పార్టీ బలోపేతంపై నాయకత్వం దృష్టి
డీఎంకే, బీఆర్‌ఎస్‌ల ప్రస్థానంలో పోలికలున్నాయనే భావన
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీ త్వరలో బీజేపీలో విలీనమవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అంటుంటే, బీజేపీలో కాదు.. కాంగ్రెస్‌లో కలిసిపోతుందంటూ బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు. కొంతకాలంగా ఎవరికి వారు ఈ విధమైన ప్రచారం చేస్తున్నారు. అయితే జాతీయ పార్టీల్లో తమ పార్టీ విలీనంపై ఆయా పార్టీల నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తున్న బీఆర్‌ఎస్.. మరోవైపు పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది.
ఇందుకోసం అనుసరించాల్సిన మార్గాలను అన్వేషిస్తోంది. ఆటుపోట్లను అధిగమిస్తూ దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రాంతీయ పార్టీల పనితీరును నిశితంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ప్రాంతీయ పార్టీగా అవతరించి నేటికీ దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నిర్మాణం, పనితీరుపై బీఆర్‌ఎస్ దృష్టి సారించింది.
డీఎంకేతో అనేక పోలికలు
తమిళనాడుకు చెందిన డీఎంకే తరహాలోనే తమది కూడా ఉద్యమ పార్టీ కావడంతో రెండు పార్టీల నడుమ అనేక సిద్ధాంతపరమైన పోలికలు ఉన్నట్లు బీఆర్‌ఎస్ భావిస్తోంది. తమిళ చరిత్ర, సంస్కృతి, ఆత్మగౌరవం తదితరాలను పార్టీ సిద్ధాంత భూమికగా కలిగి ఉన్న డీఎంకే రీతిలోనే తమ పార్టీ కూడా తెలంగాణ ఆత్మకు ప్రతీకగా నిలుస్తోందని పార్టీ నేతలు చెప్తున్నారు. డీఎంకే సుమారు 75 ఏళ్లుగా తమిళనాడు రాజకీయాలను శాసిస్తోంది. అదే రీతిలో బీఆర్‌ఎస్ కూడా సుమారు 24 ఏళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో కీలక శక్తిగా మారింది.
234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో పలుమార్లు ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన డీఎంకే..కొన్నిసార్లు అతితక్కువ స్థానాలకే పరిమితమైంది. 1991లో కేవలం 2 స్థానాలు, 1984, 2011లో కేవలం 25లోపు అసెంబ్లీ స్థానాల్లోనే గెలుపొందింది. బీఆర్‌ఎస్ కూడా రాష్ట్రంలో వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి రాగా.. గత ఏడాది ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యింది. దీంతో ఈ విషయంలోనూ డీఎంకేతో పోలిక ఉన్నట్లుగా బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.
డీఎంకే సంస్థాగత నిర్మాణం, కార్యకలాపాల పరిశీలన
బీఆర్‌ఎస్‌ను మరో 50 ఏళ్ల పాటు తెలంగాణ రాజకీయాల్లో ప్రబల శక్తిగా నిలిపేలా బలోపేతం చేస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఇటీవల చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నేతృత్వంలో ఆంజనేయ గౌడ్, తుంగ బాలు వంటి యువ నేతలు చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం ‘అన్నా అరివాలయం’ను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
డీఎంకేలో సుదీర్ఘకాలంగా కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న ఆర్‌ఎస్ భారతితో వారు భేటీ అయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, అనుబంధ విభాగాలైన యువజన, విద్యార్థి, మహిళా విభాగాల పనితీరు, సోషల్ మీడియా వింగ్ కార్యకలాపాలు తదితరాలను అడిగి తెలుసుకున్నారు. నాలుగు తరాలుగా పార్టీతో కేడర్ మమేకమైన తీరు, క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకలాపాలపై ఆరా తీశారు. తిరువల్లువర్, పశ్చిమ చెన్నై జిల్లాల్లోనూ పర్యటించిన బాల్క సుమన్ బృందం తాము పరిశీలించిన అంశాలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
తృణమూల్, బీజేడీ పనితీరుపై కూడా..!
ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నప్పటికీ ఇటీవలి ఎన్నికల్లో పరాజయం పాలైన నేపథ్యంలో.. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన డీఎంకే ఆటుపోట్లను ఎలా అధిగమించిందనే అంశాన్ని అధ్యయనం చేయాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ సీనియర్ నేతల బృందం సెప్టెంబర్‌లో చెన్నైలో పర్యటించనుంది.
క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు డీఎంకే సంస్థాగత నిర్మాణంతో పాటు ఇతర అంశాలను వారం రోజుల పాటు ఈ బృందం అధ్యయనం చేయనుంది. అలాగే దేశంలోని మరికొన్ని క్రియాశీల ప్రాంతీయ పార్టీల పనితీరును.. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, ఒడిశాలో బిజూ జనతాదళ్ (బీజేడీ) పనితీరును కేటీఆర్ బృందం ప్రత్యక్షంగా అధ్యయనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ తర్వాతే సంస్థాగత నిర్మాణంపై దృష్టి
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అవసరమైన కార్యాచరణపై పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత నిర్మాణం, శిక్షణ తదితరాలను ముమ్మరం చేయాలని భావిస్తున్నా రు.
ఈ నేపథ్యంలో అక్టోబర్ నాటికి డీఎంకేతో పాటు మరికొన్ని బలమైన ప్రధాన ప్రాంతీయ పార్టీల పనితీరుపై అధ్యయనం పూర్తి చేయాలని, అధ్యయనంలో తేలిన అంశాలను దృష్టిలో ఉంచుకుని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా కార్యాచరణకు పదును పెట్టాలని బీఆర్‌ఎస్ నాయకత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment