హెచ్ సీయూ విద్యార్థులు, ఫ్రొఫెసర్లకు బెయిల్ మంజూరు
- ఐదు రోజుల ఉత్కంఠకు తెర.. వ్యక్తిగత పూచికత్తుపై నిందితుల విడుదల
- చర్లపల్లి నుంచి హెచ్ సీయూ వరకు భారీ ర్యాలీకి విద్యార్థుల ప్లాన్.. అనుమతి లేదన్న పోలీసులు
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్ సీయూ)లో వైస్ చాన్సలర్ అతిథి గృహంపై దాడి కేసులో అరెస్టయిన 25 మంది విద్యార్థులు, ఇద్దరు ప్రొఫెసర్లకు ఎట్టకేలకు కోర్టులో బెయిల్ లభించింది. మొత్తం 27 మంది నిందితులను రూ.5 వేల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాల్సిందిగా కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. నిందితులు ప్రతివారం పోలీస్ ఠాణాకు వెళ్లి సంతకం చేయాలనే షరతును కూడా విధించింది. కోర్టు ఉత్తర్వులు అందిన వెంటనే విద్యార్థులు విడుదలయ్యే అవకాశం ఉంది. వీసీపై పోరాటంలో నేడు బెయిల్ పొందటాన్ని విజయంగా భావిస్తోన్న హెచ్ సీయూ స్టూడెంట్స్ జేఏసీ.. చర్లపల్లి జైలు నుంచి వర్సిటీ వరకు ర్యాలీ నిర్వహించాలని భావిస్తోంది. అయితే ఎలాంటి ర్యాలీలను అనుమతించేదిలేదని పోలీసులు చెబుతున్నారు.
విపీహెచ్ డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య సంఘటనతో హెచ్ సీయూ సహా ఇతర వర్సిటీల్లో వీసీల తీరు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రోహిత్ ఆత్మహత్య అనంతరం రెండునెలలు సెలవుపై వెళ్లిన వీసీ అప్పారావు ఈ నెల 23న మళ్లీ బాధ్యతలు స్వీకరించేందుకు సన్నద్ధం అవుతుండగా, ఆయన రాకను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, కొందరు ప్రొఫెసర్లు ఆందోళనల నిర్వహించారు. ఈ క్రమంలోనే వీసీ గెస్ట్ హౌస్ లో అద్దాలు, పూల కుండీలు ధ్వంసం అయ్యాయి. విషయం పోలీసుల లాఠీచార్జి వరకు వెళ్లడం, 27 మంది అరెస్ట్ కావటం తెలిసిందే.
జైలులో ఉన్న విద్యార్థులను సోమవారం కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే పరామర్శించారు. విద్యార్థులతోపాటు రోహిత్ తల్లి రాధికను కూడా ఆయన కలుసుకున్నారు. హెచ్ సీయూలో చోటుచేసుకున్న పరిణామాలపై సమగ్ర విచారణ జరిపిస్తానని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్ త్వరితగతిన ఆ పని చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.