
హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటంపై ప్రభుత్వం అపవాదులు
వర్సిటీ తరలింపు, ఎకో పార్క్ అంటూ కుయుక్తులు
బహిరంగ లేఖలో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల అడవిని శాశ్వతంగా కాపాడుకునేందుకు హెచ్‌సీయూ విద్యార్థులు చేస్తున్న అపూర్వ పోరాటంపై ప్రభుత్వం అపవాదులు వేస్తూ, బెదిరింపులకు దిగుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. విద్యార్థులు నిస్వార్థంగా, ఉదాత్త లక్ష్యాలతో చేపట్టిన ఈ ఆందోళన అద్భుతమని ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ మేరకు విద్యార్థులు, పర్యావరణ కార్యకర్తలు, ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దళారిలా ఆర్థిక ప్రయోజనాల కోసం ఆలోచించకుండా, భవిష్యత్ కోసం కంచ గచ్చిబౌలి స్థలం వేలాన్ని విరమించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకు ఎకో పార్క్ ఏర్పాటు, యూనివర్సిటీ తరలింపు వంటి ప్రతిపాదనలను ముందుకు తెస్తోందని ఆరోపించారు. 50 ఏళ్లకు పైగా సెంట్రల్ యూనివర్సిటీ పర్యావరణ పరిరక్షణకు, విజ్ఞానానికి కేంద్రంగా నిలిచిందని, ఎకో పార్క్ కన్నా గొప్పగా ఈ క్యాంపస్ పర్యావరణ సమతుల్యతను కాపాడుతోందన్నారు.
400 ఎకరాల పర్యావరణాన్ని కాపాడేందుకు పోరాటం ఇంకా మిగిలే ఉందని, ప్రభుత్వ బెదిరింపులను, దుష్ప్రచారాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలని విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు. 400 ఎకరాల పరిరక్షణకు బీఆర్‌ఎస్ కట్టుబడి ఉందని, విద్యార్థులకు అండగా నిలుస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. వేలం వేసే ప్రయత్నాన్ని విరమించుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించేదాకా పోరాటాన్ని కొనసాగిద్దామని చెప్పారు.