భార్యను ఉరివేసి హత్యచేశాడు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య కథనం ప్రకారం.. కేసముద్రంస్టేషన్‌కు చెందిన బత్తుల వీరన్నకు ఇదే మండలం బోడమంచ్యాతండాజీపీకి చెందిన అనూష(30)తో 2011లో వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు రాజేశ్(6వ తరగతి) ఉన్నాడు. మొదట్లో వారి దాంపత్య జీవితం సవ్యంగానే సాగింది. కొంతకాలంగా వీరన్న తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు.
పలుమార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. నాలుగు రోజుల క్రితం అనూష కుమారుడు రాజేశ్ బోడమంచ్యాతండాలో తన తాత ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి వీరన్న తన భార్య అనూషను ఉరివేసి హత్య చేశాడు. అనంతరం ఇంటి వెనక ఉన్న బావి దూలానికి భార్యను వేలాడ దీసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు. ఆపై అక్కడి నుంచి పరారయ్యాడు. ఆదివారం ఉదయం విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు ఘటనా స్థలికి చేరుకుని అనూష మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. అనూషను భర్తే హత్యచేశాడంటూ ఆరోపించారు.
సమాచారం అందుకున్న రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్‌రాజు సిబ్బందితో చేరుకుని ఘటనా స్థలిని పరీశీలించారు. మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మానుకోట జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరన్న.. అనుమానంతోనే భార్య మెడకు ఉరేసి చంపిన అనంతరం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించినట్లు రూరల్ సీఐ సర్వయ్య తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
తల్లికి తలకొరివి పెట్టిన చిట్టి చేతులు..
ఒకవైపు తల్లి హత్యకు గురికాగా, మరోవైపు తండ్రి లేకపోవడంతో ధీనంగా కూర్చున్న చిన్నారి రాజేశ్‌ను చూసిన వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. తన చిట్టి చేతులతో తల్లికి తలకొరివిపెట్టి అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఈ హృదయ విదారకర ఘటనను చూసిన ప్రతి ఒక్కరూ కంటతడిపెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment