
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తా.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ బీసీ నేతలదేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన బీసీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘తప్పు తప్పు అంటూ బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయి.. ఎక్కడ తప్పు జరిగిందో చూపించాలంటూ ఆ పార్టీ నేతలకు సవాల్ విసిరారు.
‘‘రాష్ట్ర పార్టీ నేతలకు బీసీ కులగణనపై అవగాహన చేసుకోవాలి. ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు. బీసీలు మౌనంగా ఉంటే మీకే నష్టం. బీసీలు నిలదీస్తే.. తమ పదవులు పోతాయని బీజేపీ, బీఆర్ఎస్‌లో రెండు వర్గాల వారు కుట్ర చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి కొస్తే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాటిచ్చారు. బలహీన వర్గాలు ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని బీసీ కులగణన చేశాం’’ అని రేవంత్ చెప్పారు.
‘‘కేసీఆర్ ఒక్క రోజులో సర్వే చేసి కాకి లెక్కలు చెప్పారు. ఆ వివరాలు బయటకు చెప్పకుండా దాచి పెట్టుకున్నారు. రాజకీయాలకు ఆ వివరాలను కేసీఆర్ వినియోగించుకున్నారు. కానీ మేము అలా చేయలేదు. ప్లానింగ్ విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా పెట్టుకుని సర్వే చేశాం. కేసీఆర్ చేసిన సమగ్ర సర్వే తప్పుడు సర్వే. ఎస్సీల్లో 56 కులాలు ఉంటే 86 కులాలుగా సమగ్ర కుటుంబ సర్వేలో చూపించారు. మేము చేసిన సర్వేను కొందరు తప్పుపడుతున్నారు. ఎక్కడ తప్పు ఉందో చెప్పండి. బీఆర్ఎస్, బీజేపీ కోర్టుల్లో కేసులు వేసి కులగణన ప్రక్రియను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంటుంది. వారికి ఆ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా సర్వే చేశాం
మోదీ బీసీ అని చెప్పుకుంటారు. 2011లో కాంగ్రెస్ చేసిన బీసీ సర్వే లెక్కలు బయట పెట్టాలి. బండి సంజయ్‌కు ప్రేమ ఉంటే ఆ లెక్కలు బయట పెట్టండి. బీసీలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని బయట పెట్టడం లేదు. ప్రతీ రాష్ట్రంలో ఈ డిమాండ్ వస్తే దేశం మొత్తం చేయాల్సి వస్తుంది. బీసీల లెక్క తేలితే బీజేపీలో అధికారం చెలాయించే ఒకటి రెండు సామాజిక వర్గాలకు ఇబ్బంది అవుతుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇప్పటి వరకు వారి వివరాలు నమోదు చేసుకోలేదు. 50 శాతం ప్రజలు, అర శాతం ఉన్న వాళ్లను ప్రశ్నిస్తారని వాళ్ల భయం. అందుకే బీసీల సర్వేకు వారు సహకరించడం లేదు. కేసిఆర్ నాలుగు కేటగిరీల్లో లెక్కలు తీస్తే మేము ఐదు కేటగిరీల్లో వివరాలు తీశాం’’ అని రేవంత్ పేర్కొన్నారు.
‘‘తప్పుడు లెక్కలు అని తప్పుడు మాట్లాడొద్దు. ఎక్కడ తప్పు జరిగిందో చెప్పండి. మేము పారదర్శకంగా సర్వే చేశాం. ఇది చరిత్రలో నిలిచి పోతుంది. మేము చేసిన సర్వే దేశానికే ఆదర్శం. సర్వే లెక్కలు బయట పెట్టొద్దని నా మీద కొందరు ఒత్తిడి కూడా తెచ్చారు. అయినా నేను పట్టించుకోలేదు. మన లెక్కలు తప్పని కొందరు తప్పుడు ప్రచారం చేస్తే మన వాళ్ళు మౌనంగా ఉండటం సరికాదు. రాహుల్ గాంధీ బీసీ కులగణనకు డిమాండ్ చేస్తే మోదీకి నష్టం. మోదీ పదవి పోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి పదవులు పోతాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి సర్వే తప్పు అనడం కాదు. ఎక్కడ తప్పు ఉందో చూపించండి. ఇదంతా బీసీలపై జరుగుతున్న పెద్ద కుట్ర. సర్వే లెక్కల ప్రకారం ఎలా న్యాయం చేయాలని నేను ఆలోచిస్తున్నా’’
సెకండ్ ఫేజ్ సర్వే పూర్తి అయిన తర్వాత దీనికి చట్టబద్ధత కల్పిస్తాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జనాభా లెక్కలలోనే లేరు. వారి ఇంటి ముందు మేలుకొలుపు డప్పు కొట్టండి. లెక్కలు చెప్పకుండా ఫామ్ హౌస్ లో పన్నోడు మంచోడు. మీ లెక్కలు తీసిన నేను మంచోడిని కాదా. మీరు కూడా నన్ను విలన్‌గా చూస్తే ఎలా?. అసెంబ్లీలో సర్వేకు చట్టబద్ధత కల్పించే వరకే నా బాధ్యత.. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక బీసీల మీదే ఉంది. బీజేపీకి నా డిమాండ్. కేంద్రం చేసే జనగణనలో కుల గణన చేయండి. నేను చెప్పిన లెక్కలు తప్పని తేల్చండి. మార్చి 10 వరకు అన్ని కుల సంఘాల సమావేశాలు పెట్టుకోండి. తీర్మానాలు చేయండి. బీసీల లెక్కలు మోదీ వద్దంటున్నారు కాబట్టే.. బండి సంజయ్ వద్దు అంటున్నారు.
‘‘మనం చేసిన సర్వేకు ప్రజామోదం కూడా ముఖ్యం. అన్ని సామాజిక వర్గాల సమావేశాలు పెట్టీ తీర్మానాలు చేయండి. యూనివర్సిటీల్లో విద్యార్థులు సెమినార్ లు నిర్వహించండి. బలహీన వర్గాలకు ఇదే భగవద్గీత, ఇదే ఖురాన్, ఇదే బైబిల్. ఇంతకంటే మించిన పాలసీ డాక్యుమెంట్ ఏది లేదు.’’ అని రేవంత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment