
రెండో మాట
వామపక్ష, దళిత విద్యార్థి సంఘాల ఈ విజయాలు భిన్న సదాశయాలతో సాధించినవే. అయినా ఐక్య సంఘటిత శక్తితోనే ఇలాంటి ఫలితాలు సాధ్యమైన సంగతి విస్మరించరాదు. కాబట్టి దేశంలోని వామపక్షాలు సహా, నిర్దిష్ట గమ్యం లేకుండా ప్రయాణిస్తున్న దేశీయ ప్రజాస్వామిక శక్తులకు కూడా ఆ విజయం దిక్సూచి. బిహార్ రాజకీయాలలోనే కాకుండా, దేశ రాజకీయాలలో సైతం పెనుమార్పులకు శ్రీకారం చుట్టగలదని భావించిన మహా ఐక్య సంఘటన విఫలమై మరొక నిరంకుశ పాలనకు, ప్రజా వ్యతిరేక పాలనకు కారణమైంది.
‘కొంతమంది కుర్రవాళ్లు/పుట్టుకతో వృద్ధులు
పేర్లకీ పకీర్లకీ/పుకార్లకీ నిబద్ధులు
తాతగారి నాన్నగారి/ భావాలకు దాసులు
వీళ్లకి కళలన్నా రసమన్నా చుక్కెదురు!
గోలచేసి అరవడమొకటే/వాళ్లెరుగుదురు...
కొంతమంది యువకులు/రాబోవు యుగం దూతలు
పావన నవజీవన/బృందావన నిర్మాతలు
బానిస బంధాలను/తలవంచి అనుకరించరు
పోనీ అని అన్యాయపు/ పోకడలు సహించరు
వారికి నా ఆహ్వానం/వారికి నా శాల్యూట్! – శ్రీశ్రీ
ఈ పంక్తులను ఇక్కడ ఉదహరించడానికి కారణం ఉంది. ఇటీవల జరిగిన ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికలలో వామపక్షాలతో దీపిస్తున్న మూడు సంఘాల ఐక్య సంఘటన మరోసారి ఘన విజయం సాధించింది. కీలకమైన నాలుగు పదవులు ఈ సంఘటనే కైవసం చేసుకుంది. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దుగ్గిరాల శ్రీకృష్ణను (దళిత కుసుమం) ఈ సందర్భంగా ‘ది టెలిగ్రాఫ్’(కోల్‌కతా) ఇంటర్వ్యూ చేసింది.
శ్రీశ్రీ రచనలతో ప్రభావితుడై...
ఆ ఇంటర్వ్యూలో చాలా అంశాలు వెలుగుచూశాయి. కారల్‌మార్క్స్ ‘కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో’లోని విశేషాంశాలకన్నా, మహాకవి శ్రీశ్రీ విప్లవగీతాలే శ్రీకృష్ణను ఎక్కువగా ప్రభావితం చేశాయని ఆ పత్రిక పేర్కొన్నది. 27 ఏళ్ల శ్రీకృష్ణ బహుముఖ అంశాలతో, జీవనపార్శా్వలతో పరిచయం, అనుభవం ఉన్న వ్యక్తి. ఆఫ్రికాలోని ఇబో ప్రజల విమోచన పోరాటాలను నవలా రూపంలో తీర్చిదిద్దిన చినువా అచుబే ‘చెదిరిన సమాజం’లో కథానాయకుడు ఒకోన్‌క్వో జీవన పోరాటానికి, లేదా గోర్కీ ‘అమ్మ’నవలలో పావెల్ జీవనపోరాటంలో ఎదుర్కొన్న కష్టాలకు, శ్రీకృష్ణ జీవన పోరాటంలో ఘటనలకు దగ్గర సంబం ధం కనిపిస్తుంది. ధనికవర్గపు చట్రంలో చదువు కోసం ఒక పేద దళితుడు ఎంతగా నలిగిపోవలసి వస్తున్నదో! ఆ వ్యధ స్వయంగా అనుభవించినవారికి గాని బోధపడదు. చిత్ర పరిశ్రమలో నాలుగేళ్లపాటు నటీమణుల మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేసి నాలుగు రాళ్లు సంపాదించుకుంటే గానీ అతడికి చదువుల ప్రాంగణంలోకి ప్రవేశం దొరకలేదు.
ఆపై సివిల్ సర్వీసెస్ పరీక్షల తర్ఫీదు కోసం మరో పోరాటం. తృష్ణ ఉన్నా, యాభయ్‌వేలు చెల్లించుకుంటే గానీ ప్రవేశం దొరకలేదు. ఇందుకోసం హాఫ్‌టోన్ ప్రెస్‌లో నైట్‌షిఫ్ట్‌లో పన్నెండు గంటలు అదనంగా పనిచేయవలసి వచ్చింది. నెలకు ఐదు వేలు జీతం. దానితోనే సివిల్స్ తర్ఫీదు పూర్తికాదు. కనుక జేఎన్‌యూలో ఉన్నత చదువుల కోసం నానారకాలైన 17 కొలువులు చేయవలసి వచ్చింది. కనుకనే, ‘‘నా జీవితంలో ప్రతిరోజు, అడుగడుగునా పోరాటమే’’నని బరువైన గుండెతో శ్రీకృష్ణ ప్రకటించుకోవలసి వచ్చింది. అతడి నాయకత్వంలోనే జేఎన్‌యూలోని మూడు ప్రగతిశీల విద్యార్థి సంఘాలు(కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ బృందం మద్దతు ఉన్న ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్, అఖిల భారత మార్క్సిస్ట్ విద్యార్థి సంఘటన, సీపీఎం విద్యార్థి సంఘం, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా)ఐక్యమైనాయి. దీని ఫలితమే విజయం.
విద్యార్థి నాయకుడు కన్హయ కుమార్‌కు ప్రభుత్వ వేధింపుల ఉదంతం తరువాత వామపక్ష విద్యార్థి ఐక్య సంఘటన సాధించిన విజయమిది. ఇంతకు మించిన స్థాయిలోనిదే హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికలలో వామపక్ష, దళిత విద్యార్థి సంఘాల విజయం. రోహిత్ వేముల ఆత్మహత్యకు దారి తీసిన దుర్మార్గపు ఘటనల తరువాత, విశ్వవిద్యాలయం వ్యవహారాలను చక్కదిద్దే పేరుతో బీజేపీ ప్రభుత్వం అనుసరించిన సంస్కృతీ వ్యతిరేక వైఖరి అనంతరం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఈ విజయం సాధ్యమైంది. ఇది దేశంలో ఏర్పడిన నియంత్రణ వాతావరణానికి సమాధానంగా లభించిన విజయం. వాక్, సభా స్వాతంత్య్రాలకు, పత్రికా స్వేచ్ఛకు, భిన్నాభిప్రాయాల ప్రకటనకు అడ్డు తగులుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ రెండు విద్యార్థి సంఘాల ఎన్నికల ఫలితాలు హెచ్చరిక కావాలి.
వామపక్ష, దళిత విద్యార్థి సంఘాల ఈ విజయాలు భిన్న సదాశయాలతో సాధించినవే. అయినా ఐక్య సంఘటిత శక్తితోనే ఇలాంటి ఫలితాలు సాధ్యమైన సంగతి విస్మరించరాదు. కాబట్టి దేశంలోని వామపక్షాలు సహా, నిర్దిష్ట గమ్యం లేకుండా ప్రయాణిస్తున్న దేశీయ ప్రజాస్వామిక శక్తులకు కూడా విద్యార్థుల ఆ విజయం దిక్సూచి. బిహార్ రాజకీయాలలోనే కాకుండా, దేశ రాజకీయాలలో సైతం పెనుమార్పులకు శ్రీకారం చుట్టగలదని భావించిన 16, 17 పార్టీల మహా ఐక్య సంఘటన విఫలమై మరొక నిరంకుశ పాలనకు, ప్రజా వ్యతిరేక పాలనకు కారణమైంది. సైద్ధాంతిక పునాదులు కొరవడిన పలువురు అవకాశవాదుల కారణంగా ఈ దుస్థితి దాపురించింది. మతతత్వ పాలన ఫలితంగా ప్రబలిన నిరంకుశ ధోరణుల వల్ల ప్రజాస్వామిక వ్యవస్థ మీద కారుచీకట్లు కమ్ముకున్నాయి. ఈ స్థితిలో జేఎన్‌యూ, హెచ్‌సీయూ విద్యార్థి సంఘాల విజయం ఆ కారుచీకట్లలో ఒక కాంతి రేఖగా భావించాలి. ఈ కిరణాలతోనే చిరకాలంగా నిద్రాణమై ఉన్న వామపక్ష రాజకీయ శక్తులు, ప్రగతిశీల దళిత, బహుజన మైనారిటీలు, కార్మిక, రైతాంగాలు మేల్కొనాలి.
జేఎన్‌యూలో కొత్త సమీకరణ
జేఎన్‌యూ ఎన్నికల సందర్భంగా ఈసారి మరొక పరిణామం జరిగింది. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), వామపక్ష విద్యార్థి ఐక్య సంఘటన కూడా చూసిన సరికొత్త సమీకరణ–బీర్సా–అంబేడ్కర్–ఫూలే విద్యార్థి సమాఖ్య (బాప్సా). ఇందులో దళిత, ఆదివాసీ, ఓబీసీ, ముస్లిం విద్యార్థులు భాగస్వాములు. అయినా వామపక్ష విద్యార్థి ఐక్య సంఘటన సాధించిన విజయం వేరు. మున్నెన్నడూ లేని రీతిలో వామపక్ష ఐక్య సంఘటనకు మొదటిసారి బాప్సా నుంచి సవాలు ఎదురుకావడం వేరు. బహుశా ఈ కీలక అంశం ఆధారంగానే ‘ది హిందు’ప్రత్యేక ప్రతినిధి వికాస్ పాఠక్ జేఎన్‌యూ ఫలితాల మీద ఇలా వ్యాఖ్యానించి ఉండవచ్చు.
‘ఇన్నేళ్లుగా సామాజికంగా అణగారిన వర్గాలకు నేడు ప్రాతినిధ్యం అనివార్యమైంది. బాప్సా ఇందుకు అవకాశం కల్పించిందని విద్యార్థి కార్యకర్తలు కొందరు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో వామపక్షాలు కూడా తమ సంప్రదాయక నినాదం ‘లాల్ సలామ్’ను ‘జై భీమ్!–లాల్ సలామ్’గా మార్చుకున్నారు. బీఆర్ అంబేడ్కర్‌ను సొంతం చేసుకుంటూ ఈ సవరణ చేసింది. కనుకనే బాప్సా అణగారిన ప్రజల సంస్థగా రాజకీయ సవాలు విసిరింది’(20–9–2017). హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికలలో (24–9–17) ఎస్‌ఎఫ్‌ఐ, అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్, దళిత స్టూడెంట్స్ యూనియన్, భావ సారూప్యత కలిగిన బృందాలు కలసి ‘సామాజిక న్యాయ సాధన సంఘటన(అలయెన్స్ ఫర్ సోషల్ జస్టిస్)గా ఆవిర్భవించాయి. సమాజాన్ని వర్గ పునాదిపై ఏర్పడిన సంకీర్ణ సామాజిక వర్గాల మిశ్రమంగా వామపక్షాలు భావిస్తాయి. కానీ, అణగారిన ప్రజల వాణికే ప్రాధాన్యం ఇవ్వాలని బాప్సా వాదన.
వామపక్షాలు పట్టించుకోవలసిన విశ్లేషణ
ఇదొక దృక్పథాల సంఘర్షణ. ఈ సంఘర్షణను స్పృశిస్తూ ప్రసిద్ధ రచయిత, వ్యాఖ్యాత ప్రఫుల్ బిద్వాయ్ తన గ్రంథం ‘ఫీనిక్స్ పునర్జన్మ: భారత వామపక్షాలు ఎదుర్కొంటున్న సవాళ్లు’లో చర్చించారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలోని రెండు ముక్కలను (సీపీఐ, సీపీఎం) కలిపి బిద్వాయ్ పార్లమెంటరీ లెఫ్ట్‌గా పరిగణించి ఒక సూత్రీకరణ చేశారు. ‘పార్లమెంటరీ లెఫ్ట్ కనుక రాష్ట్రాల ఎన్నికలలో గెలవడం మీదనే తన శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరించకుండా, దేశవ్యాప్తంగా ఏకముఖంగా ఒక మహోద్యమ నిర్మాణం పైన కేంద్రీకరించి ఉంటే ఇప్పటికన్నా చాలా మెరుగైన పరిస్థితులలో ఉండేది’ అన్నారాయన. స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజులలో సామాజిక సంస్కరణల వైపు ఉత్సాహంతో ఉరకలేసిన ఈ పార్లమెంటరీ లెఫ్ట్, తాము ప్రాతినిధ్యం వహించవలసిన అసలైన ప్రజాబాహుళ్యాన్ని మరచిపోయిందని కూడా బిద్వాయ్ సూచనప్రాయంగా చెప్పారు.
భూస్వామ్య వర్గానికీ, భూమి లేని పేదలకూ మధ్య అధికార చట్రాన్ని బద్దలు కొట్టలేకపోయిందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. పైగా మతతత్వ శక్తులతో మెతక వైఖరితో వ్యవహరిస్తున్నదని కూడా ఆయన భావించారు. సాంఘిక పరివర్తనకు దోహదం చేయవలసిందంటూ వామపక్షానికి ప్రజలు ఇచ్చిన మేండేట్ స్తబ్దతకు గురికావడం ఈ మెతకవైఖరి ఫలితమేనని ఆయన భావన. ఆది నుంచి వేధిస్తున్న ఐదు ప్రాథమిక సమస్యలను వామపక్షం పరిష్కరించుకోవడం మీదనే రాజకీయ శక్తిగా దానికి సంభవించిన పతన దశను నివారించే అంశం ఆధారపడి ఉందని బిద్వాయ్ సూచించారు.
- పార్టీలో కేంద్రీకృత ప్రజాస్వామ్యం. అధికార కేంద్రీకరణ వామపక్షాలలో భిన్నాభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛను నొక్కేయడం, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం గురించి చర్చించే అవకాశాన్ని అణచివేయడం, ఈ తప్పు లోకం కళ్లకు కనపడుతున్నా, ఆ తప్పునే కొనసాగించడం.
- కులాల సమస్య పరిష్కారంలో వైఫల్యం. అగ్ర నాయకత్వ స్థాయిలో అగ్రవర్ణ (సవర్ణ) కులాలకు చెందని వారిని అంటే దళిత బహుజన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో విఫలం కావడం, దళిత విమోచన పోరాటాలలో తమ శక్తియుక్తులను తగినంతగా వెచ్చించకపోవడం.
- తన ఆధిపత్యంలో లేని ప్రజా సమీకరణ ఉద్యమాలతో వామపక్షం సన్నిహితంగా ఉండలేకపోవడం (ఉదా: సఫాయి కర్మచారులు, పారిశుధ్య కార్మికులు, ఆదివాసులు వగైరా).
- వామపక్ష సంఘటనలో మాత్రమే కాదు, ఇలాంటి ఫ్రంట్‌తో కలసి వచ్చే భాగస్వామ్య శక్తుల మధ్య కూడా వ్యూహాత్మక ఐక్యత కొరవడడం.
- పార్లమెంటరీ మార్గాన్ని అనుసరించడం ద్వారా వామపక్షం సాధించగోరుతున్న లక్ష్యం గురించి స్పష్టమైన రాజకీయ భవిష్యద్దర్శనానికి తగిన నిర్వచనం కొరవడడం. పార్లమెంటరీయేతర వామపక్షాలు నిర్వహిస్తున్న పోరాటాల లక్ష్యాలకు పార్లమెంటరీ పద్ధతులలో వామపక్షాలు సాధించాలనుకుంటున్న లక్ష్యాలకు సమన్వయం సాధించడంలో కూడా లక్ష్య శుద్ధి లేకపోవడం. అన్నింటికీ మించి భారత పాలకుల వర్గ స్వభావాన్ని గురించి స్పష్టమైన రాజకీయ దృక్కోణాన్ని అందించలేకపోవడం.
- బిద్వాయ్ వంటి విశ్లేషకులు వామపక్షాలతో కొన్ని సందర్భాలలో ఏకీభవించి ఉండవచ్చు. వ్యతిరేకించనూ వచ్చు. కానీ ప్రజల శ్రేయోభిలాషులుగా అలాంటివారు చేసిన విమర్శను సుహృద్భావంతో చూడడం తప్పకాదు.
abkprasad2006@yahoo.co.in
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు