
హిమాయత్‌నగర్‌లో గుర్తు తెలియని యువకుడి దారుణ హత్య
కవాడిగూడ: గుర్తుతెలియని ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి...సమీప భవనంలోని లిఫ్ట్ గుంతలో శవాన్ని పడేసి వెళ్లిన ఘటన దోమలగూడ పీఎస్ పరిధిలోని హిమాయత్‌నగర్ స్ట్రీట్ నెంబర్ 8లో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఆ యువకుడిని గుర్తు తెలియని దుండగలు ముందుగా బండరాయితో మోది హత్య చేశారు. అనంతరం మృతదేహన్ని బట్టలో చుట్టి ప్లాజా అపార్ట్‌మెంట్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు పక్కనే ఉన్న లిఫ్ట్ గుంతలో పడేసి పారిపోయారు. సోమవారం ఉదయం అపార్ట్‌మెంట్ ప్రాంగణాన్ని శుభ్రం చేసేందుకు వచ్చిన సిబ్బంది రక్తపు మరకలు, దుస్తులు పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే దోమలగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అపార్ట్‌మెంట్‌లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ పక్కనే ఉన్న లిఫ్ట్‌లో 32 సంవత్సరాల యువకుడి మృతదేహం నగ్నంగా పడి ఉంది. వెంటనే సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, గాందీనగర్ డివిజన్ ఇన్‌చార్జీ ఏసీపీ గురురాఘవేంద్ర దోమలగూడ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌ఐలు నిరంజన్, సాయిచంద్‌లు, క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేశారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరిలించారు. ఇదిలా ఉండగా ప్రతి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో హత్య జరగడం సంచలనం సృష్టించింది. కాగా స్థానికుల వివరాల ప్రకారం..
గుర్తుతెలియని యువకుడు ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో భోజనం చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ షట్టర్ ముందు నిద్రపోగా..మద్యం లేదా గంజాయి మత్తులో ఉన్నకొంత మంది దుండగులు అతని వద్దకు వచ్చి నిద్రలేపి పక్క వీధిలోకి తీసుకెళ్లి ఘర్షణ పడ్డారని తెలిసింది. ఈ క్రమంలోనే హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటన అర్ధరాత్రి రెండు నుంచి మూడు గంటల మధ్య జరిగినట్లు సమాచారం.