
సాక్షి,హైదరాబాద్: ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ((Hyderabad Central University)ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
హెచ్‌సీయూలో భూముల వేలం వివాదాన్ని వ్యవతిరేకిస్తూ ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనతో భారీగా మొహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో గచ్చిబౌలి సెంట్రల్ వర్శిటీలో ఉద్రిక్తతపై బండి సంజయ్ స్పందించారు. ‘విద్యార్థులపై లాఠీఛార్జీ అమానుషం. ప్రభుత్వ భూములను తెగనమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా?. భావితరాలకు గజం జాగా కూడా మిగిల్చరా? పోలీసుల ద్వారా భయాందోళనలకు గురిచేసి కాంగ్రెస్ పాలన చేయాలనుకుంటోంది. వర్శిటీ భూములకే రక్షణ లేకపోతే ఎలా?. ప్రతిష్టాత్మక సెంట్రల్ యూనివర్సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోంది.
భూముల రక్షణ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఇష్టానుసారం దాడి చేస్తారా?.తక్షణమే అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదల చేయాలి. హెచ్‌సీయూ భూముల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు.