
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో పొంగులేటి, పొన్నం, యాదయ్య, శంకర్, రాజ్‌ఠాకూర్, జనక్‌ప్రసాద్
అప్పటివరకు ఓపికగా, ప్రభుత్వానికి అండగా ఉండాలి
మే డే ఉత్సవాల్లో సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో పదేళ్ల పాటు ఆర్థిక విధ్వంసం జరిగింది
పరిస్థితి ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది
కార్మికుల సంక్షేమం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవ స్థను గాడిన పెట్టేందుకు మరో ఏడాది సమయం పడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు ఆర్థిక విధ్వంసం జరిగిందని, మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రా న్ని రూ.8.29 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని విమర్శించారు. కాంట్రాక్టర్లకు రూ.50 వేల కోట్లు బకాయిలు పెట్టారని, ఇతర విభాగాల్లో రూ.1.20 లక్షల కోట్ల మేర చెల్లింపులు చేయలేదని అన్నారు. అనవసరమైన ఖర్చుతో ఆర్థిక దోపి డీకి పాల్పడ్డ గత పాలకులు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు.
ఫామ్‌హౌస్‌లు, పేపర్లు, టీవీ లు అంటూ వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకున్నారన్నా రు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నామని, పరిస్థితి ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని తెలిపారు. మే డే పురస్కరించుకుని గురువారం రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో సీఎం పాల్గొని కార్మికులనుద్దేశించి ప్రసంగించారు.
15 నెలలుగా నిద్రలేని రాత్రులు..
‘రాష్ట్ర అభ్యున్నతి కోసం 15 నెలలుగా నేను, నా సహచర మంత్రులు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. ఒక పద్ధతి ప్రకారం నష్టాలను నివారిస్తూ ముందుకు వెళుతున్నాం. కార్మికుల సంక్షేమం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సింగరేణి లాభాల్లో వాటా కింద కార్మికులకు బోనస్ ఇచ్చాం. ఆరీ్టసీలో కారుణ్య నియామకాలు చేపట్టాం. త్వరలో గిగ్ వర్కర్స్ పాలసీని తీసుకురాబోతున్నాం. ఇది దేశానికే ఆదర్శంగా మారుతుందని భావిస్తున్నాం. కార్మికుల విషయంలో గత ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణచివేసి 50 మంది కార్మికులను పొట్టన పెట్టుకుంది..’అని రేవంత్ ఆరోపించారు.
సమ్మె చేస్తే నష్టాలు తప్పవు
‘ఇప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సమస్య ఏదైనా మంత్రి దృష్టికి తీసుకురండి. వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల్లోకి వస్తోంది. ఇలాంటి సమయంలో సమ్మె చేస్తే సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోతుంది. ఆర్టీసీ కార్మికులు పంతాలు, పట్టింపులకు పోవద్దు. ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులదే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా ప్రజల ముందుంచాం. మీరేం చెబితే అదే చేస్తాం. ఇది మీ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు రూ.22,500 కోట్ల రాబడి ఉంటే అన్ని పథకాలను అమలు చేయవచ్చు.
కానీ ప్రస్తుతం వస్తున్న ఆదాయం రూ.18,500 కోట్లు మాత్రమే. ఏడాదిన్నరలో రూ.1.58 లక్షల కోట్లు అప్పులు చేస్తే అందులో రూ.1.52 లక్షల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పుల వాయిదాలు, వడ్డీలు చెల్లించడానికే సరిపోయింది. మరో ఏడాది పాటు వేచి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆ తర్వాత సమస్యల పరిష్కారం వేగవంతం అవుతుంది. అప్పటివరకు ఒపికగా ప్రభుత్వానికి అండగా ఉండాలి..’అని ముఖ్యమంత్రి కోరారు.
గత పాలకులు విషం చిమ్ముతున్నారు..
‘పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కపట నాటక సూత్రధారి ఇప్పుడు మళ్లీ బయలుదేరాడు. కేసీఆర్ చేసిన గాయాల్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదు. పదేళ్ల పాటు ప్రజలను పట్టించుకోకుండా మరోమారు అధికారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. సమస్యలను పరిష్కరిస్తూ, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్న ప్రజా ప్రభుత్వంపై అక్కసుతో గత పాలకులు విషం చిమ్ముతున్నారు.
ప్రజలు ఓట్లేసి అసెంబ్లీకి పంపితే ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ప్రజలు వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దు. కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదు. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అయినా అవకాశం ఇవ్వాలి..’అని రేవంత్ అన్నారు. శ్రమశక్తి అవార్డుల ప్రదానం కార్మిక శాఖ ఆధ్వర్యంలో శ్రమశక్తి అవార్డుల కోసం ఎంపిక చేసిన సంస్థలు, వ్యక్తులకు గురువారం రవీంద్రభారతిలో వాటిని ప్రదానం చేశారు. మొత్తం 11 సంస్థలు, 37 మంది వ్యక్తిగతంగా అవార్డులకు ఎంపికయ్యారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజి
బోర్డు, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, క్రిమెటివ్ స్కైజ్/ టెన్సిల్ స్ట్రక్చర్స్ మాన్యుఫాక్చరింగ్ తదితర సంస్థలు సీఎం నుంచి అవార్డులు అందుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, వీర్లపల్లి శంకర్, రాజ్‌ఠాకూర్, కనీస వేతన సలహా బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.