వాళ్ల వలలో పడొద్దు.. పంతాలకు పోయి సమ్మె చేయొద్దు | Telangana CM Revanth May Day 2025 Speech Request To RTC Employees | Sakshi
Sakshi News home page

వాళ్ల వలలో పడొద్దు.. పంతాలకు పోయి సమ్మె చేయొద్దు

Published Thu, May 1 2025 4:06 PM | Last Updated on Thu, May 1 2025 4:07 PM

Telangana CM Revanth May Day 2025 Speech Request To RTC Employees

హైదరాబాద్‌, సాక్షి:  సమ్మె యోచనలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమ్మె ఆలోచన వీడాలని.. ఏదైనా సమస్యలు ఉంటే చర్చిద్దామని.. సమ్మె పోటు రాష్ట్రానికి నష్టం చేస్తుందని అన్నారాయన. రవీంద్రభారతిలో గురువారం జరిగిన మేడే ఉత్సవాలలో ఆయన మాట్లాడుతూ.. 

‘‘తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలో పయనిస్తోంది. ఇది మీ సంస్థ. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. గత పదేళ్లలో విధ్వంసం జరిగింది. రాష్ట్రంలో గత పదేళ్లు ఆర్ధిక దోపిడీ జరిగింది. ఆర్టీసీ కార్మికులు పంతాలు, పట్టింపులకు పోకండి. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత మంత్రితో చర్చించండి. వచ్చే ఆదాయమంతా మీ చేతిలో  పెడతాం. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయండి.అణా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్లేది లేదు. అంతా మీ కోసమే ఖర్చు చేస్తాం. 

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదు. అందుకే ఒకసారి ఆలోచించండి. కష్టమైనా, నిష్ఠూరమైన ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. సమ్మె పోటు రాష్ట్రానికి నష్టం చేస్తుంది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది.. మరో ఏడాదిలో కొంత కుదురుకుంటుంది. పదేళ్లు ఏం చేయని వాళ్లు వచ్చి చెబితే వాళ్ల వలలో పడొద్దు. వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దు. ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మండి. నమ్ముకున్న మీకు  అండగా ఉంటా అని సీఎం రేవంత్‌ ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి అన్నారు. 

ఇంకా ఆయన మే డే ప్రసంగంలో ఏం చెప్పారంటే.. కార్మికుల చెమట చుక్కలే ప్రపంచ అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. ప్రపంచంలో ఎన్ని విప్లవాలు వచ్చినా కార్మికుల ఉద్యమం ప్రత్యేకం. తెలంగాణ సాధనలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికులు, అసంఘటిత కార్మికుల పాత్ర మరువలేనిది. తెలంగాణలో కార్మికులను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకువెళుతున్నాం. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో  దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందంటే మీ సహకారం ఎంతో ఉంది.

సింగరేణి లాభాలలోకార్మికులకు వాటా ఇచ్చి బోనస్ ఇచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిది. గత పదేళ్ల నిర్లక్ష్యంతో విద్యుత్ వ్యవస్థ కుప్ప కూలే పరిస్థితి వచ్చింది. ఒక పద్ధతి ప్రకారం నష్టాలను నివారిస్తూ ముందుకు వెళుతున్నాం. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టాం. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. కార్మికులకు మేలు చేయడమే మా ప్రభుత్వ విధానం. అసంఘటిత కార్మికుల కోసం గిగ్ వర్కర్స్ పాలసీని త్వరలో తీసుకురాబోతున్నాం. ఇది దేశానికి రోల్ మోడల్ గా నిలవబోతోంది

గత పదేళ్లలో విధ్వంసం జరిగింది. గత ప్రభుత్వం కార్మికుల పట్ల వివక్ష చూపింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణచివేసి 50 మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. ఇది మీ సంస్థ. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికులపైనే ఉంది. 

గత పాలకులు 50 వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టారు. 1 లక్షా 20 వేల కోట్లు ఇతర విభాగాల్లో పెండింగ్ పెట్టి వెళ్లారు. సర్పంచులకు బకాయిలు గత ప్రభుత్వం ఘనకార్యమే కదా. మేం అధికారం చేపట్టే నాటికి ప్రతీ సంస్థలో  8 లక్షల 29 వేల కోట్లు మా చేతికి అప్పు పెట్టి వెళ్లారు.

రాష్ట్రంలో గత పదేళ్లు ఆర్ధిక దోపిడీ జరిగింది. లక్ష కోట్లు పెట్టి ఆయన కట్టిన కాళేశ్వరం మూడేళ్ళకే కూలింది. ఈ 15 నెలలు నేను, నా సహచర మంత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. కెసిఆర్ చేసిన గాయాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదు. అసెంబ్లీకి మీరు పంపిన పిల్లలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదు.. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇవ్వండి. కపటనాటక సూత్రధారి(కేసీఆర్‌ను ఉద్దేశించి..) మళ్లీ బయలుదేరిండు. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు అని రేవంత్‌ ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement