ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఇన్నాళ్లూ గుట్టుగా గుప్పుమన్న గంజాయి ఇప్పుడు క్యాంపస్‌లోకి చొరబడింది! ఇంటర్మీడియట్ ఆ పైస్థాయి విద్యార్థులను మత్తులో ముంచెత్తుతోంది. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో జోరుగా గంజాయి మాఫియా దందా సాగిస్తోంది. గంజాయి దమ్ము కొడుతున్న ప్రతి వంద మందిలో 70 మంది విద్యార్థులే. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటులోని ఓ విభాగం రాష్ట్ర రాజధానిలో గంజాయి వినియోగంపై నిర్వహించిన సర్వేలో వెల్లడైన చేదు వాస్తవాలివీ!! గంజాయి మత్తుకు అలవాటు పడుతున్న విద్యార్థులు క్రమంగా డ్రగ్స్ వైపు మళ్లుతున్నారని ఈ సర్వేలో తేలింది.
గంజాయి వాడుతున్న ప్రతి వంద మందిలో 70 మంది విద్యార్థులు, 10 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, మిగిలిన వారిలో ఆటో రిక్షా, భవన నిర్మాణ కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 150 కిలోల గంజాయి వినియోగం జరుగుతున్నట్టు అంచ నాకు వచ్చారు. శివారుల్లోని 6 ఇంజనీరింగ్ కాలేజీల్లో దీని వినియోగం భారీగా ఉందని సర్వేలో స్పష్టమైంది. హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీల్లోనూ గంజాయి గుప్పుమంటున్నట్టు వెల్లడైం ది. నగరానికి వస్తున్న నైజీరియా లాంటి ఆఫ్రికన్ దేశాల విద్యార్థుల నుంచి ఈ అలవాటు క్రమంగా తెలుగు విద్యార్థులకు పాకుతోందని ఎక్సైజ్ శాఖ ఆందోళన చెందుతోంది.
మార్కెట్‌లోకి వోసీబీ పేపర్లు
గతంలో సిగరెట్‌లో పొగాకు తీసేసి ఖాళీ గొట్టంలో గంజాయి పొడి నింపి పీల్చేవాళ్లు. అయితే ఇది ఆలస్యం కావటం, పొగాకు బయటకు తీసే క్రమంలో పక్కవాళ్లు పసిగట్టే అవకాశం ఉండటంతో జాయింట్ కాగితం ముక్కలు వచ్చాయి. ఇవి వోసీబీ స్లిప్ పేరుతో మార్కెట్‌లోకి వచ్చాయి. విద్యార్థులు వీటిని ‘జాయింట్’అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ స్లిప్స్‌లో గంజాయిని చుట్ట చుట్టి సిగరెట్ తరహాలోనే కాల్చి దమ్ము కొడుతున్నారు. కాలేజీల చుట్టూ ఉన్న పాన్‌షాపు, పుస్తకాల దుకాణాల్లో ఈ స్లిప్స్ దొరుకుతున్నాయి. వీటిని కేవలం గంజాయి పీల్చడానికే తయారు చేశారని ఎక్సైజ్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. 10 గ్రాముల గంజాయి రూ.300 నుంచి రూ.700 వరకు విక్రయిస్తున్నారు.
డీలర్లు.. కొరియర్ వ్యవస్థ
గంజాయి దందాకు నగరంలో మన్‌మోహన్‌సింగ్, అంగూరీభాయి, శివాచారి, ధరణ్ సింగ్‌తోపాటు మరో 6 మంది పెద్ద డీలర్లు ఉన్నట్లు తేలింది. వీరు విశాఖపట్నం, నారాయణఖేడ్, అదిలాబాద్ నుంచి గంజాయి తెప్పిస్తున్నారు. ఒక్కో డీలర్ వద్ద 15 నుంచి 20 మంది వర్కర్లు పని చేస్తున్నారని, వీళ్లందరికీ స్థాయిని బట్టి కొందరికి నెల జీతం, మరి కొందరికి విక్రయాలపై కమీషన్ ఇస్తున్నట్లు సర్వే తేల్చింది. మెయిన్ డీలర్లు సేలింగ్ పాయింట్‌కు గంజాయి సరఫరా చేస్తున్నారు. ధూల్‌పేటలో 20, శంషాబాద్, ఆరాంఘర్, అత్తాపూర్‌లలో 12, లంగర్‌హౌస్, టోలీచౌకీ, గోల్కొండ, నానల్ నగర్‌లలో 8, గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రాంగూడలో 6, ఫతేనగర్, బాలానగర్‌లో 5 మంగల్‌హాట్‌లో 2, సీతాఫల్‌మండిలో 4, కొంపల్లిలో 4, నాగోల్‌లో 4, ఇబ్రహీంపట్నంలో 6 చొప్పున గంజాయి విక్రయ స్థావరాలు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment