ఇంక్యుబేటర్ బయోనెస్ట్‌ను ప్రారంభిస్తున్న పద్మనాభన్
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ‘బయోనెస్ట్’పేరిట ఏర్పాటు చేసిన బయో–ఇంక్యుబేటర్ దేశంలోనే అత్యుత్తమమైందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్) మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.పద్మనాభన్ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని హెచ్‌సీయూలో స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్, నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సహకారంతో ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద బయో–ఇంక్యుబేటర్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను దేశంలో అత్యుత్తమమైన 5 బయో ఇంక్యుబేటర్లను పరిశీలించానని, కానీ ఇంత అత్యాధునిక సౌకర్యాలు, విశాల స్థలం కలిగి ఉన్నది మరెక్కడాలేదన్నారు. తాను 5 వేల పరిశోధక ప్రతిపాదనలను చేశానని, అందులో 700 ప్రతిపాదనలు 500 పరిశ్రమల్లో ఆపరేషన్ అవుతున్నాయని చెప్పారు. ఇవన్నీ 100 ప్రొడక్టులుంటాయని, అందులో 50 వ్యాపారాత్మకమైనవని గుర్తుచేశారు. దేశంలోని ప్రభుత్వ సంస్థల్లో 1,000 రీసెర్చ్ లేబరేటరీస్ ఉన్నాయని, వాటిల్లో ఇంక్యుబేషన్ సౌకర్యాలు కల్పించి స్టార్టప్‌లను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. మహిళా పరిశోధక విద్యార్థులు స్టార్టప్‌లను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారాలని సూచించారు.
30 స్టార్టప్‌లకు అవకాశం..
20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బయో–ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేశామని హెచ్‌సీయూ వీసీ ప్రొఫెసర్ అప్పారావు పొదిలె, ప్లాంట్ సైన్సెస్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ పి.రెడ్డన్న వెల్లడించారు. దీనిలో 30 వరకు స్టార్టప్‌లకు అవకాశం ఉంటుందని.. 350కి పైగా పీహెచ్‌డీ స్కాలర్ విద్యార్థులు, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో న్యూయార్క్ మౌంట్ సినాయ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఈసీటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఇ.ప్రేమ్‌కుమార్‌రెడ్డి, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ బి.సెంథిల్ కుమరన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment