
హెచ్‌సీయూ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు
విద్యార్థులపై అడుగడుగునా నిఘా
ఐడీ కార్డు ఉంటేనే లోనికి అనుమతి
ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులపై కేసు నమోదు
నేటి నుంచి అడ్మిన్ భవనం ముందు నిరవధిక నిరసన
గచ్చిబౌలి/రాయదుర్గం: కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై నెలకొన్న వివాదంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ అట్టుడుకిపోతోంది. క్యాంపస్ మొత్తం పోలీసు పహారాలో ఉంది. మరోవైపు ఆందోలనలు కొనసాగిస్తున్న విద్యార్థులు, మంగళవారం నుంచి పోరాటం ఉధృతం చేయాలని నిర్ణయించారు. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టబోమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులపై కేసులు నమోదు చేసిన పోలీసులు..క్యాంపస్‌లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.
ప్రధాన రహదారి నుంచి క్యాంపస్ ప్రధాన ద్వారం వరకు స్టాపర్స్ అమర్చారు. ప్రధాన ద్వారం వద్ద యూనివర్సిటీ హస్టళ్ల ముందు గచ్చిబౌలి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల కదలికలపై నిఘా పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీకి కేటాయించిన స్థలంలో ఎలాంటి ఆటంకం లేకుండా పనులు సాగేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ బందోబస్తును మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం పర్యవేక్షిస్తున్నారు.
ఇద్దరు విద్యార్థుల రిమాండ్
పనులను అడ్డుకోవడం, తోపులాటకు దిగడంతో పోలీసు అధికారికి గాయాలయ్యాయంటూ టీజీఐఐసీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు హెచ్‌సీయూకు చెందిన ఇద్దరు పీహెచ్‌డి విద్యార్థులపై కేసు నమోదు చేశారు. పొలిటికల్ సైన్స్ పీహెచ్‌డీ స్కాలర్, హెచ్‌సీయూ స్టూడెంట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఎర్రం నవీన్, కంప్యూటర్ సైన్స్ పీహెచ్‌డీ స్కాలర్, ఏబీవీపీ నాయకులు రోహిత్ బొండుగులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరిలించారు. వీరిపై బీఎన్‌ఎస్ 329 (3), 118(1), 132, 191(3), 351(3), రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నేటి నుంచి తరగతుల బహిష్కరణ
హెచ్‌సీయూలో భూముల పరిరక్షణ కోసం మంగళవారం నుంచి తరగతులు బహిష్కరించి క్యాంపస్ లోని పరిపాలనా భవనం ముందు నిరవధిక నిరసన చేపట్టాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఇచ్చిన పిలుపునకు ఏఐఎస్‌ఏ, ఏఐఓబీసీఎస్‌ఏ, ఏఎస్‌ఏ, బీఎస్‌ఎఫ్, డీఎస్‌యూ, ఫ్రటర్నిటీ, ఎంఎస్‌ఎఫ్, పీ డీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎస్‌ఐఓ, టీఎస్‌ఎఫ్ వంటి విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి.
ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం శవయాత్ర
హెచ్‌సీయూ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా క్యాంపస్‌లో సోమవారం సాయంత్రం రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి శవయాత్రను నిర్వహించారు. వర్సిటీ ప్రధాన గేటు వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.