ABK Prasad
-
లంక కామ్రేడ్ల నుంచి స్ఫూర్తి పొందాలి!
భారత్ పొరుగు దేశమైన శ్రీలంకలో మార్క్సిస్టు నాయకులైన అనూర కుమార దిస్సనాయకే దేశ అధ్యక్షుడుగానూ, హరిణి అమరసూర్య ప్రధానమంత్రిగానూ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆసియా రాజకీయాల్లో పెను ఆసక్తికర, ఆహ్వానించదగిన పరిణామాలకు ఆస్కారం ఏర్పడింది. భారత దేశంలోని ఎన్డీయే– ఆరెస్సెస్ వినాశకర కూటమి ప్రభుత్వం శ్రీలంకలోని మితవాద పక్ష పాలకులతో ‘జోడీ’ కట్టి చిరకాలంగా వర్ధిల్లుతున్న భారత్–శ్రీలంక స్నేహ పూర్వక సంబంధాలలో ‘చిచ్చు’ పెట్టింది. ఈ విషమ పరిణామానికి సకాలంలో విరుగుడుగా వచ్చిందే సింహళంలో వామపక్ష పరిపాలన.శ్రీలంక సమగ్రాభివృద్ధిని కాంక్షించి, పాక్షిక ధోరణుల్లో గాక శ్రీలంక ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారాన్ని చేపట్టారు మార్క్సిస్టు నాయకులు. అలాంటి పరిణామాన్నే భారతదేశంలోనూ ఆవిష్కరించగల అవకాశం ఉన్నా... చీలికలు పీలికలుగా ఉన్న వామపక్షాలు ఒకే తాటిపైకి రాలేకపోతున్నాయి. నాయకులు తమ పదవులను త్యజించి విస్తృత ప్రాతిపదికన ఒకే ఒక పార్టీగా ఆవిర్భవించడానికి కృషి చేయడంలేదు. ఎన్టీయే కూటమి దుష్ట ఇజ్రాయెల్‌తో కలిసి దేశంలోని ప్రగతివాద శక్తులపై నిఘాపెట్టి నానా ఇబ్బంది పెట్టిన చరిత్ర తెలియంది కాదు. ఈ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించుకోవాలంటే దేశంలోని వామ పక్షాలన్నీ ‘చిల్లర తగాదాలు’ మానుకుని ఐక్య వామపక్ష ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. ఇందుకు శ్రీలంక చూపిన ‘ఐక్య ఉద్యమ స్ఫూర్తి’ని భారత వామపక్షాలన్నీ తక్షణం పొందాల్సిన అవసరం ఉంది.ఇదే సందర్భంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దేశంలో ఆచరణలో నిజమైన ఫెడరల్ వ్యవస్థను పాదుకొల్పడానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య సమతులమైన అధికారాల పంపిణీ నొక్కి వక్కాణించారు. ఫెడరల్ వ్యవస్థ సూత్రాల ప్రకారం, కేంద్రం ఇప్పుడు రాష్ట్రాలనుంచి వసూలు చేస్తున్న సెస్‌లు, ఇతర పన్నులను అదే దామాషా ప్రకారం రాష్ట్రాలకు పంచి తీరాల్సిందేనని భట్టి కోరారు. దీన్నిబట్టి చూస్తే, ఇరుగు–పొరుగైన శ్రీలంకలో అంతటి భారీ స్థాయిలో వామపక్ష నేతల ఆధ్వ ర్యంలో క్రమానుగతంగా సాగక తప్పని పరిస్థితులు ఎందుకు వచ్చాయో భారత వామపక్షాల నేతలు కేవలం గుర్తించడమేగాదు, ఆచరణలో దేశంలో ఐక్య ఉద్యమ నిర్మాణానికి పునాదుల్ని పటిష్టం చేసుకొనక తప్పదు. ఇటాలియన్ మాఫియా నుంచి, ఇజ్రాయెల్ గూఢచారుల నుంచి భారతదేశ తక్షణ రక్షణకు దేశంలోని వామపక్షాలన్నీ సిద్ధం కావాలి. నిరుపేదలైన షెడ్యూల్డ్ తరగతులకు చెందిన అట్టడుగు వర్గాల ప్రజలపైనే 13 రాష్ట్రాలలో దారుణమైన అత్యాచారాలు నమోదయ్యా యని తాజా నివేదికలు సాధికారికంగా ప్రకటించాయి. వీటన్నింటికి ముగింపు ఎప్పుడు? ఫెడరల్ వ్యవస్థ పునరుద్ధరణ ద్వారానేనని ఆ నివేదికలు తెలియజేస్తున్నాయి.చదవండి: ఆంగ్లం లేకుండా ఎదగ్గలమా?ఎన్డీయే – ఆరెస్సెస్ కూటమి ప్రభుత్వ నాయకులు ఈ దశలో, ముఖ్యంగా చైతన్యశీలి అయిన ప్రస్తుత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి 2025 నాటికి గానీ పదవీ విరమణ చేసే అవకాశం లేదు కాబట్టి, ఆ లోగా ‘ఒక దేశం, ఒకే ఎన్నిక, ఒకే ప్రధాని’ అన్న నినాదంతో ప్రస్తుత కేంద్ర పాలకులు ఏ అఘాయిత్యం చేసే అవకాశం లేదు. ఈలోపు దేశీయ వామపక్షాలు, సంబంధిత వర్గాలన్నీ ఒక్క తాటిపై కదిలి రాగల కార్యాచరణ వ్యూహానికి శ్రీకారం చుట్టాలి.శ్రీలంకలో కమ్యూనిస్టు – మార్క్సిస్టుల అను భవం సుదీర్ఘ కాలంలో నేటి అమూల్యమైన దీర్ఘకాలిక ఫలితాన్ని శ్రీలంక ప్రజలకు ప్రసాదించగల్గింది. లంక పరిణామం ఆసియాలోని చుట్టు పట్ల దేశాల ప్రజాబాహుళ్యానికి సహితం ఆదర్శంగా పరిణమించింది. భారత వామపక్షాలు ఈ అవకాశాన్ని అంది పుచ్చుకుని ఏకం కావాలి. శ్రీలంక వామపక్షాలు సాధించి ఆదర్శనీయమైన విజయం నుంచి భారత ప్రజల భవిష్యత్తుకు అనువైన ఉమ్మడి వ్యూహ రచనకు నడుం బిగించాలి. ఇందుకు మొదటి షరతుగా నాయకత్వం రూపకల్పనకు అవసరమైన వ్యూహాన్ని సమష్టిగా రూపొందించుకోవాలి. ఇది తప్ప మరో మార్గం లేదు. ఈ సందర్భంగా శ్రీలంకలో భారత మాజీ హైకమిషనర్‌గా పనిచేసిన గోపాలకృష్ణ గాంధీ శ్రీలంక పరిణామాల్ని సమీక్షిస్తూ... విప్లవాత్మక భావాలు మార్చుకోకుండానే ప్రజాస్వామిక ధోరణులు కూడా బలపడటానికి అనువుగా రాజకీయ పక్షాల సిద్ధాంత ధోరణులు కూడా ఉండాలనీ, ఈ ధోరణుల్ని శ్రీలంక వామపక్షాలు పెంచుకుంటూ మార్పునకు అనుగుణమైన వ్యూహరచనను ఆశ్రయించాయనీ అన్నారు. భారత్–శ్రీలంక సంబంధాలలో కూడా పెను మార్పులకు అవకాశం ఉందని గోఖలే ఆశాభావం వెలిబుచ్చారు.- ఏబీకే ప్రసాద్సీనియర్ సందకులు abkprasad2006@yahoo.co.in -
అతడు అడవిౖయె రోదించాడు... హెచ్చరించాడు!
ప్రకృతిలో ఒక భాగమైన మనిషి అత్యాశకు పోయి దాని సహజ సూత్రాలను అతిక్రమిస్తున్నాడు. ఫలి తంగా ఎన్నో దుష్పరిణా మాలకు కారకుడవుతు న్నాడు. ఈ విషయాన్ని చెప్పడం కోసం కవి సుద్దాల అశోక్ తేజ అడవి రూపమెత్తి ‘నేను అడవిని మాట్లాడుతున్నా’నని దండోరా వేశాడు. ‘‘అఖిల సృష్టికి ప్రాణముద్ర ప్రకృతి ప్రకృతికి వేలిముద్ర అడవి అడవి నిలువెత్తు సంతకం చెట్టు’’ అనేది సుద్దాల భావన. మానవ సమాజం ప్రగతి పేరుతో ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతోంది. అయితే ఈ కవి ఉత్తమోత్తమ ప్రగతిని – ‘‘ఆసుపత్రులు లేని భూగోళం నా చిరకాలపు కల/ న్యాయస్థానాలకు పని కల్పించని దృశ్యం/ నేనూ హించే సుందర ప్రపంచం’’ అని స్వప్నిస్తున్నాడు. ఇది సాధ్యమా? కాదు, కాదని చెబుతూనే ఆ ‘సుందర ప్రపంచం’ ఎలా సాధ్యమో ‘నీళ్లు నమల కుండా’ ఇలా ప్రకటించాడు.‘‘హద్దు మీరిన వ్యాపారమే / చేసింది రాజ్యాంగేతర శక్తిగా / అధికార పదవీస్వీకారం/అధికార పదవుల్లో తిరిగే బొమ్మలకు / అసలు సిసలు సూత్రధారి/ తెరవెనుక బడా వ్యాపారి/ అడవి ధ్వంసం, కడలి ధ్వంసం/ వెరసి ప్రకృతి విధ్వంసం/ ఈ త్రిసూత్ర పథ కాలంలో/ ఎదుగు తున్నది కుటిల/ వ్యాపార త్రివిక్రమావతారం/ భయానికీ భయానికీ మధ్య / బతుకు నలుగు తున్నది/ ప్రకృతికీ మనిషికీ మధ్య / ఇనుపగోడ పెరుగుతున్నది/ ప్రకృతి సమాధిపైన ప్రగతి సౌధాలు / ఏ ఆర్థిక ప్రవక్త చెప్పాడిది/ ఏ పురోగ మన సూక్తం ఇది?! అంతేగాదు–‘‘జీవనంలో ఓడినవాడు, ఆధ్యా త్మిక జీవనం కోరినవాడు, సాయుధ రణ జీవనంలో చేరినవాడు, అరణ్యా నికే వస్తాడు – రావాలి!’’ ఎందుకంటారా?ప్రకృతి మోహినీ రూపంలో రాదు గాక రాదు/ మోహ రించిన ప్రళయ రూపంలో/ ఎదురెత్తులేస్తూ ఉంటుంది/ హిమాలయాలను కరిగిస్తుంది/ జలాశయాలను మరి గిస్తుంది/ అరణ్యాలను చెరిపే స్తుంది/ ‘లావా’లను కురిపి స్తుంది. కనుకనే – ‘‘చర్యకు ప్రతిచర్య/ హింసకు ప్రతి హింస/ అనివార్యం – అది / ప్రకృతి ప్రాణ సూత్రం/ మీ చేతలవల్ల/ జరుగుతున్న పాతకా లకు, / ఘాతుకాలకు/ ప్రతీఘాత తీవ్రత/ ఏ స్థాయిలో ఉంటుందంటే/ మీ ఊహకు అందనంత/ అందినప్పుడు మీరుండరు!/ పెడమార్గం పట్టిన / చెడుమార్గం తొక్కిన మీ/ చేష్టలవల్ల/ ధర మేధం, గిరిమేధం/ తరుమేధం, చివరికి సమస్త/ నరమేధం జరిగి తీరుతుంది/ నరవరా! మళ్ళీ మళ్లీ చెబుతున్నా/ హంతకులూ మీరే/ హతులూ మీరే!’’అందుకనే, సుద్దాల తీర్మానం – ‘‘ఏ పరిశో ధనైనా/ ఏ పురోగమనమైనా/ అరణ్యం అంగీ కరించే/ పర్యావరణం పరవశించే విధంగా’’ నేటి తరాలకు అభయంగా, రేపటి తరా లకు భరోసాగా ఉండాలన్నది సుద్దాల డిక్టేషన్! కనుకనే ‘‘వేల ఏళ్లు దాటొచ్చిన మానవ జాతి, ఇక వెనక్కెళ్లడం సాధ్యం కాదు గనుకనే, కుదరని వ్యవహారం కనుకనే – ఆ ప్రకృతినే ఆశ్రయించి, పిలిపించమని సుద్దాల అరణ్య రోదన, ఆయన సమస్త వేదన! కనుకనే ‘శ్రమ కావ్యం’ ద్వారా శ్రమ జీవుల ఈతిబాధల్ని కావ్యగతం చేసి ధన్యుడైన నేల తల్లి బిడ్డ సుద్దాల... తన అరణ్య కావ్యం ద్వారా ఈ చరా చర ప్రకృతిలో అసలు ముద్దాయి ఎవరో తేల్చినవాడు! మనిషే ఈనాడు ప్రకృతికి ప్రతి నాయకుడై వాతావరణ విధ్వంసానికి కారకుడని సుద్దాల మనోవేదనతో తీర్చిదిద్దినదే ఈ గొప్ప కావ్యం.నిరుపేదల బతుకులు చట్టు బండలవుతున్న పరిస్థితిని చూస్తూ తట్టుకోలేని సుద్దాల– ‘‘అడివమ్మ మాయమ్మ అతి పేద ధీర ఆ అమ్మకున్నది ఒక్కటే చీర’’ అన్న పాట నిరుపేద కుటుంబాల ఆర్థిక దైన్యాన్ని, గుండె కోతను ప్రపంచానికి వెల్లడించాడు. ఆ స్పందించ గల హృదయాలను ఆకట్టుకుని అక్కున చేర్చు కున్న సుద్దాల సదా ధన్యుడు! – ఏబీకే ప్రసాద్, సీనియర్ సం΄ాదకులు -
అలుపెరుగని అక్షరాయుధుడు..
తెలుగు జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించిన సృజనాత్మక సంపాదకుడు ఏబీకే ప్రసాద్. పుస్తకాలు చదివే అల వాటు లేని వారంతా ఇతర కారణాలతో సంపాదకులై పోతున్న తరుణంలో ఏబీకే లాంటి నిత్య పఠనాభిలాషి సంపాదకుడు కావడం అరుదు, ఆదర్శం.వెనకటికి ‘నా కలమే ఖడ్గ’మని చెప్పిన కోటంరాజు రామారావు ప్రతిరోజూ రాజీనామా లేఖ తన జేబులో పెట్టుకొని ఉండేవారని చెప్పగా విన్నాము. కానీ ఏబీకే విషయంలో దాన్ని సమకాలీనులంతా స్వయంగా చూశారు. తన భావాలకు చోటు లేనిచోట ఆయన నిమిషమైనా నిలువలేరు. అందుకే ‘ఈనాడు’ వైజాగ్ ఎడిషన్‌లో ఎడిటర్‌గా తన జీవితాన్ని ప్రారంభించిన ఏబీకే రాష్ట్రంలో ఎడిటర్‌గా పని చేయని తెలుగు దినపత్రికంటూ దాదాపు లేకుండా పోయింది. నిజానికి తెలుగు పత్రికల సంస్థాపక సంపాదకుడుగా ఆయనకు గొప్ప పేరు వచ్చింది.‘ఈనాడు’ తర్వాత ‘ఉదయం’, ‘వార్త’, ‘ఆంధ్రజ్యోతి’ హైదరాబాద్, తిరుపతి ఎడిషన్లు ఏబీకే వెలిగించిన దీపాలే. ‘ఆంధ్రభూమి’ అసోసియేట్ ఎడిటర్‌గా, ‘ఆంధ్రప్రభ’ చీఫ్ ఎడిటర్‌గానూ ఆయన పనిచేశారు. ప్రభుత్వ మాస పత్రిక‘ఆంధ్రప్రదేశ్’కు కూడా ఎడిటర్‌గా పనిచేశారాయన. పక్ష పత్రికలు ‘సుప్రభాతం’, ‘మాభూమి’లకు ఎడిటర్‌గా తొలు దొలుత వాటిని తీర్చిదిద్దింది ఆయనే.1956లో వామపక్ష భావాల పత్రిక ‘విశాలాంధ్ర’లో తెలుగు జర్నలిజం రంగంలో ప్రవేశించిన ఏబీకే గత ఏడు దశా బ్దాలుగా ఈ భూప్రపంచంలో జరిగే మానవ సంబంధ పరి ణామాలన్నింటిపై స్పందించారు. ఆయన చలించిపోయి అక్షరా కృతి నిచ్చిన ‘నిబద్ధాక్షరి’ సాహిత్య ప్రియులంతా చదివి తీర వలసిందే. ఏబీకే సంపాదకీయాలు ఇప్పటివరకు పది సంపు టాలుగా వచ్చాయి. ఆయన సంపాదకీయాలు విస్తృత విజ్ఞానా నికి, పఠనశీలానికి, నిశిత పరిశీలనాశక్తికి, భావనాపటిమకు, భాషా పాటవానికి, పాఠక మార్గదర్శకత్వానికి ప్రతీకలు. మరీ ముఖ్యంగా తెలుగు పత్రికలలో ఇతర సంపాదకులు స్పృశించని ఆర్థిక సంబంధ అంశాలకు చెందిన అంశాలను తీసుకుని ఎంతో లోతుగా, సమయస్ఫూర్తితో సంపాదకీయాలు రాశారు. ఆర్థిక రంగ నిపుణులకు దిక్సూచి వంటి సేవలందించారు.పాఠక జనరంజకంగా సంపాదకీయం రాయడంతో పాటుగా పత్రిక మొదటి పేజీని సుందరంగా, సందర్భాను సారంగా తీర్చిదిద్దడం, చద్దివాసన లేకుండా పరిశోధనాత్మక వార్తలు ప్రచురించడం, ఆకర్షణీయమైన శీర్షికలు పెట్టడం, ఆ తర్వాత ఎడిట్ పేజీని చక్కగా రూపొందించడం, ప్రత్యేకంగా వ్యాసాలు రాయడం, ఇతరులతో పలు కొత్త శీర్షికలు రాయించడం – దిన పత్రికను అన్నివిధాలా సమగ్రంగా, అప్పుడే వండి వార్చిన భోజనంలాగా తాజా వార్తల కోసం, వ్యాసాల కోసం నకనక లాడే పాఠక జనానికి వడ్డించడంలో ఏబీకే సిద్ధహస్తులు. అత్యాధునిక భావా లుగల ఏబీకేలో పట్టుదల, సమయ స్ఫూర్తి, వేగం ఎక్కువ. జర్నలిజం రంగంలో ఆయనతో పాటుగా కలాలు పట్టిన వారంతా కలాలు మూసేశారు. ఏబీకే లాగా ఇప్పటికీ రచనలు చేస్తున్న పాత్రికే యులెవరూ లేరు.ఇవాళ తెలుగు జర్నలిజం రంగంలో పనిచేస్తున్న వారిలో ఎక్కువమంది ఏబీకే తయారుచేసిన సైన్యమే. ప్రవృత్తిపరంగా ఎవరెలా ఉన్నా, వృత్తిపరంగా చాలామందిని ఆయన చాకుల్లా మార్చారు. ప్రజాభిప్రాయాన్ని మలచడంలో ఏడు దశాబ్దాల అనుభవం గల ఏబీకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా నిరంతర కృషి చేశారు. తెలుగు భాషకు ప్రాచీన ప్రతిపత్తి సాధించడంలో ఆయన పాత్ర ఎంత గానో ఉంది.ముప్ఫై శాతం మంది పిల్లలు తమ మాతృభాషకు దూరమైపోతున్న కొద్దీ ఆ భాషను మృత భాషగా పరిగణించవలసి వస్తుందని యునెస్కో నిర్ధారణ చేసిందనీ, సమాచార విశ్వీకరణవల్ల భాషా వైవిధ్యానికి ప్రమాదం ఏర్పడిందనీ కూడా యునెస్కో తీర్మానించిందని ఏబీకే హెచ్చరించారు. ఒక భాష మరొక భాషపై పెత్తనం చలాయించడాన్ని నిరసించాలని యునెస్కో ఇచ్చిన సలహాను తెలుగు ప్రజానీకం ఆహ్వానించాలన్నారు. పాఠశాల విద్యలో తెలుగు బోధనను అయిదవ తరగతి వరకే పరిమితం చేయకుండా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయా న్నింట్లో ఎస్.ఎస్.సి. వరకు విధిగా అమలు చేస్తేనే విద్యార్థుల్లో భావప్రకటనకు స్థిరత్వం వస్తుందని ఏబీకే అభిప్రాయం వ్యక్తం చేశారు. జపనీస్, చైనీస్ భాషల అభివృద్ధికి, వాటి వికాసానికి మూలం అంతా మాతృభాషలను మాధ్యమంగా చేసుకున్నందు వల్లనే అన్నారు.ఈ ఆగస్టు ఒకటో తేదీన తొంభయ్యవ ఏట అడుగిడుతున్న ఏబీకేను వయోధిక పాత్రికేయ సంఘం ‘జీవన సాఫల్య పుర స్కారం’తో ప్రెస్‌క్లబ్‌లో సత్కరిస్తున్నది. ఏబీకే వ్యక్తిత్వాన్ని ప్రతి బింబిస్తూ సమగ్రంగా రూపొందించిన ‘అలుపెరుగని అక్షరా యుధుడు–ఏబీకే’ గ్రంథాన్ని పూర్వ ప్రధాని మీడియా సలహా దారు సంజయ్‌బారు ఆవిష్కరిస్తున్నారు.ఈ సందర్భంగా యువ పాత్రికేయులకు మీరిచ్చే సందేశ మేమిటి? అని ప్రశ్నిస్తే – ‘యువ పాత్రికేయులు సమకాలీన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, సాంకేతిక, శాస్త్రీయ సంబంధమైన ప్రతి పరిణామాన్నీ పరిశీలించాలి. వాటిని అవగా హన చేసుకోవాల’న్నారు. పుస్తక పఠనాన్ని మరవకూడద న్నారు. పాత్రికేయులు వృత్తిరీత్యా తమకు అప్పగించిన పని మీద దృష్టి మొత్తం కేంద్రీకరించాలన్నారు.అంతేకాదు– ‘యువ పాత్రికేయులు తమ వృత్తికి సంబంధంలేని అంశాలలో జోక్యం చేసుకోకూడదు, ధర్మాచరణను వీడ కూడదు. ఇందులో సాధకబాధకాలు ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే అయినా, అన్ని అవాంతరాలను తట్టుకుని నిలబడినవాడే ఆదర్శం కాగలడ’ని ఏబీకే ఘంటాపథంగా చెప్పారు.– టి. ఉడయవర్లు, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు, 98856 86415 -
ఆశల వసంతం... నిస్పృహల శిశిరం
అవినీతిపై యుద్ధం అని చెప్పి గెలిచిన ఎన్డీఏ కూటమి అవినీతిని అరికట్టలేకపోయింది. దానికి బదులు ఈ కూటమి పాలనా కాలంలో కొద్దిమందిగా ఉన్న కోటీశ్వరుల సంఖ పెరిగింది. ఇప్పుడు వారంతా మహా కోటీశ్వరులుగా మారారు. ఏడీఆర్ తాజా నివేదిక ప్రకారం... ఇక దేశంలో ‘ఆరుగాలమూ’ పాలనలో తిష్ఠవేసేది అవినీతిపరుల, కోటీశ్వరుల, మహాకోటీశ్వరుల పాలనేనని రుజువైంది. రాజ్యాంగాన్ని మార్చడం అనే విషయమూ ఎన్నికల కాలంలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో తాము రాజ్యాంగాన్ని మార్చబోమని అధికార పార్టీవారు స్పష్టం చేయవలసివచ్చింది.‘‘తయారయ్యే ప్రతీ తుపాకీ, రంగంలో ఉన్న ప్రతీ యుద్ధనౌక, మనం ఉపయోగించే ప్రతీ రాకెట్టూ – ఆకలిదప్పులతో మలమల మాడుతున్న, మనం మాడ్చుతున్న పేదసాదల కష్టార్జితం నుంచి దోచుకున్నదే’’– అమెరికా మాజీ అధ్యక్షుడు ఐజెన్‌హోవర్ విస్పష్ట ప్రకటన‘‘నేటి భారతదేశంలోని లెజిస్లేటర్లలో 360 మంది నేర చరిత్రులేనని, 476 మంది కోటీశ్వరులని, ఒక అభ్యర్థి రూ. 5 వేల కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారనీ, లోక్‌సభ నాలుగో విడత అభ్యర్థులపై తాజాగా ‘ఏడీఆర్’ (అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్) సాధికార నివేదిక వెల్లడించింది. మొత్తం 1,717 మంది పోటీ పడే అభ్యర్థుల్లో 1,710 మంది వాఙ్మూలాలను విశ్లేషించి ఈ నివేదికను విడుదల చేసింది.’’ఏడీఆర్ తాజా నివేదిక ప్రకారం... ఇక దేశంలో ‘ఆరుగాలమూ’ పాలనలో తిçష్ఠవేసేది అవినీతిపరుల, కోటీశ్వరుల, మహాకోటీశ్వరుల పాలనేనని రుజువైంది. కానీ మళ్లీ అదే ఎన్డీఏ ముఠా నినాదం – ‘వచ్చే అయిదేళ్ళు అవినీతిపై యుద్ధమే’నని! ఇప్పటిదాకా ఎన్డీఏ కూటమి ‘అవినీతిపై యుద్ధంలో’ సాధించిన విజయాలేమిటో మోదీ చెప్పగలరా? దేశ సమైక్యత అంటూనే దేశంలో విభజనకు ఎన్డీఏ అవకాశం కలిగేలా వ్యవహరిస్తోంది. ఉత్తర–దక్షిణ భారతాల మధ్య విభజన రేఖకు ప్రస్తుత కేంద్రం వ్యవహారశైలి దారి తీస్తుందనేది కొందరి వాదన.వేలాది గుజరాత్ దళిత పేదసాదలపై దారుణ హత్యాకాండకు కారకులైన నాటి బీజేపీ నాయకులు ఆ ఉన్మాద చరిత్రను దాచడానికి ప్రయత్నిస్తూ సుప్రీంకోర్టు విచారణను సహితం పక్కదారులు పట్టించారు. అయినా బీజేపీ–ఆరెస్సెస్ కూటమిగా ఉన్న ఎన్డీఏ ‘రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్టు’ పచ్చి అబద్ధమాడుతూ ఇప్పుడు తాజాగా సరికొత్త ఎదురుదాడికి సాహసిస్తోంది. పైగా, ‘భారత రాజ్యాంగాన్ని దాన్ని రూపొందించిన డాక్టర్ అంబేడ్కర్ కూడా మార్చలేరని’ తాజాగా ప్రధాని మోదీ బాహాటంగా ‘కోతల’కు దిగడం అత్యంత హాస్యాస్పదం! నిజానికి మనకు మోదీ హయాంలో రాజ్యాంగం అమలులో ఉందానిపిస్తోంది. ఉంటే, విదేశీ ‘పెగసస్’ సాఫ్ట్వేర్ ద్వారా దేశ యువకులను వేధించడానికి భారత పాలకులు సాహసించేవారు కాదు! రాజ్యాంగ నిర్మాతగా అంబేడ్కర్ తను రూపొందించిన రాజ్యాంగాన్ని ఏదో తానే మార్చేయబోతున్నట్టు మోదీ ఊహించుకుని అంబేడ్కర్ సహితం దాన్ని మార్చలేరని ‘ట్విస్టు’ ఇచ్చారు! పైగా ‘నేనింతవరకు ఈ స్థాయికి ఎదగడానికి సాయపడిన రాజ్యాంగానికి రుణపడి ఉన్నానని’ మరో ట్విస్టు ఇచ్చారు! బీజేపీ నాయకుల్లో కొందరు 400 లోక్‌సభా స్థానాలు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామనే ప్రకటనలు ఇవ్వడం, దానిపై దేశవ్యాప్తంగా నిరసన గళాలు లేవడం తెలిసిందే. అందుకే మోదీ రాజ్యాంగాన్ని ఎవ్వరూ మార్చలేరని ప్రకటించాల్సి వచ్చింది.మనకో గొప్ప సామెత ఉంది – కంపు నోటి వాడు సంపాదిస్తే, కమ్మని నోటి వాడు ఎగేసుకుపోయాడని! తన సమకాలీన సమాజంలోని అంతరాల దొంతర్లను, అకృత్యాలను, అన్యాయాలనూ, మౌఢ్యాన్నీ చాటలతో చెరిగి ప్రజల సుఖదుఃఖాలకు అద్దంపట్టిన ఇంగ్లండ్ మహా రచయిత చార్లెస్ డికెన్స్ ‘రెండు మహానగరాలు’ అన్న రచనలో చెప్పిన మాటలు నేటికీ చిరస్మరణీయాలే! అపార దేశ సంపద మధ్యనే దారుణమైన దారిద్య్రం తాండవమాడుతోంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలైనా సగటు మనిషి జీవితం దుర్లభం కావడం, కేవలం కొద్దిమందిగా ఉన్న కోటీశ్వరుల సంఖ్య అమాంతం పెరిగి మహా కోటీశ్వరులుగా మారిపోవడం చూస్తున్నాం. అందుకే డికెన్స్ మహాశయుడు తన కాలం నాటి ఇంగ్లండ్ పరిస్థితులను వర్ణించిన మహా వాక్యాలను తిలకించండి:‘‘అవి ఎంతో మంచి రోజులు. అలాగే అవి పరమ చెడ్డ రోజులు కూడా. అది జ్ఞానంతో కూడిన వివేచనా యుగం, అయినా అది మూర్ఖపు యుగం కూడా. అది విశ్వసించదగిన శకం, కానీ అది నమ్మలేని యుగం కూడా. అది అంధకారాన్ని చీల్చగలిగిన క్రాంతికి అరుదైన సమయం కూడా. అయినా అది అంధకారానికి ప్రతీక కూడా. అది ఆశల వసంతకాలం, కానీ అది నిరాశా నిస్పృహల శిశిరం కూడా. అన్నీ మా కళ్లముందే పరుచుకుని ఉన్నాయి, అయినా మా కళ్లముందు ఉండవు!’’విచిత్రమైన విషయం ఏమంటే– రాజ్యాంగాన్ని ఏదో అంబేడ్కర్ మార్చదలచినట్టు ‘భావించి’ ఒకవేళ ‘మార్చుదామనుకున్నా మార్చలేడ’ని, అలాగే ఎన్డీఏ–ఆరెస్సెస్ కూటమి మార్చుదామనుకున్నా మార్చలేదనీ ప్రకటించిన ఎన్డీఏ నాయకుడు ‘నేనీ స్థితికి (ప్రధాని పదవికి) వచ్చానంటే నన్నీ ఉన్నత స్థితికి తీసుకొచ్చింది రాజ్యాంగమే’నని ప్రకటించుకోవడం వింతలలో వింతగా ఉంది. కానీ భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్లెవరూ ఫాసిస్టుల చేతుల్లో దాన్ని పెట్టి, భ్రష్టు పట్టించరు గాక పట్టించరు. మహాకవి జాషువా ఇవాళ కాదు, దశాబ్దాల క్రితమే ‘హైందవ నాగరాజు’ నీడల్ని పసికట్టి భారంగా ఒక సత్యాన్ని చాటాడు. ‘స్వాతంత్య్రంబును సర్వసౌఖ్యమున మా భాగంబు మాకిత్తురో, ఖాతాలేదని త్రోసిపుచ్చెదరో! వక్కాణింపవే చెల్లెలా!’ఈ ప్రశ్నలో అప్పటికీ ఇప్పటికీ పెద్ద మార్పు లేదు, ఎంతసేపటికీ దళితుల ఖాతాలు మార్చడం తప్ప, ఉమ్మడి సొత్తులో వారి ఖాతాలు ఈ రోజుకీ మెరుగుపర్చింది లేదు. ఎందుకంటే జాతి వివక్షా విధానంలో, కులం కుళ్లు అంతర్భాగమనీ, ఇండియాలో వర్గమూ, వర్ణమూ అవినాభావ సంబంధం కలిగి, కుల సమస్యగా, వర్ణ వివక్షా సమస్యగా మనిషి ఉనికినీ, ఉసురునూ, ఉపాధినీ దెబ్బతీసే వికృత సమస్యగా ఉంది. ఇదే విషయాన్ని 50 స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు) 300 మంది కార్యకర్తలతో కలిసి ఒక ఫోరమ్‌గా ఏర్పడి ‘దర్బన్’ సభకు 18 పేజీల డాక్యుమెంట్‌ను సమర్పించారు. ఇది ఫోరమ్ స్థాయిలో సర్వాంగీకారం పొందిన పత్రం. ఈ దర్బన్ సభలో ‘పరివార్’ ప్రభుత్వ ప్రతినిధి పాల్గొని ‘కుల సమస్య’ దర్బన్ సభ ఎజెండాలోకి రాకుండా, వర్ణ వివక్షను పెంచి పోషిస్తున్న అమెరికా, తదితర పాశ్చాత్య రాజ్యాల అండతో సమస్యను దాటవేశారు. అలా బీజేపీ ఈ దాటవేతలో ‘జయప్రద’మయింది! చివరికి ఇప్పుడు మన దేశంలో ‘బీజేపీ పరివార్’ ప్రభుత్వం ఏ స్థాయికి ఎదిగిపోయింది? దేశ బడ్జెట్లు, బిల్లులు శాసన వేదికలో సరైన చర్చ లేకుండానే మూజువాణీ ఓటుతో ఆమోదించి ముద్ర వేసుకోవడమే! నేర చరిత్ర గల అభ్యర్థులను డబ్బు కోసం కక్కుర్తిపడి పాలక పక్షం సహా దాదాపు అన్ని పక్షాలూ (కొన్నే మినహాయింపులు) ఆశ్రయించి, ఆమోదించడం! ఇదీ మన శాసన వేదికల, అభ్యర్థుల చరిత్ర, భాగోతం!వివేకానందుడు, హరిదాస్ విహారిదాస్ దేశాయ్‌కి చికాగో నుంచి లేఖ రాస్తూ ఇలా అన్నారు: ‘అణగారిపోతున్న అసంఖ్యాక నిరుపేద కష్టజీవుల రక్త మాంసాలపై ఆధారపడి విద్యావంతుడై, కులాసా జీవితం గడిపే ప్రతి ఒక్కరినీ దేశ ద్రోహిగా పరిగణించాలి. మన సంస్కర్తలు అసలు ‘జబ్బు’ ఎక్కడుందో చూడరు. విగ్రహాల వల్ల లాభం లేదు. హిందువనీ, ముసల్మాన్ అనీ, క్రిస్టియన్ అనే పేర్ల చాటున ఆ మతాల పదఘట్టన కింద కకావికలమవుతున్న ప్రజా బాహుళ్యం... ధన సంచులున్న వాడి పాదాల కింద శాశ్వతంగా పడి నలిగి పోవడానికే తాము పుట్టామన్న భావనకు గురి కారాదు. విగ్రహాలు ఉంటాయో, ఊడతాయో, కులాలు మంచివా, చెడ్డవా ప్రశ్నలు మనకు అనవసరం. పేదల మనస్సుల్లో భావవ్యాప్తి జరిగిన మరుక్షణం, మిగతా కార్యాచరణను వారే పూర్తి చేస్తారు!’ఏబీకే ప్రసాద్సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
నిజమైన కళకు నీరాజనాలు
‘‘ప్రజా నాట్యమండలి ప్రదర్శనలు చూసిన తర్వాత, మా గండపెండేరాలను తీసి ఆ నాట్య మండలి నిర్వాహకుల, కళాకారుల ముందు సమర్పించాలనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు విశ్వనాథ సత్యనారాయణ. నాటక, సాహిత్యాది రంగాలు ఎలా ఉంటే నిజమైన ప్రజాకళలుగా, సృజన శక్తులుగా భాసిస్తాయో ‘ప్రజా నాట్యమండలి’ ప్రదర్శనలు నిరూపించాయి. అయితే తెలుగునాట నాటక రంగానిది మహా వైభవోపేత చరిత్ర. అవి జనజీవితాన్ని ఎల్లెడలా ప్రభావితం చేశాయి. జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పాయి. నవజీవన పరిధి విస్తృతం కావాలంటే ‘ప్రశ్న’ అనివార్యం అని చాటాయి. ‘సమాజానికాయువైన నాటకమే శ్వాసగా జీవితాలనర్పించిన సూత్రధారులెందరో! మధురస్వర ఝరీ గమన హృద్యపద్య రాగంతో మేలుకొలుపు పాడిన గాత్రధారులెందరో!! ఆ మహానుభావులకు వందనం!!! నాటక, సాహిత్యాది రంగాలకు చెందిన వివిధ రంగాలు ఎలా ఉంటే నిజమైన ప్రజాకళలుగా, సృజన శక్తులుగా భాసిస్తాయో 1930లలో భారత పర్యంతం వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘ప్రజా నాట్యమండలి’ ప్రదర్శనలు నిరూపించాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, ‘ఆంధ్ర ప్రజా నాట్యమండలి’ సారథ్యంలోని ‘మా భూమి’ ఇత్యాది కళా రూపాలను ప్రస్తావిస్తూ మహాకవి విశ్వనాథ సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు పలువురి ప్రశంసలు అందుకున్నాయి. ‘‘ప్రజా నాట్యమండలి ప్రదర్శనలు చూసిన తర్వాత మా గండపెండేరాలను తీసి ఆ నాట్య మండలి నిర్వాహకుల, కళాకారుల ముందు సమర్పించాలనిపిస్తోంది. ప్రజాకళలు ఎలా ఉండాలో ‘మా భూమి’, ‘అంతా పెద్దలే’ నాటకాలు నిరూపించా’’యని ప్రశంసల వర్షం కురిపించారు! ఈ కితాబు నాటికీ, నేటికీ మరపురాని సందేశంగా నిలిచిపోయింది. ఆ ఒరవడిలో ముందుకు సాగి, అఖిల భారత స్థాయిలోనే ఒక విశిష్ఠ స్థానాన్ని పొందిన ‘ఆంధ్ర ప్రజా నాట్యమండలి’ రాష్ట్రీయ విశిష్ఠ శాఖలలో ఒకటి గుంటూరు జిల్లా ‘ప్రజా నాట్యమండలి’. భారత ప్రజానాట్య మండలికి ఆంధ్ర ప్రజానాట్య మండలి ఎలా ‘ఒజ్జ బంతి’ అయిందో, అలాగే గుంటూరు ప్రజా నాట్యమండలి వివిధ శాఖలతో పరిఢవిల్లింది. మానవ జీవన దర్పణంగా పలువురు ఆంధ్ర పండితుల, కవుల ఆశీస్సులతో ముందుకు సాగుతోంది. సందేశాలు సమకాలీనం విశ్వనాథ వారు ఎంతటి మహాకవో, అంతటి సరసుడు, ‘గడగ్గాయి’ కూడా! పెళ్లయి, కాపురాలకు వెళ్లబోయే నూతన దంపతులందరికీ కంటికి కనిపించినా, కనిపించకపోయినా ‘అరుంధతీ’ నక్షత్రాన్ని చూపడానికి మన పెద్దలు ప్రయత్నిస్తారు. కానీ విశ్వనా«థను ఒకరు మీరెప్పుడైనా ‘అరుంధతీ’ నక్షత్రాన్ని చూశారా అని ప్రశ్నించగా... నాకైతే ‘అరుంధతి కనిపించలేదుగానీ చేసిన ‘అప్పులయితే’ కనిపించి, వేధించాయని చమత్కరించారు. బహుశా కొన్ని జీవితానుభవాల తర్వాత, ‘చింతామణి’ నాటక కర్తగా సుప్రసిద్ధుడైన మహాకవి కాళ్లకూరి... భార్యాభర్తల మధ్య ఉదాత్తమైన సంసార అవగాహన ఎలా ఉండాలో చెప్పడానికి ఒక పద్యాన్ని రాశారు. సందేశాత్మకంగా ఉండటానికి సరళమైన భాషలో రాసి మనకు అందించారు! ఆరోజుల్లో వేశ్యా లంపటత్వం వల్ల సంసార జీవితాలు ఎలా బుగ్గిపాలవుతున్నాయో చెప్పి, ఆ వినాశం వల్ల సంసార జీవితాల్ని రక్షించడం అవసరమని భావించి కాళ్లకూరి ఆ నాటకం రాశారు! ఫలితంగా గంభీర సంసార జీవితాల అవగాహనకు ఆ పద్యం ద్వారా సమకాలీన సందేశం అందింది. కనుకనే కాళ్లకూరి రచనకు అంత విలువ పెరిగింది. ‘కష్ట ఫలితంబు బహుళ దుఃఖ ప్రదంబు సార రహితమైన సంసారమందు భార్యయను స్వర్గమొకటి కల్పనంబు చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషులుండు!’ ప్రశ్నించే సంస్కారం బుద్ధి జీవుల్లో పెరగనంతవరకూ మనిషికి వికాసం ఉండదని కవి మీగడ రామలింగస్వామి స్పష్టం చేస్తాడు. ఎందుకని? ఆయన మాటల్లోనే నవజీవన పరిధి విస్తృతం కావాలంటే ‘ప్రశ్న’ అనివార్యం అంటారు. ‘ప్రశ్న మానవ విజ్ఞాన పరిధి పెంచు ప్రశ్న లేనిదే మనిషికి ప్రగతి లేదు ప్రశ్న యందే సకల దిశా ప్రగతి యుండు కాన, ప్రశ్నయే వ్యక్తి వికాసమౌను’ అంటారు. అంతేగాదు, ‘ఈర్ష్య’ అనేది ఏ కళకూ, నాటకానికీ పనికి రాదనీ, ఈర్ష్య అనారోగ్యం, హానికరమని స్పష్టం చేశారు! ఇలా ఎన్నెన్నో దృశ్య మాలికలను ‘దర్పణం’ పేరిట గుంటూరు కళా పరిషత్ 1997–2022 సంవత్సరాల మధ్య కార్యక్రమాలన్నింటిని రసవత్తరమైన రచనా శైలిలో ‘కళ ప్రజలది’ అన్న మకుటం కింద రజతోత్సవ ప్రత్యేక సంచికగా అందించింది. ‘దర్పణం’ సంపాదకులు, సహ సంపాదకులు వల్లూరు శివప్రసాద్, వల్లూరు తాండవకృష్ణ అభినందనీయులు. నాటక రంగంలో ప్రజాకళలకు ప్రాధాన్యం కల్పించడంలో సుప్రసిద్ధులైన నవీన పథకులుగా ఖ్యాతి పొందిన నటశేఖరులు బళ్లారి రాఘవ, గరికపాటి రాజారావు ప్రఖ్యాతులకు ఈ ప్రత్యేక సంపుటిని అంకితమిచ్చారు. గుంటూరు కళాపరిషత్ కార్యక్రమాల ప్రత్యేక దృశ్యమాలిక ఈ సంచికకు ప్రత్యేక కళాకాంతులు అందించింది. ఎందరో మహానుభావులు జీవితాంతం ఆధునికులను వెన్నుతట్టి ప్రోత్సహించినవారు... కందుకూరి, తిరుపతి కవులు, చిలకమర్తి, బలిజేపల్లి, పరబ్రహ్మ పరమేశ్వరి, ఒద్దిరాజు సోదరులు, కోదాటి నరసింహం, రామరాజు, గురజాడ, బళ్లారి రాఘవ, వాసిరెడ్డి, సుంకర, ఆత్రేయ, గరికపాటి, ఆత్రేయ ఇత్యాదులు. ఇలా తెలుగు నాటక పరిణామానికి దోహదం చేసినవారి గురించి మేడిచర్ల సత్యనారాయణమూర్తి కవితాత్మకంగా కురిపించిన ప్రశంస ద్వారా దర్పణం సంచిక వైశిష్ట్యం తెలుస్తుంది. ‘సమాజానికాయువైన నాటకమే శ్వాసగా జీవితాలనర్పించిన సూత్రధారులెందరో, మధురస్వర ఝరీ గమన హృద్యపద్య రాగంతో మేలుకొలుపు పాడిన గాత్రధారులెందరో, నటనకు జీవం పోసి దైవాలుగా పూజలంది శిలారూపమందిన పాత్రధారులెందరో, ఎవని కళకు, యువనికలకు ఊపిరినిచ్చెనో ఈ రంగస్థలి చిత్రకారులెందరో ఆ మహానుభావులకు వందనం సాష్టాంగ వందనం!’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
రాజ్యాంగ విలువలకు తిలోదకాలేనా?
సుప్రసిద్ధ మహాకవి సి. నారాయణ రెడ్డి మూడు దశా బ్దాల నాడే కొందరు భావి పాలకులు దేశ రాజ్యాంగాన్ని పక్కకు తోసేసి, ‘రాచరిక పాలన’ను అభిలషిస్తూ ప్రవర్తించే అవకాశాలు ఎలా ఉన్నాయో ‘ప్రపంచ పదులు’ కవిత ద్వారా పాఠకులకు అందించారు. ‘నడమంత్రపు బుద్ధి దూకుడు’ ఎలా ఉంటుందో ఆ కవితలో నిరూపించారు: ‘‘గాలిలోన ఎగిరిపడే గడ్డిపరక ఊపిరెంత? ఏటిలోన తుళ్లిపడే నీటి బుడగ ఉనికి ఎంత? అబ్బో దశ పట్టిందని ఉబ్బిపోతె ఏం లాభం? కడలిలోన మిడిసిపడే కప్పపిల్ల పాకుడెంత? నడమంత్రపు సిరినేర్పిన దుడుకుబుద్ధి దూకుడెంత?’’ పాలకుల ఈ ‘దుడుకు బుద్ధి’ వల్ల దేశానికి రాబో తున్న అనర్థాల గురించి అడుగడుగునా నిశితమైన పరిశీలనలో ఉన్నారు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్. పదవిని అధిష్ఠించిన రోజు నుంచీ దేశ ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ పాలకులు ఎత్తుకున్న ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ నినాదం దేశ ఫెడరల్ వ్యవస్థ స్వరూప, స్వభావాలకు విరుద్ధం. దేశంలో ‘రాచరికం’ ఉంది గాని 75 ఏళ్లలో దేశ ప్రజలు నిర్మించుకున్న సెక్యులర్ రాజ్యాంగ వ్యవస్థ లేదని వర్తమాన పరిస్థితులు చెబుతున్నాయి. కనుకనే కాలానికి లొంగిపోని కర్మయోగులు నేడు మేలుకోవలసి ఉంది. ఎందుకంటే: ‘‘కలవరపడి వెనుతిరిగితే కాలం ఎగబడుతుంది కదనుతొక్కితే కాలం భయపడుతుంది కనురెప్పలు మూతపడితే కాలం జోకొడుతుంది కంఠమెత్తి తిరగబడితే కాలం జేకొడుతుంది!’’ కాబట్టి ప్రతిపాదిత ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ విధా నాన్ని బుద్ధిజీవులు అందరూ వ్యతిరేకించాలి. పటిష్ఠ మైన ప్రజాస్వామ్య పునాదులను గౌరవించాలనీ, ప్రస్తుత పాలకుల కనుసన్నలలోనే ఎదిగిన మాజీ రాష్ట్రపతి కోవింద్ అధ్యక్షతన ‘ప్రజాస్వామ్య రక్షణ’ పేరిట మరో ‘తైనాతీ’ కమిటీ ఏర్పాటు తగదనీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. పాలకుల చేతిలో కోవింద్ కీలు బొమ్మగా వ్యవహరించరాదనీ ఆయన సలహా ఇచ్చారు. అసలు విచిత్రమేమంటే, కేంద్ర, రాష్ట్రాలకు కలిపి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా దేశాని కయ్యే అపారమైన ఖర్చును ఆదా చేయవచ్చునని కేంద్ర ఎన్నికల సంఘం సలహా ఇవ్వబోవడం! ఈ చర్య రాజ్యాంగాన్నీ, పార్లమెంటరీ వ్యవస్థనూ అవ మానపరచడమే! అంతేగాదు, మత విశ్వాసాలను కూడా రాజకీయ లబ్ధి కోసం బీజేపీ–ఆరెస్సెస్ పాలకులు వాడుకోవడం ఓటర్లను దగా చేయడమే! ఈ రాజకీయమే వేల ఏళ్ల నాటి బాబ్రీమసీదు కట్టడాన్ని బలవంతంగా కూల్చి వేసి, దాని స్థానే రామమందిర నిర్మాణానికి కారణ మయ్యింది. నిజానికి సాధారణ ముస్లిం పౌరులు హిందువులకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. హిందువులు పవిత్రంగా భావించే రామా యణాన్ని స్థానిక ‘అవధి’ భాషలో రచించి ఖ్యాతి వహించిన తులసీదాస్‌ను హిందీలో రాయనందుకు శిక్షించడానికి ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో ఆయననూ, ఆయన రామాయణాన్నీ ఓ స్థానిక ముస్లిం కాపాడాడు. ఈ వాస్తవాన్ని ఈ రోజుకీ గుర్తించ నిరాకరిస్తున్న ముఠా... మహాత్మాగాంధీ పేరిట కంటి తుడుపు ఉత్సవాలు చేస్తున్నా రని గమనించాలి. లాహోర్ కుట్ర కేసులో నిందితులుగా, ముద్దా యిలుగా ఉన్న భగత్‌సింగ్, సుఖదేవ్‌లు ఉరిశిక్షను ఎదుర్కొంటున్నప్పుడు భగత్‌సింగ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘‘తన కాలంలో మార్క్స్ కొత్త తరహాగా ఆలోచించబట్టే కాల చక్రాన్ని తన పద్ధతుల్లో త్వరిత గతిన ముందుకు నడిపించగలిగారు. అలాగే మన దేశంలో సామ్యవాద సిద్ధాంతాన్ని (సోషలిజం) నేను గాని, నువ్వు గాని (సుఖదేవ్తో సంభాషణ) ఆరంభించలేదు. నిజానికి కాలం, పరిస్థితులు కల్పించిన ప్రభావ ఫలితం అది. ఇంత కష్టమైన బాధ్యతను మనం చేపట్టినప్పుడు దాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోవాలే గాని కష్టాలు ఎదురయ్యాయని చెప్పి, ఆత్మహత్య చేసుకుంటే అది ప్రజలకు మార్గదర్శకం కాజాలదు.’’ ఈ మాటలు భగత్‌సింగ్ ఏ సందర్భంలో అన్నాడు? ఉవ్వెత్తున ప్రజాందోళన వల్ల మన ఉరిశిక్షలు ఆగిపోయి, యావజ్జీవ కారాగార శిక్షగా మారిపోవచ్చు. కానీ, 14 ఏళ్లపాటు ద్వీపాంతరవాస శిక్ష అనుభవించాక మనం జీవచ్ఛవాలుగా మారిపోతాం. అలాంటప్పుడు బతకడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలు కదా... ఇలా ఆలోచిస్తూ సుఖదేవ్ తన అభిప్రాయాల్ని భగత్‌సింగ్‌కు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరానికి జవాబుగా భగత్‌సింగ్ రాసిన ఆశావహమైన లేఖే ‘కాలం అవసరం నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళం’ అన్న ప్రత్యుత్తరం. కాగా, నేటి తరం పాలకులకు రాజ్యాంగ విలువలూ తెలియవు. కనుకనే పాలనా వ్యవస్థల నుంచి, విద్యా వ్యవస్థలు, ప్రజాస్వామ్య వ్యవస్థల దాకా ఇష్టం వచ్చినట్లు మార్చడానికి ప్రయత్ని స్తున్నారు. అందుకే బహుశా, ‘ఒడువని ముచ్చట’ అనే కవితలో కందుకూరి అంజయ్య ఆవేదనను మనమూ పంచుకుందాం: శంకరా! ఇప్పుడు మనుషులను కూడగట్టే మానిసి లేడు మంచి చెడ్డలను విప్పిచెప్పే సాత్వికుడూ లేడు అంతా... వడ్లూ – పెరుగూ కలిసినట్టుంది ఈనగాస్తే నక్కలపాలయింది అంతా మొదటికొచ్చింది ఒడువని ముచ్చటై కూసుంది!! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
న్యాయమూర్తినీ వదలని వేధింపులు!
జిల్లా జడ్జి తనను లైంగికంగా వేధిస్తున్నాడనీ, అనుమతిస్తే గౌరవంగా చనిపోతాననీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా జడ్జి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం కలకలం రేపింది. అసలు దేశవ్యాప్తంగా మహిళలపైన నేరాలు పెరగడం చూస్తున్నాం. మహిళలపై అత్యాచారాలకు కారణం – వారి పట్ల భారత సమాజ దృక్పథమే. అయితే, ఒక మహిళా న్యాయమూర్తి లాంటి ప్రసిద్ధురాలినే వేధింపులు దుర్భర మానసిక స్థితి వైపు నెట్టాయంటే సామాన్య స్త్రీల పరిస్థితి ఏమిటి? విచిత్రమేమంటే, సరికొత్త ఉదారవాద ఆర్థిక యుగంలో తిరిగి పాత తరహా పురుషాధిక్య ధోరణులు ప్రబలిపోతున్నాయి. నేటి ఈ అవాంఛనీయ పరిస్థితులలో కావలసింది సమాజంలో స్త్రీ ప్రతిపత్తిని పెంచగల రాజకీయ విధానాలు, కార్యక్రమాలు! ‘‘ఏ పౌరుడూ మరొక పౌరుణ్ణి కొన గలిగినంత ధనవంతుడుగా ఉండకూడదు. అలాగని ఏ పౌరుడూ తనను తాను అమ్ముకోవలసినంత పేదవాని గానూ ఉండకూడదు.’’ – రూసో మహాకవి, తాత్విక మేధావి ‘‘తనను జిల్లా జడ్జి లైంగికంగా వేధిస్తున్నాడనీ, అనుమతిస్తే గౌరవంగా చనిపోతాననీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా జడ్జి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌కు లేఖ రాయడం దేశంలో కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని దేశ ప్రధాన న్యాయమూర్తి సీరియస్‌గా తీసుకొని అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను విచారణకు ఆదేశించారు. ‘‘ఇక నాకు ఏమాత్రం జీవించాలని లేదు. నిర్జీవమైన ఈ శరీరాన్ని మోయడం నిష్ప్రయోజనం. నా జీవితాన్ని గౌరవప్రదంగా ముగించుకోవడానికి అనుమతించండి’’ అని మహిళా జడ్జి తన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ సుప్రీం చీఫ్‌ను కదిలించి వేసిన ఫలితంగా తక్షణ చర్యలకు ఆదేశించారు.’’ – 16.12.2023 నాటి పత్రికా వార్తలు ఇలాంటి ‘వేధింపుల పర్వం’ ఇంతకుముందూ జరిగిందని మరచి పోరాదు. నైతికంగా బలహీనుడైన ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలోనే పనిచేస్తున్న ఒక స్త్రీ అధికారిని రకరకాల వేధింపులకు గురిచేసి, ఆమె లొంగకపోయే సరికి, ఆమెనూ, ఆమె కుటుంబ సభ్యులనూ ఎన్ని రకాల బాధలు పెట్టిందీ లోకం మరచిపోలేదు. అలాంటి నైతిక బలహీనతలు లేనందుననే ప్రస్తుత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ చంద్రచూడ్ ఉత్తరప్రదేశ్ మహిళా న్యాయమూర్తి పట్ల జరిగిన వేధింపుల కేసుపై తక్షణ విచారణకు ఆదేశించారు. గవర్నర్ల తీరు ఇదిలా ఉంచి, బీజేపీ–ఆరెస్సెస్ నాయకత్వ పాలన ఎలా ఉందో చూడండి: వారి విధానాలను అడ్డుకునే లేదా విమర్శించే రాష్ట్ర ప్రభుత్వాలను అదుపులో ఉంచగల తమ పార్టీ గవర్నర్లకు మాత్రమే రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడే అధికారాలు అప్పగించారు. ఇందుకు పక్కా ఉదాహరణలు – కేరళ, తమిళనాడు గవర్నర్లు తీసు కుంటున్న నిర్ణయాలు! రాజ్యాంగంలోని 200 అధికరణకు ఇచ్చిన తొలి వివరణ ప్రకారం, శాసనసభ చర్చలో ఉన్న బిల్లులను ఆమోదించడమో లేదా తిరస్కరించడమో శాసనసభ నిర్ణయం. అంతేగానీ ఆ హక్కు గవర్నర్‌కు లేదు. కానీ ఇప్పుడు బీజేపీ గవర్నర్లు తమ అసాధారణ అధికారాలు చెలాయిస్తూ శాసనసభ బిల్లులను తొక్కి పెడుతున్నారు. కానీ, బిల్లును ఆమోదించగల లేదా తిరస్కరించగల అధికారం ప్రజలు ఎన్నుకున్న శాసనసభకు లేకుండా చేసే పెత్తనం గవర్నర్‌కు లేదు. ఒక వేళ ఏ కారణం చేతనైనా బిల్లును ఆమోదించ నిరాకరించే పక్షంలో ‘తిరిగి పరిశీలించండి’ అన్న విజ్ఞప్తితో శాసన సభకు నివేదించాలేగానీ, బిల్లులను తొక్కిపెట్టే అధికారం మాత్రం గవర్నర్‌కు లేదని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కరాఖండీగా ప్రకటించాల్సి వచ్చింది. ఆ అధికారం ప్రజలు ఎన్నుకొనని గవర్నర్లకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రసిద్ధులకే ఇలా ఉంటే... అంతేగాదు, పంజాబ్ శాసనసభ కేసులో సుప్రీంకోర్టు బిల్లులను తొక్కిపెట్టి ఉంచే అధికారం గవర్నర్లకు లేదని స్పష్టం చేయడంతో రాజ్యాంగంలోని 200 అధికరణకు ఆచరణలో విలువ పెరిగింది. ఇదే సూత్రం రాష్ట్రపతికీ వర్తిస్తుంది. లోక్ సభ మాజీ ప్రధాన కార్యదర్శి పి.డి.టి. ఆచారి చెప్పినట్టు, ఒక చట్టం రాజ్యాంగబద్ధత సరైనదా, కాదా అన్నది కోర్టు నిర్ణయించాల్సిందే గానీ, ఆ విషయంపై ఇటు రాష్ట్రపతికీ, అటు గవర్నర్లకూ ఎలాంటి నిర్ణయాధికారం లేదు. అయితేనేమి, పాలకులు రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నట్టు నటించ డమేగానీ దాని విలువలను ఆచరణలో పాటించడంలో నడుపుకొనేవి ‘సొంత దుకాణాలే’నని మరవరాదు. ఈ పరిస్థితులలో ఒక్క మహిళా న్యాయమూర్తులపైననే కాదు, అసలు దేశ మహిళలపైననే నేరాల సంఖ్య పెరిగిపోవడం చూస్తున్నాం. 2022వ సంవత్సరానికి నేషనల్ క్రైమ్స్ బ్యూరో ప్రకటించిన వివరాలను బట్టి మహిళలపైన ఇంతకుముందు కంటే నేరాల సంఖ్య పెరిగిపోయింది. పైగా, పెక్కు రాష్ట్రాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు పక్కన తమ మగ బంధువుల తోడు లేకుండా తాముగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు చేసుకోలేని స్థితి. మహిళలపై నేరాల సంఖ్య 4 శాతంపైన పెరిగిందని క్రైమ్స్ బ్యూరో నివేదిక. ఇవిగాక భర్తలు, వారి బంధువులు చేసిన నేరాల సంఖ్య 2022లో 4.45 లక్షలు. అంటే, ప్రతి గంటకూ 51 కేసులు రికార్డ య్యాయి. మరీ విచిత్రమేమంటే, ‘సరికొత్త ఉదారవాద ఆర్థిక యుగంలో తిరిగి పాత తరహా పురుషాధిక్య ధోరణులు ప్రబలిపోతున్నా’యని జాతీయ మహిళా సంస్థ ‘జాగోరి’ డైరెక్టర్ జయశ్రీ వేలంకర్ వివరించారు. నేటి ఈ అవాంఛనీయ పరిస్థితులలో కావలసింది సమాజంలో స్త్రీ ప్రతిపత్తిని పెంచగల రాజకీయ విధానాలు, కార్యక్రమాలని ఆమె అన్నారు. మహిళల రక్షణకు ఉద్దేశించిన కఠిన చర్యలు కాగితం మీదనే ఉండి పోయాయిగానీ ఆచరణలో లేవనీ, దీన్ని బట్టి సంప్రదాయంగా స్త్రీలపై అత్యాచారాలు పెరుగుతూ ఉండటానికి అసలు కారణం – స్త్రీల పట్ల భారత సమాజ దృక్పథమేననీ సుప్రీంకోర్టు ప్రసిద్ధ మహిళా న్యాయ వాది శిల్పి జైన్ స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే, ఉత్తరప్రదేశ్ మహిళా న్యాయమూర్తి లాంటి ప్రసిద్ధురాలినే వేధింపులు దుర్భర మానసిక స్థితివైపు నెట్టాయంటే సామాన్య స్త్రీల విషయంలో గణింపు నకు రాని, వచ్చినా పట్టించుకోని సమాజ స్థితిగతుల్ని అర్థం చేసు కోగలగాలి. మాంస వ్యాపారం నా మిత్రుడు, సుప్రసిద్ధ లాయర్ హనుమారెడ్డి మతాలు – చట్టాల గురించి ముచ్చటిస్తూ మరవరాని రెండు మంచి మాటలు చెప్పాడు: ‘‘మతాలు రాజ్యమేలినప్పుడు చట్టం ఒక పద్ధతిగానూ, రాచరికం రాజ్యమేలినప్పుడు చట్టం మరొక పద్ధతిలోనూ, వ్యాపారం రాజ్యమేలినప్పుడు వేరొక పద్ధతిలోనూ ఉండి ప్రజలకు సంబంధించిన విధివిధానాలు మారుతూ వచ్చాయి. స్థూలంగా చెప్పాలంటే నేరాలు రెండు విధాలుగా ఉండాలి. ఒకటి రాజ్యాధికారం పట్ల నేరం, రెండవది ప్రజలపట్ల నేరం.’’ అలాగే, ‘ప్రేమ’ అనే పేరిట ఎంత ప్రమాదకర పరిణామాలు, విధ్వంసం జరుగుతున్నాయో మందరపు హైమవతి తన ‘నీలి గోరింట’ కవితలో ఇలా చీల్చి చెండాడవలసి వచ్చింది: ‘‘తండ్రీ, కూతురు, గురువు, శిష్యురాలు వావివరసల్లేకుండా ఆడపిల్లలే అంగడి సరుకులైనప్పుడు మానవ మాంస వ్యాపారంలో మహిళల శరీరాలే పెట్టుబడి ఐనప్పుడు రుష్యశృంగుడైనా మేనకను చూచిన విశ్వామిత్రునిలా మారిపోడా?!’’ అలా మారిపోకూడదనే ఉత్తరప్రదేశ్ మహిళా న్యాయమూర్తికి జరిగిన సంఘటన నేపథ్యంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి పదేపదే చేస్తున్న విజ్ఞప్తుల పరంపర లక్ష్యం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఇంకా ఎందుకీ విదేశీ మొగ్గు?
‘అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుపడటానికి విద్య, ఉద్యోగార్థులై అమెరికాకు వస్తున్న భారతీయులు ఎంతగానో దోహదపడుతున్నారు’ అని పాతికేళ్ల కిందే ఓ అమెరికా రాయబారి వ్యాఖ్యానించాడు. ఇప్పటికీ ఈ పరిస్థితిలో మార్పు రాలేదు. జాతీయ స్థాయి విద్య, ఉపాధి సౌకర్యాలు దేశ యువతకు అందించలేక పోవడానికి కారణం... మనదేశంలో తగిన వనరులు లేకపోవడం కాదు. అది పాలకుల పరాధార మనస్తత్వం. అందుకే తల్లితండ్రులు, పిల్లలు విదేశీ వనరుల పట్ల వ్యామోహాన్ని పెంచుకోవలసి వచ్చింది. కానీ దీన్ని సరిదిద్దవలసిన నేతలకు నైతికత, విశ్వసనీయత కరవైపోయాయి. పైగా, ప్రజా ప్రాతినిధ్య సభలుగా రాణించవలసిన రాజ్యాంగ సంస్థలను భ్రష్టు పట్టించడమే పాలకులు పనిగా పెట్టుకున్నారు. ‘‘భారత భూమి మీద పిల్లల్ని కనడం అమెరికాకు దత్తత ఇవ్వడానికేనని తెలిసుంటే... ప్రసవానికొక పునర్జన్మ నెత్తకపోదును... అమెరికా ఖజానా నింపుకొనే యుద్ధంలో/ బిడ్డను యుద్ధభూమికి అంకితమిచ్చిన తల్లిగుండె/ కన్నీరింకిన మేఘాలై వర్షిస్తుంది/ స్వార్థ సామ్రాజ్య నేతలకు/ తల్లి ఉసురు తగలకపోదు.’’ – కవయిత్రి డాక్టర్ పెళ్లకూరు జయప్రద ఇంతకూ అన్ని వసతులు, సౌకర్యాలు పొదిగి ఉన్న భారత భూమిని వదిలేసి మన యువత పరాయి పంచలలో విద్య కోసం, ఉద్యోగాల కోసం ఎందుకు ఎగబడవలసిన దుఃస్థితి వచ్చింది? భారత పాలనా చక్రాలు, దేశ నేతలు... జాతీయ స్థాయి విద్య, ఉపాధి సౌకర్యాలు దేశ యువతకు అందించలేక పోవడానికి దేశంలో తగిన వనరులు లేక కాదు. భారత సెక్యులర్ రాజ్యాంగం అందించిన దేశీయ వనరుల వినియోగానికి సంబంధించిన అధ్యాయాలను అడ్డదిడ్డమైన నిబంధ నలతో జత చేసినందున దేశ పౌరులు ప్రయోజనం పొందలేక పోతున్నారు. సంపన్న గుత్త వర్గాలు ఈ అవకతవకల ఆధారంగా దేశ వనరులను యథేచ్ఛగా సొంతం చేసుకుని పౌరులకు దేశీయ విద్య, ఉద్యోగ అవకాశాలను దెబ్బ తీస్తున్నారు. ఫలితంగా విదేశీ విద్య, ఉపాధి వనరులనన్నా సద్వినియోగం చేసుకొని బతుకుదామన్న తపనలో ఈ వ్యామోహాన్ని తల్లిదండ్రులు పెంచుకోవలసి వచ్చింది. ఈ వాస్తవాన్ని మన దేశం దృష్టికి మొదటిసారిగా పాతికేళ్లనాడే – ఎవరో కాదు, భారతదేశంలోని అమెరికా రాయబారే తీసుకొచ్చాడు. ‘‘అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుపడటానికి విద్య, ఉద్యోగార్థులై అమె రికాకు వస్తున్న భారతీయులు ఎంతగానో దోహదపడుతున్నారు’’ అని ఆయన కీర్తించిన సంగతి మనం మరచిపోరాదు. ఈ పాతికేళ్లుగానూ ఈ పరిస్థితిలో మార్పు లేదు. అంటే, భారత పాలకులు దేశంలో విద్య, ఉద్యోగ వనరులను భారత యువతకు కల్పించకుండా పరాధార మనస్తత్వానికి అలవాటు పడిన ఫలితంగా ఈ దుఃస్థితి దాపురించి కొనసాగుతోందని మరచిపోరాదు. ఈ దశలో గత పాతికేళ్లుగా పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలకు ప్రజా ప్రతినిధుల పేరిట ఎన్నికవుతూ వస్తున్న వివిధ పార్టీల ఛోటా– మోటా రాజకీయ నాయకులు తమ ఆస్తులకు మించిన ధనరాసులతో ఎలా తూగుతూ తమ అవినీతి సామ్రాజ్యాలను నిర్మించుకుంటూ వస్తున్నారో ‘ఏడీఆర్’ సాధికార నివేదికలు బట్టబయలు చేస్తున్నాయి. అయినా మార్పు లేదు. ఈ పరిస్థితుల్లో దేశంలో విద్య, వైద్యాభివృద్ధి వనరులు ప్రజలకు ఇబ్బడిముబ్బడిగా ఎలా, ఎక్కడినుండి లభి స్తాయి? అందుకే నన్నయ మహాకవి మహాభారతం ‘ఆదిపర్వం’లోనే ‘సరమ’ అనే కుక్కపిల్ల ద్వారా సార్వకాలికమైన విజ్ఞానాన్ని ప్రజలకు పంచిపెట్టాడు. ‘ఆదిపర్వం’ తొలి ఆశ్వాసంలో పాండవుల ముని మనుమడైన జనమేజయ మహారాజు నిర్వహించిన ఒక యజ్ఞం గురించి ప్రస్తావిస్తాడు. ఆ యజ్ఞ భూమికి ‘సరమ’ అనే కుక్క పిల్ల వస్తే అపవిత్రంగా పరిగణించి జనమేజయుడి సోదరులు దాన్ని దారుణంగా కొట్టి బయటకు పంపించివేస్తారు. ఆ ‘సరమ’ జరిగిన దారు ణాన్ని తల్లికి వివరిస్తుంది. అప్పుడు నీతులు పేదవాళ్ళకే కాదు, అంద రికీ వర్తించాలనీ, ఈ పని చేయడం తగునా, తగదా అన్న ఆలోచన, సార్వకాలిక సత్యం అందరూ పాటించాలనీ ‘సరమ’ తల్లి బోధిస్తుంది. ఇక, ‘మట్టి’కి అనువాదం ‘రైతు’ అని చెబుతూ గ్లోబలైజేషన్ పేరిట ‘చాపకింద నీరులా’ జరుగుతున్న తతంగం ఏమిటో మరొక ఆధునిక కవి ఇలా వర్ణించాడు: ‘‘కాడెద్దులు పోయి కంప్యూటర్లు వచ్చాయి భుజాల మీద నాగలి పోయి బైలార్స్ ట్రాక్టర్లు వచ్చాయి ఆకలికి తప్ప అన్నిటికీ యంత్రాలు వచ్చాయి.’’ అయినా రైతు దుఃస్థితి మారలేదని ఒక కవి స్పందిస్తే– ఇదే సమయంలో ‘వానకు కూడా దరిద్రం పట్టుకుంది/ కురవకుండానే రైతు కళ్ళల్లో నీళ్ళు నింపుతోం’దని మరో కవి వ్యంగ్యంగా అంటించాడు. ఇదిలా ఉండగా, మరో కవి ప్రస్తుత వ్యవసాయ పరిస్థితుల్ని వర్ణిస్తూ: ‘‘కాడికి కంప్యూటర్/ మేడికి కీబోర్డు, వెబ్సైట్లో విత్తడం, ఇంటర్నెట్లో అమ్మడం’’ అని గ్లోబల్ వ్యవసాయాన్ని వ్యంగ్యంగా చిత్రించాడు. మరో ఆధునిక కవి – ‘‘కళ్లముందు పంటకల్లం అదృశ్యమైనప్పుడు ఇళ్లల్లో దూలాలకు వేలాడేవి విత్తనాల సంచులు కాదు – రైతుల శవాలు’’ అని ఆక్రోశించాడు. ఇలాంటి నిరాశావాదానికి విరుగుడు అన్నట్టు, రైతుకు బలంగా కొమ్ముకాస్తూ, రాబోయే మంచిరోజుల్ని తలచుకొని, రైతు ఆగ్రహిస్తే వచ్చే పరిణామాన్ని వివరిస్తూ, ఆహ్వానించదగ్గ ఆశావాదాన్ని కోడూరి విజయకుమార్ ఇలా వ్యక్తం చేశాడు: ‘‘మట్టి చేతులు కూడా మాట్లాడతాయి వాటి మాటల భాషే వేరు – మట్టి చేతులు మాట్లాడటం ప్రారంభించాక నోళ్లున్న మారాజుల సింహాసనాలే కదిలిపోతాయి ఆ రోజుకి ఎదురు చూడాల్సిందే’’! కానీ మన నేతలకి నైతికత, విశ్వసనీయత కరువైపోయాయి. దీనికి కారణం అడ్డగోలు సంపాదనల ద్వారా ఎదిగిపోవడం. ప్రజా ప్రాతినిధ్య సభలుగా రాణించవలసిన రాజ్యాంగ సంస్థలను భ్రష్టు పట్టించడం. ఆఖరికి దేశ తొలి ప్రధాన మంత్రి, జాతీయ కాంగ్రెస్ నిర్మాతలలో అగ్రగణ్యుడైన జవహర్లాల్ నెహ్రూను నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నాలను చాపకింద నీరులా నేటి పాలక వర్గం చేస్తోంది. పేరును మాయపుచ్చినంత మాత్రాన ఆ వ్యక్తి నెలకొల్పిన మంచి సంప్రదాయాలు చెక్కు చెదిరిపోవు. నెహ్రూ మాదిరిగా తమ కపటాన్ని చీల్చి తమ వ్యక్తిత్వంలోని పరిమితుల్ని అంత బాహాటంగా చెప్పుకున్నవారు లేరు. ‘‘నేను ధనిక వర్గంలో పుట్టి పెరిగినందున భావవ్యాప్తిలో కమ్యూనిస్టులు వెళ్లగలిగినంత దూరం వెళ్లలేను’’ అన్నారు. అందుకే పాలకులకు నైతికత ప్రధాన సూత్రంగా ఉండాలి. అందుకే ఏ ప్రార్థన చేసినా అది స్వార్థం కోసం కాదు, కార్య సాధన కోసం గుండె ధైర్యం ఇవ్వమని విశ్వకవి రవీంద్రుడు ఎందుకు కోరుకున్నాడో వినండి: ‘‘నన్ను ప్రార్థించనీ – ప్రమాదాల నుంచి రక్షించమని కాదు ధైర్య సాహసాలతో ఎదుర్కొనే శక్తిని కలిగించమని ప్రార్థించనీ నన్ను కోరుకోనీ నాకు సంభవించే నా బాధలను పోగొట్టమని కాదు కష్టనష్టాలను అతి తేలికగా భరించగలిగే శక్తిని కోరుకోనీ నన్ను ఆశించనీ నా జీవిత పోరాటంలో మిత్రుల సహకారాన్ని దిగ్విజయం పొందడానికి నా స్వంత శక్తిని ఆశించనీ ఓ ప్రభూ! నాకు కలిగే దిగ్విజయాలలో మాత్రం నీ కరుణా కటాక్షాలను స్మరించే పిరికివానిగా చేయకు పరాజయాలలో నీ చేయూత అర్థించనీ’’! శభాష్, ఈ నిర్మలమైన మనస్సు పాలకుల మెదళ్లను ఏనాటికి కుదిపి కదుపుతుందో! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
వాస్తవ రూపంలో ‘దున్నేవాడిదే భూమి’
‘ఎవరెన్ని చెప్పినా పేద ప్రజల ప్రయోజనాలకు మాత్రం రక్షణ లేదు. మన ప్రభుత్వం నమ్రతతో ఈ సత్యాన్ని అంగీకరించి తీరాలి’ అని ఒకప్పుడు కఠోర సత్యం చెప్పారు మహాత్మా గాంధీ. కానీ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా కూడా ఆ ధోరణిలో మార్పు రాలేదు. తరాలుగా పేద ప్రజలు కాయకష్టం చేసి సంపద సృష్టిస్తున్నారు. అలాంటి పేద ప్రజలకు నిర్ణయాధికారం లేదు. వారి యాజమాన్య హక్కులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రాణం పోశారు. అసైన్డ్ భూముల మీద వారికి పూర్తి హక్కులు కల్పించడం ఒక చారిత్రక నిర్ణయం. దశాబ్దాలుగా పోరాటాల రూపంలో వెల్లడైన పేదల కాంక్షలకు నేటి ఈ నిర్ణయం అంతిమ విజయంగా భావించుకోవాలి. ‘‘కోట్లాది దేశ ప్రజలకు ఆహార పంటలు అందించే రైతులకన్నా దేశంలోని పెట్టుబడి దారులకే ప్రభుత్వాలు సర్వ సౌకర్యాలు కల్గిస్తున్నాయి. ఇది కంటికి కన్పించే నగ్న సత్యం. నేను పెట్టుబడిదారులకు వ్యతిరేకిని కాదు. నిజం చెప్పాలంటే, నేను ఒక పెట్టుబడిదారుడికి చెందిన ఇంట్లోనే ఉంటు న్నాను. కానీ పెక్కుమంది పెట్టుబడిదారుల వైఖరి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రభుత్వాలు మాత్రం తాము పేద ప్రజలకు చేయవలసిందంతా చేస్తున్నామని పైకి చెప్పొచ్చుగాక. ఆ మాటకొస్తే వలస పాలకు లైన బ్రిటిష్ వాళ్ళు కూడా అలాగే చెబుతూండేవాళ్లు. అసలు సత్యం ఏమంటే – ఎవరెన్ని చెప్పినా పేద ప్రజల ప్రయోజనాలకు మాత్రం రక్షణ లేదు. మన ప్రభుత్వం నమ్రతతో ఈ సత్యాన్ని అంగీకరించి తీరాలి. అంతేగాదు, ఏ ప్రయివేట్ ఆస్తి అయినా సరే, అది సిగ్గుఎగ్గూ లేకుండా దొంగిలించిన ఆస్తిగానే నేను పరిగణిస్తాను. ఎవరైనా సరే తన కాయకష్టం ద్వారా సంపాదించని ఆస్తి, లేదా బతుకుతెరువుకు అవసర మైన కనీస శ్రమ ఫలితంగా దక్కని సొమ్ము... సిగ్గూ ఎగ్గూ లేని సంపా దన అవుతుంది.’’ – మహాత్మా గాంధీ (11.12.1947). వి. రామ్మూర్తి ‘హిందూ’ పత్రిక తరఫున ఎడిటర్‌గా సంకలనం చేసి ‘కస్తూరి అండ్ సన్స్ లిమిటెడ్ (చెన్నై) తరఫున 2003లో ప్రచురించిన గ్రంథం నుంచి. తరాలుగా పేద ప్రజలు కాయకష్టం చేసి సంపద సృష్టిస్తున్నారు.ఆ బడుగు, బలహీన వర్గాలకు చెందిన హక్కులను మొట్టమొదటి సారిగా సాధికారికంగా క్రోడీకరించి... ‘దున్నేవాడిదే భూమి’ అన్న దశాబ్దాల వామపక్ష ఉద్యమాల స్ఫూర్తిని కొలది రోజుల నాడు ఆచరణలోకి తెచ్చారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. పేద ప్రజల సాగు హక్కులకు ప్రాణం పోశారు. దీనితో పది రకాల వ్యాఖ్యా నాల ద్వారా పేదల భూమి హక్కులను, సాగు హక్కులను తారు మారు చేసే మోతుబరుల ప్రయత్నాలకు స్వస్తి పలికారు. రాష్ట్రంలో మరే ప్రభుత్వం వచ్చినా, దీన్ని చెదరగొట్టే ప్రయత్నాలు చెల్లవు. ఆ ప్రయత్నాల్ని తిప్పికొట్టే శక్తినిచ్చేదే ఈ ముందడుగు. వామపక్షాలు దశాబ్దాల తరబడిగా ఆంధ్ర, తెలంగాణలలో కౌలు దారీ చట్టాల కోసం చేస్తూ వచ్చిన పోరాటాలతో సాధించిన పాక్షిక విజయాలకు... నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు అసైన్డ్ భూములపై హక్కులు ఇచ్చిన తీరు భూ చరిత్రలో అంతిమ విజయంగా భావించుకోవాలి. పేదలకు ఈ యాజమాన్య హక్కులు రావడం వలన వారు అవసరం అయితే తమ భూమిని విక్రయించుకోవచ్చు. ఇక, ఇంతకుపూర్వం కౌలు రైతులకు రుణాలు పొందే అర్హత కార్డులు ఉండేవి కావు. ఈ కార్డులు లేకనే బ్యాంకులు రుణాలివ్వలేదు. ఎంతసేపూ భూములకు పట్టాలున్న రైతుల్నే గుర్తిస్తారు. కౌలు రైతులను గుర్తించేది లేదన్న వైఖరిని కేసీఆర్ లాంటి నాయకులు కనబరిచారు. ఏదైనా ఇంట్లో అద్దెకు ఉంటే, ఆ ఇంటిపై హక్కు అతనికి ఇవ్వగలమా అని కూడా ప్రశ్నించారు. కానీ ఒకప్పుడు వై.ఎస్. రాజ శేఖర రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో నాలుగు లక్షల మందికి పైగా కౌలు రైతులు రుణ అర్హత కార్డులు పొందారు. తద్వారా అనేకమంది బ్యాంకు రుణాలు పొందగలిగారు. కౌలుదారులకు విధిగా వర్తించాల్సిన రక్షణ చట్టాల కోసం సుదీర్ఘ పోరాటాలు జరిగిన చరిత్ర ఉంది. ఆంధ్ర–తెలంగాణ వామపక్ష నాయకులు ఆ యా ప్రాంతాలలో విడివిడిగానూ, ఉమ్మడి గానూ కలిసి పోరాటం జరిపారు. చండ్రరాజేశ్వర్రావు, చలసాని వాసుదేవరావు, రావి నారాయణరెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మగ్దుం మొహియుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి, ఎస్వీకే ప్రసాద్– సుగుణ దంపతులు లాంటివాళ్లు ఇందులో ఉన్నారు. ఉభయ రాష్ట్రాల చరిత్రలో తొలి భూపోరాటాలు, పాక్షిక విజయాలన్నీ వామపక్షాల నేతృత్వంలోనే సాధ్యమయ్యాయి. ఒక్క ముక్కలో, పాత ఫ్యూడల్ శక్తులకు ముగుదాడు వేసి సాధించిన విజయాలన్నీ వామపక్షాలు బలంగా ఉన్నప్పటివే. అవి ఎప్పుడు బలహీనపడ్డాయో అప్పటినుంచీ పటిష్ఠమైన పార్టీగా ఉమ్మడి వామపక్షాల మాట గతకాలపు ‘ముచ్చట’గానే మిగిలి పోయింది. కానీ ప్రస్తుత దశ వేరు. కార్పొరేట్ శక్తుల చేతిలో దేశం నడుస్తున్నది. చాలక, వారి ఆధ్వర్యంలో ప్రసార మాధ్యమాలు కూడా లొంగిపోతున్నాయి. దేశీయ, విదేశీయ ఆశ్రిత పెట్టుబడుల పెత్తనం స్వతంత్ర భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను పాతి పెట్టింది. ఈ దుఃస్థితిని కనిపెట్టిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్, ‘రానున్న రోజుల్లో ప్రజలు పార్లమెంట్‌ను కూల్చేస్తా’రని ముందుగానే హెచ్చరించారు. గత పదేళ్లుగా ప్రతియేటా భారత పరిశోధనా సంస్థ ‘ఏడీఆర్’ నివేదికలు విషాద వాస్తవాన్ని చెబుతున్నాయి. అటు పార్లమెంట్ సభ్యులలో (అన్ని రకాల పార్టీల వాళ్ళు), ఇటు రాష్ట్రాల శాసన సభ్యులలో, మంత్రులలో ఎంత భారీ స్థాయిలో అవినీతి పేరుకు పోయిందో, సవరణకు వీలుకాని స్థాయిలో అవినీతి ఎలా రాజ్య మేలుతోందో ఏడీఆర్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అందుకే మన పాలకుల్ని ఉద్దేశించి ఒక మహాకవి ఇలా హెచ్చరించాడు:‘విజ్ఞానం వికసించదు విదేశాలు తిరిగొస్తేనే పరిణతమతి ప్రసరించదు పురాణాలు తిరగేస్తేనే!’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాకులు abkprasad2006@yahoo.co.in -
మార్క్స్ అవగాహన రుజువవుతోందా?
పార్లమెంటులో, శాసన సభల్లో వందలాది మంది ఎలా కోట్ల ఆస్తులకు పడగలెత్తారని ‘ఏడీఆర్’ నివేదికలు ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియను ‘ఐదేళ్ల కాంట్రాక్టు’గానే పార్టీలు చూస్తున్నాయి. ‘ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం’ వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోంది. ధనికవర్గ సమాజాలు నేరస్థుల్ని, వారి వెంటనే నేర చట్టాల్ని, వాటిని సమర్థించే శక్తుల్ని ఎలా సృష్టించుకుంటూ పోతాయో కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పారు. అలాంటి సమాజంలో ఒక తత్వవేత్త అందుకు తగిన భావాల్ని అందజేస్తాడు. ఒక కవి తన కవితల్ని అల్లుకుంటూ పోతాడు. ఒక మతాధికారి తన వంతుగా ప్రవచనాల్ని అందిస్తాడు. వర్గ రహిత సోషలిస్టు వ్యవస్థ ఏర్పడేవరకూ ఈ పరిస్థితిలో మార్పు ఉండదు! ‘‘మన దేశంలో ప్రజల కోసం కాకుండా పవర్ (అధికారం) కోసమే పథకాలు పుట్టు కొస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియను ‘ఐదేళ్ల కాంట్రాక్టు’గానే పార్టీలు చూస్తున్నాయి. కార్పొరేట్ విధాన రాజకీయాలనే అన్ని పార్టీలు అనుసరిస్తున్నాయి. ఇంతకూ మన దేశంలో భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యా లను చదివిన నాయకులెందరు?’’ – తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనర్‌గా పనిచేసిన ఐఏఎస్ అధికారి వి. నాగిరెడ్డి (28.10.2023) ‘‘దేశంలో చట్టాలకు విరుద్ధంగా మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం’ వల్ల ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు వాటిల్లుతోంది. దేశ ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల అధీనంలో ఉండ వలసిన ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రయివేట్ రంగ సన్నిహితులకు కట్టబెట్టడానికి మారుపేరు ‘ఆశ్రిత పెట్టుబడి’!’’ – సీనియర్ పాత్రికేయులు పరాంజయ గుహ ఠాకుర్తా (29.10.2023) ‘పాలన సాగించే సివిల్ సర్వెంట్లను ప్రచార సాధనాలుగా ఉపయోగించుకునేలా– దేశంలోని 765 జిల్లాలకు జాయింట్ సెక్రటరీ, లేదా అంతకన్నా తక్కువ స్థాయి అధికారులను ‘రథ్ ప్రభారీ’లుగా నామినేట్ చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంపై కేంద్ర మంత్రి మండలి మాజీ కార్యదర్శి కె.ఎం. చంద్రశేఖర్ తీవ్ర నిరసన తెలిపారు.’ (30.10. 2023) పాలనా యంత్రాంగంలో అవినీతి భాగోతం అంతటితోనే ఆగలేదు. రాజకీయ పార్టీలకు ఎన్నికలలో డబ్బు ఎక్కడినుంచి వస్తోందీ, ఎటు పంపిణీ అవుతోందన్న వివరాలను తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ‘లేదు పొమ్మని’ మోదీ ప్రభుత్వ అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సుప్రీంకోర్టు ముఖం మీదనే చెప్పారు. తెలుసుకునే హక్కు దేశ పౌరులకు లేదు పొమ్మంటున్న కేంద్ర పాలకుల ఎత్తుగడను సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ప్రశ్నిస్తోంది. భారతదేశంలో ప్రజాస్వామ్య సంస్కరణలు స్థిరపడి నిలదొక్కు కునేటట్లు చేసేందుకు ఏర్పడిన సంస్థ ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్’... కొంతకాలంగా పార్లమెంటు, రాష్ట్రాల శాసన సభల్లో ప్రవేశి స్తున్న వివిధ పార్టీల, రాజకీయ నాయకుల, ప్రతినిధుల ఆదాయ వ్యయాల వివరాలను వెల్లడిస్తూ దేశ ప్రజల్ని హెచ్చరిస్తోంది. ‘అందరూ శాకాహారులే అయిన చోట రొయ్యల బుట్ట ఎలా ఖాళీ అవుతోంద’ని ప్రశ్నిస్తోంది. పార్లమెంటులో 250 మంది సభ్యులకు పైగా, రాష్ట్రాల శాసన సభల సభ్యులలో వందలాది మంది ఎలా వందల కోట్ల ఆస్తులకు పడగలెత్తుతూ వచ్చారని ‘ఏడీఆర్’ సాధికార నివేదికలు గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నా సమాధానం లేదు. సగానికి పైగా పార్లమెంట్ సభ్యులలో, రాష్ట్రాల శాసన సభ్యులలో, పాలకులలో పేరుకు పోతున్న అవినీతికి, క్రిమినల్ కేసులకు అంతులేని పరిస్థితిని ఏడీఆర్ సాధికార నివేదికలు బయట పెడుతున్నాయి. క్రమంగా ఇలాంటి పరిస్థితులు ధనికవర్గ సమాజాలు నేరస్థుల్ని, వారి వెంటనే నేర చట్టాల్ని, వాటిని సమర్థించే శక్తుల్ని ఎలా సృష్టించుకుంటూ పోతాయో చరిత్రలో మొదటిసారిగా విశ్లేషించినవాడు శాస్త్రీయ సోష లిజం సిద్ధాంత ప్రవక్త కార్ల్ మార్క్స్. అలాంటి దోపిడీ వ్యవస్థ ఉనికిని కాపాడటానికి వివిధ శక్తులు ఏ స్థాయిల్లో ఎలా చేదోడు వాదోడు అవుతాయో మార్క్స్ ఇలా విశ్లేషించి చూపాడు: అలాంటి సమాజంలో ఒక తత్వవేత్త అందుకు తగిన భావాల్ని అందజేస్తాడు. ఒక కవి తన కవితల్ని అల్లుకుంటూ పోతాడు. ఒక మతాధికారి లేదా పూజారి తన వంతుగా ప్రవచనాల్ని అందిస్తాడు. ఓ ప్రొఫెసర్ గారు ఇందుకు తగిన గ్రంథ రాజాల సారాంశాన్ని అందజేస్తుంటాడు. ఓ నేరగాడు యథేచ్ఛగా అలా నేరాలు చేస్తూనే పోతాడు. నేరానికి పాల్పడటం కూడా ధనిక, దోపిడీ వర్గ సమాజ వస్తూత్పత్తి క్రమంలో భాగంగానే సాగిపోతుంది. అటు సరుకుల ఉత్పత్తి క్రమానికి, ఇటు సమాజానికి మధ్య నెలకొనే అవినాభావ సంబంధాన్ని పరిశీలించినట్లయితే–అనేక భ్రమలు, దురభిమానాలు పటాపంచలై పోతాయి. ఎందుకంటే, మన ‘లా ప్రొఫెసర్’ గారు ఆ భ్రమలపై ఆధారపడి ఓ గ్రంథ రాజాన్ని తయారు చేసుకొని మార్కెట్ లోకి ఓ అమ్మకపు సరుకుగా వదులు తాడు. ఆ పుస్తకాన్ని తమ వంతు ‘జాతీయ సంపద’గా భావించి ధనిక వర్గం పంచుకోవడానికి దోహద పడుతుంది. మరో వైపున దాన్ని తయారు చేసిన ‘లా ప్రొఫెసర్’ గారిలో ఇది వ్యక్తిగత మైన ఆనందాన్నీ, తృప్తినీ పెంచేస్తుంది. ఇలా మన ప్రొఫెసర్ ధనికవర్గ ప్రయోజనాలకు ఉపయోగపడే ఓ క్రిమినల్ చట్టం రూపొందడానికి చేయూత నివ్వడమేగాక, ఆ చట్టానికి గొడుగు పట్టే ‘పీనల్ కోడ్స్’ (శిక్షా స్మృతి)ను, దానితోపాటే ధనికవర్గ ప్రయోజనాలు ఈడేర్చిపెట్టే శాసన కర్తలు, కళాకారులు రూపొందేలా, ఆ చట్టానికి వత్తాసు పలికే సాహిత్యానికి, నవలలకు, చివరికి సమాజంలో అనంతమైన విషాదకర సన్నివేశాలకు కారణమవుతాడు. కనుకనే, అలాంటి సమాజాల్లో పరస్పర వర్గ ప్రయోజనాల రక్షణ కోసం ఒక వైపు నుంచి ధనికవర్గమూ, మరో వైపు నుంచి శ్రామికులు ఆచరణలో ప్రయివేట్ ఆస్తి ఉనికిని కాపాడు తున్నట్టు అవుతోందని కూడా మార్క్స్ ప్రభృతులు అరమరికలు లేకుండా చెప్పారు. వర్గ రహిత సోషలిస్టు వ్యవస్థ ఏర్పడేవరకూ ఈ పరిస్థితిలో మార్పు ఉండదు! అందుకే అన్నాడా, శ్రమ విలువ తెలిసిన వేమన? ‘‘భూమిలోన పుట్టు భూసారమెల్లను తనువులోన పుట్టు తత్వమెల్ల శ్రమములోన పుట్టు సర్వంబు తానౌను’’! కాగా, అసలు జీవితమంటే ఏదో ‘సినారె’ను అడిగితే చెబుతాడు: ‘‘ఉప్పెనలో తలవొగ్గక నిలువున ఉబికొచ్చే జీవితం ఓటమిలో నిట్టూర్చక రివ్వున ఉరికొచ్చేదే జీవితం చచ్చేదాకా బతికి వుండటం జాతకాల్లో ఉన్నదే – ఒరిగిపోయినా తన కంఠం నలుగురు మెచ్చేదే జీవితం ప్రలోభాలు పైబడినా నీతికి పడి చచ్చేదే జీవితం’’! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
వ్యాక్సిన్ల సామర్థ్యం తెలిసేదెలా?!
‘‘ఎప్పటికప్పుడు కొత్త వ్యాక్సిన్ల సృష్టి జరుగుతూన్న సందర్భంగా సదరు వ్యాక్సిన్లు సరిగ్గా పని చేసేవా, లేదా అని తేల్చుకోవాలంటే – ముందు ఆ వ్యాక్సిన్లను రాజకీయ పాలకులపై ప్రయోగించి చూడాలి. ఎందుకంటే, తీసుకున్న వ్యాక్సిన్ వల్ల ఆ పాలకులు బతికి బట్టకడితే ఆ వ్యాక్సిన్ మంచిదని నిర్ధారణ చేసుకోవచ్చు. కానీ ఆ పాలకులు ఆ వ్యాక్సిన్ వల్ల స్వర్గస్థులయితే, దేశం సుఖంగా ఉన్నట్టు భావించాలి.’’ – ప్రసిద్ధ పోలిష్ తాత్వికులు మోనికా విర్నివా స్కా ఈ బండ ‘జోకు’ వినడానికి కటువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ గత పదేళ్లకు పైగా ప్రజా బాహుళ్యం ఆరోగ్య భాగ్యం కన్నా, వ్యాపార లాభాల కోసం పెక్కు ప్రయివేట్ కంపెనీలు వ్యాక్సిన్ల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వస్తున్నాయి. అవి సృష్టించే వ్యాక్సిన్లు ప్రముఖ శాస్త్రవేత్తల కొలమానాలకు అందకపోయినా, తిరస్కరిస్తున్నా మార్కెట్లోకి పాలక వర్గాల అండతో విడుదలవుతూండటం చూస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యథేచ్ఛగా సాగిన ఈ కుంభకోణాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎండకట్టి అనుక్షణం, ఈ రోజు దాకా ప్రశ్నిస్తూ వస్తున్న ప్రసిద్ధ భారత కరోనా శాస్త్రవేత్త, పరిశోధకురాలు గగన్‌దీప్ కాంగ్! వైరస్ల స్థాయి ఎంత తీవ్రమైనదంటే – భవిష్యత్తులో సోకగల ప్రమాదాలను కూడా ముందుగానే ఊహించి రోగ నిర్ణయానికి అవసరమైన ప్రయివేట్ స్థాయి అవకాశాలను కూడా గణించి, ప్రయివేట్ కంపెనీలను షరతులతో అదుపులో ఉంచుతూ రంగంలోకిదించాలని ఆమె పదేపదే ముందస్తుగానే సూచిస్తూ వచ్చారు. ఈ రోజు కాకపోతే రేపు అయినా పాలకులు అను మతించిన ప్రయివేట్ కంపెనీలను అదుపాజ్ఞల మధ్య వాడుకోవలసి ఉంటుందన్నారు. ప్రపంచ క్లినీషియన్ శాస్త్రవేత్తలలో భారతదేశ ఉద్దండురాలుగా ఆమెను గుర్తిస్తూ లండన్ రాయల్ సొసైటీ ‘ఫెలోషిప్’ ఇచ్చి గౌరవించింది. రాయవెల్లూరు మెడికల్ కాలేజీలో వైద్య శాస్త్ర పరిశోధనా కేంద్రంలో పిల్లల్లో ప్రబలుతున్న వైరల్ వ్యాధులపై ఎనలేని పరిశోధన చేశారు. అంతేకాదు, పిల్లలకు సంబంధించి పటిష్ఠమైన ఆరోగ్య జాగ్రత్తలను ప్రాథమిక దశ నుంచే తీసుకోవడం వల్ల ఉత్తరోత్తరా వాళ్లను ఆస్పత్రుల చుట్టూ తిప్పే అవసరం ఉండదనీ, ఆ జాగ్రత్త తీసుకోకపోవడం వల్లనే కనీసం వంద దేశాల్లో లక్షలాది చిన్నారులు దారుణ పరిస్థితుల్లో చనిపోవలసి వచ్చిందనీ గగన్‌దీప్ కాంగ్ ఆందోళన వెలిబుచ్చారు. మానవాభ్యున్నతి గణింపులో గత పదిహేనేళ్లలో భారత అభి వృద్ధి సూచీ 3 స్థానాలు దిగజారి పోయింది. ఈ గణింపులో చిన్నారుల మరణ శాతం కూడా పరిగణనలోకి తీసుకుంటారనేది మరువరాదు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచవలసిన పాలకులు ఎప్పటికప్పుడు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజాస్వామ్య, లౌకిక వాద సిద్ధాంతాలను తుంగలో తొక్కుతున్నారు. మత రాజకీయాలను పెంచి పోషిస్తూ ‘హిందూ జాతీయవాదాన్ని’ రేకెత్తించి నియంతృత్వ పాలనను స్థాపించడానికి కావల సిన వాతావరణాన్ని సృష్టించుకొంటున్నారు. దీన్ని ఊహించే భారత రాజ్యాంగ నిర్మాత ‘భారత రాజ్యాంగంలో ఆచరణకు పొందుపరచిన ప్రజాస్వామ్య సూత్రాలను ఇతరులు ప్రజాస్వామ్య విరుద్ధంగా మార్చేసే ప్రమాదం లేకపోలేదు, నియంతృత్వాన్ని ప్రవేశపెట్టే ప్రమాదమూ లేక పోలేదు’ అని హెచ్చరించారు. దక్షిణాసియాలో ముఖ్యంగా భారతదేశంలో హిందూ మత రాజకీయాల వల్ల అన్యమతస్థులకు స్థానముండదనీ, ప్రజాస్వామ్య లక్ష్యాలతో పొందుపరిచిన భారత సెక్యులర్ వ్యవస్థను అపహాస్యం చేస్తూ గాంధీజీ హంతకుడు గాడ్సే కాలం నాటి పరిస్థితులను ‘సెక్యులరిజం’ పేరు చాటున తాము కూడా పాలనలో కొనసాగించ దలచినట్లు ‘బీజేపీ – ఆరెస్సెస్’ నాయకుల ప్రస్తుత ధోరణులు కనిపిస్తున్నాయనీ ‘వర్జీనియా యూని వర్సిటీ’ భారతీయ ప్రొఫెసర్ నీతీ నాయర్ ‘గాయపడ్డ మనస్సులు’ (2021) గ్రంథంలో పేర్కొన్నారు. ప్రత్యేక ‘హిందూ రాష్ట్రం’ సెగ ఒక మతాన్ని కాదు – ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, దళితులు, బౌద్ధులు అందర్నీ చుట్టుముడుతుందనీ, అందుకని, మన భారత ప్రజలు ప్రత్యేక ‘హిందూ రాష్ట్ర ప్రతిపత్తి’కీ లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగంలో అక్షర సత్యంగా పొందుపరిచిన ‘సమగ్ర భారతదేశ’ భావనకూ మధ్య వాస్త వాన్ని విధిగా ప్రేమించాలని ప్రొఫెసర్ నీతీ నాయర్ ఆ గ్రంథంలో పేర్కొ న్నారు. ఇటీవల ‘మహిళా రిజర్వేషన్ల’ సమస్యపై బీజేపీ పాలకులు నడిపిన తంతుపై సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు మంజుల్ వేసిన పాకెట్ కార్టూన్ (23.9.2023) వీరి రాజకీయాలను పట్టిస్తుంది. ‘మీ మహిళా రిజర్వేషన్ల కోటా 2039లో వస్తుంది. అయితే దాన్ని పెద్దగా ఆలస్యమైనట్టు మీరు భావించకండి. 2024లోనే మీ కోటాను మీకు కాగితం మీద కల్పిస్తాం. కానీ ఈలోగా, అంటే 2024లోనే మీ ఓటును మాకు ముందస్తు క్రెడిట్‌గా వేయండి’ అని ప్రధాని ముక్తాయించడం అసలు ‘చరుపు’! కానీ, ఆ 2039 నాటికి ఎవరుంటారో, ఎవరు ఊడతారో మాత్రం తెలియకపోవడం అసలు ‘మర్మం’! అందుకే అన్నాడేమో వేమన: ‘‘కులము గలుగువారు, గోత్రంబు గలవారు విద్య చేత విర్రవీగు వారు,పసిడి గల్గు వాని బానిస కొడుకులు!’’ ఏబీకే ప్రసాద్ abkprasad2006@yahoo.co.in సీనియర్ సంపాదకులు -
విప్లవాగ్ని జ్వలితుడు
తలవంచని విప్లవ కవిగా, పెక్కు నిర్బంధాల మధ్యనే ముందుకు సాగుతున్నారు వరవరరావు! 1957–2017 మధ్య కాలంలో ఆయన రాసిన సుమారు 50 కవితలను పెంగ్విన్ రాండమ్ హౌస్ ‘వరవరరావు – ఎ లైఫ్ ఇన్ పొయెట్రీ’ పేరుతో ఆంగ్లంలో ప్రచురించింది. ‘బానిస సమాజం నుంచి బానిస భావం కూడా లేని కమ్యూనిజం’ వైపు పయనిస్తున్న ‘వరవర’కు తగిన గౌరవం. ‘‘లోకంలో మేధావులనుకుంటున్నవారు సహితం పిరికిపందలుగా ఉంటారు. అలాంటి పిరికి పందలకన్నా మనోధైర్యంతో, దమ్ములతో బతకనేర్వడం అతి అరుదైన లక్షణంగా భావించాలి.’’ – ‘వికీలీక్స్’ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ ప్రపంచ దేశాలపై అమెరికా నిరంతర కుట్రలను బహిర్గతం చేసినందుకు జీవిత మంతా కష్టాలను కాచి వడబోస్తున్న మహాసంపాదకుడు, ప్రపంచ పాత్రికేయ సింహం... జూలియన్ అసాంజ్. అలాంటి ఒక అరుదైన సింహంగా, తలవంచని విప్లవ కవిగా ఈ క్షణం దాకా పెక్కు నిర్బంధాల మధ్యనే ముందుకు సాగుతున్న కవి వరవరరావు! దఫదఫాలుగా దశాబ్దాలకు మించిన జైళ్ల జీవితంలో ఆయనను (1973లో తొలి అరెస్టు మొదలు) 25 కేసులలో కేంద్ర, రాష్ట్ర పాలకులు ఇబ్బందులు పెట్టారు. అలాంటి విప్లవకవి వరవరరావు తెలుగులో 1957–2017 మధ్య కాలంలో రాసిన సుమారు 50 కవితలను ఎంపిక చేసి... కవి, సాహితీ విమర్శకులు, మానవ హక్కుల పరిరక్షణా ఉద్యమాలకు నిరంతరం చేయూతనందిస్తున్న పాత్రికేయులు ఎన్.వేణుగోపాల్, నవలాకారిణి, కవయిత్రి మీనా కందసామి ఇండియాలోని సుప్రసిద్ధ పెంగ్విన్ రాండమ్ హౌస్ కోరికపై అందజేసిన గ్రంథమే ‘వరవరరావు – ఎ లైఫ్ ఇన్ పొయెట్రీ’! సర్వత్రా ‘సామ్యవాద రంకె’ వినిపించిన వరవరరావు 1972 లోనే: ‘దోపిడీకి మతం లేదు, దోపిడీకి కులం లేదు దోపిడీకి భాష లేదు, దోపిడీకి జాతి లేదు దోపిడీకి దేశం లేదు తిరుగుబాటుకూ, విప్లవానికీ సరిహద్దులు లేవు’ అని చాటుతూనే, తనను శత్రువు కలమూ, కాగితమూ ఎందుకు బంధించాయో తెగేసి చెప్తాడు: ‘ప్రజలను సాయుధులను కమ్మన్నందుకు గాదు/ నేనింకా సాయుధుణ్ణి కానందుకు’ అన్నప్పుడు జూలియన్ అసాంజ్ చేసిన హెచ్చరికే జ్ఞాపకం వస్తుంది. అంతేగాదు, ‘వెనక్కి కాదు, ముందుకే’ అన్న కవితలో ‘వరవర’: ‘బానిస సమాజం నుంచి బానిస భావం కూడా లేని కమ్యూనిజం దాకా పయనించే ఈ కత్తుల వంతెన మీద ఎంత దూరం నడిచి వచ్చావు – ఇంకెంత దూరమైనా ముందుకే సాగు’ గాని వెనకడుగు వెయ్యొద్దని ఉద్బోధిస్తాడు! ధనస్వామ్య రక్షకులైన పాలకుల దృష్టిలో ‘ప్రజాస్వా మ్యా’నికి అర్థం లేదని– ‘పార్లమెంటు పులి కూడ /పంజాతోనే పాలిస్తూ సోషలిజం వల్లించుతూనే / ప్రజా రక్తాన్ని తాగేస్తుంద’నీ నాగుబాము పరిపాలనలో / ప్రజల సొమ్ము పుట్ట పాల’వుతున్న చోటు – ‘జలగల్ని పీకేయందే – శాంతి లేదు/ క్రాంతి రాద’ని నిర్మొహమాటంగా ప్రకటిస్తాడు. ‘జీవశక్తి’ అంటే ఏమిటో కవితాత్మకంగా మరో చోట ఇలా స్పష్టం చేస్తాడు: ‘అన్ని రోజులూ కన్నీళ్లవి కావు / అయినా ఆనంద తీరాలు ఎప్పుడూ తెలియకుండా / దుఃఖం లోతెట్లా తెలుస్తుంది? ఆ రోజులూ వస్తాయి / కన్నీళ్లు ఇంద్రధనుస్సులవుతాయి నెత్తురు వెలుగవుతుంది / జ్ఞాపకం చరిత్ర అవుతుంది బాధ ప్రజల గాథ అవుతుంది!’ జైలు జీవితానుభవాన్ని సుదీర్ఘ అనుభవం మీద ఎలా చెప్పాడో! ‘జైలు జీవితమూ అంగ వైకల్యం లాంటిదే నీ కంటితో ఈ ప్రపంచాన్ని చూడలేవు నీ చెవితో వినలేవు, నీ చేయితో స్పృశించలేవు నీ ప్రపంచంలోకి నువ్వు నడవలేవు నీవుగా నీ వాళ్ళతో నువ్వు మాట్లాడలేవు ఎందుకంటే – అనుభూతి సముద్రం పేగు తెగిన అల ఇక్కడ హృదయం!’ ఇప్పటికీ దేశవ్యాపితంగా ప్రజా కార్యకర్తలపైన, పౌరహక్కుల నాయకులపైన యథాతథంగా హింసాకాండ అమలు జరుగుతూనే ఉంది. దానికి ఉదాహరణగా, అనేక రకాలుగా వికలాంగుడైన ప్రజా కార్యకార్త ప్రొఫెసర్ సాయిబాబానే కార్పొరేట్ శక్తుల కన్నా ప్రమాదకరం అన్నట్టుగా పాలకులు వ్యవహ రించడం ఏమాత్రం క్షంతవ్యం గాదు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
‘జమిలి’ ఎన్నికలు రాజ్యాంగ ఉల్లంఘన
దశాబ్దాలుగా రాజ్యాంగ మౌలిక స్వరూపం చెదరకుండా ప్రజలు కాపాడుకుంటూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో ‘ఒకే దేశం – ఒకే ప్రజ’ వంటి ఆకర్షణీయ నినాదాలతో దేశ సమాఖ్య తత్వాన్నీ, లౌకిక స్వభావాన్నీ దెబ్బతీసే ప్రతిపాదనలను కేంద్రపాలకులు ముందుకు తెస్తున్నారు. మెజారిటీ వాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. అలాగే రాజకీయ పార్టీల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ధోరణి పెరిగిపోతోంది. ఫలితంగా రాజకీయాలు నేరమయం, ధనమయం అయిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం ‘జమిలి ఎన్నికలు’ అంశాన్ని మరోసారి ముందుకు తెచ్చింది. కేంద్ర, రాష్ట్ర చట్ట సభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించాలనే ఆలోచన ఏ మాత్రం ఆచరణ సాధ్యం కాదు. దీనివల్ల రాజ్యాంగ పరమైన సమస్యలు తలెత్తుతాయి. ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ అన్న ఎజెండా ద్వారా, ‘ఒకే పన్ను, ఒకే రేషన్ కార్డు’ ఇత్యాది నినాదాలూ, విధానాల ద్వారా దేశంలో ఐక్యతను కాపాడగలమన్న సరికొత్త భావనను ప్రవేశపెట్టడానికి కేంద్ర పాలకులు ప్రయత్నిస్తు న్నారు. తద్వారా కేంద్ర పాలకులు తమ చేతుల్లో పరిపాలనా, రాజకీయ అధికారాన్ని బహుముఖంగా కేంద్రీకరించుకుని, రాష్ట్రాల అధికారాలను బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ తతంగం 2014 నుంచే ప్రారంభమైందని మరవరాదు. ఈ తంతులో భాగంగానే పార్లమెంటును పాలకులు విస్పష్ట నిర్ణయాలు తీసుకోకుండా తటస్థపరిచారు. ఇక మీడియా దాదాపు పాలకుల సేవికగా మారింది. న్యాయ వ్యవస్థను చాలావరకు మెడలు వంచారు, పౌర సమాజాన్ని నిర్వీర్యపరిచారు.’’ – సీనియర్ జర్నలిస్టు సి. రాం మనోహర్ రెడ్డి (11.9.2023) దేశ తొలి అధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్, ఆయన ఆధ్వర్యంలో నియమితులైన నాటి రాష్ట్రాల గవర్నర్లు వ్యవహరించిన తీరుతో ఇటీవలి కాలంలో మన దేశ అధ్యక్షులు, గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుతెన్నులను పోల్చి చూస్తే రాజ్యాంగం ఏ విధంగా అతిక్రమణకు గురవుతోందో అర్థమవుతుంది. రాజ్యాంగ ప్రవేశికలో ‘భారత ప్రజలమైన మేము రూపొందించుకొని, అంకితమిచ్చుకున్న ప్రజా రాజ్యాంగం’ అని సగర్వంగా ప్రకటించుకున్న మనం ఇప్పుడు రాజ్యాంగ ఉల్లంఘనలను చూసి తల దించుకోవలసి వస్తోంది. ఆ తొల్లింటి రాజ్యాంగ హామీలు, ఇంకా ఇప్పుడు అమలు జరుగు తున్నా యనుకోవడం ప్రజల భ్రమ అవుతుంది. ఎందుకంటే ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని, విధానాలను మనసారా అభిలషించి ‘దేశంలో కొలది మంది మోతుబరుల చేతుల్లో దేశ సంపద, అధికారాలు కేంద్రీకృతం కారాదని’ శాసించిన జాతిపిత గాంధీజీని ప్రేమించినట్టు నటించి ఆయనను హతమార్చినవాళ్లే గాంధీ బొమ్మలు పెట్టుకుని ఊరేగు తున్నారు. దేశ స్వాతంత్య్ర తొలి సంవత్సరాల్లో కేంద్రంలోనూ, రాష్ట్రాల లోనూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించేవారు. కానీ 1960లలో కేంద్ర (కాంగ్రెస్) పాలకులు రాజ్యాంగంలోని 356వ నిబంధనను తమ స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుని రాష్ట్రాలలో తమకు ఇష్టం లేని ప్రభుత్వాలను కూల్చడానికి జంకలేదు. శాసనసభ విశ్వాసాన్ని చూరగొన్న రాష్ట్ర ప్రభుత్వాలే పాలనలో ఉండాలి. ఆ విశ్వాసం సడలి నప్పుడు అవి దిగిపోయి, తిరిగి ప్రజల విశ్వాసం చూరగొనేందుకు ఎన్నికలకు వెళ్లాలి. ఈ పద్ధతిని తారుమారు చేసి, కేంద్ర పాలనను (రాష్ట్రపతి పాలన) రుద్దడానికి పాలకులు అలవాటు పడటం ద్వారా అటు ఫెడరల్ వ్యవస్థ లక్ష్యాలనూ, ఇటు ప్రజాస్వామ్య విలువల్నీ ఏకకాలంలో ధ్వంసం చేయడానికి తెగబడ్డారు. అదే సమయంలో రాష్ట్రాలూ, కేంద్రానికీ ఎన్నికలు వేరు వేరు సమయాల్లో జరప వలసిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు కేంద్రం ‘జమిలి ఎన్నికలు’ అంశాన్ని మరోసారి ముందుకు తెచ్చింది. కేంద్ర, రాష్ట్ర చట్ట సభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించాలనే ఆలోచన ఏమాత్రం ఆచరణ సాధ్యం కాదు. దీనివల్ల అనేక రాజ్యాంగ పరమైన సమస్యలు తలెత్తుతాయి. తొలినాటి ప్రజాస్వామిక విలువలు మచ్చుకు కూడా కానరాకుండా పోవడం నేటి రాజకీయాల్లో మనం చూస్తున్న విషాదం. ఎవరు ఎంత డబ్బు ఖర్చుపెడితే అంతగా ఎన్నికల్లో గెలవవచ్చు అనే నమ్మికతో రాజకీయపార్టీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ధనవంతులూ, నేరప్రవృత్తి కలిగినవారూ రాజకీయాల్లో అత్యధికంగా పాల్గొనడం కళ్లెదుట కనిపిస్తున్న రాజకీయ చిత్రం. తాజా ఏడీఆర్ రిపోర్ట్‌ను గమనిస్తే మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత ‘నిఖార్సు’గా పరిఢవిల్లుతోందో అర్థమవుతుంది. రాజ్యాంగం ప్రకారం ఏమాత్రం మన రాజకీయపార్టీలు నడుచుకోవడం లేదనీ, అవి కేవలం ఏదో విధంగా అధికారంలోకి రావడానికే ప్రయత్నిస్తున్నాయనీ... పైకి మాత్రం రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నటిస్తున్నాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాజ్యాంగ సూత్రా లనూ, సమాఖ్య తత్వాన్నీ, లౌకికత్వాన్నీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అనేక ప్రతిపాదనలు బహిరంగంగానే ముందుకొస్తున్నాయి. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే వ్యక్తి పాలన’ అటువంటిదే. చైతన్యశీలి, ప్రజాస్వామ్యవాది అయిన నేటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పదవీ స్వీకారం చేసిన తర్వాత అడుగ డుగునా కేంద్ర పాలకుల దుందుడుకు విధానాలను వ్యతిరేకిస్తూండటంతో కొంతలో కొంత వారు దూకుడు తగ్గించుకుంటున్నారు. అయితే మళ్లీ అధికారం చేజిక్కించుకోవడానికి ఎప్పటిలాగే తమ పాత విధానాన్ని అనుసరించి కుల, మత, వర్గ సంఘర్షణలకు ప్రజల మధ్య ‘చిచ్చు’ రగిలిస్తున్నారు. ఇదేమాత్రం వారికి అమానవీయం అనీ, రాజ్యాంగ విరుద్ధమనీ అనిపించడంలేదు. మెజారిటీ వాదాన్ని ముందుకు తెచ్చి తమ చర్యలను ప్రతిభావంతంగా సమర్థించుకుంటున్నారు. బహుశా అందుకే మహాకవి దాశరధి కృష్ణమాచార్యులు ఒక పాత్ర ద్వారా చెప్పించిన మాటలు ఈ సందర్భంగా గుర్తుకొస్తున్నాయి: ‘నేను చేసిన పాపాలు అనేకమయినా, నా జిహ్వకు మాత్రం అవి పానకాలే!’ అందుకే, అలాంటి ‘పానకాల రాయుళ్ల’ను పాలకులుగా పెరగనివ్వకుండా ఉంచడానికే నేటి చైతన్యశీలమైన సుప్రీంకోర్టు విశ్వ ప్రయత్నం! దాని కృషికి చేదోడు వాదోడుగా నిలవడం – బాధ్యతగల భారత పౌర సమాజ ధర్మం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
మన ‘పాల్ రాబ్సన్’!
‘గద్దరమ్మ నోటికి దండం’ అనేవాళ్లు, ఇప్పుడు ‘గద్దర్’ నోటికి దండాలు పెట్టే రోజులొచ్చాయి! ఒక ఉద్యోగిగా సరి పెట్టుకుని, పెరుగుతున్న ధరలతోనే రాజీపడి బతుకు భారాన్ని చిరునవ్వుతో మోసుకుంటూ కాలక్షేపం చేయలేక, కళారంగాన్ని కదనరంగంగా మార్చిన విప్లవ కవితా ఉద్యమ వారసుడు, కవి, మధుర గాయకుడు అయిన గుమ్మడి విఠల్ రావు (గద్దర్) కాకతీయ మహాయుగానికి, తెలంగాణ విప్లవోద్యమానికి కారణమయిన తెలంగాణలో పుట్టి పెరిగిన వాడు. సామాజిక అసమానతలపైన, అన్యాయాలపైన అతని విమర్శ వ్యక్తిగతమైనది కాదు, వ్యవస్థాగతమైనది. నిత్య హత్యా సత్యమైన ఆస్తిహక్కుకు బద్ధవిరోధి. అది రద్దు కానంత వరకు ఈ కుల వ్యవస్థ, ఈ మత దురహంకార వర్గ సమాజం మారదనీ, మానవుడు మారడనీ నమ్ముతున్నవాడు. సరికొత్త బాణీలతో, సొంత గొంతుతో అట్టడుగు ప్రజల యాసలో, మాండలిక భాషలో కళారంగాన్ని విప్లవీకరించిన వ్యక్తిగా గద్దర్‌కు ఈ దేశంలోనే కాదు, ఖండాంతరాలలో కూడా పోలిక – నీగ్రో బానిసల బతుకులకు అర్థం చెప్పి వాళ్ళ బాధల గాథలే పల్లవిగా, అను పల్లవిగా, వీధి వీధినీ గానం చేసి అజ్ఞాత జీవితాలకూ, అస్థిరమైన ప్రవాస జీవితాలకూ నాద బ్రహ్మగా నిలిచిన పాల్ రాబ్సన్ ఒక్కడే! ఆ బానిసల గర్భశోకానికి శ్రుతిగా సంగీతం వెలయించిన పాల్ రాబ్సన్ 1950లలో ‘ఫిస్క్ జూబ్లీ గాయకుల’కు ప్రత్యక్ష వారసుడు. స్పానిష్ అంతర్ యుద్ధంలో సమర గీతాలు ఆలపించాడు. ఈ సమర కళాయాత్రను సహించలేని అమెరికా పాల కులు రాబ్సన్ నోరు నొక్కబోయారు. అతని గాన సభలను దేశ మంతటా నిషేధించారు. విదేశాలకు వెళ్ళకుండా పాస్‌పోర్ట్ నిరా కరించారు. అయినా జ్ఞాతంగానూ, అజ్ఞాతంగానూ దేశంలోనూ, దేశాంతరాలలోనూ ప్రభుత్వాలూ, అధికారులూ, సంస్థలూ, జీవన రంగంలో సర్వ విభాగాలకు చెందిన మేధావులూ రాబ్స న్ను తలకెత్తుకున్నారు. అలాంటివాడు మన గద్దర్. ‘ఫెస్క్ జూబ్లీ’ గాయకులకు రాబ్సన్ వారసుడైనట్లే, నూతన ఫక్కీలో శ్రీకాకుళ గిరిజనోద్య మానికి అక్షర రూపమిచ్చిన జముకుల కథకు జనకుడు, గాయ కుడూ అయిన పాణిగ్రాహి జానపద కళాసృష్టికీ ప్రత్యక్ష వార సుడు గద్దర్. పాణిగ్రాహి జముకుల కథలోని కథకుడైన చిన బాబు వయస్సు ఆనాటికి 14 ఏళ్ళే అయినా బుద్ధిలేని ప్రభుత్వం రైల్వే స్టేషన్లో జనం మధ్యనే అరెస్ట్ చేసి అర్ధరాత్రి అడవులలో ‘ఎన్కౌంటర్’ జరిపి ఆ ‘అభిమన్యుడి’ని పొట్టన పెట్టుకుంది! నాటి ఆంధ్ర కళారంగంలో విప్లవానికి అదే నాంది. రచ యితలను, కళాకారులను నిర్బంధించడం ఏ ప్రభుత్వ పతనా నికైనా తొలి మెట్టు అవుతుంది. అప్పుడు ఎవరికి వారే ఆలోచించుకుని కాంగో కవి ‘లెవెన్ ట్రీ’ అన్నట్టుగా ‘తన విముక్తికి తానే నడుం కడతాడు.’ కనుకనే శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంత కల్లోలానికి కలం, గళం సారథ్యం వహించిన పాణిగ్రాహి గానీ, తెలంగాణలో గిరిజన ప్రాంతాలలో దోపిడీ వ్యవస్థపై గజ్జె కట్టి గుండె చప్పుళ్ళు విన్పించిన గద్దర్ గానీ లక్షలాది జనాన్ని కదిలించారు. గద్దర్ బాణీ విప్లవ రచయితల సంఘానికి ‘పారాణి’గా అమరింది. ఆంధ్ర ప్రజా నాట్యమండలి చేతుల మీదుగా, ఒకనాటి సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో పునరుద్ధరణ పొందిన ఎన్నో జానపద కళారూపాలు ఆనాటి వాతావరణాన్ని పుణికి పుచ్చుకోగా ఇటీవల పాణిగ్రాహి, గద్దర్ చేపట్టిన కళా రూపాలు సరికొత్త ఫక్కీలో తెలుగు భారతి నొసట వీర రస గంగాధర తిలకాలు దిద్దాయి! అందుకే తెలుగు బుర్రకథను రమ్యమైన కళాఖండంగా తీర్చిదిద్ది దేశాన్ని ఊపివేసిన నాజర్ కూడా పాణిగ్రాహి, గద్దర్ ప్రయోగాలను కళ్ళ కద్దుకున్నాడు. కథకు, వర్ణనకు, హాస్యా నికి, గంభీరతకు, రౌద్రానికి, కరుణకు, కాఠిన్యానికి, బీభత్సానికి, రమ్యతకు, సభ్యతకు – ఒకటేమిటి, నవరసాలకు మించిన నవ్య పోషణకు నగలు తొడిగే సామాన్యుని నాగరికతా సంస్కృతుల నట్టింటి మాణిక్యంగా గద్దర్ బృందం దిద్ది తీర్చినదే జన నాట్యమండలి! అమరవీరులను తలచుకుంటూ అతను రాసిన ‘పాదాపాదాల పరిపరి దండాలు’, ‘సిరిమల్లె చెట్టుకింద’, ‘లాల్ సలామ్’ పాటలు, ఖవాలీ,సంగీత నృత్య రూపకాలు మరపురాని కళాస్మృతులు. గద్దర్, వంగపండు ప్రసాద్ (విశాఖ బాణీలో) ‘జజ్జనక జనారే’ అనే పాట విన్నప్పుడు ఈ జోస్టాలే 'Rumba' పాట గుర్తుకొస్తుంది! గద్దర్ అంగోలా కవి అగస్తినో నేటో లాంటివాడు. గద్దర్ రాష్ట్ర సరి హద్దులు దాటి, దండకారణ్యంలో దూకి, రాముడికి బదులు పరశు రాముడై సంచరించి, మణిపూర్, అస్సాం ఉద్యమాల ఊపిరిని కూడా పొదుగుకొని, భాషల అక్షరాభ్యాసం చేసి హైదరాబాద్‌లో మళ్ళీ పొద్దుపొడుపై వాలాడు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు – రచనా కాలం ఫిబ్రవరి 25, 1990 abkprasad2006@yahoo.co.in -
వేధిస్తున్న విపరిణామాలు
వందేళ్లలో ప్రపంచ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. ఫలితంగా వ్యవసాయోత్పత్తులు దెబ్బతింటున్నాయి. దీనివల్ల ఆహోరోత్పత్తుల ధరలు చుక్కలనంటి, ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే, వందేళ్లలో మారిన ప్రకృతి విపరిణామాల గురించి ఆలోచిస్తున్నాం సరే, మరి సమాజంలో ఇంకా మారని దుష్పరిణామాల గురించి ఆలోచిస్తున్నామా? మనుషుల మధ్య ఉన్న పెక్కు సామాజిక అసమానతలు ఇప్పటికీ తొలగిపోవడం లేదు. అంటరానితనమనే రుగ్మత ఇంకా పీడిస్తున్న పెను‘రోగం’గానే ఉంది. ‘ఎల్‌నినో’ వాతావరణాన్ని ప్రభావితం చేస్తే... కుల వ్యవస్థ, మత వ్యవస్థలు సంఘ జీవనాన్ని ఇప్పటికీ కలుషితం చేస్తూనే ఉన్నాయి. ‘‘గత వందేళ్లలోనే ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగాయి. 2100 సంవ త్సరానికల్లా అనూహ్యంగా 4 సెంటిగ్రేడ్ డిగ్రీలు పెరగనున్నాయి. కాగా, ఇంతవరకు ప్రపంచ వాతావరణ రికార్డులో లేని వేడిమి 2022లో నమోదైంది. అంతేగాదు, తరచుగా దక్షిణ ఆసియాలో బిళ్లబీటుగా ఉధృతమవుతున్న వేడిగాలులు రానున్న సంవత్సరాల్లో కూడా కొనసాగ బోతున్నాయి. ఇంతగా వేడి గాలులు భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రా లలోనే గాక, దక్షిణాది రాష్ట్రాలను కూడా అమితంగా పీడిస్తున్నాయి. ఢిల్లీని 72 ఏళ్ల చరిత్రలో ఎరగని ఉష్ణోగ్రతలు ఈ ఏడాది కుదిపేశాయి. ప్రపంచ వాతావరణంలో అనూ హ్యమైన స్థాయిలో (40 డిగ్రీల సెంటి గ్రేడ్‌కు మించి) వేడిగాలులు వీచే ఈ పరిస్థితుల్లో, భారత్, చైనా, పాకిస్తాన్, ఇండోనేసియా లాంటి దేశాల్లో బయటి పనిచేసుకుని బత కాల్సిన దినసరి కార్మికులు యమ యాతనలకు గురికావల్సి వస్తుంది. 1971–2019 సంవత్సరాల మధ్య ఇండియాను చుట్టబెట్టిన అసాధా రణ వేడిగాలుల ఫలితంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితులు మళ్లీ పునరావృతమయ్యే ప్రమాదం ఉంది.’’ – ప్రొఫెసర్స్ వినోద్ థామస్, మెహతాబ్ అహ్మద్ జాగిల్,నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఈ ‘మిడిమేల’మంతా భారతదేశాన్ని ఎలా చుట్టబెడుతోంది? మరో వైపు, గత ఏడేళ్లుగా పసిఫిక్ మహాసముద్రం నుంచి ఏనాడూ ఎరుగ నంతటి వేడి గాలులకు నిలయమైన ‘ఎల్‌నినో’ వాతావరణ దృశ్యం భారత దేశాన్ని ‘కుమ్మేస్తూ’ ముంచుకొస్తోంది. ఫలితంగా వ్యవసాయో త్పత్తులు దెబ్బతింటున్నాయి. దీనివల్ల తీవ్రమైన సామాజిక పరిస్థి తులు తలెత్తి, ఆహోరోత్పత్తుల ధరలు చుక్కలనంటి, ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని సిడ్నీ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్రాచార్యులు డేవిడ్ యుబిలావా హెచ్చరిస్తున్నారు. ‘ఎల్‌నినో’ ప్రభావం అన్ని చోట్లా ఒకే తీరుగా ఉండదు. కాకపోతే, పెక్కు దేశాలకు వర్తక వ్యాపారాల సంబంధ బాంధవ్యాలున్నందువల్ల ఆర్థికపరమైన ఒడిదు డుకులు అనివార్యమవుతాయి. కొన్నిచోట్ల కరువు కాటకాలతో పాటు, సామాజిక ఒడిదుడుకులు అనివార్యమనీ అంచనా! ఇప్పటికే మనుషుల మధ్య పెక్కు సామాజిక అసమానతలు ఉన్నాయి. అంటరానితనమనే రుగ్మత పెక్కుమందిని ఇంకా పీడిస్తున్న పెను‘రోగం’గానే ఉంది. ‘ఎల్‌నినో’ లాంటి వాతావరణం వల్ల వారి జీవితాలకు మరిన్ని అవాంతరాలు తోడవుతున్నాయి. ఈ జాఢ్యం ఇప్పుడే గాదు, ‘ఏలినాటి శని’గా మనదాకా దాపురించి ఉన్నందుననే – మహాకవి జాషువా ఏనాడో ఇలా చాటాడు: ‘‘అంటరాని తనంబునంటి భారత జాతి భువన సభ్యత గోలుపోయె... నిమ్న జాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశమును కాల్చివేయు’’ అంతేనా? తాను ‘పుట్టరాని చోట పుట్టినందుకు’ అసమానతా భారతంలో ఎన్ని అగచాట్లకు గురయ్యాడో వెలిబుచ్చిన గుండె బాధను అర్థం చేసుకోగల మనస్సు కావాలని ఇలా కోరుకున్నాడు: ‘‘ఎంత కోయిల పాట వృథయయ్యెనొ కదా చిక్కు చీకటి వన సీమలందు ఎన్ని వెన్నెల వాగు లింకి పోయెనొ కదా కటికి కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింక లీడేరెనొ కదా మురికి తిన్నెల మీద పరిమళించి ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యెనొ కదా పండిన వెదురు జొంపములలోన ఎంత గంధవహన మెంత తంగెటి జున్ను యెంత రత్నకాంతి యెంత శాంతి ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనొ పుట్టరాని చోట బుట్టుకతన...’’ ‘ఎల్‌నినో’ వాతావరణాన్ని ప్రభావితం చేస్తే... కుల వ్యవస్థ, మత వ్యవస్థలు సంఘ జీవనాన్ని ఇప్పటికీ ఎలా కలుషితం చేస్తున్నాయో ‘గబ్బిలం’ దీనావస్థ ద్వారా జాషువా వ్యక్తం చేశారు. ‘పూజారి’ లేని సమయం చూసి నీ బాధను శివుడి చెవిలో విన్నవించుకోమంటాడు. అప్పటికీ ఇప్పటికీ – పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రంగా వ్యవస్థ అవస్థ పడుతూనే ఉంది. కనుకనే జాషువా ‘ముప్పయి మూడు కోట్ల దేవతలు ఎగబడ్డ దేశంలో భాగ్యవిహీనుల కడుపులు చల్లారుతాయా’ అని ప్రశ్నించాడు! అలాగే అనేక ప్రకృతి వైపరీత్యాల నుంచి మానవుల్ని క్షేమంగా గట్టెక్కించే ఔషధాలు, వాటి విలువల్ని తొలిసారిగా ప్రపంచానికి వెల్లడించిన 18వ శతాబ్ది కవి చెళ్లపిళ్ల నరస కవి. ఒక్క ‘కరణి’ అన్న పదంతోనే (ఒక రీతి, ఒక పద్ధతి) ధరణిని శ్వాసించి, శాసించిన కవి! ఆయన గ్రంథం ‘యామినీ పూర్ణతిలకా విలాసం’ ఎన్ని రకాల ఔషధాలనో వెల్లడించింది: చనిపోయిన వారిని బతికించే ఔషధి – ‘సంజీవకరణి’, విరిగిపోయిన ఎముకల్ని అతికించేది– ‘సంధాన కరణి’, తేజస్సును కోల్పోయిన మనిషికి తేజస్సు ప్రసాదించే ఔషధం– ‘సౌవర్ణకరణి’, మనిషి శరీరంలో విరిగి పోయిన ఎముక ముక్కల్ని తొలగించేసేది – ‘విశల్యకరణి’. ఇవన్నీ నరస కవి చూపిన ప్రకృతి లోని పలు రకాల ఔషధాలు! కళల్ని మెచ్చుకుని వాటికి కాంతులు తొడిగే శిల్పుల్ని నిరసించడం తగదు గదా! ఎందుకని? ‘వానతో వచ్చే వడగండ్లు’ నిలుస్తాయా?! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
చెయ్యాల్సింది వదిలి ఇంకేదో చేస్తున్నారు!
‘‘భారత రాజ్యాంగంలో కీలకమైన 44వ అధికరణ ప్రకారం దేశానికంతకూ కలిపి ఒకే ఒక పౌర స్మృతి అమలులో ఉండాలి. ఇది లేనందుననే దేశంలోని సామాజికులలో ఐక్యత, అమలు జరగాల్సిన ఆర్థిక న్యాయం కుంటుపడి పోతున్నాయి’’ – ఎం. వెంకయ్య నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి ప్రకటన (7.7.2023) వెనకటికొకడు ‘తాడి చెట్టు ఎందుకెక్కావురా’ అంటే, కల్లు కోసమనే రీతిగా సమాధానం చెప్పకుండా ‘దూడ మేత కోసం’ అని సమాధానం చెప్పాడట. ‘ఒకే దేశం ఒకే జాతి’ అనే బీజేపీ ఎజెండాను అమలు చేయడంలో భాగంగా ‘ఉమ్మడి పౌర స్మృతి’ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిందనేది బహిరంగ రహస్యమే. అసమానతలను రూపు మాపుకునే హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. కానీ ఆ విషయాన్ని మరచి అందుకు పూర్తిగా భిన్నమైన భూస్వామ్య, పెట్టు బడిదారీ వ్యవస్థల మూలాలు చెక్కు చెదరకుండా భారత కాంగ్రెస్, బీజేపీ పాలకులు సంపూర్ణ మంత్రి వర్గాల పేరుతోనో, సంకీర్ణ ప్రభుత్వాల నాటకంతోనో ఇంతకాలం కాలక్షేపం చేస్తూ వచ్చారు. కుల, మత, వర్గ విభేదాలు ప్రజల మధ్య పెరగ డానికి, పాక్షిక రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకుని తాత్కాలికంగా గట్టెక్కడానికి ఎత్తులు, పైఎత్తులతో కాలక్షేపం చేస్తూ వస్తున్నారు. అటువంటి ఒక ఎత్తుగడే ‘ఉమ్మడి పౌర స్మృతి.’ తమ స్వార్థ రాజకీయాలను వివిధ అణగారిన ప్రజా శక్తులు ఆందోళనల ద్వారా, సమ్మెల ద్వారా, ఉధృత స్థాయిలో ఉద్యమాల ద్వారా ఎదుర్కొంటూ వస్తూండటంతో పాలక వర్గాలు అరెస్టులు, కాల్పులు, నిర్బంధ విధానాల ద్వారా ప్రజా శక్తుల్ని అణచ జూస్తు న్నారు. ఈ సందర్భంగా, ప్రజలపై నిర్బంధ విధానాన్ని అమలు జరపడం ద్వారా పాలకులు అనుసరించే ఎత్తుగడలకు విచిత్రమైన రెండు ఘటనలను చరిత్రనుంచి ఉదహరించుకుందాం: ముందుగా పాత సోవియెట్ యూనియన్‌లో చోటుచేసుకున్న సంఘటన. పంటలు పండించడంలో ఆరితేరిన ఒక రైతు ఒక మార్కెట్ స్క్వేర్‌లో నిలబడి, ‘మన వ్యవసాయ మంత్రి ఒక తెలివితక్కువ దద్దమ్మ (ఫూల్) అని అరిచాడట. అంతే ఆ రైతును అరెస్టు చేసి 10 సంవత్సరాల ఒక మాసం పాటు జైల్లో నిర్బంధించారు. అందులో ఆ రైతు, మంత్రి గారిని ‘ఫూల్’ అని అగౌరవ పరచినందుకు ఒక మాసం పాటు, ప్రభుత్వ గుట్టును రట్టు చేసినందుకు 10 ఏళ్ళూ శిక్ష విధించారు. ఇంతకూ అసలు రహస్యం – ఆ రైతు పెద్ద మంత్రిని ఎద్దేవా చేసినందుకు విధించిన జరిమానా చిన్నదే, కానీ మంత్రిని ‘పనికిమాలిన దద్దమ్మ’ అన్న విమర్శ ప్రజల మనస్సుల్ని బాగా ప్రభావితం చేసినందుకు బారీ పెనాల్టీ విధించడం జరిగిందట! అలాగే మన దేశంలో జరిగిన మరో సంఘటన చూద్దాం. ‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ... వీళ్లందరి ఇంటిపేర్లుగా మోదీ ఎలా వచ్చింది? దొంగలందరి ఇంటిపేరుగా మోదీ ఎలా వచ్చింది’ అన్న రాహుల్ గాంధీ ‘జోక్’ కూడా క్రిమినల్ కేసులో చేరిపోయింది. దీనిపైన సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ సంజయ్ హెగ్డే వ్యాఖ్యా నిస్తూ ‘జోక్‌ను, విమర్శను పరువు నష్టం కింద భావించి ఒక వ్యక్తిని అమెరికాలో జైలులో నిర్బంధించరు. ‘ఏలిననాటి శని’ లాంటి వలస చట్టం వల్ల ఇది ఇక్కడ సాధ్యమయింద’న్నారు. ‘ఏదో ఒక మోదీని అవమానించారని కాదు, మోదీలందరినీ ఉద్దేశించి అన్న సాధారణ అర్థంలో రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని కోర్ట్ శిక్ష విధించింది’ అని ఆయన వివరించారు. పలువురు వ్యక్తులను సంబోధించే క్రమంలో ఇంటి పేర్లు, వంశనామాలు పెట్టి పిలిచినంత మాత్రాన ‘పరువు నష్టం’ కింద జమ కట్టడానికి వీలు కాదన్నారు. ఈ సందర్భంగా ఆయన హోమీ మోదీ, లాలా మోదీ, సయెద్ మోదీ, పూర్ణేందు మోదీ వంటి పేర్లను ప్రస్తావించారు. భారత రాజ్యాంగానికి విశిష్టమైన వ్యాఖ్యాన పరంపర అందించిన సుప్రసిద్ధ మానవ హక్కుల పరిరక్షణా ఉద్యమ నేతల్లో అగ్రజుడైన ఉన్నత న్యాయవాది కేజీ కన్నాభిరాన్ దేశంలోని పౌరహక్కుల ఉద్యమ కార్యకర్తల్ని భూస్వామ్య పెట్టుబడిదారీ ప్రభుత్వం అన్యాయంగా అరెస్టులు చేసి, నిరా ధారమైన ఆరోపణలతో జైళ్లపాలు చేసినప్పుడు నిద్రాహారాలు లెక్క చేయ కుండా వారికి లీగల్ సహాయం అందించి విడుదలయ్యేటట్టు చేశారు. నక్సలైట్ ఖైదీల విడుదల కోసం ఏర్పడిన రక్షణ కమిటీకి కన్వీనర్‌గా పనిచేశారు. దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరును ప్రస్తావిస్తూ కన్నాభిరాన్, న్యాయ వ్యవస్థ పనిచేస్తున్న తీరును ప్రస్తావించి ఇలా వ్యాఖ్యానించారు: ‘‘దేశంలోని కోర్టులు అధికార, అనధికార స్థానాల్లో ఆధిపత్య స్థానాల్లో ఉన్న బలవంతులైన వారిని దుర్మార్గపు పరిణామాలకు బాధ్యుల్ని చేసి శిక్షించలేక పోతున్నాయి. చివరికి అణగారిన కార్మికులు ఆత్మగౌరవం కోసం పోరాడు తున్న సందర్భాల్లో కూడా అలాంటి వారి రక్షణకు కొన్ని కోర్టులు ముందుకు రావడం లేదు’’! చివరగా... చరిత్రలో కొందరు పాలకులు ప్రజలపైన, చివరికి, ప్రసిద్ధ చరిత్రకారులపైన ఎన్ని కిరాతకమైన ఆంక్షలు విధిస్తారో, దుర్మార్గాలకు పాల్పడుతుంటారో తెలియచేసే ఉదాహరణ ఒకటి చూద్దాం. చైనా చరిత్రలో ‘సీమా కియాన్’ అనే ప్రసిద్ధ చరిత్రకారుడు చక్రవర్తిని విమర్శించి ప్రజల ముందు అభాసుపాలు చేశాడు. అందుకు ఆ చక్రవర్తి ఒక దుర్మార్గమైన ‘ఆఫర్’ ఇచ్చాడు. చేసిన నేరానికి ‘ఉరిశిక్ష కావాలా లేక ఆ స్థానంలో నపుంస కుడిగా మారి పోతావా’ అని అడిగాడు. మరి తాను చరిత్రకారుడు కాబట్టి నపుంసకుడిగా ఉండిపోయి అయినా తాను ప్రారంభించిన చరిత్ర రచనను పూర్తిచేయాలనుకున్న కియాన్ నపుంసకునిగా మారడానికే మొగ్గాడు. (సైమన్ సీబాగ్ మాంటిఫియోర్ ‘ది వరల్డ్: ఎ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హుమా నిటీ’). బహుశా కారల్ మార్క్స్ మహనీయుడు అందుకే అని ఉంటాడు: ‘‘మనుషులు తమ చరిత్రను తామే లిఖించుకుంటారు. కానీ, తమ ఇష్టా ఇష్టానుసారంగా రాసుకుంటూ పోలేరు. ఎవరికి వారు తమకు తామై ఎంచు కునే సందర్భాల ప్రకారమూ రాసుకోలేరు. మరి ఏ పునాది ఆధారంగా రాస్తారు – సిద్ధాన్నంలాగా అప్ప టికే ఉన్న పరిస్థితులు ఆధారంగా, గతం నుంచి సంక్రమించిన పరిస్థితులు ఆసరాగా తప్ప మరొక మార్గం లేదు’’! అవును కదా మరి – ‘‘భూమిలోన పుట్టు భూసారమెల్లను తనువులోన పుట్టు తత్వమెల్ల శ్రమములోన పుట్టు సర్వంబు తానేను’’! abkprasad2006@yahoo.co.in -
సమాఖ్య స్ఫూర్తికి తిలోదకాలు!
రాష్ట్రాల అధికారాలను కేంద్ర పాలక వర్గ పార్టీలు మింగేయడం, ఎన్నడూ లేని విధంగా గవర్నర్ల అధికారాలకు కొమ్ములు మొలవడం బాబూ రాజేంద్ర ప్రసాద్ దేశాధ్యక్షుడిగా ఉన్నంతవరకూ మనం ఎరగం! ఆ తర్వాతి పాలక వర్గాల ఇష్టానుసార పరిపాలనకు ఉత్తరప్రదేశ్‌కు పార్లమెంటులో అత్యధికంగా ఉన్న 80 స్థానాలు ఆసరా అయి, దేశ రాజకీయాల్ని శాసిస్తూ దక్షిణాది రాష్ట్రాల్ని శాసింపజూస్తూ వస్తున్నాయి. ఆ ధోరణిలో భాగమే తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వాన్ని శాసించే విధంగా అక్కడి గవర్నర్ రాష్ట్ర మంత్రుల్ని బర్తరఫ్ చేయడానికి సాహసించడం! మరీ విచిత్రమైన విషయం.. వలసపాలనలో గవర్నర్లుగా పనిచేసిన వారు చలాయించిన అధికారాలకు, స్వతంత్ర భారతంలో గవర్నర్ల అధికారాలకు మధ్య భేదాన్ని కూడా గ్రహించలేనంతగా దృష్టి లోపంతో ఉన్నారు నేటి పాలకులు. ఒకనాడు తమదంటూ ‘చిరునామా’ కూడా లేక పరాయి పంచల్లో బతుకుతోన్న తెలుగువారిని వెన్ను తట్టి వేల సంవత్సరాల తెలుగు భాషా, సాంస్కృతిక మూలాలను గుర్తు చేసి వారిలో చైతన్యం నింపిన మహా నాయకులెందరో! ఆ నాయకులలో ఆచరణశీలురు, ఉద్యమస్ఫూర్తి ప్రదాతలు అయిన పొట్టి శ్రీరాములు, ఎన్.టి. రామారావు ముఖ్యులు. ఆంధ్రోద్యమ ఉద్ధృతిలో ఈ ఇరువురి ప్రవేశం ఉత్తరోత్తర భారతదేశ ఫెడరల్ స్ఫూర్తికే తలమానికంగా నిలిచింది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినవారిలో 112మంది కన్నడిగులు కాగా, కన్నడ తెలుగువారు 69మంది! ఈ విశిష్టతను వెల్లడిస్తూ ఒక కన్నడ తెలుగు మిత్రుడు ఒక లేఖను విడుదల చేశారు. దాని సారాంశం – ‘‘ఆంధ్ర, తెలంగాణాలు మట్టుకే తెలుగు తావులు కావు. తెలుగు నేల ఎంత పెద్దదంటే, విందెమల నుండి వానమాముల వరకూ, వంగ కడలి నుండి పడమటి కనుమల దాకా పరుచుకున్నది తెలుగు నేల. ఈ నేలను కొన్ని కోట్ల మంది తెలుగువారితో పాటు కన్నడిగులు, తమిళులు, ఒరియా, మరాఠీ, గోండీ వాళ్లూ పంచుకుని ఉన్నారు. ఈ క్రమంలో తెలుగు ‘నుడి’ అన్నది భాషా సంబంధమైన నుడికారాలు, నానుడుల సంపదలో బాగా నష్టపోయింది. తెలుగు జాతికి గల ఈ సంపదను గుర్తించాల్సింది బయటి వాళ్లు కాదు, తెలుగు వాళ్లమైన మనమే’’నని కన్నడ – తెలుగు సోదరులు జ్ఞాపకం చేయవలసి వచ్చింది! తెలుగు జాతికి గల అటువంటి సంపద గుర్తింపునకు ఉద్యమరూపంలో స్ఫూర్తిదాయకంగా నిలిచిన వారు పదహారణాల ఆంధ్రులైన పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్. దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చిందని అందరూ సంబరపడుతున్న వేళ .. ఆ ముహూర్తాన్ని ముమ్మూర్తులా అనుభవించడానికి నోచుకోనిది పరాయి పంచన జీవిస్తున్న మహోన్నత చారిత్రక, సాంస్కృతిక చరిత్ర గల ఆంధ్రులేనన్న సంగతి మరచిపోరాని ఘట్టం! నాటి చీకటి రోజుల నుంచి ఆంధ్రులను చైతన్యంలోకి, ఆచరణలో తీసుకురావడంలో పొట్టి శ్రీరాములు, ఎన్టీ రామారావుల పాత్ర అనుపమానం! అలాగే, అడుగడుగునా కేంద్ర పాలకులపైన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆధారపడే పాలకవర్గ సంస్కృతిని రాష్ట్రాలు చేధించేటట్టు చేసిన ఖ్యాతి ఎన్టీఆర్‌ది! కేంద్ర రాష్ట్ర సంబంధాలు కేవలం ఫెడరల్ సంబంధాలే గాని, కేంద్ర పాలకులకుల యుక్తులపై ఆధారపడేవి కావని చాటి చెప్పి రాష్ట్రాల ఫెడరల్ స్ఫూర్తికి దోహదం చేశారాయన. అలా పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్‌ల దూరదృష్టి ఫలితమే నేడు దేశంలోని పలు కాంగ్రెస్, బీజేపీ పాలకుల కుయుక్తులకు అడ్డుకట్టలు వేయడానికి అవకాశమిస్తోంది! రాష్ట్రాల అధికారాలను కేంద్ర పాలక వర్గ పార్టీలు మింగేయడం, ఎన్నడూ లేని విధంగా గవర్నర్ల అధికారాలకు కొమ్ములు మొలవడం డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ దేశాధ్యక్షుడిగా ఉన్నంతవరకూ మనం ఎరగం! ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీ పాలక వర్గాల ఇష్టానుసార పరిపాలనకు ఉత్తరప్రదేశ్‌కు పార్లమెంటులో అత్యధికంగా ఉన్న 80 స్థానాలు ఆసరా అయి, దేశ రాజకీయాల్ని శాసిస్తూ దక్షిణాది రాష్ట్రాల్ని శాసించజూస్తూ వస్తున్నాయి. కనుకనే తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వాన్ని శాసించే విధంగా అక్కడి గవర్నర్ మంత్రుల్ని బర్తరఫ్ చేయడానికి సాహసించడం! రాజ్యాంగ నియమాలను త్రోసిరాజని పలువురు గవర్నర్లు వ్యవహరిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణలు... మణిపూర్, త్రిపురలు! చివరికి, ఆదివాసీలు అటవీ భూముల్ని సాగు చేసుకుని బతికే హక్కును చట్టరీత్యా సుప్రీంకోర్టు ఏనాడో (1996 లోనే) అనుమతించి రక్షణ కల్పించినా, ఆ చట్టంలోని పలు రక్షణ నిబంధనలను సవరింపజేసి ఆ భూముల్ని అధికార పక్ష మోతుబరులు అనుభవించడానికి వీలు కల్పించేలా పాలకులు తాము ‘బ్రూట్’ మెజారిటీ అనుభవిస్తున్న పార్లమెంటు ఆమోదం కోసం పంపడం జరిగింది! అలాగే ఢిల్లీ చుట్టూ రాష్ట్రాల పాలకుల్ని తిప్పించాలనుకునే ‘సంస్కృతి’కి కాంగ్రెస్, బీజేపీ పాలకులు అలవాటు పడ్డారు. ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలలోని కొన్ని ప్రతిపక్ష పాలకులూ ఢిల్లీకి సలాం కొడుతున్నారు! రాజ్యాంగ ఫెడరల్ స్వభావానికి విరుద్ధమైన కేంద్ర పాలకుల ధోరణికి మరొక తిరుగులేని ఉదాహరణ... 2002లో గుజరాత్ ప్రభుత్వం ప్రజలపై అమలు జరుపుతున్న దమనకాండను నిరసిస్తూ ఉద్యమించిన నేరానికి తీస్తా సెతల్వాడ్‌ను అరెస్టు చేసి, జైలు పాలు చేసి సుప్రీంకోర్టు ఆమెకు కల్పించిన వెసులుబాటును సహితం పనిగట్టుకుని ఏళ్ల తరబడిగా వ్యతిరేకిస్తూ ఉండటం! శ్రీమతి సెతల్వాడ్ మహిళ అయినందున సి.ఆర్.పి.సి 437 నిబంధన ప్రకారం అందవలసిన సౌకర్యాలు ఆమెకు అందాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా ప్రస్తుత పాలకులు ఆమెపై వేధింపులు మానలేదు. అంతేగాదు, మరీ విచిత్రమైన విషయం.. వలస పాలనలో గవర్నర్లుగా పనిచేసిన వారు చలాయించిన అధికారాలకూ, స్వతంత్ర భారతంలో గవర్నర్ల అధికారాలకూ మధ్య భేదాన్ని కూడా గ్రహించలేనంతగా దృష్టి లోపంతో ఉన్నారు నేటి పాలకులు. కనుకనే స్వతంత్ర భారత లోక్‌సభకు సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన పి.డి.టి. ఆచార్య బ్రిటిష్ వలస పాలనలోని గవర్నర్ల పాత్రకూ, స్వతంత్ర భారత రాష్ట్రాల్లోని గవర్నర్ల పాత్రకూ స్వభావంలోనే పొసగదని తేల్చేశారు. అనేక కేసుల్లో స్వతంత్ర భారత సుప్రీంకోర్టు, స్వతంత్ర భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం లేదా ఆమోదం మేరకే రాష్ట్ర గవర్నర్లు నడుచుకోవాలని 1974 నాటి అనేక కేసులలో ఏడుగురు న్యాయమూర్తులు గల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది! (షంషేర్ సింగ్ – స్టేట్ ఆఫ్ పంజాబ్). ఈ నేపథ్యంలోనే తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి సొంత నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధ ప్రకటనలూ తమ వద్ద చెల్లవని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ బాహుటంగానే ఖండించాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యానికి, మతాతీత, సామాజిక న్యాయ వ్యవస్థకు, సమాఖ్య (ఫెడరల్) వ్యవస్థకు, లౌకిక రాజ్యాంగానికే డి.ఎం.కె కట్టుబడి ఉంటుందని స్టాలిన్ స్పష్టం చేశారు. ఎప్పుడైతే ఒక దేశం, ఒక పాలకుడు, ఒకే ప్రభుత్వం, ఒకే ఎన్నిక తన లక్ష్యమని ప్రధాని ప్రకటించారో ఆ రోజునే దేశ భవిష్యత్తుకు రానున్న ప్రమాదాన్ని చెప్పకనే చెప్పినట్టయింది. అయితే ఈలోగా సామాజిక స్పృహ కలిగిన డి.వై చంద్రచూడ్ లాంటి న్యాయమూర్తి సుప్రీంకోర్టును 2025 చివరి వరకూ అధిష్ఠిస్తారన్న ‘చేదు నిజాన్ని’ తాను భరించాల్సి వస్తుందని ప్రధాని బహుశా అనుకొని ఉండరు! అసలు విషాదం అంతా అందులోనే దాగి ఉంది! ఎందుకంటే– ఓ మహా కవి అననే అన్నాడు గదా... ‘‘చిటికెడు పేరు కోసం నీతిని నిలువునా చీల్చేస్తుంది స్వార్థం మూరెడు గద్దె కోసం జాతి పరువునే ఆరవేస్తుంది స్వార్థం!’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.i -
ప్రశ్నించే గొంతులకు సంకెళ్లా?
‘దేశద్రోహ’ నేరారోపణ అన్నది వలస పాలకుల దౌర్జన్య పాలనావసరాల కోసం ఏర్పరచుకున్న ప్రత్యేక నిబంధన. వలస పాలనానంతరం ఏర్పడిన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఈ నిబంధన చేటు కలిగిస్తోంది. 2010 నుంచీ ఇప్పటివరకూ 800కు పైగా దేశద్రోహ కేసులు నమోదయ్యాయని ‘ఎ డికేడ్ ఆఫ్ డార్క్నెస్’ డేటాబేస్ చెబుతోంది. ఈ ప్రజా వ్యతిరేక చట్టాల కొనసాగింపు కేంద్రం వరకే పరిమితం కాలేదు. కొన్ని రాష్ట్రాల పాలకులు కూడా అదే ‘అలవాటు’లో ఉన్నారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం 150 మందికిపైగా పౌర హక్కుల ఉద్యమ నాయక, కార్యకర్తలపైన సాధికారత లేని ‘ఉపా’ కేసుల్ని మోపింది. భూస్వామ్య, ధనికవర్గ ప్రయోజనాల రక్షణే పాలకుల ప్రాధాన్యమా? ‘‘దేశంలో వలస పాలన అంతరించిన తరువాత కూడా, వలస పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసం భారతదేశంలో పౌరులపైన, పౌర హక్కులపైన విధించిన ‘దేశద్రోహ’ చట్టంలోని ‘124–ఎ’ నిబంధన అమలు జరుగు తూండటం దారుణం. వలస పాలనానంతరం ఏర్పడిన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఈ నిబంధన చేటు కలిగిస్తోంది. ఈ తప్పుడు నిబంధన సృష్టించిన సమస్యను ఏ భాషా మార్పు వల్లా, నిబంధనల సరళింపు వల్లా పరిష్కరించలేము. ఎందుకంటే ‘దేశద్రోహ’ నేరారోపణ అన్నది వలస పాలకుల దౌర్జన్య పాలనావసరాల కోసం ఏర్పరచుకున్న ప్రత్యేక నిబంధన. కనుకనే స్వతంత్ర భారత సుప్రీంకోర్టు ‘124–ఎ’ దేశద్రోహ నేరా రోపణ నిబంధన స్వతంత్ర భారతంలో చెల్లదని కేదార్నాథ్ వర్సెస్ బిహార్ (1962) కేసు విచారణ సందర్భంగా కొట్టివేసింది. ఈ అత్యు న్నత న్యాయస్థానం నిర్ణయాన్ని పాలకులు అమలు జరిపి ఉంటే – ప్రభుత్వాన్ని విమర్శించిన నేరానికి లేదా అలాంటి విమర్శను ప్రసారం చేసే వీడియోలు విన్న నేరానికి లేదా అలాంటి పాటలు విన్న నేరానికి దేశ పౌరులపైన దేశద్రోహ కేసులను పాలకులు మోపి ఉండేవారు కాదు. ఇప్పటిదాకా రాజ్యాంగంలోని 14వ అధికరణ కింద 2010 నుంచీ ఇప్పటి వరకూ 800కు పైగా దేశద్రోహ కేసులు నమోదయ్యాయి.’’ – లభ్యతి రంగరాజన్ (ఇప్పటివరకూ దేశంలో నమోదైన ‘దేశద్రోహ’ కేసులను పరిశీలించి, వాటిని ‘ఓ దశాబ్దపు చిమ్మ చీకటి’ (ఎ డికేడ్ ఆఫ్ డార్క్నెస్) పేరిట ఏర్పాటుచేసిన డేటాబేస్ సాధికారికంగా నమోదు చేసింది. దీనికి లభ్యతి రంగరాజన్ ఎడిటర్‌గా ఉన్నారు.) దేశ పాలకులూ, వారి ఇష్టానుసారం మెలగుతున్న పాలనా యంత్రాంగమూ పుర్రెకు పుట్టిన బుద్ధి ప్రకారం పౌర సమాజాన్ని ఇబ్బంది పెట్టవచ్చా? అనుకూలమైన వలస చట్టాల చాటున అనేక రకాల నిర్బంధాలకు గురి చేయవచ్చునని ‘పెగసస్’ విదేశీ స్పైవేర్ కొనుగోలు చేసినప్పుడే ఇది నిరూపితమైంది. ఈ ప్రజా వ్యతిరేక చట్టాల కొనసాగింపు కేంద్రం వరకే పరిమితం కాలేదు. అలాంటి చట్టా లపై ఆధారపడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు, పాలకులు కూడా అదే ‘అల వాటు’లో ఉన్నారు. ఉండబట్టే తాజా పరిణామాలలో భాగంగా దేశవ్యాప్తంగానూ, విదేశాల్లోనూ ఖ్యాతి పొందిన సుప్రసిద్ధ విద్యావేత్త, సంస్కర్త, పౌరహక్కుల ఉద్యమ నాయకులలో ఒకరు అయిన ప్రొఫె సర్ హరగోపాల్ సహా దాదాపు 150 మందికిపైగా పౌర హక్కుల ఉద్యమ నాయక, కార్యకర్తలపైన సాధికారత లేని ‘ఉపా’ కేసుల్ని మోపి పాలకులు తమ ‘చెవి దురద’ తీర్చుకున్నారు. ఆ ‘దురద’ను అంత త్వరగానూ తొలగ గొట్టుకోవడానికి తంటాలు పడ్డారు. ఏ ‘నేరం’పైన ఈ కుట్ర కేసు బనాయించవలసి వచ్చిందో స్పష్టత లేదు. కాగా, ఫక్తు తెలంగాణ వాసి, భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినా ఆ వాసనకు దూరంగా ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి, తాను పుట్టి పెరిగిన ఫ్యూడల్ సంప్రదాయాల్ని కాలదన్నిన వారు బి.నరసింగరావు. తెలంగాణలో తన ప్రజలు అనుభవించిన భూస్వామ్య దాష్టీకాలను కళ్లారా చూసి మనసు చెలించి, ‘దాసి’ చలన చిత్రం ద్వారా ధనిక వర్గ దుర్మార్గాన్ని ఎండగట్టి దేశంలోనే గాక అంతర్జాతీయంగానూ ఆయన ఖ్యాతి గడించారు. అలాంటి నేలతల్లి బిడ్డకు కూడా పాలకులు ‘ఇంటర్వ్యూ’ ఇవ్వడానికే జంకారు, కాదు భయపడ్డారు, లేదా బిడియపడ్డారు! ఎందుకు? నాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోనే తెలంగాణకు నిజమైన రక్షణ ఉందని ఆయన ప్రకటించినందుకు! పేరుకు తగ్గట్టే ఆయనది తెలంగాణలోని ‘ప్రజ్ఞాపురం’. వాస్తవం ప్రకటించినందుకు తనకు ఇంటర్వ్యూను నిరాకరించిన నేటి తెలంగాణ పాలకులను ప్రశ్నిస్తూ నరసింగరావు ఎక్కడ పుట్టిన ‘కమలం’ ఇది అని ప్రశ్నించడం కొంత బాధాకరమైనదైనా అది తనకు జరిగిన అవమానాన్ని వ్యక్తం చేయడానికి ఉద్దేశించింది మాత్రమేనని భావించాలి. భారత లౌకిక రాజ్యాంగం నిర్దేశించి నెలకొల్పిన సుసంప్ర దాయాలు ఎన్నో ఉన్నా వాటిని తృణీకరించి ప్రజా వ్యతిరేక పాలనను డొల్లించుకుపోతున్న పాలకులకు ‘ముగుదాడు’ వేయగల ప్రజా స్వామిక న్యాయ వ్యవస్థ ఇప్పుడు ఉన్నందున, పాలకులు, పాలనా వ్యవస్థ కొంతమేర అదుపులో ఉన్నట్టు కన్పిస్తోంది. కానీ లోపాయికారీ పద్ధతుల్లో దేశంలోని ఫెడరల్ వ్యవస్థ ప్రయోజనాల్ని దెబ్బతీయడానికి మరోవైపు నుంచి మతవాద, మితవాద శక్తులు చీలుబాటలవైపే ప్రయాణిస్తూ వ్యవస్థను అస్థిరం చేస్తున్నాయని మరచిపోరాదు. అంత కన్నా ఎన్నటికీ మరవరాని అంశం – రాజ్యాంగంలో పొందుపరచు కున్న ప్రజాహిత సూత్రాలను అమలు చేయించుకోగల హక్కును దేశ పౌరులకు లేకుండా చేశారు. కారణం స్పష్టమే. భూస్వామ్య, ధనికవర్గ ప్రయోజనాల రక్షణకే పాలకుల ప్రాధాన్యం. నేడు రాజ్యాంగమూ, దాని ప్రయోజనాలనూ కేవలం కొద్దిమంది కార్పొరేట్ అధిపతులు, వారికి కొమ్ముకాస్తూన్న పాలక వర్గమే అనుభవిస్తోందని ప్రజలు భావిస్తున్నారు. తొల్లింటి అరకొర ప్రజానుకూల ప్రణాళికా వ్యవస్థ కూడా ఈ రోజున కూలిపోయింది. అందుకే కూలిపోయే వ్యవస్థను కాపాడ్డానికే దాని రక్షకులైన పాలక వర్గాలు ‘కంకణం’ కట్టుకుంటారు. మహాకవి శ్రీశ్రీ దశాబ్దాల క్రితమే రానున్న పరిణామాల్ని గురించి ముందస్తు హెచ్చరిక చేశారు: ‘‘విభజన రేఖను రక్షించడానికే న్యాయస్థానాలు, రక్షక భట వర్గాలు చెరసాలలు, ఉరి కొయ్యలు’’ అని చెబుతూనే – ‘‘అభిప్రాయాల కోసం బాధలు లక్ష్యపెట్టనివాళ్లు మాలోకి వస్తారు అభిప్రాయాలు మార్చుకొని సుఖాలు కామించేవాళ్లు మీలోకి పోతారు’’ అనీ ప్రకటించారు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
వాదోపవాదాల విషాదం
రైల్వే సిగ్నల్స్ నిర్వహణ వ్యవస్థపై నిరంతరం కన్నువేసి, ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఉండకపోతే రైలు ప్రమాదాలు తరచూ సంభవించే అవకాశం ఉందని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నైరుతి రైల్వే ప్రధాన అధికారి హెచ్చరించారు! అలాగే, రైలు ప్రయాణికుల భద్రత గురించి ‘కాగ్’, పార్లమెంటరీ స్థాయీ సంఘం అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ సంబంధిత కేంద్ర కమిటీలు, ఉన్నతస్థాయి విచారణ సంఘాల నివేదికలను అధికారులు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? రైళ్లు ఢీకొనకుండా ‘కవచ్’ రక్షణ వ్యవస్థను రూపొందించినా, బ్రాడ్‌గేజ్ రైల్వే మార్గాల్లో కాపలా లేని లెవెల్ క్రాసింగ్స్‌ను కూడా తొలగించినా రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ లోపాల్ని పరిష్కరించడానికి ప్రయత్నించే బదులు.. మంత్రులు రాజీనామాలు చేయాలని, కాదు కాదు... కింది తరగతి రైల్వే ఉద్యోగుల్ని, కార్మికుల్ని శిక్షించాలని వాదోపవాదాలకు దిగడం కూడా విషాదమే! ‘‘వందలాదిమంది ప్రయాణికుల దుర్మరణానికి దారి తీసిన ఒడిశా రైలు ప్రమాదానికి కారకులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ శతాబ్దంలోనే ఇది అతి పెద్ద ప్రమాదం.’’ – ప్రధాని నరేంద్ర మోదీ (4.6.2023) ‘‘చాలాకాలంగా భారత రైల్వేలోని సిగ్నలింగ్ వ్యవస్థ నిర్వహణలో ఉన్న తీవ్రమైన లోపాల గురించీ, వైఫల్యాల గురించీ, రైళ్ల రాకపోకలను తెలియజేసే గుర్తులను సూచించే సరైన పద్ధతుల గురించీ; రైలు బయలుదేరిన తరువాత, రైలు వెళ్లే దిశను మార్చవలసి వస్తే ఆ మార్పును సూచించే గుర్తును తెలిపే విధానం గురించీ స్పష్టంగా ఉంది. కానీ నిర్దిష్టమైన సిగ్నల్స్‌ను అనుసరిస్తూ లోపాల్ని తక్షణం సవరించకపోతే – రైలు దుర్ఘటనలు అనివార్యమవుతాయి...’’ అని కూడా నైరుతి రైల్వే ప్రధాన అధికారి ఈ ఏడాది ఫిబ్రవరి 9 న హెచ్చరించారు. అంతేగాదు, రైల్వే సిగ్నల్స్ నిర్వహణ వ్యవస్థపై నిరంతరం కన్నువేసి, సరిదిద్దుకుంటూ ఉండకపోతే రైలు ప్రమాదాలు తరచూ సంభవించే అవకాశం ఉందని ఆ ఉన్నతాధికారి హెచ్చరించారు. అలాగే, రైలు ప్రయాణికుల భద్రత గురించి ‘కాగ్’, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికల హెచ్చరికలను పాలకులు పెడచెవిన పెట్టడానికి కారకులెవరన్న ప్రశ్నలకూ సమాధానం లేదు! ఈ పై కారణాలను పరిశీలించినప్పుడు ఎవరిని నిందించాలి? పాలకుల ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర కమిటీలు, దఫదఫాలుగా నియమించిన సాధికార ఉన్నతస్థాయి విచారణ సంఘాల నివేదికలను, వాటి సారాంశాన్ని అధికారులు ఎందుకు పాటించడం లేదన్నది అసలు ప్రశ్న. రైలు ప్రమాద ఘటన సందర్భంగా, మహబూబ్‌నగర్ వద్ద రైలు ప్రమాదంలో 112 మంది ప్రయాణికులు చనిపోయినందుకు విలవిలలాడిన నాటి కేంద్ర రైల్వే మంత్రి, గాంధేయవాది అయిన లాల్ బహ దూర్ శాస్త్రి తన పదవికి క్షణాలలో రాజీనామా చేసి ఆదర్శంగా నిలబడ్డారు. ప్రధాని పండిట్ నెహ్రూ ‘వద్దని’ వారించినా లాల్‌బహదూర్ రాజీనామాకే పట్టుబట్టారు! మహబూబ్‌నగర్ దుర్ఘటన తరువాత కొలది రోజులకే తమిళనాడులోని అరియలూర్ దుర్ఘటనలో 144 మంది చనిపోయారు. ఈ రెండు ఘటనలూ లాల్‌బహదూర్‌ను కుదిపేశాయి. 68,100 కిలోమీటర్ల నిడివిగల రైల్వే లైన్లతో కూడిన భారత వ్యవస్థలో గత 15 ఏళ్లలో జరిగిన ప్రధాన దుర్ఘటనలు: జ్ఞానేశ్వర్ ఎక్స్‌ప్రెస్ (మృతులు 148), ఉత్తర బంగా–వనాంచల్ ఎక్స్ ప్రెస్ (63 మంది), ఛాప్రా–మథుర ఎక్స్‌ప్రెస్ (63 మంది), హుబ్లీ–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (25మంది), తమిళనాడు–ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ (30), యూపీ సంత్‌కబీర్–గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ (25), డెహ్రాడూన్–వారణాసి జనతా ఎక్స్‌ప్రెస్ (30), పాట్నా–ఇండోర్ ఎక్స్‌ప్రెస్ (150), బికనీర్– గౌహతి ఎక్స్‌ప్రెస్ (9 మంది), హౌరా–న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (140). రైళ్లు ఢీకొనకుండా ‘కవచ్’ రక్షణ వ్యవస్థను రూపొందించినా, బ్రాడ్‌గేజ్ రైల్వే మార్గాల్లో కాపలా లేని లెవెల్ క్రాసింగ్స్‌ను కూడా తొలగించినా రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అదుపాజ్ఞల వ్యవస్థ పకడ్బందీగా లేనందున జరుగుతున్న ఈ వరస రైలు దుర్ఘటనల నివారణకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా అక్కరకు రావడం లేదు. అంటే సిబ్బందికి ఇచ్చే శిక్షణలో కూడా లోపం ఉందని పలువురు రైల్వే అధికారుల నోట కూడా వినవస్తోంది. కానీ ఈ తీవ్ర లోపాల్ని పరిష్కరించడానికి ప్రయత్నించే బదులు కింది తరగతి రైల్వే ఉద్యోగుల్నీ, కార్మికుల్నీ శిక్షించే మార్గాలను పాలకులు వెతకడానికి ప్రయత్నించడం సమంజసం కాదు. ఒకవైపున రైల్వేబోర్డే సిగ్నలింగ్‌లో లోపం వల్ల ఒడిశా రైలు ప్రమాదం జరిగిందని చెబుతున్నప్పుడు, ప్రమాద కారణాల్ని కార్మిక సిబ్బందిపైకి నెట్టడానికి ప్రయత్నించడం సరి కాదు. ఆధునిక పరిజ్ఞానం ఆకళింపులో ఉన్నా మానవుల స్వయం పరిమితుల్ని కూడా గమనించుకోవాలి. అక్కడికీ ఒక సీనియర్ రైల్వే అధికారి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు: ‘‘ఇంటర్ లాకింగ్‌లోని సాఫ్ట్ వేర్ లేదా హార్డ్ వేర్ పనిచేయడంలో సంభవించే లోపం వల్ల కూడా రైళ్లకు సూచించవలసిన లూప్‌లైన్, మెయిన్ లైన్ ఎంపికలో గందరగోళానికి అవకాశం ఉంది. అంటే సిగ్నల్ ఒకటై, స్విచ్ ఆపరేషన్ వేరైతే ఈ ప్రమాదానికి ఆస్కారం ఉంది (5.6.23). ఈ ఘోరానికి రైల్వేమంత్రి రాజీనామా పరిష్కారం కాకపోవచ్చుగాని, ఆ స్థానంలో మరొకర్ని విచారణ పేరిట తేలిగ్గా ఇరికించే అవకాశం ఉంది. ఇంతకూ మనిషి (మంత్రి కూడా మనిషే అయితే) స్వార్థం ఎలా పనిచేస్తుందో కవి ‘సినారె’కు బాగా తెలిసి నట్టుంది: ‘‘తోడుగ సాగే నీడను కూడా వాడుకుంటుంది స్వార్థం ఆపై వాణ్ణే పాచిక చేసే ఆడుకుంటుంది స్వార్థం మనిషిలోని ఆ చీకటి కోణం మార్చే వేషాలెన్నో – చిటికెడు పేరుకు నీతిని నిలువున చీల్చేస్తుంది స్వార్థం మూరెడు గద్దె కోసం జాతి పరువునే ఆరవేస్తుంది స్వార్థం!’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
New Parliament Building: ఎన్నికల దండమా?
‘కర్రపుల్ల’తో అధికారం నిలబడాలేగానీ, దాని కోసం వెంపరలాడే ముందుపీఠిలో రాజకీయ నాయకులే ఉంటారు. ఏ రుజువులూ లేకపోయినా ‘సెంగోల్’ కర్రపుల్లని ‘రాజదండం’గా తెరమీదకు తెచ్చారు. కర్ణాటక తమ చేజారిపోగా, ఇప్పుడు రంగం తమిళనాడుకు మారింది. ‘సెంగోల్’ పదం ‘సికోలు’ నుంచి వచ్చింది. దీనికి జనసామాన్యంలో అర్థం చర్నాకోల అనే. దాన్ని ఎవరి మీద ఝళిపించాలి? మన దేశంలో ఇంకా ‘భారత ప్రజలమైన మేము’ అని సగర్వంగా తొల్లింటి దేశ లౌకిక రాజ్యాంగానికి సమ్మతిని ప్రకటిస్తూ, భారత రిపబ్లిక్కు ముందుమాటగా చేసిన ప్రతిజ్ఞకు విలువ ఉందా? రాజ్యాంగం 368వ అధికరణ ప్రకారం, లౌకిక రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చడానికి ఏ విభాగానికీ హక్కు లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం కేశవానందభారతి, ఇందిరాగాంధీకి సంబంధించిన కేసులలో స్పష్టం చేసింది. బహుళ సంస్కృతులకు, విభిన్న మత విశ్వాసాలకు భారత సెక్యులర్ (లౌకిక) రాజ్యాంగ వ్యవస్థ నిలయమని స్పష్టం చేసింది. 14–16 అధికరణల కింద సమాన శ్రమకు సమాన వేతనం పొందే హక్కు ఉందన్న రాజ్యాంగ హక్కును 1979 నుంచి 1990 మధ్యకాలంలో ఆరు కేసులలో సుప్రీంకోర్టు ఖాయ పరిచింది. ఈ కేసుల న్నింటిలోనూ ఉన్నత న్యాయస్థానాలు రాజ్యాంగం తొలి ప్రతిజ్ఞకే కట్టుబడి ఉన్నాయి. కట్టుబడనిదల్లా కొన్నాళ్లు కాంగ్రెస్ పాలకవర్గమూ, ఆ తరువాత వాజ్‌పేయి హయామును మినహాయించి మిగతా ‘హిందూత్వ’ పాలక వర్గాలూ! వీటన్నింటి దుష్ఫలి తంగా – చివరికి దేశ సర్వ సేనాపతి, రాజ్యాంగ సంరక్షకులైన రాష్ట్రపతి హోదానే కించపరిచే దుఃస్థి తికి నేటి పాలకవర్గం పాల్పడింది. ఈ ‘డ్రామా’ కోసం విశ్వసనీయమైన రుజువులూ, పత్రాలూ లేక పోయినా ‘సెంగోల్’ను కనిపెట్టారు. నిజానికి ‘కర్రపుల్ల’తో అధికారం నిల బడాలే గానీ, ఆ ‘పుల్ల’ కోసం వెంపరలాడే ముందుపీఠిలో రాజకీయ నాయకులే ఉంటారు. ‘సెంగోల్’ కర్ర పుల్లను ‘రాజదండం’గా చిత్రించడానికి చరిత్రకా రులైన శివనాగిరెడ్డిని, బాజ్జీరావును సహాయం కోరడం మరీ విచిత్రం. ‘నంది’ ధ్వజ రూపంలో ఉన్న ‘సెంగోల్’ పదానికి అర్థం వేరని ఎవరోగాదు, ఆ చరిత్ర పరిశోధకులే దాచుకోకుండా వెల్లడించాల్సి వచ్చింది. అసలు ‘సెంగోల్’ పదం ‘సికోలు’ పదం నుంచి వచ్చింది. చోళుల కాలం నుంచి ఈ ‘సికోలు’కు జనసామాన్యంలో అర్థం చర్నాకోల అనే. ఇది లేకుండా పరిపాలన నడవదా? ఒకవేళ అది చేతిలో ఉన్నా ఎవరిమీద ఝళిపించాలి? అన్ని రాజ్యాంగ గ్యారంటీలను నేడు కోల్పోతున్న సామాన్య పౌరుల మీదా? పౌర హక్కుల ఉద్య మాల మీదా? మహిళా క్రీడాకారుల మీదా? వారిని లైంగిక దృష్టితో న్యూనపరచడానికి ప్రయత్నించి ఎదురుబొంక జూచిన బీజేపీ ఎంపీ మీదనా? పాల కుల నుంచి ఈ క్షణం దాకా సమాధానం లేదు, రాదు. అయినా పాలకుల దృష్టి మాత్రం ‘దంత కథ’గా మిగిలిపోయిన ‘సెంగోల్’ రాజదండంపై నుంచి తొలగదు. ఆ మాటకొస్తే ఆది నుంచీ, తలపెట్టిన నూతన పార్లమెంట్ భవన నిర్మాణం కూడా మోదీ అడుగు ల్లోనే సాగుతూ వచ్చింది. అప్పుడూ దేశాధిపతి రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని ఆహ్వానానికి దూరం చేశారు. రాష్ట్రపతిగా తన ప్రతిపత్తికి బాహాటంగా జరుగుతున్న అవమానాన్ని ఆమె దిగమింగుకున్నా చూసే ప్రజలు మాత్రం పసిగట్టేశారు. ఇప్పుడిక దేశానికి తొల్లింటి ప్రకటిత లౌకిక రాజ్యాంగం లేదు. ‘భారత ప్రజలమైన మేము’ అని ప్రకటించుకోగల సత్తాను క్రమంగా కోల్పోవలసిన దుఃస్థితులు దాపురించాయి. తొల్లింటి లౌకిక రాజ్యాంగం ఇంకా బతికి ఉండాలన్నా; ప్రజల, పీడిత వర్గాల, దళిత, బహుజన వర్గాల మౌలిక ప్రయోజనాలు నెరవేరి, మనుగడ నిలవాలన్నా; తాము మరింత చైతన్యం పొందే వరకూ నేటి పరి స్థితుల్లో విశ్వసనీయమైన ఏకైక దుర్గం – 2025 ఆఖరి దాకా భారత సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిగా చైతన్యమూర్తి అయిన చంద్రచూడ్ కొనసాగడం. ఈ అవకాశాన్ని బలవంతంగా మార్చడానికి పాలక శక్తులు రకరకాల ‘విన్యాసా ల’కు పాల్పడతాయి. వాటిలో ఒకటి ఎలాంటి అధి కారాలు లేని అనధికార ‘దళాలు’. పిలిస్తే చాలు ‘కేరాఫ్’ రోడ్స్! చూడరాదూ–ఉన్నట్టుండి, నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవమూ, గాంధీజీ హత్యకు ప్రణాళిక పన్నాడన్న ఆరోపణను అనివార్యంగా భరించాల్సి వచ్చిన ‘హిందూత్వ’ సిద్ధాంతకర్తలలో ఒకరైన సావర్కార్ జన్మదినాన్ని నూతన పార్లమెంట్ ఆవిష్కరణ రోజునే జరపడమూ, పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అదే రోజున సావ ర్కార్‌కు నివాళులు అర్పించడమూ జరిగింది. అన్నింటికన్నా గమనించదగిన అంశం – సెక్యులర్ రాజ్యాంగం కళ్ల ఎదుటనే యజ్ఞాలు, పూజ పునస్కారాలతో సర్వకార్య క్రమాలకు తెరలేపడం. దక్షిణాదిని ఉత్తరాది ‘జయించే’ విశ్వ ప్రయత్నా లలో తొలిమెట్టుగా కర్ణాటక రాష్ట్రం బీజేపీ చేజారిపోగా, ఇప్పుడు రంగం పక్కనున్న తమిళనాడుకు మారింది. తమిళనాడును జయించే మార్గాలలో భాగంగానే సంబంధం లేని ‘రాజ దండం’గా ప్రచారంలోకి ఎక్కిన ‘సెంగోల్’ దుడ్డు కర్ర కొంతమంది ‘స్వాముల’ ద్వారా చేతికి చిక్కింది. ఫ్యూడల్ సంస్కృతి, పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు అవలక్షణాలు కలగలిసి పోయిన వ్యవస్థలో నిజం కోసం తాపత్రయం మాత్రం ఆగదు. ‘నిరుద్ధ భారతం’ రచనలో దేశభక్తుడైన మంగిపూడి వెంకటశర్మ ‘శ్రుతి ప్రమాణములు జాతులు నాలు గెయంచు చెప్పగా ఐదవ జాతి ఎక్క డిదొ? ఆర్య మహా జనులార, చెప్పరే’ అని సూటిగా ప్రశ్నించాడు. ‘నాస్తితు పంచమః’ (పంచమజాతి అంటూ ఏదీ లేదు) అని మనుస్మృతి చెప్పినా చెవుల్లో పోసుకున్న ‘సీసం’ బయటకు రాదు. పాబ్లో నెరూడా వీరుల గురించి అంటాడు: ‘వాళ్లు చని పోలేదు, కాల్చే తుపాకీ గొట్టం ముందు నిటారుగా నిలబడ్డార’ని! అలాగే మన కవి శివసాగర్... పీడనా దోపిళ్ల నుంచి, ప్రజాకంటకుల నుంచి జన సామా న్యాన్ని విముక్తం చేసి సామ్యవాద ప్రజాస్వామిక యుగాన్ని ఆవిష్కరిచుకోవల్సిన అవసరాన్ని గుర్తు చేశాడు (‘అమరత్వం’ కవిత): ‘‘విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది చిన్నారి పువ్వు రాలిపోతూ చిరునవ్వుతో కాపును వాగ్దానం చేసింది... సూర్యాస్తమయం చేతిలో చేయివేసి సూర్యోదయాన్ని వాగ్దానం చేసింది అమరత్వం రమణీయమైంది అది కాలాన్ని కౌగిలించుకొని మరో ప్రపంచాన్ని వాగ్దానం చేసింది.’’ అదే రేపటి సామ్యవాద ప్రజాస్వామిక యుగావిష్కరణం కావాలి. అంతేగానీ కావలసినవి అభినవ రాచరికాలూ, రాజదండాలూ కాదు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఆర్థిక వ్యవస్థకు జీవం పోసేనా?
బ్రిటిష్ వలస పాలకులు కూడా పేద వర్గాల ఉద్ధరణ కోసం చేయవలసిందంతా చేస్తున్నామని కోతలు కోసేవారు. అవే మాటల్ని దేశ స్వాతంత్య్రం తరువాత ఏర్పడిన దేశీయ ప్రభుత్వం కూడా చెప్పింది. అవే ఇప్పటికీ కేంద్ర పాలకులు చెబుతారు. ప్రపంచ బ్యాంకు విధాన ఒరవడిలో పెట్టుబడి విధానాల్ని ఆశ్రయించే దేశాల పాలకులందరిదీ ఇదే తంతు. కానీ ఈ రాజకీయవేత్తలకు తమ ‘అమాయక మనస్తత్వం’ నుంచి బయటపడటం ఇష్టం ఉండదు. అది రోగ నివారణకు అందనంత పెద్ద జబ్బు. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు ‘జీవం పోసే’ పేరిట 2000 నోట్ల కట్టల ఉపసంహరణ తతంగానికి తెరలేపారు. రూ. 2 కూడా చేతిలో ఆడని అసంఖ్యాక కష్టజీవులకు దీనివల్ల కలిగే ప్రత్యేక లాభం ఏముంటుంది? ‘‘ఈ దేశ ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంచగల సర్వ సంపదలూ దేశంలోనే ఉన్నాయి. కానీ అవి అందరికీ సమస్థాయిలో అందుబాటులోకి రాకపోవడానికి కారణం – ఈ సంపదంతా తమ హక్కు భుక్తం కావాలన్న కొలదిమంది సంపన్న స్వార్థపరుల అవధులు లేని గొంతెమ్మ కోరికలేనని మరచిపోరాదు.... దేశ స్వాతంత్య్రం తరువాత ఏర్పడిన దేశీయ ప్రభుత్వం కూడా తాను పేద వర్గాల ఉద్ధరణ కోసం చేయవలసిందంతా చేస్తున్నానని బీరాలు పలకవచ్చు. కానీ, బ్రిటిష్ వలస పాలకులు కూడా అలాంటి కోతలే కోసేవారు. కానీ అసలు రహస్యం – పేద ప్రజల ప్రయోజనాలు మాత్రం నెరవేరక పోవడం. ఈ సత్యాన్ని స్వతంత్ర భారత పాలకులు వినమ్రతతో అంగీకరించి తీరాలి.’’ – జాతిపిత గాంధీజీ (1947 డిసెంబర్ 11); ‘ది హిందూ’ ప్రచురించిన ‘మహాత్మాగాంధీ: ది లాస్ట్ 200 డేస్’ నుంచి. ‘‘సంపన్నుల చేతిలో అంత అధికారం ఎలా గూడు కట్టుకుంది? పాలకులు ప్రయివేట్ కార్పొరేషన్ల పైన, సంపన్నుల ఆస్తుల పైన శ్రుతి మించిన ఆదాయంపై విధించే పన్నుల్ని తగ్గించి వేయడంవల్ల! మరోవైపున శ్రమజీవులైన కార్మిక సంఘాలను అణచి వేయడం ద్వారా వారి కనీస వేతనాన్ని ద్రవ్యోల్బణం ద్వారా కోత పెట్టేయడం రివాజుగా మారింది.’’ – ప్రసిద్ధ ఆర్థికవేత్త పాల్ క్రూగ్మన్ 2016లో అకస్మాత్తుగా బీజేపీ పాలకులు పెద్ద నోట్ల చలామణీని అదుపు చేసి దేశాన్ని ద్రవ్యోల్బణం నుంచి కాపాడుతామని బీరాలు పలికి తాము చతికిలపడటమే గాక కోట్లాదిమంది సామాన్య ప్రజలను కష్టాల్లోకి నెట్టేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజలు తేరుకోలేదు. ఈలోగానే ‘పెద్ద నోట్ల భారం’ పేరిట వాటిని చలామణీ నుంచి ఉపసంహరించే పేరిట గతంలో 500, 1000 నోట్లకు ఎసరు పెట్టినట్టే ఇప్పుడు రూ. 2000 నోట్లపై యుద్ధం ప్రకటించారు. 2016లో ‘పాకిస్తాన్‌పై యుద్ధం కోసం’ పెద్ద నోట్ల చలామణీని అదుపు చేస్తే, ఈ రోజు దాకా తేరుకోకుండా కునారిల్లుతూ వస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ‘జీవం పోసే’ పేరిట 2000 నోట్ల కట్టల ఉపసంహరణ తతంగానికి తెరలేపారు. సామాన్య ప్రజాబాహుళ్యం మౌలిక ప్రయోజనా లకు రూ. 2000 నోటు ఉపసంహరణ వల్ల ప్రత్యక్షంగా నష్టం కలగక పోవచ్చు. అయితే పరోక్షంగా ఎన్నికల పేరిట రాజకీయ పార్టీలు పోటాపోటీలతో అనుసరించే ఎత్తుగడల నుంచి మాత్రం రెండువేల రూపాయల నోటు తొలగిపోదు. లోపాయకారీగా ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. కేవలం పాలకపక్ష నాటకంగా పైకి కనిపించినా, పరోక్షంగా ప్రతిపక్షాల ప్రయోజనాలు నెరవేర్చడంలో కూడా ‘రెండు వేల నోటు’ ఉపయోగపడుతుందని మరచిపోరాదు. గతంలో రూ. 1000, రూ. 500 నోట్ల రద్దు వల్ల ‘నల్ల ధనం, నకిలీ నోట్లు’ చలామణీ నుంచి తప్పుకున్న దాఖలాలు లేవు. అలాగే విదేశీ బ్యాంకుల్లో ఏళ్ల తరబడిగా తలదాచుకుంటున్న భారత పెట్టుబడి దారుల దొంగ డబ్బును దేశానికి తీసుకొచ్చి, భారత ప్రజలకు లక్షలు, కోట్లు పంచిపెడతానన్న ప్రధాన మంత్రి మాట ‘నీటి మూట’గా ఎలా మారిందో ప్రజలు చూశారు. ఈ సందర్భంగా నాటి రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా ఉన్న రఘురామ్ రాజన్ పాలకుల నిర్ణయాల్ని నిరసించి, ‘దేశాన్ని ఆర్థిక సంక్షోభం’లోకి పాలకులు నెట్టబోతున్నారని ప్రజల్ని హెచ్చరించి మరీ గవర్నర్ పదవికి రాజీనామా చేసి అమెరికాలో కొలువుకి ‘చెక్కేయ’వలసి వచ్చింది. రాజన్ హెచ్చరికలు దేశానికి ముందస్తు మెలకువలయ్యాయి. అయినా పాలకులలో చలనం లేదు. సుప్రీం కోర్టు కూడా ‘ఆరేళ్ల తర్వాత ఇప్పుడు కాలాన్ని వెనక్కి తిప్పలేమన్న’ తీవ్ర నిరాశను బాహాటంగానే వ్యక్తం చేసింది. ఆసియా, ఆఫ్రికా వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు స్వతం త్రంగా, ఎలాంటి ‘ఉచ్చులు’ లేకుండా బతకవచ్చునో జూలియస్ నైరేరి అధ్యక్షతన ఏర్పడిన ‘సౌత్ కమిషన్’ నిరూపించింది (1990 రిపోర్టు). కాంగ్రెస్ హయాంలో ప్రధాని హోదాలో నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఆ రిపోర్టును ఆహ్వానించి కూడా ఆచరణలో అమలు చేయలేకపోయారు. ఇదిలా ఉండగా – ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు అన్నార్తులైన ప్రజాబాహుళ్యంపై ఎక్కుపెట్టిన దారి దోపిడీ పద్ధతుల వల్ల ఆయా ఖండాల ప్రజలు ఎలా ఆర్థికంగా కునారిల్లి పోయారో ఆ సంస్థల ఆదేశంపై వాటి తరఫున ఆ దేశాలలో పని చేసిన వైస్ ప్రెసిడెంట్ డేవిసన్ బుధూ తన అనుభవాలను అమితమైన దుఃఖంతో అక్షరబద్ధం చేశారు. ‘‘ఈ ఖండాలలో కోటానుకోట్ల పేద ప్రజలు పట్టెడన్నం కోసం మాడుతున్నారు. అన్నార్తుల రక్తంతో తడిసిన మా అధికారుల చేతులను కడగటానికి ప్రపంచంలో ఉన్న సబ్బులన్నీ చాలవు’’ అని ప్రకటించారు! ‘రూ. 2000’ పెద్ద నోటును సర్క్యులేషన్ నుంచి కట్టడి చేసినంత మాత్రాన రూ. 2లు కూడా చేతిలో ఆడని అసంఖ్యాక సామాన్య కష్టజీవులకు కలిగే ప్రత్యేక లాభం ఏముంటుంది? కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తగా కేంద్ర పాలకులు కొత్త వేషానికి గజ్జె కట్టారు. కర్ణాటక తాజా ఎన్నికల్లో రెండువేల రూపాయల కట్టలు ప్రాణం పోసుకున్నందువల్ల 2024 ఎన్నికల నాటికన్నా ఈ కట్టల్ని ‘కట్టడి’ చేయాలన్నది కేంద్ర పాలకుల ఎత్తుగడ! అసలు ‘మంచి పాలన’ పేరిట దేశ రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చే ప్రపంచ బ్యాంకు విధాన ఒరవడిలో పెట్టుబడి విధానాల్ని ఆశ్రయించే దేశాల పాలకులందరిదీ ఇదే తంతు అని నిశితమైన ఆర్థిక వ్యవహారాల నిపుణులలో ఒకరైన సంజీవి గుహన్ ఖండించవలసి వచ్చింది. వరల్డ్ బ్యాంక్ చరిత్రకారులైన ఎడ్వర్డ్ మాసన్, రాబర్ట్ ఆషర్ అభిప్రాయం కూడా అదే! అంతేగాదు, బీజేపీ పాలకుల నిర్ణయాలను ‘ఆదర్శం’గా భావించిన ఒక ‘నేత’ మరొక అడుగు ముందుకు వేసి – ప్రతిపక్షాల కూటమికి తనను రథసారథిని చేస్తే మొత్తం ఎన్నికల ఖర్చంతా తానే భరిస్తానని అన్నట్టుగా ఓ ఇంగ్లిష్ ఛానల్లో బాహాటంగా ప్రకటించడంతోనే – రెండు వేల రూపాయల నోటుకు ‘వేటు’ పడిందని కొల్లలుగా ప్రకటనలు వెలువడజొచ్చాయి. ఈ సందర్భంగా రాజకీయ పాలకుల, నాయకుల తప్పిదాలకు మూలాన్ని కనుగొనే యత్నంలో ఐన్‌స్టీన్‌కూ, సోషలిస్టు నాయకుడు రావ్‌ుమనోహర్ లోహియాకూ మధ్య సాగిన ఒక ఆసక్తికరమైన సంభా షణను గమనించాలి. ఐన్‌స్టీన్: ‘రాజకీయులు చేసే తప్పిదాలు వాళ్ల లోని చెడ్డ తలంపుల వల్లగాక, అమాయకత్వం నుంచి పుట్టే లక్షణంగా మనం భావించవచ్చా?’ లోహియా: ‘అసలు రహస్యం – రాజకీయవేత్తలకు తమ అమా యక మనస్తత్వం నుంచి బయటపడటం ఇష్టం ఉండదు. అది రోగ నివారణకి అందనంత పెద్ద జబ్బు. ఆ జబ్బే వారిని పీడిస్తుండే పెద్ద రోగం. ఈ రోగం నుంచి బయట పడటం ఇష్టం లేనందుననే చాలా మంది రాజకీయులకు దేశ సామాజిక, ఆర్థిక, ధార్మిక సమస్యలపై శాస్త్రీయమైన అవగాహన ఉండదు గాక ఉండదు’! ఆర్థిక నిపుణులైన శుభదారావు నేతృత్వంలో పనిచేస్తున్న ఆర్థికవేత్తల బృందం (క్వాంట్ ఎకో) వివరించినట్టుగా, పన్నుల ఎగ వేతకు వీలుగా దొంగచాటుగా అట్టిపెట్టుకోవడానికి ఈ 2000 లాంటి పెద్ద నోట్లు సంపన్నుల వద్ద మేట వేసుకున్నాయి. అవి ఇప్పుడు కోట్లాది విలువ చేసే లోహ సంపద పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. గతంలో బ్యాంకుల వద్ద పొద్దుగూకులు పెద్ద నోట్లు మార్చుకోవడానికి పడిగాపులు పడి 125 మంది సాధారణ ఖాతాదార్ల ప్రాణాలు ‘హరీ’ అన్నాయి. ఈసారి ‘భాగోతం’ ఎలా ముగుస్తుందో రేపటి ‘వెండి తెర’పై చూడాల్సిందే! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
బౌద్ధ వైభవ చిహ్నం తొలగించడమా?
చరిత్రలో హేతువాదాన్ని వ్యాప్తి చేయడంలో అగ్రగామి, బౌద్ధ ధర్మం. సర్వమానవ సమానత్వాన్ని కాంక్షించినది, యజ్ఞ యాగాదులను నిరసించినది కూడా ఇదే ధర్మం. అలాంటి మహత్తర ధర్మాన్ని తెలుగు నేల ఇరు చేతులా హత్తుకుంది. దేశంలోని ఏ బౌద్ధ స్థావరం నుంచి దొరకని ఆనవాళ్లు తెలుగు నేలలో దొరికాయి. అలాంటి తెలుగు నేల విశిష్ట బౌద్ధ వారసత్వపు చిహ్నంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ‘పూర్ణఘటాన్ని’ నెలకొల్పారు. కానీ కొత్తగా ప్రారంభమైన తెలంగాణ సచివాలయంలో ఆ ఆనవాళ్లను చెరిపేశారు. భారత దళిత ప్రజా బాహుళ్య విమోచనకు ఏ బౌద్ధ సౌభ్రాతృత్వ ధర్మాన్ని అంబేడ్కర్ ప్రబోధిస్తూ వచ్చాడో అదే అంబేడ్కర్ పేరిట ఏర్పాటైన సచివాలయంలో బౌద్ధ చిహ్నాన్ని కూల్చేశారు. భారత సెక్యులర్ రాజ్యాంగ నిర్మాత, బౌద్ధ సంస్కృతీ ప్రియుడైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరిట తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ ఆవిష్కరణ జరిగిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికీ, ప్రజలకూ శుభాభినందనలు తెలుపు తున్నాను; కానీ ఈ సందర్భంలోనే సెక్రటేరియట్లో ఉండవలసిన, ఉమ్మడి తెలుగు బౌద్ధ సంస్కృతీ వైభవ ప్రతీకగా అంతకుముందు నుంచీ ఉన్న విశిష్ట శాశ్వత కట్టడాన్ని తొలగించినందుకు విచారం వెలిబుచ్చక తప్పడం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో (2008) ఆయన ఆధ్వర్యాన తెలుగు ప్రజల ఉమ్మడి బౌద్ధ సంస్కృతీ వైభవ చిహ్నంగా ఆ కట్టడం నాలుగు భాషల ఉద్దీపనతో వెలిసింది. ఎంతోమంది పర్యాటకుల్ని ఆకర్షించిన బౌద్ధ సంస్కృతీ చిహ్నమది (ఘనాకారపు గ్రానైట్ రాయి మీద తొలిచిన పూర్ణఘట ప్రతిరూపం). కానీ నేటి సెక్రటేరియట్ ఆవరణలో ఆ విశిష్ట చిహ్నం ఆనవాళ్ళు ‘కలికానికైనా’ కానరావు. ఇంతకూ ఆ బౌద్ధ ధర్మ సంస్కృతీ వైభవ కట్టడం ఏమైనట్టు? భారత దళిత ప్రజా బాహుళ్య విమోచనకు ఏ బౌద్ధ సౌభ్రాతృత్వ ధర్మాన్ని అంబేడ్కర్ ప్రబోధిస్తూ వచ్చాడో ఆ చిహ్నాన్నే కూల్చేశారు. ఏ యజ్ఞయాగాదులకు దూరంగా జరిగి సర్వ మానవ సమానత్వం లక్ష్యంగా అంబేడ్కర్ ముందుకు సాగాడో –అందుకు విరుద్ధంగా యజ్ఞయాగాదులతో ‘బీఆర్ఎస్’ నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన అంబేడ్కర్ సచివాలయ ప్రవేశం చేశారు. విశేషమేమంటే, ‘బౌద్ధ ధర్మ చక్ర ప్రశస్తి’ శాసనం మన దేశం మొత్తం మీద ఏ బౌద్ధ స్థావరం నుంచీ ఇంతవరకూ వెలుగు చూడనందుననే తెలంగాణలోని ‘ఫణిగిరి’ ధర్మ చక్ర ప్రశస్తి శాసనానికి చారిత్రక ప్రాధాన్యం లభించింది. ప్రాకృత భాషను, పాలీ లిపిని, ‘బ్రాహ్మీ’ లిపిని ప్రేమించి, ప్రోత్సహించిన ధర్మం కూడా బౌద్ధానిదేనని మరచి పోరాదు. క్రీ.పూ. 3 – క్రీ.శ. 18 శతాబ్దాల మధ్య వెలువడిన వేలాది శాసనాలను ఉమ్మడి తెలుగువారి సొత్తుగా భావించి ఈ విశేషాలన్నింటినీ ఆవిష్కరించిన ప్రసిద్ధ స్థపతి ఈమని శివనాగిరెడ్డి ఒకరు. ఈయనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయ ప్రాంగణంలో తెలుగు వారి బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబించే అత్యున్నత కట్టడ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. సరిగ్గా ఆ కట్టడం ఆనవాళ్లే కనపడకుండా చేసింది కేసీఆర్ పాలన. కాక పోతే అంబేడ్కర్ పేరును ఒక ముసుగుగా వాడుకోవడం పాలకుల కొత్త ‘సంస్కృతి’! కొండా శ్రీనివాసులు, అవధానం ఉమా మహేశ్వరి సంపాదకులుగా శివనాగిరెడ్డి తెలుగు సంస్కృతీ వైభవాన్ని కళ్లకు కట్టి చూపే ‘మీరూ శాసనాలు చదవొచ్చు’అన్న అమూల్య గ్రంథాన్ని అందించారు. ఇందులో ఆయా కాలాల్లో హైందవ, బౌద్ధ మతాలకు మధ్య జరిగిన భావ సంఘర్ష ణలు, లిపిలో వచ్చిన మార్పులు వగైరా చరిత్ర ఉంది. ఈ పరిణామ క్రమానికి శాశ్వత నిలువుటద్దంగా నిలిచిన, సెక్రటేరి యట్ ఆవరణలో స్థాపితమైన ఉమ్మడి బౌద్ధ సంస్కృతీ వైభవ అమూల్య చారిత్రక కట్టడాన్ని ఎందుకు తొలగించారో సమా ధానం కావాలి. హేతువాదాన్ని వ్యాప్తి చేయ డంలో స్థిర చిత్తంతో ముందుకు దూసుకు వెడుతున్న బౌద్ధ ధర్మాన్నీ, దాని తాలూకు ప్రచార సంస్థ లనూ ఎదుర్కొంటున్న దశలో హైందవంలోని ఛాందసులు బౌద్ధా రామాల్ని కూల్చకుండా ఉంటారా అని మహాపండితులు రాహుల్ సాంకృత్యాయన్, తిరుమల రామచంద్ర పదేపదే ప్రశ్నించవలసి వచ్చిందని మరవరాదు. హైదరాబాద్‌లో మూసీ తీరాన ఉన్న క్రీ.శ. 4వ శతాబ్ది నాటి బౌద్ధారామాన్ని కాస్తా 30 ఏళ్ల క్రితమే కొనగండ్ల నరసింహస్వామి ఆలయంగా మార్చేశారని శాసనాల చరిత్రలో పేర్కొన్నారు. అహో బిలం, మంగళగిరి, భీమునిపట్నం (పావురాళ్ల కొండ), సింహాచలం మున్నగు నరసింహ క్షేత్రాలన్నీ ఒకనాటి బౌద్ధ స్థావరాలేనంటారు. హైదరాబాద్‌లో లభించిన ప్రాకృత బౌద్ధ శాసనం క్రీ.శ. 4వ శతాబ్ది నాటిది. ప్రముఖ శాసన పరిశోధకులు పీవీ పరబ్రహ్మ శాస్త్రి దానిని ధ్రువీకరించారు. బౌద్ధానికి విస్తారంగా రాజాదరణ లభించిన విష్ణుకుండినుల కాలంలో (క్రీ.శ. 6వ శతాబ్ది) విష్ణుకుండి మొదటి గోవింద వర్మ పట్టపురాణి పరమభట్టారిక మహా దేవి నల్గొండ జిల్లా తుమ్మల గూడెంలో తన పేర ఒక మహా విహారాన్ని నిర్మించి, సర్వ జీవరాసుల హితాన్ని కోరే బౌద్ధం పట్ల తన మక్కువను తెలియజేసింది. ఇక క్రీ.శ. 14–17 శతాబ్దుల్లో విజ యనగర శాసనాలు బౌద్ధ ధర్మాన్ని తలదాల్చి యశస్సు గడించినవే. కాకతీ యుల తరువాత మొత్తం తెలుగునేలను పాలించిన కుతుబ్‌షాహీలు తెలుగును ప్రోత్సహించినవాళ్లే. సుప్రసిద్ధ నాణేల పరిశోధకులు డాక్టర్ దేమె రాజారెడ్డి కోటిలింగాల తవ్వకాల్లో అనేక పేర్లున్న నాణేలపై గల లిపి క్రీ.పూ. 3వ శతాబ్ది నాటిదనీ, రాజుల పేర్లు తెలుగులో ఉన్నాయనీ నిర్ధారించారు. తెలుగు లిపి ఆవిర్భావ, వికాసాల గురించి పీవీ పరబ్రహ్మశాస్త్రి, డా.ఎస్. రామచంద్రమూర్తి అనేక విషయాలు వెల్లడించారు. ఇంత చరిత్ర సంస్కృతి ఉభయ ప్రాంతాలలోని తెలుగు వారికి ఉండగా, ఉమ్మడి బౌద్ధసంస్కృతీ వైభవాన్ని వెలార్చిన సాధికార నిర్మాణ రూపాన్ని సెక్రటే రియట్‌లో నామరూపాలు లేకుండా చేయడం దుర్మార్గం. పాలకుల స్థాయికి మించిన దుశ్చర్యగా పరిగణించక తప్పదు. ఇంతకూ ‘జీవతత్వం’ ఎక్కడుందన్న ప్రశ్నకు వేమన్నను అడిగితే చెబుతాడు:‘‘తనువులోన జీవతత్వ మెరుంగక వేరెకలదటంచు వెదుక నేల,భానుడుండ దివ్వెపట్టి వెదుకు రీతి?!’’ abkprasad2006@yahoo.co.in -
ప్రకృతికి శిరమొగ్గి నిలిచిన ‘శివుడు’!
ఎండలు మండిపోతాయని ప్రతిసారీ చెప్పుకొంటున్నప్పటికీ, ఈసారి ఆ మండిపోవడం అక్షరాలా నిజమని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆసియా ఖండ చరిత్రలోనే విలయతాండవం చేస్తాయని భయపెడుతున్నారు కూడా. అయితే వాతావరణ మార్పుల వల్ల దుర్భరమైన వేడిగాడ్పులు ఎలా వస్తున్నాయో, భరించలేని చలిగాలులు కూడా అంతే వీస్తున్నాయి. ఇలాంటివన్నీ ఎప్పుడో మనకు కవి సమయాలయ్యాయి. దప్పిక వల్ల చెట్లు తమ నీడల్ని తామే తాగుతున్నట్లు చిత్రించాడు నన్నెచోడుడు. శివుడు కూడా చలి భరించలేక హిమాలయాలను వదిలాడని చమత్కరించాడు సారంగు తమ్మయ్య. ఏమైనా మనుషుల శరీరాలు ఈ రెంటికీ అలవాటు పడాలి. వీటన్నింటినీ భరిస్తూనే లోకయాత్ర చేస్తూ ఉండాలి. ‘‘చరిత్రలో ఇంతవరకు కనీవినీ ఎరుగని ఎండలు, వేడి గాలులు ఆసియా దేశాల్ని పీల్చి పిప్పి చేస్తాయి. ఈ అసాధారణ పరిణామం భారత, చైనా దేశాలలో పెక్కుమంది ప్రజల దుర్మరణాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా ఏప్రిల్–మే నెలలు ఆసియా ఖండ చరిత్రలోనే విలయతాండవంగా భావించవచ్చు. ఉత్తర, తూర్పు భారత రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు తగ్గవు. ఒకవేళ వేడి తీవ్రత తగ్గని పక్షంలో పరిణామాలు ప్రమాదకరంగా మారవచ్చు’’ – మాక్సిమిలియానో హెరీరా, వాతావరణ శాస్త్రవేత్త (‘గార్డియన్’ పత్రిక; 20 ఏప్రిల్ 2023) వాతావరణ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ప్రకారం, భూమిపై ఏకంగా 20 లక్షల ఏళ్లపాటు వర్షం పడిందన్న వార్త ‘కలగుండు’ పడినట్లయింది. అంటే సృష్టి, వినాశాల మధ్య భూమి, ప్రకృతి పబ్బం గడుపుకుంటూ వచ్చాయని భావించాలి. సృష్టి, వినాశాలు ప్రాకృతిక సహజాలు. పెరుగుతూ వచ్చిన సృష్టి రహస్యాల పరిజ్ఞానంతో మానవ జాతి తన మనుగడను కాపాడుకుంటూ వస్తోంది. ఇదిలా ఉండగా, దక్షిణాసియా దేశాలకు దఫదఫాలుగా వినాశంగా పరిణమి స్తున్న ఇండో–పసిఫిక్ వాతావరణ మార్పులు ఒకసారి దుర్భరమైన వేడి గాలులకు (ఎల్‌నినో), మరోసారి అమితమైన చలి గాడ్పులకు (లానినా) కారణమవుతున్నాయి. 2009 నుంచి 2018 వరకు మన దేశంలో అసాధారణ వేడిగాడ్పులకు కారణమైనది ఎల్‌నినో. ఫలితంగా ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయి. ప్రతీ 2–7 సంవత్సరాలకు ఎల్‌నినో వరసగా దెబ్బతీస్తూనే వచ్చింది. ప్రకృతి వైపరీత్యం ఎంత దెబ్బతీయకపోతే, లోకాల్ని శాసించే శివుడు సహితం చలికి తట్టుకోలేక హిమాలయాల్ని వదిలి భూమ్మీద చెట్ల నీడను ఆశ్రయించాల్సిన గతి పడుతుంది! (‘హరుడు కైలాస కుధర నాథాగ్ర వసతి విడిచి/ వటమూల తలముల విశ్రమించె’.) ఈ సత్యాన్ని ‘వైజయంతీ విలాసం’ కావ్యం ద్వారా సారంగు తమ్మయ్య ప్రజలపై ప్రకృతి ప్రభావాన్ని తెలియ జెప్పడం కోసం ప్రకటించాడు. దుర్భాక రాజశేఖర శతావధాని తన ‘రాణా ప్రతాప సింహ చరిత్ర’లో హల్దీ్దఘాట్ కనుమ దగ్గర రాజపుత్రులకూ, మొగలాయీలకూ మధ్య జరిగిన యుద్ధాన్ని వర్ణిస్తూ, మధ్యాహ్నాన్నిలా చిత్రించాడు: ‘‘మెండై ఎండలు నిండె, నల్దెసల గ్రమ్మెన్ నిప్పులన్ గుప్పుచు ద్దండ గ్రీష్మ సమీరముల్ నిఖిల జగంబుల్ కడున్ డస్సె బ్ర హ్మాండబందు పొగల్ సెగల్ తటుములై వ్యాపించి మధ్యాహ్నమా ర్తాండుండుజ్వల కాండుడై గగనమధ్యం బందు మెల్గొందగన్.’’ ఇదిలా ఉండగా నన్నెచోడుడు ‘కుమార సంభవం’ కావ్యంలో, పార్వతి మండుటెండలకు పంచాగ్ని మధ్యంలో ఘోర తపస్సు చేస్తున్న సందర్భాన్ని వర్ణించాడు. ‘లోకులు భయపడేంత’గా వడగాలి వీచడాన్ని, ఆ వడగాలికి ఏనుగుల తలలు పేలిపోయి లోపలి ముత్యాలు పేలాలుగా పటపటా చిట్లిపోయినట్లు, దప్పిక కోసం ఎదురు చూసే చెట్లు తమ నీడల్ని తామే తాగుతున్నట్లు చిత్రించాడు. ఇక విశ్వనాథ పగటి ఎండల తీవ్రతల వల్ల జిల్లేడు కాయల్లా, వడ్లగింజల్లా, సున్నపురాయిలా విరిగిపోయి భూమి కాస్తా కకావికలైపోయిందని వర్ణించాడు! ఆధునికుడైన కవి కాకరపర్తి కృష్ణశాస్త్రి తన కాలంలోనే సముద్రం ఉప్పొంగడం, అది భూమిని ముంచేసిన ఘటనలను ‘ప్రళయ సంరంభం’ కవితలో కళ్లకు కట్టి చూపాడిలా: ‘‘ఆకసమంటుచున్ ఘుమ ఘుమార్భటితో దిశలన్ స్పృశించుచునే భీకర లీల లేచి అతివేల జవంబున వచ్చి వచ్చియ స్తోక తరంగ మొండుపడు దుస్సహమై ధరముంచి వైచి తా నేక పయోధి సూత్రముగ ఎంతయు జేసి శమించెనంతటన్’’! ఆంధ్ర సామ్రాజ్య విచ్ఛిన్నానికి ‘రాళ్లు’ కూడా దుఃఖంతో ఎలా కరిగిపోయాయో కవి కొడాలి సుబ్బారావు ఎంతో ఆర్ద్రతతో గుండె చెరువై ఇలా వర్ణించాల్సి వచ్చింది: ‘‘శిలలు ద్రవించి యేడ్చినవి, జీర్ణములైనవి తుంగభద్రలో పల గుడి గోపురంబులు, సభాస్థలులైనవి కొండ ముచ్చుగుం పులకు, చరిత్రలో మునిగి పోయిన దాంధ్ర వబంధరాధిపో జ్జ్వల విజయ ప్రతాప రభ సంబొక స్వప్న కథావిశేషమై.’’ ఇంతకూ, సంభవించే ప్రకృతి వైపరీత్యాలకేమిగాని మానవ హృదయంలో సహజంగానే ప్రకృతిని చూసి ఆనందించే లక్షణం మాత్రం చచ్చిపోదని చెబుతూ ప్రసిద్ధ కళాకారుడు, కవి అడవి బాపి రాజు ఓ చిరంతన సత్యాన్ని ప్రకటించిపోయారు: ‘‘అందరికీ ప్రకృతిని చూసి ఆనందించే లక్షణం ఉంది. ఆ ప్రకృతి భౌతిక రూపంగా, మనోమయ రూపంగా, బుద్ధి రూపంగా ప్రత్యక్షం అవుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఆ ప్రకృతిలో మనస్సుకుగాని, హృదయానికిగాని, బుద్ధికిగాని, ఆత్మకుగాని ఆనందం కల్గించే ఒక దృశ్యం, ఒక రూపం, ఒక జీవితం, ఒక భావం, కళాశక్తి కలిగిన రసజ్ఞునికి గోచరించినప్పుడు – తనలో ఉండే ఆ కళా శక్తి పైకి ఒక స్వరూపంగా జన్మించాలని ఆవేదన పొందడం చేత కళా స్వరూపం ఉద్భవిస్తున్నది. ఆ కళా స్వరూపంలో ఉన్న ముఖ్య లక్షణం ఆనందం. ఆ సృష్టి భాషా స్వరూపమైతే కవిత్వం, వర్ణ స్వరూపమైతే చిత్ర లేఖనం, మూర్తి స్వరూపమైతే శిల్పం, అంగ విక్షేప స్వరూపమైతే నృత్యం, భవన స్వరూపమైతే ఆలయం అవుతుంది’’! ప్రకృతిలో మనం భాగం కాబట్టి, అందులో దఫదఫాలుగా ఇదే మానవుడి చేష్టల వల్లనో, ప్రకృతి సహజంగానో పెల్లుబుకి వచ్చే ఉపద్రవాలను భరిస్తూనే లోకయాత్ర సాగుతూండటం సహజ పరిణామం. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఆపత్కాలంలో ఐక్యతా రాగం!
దేశంలో వామపక్షాలు బలహీనమై పోతున్న కాలమిది. ఇదే సమయంలో మతతత్త్వ శక్తులు బలపడిపోతుండటం ప్రగతి శీల ప్రజాస్వామ్యవాదులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఉభయ కమ్యూనిస్టు పార్టీల (సీపీఐ, సీపీఎం) జాతీయ నాయకత్వాలు హైదరాబాద్‌లో సమావేశమై వామపక్షాల ఐక్యత అవసరంపై చర్చించాయి. ఈ పార్టీల్లో సీపీఐ తాజాగా ‘జాతీయ పార్టీ’ హోదాను కోల్పోయిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలు వామపక్షాలు ఐక్యమైతేకాని మతతత్త్వ శక్తులను అడ్డుకోవడం సాధ్యం కాదని ప్రకటించాయి. వామపక్షాల ఐక్యత అవసరాన్ని ఎనభై ఏళ్ల క్రితమే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రమాణ పత్రం ఒకటి నొక్కి వక్కాణించడం గమనార్హం. ‘‘భారతదేశాన్ని ‘హిందూ దేశం’గా మార్చేందుకు, భారత సెక్యులర్ రాజ్యాంగం స్థానంలో దేశాన్ని విభజించి కేవల ‘హిందూ’ దేశంగా మార్చే ‘మను స్మృతి’ని అమలు పరిచేందుకు ఆరెస్సెస్, బీజేపీలు ప్రయత్నిస్తు న్నాయి. మితవాద రాజకీయాలపై శక్తిమంతంగా పోరాడాలంటే దేశంలో వామ పక్షాల మధ్య ఐక్యత మరింత అవసరం. దేశంలోని మితవాద రాజకీ యాలపై నిరంతర పోరుకు వామపక్షాల ఐక్యత నేడు తక్షణావసరం. ఈ ఐక్యత పరస్పర విశ్వాసం ద్వారానే సాధ్యం’’. – సీపీఐ, సీపీఎం పార్టీలు హైదరాబాద్‌లో తొలిసారిగా జరిపిన సంయుక్త సమావేశంలో (10.4.2023) తీసుకున్న నిర్ణయం. వామపక్షాలైన సీపీఐ, సీపీఎంల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి ‘యూనిటీ’ సమావేశం వామపక్ష అభిమానులలో నూతనోత్తే జానికి కారణమయింది. ఉభయపక్షాల ఐక్యత తక్షణావసరాన్ని ఇరు పక్షాల నాయకులు, కార్యకర్తలు గుర్తించడం ముదావహం. నిజానికి ఉభయ పార్టీలూ కలవ వలసిన అవసరాన్ని కొత్తగా ఇప్పుడు గుర్తించారని చెప్పనవసరం లేదేమో. ఎనిమిది దశాబ్దాల క్రితమే కాన్పూర్ కేంద్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ఎస్. సత్యభక్త కమ్యూనిస్టుల ఐక్యత కోసం తొలి ప్రమాణ పత్రాన్ని వెలువరించారు. హైదరాబాద్ కేంద్రంగా వెలువడిన ఉభయ పార్టీ (సీపీఐ, సీపీఎం)ల సంయుక్త సమావేశంలో ప్రసంగించిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, ïసీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలు ఉగ్గడించిన ‘ఉభయ పక్షాల ఐక్యత అవసరం’ గుర్తించ డానికి ఇన్నేళ్ల సమయం పట్టడం... ఉభయ వామ పక్షాల ఉమ్మడి వార సత్వానికి ఒక రకంగా ‘మచ్చ’గానే భావించాలి. అయినా ఇప్పటికైనా ఏకపక్షంగా ఉభయపక్షాల ఐక్యతావాంఛ... అనేక సమస్యల పరిష్కా రానికి ఎదురుచూస్తున్న దేశానికి శుభసూచకంగా భావించాలి. ఈ సందర్భంగా కాన్పూర్ తొలి పార్టీ ప్రమాణ పత్రాన్ని ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, ఆ పత్రం ఆనాటికే కాదు, ఎప్పటికీ పోరాట పటిమ గల పార్టీకి ఒక బలమైన దిక్సూచిగా ఎలా నిలబడి పోయిందో గుర్తించడం కోసమే! అందులో పేర్కొన్న ప్రమాణాలలో కొన్నింటిని ఒక్కసారి పరిశీలిద్దాం: ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా లేని రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలనుకొనేది సంపాదన కోసం, అది వీలు చిక్కకపోతే ప్రజలపై నిర్బంధ విధానాల ద్వారా ఒడుపుకోవడం కోసమే గానీ ప్రజల ప్రయోజనాలను గుర్తించి వారిని సకాలంలో ఆదుకోవడానికి కాదు; ఈ పరిస్థితుల్లో వామపక్షాల బాధ్యత పెట్టుబడిదారీ శక్తుల తరఫున కొమ్ము కాయడం కాదు, ఆ కొమ్ములను విరిచి ప్రజాబాహుళ్యం మౌలిక అవసరాలైన తిండి, బట్ట, వసతి, ఉపాధి సౌకర్యాలను కల్పించడం. తద్వారా ప్రజలు తమ కష్టార్జితాన్ని తాము స్వేచ్ఛగా అనుభవించడానికి దోపిడీకి తావు లేకుండా చేయడం కమ్యూనిస్టుల విధిగా ఉండాలి. ఇదీ స్థూలంగా 1924 నాటి కాన్పూర్ డాక్యుమెంట్ ఆదేశించింది. ఆ ‘ప్రమాణ పత్రం’ మకుటం కూడా ‘సత్యభక్త, భార తీయ సామ్యవాది దళ్’ (ది ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ) అనీ, ‘సత్యవాది’ అనీ! 1924 నాటి భారత కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని సమ స్యల్ని ఎంతగా మనసు విప్పి బాహాటంగా ప్రకటించిందో చూడండి: ‘సమాజంలో నాయకులకు, రాజకీయవేత్తలకు, మత ప్రవక్తలకు, సంఘ సంస్కర్తలకు కొదువ లేదు వీరంతా ప్రజలకు చేసే మార్గ నిర్దేశానికి కొదవ లేదు. కానీ వీరు చూపే అనేక మార్గాలు ఉన్న ‘జబ్బు’ను పెంచేవే కానీ తుంచేవి కావు. పైగా చాలామంది మార్గదర్శ కులు తమ పొట్టలు నింపుకోవడం కోసం ప్రజల్ని బుద్ధి పూర్వకంగానే అగాథంలోకి నెట్టేస్తారు. కానీ, ఇలా అగాథంలోకి నెట్టే వాళ్లనుంచి ప్రజల్ని రక్షించడానికే భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టింది. ప్రజలు ఎదుర్కొనే అన్ని సమస్యల నుంచీ వారిని తామే రక్షిస్తామన్న హామీ ఏ పార్టీ ఇవ్వదు. ఎందుకంటే, ఏ పార్టీ వ్యవస్థా అలా ఉండదు కనుక. ప్రజలంతా ఏకమై తమ కాళ్లమీద నిలబడి సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి. ధనికులకు, పేదలకు మధ్య దారుణంగా పేరుకు పోయిన సమస్యల్ని తగ్గించడం పార్టీ లక్ష్యంగా ఉండాలి. సమాన త్వాన్ని ప్రేమించేవారికి పార్టీలో నిస్సందేహంగా స్థానం ఉంటుంది. అంతేగాని తాము మాత్రమే అన్ని సౌకర్యాలు అనుభవించాలనుకొనే వారికి పార్టీలో స్థానం ఉండదు. ఎవరైతే ప్రజల్ని మోసం చేస్తూ, ఇతరులను దోచుకుంటూ అనుభవించగోరతారో... వారికి పార్టీలో స్థానం ఉండదు. తమ చెమటోడ్చి సంపాదించుకుంటూ, తప్పుడు మార్గాల ద్వారా సంపాదనకు ఒడిగట్టని పేద రైతులు, కార్మికులు, నిరుపేద గుమస్తాలు, చిన్నచిన్న ప్రభుత్వోద్యోగులు, రైల్వే సిబ్బంది, స్కూలు మాస్టర్లు, చిన్నచిన్న వ్యాపారులు, చిన్నస్థాయి పోలీస్ కానిస్టేబుల్స్, ప్రెస్ ఉద్యోగులు – వంటి వారు మాత్రమే మా పార్టీలో సభ్యత్వానికి అర్హులు’ అని పార్టీ ఈ పత్రం ద్వారా చాటింది. అయితే పెట్టుబడిదారీ (కాపిటలిస్ట్) వర్గానికి, వారి ప్రయోజ నాల కోసం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పనిచేసే సంస్థలను పార్టీ సహించదని చెప్పింది. అందుకనే శ్రమ జీవులంతా ఏకైక భారత కమ్యూనిస్టు పార్టీ పతాకం కింద సమకూడి, తుది శ్వాస వరకూ నిలబడాలని ప్రమాణ పత్రం నిర్దేశించింది. అంతేగాదు, రంగంలో ఉన్న పెక్కు రాజకీయ పార్టీలు వర్గ ప్రయోజనాలను ప్రతిబింబించేవి కాబట్టి... వీటన్నింటిలో ఏకైక పెద్ద కార్మికవర్గ శక్తి కమ్యూనిస్టు పార్టీ కాబట్టి అందరూ ఐక్య శక్తిగా సమీకృతం కావాలని ఆ మానిఫెస్టో ప్రకటించింది. బహుశా అందుకనే సుభాష్ చంద్రబోస్ రానున్న రోజుల్లో భారతదేశ భవిష్యత్తు మౌలికంగా వామపక్ష శక్తుల పోరాటం, త్యాగాల మీదనే ఆధారపడి ఉంటుందని జోస్యం చెప్పారు. ఎందుకంటే, విప్లవోద్యమం అనేది అరాచక ఉద్యమం కాదు, టెర్రరిస్టుల ఉద్యమమూ కాదు. భారత స్వాతంత్య్రోద్యమంలో దేశ భక్తులైన అనేకమంది మేధావులను, నాయకులను, యువకులను, రచయిత లను ‘దేశద్రోహులు’గా వలస పాలకులు ముద్రవేసి జైళ్లలో పెట్టారు. అందులో వామపక్ష భావాలు ఉన్నవారు అనేకమంది ఉన్నారు. ‘మనల్ని దేన్ని చదవకూడదని బ్రిటిష్ పాలకులు కోరుకున్నారు’ (బ్యాన్డ్ అండ్ సెన్సార్డ్: వాట్ ది బ్రిటిష్ రాజ్ డిడిన్ట్ వాంట్ అజ్ టు రీడ్’) అనే గొప్ప చారిత్రిక విశ్లేషణా గ్రంథాన్ని తాజాగా అందించిన చరిత్రకారిణి దేవికా సేథి... అప్పటి వలస భారతంలోని ‘సెన్సార్షిప్’ నిబంధనల మాలోకం గురించీ వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన దాదాపు 75 ఏళ్ల తర్వాత రాసిన ఆ గ్రంథం ఎన్నో మరుగున పడిన విషయాలను తెలియచేస్తోంది. ఇంతకూ ‘దేశద్రోహి’ అంటే ఎవరు, అన్న ప్రశ్నకు టర్కీ ప్రసిద్ధ ప్రజా మహాకవి హిక్మెట్‌ను అడిగితే చెబుతాడు: ‘‘ఔను, నేను దేశద్రోహినే – మీరు దేశభక్తులైతే మీరే మన మాతృభూమి పరిరక్షకులైతే నేను నా మాతృభూమికి దేశద్రోహినే దేశభక్తి అంటే మీ విశ్వాసాల వ్యవసాయ క్షేత్రాలే అయితే దేశభక్తి అంటే మీ బొక్కసాల్లో సంపదలే అయితే దేశభక్తి అంటే మీ బ్యాంకు ఖాతాల్లో నిధులే అయితే దేశభక్తి అంటే దారి పక్క దిక్కులేని ఆకలి చావులే అయితే దేశభక్తి అంటే జనాలు కుక్కపిల్లల్లా చలికి వణికిపోవడమే అయితే ఎండా కాలంలో మలేరియాతో కునారిల్లడమే అయితే మతగ్రంథాలను వల్లించడమే దేశభక్తి అయితే పోలీసు చేతి లాఠీయే దేశభక్తి అయితే మీ కేటాయింపులూ, మీ జీతభత్యాలు మాత్రమే దేశభక్తి అయితే మూఢ విశ్వాసాల అజ్ఞానపుటంధకారపు మురికి గుంట నుంచి విముక్తి లేకపోవడమే దేశభక్తి అయితే – నేను దేశద్రోహినే!’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కుల మతాల ‘అంటు’ లేని కాలం!
మనిషి ఆధునికుడైనకొద్దీ విశాలం కావాల్సింది పోయి, సంకుచితంగా మారుతున్నాడు. తన కులం, తన ప్రాంతం అని గీతలు గీసుకుంటున్నాడు. ఈ మానవ స్వభావాన్ని అడ్డుపెట్టుకొని, దాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం మరింత రెచ్చగొట్టే రాజకీయ పార్టీలు ఉండనే ఉన్నాయి. దీంతో మనకు కులం, మతం అనేవి నిత్య పీడనగా మారిపోయాయి. కానీ ఇలాంటి అడ్డుగోడలు లేని కాలం ఉంటే ఎంత బాగుంటుంది! కేరళలోని ‘పట్టణం’లో జరిపిన తవ్వకాలు ఇది కేవలం ఊహ కాదనీ, చారిత్రక నిజమనీ రుజువు చేస్తున్నాయి. కులమతాలతో సంబంధం లేని కాలం... దేవుళ్ళు, ఆయుధాలతో నిమిత్తం లేకుండా కేవలం ప్రకృతి జీవనంతో పెనవేసుకున్న ప్రజా సామాజిక జీవన వ్యవస్థ అక్కడ విరాజిల్లుతూ వచ్చిందని వెల్లడయ్యింది. దీనికి ప్రధాన కారణం – ప్రజలు తమను ప్రకృతి నుంచి వేరుగా భావించకపోవడమే. మహాకవులు వేమన, పోతన ఎన్ని జీవన సత్యాలను పోతపోసి పోయారో చెప్పలేం: ‘‘మర్మమెరుగలేక మతములు కల్పించి ఉర్వి దుఃఖులగుదు రొకరికొకరు గాజు ఇంట కుక్క కళవళ పడురీతి’’ అని వేమన అంటే, పోతనా మాత్యుడు: ఈ లోకం నుండి లోకేశులు, లోకస్థులు వెళ్లిపోయిన తరువాత లోకం కాని లోకాన్ని, చివరి ‘అలోకా’న్ని అంటే పెను చీకటిని కూడా దర్శించడమేగాక, ఆ తరువాత వెలుగునిచ్చేవాడినే సరాసరి సేవిస్తా నని ప్రకటించాడు! పోతన వాడిన ‘పెను చీకటి’ అంటే వైజ్ఞానిక శాస్త్రం నిరూపించిన ‘డార్క్ మ్యాటర్’ అనే! కనుకనే వేమన 17వ శతాబ్దం నాటికే ‘నీ శరీరంలోని జీవ తత్వాన్ని తెలుసుకోలేక అదెక్కడో వేరే ఉందని భావించి వెతుకుతావెందుకు వెర్రివాడా’ అని ప్రశ్నించాడు. ‘భానుడు (సూర్యుడు) ఒక వైపున దివ్యంగా కాస్తుండగా, వేరే దీపం పట్టుకొని చూడ్డం దేనికి’ అని మెత్తగా చురక వేశాడు. ఈ పద్ధతి ‘తెలివి’ లేదా మూఢత్వం ఎలా ఉంటుందో కూడా మరో ఉదాహరణ ద్వారా వేమన చూపించాడు: ‘‘తాము నిలుచు చోట దైవము లేదని పామర జనులు తిరుపతుల తిరిగి జోము (ఉన్న సుఖం) వీడి చేతి సొమ్మెల్ల పోజేసి చెడి గృహంబు తాను చేరు వేమ’’! అంతేగాదు, ఈ ప్రపంచాన్ని ‘అణువులే’ శాసిస్తున్నాయన్న ఆధు నిక వైజ్ఞానిక దృష్టిని కూడా ఆనాడే కనబరిచాడు వేమన! ప్రకృతి ఆరాధకులు ఇంత ‘సోది’తో పాఠకులను ఎందుకు విసిగించవలసి వచ్చిందంటే, భారతదేశ చరిత్రలో ఇనుపరాతి యుగం, అనంతర ఇనుప రాతి యుగాలలో కేరళలో కులమతాలతో సంబంధం లేని కాలం... దేవుళ్ళు, ఆయుధాలతో నిమిత్తం లేకుండా కేవలం ప్రకృతి జీవనంతో పెనవేసుకున్న ప్రజా సామాజిక జీవన వ్యవస్థ విరాజిల్లుతూ వచ్చిందని వెల్లడయ్యింది. ‘పట్టణం’ పేరుగల ఊరిలో జరిపిన తవ్వకాల్లో కొలది రోజుల క్రితం ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతగా కుల, మతాలతో నిమిత్తం లేకుండా ఎదుగుతూ వచ్చిన ఆ కేరళ ‘పట్టణం’ చరిత్ర కేవలం ప్రకృతి ఆరాధనా చరిత్ర! అక్కడ జరిపిన తవ్వకాల ప్రకారం తెలుస్తున్న ఆ ప్రాచీన స్థల చరిత్రను బట్టి,సంస్థాగతమైన కులమతాల చరిత్రకు అది పూర్తి విరుద్ధ ప్రాంతంగా తేలింది! కుల వ్యవస్థలో అంతర్భాగంగా అంతస్థులుగా ఇముడుకు పోయిన అసమానత్వం ఇక్కడ పరిశోధకులకు కనిపించిన దాఖలా లేకపోవడం విశేషం! కాగా, ఈ అసమానతా ధోరణులు, కుల వ్యవస్థ నేటి కేరళలోనూ, మిగతా భారత రాష్ట్రాలలోని ఆధునిక వ్యవస్థల్లోనూ పెచ్చరిల్లడమే ఆశ్చర్యకరమని పరిశోధకులు పి.జె. చెరియన్, పి. దీపక్ రాస్తున్నారు. విభజనల జాడలు లేవు ఇక్కడి తవ్వకాలలో జరిపిన పరిశోధన ప్రకారం, ఇక్కడ దొరికిన లక్షలాది సిరామిక్ (పింగాణీ) ముక్కలు... మధ్యధరా సముద్ర ప్రాంత దేశాలలో, నైలునది, రెడ్ సీ, భారతదేశ తూర్పు, పశ్చిమ ప్రాంతాల, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాలలో లభించిన పింగాణీ ముక్కలను పోలి ఉండటం విశేషం. ఈ అవశేషాలన్నీ క్రీ.పూ. 5వ శతాబ్ది నుంచి క్రీ.శ. 5వ శతాబ్ది మధ్యకాలం నాటివి. అంతేగాదు, ఈనాటి మాదిరిగా కాకుండా ‘పట్టణం’ నివాసులు కుల, మత హద్దులెరుగని శాంతికాముక ప్రజలుగా పరిశోధకులు నిర్ధారించారు. కులపోరులుగానీ, మతయుద్ధాలుగానీ ఆ ప్రజలు ఎరుగరు. ఈ పరిశోధనలో పాల్గొన్న పరిశోధక ఉద్దండులలో ఆక్స్ఫర్డ్ ప్రముఖు లతోపాటు హైదరాబాద్ మాలిక్యులార్ బయాలజీ పరిశోధకులు కూడా ఉన్నారు. ఈనాడు సమాజాన్ని, సామాజిక వ్యవస్థల్ని కుల మతాల విభజనతో కుళ్లబొడిచి చీల్చుతున్న వైనం ‘పట్టణం’ చరిత్రలో మచ్చుకు కూడా మనకు కనిపించదని పరిశోధకులు తేల్చారు. దీనికి కారణం – సంస్థీకృత లేదా వ్యవస్థీకృత కులం, మతం అక్కడ లేక పోవడమే. అంతేగాదు, ఆనాటి ప్రజలు బహుముఖీన వ్యాపక వ్యవస్థలో ఉండి కూడా కులాతీతంగా, మతాతీతంగా జీవనం గడపడం అత్యంత ఆశ్చర్యకరమని పరిశోధకుల నిర్ణయం. దీనికి ప్రధాన కారణం – ప్రజలు తమను ప్రకృతి నుంచి వేరుగా భావించకపోవడమే. అలాంటి సామాజిక వ్యవస్థతో పోల్చుకుంటే, ఈనాటి సమ కాలీన ప్రపంచంలో పెక్కు సమస్యలకు ప్రధాన కారణం ప్రకృతి సహజ వనరులను విచ్చలవిడిగా దోచుకుపోవడమే. ఈ పరిస్థితిని ‘పట్టణం’ లాంటి ఆదర్శ సామాజిక వ్యవస్థ వ్యతిరేకించింది. సహజ వనరుల దోపిడీకి అడ్డుకట్ట వేసింది. అందుకే ప్రయివేట్ దోపిడీ వ్యవస్థను తమ స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులు (వాళ్లు ఏ ‘బ్రాండు’కు చెందినా) పెంచి పోషించే వ్యవస్థల్లో ఆ ఆదర్శ కులాతీత, మతాతీత సామాజిక వ్యవస్థలు నిలబడలేవు. ప్రశ్నించే హక్కు మాయం ఎక్కడివరకో అక్కర్లేదు – భారత పార్లమెంట్లో సగానికి (250 మందికి)పైగా అవినీతిపరులున్నారని అవినీతి నిరోధక జాతీయ పరిశోధనా సంస్థ అక్షరసత్యంగా జాబితాతో సహా పేర్కొన్నప్పటికీ వారిపై పాలక వ్యవస్థ చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. పైగా ఆ ‘మచ్చ’ను రూపుమాపడానికి బదులు తానూ పూసుకొని సిగ్గువిడిచి తిరుగుతోంది. ఈ జాఢ్యం అంతటితో ఆగలేదు. అసలు ప్రశ్నించే హక్కునే దేశ పౌరులకు దూరంచేసి రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన సమాచార హక్కు చట్టాన్నే మడిచి మడత పెట్టేసి తిరుగుతున్నారు పాలకులు. చివరికి రాజ్యాంగ చట్టం అనుమతించిన ప్రశ్నించే హక్కును కూడా పౌరులకు దూరం చేసేందుకు సాహసించారు. అలాగే, మత మార్పిళ్లు ఎందుకు జరుగుతున్నాయో బుర్రపెట్టి ఆలోచించుకోమని వివేకానందస్వామి నెత్తిన నోరు పెట్టుకుని అనేక సార్లు బోధించినా, మనస్సుల్ని ‘హిందూత్వ’ మతతత్వానికి తాకట్టు పెట్టుకున్న పాలక వ్యవస్థలు విభిన్న మతాల వారిపై దౌర్జన్యాలను, దాడులను కొనసాగిస్తూనే ఉన్నాయి. చివరికి మంత్రుల ‘డిగ్రీ’లను ప్రశ్నించడమే నేరమైపోయింది. రుజువు అడిగినందుకు సమాధానం చెప్పి నోరు మూయించే బదులు, అడిగిన వాడి నోటికి ‘తాళం’ వేసే సంస్కృతికి అలవాటు పడుతున్నారు. ‘ఒక దేశం, ఒకే ఎన్నిక, ఒక ప్రధాని’ అన్న నినాదంతో బయలుదేరిన పాలనా రథం చివరికి సుప్రీం కోర్టును కూడా తాను చెప్పిన జడ్జీలను నియమించాలన్న ఫర్మానాను అమలు పరచాలన్న మంకుపట్టుకు దిగింది. ఇందుకు వ్యతిరేకిస్తున్న సుప్రీంకోర్టుపై కన్నెర్ర చేస్తోంది కేంద్రం. ఈ విపరి ణామాలు దేశానికీ, ప్రజా క్షేమానికీ, నిర్మలమైన పాలనా పద్ధతు లకూ– ఒక్క ముక్కలో ‘భారత ప్రజలమైన మేము’ అన్న విస్పష్ట ప్రకటనతో ప్రజలు రూపొందించుకున్న రిపబ్లికన్ రాజ్యాంగ లక్ష్యాలకే పరమ విరుద్ధమైనవి. ఆ వెరపు ఉంటే దేశ పాలనా వ్యవస్థ తన చేష్టలను సవరించుకుని, ‘పట్టణం’ బాటలోకి రావాలి. గుణపాఠం తీసుకోవాలి. ఎందుకో మళ్లీ వేమన్నే గుర్తుకొస్తున్నాడు: ‘‘అల్పబుద్ధి వానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగ గొట్టు’’! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాకులు abkprasad2006@yahoo.co.in -
గొంతెత్తడం ప్రజల రాజకీయ కర్తవ్యం
అభిప్రాయ ప్రకటనకు వీలులేని స్వాతంత్య్రం నిరర్థకం. పౌరుల సమావేశ స్వేచ్ఛకు, చర్చలకు అవకాశం కల్పించని వ్యవస్థ దేనికి? అలా లేనప్పుడు దేశ సామాజిక వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి అంతకన్నా పెద్ద ప్రమాదం మరొకటి లేదు. బహిరంగ చర్చలు, నిర్ణయాలు ప్రజల రాజకీయ కర్తవ్యమని మరచిపోరాదని శతాబ్దం క్రితమే సుప్రసిద్ధ అమెరికన్ న్యాయమూర్తి జస్టిస్ లూయీ బ్రాండీస్ అన్నారు. పౌరులకు భారత రాజ్యాంగం హామీపడిన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అక్షరసత్యంగా అమలు జరగకుండా పాలక పక్షాలు అడ్డుకుంటూనే వస్తున్నాయి. పౌర స్వేచ్ఛకు ‘శ్రీరామరక్ష’గా నిలబడగలిగిన పాలకులే ప్రజల మన్నన పొందగలరు. పౌరుల సుఖ సంతోషాలే తమ సుఖసంతోషాలని విశ్వసించగలిగినవారే పౌరస్వేచ్ఛకు హామీ ఇవ్వగలరు. ‘‘స్వాతంత్య్రం పొందిన దేశంలో రాజ్య పాలనా వ్యవస్థ అంతిమ లక్ష్యం– దేశ పౌరులు స్వేచ్ఛగా తమ శక్తియుక్తుల్ని వృద్ధి చేసుకునేటట్లు వారికి అండదండలుగా నిలవగల్గడం. ప్రభుత్వంలో నిరంకుశ ధోరణులు ప్రబలి నప్పుడు బుద్ధిగల పాలకులు వాటిని అణచివేయాలి. అలాంటి పాల కులు మాత్రమే ప్రజల మన్ననలు పొందగల్గుతారు. అలాంటి పాలకులు మాత్రమే పౌర స్వేచ్ఛకు ‘శ్రీరామరక్ష’గా నిలబడగలరు. అలాంటి వారు మాత్రమే పౌరుల సుఖ సంతోషాలే తమ సుఖసంతోషాలని విశ్వసించగలరు. పౌరులు స్వేచ్ఛగా ఆలోచించగల్గి, స్వేచ్ఛగా మాట్లాడగల్గడం అనే లక్షణం– రాజకీయ సత్యాల్ని స్వేచ్ఛగా అన్వేషించి కనుగొనడానికి అనివార్యమైన లక్షణమని గుర్తించాలి. స్వేచ్ఛగా అభిప్రాయ ప్రకటనకు, పౌరుల సమావేశ స్వేచ్ఛకు, చర్చలకు అవకాశం కల్పించని వ్యవస్థ నిరర్థకం. ఒక దేశ పౌరులు తమ సమస్యలపై స్పందించడానికి స్వేచ్ఛ లేని దేశ స్వాతంత్య్రం అనర్థం, ప్రమాదకరం. బహిరంగ చర్చలు, నిర్ణయాలు ప్రజల రాజకీయ కర్తవ్యమని మరచిపోరాదు.’’ – సుప్రసిద్ధ అమెరికన్ న్యాయమూర్తి జస్టిస్ లూయీ బ్రాండీస్ ‘‘వచ్చే సాధారణ ఎన్నికలను బలంగా ఎదుర్కోవాలంటే, 2024 పోరాటం ఎవరో ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య జరిగే పోరుగా కాకుండా దేశంలో ప్రజాస్వామ్యానికీ, నియంతృత్వానికీ మధ్య జరగ వలసిన సంకుల సమరంగా అన్ని ప్రతిపక్షాలూ భావించి ఉమ్మడిగా రంగంలోకి దిగేందుకు నడుం కట్టాలి.’’ – ప్రొఫెసర్ హర్బన్స్ ముఖియా, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం చరిత్రాధ్యాపకులు (27 మార్చ్ 2023) జస్టిస్ బ్రాండీస్ శతాబ్దం క్రితం చేసిన చరిత్రాత్మక హెచ్చరిక పౌర సమాజాలకు అరమరికలు లేని బహిరంగ చర్చలు నిరంతర రాజకీయ కర్తవ్యంగా కొనసాగవలసిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. దేశ రాజ కీయ పాలనా వ్యవస్థను ఒక వైపు నుంచి స్వాతంత్య్రానంతరం గాడి తప్పిన కాంగ్రెస్ (ఐక్య సంఘటన పాలన మినహా) పాలకులు, మరొకవైపు నుంచి బీజేపీ నడిపిస్తూ వచ్చాయి. రాజ్యాంగ మౌలిక సూత్రాలను తమ ఇష్టానుసారం తారుమారు చేసి, భారత పౌరులకు రాజ్యాంగం హామీపడిన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అక్షరసత్యంగా అమలు జరగకుండా ఇవి అడ్డుకుంటూనే వచ్చాయి. వ్యక్తిగత ఎజెండా లతో పాలనా పద్ధతుల్ని భ్రష్టు పట్టిస్తూనే వచ్చాయి. ఇక నేటి బీజేపీ పాలకవర్గం ప్రేమించే ఇజ్రాయెల్‌లో ఒక సరికొత్త పరిణామం తలెత్తింది. ఆ దేశ ప్రధానమంత్రిని ఏ పరిస్థితుల్లోనూ పాలనకు తగడని పదవి నుంచి తొలగించడానికి వీలు లేకుండా ఇజ్రా యెల్ తాజాగా చట్టం చేసింది. దీన్ని ‘ఇజ్రాయెలీ రాజ్యాంగ నిర్మాణ వ్యవస్థలోనే సరికొత్త విపత్కర పరిణామం’గా బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూ ట్లో మధ్యప్రాచ్య విధాన నిర్ణయ కేంద్రం డైరెక్టర్ నతన్ సాక్స్ అభివర్ణించాడు. ఇజ్రాయెల్ కొత్త శాసనం ప్రకారం ఆ దేశపు సుప్రీంకోర్టుకు ఇజ్రాయెల్ పాలకవర్గంపైగానీ, దేశ శాసనాలపైగానీ అవసర మైన అదుపాజ్ఞలను జారీ చేసే హక్కు ఉండదు. ఈ తాజా పరిణామం ప్రభావం భారత పాలనా వ్యవస్థకు విస్తరించకుండా ఉండాలని మాత్రమే మనం కోరుకోగలం. విచ్చలవిడిగా దేశ ఏకైక కుబేర వర్గంగా బలిసినవారి గురించి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన పాదయాత్రలో ప్రస్తావించి, విమర్శిస్తే పాలకులకు అంత ‘గుర్రెందు’కు? ఏ మాటకామాటే చెప్పు కోవాలి. కాంగ్రెస్ హయాంలోనూ, వారు ఈ వర్గంతో అంటకాగుతూ వారి దోపిడీ యథేచ్ఛగా సాగడానికి అనుమతించిన వారేనని మరచి పోరాదు! దీనికి భిన్నంగా తన సుదీర్ఘ పాదయాత్రలో కళ్లారా చూసిన ప్రజల కడగండ్ల దృష్ట్యా రూపొందించిన ‘నవరత్న’ ప్రణాళికను ఆ ప్రజలకు జీవశక్తిగా మలిచారు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి. కోవిడ్ ఒడుదొడుకుల ఫలితంగా రాష్ట్రం తలపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడానికి ఇబ్బందులు ఎదురైనా జగన్ తట్టుకోగల్గడం ప్రశంసనీయ పరిణామంగా భావించాలి. అందుకే వేమన అన్నాడేమో: ‘‘భూమిలోన పుణ్యపురుషులు లేకున్న జగములేల నిల్చు పొగులు లేక (కుమిలిపోక)’’ రాహుల్ ఇవాళ ఇన్ని కబుర్లు చెబుతున్నారుగానీ, జగన్‌కన్నా ముందు ఉన్నత స్థాయికి ఎందుకు దూసుకురాలేక పోయారు? ‘అసూయ’ అనలేంగానీ, తనపై బనాయించిన అక్రమ కేసుల్ని జగన్ ఎదుర్కొంటూ పదహారు మాసాలకు పైగా జైళ్లలో మగ్గుతున్న ఘడియలలో ఒక్కసారైనా రాహుల్ సానుభూతిని ప్రకటించగలిగాడా? ఇవాళ సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లను సుప్రీంకోర్టు హెచ్చరికలను సహితం లెక్క చేయకుండా స్వార్థ రాజకీయాలకు బీజేపీ పాలకవర్గం వినియోగిస్తున్న తీరు అభ్యంతరకరమే కాదు, పరమ హాస్యాస్పదం! ‘ఉపా’ చట్టాన్ని తమ మనుగడకు బీజేపీ పాల కులు ‘ఉపాహారం’గా మలుచుకోవడం దారుణ పరిణామం! ప్రస్తుత సుప్రీంకోర్టు చైతన్యంతో నిర్ణయాలు చేస్తూండటం ఒక్కటే జస్టిస్ బ్రాండీస్ సంప్రదాయానికి నేడూ, రేపూ ‘శ్రీరామరక్ష’గా భావించాలి! ఇంతకూ మనం కనీసం కోరుకోదగిందల్లా – సుప్రీంకోర్టు అధికారాలను ఇజ్రాయెల్ పార్లమెంట్ తగ్గించినట్టుగా 2024 ఎన్నికలకు ముందే అలాంటి పరిణామం భారత్‌లో రాకూడదనే! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాకులు abkprasad2006@yahoo.co.in -
ఏ ప్రభుత్వమైనా ఇదే తంతు!
నిష్పక్షపాతంగా ఉండాల్సిన దర్యాప్తు సంస్థలు పాలకుల చేతి చిలకలుగా ఉంటున్నాయన్న ఆరోపణలు కొత్తవి కాదు. ఈ సంస్కృతికి ఏ ఒక్క పార్టీనో నిందించి ప్రయోజనం లేదు. సీబీఐ, ఈడీ, ఆదాయ పన్ను శాఖ ఉన్నతాధికారుల చేతులు మెలిపెట్టి వారిని వాడుకోవడంలోనూ; రాజనీతికి, దేశ విశిష్ట రాజ్యాంగ చట్ట నిబంధనలకు యథేచ్ఛగా తిలోదకాలివ్వడంలోనూ పాలకుల మధ్య ఎత్తుగడలలో తేడాలే తప్ప వ్యవహారం మొత్తం ఒకే రకం. అలాగే ఇవాళ ప్రతిపక్ష నాయకుల్ని, పాత్రికేయుల్ని, ప్రజా సమస్యలకు న్యాయమైన పరిష్కారాన్ని కోరుతూ ఉద్యమాలు నిర్వహిస్తున్న పౌర హక్కుల ఉద్యమకారులపై పోలీసు జులుం వినియోగించే సంస్కృతికి కూడా పాలక పార్టీలు సమాన స్థాయిలో మూల విరాట్టులేనని మరచిపోరాదు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన సంస్థలను కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోందన్న రొడ్డ కొట్టుడు ప్రకటనలను ప్రజలు వినలేక చస్తున్నారు. ఎందుకంటే,‘అందరూ శాకాహారులే అయితే రొయ్యల బుట్ట కాస్తా ఎలా ఖాళీ అయిపోయిం’దన్న ప్రశ్నకు సమాధానం వారికి ఇంతవరకూ దొరక లేదు కాబట్టి! దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న ముహూర్త కాలంలో కూడా ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఎందుకని? నాయకులకన్నా స్వాతంత్య్రం కోసం ఆస్తులు, ప్రాణాలు సహా దేశ ప్రజా బాహుళ్యం అనంతమైన త్యాగాలు చేసి ఉన్నారు గనుక. ఇవాళ ప్రతిపక్ష నాయకుల్ని, వారి అనుయాయుల్ని, పాత్రికే యుల్ని, పౌర సమాజాన్ని, ప్రజా సమస్యలకు న్యాయమైన పరిష్కా రాన్ని కోరుతూ ఉద్యమాలు నిర్వహిస్తున్న పౌర హక్కుల ఉద్యమ కారులను హింసిస్తూ, వారిపై పోలీసు జులుం వినియోగించే పాలక సంస్కృతికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సమాన స్థాయిలో మూల విరాట్టులేనని మరచిపోరాదు. అంతేగాదు, కోర్టుల్ని ధిక్కరించి, వాటి చేతుల్ని మెలిపెట్టి పనులు నిర్వహించుకునే సంస్కృతికి తెరలేపినవీ కూడా ఈ రెండు పార్టీలేనని నిద్రలోనూ మరవరాదు. అలహాబాద్ హైకోర్టు సాహసించి ఇందిరాగాంధీ ‘ఎమర్జెన్సీ రాకెట్’ బాగోతాన్ని బట్టబయలు చేస్తూ శఠిస్తూ చెప్పిన చరిత్రాత్మక తీర్పును ఆమోదిస్తూనే సుప్రీంకోర్టు ప్రసిద్ధ న్యాయమూర్తి కృష్ణయ్యర్ ఉదార దృక్పథంతో ఇందిరా గాంధీ ‘విషయాన్ని చక్కబెట్టుకోవడానికి’ వెసులుబాటు కల్పించబట్టి తక్షణం ఆమె రాజీనామా వాయిదాపడింది. సీబీఐ, ఈడీ, ఆదాయ పన్ను శాఖ ఉన్నతాధికారుల చేతులు మెలిపెట్టి వారిని వాడుకోవడంలోనూ; రాజనీతికి, దేశ విశిష్ట రాజ్యాంగ చట్ట నిబంధనలకు యథేచ్ఛగా తిలోదకాలివ్వడంలోనూ కాంగ్రెస్, బీజేపీ పాలకుల మధ్య ఎత్తుగడలలో తేడాపాడాలే తప్ప వ్యవహారం మొత్తం ఒకే రకం. ప్రజాబాహుళ్యాన్ని, వారి సంక్షేమాన్ని ప్రజాస్వామిక పద్ధతుల్లో తీర్చిదిద్దుతూ వచ్చిన ఉదాహరణలు తక్కువ. స్వతంత్ర సంస్థలుగా ఉండవలసిన సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖలను గతంలో ‘చేతివాటు’ పనిముట్లుగా వాడుకున్న తీరు చివరికి సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లడమూ, కోర్టు సీబీఐ, ఈడీ అధికారు లను చీవాట్లు పెడుతూ, ఇకమీదట ‘మీరు కేంద్ర ప్రభుత్వానికే కాదు, సుప్రీం న్యాయస్థానానికి బాధ్యులై ఉండాల’ని కఠినంగా ఆదేశించడమూ జరిగింది. బహుశా ఈ పరిణామాలను గమనించిన తరువాతనే కేంద్ర సీబీఐ మాజీ ఉన్నతాధికారి, గూఢచార శాఖ మాజీ అధిపతి రామేశ్వర్ నాథ్ కావ్ కూడా పాలకుల ప్రలోభాల ఫలితంగా గూఢచార శాఖ అధికారులు చూచి రమ్మంటే కాల్చి వచ్చే బాపతులుగా తయారు కావడం విచారకరమని ఒక పుస్తకమే రాసి విడుదల చేశారు. ఈ బాగోతం ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ఇలాంటి ఉదాహరణలను పెక్కింటిని ‘హిందూ’ దినపత్రిక మేటి పక్ష పత్రిక అయిన ‘ఫ్రంట్ లైన్’ ప్రత్యేక ప్రతినిధి, విశిష్ట విశ్లేషకుడైన ఆశుతోష్ శర్మ పేర్కొన్నారు: ‘‘రూ. 300 కోట్ల మనీ లాండరింగ్ కుంభకోణం కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి నారాయణ్ రానే, అధికార పక్షంలో చేరడంతోనే అతనిపై అంతకుముందున్న కేసు కాస్తా మాఫీ అయిపోయింది. అదే తరహాలో పశ్చిమ బెంగాల్లో ‘నారదా’ కుంభ కోణంలో నిందితుడైన సువేందు అధికారిపై విచారణ కాస్తా రద్దయిపోయింది. మధ్యప్రదేశ్ షిండే సేనకు చెందిన భావనా గవ్లీకి ‘ఈడీ’ జారీ చేసిన అయిదు సమన్లను ఖాతరు చేయకపోయినా ప్రస్తుత లోక్‌సభలో ‘షిండే సేన’కు ఛీఫ్ విప్‌గా ఉన్నారు. అలాగే, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్ట (ఫెమా) ఉల్లంఘన కేసులో ఈడీ విచారణలో ఉన్న యశ్వంత్ యాదవ్, ఎమ్మెల్యే యామినీ యాదవ్ దంపతులిద్దరూ ఇప్పుడు ‘షిండే సేన’లో సభ్యులుగా ఉన్నారు. మనీ లాండరింగ్ కేసులో శివ సేన సభ్యుడుగా ఉన్న ప్రతాప్ సర్ నాయిక్‌పై ‘ఈడీ’ సోదా నిర్వహించితే ఇప్పుడతను షిండే సేనలోకి చేరడంతోనే కేసు కాస్తా మాఫీ అయిపోయింది. ఈ సందర్భంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి, ‘ఆప్’ జాతీయ నాయకు డైన అరవింద కేజ్రీవాల్ (మార్చి 1న) ఒక ప్రశ్న సంధిస్తూ ‘ఈ రోజున ఆప్ మంత్రి మనీష్ సిసోడియా బీజేపీలో చేరితే, రేపంటే రేపే విడుదలైపోడా?’ అని ఓ జోక్ వదిలారు. అంతేగాదు, సుప్రీంకోర్టు న్యాయవాది కాళీశ్వరం రాజ్ – ‘భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందంటే, కోర్టు నిర్ణయించిన న్యాయమూర్తుల నియా మకాల్ని కూడా తిమ్మినిబమ్మిని చేసి తారుమారు చేయగల శక్తి పాలక వర్గానికి ఉందని అర్థమవుతోంది’ అని చురక వేశారు. అయితే, ఎప్పు డయితే సుప్రీం కోర్టుకు ప్రగతిశీల ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ పదవీ స్వీకారం చేశారో అప్పటినుంచీ సుప్రీంకోర్టు నుంచి వెలువడుతున్న ప్రజాహిత నిర్ణయాలు దేశ ప్రజలకు మంగళకర సూచనగా భావించాలి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలనా కాలంలో సుప్రీం న్యాయమూర్తి హోదాలో జస్టిస్ ఖన్నా దేశవ్యాప్తంగా పౌర హక్కుల వినాశానికి, పాలక నియంతృత్వ ధోరణులకు ‘ఫుల్ స్టాప్’ పెట్టించి రాజకీయ ఖైదీల విడుదలకు ఉత్తర్వులు జరూరుగా జారీ చేసి, దేశంలోనూ, విదేశాలలోనూ ఖ్యాతి గడించారు. తాను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కానున్న సమయంలో ఆ పదవిని త్యాగం చేసిన జస్టిస్ ఖన్నాను విదేశాలు మరచిపోలేదుగానీ, మన దేశంలో అలాంటి న్యాయమూర్తికి ఏటా నివాళులర్పించగల కనీస సంస్కారం కూడా మనలో కరువై పోయింది. ఒక దేశం, ఒకే ఎన్నిక, ఒకే నాయకుడు అన్న ధోరణి రాజ్యాంగం నిర్దేశించి, గ్యారంటీ చేసిన ఫెడరల్ (సమాఖ్య) వ్యవస్థకు చేటు కల్గి స్తుందని దేశ ప్రజలు స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఈ సందర్భంగా కవయిత్రి మాయా ఏంజెలో (శివలక్ష్మి అనువాదం) స్వేచ్ఛా పక్షికీ, ‘పంజరంలోని పక్షి’కీ గల తేడాను వర్ణిస్తూ చెప్పిన మాటల్ని విందాం: ‘‘స్వేచ్ఛా పక్షి తన శక్తి మేరకు ఆకాశాన్ని సైతం శుభ్రం చేయడానికి ధైర్యం చేస్తుంది... పంజరంలో పక్షి భయంకరంగా వణికే గొంతుతో పాడుతుంది కానీ, చాలాకాలంగా సుదూరపు కొండలనుంచి శ్రుతి తప్పిన రాగం అస్పష్టంగా పంజరం నుంచి విముక్తి కోసం పక్షి స్వర రాగం విషాదంగా వినపడుతూనే ఉంటుంది స్వేచ్ఛా పక్షులు ఆహ్లాదకరమైన ఇతర పక్షుల గురించి ఆలోచిస్తాయి చెట్లు వదిలే వాణిజ్య వాయువుల్ని మృదువుగా ఆస్వాదిస్తాయి ఆ పక్షులు ఆకాశానికి తమ పేరు పెట్టుకుంటాయి! కానీ పంజరంలోని పక్షి తన కలల సమాధిపై నిలబడి ఉంటుంది ఆ పక్షి రెక్కలు కత్తిరించబడ్డాయి, పాదాలు కట్టివేయబడ్డాయి కాబట్టి పంజరంలో పక్షి పాడటానికి తన గొంతు సవరించుకుంటుంది పంజరంలో పక్షి పాడుతుంది భయకంపితమైన స్వరంతో తన స్వేచ్ఛను ఎలుగెత్తి చాటే పక్షి స్వర రాగం విషాదంగా వినబడుతూనే ఉంది!’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
విశాఖను వరించిన పెట్టుబడులు
కేవలం 1 శాతం సంపన్నవంతులను మాత్రమే పట్టించుకుంటూ, ప్రపంచంలోని మిగతా 99 శాతం భవిష్యత్తును గాలికి వదిలేయకూడదు. కొద్దిమంది చేతుల్లో ద్రవ్య అధికార కేంద్రీకరణ జరిగి అది మిగతా ప్రపంచ భవిష్యత్తును శాసించడం పచ్చి నిరంకుశత్వం. వీటిని పూర్తిగా గుర్తెరిగి, ప్రపంచ పెట్టు బడులను పూర్తిగా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా మలుస్తూ సాగింది విశాఖపట్నంలోని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్. విశాఖ కేంద్రాన్ని ప్రపంచ పెట్టుబడులకు కేంద్ర స్థానంగా ఎందుకు మార్చకూడదన్న ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ముందుకు సాగిన ఫలితమే – ఈ సదస్సు. ‘‘20వ శతాబ్దపు పెట్టుబడిదారీ వ్యవస్థ 21వ శతాబ్దపు సమాజాన్ని తీర్చిదిద్దడంలో విఫలమైందా? గత 30 సంవత్సరాల వ్యవ ధిలో సంపన్న వర్గాలకూ, పేద వర్గాలకూ మధ్య ఆదాయ వనరులలో వ్యత్యాసం దారుణంగా పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో మనకు నూతన వ్యవస్థ అవసరమని చెప్పినంత మాత్రాన పరిస్థితులు మారవు. ఉన్న వ్యవస్థ ఎందుకు ప్రజాబాహుళ్యం అవసరాలను తీర్చలేకపోతోంది? కొలది మందిలో పేరుకుపోయిన అవధులు లేని కోరికలు; పేద, కార్మిక వర్గాల హక్కులపై సాగుతున్న దాడులు– ఈ పరిస్థితులు వెరసి ఉత్పత్తి అవుతున్న సంపద పంపిణీలో వాటాను పేద సాదలు అనుభవించనివ్వకుండా చేస్తున్నాయి. ఇలా పేద సాదల న్యాయమైన డిమాండ్ కుంచించుకు పోతూ, వ్యాపార సరళి దెబ్బతింటూపోతే వ్యాపార వర్గాల వ్యాపారమూ బతికి బట్ట కట్టలేదని గుర్తించాలి. కను కనే, అమెరికా అధ్యక్ష కార్యాలయ సలహాదారుగా పనిచేసిన లారీ సమ్మర్స్ 40 శాతం అమెరికన్లలో పెట్టుబడిదారీ విధానమంటే సాను కూల అభిప్రాయం లేదని బాహాటంగా చాటాడు’’. – షరాన్ బ్రూనో, అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ‘‘నానాటికీ పెరిగిపోతున్న సామాజిక అసమానతలు ప్రపంచ ప్రజల భావి భాగ్యోదయానికీ, భద్రతకూ కాచుకు కూర్చున్న పెద్ద ప్రమాదం’’. – ప్రపంచ ఆర్థిక, సహకారాభివృద్ధి సమాఖ్య ప్రపంచ పెట్టుబడులకు దావోస్ కేంద్ర స్థానంగా ఉండి, వర్ధమాన బతుకుల్ని శాసిస్తూ వచ్చిన దశ నుంచి కొత్త మార్పు మొదలైంది. కేవలం 1 శాతం సంపన్నవంతుల గొంతును వినిపిస్తూ ప్రపంచంలోని మిగతా 99 శాతం ప్రజాబాహుళ్యం భవిష్యత్తును దావోస్ గాలికి వదిలేస్తూ వచ్చింది. కనుకనే స్విట్జర్లాండ్ యువజన సమాఖ్య అధిపతి డేవిడ్ రాత్, కొద్దిమంది చేతుల్లో ఈ ఆర్థిక, ద్రవ్య అధికార కేంద్రీకరణ మిగతా ప్రపంచ ప్రజాబాహుళ్యం భవిష్యత్తును శాసించడం పచ్చి నిరంకుశత్వంగా అభివర్ణించాడు. అలాంటి దావోస్ సభలలో చర్చలను, ఫలితాలను అవగతం చేసుకొని వచ్చిన అనుభవం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్ర సమగ్రా భివృద్ధి కోసం పథక రచన చేశారు. భారతదేశంలో విశిష్ట సహజ సాగర వనరులకు కేంద్రంగా, సహజ సంపదలకు ఆలవాలంగా ఉండి, దేశీయ పారిశ్రామిక స్థావరా లలో ఆంధ్రప్రదేశ్ తూర్పు కోస్తాలో ప్రభవిల్లుతూ వచ్చిన నగరం– విశాఖపట్నం. విశాఖ కేంద్రాన్ని ప్రపంచ పెట్టుబడులకు కేంద్రస్థానంగా ఎందుకు మార్చకూడదన్న ఆలోచనతో జగన్ ముందుకు సాగిన ఫలితమే – గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023. భారీ పారిశ్రామిక, ఉపాధి అవకాశాల కేంద్రంగా ఈ విశాఖ సదస్సును జయప్రదం చేయగలగడం అతని వయస్సుకు మించిన గౌరవాన్ని తెచ్చి పెట్టింది. ఎందుకంటే, బహు కొలది మందిగా ఉన్న సంపన్నుల చేతుల్లో ఆర్థిక, ద్రవ్య వనరుల కేంద్రీకరణ వల్ల ఆ వర్గాలే మిగతా అసంఖ్యాక ప్రజా బాహుళ్యంపై నియంతృత్వం చలాయించే ప్రమాదం ఇప్పటికే బలంగా పొంచి ఉంది. అందుకే జగన్ తన ‘నవరత్నాల’ పథకం ద్వారా ఆదిలోనే ప్రజా ప్రయోజనాల రక్షణకు ‘ఏడుగడ’గా నిలిచారు. అందుకే విశాఖ పెట్టుబడుల సదస్సు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయో జనాలకు రాగల నష్టం ఏమీ ఉండదు. పైగా ప్రపంచ వ్యాపిత పెట్టు బడులు రాష్ట్రానికి రాగల అవకాశాలు మరింతగా పెరిగాయి. రాష్ట్రానికి కేంద్రమూ, బీజేపీ పాలకులూ రాష్ట్ర విభజన సమయంలో హామీ పడిన ప్రత్యేక హోదా విషయంలో అనుసరిస్తున్న ‘రాజకీయ తాత్సారం’ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అపారమైన నష్టం వాటి ల్లింది. దీనికితోడు క్రియాశీల పాత్ర నిర్వహించవలసిన అతుకుల బొంత ‘తెలుగుదేశం’, ‘గాలివాటు’ రాజకీయాలకు పేరుమోసిన ‘సినీ వంగడం’ పవన్ కల్యాణ్ ‘వారాహి’ అబద్ధాలకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని దుఃస్థితిలో ఉన్నారు. ఈ రాజకీయ ‘విచిత్ర వేషధారణ’ తంతు పసికట్టిన ప్రధాని మోదీ తన బీజేపీ (ఆరెస్సెస్)కి ఏపీలో రాజకీయ అవకాశాల్ని పెంచుకోవడం కోసం ‘దేశం’తో పవ న్కు ఉన్న చెట్టాపట్టాల్ని తెగ్గొట్టగలిగారేగానీ, వారి మధ్య అక్కరకు రాని రహస్య సమావేశాల్ని ఆపలేకపోయారు. అయితే ఏపీ సీఎం జగన్ ప్రగతి మార్గాన్నీ, ‘నవరత్నాల’ బలమైన ప్రభావాన్నీ వీళ్లెవరూ అడ్డుకోలేక పోయారు. పైగా ఆయనకు అవాంతరాలు కల్పిస్తూ రోజు రోజుకీ ప్రజల ముందు అభాసుపాలవుతున్నారు. ఈ దశలో రాష్ట్రానికి దూసుకువచ్చిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ శిఖరాగ్ర సమావేశం జగన్ చొరవ ఫలితంగా జయప్రదం కాగల్గింది. అందుకే జగన్ ‘‘మేము అమలు చేస్తున్నవి కేవలం ఉచిత పథ కాలు కావు. ఇదంతా మానవ వనరుల మీద పెడుతున్న పెట్టుబడిగా మేం భావిస్తున్నాం. మానవ వనరుల నైపుణ్యాభివృద్ధిపైన పెట్టు బడిగా భావిస్తున్నాం. మా విద్యార్థులు సొంత కాళ్లపై నిలబడి, ఉన్నత స్థానాలకు ఎదగడానికి అవసరమైన వనరులను సమకూరుస్తున్నాం. అందుకోసం విద్యాప్రమాణాలు పెంపొందిస్తున్నాం. అభివృద్ధిలో వారిని భాగస్వాములు చేస్తున్నాం’’ అనగలిగారు. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు 62 శాతం పదవులు ఇచ్చి దేశ చరిత్రలో నూతన ఒరవడిని సుస్థిరపరిచి దేశ చరిత్రలోనే మొదటి స్థానంలో జగన్ నిలబడటానికి ‘దమ్ము’ అందించినవీ, అధికారానికి రావడానికి ముందే సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా గడించిన ప్రజాస్పర్శతో ప్రకటించినవీ అనుల్లంఘనీయమైన ‘నవరత్నాల’ని మరచిపోరాదు. తద్వారా దేశంలోని రాజకీయ పార్టీలకూ, ముఖ్యమంత్రులకూ తండ్రి రాజశేఖరరెడ్డి తర్వాత అంత ఆదర్శంగా నిలిచినవాడు జగన్! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
పాలనా రథానికి ప్రజలే రక్ష!
భారతీయులు 140 కోట్ల మంది తనకు రక్షా కవచంగా ఉన్నారని ప్రధాని అన్నారు. మరి అలాంటప్పుడు ఒక డాక్యుమెంటరీని ఎందుకు అంతగా ప్రభుత్వం వ్యతిరేకించింది? భారత సమాజ పరిస్థితులు, ప్రభుత్వ చర్యల గురించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోగోరే భారతీయుల హక్కుల్ని ఇది కాలరాయడం కాదా? ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడటం కష్టసాధ్యమని నమ్మిన నాయకులున్నారు. కానీ జాతీయోద్యమ నాయకుడైన మహావీర్ త్యాగి ప్రజలు భాగస్వాములు కాని అధికారాలు ప్రభుత్వాలకు ఉండటానికి వీల్లేదని వాదించారు. ప్రాథమిక హక్కుల్ని ప్రభుత్వాలు కాలరాచే పరిస్థితుల్లో అలాంటి ప్రభుత్వాల్ని కూలద్రోసే హక్కును ప్రజలకు దఖలు పరచాలన్నారు. ‘‘నా ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను దేశ ప్రజలు నమ్మ బోరు. 140 కోట్లమంది భారతీయులూ నాకు రక్షణగా, సురక్షితమైన కవచంగా ఉన్నారు.’’ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (8 ఫిబ్రవరి 2023) గుజరాత్లో 2002లో మైనారిటీలపై జరిగిన మూకుమ్మడి హత్యా కాండ గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒక ప్రకటన చేస్తూ– గుజరాత్ ప్రజల రాజ్యాంగ హక్కులను కాపాడటంలో గుజరాత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనీ, ఆ తర్వాత వారాల తరబడి సాగిన హింసాకాండను అదుపు చేయలేక పోయిందనీ నిశితంగా విమర్శించింది. అంతేగాదు, గత 20 సంవత్సరాలుగానూ దేశవ్యాప్తంగా వివిధ బాధ్యతాయుత సంస్థల ప్రతినిధులు, మానవ హక్కుల నాయకులు ఈ విపరిణామాన్ని ఖండిస్తూ వచ్చారు. అయినా 2002 నాటి గుజరాత్ హింసాకాండను ప్రోత్సహించిన బాధ్యు లెవరిపైనా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోలేదు. గుజరాత్ ఊచ కోతలపై ‘ఇండియా – ది మోదీ క్వశ్చన్’ మకుటం కింద ఒక డాక్యు మెంటరీని ‘బీబీసీ’ విడుదల చేసింది. అయితే ఈ డాక్యుమెంటరీ ‘భారతదేశ సార్వభౌమాధికారాన్ని, నిజాయితీని అవమాన పరుస్తోం’దన్న పేరిట సామాజిక మాధ్యమాలన్నిటి నుంచి ప్రభుత్వం తొలగించింది. భారత సమాజ పరిస్థితుల గురించి, ప్రభుత్వ చర్యల గురించి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోగోరే భారతీయుల హక్కుల్ని కాలరాయడం పట్ల శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు తదితర విద్వత్ సంపన్నులు 500 మందికి పైగా విస్మయం వ్యక్తం చేశారు. పరిణామాలకు అద్దం నిజానికి ‘బీబీసీ’ డాక్యుమెంటరీ వచ్చింది గుజరాత్ మారణకాండ అనంతరం 20 సంవత్సరాలకు. అంతకుముందే 2010 నాటికే రాణా అయూబ్ ‘గుజరాత్ ఫైల్స్’ పేరిట గుజరాత్ బీజేపీ పాలకవర్గ ‘మాలోకా’న్ని ప్రత్యక్షరబద్ధంగా నమోదు చేసింది. ఈ గ్రంథానికి ఉపోద్ఘాతం రాసింది మరెవరో కాదు, సాక్షాత్తూ మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ. ‘ఈశావాప్యోపనిషత్’లో కళ్లు తెరిపించే ఒక సూక్తి ఉంది: ‘‘నిజం అనే ముఖాన్ని కనపడనివ్వకుండా ఓ బంగారు కుండీలో దాచి ఉంచుతారు. అసలా జలతారు కుండీలో దాగిన నిజమేమిటి?’’ అలాగే నిజమనేది కట్టుకథకు అందని వాస్తవం! అలాంటి ‘గుజరాత్ వాస్తవాల’ను రాణా అయూబ్ సాహసంతో బహిర్గతం చేసిందని శ్రీకృష్ణ కితాబిచ్చారు. ‘అయూబ్ రచన పరి శోధనాత్మక పాత్రికేయ విధి నిర్వహణలో ఒక సాహస యాత్ర. పాలనా రంగంలో నానాటికీ పెరిగిపోతున్న నిజాయితీకి పాతరేసి, దొంగచాటు రాజకీయ కుట్రలకు మార్గం తీస్తున్న పరిణామాలకు ప్రత్యక్ష సాక్ష్యం’ అని పేర్కొన్నారు. రాజ్యాంగ రచనా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అంబేడ్కర్, భారత ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఎన్నికైనందున అధికార దుర్వినియోగానికి పాల్పడటం కష్టసాధ్యమన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అంబేడ్కర్ అభిప్రాయంతో జాతీయోద్యమ నాయకుల్లో ఒకరైన మహావీర్ త్యాగి(1899–1980) విభేదిస్తూ, అంబేడ్కర్ లాగా ఇలాంటి అభిప్రాయాలు కల నాయకులెవరైనా ఉంటే వారు అలాంటి ప్రకటనలు చేయబోయేముందు కొన్నాళ్లు జైలులో ఉండొస్తే మంచిదని వ్యంగ్యంగా సలహా ఇచ్చారు! ఆ పిమ్మట త్యాగి, రాజ్యాంగ రచన ముసాయిదా సంఘానికి సవాలుగా ఒక ప్రతిపాదన చేస్తూ, ప్రజలకు ఆమోదించిన ప్రాథమిక హక్కుల్ని ముందుముందు ఏర్పడబోయే ప్రభుత్వాలు కాలరాచే పరిస్థితుల్లో అలాంటి ప్రభుత్వాల్ని కూలద్రోసే లేదా మార్చేసే హక్కును ప్రజలకు దఖలు పరిచే అంశాన్ని చర్చించారా లేదా అని ప్రశ్నించారు. ప్రజలకున్న అలాంటి సహజమైన హక్కుకు మీరు గ్యారంటీ ఇవ్వలేదని త్యాగి విమర్శిస్తూ ప్రభుత్వ హక్కులతోపాటు ప్రజల హక్కుల్ని గురించి కూడా ఆలోచించా లన్నారు. ప్రజలు భాగస్వాములు కాని అధికారాలు ప్రభుత్వాలకు ఉండటానికి వీల్లేదని త్యాగి వాదించారు. అందుకు పూర్తిగా సమ్మ తిస్తూ డాక్టర్ అంబేడ్కర్, ఉత్తరోత్తరా ప్రివెంటివ్ డిటెన్షన్ (ముందస్తు ఊహపై ఆధారపడి) పైన వ్యక్తుల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టే స్వేచ్ఛను భావిప్రభుత్వాలకు అనుమతించే ప్రసక్తి ఉండరాదని పలుమార్లు స్పష్టం చేశారు. దేశ స్వాతంత్య్రం తర్వాత ప్రజాస్వామ్యం, ఎన్నికల మాటున ‘ఓటు’ ఎరలోనూ షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తరగతులకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు. పైగా ఎన్నికల పేరిట సంపన్న వర్గాలు, కుల, మత, రాజకీయ పక్షాలూ చేసిందీ, చేస్తున్నదీ – అన్ని కులా లలోని పేదలు, అణగారిన ప్రజలు చైతన్యం పొందకుండా జాగ్రత్త పడటం మాత్రమే. అంబేడ్కర్ ముసాయిదా రాజ్యాంగ ప్రతిని వెలుగు చూడకుండా రాజ్యాంగ రచనా సంఘంలోని కొందరు సభ్యులు విశ్వ ప్రయత్నం చేశారు. అడ్డదారులలో ఎన్నికల పేరిట కుల, మత సంపన్న వర్గాల సభ్యులు హెచ్చుమంది ఎలా అనతికాలంలోనే ‘కుబేర సంతానం’గా మారి భారతదేశ ఆర్థిక వ్యవస్థనే, తారుమారు చేయడానికి వెనుదీయడం లేదో ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది. రాజ్యం కార్పొరేట్ ఎస్టేట్ వ్యాపారంగా ఎలా మారిపోయిందో రుజువై పోయింది. స్వతంత్రంగా వ్యవహరించాలి 1951 మేలోనే కేంద్ర, రాష్ట్ర శాసన వేదికల్లోకి ప్రవేశించడానికి ఎవరెవరిని అనర్హులుగా ప్రకటించాలో ‘ప్రజా ప్రాతినిధ్య బిల్లు’ను అంబేడ్కర్ ప్రవేశపెడుతూ అవసరమైన సవరణలను కూడా ప్రతి పాదించారు. వాటిలో ప్రధానమైనవి – పార్లమెంట్, ఎన్నికల చట్టం పార్లమెంట్ సభ్యుల స్వేచ్ఛను ప్రభుత్వ స్వేచ్ఛను భిన్నమైనవిగా భావించాలి. మొత్తం పార్లమెంట్‌ను అవినీతికి ‘పెద్ద బిడ్డ’గా మార్చ కుండా ఉండే విధంగా సభనూ, ఎన్నికల చట్టాన్నీ రూపొందించాలి. పార్లమెంట్ సభ్యులకు రాజకీయ పదవులను కట్టబెట్టడం ద్వారా లేదా ఇతర ప్రలోభాలకు లోను చేయడం ద్వారా మొత్తం పార్లమెంట్‌ను లేదా శాసన వేదికలను అవినీతిపాలు చేసేలా ప్రభుత్వానికి అవకాశం కల్పించకూడదు. దానికి తగిన విధంగా మన శాసన వేదికలు, పార్ల మెంట్, ఎన్నికల చట్టమూ ఉండాలని అంబేడ్కర్ అభిలషించారు. పార్లమెంట్ లేదా శాసన వేదిక అనేది నిర్భీతిగా, ప్రభుత్వం నుంచి ఏ ప్రలోభాన్ని ఆశించకుండా స్వతంత్రంగా వ్యవహరించలేని నాడు అలాంటి శాసన వేదికలు నిష్ప్రయోజనకరం. శాసన వేదికలు ప్రభు త్వాలు చెప్పే మాటలకు డూడూ బసనన్నలుగా, నట, గాయక వందిమాగధులుగా వ్యవహరించరాదని కూడా అంబేడ్కర్ (1951 మే 9) నిర్మొహమాటంగా పేర్కొన్నారని మరచి పోరాదు. పార్లమెంట్ ఒక స్టాక్ ఎక్స్ఛేంజీగా (వ్యాపార లావాదేవీల కేంద్రం) ఇప్పటికే (1951 నాటికే) మారిపోయిందని పండిట్ లక్ష్మీకాంత మైత్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంప్రదాయానికి 75 ఏళ్లకు కూడా ‘కళ్లెం’ వేయడానికి పాలకులకు ఇష్టం లేదు. దీనివల్ల పాలకులు ప్రయోజనం పొందడం సహజం. కనుకనే న్యాయ వ్యవస్థ తన జడత్వాన్ని క్రమంగా వదిలించుకుని చైతన్యావస్థలోకి వచ్చి కఠినమైన నిర్ణయాలు తీసుకోగల సత్తాను సంతరించుకుంటోంది. అందుకే కవి కుమారుడు ఎంతటి కమ్మని సూక్తిని విడిచి వెళ్లాడో గదా – ‘‘బలవంతపు రాజ్యకాంక్షా ఒక పాపము జూచునే ఈశ్వరా?’’! తన ‘బీదతనం’ దేశ దారిద్య్రమనీ, తన మరణం లోక ప్రళయమనీ భావించి సంచరించే అహంకారుల గురించి సుమతీ శతకకారుడు హెచ్చరించలేదూ?! abkprasad2006@yahoo.co.in -
రాజా రామ్మోహన్ రాయ్ జాతీయ అవార్డుకు ఎంపికైన డాక్టర్ ఏబీకే ప్రసాద్
జర్నలిజం రంగంలో అత్యుత్తమమైన సేవలు అందించినందుకు ప్రతిష్టాత్మకమైన రాజా రామ్మోహన్ రాయ్ అవార్డుకు డాక్టర్ ఏబీకే ప్రసాద్‌ను ఎంపిక చేసినట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఏబీకేగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ పాత్రికేయ రంగంలో 75 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారు. ఆధ్ర ప్రదేశ్ నుంచి వెలువడిన ప్రధాన పత్రికలకు సంపాదకులుగా పనిచేసిన అరుదైన గౌరవం వీరికి దక్కింది. 2004-2009 వరకు ఆంధ్ర ప్రడేశ్ రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షులుగా కూడా ఆయన పనిచేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని కమిటి ఈ అవార్డును ప్రకటించింది. ఫిబ్రవరి 28 న డిప్యూటీ స్పీకర్ హాల్, కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా, రఫీ మార్గ్, న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్దు ప్రదానోత్సవం జరుగుతుంది. -
ముంచే గాలివాటు రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్ గత శాసనసభ ఎన్నికల్లో ‘బింకానికి’ పోయి రెండు చోట్ల నిలబడి, ఘోరాతిఘోరమైన ఓటమి పాలయ్యాడు పవన్ కల్యాణ్. పరువూ పోయింది, ‘పవరూ’ రాలేదు. అయినా తన డంబపు ‘పవనిజం’ స్లోగన్‌ను వదులుకోలేదు. అంతవరకే అయితే సరే అనవచ్చు. కానీ ఆయన ఏ నిశ్చితాభిప్రాయం లేని ‘వ్యామోహాల పుట్ట’ అని రోజురోజుకూ రుజువవుతోంది. అదే ఆయనతో ‘నేనెవరితోనైనా సరే పొత్తులకు సిద్ధం’ అనేలా చేస్తోంది. అన్నట్టూ– పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికి పెడుతుందట అన్న సామెత మనకు ఉండనే ఉంది. శతాబ్దాలకు సరిపడా నీతుల్ని శతక వాఙ్మయ కర్తలు ఎందుకు బోధించి పోయారోగానీ, అవి నేటి భ్రష్ట రాజకీయ సంస్కృతికి ప్రత్యక్షర సాక్ష్యాలుగా నిలిచి పోతున్నాయి. ‘గాలి వాటు’ రాజకీయాలకు పేరు మోసిన పవన్ కల్యాణ్ నిశ్చితా భిప్రాయం లేని ‘వ్యామోహాల పుట్ట’ అని రోజు రోజుకూ రుజువ వుతోంది. ‘వారాహి’ వాహనాన్ని చూపి దాన్నొక బెదిరింపు సాధనంగా చూపెడుతున్నాడు. ‘వ్యామోహాలు’ ఎలాంటివో వేమన నిర్వచించి పోయాడు: ‘‘ఈ దేహమే వ్యామోహాల పుట్ట. కానీ అశాశ్వతమై పగిలి పోయే ఓ కుండ. ఈ శరీరం తొమ్మిది కంతల తిత్తి. ఆ ‘తిత్తి’కి ఒంటి నిండా దిగేసే సొమ్ములు చాలక కులాలు, గోత్రాల పేర్లు కూడా ఆభరణాలుగా తగిలించుకుని ఊరేగుతున్నారు’’. అల్ప బుద్ధివాడు అధికారంలోకి వస్తే మంచివాళ్లందర్నీ తొలగ్గొడతాడనీ, ఇదెలాంటిదంటే ‘పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికి పెట్టిందన్న’ సామెత లాంటిదనీ అన్నాడు. బహుశా అందుకనే పోతనామాత్యుడు కూడా మనిషి బుద్ధుల్ని నాలుగైదు రకాలుగా వర్ణించి పోయాడు. అవి: ‘కుబుద్ధి, మంద బుద్ధి, అల్ప బుద్ధి, దుర్బుద్ధి’ అని! ఈ అవకాశవాద బుద్ధే, ఇప్పుడు ‘నేనెవరి తోనైనా సరే పొత్తులకు సిద్ధం’ అని పవన్ చేత అనిపిస్తోంది. గత ఎన్నికల్లో ‘బింకానికి’ పోయి రెండు చోట్ల నిలబడి, అభాసుపాలై ఘోరాతిఘోరమైన ఓటమి పాలయ్యాడు. ఫలితంగా పరువూ పోయింది, ‘పవరూ’ దూరమై పోయింది. ఇన్ని దారుణ అనుభవాల నుంచి కూడా పవన్ తన ‘పవనిజం’ అన్న పాత స్లోగన్‌ను మాత్రం వదులుకో లేకుండా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగ తుల అభ్యున్నతికి రాజ్యాంగపరంగా రక్షణ కల్పించే అవసరాన్ని తొలి సారిగా గుర్తించి దానికి చట్టరూపం ఇవ్వాలన్న తలంపు మొదటి సారిగా 2001లోనే ప్రతిపక్ష నాయక హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డికి వచ్చింది. ఆయన ప్రతిపాదించిన దరిమిలానే దళిత వర్గాలకు ‘సబ్ ప్లాన్’ చట్టం వచ్చింది. ఆ చట్టం కాలపరిమితి మొన్నటి జనవరి 23తో ముగియవలసింది. కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో ముందడుగు వేసి దాన్ని మరొక పదేళ్లకు పొడిగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించడం వల్ల దళితుల, ఆదివాసీల అభ్యున్నతికి ఈ చర్య ఎంతో దోహదం చేస్తుంది. సకల దళిత శక్తులు వివిధ దశల్లో సమీకృతమైన ఫలితమే ‘సబ్ ప్లాన్’. ఆ నిధులు దుర్వినియోగమై పక్కదారులు పడుతున్నాయని సబ్ ప్లాన్ లక్ష్యాల గురించిన అవగాహన లేని పవన్ వాపోవడం కేవలం ఆయన ద్వేష భావననే బట్టబయలు చేస్తోందని చెప్పక తప్పదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రజా బాహుళ్యానికి మాత్రం గణనీయమైన స్థాయిలో ఒరిగిందేమీలేదంటూ అంబేడ్కర్ తన బాధను చివరి శ్వాస వరకూ వ్యక్తం చేస్తూనే వచ్చారు. ‘‘షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల బతుకుతెరువులు ఆచరణలో బాగుపడనంత కాలం, ఆ వైపుగా సమూలమైన, సమగ్ర మైన మార్పులు రానంత కాలం భారతదేశ భవిష్యత్తు ఆశాజనకంగా ఉండబోదని అంబేడ్కర్ స్పష్టం చేశారని సుప్రసిద్ధ జాతీయ వ్యంగ్య చిత్ర వారపత్రిక ‘శంకర్స్ వీక్లీ’ (1953 ఫిబ్రవరి) నివేదించింది. అంతేగాదు, కళావంతులైన దేవదాసీలకు చెందిన కేసరీబాయి కేర్కర్ (1892–1977) స్వరంతో ‘వందేమాతరం’ గ్రామఫోన్ రికార్డును సిద్ధం చేయాలనీ, ఆ తొలి కాపీని తానే కొంటాననీ ప్రకటించినవారు అంబేడ్కర్! ఎందుకంటే ‘సురశ్రీ’గా పేరొందిన కేర్కర్, జైపూర్‌కు చెందిన అత్రౌలి ఘరానాలో 20వ శతాబ్దపు క్లాసికల్ సింగర్‌గా పేరొందిన హిందూస్తానీ సంగీత విద్వాంసుడు అల్లాదియా ఖాన్ వద్ద శిక్షణ పొందిన విషయాన్ని బహిర్గతం చేశారు అంబేడ్కర్. హైందవంలోని కుల వ్యవస్థను, పరమత విద్వేష భావాలను వ్యతిరేకించిన అంబేడ్కర్ చివరికి బౌద్ధ ధర్మాన్ని ప్రేమించి ఆహ్వానించవలసి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర శాసన వేదికలలో పాల్గొనే సభ్యులపై ఏయే అనర్హతా నిబంధనలను విధించాలో 1951లోనే ప్రత్యేక బిల్లును ఆయన రూపొందించారు. శాసన వేదికల్లోని సభ్యులకు రాజకీయ పదవుల ఆశ జూపడం ద్వారానో, మరే ఇతర ప్రయోజనాలు కల్పి స్తామనో ప్రలోభాలకు గురిచేసే పార్లమెంట్ వేదిక వల్ల ప్రయోజనం లేదు. ఎలాంటి భీతి లేదా ప్రలోభమో ప్రభుత్వం నుంచి లేకుండా పార్లమెంట్ సభ్యులు స్వతంత్రంగా వ్యవహరించలేకపోతే అలాంటి ‘పార్లమెంట్’ వల్ల గానీ, శాసనసభ వల్లగానీ ప్రజలకు ఉపయోగం ఉండదు. అలాంటి స్థితిలోనే పాలకులకు ‘డూడూ బసవన్న’లుగా వ్యవహరిస్తారని అంబేడ్కర్ హెచ్చరించారు. అలాంటి పరిస్థితుల్లోనే పార్లమెంట్ (లేదా శాసన వేదిక) కాస్తా స్టాక్ ఎక్స్ఛేంజి వ్యాపార మార్కెట్‌గా ఎలా మారిపోతుందో అంబేడ్కర్ ఉదాహరించారు. అంతేగాదు, బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో ఉన్న షెడ్యూల్డ్ కులాల అభ్యర్థుల సంఖ్యకన్నా స్వతంత్ర భారత ప్రభుత్వ కొలువులో ఉన్న వారి సంఖ్య బహు తక్కువనీ, ఆ మాటకు వస్తే తన స్వతంత్ర భారత రాజ్యాంగ ముసాయిదా ప్రతినే తారుమారు చేయడానికి ముసాయిదా సంఘంలోని కొందరు సభ్యులు సాహసించిన విష యాన్నీ కూడా అంబేడ్కర్ బయట పెట్టాల్సి వచ్చిందని మరచి పోరాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాలలో అధికారం కోసం, దళిత వర్గాలపై ఆధిపత్యం కోసం కేవల పదవీ కాంక్షతో కక్షిదారులైన కొందరు అగ్ర – అర్ధ అగ్రవర్ణాలకు చెందిన ‘వినాయకులు’ పని చేస్తున్నారన్నది పచ్చి నగ్న సత్యం. బహు పరాక్, ప్రసిద్ధ ఫ్రెంచి చిత్రకారుడు పియరీ నోరా అన్నట్టు– ‘‘జ్ఞాపక శక్తి ఉన్న చోటునే మరుపు పెద్దమ్మ కూడా వెన్నంటే ఉంటుంది’’! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
హేతువాదమే మౌఢ్యానికి విరుగుడు
భారత హేతువాద సంఘాధ్యక్షుడు రావిపూడి వెంకటాద్రి తన 101వ సంవత్సరంలో పరమపదించారు. హేతువాదాన్నీ, మానవతావాదాన్నీ వ్యాపింప జేయడానికి దశాబ్దాలుగా వేలకొలదీ పేజీల ద్వారా అనంతమైన కృషి సల్పిన హేతువాది ఆయన. బౌద్ధాన్నీ, దాని హేతువాద దృక్పథాన్నీ నాశనం చేయడం కోసం రాజకీయ ఆధిపత్యం చలాయించిన శక్తుల దుర్మార్గాన్ని చారిత్రకాధారాలతో నిరూపించారు. అసహనం, ద్వేషాల వల్ల మత విశ్వాసాలు మారవని ఆయనకు స్పష్టంగా తెలుసు. మతమౌఢ్యం మారాలంటే మానసిక పరివర్తన రావాలనీ, అది చాలా నిదానమైన క్రమమనీ అంటారు. మను షుల్లో ఉన్న వివేచనా జ్ఞానాన్ని పని చేయించడం ద్వారానే మౌఢ్యాన్ని రూపుమాపవచ్చునన్నది హేతువాదుల నిశ్చితాభిప్రాయమని చెబుతారు. ‘‘వైజ్ఞానిక పునాదుల పైన, శాస్త్రీయ పరి జ్ఞానం పైన మాత్రమే మానవుల సుఖసంతో షాలు ఆధారపడి ఉంటాయి.’’ – స్వతంత్ర భారత తొలి ఉప రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణ కొన్ని శతాబ్దాల క్రితం వేమన, బద్దెన ఏ నీతులు శతక వాఙ్మయం ద్వారా బోధించారో వాటికి కాలం గడిచిన కొలదీ విలువ పెరుగు తూనే ఉంది. మూఢ విశ్వాసాల నుంచి ప్రజా బాహుళ్యానికి కొంత విమోచన వచ్చినా– పాలక శక్తుల ప్రాపకంతో సమాజంలో పెరు గుతూ వచ్చిన కుల, మత శక్తుల నుంచి విమోచన ఇంకా ప్రజలకు దూరంగానే ఉంది. ఎనిమిది దశాబ్దాలుగా తెలుగు ప్రజల్ని హేతువాదం ద్వారా నిరంతరం చైతన్యంతో రగిలించిన భారత హేతువాద సంఘాధ్య క్షుడు, ‘హేతువాది’ పత్రిక ప్రధాన సంపాదకులు, దార్శనికుడు రావి పూడి వెంకటాద్రి తన 101వ సంవత్సరంలో పరమపదించారు. నిష్క ల్మష హృదయంతో జీవితం సహేతుక పద్ధతిలో గడిపితే వ్యక్తి మనస్సు ముదిమిని జయిస్తుందని తన జీవితం ద్వారా నిరూపించారు వెంకటాద్రి. సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమాలు, భారతీయ తత్వ దర్శనాలు, సత్యాన్వేషణ, ఆస్తికత్వం, నాస్తికత్వం, హేతుత్వం, మత తత్వం – ఆయన అన్వేషణా రంగాలు. హేతువాదాన్నీ, మానవతా వాదాన్నీ వ్యాపింపజేయడానికి వేలకొలదీ పేజీల ద్వారా వందలాది సంపుటాల ద్వారా అనంతమైన కృషి సల్పిన విస్పష్ట తొలి తెలుగు హేతువాది ఆయన. మహాకవి గురజాడ అప్పారావు 110 సంవత్సరాల నాడే – దేశవ్యాపితంగా ఖ్యాతి గడించిన బౌద్ధ ధర్మాన్ని కుల, మత స్వార్థపర వర్గాలు భారత సరిహద్దుల నుంచి ఎలా తరిమికొట్టాయో చెప్పారు. దేశంలోని బౌద్ధ ధర్మ, హేతువాద పీఠాల్ని బలవంతంగా కూల్చి, వాటి స్థానే హేతువాద విరుద్ధ క్షేత్రాలకు పాలకులు ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ‘క్రీ.శ. రెండు, మూడు శతాబ్దాల నాటికే’ కుల, మత వ్యవస్థకు పునాదులు గట్టిపరచుకొనే శక్తులకూ, బౌద్ధానికీ మధ్య జరిగిన సంఘర్షణకు ఆంధ్రలోని శ్రీ పర్వతమే కేంద్రం; బౌద్ధేతర శక్తులు బౌద్ధ భిక్షువులను వారి ఆరామాల నుండి బలవంతంగా బహి ష్కరించి, నాగార్జున కొండ వద్ద ఉన్న బౌద్ధారామాలను, విహారాలను ఎలా స్వాధీనం చేసుకున్నారో రావిపూడి వెంకటాద్రి నిరూపణలతో రుజువు చేశారు. క్రీస్తుపూర్వం శుంగుల కాలం నుంచి క్రీ.శ. ఏడవ శతాబ్దం దాకా బౌద్ధాన్నీ, దాని హేతువాద దృక్పథాన్నీ నాశనం చేయడం కోసం రాజకీయ ఆధిపత్యం చలాయించిన శక్తుల దుర్మా ర్గాన్ని చారిత్రకాధారాలతో రావిపూడి నిరూపించారు. చైనా యాత్రికు లైన– క్రీ.శ. 4వ శతాబ్దంలో మన దేశాన్ని సందర్శించిన ఫాహియాన్ గానీ, 7వ శతాబ్దం నాటి హ్యుయాన్ త్సాంగ్ గానీ బౌద్ధుల మీద జరిగిన అనేక దాడుల వివరాలను ఎలా పేర్కొన్నారో వివరించారు. హేతువు మీద ఆధారపడి వర్ధిల్లిన లోకాయత, చార్వాక, బౌద్ధాది దర్శనాల్లోని హేతుబద్ధ భారతీయ తత్వాన్ని పతనం చేసిన తరు వాతనే భావవాదం, ఛాందసవాదానికి కొమ్ములు మొలవడం ప్రారంభించాయని రావిపూడి ఉదాహరించారు. సుప్రసిద్ధ చరిత్రకారుడు లక్ష్మీనరసు తన ‘బౌద్ధం అంటే ఏమిటి?’ గ్రంథంలో బౌద్ధ ధర్మసారం వివరించారు. ఆ సారాంశాన్ని ఆయన బుద్ధుని మాటల్లోనే చెప్పారు: ‘‘నేను బోధించే ధర్మం అందరి పట్ల సమాన ఆదరణ కల్గిన ధర్మం. దీన్ని మన, తన భేదం లేకుండా అందరికీ బోధించండి. ఇది మంచివారిని, చెడ్డవారిని, సంపన్నులను, పేదలను ఒకే విధంగా విముక్తి చేస్తుంది. దీని నుంచి ఎవరికీ ఎలాంటి మినహాయింపూ లేదు. కరుణామయులైనవారు తమను మాత్రమేగాక, ఇతరులనూ విముక్తి చేయాలని కోరుకుంటారు. ఎందరినో విముక్తి చేసినా, చెయ్యవల సింది మరెంతో ఉంటుంది. ఇది నిరంతరం కొనసాగవలసిన ప్రక్రియ. ఈ ధర్మం ప్రపంచమంతా వ్యాపించి దుఃఖసాగరంలో మునిగిన అందరినీ రక్షించాలి.’’ ప్రాచీన కాలంలోనే విజ్ఞాన కాంతుల్ని వెదజల్లుతూ, సంఘంలోని అజ్ఞానాంధకారాలను బట్టబయలు చేయడానికి బయల్దేరిన భావ విప్ల వోద్యమం వెయ్యేళ్లకుపైగా వర్ధిల్లి జన్మించిన భారతదేశంలోనే అడుగంటిపోవడం ఎంతటి విషాదకర పరిణామమో అంటారు రావిపూడి వెంకటాద్రి. ఇక కాలక్రమంలో బౌద్ధంలో చొరబడిన విగ్రహారాధన, పునర్జన్మ, కర్మ సిద్ధాంతాల వంటి మత వాసనలు కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించడంతో తొలగిపోయి హేతువాద, మానవతావాదాలపై ఆధారపడిన సిసలైన బౌద్ధం వర్ధిల్లాలని రావిపూడి ఆశించారు. అందుకే ఒక సందర్భంలో ఇలా స్పష్టీకరించారు: ‘‘ఒక మతం వేరొక మతాన్ని ద్వేషిస్తుంది. కానీ హేతువాదం మతాలన్నింటినీ సమంగా నిరాకరిస్తుంది. అసహనాన్నీ, ద్వేషాన్నీ ప్రదర్శించదు. అసహనం, ద్వేషాల వల్ల మత విశ్వాసాలు మారవని హేతువాదులకు తెలుసు. మతమౌఢ్యం మారాలంటే మానసిక పరివర్తన రావాలనీ, అది చాలా నిదానమైన క్రమమనీ హేతువాదులకు తెలుసు. ఆంక్షల వల్ల, నిర్బంధాల వల్ల, నిరంకుశ నిషేధాల వల్ల మత తత్వం అణగిపోదనీ హేతువాదులకు తెలుసు. కనుకనే మనుషుల్లో ఉన్న వివేచనా జ్ఞానాన్ని పని చేయించడం ద్వారా మాత్రమే ఏ విధమైన మౌఢ్యాన్ని అయినా రూపుమాపవచ్చుననీ హేతువాదుల నిశ్చితా భిప్రాయం’’. అంతేకాదు– ‘‘జాతి, మత, కుల, వర్గ ప్రాతిపదికల మీద మనం ఆధారపడితే – విజ్ఞానం, తత్వం, స్వేచ్ఛ, సమత, న్యాయం, సౌభ్రా తృత్వం ప్రాతిపదికలుగా నిర్ణయించవలసిన మానవతావాద నీతి దుర్లభమవుతుంది. మానవులంతా ఒకటే అనుకున్నప్పుడు, మాన వుల మధ్య విభిన్నమయిన నీతులు ఉండటానికి వీల్లేదు... అంతే గాదు, నేటి జాతులన్నీ రక్త సాంకర్యం పొందినవే. సిద్ధాంత సాంకర్యం పొందినవే. వర్గాలన్నీ ఆర్థిక స్థాయీ సాంకర్యం పొంది ఉన్నవే. అందువల్ల భిన్న జాతి, మత వర్గాల మధ్య స్పష్టమైన విభజన రేఖ గీయడం సాధ్యం కాదు. అందువల్ల జాతి, మత వర్గాల పేర్లతో మనుషుల్ని విభజించడం హేతువిరుద్ధం. అలాంటి హేతు విరుద్ధమైన విభజనను సృష్టించినవారు ఆయా కాలాల్లో పాలక వర్గాలుగా (శాసకులుగా) పెంపొందిన బాపతే. వారు చిరంతన సత్యాలుగా పేర్కొన్న సిద్ధాంతాలన్నీ మానవుణ్ణి పెంపుడు జంతువుగా, సిద్ధాంతదాసుడిగా, డూడూ బసవన్నగా తయారు చేయడానికే దారి తీశాయి. కానీ, మనిషి పెంపుడు జంతువు కావడానికి స్వభావతః ఇష్ట పడడు కనుకనే ఎప్పటికప్పుడు వ్యవస్థీకృత సిద్ధాంతాల మీద తిరుగు బాటు చేస్తూ వచ్చాడు. అదే– భావ విప్లవమంటే’’ అన్నది రావిపూడి మాట! అందుకే కారల్ మార్క్స్ మహనీయుడు ‘మతం మత్తుమందు’ అని ఏనాడో నిర్వచించి పాఠం చెప్పవలసి వచ్చింది. ‘విజ్ఞానాభి వృద్ధితో పాటు పరిణామం చెందే ఆలోచనా వైఖరిగానే హేతువాదం వన్నె తేలుతుందనీ, ఆలోచనలోనూ, ఆచరణలోనూ హేతువాదం ఒక ఉద్యమమ’నీ వేయి విధాల నిరూపిస్తూ వచ్చాడు రావిపూడి వెంకటాద్రి! కనుకనే ఓ కవి కుమారుడున్నట్టు– ‘‘కలవరపడి వెనుదిరిగితె కాలం ఎగబడుతుంది కదనుతొక్కి చెలరేగితే కాలం భయపడుతుంది కర్మయోగి ఎన్నడూ కాలాధీనుడు కాదు – కనురెప్పలు మూతపడితె కాలం జోకొడుతుంది కంఠమెత్తి తిరగబడితే కాలం జేకొడుతుంది!’’ ఆఖరి శ్వాసలో కూడా స్థూలంగా అదే రావిపూడి తీర్మానం కూడా! -ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
స్తబ్ధత నుంచి చైతన్యంలోకి...
ప్రాథమిక హక్కుల్ని ఎలా కాపాడుకోవాలో ప్రజలకు బోధించేదీ, తమ దైనందిన జీవితాలను ఎలా తీర్చి దిద్దుకోవాలో చెప్పేదీ రాజ్యాంగమే అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ఆ రాజ్యాంగం పాలితులకు బోధలే కాదు, పాలకులకు హితబోధలూ చేసింది. కానీ వాటిని పెడచెవిన పెట్టడమే నేటి దేశ దుఃస్థితికి కారణం. మైనారిటీల ఉనికిని తక్కువ చేసేలా పౌర చట్టాన్ని సవరించే ప్రయత్నం ఇందుకు ఒక ఉదాహరణ. వందిమాగధులుగా ప్రవర్తించేవారినే గవర్నర్లుగా నియమించడం మరొక ఉదాహరణ. నిరసనకారులపై అక్రమ కేసులు బనాయించడం మరో ఉదాహరణ. అయితే దీనికి విరుగుడు మళ్లీ రాజ్యాంగంలోనే ఉంది. దాని వెలుగులో ప్రజలు స్తబ్ధత వదిలించుకోవడంలోనే ఉంది. ‘‘మహాత్మాగాంధీ దేశంలో ఒక గ్రూపునకు వ్యతిరేకంగా మరో గ్రూపును రెచ్చగొట్టే పద్ధతిని ఎన్నడూ అనుసరించలేదు. ఆయన హిందువే కావొచ్చు, కానీ దేశ పౌరులయిన ముస్లింలను దేశ స్వాతంత్య్రానికి ముందు కూడా ప్రేమించారు. గాంధీజీ అనుసరించిన విధానం న్యాయబద్ధమైన సంస్కృతికీ, పౌర నీతికీ, సహృదయంతో కూడిన జాతీయ సమైక్యతకూ నిద ర్శనం. అలాంటిది ఇతర మైనారిటీల పట్ల నేడు అనుసరిస్తున్న ప్రభుత్వ వివక్షాపూరిత విధానాలకు భారతదేశం తలదించుకోవలసి వస్తోంది.’’ – నోబెల్ బహుమాన గ్రహీత,సుప్రసిద్ధ ఆర్థికవేత్త అమర్త్యసేన్ (15 జనవరి 2023) ‘చింత చచ్చినా పులుపు’ చావలేదు. రాజ్యాలు అంతరించినా, దేశ పాలకుల్లో తెచ్చిపెట్టుకున్న రాచరికపు లక్షణాలు చావడం లేదు. దేశంలోని అసంఖ్యాక మైనారిటీ జాతుల ఉనికిని, వారి ప్రయోజనాలను తక్కువ చేసేలా పౌర చట్టాన్ని కొత్తగా సవరిస్తూ రూపొందించడం ఇందుకు ఒక ఉదాహరణ. పార్లమెంటులో నిర్దుష్టమైన చర్చ జరక్కుండానే ఆమోదించినట్టు పాలకులు ప్రకటించిన మరునాడే, రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పొందినట్టు వెల్లడించారు. అయినా చట్టం అమలులోకి రాకుండా ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? దానికి కారణం–కొత్త చట్టం కింద రూల్స్ రూపొందించలేక పోవడం! కాగా, త్రిపురలోని ఏ వామపక్ష ప్రభుత్వాన్ని, అందులోనూ దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన మాణిక్ సర్కార్ ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా దేశ పాలకులు కూలదోసి కులుకుతున్నారో– అదే ఢిల్లీ పాలకులకు నిద్ర లేకుండా చేస్తూ త్రిపురలోని అనేక ఆదివాసీ తెగలను సమీకరించి, ‘గ్రేటర్ తిప్రాలాండ్’ (బృహత్ త్రిపుర) పేరిట ‘తిప్రహా దేశీయ అభ్యుదయ ప్రాంతీయ సమాఖ్య’ను ప్రద్యోదత్ విక్రమ్ మాణిక్య దెబ్రమా నెలకొల్పారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ సమాఖ్య ఏర్పడింది. ఈ బృహత్ త్రిపుర 19 తెగల ప్రజా బాహుళ్యం విస్తరించి ఉన్న ప్రాంతం. ఈ ఆదివాసీ ప్రజా బాహుళ్యా నికి ప్రాథమిక హక్కులు ఉన్నప్పటికీ వాటికి రక్షణ లేకపోయినందునే తాజా బృహత్ ఉద్యమానికి వారు సిద్ధమయ్యారు. త్రిపుర రాష్ట్ర సరి హద్దులలోనే ‘గ్రేటర్ తిప్రాలాండ్’ నెలకొల్పుకోవడానికి పూను కున్నారు. త్రిపురలో బీజేపీ–ఆరెస్సెస్ పాలనకు ఇప్పుడీ ‘గ్రేటర్ తిప్రాలాండ్’ ‘దేవిడీమన్నా’ చెప్పడంతో ఢిల్లీ పాలకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ(24 నవంబర్ 2022)– చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని విమర్శకులు చెబితే సరిపోదనీ, నిజానికి భారతదేశ చరిత్రను తిరగ రాయాల్సిన సమయం వచ్చిందనీ చెప్పారు. ఈ దేశంలో 150 సంవత్సరాలకు మించి ఏ ప్రాంతంలో అయినా కనీసం 30 రాజ్యాలు పరిపాలించిన ఉదాహరణలతో పండితులూ, విద్యార్థులూ పరిశోధించి తెల్పడానికి ముందుకు రావాలని విన్నపాలు చేశారు. ‘మన చరిత్ర వక్రీకరణలకు గురైంది. దాన్ని సరి చేయడానికి మనం కష్టపడి పనిచేసి చరిత్రను సరి చేయాలి’ అని అమిత్ షా బాహాటంగానే ప్రకటిస్తున్నారు. పాలకులు ఏది పలికినా శాసనమై కూర్చుంటే, ఇంక వేరే జనవాక్యానికి స్థానమేదీ? అందుకే, అటు పాలకులకూ, ఇటు పాలితులకూ నైతిక విలువలు బోధించేది భారత లౌకిక రాజ్యాంగమేననీ, అదే సర్వులకూ నైతిక విధాన బోధిని అనీ దేశ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే జస్టిస్ డీవై చంద్రచూడ్ చెబుతూనే వస్తున్నారు. ‘దేశ ప్రజల్ని స్తబ్ధతలో నుంచి చైతన్యంలోకి మేలుకొల్పి, ప్రాథమిక హక్కుల్ని ఎలా కాపాడుకోవాలో బోధించి, తమ దైనందిన జీవితాలను ఎలా తీర్చిదిద్దుకోవాలో చెప్పే గైడ్’ రాజ్యాంగమే అని ఆయన అన్నారు. అందువల్లే ప్రజల దైనందిన అవసరాలతో నిమిత్తం లేకుండా అర్ధంతరంగా పెద్ద నోట్లను రద్దు చేసి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా పాలకులు తీసుకున్న నిర్ణయాన్ని నిశితంగా ఖండించారు. జమ్ము–కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని (370వ అధికరణ) ఎందుకు రద్దు చేయవలసి వచ్చిందో, అవినీతికి దారులు తెరిచే ఎలక్టోరల్ బాండ్స్‌ను ఎందుకు ప్రవేశ పెట్టవలసి వచ్చిందో తెల్పాలని నిగ్గ దీశారు. కొలీజియం వ్యవస్థను రద్దు చేయమని కోరే హక్కును ప్రభుత్వానికి ఎవరిచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించాల్సిన అవసరం వచ్చిందంటే పాలకుల స్థాయిని అనుమానించవలసి వస్తోంది. ఇక రాష్ట్రాల గవర్నర్ల నియామకంలో వారి ప్రవర్తనను కనిపెట్టి ఉండటంలో దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పాటించిన న్యాయ సూత్రాలు ఇప్పుడు గాలికి ఎగిరిపోయాయి. పాలక పార్టీలకు వందిమాగధులుగా ప్రవర్తించే అవకాశవాద రాజకీయ శక్తులనే గవ ర్నర్లుగానూ, ఉపరాష్ట్రపతులుగానూ నియమించే దుఃస్థితికి పాలకులు దిగజారిపోవడాన్ని చూసి దేశం విస్తుపోతోంది. ఈ పరిస్థితుల్లో జస్టిస్ చంద్రచూడ్ దేశ ప్రధాన న్యాయమూర్తిగా రెండేళ్ల పాటు కొనసాగనుండటం 2024లో రాబోతున్న సాధారణ ఎన్నికల నిర్ణయాలపై పాలకుల ప్రభావానికి గండి కొట్టగల పరిణామంగానే భావించాలి. అంతేకాదు... ఒకనాటి భీమా కోరెగావ్ పోరాటాన్ని గుర్తు చేసు కుంటూ దళిత ప్రజా బాహుళ్యం జరుపుకొన్న ఉత్సవాలలో పాల్గొన్న వామపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించి వారిని ఏళ్ల తరబడి జైళ్లపాలు చేసి వేధించడం ప్రజలు గమనించారు. ఈ సమస్య కూడా దేశ ప్రధాన న్యాయమూర్తి దృష్టికి రాగానే ఆయన పాలక పద్ధతుల్ని విమర్శిస్తూ వామపక్ష రాజకీయ ఖైదీల్ని విడుదల చేయడమో, కఠిన శిక్షలను సడలించడమో జరుగుతోంది. అంతేగాదు, ఎల్గార్ పరిషత్, మావోయిస్టుల మధ్య సంబంధాల మిషతో పాలకులు బనాయించిన కేసు నుంచి ఆనంద్ తేల్తుంబ్డేను చంద్రచూడ్ కోర్టు విడుదల చేసింది. అంతకుముందే తేల్తుంబ్డే బెయిల్‌ను సవాలు చేస్తూ ఎన్ఐఏ పెట్టిన దరఖాస్తును సుప్రీం తోసిపుచ్చింది. నేటి తాజా దేశ పరిస్థితుల్ని సమీక్షించుకోవాలంటే – ఎన్నికల కమిషనర్ల దగ్గర నుంచి రాష్ట్రాల గవర్నర్ల వరకు పాలక పక్ష నాయకుల్ని మినహాయించి మరొకర్ని నియమించే సంప్రదాయానికి స్వస్తి చెప్పారు. బహుశా అందుకే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ ‘రాజ్యాంగబద్ధమైన నియామకాల్లో రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ ప్రయోజనాలకు స్థానం ఉండరాదని’ స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయానికి తూట్లు పొడవడానికి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రయత్నించిన ఫలితంగానే విరుద్ధ పరిణామాలకు చోటు దొరికింది. అలాగే న్యాయమూర్తులే న్యాయమూర్తుల్ని నియమించుకునే సంప్రదాయం మంచిది కాదనీ, కానీ ఇటీవలి కాలంలో ముగ్గురు సుప్రీం ప్రధాన న్యాయమూర్తులుగా వచ్చిన జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్ వల్ల కోర్టు స్వతంత్ర ప్రతిపత్తికి విలువ వచ్చిందనీ లా కమిషన్ మాజీ అధ్యక్షుడు, ఢిల్లీ, మద్రాసు హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తి అజిత్ ప్రకాష్ షా అభిప్రాయపడవలసి వచ్చింది. బహుశా అందుకే కాబోలు ఓ మహాకవి మనలో అసలు జబ్బు ఎక్కడుందో చెబుతూ – ‘‘మనల్ని చూసి మనం నవ్వుకోలేక పోవడమే ఏడుపంతటికీ కారణం/ ఇంకా ఎన్నాళ్ళీ ఏడుపు? ఇవాళ సమస్యల్ని పరిష్కరించలేక/ ఆధ్యాత్మికంలోకి పరుగెత్తుతారు/ పద్యాలచే పంటలు పండించగలవా?/ పప్పు రుబ్బించగలవా?’’ అని ప్రశ్నిస్తారు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
లోహియా లోకదర్శన సులోచనాలు!
తెలుగువారికి రామమనోహర్ లోహియా ఒక భారత సామ్యవాద నాయక శిరోమణిగానే తెలుసు. హిందూమతం పైనా, పురాణ గాథల పైనా ఆయన చేసిన ప్రగాఢ పరిశోధనలూ, ఆలోచనలూ మనకు దూరంగానే ఉండిపోయాయి. లోహియా ఇతిహాస వ్యాసాల పుస్తకం ఆయనలోని ఈ కోణాన్ని చేరువ చేస్తుంది. పురాణ పాత్రల మీద వెలుగు అన్నట్టేగానీ, ఆ పేరుతో అనేక రాజకీయ, సామాజిక, చారిత్రక సత్యాలు చాటారు. ఉత్తరాది వారు రావణ, కుంభకర్ణాదుల్ని దక్షిణాది వారిగా, రాక్షసులుగా చిత్రించి వధించే ధోరణిని తూర్పారబట్టారు. ఆయన దృష్టిలో శ్రీరాముడు ఉత్తర–దక్షిణ భారతదేశాల మధ్య ఐకమత్యానికి ప్రతీక కాగా, శ్రీకృష్ణుడు తూర్పు–పడమరల ఏకత్వానికి ప్రతీక. ‘‘నాకు అవకాశం దొరకాలే గానీ ఈ భూమండలం సహా, యావత్తు గ్రహరాశిని సొంతం చేసుకొని ఏలుబడిలోకి తెచ్చుకొంటాను.’’ – భూస్వామ్య వ్యవస్థలో కూలి నాలి చేసుకొని బతికే శ్రమజీవుల కాయకష్టానికి విలువ కట్టిన ప్రసిద్ధ ఆర్థికవేత్త రికార్డో ప్రకటన. పరాయి వలస పాలనకు వ్యతిరేకంగా అసమాన త్యాగాలతో పోరాడి దాన్నుంచి విముక్తి సాధించుకున్నారు వివిధ ఖండాల ప్రజలు. అయితే విమోచన తరువాత కూడా (స్వతంత్ర భారతం సహా) స్థానిక పాలకుల స్వార్థ ప్రయోజనాల వల్ల దోపిడీ వ్యవస్థలో మౌలికమైన మార్పు రాలేదు. ఈ సత్యాన్ని చాటినవారు భారత స్వాతంత్య్ర పోరాటంలో తలమునకలై తన సమకాలీన రాజకీయ సహచరుల పోకడలనూ, సైద్ధాంతిక రంగంలో ఆటుపోట్లనూ దగ్గ రుండి గమనించిన రామమనోహర్ లోహియా. ఇటీవల లోహియా ఇతిహాస వ్యాసాల పేరిట ‘పురాణ పాత్రలపై కొత్త వెలుగు’ మకు టంతో లోహియా సమతా ట్రస్ట్ నిర్వాహకులు, నిరంతర అధ్యయన శీలి రావెల సోమయ్య ఒక ఉత్తమ సంకలన గ్రంథాన్ని ప్రచురించారు. రిషితుల్యుడు, ఆసియాలో తొలి సామ్యవాదిగా పేరెన్నికగన్న స్వామి వివేకానందకు ఈ సంపుటిని అంకితమిచ్చారు. పేరుకు ‘పురాణ పాత్ర’లపై ప్రసరించిన కొత్త వెలుగే. కానీ దాని చాటున అనేక రాజకీయ, సామాజిక, చారిత్రక సత్యాలు ఉన్నాయి. ఇంతవరకూ తెలుగువారికి లోహియా ఒక భారత సామ్యవాద నాయక శిరోమణిగానే తెలుసు. హిందూమతం పైనా, పురాణ గాథల పైనా ఆయన చేసిన ప్రగాఢ పరిశోధనలూ, ఆలోచనలూ హిందీ భాషా ప్రియులకు మాత్రమే లభ్యమవుతూ వచ్చాయి. ఆ లోటు ప్రస్తుత తెలుగు సంకలనంతో కొంతవరకు తీరుతుంది. పురాణ పాత్రల ప్రస్తావనలో కూడా లోహియా ఆధారపడింది ‘రొడ్డ కొట్టుడు’ సరుకు మీద కాదు. ఎకాఎకిని ఏ మహోన్నతుని భావదీప్తిని అందిపుచ్చుకోవాలో సరిగ్గా ఆ ఉద్దండుని ‘సహవాసాన్నే’ లోహియా కోరుకున్నాడు. ‘అవధి’ అనే స్థానిక ప్రజల భాషకు వ్యతి రేకులైన సంస్కృత ఛాందసుల ఆగడాలను అతి కష్టం మీద వ్యతి రేకించి నిలబడిన పండిత తులసీదాస్ రామాయణ రచనను ప్రేమిం చినవాడు లోహియా! స్థానిక భాష ‘అవధి’లో రచించిన రామాయ ణాన్ని కాపాడుకోవడానికి తులసీదాస్ పడిన కష్టాలు వర్ణనాతీతం. ఆ సమయంలో తులసీదాస్ గ్రంథాన్ని భద్రంగా కాపాడిన వ్యక్తి ముస్లిం సోదరుడు. రామలీల ఉత్సవాల్ని జరిపే ఉత్తరాది వారు రావణ, కుంభకర్ణాదుల్ని దక్షిణాది వారిగా, రాక్షసులుగా చిత్రించి వధించే ధోర ణిని తూర్పారబట్టినవాడు లోహియా. ఆయన దృష్టిలో శ్రీరాముడు ఉత్తర–దక్షిణ భారతదేశాల మధ్య ఐకమత్యానికి ప్రతీక కాగా, శ్రీకృష్ణుడు తూర్పు–పడమరల ఏకత్వానికి ప్రతీక. ఛాందసుల మాటేమోగానీ, లోహియాకు మాత్రం హిందూ మతంలోనే లోపాయికారిగా పాతుకుపోయిన రాజకీయ దూరదృష్టి ఆశ్చర్యం కల్గించింది. ఎందుకంటే, లోహియా భావనలో మతం, రాజనీతి పరిధులు, ఆశయాలు, వాటి పాటింపు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి వాటిని కలపకూడదు. ఎందుకని? ‘‘మతం దీర్ఘకాలం ఉండే రాజనీతి కాగా, రాజనీతి అనేది కొంతకాలం మాత్రమే సాగే మతం’’! మతం, రాజనీతుల్లో వివేకం లేకుంటే అవి రెండూ కలిసిపోయినప్పుడు దేశం నాశనమవుతుం దన్నాడు లోహియా! ‘‘రాజకీయ క్షేత్రంలో మతం చొరబడిపోయి దేశంలో ఎంత ఉద్వేగం, ఉద్రేకం, హింస, ద్వేషాలు ప్రబలిపోతు న్నాయో నేను కళ్లారా చూస్తున్నాను. దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే మత కార్యకలాపాల్ని అరికట్టక తప్పదు’’! చరిత్రకారుడు విల్ డూరాంట్ తన ‘లెసన్స్ ఆఫ్ హిస్టరీ’లో సోష లిస్టు, క్యాపిటలిస్టు పరిణామ దశల గురించి వెలిబుచ్చిన భావాలతో లోహియా ఏకీభవిస్తున్నట్టు కన్పిస్తుంది: ‘‘పెట్టుబడిదారీ విధాన వ్యాప్తి గురించిన భీతితో సోషలిజం తన స్వేచ్ఛా పరిధిని విస్తృతం చేసుకొనక తప్పని స్థితి ఏర్పడినట్టే, సోషలిస్టు వ్యవస్థ విస్తృతిని గమనించి పెట్టుబడీదారి వ్యవస్థ కూడా తన సమానత్వ పరిధిని విస్తృత పరుచుకొనక తప్పలేదు. ఫలితంగా రెండు విభిన్న ధృవాలూ త్వరలో ఏకమయ్యే పరిస్థితి ఉత్పన్నం కావొచ్చు’’! సోషలిజానికి శాశ్వత నిర్వచనాలుండవు, దాని నిత్య పరిణా మంలో కొత్తగా అన్వేషిస్తూ ఉండవలసిందేనని లోహియా భావన. అంతేగాదు, మన తెలుగు భాషకు లోహియా అర్థవంతమైన భాష్యం కూడా చెప్పడం విశేషం! ‘‘తెలుగు భాషలో ‘ఉ’కారాంత పదాలు తర చుగా దొరకడానికీ, తులసీదాస్ రాసిన ‘అవధి’ భాషలోనూ, తులసీ రామాయణంలోనూ ఈ ‘ఉ’కారాంత పదాలు ఎక్కువగా ఉండటాన్నీ లోహియా పేర్కొంటాడు. పదాల చివర్లో ‘ఉ’ కలిపితే పదానికి తీపి దనం ఎక్కువవుతుందనీ, ఈ పద మాధుర్యం వెనుక విజయపురిని పాలించిన ఇక్ష్వాకు రాజుల భాషా ప్రభావం ఉండి ఉండవచ్చనీ, ఈ కారణం వల్లనే ఆంధ్రప్రదేశ్ నుంచి ‘ఉ’ అయోధ్యకు చేరిందో, లేదా అయోధ్య నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిందో తాను చెప్పలేననీ, కానీ, అవధి, తెలుగు భాషా పదాల పరస్పర వాడకం నిజంగా జరిగిందా అని మాత్రం తెలుసుకోవడం తనకిష్టమనీ అంటాడు. దీనివల్లే లోహియా అనేక ప్రాంతీయ భాషా శాసనాలను ఆసక్తితో చూడటం విశేషం. కానీ ఒక్క అనుమానం – ఎన్నో విషయాలపైన ఇంతగా సాధి కార వ్యాఖ్యలు అందించగల్గిన లోహియాకు క్రీస్తుపూర్వం 2100 సంవత్సరం నాటికే సుమేరియా నాగరికత సంపన్న పాలకుల ఆస్తిపాస్తులను, సేద్య యోగ్యమైన భూసంపదను ఎలా, ఏ పద్ధతుల ద్వారా పేద ప్రజలకు పంచి దుర్భిక్ష పరిస్థితులు తలెత్తకుండా చేయ గలిగిందో అవగాహన లేకపోవడం ఒక మహా సోషలిస్టు నాయకుడిలో లోపంగా భావించవచ్చా?! ఎందుకంటే, అమెరికన్ మహా కోటీశ్వ రుల్లో బలవంతుడైన రాక్ఫెల్లర్ కొడుకు జాన్ డి. రాక్ఫెల్లర్ అమెరికా లోని ఘరానా ప్రయివేట్ ట్రస్ట్ కంపెనీల గురించి ప్రస్తావిస్తూ ఓ గొప్ప నిజాన్ని బహిర్గతం చేశాడు: ‘‘అందమైన అమెరికన్ గులాబీ రోజాను దాని అందచందాలతో, మధుర సువాసనలతో పెంచడం మహా సులభమే. కానీ ఎలా? ఈ పెద్ద గులాబీని ఆసరా చేసుకొని దాని చుట్టూ మొగ్గ తొడుగుతూన్న చిన్న గులాబీలను కాస్తా తుంచి పారేయడం ద్వారా. ఆ పద్ధతిలో ఎదిగినవే అమెరికన్ ట్రస్టు కంపెనీ లన్నీ.’’ జూనియర్ రాక్ఫెల్లర్ మార్క్సిజం పరీక్షకు తనను తాను గురి చేసుకొన్నాడో లేదో తెలియదుగానీ, పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించే అసమ సామాజిక, అరాచక పరిస్థితులను బలైపోయిన శిశు ‘రోజా’ ఉదాహరణ ద్వారా బహిర్గతం చేయగలిగాడు. నూరేళ్ల క్రితమే ఇంగ్లండ్ మహాకవి షెల్లీ ‘ఇంగ్లండ్ ప్రజలకు విన్నపం’ పేరిట ఇచ్చిన సందేశం విశ్వగీతికగా మార్మోగిపోయింది. పారిశ్రామిక విప్లవానంతరం పెట్టుబడిదారీ విధాన ఫలితాల వల్ల కష్ట జీవులైన కార్మిక కుటుంబాలు అనుభవిస్తున్న వ్యథలను గమనించి, ఆ కష్టాలకు కర్మ సాక్షిగా ఆయన నిలబడ్డాడు. ‘‘కష్ట జీవులారా! మీరు నాటే విత్తనాన్ని మరొకడుఅనుభవిస్తున్నాడు, నీవు సృష్టించే సమాజ సంపదను మరొకడెవడో దొంగిలిస్తున్నాడు, నీవు నేసే బట్టలను మరొకడెవడో ధరిస్తున్నాడు, నీవు సృష్టించే ఆయుధాల్ని మరొకడు ధరిస్తున్నాడు. విత్తనం నువ్వే నాటు, కానీ నియంతకు అందనివ్వకు, సంపదను సృష్టించు, కానీ దుర్మార్గ పాలకుడికి అందనివ్వకు, దుస్తులు కుట్టు, కానీ సోమరిపోతుకు అందనివ్వకు ఆయుధాలు తయారుచెయ్యి, కానీ వాటిని నీ రక్షణకే ఉపయోగించు.’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
అమృతోత్సవ దీక్షకు ఫలితం?!
కోరేగావ్ దళిత మహాసభ ఉద్దేశాన్ని వక్రంగా చిత్రించి, ఆ సభకు హాజరైన కొందరు వామపక్ష›సభ్యులు పాలకుల్ని హత్య చేయడానికి కుట్ర పన్నారన్న మిషపైన దేశవ్యాప్తంగా కొందరు పౌర హక్కుల నాయకుల్ని నిష్కారణంగా అరెస్టులు చేసి వేధింపులకు గురిచేశారు. గూఢచర్య ‘పెగసస్’తో భారతదేశ పౌర సమాజంపై పాలక పక్షం విరుచుకుపడింది. ఆఖరికి చిన్న దేశమైన భూటాన్ కరెన్సీతో ఇండియా రూపాయి సమానమైంది. ఇలా గడిచిన ఏడాది ఎన్నో పరిణామాల్ని భారతీయ సమాజం చవిచూసింది. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ పాలకులు, పాలితులు మిగిలిన పాఠాలను స్మరించు కోవలసి ఉంది. గడిచిన 75 ఏళ్ల చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోవలసి ఉంది. భారత స్వాతంత్య్రానికి 75 ఏళ్లు నిండిన వేళ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ దేశ న్యాయ స్థానాలకూ, పాలక వర్గానికీ, పౌర సమాజానికీ బాధ్యతా యుతమైన కర్తవ్యాన్ని (30 డిసెంబర్ 2022) నిర్దేశించారు. రాబోయే రోజుల్లో దేశ న్యాయ వ్యవస్థలో మహిళలదే ప్రధాన పాత్ర కాబోతున్నదనీ, వలసవాద ఆలోచనా విధానాల నుంచి న్యాయ వ్యవస్థను రక్షించవలసిన సమయం వచ్చిందనీ అన్నారు. వ్యక్తులను అకారణంగా అరెస్టులు చేసి, జైళ్లలో పెట్టడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనంటూ పలువురు పౌరుల విడుదలకు మార్గాన్ని సుగమం చేశారు. కోరేగావ్ దళిత మహాసభ ఉద్దేశాన్ని వక్రంగా చిత్రించి, ఆ సభకు హాజరైన కొందరు వామపక్షాల సభ్యులు పాలకుల్ని హత్య చేయ డానికి కుట్ర పన్నారన్న మిషపైన దేశవ్యాప్తంగా కొందరు పౌర హక్కుల నాయకుల్ని నిష్కారణంగా అరెస్టులు చేసి వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. కోరేగావ్ దళితుల సభలో స్వయంగా పాల్గొన్న న్యాయమూర్తులు ఈ అరెస్టులను, వేధింపులను నిరసించినా పాల కుల కుట్రపూరిత వైఖరి కొనసాగుతూనే వచ్చింది. కాగా జస్టిస్ చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా పదవిని స్వీకరించిన తర్వాత ఈ వేధింపుల విషయంలో కూడా స్పష్టమైన వైఖరి తీసుకున్నారు. అరెస్టయినవాళ్లు జైళ్లలో నిరవధికంగా విచారణ లేకుండా మగ్గడాన్ని గమనించి, నిష్కారణ పరిణామానికి ఫుల్స్టాప్ పెట్టడానికి నిర్ణయిం చారు. విచారణను త్వరితం చేసి, డిటెన్యూల విడుదలకు క్రమంగా చర్యలు తీసుకోవడం హర్షించదగిన పరిణామం. ఫాదర్ స్టాన్ స్వామి అరెస్టు ఉదంతం పాలక వర్గాల అత్యంత నీచమైన చర్య. భారత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సేకరించానని ప్రకటించిన ‘సాక్ష్యం’ ఫాదర్ స్టాన్ స్వామి, తదితర నిందితుల కంప్యూటర్లలోకి పనిగట్టుకొని చొప్పించిన దొంగ సాక్ష్యాలే నని ప్రసిద్ధ అమెరికన్ డిజిటల్ ఫోరెన్సిక్ కంపెనీ ‘ఆర్సెనల్ కన్సల్టెన్సీ’ విడుదల చేసిన నివేదికలో (10 డిసెంబర్ 2021) పేర్కొంది. విచిత్రమేమంటే, ఏ ఇజ్రాయిల్ స్పైవేర్ ‘పెగసస్’ను భారత పాల కులు ఉపయోగించారో, దాని సంస్థతో ఎన్ఐఏ కూడా సంబంధాలు పెట్టుకుంది. అయితే సుప్రీంకోర్టు (27 అక్టోబర్ 2021) విచారణ కోసం ఒక సాంకేతిక సంఘాన్ని నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి. రవీంద్రన్ అధ్యక్షులుగా ఉన్న ఈ కమి టీలో ప్రొఫెసర్ పి. ప్రభాకరన్, ప్రొఫెసర్ అశ్వన్ గుమస్తే సభ్యులుగా ఉన్నారు. నిందితుల ఫోన్లను ఇజ్రాయిల్ పెగసస్ స్పైవేర్ ట్యాంపర్ చేస్తున్న విషయం నిజమా? కాదా? అని తేల్చాలని ఈ కమిటీ ఎన్ఐఏను ఆదేశించింది. కానీ, ఇంతవరకూ ఆ విషయాన్ని ఎన్ఐఏ తేల్చకుండా దాటవేసిందని వార్తలు. ఈ ‘కప్పదాట్లు’ అంతటితో ఆగ లేదు. ‘పెగసస్’తో భారతదేశ పౌర సమాజంపై పాలక పక్షం విరుచుకుపడేంతవరకు కొనసాగుతూనే వచ్చింది. అంతేగాదు, కాంగ్రెస్ పాలకుల ‘బోఫోర్స్’ కొనుగోళ్ల వల్ల దేశం నష్టపోయింది రూ. 70 కోట్లు కాగా, బీజేపీ–ఆరెస్సెస్ పాలకుల రఫేల్ (ఫ్రెంచి) విమానాల కొనుగోళ్ల వల్ల దేశం కోల్పోయింది రూ. 70 వేల కోట్లని తేలినా నిగ్గతీయగల చైతన్యాన్ని ప్రతిపక్షాలూ కోల్పోయాయి. ఆ మాటకొస్తే, 2002లో గుజరాత్లో ఏమైంది? పాలకుల అధికారిక దౌర్జన్యాలను, ఆగడాలను ఎండగట్టి, వారు శిక్షార్హులేనని సుప్రీంకోర్టు ప్రత్యేక సలహాదారుగా విచారణకు నియమితులైన ‘ఎమి కస్ క్యూరీ’ ప్రసిద్ధ న్యాయవాది రాజు రామచంద్రన్ సమర్పించిన నివేదికను కూడా పాలకులు తొక్కిపట్టిన ఉదంతాన్ని దేశం మరచి పోలేదు. ఇన్ని రకాల దారుణాలకు, పాలక పక్షాలు ఒడిగట్టిన దేశంలో – స్వాతంత్య్ర దినోత్సవ అమృతోత్సవాలు ముగిసిన వేళలో పాల కులకు, పాలితులకు మిగిలిన గుణపాఠాన్ని స్మరించుకోవలసిన సమయమిది. దేశ స్వాతంత్య్రం కోసం సకల వ్యక్తిగత సౌకర్యాలను గడ్డిపోచగా భావించి ప్రాణాలు సహా సర్వస్వాన్ని త్యాగం చేసిన లక్షలాదిమంది దేశభక్తులను ఒక్కసారి తలచుకోవలసిన సమయం ఇదే. గడిచిన 75 ఏళ్ల పరిణామాల నుంచి గుణపాఠాలు తీసు కోవలసిన ఘడియ కూడా ఇదే! అంతేగాదు, ఈ 75 ఏళ్లలోనే క్రమంగా పత్రికా రంగంలో కూడా జాతీయ ప్రయోజనాల పరిరక్షణ స్పృహకన్నా కార్పొరేట్ ఇండియాలో భాగంగా కార్పొరేట్ మీడియా బలిసింది. పత్రికా రంగంలో ప్రయివేట్ రంగ ప్రయోజనాల ప్రాధాన్యం పెరిగింది. తద్వారా జర్నలిజం స్వరూప స్వభావాలనే అది తారుమారు చేస్తూ వచ్చింది. 1955 నాటికే వర్కింగ్ జర్నలిస్టుల, తదితర వార్తా పత్రికా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతూ ప్రత్యేక చట్టమే వచ్చింది. ఫలితంగా ఇతర సంస్థలలో పనిచేసే వివిధ వృత్తిదారుల ప్రయోజ నాలను కూడా రక్షించే నిబంధనలు అందులో పొందు పర్చడం జరిగింది. ఇది లేబర్ కోర్టుల ద్వారా ఉద్యోగుల సమస్యల సామరస్య పరిష్కారానికి తోడ్పడింది. తొల్లింటి ప్రయివేట్ మీడియాను జైన్లు, బిర్లాలు, గోయెంకా లాంటి జూట్ వ్యాపారులు నిర్వహించగా, ఇప్పుడు ఆ స్థానాన్ని నడమంత్రపు ‘సిరి’ పారిశ్రామికవేత్తలు భర్తీ చేశారు. వీళ్లపైన భారత రాజ్యాంగ నిబంధనల ఆజమాయిషీ బొత్తిగా మృగ్యమై పోవడం కూడా కాంగ్రెస్, బీజేపీ–ఆరెస్సెస్ పాలనల ‘పుణ్యమే’. కాబట్టి ఈ సమీక్ష అనివార్యమవుతోంది. చివరికి మన కరెన్సీ కూడా ఈ 75 ఏళ్లలో ఏ స్థాయికి దిగజారి పోయిందో, ఆ దిగజారుడులో కాంగ్రెస్ పాలకులు కూడా భాగ స్వాములయినా ఒక ఆలోచనాపరురాలిగా, కాంగ్రెస్ వాదిగా భావికా కపూర్ నిర్మొహమాటంగా ఇలా వర్ణించారు: మన ప్రగతి ‘వేగం’ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే – ‘‘భూటాన్ కరెన్సీ ఇప్పుడు ఇండియా కరెన్సీతో సమానం. ఒక భూటానీస్ గుల్ట్రమ్ (కరెన్సీ) ఒక రూపాయితో సమానమైంది. భూటాన్ ఒక్కటే కాదు, అఫ్గానిస్తాన్ రూపాయి కూడా ఇండియా రూపాయితో సమానమై కూర్చుంది. అంటే, మనమిప్పుడు తాలిబన్ల రాజ్యానికి సమానమన్నమాట. వావ్ మోదీజీ.. వావ్!’’ (30 డిసెంబర్ 2022) ఏది ఏమైనా, 75 ఏళ్ల భారత అమృతోత్సవాలు ముగిసిన వేళలో ఒక మహాకవి, స్వతంత్ర భారత మానవుడిని తలచుకుని అతని నేటి దుఃస్థితికి స్పందించిన తీరును మరొక్కసారి గుర్తు చేసుకుందాం: ‘‘ఆ మానవమూర్తి ముఖం మీద ఎప్పుడూ ఉండే పసిపాప నవ్వులేదు! స్వతంత్ర భరతవర్ష వాస్తవ్యుడా మానవుడు అర్ధనగ్నంగా ఆకాశాన్నే కప్పుకొని నిండని కడుపుతో మండుతూన్న కళ్లతో ఇలా ఎంతకాలం ఇంకా నిలబడతాడా ప్రాణి? అందుకే అతణ్ణి జాగ్రత్తగా చూడండి స్వతంత్ర భారత పౌరుడు అతని బాధ్యత వహిస్తామని అందరూ హామీ ఇవ్వండి అతని యోగ క్షేమాలకు / అందరూ పూచీపడండి అతికించండి మళ్లీ / అతని ముఖానికి నవ్వు! స్వాతంత్య్రం ఒక చాలా సున్నితమైన పువ్వు,చాలా వాడైన కత్తి, విలువైన వజ్రం స్వాతంత్య్రం తెచ్చేవెన్నెన్నో బాధ్యతలు సామర్థ్యంతో నిర్వహిస్తామని / సంకల్పం చెప్పుకుందాం’’ ఇంతకీ మహాకవి ఆశించిన ఆ ‘సామర్థ్యం, సంకల్పం’ మనలో ఏది? అది మనలో కరువయింది కాబట్టే పాలకుల పాలనా సామ ర్థ్యాన్ని గత సుమారు రెండు దశాబ్దాలుగా బొడ్లో చేయివేసి ప్రశ్నిస్తున్న ‘ఏడీఆర్’(అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్) నిరంతర నివే దికలు కూడా ‘బుట్టదాఖలు’ అవుతున్నాయి. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
విజ్ఞానమే పరిష్కారం! చిట్కాలు కావు!
చైనాలో బీఎఫ్.7 వేరియంట్ బాధితుల శవాల గుట్టలతో మార్చురీలన్నీ నిండిపోతున్నాయనీ, 20 లక్షల మంది చనిపోవచ్చనీ అమెరికా నుంచి వార్తలు వండుతున్నారు. కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు చైనా విధించుకున్న ఆంక్షలను ఎత్తి వేయాలని గగ్గోలు పెట్టినవాళ్లే, ఆ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా పరిస్థితులలో మార్పు లేదని ఎత్తిపొడుస్తున్నారు. నిజానికి ప్రజల ఆరోగ్య భాగ్యాలే ప్రాధాన్యతగా చైనా వ్యవహరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. ఒక్క చైనీయుడూ చనిపోకుండా చేయడం కాదు, సాధ్యమైనంత తొందరలో వ్యాధిని అదుపు చేసి సామాజికులపై పడే ఖర్చుల భారాన్ని కనీస స్థాయికి తేవడమే ఆ దేశ విధానమని ‘లాన్సెట్’ చెబుతోంది. కాబట్టి విమర్శకులు ముందు తమ ఇంటిని చూసుకోవాలి. ‘‘ఏ ప్రజా సమస్యల విషయంలోనైనా మన దృష్టిలో ఉండవలసింది ప్రజలు, వారి ఆరోగ్య భాగ్యాల సమస్య. ఈ తాత్విక దృక్కోణం ఆధారంగానే చైనా ప్రభుత్వం వ్యవహరించింది. విదేశాల నుంచి చైనా సందర్శనకు వచ్చిపోయే ఆగంతుకుల నుంచి చైనాలో ‘కోవిడ్–19’ వైరస్ వ్యాపిం చింది. అయినా కోవిడ్–19 వైరస్ వ్యాప్తి నిరోధానికీ, నిర్మూలనకూ చైనా అన్ని చర్యలూ తీసుకుంది. ఫలితంగా ఈ విషయంలో చైనా ప్రభుత్వం వుహాన్‌లో వైరస్ వ్యాప్తి ఉధృతిని నిలువరించి గణనీయమైన క్రియాశీల ఫలితాలు సాధించింది.’’ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గెబ్రీయేసస్ ‘‘చైనాలో వైరస్ వ్యాధి విస్తరణ వల్ల చనిపోయిన వారి సంఖ్య ప్రపంచంలోనే తక్కువ. కోవిడ్–19 వైరస్ మహమ్మారి వల్ల ప్రపం చంలో అదనంగా చనిపోయినవారి సంఖ్య 1 కోటి 82 లక్షలని అంచనా. ప్రపంచవ్యాపితంగా చూస్తే ఈ వైరస్ మూలంగా ప్రతి లక్షమంది ప్రజలకు 120 మరణాలు నమోదు కాగా, అందులో 179 మరణాలు అమెరికాలో నమోదైతే – చైనాలో కేవలం 0.6 మరణాలు మాత్రమే నమోదైనాయి. చైనా అనుసరిస్తున్న విధానం ఒక్క చైనీయుడు కూడా ఈ మహమ్మారి వల్ల చనిపోకుండా చేయడం కాదు, సాధ్యమై నంత తొందరలో కోవిడ్–19 వ్యాధిని అదుపు చేసి సామాజికులపై పడే ఖర్చుల భారాన్ని కనీస స్థాయికి తేవడం. తద్వారా కోటానుకోట్లమంది ఆరోగ్యాన్ని, సాధారణ జీవితాన్ని, సరకులు ఉత్పత్తి క్రమాన్ని సాధ్యమై నంత వేగంగా తిరిగి నెలకొల్పడం. పశ్చిమ పసిఫిక్ ప్రాంత ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ సహితం చైనా కృషిని కొనియాడారు.’’ – సుప్రసిద్ధ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ ‘లాన్సెట్’ ‘‘కరోనా కేసుల సంఖ్యపై చైనా గోప్యత. రోజువారీ కేసుల వివరా లను ఇకనుంచీ వెల్లడించబోవటం లేదని చైనా జాతీయ ఆరోగ్య సంస్థ తెలిపింది. జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తివేసిన 20 రోజుల్లోపే 25 కోట్ల మంది ప్రజలకు కరోనా సోకింది. దేశంలో ఆస్పత్రులలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లన్నీ కొత్తగా సోకిన బీఎఫ్.7 వేరియంట్ బాధితుల శవాల గుట్టలతో మార్చురీలన్నీ నిండిపోతున్నాయి. 2023వ సంవత్సరంలో చైనాలో 20 లక్షల మంది కోవిడ్‌తో చనిపోవచ్చని ఒక అంచనా. ఒక మున్సిపాలిటీలో ఒక్క రోజులోనే 5.3 లక్షల కేసులు నమోదైనట్టు సమాచారం. ఆ లెక్కల్ని ఆన్లైన్లో అధికారులు తొలగించేశారు.’’ – అమెరికా నుంచి విడుదలైన (25.12.22) ఒక వార్త ఇలాంటి ‘వార్తలు’ ఇలా విడుదలవుతూ ఉండగానే సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు మంజుల్ ఈనాటి భారత పాలకులు విడుదల జేస్తున్న కొన్ని ఆంక్షలపై ఒక చరుపు చరుస్తూ కార్టూన్ (26.12.22) వేశాడు. ‘అక్కర్లేదు. నేవెడుతున్నది ఒక పెళ్లి కార్యక్రమానికి గానీ, నోరు మూసుకుని పడుండే పార్లమెంటుకు కాదు సుమా’ అని వ్యంగ్యాస్త్రం విసిరాడు. సరిగ్గా ఇదే సమయంలో జాతీయ స్థాయిలో ఇమ్యునైజేషన్ టెక్నికల్ సలహా సంఘ అధినేత ఎన్.కె. అరోరా ‘భారతదేశంలో కోవిడ్–19 మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితులు ‘అదుపు’లోనే ఉన్నాయి గానీ, అప్రమత్తత మాత్రం అవసర’మని చెబుతూ, ‘ఇలాంటి అంటువ్యాధుల్ని అరికట్టడం అసలు సాధ్యమా? వ్యాక్సిన్లు పని చేస్తున్నట్టా, లేనట్టా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతే గాదు, ‘ఇలాంటి మహమ్మారిని అరికట్టడం అసాధ్యం. ఫలితంగా కొన్ని చోట్ల వ్యాధి తీవ్రత ఎక్కువ కావొచ్చు, మరికొన్ని చోట్ల తక్కు వగా ఉండొచ్చు, అంతే తేడా’ అని అరోరా అన్నారు. ఆధునిక శాస్త్ర వైజ్ఞానిక దృష్టితో వైరస్ క్రిములను అరికట్టే విధానాన్ని జయప్రదమైన ప్రయోగాలతో నిరూపించిన శాస్త్రవేత్త, 19వ శతాబ్దపు సుప్రసిద్ధ భౌతికవాద శక్తి లూయీ పాశ్చర్! ఇంతటి వైజ్ఞానిక ప్రగతి బాటల్ని విస్మరించి పాలకులూ, కొన్ని వ్యాపార పత్రికలూ ఏ అమెరికా నుంచో విడుదలయ్యే చౌక బారు కథనాలను భుజాన వేసుకుని ప్రజా బాహు ళ్యాన్ని గందరగోళపర్చడం ఒక ఆనవాయితీగా మారింది. అంతేగాదు, ఏనాడో భారతదేశంలో దేశ వైద్య పరిషత్ ఖరారు చేసిన శాస్త్రీయ నిర్ణయాలను, ఆదేశాలను పక్కనపెట్టి, వ్యాపార సరళిలో ప్రయివేట్ మందుల కంపెనీలతో మిలాఖత్ అయ్యి, భారత మెడికల్ కౌన్సిల్ అప్పజెప్పిన సాధికారిక ఆదేశాలను పెక్కుమంది వైద్యులు, ఇతర ఆరోగ్య శాఖ అధికారులు విస్మరించడంవల్ల – దేశ ఆరోగ్య వ్యవస్థే ప్రయివేట్ వ్యాపార ధోరణికి అలవాటు పడి పోయింది. అందుకే భారత మెడికల్ అసోసియేషన్, దేశీయ డాక్టర్లకు వంద రకాల ప్రశ్నలను సంధించి, సుమారు 81 శాతం మంది డాక్టర్ల నుంచి సమాధానాలు రాబట్టింది. వారిలో 37 శాతం మంది మెడికల్ కంపెనీల ప్రతినిధులతో వారానికి ఒకసారి సంభాషిస్తామని చెప్పగా, 25.9 శాతం మంది నెలకు రెండుసార్లయినా చర్చిస్తామని చెప్పారు. కాగా, 69.1 శాతం మంది డాక్టర్లు మాత్రం ప్రయివేట్ వైద్య కంపెనీల ప్రతినిధులు తమకు ఇవ్వజూపే మందుల ప్రయోజనాలను అతిగా చూపుతూ, సదరు కంపెనీల మందులవల్ల కలిగే ఇబ్బందుల్ని గురించి తక్కువగా చెబుతున్నామని తెలిపారు. ఇటు 63 శాతం మంది డాక్టర్లు ప్రయివేట్ కంపెనీల నుంచి తమకు స్టేషనరీ సామాను, మందుల శాంపిల్స్, కంపెనీల తాలూకు జర్నల్స్ ఉచితంగా అందుతున్నాయని వెల్లడించగా, ప్రయివేట్ ఫార్మా కంపెనీలతో గానీ, వాటి ప్రతినిధు లతోగానీ మాట్లాడే సందర్భాల్లో పాటించాల్సిన జాగ్రత్తల గురించి భారత వైద్య పరిషత్ నిర్ణయించిన జాగ్రత్తలను, హెచ్చరికలను 70.4 శాతం డాక్టర్లు బొత్తిగా చదవలేదని రుజువైంది. ప్రయివేట్ ఫార్మా కంపెనీలతో చర్చల్లో వైద్యులు పాటించాల్సిన నైతిక ప్రమాణాలను ఉల్లంఘిస్తే ఎదుర్కోవలసిన శిక్షలు కూడా వైద్యులకు తెలియక పోవడం మరీ ఆశ్చర్యకరం. 2014 నాటికే భారత వైద్యమండలి నిర్ణ యించిన నైతిక ప్రమాణాలు, ఫార్మా కంపెనీలతో పాలకుల లోపాయి కారీ ఒప్పందాల ఫలితంగా మరింత దిగజారిపోతూ వచ్చాయి. కాగా, ఇంత దిగజారుడు ప్రవర్తన మధ్య కూడా 58 శాతం మంది డాక్టర్లు ప్రయివేట్ ఫార్మా కంపెనీల నుంచి ప్రలోభాలకు లొంగడం ‘అనైతిక ప్రవర్తన’గా ప్రకటించడం సంతోషకరం. అర్ధ సత్యాలతో కూడుకున్న ప్రస్తుత పరిస్థితులలో గమనించ వలసిన విషయం ఏమిటంటే, కోవిడ్–19 వ్యాప్తిని నిరోధించేందుకు చైనా విధించుకున్న ఆంక్షలను ‘ఎత్తి వేయాలని’ గగ్గోలు పెట్టిన విదేశీ పాలకులే (భారతదేశం సహా), ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా పరిస్థితులలో మార్పు లేదని ‘ఎత్తిపొడుపు’ మాటలు వల్లించడం ఎలాంటి ‘నీతో’ సంతృప్తికరంగా వివరించ గలగాలి. లూయీ పాశ్చర్ అన్నట్టు ‘మానవ ఆరోగ్య రక్షణకూ, క్రిముల సంహారానికీ ప్రాథమిక గ్యారంటీ – శాస్త్ర విజ్ఞా నమేగానీ చిట్కాలు కావు’! అందుకే కవి పెరుగు రామకృష్ణ అంటాడు: ‘‘జీవితమే వ్యాపా రమై పోయిన వ్యవస్థలో/ రోజూ మరణించడం/ మళ్లీ రోజూ బతకడం/స్నానమయ్యాక గుడ్డలు తొడుక్కున్నట్టే!’’ ఎందుకీ పరిస్థి తుల వైపు మన దేశం పరుగెడుతోందన్న ప్రశ్నకు నివృత్తిగా విశ్వకవి టాగూర్ ప్రార్థనను మరొక్కసారి విందాం: ‘నన్ను ప్రార్థించనీ/ ప్రమాదాల నుంచి రక్షించమని కాదు/ ధైర్య సాహసాలతో ఎదుర్కొనే శక్తిని/ కలిగించమని ప్రార్థించనీ/ నన్ను కోరుకోనీ/ నాకు సంభవించే నా బాధలను పోగొట్టమని కాదు/ కష్టనష్టాలను అతి తేలిగ్గా భరించగల/ శక్తిని కోరుకోనీ/ నన్ను ఆశించనీ, నా జీవిత పోరాటంలో మిత్రుల సహకారాన్ని/ దిగ్విజయం పొందడానికి నా సొంత శక్తిని ఆశించనీ/ నన్ను అర్థించనీ/ ఆతు రతతో భయపడి రక్షణ కోసం కాదు/ నేను నా స్వాతంత్య్రాన్ని సిద్ధించుకోవడానికి శక్తి సామర్థ్యాలు అర్థించనీ/ ఓ ప్రభూ!/ నాకు కలిగే దిగ్విజయాలలో మాత్రం నీ కరుణా/ కటాక్షాలను స్మరించే పిరికివానిగా చేయకు/ పరాజయాలలో నీ చేయూత అర్థించనీ!’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు Abkprasad2006@yahoo.co.in -
సుప్రీం స్వతంత్రతే దేశానికి రక్ష
భారత లౌకిక రాజ్యాంగ లక్ష్యాల పరిరక్షకురాలిగా సుప్రీంకోర్టు పాత్ర ఎంతో కీలకమైనది. కానీ గత 75 ఏళ్లుగా దాని మీద స్వారీ చేయాలని మొదట కాంగ్రెస్ పాలకులు, ఇప్పుడు బీజేపీ పాలకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతతో వ్యవహరించాల్సి ఉందన్న తీర్పును శిరసా వహించవలసింది పోయి, దాన్ని తోసిపుచ్చుతూనే వచ్చారు. కానీ దానికి ఎదురు నిలిచి గట్టిగా అడ్డుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు న్యాయ స్థానానికీ, పాలక వర్గానికీ మధ్య అధికార సమతుల్యతను సాధించగలిగారు. కానీ ప్రభుత్వం మాటే చెల్లుబడి కావాలి అన్న వాదన మళ్లీ యధాతథ స్థితికే వచ్చింది. పాలకవర్గానికి అనుకూలురుగా వ్యవహరించగల వ్యవస్థను ఖరారు చేసే ప్రయత్నంలో బీజేపీ పాలకులు ఉండటం గమనార్హం. ‘‘రానున్న దశాబ్దాలలో సుప్రీంకోర్టు దేశ పాలకుల నుంచీ, ఇతర రంగాల నుంచీ పెక్కు సవాళ్లను ఎదుర్కొనవలసి ఉంటుంది. వాస్తవానికి భారత లౌకిక రాజ్యాంగ లక్ష్యాల పరిరక్షకురాలిగా సుప్రీంకోర్టు తన కర్తవ్యాన్ని తు.చ. తప్పకుండా నెరవేర్చవలసి ఉంటుంది.’’ – భారత లా కమిషన్ మాజీ అధ్యక్షులు, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.పి. షా (20 సెప్టెంబర్ 2022) గత 75 సంవత్సరాల్లో మొదట కాంగ్రెస్ శక్తులు, ఆ పిమ్మట బీజేపీ– ఆరెస్సెస్ శక్తులు రాజ్యాంగ లౌకిక సూత్రాలకు కట్టుబడకుండా పాలకుల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ వచ్చాయి. 1971–93 మధ్య దేశ పాలకులు సుప్రీంకోర్టులో తమకు అను కూలంగా ఉండే న్యాయ మూర్తులే ఉండాలని పట్టుబట్టడంతో అలాంటి వారినే ప్రధానంగా నియమిస్తూ వచ్చారు. దాంతో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయ మూర్తుల నియామకాల్లో ‘సీనియారిటీ’ ప్రశ్న తలెత్తకుండా పాలకులు జాగ్రత్త పడుతూ వచ్చారు. 1981లో ‘ఫస్ట్ జడ్జెస్’ కేసులో (ఎస్.పి. గుప్తా కేసు) వెలువరించిన న్యాయ వ్యవస్థ స్వతంత్రత తీర్పును శిరసా వహించవలసిన అవసరాన్ని పాలకులు తోసిపుచ్చుతూనే వచ్చారు. ఈ ధోరణిని 1993లో గట్టిగా అడ్డుకున్నవారు నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎన్. వెంకటాచలయ్య. దాంతో అప్పటికి న్యాయస్థానానికీ, పాలక వర్గానికీ మధ్య అధికార సమతుల్యత వచ్చినట్టు కన్పించేదిగానీ, పాలక శక్తుల నిరంకుశ ధోరణి (ప్రభుత్వం మాటే చెల్లుబడి కావాలి అన్న వాదన) మళ్లీ యధాతథ స్థితికే వచ్చింది. ఎటుతిరిగీ బలహీనమైన పాలక వర్గాలు అధికారంలో ఉన్న ప్పుడు మాత్రమే న్యాయస్థానాలు కొంత గాలి పీల్చుకోగలిగాయి. ఈ పరిణామాలు వచ్చివచ్చి నరేంద్ర మోదీ ప్రధానిగా బీజేపీ ప్రభుత్వం రాగానే ‘తీసికట్టు నాగంబొట్టు’ అన్న చందంగా తయారయ్యాయి. అయితే ఈ స్థితి ప్రధాన న్యాయమూర్తిగా మొన్నటిదాకా పనిచేసి రిటైర్ అయిన జస్టిస్ ఎన్.వి. రమణ కాలంలో కొంతవరకు ప్రజాను రంజకంగా కొనసాగింది. ఆ తరువాత ప్రధాన న్యాయమూర్తిగా వచ్చి 2024వ సంవత్సరం దాకా ఆ పదవిలో కొనసాగనున్న జస్టిస్ డి.వై. చంద్రచూడ్ తీసుకొంటున్న నిర్ణయాలు సుప్రీం పరువును, దేశ లౌకిక రాజ్యాంగ ప్రతిపత్తిని అక్షరసత్యంగా కాపాడుతున్నాయి. అయితే జస్టిస్ ఎ.పి. షా చెప్పినట్టుగా అప్పుడే ‘‘పాలకవర్గం నుంచి జస్టిస్ చంద్రచూడ్ విధానాలకు ప్రతిఘటన’’ మొదలైందని మరచిపోరాదు. ఈ సందర్భంగా ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతి రేకంగా రాష్ట్ర హైకోర్టు వెలువరించిన ప్రతికూల తీర్పులపై సుప్రీం కోర్టు ఇచ్చిన తిరుగులేని తీర్పును ఒక కనువిప్పుగా భావించాలి. ‘‘ఏపీలో ప్రభుత్వ కార్యనిర్వాహక విధుల జోలి హైకోర్టుకు ఎందుకు? హైకోర్టే ప్రభుత్వమైతే ఇక అక్కడి మంత్రి మండలి ఎందుకు? ప్రజా ప్రతినిధులెందుకు?’’ అంటూ సుప్రీం జస్టిస్ కె.ఎం. జోసఫ్, జస్టిస్ బీవీ నాగరత్నం ధర్మాసనం వ్యాఖ్యానించవలసి రావటం సుప్రీం నిర్ణయాలకు ఎంత ప్రాముఖ్యముందో అర్థమవుతోంది. పరిపాలనా వికేంద్రీకరణ అవసరం ఎంత ఉందో కూడా సుప్రీం ధర్మాసనం గుర్తిం చింది. రాజధాని ఫలానా ప్రాంతంలోనే ఉండాలని ఆదేశించే అధి కారం కోర్టుకు లేదనీ, కోర్టులకు ఆ హక్కు ఉండే పక్షంలో మంత్రి వర్గాలెందుకనీ కూడా సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఇలా ధర్మాసనం లేవనెత్తిన ప్రజానుకూలమైన ప్రశ్నల నేప థ్యంలో– బీఆర్ అంబేడ్కర్‌ను ఉటంకిస్తూ, భారత పాలక వర్గాలు రాజకీయంగా ఎంత పతనమయ్యాయో చెప్పిన మాటల్ని ‘శంకర్స్ వీక్లీ’ (16 ఏప్రిల్ 1949) ఒక కార్టూన్ ద్వారా ఏనాడో వెల్లడించింది. ‘‘భారతదేశంలో రాజకీయ నాయకుణ్ణి ఒక మత గురువు స్థానంలో నిలబెట్టి కొలుస్తారు. కానీ, భారతదేశం వెలుపల మాత్రం అక్కడి ప్రజలు మత గురువుల జన్మదినాలనే జరుపుకొంటారు. కానీ ఇండియాలో మత గురువుల జన్మదినాలతోపాటు రాజకీయ నాయ కుల జన్మ దినాలు జరుపుతారు. రాజకీయ నాయకుడు సత్ప్రవర్తన గలవాడయినప్పుడు ప్రేమించండి, గౌరవించండి. కానీ నాయకుణ్ణి కొలవడం అనేది ఉండకూడదు. ఆ పని కొలిపించుకునేవాడికీ, కొలిచే వాడికీ తగదు. ఉభయత్రా ఈ పని నైతిక పతనంగా భావించాలి’’ అన్నారు అంబేడ్కర్. ఈ మాటల్నే 1955లో తలచిందెల్ల ధర్మం అని భావించరాదని పార్లమెంట్లో చెప్పారు. ‘రాజు తప్పు చేయడన్న’ సంప్రదాయం బ్రిటిష్‌వాడి నమ్మిక. కానీ రాజ్యాంగాన్ని అమలుజరిపే విషయంలో రాచరిక వ్యవస్థల్లో లాగా నేటి ప్రధానమంత్రి తప్పు చేయడనీ, చేయలేడనీ చెప్పడం ఉండకూడదన్నారు. ఈ దృష్ట్యానే అంబేడ్కర్ సుప్రీంకోర్టు జడ్జీలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి సర్వాధికారాలు ఉండాలని కోరుతూ సవరణలు ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమానా భివృద్ధి ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ప్రాంతీయ రాజధానులు, కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయాలు సబబేనన్నది సుప్రీం కోర్టు భావన. ఈ పరిణామాలకు కొన్ని ప్రతిపక్షాలు, వాటికి కొమ్ము కాసే పత్రికలు వక్రభాష్యం చెబుతున్నాయి. జగన్ ప్రభుత్వం నవ రత్నాల పథకాన్ని జయప్రదంగా అమలు కానివ్వకుండా చూసేందుకు కొన్ని ప్రతిపక్షాలు ‘జక్కాయి బుక్కాయి’తో చేతులు కలిపి పాలనా రథాన్ని కుంటుపర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. సుప్రీం తాజా నిర్ణ యంతో వాటి నోళ్లు పెగలక ‘రూటు’ మార్చాయి. ప్రపంచంలో ఎక్కడా దేశానికి, రాష్ట్రాలకు రెండేసి మూడేసి రాజధానులు ఉండవని ‘కోత కోస్తూ’ వచ్చిన కొన్ని ప్రతిపక్షాలు తమ మాటలు అబద్ధాలని గుర్తించక తప్పని స్థితి వచ్చింది. సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం తీసుకున్న నిర్ణయం ఫలితంగా – జస్టిస్ కె.ఎం. జోసెఫ్ లాంటి దళిత న్యాయమూర్తి నిజాయితీ కూడా ప్రపంచానికి వెల్లడయింది. ఎందుకనంటే రాష్ట్ర గవర్నర్లు... రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి, వాటి సలహా సహకారాలతోనే రాజ్యాం గంలోని 163వ అధికరణ ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది గానీ, రాష్ట్ర ప్రభుత్వాలను ధిక్కరించి కాదని బొమ్మై కేసులో జస్టిస్ జయ చంద్రారెడ్డి తీర్పును దేశవ్యాపిత స్థాయిలోనే ప్రజాస్వామ్య నిర్ణ యంగా న్యాయ శాస్త్రవేత్తలు భావించారు. ఉత్తరాఖండ్‌లో పరిణామాలు బీజేపీ పాలకులకు వ్యతిరేకంగా ఉన్నందున అర్ధంతరంగా అక్కడ రాష్ట్రపతి పాలనను విధించేందుకు మోదీ ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని తిప్పి కొట్టడానికి జస్టిస్ జోసెఫ్ జంకనందున అప్పటికి ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న ఆయన్ని సుప్రీంకోర్టు జస్టిస్‌గా పదవీ స్వీకారం చేయనివ్వకుండా మోదీ ప్రభుత్వం అడ్డు కుంది. నేడు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలోని బీజేపీ గవర్నర్లు చేస్తున్న నిర్వాకం – దాదాపు పది రాష్ట్రాలలోని బీజేపీయేతర ప్రభు త్వాలను పడగొట్టేందుకు తోడ్పడటం. ఇలా 1960ల నుంచి నేటి దాకా పెక్కుమంది గవర్నర్లు పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలదోయడానికి తోడ్పడుతూ వచ్చినవాళ్లే! మోదీ మంత్రివర్గ సీనియర్ సభ్యుడు కిరణ్ రిజిజూ జాతీయ స్థాయి న్యాయమూర్తుల నియామకాలను ఖరారు చేసే వ్యవస్థను రద్దు చేసి, పాలకవర్గానికి అనుకూలురుగా వ్యవహరించగల వ్యవస్థను ఖరారు చేసే ప్రయత్నంలో ఉండటం ఇక్కడ గమనార్హమైన విషయం. అందుకే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్ ఒక తాజా ఇంటర్వ్యూలో ‘న్యాయ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ సంపూర్ణాధి పత్యాన్ని అనుమతిస్తే న్యాయవ్యవస్థ స్వేచ్ఛగా నిర్ణయాలు చేయగల స్థితిలో ఉండదు’ అన్నారు. అందుకేనేమో వేమన మహాకవి ఏనాడో ఇలా తీర్పు చెప్పిపోయాడు. ‘అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా? విశ్వదాభిరామ వినుర వేమ’! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
మళ్లీ కావాలి ఒక ‘సెన్సేషన్’!
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను ఆగమేఘాల మీద నియమించారన్న విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం నిశితమైన వ్యాఖ్యానాలు చేసింది. టీఎన్ శేషన్ లాంటి ఒక బాధ్యతాయుతమైన అధికారిని కోరుకుంటున్నట్టు చెప్పింది. అయితే రెండు దశాబ్దాలుగా ఏ ఒక్క కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా పూర్తికాలం తన పదవిలో కొనసాగడం లేదు. యూపీఏ, ఎన్డీయే రెండు పాలక కూటముల హయాంలోనూ జరిగింది ఇదే. ఇంత అస్థిరంగా పదవిలో ఉండే అధికారి, ఒకవేళ అత్యంత శక్తిమంతమైన స్థానంలో ఉన్నవారి మీద ఆరోపణలు వస్తే ఏం చర్యలు తీసుకోగలరు? స్వతంత్ర ప్రతిపత్తి, విలువలు ముఖ్యమైనందున సీఈసీ నియామకానికి స్వతంత్రమైన నిర్ణయాధికారం గల ప్యానెల్ ఉండి తీరాలి. ‘‘దేశంలో కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారుల (సీఈసీ), ఇతర ఎన్నికల అధికారుల (ఈసీ) నియామకాల విషయంలో రాజ్యాంగపు మౌనాన్ని ప్రభుత్వాలు తమకు అనుకూలంగా దుర్వినియోగం చేసుకుంటూ వస్తున్నాయి. ఇది అవాంఛనీయ పోకడ. వారి నియామకానికి ఎలాంటి ప్రక్రియనూ దేశ రాజ్యాంగం, అందులోని 324వ అధికరణ నిర్దేశించలేదు. కానీ, ఎన్ని కల కమిషనర్ల నియామకం విషయంలో చట్టం చేయాలని రాజ్యాంగం నిర్దేశించిపోయినా గత 72 ఏళ్లుగా ఆ పనిని పాలకులు చేయలేదు. ఫలితంగా ఏ ఒక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా 2004 నుంచీ ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోలేదు. ఇక పదేళ్ల యూపీఏ (కాంగ్రెస్ కూటమి) పాలనలో ఏకంగా ఆరుగురు సీఈసీలు మారి పోగా, ప్రస్తుత ఎన్డీఏ (బీజేపీ కూటమి) ఎనిమిదేళ్ల పాలనలో ఏకంగా ఎనిమిదిమంది సీఈసీలను మార్చేశారు. ఈ పరిస్థితుల్లో ఒకనాడు భారతదేశ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా, వ్యక్తిత్వం ఉన్న అధికారిగా పని చేసిన టీఎన్ శేషన్ లాంటి వారు సీఈసీగా రావాలని మేము కోరు కుంటున్నాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి, విలువలు ముఖ్యమైనందున సీఈసీ నియామకానికి స్వతంత్రమైన నిర్ణయా ధికారం గల ప్యానెల్ ఉండి తీరాలి. ఎందుకంటే, ఇప్పటి పద్ధతిలో అస్వతంత్రమైన సీఈసీ నియామకం వల్ల ఒకవేళ ప్రధానమంత్రిపై ఆరోపణలొస్తే సీఈసీ నిర్ణయం తీసుకోగలరా?’’ – సీఈసీల స్వల్పకాలిక నియామకాలతో కేంద్ర పాలకులు అనుసరిస్తున్న విధానాలను విమర్శిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం (22 నవంబర్ 2022) టీఎన్ శేషన్ 1990 డిసెంబర్ నుంచి 1996 డిసెంబర్ దాకా దేశ 10వ సీఈసీగా పనిచేశారు. అలాంటి బాధ్యతాయుత ఉన్నతాధికారి నేడు దేశానికి కావాలని సుప్రీంకోర్టు గౌరవ ధర్మాసనం ఎందుకు అభి ప్రాయపడవలసి వచ్చిందో ప్రతి పౌరుడు పరిశీలించాల్సిన అవసరం తలెత్తింది. 1950 మార్చి నుంచి 2022 ‘మే’ దాకా శేషన్ సహా సీఈసీ లుగా పనిచేసినవారు మొత్తం 25 మంది. ఒకసారి రాష్ట్రపతి నియ మించిన తర్వాత, ఏ సీఈసీ అయినా బాధ్యతలను సక్రమంగా నిర్వ హించక పోయినా, తప్పుడు నిర్ణయాలకు పాల్పడినా ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించాలంటే – లోక్‌సభ, రాజ్యసభ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలన్నీ క్షుణ్ణంగా తెలిసినవాడు, తన పరిధిలో నిక్కచ్చి అయిన సాహసి కాబట్టే టీఎన్ శేషన్ తన హయాంలో దేశ ఎన్నికల నిర్వహణలోనే ‘పాపం’లా పేరుకుపోయిన వందకుపైగా అవకతవక లను గుర్తించి, దేశ ఎన్నికల నిర్వహణ తీరును సంస్కరించడానికి నడుం బిగించారు. మన కేంద్ర పాలకుల స్వార్థపూరిత విధానాలలోని అవకతవకలను సరిదిద్ది, సకాలంలో పాలకుల్ని ‘గాడి’లో పెట్టేందుకు దోహదపడమని అధికారుల నిబంధనలు ఘోషిస్తున్నా... ‘చూసి రమ్మంటే కాల్చి వచ్చే’ బాపతువాళ్లు అధికార గణంలో కూడా ఉండ బట్టే అనేక అవకతవకలకు ఆస్కారం కల్గుతోందని గతంలో ‘రీసెర్చి అండ్ ఎనాలిసిస్ వింగ్’ (‘రా’) గూఢచారి సంస్థ అధిపతిగా పనిచేసిన ‘కా’(కేఏడబ్ల్యూ) వెల్లడించిన విషయం ఈ సందర్భంగా గుర్తొస్తోంది. కానీ సీఈసీగా శేషన్ భారత ఎన్నికల నిర్వహణ వ్యవస్థలోని లొసుగుల ఆధారంగా రాజకీయ పార్టీలు చేస్తున్న అవినీతి, అక్రమ చర్యలకు అడ్డుకట్ట వేశారు. ఈ క్రమంలోనే ఒక జనరల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ – ఆర్ఎస్ఎస్ అగ్రనాయకుల్ని శేషన్ అడ్డు కున్నారు. ‘రాజ్యాంగ సెక్యులర్ లక్ష్యాలకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారా, లేదా? అయినప్పుడు ఆ ప్రతిజ్ఞకు భిన్నంగా వ్యవహ రించిన మిమ్మల్ని, మీ పార్టీని ఎందుకు నిషేధించరాదో చెప్పమని (అద్వానీ ప్రభృతుల్ని) నిలేసినవారు శేషన్. ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళిని పకడ్బందీగా రూపొందించ డంతో పాటు, అర్హులైన వారందరికీ ఓటర్ల గుర్తింపు కార్డుల్ని సిద్ధం చేసి పంపిణీ చేసినవారు శేషన్! ఎన్నికల ప్రచారం పేరిట విచ్చల విడిగా డబ్బులతో ఓటర్లను కొనేయడానికి, మద్యాన్ని విచ్చలవిడిగా అభ్యర్థులు ఏరులై పారించడాన్ని చట్ట విరుద్ధ అవినీతికర చర్యలుగా ప్రకటించి తాను సీఈసీ హోదాలో వాటిని కొనసాగించవలసిన ఆదర్శాలుగా మలిచారు. ఈ కఠినమైన ఆదర్శ నిర్ణయాలను చేసి అమలు జరిపినందుకు శేషన్‌ను ప్రశంసించినవారూ ఉన్నారు, విమ ర్శించినవారూ ఉన్నారు. ఎన్నికల ప్రచారం పేరుతో ‘లౌడ్ స్పీకర్ల’ విచ్చలవిడి వాడకాన్ని నియంత్రించిన వారాయన. కనుకనే గిట్టిన వారి దృష్టిలో ‘సెన్సేషన్’గానూ, గిట్టనివారి దృష్టిలో తమ పాలిట ‘అల్సేషన్’ గానూ ఆయన కనిపించారు. సీఈసీ పదవిలో అంత వరకూ పనిచేసిన మొత్తం 25 మంది సీఈసీలలో ఒక్క శేషన్‌కే ప్రసిద్ధ రామన్ మెగసెసే పురస్కారం లభించింది. లక్ష్యం సరైనదైతే ‘సుపరి పాలనా వ్యవస్థ నిర్మాణం అసాధ్యమేమీ కాదు’ అని స్పష్టంగా ప్రకటించినవాడు శేషన్. కనుకనే సీఈసీ పదవిలో ఉన్న వ్యక్తులు పాలకుల కోరికల మేరకు ‘తలలూపే’ బాపతుగా ఉండటం దేశ నడవడికకు ఆదర్శనీయమైన ఆచరణను ప్రసాదించలేదని దేశ అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనం దృఢాభిప్రాయంగా మనం తీర్మా నించుకోవచ్చు. సీఈసీ పదవికి ప్రతిపాదించిన నాలుగైదు పేర్లలో ఒకరిని (అరుణ్ గోయెల్) నిమిషాల మీద నియమించి దేశంలో ‘గత్తర’ లేపారు పాలకులు. ‘ఆగమేఘాల’ మీద ఒక అధికారిని నియ మించడానికి చూపిన చొరవను ఆక్షేపిస్తూ రాజ్యాంగ ధర్మాసనం తరఫున జస్టిస్ కె.ఎం. జోసఫ్ చేసిన ప్రకటనను సునిశిత వ్యాఖ్యగా మనం పరిగణించాలి. జస్టిస్ జోసఫ్ మాటల్లో: ‘స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలి. ఇంతకూ అసలు సమస్యల్లా సంబంధిత వ్యక్తి (అధికారి) నిజంగా స్వతంత్ర శక్తి ఉన్నవాడా కాదా అన్నదే అసలు ప్రశ్న’! కనుకనే కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకానికి కేంద్రంలో తటస్థంగా వ్యవహరించే స్వతంత్రమైన యంత్రాంగం ఉండి తీరాలని జస్టిస్ జోసఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి అభిప్రాయ పడ్డారు. ధర్మాసనం వేసిన సూటి ప్రశ్న: ‘ప్రధానమంత్రిపై ఆరోప ణలు వస్తే ప్రధాన ఎన్నికల అధికారి చర్యలు తీసుకోగలరా? అందుకే సీఈసీకి స్వతంత్ర ప్రతిపత్తి, వ్యక్తిత్వం ముఖ్యం’! కులాతీత, వర్గాతీత, మతాతీత రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చుకున్నామా అన్నది ఈ రోజుకీ ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇందుకు కారణాన్ని అన్వేషించడం ఇప్పటికైనా కష్టమేమీ కాదు. రాజ్యాంగ మౌలిక లక్ష్యాలు భారత ప్రజల అనుభవంలోకి, ఆచరణ లోకి అనువదించుకోవాలంటే – ముందు తక్షణమే జరగవలసిన పని – రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశిక సూత్రాలకు, పౌరుల ప్రాథమిక హక్కుల అధ్యాయానికి మధ్య వ్యత్యాసాన్ని పూర్తిగా తొల గించగలగాలి. ఆచరణలో అమలు చేయకుండా సంపన్న వర్గాల ప్రయోజనాలను కాపాడే ఆదేశిక సూత్రాలను పౌరుల ప్రాథమిక హక్కుల జాబితాలోకి మార్చడానికి పాలక వర్గాలు సంసిద్ధం కావాలి. పౌరుల ప్రాథమిక హక్కులకు ఆచరణలో విలువ ఇచ్చిననాడే 75వ స్వాతంత్య్ర అమృతోత్సవాలకు విలువా, సలువా ఉంటుంది. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రసిద్ధ కవుల్లో, కథకుల్లో ఒకరైన అట్టాడ అప్పల్నాయుడు ‘చిటికెన వేలు’ కథలోని ఒక పాత్ర గుర్తుకొస్తోంది: ‘‘మన దేశంలో జరిగే ఎన్నికల్లో ధనమూ, దైవమూ, మద్యమూ గాక నెత్తురు కూడా గద్దె ఎక్కడానికి అవసరం అని తెలుసుకున్నాడు. నెత్తురు మన మూకదయినా సరే, శత్రు మూక దయినా సరే పారాల్సిందే.’’ మన ఎన్నికల నిర్వహణ తంతు 75 ఏళ్ల తర్వాత కూడా అలాగే కొనసాగుతోందంటే ఆశ్చర్యమా?! abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
సామాన్యుడి కోసం ధర్మపీఠం
సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల తన ప్రమాణ స్వీకారంలో జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నిర్మొహమాటంగా చేసిన ఒక ప్రకటన దేశ ప్రజల్లో ఆశలు రేకెత్తించేదిగా ఉంది. పాలక విధానాల ఫలితంగా దేశం నేడు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా దేశ దిశాగతిని మార్చడానికి తోడ్పడగల నిర్ణయాలు చేసే అవకాశం తన స్థాయిలో ఉందని ఆ ప్రకటన ద్వారా ఆయన సూచనప్రాయమైన భరోసాను ఇచ్చారు. తన ఎదుగుదలలో గాంధీ, నెహ్రూల ప్రజాస్వామ్య భావాల ప్రభావమే గాక కారల్ మార్క్స్ రూపొందించిన ప్రపంచ ప్రసిద్ధ మేనిఫెస్టో ప్రభావం కూడా ఉండి ఉండవచ్చునని అనిపిస్తోంది! కనుకనే చంద్రచూడ్ ‘సామాన్య పౌరుల ప్రయోజనాల పరిరక్షణే’ తన ధ్యేయంగా బాహాటంగా ప్రకటించుకోగలిగారు. ‘‘పేదసాదల కోసం మా ప్రభుత్వం అన్నీ చేస్తోందని మన పాలకులు చెప్పుకోవచ్చు గాక. కానీ అలాంటి ‘కోతలు’ బ్రిటిష్ పాలకులు కూడా కోస్తూండేవారు. కానీ అసలు నిజం – పేదల ప్రయోజనాలు మాత్రం స్వతంత్ర భారత ప్రభుత్వం కూడా నెరవేర్చడం లేదు. ఈ సత్యాన్ని మన పాలకులు హుందాగా అణకువతో ఒప్పుకుని తీరాలి’’ – మహాత్మాగాంధీ (1947 డిసెంబర్) ‘‘వెయ్యిన్నొక్క కత్తుల కన్నా ప్రజాభిప్రాయం అనేది అత్యంత బలమైన ఆయుధం. హైందవాన్ని క్షుద్ర పూజాదికాలతో రక్షించు కోలేము. పరాయి పాలన నుంచి విముక్తి పొందిన దేశం మనది. ఈ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కంటికి పాపలా కాపాడుకోవాలి. ఎలా? నీలో మానవత్వం, ధైర్య సాహసాలు, నిరంతర జాగరూకత ఉన్నప్పుడే నీ ధర్మం నీవు నెరవేర్చగలుగుతావు. ఈ అప్రమత్తత మనలో కొరవడిన నాడు, మనం అత్యంత ప్రేమతో సాధించుకున్న స్వాతంత్య్రం కాస్తా చేజారిపోతుంది. కానీ దురదృష్టవశాత్తూ దేశంలో ప్రస్తుత అశాంతికి అంతటికీ కొందరు కారణమని వింటున్నాను. భారత దేశం హిందువులకు ఎంతగా పుట్టినిల్లో, ముస్లిములకూ అంతే పుట్టినిల్లు అని మరచిపోరాదు. అలాగే ఎవరికి వారు తమ మతమే గొప్పదనీ, అదే నిజమైనదనీ భావించడం తప్పు. ఈ భావననే చిన్నప్పటి నుంచీ పిల్లల్లో కూడా నూరిపోయడం వల్ల అదే నిజమన్న ధోరణిని వారిలో పెంచిన వారవుతున్నారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకునేదే నిజమైన ప్రజా ప్రభుత్వం. ప్రజల దారిద్య్రాన్ని, నిరుద్యోగ పరిస్థితిని పట్టించుకోని పాలకులు ఒక్క రోజు కూడా అధికారంలో ఉండటానికి వీలు లేదు’’. – మహాత్మాగాంధీ (అదే ఏడాది మరొక సందర్భంలో) ‘‘దేశం కోసమే నా తపన అంతా. 365 రోజులూ పని చేస్తున్నా. నేను పునాది రాయి వేసిన ప్రాజెక్టులను నేనే ప్రారంభిస్తున్నా. ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం’’. – ప్రధాని నరేంద్రమోదీ (19.11.2022) ‘దేశం కోసమే నా తపనంతా..’ అనేంతగా ‘ఆత్మవిశ్వాసం’ కొంద రిలో పెల్లుబికి వస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సందర్భంగా ఆయన నిర్మొహమాటంగా చేసిన ఒక ప్రకటన దేశ ప్రజల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని ఆలోచింపజేసేదిగా ఉంది. జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబర్ 10 వరకు ఆ పదవిలో ఉంటారు. ఆ లోపుగా.. దేశం నేడు పాలక విధానాల వల్ల ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా దేశ దిశాగతిని మార్చడానికి ఆయన తన స్థాయిలో తోడ్పడగల నిర్ణయాలు చేసే అవకాశం ఉంది. ఆయన ప్రకటన సూచన ప్రాయంగా అదే తెలియజేస్తోంది. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన భరోసాను పాలకవర్గాలు హరించేస్తున్న సమయంలో చంద్ర చూడ్.. ‘ఆధార్’ పత్రం పేరిట పాలకులు పౌరహక్కుల్ని కత్తిరించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఏనాడో ఎదుర్కొని అడ్డుకట్ట వేశారు. ‘ఆధార్’ కార్డు పేరిట పౌరులకు ప్రశ్నించే హక్కును హరించడం ఎలా సాధ్యమో ఆయన నిరూపించారు. ‘ఆధార్’ కార్డు చెల్లుతుందంటూ ధర్మాసనంలోని మిగతా నలుగురు సభ్యులు మెజారిటీతో నిర్ణయిం చగా, అది ఎలా రాజ్యాంగ విరుద్ధమో నిరూపించి నెగ్గుకొచ్చిన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్! కనుకనే ఇప్పుడు దేశ ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ పదవీ స్వీకారం చేసిన రోజున కూడా ‘సామాన్యుల సేవే తన తొలి ప్రాధాన్యమని’ ప్రకటించారు. ఆ ప్రకట నలో ఆయన పాలకులకు చేదోడువాదోడుగా ఉపయోగపడే ‘సీల్డ్ కవర్’ తతంగానికి కోర్టులు స్వస్తి చెప్పించాలని కూడా సూచించారు. న్యాయ వ్యవస్థపై కూడా ప్రజల నమ్మకం సడలిపోతున్న సమయంలో ఆయన ఇస్తున్న భరోసా నమ్మకాన్ని కలిగిస్తోంది. చంద్రచూడ్ ఎదుగుదలలో గాంధీ, నెహ్రూల ప్రజాస్వామ్య భావాల ప్రభావమే గాక వర్గరహిత సామాజిక వ్యవస్థ ప్రతిష్ఠాపన లక్ష్యంగా ప్రపంచ శ్రమజీవుల ప్రయోజనాల రక్షణకు కారల్ మార్క్స్ రూపొందించిన ప్రపంచ ప్రసిద్ధ మేనిఫెస్టో ప్రభావం కూడా ఉండి ఉండవచ్చు! కనుకనే చంద్రచూడ్ ‘ప్రతి అంశంలోనూ సామాన్య పౌరుల ప్రయోజనాల పరిరక్షణే’ తన ధ్యేయంగా బాహాటంగా ప్రక టించుకోగలిగారు. ఎలాగంటే ధనికవర్గంలో జన్మించిన ఫ్రెంచి మహా రచయిత బాల్జాక్ ఫ్రెంచి సామాజిక పరిణామ క్రమాన్నే సామాన్య ప్రజల ప్రయోజనాల రక్షణ కోసం మార్చేసిన వాడు. అందుకే మార్క్స్ అతణ్ణి సమాజ వాస్తవిక పరిస్థితులకు అద్దంపట్టిన మహా రచయితగా వర్ణించాడు. ధనిక, పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలు క్రమంగా ఏ దారుణ పరిస్థితుల వైపుగా సామాజిక వ్యవస్థల్ని నడిపిస్తాయో తన రచనల ద్వారా ధనికుడైన బాల్జాక్ వర్ణించడాన్ని మార్క్స్ ప్రశంసించాడు. అంతేగాదు, ధనిక వర్గ నాగరికతకూ, దాని అధీనంలో జరిగే నేరాలకూ మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయో కూడా మార్క్స్ అనేక సదృశాలతో నిరూపించాడు. అలాంటి ధనిక వర్గ సమాజాల్లో ‘ఎవరికివారే యమునాతీరే’గా ప్రజావసరాలతో నిమిత్తం లేకుండా జరిగే వస్తూత్పత్తి లాగానే నేరగాళ్లు వరుసగా నేరాలు సృష్టిస్తుంటారు. వాటితోపాటు నేర చట్టానికి దోహదం చేస్తారు. ఈ క్రమంలోనే నేర చట్టాన్ని గురించి ప్రొఫెసర్ గారు ఉపన్యాసాలు దంచేయడానికి ముందుకొస్తారు. ఆ తర్వాత ఆ ఉపన్యాసాలన్నింటినీ సంకలనం చేసుకుని ఓ గ్రంథం సిద్ధం చేసుకుని దాన్ని జనరల్ మార్కెట్లోకి ఓ ప్రత్యేక వస్తువు(కమాడిటీ)గా విడుదల చేస్తాడు. అమ్మి సొమ్ము చేసుకుంటాడు! అంతేనా, అలాంటి సమాజంలోని నేరగాడు మొత్తం పోలీస్ వ్యవస్థ సృష్టికి, తద్వారా క్రిమినల్ జస్టిస్, ఆ పిమ్మట జడ్జీలు, ఉరి తీసే తలార్లు, ఆ పిమ్మట జ్యూరీ వ్యవస్థ వగైరాల ఏర్పాటుకు కారణమౌతాడు. అటుపైన ‘తాటి తోనే దబ్బనం’ అన్నట్టుగా చిత్రహింసలు మొదలై, ఆ హింసాకాండ నిర్వహణకు గానూ అందుకు తగిన వృత్తి నిపుణుల సృష్టి అవసరం అవుతుంది (ఇలాంటివారు అవసరం అవబట్టే రా.వి. శాస్త్రి ‘సారో కథలు’, ‘సారా కథలూ’ రాయాల్సి వచ్చింది). అందుకే మార్క్స్ అంటాడు: ‘‘శ్రామిక వర్గాలు, సంపన్న వర్గాలు భిన్న ధ్రువాలు. రెండూ ప్రైవేట్ ఆస్తుల సృష్టి కారకులే!’’ అని. అందువల్ల ఈ రెండు ఒకే నాణేనికి రెండు ముఖాలని సరిపెట్టుకుంటే చాలదు. ప్రైవేట్ ఆస్తి ప్రత్యేక సంపదగా తనకు తాను రక్షించుకొనక తప్పదు, అలాగే శ్రామిక జీవులూ తమను తాము రక్షించుకొనక తప్పదు. కనుకనే వారిది అమానుషమైన దుఃస్థితి. ఈ స్థితిలోనే ప్రైవేట్ ఆస్తిపరుడు స్వార్థపరుడు అవుతాడు, కాగా తన అమానుష మైన దుఃస్థితిని వదిలించు కోవాలనుకున్న శ్రమజీవి సమాజానికి శత్రువుగా కన్పిస్తాడు. కనుకనే శ్రమజీవిని దోచుకోవడంపై ఆధార పడిన ప్రైవేట్ ఆస్తి రద్దు అయితేనే శ్రమజీవులకు బతుకు. అయితే అసమ సమాజ వ్యవస్థలోని అమానుష జీవన పరిస్థితులు రద్దు కాకుండా మాత్రం శ్రామికులకు శాశ్వత విమోచనం దుర్లభమని మార్క్స్–ఎంగెల్స్‌లు నిరూపించారు (కలెక్టెడ్ వర్క్స్: వాల్యూమ్ 4). అందువల్ల జస్టిస్ చంద్రచూడ్‌ను ‘న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం కొనసాగేలా మీరు ఏం చర్యలు తీసుకొంటారన్న’ ప్రశ్నకు ‘చేతల్లోనే చూపిస్తానని’ భరోసా ఇచ్చారు. అంతవరకూ ప్రజల అస మ్మతిని ప్రజాస్వామ్యం మనుగడకు రక్షణ కవచంగా ప్రధాన న్యాయ మూర్తి సుప్రీంకోర్టును నిరంతరం తీర్చిదిద్దగలరని ఆశిద్దాం. సామా న్యుడికే తన ‘పెద్ద పీట’ అని చాటిన చంద్రచూడ్ దేశ దిశాగతిని తీర్చి దిద్దేందుకు తనకు సంక్రమించిన అనితరసాధ్యమైన అవకాశాన్ని 2024 ఎన్నికల సంవత్సరాని కన్నా ముందస్తుగానే తగినట్టుగా ఉపయోగించుకోగలరని ఆశిద్దాం! ఏబీకే ప్రసాద్,సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
రాష్ట్రాల వృద్ధిలో కేంద్రం పాత్రేమిటి?
సొంతంగా ఎదిగేందుకే రాష్ట్రాలు ప్రయత్నించాలి గానీ కేంద్రం వైపు ఎదురుచూడరాదని ప్రకటించారు ప్రధాని. దానర్థం రాష్ట్రాలకు ఇవ్వాల్సినవి ఇవ్వలేమని చెప్పడమా? ఆధునిక సవాళ్లకు గాంధీ భావాలే మంచి విరుగుడని భావించే కేంద్ర పాలకులు... ఆచరణలో మాత్రం స్వపరిపాలనను నినాదప్రాయంగా మార్చారు. ‘ఆత్మ నిర్భర భారత్’ సాకారం చేయలేదు. ఫెడరల్ వ్యవస్థలో రాజ్యాంగ నిర్దేశాలకు విరుద్ధంగా వ్యవహరించినప్పుడు ప్రజలను అప్రమత్తుల్ని చేయడానికి భారత లా కమిషన్ మాజీ అధ్యక్షుడైన ఎ.పి. షా ఇలా హెచ్చరించారు: ‘‘నిరంకుశంగా వ్యవహరించే పాలక వ్యవస్థలో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు దేశ రాజ్యాంగ విలువలను కాపాడే బాధ్యత ఉంది.’’ ‘చల్లకొచ్చి, ముంత దాచాడన్న’ తెలుగు వాళ్ల సామెత ఎంత నిజమో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తలపెట్టిన వ్యూహాత్మక రాజకీయ యాత్రలు నిరూపించాయి. ఇందులో కీలక మైన అంశం చాలాకాలంగా ‘చిలవలు–పలవలు’గా పెరుగుతూ వస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు... ‘జనసేన’ పేరు చాటున ఎలాంటి విధాన స్పష్టత లేని సినీ నటుడు పవన్ కల్యాణ్‌ల మధ్య సంబం ధాలు. రెండు చేతులతో ‘ఏటీఎం’ల నుంచి ఇష్ట మొచ్చినట్టుగా డబ్బు దోచుకుని లబ్ధి పొందాడని బాబును గతంలో విమర్శించారు మోదీ. అలాంటిది బాబును కూడా కలుపుకొని పోదామని గనక ఈ ‘సత్తరకాయ’ పవన్ అని ఉంటే, దానికి మోదీ అంగీకరిస్తారా? అయితే, ఏపీలో పాగా వేయాలన్న బీజేపీ వ్యూహానికి అనుగుణంగా మోదీ మనసులో ఏముంది? అది ఆయన మన ఊహలకే వదిలేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించడానికి పరోక్షంగానూ, ప్రత్య క్షంగానూ గతించిన పార్లమెంట్లో బీజేపీ నాయకత్వం కూడా సారథ్యం వహించింది. విభజించే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కల్పించి దాని పురోభివృద్ధికి దోహదపడే చర్యలను మాత్రం తీసుకోలేదు. ‘ప్రత్యేక హోదా’ ఊసే ఎత్తడం మానుకున్నారు. ఈ విషాదకర అనుభవం చంద్రబాబు కాంగ్రెస్–బీజేపీ నాయకత్వాలతో మిలాఖత్ కావడం వల్ల నూతన ఆంధ్రప్రదేశ్ అనుభవించాల్సి వచ్చింది. తిరిగి ఈ పరిస్థితుల మధ్యనే సరికొత్త విద్రోహానికి పవన్ ద్వారా బీజేపీ నాయకత్వం గజ్జె కట్టింది. స్థూలంగా, మోదీ–పవన్‌ల భేటీ ఫలితం ఇదే కాబోతోంది. అందుకనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడానికి ఈ క్షణానికీ మోదీ ముందుకు రాలేదు. రాక పోగా, సరికొత్త ‘బండరాయి’ని మోదీ వదిలివెళ్లారు. ‘సొంతంగా ఎది గేందుకే రాష్ట్రాలు ప్రయత్నించాలి గానీ కేంద్రం వైపు ఎదురు చూడరాద’ని ప్రకటించారు. కేంద్ర పాలకుల ప్రవర్తన, వారు ఫెడరల్ వ్యవస్థలో రాజ్యాంగ నిర్దేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును ఏనాడో పసిగట్టి ప్రజ లను అప్రమత్తుల్ని చేయడానికి ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి, భారత లా కమిషన్ మాజీ అధ్యక్షుడైన ఎ.పి. షా ఇలా హెచ్చ రించారు: ‘నిరంకుశంగా వ్యవహరించే పాలక వ్యవస్థలో దేశ అత్యు న్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు బాధ్యతలతో కూడిన దేశ రాజ్యాంగ విలువలను కాపాడే బాధ్యత ఉంది.’ (20 సెప్టెంబర్ 2022). ఇదే సందర్భంగా జస్టిస్ షా, 2014–2022 దాకా గడిచిన ఎని మిదేళ్లలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జస్టిస్ ఆర్.ఎం. లోధా నుంచి జస్టిస్ ఎన్.వి. రమణ దాకా ఎనిమిదిమంది సుప్రీం ప్రధాన న్యాయమూర్తులుగా ఉండి ఉన్నత న్యాయస్థానం పురోగతికి దోహదం చేశారని చెబుతూ... ఆనాటి బీజేపీ మంత్రి అరుణ్ జైట్లీ అన్న మాటల్ని గుర్తు చేశారు: రిటైర్ అవుతున్న న్యాయ మూర్తులకే ఉద్యోగాలిస్తే కోర్టులను ప్రభావితం చేసి ప్రభుత్వాలకి తోడ్పడతారని జైట్లీ బాహాటంగా ప్రకటించారు. న్యాయమూర్తులుగా పనిచేసినవారు రాష్ట్రాల గవర్నర్ పదవుల కోసం ‘అర్రులు’ చాచ డాన్ని జస్టిస్ షా నిరసిస్తూ వచ్చారని మరవరాదు. గవర్నర్‌గా నియ మితులైన ఓ న్యాయమూర్తి అనంతరం సుప్రీం ప్రధాన న్యాయ మూర్తిగా వచ్చిన జస్టిస్ ఆర్.ఎం. లోథా ధైర్యంగా, సాహసవంతమైన నిర్ణయాలు చేయగలిగారు. మళ్లీ మరో ప్రధాన న్యాయమూర్తి వివా దాల్లో నిలిచారు. దానికితోడు రహస్యంగా కవర్లో పెట్టి అందజేసే ‘సీల్డ్ కవర్’ ఆనవాయితీని ప్రవేశపెట్టారు. అయితే ఆ సంప్రదాయం మీద ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ అసహనం వ్యక్తం చేశారు. అందరిలోకీ న్యాయవ్యవస్థ మనుగడకు తలమానికంగా నిలిచిన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా. ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ‘అత్యవసర పరిస్థితుల’ పేరిట పౌరులపై రుద్దిన నిర్బంధ చట్టాన్ని ధిక్కరించి రాజకీయ ఖైదీల విడుదలను సుసాధ్యం చేసినవారు ఖన్నా. తనకు సిద్ధంగా ఉన్న ప్రధాన న్యాయమూర్తి పదవిని కూడా కాలదన్నిన గొప్ప న్యాయమూర్తి ఖన్నా. ఆయన త్యాగానికి అమెరికాలో అయినా బ్రహ్మరథం పట్టి హారతులు ఇచ్చారుగానీ, ఎమర్జెన్సీ కాలంలో ఆయన చూపిన త్యాగాన్ని మరచిపోయినవాళ్ళం మన భారతీయు లేనని మరచిపోరాదు. అలాగే జస్టిస్ రమణ సుప్రీం ప్రధాన న్యాయ మూర్తి హోదాలో సుప్రీంకోర్టు గౌరవాన్ని పునఃప్రతిష్ఠించారని కూడా లా కమిషన్ మాజీ అధ్యక్షుడు జస్టిస్ షా అభిభాషణ. అయితే ప్రధాని మోదీ హయాంలో నిర్ణయాలను గమనిస్తు న్నప్పుడు – రానున్న దశాబ్దాలలో పాలకుల నుంచి అనేక అంశాలలో సుప్రీంకోర్టు సవాళ్లను ఎదుర్కొనవలసి వస్తుందనీ, వీటిని ప్రతి ఘటించేందుకు దేశ సెక్యులర్ రాజ్యాంగమే శ్రీరామరక్ష అనీ జస్టిస్ ఎ.పి. షా నిశ్చితాభిప్రాయం. బహుశా జస్టిస్ షా మాదిరిగానే... జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ చలమేశ్వర్‌లు తమ తమ స్థాయుల్లో సుప్రీం కోర్టు నిర్వహణలో అనేక వివాదాస్పద సమస్యల మధ్య మంచి సంప్రదాయాలను ప్రవేశపెట్టారు. వీరికి అనుగుణంగానే ఆధునిక సంస్కరణ భావాలు మూర్తీభవించిన జస్టిస్ చంద్రచూడ్... ‘‘న్యాయ పాలనలోకి మహిళలు, సమాజంలోని అణగారిన వర్గాల వారు పెద్ద సంఖ్యలో ప్రవేశించవలసిన అవసరం ఉంది. ఇందుకు గానూ మొత్తం న్యాయవ్యవస్థనే మరింత ప్రజాస్వామ్యయుతంగా, ప్రతిభావంతంగా మార్చవలసిన అవసరం ఉంది. చట్టాలు అణచి వేతలకు సాధనంగా కాక, న్యాయం అందించే సాధనంగా ఉండాలి. ఆ బాధ్యతను గుర్తించి పాలకులు నడుచుకోవలసిన అవసరం ఉంది’’ అని స్పష్టం చేశారు. ఇది పాలకులకు, న్యాయ వ్యవస్థకు గొప్ప పాఠంగా మనం భావించాలి. అంతేగాదు, ‘‘దీర్ఘ కాలంలో న్యాయ వ్యవస్థను సజీవ శక్తిగా నిలబెట్టేవి... దయా గుణం, సహా నుభూతితో ప్రజల వేదనను పోగొట్టగలిగిన సామర్థ్యం మాత్రమే. అణగారిన వర్గాల ఆక్రందన వినగలిగి, వారి బాధలను చూడగలిగి, చట్టాన్ని, న్యాయాన్ని నేర్పుగా సమతుల్యం చేయగలిగిన నాడే – న్యాయమూర్తి తన బాధ్యతలను నిర్వహించినట్టు’’ అన్నది చంద్ర చూడ్ వేదన. గుజరాత్ నుంచి వయా ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆపైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల దాకా అధికారిక కుట్రలు, కుహకాలూ పాకిం చుతున్న కాషాయ నాయకులు... నేటి ‘సవాళ్లకు గాంధీ భావాలే మంచి విరుగుడ’ని భావిస్తున్నారు. కానీ స్వపరిపాలన మన ధ్యేయంగా, ఆచరణగా ఉండాలని చెప్పిన గాంధీజీ బోధనను నినాదప్రాయంగా మార్చారు. ‘ఆత్మ నిర్భర భారత్’ సాకారం కాలేదు. దేశీయ పరిశ్రమలను స్వదేశీ–విదేశీ గుత్త వర్గాలకు ధారాదత్తం చేశారు. వారు నిర్ణయించిన ధరలపై కోట్లాది ప్రజలను బతికేటట్టు చేసిన పాలనా విధానాలు దేశాన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నాయి? డాలర్లపై ఆధారపడిన దేశీయ ఆర్థిక విధానం వల్ల రూపాయి విలువ అధఃపాతాళానికి వెళ్లిన సమయంలో – పాలకులు ‘ప్రజలను దోచు కునేవాళ్లను వదిలిపెట్టేది లేద’ని ప్రకటనలు చేస్తుంటే వినేవాళ్ల చెవుల్లో సీసం పోసినట్టుగా ఉంది. స్వయంపోషక ఆర్థికాభ్యున్నతిని సాధించగోరే ఫెడరల్ వ్యవస్థ లోని రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాల పర్యటన మధ్యనే ప్రధాని మోదీ బండ సత్యాన్ని ప్రకటించారు: ‘‘ఏ రాష్ట్రానికా రాష్ట్రం స్వయంగా ఎది గేందుకు ప్రయత్నించాలి.’’ అంటే పాలకుల అపరాధం ఫలితంగా అర్ధంతరంగా ఏర్పర్చిన ఆంధ్రప్రదేశ్ లాంటి అనాధ శరణాలయాలు ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కోరడం చెల్లదని మోదీ తన తాజా పర్య టనలో చెప్పినట్టా? ఇందుకు పవన్ కల్యాణ్‌ను పావుగా వినియోగిం చుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ప్రతిపత్తిని కోరుతున్న వారి నోళ్లను నొక్కేయడమే బీజేపీ పాలకుల ధ్యేయమా? ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
మానవ హక్కులకు ప్రాణధార
‘చట్టాలు పేద వర్గాలను పీల్చి పిప్పి చేస్తూంటే, ధనిక వర్గం ఆ చట్టాలతోనే పెత్తనం చలాయిస్తూంది’ అన్నాడు గోల్డ్‌స్మిత్. ఆదర్శంలో ప్రతి ఒక్కరూ వారి స్థాయితో నిమిత్తం లేకుండా తమ ఫిర్యాదును న్యాయస్థానానికి నివేదించుకోగలగాలి. అందుకే జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ధోరణు లకు అడ్డుకట్ట వేయవలసిన అవసరాన్ని సుప్రీంకోర్టు కూడా గుర్తించవలసి వచ్చింది. కానీ ‘చట్టాలు సాలెగూడుల్లాంటివి. ఆ గూట్లోకి బలహీనమైన ప్రాణి దూరితే దాని కథ ముగిసినట్టే’ అన్నాడు సోలన్. అందుకే రాజ్యాంగంలోని 32వ అధికరణానికి ఉన్న పరిమితులను సైతం దృష్టిలో ఉంచుకుని మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న న్యాయమూర్తులు ఉన్నారు. అలాంటివారిలో... జస్టిస్ యతిరాజులు ఒకరు. ‘‘ఎంతటి సాధారణ పౌరుడైనా, జీవి తంలో అతడు ఏ స్థానంలో ఉన్నా, దానితో నిమిత్తం లేకుండా న్యాయస్థానంలో తన కేసును హుందాగా వినిపించే హక్కు అతనికి ఉంది. అంతే హుందా తనంతో కోర్టు అతని వాదనను సానుభూతితో వినే మర్యాదనూ పాటించాలి. ప్రజా సమస్యలను వినడానికే న్యాయస్థానాలు ఉన్నాయి. కోర్టులో న్యాయం కోసం వచ్చే పౌరుల్ని యాచకులుగానూ, పీడకులు గానూ చూడరాదు.’’ – 1988 షీలా బర్సీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు. ‘‘తీర్పు గుడ్డిది కావచ్చుగానీ, తీర్పరి (జడ్జి) గుడ్డివాడు కాకూడదు. – సుధాంశు రంజన్, సుప్రసిద్ధ జర్నలిస్టు, ‘జస్టిస్ వర్సెస్ జ్యుడీషియరీ’ గ్రంథం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 2019 భారత రాజ్యాంగ సూత్రాలను, ‘భారత ప్రజలమైన మేము మాకుగా రూపొందించుకున్న సెక్యులర్ రాజ్యాంగాన్ని’ కంటికి రెప్పలా కాపాడుకునే హక్కు మాకు ఉందని రాజ్యాంగం పీఠికలోనే నిర్ద్వంద్వంగా ప్రకటించి ఉన్నందున అది ఎప్పటికీ అనుల్లంఘనీయ మని ప్రముఖ తెలుగు న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ జి. యతి రాజులు చాటి చెప్పారు. రాజ్యాంగ అతిక్రమణ జరిగినప్పుడు ‘రాజ్యాంగ పరిహార’ హక్కును 32వ అధికరణం ప్రసాదిస్తోంది. భాగమైన 32వ అధికరణకు ఆచరణలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ– ఆ ఇబ్బందుల ఫలితంగా పాలక వర్గాలు, అధికారులు, పోలీసుల వల్ల సామాన్య ప్రజలు ఎలాంటి కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తోందో వివరించారు. ‘‘జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ధోరణులకు’’ అడ్డుకట్ట వేయవలసిన అవసరాన్ని సుప్రీం కోర్టు ఎందుకు గుర్తించవలసి వచ్చిందో జస్టిస్ యతిరాజులు పదే పదే ప్రస్తావించవలసి వచ్చింది (‘ఆర్టికల్ 32 అండ్ ద రెమెడీ ఆఫ్ కాంపె న్సేషన్’ పేరుతో రాసిన పుస్తకంలో). అయితే, దురదృష్టవశాత్తూ, కాదుకాదు, రాజ్యాంగ ఆదేశాల ఉల్లంఘనకు పాల్పడి పౌరహక్కుల అధ్యాయానికి తూట్లు పొడవడానికి అలవాటుపడిన పాలకవర్గాలు పౌరులకు ఉపయోగపడాల్సిన అధికరణలను ఆచరణలో అమలు కాకుండా చేసే యంత్రాంగాన్ని చొప్పించాయి. ఆదేశిక సూత్రాల లక్ష్యం సంక్షేమ రాజ్య స్థాపన. అవి అమలు జరగాలంటే వాటికి చట్టబద్ధత అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని విస్మరించరాదు. కొంతమంది వ్యక్తులకు సౌకర్యాల పేరిట కల్పించిన ప్రత్యేక హక్కులను అవసరమైతే సవరించయినా సరే ఆదేశిక సూత్రాలను అమలు జరపాలని కనీసం తొమ్మిది, పది కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు చెప్పింది (1970–1987 మధ్యకాలంలో). రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రాధా న్యతను నొక్కి చెప్పడానికి జస్టిస్ యతి రాజులు ‘‘మానవ హక్కుల, ప్రాథమిక స్వేచ్ఛా స్వాతంత్య్రాల’’ రక్షణ ప్రాధాన్య తను ఉగ్గడించిన యూరోపియన్ కన్వెన్షన్ అధికరణలో పెక్కింటిని కూడా ఉదాహ రించారు. ఈ 32వ అధికరణ ఆసరాగానే పాలకులు ప్రత్యర్థులపై విధించే అక్రమ కేసుల నుంచి విడిపించే ‘హెబియస్ కార్పస్’ పిటీషన్ కూడా అమలులోకి రాగ ల్గింది! అలాంటి అధికారం ఉన్న 32వ అధిక రణను విధిగా అమలు జరిపే బాధ్యత నుంచి తప్పించి అమలు లోకి రాకుండా చేశారు. అలాంటి 32వ అధికరణ అమలు జరపడా నికున్న అడ్డంకులను ఛేదించిన జస్టిస్ యతిరాజులును న్యాయ శాస్త్రంలో ఉద్దండులైన పలువురు పాత తరం న్యాయ మూర్తులకు దీటైనవారిగా భావించవచ్చు. సుప్రసిద్ధ గోల్డ్‌స్మిత్ అన్నట్టు ‘‘చట్టాలు పేద వర్గాలను పీల్చి పిప్పి చేస్తూంటే, ధనిక వర్గం ఆ చట్టాలతోనే పెత్తనం చలాయిస్తూంది.’’ అయితే గతించిన శతాబ్దంలో ఏథెన్స్లో ధనికులకూ, పేదలకూ మధ్య దుర్భరమైన అంతరం ఏర్పడినప్పుడు రాచరిక కుటుంబీకుడైన సోలన్ రంగంలోకి దిగాడు. స్వయంగా ప్రజలకు ఆర్థిక బానిసత్వం నుంచి, అప్పుల నుంచి విముక్తి కల్పించాడు. జైళ్లపాలైన వారిని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశాడు. పేదల్ని పిండి వసూలు చేసే పన్నులకు పన్నెండు రెట్లు ఎక్కువ పన్నును ధనిక వర్గాల నుంచి రాబట్టాడు. కోర్టులను ప్రజాబాహుళ్యం అవసరాలకు అనుగుణంగా సంస్కరిం చాడు. ఏథెన్స్ నగర రక్షణలో ప్రాణాలొడ్డిన వారి పిల్లలను పైకి తెచ్చి, ప్రభుత్వ ఖర్చుపైన విద్య చెప్పించాడు. ఈ సమూల సంస్కరణలకు ధనిక వర్గాలు భీషణమైన నిరసనలకు దిగాయి. అయితే ఇలా – ఒక తరం గడిచే లోగానే సోలన్ పెను సంస్కరణలు ఏథెన్స్ను విరుచుకు పడటానికి సిద్ధంగా ఉన్న విప్లవం నుంచి రక్షించాయి. అందుకే సెయింట్ అగస్తీన్ అన్నాడు: రాజ్యాలు, రాజ్యపాలకు లంటే ఎవరనుకున్నారు? పరమ ఘరానా దోపిడీదారులు, దోపిడీవర్గ సంస్థలు అన్నాడు (ది సిటీ ఆఫ్ గాడ్)! కనుకనే, సోలన్ ‘‘పాలకు డెవరో చెప్పండి – అతను చేసే చట్టం ఎలా ఉంటుందో నేను చెప్తా’’ అన్నాడు. ‘‘ఎందుకంటే చట్టాలు సాలెగూడుల్లాంటివి. ఆ గూట్లోకి బలహీనమైన ప్రాణి (పురుగు) దూరితే దాని కథ ఇక ముగిసి నట్టే. కానీ, ఎదిరించగల శక్తి ఉన్నది దూరితే అది నిభాయిం చుకుని బయటపడగల్గుతుంది’’ అని వివరించాడు. రాజ్యాంగంలోని 32వ అధికరణకున్న పరిమితులను సహితం దృష్టిలో ఉంచుకుని జస్టిస్ యతిరాజులు అదే అధికరణ కింద కక్షి దారుల సహజహక్కుల్ని రక్షించడం, నష్టపరిహారం రాబట్టగల్గడం... మానవహక్కుల సహజ పరిరక్షణకు తనవంతు చారిత్రక బాధ్యతను నెరవేర్చడంగా భావించాలి. ఈ విషయంలో జాతీయస్థాయిలోనూ, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ పలువురు న్యాయమూర్తులు సాధించిన విజయాలకు జస్టిస్ యతిరాజులు కృషి ఏమాత్రం తీసి పోదు. నిజాయితీకి, నిర్మొహమాటానికి పేరొంది, జాతీయ స్థాయిలో అభ్యుదయకర సంస్కరణలకు చేదోడు వాదోడుగా నిలిచిన జస్టిస్ పి.ఎ.చౌదరి, హిదా యతుల్లా, కేహార్, వెంకటాచలయ్య, హెచ్.ఆర్. ఖన్నా, జె.ఎస్.వర్మ, లోకూర్, జె.ఎస్.టాగోర్, భరూచా, కురియన్, జోసఫ్, జాస్తి చలమేశ్వర్ ప్రభృతులు ప్రవేశపెట్టిన నూతన ఒరవడు లకు జస్టిస్ యతిరాజుల కృషి కొనసాగింపుగానే భావించవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, జాతీయ స్థాయిలోనూ నూతన ఒర వడిలో తీర్పులు వెలువరించిన పి.ఎ.చౌదరి, జస్టిస్ జీవన్ రెడ్డి ప్రభృ తుల కృషికి ప్రాణధారపోసి చట్టబద్ధతకు దూరంగా ఉండి పోయిన దానిని పలువురి దృష్టిని ఆకర్షించేలా చేసి ప్రజలముందు ప్రయోజ నకర అధికరణగా నిలబెట్టగలిగారు! సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానంలో ఉండ వలసిన సుప్రసిద్ధ పౌరహక్కుల వాణి అయిన ప్రశాంత్ భూషణ్ గొంతు నొక్కేసే సంప్రదాయానికి తలుపులు తెరి చిన మాజీ ప్రధాన న్యాయమూర్తుల వైఖరిని తూర్పారబట్టారు. ఇలాంటి వాతావర ణంలో – చట్టరీత్యా ఆచరణలో అమలు కాకుండా దూరంగా ఉంచేసిన 32వ అధికరణకు ఆచరణలో శాశ్వత విలువను సంతరింపజేయడంలో జస్టిస్ యతిరాజుల కృషి సదా అభినంద నీయం. అయితే, రాజ్యాం గంలో కేవలం పేరుకు మాత్రమే చేర్చి, ఆచరణలో లేకుండా దూరం చేసిన వాటికి పూర్తి చట్టబద్ధత కల్పించే వరకు ప్రజాశ్రేయస్సును కోరే న్యాయమూర్తులు విశ్రమించకుండా ఉంటే ప్రజలు సంతోషిస్తారు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
విన్నారా? ‘మెదడే’ ప్రమాదకరమట!
న్యాయస్థానాల తీర్పుల్ని తప్పుపట్టకూడదని ఎక్కడా శాసనం లేదని బ్రిటిష్ రాణి న్యాయశాస్త్ర సలహాదారు డేవిడ్ పానిక్ అంటారు. న్యాయస్థానాలను గురించి ప్రస్తావించడం తగదని కొందరు ఇచ్చే సలహాలను వీళ్లు కొట్టేస్తారు. న్యాయవ్యవస్థ నడవడికలోని లోపాలను తొలగించుకోవడానికి విధిగా ప్రయత్నించాలని చెబుతారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో జరిగే పనుల తీరు గురించిన వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పకపోవడం తెలివి తక్కువ పని. వ్యవస్థల పనితీరులో లోటుపాట్లను గమనించలేనంత అమాయకులుగా ప్రజాబాహుళ్యాన్ని భావించడం అప్రజాస్వామికం. ఏ వ్యవస్థ అయినా విమర్శకు అతీతం కాదు. ముఖ్యంగా ఆలోచించే మెదడుంటే ప్రమాదకరమైన తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడతారని భావించేవాళ్లు ఉన్నప్పుడు! ‘‘మావోయిస్టు కుట్ర కేసు పేరిట వికలాం గుడైన ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబాను, ఆయనతోపాటు నిందితులైన ఇతరులను జైలు నుంచి విడుదల చేస్తూ, వారిపై మోపిన కుట్ర కేసును కొట్టివేస్తూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు కాకుండా సుప్రీంకోర్టు నిల్పివేసిన పద్ధతి చాలా అసాధారణం. పరస్పర విరుద్ధంగా వెలువడిన ఈ రెండు కోర్టుల తీర్పులు కీలకమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సాయిబాబా ప్రభృతులపైన మోపిన కేసును బొంబాయి హైకోర్టు– కేసు సామర్థ్యాన్ని బట్టి కాక, సాంకేతిక కారణాలపైన కొట్టివేసి ఉండ వచ్చు. కానీ ఆ తీర్పుకు వ్యతిరేకంగా వచ్చిన అప్పీలును అనుమ తించేప్పుడు సుప్రీంకోర్టు కొంత సంయమనం పాటించి ఉండాల్సింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం బొంబాయి హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా తన అప్పీలును తక్షణమే పరిశీలించాలన్న కోర్కెను తీర్చడానికే సుప్రీం కోర్టు అసాధారణమైన ఉత్సాహాన్ని కనబరిచింది. ఫలితంగా సుప్రీం కోర్టు... ధర్మాసనం ఏర్పాటు చేసింది. కానీ, సాయిబాబా ప్రభృతులను విడుదల చేయడానికి గల కారణాలను ఎంతో వివరంగా పేర్కొన్న బొంబాయి హైకోర్టు తీర్పును కేవలం సమర్థించడానికి సుప్రీం బెంచ్ అంత వేగంగా ఉత్సాహం కనబరిచి ఉండగలిగేదా అన్నది అనుమానిం చాల్సిన విషయం.’’ – ‘ది హిందూ’ సంపాదకీయం (17 అక్టోబర్ 2022) మన పాలకులుగానీ, కొందరు న్యాయమూర్తులుగానీ ఎలా వ్యవహ రిస్తున్నారంటే– ‘మనిషికి మెదడు ఉండటమే ప్రమాదకరం’ అన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఆలోచించే మెదడుంటే ప్రమాదకరమైన తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడతారని కొందరు న్యాయ మూర్తులు నిర్ణయించినట్టు కనబడుతోంది. మెదడు ఎందుకు, ఎలా ప్రమాదకరమైనదో బ్రిటిష్ రాణి క్యాబినెట్‌కు ప్రత్యేక న్యాయశాస్త్ర సలహాదారుడిగా వ్యవహరించిన డేవిడ్ పానిక్ కోర్టుల గురించి వ్యంగ్యంగా ఓ కథ చెప్పాడు: దారిన పోయే ఒక దానయ్య దారిన పోయేవాళ్లంతా కంగారు పడేంతగా, పెద్దగా భయంకరంగా తుమ్ము తుమ్మాడట. దానిపైన కొందరు దగ్గర్లో ఉన్న కోర్టులో ఫిర్యాదు చేస్తే, ఆ కోర్టు వారు ఆ వ్యక్తి రెండు ముక్కుల్లో ఏ వైపు నుంచి తుమ్మాడో తేల్చమన్నారట! అలా ఉంటాయి కొన్ని కోర్టు తీర్పులని చెప్పడానికే డేవిడ్ పానిక్ ఈ స్టోరీ చెప్పాడు. అలాగే కొన్ని సందర్భాల్లో కోర్టు తీర్పుల్ని తప్పుపట్టకూడ దని ఎక్కడా శాసనం లేదని చెబుతూ డేవిడ్ పానిక్, జడ్జి జెరోమి ఫ్రాంక్ ఇలా స్పష్టం చేశారు: ‘‘న్యాయస్థానం వ్యవహరించే తీరు తెన్నుల్ని గురించిన వాస్తవాలను వెల్లడించడం తగదనీ, పైగా ప్రమాదకరం కాబట్టి న్యాయస్థానాలను గురించి ప్రస్తావించడం తగదనీ కొందరు రాజకీయవేత్తలు, కొందరు న్యాయశాస్త్రవేత్తలు సలహాలిస్తుంటారు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో, ప్రభుత్వ శాఖల్లో జరిగే పనుల తీరు గురించిన వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పక పోవడం తెలివి తక్కువ పని. మనిషి రూపొందించి నిర్మించిన వ్యవస్థల పనితీరులో లోటుపాట్లను గమనించలేనంత అమాయకు లుగా, చిన్నపిల్లలుగా ప్రజాబాహుళ్యాన్ని భావించడం అప్రజాస్వా మికం. మన న్యాయవ్యవస్థ నడవడికలోని లోపాలను తొలగించుకోవ డానికి విధిగా ప్రయత్నించాలి. అందుకనే న్యాయస్థానంలో కూర్చొన దగిన సుశిక్షితులైన జడ్జీలను మాత్రమే అనుమతించాలి. వారి ప్రవ ర్తనను స్వేచ్ఛగా విమర్శించే హక్కు ప్రజలకుండాలి. వారి ప్రవర్తన జ్యుడీషియల్ పర్ఫామెన్స్ కమిషన్ విచారణకు సిద్ధమై ఉండాలి.’’ అందుకే స్వతంత్ర భారత న్యాయవ్యవస్థలో ఉద్దండపిండాలైన ఉన్నత న్యాయశాస్త్ర కోవిదుల్లో, ఉత్తమ న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ కృష్ణయ్యర్ న్యాయమూర్తి స్థానంలో ఉన్నవాడికి సామాజిక న్యాయంపట్ల అవగాహన, అనురక్తి, ప్రేమానురాగాలు విధిగా ఉండా లనీ... ఈ విషయంలో ఏ కోర్టు బెంచ్గానీ, బార్ అసోసియేషన్ గానీ నా ఆదర్శం నుంచి, లక్ష్యం నుంచి నన్ను మరల్చజాలవనీ పదేపదే స్పష్టం చేస్తూ వచ్చారు. ఈ సత్యానికి ప్రతిబింబంగానే ఫ్రెంచి తాత్త్వికులలో, వామపక్ష ప్రతినిధుల్లో ఒకరైన థోరే ఒక సందర్భంలో మాట్లాడుతూ– వ్యక్తుల్ని అన్యాయంగా, అక్రమంగా జైళ్లలో నిర్బంధించగల ప్రభుత్వం ఉన్న చోట న్యాయంగా వ్యవహరించే వ్యక్తి స్థానం కూడా జైల్లోనే అని వ్యంగ్యంగా పేర్కొన్నాడు. ఆయనను ఫ్రెంచి ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో నిర్బంధించే నాటికే ప్రపంచ ప్రసిద్ధ తాత్త్వికుడైన ఎమర్సన్ కూడా జైల్లో మగ్గుతున్నాడు. థోరేను అకస్మాత్తుగా చూసి, ‘అదేమి టయ్యా, నువ్వు కూడా జైల్లోనే ఉన్నావా?’ అని ఆశ్చర్యం వెలిబు చ్చాడు ఎమర్సన్. ‘అవును, ఎవరినైనా ప్రభుత్వం అక్రమంగా జైల్లోకి నెట్టే కాలంలో న్యాయం పలికే ఏ మనిషి స్థానమైనా జైలే సుమా’ అన్నాడు థోరే! అందుకే జస్టిస్ కృష్ణయ్యర్ ‘అన్యాయంగా జైళ్లలో నిర్బంధితులైన వారిని ప్రస్తావిస్తూ... ఉద్రేకంగా అక్రమ కేసులలో నిర్బంధితులైనవారికీ, వారి హక్కుల రక్షణకు పూచీ పడుతున్న రాజ్యాంగానికీ మధ్య ఇనుప తెర అనేది లేదనీ, ఉండదనీ గమనిం చా’లని పదేపదే చెప్పేవారు. కానీ, ఇప్పటికొచ్చేసరికి అసలు ‘మనిషి (పౌరుడి) మెదడు’ మీదనే కత్తి ఎక్కుపెట్టడం జరుగుతోంది. అందుకే మహాకవి శ్రీశ్రీ అదే ‘మెదడు’ గురించిన విశ్వజనీనమైన సత్యాన్ని ఎలా మానవాళి ముందు ఆవిష్కరించాడో చూడండి: ‘‘మెదడన్నది మనకున్నది అది కాస్తా పనిచేస్తే విశ్వరహఃపేటికావిపాటనం జరగక తప్పదు.’’ ‘మెదడు’ను పనిచెయ్యనివ్వాలి గదా? మరి దాని ఉనికినే ప్రమాదకరంగా భావించి ప్రజల ‘మెదళ్ల’నే కట్టడి చేయాలన్న తపనకు కొందరు తెరలేపడం ప్రమాదకరం. న్యాయస్థానాల గౌరవం మసకబారకుండా జాగ్రత్తపడటం కోసం జస్టిస్ లోకూర్ లాంటి వారు తమకు తాత్కాలిక పాలక శక్తులు ఎర చూపిన ప్రమోషన్లకు లొంగి పోలేదు. తమ ఉనికి కోసం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పాలకులు ప్రవేశపెట్టిన తప్పుడు చట్టాలు యువకుల జీవశక్తిని నులిమివేస్తు న్నాయి. ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టులో వీస్తున్న ఆహ్వా నించదగిన నిర్ణయాలు, పరిణామాల వాతావరణంలోనైనా అలాం టివి వైదొలగి పోవాలని ప్రజాస్వామ్యవాదులంతా కోరుకుంటారు. ఈ తప్పుడు కేసుల తతంగం అంతా జరుగుతూన్న సందర్భం గానే– ప్రపంచంలో ఆకలిదప్పులతో కునారిల్లిపోతున్న 121 దేశాలతో కూడిన జాబితాలో భారతదేశం 107వ స్థానంలో నమోదు కావటం మనకు సిగ్గుచేటుగా లేదా? అయినా దేశ పాలకులకు ‘చీమ కుట్టి నట్టు’గా కూడా లేదు. ఈ సందర్భంగా కవి కంచాన భుజంగరావు అమృతోత్సవాల సందర్భంగా వినిపిస్తున్న సందేశాన్ని విందాం: ‘‘అర్ధరాత్రి సంకెళ్లు తెగిన జాతికి సూర్యోదయం ఒక సహజమైన ఆశ తెల్లవారడం ఒక అనంతమైన భరోసా కాకపోతే 27,375 ఉదయాలు ఎదురుచూపులుగా కరిగిపోవడమేమిటన్నదే ఇప్పుడు తాజా ప్రశ్న. దొరల బూట్లలో కాలుపెట్టినప్పుడే అభివృద్ధి నడక ఎక్కడో తప్పటడుగులు వేసింది ఇప్పుడు కేవలం రెండొందల మర్రి చెట్ల (మహాకోటీశ్వరులు) నీడ దేశాన్ని కమ్మేసింది. పెట్టుబడి ఒక్కటే ఇప్పుడు వీసా లేకుండా దేశాలు తిరిగేస్తుంది ఈ గడ్డమీద పెట్టుబడికి ఉన్నంత స్వేచ్ఛ వేరెవరికైనా ఉందా? ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
జడ్జి ప్రశ్నలకు జవాబులున్నాయా?
ఆరోగ్యవంతమైన పత్రికలకు జాతీయ, సామాజిక బాధ్యత అనివార్యం. ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండటంలో పాలనాశక్తుల కన్నా ముందుగా జాగరూకులవడంలో మీడియా స్వతంత్ర హోదాలో వ్యవహరించాలి. ప్రజల పట్ల కడు గౌరవంతో, అణకువతో ప్రవర్తించాలి. కానీ ఒకనాటి విశిష్ట పాత్రికేయ ప్రమాణాలన్నీ క్రమంగా పతనమవడం చూస్తున్నాం. అందుకే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో సామాజిక, నైతిక ప్రమాణాల గురించి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి నిశితమైన విమర్శలు చేశారు. నిజాయితీ గల పాత్రికేయులందరూ వీటికి జవాబులు వెతకాలి. అయితే పత్రికా విలేకర్లు, ఎడిటర్లు అంటే నేడు చులకన భావన ప్రజల మనసుల్లో నాటుకుపోవడానికి దోహదపడినవి స్వార్థపర రాజకీయాలేనని మరవరాదు. ‘‘వార్తా పత్రికలు అనేవి సమాజంలో అంతర్భాగం. అంతమాత్రాన్నే తాము మొత్తం సమాజానికే ‘శిష్టాది గురువు’లమనీ, లోకంలోని జ్ఞానమంతా తమ సొత్తనీ భావించి విర్రవీగరాదు. బుద్ధిగల ఏ వార్తాపత్రికైనా చారిత్రక పరిణామంలో తనవంతు కీలకమైన పాత్ర నిర్వహిం చాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే బాధ్యత గల ఏ పత్రికైనా సమాజం కోసం, తాను సేవలందించే ప్రజల కోసం వారి పట్ల కడు గౌరవంతో, అణ కువతో ప్రవర్తించాలి. ఆరోగ్యవంతమైన పత్రికలకు జాతీయ, సామాజిక బాధ్యత అనివార్యం. ఈ క్రమంలోనే సమాజం పట్ల పత్రికల బాధ్యతను ఏరోజుకారోజు తాత్కాలిక రాజకీయ పార్టీలు లేదా ఆనాటి ప్రభుత్వాల బాధ్యతతో పోల్చుకోరాదు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి చేదోడు వాదోడు కావడంలో పత్రికలు పాలనాశక్తుల కన్నా ముందుగా జాగరూకులవడంలో స్వతంత్ర హోదాలో వ్యవహరించాలి.’’ – సుప్రసిద్ధ జాతీయ దినపత్రిక ‘ది హిందూ’ 1978 సెప్టెంబరు 5న తన నూరు సంవత్సరాల చరిత్రను (1878–1978) సమీక్షిస్తూ రాసిన సంపాదకీయం. ఒకనాటి ఇలాంటి విశిష్ట పత్రికా (పాత్రికేయ) ప్రమాణాలన్నీ కొలది సంవత్సరాలుగా ఎలా పతనమవుతూ వస్తున్నాయో చూస్తూనేవున్నాం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలుగు న్యాయ మూర్తులలో విశిష్టమైన జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఈ విషయంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర భావాలతో న్యాయస్థానాల ద్వారా, సభల ద్వారా ప్రజా బాహుళ్యంలో ఆధునిక వైజ్ఞా నిక దృష్టిని పెంపొందించడానికి కృషి చేస్తూ వచ్చిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి. తెలంగాణా వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో నేటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో సామాజిక, నైతిక ప్రమాణాల గురించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రస్తావించి, నిశితమైన విమర్శలు చేశారు. ఈనాటి కొందరు జర్నలిస్టులు పత్రికా యాజమాన్యాల సాయంతో పాలకుల్ని ఒప్పించడం సబబైన మార్గమని భావిస్తూండడాన్ని జస్టిస్ సుదర్శన్ విమర్శించారు. ఈ ధోరణి నేటి మీడియాలో పెరిగి పోతుండడాన్ని ఆయన నిరసించారు. వేలాది వార్తా పత్రికలు, వెయ్యి ఉపగ్రహాల సహాయంతో నడుస్తున్న న్యూస్ చానల్స్, 600 ఎఫ్.ఎం. స్టేషన్స్‌తో దేశంలోని బహు కొలదిమంది సంçపన్నులు లాభాల వేటలో పడి సొమ్ము చేసు కుంటున్నారు. ఇలాంటి వాతావరణంలోనే ఒక నటుడు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని మీడియా ఓ పెద్ద ఘటనగా చూపింది. అందుకు దోహదం చేసినవాళ్లు వెంటనే దాన్ని రాజకీయ పోరాటంగా మలిచేశారు. కానీ అదే సమయంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనకు కేవలం ఏడు నిమిషాల ప్రాధాన్యం కల్పించారు. ఎందు కని? వార్తలు పత్రికా ఆఫీసుల నుంచి కాకుండా ఎక్కడో బయట ‘అల్లి’ పత్రికలకు చేరుతున్నాయి! అయినా నిజాయితీ గల జర్నలిస్టులు, ప్రజా సమస్యల పట్ల ఆవేదన చెందగల పాత్రికేయులు కూడా మనకు లేకపోలేదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గుర్తించగలిగారు. అంతేగాదు, మరొక వాస్తవాన్ని కూడా జస్టిస్ సుదర్శన్ బహిర్గతం చేశారు. వార్తా పత్రికలు నిర్వహించే యాజమాన్య సంస్థల్లో పెక్కింటికి ఇతర వ్యాపారాలు కూడా ఉన్నందున నిర్ణయాలు త్వరగా తీసుకోలేని దుఃస్థితిని కూడా ఆయన వివరించారు. అందుకే దేశంలో ప్రజాస్వామ్యాన్ని, దాని విలువల్ని కాపాడేందుకుగానూ పూర్తిగా ప్రయివేట్ పత్రికా యాజమాన్యాల మీడియా సంస్థలపై సరైన అదుపాజ్ఞలు విధించడం అవసర మన్న సుప్రీంకోర్టు ప్రకటనను కూడా జస్టిస్ సుద ర్శన్ గుర్తు చేయవలసి వచ్చింది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్ట్ ప్రొఫెసర్ పద్మజా షా మాట్లాడుతూ – ప్రతీ పాత్రి కేయ విలువనూ, గత ప్రమాణాలనూ ధ్వంసం చేసి నేరస్థ రాజకీయ విలువల్ని చొప్పించేశారనీ, అదే జర్నలిజంగా ప్రమోట్ అవుతోందనీ ఆవేదన చెందారు. ధనార్జనలో భాగంగా అమెరికన్ కోటీశ్వరుడు రూపర్ట్ మర్డోక్ ‘ఫాక్స్’ న్యూస్ చానల్ పెట్టి ఎలా అనైతిక ప్రమాణాలను ప్రవేశపెట్టాడో లోకానికి తెలుసు. ఎక్కడో అమెరికా, ఇతర దేశాల సంగతి కాదు... ఆ మాటకొస్తే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నట్టింటనే ఇలాంటివి జరిగాయి. ‘‘సీనియర్ జర్నలిస్టుల’’ పేరిట చలామణీ అవు తున్న ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని ఒక ముఖ్యమంత్రి సాకడం జరిగింది. వారికి ఇంటర్– స్టేట్ వాహనాల లైసెన్సులు ఇప్పించడమే గాకుండా హౌసింగ్ బోర్డు యాజమాన్యంలో కూడా చోటు కల్పించారు. దాన్ని స్వప్రయోజనాలకు వినియో గించుకుని బ్యాంకుల్ని దివాళా తీయించిన ఉదా హరణలూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని మరవరాదు! అంతేగాదు, అనైతిక మీడియా సోదరుడే ‘‘ముందు వాడి (ఎన్.టి.ఆర్.) ఫొటోను తీసి అవ తల పారేస్తావా, లేదా?’’ అని స్వయంగా చంద్ర బాబు ముఖం మీదనే ‘ఉరిమాడా,’ లేదా? ఎన్టీఆర్ ఫొటో తీసేస్తే కథ అడ్డం తిరుగుతుందని తెలిసిన చంద్రబాబు ‘అలాగే తీసేద్దాంలే, ఇప్పుడు కాదు’ అని చెప్పి... ‘ఫొటో నాటకం’ కోసం కొన్నాళ్లు ఎన్టీఆర్ అవసరమని తెలిసి తన తైనాతీ జర్న లిస్టును కాపాడుకున్నాడా, లేదా? ఇప్పటికీ ఆ నాటకం ఎన్టీఆర్ బొమ్మతోనే కొనసాగిస్తున్నారా, లేదా? చివరికి అమరావతి రైతాంగాన్ని మోస గించిన వైనాన్ని గురించి సీనియర్ జర్నలిస్టుగా హైకోర్టులో నేను రిట్ వేసినా, దాన్ని కనీసం చర్చకు కూడా రానివ్వకుండా తొక్కిపెట్టించిన ఖ్యాతిని మూటగట్టుకున్నవాడు చంద్రబాబే! అంతే గాదు, అమరావతి రైతాంగానికి జరిగిన అన్యాయం గురించి సుప్రీంకోర్టులో నేను రిట్ వేసినప్పుడు, ఆగమేఘాల మీద ఢిల్లీ చేరుకుని, ఆ కేసును కూడా తొక్కిపట్టేట్టు చేసినవాడూ చంద్ర బాబే కదా? ఆ కేసు అప్పటికీ ఇప్పటికీ అక్కడే ఉండిపోయింది. ముక్కారు పంటలు పండే అమ రావతి ప్రాంత భూములను తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన మంత్రివర్గంలోని ధనాఢ్యుడైన విద్యాశాఖామంత్రికి ధారాదత్తం చేయడమే కాక... ఎదురు తిరిగిన రైతుల భూముల్ని తగలబెట్టించి, ఆ దుర్మార్గాన్ని దళితు డైన నందిగం సురేష్‌పై (నేటి పార్లమెంట్ సభ్యుడు) నెట్టి, వేధింపులకు గురిచేసిన వాళ్లెవరు? కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. పత్రికా విలేకర్లు, ఎడిటర్లు అంటే నేడు చులకన భావన ప్రజల మనసుల్లో నాటుకుపోవడానికి దోహదపడినవి పాలకుల స్వార్థపర రాజకీయా లేనని మరవరాదు. కనుకనే గౌరవ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మన మీడియా నిర్వాహకులకు (కోట్లకు పడగలెత్తిన యాజమాన్యాలకు, బతుకు బాటలో లొంగిపోయే కొందరు మీడియా మిత్రు లకు) చురకలు వేయడం సకాలంలో సబబైన స్పందనగా నేను భావిస్తున్నాను. అమెరికాలో వాల్టర్ లిప్మన్, ప్రొఫెసర్ నోమ్ చామ్స్కీ నిర్వ హించిన పాత్రను ఇక్కడ మన కాలంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోషిస్తున్నారని చెప్పడం అతిశయోక్తి కాజాలదు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఎంత ఖర్చుకు ఎంత ప్రయోజనం?
పార్లమెంట్ సమావేశాల కోసం నిమిషానికి రూ. 2.6 లక్షల చొప్పున ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నాం. ఒక్కో సమావేశంపైన రూ.144 కోట్లు ‘కృష్ణార్పణం’ చేసుకుంటున్నాం. అయినా దీనికి తగిన ఫలితం మాత్రం ప్రజలకు అందడం లేదు. ఇక సభల్లో చర్చను తప్పించడానికి ద్రవ్య బిల్లులను పాలక పక్షాలు వాటంగా వాడుకోవడం చాలాకాలంగా నేర్చాయి. ఈ పని కాంగ్రెస్ హయాంలోనూ జరిగింది. ఇప్పుడు బీజేపీ పాలకుల నేతృత్వంలోనూ సాగుతోంది. దీనికి మరో అడుగు ముందుకేసి, ‘ఏక్ భారత్’ అంటే ‘బీజేపీ భారత్’ అనేలా చేస్తోంది పాలక పక్షం. ఆ నినాదాన్ని ఖాయం చేయడానికే లోక్‌సభకూ, అన్ని రాష్ట్రాలకూ కలిపి ఒకే ఘడియలో ఒకే రోజున ఒకే ఎన్నిక నిర్వహించాలన్న పల్లవి ఎత్తుకుంది. ఈ దేశమైన ‘దటీజ్ భారత్’లో పార్లమెంట్ (ఉభయ సభలు) రోజుకు ఎంతో ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తోంది. అయినా కొలది రోజులనాడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టుగా పాలనా వ్యవస్థను, సెక్యులర్ రాజ్యాంగాన్ని ఆధునిక ‘నీరో’ చక్రవర్తులుగా తయారైన పాలకుల నుంచి ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం అన్నది ప్రశ్నగానే మిగిలిపోతోంది! అంతే గాదు, ‘మనీ బిల్స్’ పేరిట రాజ్యసభ చర్చలను పక్కతోవ పట్టిస్తూ ‘పెద్దలు’ చేస్తున్న చిల్లర పనులను కూడా కనీస ప్రజాస్వామ్య పాలనా సూత్రాలను కాపాడుకోగోరే ప్రజలూ, ప్రజాస్వామ్య శక్తులూ కట్టడి చేయవలసిన తరుణం వచ్చింది! సభ నిర్వహణ, సభ్యుల జీతనాతాలు, దినసరి ఎలవెన్సులు పేరిట 10–15 రోజులకు రూ. 144 కోట్లు అవుతోంది. కథ ఇంతటితో ముగియదు. భవిష్యత్తులో పార్లమెంటేరియన్లకు పెంచనున్న జీత నాతాల్ని కూడా లెక్క కట్టారు. ఈ లెక్క చూస్తే ‘నుయ్యి తియ్యబోతే దయ్యం బయట పడిందన్న’ సామెతలా నెలసరి జీతాలతో పాటు నియోజక వర్గ అలవెన్సులు, సెక్రటేరియట్ అలవెన్సులు, సభ్యుల కార్యాలయ అలవెన్సులు ఆ దామాషాలో పెరగాల్సిందే. ఎందు కంటే, ప్రజలు ఎన్నుకున్న పాపానికి సభ్యుడి నెల జీతంతో పాటు, ఖర్చులన్నీ తడిసి మోపెడవుతాయి. పార్లమెంట్ సమావేశాలకు ఇంత ఖర్చు పెడుతున్నా దీనికి తగిన ఫలితం మాత్రం ప్రజలకు అందడం లేదు. ఈ సందర్భంలో ఒక కీలక ప్రశ్న తలెత్తింది. నెలసరి జీత నాతాలు పెంచుకునే సభ్యులు పార్లమెంటులో చర్చలు కొనసాగ కుండా అడ్డుకునే మార్గాలు కూడా చూస్తారని ఒకప్పుడు బీజేపీ సీనియర్ సభ్యుడు, మాజీ మంత్రి అరుణ్ జైట్లీయే అన్నారు! రాజ్యసభలో ఇటీవల ‘మనీ బిల్స్’ చాటున పాలకులు కొన్ని చిల్లర మాటలకు దిగడం హాస్యాస్పదం! చర్చను తప్పించడానికి ఈ బిల్స్‌ను పాలక పక్షాలు వాటంగా వాడుకోవడం చాలాకాలంగా నేర్చాయి. ఈ పని కాంగ్రెస్ హయాంలోనూ జరిగింది. ఇప్పుడు బీజేపీ పాలకుల నేతృత్వంలోనూ సాగుతోంది. ‘ఏక్ భారత్’ అంటే ‘బీజేపీ భారత్’ అనే అర్థం చేసుకోవాలట. ఆ నినాదాన్ని ఖాయం చేయడానికే ఇకనుంచి లోక్‌సభకూ, అన్ని రాష్ట్రాలకూ కలిపి ఒకే ఘడియలో ఒకే రోజున ఒకే ఎన్నిక అవసరమంటున్నారు బీజేపీ నాయకులు. 2014 నుంచి దాన్నే పదే పదే చెబుతున్నారు. ఇప్పుడు బీజేపీ పాలన ఉనికి మహారాష్ట్ర ప్రయోగంతో ఇబ్బందుల్లో పడిన దరిమిలా మరింత వేగంగా ముందుకు సాగుతున్నారని ప్రజలకూ అర్థమయ్యింది. కర్ణా టక బీజేపీ ప్రభుత్వ ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని అత్యధిక లోక్‌సభ స్థానాలను జీవనాడిగా భావించుకుని ఉత్తర, దక్షిణ, తూర్పు భారత రాష్ట్రాలను కంట్రోల్ చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు, వేస్తున్న ఎత్తుగడలు బెడిసికొట్టే రోజులు దగ్గర పడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు ఉత్తర ప్రదేశ్‌లోని 85 పార్లమెంటు స్థానాల బెడద (ఉత్తరాఖండ్‌ను కూడా కలుపుకొని) గురించి ఏనాడో రాజ్యాంగ నిర్మాత డా. అంబేడ్కర్ పసిగట్టారు. అందువల్లే దక్షిణ భారత దేశానికి హైదరాబాద్ శాశ్వత రాజధానిగా ఉండాలని ప్రతిపాదించారని మరచిపోరాదు! ఉత్తర ప్రదేశ్‌ను ఎలాగూ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ– ఆర్ఎస్ఎస్ వర్గీ యులు త్యాగం చేయలేరు కాబట్టి, దక్షిణ తూర్పు రాష్ట్రాలకు ఎసరు పెట్టారు, మరింతగా పెడతారు! ఎలాగూ ‘పెగసస్’ గూఢ చర్యంతో దేశ విదేశాల్లో అభాసు పాలైన మన పాలకులకు ‘అన్యధా శరణం’ లేకనే మధ్యంతర ఎన్నికలకు తహతహలాడుతున్నారని గ్రహించాలి. గుజరాత్లో మైనారిటీలపై తలపెట్టిన 2002 నాటి ఊచకోతలపై సమగ్రమైన విచారణ జరిపేందుకు తాను నియమించిన ప్రత్యేక విచారణ సంఘం (2008) సమర్పించిన నివేదికను విడుదల చేస్తూ, భారతదేశంలో మత సామరస్యం అనేది ప్రజాస్వామ్యానికి జీవశక్తి అని చెబుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇలా వ్యాఖ్యానించింది. ‘‘ఏ మతమూ ద్వేషాన్ని బోధించదు. మతం పేరిట ప్రజల్ని చంపు కోవడం యావత్తు దేశానికీ, చట్టబద్ధంగా నడుచుకోవలసిన సమాజా నికీ మాయని మచ్చ.’’ గుజరాత్ కేసుల్లాంటివి ఎక్కడ తలెత్తినా వాట న్నింటినీ తుదకంటా వెంటాడి ఒక కొలిక్కి తీసుకురావాల్సిందేనని చెప్పింది. ఆ ఆదేశం ప్రకారం రంగంలోకి దిగిన సుప్రీం ప్రత్యేక ఉన్నత సలహాదారైన న్యాయవాది రాజు రామచంద్రన్ గుజరాత్ సమర్పించిన సాధికార నివేదికను పాలక వర్గం తొక్కి పట్టడమే గాకుండా, దాన్ని నామరూపాలు లేకుండా చేస్తూ, తనను తాను ‘కడిగిన ముత్యం’ అని చాటుకోవడానికి ప్రయత్నించింది! గుజరాత్లో దళిత మైనారిటీలను ఊచకోతకోయగలిగిన వాళ్లకు ‘దళిత, ఆదివాసీ’ పదాలు కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే ఉద్దేశించిన ఊతపదాలు. కనుకనే ఈ ఎత్తుగడను పసిగట్టిన సుప్రసిద్ధ మేధావి, గోవా యూనివర్సిటీలో ‘డి.డి.కోశాంబి’ విజిటింగ్ ప్రొఫెసర్ పీటర్ రోనాల్డ్ డిసోజా ప్రత్యేక వ్యాసం రాస్తూ, ద్రౌపదీ ముర్మూను రాష్ట్రపతి పదవికి బీజేపీ తమ అభ్యర్థిగా నామినేట్ చేయడాన్ని ‘తిరుగులేని దెబ్బగా’ వర్ణించారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఎదు ర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగానూ, ఒక్క తాటిపైకి గుమి గూడబోతున్న ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకుగానూ వేసిన ఎత్తుగడగా దీన్ని పేర్కొన్నారు. భారత ప్రభుత్వ వ్యవస్థలో ఈ రోజున కోర్టులలో, మీడియాలో, బ్యూరోక్రాట్లలో, యూనివర్సిటీలలో, కార్పొరేట్ సంస్థల్లో ఉన్న అధికారగణంలో ఆదివాసీ ప్రజల తరఫున గొంతు విప్పి మాట్లాడగల్గిన వారి సంఖ్య బహుస్వల్పమని ద్రౌపదీ ముర్మూకు తెలుసు. కానీ ఈ ఆదివాసీ జనాలనే అభివృద్ధి పేరిట, మౌలిక సదుపాయాల కల్పన పేరిట వివిధ నగరాల మురికి వాడల్లో కుక్కడం జరిగింది. తద్వారా దేశ సాంస్కృతికాభివృద్దికి కూడా వారిని దూరం చేశారు. అదే సందర్భంలో రిజర్వేషన్ల పుణ్యమా అని దేశ శాసన వేదికలలో ఆ మాత్రమైనా స్థానం లభించే అవకాశం కల్గింది. కానీ పార్టీ రాజకీయాలు వచ్చి ఆదివాసీలు, దళితుల గొంతు నొక్కేశాయి. ‘ఇప్పుడు ఆదివాసీ అయిన ద్రౌపదీ ముర్మూ ఈ దగా పడిన ఆదివాసీలకు గొంతెత్తి మాట్లాడగల అవకాశం కల్పిస్తారా? ఒక స్త్రీగా, భర్తను కోల్పోయిన ఒక భార్యగా, ఒక ఆదివాసీగా అనుభవించిన కష్టనష్టాల దృష్ట్యా గర్వించదగిన ధృఢమైన రాజకీయ శక్తిగా తన ముద్రను వేయగలరా?’ అని ప్రొఫెసర్ డిసోజా ప్రశ్నించడం ఆసక్తకర చర్చగా మారింది. మరొక కీలకమైన అంశాన్ని లేవనెత్తుతూ... ముర్మూ రాజ్యాంగపరంగా తన అధికారాల పరిధిని పూర్తిగా వినియో గించుకోవాలి. కేవలం రాష్ట్రపతి కార్యాలయ ప్రొటొకాల్ పరి«ధులకే అంటుకుపోయిన కొందరు పాత రాష్ట్రపతుల మాదిరిగా వ్యవహ రించకుండా రాజేంద్రప్రసాద్, రాధాకృష్ణన్‌లా చొరవతో ముందుకు సాగాలని డిసోజా సలహా ఇచ్చారు. అంతేగాదు, రాష్ట్రపతిగా ఆమె తన ఐదేళ్ల పదవీకాలంలో దేశంలో నిర్లక్ష్యానికి గురైన ఆదివాసీ ప్రజలున్న ప్రాంతాలను పర్యటిస్తే అదో ప్రయోజనకర చర్యే కాగల దనీ, ఆయా ప్రాంతాల్లో స్కూళ్లు, ఆసుపత్రులు, మార్కెట్లు, నీటి సౌకర్యాలు ఆమె స్వయంగా కళ్లారా చూస్తే అనుభవంలోకి రాగలవనీ డిసోజా అన్నారు. అలాగే, దేశ రాష్ట్రపతిగా ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతి భవన్లో కూర్చోబెట్టడం ఎంతటి తిరుగులేని ఘటనో... అదే స్థాయిలో రాష్ట్రపతి భవన్‌ను ఆదివాసీ సంస్కృతితో ముర్మూ సంస్క రించడానికి ప్రయత్నిస్తారో లేక ఆమెను అదే భవన్ సంస్కృత భాషాభిమానిగా మారుస్తుందో చూడాలని డిసోజా వ్యంగ ధోరణిలో అన్నారు. ఏది ఏమైనా రానున్న ఐదేళ్లూ ద్రౌపదీ ముర్మూ తన పదవిలో ముళ్లమీద కూర్చోకుండా గడిపి గట్టెక్కిరాగలరనే ఆశిద్దాం. abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
‘నడమంత్రపు’ ఎన్నికలకు సన్నాహాలా!
‘ఒక దేశం, ఒక ఎన్నిక, ఒక ప్రధాని’ అని కేంద్రంలోని అధికార బీజేపీ గత కొంతకాలంగా నినదిస్తూనే ఉంది. వీలు చిక్కినప్పుడల్లా లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయమై లా కమిషన్‌ను గిల్లుతూనే ఉంది. తరచూ ఎన్నికల వల్ల పడే ఖాజానా భారాన్ని తప్పించడానికీ, జన జీవితానికి విఘాతం కలగకుండా చూడటానికీ జమిలి ఎన్నికలే తరుణోపాయం అని చెబుతోంది. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాలనా పరిస్థితులు అస్తుబిస్తుగా ఉండటం కూడా దీనికి ఒక ప్రధాన కారణం. ఈ తరహా ఎన్నికల నిర్వహణ ద్వారా ఏకపక్ష పాలనకూ, ఏక వ్యక్తి నియంతృత్వ పోకడలకూ ప్రయత్నిస్తోందనే అనుమానాలు బలంగానే ఉన్నాయి. నిర్ణీత తేదీ రాకముందే 2024లో జరగాల్సిన ఎన్నికలు జరుగుతాయా? ఈ ‘నడమంత్రపు’ ఎన్నికల కోసం బీజేపీ–ఆరెస్సెస్ పాలకులు తహతహలాడటం ఇవాళ అర్ధంతరంగా పుట్టిన ‘పుండు’ కాదు. 2014లో ప్రధానమంత్రి పదవిని నరేంద్ర మోదీ చేపట్టిన రోజు నుంచీ ‘ఒక దేశం, ఒక ఎన్నిక, ఒక ప్రధాని’ నినాదం కొనసాగుతూనే ఉంది. గత ఎనిమిదేళ్లుగా తనకు వీలు చిక్కినప్పుడల్లా లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయమై కేంద్ర ‘లా కమిషన్’ను పదేపదే గిల్లుతూ వచ్చారు మోదీ. అదే విషయాన్ని బీజేపీ న్యాయ శాఖామంత్రి కిరెన్ రిజిజూ (22 జూలై 2022) లోక్‌సభలో ప్రకటిస్తూ, జమిలి ఎన్నికలు జరిపే అంశాన్ని పార్లమెంటరీ కమిటీ అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఇందుకు ‘కారణాల’ను పేర్కొంటూ, తరచూ ఎన్నికల వల్ల సాధారణ జన జీవితానికి విఘాతం కలుగుతోందనీ, ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించి పోతున్నాయనీ అన్నారు. వీటికితోడు ఖజానాపై భారం పడుతోంది కాబట్టి, జమిలి ఎన్నికలు నిర్వహించడం అవసరమని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి చెప్పారు. జారిపోతున్న విలువలు అయితే దీనికి ప్రతిపక్షాలు స్పందిస్తూ, ‘ధరల పెరుగుదలపైనా, జీఎస్టీ రూపంలో రాష్ట్రాలపై పడుతున్న దుర్భర భారం పైనా’ ముందు చర్చ జరగాలని కోరాయి. బీజేపీ పాలకుల కోర్కె పైనే 21వ లా కమిషన్ తన ముసాయిదా నివేదికలో ‘ఉప్పు’ అందిస్తూ, ఈ ‘చిట్కా’తో దేశం ‘తరచూ ఎన్నికల బెడద’ నుంచి విముక్తి అవు తుందని వత్తాసు పలికింది. ఇందుకు అనుగుణంగానే 22వ లా కమిషన్‌ను ‘ఏర్పాటు’ చేసిన పాలకులు – కమిషన్‌ను అధ్యక్షుడు, ఇతర సభ్యులు లేకుండానే వదిలేసింది. ఫలితంగా కమిషన్ పదవీ కాలం మూడేళ్లూ గడిచిపోనుండటం పాలకుల దురుద్దేశానికి నిదర్శనం. ‘జమిలి’ ఎన్నికల ఎత్తుగడ వెనక బీజేపీ పాలనలో ఒక్కొక్కటిగా జారిపోతున్న ప్రజాస్వామిక విలువలు ఉన్నాయని మరచిపోరాదు. విచిత్రమేమంటే, మోదీ కేంద్ర మంత్రివర్గంలోని మంత్రులలో కనీసం 42 శాతం మంది తమపైన క్రిమినల్ కేసులున్నాయని బాహాటంగా ప్రకటించుకున్నారు. అయినా కొలది రోజులనాడు జరిగిన నూతన రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా క్రిమినల్ కేసులతో మసకబారి పోయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు వేసే ఓట్లు చెల్లనేరవని ప్రకటించే అధికారం తనకు ఉన్నా కూడా ఉన్నత న్యాయస్థానం గొంతు విప్పలేకపోయింది. ఏక పక్ష పాలనకేనా? 500 పైచిలుకు పార్లమెంట్ సభ్యులలో 250 మందికి పైగా అవినీతి పరులు ఉన్నారని, సాధికారికంగా రుజువులతో లెక్కదీసి దేశ ప్రజల ముందుంచిన అత్యున్నత విచారణ సంస్థల నివేదికలను ఇంతవరకూ కాదనగల ధైర్యం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకత్వానికి లేదు. ఇలాంటి సర్వవ్యాపిత పతన దశల్లో ఉన్న రాజ్యాంగ వ్యవస్థల నీడలో 2014లో ఢిల్లీ పీఠం ఎక్కిన మోదీ ప్రభుత్వం వచ్చీరావడంతోనే ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం’ (ఆర్పీఏ)లో, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎలాంటి నేరానికి పాల్పడ్డా, చార్జిషీట్ అతనిపై నమోదై ఉన్నా ఏడేళ్లకు తక్కువ గాకుండా ఖైదు శిక్ష విధించాలన్న బిల్లును పక్కకు పెట్టేసింది. బీజేపీ ‘జమిలి’ ఎన్నికలకు అనుసరించబోతున్న వ్యూహానికి ఇది పక్కా నిదర్శనం. నేరస్థులైన రాజకీయవేత్తలు తమపై ఆరోపణలు రుజువయ్యే దాకా లేదా విడుదలయ్యేదాకా ఎన్నికల్లో పాల్గొనడానికి అర్హులు కారని తొలి చట్టం నిర్దేశించింది. ఈ చట్ట నిబంధనలున్న ముసాయిదా బిల్లును కాస్తా మోదీ ప్రభుత్వం పక్కకు నెట్టేయడం రానున్న ‘జమిలి’ ఎన్నికల ద్వారా ఏకపక్ష పాలనకు, ఏక వ్యక్తి నియంతృత్వ పోకడలకు ‘తాతాచార్యుల ముద్ర’ వేయడంగానే భావించాలి. అంతకుముందు, స్వాతంత్య్రం తర్వాత తొలి పాతిక ముప్పయ్యేళ్ల దాకా ‘పళ్ల బిగువుతో’ కాపాడుకుంటూ వచ్చిన రాజ్యాంగ నిర్దేశాలు, ప్రజా ప్రాతినిధ్య చట్ట నిబంధనలు క్రమంగా ‘డుల్లి’పోతూ వచ్చాయి. అయినా బీజేపీ పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో బీజేపీ ఎమ్మెల్యేలపై నమోదైన అనేక కేసులను స్వచ్ఛంద సంస్థ – ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్) పదేపదే దేశ ప్రజల దృష్టికి తెస్తూనే ఉంది. ‘మసకబారి’ ఎన్నికైన సభ్యుల సంఖ్య 2007 నుంచీ మరీ రెట్టింపు అవుతోందని 2014 నుంచీ సుప్రీంకోర్టు కూడా మొత్తుకుంటూనే ఉంది. రబ్బరు స్టాంపు కాకూడదు గిరిజనుల నుంచి రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్మూ కూడా ఈ విషయాలన్నీ గమనించాలి. పాలకులకు ‘రబ్బరు స్టాంపు’గా మారకూడదు. దేశ జనాభాలో 2011 జనగణన ప్రకారం, 10 కోట్ల 40 లక్షలమంది ఆదివాసీ ప్రజలు (8.6 శాతం మంది) ఉన్నారని మరచిపోరాదు. అంతేగాదు, ఏడు రాష్ట్రాలలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారు 2020లో కూడా వేధింపులకు గురి కావలసి వచ్చిందని జాతీయ స్థాయిలో నేరాలు నమోదు చేసిన తాజా నివేదిక వెల్లడించింది. అందుకే ‘సమత’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, గనులు, ఖనిజాలు, ప్రజారక్షణ సంస్థ అధ్యక్షుడు రవి రెబ్బాప్రగడ... రాష్ట్ర పతిగా ద్రౌపదీ ముర్మూ షెడ్యూల్డ్ తెగల ప్రయోజనాలను మరింతగా కాపాడాల్సిన అవసరాన్ని మరీమరీ గుర్తు చేస్తున్నారు. దళిత వర్గం నుంచి వచ్చిన రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా ఆ పదవిలోకి వచ్చేట్టు చేయగలిగింది భారతీయ జనతా పార్టీయే. అయినా దళితుల బతు కులు ఇసుమంత కూడా మెరుగు పడకపోగా, బీజేపీ ఎన్నికల ప్రయోజనాల కోసమే ‘పావు చెక్క’గా వినియోగపడక తప్పలేదు. గతంలో దేశంలో విధించిన మద్య నిషేధం కాస్తా ఉన్నట్టుండి మధ్యలో మటుమాయమైనప్పుడు శ్రీశ్రీ వ్యంగ్య ధోరణిలో కాంగ్రెస్ ‘పొడి’ రాష్ట్రాలన్నీ ‘తడి’ చేస్తోందని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఆ దశ కూడా దాటిపోయింది. ‘తురా’ పట్టణంలోని తన ‘ఫామ్ హౌస్’ను ‘వేశ్యా గృహం’గా మార్చాడన్న ఆరోపణపైన మేఘాలయ బీజేపీ నాయకుడు బెర్నార్డ్ మరాక్ కోసం ఆ రాష్ట్ర పోలీసులు గాలింపును ఉధృతం చేశారని పత్రికల్లో కథనాలు వచ్చాయి. ‘జమిలి’ ఎన్నికల ప్రతిపాదనపై కొంతకాలంగా బీజేపీ పట్టు పట్టడానికి – మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కర్ణాటక సహా పలు బీజేపీ రాష్ట్రాలలో పాలనా పరిస్థితులు అస్తుబిస్తుగా ఉండటం కూడా ఒక ప్రధాన కారణం. ఈ సందర్భంగా భారతదేశ ప్రసిద్ధ జాతీయ పక్షపత్రిక ‘ఫ్రంట్ లైన్’ తాజా సంచిక ‘మహా సర్కస్’ మకుటంతో మహారాష్ట్ర పరిణామాలపై గొప్ప వ్యంగ్య చిత్రం ప్రచురించింది. మహారాష్ట్ర తర్వాత ప్రభుత్వాల్ని పడగొట్టే బీజేపీ తర్వాత పడగొట్టే రాష్ట్రమేది? అని ఆ చిత్రం ప్రశ్నించింది. ఈ సర్కస్ నడుపుతున్న వారిలో మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా మరోవైపు నుంచి ‘కమ్చీ’ ఝళిపిస్తూ ఇకమీదట ఉండేది ‘ఒకే భారత్, అదే బీజేపీ భారత్’ అని ముక్తాయింపు విసురుతాడు. అదే ‘నడమంత్రపు ఎన్నికల’కు వచ్చే ‘జమిలి భారత్’! 2024 వరకూ ప్రస్తుత పాలన కొనసాగకపోవచ్చు. ఈ అనుమానాల్ని రేకెత్తిస్తున్నది మరెవరో కాదు – తన ఉనికి అనుమానంలో పడిన రాజకీయ పార్టీయే, దాని పాలకులే! ‘గొంతెమ్మ కోర్కెలన్నీ ఎండమావుల నీళ్లే’నన్న సామెత రాజకీయ పాలకుల విషయంలో అక్షరసత్యం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ప్రశ్నే ప్రజాస్వామ్యానికి జీవనాడి
ఆదేశిక సూత్రాలనే కాదు, రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా ఆచరణలోకి రాకుండా కేంద్ర పాలకులు జాగ్రత్తపడుతున్నారు. అదేమని అడిగితే, మాటల తూటాలను కూడా బూతులుగా పరిగణిస్తున్నారు. ప్రశ్నించే గొంతులను నోరెత్తకుండా చేసి, యథేచ్చగా పాలన చేయడానికి రోజుకొక కొత్త చిట్కాలు వెలువడుతున్నాయి. వలస పాలకులైనా, నాడు దేశ పౌరుల స్వేచ్ఛను ‘బందీ’ చేయడానికి వినియోగించిన దేశ ద్రోహ నేర చట్టాన్ని రద్దు చేసు కున్నారుగానీ, మన పాలకులు దాన్నే పట్టుకుని వేలాడుతున్నారు. ఇప్పటికైనా దేశ ఉన్నత న్యాయస్థానంలో మంచి సంస్కరణలకు పునాది లేచింది. ‘న్యాయం అనేది ప్రజల న్యాయబద్ధమైన హక్కుల్ని రక్షించడంలోనే కాదు, సామాజిక–ఆర్థిక న్యాయాన్ని చేకూర్చడంలో కీలకమైన అంశంగా ఉండాలి.’ ‘‘ఒక వ్యంగ్య చిత్రకారుణ్ణి (కార్టూనిస్టు) దేశద్రోహ నేరారోపణపైన జైల్లో పెట్టడమంటే ఇక మన రాజ్యాంగం విఫలమైనట్టే!’’ – సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై.చంద్రచూడ్ ‘‘భావ ప్రకటనా స్వేచ్ఛకు దేశం హామీ పడిన మాట నిజమే నయ్యా, ఇంతకూ నువ్వు పాలక పార్టీ మనిషివి, అవునా?’’ – మంజుల్ కార్టూన్ (29 జనవరి 22) ‘‘కర్ణాటకలోని బీజేపీ పాలనలోని అవినీతి నిరోధక విభాగం అధిపతిని నేను గట్టిగా మందలించినందుకుగానూ నన్ను బదిలీ చేస్తా మని బీజేపీ పాలకులు ఢిల్లీ నుంచి పరోక్షంగా బెదిరించారు.’’ – కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్.పి.సందేశ్ (కోర్టులో బహిరంగ ప్రకటన– 13 జూలై 22 నాటి వార్త) వివిధ స్థాయుల్లో ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరులు, విధానాలు మెజారిటీ పాలక ప్రభుత్వం పేరిట దేశంలో చలామణీ అవుతున్నాయి. ఈ వాతావరణంలో రాజ్యసభను (పేరు ఎగువ సభ) పాలకపక్షం ఉపయోగించుకుంటున్న తీరు ప్రశ్నార్థకమవుతోంది. గతంలో కాంగ్రెస్ పాలకులు తమకు మెజారిటీ లోపించినప్పుడు కొన్ని కీలకమైన బిల్లులకు ఆమోదముద్ర వేయించుకోవడానికి రాజ్య సభలో అడ్డదారులు తొక్కడం మనకు తెలుసు. ఇప్పుడు ఆ తప్పుడు పద్ధతిలో భాగంగానే బీజేపీ–ఆరెస్సెస్ కూటమి పాలకులూ రాజ్య సభను ఉపయోగించుకోవడానికి వెనుకాడటం లేదు. పరోక్ష పలుకు బడికి లేదా ప్రయత్నాలకు వేదికగా రాజ్యసభ మారుతోంది. గతంలో దేశ ప్రధాని హోదాలో పీవీ నర సింహారావు (కాంగ్రెస్)కు అస్తుబిస్తు మెజారిటీ ఉన్నప్పుడు, ‘గట్టె’క్క డానికి వాటంగా ఉపయోగపడింది రాజ్యసభేనని మరచిపోరాదు. అందుకే అప్పుడూ, ఇప్పుడూ కూడా పాలకపక్షాలు రాజ్యసభ స్థానాలు పెంచుకోవడానికి అన్యమార్గాలు వెతుకుతున్నాయి. ఆ మార్గాల్లో ప్రధానమైన ఎత్తుగడగా రాష్ట్రాలను పరోక్షంగా ప్రభావితం చేయడం ఒకటి. వడ్డించేవాడు మనవాడైతే కడపంక్తిలో కూర్చున్నా పదార్థాలన్నీ బీరుపోకుండా చేరినట్టే, అలహాబాద్ కోర్టు తీర్పుతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన పదవిని కోల్పోవలసి వచ్చినప్పుడు ఆమెను తాత్కాలికంగా గట్టెక్కించడానికి పరోక్షంగా సాయం చేసినవారు సుప్రీం న్యాయమూర్తి వి.ఆర్. కృష్ణయ్యరే! కాగా సుప్రీంకోర్టు ప్రధాన సీనియర్ న్యాయమూర్తిగా నియమితులు కావాల్సిన జస్టిస్ హెచ్.ఆర్. ఖన్నా ప్రభుత్వ పన్నాగాలకు లోనుకాకుండా ఉన్నందుకే అర్హమైన ప్రమోషన్‌ను కోల్పోవలసి వచ్చింది. అయినా ప్రజల మధ్య, న్యాయమూర్తుల మధ్య, ప్రజాస్వామ్య సంప్రదాయాల మధ్య జస్టిస్ ఖన్నా నిలబడ్డారు. అయితే, మన దేశంలో ఆయన్ని మరచిపోయాం! మరీ విచిత్రమేమంటే, ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిర రాజకీయ డిటెన్షన్ ఉత్తర్వులను ఒక్క కలంపోటుతో రద్దు చేసినందువల్ల జైళ్ల నుంచి విడు దలైన రాజకీయ ఖైదీల్లో హెచ్చుమంది బీజేపీ డిటెన్యూలు కూడా ఉన్నా వాళ్లకూ ఖన్నా సేవలు గుర్తు రాకపోవడం గమనార్హం. అంతేగాదు, బ్రిటన్‌లో రాణి క్వీన్స్ కౌన్సిల్లో విశిష్ట సభ్యుడైన హెచ్.హెచ్. యాస్క్విత్ (1908–16) ఇంగ్లండ్ ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా ఇంగ్లిష్ వాడి జైళ్లలో మగ్గుతూన్న మన బాల గంగాధర తిలక్‌ను ప్రస్తావించాడు. ప్రజానుకూలమైన జర్నలిజాన్ని (పబ్లిక్ జర్నలిజం) ఇంగ్లండ్ ప్రజలు గౌరవిస్తారనీ, అలాగే తిలక్ రాతలన్నీ పబ్లిక్ జర్నలిజంగానే పరిగణనలోకి వస్తాయనీ యాస్క్విత్ సమర్థించాడు. తిలక్ రచనల్ని పబ్లిక్ జర్నలిజంగా పరిగణించకపోతే, పత్రికా స్వేచ్ఛకే గండికొట్టినట్టు అవుతుందని హెచ్చరించాడు. ఈ ప్రజాస్వామ్య సంప్రదాయాలను ‘పరగడుపు’గా భావిస్తు న్నందునే మన పాలకులు దేశ వాస్తవ చరిత్రను పక్కకు తోస్తున్నారు. మహాత్మాగాంధీ మునిమనుమడు, చైతన్యశీలి అయిన తుషార్ గాంధీ, ఇంకా ఇతర గాంధేయులు ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ పాల కులు క్రమంగా దేశంలోని ప్రధాన గాంధేయ సంస్థలపై ఆధిపత్యం సాధించి నియంత్రించ బోతున్నారనీ, గాంధీ సిద్ధాంతాలకు భిన్నమైన సిద్ధాంతాలను చొప్పించే ప్రమాదం ఉందనీ వారు పేర్కొన్నారు. ఈ వ్యూహంలో భాగమే సావర్కార్ భజనను ముందుకు నెట్టడమని చెబుతూ, ప్రస్తుత కేంద్ర పాలకుల్ని తృప్తిపరచడం కోసం దేశ చరిత్రనే వక్రీకరిస్తున్నారనీ తుషార్ ప్రభృతులు దేశ ప్రజల్ని హెచ్చరించి అప్రమత్తుల్ని చేయవలసి వచ్చింది. ఇక, రాష్ట్రపతులను ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే ఎన్నుకోవాలని భారత రాజ్యాంగ సభ సభ్యుడు ప్రొఫెసర్ కె.టి. షా అన్నారు. దీన్ని ప్రతిపాదిస్తూ ఓ చిత్రమైన వ్యంగ్యాస్త్రం రాజ్యాంగ సభ సభ్యుల పరిశీలనకు వదిలారు: ‘‘దేశ రాష్ట్రపతి దేశ ప్రధానమంత్రికి కేవలం ఓ గ్రామ్‌ఫోన్‌గా మాత్రమే పనిచేయాలని సభవారు కోరుకుంటు న్నారా?’’ అని షా ప్రశ్నించారు. అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి తన అధి కారాలను కేంద్ర మంత్రి మండలి సహాయ, సలహాల మీద ఆధారపడి అమలు చేస్తారనీ, అందువల్ల రాష్ట్రపతులు కేవలం ‘రబ్బరు స్టాంపు’గా వ్యవహరించడం కుదరదనీ లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన పి.డి.టి ఆచార్య (14 జూలై 2022) వివరించారు. స్వతంత్ర భారత చరిత్రలో రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి ఉద్దండులు కొన్ని విధాన నిర్ణయాలపైన ప్రభు త్వంతో బాహాటంగానే విభేదించి, ప్రభుత్వాల్ని ప్రభావితం చేయగలి గారని ఆచార్య గుర్తు చేశారు. అంతేగాదు, ‘భారతదేశానికి రాష్ట్రపతులు అవసరమేగానీ, కేవలం రాష్ట్రపతి కార్యాలయ నిర్వాహ కులు మాత్రం కా’దని ఆచార్య అభిప్రాయం! ఇతర అన్ని పరిణామాలకన్నా, నేటి భారత పాలనా యంత్రాం గంలో విధాన నిర్ణయాల పరిధిలో అడుగడుగునా ‘కొట్టొచ్చేట్టు’ అశ్రద్ధ కనిపిస్తోంది. భారత రాజ్యాంగంలో ఏ ఆదేశిక సూత్రాలు పేద, నిరుపేద బహుజనుల భవిష్యత్తును తీర్చి దిద్దేందుకు దోహదం చేస్తాయో ఆ సూత్రాలనే పాలకులు పక్కనబెట్టడానికి అలవాటు పడ్డారు. ‘ ప్రజా బాహుళ్యం పట్ల ... రాజ్యాంగం కల్పించిన హక్కుల్నే కాదు, బాధ్యతల అధ్యాయంలో పేర్కొన్న ఆదేశిక సూత్రాలను కూడా ఆచరణలోకి రానివ్వకుండా పాలకులు జాగ్రత్తపడుతున్నారు. అదే మంటే పార్లమెంట్లో, శాసనసభల్లో మాటల తూటాలను బూతు లుగా పరిగణించి, అసలు నోరెత్తకుండా చేసి, యథేచ్చగా పాలన కొనసాగించేలా రోజుకొక కొత్త చిట్కాలు వెలువడుతున్నాయి. మన వేలు విడిచిన వలస పాలకులైనా, నాడు దేశ పౌరుల స్వేచ్ఛను ‘బందీ’ చేయడానికి వినియోగించిన దేశ ద్రోహ నేర చట్టాన్ని ఇంగ్లండులో రద్దు చేసుకున్నారుగానీ, మన పాలకులు ఇంకా దాన్నే పట్టుకుని వేలాడుతున్నారు. కనీసం ఇప్పటికైనా దేశ ఉన్నత న్యాయస్థానంలో మంచి సంస్కరణలకు పునాది లేచింది. వాటిని కూడా అదుపు చేయాలన్న దుగ్ధ పాలకులను విడనాడటం లేదు. జస్టిస్ ఫజిల్ అలీ అన్నట్టు ‘న్యాయం అనేది ప్రజల న్యాయబద్ధమైన హక్కుల్ని రక్షించడంలోనే కాదు, సామాజిక – ఆర్థిక న్యాయాన్ని ఆచరణలో చేకూర్చడంలో కీలకమైన అంశంగా ఉండాలి’. ‘‘చీకట్లను చీల్చుకుని ఒక కొత్త సూర్యుడు ప్రభవిస్తున్నాడు, ఒక సామూహిక గానం పల్లవిస్తోంది – ఇళ్లనూ, బళ్లనూ, వాకిళ్లనూ సమస్త ఆత్మీయ ప్రపంచాలనొదిలి ఆదర్శాలనే ప్రపంచంగా మార్చుకున్నారు వాళ్లు నూతన ప్రపంచానికి ద్వారాలు తెరిచారు వాళ్లు వాళ్లకు మన ఆహ్వానం అనివార్యం’’(దొరా ఫరూఖీ కవితకు ఉదయమిత్ర స్వేచ్ఛానువాదం.)! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
‘చౌరస్తా’లో రాజ్యాంగ విలువలు
దేశంలో జరుగుతున్న ఎన్నో ఘటనలు పడిపోతున్న ప్రజాస్వామిక విలువలను సూచిస్తున్నాయి. అసహనాన్ని సూచిస్తున్నాయి. న్యాయంగా ఉండటానికి రోజులు కావని చెబుతున్నాయి. ఇది కొత్త రాజకీయ వాదనలు చేయడానికి కారణమవుతోంది. నిజానికి ఇలాంటి ధోరణులు ప్రబలడానికి మూలం ఎక్కడ ఉందో అంతా ఆలోచించాలి. యావద్భారత రాజకీయాల్ని తారుమారు చేసే ‘పుండు’ అంతా స్వార్థపూరిత పార్టీల పాలకులలో ఉంది. అంబేడ్కర్ ఆశించినట్టుగా సంపన్న వర్గాల ఆధిపత్యం నుంచీ, కుల వ్యవస్థ పట్టు నుంచీ విడివడిన సామాజిక వ్యవస్థ నిర్మాణం జరగలేదు. వామపక్షాల మధ్య ఐక్యత కొరవడిన ఫలితంగా బలమైన ఉద్యమాలు లేక జనం మితవాద పార్టీల వైపు ఆకర్షితులవుతున్నారు. ఇది మౌనం వీడాల్సిన సమయం. ‘‘తమిళనాడును స్వయంప్రతిపత్తిగల ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే స్థితికి మా తమిళనాడును నెట్టవద్దు. తమిళనాడును ప్రత్యేక దేశంగా మేము ప్రకటించుకునే స్థితికి మమ్మల్ని నెట్టవద్దు. స్వపరిపాలనా ప్రాంతంగా తమిళనాడును కేంద్రం ప్రకటిం చాలి. అందాకా మేము విశ్రమించేది లేదు. తమిళనాడు వేరే దేశంగానే వృద్ధి చెందాలన్న పెరియార్ విశ్వాసం వైపుగా మమ్మల్ని నెట్టవద్దు.’’ – సీఎం ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే సీనియర్ నాయకుడు, నీలగిరి పార్లమెంట్ సభ్యుడైన ఎ.రాజా (4 జూలై 2022). ‘‘ద్రవిడియన్ ప్రాంతీయ పార్టీ రాజకీయాల వైఫల్యాన్ని డీఎంకే నాయకుడు రాజా ఆమోదించినట్టే’’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సి.టి. రవి దీనికి స్పందించారు. రాజా ప్రకటన దేశ విభజనకు దారితీసే పచ్చి చీలుబాట రాజకీయమని బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి ప్రకటించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ మౌనంగా ఉండిపోవడాన్ని ఖండిస్తున్నాననీ, రాజ్యాంగానికి బద్దులై ఉంటానని హామీపడి కూడా స్టాలిన్ ప్రేక్షకుడిగా ఉండిపోయారనీ తిరుపతి అన్నారు. నిజానికి దేశంలో ఇలాంటి ధోరణులు ప్రబలడానికి మూల మంతా ఎక్కడ ఉందో నిష్పాక్షికంగా ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. వేర్పాటు ధోరణుల మూలం అంతా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఉందని దక్షిణ, తూర్పు భారత రాష్ట్రాలు ఇప్పటికే గ్రహించాయి. యావద్భారత రాజకీయాల్ని తారుమారు చేసే ‘పుండు’ అంతా స్వార్థపూరిత పార్టీల పాలకులలో ఉంది. కేంద్రాధి కారంలో ఉన్న రాజకీయ పక్షాల ఉసురును ఇంతవరకూ కాపాడి నిలబెడుతున్న ఏకైక ‘చిట్కా’ – యూపీలోని 80 లోక్‌సభ సీట్లు. ఈ ‘గుట్టు’ చేతుల నుంచి జారిపోకుండా జాగ్రత్త పడటానికే ఉత్తర– దక్షిణ భారతదేశాల మధ్య గండి కొట్టాల్సిన అవసరం పాలకులకు అనివార్యం అయిపోయింది. భారతదేశ పాలనలో ఈ ‘గుట్టు’ను కాస్తా పసిగట్టి ‘రట్టు’ చేసిన తొలి దార్శనికుడు, భారత రాజ్యాంగ నిర్మాతలలో అగ్రగణ్యుడైన అంబేడ్కర్. కనుకనే దక్షిణ భారతదేశానికి హైదరాబాద్ నగరాన్ని రాజధానిగా తక్షణం ప్రకటించాలని అంబేడ్కర్ కోరారని మరచి పోరాదు. అప్పుడుగానీ ఉత్తరప్రదేశ్‌లోని లోక్‌సభ సీట్ల ఆధారంగా దక్షిణ భారత రాష్ట్రాలకు కేంద్ర పాలకులు నిరంతరం తలపెడుతున్న అన్యాయానికి అడ్డుకట్టు వేయడం సాధ్యపడదు. అందుకే అంబేడ్కర్ ప్రతిపాదనకు (దక్షిణ భారత రాజధానిగా హైదరాబాద్) అంతటి విలువ! ఈ దృష్టితో చూస్తే డీఎంకే నాయకుడు ఎ.రాజా ఆందోళనను కూడా తప్పుగా అర్థం చేసుకోనక్కర్లేదు. అంబేడ్కర్ 1956లో విస్తృత స్థాయిలో భారత రిపబ్లికన్ పార్టీని ఏర్పరచి, దానిని లౌకిక (సెక్యులర్) ప్రాతిపదికపైన ‘సోషలిస్టు ఫ్రంట్’గా తీర్చిదిద్దారు. బౌద్ధంలోని హేతువాద సూత్రాల అండ దండలనూ తోడు చేసుకున్నారు. తద్వారా సంపన్న వర్గాల ఆధిపత్యం నుంచీ, కుల వ్యవస్థ పట్టు నుంచీ, మూఢ విశ్వాసాల నుంచీ, సామాజిక దురన్యాయాల నుంచీ విడివడిన కుల రహిత సామాజిక వ్యవస్థ నిర్మాణాన్ని ఆశించారు. అందువల్లే వ్యవసాయ రంగంలోని పేద రైతాంగ వర్గాలనూ, సామాజికంగా వెనుకబడిన, నిరక్ష్యానికి గురైన వర్గాలనూ ఆకర్షించగలిగారు. అయితే అప్పటికి కుల వర్గ విభేదాలనూ, దౌర్జన్యాలనూ, హింసాకాండనూ బలంగా ఎదురొడ్డి, అగ్రకుల పెత్తనాలకు వ్యతిరేకంగా నిలబడగల బలవత్తర ఉద్యమాలు లేకపోవడంవల్ల... దళిత, బహుజన, పేద వర్గాలు మితవాద రాజకీ యాల వైపు ఆకర్షితులవుతూ వచ్చిన ఉదాహరణలూ ఎన్నో అని ప్రొఫెసర్ హరీష్ వాంఖడే (జేఎన్‌యూ ప్రొఫెసర్) అభిప్రాయం. ఆ మాటకొస్తే అప్పుడే కాదు, ఇప్పటి వర్తమాన రాజకీయాల లోనూ ఇదే పరిస్థితి. వామపక్షాల మధ్య ఐక్యత, ఏకవాక్యత కొరవడిన ఫలితంగా పేద, మధ్యతరగతి వర్గాలు పలు అన్యాయాలకూ, దాష్టీకాలకూ బలి కావలసి వస్తున్న సత్యాన్ని గుర్తించాలి. ఈ రోజుకీ భూమి తగాదాల మిషపైన ఆదివాసీ మహిళల పైన దాడులు జరుగుతున్నాయి. ఒక ఆదివాసీ మహిళనుగానీ, పురుషుడినిగానీ దేశ రాష్ట్రపతి స్థానంలో ఒక పాలకవర్గ పార్టీ కూర్చోబెట్టినంత మాత్రాన ఏ ప్రయోజనమూ లేదు. ‘స్టాంపు డ్యూటీ’తో నిమిత్తం లేకుండా, కేవలం ‘రబ్బర్ స్టాంప్’గా రాష్ట్రపతి ఉన్నంతకాలం దేశానికీ, ప్రజలకూ ఒరిగేదేమీ ఉండదు. బీజేపీకి చెందిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ హయాంలో, లక్నోలోని 140 ఏళ్ల చరిత్రగల ఒక హయ్యర్ సెకండరీ స్కూలు, కళాశాల ఉన్నట్టుండి అంతర్ధానమై, వాటి స్థానంలో ఒక ప్రైవేట్ స్కూలు వెలిసింది. దాంతో విద్యార్థులు పాఠాలన్నీ రోడ్డుపైనే నేర్చుకోవలసిన గతి పట్టింది. స్కూలు పేరు మారిపోయింది. స్కూలు లోకి విద్యార్థుల్నీ, ఉపాధ్యాయుల్నీ రానివ్వలేదు. వందలాదిమంది ఆ బడి పిల్లలు గేటు బయటే కూర్చునివుంటే, రోడ్డుమీదనే టీచర్లు పాఠాలు చెప్పాల్సిన గతి పట్టింది. ‘పేరు ధర్మరాజు, పెను వేప విత్తయా’ అన్నట్టు ప్రసిద్ధ చరిత్ర గల ఆ పాఠశాలకు బీజేపీ పాలకులు ఎందుకు ఆ గతి పట్టించారంటే – లక్నోలో ప్రసిద్ధికెక్కిన ఆదర్శ విద్యావేత్త రెవరెండ్ జేహెచ్ మెస్మోర్ ఆ పాఠశాలను నెలకొల్పి ఉండటమే! అలాగే కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి హెచ్.పి. సందేశ్ అవినీతి నిరోధక సంస్థ (ఏసీబీ)ను విమర్శిస్తూ, అవినీతికి పాల్పడిన ఒక అధికారిని శిక్షించాలని ఆదేశించారు. అయితే నిజాయితీపరుడైన న్యాయమూర్తి సందేశ్‌కు దక్కిన ప్రతిఫలం – బదిలీ ఉత్తర్వులు! బదిలీకి సిద్ధంగా ఉన్నానని సందేశ్ ప్రత్యుత్తరమిచ్చారు. ఈ సంద ర్భంగా, ఏసీబీ తరఫున హాజరైన న్యాయవాదిని ప్రశ్నిస్తూ సందేశ్ చేసిన ప్రకటన దిమ్మ తిరిగిపోయేలా ఉంది: ‘‘ఇంతకూ మీరు ప్రజల ప్రయోజనాల్ని రక్షిస్తున్నారా లేక అవినీతితో గబ్బు పట్టిపోయిన అధికారుల్ని కాపాడుతున్నారా? ఈ నల్ల కోట్లు ఉన్నవి అవినీతిపరుల్ని రక్షించడానికి కాదు. లంచగొండితనం, అవినీతి క్యాన్సర్ వ్యాధిగా తయారైంది. ఈ వ్యాధి ఇక ఆఖరి దశ వరకూ పాకడానికి వీల్లేదు’’ అని హెచ్చరించారు. ఇక గుజరాత్ అల్లర్లానంతరం నరేంద్ర మోదీని ఒకప్పుడు సుప్రీంకోర్టు ‘నయా నీరో’గా విమర్శించింది. కానీ, అదే గుజరాత్ కేసులో మోదీకి ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం’ ఇచ్చిన ‘క్లీన్ చిట్’ సరైనదేనంటూ సుప్రీం ఇటీవల చెప్పడం మరో చిత్రమైన ట్విస్టు. కాగా, ఈ సందర్భంగా 92 మంది సుప్రసిద్ధులతో కూడిన రాజ్యాంగ పరిరక్షణా మండలి ఒక ప్రకటన విడుదల చేసింది: ‘‘ఇంతకూ 2002 నాటి గుజరాత్ ఊచకోతలపైన జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదికలు, నాటి సుప్రీంకోర్టు ప్రత్యేక సలహాదారైన ప్రసిద్ధ న్యాయ వాది రాజు రామచంద్రన్ సమర్పించిన ప్రత్యేక నివేదిక ఏమైనట్టు?’’ అని రాజ్యాంగ పరిరక్షణ మండలి ప్రశ్నించింది. ఈ 92 మంది ఉద్దండులలో సమాచార శాఖ మాజీ కమిషనర్ హబీబుల్లా, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సునీల్ మిత్రా, హోంశాఖ మాజీ కార్య దర్శి జి.కె. పిళ్ళై, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాతాసింగ్, తదితర పెక్కుమంది మాజీ ప్రధాన కార్యదర్శులూ, రిటైర్డ్ రాష్ట్ర పోలీస్ అధికారులూ ఉన్నారు. ఆ ప్రకటనలో వారిలా పేర్కొ న్నారు: ‘‘జీవించే హక్కును, పౌర స్వేచ్ఛను హరించే ప్రభుత్వ చర్యలను ప్రశ్నించి, వాటిని కాపాడుకోవడం పౌరుల విధి.’’ అందుకే ‘మౌనం’ అనేది ఒక్కో సందర్భంలో మంచికి దోహదం చేయొచ్చు. ఇంకొన్ని చోట్ల ఆ లక్షణమే మానవుడి ఉనికికే ప్రమాదభరితం కావొచ్చు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ప్రశ్నించినవారికి నిర్బంధమా?
సర్వమత సామరస్యాన్నీ, సర్వుల మనోభావాలనూ గౌరవించడం ద్వారా సమాజ శాంతిని శాశ్వతం చేయడం సాధ్యమని నమ్మి ప్రచారం చేసినవాడు కబీర్ దాసు. మానవ మనుగడకు ఐకమత్యం అత్యవసరమనీ, ప్రేమను మించిన శక్తి లేదనీ బోధించిన కరుణామయుడు కబీర్. ఇలాంటి సమగ్ర దృక్పథం, సమన్వయ దృష్టి మన రాజకీయ నాయకులకు ఎందుకు లోపిస్తోంది? ఇంకా మత దురహంకారాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? వీటిని ప్రశ్నించినవారు నిర్బంధాల పాలవుతున్నారు. లౌకిక రాజ్యాంగ వ్యవస్థను బలహీనపరిచే చర్యలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. దేశాన్ని అభ్యుదయ మార్గానికి మళ్లించే అవకాశాన్ని కమ్యూనిస్టు పార్టీలు చేజార్చుకోవడం కూడా మితవాద శక్తులు బలపడటానికి కారణమైంది. ‘‘మానవ హక్కుల సంరక్షణకు కృషి చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త అయిన తీస్తా సెతల్వాడ్‌ను అరెస్టు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం భావించి, అరెస్టు చేయమని సూచించిందా? ప్రస్తుతం ఆమె గుజరాత్ పోలీసుల కస్టడీలో ఉంది. ఆమెను అరెస్టు చేయడంగానీ, అరెస్టు చేయాలన్న ఉద్దేశంగానీ తమకు లేదని స్పష్టం చేస్తూ సుప్రీం న్యాయమూర్తులు తక్షణం స్పందించాలని నేను కోరడం తప్పని అనుకోవడం లేదు. కనుక తీస్తా సెతల్వాడ్‌ను తక్షణం బేషరతుగా విడుదల చేయాలనీ; ఆమె అరెస్టునూ, ఆమె డిటెన్షన్ కొనసాగింపునూ కొట్టివేయాలనీ విజ్ఞప్తి చేస్తున్నాను.’’ – న్యూస్‌పోర్టల్ ‘ద వైర్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుప్రీంకోర్టు గౌరవ మాజీ న్యాయమూర్తి మదన్ లోకూర్ 2002 నాటి గుజరాత్ అల్లర్లలో నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న (నేటి ప్రధాని) నరేంద్ర మోదీ ప్రభుత్వం పాత్రపై ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’ ఇచ్చిన నివేదికను ప్రశ్నిస్తూ, తిరిగి దాని పూర్వా పరాలను విశ్లేషించి నివేదికను సమర్పించాలని సుప్రసిద్ధ న్యాయవాది రాజు రామచంద్రన్‌ను సుప్రీంకోర్టు కోరింది. కోర్టు ఆదేశాల మేరకు 2011 జనవరి – జూలైలలో ప్రత్యేక సలహాదారు హోదాలో రాజు రామచంద్రన్ రెండు నివేదికలు సమర్పించారు. అల్లర్ల సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్స్ వద్ద హోంశాఖతో సంబంధం లేని ఇద్దరు మంత్రులు ఉండటాన్ని రామచంద్రన్ నివేదిక తప్పుపట్టింది. ఇదిలా ఉండగానే, రానున్న పరిణామాలను ముందుగానే హెచ్చరించడంలో దిట్ట అయిన గుజరాత్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఆర్.బి. శ్రీకుమార్‌ను కూడా తీస్తా సెతల్వాడ్ మాదిరిగా పోలీసులు అరెస్టు చేసి డిటెన్షన్‌కు పంపడానికి కొన్ని గంటల ముందు ‘నేను జంకేది లేదు, నిజ నిర్ధారణ కోసం పోరాడుతూనే ఉంటాను. నా వ్యక్తిగత కష్టనష్టాలను భరించడానికైనా సిద్ధంగా ఉన్నాను’ అని ప్రసిద్ధ మలయాళ దినపత్రిక ‘మాతృభూమి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించాడు. అంతేగాదు, గుజరాత్ మాజీ గూఢచారి శాఖాధిపతిగా శ్రీకుమార్ తన విధేయత కేవలం భారత రాజ్యాంగ పత్రానికేగానీ, ఏ రాజకీయ పార్టీకి కాదనీ, ఎంతటి శక్తిమంతమైన కరడుగట్టిన రాజ కీయ నాయకుడినైనా ఎదుర్కొని నిలబడటానికి తాను సిద్ధంగా ఉన్నా ననీ ప్రకటించాడు. అంతేగాదు, గుజరాత్ హత్యాకాండ ఘటనలపై సీబీఐ విచారణను కోరుతూ సుప్రసిద్ధ నర్తకి, సామాజిక కార్యకర్త అయిన మల్లికా సారాభాయి సుప్రీంకోర్టులో రిట్ వేయకుండా తప్పిం చేందుకు ఆమె లాయర్‌కు నాటి మోదీ ప్రభుత్వం రూ. 10 లక్షలు ఇచ్చిందని శ్రీకుమార్ ఆరోపించాడు. ఇదే ఆరోపణను మల్లికా సారా భాయి కూడా 2011లో పత్రికా గోష్ఠిలో చేయడం మరొక విశేషం! ఇన్ని గొడవలతో దేశ రాజకీయాలు సాగుతున్నాయి. పాలనా విధానాలూ, ప్రజా వ్యతిరేక చర్యలూ, పౌరహక్కుల అణచివేత, కోర్టులను అపమార్గం పట్టించే విధానాలూ, ఒక్కమాటలో – లౌకిక రాజ్యాంగ వ్యవస్థను బలహీనపరిచే చర్యలు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ‘పళ్ల బిగువు’ మీద తొలి ముప్పయ్యేళ్లు అలా అలా ‘తూట్లు’ పడకుండా లౌకిక రాజ్యాంగం నిలిచింది. ఆ తరువాత కాంగ్రెస్ – బీజేపీ పాలకులు, వారు నిర్వహించిన అవకాశవాద రాజకీయాలతో బీటలు వారడం మొదలైంది. ఇందిరాగాంధీ, రాజీవ్, మన్మోహన్ సింగ్, వాజ్‌పేయి పాలనలు కూడా క్రమంగా తొట్రుబాటుతోనే కాలక్షేపం చేయాల్సి వచ్చింది. చివరికి కాంగ్రెస్ ఐక్య సంఘటన ప్రభుత్వంలో ప్రధాన భూమిక వహించిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ మద్దతుతో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, ఇందిర సమకాలికుడు జ్యోతిబసును దేశ ప్రధానమంత్రిగా నిలబెట్టడానికి చేసిన ప్రయత్నాలు – ఉభయ కమ్యూనిస్టు పార్టీల మధ్య ఏకవాక్యత లేక విఫలమయ్యాయి. అనుభవజ్ఞుడైన జ్యోతిబసు ప్రధాన మంత్రిత్వంలో భారత పాలనా శకపు రాజకీయ పటమే అభ్యుదయ మార్గానికి మళ్లి ఉండేది. ఆ అవకాశాన్ని ఆ పార్టీలే కాదు, దేశమూ, శ్రమ జీవులైన కార్మిక, కర్షక లోకమూ కోల్పోయింది. మితవాద శక్తులు పేట్రేగి పోవడానికి వీలుగా తరువాతి పాలకులు మత దురహంకారం రెచ్చగొట్టారు. తద్వారా కల్లోల భారత సృష్టికి పునాదులు వేశారు. ఇందుకు తోడ్పడుతున్నవి తిరిగి వలస పాలనా చట్టాలేనని మరచిపోరాదు. పార్టీల నుంచి తరచుగా ‘కప్పదాటు’ రాజకీయాలకు అడ్డుకట్ట వేయడానికి రాజ్యాంగంలో అనుబంధపు అధ్యాయాలలో పొందు పరచిన యాంటీ డిఫెక్షన్ చట్టానికి కూడా రాజకీయ పక్షాలు అడుగడుగునా తూట్లు పొడుస్తూనే ఉన్నాయి. తరచుగా ‘ఆయారాం– గయారాం’ రాజకీయాలకు స్వస్తి చెప్పించగల సత్తా తరచూ పార్టీలు మార్చే ఫిరాయింపుదారులైన రాజకీయ నాయకులకు లేదు. వారికి ప్రస్తుత ఫిరాయింపుల నిషేధ చట్ట నిబంధనలు ముగుదాడులు కాగల పరిస్థితి లేదు. ఫిరాయింపుల నిషేధ చట్టంలోని పదవ షెడ్యూల్ ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. అందుకే ఈ అస్పష్టతకు అవకాశమిస్తున్న చట్టంలోని నాల్గవ పేరాను పదవ షెడ్యూల్ నుంచి తొలగించాలని రాజ్యాంగ నిపుణుల నిశ్చితాభిప్రాయంగా కన్పిస్తోంది. ఈ ప్రతి పాదన కొత్తదేమీ కాదు. 1999లో లా కమిషన్, 2002లో రాజ్యాంగ నిర్వహణ వ్యవహారాల సమీక్షకు ఏర్పడిన జాతీయ స్థాయి కమిషన్ ఇలాంటి సిఫారసులే చేశాయని మరచిపోరాదు. భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్ర అమృతోత్సవాలు నిర్వహించుకుంటున్న ఈ సమయంలోనైనా దేశంలో కనీస ప్రజా స్వామ్య విలువలు వృద్ధి చెందడం అత్యవసరం. లేకపోతే అదు పాజ్ఞలు తప్పే పాలకులకు, ప్రభుత్వాలకు... మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా సమాజంలో అశాంతికి, అరాచకాలకు దోహదం చేసే నూపుర్ శర్మ లాంటి వారిని అదుపు చేయడం సాధ్యమేనా? ‘దేశంలో ఉద్రిక్త పరిస్థితికి, అశాంతికి, పెక్కు రాష్ట్రాలలో హింసాకాండకు బీజేపీ మాజీ నాయకురాలు నూపుర్ శర్మ బాధ్యు రాలని సుప్రీం బెంచ్ గౌరవ న్యాయమూర్తి సూర్యకాంత్ శఠించవలసి వచ్చింది. ఇంతకూ విచిత్రమైన సంగతేమిటంటే – సర్వమత సామర స్యాన్ని, సర్వుల మనోభావాలను గౌరవించడం ద్వారా సమాజ శాంతిని శాశ్వతం చేయడం సాధ్యమని నమ్మి ప్రచారం చేసినవాడు కబీర్ దాసు. హిందూ, ముస్లిం మతాల్లో సంప్రదాయాలు కట్టుబాట్ల పేరిట జరిగే అనేక అన్యాయాలను, అక్రమాలను ఎదిరించి పోరాడిన సంస్కర్త, విప్లవకర్త కబీర్. నీవు నడిచే బాటలో ముళ్లు పరిచే వాళ్ల మార్గంలో సహితం నీవు పూలనే ఉంచు; పూలనూ, ముళ్లనూ బేరీజు వేసి వాటి విలువ నిర్ణయించే వాడు పరమాత్మ అన్నాడు. కబీర్‌కు ఈ సమగ్ర దృక్పథం, సమన్వయ దృష్టి ఎలా అబ్బింది? ఉత్తర భారత సమాజంలోని హిందూ, ముస్లిం, జైన, బౌద్ధ మతాలలో ఉన్న కఠిన సాధనాలను, మూఢ విశ్వాసాలను తూర్పారబట్టి, ప్రేమతో నిండిన శక్తియుక్తుల భక్తి మార్గాన్ని ప్రజలకు అందించాడు కబీర్. మానవ మనుగడకు ఐకమత్యం అత్యవసరమనీ, ప్రేమను మించిన శక్తి లేదనీ బోధించిన కరుణామయుడు కబీర్. అందాకా ఎందుకు? ‘మనుషు లందున ఎంచి చూడగ రెండె కులములు – మంచియన్నది మాల అయితే, మాల నేనగుదున్’ అని మతాతీతంగా, కులాతీతంగా మహా కవి గురజాడ చాటలేదూ? ఇంతకూ – రాబందుకూ, రాజుకూ తేడా లేదన్న సామెత ఎందుకు పుట్టిందోగానీ, ‘నిండిన కడుపు నీతి వినదు’ సుమా! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఆదివాసీ రాష్ట్రపతి కావడానికి ఇన్నేళ్లా?
భారత రాష్ట్రపతి స్థానానికి తమ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును నిలబెట్టింది. ఆమె గెలిస్తే తొలిసారిగా రాష్ట్రపతి పదవి చేపట్టిన గిరిజనురాలిగా చరిత్ర సృష్టిస్తారు. ఎన్నిక లాంఛనప్రాయమే అనే అంచనాలున్న నేపథ్యంలో భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుగుతున్నవేళ ఇదొక శుభ పరిణామం అనుకోవచ్చు. అయితే, ఒక ఆదివాసీ... దేశ అత్యున్నత స్థానానికి చేరడానికి 75 సంవత్సరాలు పట్టిందనేది కఠిన వాస్తవం. మితవాద పక్షం నుంచి ఈ ముందడుగు పడుతుందనేది మరొక నిజం. ఉదారవాద పార్టీలు ఇప్పటికీ కొన్ని చట్రాల్లోంచి బయటకు రాలేదన్నది ఇంకో నిజం. ఇన్ని నిజాల మధ్యలో ఇంకో నిజం ఏమిటంటే, దేశంలో ముస్లింలకు తమ జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం దక్కడం లేదు. అందర్నీ కలుపుకొని పోయేట్టుగా మన విధానాలు ఉండాలన్నది మరిచిపోరాదు. ‘‘భారత రాష్ట్రపతి పదవికి తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్మును బీజేపీ అభ్యర్థిగా నిలబెడుతున్నందుకు గర్వంగా ఉంది. లక్షలాదిమంది ప్రజలు, ముఖ్యంగా దారిద్య్ర బాధల్ని, కష్టనష్టాలను అనుభవించి వాటిని ఎదుర్కొంటున్న ప్రజలు ముర్ము జీవితం నుంచి గొప్ప ధైర్యాన్ని పొందుతారు. విధాన నిర్ణయాల పట్ల ఆమె అవగాహన, కారుణ్య దృష్టి మన దేశానికి ఎంతగానో తోడ్పడ తాయి. ఎందుకంటే, ద్రౌపది ముర్ము సమాజ సేవకు, పేదలు, అణగారిన, విస్మరించబడిన వర్గాల ఉద్ధరణకు తన జీవితాన్ని అంకితం చేసుకున్న మహిళ. – ప్రధాని నరేంద్ర మోదీ ‘‘భారత తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును బరిలోకి దించాలని ఒక వైపున మితవాద పార్టీ అయిన బీజేపీ నిర్ణయించగా, దేశంలోని అభ్యుదయకర అతివాద పార్టీలుగా పేరున్న రాజకీయ పక్షాలు ఇప్పటికీ అగ్రవర్గాలకు చెందిన అభ్యర్థులనే పట్టుకుని వేలాడ వలసి రావడం విచారకరం. ‘అభ్యుదయవాదులం’ అనుకునే సవర్ణులు ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోవడం అంత కష్టమైన పనా? కాగా, అదే సమయంలో దేశానికి తొలి ఆదివాసీ రాష్ట్రపతి కావడానికి 75 సంవత్సరాల కాలం పట్టడం, అందులోనూ మితవాద పక్షమైన బీజేపీ అభ్యర్థిగా నిలబడవలసి రావడం ఆశ్చర్యకరం’’. – ‘కఠువా’ అత్యాచార కేసులో వాదించిన సుప్రసిద్ధ న్యాయవాది దీపికా సింగ్ రజావత్ ‘‘తనకు అనుకూలమైన ‘డమ్మీ’ రాష్ట్రపతిగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థిని బీజేపీ నిలబెట్టడం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ తరగతుల ప్రజలను మోసం చేయడానికే. అయితే రాజకీయ, పరిపాలనా సంబంధమైన శక్తియుక్తులున్న మహిళ ద్రౌపది ముర్ము అని మరచిపోరాదు.’’ – జాతీయ కాంగ్రెస్ ప్రకటన అయితే, వ్యక్తి శక్తియుక్తులకన్నా కీలకమైన అంశం – గత 75 ఏళ్లుగా భారత రాజకీయాల్నీ, అధికార పదవులలో ఉన్న పాలక శక్తుల్నీ నడిపిస్తున్నది భారత సెక్యులర్ రాజ్యాంగమూ కాదు; దేశానికీ, పాలనకూ దిక్సూచిగా ఉండవలసిన అందలి విస్పష్టమైన ఆదేశిక సూత్రాలూ కావు. ‘భారత ప్రజలమైన మేము’ (ఉయ్ ది పీపుల్) ‘మాకై అంకితమిచ్చుకున్న రాజ్యాంగ పత్రం’ అని పేర్కొన్నా, ‘మీరెవరు మమ్మల్ని శాసించడానికి?’ అని ఎదురు ప్రశ్నలకు దిగిన రాజకీయ పాలకులున్న దేశం మనది. ‘ఆదేశిక సూత్రాల’నే కాదు, ‘పౌర బాధ్యత’ల ప్రత్యేక అధ్యాయం ద్వారా దేశ ప్రజలలో శాస్త్రీయ ధోరణులను ప్రబుద్ధం చేయాలన్న స్పష్టమైన ‘తాఖీదు’ను కూడా కాంగ్రెస్–బీజేపీ పాలకులు పక్కకునెట్టి యథేచ్చగా తిరుగుతున్నారు. ఇక అధికార పార్టీ నేతృత్వంలో హిందూత్వ రాజకీయాల ద్వారా విద్యా వ్యవస్థ స్వరూప స్వభావాన్నే తారుమూరు చేసే ప్రయత్నాలు శరవేగాన జరుగుతున్నాయి. ఇందుకు విద్యా, విశ్వవిద్యాలయ స్థాయిలో స్థిరపడిన అభ్యుదయకర నిబంధనల్నీ, చట్టాలనే మార్చే యత్నాలు వేగంగా సాగుతున్నాయని మరచిపోరాదు. అనేక మతాలు, మత విశ్వాసాలు, ప్రత్యేక సంప్రదాయాలు, అనేక తెగలు, బహుళ జాతులు, బహు భాషలతో కూడిన భారత ప్రజలందరినీ తాను విశ్వసించే ‘మూస’లో బంధించడానికి బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ప్రయత్నిస్తోంది. అవే ఎత్తుగడలతో 2024 ఎన్నికల వైపు కూడా దూసుకుపోతోంది. ఇందుకు అన్ని ఎత్తుగడలకంటే కీలకమైన మాధ్యమం విద్యా రంగం అని భావిం చింది. అందుకే ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ప్రాతినిధ్యం దక్కడం లేదు బహుళ జాతులతో కూడిన భారతదేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్య కేంద్రంగా వర్ధిల్లాల్సిన పార్లమెంట్‌ను సహితం స్వభా వంలోనూ, ఆచరణలోనూ సంకుచిత స్థాయికి దిగజార్చుతూ వచ్చారు. సమావేశాలు మొక్కుబడిగా జరుగుతున్నాయి. అవీ రసవిహీనమైన ఉబుసుపోని చర్చలతోనే ముగుస్తున్న సందర్భాలే ఎక్కువ. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి పాత్ర నామమాత్రం. ఇక యూరప్‌తో పోల్చితే అక్కడి ఎన్నో దేశాల కంటే భారత ముస్లిం జనాభా ఎక్కువ. అనేక దేశాల స్థాయిలో భారత ముస్లిం జనాభా ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అయినా రాజకీయ స్థాయిలోనూ, సంస్థాగత స్థాయిలోనూ ముస్లింల ప్రతిపత్తికి విలువ లేనట్టుగా పాలక విధాన పోకడలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే, భారతదేశంలో ప్రజా రాజకీయ కార్యాచరణకూ, ప్రజాస్వామ్య మనుగడకూ కీలకం – విస్పష్టమైన విధానాల ఆచరణే నని చరిత్ర రుజువు చేస్తోంది. కనుకనే, భారతదేశంలో విశిష్ట ‘ఎమెరిటిస్’ ప్రొఫెసర్ జోయా హాసన్ (జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ) ప్రస్తుతం దేశంలో ముస్లిం మైనారిటీల దుఃస్థితిని గురించి ఇలా పేర్కొనక తప్పలేదు: ‘‘గత పదేళ్లలోనే భారతదేశ సెక్యులర్ (అన్ని మతాలనూ సమంగా పరిగణించే) వ్యవస్థ రాజ్యాంగ పునాదులు కాస్తా దేశ రాజకీయ పాలనా పద్ధతుల వల్ల బీటలు వారుతున్నాయి.’’ ఎందుకంటే, దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ ముస్లింల ప్రాతినిధ్యం వారి జనాభాకు తగిన దామాషాలో పెరగనే లేదు. పైగా జనాభాలో 20 కోట్ల మందికిపైగా ఉన్న ముస్లింలను రెచ్చగొట్టేలా పాలకపక్ష ప్రతినిధి ప్రవక్త మహమ్మద్‌ను తూలనాడుతూ ప్రకటనలు చేయడంతో దేశవ్యాప్తంగా అశాంతిని ప్రజ్వలింపజేసింది. అందరూ కలిస్తేనే... హిందూస్థాన్ ఒక ఆదివాసీ మహిళను దేశ రాష్ట్రపతి స్థానంలో నిలబెట్టడానికి బీజేపీ పడుతున్న తాపత్రయంలో ఒక్క శాతం అభిమానాన్ని కూడా ముస్లిం మైనారిటీల మనోభావాలపట్ల చూపక పోవడం క్షమించరాని వివక్షగా పరిగణించక తప్పదు. అంతేగాదు, ఈ వివక్ష చివరికి ఎక్కడికి దారి తీసి మరింత అలజడికి కారణమవుతోందంటే, ఫలానావాడు ‘హిందువుల’ వ్యతిరేకి అని ఎక్కడ ముద్ర పడుతుందోనన్న జంకు కొద్దీ హిందూ రాజకీయ పక్షీయులూ, పార్టీలూ న్యాయబద్ధంగా ముస్లింలకు ఇచ్చే టికెట్ల సంఖ్యను తగ్గించేయడం జరుగుతోందని ప్రొఫెసర్ జోయా హాసన్ వెల్లడించారు. అంతేగాదు, ప్రజాస్వామ్య విలువలకూ, వ్యక్తి ఉనికికీ కూడా గౌరవం పూజ్యం. పైగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పాలకులు ప్రజా కోర్కెలను లేదా ప్రజా ఉద్యమాలను అణచటానికి, కట్టడాలను కూలగొట్టడానికి ఇటీవల ‘బుల్డోజర్’లను కూడా యథేచ్చగా వాడుతున్నారు. ఇప్పటికైనా మనం గుర్తించి తీరవలసిన సత్యం – భారతదేశం ఒకప్పుడు నాగరిక దేశంగా ప్రపంచ ఖ్యాతి గడించడానికి కారణం ఏమిటో భారతీయుడైన రఘుపతిరాయ్ ఫిరాక్ అనే కవి లిఖించిన ఆర్ద్రమైన ఈ క్రింది కవితలో వెల్లడవుతోంది: ‘‘ప్రపంచంలోని నలు మూలల ఉన్న దేశాల నుంచి వచ్చే పోయే వర్తక సమూహాలతోనే ఈ దేశం కిటకిటలాడే హిందూస్థాన్‌గా రూపు దిద్దుకుంది.’’ దానికి అనుగుణంగానే సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులలో ఒకరైన గణేష్ దేవో, భారతదేశంలో ప్రచలితమవుతున్న అనేక భాషలలో ప్రాంతీయ భిన్నత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఉన్నవి అమ్ముతూ వ్యయం తగ్గింపా?
దేశవ్యాప్తంగా ‘అగ్నిపథ్’ సృష్టించిన అగ్నిగుండం ఏమిటో మనకు తెలుసు. త్రివిధ దళాల్లో యువ సైనికుల్ని తాత్కాలిక సేవల కోసం ఉపయోగించుకుని మధ్యలో వదిలేసే పథకానికి కేంద్రం తెర లేపింది. తమ ప్రయోజనాల్ని ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసిందని భావించినందునే అభ్యర్థులు భారీ ఆందోళనకూ, విధ్వంసకాండకూ దిగారు. అయితే ఈ పథకం తేవడానికి కారణం ఏమిటి? సైన్యంలో పెన్షన్ వ్యయం పెరగడం! దీనికి నిజంగా చేయవలసింది – ఇరుగు పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపర్చుకుని రక్షణ బడ్జెట్‌ను తగ్గించుకోవడం! కానీ ప్రభుత్వం దీనికి బదులుగా లాభసాటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుకు అప్పజెబుతోంది; పెద్ద నోట్ల రద్దు అని చెప్పి ఎదురుడబ్బులు ఖర్చుచేసింది. ఇన్ని అస్తవ్యస్త విధానాలను అమలుచేస్తున్న ప్రభుత్వం సైన్యంలో వ్యయం పేరిట ఉద్యోగావకాశాల మీద నీళ్లు జల్లితే అభ్యర్థులకు ఆగ్రహం రాదా? భారతదేశంలో క్రమక్రమంగా ప్రభుత్వ రంగం కొడిగట్టిపోతూ వస్తోంది. 2014 ఎన్నికల తర్వాత అది మరింత వేగంగా బీజేపీ–ఆరెస్సెస్ ‘హిందూత్వ’ ఎజెండా చాటున ప్రైవేట్ ‘దుకాణం’గా స్థిరపడుతోంది. ఆ పరిణామంలో భాగంగానే – త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ పేరిట కేంద్రం ప్రవేశపెట్టిన సరికొత్త పథకం ‘అగ్నిపథ్’! సైనిక దళాల్లో చేరడానికి పాత రిక్రూట్మెంట్లలో అవసరమైన వివిధ దశల్ని (పరీక్షల్ని) పూర్తి చేసుకున్న అభ్యర్థులను డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా తాత్కాలిక సేవల కోసం ఉపయోగించుకుని మధ్యలో వదిలేసే పథకా నికి కేంద్రం తెర లేపింది. రిక్రూట్మెంట్ పరీక్షలు రాసి పాసైన అభ్య ర్థులు తమను ప్రభుత్వం మోసం చేస్తోందని భావించి, దీనికి నిరస నగా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకూ, విధ్వంసకాండకూ దిగారు. శాశ్వత రిక్రూట్మెంట్ పథకం ద్వారా కాకుండా తాత్కాలిక అవసరాల కోసం తమ ప్రయోజనాల్ని ప్రభుత్వం పక్కన పెట్టేసిందని అభ్యర్థులు భావించినందునే ఈ స్థాయిలో భారీ విధ్వంసకాండకు దిగారు. ఎందుకీ కొత్త ఎత్తుగడ? అభ్యర్థుల్ని ‘స్వల్ప కాలం పాటు’ ఆర్మీలో పని చేయడానికి మాత్రమే అనుమతించాలన్న నిబంధనను ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టింది? సైనిక, నావిక, విమాన సర్వీ సుల్లో పనిచేసే ఉద్యోగులకు పెరిగిపోతున్న పెన్షన్ చెల్లింపులకు కోత పెట్టడానికి ఈ కొత్త ఎత్తుగడను ప్రభుత్వం ఎత్తింది. ఇది పేరుకు ‘అగ్నిపథ్’. మరో మాటలో అగ్నిగుండం అనుకోవచ్చు. అయితే, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేట్ రంగానికి ధారాదత్తం చేసే పథకాల్ని బీజేపీ–ఆరెస్సెస్ కూటమి పాలకులు 2014 నుంచే అమలు చేస్తున్నారు. దీని పరాకాష్ఠ – కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తూన్న ప్రతిష్ఠాత్మక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సహితం ప్రభుత్వ రంగం నుంచి తప్పించడం. దాన్ని ప్రైవేట్ రంగానికి కట్టబెట్టాలని నిర్ణయిం చినప్పుడే ఇది దేశ ప్రజలందరికీ అర్థమయింది. విశాఖ కర్మాగారాన్ని పబ్లిక్ రంగంలో కాపాడుకునేందుకు విశాఖలోనూ, దేశ వ్యాప్తం గానూ ఈ రోజుకూ ప్రజలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయినా ‘మొండికీ, బండకూ’ ఆయుష్షు ఎక్కువన్నట్టుగా దేశ పాలనా వ్యవస్థ ప్రవర్తిస్తోంది. ఇక్కడ గుర్తించవలసింది ఏమంటే– ఇలాంటి ఆందోళ నలు తలెత్తడానికి గల కారణాలను విశ్లేషించుకొని సకాలంలో సవర ణలను చేసుకోవాలనీ, ‘కక్షలు, కార్పణ్యాల’తో పరిష్కారాలు కుదర వనీ ప్రపంచవ్యాప్తగా మొండి పాలకులకూ, ప్రభుత్వాలకూ తెలియని పాఠమా? ప్రతి సంవత్సరమూ, దేశ రక్షణ బడ్జెట్లో సగానికి పైగా ఉద్యోగుల పెన్షన్ల కిందనే పోతోందనీ, పరిశోధన, అభివృద్ధి రంగా లకు ఐదు శాతం కన్నా తక్కువే అందుతోందనీ, రెవెన్యూ ఖర్చులో 70 శాతం రక్షణ బడ్జెట్‌కే ఖర్చు అవుతోందనీ ‘నీతులు’ చెప్పడానికి అలవాటు పడ్డారు పాలకులు. కానీ ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు, దౌత్య సంబంధాలు ఇతోధికంగా పెంచుకోవడం పట్ల పాలనా వ్యవస్థ శ్రద్ధ పెట్టడం లేదు. రక్షణ విధానాల్లో మార్పు వచ్చేలా దేశ రక్షణ బడ్జెట్‌ను రూపొందించుకోవడం లేదు. ఏదో ఒక మిషతో ఉద్రిక్తతల సడలింపుపైన శ్రద్ధ వహించడం లేదు. ఇందువల్ల దేశానికీ, ప్రజల ప్రాథమిక ప్రయోజనాలకూ కలుగుతున్న నష్టాన్ని గుర్తించడం లేదు. దీన్నే భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ‘ది ఇండియా వే’ (భారత మార్గం) అన్న తన కొత్త గ్రంథంలో కూడా స్పష్టం చేస్తున్నారు. గత మూడు దశాబ్దాల్లో దేశాల మధ్య సంబంధాలు మెరుగై ఉన్నందున, ఆ పరిస్థితిని చెక్కు చెదుర్చుకోరాదనీ... దేశాల సరి హద్దులు, సంబంధ బాంధవ్యాలు పరస్పరం విడదీయరానివనీ జై శంకర్ చెబుతున్నారు. ఈ నిర్వాకాలతో ఒరిగిందేమిటి? కానీ గత పదేళ్ల వ్యవధిలో జరుగుతున్నదేమిటి? ఏదో ఒక మిష పైన, లేదా పాలక అవసరాల పైన, దేశ సైన్యం పేరిట... ‘హిందూత్వ’ ఎజెండా పేరిట... నల్లధనాన్ని వెలికి తీయకుండానే దాని పేరిటా దేశీయ కరెన్సీతో పాలకులు చెలగాటం ఆడుకున్నారు. దీనివల్ల మాసాలు, సంవత్సరాల తరబడీ సామాన్య, మధ్యతరగతి ప్రజల చేతుల్లో డబ్బులు ఆడక, బ్యాంకుల వద్ద గంటల తరబడీ పడిగాపులు పడవలసి వచ్చింది. ఆ క్రమంలో సుమారు 150 మంది బ్యాంకుల వద్దనే కుప్పకూలి ప్రాణాలు విడిచిన సంగతి మనకు తెలుసు! అంతకుమించి, కొత్త నోట్ల సృష్టి కోసం ఎదురు 25 వేల కోట్ల రూపా యలు ప్రింటింగ్ ప్రెస్‌లకు ధారాదత్తం చేసుకోవలసి వచ్చింది. ఇన్ని అనవసర ఖర్చులు పెడుతున్న ఈ అనుభవాలన్నింటి దృష్ట్యా ‘అగ్నిపథ్’ పథకాన్ని అగ్నితో చెలగాటం అనక తప్పదు. ఇది శిక్షణ పొందిన యువకుల రిక్రూట్మెంట్ విధానాన్నేగాక, యువ సైనికుల స్వభావాన్ని కూడా మౌలికంగానే దెబ్బ తీస్తుంది. అంతే గాదు, నిజానికి ఇదే బీజేపీ ప్రభుత్వం ‘ఒక ర్యాంకు ఒక పెన్షన్’ అన్న పథకాన్నే అమలు జరుపుతామని హామీ ఇచ్చి పరిపాలనకు వచ్చింది. తీరా ఆచరణలో ‘ర్యాంకూ లేదూ, పెన్షనూ లేదు’ పొమ్మనే నిర్ణయా నికి రావడం ప్రస్తుత గందరగోళానికి దారితీసింది. ఇది ఆర్మీ ఉద్యో గార్థులకూ మింగుడుపడని అంశం కాదా? ఆర్మీ ఉద్యోగార్థుల రిక్రూట్ మెంట్ గరిష్ఠ వయఃపరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచినట్టు పాల కులు చేతులు కాలిన తరువాత ప్రకటించబోవడం మరొక విడ్డూరం! దేశ భద్రతకు ప్రమాదం అంతేగాదు, సైన్యంలోకి రాష్ట్రాల వారీగా జనాభా ప్రాతిపదికపై రిక్రూట్ చేయడం 1966 నుంచీ అమలులో ఉంది. అలాగే, మన పార్ల మెంట్‌ను కూడా రానురానూ 500 మంది సభ్యుల్లో ఎక్కువగా పురు షులతోనే నింపడం ఎక్కువైంది. ఒకనాడు– 1952లో భారత రిపబ్లిక్ తొలి పార్లమెంట్ సమావేశంలోనే హేమాహేమీలైన 22 మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు. విశేషమేమంటే, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న వేళ, అమృత మహోత్సవాలు నిర్వహించు కుంటున్న దశలో కూడా నాయక స్థానాల్లో ఉన్న మహిళలను అధ్య క్షులనో లేదా పార్టీ నాయకురాళ్లనో చెబుతూ ఉంటారేగానీ, గౌరవ పార్లమెంట్ సభ్యురాళ్లని మనం పిలుచుకోలేకపోతున్నాం. ఈ రోజుల్లో కేంద్రంలో పాలక రాజకీయ పక్ష సైద్ధాంతిక దృక్పథం కారణంగా దేశంలో ఫెడరల్ (సమాఖ్య) వ్యవస్థలో అస్తవ్యస్త స్థితి దాపురించింది. ఫెడరల్ వ్యవస్థ ఉనికికి అత్యధిక పార్లమెంట్ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ పాలకులు గండి కొడుతున్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ అస్తవ్యస్త విధానం కూడా ఈ కోవ లోనిదే. తాజాగా కేంద్ర పాలకులు వ్యయాన్ని మిగిల్చే పేరిట తీసుకున్న నిర్ణయం మూలంగా వృత్తి గౌరవాన్నీ, సమాజ సుస్థిరతనూ, తద్వారా దేశ భద్రతనూ ప్రమాదంలోకి నెట్టినట్టే అవుతుందని సుప్రసిద్ధ పరిశోధనా సంస్థ ‘సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్’ కేంద్రం సీనియర్ పరిశోధకులు సుశాంత్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘హిందూత్వ’ రాజకీయాల్లో భాగంగా మత మైనారిటీల ఆస్తుల్ని కూలగొట్టే దుర్మార్గపు చర్యల్ని సుప్రీంకోర్టు నిశితంగా విమర్శించ వలసి వచ్చింది. అలాగే, కేంద్ర అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్మీలో విశిష్ట పాత్ర నిర్వహిస్తూన్న సిక్కు, డోగ్రా, మద్రాసు రెజిమెంట్ వగైరా ఫెడరల్ యూనిట్లను తక్కువ చేసినట్టు అవుతోందని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఖండించవలసి వచ్చింది! ఏది ఏమైనా, ప్రతిష్ఠ కోసం పెద్దనాయుడు చస్తే ఈడ్వలేక ఇంటిల్ల పాదీ చచ్చారన్నట్టుగా పాలకుల ప్రవర్తన ఉండకూడదు సుమా! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
‘కరోనా’ కథ కంచికి చేరేనా?
‘మానవ మనుగడ పైన వైరస్ క్రిములదే ఆఖరి మాట’ అని ఏనాడో హెచ్చరించాడు లూయీ పాశ్చర్. ప్రపంచవ్యాపితంగా ప్రబలమై ఉన్న 300 రకాల వైరస్ క్రిముల్ని శాస్త్రవేత్తలు ఎప్పుడో కనిపెట్టారు. పెను ఉప్పెన వచ్చి పచ్చని చేలనూ, పంటలనూ ఊడ్చిపెట్టినట్టే, వైరస్ క్రిములూ మానవ జీవితాల్ని నాశనం చేస్తాయని చెబుతూనే ఉన్నారు. అయినా వీటికి పరిష్కారం ఇప్పటిదాకా ఎందుకు దొరకలేదు? ఎందుకంటే, ఈ భయం అధికారాన్ని స్థిరపరచడానికి పనికొస్తుంది. ఇంకాముఖ్యంగా ఫార్మా కంపెనీలకు సిరులు కురిపిస్తుంది. కరోనా సాధారణ ‘ఫ్లూ’ లాంటిదేననీ, దాన్ని నివారించడానికి ‘ఫ్లూ’ సంబంధిత సాధారణ నివారణ చర్యలు సరిపోతాయనీ ఎందరు మొత్తుకున్నా వైద్యరంగాన్ని శాసించడానికి అలవాటుపడిన మందుల కంపెనీల ఒత్తిళ్లకు అమెరికా పాలకులు లొంగిపోయారు. ఆ బాటే ప్రపంచమూ అనుసరిస్తోంది. ‘‘అంటువ్యాధుల, మహమ్మారుల యుగం వెనక బలమైన రాజకీయాల ప్రభావం కూడా ఉంటుంది. ఈ వ్యాధుల నివారణకు రాజ్య వ్యవస్థగానీ, లేదా ప్రభుత్వంగానీ తన పౌరులకు ఏ మేరకు బాధ్యత వహిస్తోంది అన్నది, ఏ మేరకు ప్రజల ప్రతిఘటన ఉందన్నదాన్ని బట్టి తెలిసిపోతుంది. ఎందుకంటే, ఎప్పటి కప్పుడు రానున్న ఎన్నికల తేదీని బట్టి పాలకుల నిర్ణయం ఆధారపడి ఉంటుంది. అలాగే మహమ్మారి రోగాల నివారణకు ప్రజలు ఎంత వరకు శ్రద్ధ వహించాలని ప్రభుత్వం కోరుకుంటోందన్న దానిపై ఆధార పడి కూడా వ్యాధి ఫలితం ఆధారపడి ఉంటుంది. అంటే ఎన్నికల్లో రాజకీయ లబ్ధిపై ఆధారపడి మహమ్మారి వ్యాధిని అదుపు చేయడానికి పాలకులు ప్రయత్నిస్తారన్నమాట.’’ (చిన్మయ్ తుంబే రాసిన ‘ఏజ్ ఆఫ్ పాండెమిక్స్(1817–1920): హౌ దే షేప్డ్ ఇండియా అండ్ ద వరల్డ్’. 2020) దేశంలో ‘కరోనా’ కేసులు, వాటికి అనుబంధంగా ‘చిలవలు పలవలు’గా పుట్టుకొస్తున్న రకరకాల అనుబంధ వ్యాధులు – దేశం లోనూ, ప్రపంచ వ్యాపితంగానూ కోటానుకోట్ల ప్రజలను ఆందోళన పరుస్తున్నప్పటికీ ప్రపంచంలోని పెక్కుమంది పాలకులకు పరి ష్కారం దొరక్కపోవడానికి కారణం ఏమిటి? ప్రభుత్వాల నియం త్రణ వ్యవస్థ లోపమా? లేక, మందుల వ్యాపారులకూ, పాలక వర్గాలకూ మధ్య లాభసాటి బేరసారాల ఫలితమా? ‘కోవిడ్’కు ముందు గత 500 సంవత్సరాల క్రితమే ప్రపంచ వ్యాపితంగా ప్రబలమై ఉన్న 300 రకాల వైరస్ క్రిముల్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వీటిలో ఎన్నిరకాల అంటువ్యాధులకు మానవ శరీరమే గాక, మానవేతర ప్రకృతిలోని పశుపక్ష్యాదుల శరీరాలు కూడా దోహదం చేస్తూ వచ్చాయో జీవశాస్త్రవేత్తలు పలువురు విపులంగా చర్చించారు. ఆ మాటకొస్తే నూరేళ్ల నాటి స్పానిష్ ఫ్లూ నుంచి నేటి ‘కోవిడ్–19’ మహమ్మారి దాకా నడిచిన మానవ–మానవేతర కల్లోల ప్రపంచాన్ని గురించి మార్క్ హోనిగ్స్బామ్ తన తాజా గ్రంథంలో పూసగుచ్చినట్టు వివరించారు. యుద్ధాల వల్ల, మానవ సంచారం ద్వారా వివిధ ఖండాలలో వ్యాపిస్తూ వచ్చిన రకరకాల వైరస్ల గురించి శాస్త్రవేత్తలు చర్చించారు. కోవిడ్–19 వైరస్‌కు ముందు హెచ్ఐవీ, సార్స్ వైరల్ వ్యాధులు ప్రపంచానికి ముందస్తు హెచ్చరికలు. వాటిని ధృవపరుస్తూ తర్వాత ప్రపంచం మీదికి వచ్చి మానవాళిని కకావికలు చేసినవి ఎబోలా, జైకా, కోవిడ్–19. ఈ పరిణామాన్ని వివరిస్తూ 2016లోనే నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఒక హెచ్చరిక విడుదల చేసింది – ‘‘వైద్య శాస్త్రం అమోఘమైన అసాధారణ పురోగతిని సాధించినప్పటికీ, అంటువ్యాధుల ప్రమాదం గురించి మనం ఉదాసీన వైఖరితో ఉండరాదు. ఎందుకంటే నానాటికీ అంటువ్యాధుల వ్యాప్తి పెరిగి పోతున్నట్టు కన్పిస్తోంది’’. ఈ వ్యాప్తిని గురించి 1880లలోనే తొలిసారిగా ప్రపంచానికి వెల్లడించి, శాస్త్రబద్ధంగా వివరించిన మహ నీయుడు లూయీ పాశ్చర్. ‘‘మానవ మనుగడ పైన వైరస్ క్రిములదే ఆఖరి మాట’’ (ఇటీజ్ ది మైక్రోబ్స్ దట్ విల్ హావ్ ద లాస్ట్ వర్డ్) అని హెచ్చరించాడు పాశ్చర్. అంతటితో ఆగకుండా మానవ జీవితం అంటేనే క్రిమి, క్రిమి అంటేనే జీవితం – పెను ఉప్పెన వచ్చి పచ్చని చేలనూ, పంటలనూ ఊడ్చిపెట్టినట్టే, వైరస్ క్రిములూ మానవ జీవితాల్ని నాశనం చేస్తాయని శాస్త్రవేత్తలు చాలాకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. అమె రికా యుద్ధోన్మాదుల చర్యల ఫలితంగా ఆఫ్రికా ఖండానికేగాక, యావత్ ప్రపంచానికే మొదటిసారిగా ఎయిడ్స్ మహమ్మారి వ్యాధి పాకిపోయి కోట్లాదిమంది జీవితాలను బుగ్గిపాలు చేసింది. ఇంతకు ముందు వచ్చిన వ్యాక్సిన్లతో ఫార్మా కంపెనీలు సాధారణ వ్యాపారం చేసినా, మానవ జీవితాలతో చెలగాటమాడే స్థితికి చేరుకోలేదు. ఎప్పుడయితే కరోనా–19 బయటపడిందో పరిస్థితి మారిపోయింది. అది సాధారణ ‘ఫ్లూ’ వ్యాధికి సంబంధించినదేగానీ మరొకటి కాదనీ, ఆ రోగ నిరోధానికి ‘ఫ్లూ’ సంబంధిత సాధారణ నివారణ చర్యలు సరిపోతాయనీ అమెరికా వైద్య శాస్త్ర పరిశోధకులూ, ఇతర నిపుణులూ మొత్తుకున్నారు. అయినా అక్కడి వైద్యరంగాన్ని శాసించడానికి అలవాటుపడిన మందుల వ్యాపార కంపెనీల ఒత్తిళ్లకు అమెరికా పాలకులు లొంగిపోయారు. అంతేకాదు, ప్రపంచవ్యాపితంగా అమె రికా ఫార్మా కంపెనీల తాఖీదులకు ‘జీ హుకుం’ అనేట్టు చేశారు. అమెరికా ఉద్దండ వైద్య శాస్త్ర నిపుణులు కోవిడ్–19 వైరస్‌కు సాధారణ ‘ఫ్లూ’కు వాడే మందులు వాడితే చాలునని పదేపదే హెచ్చరించినా అక్కడి ఫార్మా గుత్త కంపెనీలు మాత్రం మానవ రక్తం పీల్చుకోవడానికి అలవాటుపడి ప్రభుత్వం చేతులు కట్టివేశాయి. ఈలోగా ‘ఫ్లూ’ వ్యాధి నివారణకు మనం వాడుకునే ‘ఆరుకోట్ల వయల్స్’ను అమెరికాకు కారుచౌకగా మన పాలకులు ధారాదత్తం చేసి, ఆ వయల్స్ దేశ ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారని మరచిపోరాదు. ఇక అమెరికా విద్యే మనకూ అలవాటయింది. అమెరికా ఫార్మా గుత్త కంపెనీలే ఇక్కడి పాలకులకూ అనుసరణీ యమయ్యాయి. చివరికి దేశీయ కంపెనీలు అనుకున్న భారత్ బయోటెక్ లాంటి సంస్థలు కోవిడ్–19 నిరోధానికి తయారు చేశామని చెప్పిన వ్యాక్సిన్లను విడుదల చేసేముందు ‘మూడు దశల పరీక్షల ఫలితాలను మా ముందు ఉంచం’డని శాస్త్రవేత్తలు కోరినా ఈరోజుదాకా ఆ మూడు పరీక్షల అంతిమ ఫలితాలను కంపెనీ సమ ర్పించకపోవడం వైద్య పరిశోధనా రంగంలో ఒక శాశ్వత మచ్చగా నిలిచిపోయింది. అయినా దేశ పాలకులు ఏ కారణం చేతనో ఆ అసమగ్ర పరిశోధననే అందలమెక్కించి దేశ, విదేశాలకు ఆ కంపెనీ మందుల్నే ఎగుమతి చేస్తున్నారు. ఈ దశలో బయోటెక్ కంపెనీ మోసం చేసిందన్న ఆరోపణపై కొనుగోళ్లు నిల్పివేసి, బ్రెజిల్ ప్రభుత్వం దావాలకు దిగడం మరో అవమానకర ఘట్టం. బయటేమో మన భాగోతం అలా ఉంది. దేశంలోనేమో గుజ రాత్లో కూడా కోవిడ్ మరణాల సంఖ్య తక్కువేమీ లేదు. అయినా ప్రతిపక్షాల ప్రభుత్వాలున్న మూడు దక్షిణాది రాష్ట్రాలు, ఒక ఢిల్లీ (కేజ్రీవాల్) ప్రభుత్వాన్ని మాత్రమే కోవిడ్ విజృంభణ, కోవిడ్ మరణాలు పెరుగుతున్నాయన్న పేరిట కేంద్ర పాలకులు ‘యాగీ’కి దిగడం ఆశ్చర్యకరం! ఏతావాతా ప్రస్తుతం కరోనా ఆధారిత ‘గుంపు చింపుల’న్నీ చిత్రమైన దశకు చేరుకున్నాయి. ఎటూ నిర్ధాణగా తేల్చలేని ‘కోవిడ్–19’ ప్రభావం గురించీ, రోజుకో కొత్త కోవిడ్ వేరియంట్ బయటపడుతోందని ఫార్మా కంపెనీలు చెప్పే మాటలు... వైద్యుల్నేగాదు, ప్రజలనూ తీవ్ర గందరగోళంలోకి నెడుతున్నాయి. ఫలితంగా గొప్పగొప్ప వైద్యులు సహితం నిర్దిష్ట సలహాలు ఇవ్వగల స్థితిలో లేక ‘మాస్కు’లు పెట్టుకుని తిరగమని సలహా ఇవ్వడానికి మించి నిర్దిష్ట దృక్పథానికి ఇప్పటికీ రాలేకపోతున్నారు. ఈ ధోరణి సామాన్య ప్రజలను మింగలేని కక్కలేని పరిస్థితుల్లోకి నెడుతోంది. చివరికి ఈ రకరకాల ‘వేరియంట్లు’ స్వరూప స్వభావాలను కూడా చివరికి వివరించి చెబుతున్నది డాక్టర్లుగానీ, వైద్య నిపుణులు గానీ కాదు. లాభసాటి వ్యాపారంలో ఉన్న బడా ఫార్మా కంపెనీలు, వారి కాంటాక్టులో ఉన్న కొందరు వైద్యులూ, ఏజెంట్లూ మాత్రమేనని అనుమానాలు తీవ్రతరమవుతున్నాయి. ఇంతకూ అసలు ‘కరోనా’, దాని తాలూకూ వేరియంట్ల కథ ‘కంచి’కి ఎప్పుడు చేరుతుంది? వైద్యులు, రోగులు ‘ఇళ్ల’కెప్పుడు చేరతారు?! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
మరో నాలుగేళ్లూ మండే ఎండలే!
సుమారు నూటాపాతికేళ్ల భారతదేశ చరిత్రలో ఈ 2022వ సంవత్సరం ప్రతికూల కారణాల వల్ల ప్రత్యేకమైనది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, ఎట్టకేలకు వేసవి తగ్గుముఖం పడుతోందని సంతోషపడటానికి లేదు. రాబోయే నాలుగేళ్లూ కూడా ఎండలు ఇలాగే మండిపోతాయని ఇప్పటికే ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. వీటి ఫలితంగా వడగాడ్పులూ, ఉక్కపోతలతో పాటు ఆహార భద్రతా సంక్షోభం, అనారోగ్యాలు కలగడం లాంటి ఎన్నో విపరిణామాలను మానవాళి ఎదుర్కోవాల్సి ఉంది. దీనికి తక్షణం మనం చేయవలసిందల్లా శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో వినడం, పర్యావరణ కార్యకర్తలు ఏం చేయమని చెబుతున్నారో చేయడం! ‘‘ఇప్పుడే కాదు, రాబోయే నాలుగేళ్ల పాటూ అదనంగా 1.5 డిగ్రీల చొప్పున తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఫలితంగా మరింతగా మంచు కరిగిపోవడం, సముద్ర జలరాశులు పోటెత్తిపోవడం, తీవ్ర స్థాయిలో వడగాడ్పులు వీయడం తదితర అసాధారణ పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. ఫలితంగా ప్రజల ఆహార భద్రత, ఆరోగ్యం, పరిసరాలు, భద్రమైన అభివృద్ధికి చేటు మూడే ప్రమాదం ఉంది’’. – ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) హెచ్చరిక: 2022 మే మూడో వారంలో విడుదల చేసిన ప్రకటన. అంతేగాదు, దక్షిణాసియా పాత, కొత్త వలస సామ్రాజ్య పాలకుల యుద్ధోన్మాద వ్యూహాలు కూడా వాతావరణ పరిస్థితులు వికటించ డానికి దోహదపడుతున్నాయి. ఫలితంగా దక్షిణాసియాలో కీలక స్థానంలో ఉన్న భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ లాంటి దేశాలు వాతావరణ రక్షణకు మునుపటికన్నా ఎక్కువ శ్రద్ధతో, మెలకువతో, జాగరూకతతో వ్యవహరించాల్సిన అత్యవసర పరిస్థితులు నేడు ఏర్పడ్డాయి. ఈ పరిణామాల ఫలితంగా దక్షిణాసియా దేశాలలో తరచుగా ఇకపైన ఎప్పటికన్నా ఎక్కువగా సుదీర్ఘకాలంపాటు వడ గాడ్పులూ, ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కబోతలూ ఎక్కువయ్యే ప్రమాదం ఉందని సుప్రసిద్ధ పర్యావరణ, వాతావరణ శాస్త్రవేత్త షకీల్ అహ్మద్ రోమ్‌షూ హెచ్చరిస్తున్నారు. గత దశాబ్దాలుగా ప్రపంచ వాతావరణం అసాధారణ రీతిలో వేడెక్కిపోతుండటాన్ని గురించి శాస్త్రవేత్తలు ఆందో ళన వ్యక్తం చేస్తూనే ఉన్నారని మనం మరవ కూడదు. ఎండల్లోనే పుట్టిన తరం 2000 సంవత్సరం నుంచీ ఈ ఉష్ణోగ్రతల తీవ్రత నమోదవడాన్ని శాస్త్రవేత్తలు గమనిస్తూనే వస్తున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకునే, ‘‘2000 తర్వాత పుట్టిన యువతరాలు ఈ ఉష్ణోగ్రతల తీవ్రతను చవిచూడకుండా ఉన్న రోజులు లేవు’’ అని మరో ప్రసిద్ధ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ కోల్ (పుణె) వ్యాఖ్యానించారు. ఉత్తరాది నుంచి దక్షిణాది పర్యంతం 1951 తర్వాత 40 డిగ్రీల సెల్సియస్‌కు వీసమెత్తు కూడా తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. క్రమేణా పెక్కు రాష్ట్రాలలో 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరి ప్రజా జీవితాలను దుర్భరం చేస్తూ వచ్చాయి. ఫలితంగా 1992 నుంచి 2015 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వేడిగాలుల కారణంగా అకాల మరణానికి గురైన వారి సంఖ్య 24 వేల మందికి పైగానేనని తేలింది. ఇక 1901–2022 సంవత్సరాల మధ్య కాలంలో చరిత్రకు తెలిసి నంతవరకూ 2022 మార్చి నెల అత్యంత తీవ్రతర ఉష్ణోగ్రతకు తొలి ఆనవాలుగా మిగిలిపోయింది. అంతేగాదు, వర్ధమాన దేశాలను తమ దోపిడీకి గురి చేసేందుకు వలస సామ్రాజ్య పెట్టుబడిదారీ రాజ్యాలకు ఇండో–ఫసిఫిక్ ప్రాంతం ఎలా కేంద్రమవుతూ వచ్చిందో... అదే మోతాదులో నిత్యం వాతా వరణ పరిస్థితులు తారుమారు కావడానికి కూడా కేంద్రమవుతోంది. ఈ దారుణ పరిస్థితులు చివరికి ఏ దశకు చేరుకుంటున్నాయంటే– ఇటీవలనే పదమూడేళ్ల ఆరవ్ సేuŠ‡ అనే వాతావరణ పరిరక్షణకు నడుం బిగించిన ముక్కుపచ్చలారని ఔత్సాహికుడు ఓ పెద్ద చెట్టు బొమ్మ సాయంతో దేశ ప్రజలకొక విజ్ఞానపూర్వకమైన సందేశం ఇచ్చాడు: ‘‘అయ్యా, నా తోటి మానవులారా, నన్ను (చెట్టును) నాశనం చేయకండి. నేను మీకు నీడనూ, ఆహారాన్నీ, నీటినీ, ప్రాణవాయువునూ దానం చేస్తూంటాను’’! అంతేగాదు, ఈ శతాబ్దం ప్రారంభమైన తర్వాత ప్రపంచ ఆహార సంస్థ డైరెక్టర్ జనరల్ డోంగ్యూ అత్యంత శాస్త్రీయమైన పద్ధతుల్లో చెట్లూ చేమల ప్రాధాన్యతను ఉగ్గడిస్తూ విశిష్టమైన ఒక సందేశం ఇచ్చాడు: ‘‘మానవ నాగరికతకూ, వ్యవసాయానికీ, ఆహార భద్రతకూ, గ్రామీణ జీవన స్రవంతికీ... చెట్లూ చేమలు ఎంతగా అని వార్యమైన పరిసరాలో మనం గుర్తించి గౌరవించాలి!’’ పటపటలు, చిటచిటలు... అందుకే వేసవి తాపం ఎందరో కవులకు ‘హాట్ టాపిక్’ అయింది. దీనికిగానూ మన సారస్వతంలో ఇవ్వదగిన ఎన్నో ఉదాహరణ లున్నాయి. 17వ శతాబ్దంలోనే తంజావూరు రఘునాథనాయకుడు తన వాల్మీకి చరిత్రలో వేసవి భీష్మతాపం ఎలా ఉండేదో ధ్వన్యనుకరణ ద్వారా వర్ణించాడు. ‘పటపట/ తటతట/ చిటచిట/ కటకట’ శబ్దాలను ప్రయోగిస్తూ గ్రీష్మాన్ని బొమ్మకట్టాడు. ‘పటపట పగిలెన్ కుంభిణి తటతట పథికుల మనంబు చల్లడపడియెన్ చిటచిట ఎగసెన్ దవిశిఖి కటకట గ్రీష్మంబు ఒకింత కనబడునంతన్’. అంతేగాదు, దావాగ్ని మూలాన మండిపోతున్న కొండలు, బంగారు ‘మలాము’ వేసినట్లు మెరిసిపోయాయట! ఎటుచూసినా ‘అఖండ దావాగ్ని శిఖలే’ అల్లుకుపోయాయన్నాడు! ఇక చలిగొండ ధర్మన్న కవి (చిత్ర భారతం) కూడా నిప్పులు చెరిగే వేసవి తీవ్రతను ‘మిటమిట/ పెటపెట/ బొటబొట/ చిటచిట’ శబ్దాలతో వర్ణించకుండా ఉండలేకపోయాడు! అలాగే ‘వైజయంతీ విలాసం’లో సారంగు తమ్మయ్య వేసవిలో భూమి ‘వేడి మంగలం’లా సెగలు కక్కిందన్నాడు. చివరికి భూమికి దిగి రావడానికి ఇష్టం లేక మంచుకొండను కౌగిలించుకుని కూర్చున్న శివపార్వతుల్ని సహితం భూమ్మీదనున్న చెట్ల నీడను ఆశ్రయించేటట్టు చేసినవాడు ఎవరో కాదు, మన కొంటె కోణంగి శ్రీనాథుడే సుమా! ‘హరుడు కైలాస కుధర నాథాగ్ర వసతి/ విడిచి వటమూల తలముల విశ్రమించె’ అన్నాడు. ఇంకో కొంటె కోణంగి తెనాలి రామకృష్ణుడు మండు వేసవిని పోలికలేని వస్తువులతో పోల్చి వర్ణించడంలో దిట్ట. ‘పంపా తరంగ రింఖణ ఝంపా సంపాద్యమాన జలకణ రేఖా సంపాత శితలానల సంపద వదలించె పరమశైవోత్తంసున్’. అలాగే మేఘాలు కమ్ముకు రావడాన్నీ, వర్షించడాన్నీ, వాటి క్రమాభివృద్ధినీ సూచించేలా పాలవేకరి కదిరీపతి ‘శుక్తసప్తతి’ రచనలో ప్రకృతిని ఎంతో చలనశీలంగా వర్ణించాడు. ఎంతగానో ఆశావహు లమై ఉరుములు మెరుపుల కోసం ఎదురుచూస్తున్న ఈనాటి మనల్ని ఎలా ఆకట్టుకోజూశాడో గమనించండి: ‘‘అప్పుడొక్కించుక మబ్బు గానబడి యింతై అంతౖయె మించి విష్ణుపదం బంతయు నాక్రమించి జన సందోహే క్షణాంధత్వ క్వచ్చపలంబై కడు గర్జిత ప్రబలమై సంజాత ఝంఝా మరుద్విపులంబై ఒక వాన వట్టె వసుధా విర్భూత పంకంబుగన్... పెళ పెళారని బెడిదంపు పిడుగులురల ఝల్లు ఝల్లున పెనుజల్లు చల్లుచుండ బోరుబోరున వర్షంబు ధారలురిసె’’! ఇప్పుడు ఆ ధారల కోసమే జనులు పడిగాపులు పడి ఉన్నారు. కానీ, ఎటుతిరిగీ మరో నాలుగేళ్లపాటు తీవ్ర ఉష్ణోగ్రతల మధ్యనే కాపురాలు వెలగబెట్టక తప్పదన్న తాజా హెచ్చరికలే ఆశలమీద నీళ్లు చల్లుతున్నాయి. అయినా వర్షాగమ వార్తలు ఏ మూల నుంచి వినబడినా ఆప్తవాక్యంగానే భావించుకోవాలి. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఇది ఎదురుకాల్పుల కనికట్టు కథ!
‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్ పోలీసులు చెబుతున్న ‘కట్టుకథ’ అని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చింది. సుప్రీం కోర్టు కూడా ఎన్కౌంటర్ దోషులెవరనేది ఇప్పుడు రహస్యమేమీ కాదని పేర్కొంది. ‘దిశ’ నిందితుల్లో ముగ్గురు మైనర్ యువకులు. వాళ్ళు మైనర్లని సాధికారికంగా నిర్ధారణకు వచ్చాకనే పోలీసుల ఆరోపణలు ‘నమ్మశక్యం కానివి’గా కమిషన్ పేర్కొంది. అలా ఈ వ్యవహారంలో తప్పంతా పోలీసుల మీద పడుతోంది. అయితే యావత్ దేశంలో జరుగుతున్న ఎన్కౌంటర్ కట్టుకథలకు కేవలం పోలీసులను నిందించడం ఘోరమైన పాక్షిక వైఖరి అవుతుంది. అధికారంలో ఉన్నవారి అనుయాయుల ఎరుక లేకుండా పోలీసు యంత్రాంగం తనకు తానుగా తప్పుడు కేసులకు, ఇలాంటి ఎన్కౌంటర్లకు పాల్పడ్డానికి సాహసిస్తుందా? ‘‘భారతదేశంలో 1984–2020 మధ్య దేశ పోలీస్ యంత్రాంగం ప్రవర్తన మారలేదు. వృత్తి బాధ్యతల పరంగానూ, పోలీస్ యంత్రాంగాన్ని నిర్వహించే పాలకుల ఆచరణలోనూ మార్పు లేదు’’ – రిటైర్డ్ జడ్జి ఢీంగ్రా ‘‘చటాన్‌పల్లి (హైదరాబాద్ శివార్లు)లో ‘దిశ’ హత్య కేసులోని నలుగురు నిందితుల ఎన్కౌంటర్ ఓ కట్టుకథ. పిన్న వయస్సు యువకు లపై జరిగిన ఈ ఎన్కౌంటర్లో సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. తక్షణ న్యాయం కోసం పోలీసులు ఈ ఎన్కౌంటర్ జరపడం అనేది ఆమోదయోగ్యం కాదు. ఎన్కౌంటర్ జరి పిన పోలీసులపై చర్యలు తప్పనిసరి. హత్యానేరం కింద పోలీసులపై విచారణ చేయాల్సిందే.’’ – జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక (20.5.2022) ‘‘ఎన్కౌంటర్లో దోషులెవరో కమిషన్ గుర్తించింది. ఇందులో దాపరికమంటూ లేదు, కేసును ఇక తెలంగాణ హైకోర్టు విచారిస్తుంది.’’ – సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటన (21.5.2022) ఈ సందర్భంగా ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి అన్నింటి కన్నా ఆశ్చర్యకరమైనది... జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ సాధికార నివేదికను పొక్కనివ్వకుండా చూడమని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు పదేపదే విజ్ఞప్తులు చేసుకోవడం. కానీ, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ కమిషన్ నివేదికను తదుపరి చర్యలకు తెలంగాణ హైకోర్టుకు పంపించారు. అంతకుముందు పోలీసులు జరిపిన ఎన్కౌంటర్ హత్యలపై సీబీఐ ప్రత్యేక విచారణను కోరుతూ పిటిషనర్ న్యాయవాది జి.ఎస్.మణి ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాని ఫలితంగానే 2019 డిసెంబర్లో జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్‌ను సుప్రీంకోర్టు నియమించాల్సి వచ్చింది. పిటిషనర్ న్యాయవాది మణి ‘మహిళలపై తరచుగా జరుగుతున్న హత్యలను నిరోధించడంలో విఫలమవుతున్న వైనాన్ని గుర్తించకుండా ఉండేందుకే పోలీసులు ఇలాంటి ఎన్కౌంటర్లకు బుద్ధిపూర్వకంగా తలపెడుతున్నారని పేర్కొ న్నారు. అందుకే సీబీఐనిగానీ, ప్రత్యేక విచారణ బృందాన్నిగానీ రంగంలోకి దించాలని కోరారు. ఈ విజ్ఞప్తులు అన్నింటి ఫలితంగానే సిర్పూర్కర్ కమిషన్ నియామకం జరిగింది. 14 మాసాలకు పైగా చటాన్‌పల్లి ఎన్కౌంటర్ భాగోతంపై పూర్తి విచారణ జరిపింది. చివరకు ‘ఈ ఎన్కౌంటర్ కట్టుకథ’ అని తేల్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ప్రత్యేక తెలంగాణలోనూ... ఆ మాటకొస్తే యావత్తు దేశంలో జరుగుతున్న ‘ఎన్కౌంటర్’ కట్టు కథలకు కేవలం పోలీసులను మాత్రమే నిందించడం ఘోరమైన పాక్షిక వైఖరి అవుతుంది. ఎందుకంటే, ‘శివుడికి తెలియకుండా చీమైనా కుట్టద’న్న సామెత మనకు ఉగ్గుతో పోసిన పాఠం ఉండనే ఉంది కదా! అలాగే పాలనాధికారంలో ఉన్నవారి అనుయాయుల ఎరుక లేకుండా పోలీసు యంత్రాంగం తానుగా తప్పుడు కేసులకు, ఇలాంటి ఎన్కౌంటర్లకు పాల్పడ్డానికి సాహసిస్తుందా?! పాలకుల స్వార్థ ప్రయోజనాల్ని కనిపెట్టి, కాపు కాసుకుని ఉండే పోలీసు వర్గాలు మాత్రమే ఇలాంటి ఎన్కౌంటర్లకు సిద్ధమవుతాయి. ఈ చొరవనే ‘పిలవని పేరంటం’ అనేది! అసలు, సమాజంలో విచ్చలవిడిగా మహిళలపై రకరకాల హత్యలకు, అరాచకాలకు పాల్పడ్డానికి కారణం... భారత సామాజిక వ్యవస్థ అరాచక, దోపిడీ వ్యవస్థగా మారడం. ఫ్యూడల్ (భూస్వామిక) వ్యవస్థ పూర్తిగా కనుమరుగు కాకముందే మరింతగా ప్రజలపై ప్రత్యక్ష, పరోక్ష దోపిడీకి ‘గజ్జె’ కట్టిన కారణంగానే భారత సామాజిక స్థితిగతులు 75 ఏళ్ల తర్వాత కూడా అధోగతికి చేరుతూనే ఉన్నాయి. ఇది మనం మనం కళ్లారా చూస్తున్న దృశ్యమే. ఈ పరిస్థితికి జవాబుగానే ‘దిశ’ కేసు విచారణలో జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ‘ఎదురుకాల్పుల నివారణకే ఎన్కౌంటర్ జరపాల్సి వచ్చిందన్న’ పోలీసు అధికారుల సాకును... నమ్మలేకనే ‘కట్టుకథ’గా నిర్ధారించవలసి వచ్చింది. ‘ఉగ్రవాదుల’ పేరిట జరిగే ఎదురు బొదురు కాల్పుల సంగతి వేరు. అది సమ ఉజ్జీల మధ్య ‘సమరశంఖం’ కావొచ్చు! కానీ ‘దిశ’ దారుణ హత్యకేసు పేరిట పోలీసులు జరిపిన ‘ఎన్కౌంటర్’ కేసు సందర్భంగా నిందితులెవరో జాతీయ స్థాయి కమిషన్ తేల్చి చెప్పింది. అందువల్లనే ఇంక అది ఏమాత్రం రహస్యం కాదని జస్టిస్ రమణ కూడా ప్రకటించాల్సి వచ్చింది. ‘రావలసిన తీర్పు ఎంతకాలం ఆలస్యమైతే, ఆ మేరకు కక్షిదారులకు అంతకాలం అన్యాయం జరిగినట్టే’ అని న్యాయ చట్టం ఘోషిస్తున్నా సరే, మనకు చలనం లేదు! మరొక విశేషమేమంటే మన దేశంలోనే ఒక భూమి తగాదాలో 108 సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పు రావడం చూశాం మనం! ఇప్పుడు తాజా కేసులోని ఎన్కౌంటర్లో చనిపోయిన నలుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్ యువకులు. వాళ్ల స్కూల్ రికార్డులను సైతం పరిశీలించి మరీ వాళ్లు మైనర్లని సాధికారికంగా నిర్ధారణకు వచ్చిన తర్వాతనే సిర్పూర్కర్ కమిషన్ పోలీసుల ఆరోపణలు ‘నమ్మశక్యం కానివి’గా తీర్పిచ్చింది! అలాగే, సిర్పూర్కర్ కమిషన్ నివేదికను బహిరంగ పర్చకుండా రహస్యంగా కవర్లో పెట్టి కోర్టు వారు కింది కోర్టులకు పంపాలిగానీ, బహిరంగపరచ రాదనే వాదనను ప్రధాన న్యాయమూర్తి తోసిపుచ్చడం ప్రశంసనీయం. అంతేకాదు, ప్రభుత్వం తరఫు న్యాయవాది శ్యామ్ దివాన్... కమిషన్ నివేదికను బట్టబయలు చేస్తే న్యాయపాలనపై తీవ్రమైన ప్రభావం ఉంటుంద న్నారు. కాబట్టి ‘సీల్డ్ కవర్’లో పెట్టి పంపాలని వాదించారు. ఈ వాదనను కమిషన్ సభ్యురాలైన జస్టిస్ కోహ్లీ నిరాకరించారు. ఈ సమయంలోనే ప్రధాన న్యాయమూర్తి రమణ... ‘దేశ భద్రతకు ఏర్పడిన తీవ్ర ప్రమాదకర సన్నివేశం ఏదైనా ఉండి ఉంటే దాన్ని పరిశీలించవచ్చు. ఇది తెలంగాణ పోలీసు ఎన్కౌంటర్ కేసు కాబట్టి ‘సీల్డ్ కవర్’ రాజకీయం ఇక్కడ కుదరద’న్నారు! రక్తసిక్తమైన ఢిల్లీ పోలీసుల చేతులు, చేతల గురించి ప్రస్తావిస్తూ ‘ఢిల్లీ పోలీసులంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పోలీసులని అర్థమ’ని సుప్రసిద్ధ భారత అభ్యుదయ, ప్రజాస్వామికవాద ‘కారవాన్’ పత్రిక సంపాదకుడైన ప్రభిజిత్ సింగ్ వ్యంగ్యీకరించడం(మే – 2022) ఇక్కడ ప్రస్తావనార్హం. ‘దిశ’ కేసులో ఉభయపక్షాల బాధితులూ మహిళలూ, కుటుం బాలే. కాబట్టి సజ్జనార్ నాయకత్వాన పోలీస్ ఎన్కౌంటర్లో హతులైన యువకుల వివరాలతో ప్రాథమిక కేసును నమోదు చేయా లని తెలంగాణ మహిళ, ట్రాన్స్‌జెండర్ సంస్థల సంయుక్త సంస్థ డిమాండ్ చేసింది. పోలీసులను (కమిషనర్ సజ్జనార్‌తో సహా) పేరు పేరునా పేర్కొంటూ కమిషన్ అభిశంసించిన అధికారులను అందరినీ అరెస్టు చేయాలని కోరింది. ఆ తర్వాతనే 2019 డిసెంబర్లో సుప్రీం కోర్టు కమిషన్‌ను నియమించాల్సి వచ్చింది. నేటి భారత మహిళల స్థితి గతుల్ని పరామర్శించుకుంటూ, సమీక్షించుకుంటూ... ఓ మహిళా మూర్తి ఆలోచనల్ని ఇక్కడి పేర్చుకుందాం. ‘‘వెలుగు రేకలు ప్రసరించని చీకటిలో ఏ ఉదయ కుసుమమూ విచ్చుకోదు నిరాశా నిస్పృహలను తరిమేసి / దిగంతాలను తాకి వచ్చే వేకువ పిట్టనొకదాన్ని ఈ భూగోళంపై వదలాలి విశ్వాసాన్ని కూడదీసుకోలేని జన కూడలిలో ఏ రేపటి పసితనమూ గుబాళించదు దురహంకారం మెడలు విరిచి – విశాల ప్రపంచాన్ని ఒడిసి పట్టుకునే గర్భాశయానికి ఏ నేలైనా తలవొంచి నిలబడాల్సిందే...’’ – వైష్ణవిశ్రీకి కృతజ్ఞతతో... ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
నల్ల చట్టానికి అమృతోత్సవాలా?
సామ్రాజ్యవాదులు ఇండియాలో తమ ఉనికిని కాపాడుకోవడానికిగానూ పౌరుల ప్రతి కదలికనూ, న్యాయమైన వారి నిరసనలనూ అడ్డుకున్నారు. దానికోసం దేశద్రోహమనే నల్లచట్టాన్ని తెచ్చారు. అయితే దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతూ ఆ వలస పాలనావశేషాలు మనల్ని ఇంకా వదిలిపోవడం లేదు. ఒక కిరాతక చట్టానికి కూడా ‘అమృతోత్సవం’ జరుపుకోవలసి రావడం ఒక దుర్భర సన్నివేశం! సమకాలీన ప్రభుత్వ నిర్ణయాలనూ, పనితీరునూ విమర్శించగల స్వేచ్ఛ ఉండటమే ప్రజాస్వామ్యానికి కీలకమనీ... ప్రజాస్వామ్యంలోని ఈ కీలకమైన లక్షణాన్నే దేశద్రోహ చట్టం చంపేస్తుందనీ... అది అభిశంసననూ, ప్రతిపక్షాన్నీ శత్రువుగా భావిస్తుందనీ కె.ఎం.మున్షీ ఏనాడో చెప్పిన మాటలను మనం మరిచిపోకూడదు. కీలెరిగి వాత పెట్టమన్నారు! అదెప్పుడో చేయవలసిన పని. అయినా పాలకుల, అధికారగణాల స్వార్థపూరిత రాజకీయ, నిరంకుశ విధానాలు, ఆచరణ మూలంగా గత 75 సంవత్సరాలుగా యథేచ్ఛగా పట్టిపీడిస్తూ వచ్చిన వలస పాలనావశేషాలు మనల్ని ఇంకా వదిలిపోవడం లేదు. ‘దేశద్రోహం’ అనే ముసుగులో మిగిలిపోయిన ఒక కిరాతక చట్టానికి కూడా ‘అమృతోత్సవం’ జరుపుకోవలసి రావడం ఒక దుర్భర సన్నివేశం! స్వతంత్ర భారతానికే ఎంతమాత్రమూ పొసగని సందర్భం! ఈ దుర్మార్గపు చట్టం గురించి 1951లో నేటికి 71 ఏళ్ళ క్రితమే పంజాబ్ హైకోర్ట్ ఘాటుగా వ్యాఖ్యానించింది. ‘124–ఎ’ నేర నిబంధనను ‘ఇది అత్యంత ప్రమాదకరం’ అని బాహాటంగా ప్రకటించింది! అయినా సరే, ఈ 75 ఏళ్ళలోనూ కాంగ్రెస్, బీజేపీ పాలకులు ఆ వలస చట్టాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం యధేచ్ఛగా వాడుకుంటూనే వచ్చారు. ఈ క్షణంలోనూ వాడు కొంటున్నారు. ఈ విశృంఖలత్వానికి అడ్డుకట్ట కట్టేందుకు సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తీ, మరికొందరు దేశభక్తులయిన న్యాయ మూర్తులూ సిద్ధమయ్యారు. ప్రజలకు సిద్ధించవలసిన న్యాయాన్ని దక్కనివ్వకుండా అడ్డుకునే ధోరణి దేశంలో అరాచకానికి ‘రాచబాట’ వేస్తుందనీ, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి వివాదాల తక్షణ పరిష్కారమే సమాధానమనీ ప్రకటించారు. తమకు సకాలంలో న్యాయం జరగనప్పుడు ప్రజాబాహుళ్యం అన్యమార్గాలు వెతుక్కు న్నప్పుడు దేశ న్యాయవ్యవస్థే కుప్పకూలిపోయే ప్రమాద ముందని గౌరవ న్యాయమూర్తులు ప్రకటించాల్సి వచ్చింది. దేశప్రజల గౌరవాన్నీ, హుందాతనాననీ, ఓర్పునూ, వారి హక్కుల్నీ గుర్తించి, గౌరవించినప్పుడు మాత్రమే దేశంలో శాంతి నెల కొంటుందని వారు హితవు చెప్పవలసి వచ్చింది. సామ్రాజ్యవాదులు, ఇండియాలో తమ ఉనికిని కాపాడు కోడానికిగానూ పౌరుల ప్రతి కదలికనూ, న్యాయమైన వారి నిరసనలనూ అడ్డుకోవడానికి నల్లచట్టాన్ని ఇష్టారాజ్యంగా వాడుకుంటూ వచ్చారు. పౌరులు తమ హక్కుల్ని రక్షించుకోవడానికి చేసే ప్రయత్నాలను ‘దేశద్రోహం’గా చిత్రించడానికి ‘124–ఎ’లోని తుచ్ఛమైన నిబంధనలను అడ్డూ అదుపూ లేకుండా వాడుకున్నారు. వారి కోవలోనే ఇప్పటికీ దేశ స్వాతంత్య్రానంతరం 75 ఏళ్ల తర్వాత కూడా మన పాలకులు, వారి వందిమాగధ నిరంకుశ అధికార గణం వలస చట్టాన్నీ, అందులోని ప్రజా వ్యతిరేక నిబంధనలనూ జాగ్రత్తగా కాపాడుకుంటూ, వినియోగించుకుంటూ వస్తున్నారు. విద్రోహ రాజకీయానికి ‘పుట్టుకతోనే పుట్టిన రాజపుండు’ ఇది. కనీసం 1951లో పంజాబ్ హైకోర్టు హెచ్చరిక తర్వాతనైనా దేశ పాలకులకు చీమకుట్టినట్టు కూడా కాలేదు. ఈ తప్పుడు చట్టనిబంధనల కిందనే వలస పాలకులు జాతీయ నాయకులైన బాలగంగాధర తిలక్, గాంధీ తదితరులను అరెస్ట్ చేశారు. ‘దేశద్రోహ’ నేరారోపణ కింద అరెస్టులతో విజయకుమార్ సిన్హా లాంటి భగత్‌సింగ్ సహచరులను అండమాన్ దీవులలో నిర్బంధించారు. భారతీయ జనతా పార్టీ పాలనలో 2014–19 మధ్యకాలంలో అత్యధిక కేసులు పౌరహక్కుల నాయకులపైన, ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థుల పైన, వారి నాయకులపైన పెట్టారు. వలస పాలకుల ‘దేశద్రోహ’ చట్టం ముసుగు కిందనే కేసులు బనాయించి ఈ రోజుకీ వేధిస్తూనే ఉన్నారు. అలాగే ‘మిలార్డ్’ అనే పద ప్రయోగం కనుమరుగవడానికి న్యాయస్థానాలు ఈ 75 ఏళ్ళలోనే తంటాలు పడాల్సి వచ్చింది! నిజానికి మహదానంద ఘడియలలో జరుపుకోవాల్సిన స్వాతంత్య్ర దినోత్సవ 75 ఏళ్ళ అమృతోత్సవాల సమయంలో కూడా బీజేపీ పాలకులూ, పాలనా యంత్రాంగమూ ఈ క్షణం దాకా వలస పాలకుల దేశద్రోహ చట్టాన్ని సమర్థిస్తూనే ఉన్నారు. గట్టిగా ఆందోళన వచ్చినప్పుడల్లా చట్ట ‘‘నిబంధనలను పునః పరిశీలించే’’ విషయం అలోచిస్తామనీ కప్పదాట్లు వేస్తున్నారు. వలస పాలనావశేషాన్ని కాపాడటానికే సిద్ధమైనట్లు వారి మాటలూ, ఆచరణా వెల్లడిస్తున్నాయి! బహుశా ఇలాంటి పాలకుల ప్రవర్తనను చూసే భారత రాజ్యాంగ నిర్ణయ సభ ప్రధాన బోధకుడు, రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బాహాటంగా ఇలా ప్రకటించి ఉంటాడు: ‘‘రాజ్యాంగ నిబంధనలకు, వాటి నైతికతకు కట్టుబడి ఉండే తత్వం పౌరుల్లో సహజంగా నెలకొని ఉండే గుణం కాదు. అందువల్ల ఆ సద్గుణాన్ని మనం పెంచి పోషించాలి. ఈ విషయంలో మన ప్రజలు రాటుతేలాల్సి ఉంది. ఎందుకంటే, మన భారతదేశం ప్రధానంగా ప్రజాస్వామ్య వ్యతిరేక భావాలతో కూడుకుని ఉంది. అందువల్ల భారతదేశంలో ప్రజాస్వామ్య లక్షణం అనేది పైపై ‘సోకే’ సుమా!’’ కనుకనే బాలగంగాధర తిలక్, గాంధీలను ‘దేశద్రోహ’ (వలస) చట్టం కింద అరెస్టు చేసి, కోర్టులలో విచారిస్తున్న సమయంలో... భారత రాజ్యాంగం మౌలిక ప్రజాస్వామిక లక్షణాల్ని సమర్థిస్తూ సుప్రసిద్ధ జాతీయవాది కె.ఎం.మున్షీ రాజ్యాంగ నిర్ణయ సభలో మాట్లాడుతూ– వలస చట్టంలోని ‘దేశద్రోహం’ పదాన్ని అరువు తెచ్చుకుని స్వతంత్ర భారతంలో దాన్ని ఉపయోగించడానికి వీల్లేదని ప్రకటించారు. ఆ పదం పౌరుల అభిప్రాయ ప్రకటననూ, పౌరస్వేచ్ఛను అణచివేస్తుందనీ భారత శిక్షాస్మృతిలోని ఇండియన్ పీనల్ కోడ్‌లోని ‘124–ఎ’ సెక్షన్‌ను మనం కొనసాగించదలచామన్న తప్పుడు అర్థాన్ని ప్రజల మనస్సుల్లో కల్పించినట్టవుతుందనీ, ఆ సెక్షన్ రద్దు కావలసిందేననీ, మున్షీ కోరారని మరచిపోరాదు! 1950వ దశాబ్దంలో రెండు హైకోర్టులు పౌరస్వేచ్ఛను ‘124–ఎ’ హరించి వేస్తుందని స్పష్టమైన తీర్పు ఇచ్చాయి. అయితే 1962లో ‘కేదార్నాథ్ సింగ్ వర్సెస్ బిహార్ స్టేట్’ కేసులో సుప్రీంకోర్టు అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం దీనికి విరుద్ధమైన తీర్పును వెలువరించింది. భారత రాజ్యాంగ సభ స్ఫూర్తిని తిరస్కరిస్తూ శాంతి ప్రయోజనాల దృష్ట్యా వలస చట్టంలోని ‘124–ఎ’ సెక్షన్ ఉండాల్సిందేనంది. ఈ వాదనను పూర్తిగా తిరస్కరిస్తూ మద్రాసు హైకోర్టులోని సుప్రసిద్ధ న్యాయవాది సుహ్రిత్ పార్థసారధి ఇలా స్పష్టం చేశారు: ‘‘రాజ్యాంగ నిర్ణయ సభలో మున్షీ స్పష్టం చేసినట్టుగా– సమకాలీన ప్రభుత్వ నిర్ణయాలనూ, పనితీరునూ విమర్శించగల స్వేచ్ఛ ఉండటమే ప్రజాస్వామ్యానికి కీలకం. ప్రజాస్వామ్యంలోని ఈ కీలకమైన లక్షణాన్నే దేశద్రోహ(సెడిషన్) చట్టం చంపేస్తుంది. అది అభిశంసననూ, ప్రతిపక్షాన్నీ శత్రువుగా భావిస్తుంది. ఒక్కమాటలో ప్రజాస్వామ్య రిపబ్లిక్ మౌలిక పునాదినే సెడిషన్ కుళ్లబొడుస్తుంది.’’ ఇదిలా ఉండగా ‘చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం’(ఉపా) పేరిట జరుగుతున్నది ఏమిటంటే, శాంతియుతంగా చేస్తున్న భిన్నాభిప్రాయ ప్రకటన స్వేచ్ఛను కూడా హరించడం! అందుకని తక్షణం జరగాల్సిన పని పౌరస్వేచ్ఛకు రాజ్యాంగం ఇచ్చిన విస్పష్టమైన హామీలను పునరుద్ఘాటించాలి. దానికిగానూ పౌరులకు ఉన్న భావ ప్రకటనా స్వేచ్ఛను అరమరికలు లేకుండా గౌరవించ డమూనని బాధ్యతగల న్యాయమూర్తులు, న్యాయవాదులూ భావిస్తు న్నారు. చివరికి మన పాలకులు ఎలా తయారయారంటే, ఒక్కసారైనా సుమతీ శతక కారుణ్ణి తలచుకోవడం శ్రేయస్కరం అనిపిస్తుంది. సమయం చూసుకొని, ఏ సమయానికి ఏది తగినదో దానికి టంకప్పొడల్లే ఠక్కున అతుక్కుపోయే మాటలు ఆ క్షణానికి పలికి, తాను బాధపడకుండా తప్పించుకు తిరిగే నాయకుడే లోకంలో ధన్యుడన్నాడు. బద్దెన! ఎంత అనుభవమండీ! నేటి భారత ప్రజల అనుభవం కూడా ఇదే సుమా! కాకపోతే ఏమిటి చెప్పండి, తాజ్మహల్నట ‘తేజోమహల’ని పిలవాలట! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
అందుకే రష్యాను సమర్థించక తప్పదు
అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడల్లా ఒక యుద్ధం తరుముతూ వస్తోంది. ఉక్రెయిన్‌లోని చమురు సంపదపైన కన్నువేసిన పశ్చిమ రాజ్యాలు రష్యా నుంచి ఉక్రెయిన్ను విడగొట్టేందుకు చాలాకాలంగా కుట్ర పన్నుతూ వచ్చాయి. సామ్రాజ్యవాద కూటమి చేతిలో కీలుబొమ్మగా మారిన ఉక్రెయిన్ నేటి పతనావస్థను చేజేతులా ఆహ్వానించింది. ‘శాశ్వత శాంతి కోసం శాశ్వత యుద్ధం’ అన్న అమెరికా లక్ష్యం నిజానికి శాశ్వత శ్మశాన శాంతి మాత్రమే! తమకు భౌగోళికంగానూ, సైద్ధాంతికంగానూ ఏ సంబంధమూ లేని ఉక్రెయిన్‌లో వనరుల దోపిడీ కోసమే తిష్ఠ వేసిన సామ్రాజ్యవాద కూటమిని నిష్క్రమింపజేయడమే శాంతికాముక దేశాల కర్తవ్యం కావాలి. అందువల్లే రష్యా రక్షణకు పుతిన్ తీసుకుంటున్న చర్యలను సమర్థించక తప్పదు. ‘‘మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభ మయినట్టే. శాంతి స్థాపనాయత్నంలో విఫల మైనప్పుడల్లా ప్రజల్ని యుద్ధంలోకి నెడతారు. ఇది నేడు పునరావృతం అవుతున్న సమకాలీన చరిత్ర. అమెరికా భీకరమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న దరిమిలా ముంచుకొచ్చింది ఏమిటి? యుద్ధం. ‘డాట్ కాం’ సంక్షోభం తరువాత ముమ్మరించిందేమిటి? యుద్ధం. మనం జీవిత కాలంలో కనీవినీ ఎరుగనంతటి పెను విపత్కర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోబోతున్నాం. మనం అంటే ప్రపంచ ప్రజలం కోవిడ్–ఫ్లూతో ప్రారంభమైన యుద్ధం నుంచి, ఉక్రెయిన్ యుద్ధానికి చేరుకున్నాం. ఇక్కడినుంచి ప్రపంచ యుద్ధం వైపుగా, మూడో ప్రపంచ యుద్ధానికి సాగిపోతున్నాం. ఈ దశలో అమెరికా, బ్రిటన్, నాటోలు రష్యాలో పశ్చిమ రాజ్యాల సైనిక స్థావరంగా పెంచి పోషిస్తున్న ఉక్రెయిన్ రక్షణ పేరిట మరిన్ని ఆయుధాలను గుప్పించే యత్నంలో ఉన్నాయి.’’ – సుప్రసిద్ధ ప్రపంచ పరిణామాల విశ్లేషకుడు,పరిశోధకుడు గెరాల్డ్ సిలెంటీ మరొక ప్రసిద్ధ అమెరికా రాజకీయ వ్యాఖ్యాత, పరిశోధకుడు అయిన స్టీఫెన్ లెండ్‌మాన్ మాటల్లో – రష్యాలో అంతర్భాగమైన ఉక్రెయిన్‌లోని చమురు సంపదపైన కన్నువేసిన అమెరికా నేతృత్వంలోని పశ్చిమ రాజ్యాలు, నాటో సైనిక కూటమి... రష్యా నుంచి ఉక్రెయిన్ను విడ గొట్టేందుకు కుట్ర పన్నుతూ వచ్చాయి. ఇందుకు గోర్బచేవ్ సోవి యట్‌ను రెక్జావిక్ (ఐస్లాండ్ రాజధాని) సమావేశంలో ఆంగ్లో– అమెరికన్ సామ్రాజ్యవాదులకు పాదాక్రాంతం చేయడంతో సోవియట్ రిపబ్లిక్లలో పాశ్చాత్య రాజ్యాల జోక్యానికి మరింతగా దారులు తెరిచి నట్టయింది. చాపకింద నీరులా పాకుతూ వచ్చిన ఈ దురాక్రమణ పరిణామాల్ని లెండ్‌మాన్ ఇలా వర్ణించాడు: ‘‘అమెరికా పాలకపక్షాలు తమ కంట్రోల్లో లేని దేశాలను సహించలేవు. ఈ విషయంలో చిన్న, పెద్ద దేశాలన్న తారతమ్యం వాటికి ఉండదు’’. అసలు తమ పెత్తనానికీ, అధికార ప్రయోజనాలకూ ప్రపంచ దేశాలు అడ్డు రాకూడదన్నది ఆంగ్లో–అమెరికన్, నాటో దురాక్రమణ కూటమి లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగానే ఉక్రెయిన్ సహజ వనరుల దోపిడీ కోసం సామ్రాజ్యవాద కూటమి పన్నుగడ పన్నింది. కృశ్చేవ్, గోర్బచేవ్ నాయకత్వాలు సోవియట్ యూనియన్ను సోషలిస్టు రిపబ్లిక్‌గా నిలవకుండా దాని విచ్ఛిత్తికి పన్నిన కుట్రకు సోవియట్ రిపబ్లిక్కులు బలయ్యే ప్రమాదం ముమ్మరించింది. అందువల్లే ఉక్రె యిన్ సామ్రాజ్యవాద కూటమి చేతిలో కీలుబొమ్మగా మారి, నేటి పతనావస్థను చేజేతులా ఆహ్వానించింది. ఇంతకుముందు – 2004లోనే ఉక్రెయిన్ రిపబ్లిక్లో అమెరికా ‘ఆరెంజ్ రివల్యూషన్’ పేరిట కుట్ర పన్నింది. అప్పుడు జరిగిన ఉక్రె యిన్ అధ్యక్ష ఎన్నికల్లో రష్యా అనుకూల అభ్యర్థిగా విక్టర్ యానుకోవిచ్ విజయం సాధించాడు. చూస్తూచూస్తూ ఉక్రెయిన్ను సామ్రాజ్యవాద ‘నాటో’ సైనిక కూటమిలో భాగస్వామిని చేయడాన్ని అతను వ్యతిరేకిం చాడు. పశ్చిమ రాజ్యాలతో సాధారణ సంబంధాలు కొనసాగించ డానికి మాత్రమే సానుకూలత వ్యక్తం చేశాడు. అయితే ఉక్రెయిన్‌లో అప్పట్లో ఉన్న పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలకు అనుకూల సుప్రీం కోర్టు యానుకోవిచ్ ఎన్నికను కాస్తా నిష్కారణంగా రద్దుచేసి, పశ్చిమ సామ్రాజ్యవాద దేశాల కూటమి సానుకూల అభ్యర్థి ఎన్నికైనట్టు చిత్రించింది. కానీ ఆరేళ్లలో (2010) తిరిగి ఉక్రెయిన్ రిపబ్లిక్లో జరిగిన ఎన్నికల్లో మరోసారి యానుకోవిచ్ ఘనంగా గెలుపొందాడు. మళ్లీ ఆ పిమ్మట నాలుగేళ్లలోనే (2014) ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులు ఒబామా – బైడెన్లు తలపెట్టిన కుట్రలో బల వంతంగా యానుకోవిచ్ అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. అప్పటికీ క్రిమియన్లూ, డాన్బాస్ ప్రజలూ తాము అభిలషిస్తున్న ప్రజాస్వామిక పాలన కోసం ఫాసిస్టు పరిపాలనను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అందుకు అనుగుణంగానే క్రిమియన్లు అసంఖ్యాకంగా ముందుకొచ్చి రిఫరెండం (జనవాక్య సేకరణ) ద్వారా రష్యాలో చేరడానికి సానుకూలతను వ్యక్తం చేసిన తరువాతనే ప్రస్తుత రష్యా అధినేత వ్లాదిమీర్ పుతిన్, రష్యన్ ఉన్నతాధికారులూ సమ్మతించారు. ఆ మార్గంలోనే డాన్బాస్ ప్రాంత ప్రజలూ అసంఖ్యాకంగా కదిలి డోనెస్క్, లుగాస్క్లతో కలిపి ఉమ్మడిగా ‘ప్రజా రిపబ్లిక్’నూ నెల కొల్పుకున్నారు. అయినాసరే, 2014 ఏప్రిల్‌లో సోవియెట్ రిపబ్లిక్ల పైనా, నాటి ప్రజా బాహుళ్యంపైనా అమెరికన్ సామ్రాజ్యవాద కూటమి జోక్యంతో, ప్రోత్సాహంతో యుద్ధం మొదలైంది. చివరికి రష్యన్ రిపబ్లిక్స్లో ఒకటైన ఉక్రెయిన్ను స్థావరంగా మార్చుకుని, దాని సహజవనరులను దోపిడీ చేస్తూ, రష్యన్ రిపబ్లిక్స్లో శాంతి, సామ రస్యాలను నాశనం చేయడమే ఆంగ్లో–అమెరికన్–నాటో సామ్రాజ్య వాద కూటమి లక్ష్యమంటారు అమెరికన్ వ్యాఖ్యాత స్టీఫెన్ లెండ్‌మాన్. అందులో భాగంగానే రష్యా సరిహద్దుల చుట్టూ బెదిరింపు చర్యగా అమెరికా–నాటో కూటమి తమ సైన్యాలను దఫదఫాలుగా మోహరిం పజేసే ఎత్తుగడలకు పాల్పడిందన్నారు. ‘శాశ్వత శాంతి కోసం శాశ్వత యుద్ధం’ అన్న అమెరికా సామ్రాజ్య వాదం లక్ష్యం శాశ్వత శ్మశాన శాంతి కోసం తహతహలాడుతున్నట్టుగా ఉందని మరో ప్రసిద్ధ విమర్శకుడు గోరే విడాల్ వ్యాఖ్యానించారు. అంతేగాదు, శాశ్వత యుద్ధాలను శాంతికి పవిత్రమైన ఆనవాళ్లుగా అమెరికా భావిస్తోందని ప్రసిద్ధ చరిత్రకారుడు హారీ ఎల్మెర్ బార్నెస్ విమర్శించారు. బహుశా అందుకే ఏనాడో సుప్రసిద్ధ ప్రపంచ అణు శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ‘అణు విచ్ఛిత్తి మన ఆలోచనా ధోరణిని తప్ప అన్నిం టినీ మార్చేసిం’దని చెబుతూ– ‘‘మన ఆలోచనకు కూడా అందనంత మహా విపత్తు వైపు మనం పయనిస్తున్నాం. కనుక మానవాళి బతికి బట్టకట్టాలంటే మన ఆలోచనా ధోరణిలోనే సమూల మార్పు రావలసి ఉంటుంది’’ అన్నాడు. అణ్వస్త్ర పితామహుడైన రాబర్ట్ ఓపెన్ హీమర్ ‘నేనే మృత్యువుని, ప్రపంచ వినాశకుడిని’ అంటూ భగవద్గీతను ఉదాహరిస్తూ మనో వేదనను వ్యక్తం చేశారు. ఇంతమంది ఉద్దండుల్ని మనం ఎందుకు ఉదాహరించుకోవలసి వస్తోందంటే... సామ్రాజ్యవాద దుష్ట కూటమి కుట్రలకూ, కుహకాలకూ నిలయమైన ఉక్రెయిన్ యావత్తు రష్యా ఉనికికే ప్రమాదకరంగా మారినందుననేనని ఇప్పటికైనా గ్రహించాలి. రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసిన నాజీ జర్మనీ కుట్రలకు బలైన పుడు... స్టాలిన్ నాయకత్వాన అనుసరించిన ఎత్తుగడల వల్లనే సోవి యట్ సోషలిస్టు రిపబ్లిక్ తాను బతికి బట్టకట్టడమేగాక యావత్ ప్రపంచ దేశాల రక్షణకు ‘ఏడుగడ’గా నిలబడింది. చివరికి హిట్లర్ చావు కూడా స్టాలిన్ యుద్ధతంత్రం ద్వారానే ఖాయమైంది! అంత వరకూ నాటకాలాడుతూ వచ్చిన అమెరికా–బ్రిటన్ –ఫ్రాన్స్ అధినే తలు స్టాలిన్‌కూ, సోవియట్కూ కృతజ్ఞతలు తెల్పుకోవలసి వచ్చింది. అలాంటి ఘట్టాలే ప్రస్తుతం ఆంగ్లో–అమెరికన్–నాటో కూటమి కుట్రలకు బలవుతున్న ఉక్రెయిన్ వల్ల రష్యా విషయంలోనూ పునరా వృతం అవుతున్నాయి. అందుకే తమకు భౌగోళికంగానూ, సైద్ధాంతి కంగానూ ఎలాంటి సంబంధమూ లేని ఉక్రెయిన్‌లో కేవలం వనరుల దోపిడీ కోసం తిష్ఠ వేసిన ఆంగ్లో–అమెరికన్–నాటో సామ్రాజ్యవాద సైనిక కూటమిని అక్కడినుంచి నిష్క్రమింపజేయడమే శాంతికాముక దేశాల, ప్రజల కర్తవ్యంగా ఉండాలి. అందుకే రష్యా రక్షణకూ, ఉక్రె యిన్ రిపబ్లిక్ పరిరక్షణకూ రష్యన్ ప్రభుత్వమూ, దాని అధ్యక్షుడుగా పుతిన్ తీసుకుంటున్న చర్యలను సమర్థించక తప్పదు. సామ్రాజ్య వాదుల చంకలో దూరిన ఉక్రెయిన్ అస్తుబిస్తు పాలకవర్గం వల్ల మొత్తం రష్యా ఉనికికే ప్రమాదం ఏర్పడిన దశలో ప్రపంచ ప్రజలు కొమ్ముకాయవలసింది – కేవలం పుతిన్‌కూ, రష్యా రక్షణకూ, ఉక్రెయిన్ ప్రజల రక్షణకూ మాత్రమే! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ప్రజాస్వామ్య లక్ష్యాలు కాపాడుకోవాలి
రాజ్యాంగం కనుసన్నల్లో గాక తమ చేతివాటం కొద్దీ రాజ్యాంగ సంస్థల్ని స్వప్రయోజనాలకు వినియోగించుకోవడం చూస్తూనే ఉన్నాం. అన్ని బాధ్యతా యుత సంస్థలూ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడి తీరాల్సిందేనని ఇటీవల సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ ర మణ వ్యాఖ్యానించడం గమనార్హం. సీజే చేసిన ఈ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే... ‘న్యాయ వ్యవస్థమీద కూడా 1,600కి పైగా ఫిర్యాదులూ, కేసులూ ఉన్నా’యని లోక్‌సభలో కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజూ ప్రకటించి ఎదురుదాడికి దిగారు. ఈ విధంగా రాజ్యాంగ విభాగాలు లేదా సంస్థల మధ్య పరస్పర విమర్శలు పెరగడం దేశానికి శ్రేయస్కరం కాదు. ప్రజాస్వామ్య లక్ష్యాలను కాపాడుకోవలసిన అవసరం, బాధ్యత అందరి మీదా ఉంది. మహా కోటీశ్వరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ ఎందుకన్నాడోగానీ ఇటీవల ఓ గొప్ప సత్యాన్ని గుర్తు చేశాడు: ‘‘ఈ రోజున ఇంత నీడలో కూర్చుని తీరు బడిగా సేద తీర్చుకుంటున్నామంటే అర్థం– ఏనాడో వెనుక ఏ మహానుభావుడో నీడనిచ్చే ఓ చెట్టును నాటిపోయిన ఫలితమే సుమా’’ అని! అలాగే ఈ రోజున స్వతంత్ర భారత రాజ్యాంగ రచనలో అటూ ఇటుగా కొన్ని హెచ్చుతగ్గులు రంధ్రాన్వేషకులకు తగలొచ్చునేమోగానీ, అంతమాత్రాన మొత్తం రాజ్యాంగ రచనా సంవిధానాన్నే ఎకసెక్కా లకు గురిచేయరాదు. ఇందుకు అతి తాజా ఉదాహరణగా కేంద్ర స్థాయిలో నడిచే సాధికార విచారణ సంస్థలే పరస్పరం కుమ్ములాట లకు దిగడాన్ని పేర్కొనకుండా ఉండలేం. రాజ్యాంగం కనుసన్నల్లో గాక కేవలం ఎప్పటికప్పుడు తాత్కాలిక ‘తోలుబొమ్మలాట’గా అధికారం చేపట్టే రాజకీయ పార్టీల నాయకులు తమ చేతివాటం కొద్దీ రాజ్యాంగ సంస్థల్ని తరచూ స్వప్రయోజనాలకు వినియోగించు కోవడం చూస్తున్నాం. కాగా ఇప్పుడు తాజాగా ఈ పుండు న్యాయ వ్యవస్థల్లో కూడా పుట్టి శరవేగాన పెరిగిపోతోంది. ఇందుకు తాజా ఉదాహరణే... కేంద్రాధికార స్థానంలోని పాలకుల కనుసన్నల్లో మసలే విచారణాధికార సంస్థ ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ (సీబీఐ)... దేశంలోని ‘‘ప్రతీ పేరుమోసిన ఇతర గౌరవ సంస్థల మాదిరే రోజు రోజుకీ ప్రజల దృష్టిలో పడి, దాని విశ్వసనీయతను ప్రజలు ప్రశ్నించే స్థితి ఏర్పడిందని’’ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (1.4.2022) ప్రస్తావిం చారు. ఇదే సందర్భంలో ఆయన దేశంలో రాజ్యాంగం ప్రజాస్వామ్య లక్ష్యాలను ఎందుకు కాపాడుకోవలసిన అవసరం మరింతగా ఉందో వివరిస్తూ ఇలా అన్నారు: ‘‘భారతీయులం స్వేచ్ఛను ప్రేమిస్తాం. ఆ స్వేచ్చను కాస్తా గుంజుకోవడానికి ఎవరు ప్రయత్నించినా జాగరూ కులైన మన పౌర సమాజం స్వేచ్ఛను హరించజూసే నిరంకుశ వర్గాల నుంచి అధికారాన్ని తిరిగి గుంజుకోవడానికి సంకోచించదు. అందు వల్ల పోలీసులు, విచారణ సంస్థలు సహా అన్ని బాధ్యతాయుత సంస్థలూ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడి తీరాల్సిందే’’. ప్రధాన న్యాయమూర్తి నోటి నుంచి ఈ హెచ్చరిక వెలువడిన వెంటనే కేంద్ర న్యాయ శాఖామంత్రి కిరణ్ రిజిజూ మరునాడు... ఆ మాటకొస్తే ‘న్యాయ వ్యవస్థమీద కూడా 1,600కి పైగా ఫిర్యాదులు, కేసులు ఉన్నాయని’ లోక్‌సభలో ప్రకటించడంతో– ఈ పరస్పర ఎత్తి పొడుపుల్లో వేటిని నమ్మాలో, వేటిని కుమ్మాలో సామాన్యులకు, పాలనా వ్యవస్థలు నిర్వహిస్తున్న వారికీ అంతుపట్టని పరిస్థితి! నిజానికి ఒకప్పుడు సీబీఐ అంటే జనంలో విశ్వసనీయత ఉండేది. చివరికి తీవ్ర నిరాశకు గురవుతున్నపుడు కూడా ఒక దశ వరకు ప్రజలు న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లగలిగే వారనీ, ఇప్పుడు ఆ విశ్వస నీయత కూడా ప్రజల్లో కలగడం లేదని కూడా జస్టిస్ రమణ గుర్తు చేయాల్సి వచ్చింది. ఈ పరిణామాన్ని ఇకనైనా అడ్డుకోవాలంటే– రాజకీయుల్ని లేదా పాలకుల్ని రాసుకు పూసుకుని తిరగడాన్ని పోలీసులు మానుకోవాలని కూడా హితవు చెప్పాల్సి వచ్చింది. ప్రజా స్వామ్య విలువలతో పాటు మన వ్యవస్థలన్నీ ఎలా నిర్వీర్యమై పోతున్నాయో జస్టిస్ రమణ గుర్తు చేస్తున్న సమయంలోనే బీజేపీ మంత్రి రిజిజూ పోటీగా న్యాయవ్యవస్థపైనే ఎదురుదాడికి దిగారు. ఈ ఎదురుదాడితో మొత్తం పాలకులు, పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, విచారణ సంస్థల ‘సగులు మిగులు’ ప్రతిష్ఠలు ఏమైనా మిగిలి ఉంటే గింటే, పోయిన విలువ తిరిగి రాదని గ్రహించాలి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనా సంస్కరణల్లో భాగంగా, మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనివార్యంగా ఆమోదిం చాల్సి వచ్చిన పథకం– రాజధానుల వికేంద్రీకరణ! కానీ, సుప్రీం పరోక్ష అనుమతితో కొత్తగా రాష్ట్ర హైకోర్టుకు బదలాయించిన న్యాయ మూర్తి ఒకరు ‘రాష్ట్ర రాజధానిని మార్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి’ లేదని శాసించారు. అలాగే బీజేపీ తన అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒకవైపు ‘మేలమాడుతూ’నే మరోవైపు నుంచి రాష్ట్రంలో బలం పెంచుకోవడానికి నానా బాపతుతో జట్టుకట్టి కలగాపులగం రాజకీయాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పాలనా వికేంద్రీ కరణ ప్రతిపాదనలకు స్థూలంగా సమ్మతించి నాటకమాడుతున్న దశలోనే, కేంద్రాధికారాన్ని కూడా ధిక్కరిస్తూ హైకోర్టు కొత్త బెంచ్ నుంచి ‘రాజధానిని మార్చరాదని’ తాఖీదు వచ్చింది. పైగా హైకోర్టు ప్రకటన ఏ పరిస్థితుల్లో వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో.. విడిపోతున్న కొత్త ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్ణయం కాకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోర్టులో పలు వురు ప్రసిద్ధ మాజీ న్యాయమూర్తులు ఆదరాబాదరాగా చంద్రబాబు చేసిన అమరావతి భూముల గోల్మాల్ విషయమై తిరుగులేని రిట్ పిటీషన్ వేశారు. దాన్ని కోర్టు అనుమతించి విచారణకు స్వీకరించింది కానీ, విచారించలేదు. అది ఇంకా పెండింగ్‌లో ఉన్నట్టే లెక్క. అందులో అమరావతి భూములను బాబు ఎలా గోల్మాల్ చేసి... మూడు నాలుగు పంటలు పండే భూముల్ని అర్ధరాత్రి ఎలా తాను బయట పడకుండా తన అనుయాయుల ద్వారా తగలబెట్టించి, తప్పుకోజూసి ఎలా అభాసుపాలైందీ ప్రస్తుత హైకోర్టు కూడా తెలుసుకో గలిగితే మంచిది. అమరావతి భూములను తగులబెట్టించిన పాపాన్ని బాబు, అతని అనుయాయులు ఎవరిమీదికి నెట్టారు? ఆ పంటల దహన కాండను కళ్లారా చూసి గుండె పగిలినంత పనైన ఈనాటి వైసీపీ ఎంపీ నందిగం సురేష్ (దళితుడు) పైకి! అతణ్ణి ఎలాగోలా పంట దహన కాండ క్రియలో ఇరికించడానికి బాబు గ్యాంగ్ చేసిన ప్రయత్నాలూ, వేధింపులూ అన్నీ ఇన్నీ కావు. వేటికీ సురేష్ లొంగి కాళ్లుపట్టుకోలేదు గనుకనే–ఎన్నికల్లో అనివార్యంగా పార్లమెంట్ సభ్యుడై గడిచిన యావత్తు చరిత్రకు నిండైన, మెండైన ప్రతినిధిగా నిలబడ్డాడు. అంతకు ముందు, వేధింపులలో భాగంగా పోలీసులు సురేష్‌ను అరెస్టు చేసి, ‘నీవే పంట భూములు తగలబెట్టాన’ని ఒప్పుకుంటే ‘బాబు ద్వారానే రూ. 50 లక్షలు నీకు ముడతాయ’ని రకరకాల ప్రలోభాలు పెట్టారు. అయినా లొంగని మొండి ఘటమైనందుననే సురేష్ మాటకి ఈ రోజుకీ అంత విలువన్న సంగతిని న్యాయమూర్తులూ, న్యాయ వ్యవస్థా మరచిపోరాదు. గౌతమబుద్ధుడు మనకు ఏమి బోధించి పోయాడు? ‘చివరకు నేను చెప్పానని కూడా దేన్నీ నమ్మొద్దు. సొంత బుద్ధితో ఆలోచించి నిర్ణయాలకు రండ’ని చెప్పాడు. అదీ– న్యాయ వాదికైనా, న్యాయ మూర్తికైనా ఉండాల్సిన నీతి, నియమం! ఉమ్మడి హైకోర్టులో నేనూ, ప్రసిద్ధ మాజీ న్యాయమూర్తులూ జమిలిగా అమరా వతి భూముల పంపిణీ తంతుపై వేసిన రిట్ పిటీషన్లు, రిమైండర్లకు ఈ క్షణానికీ జవాబు రావలసే ఉంది. అందుకనే, వాటి తుది తీరు మానానికి మళ్లీ డొంకంతా న్యాయబద్ధంగా మాజీ న్యాయమూర్తులు కదపవలసి వస్తోంది. అంటే అమరావతి భూముల అక్రమ పంపిణీ సమస్య ఇంకా అలాగే ఉండిపోయిందని గౌరవ న్యాయమూర్తులు గుర్తించాలి. ఆ మాజీ న్యాయమూర్తుల అపరిష్కృత ఫైల్‌కు గౌరవ న్యాయం జరిగే వరకు అమరావతి భూములు అన్యాక్రాంతం కథకు ముగింపు రాదు, ఇతరత్రా ఎన్ని పొంతన లేని మధ్యంతర తీర్పు లొచ్చినా సరే! ‘క్వీన్స్ కౌన్సిల్’ డేవిడ్ పానిక్ అన్నట్టు ‘‘రాజకీయ పాలకులకు నిర్ణయించిన పదవీ కాలం పరిమితమే. కానీ న్యాయ మూర్తులకున్న పదవీ భద్రత పాలకులకు ఉండదు. ఈ పదవీ భద్రత పబ్లిక్ సర్వెంట్లయిన న్యాయ మూర్తులకు మాత్రం ప్రత్యేక వనరు. అందువల్ల జడ్జీలనూ, వారి బాధ్యతల నిర్వహణా తీరునూ, వారి పని తీరునూ స్వేచ్ఛగా, బాహా టంగా విమర్శించవచ్చు. అలాగే, పత్రికలు ఇతర ప్రసార సాధనాలు వెలిబుచ్చే అభిప్రాయాలనూ, విమర్శలనూ జడ్జీలు పట్టించుకోనక్కర లేదు. అలా విమర్శలకు ఉలిక్కిపడే జడ్జీలు, జడ్జీలు కాజాలరు’’! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కొంప మునిగినా.. కొందరికి లాభమే
దేశంలో ఎటువంటి పరిస్థితి తలెత్తినా అది ధనికుల సంపదనూ, బీదల సంఖ్యనూ మరింత పెంచేదిగా ఉండటం గమనార్హం. ‘కోవిడ్–19’ సమయంలో ఒకవైపున లక్షలు, కోట్లాది మంది ప్రాణాలు కోల్పోతున్న కాలంలో కూడా కోట్లకు పడగలెత్తుతూ వచ్చిన సంపన్నుల వైనం-దొంగ చేతికి తాళం అందించినట్టయింది. సకాలంలో సరైన మందులు వాడక పోవడంవల్ల మరణించిన వారికన్నా.. సామాజిక వ్యవస్థల్లో అసమానతల వల్ల చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువని గణాంకాలు వెల్లడిస్తుండటం మరొక చేదు వాస్తవం. ధనికుల సంపదపై పన్నులు తగ్గించడం వల్ల వారికి లాభం కలుగగా, సామాన్య మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం పెరిగింది. ఒక్క 2020లోనే ఇందువల్ల అత్యంత దారిద్య్రంలోకి జారుకున్న వారి సంఖ్య 4.6 కోట్లు. రాజు (పాలకుడు) నోటినుంచి వచ్చిందీ; న్యాయస్థానాలు, న్యాయమూర్తుల లేదా మేజిస్ట్రేట్ల నుంచీ వెలువడే తీర్పులన్నీ ధర్మాలు కావనీ, హాస్యాస్ప దాలుగా ఉంటాయనీ నిరూపిస్తూ లోకరీతిని పొల్లుపోకుండా వివరించిన మేటి కథల్లో ఒకటి-సుప్రసిద్ధ కథకుడు పతంజలి చెప్పిన ‘పిలక తిరుగుడు పువ్వు’! ఒక గ్రామంలో కులాల వారీగా ప్రజలు రెండు ముఠాలుగా చీలిపోయి భూమి గుండ్రంగా ఉందని ఒక వర్గం; కాదు, భూమి బల్లపరుపుగా ఉందని మరో వర్గం భావించడంతో బయలుదేరిన కక్షల కారణంగా గొడవలు జరిగాయి. పోలీసులు రెండు వర్గాల వారినీ పిలక పట్టుకుని తీసుకొచ్చి దొమ్మీ నేరంమీద, హింసాకాండ రెచ్చగొడుతున్నారన్న ఆరోపణ మీద కేసును మేజిస్ట్రేట్ ముందు దాఖలు చేశారు. న్యాయమూర్తి కేసును కొత్త తరహాలో విచారించడం మొదలుపెడతారు. ఎలా? జీవితమే నమ్మకాలకూ, ఆచరణకూ పొంతన లేకుండా ఉంది కాబట్టి, జీవితమే బల్లపరుపుగా ఉంది కనుక ఫలానా ఊళ్లో ఇలాంటి తగవు తలెత్తిందని భావించిన న్యాయమూర్తి.. నిజానికి భూమి గుండ్రంగా ఉంటే జీవితం ఇలా ఉండదనీ, అందుకే భూమి బల్లపరుపుగా ఉందనీ తీర్పు చెప్పి రెండు పక్షాల కక్షిదారుల్ని విడుదల చేసేశారు! మా రాజులు, మా పాలకులు ఏమిటంటే కోర్టువారు కూడా అదే రైటన్నప్పుడు (భూమి గుండ్రంగా లేదు, బల్లపరుపుగా ఉందని).. కోర్టును మాత్రం పాలకుడు ఎందుకు గౌరవించాలని అడుగుతారు. ఏతావాతా పాలకుడికి సమర్థనగా కోర్టు ‘చట్టబద్ధంగా ఏర్పడిన భారత గణతంత్ర వ్యవస్థను కుట్రపూరితంగా కూల్చివేయడానికి కుత్సిత బుద్ధితో ప్రతిపక్షం (ముద్దాయిలు) పన్నిన పన్నాగం’ అని తీర్పు చెప్పడం... నేటి ‘పిలక తిరుగుడు పువ్వులు’గా మారిన కొందరి పాలకుల నడవడికగా కనిపిస్తుంది. స్వార్థ ప్రయోజనాలు అలా దూసుకువచ్చిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల తతంగం ద్వారా దేశంలో ఎక్కడా, ఏ రాష్ట్రంలోనూ లేని 80 మంది పార్లమెంటు సభ్యులతో దేశ పాలనను చేతిలో పెట్టుకుని దేశాన్ని ఉత్తర-దక్షిణ భారతాలుగా చీల్చి ఏలుబడి సాగించుకుంటున్నారన్న అపవాదును యూపీ ఆధారంగా పాలకులు మూటగట్టుకుంటున్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించిన భారత రాజ్యాంగ ప్రధాన నిర్ణేత అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఉత్తర-దక్షిణ భారతాల పేరిట చీలుబాటలకు అడ్డుకట్ట వేయడానికే దక్షిణ భారత ప్రత్యేక రాజధానికి బీజావాపనం చేశారని గుర్తించాలి. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా జరుగుతున్న ఈ ‘బహుళార్థ సాధక’ రాజకీయ కుట్రలకు, వక్ర రాజకీయాలకు స్వస్తి చెప్పాలన్నదే అంబేడ్కర్ ఆకాంక్ష అని మరచిపోరాదు. అంతకన్నా ఘోరమైన, అనూహ్యమైన పరిణామం-జాతీయ స్థాయి గొప్ప సంస్థగా పేరుమోసిన ఒకనాటి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)కి సారథ్యం వహిస్తూ వచ్చిన చిత్రా రామకృష్ణ ఉన్న ట్టుండి బీజేపీకి సన్నిహితుడైన ఒక యోగి పన్నిన వ్యూహంలో చిక్కుకోవడం. అతగాడు చెప్పినట్టు నిర్ణయాలు తీసుకునే మైకంలో చిక్కుబడిపోయి తన వ్యక్తిత్వాన్ని మంటగలుపుకున్నదంటే-పాలక వర్గాల్లోని ‘గాడ్‌మెన్’ల ముసుగుల్లో స్వార్థ రాజకీయ పాలకుల ప్రయోజనాల్ని కాపాడుతూండటం వల్లనే ఇలాంటి విషమ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో హర్షద్ మెహతా లాంటి ‘నడమంత్రపు సిరి’ రాయుళ్లు దేశ ఆర్థిక వ్యవస్థకు తలపెట్టిన పూడ్చలేని హానికర పరిణామాలకు మరొక ఉదాహరణే చిత్రా రామకృష్ణ పతనం. మరింత పేదరికంలోకి.. ఇదే సమయంలో ప్రపంచ దేశాల్ని కల్లోల పరుస్తోన్న ‘కోవిడ్-19’ అంటువ్యాధి సమయంలో ఒకవైపున లక్షలు, కోట్లాది మంది ప్రాణాలు కోల్పోతున్న కాలంలో కూడా కోట్లకు పడగలెత్తుతూ వచ్చిన సంపన్నుల వైనం-దొంగ చేతికి తాళం అందించినట్టయింది. కోవిడ్-19 వైరస్ వల్ల సకాలంలో సరైన మందులు వాడక పోవడంవల్ల మరణించిన వారికన్నా... సామాజిక వ్యవస్థల్లో అసమానతల వల్ల చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అత్యంత సంపన్న వర్గాలపై విధించే పన్నులను తగ్గించడంవల్ల ఆ పన్నుల భారాన్ని సామాన్య, మధ్యతరగతి ప్రజల భుజస్కంధాలపైన మోపడం వల్ల విషమ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక్క 2020లోనే ఇందువల్ల అత్యంత దారిద్య్రంలోకి జారుకున్న వారి సంఖ్య 4.6 కోట్లని తేలింది. ప్రపంచంలో కొత్తగా పెరిగిన పేదల సంఖ్యలో వీరే సగంమంది ఉంటారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అంతేగాదు, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ఫలితంగా... ఒక వైపున పేదలు, పేదరికం పరిధిలోకి జారడానికి దగ్గరలో ఉన్న నిరుపేదల సంఖ్య ఆర్థికంగా అత్యంత సంపన్న వర్గాలకు అనుకూలంగా దేశ ఆర్థిక వ్యవస్థను మలచడం వల్లనే పెరిగిపోతోందని ‘ఆక్స్‌ఫామ్’ సాధికార సంస్థ వెల్లడించింది. చివరికి పచ్చి హిందూ తత్వవాది, ఆరెస్సెస్ అధ్యక్షుడైన మోహన్ భగవత్ ‘ఒక వైపున ఆర్థిక ప్రగతి కనిపిస్తున్నా, ప్రపంచ ఆర్థిక సంపదపైన పెత్తనం మాత్రం కొలది మందిది మాత్రమే’ కొనసాగు తోందని స్పష్టం చేశారు. ఇది మరీ విచిత్రమైన పరిణామం-దేశంలో అసాధారణంగా పెరిగిపోతున్న కొలదిమంది అత్యంత సంపన్నుల ఆస్తిపాస్తులను తైపారు వేసి చూస్తే-కొందరు మాత్రమే అగ్ర స్థానంలో ఉండటమేగాక, భారతదేశ సంపదపై ‘ఉగ్రరూపం’లో భల్లూకపు పట్టు సంపాదించారు. ఈ విషమ పరిణామాన్ని మన తరంలో మనం ఇప్పుడు దర్శిస్తున్నాం గానీ... సరళీకరణ, ప్రైవేటీ కరణ, ప్రపంచీకరణ పేర్ల చాటున ప్రపంచబ్యాంకు రుద్దే సంస్కరణల ప్రభావం ప్రజా బాహుళ్యంపైన ఎలా ఉంటుందో.. తొలుత ఆడమ్ స్మిత్ రాసిన ‘జాతుల సంపద’ అనే ప్రపంచ ప్రసిద్ధ ఆర్థిక శాస్త్ర అనర్ఘరత్నం తర్వాత, అంత గొప్పదిగా పేరుగాంచిన డాక్టర్ డేవిడ్ కార్టన్ రాసిన ‘కార్పొరేట్ రంగం ప్రపంచాన్ని ఏలబోతున్న వేళ’ (వెన్ కార్పొరేషన్స్ రూల్ ది వరల్డ్) అన్న గ్రంథం మరిన్ని సత్యాలను కళ్లకు కట్టి చూపింది. కార్టన్ కనీసం 15 ఏళ్ల నాడే ప్రపంచ దేశాలను ఇలా హెచ్చరించాడు: శ్రీమంతుల కోసమేనా? ‘స్వల్పాదాయ వనరులున్న దేశాలలో శరవేగాన ప్రవేశపెట్టే ఆర్థిక ప్రగతి పథకాల వల్ల వచ్చే ఫలితం-శ్రీమంతులకు పనికివచ్చే ఆధు నిక ఎయిర్‌పోర్టులు, టెలివిజన్లు, భారీ ఎక్స్‌ప్రెస్ రహదార్లు, ఫ్లైఓవర్లు; సంపన్న వర్గాల అవసరాలు తీర్చిపెట్టే అత్యాధునిక ఎలెక్ట్రానిక్స్ వస్తువులతో నిండిన ఎయిర్ కండీషన్డ్ షాపింగ్ కేంద్రాలు, ఫ్యాషన్ లేబుల్స్ వగైరా. ఇందువల్ల అసంఖ్యాక ప్రజాబాహుళ్యం జీవన పరిస్థితులు మెరుగుపడవు. ఈ రకమైన ఆర్థిక ప్రగతి ఎగుమతుల్ని పెంచే ఆర్థిక వ్యవస్థను కోరుకుంటుంది. తద్వారా సంపన్న వర్గాలు కోరుకునే వస్తువుల కొనుగోలుకు అవసరమైన విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించడం దాని లక్ష్యం. కాగా, ఈ తరహా అభివృద్ధి మూలంగా పేదల భూములన్నింటినీ కేవలం ఎగుమతుల్ని పెంచే వాణిజ్య పంటలకు మళ్లించేస్తారు. ఈ భూముల్ని సాగు చేసుకుంటూ వచ్చిన పాతకాపులందరూ బతుకుతెరువు కోసం, చాలీ చాలని కూలికి పట్టణ మురికివాడల్లో కుదురుకుని ఎగుమతులకు ఉద్దేశించిన వస్తూత్పత్తిలో పాల్గొనాల్సి వస్తుంది. తద్వారా కుటుం బాలు విచ్ఛిన్నమవుతాయి. సామాజిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే స్థితికి చేరుతుంది. హింస, దౌర్జన్యాలు సమాజంలో సర్వసామాన్య మైపోతాయి!’’ పదిహేను ఏళ్లనాడు డాక్టర్ కార్టన్ చేసిన ముందస్తు హెచ్చరిక నేటి మన దుస్థితికి చెరపలేని నిలువుటద్దం! -ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
వినదగిన ‘తక్కెళ్ల జగ్గడి’ వాదన
సమాజంలోని ఆలోచనాశీలికి తక్కెళ్ల జగ్గడు ప్రతీక. ‘మాలపల్లి’ నవలలోని పాత్ర అయితేనేమి, ఈ కాలాన కూడా అలాంటి ముక్కుసూటి మనిషి ఉండాలి. ఒక స్థానిక కోర్టులో ఏ మొహమాటమూ లేకుండా న్యాయమూర్తి ముందు సమాజ పరిస్థితులను ఏకరువు పెడతాడు. నిరుపేదలు మరింత నిరుపేదలు కావడానికి కారణాలను అప్పుడే విశ్లేషించాడు. అయినా సమాజం ఏమైనా మారిందా? వ్యవస్థ మెరుగు పడిందా? జగ్గడి నీతిని ఇప్పుడు వర్తింపజేసినా భూమి బద్దలవుతుందేమో అన్నట్టుగానే ఉంది మన ధోరణి. దాని కోసమైనా మరింతమంది జగ్గళ్లు కావాలి. వ్యవస్థను నిద్ర లేపాలి. నేడు దేశంలో గానీ, పలు రాష్ట్రాలలో గానీ అమలవుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను గమనిస్తున్న వారికి ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’ నవలలో ‘తక్కెళ్ల జగ్గడు’ గుర్తుకొస్తాడు. ఒక స్థానిక కోర్టులో ఎలాంటి నదురూ బెదురూ లేకుండా న్యాయమూర్తి ముందు సమాజ పరిస్థితులను, పేదల దారుణాతి దారుణ పరిస్థితులను జగ్గడు ఏకరువు పెడతాడు. ధనవంతులు తాము ధనవంతులయింది తమ ప్రయోజకత్వం వల్ల కాదు. అందుకు ఎందరో పేదల శ్రమ దోపిడీయే కారణం. దాని ఫలితమే కోట్లాదిమంది నిరుపేదల వుతున్నారు. ఈ దోపిడీ ఏ రూపంలో, ఏ మిష పైన కొనసాగుతుందో కూడా జగ్గడు వందేళ్ళ నాడే సిద్ధాంతీకరించాడు! ‘‘కలియుగంలో రాక్షసులు లేరంటారు గానీ ధనికులే కలియుగ రాక్షసుల’’న్నాడు. ఎలా అన్న ప్రశ్నకు, అప్పటికే దోపిడీ సమాజ వ్యవస్థ అనుసరించే చిట్కాలు, మాయోపాయాలూ ఎలా ఉంటాయో వివరిస్తాడు. ‘‘భాగ్యవంతులు బీదల్ని దోచుకుంటే దానిపేరు వ్యవహారం, బీదలు తమ హక్కును తీసుకుంటే అది చౌర్యం. బీదల దగ్గర నుంచి మోసం చేసి కొంటే ఆకర్షించిన ధనాన్ని మరల బీదలు లాక్కుంటే మాత్రం అది ఎట్లా తప్పయిందో కోర్టువారు నిర్ధారణ చేయగోరు తున్నాను. ఇలాంటి అక్రమ చట్టాల వారస సంతానంగా వచ్చినవే బీదల నేరాలు. అంటే, భాగ్యవంతులకు ఉపయోగించే నేరం చట్ట సమ్మతమై, వారికి ఉపయోగించనిది నేరమా? అంటే భాగ్య వంతుల ప్రాణానికి విలువ ఎక్కువ! బీదవాని కంటే భాగ్యవంతుడి కుక్క గొప్పది కాబోలు. బీదలోడ్చిన చెమటా, రక్తమూ కరుడు కట్టి ధనికుని భాగ్యం అవుతుంది’’ అని చాటిన వాడు జగ్గడు! తక్కెళ్ల జగ్గడి నీతిని వందేళ్ళ తర్వాత అయినా వర్తింపజేస్తే భూమి బద్దలవకుండా ఉంటుందా? బద్దలయ్యే దశలో ఉంది కాబట్టే, కనీసం గత నలభై ఏళ్ళుగా అనేక సాధికార విచారణ సంస్థలు దేశ వ్యాప్తంగా జరిపిన సర్వే ఫలితాల దృష్ట్యా కూడా ఎవరిలోనూ జ్ఞానోదయం ఈ క్షణం దాకా కలగడం లేదు. కనుకనే జగ్గడి నీతి పాఠాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకోవలసి వస్తోంది! చివరికి ప్రతిపక్షాల్ని వేధించడానికి క్రమంగా 2024 నాటికల్లా ‘ఒక దేశం ఒకే ఎన్నిక’... ఆ ఒకే ఎన్నిక ద్వారా క్రమంగా ఏక వ్యక్తి పాలనకు మార్గాన్ని సుగమం చేయడం తిరుగులేని కర్తవ్యంగా పాలకులు నిర్ణయించుకున్నట్టున్నారు. అందుకే బహుశా ‘పెగసస్’ కూపీ ‘స్పైవేర్’ అవసరమైంది! ఇక్కడ విచిత్రమేమంటే ఇలాంటి ‘కూపీ’ పద్ధతులు, కూట రాజకీయాలు, కుట్ర కోణాలకు కేంద్ర పాలకుల కన్నా ముందు జాగ్రత్తల్లో ఉన్నవాడు చంద్రబాబు నాయుడు! వర్ధమాన దేశాలపై అమెరికా ఎక్కు పెట్టి ఉంచిన కుట్రలనూ, అనుసరిస్తున్న తప్పుడు విధానాలనూ ప్రాణాలకు తెగించి ఎండ గట్టినవాడు ఎడ్వర్డ్ స్నోడెన్! రెండేళ్ళ ముందే స్నోడెన్ అమెరికా ఎత్తుగడలను గమనించి అమెరికన్ పౌరులకే గాక, వర్ధమాన దేశాల ప్రభుత్వాలను ‘‘మీ డబ్బు, మీ జీవితాలు జాగ్రత్త’’ అని హెచ్చరిం చాడు. రానున్న రోజుల్లో కేంద్రీయ బ్యాంకులు, డిజిటల్ కరెన్సీలు ప్రజల భవిష్యత్తును ‘అతలాకుతలం’ చేస్తాయని ప్రకటించాడు. ఈ పరిణామాల దృష్ట్యా ఇజ్రాయిల్ ‘పెగసస్’ స్పైవేర్ ద్వారా భారత ప్రతిపక్షాలపైనా, పలు సామాజిక కార్యకర్తల పైనా, పౌర హక్కుల నాయకుల పైనా జాతీయ స్థాయిలో కానరాని నిర్బంధ విధా నాలకు గురి చేయడాన్ని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ఒకటికి రెండుసార్లు ప్రశ్నించాల్సి వచ్చింది. ‘కొరివితో తల గోక్కు’న్నట్టుగా ‘పెగసస్’ కుంభకోణం ద్వారా పశ్చిమాసియాలో ఆఫ్రికన్ల ప్రయోజనాలను దెబ్బతీయజూస్తున్న ఆంగ్లో–అమెరికన్ సామ్రాజ్యవాదుల చేతిలో కీలుబొమ్మగా మారిన ఇజ్రాయిల్‌తో మనం జట్టు కట్టడం... భారతదేశం పట్ల ఆఫ్రికన్లలో వ్యతిరేక భావాలు ప్రబలడానికి చోటిచ్చినట్లయింది. ‘కోవిడ్–19’ వైరస్ వ్యాప్తి కేవలం సాధారణ ‘ఫ్లూ’ లాంటిదనీ, దాని నివారణ పేరిట రకరకాల వ్యాక్సిన్ల ఎగుమతుల వ్యాపార లావాదేవీల్లో ఉన్న దాదాపు 40–80 మందుల కంపెనీల పట్టులో ఉన్న అమెరికా ప్రభుత్వం ఆ కంపెనీల ప్రయోజనాల రక్షణకు అనుమతించడంతో ‘కోవిడ్–19’కు ఇంతవరకూ ఉపశమనం కలగక పోగా రోజుకొక తీరున కొత్త వేరియంట్లు తామరతంపరగా పుట్టుకు రావడం... ప్రైవేట్ మందుల వ్యాపార కంపెనీల ఉనికినే ప్రశ్నించే స్థితి ఏర్పడటం జరుగుతోంది. ఇందుకు బ్రెజిల్లో భారత ప్రభుత్వం అమ్మజూపిన స్థానిక ప్రైవేట్ మందుల వ్యాపార కంపెనీతో పాటు మన పాలకులు కూడా ఇరుక్కుపోవలసి వచ్చింది. ఇలా, మన దేశంలో ఇలాంటి పాలకులు ఎన్ని రకాలుగా 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాల సమయంలో కూడా పుట్టుకొచ్చి మన మధ్య మసలు తున్నారంటే– ‘తక్కెళ్ల జగ్గడి’ బోధల అవసరం ఇక ముందు కూడా ఉంటుందనీ విశ్వసించవచ్చు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
అన్ని గొంతులూ విన్నప్పుడే...
మంచిమాట ఎవరు చెప్పినా ముందు వినాలన్నాడు సుమతీ శతకకర్త. విని, తొందరపడకుండా ఆలోచించి, నిజానిజాలు తెలుసుకోగలిగినవారే నీతిపరులని చెప్పాడు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అల్లాడించింది. ఆర్థిక వ్యవస్థలను తలకిందులు చేసింది. వీటన్నింటికీ నిజంగా కారణం కరోనాయేనా అని ప్రశ్నించే గొంతులూ ఉన్నాయి. కోవిడ్‌ను సీజనల్‌గా వచ్చే ఇన్ఫ్లుయెంజాగానే పరిగణించి వైద్యం చేసివుంటే అనవసర లాక్డౌన్స్ తప్పేవని ప్రొఫెసర్ చోసుడొవస్కీ లాంటివాళ్లు చెబుతున్నారు. కరోనా వల్ల ప్రపంచ సంపదను మహాశ్రీమంతులు మరింతగా పంచుకున్నారని కూడా అన్నారు. ఇందులోని నిజానిజాలు తేల్చుకోవాలన్నా ముందు ఇలాంటివాళ్ల మాటలు తొందరపడకుండా వినాలి. సత్యం దిశగా యోచించాలి. సుమతీ శతకకారుడు బద్దెన భవిష్యత్తును ఊహించి వందల సంవత్సరాల క్రితమే బోధించిన నీతి సూత్రం ఈ క్షణానికీ ఎంత విలువైనదో మరోసారి రుజువైంది. ‘నీతి తెలిసిన వాడెవడు?’ అన్న ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం... మానవేతర ప్రకృతిలోని పశుపక్ష్యాదులకు కూడా వర్తిస్తుంది. మంచిమాట ఎవరు చెప్పినా ముందు వినాలని చెబుతూ ఇలా హెచ్చరించిపోయాడు. ‘‘విన్న తరువాత తొందరపడకుండా బాగా ఆలోచించాలి. ఆ తరువాత నిజానిజాలు తెలుసుకోగలిగినవారే లోకంలో నీతిపరులు’’ అని బోధించాడు. ఇప్పుడా బోధించే వంతు తెలివిగల రెండు ఎలుకలపై పడిందనిపిస్తుంది. ఇంతకూ ఆ ఎలుకల సంభాషణను ఒక సుప్రసిద్ధ కళాకారుడు (క్యారికేచరిస్టు) ఇలా అక్షరబద్ధం చేశాడు: ఒక ఎలుక రెండో ఎలుకను ‘‘నీవు కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి పోతున్నావా?’’ అని అడిగితే, ఆ రెండో ఎలుక ‘‘ఎందుకా తొందరపాటు? మనుషుల మీద ప్రయోగ ఫలితాలు తేలనీ’’ అని సరిపెడుతుంది, తెలివిగా! ప్రపంచమంతటా 2020–21 నుంచి విస్తరించిన కరోనా వైరస్ పౌర సమాజాన్ని నాశనం చేసింది. అది విస్తరించిన దేశాలన్నిటా ఆర్థిక సంక్షోభాలు సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ బడుగు దేశాలకు, ప్రజలకు అత్యంత ఆశాజనకంగా తన విశిష్ట విశ్లేషణలను, సకాలంలో హెచ్చరికలను అందిస్తూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు కెనడాకు చెందిన ఆర్థికవేత్త ప్రొఫెసర్ మైఖేల్ చోసుడొవస్కీ (కాట్లిన్ జాన్స్టోన్ ప్రత్యేక వ్యాసం 14 ఫిబ్రవరి 2022). చోసుడొవస్కీ విశ్లేషణల వల్ల ప్రపంచ వైద్య నిపుణులు సహితం పలు వ్యాపార కంపెనీల మందుల నాణ్యత గురించి ప్రశ్నించే స్థితి ఉత్పన్నమైంది. దీనికితోడు కరోనా వైరస్‌కు దాని విభిన్న రూపాల (వేరియంట్స్) నిర్ధారణకు వాడుతున్న ఆర్టీ – పీసీఆర్ పరీక్షలు కూడా నిరర్థకంగా తయారైనాయని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించడంతో పెద్ద గందరగోళం సర్వత్రా వ్యాపించింది. పైగా ‘సార్స్ – కోవిడ్ 2’ సాధారణంగా సీజనల్‌గా వచ్చే ఫ్లూ, ఇన్ఫ్లుయెంజాలకు మించింది కాదనీ, వాటికి వాడే సాధారణ ఇంజెక్షన్లకు భిన్నంగా వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా మార్కెట్‌కు వదులుతున్న ఇంజక్షన్లు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదనీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులే నిర్ధరిస్తూ ఉండడంతో ప్రొఫెసర్ చోసుడొవస్కీ హెచ్చరికలకు విలువ పెరగడం మరొక విశేషం! ఈ గందరగోళం మధ్య దేశదేశాల్లో నిరంతరం జరుగుతున్న పని – లాక్డౌన్లు, ప్రజల నిత్య వర్తక వ్యాపారాలు స్తంభించి, సర్వవ్యాప్త ఆర్థిక సంక్షోభాల్లోకి దేశాల్ని నెట్టడమూ! అంతేగాదు, ఏ ‘కోవిడ్ – 19’ వైరస్ నిర్మూలనకు ఉద్దేశించిన ‘ఎం–ఆర్ఎన్ఏ’ వ్యాక్సిన్స్ ఉన్నాయో, ఆ ప్రత్యేక వ్యాక్సిన్ల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల ఫలితాలు రావడంతో ప్రపంచ వైద్యరంగంలో భారీ గందరగోళ పరిస్థితులు ఏర్పడటాన్ని నిపుణులు గుర్తించారు. అంతేగాదు, ఈలోగా ‘సమాచార స్వేచ్ఛ’ చట్టం కింద సేకరించిన సమాచారం ప్రకారం, ‘కోవిడ్–19’ వ్యాక్సిన్ రక్షణ కవచమేనా అన్న సందేహం రేకెత్తడం మరొక విషమ పరిణామంగా ప్రసిద్ధ వైద్య నిపుణులు పేర్కొనడం జరిగింది. ఇన్నిరకాల పరిణామాల ఫలితంగానే ప్రొఫెసర్ చోసుడొవస్కీ ఈ కింది నిర్ణయానికి వచ్చి ఉంటారు. ‘‘ప్రపంచ చరిత్రలోనే అత్యంత విషాదకర సంక్షోభపు చౌరస్తాలో మనం నిలబడాల్సి వచ్చింది. మనది నడుస్తున్న చరిత్ర. అయినా 2020 సంవత్సరం జనవరి నుంచీ అనుభవిస్తున్న ఘటనల పరంపర గురించిన మన అవగాహన మాత్రం మసకబారిపోయింది. కోవిడ్–19 మహమ్మారి వైరస్ కారణాల గురించీ, దాని వ్యాప్తివల్ల కలిగే దారుణ ఫలితాల గురించీ ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. అంతేగాదు, బయటకు చెప్పని అసలు వాస్తవం – ప్రపంచ దేశాల్ని భారీ ఎత్తున నిరుద్యోగంలోకీ, ఆర్థిక దివాళా పరిస్థితుల్లోకీ, దారుణ దారిద్య్ర పరిస్థితుల్లోకీ, నిరాశా నిస్పృహల్లోకీ నెట్టి ప్రజల్ని సుడిగుండంలోకి దించగల బడాబడా గుత్తాధిపతుల ప్రయోజనాల రక్షణకు ఈ కరోనా వైరస్ ఒక పెద్ద ముసుగని మరిచిపోరాదు. దీని ఫలితానికే ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ గురయ్యారు’’. కోవిడ్‌ను సీజనల్‌గా వచ్చే సాధారణ ఇన్ఫ్లుయెంజాగానే పరిగణించి వైద్యం చేస్తే మహమ్మారిని నివారించగలిగేవాళ్లమనీ, అప్పుడు అనవసర ఆర్థిక కార్యకలాపాల దిగ్బంధనలు (లాక్డౌన్స్) తప్పేవనీ, జాతీయ ఆర్థిక వ్యవస్థ కునారిల్లకుండా భద్రంగా ఉండగలిగేదనీ చోసుడొవస్కీ తన డాక్యుమెంట్లో స్పష్టం చేశారు (ద 2020 వరల్డ్‌వైడ్ కరోనా క్రైసిస్: డిస్ట్రాయింగ్ సివిల్ సొసైటీ, ఇంజనీర్డ్ ఎకనామిక్ డిప్రెషన్, గ్లోబల్ కూ డెటట్ అండ్ ద ‘‘గ్రేట్ రీసెట్’’). ఈ సానుకూల నిర్ణయానికి దూరమైనందుననే కరోనా మరో సద్దు మరో సద్దుగా (సెకండ్ వేవ్, థర్డ్ వేవ్) వస్తోందన్న ప్రచారంతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలన్నింటినీ దివాళా ఎత్తించారనీ ఆ డాక్యుమెంట్ స్పష్టం చేసింది! ఎక్కడికో అక్కర్లేదు, ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారమే కనీసం అభివృద్ధి దశలోని పాతిక, ముప్ఫయ్ వర్ధమాన దేశాలలో ఈ దశలోనే కరువుకాటకాలు చుట్టుముట్టిన ఫలితంగా విలవిలలాడాయి. ఈ దశలో అనేక కంపెనీలూ, సంస్థలూ దివాళా ఎత్తడానికి, నిరుద్యోగం పెచ్చరిల్లిపోవడానికి ‘వైరస్’ కారణమన్నది కేవలం సాకు మాత్రమేనని కూడా ఆ డాక్యుమెంట్ స్పష్టం చేసింది! అంతేకాదు, ఆర్థిక వ్యవస్థలు ఈ దశలో – అంటే కరోనా కాలంలో చితికిపోతున్న సమయంలోనే 2020 ఫిబ్రవరి నుంచీ బిలియన్ల కొలదీ డాలర్లను మహాకోటీశ్వరులు ఎలా పోగుచేసుకుని బలిసిపోయారో డాక్యుమెంట్ ప్రస్తావించింది. కానీ, అసలు వాస్తవం ఏమంటే – ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగనంత స్థాయిలో ప్రపంచ సంపదను భారీఎత్తున బడా సంపన్న వర్గాలు తమ మధ్యన పునఃపంపిణీ చేసుకోవడం (రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్) జరిగిందని ఆ డాక్యుమెంట్ వివరించింది! బహుశా అందుకే ‘టెంపెస్ట్’ (పెను ఉప్పెన) అన్న రచనలో ‘‘నరకలోకం ఖాళీ అయిపోగా, దయ్యాలన్నీ ఇక్కడ చేరా’’యని మహాకవి, నాటకకర్త షేక్స్పియర్ అన్నాడు! మరొక రహస్యం ఈ సందర్భంగా మరచిపోరానిది – ప్రజలలో విశ్వాస వారధులు నిర్మించి, కష్టాలను కడు ధైర్యంతో ఎదుర్కోగల చేవను ఎక్కించవలసినవాళ్లు కూడా కోవిడ్–19 గురించిన రకరకాల తప్పుడు సమాచారాన్ని భుజాన వేసుకోవడం! వాస్తవాల్ని తెలుసుకోగోరే ప్రాథమిక మానవ హక్కుల్ని పౌరులు చలాయించగల ధైర్యస్థయిర్యాలను అందించాల్సిన అవసరాన్ని ఆ డాక్యుమెంట్ ఎత్తిచూపింది. దీనికితోడు, కోవిడ్–19 చాటున మరో పెను పరిణామం ముంచుకొస్తోందనీ, పైస్థాయిలో ప్రపంచ ద్రవ్య వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని మరీ నిర్ణయాలను రుద్దే సరికొత్త విధాన వ్యవస్థ బ్రహ్మప్రళయంగా రూపుదిద్దుకుంటోందనీ, ఇది ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తుందనీ చెప్పింది. ఇలాంటి ఆదేశాలను అనేక దేశాలలోని అవినీతిపరులైన రాజకీయవేత్తలకు ఏకకాలంలో బట్వాడా చేసే విధానం రూపొందించడం జరుగుతుందని చోసుడొవస్కీ హెచ్చరించారు. మొత్తం ఐక్యరాజ్యసమితి ఈ వినాశకర ఎత్తుగడల పట్ల మూగనోము పట్టగల ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు. అందుకే, తత్త్వవేత్తలు ఒక సత్యాన్ని వెల్లడించాల్సి వచ్చింది– ‘‘అబద్ధం ఒకసారి నిజమైతే, ఇక వెనక్కి మళ్లే సమస్య ఉండదు’’. పిచ్చి తలకెక్కింది. రోకలిచుట్టమన్నట్టుగా, ఆ పని జరిగితే ప్రపంచం తలకిందులు కాక తప్పదు. కనుకనే మానవాళి ఇప్పుడు సమస్యల చౌరస్తాలో కొట్టుమిట్టాడుతోందని విజ్ఞుల భావనగా అర్థం చేసుకోవాలి! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
మహిళలే నవ భారత నిర్మాతలు
ఎన్ని అవరోధాలు, సవాళ్లు ఉన్నప్పటికీ భారతీయ మహిళలు తాము శక్తిమంతులమని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. విజయం సాధించాలనే నిబద్ధతతో ఉత్సాహంగా దూసుకుపోతున్నారు. నైపుణ్యం, గుర్తింపు, గౌరవం సాధించడానికి మహిళలు తాము చేసే ప్రయత్నాలలో ఎప్పటికీ నిరుత్సాహం చెందకుండా ఉండటమే వారిని మనకు నిజమైన ఆదర్శప్రాయులుగా చేస్తోంది. ‘నేటి లింగ సమానత్వమే రేపటి సుస్థిర సమాజం’... ఈ ఏడాది మన మహిళా దినోత్సవ నేపథ్యాంశం. మహిళలే మన నవ భారత నిర్మాతలు. కొన్ని దశాబ్దాల క్రితమే చిలకమర్తి లక్ష్మీ నరసింహం ‘ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్’ అన్నాడు. స్త్రీ–పురుష విభ జన జీవశాస్త్ర సంబంధమైనదే తప్ప పురుష ఆధి క్యతా ధోరణికి ఆమోద ముద్ర కాదని ప్రకటిం చాడు. ఆస్తిని విభజించినట్టే... స్త్రీ–పురుషుల్ని ఒక యూనిట్‌గా కాకుండా రెండు ‘వర్గా’లుగా చీల్చి తమ ఆధిక్యతా సామ్రాజ్యాన్ని స్త్రీమూర్తిపై స్థాపిం చుకోవడం కోసం పురుషులు తహతహలాడి నందునే మహిళా ఉద్యమాల ఆవశ్యకత వచ్చింది. ‘సెక్స్’ అనే పదం చాటున జరిగే ఈ కృత్రిమ విభజనకు 20వ శతాబ్దపు ఫ్రెంచి మహిళా ఉద్యమ నాయకురాలైన సిమన్ దిబోవర్ అడ్డుకట్ట వేసింది. ఆదిమ మానవుల్లో స్త్రీ–పురుషులు ఎదురు బొదురుగా నిల్చిన రెండు మానవా కృతులనీ, ఈ ఏకత్వాన్ని చెదర గొట్టింది స్త్రీమూర్తి కాదనీ దిబోవర్ ప్రకటిం చింది. యాజ్ఞవల్క్య ముని సహితం ‘రెండుగా చీలిన వెదురు బొంగే – సతి, పతి’ అన్నాడు! దిబోవర్ కన్నా పాతికేళ్లముందే గుడి పాటి వెంకటచలం... ‘స్త్రీకి కూడా శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి’ అన్నాడు! దిబోవర్ ఈ సమరంలో ‘పురుషులను తుడిచిపెట్టి ముందుకు సాగిపోవాలన్న దుష్ట తలంపు స్త్రీకి కలలో కూడా రా’దని చెబుతూ... కేవలం ఉద్య మాల వల్లనే, ఆచరణలో వినియోగంలోకి రాని కొన్ని అరకొర చట్టాలను సాధించుకున్నంత మాత్రాన్నే నిజమైన విమోచన కాదని చెప్పింది. స్త్రీలోని అంతర్ శక్తి ప్రబుద్ధమై తానూ జీవితానికి సాధికార వ్యాఖ్యాత కావాలన్నది ఆమె ప్రబోధం. అందుకే పితృస్వామిక వ్యవస్థలో అణగారుతూ వచ్చిన ‘మాధవి’కి తగిన ‘మాధ వుడు’ దొరికేదాకా ఈ పోరాటం ఆగబోదని చెప్పింది. స్త్రీ–పురుషుల మధ్య ఉన్న సంబంధం కేవలం మానవుల మధ్య అనుబంధం తప్ప మరొ కటి కాదన్న మార్క్స్ వాక్యాలతో దిబోవర్ తన ‘సెకండ్ సెక్స్’ ఉద్గ్రంథాన్ని ముగించడం విశేషం. అసలు ఫ్రెంచి విప్లవానికి మహిళలే పూర్తిగా నాయకత్వం వహించి ఉంటే ప్రపంచ చరిత్ర ఎలాంటి మలుపులు తిరిగి ఉండేదోనని సోవియెట్ సోషలిస్టు నేత వ్లాదిమిర్ లెనిన్ నిబిడాశ్చర్యం ప్రకటించాడు. ఎందు కంటే, అరకొర మార్పు లతో, పురుషాధిక్యతా రాజ కీయ పాలకవర్గాలు చేసే స్వార్థపూరిత చట్టాలు ఆచ రణలో ఉన్నంతకాలం, అవి ‘ఉనికి’లో ఉంటాయే గానీ, వాటి ‘ఉసురు’కు విలువ లేదు, రాదు. ఈ దుఃస్థితిలో ‘మహిళల అభ్యున్నతి కోసమే చట్టా లున్నా’యన్న పాలకవర్గాల మాటకు విలువ లేకుండా పోయింది. కారణం, చెప్పిన మాటకు, చేస్తున్న చట్టాలకు ఆచరణలో పొంతన లేకపోవ డమే. విలువ ఉన్న పక్షంలో శాసన వేదికల్లో వారి ప్రాతి నిధ్య శాతాన్ని ఎందుకు కుదిస్తున్నారు? 50 శాతం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించవలసిన ప్పుడు కనీసం దాన్ని వారు రాజీపడి సర్దుకుం టున్న 30 శాతానికి కూడా ఎందుకు పెంచలేకపోతు న్నారు? విశ్వకవి టాగోర్ మాటలకు నేటికీ విలువ తగ్గ లేదు. ‘మన శత్రువు మన సంకెళ్లను ఎంత గట్టిగా బిగిస్తే, అంత బలంగానూ మన సంకెళ్లు తెగి పోతాయి. శత్రువు కళ్లు ఎంతగా చింత నిప్పులైతే, అంతగానూ మన కళ్లూ నిప్పులు చెరగగలవు’. ఇవాళ కాదు, 1950 నుంచీ అవినీతికి వ్యతి రేకంగా గళమెత్తిన ఉద్దండులైన దేశ ఉన్నతాధి కారులు – కౌల్దార్, వాంఛూ, సంతానం, దగ్లీ, కాల్కర్, వోహ్రా కమిటీల సిఫారసులన్నీ ఏ గంగలో కలిశాయి? చివరికి లోక్‌పాల్ గతి ఏమైంది? 75 సంవత్సరాల భారత స్వాతంత్య్రోద్యమం తర్వాత కూడా గాంధీజీ సంధించిన ప్రశ్నకు ఈ రోజుదాకా మనం సూటైన సమాధానం చెప్పలేని దుర్గతిలో ఉన్నాం. మన దేశంలో అర్ధరాత్రి వేళ స్త్రీ ఒంటరిగా, నిర్భయంగా బజారులో వెళ్లగల పరిస్థితి ఉందా? ‘పది గంటల పనిదినం’ యూరప్‌లో మొదటి సారిగా ప్రవేశపెట్టిన రోజున కారల్‌మార్క్స్ ఆ చట్టం గురించి చిత్రంగా వ్యాఖ్యానించాడు: ‘ఇది కష్టజీవులైన శ్రామిక వర్గానికి సూత్రబద్ధమైన విజయం. ఎందుకంటే, చరిత్రలో మొదటిసారిగా మధ్యతరగతి రాజకీయ అర్థశాస్త్రం కార్మికవర్గ రాజ కీయ అర్థశాస్త్రానికి పట్టపగలే లొంగిపోయింది. ధనస్వామ్య వ్యవస్థలో ‘విశ్రాంతి’ కూడా కొలది మందికి మాత్రమే అందుబాటులో గల ‘విలువైన వస్తువే’గానీ, రెక్కాడితేగానీ డొక్కాడని అసంఖ్యాక శ్రమజీవులైన స్త్రీ–పురుషుల బతుక్కి మాత్రం శాంతీ లేదు, విశ్రాంతీ లేదు’ అన్నాడు. ‘భారత ప్రజలమైన మేముగా రచించుకుని అంకితమిచ్చుకున్న’ రాజ్యాంగాన్ని ప్రజలకు వ్యతి రేకంగా స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకొనే హక్కు దేశ పాలక వర్గాలకూ, పార్టీలకూ లేదని చాటి చెప్పిన రాజ్యాంగం మనది. అయినా, మహిళా హక్కులకు సంబంధించి మహిళా ప్రతి నిధులు ప్రవేశపెడుతూ వచ్చిన పెక్కు ప్రతిపాదన లను ఏదో ఒక మిష పైన అమలులోకి రాకుండా శతధా అడ్డుకుంటూనే వచ్చారని మరవరాదు. ఫ్రెంచ్ మహిళల చొరవ వల్లనే బానిస దుర్గంగా పేరొందిన బాస్టిల్లీ స్థావరం కుప్పకూలింది. అదే యావత్తు ఫ్రెంచ్ ప్రజలకు ప్రజాస్వామ్య రక్షణ దుర్గంగా చరిత్రలో కీర్తికెక్కింది. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
‘బంకర్లే’ నియంతల ఆఖరి ‘మజిలీ’!
అమెరికా కూటమి ఒరలోకి దూరడానికి ఉత్సాహపడింది ఒకప్పటి సోవియన్ రిపబ్లిక్ అయిన ఉక్రెయిన్. అయితే, ఉక్రెయిన్‌లో జలవనరులకు, చమురు వనరులకు, అణ్వస్త్ర సంపదకు అనువైన వాతావరణం ఉన్నందునే అమెరికా, ‘నాటో’ల కన్నుపడింది. అన్నింటికన్నా కీలకం గనక – ఉక్రెయిన్ చేతిలో ఉంటే మొత్తం పాత సోవియట్ రిపబ్లిక్లనే కైవసం చేసుకోవడం తేలికన్నది వలస సామ్రాజ్యవాదుల ఎత్తుగడ. అందుకు ప్రలోభాలతో ఉక్రెయిన్ సహకరించి... అమెరికా, నాటోలకు నేడు కేంద్ర స్థానమైంది. ఫలితంగా రష్యా ఉనికిని కాపాడుకోవడానికైనా పుతిన్ ఉక్రెయిన్ పట్ల స్వతంత్ర వైఖరితో ముందడుగు వేయవలసి వచ్చింది. ఈ అమెరికా, నాటో కూటములు ఉక్రెయిన్ను రక్షించలేవు. ఒకనాటి సోషలిస్టు సోవియట్ యూని యన్‌లో ఉక్రెయిన్ అంతర్భాగం. అలాంటిది ఇప్పుడెందుకు అమెరికా, బ్రిటన్ లాంటి రష్యా వ్యతిరేక దేశాల కూటమిలో భాగమైన ‘నాటో’, తదితర నయా వలస సామ్రాజ్య అనుకూల వ్యవస్థలో అంతర్భాగంగా మారింది? చివరికి భారత వ్యతిరేక రష్యన్ రిపబ్లిక్‌గా కూడా ఎవరి ప్రోత్సాహంతో మారింది? ఇందుకు భారత కేంద్ర ప్రభుత్వ సలహాదారైన కాంచన్ గుప్తా వ్యాఖ్యానాన్ని ఆశ్రయించవలసిందే. నాటో సామ్రాజ్యవాద కూటమికి అనుకూలంగా, భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ ప్రవ ర్తనను గుప్తా ఇలా ఎండగట్టారు: ‘‘ఒకవైపున ఐక్యరాజ్యసమితిలో స్థిర మైన ఇండియా వ్యతిరేక వైఖరి తీసుకుంటావు. 1998లో ఇండియా అణుపరీక్షల తర్వాత ఇండియాకు వ్యతిరేకంగా భద్రతా సమితి ఆంక్షలకు అనుకూలంగా ఓటు వేస్తావు. కశ్మీర్లో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని ఒత్తిడి చేస్తావు. ఇండియాకు వ్యతిరేకంగా విని యోగించే సైనిక ఆయుధాలను పాకిస్తాన్‌కు అమ్ముతున్నావు. అయినా నీకు ఇండియా సాయం మాత్రం కావాలి!’’ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా, సామ్రాజ్యవాద అనుకూల ఉక్రెయిన్ పరిస్థితులను అర్థం చేసుకోవడం కష్టం. కనుకనే మన దేశంలోని కొందరు సంపాదకులు ఉక్రెయిన్ పరిస్థితులకు వక్ర భాష్యాలు అల్లి మన యువకుల్ని తప్పు అవగాహనలోకి నెడు తున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ – ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభ స్థితిలో అక్కడ ఉన్నత విద్యాసంస్థల్లో ఇరుక్కుపోయిన పలువురు విద్యార్థుల్ని ఇక్కడ మన దేశంలో కొన్ని పత్రికా సంస్థలు ప్రశ్నిస్తున్న తీరు పరమ పాక్షికంగా తయారైంది. ఉక్రెయిన్‌లో రష్యా జోక్యం వల్లనే యుద్ధ పరిస్థితుల్ని అక్కడి మన పిల్లలు అనుభవించాల్సి వస్తోందన్న అభిప్రాయం ఇక్కడి మన శ్రోతలకు కలుగుతోంది. నిజానికి అక్కడి విద్యార్థుల్ని ఎంతమందిని, ఎంత గుచ్చి గుచ్చి ప్రశ్నించినా – రష్యా చర్యను మాత్రం ఖండించటం లేదని మరచిపోరాదు. అసలు ఉక్రెయిన్ రిపబ్లిక్ ఉనికి కథ ఇలా ఉంది. 31 సంవత్స రాల క్రితం వరకు ఒక పటిష్ఠమైన సోషలిస్టు రిపబ్లిక్‌గా 1991 దాకా నిలదొక్కుకున్న దేశం పరిస్థితి కృశ్చేవ్, గోర్బచేవ్‌లు రాజ్యాధికారం లోకి ప్రవేశించడంతో పూర్తిగా తారుమారై పోయింది. ‘సంస్కరణ’ల పేరిట సోషలిస్టు సోవియట్‌ను ఒక నాయకుడు ఇండియాలో ‘చెట్టు లెక్కి’ నాటకాలాడితే(ఇండియా పర్యటనలో కృశ్చేవ్ నిజంగానే చెట్లె క్కాడు), మరొక నాయకుడు (గోర్బచేవ్) ఐస్లాండ్ రాజధాని నగరం ‘రెక్జావిక్’లో అమెరికా కూటమితోనూ, పోప్తోనూ చేతులు కలిపి సోవియట్ సంపూర్ణ పతనానికి పునాదులు తవ్వాడు. నాటి నుంచి సోవియట్ పరిస్థితిలోనూ, సోషలిస్టు వ్యవస్థలోనూ దారుణమైన నైరాశ్యం చోటు చేసుకుంది. ఆ పరిస్థితిని మార్చే ‘నాథుడు’ కరువై సోవియట్ కుంటుతూ ‘రష్యా’ రూపంలో అవతరించి పతనావస్థకు చేరిన సమయంలో వ్లాదిమీర్ పుతిన్ తలెత్తి సోవియట్ పాత పుణ్యాన్ని కొంతవరకు నిలబెట్టడానికి తన పద్ధతుల్లో పూనుకున్నాడు. 1985లో గోర్బచేవ్ సోవియట్ నాయకత్వంలోకి ప్రవేశించడం తోనే ప్రారంభమైన సంస్కరణలు... ‘రెక్జావిక్’ సమావేశం ద్వారా పూర్తిగా నయా వలస సామ్రాజ్యవాద నాయకులకు అనుకూలంగా మారిపోయాయి. గోర్బచేవ్ రంగ ప్రవేశంతో పాత సోషలిస్టు సోవి యట్ కనుమరుగైపోయి, సోవియట్ రిపబ్లిక్‌లుగా ప్రశస్తికెక్కిన అర్మే నియా, జార్జియా, ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, ఉక్రెయిన్, బెలారస్, మాల్దోవా, అజర్బైజాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, ఉజ్బె కిస్తా్తన్, తుర్కుమెనిస్తాన్, కజక్‌స్తాన్ – మొత్తం 14 రిపబ్లిక్లు స్వాతం త్య్రాన్ని ప్రకటించేసుకున్నాయి. వీటిలో అమెరికా కూటమి ఒరలోకి దూరి, దాని ఆధ్వర్యంలో ‘నాటో’ సభ్యదేశంగా ఉనికిని చాటుకోవడా నికి సిద్ధమైంది ‘ఉక్రెయిన్’(అంతకుమునుపే ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా ఈ కూటమిలో చేరాయి). ఉక్రెయిన్‌లో జలవనరులకు, చమురు వనరులకు, అణ్వస్త్ర సంపదకు అనువైన వాతావరణం ఉన్నందునే అమెరికా, నాటోల కన్నుపడింది. ఉక్రెయిన్ చేతిలో ఉంటే మొత్తం పాత సోవియట్ రిపబ్లిక్లనే కైవసం చేసుకోవడం తేలికన్నది వలస సామ్రాజ్యవాదుల ఎత్తుగడ. అందుకు ప్రలోభాలతో ఉక్రెయిన్ సహకరించబట్టే పుతిన్ తన ఉనికిని కాపాడుకోవడానికైనా ఉక్రెయిన్ పట్ల స్వతంత్ర వైఖరితో ముందడుగు వేయవలసి వచ్చింది. అందు వల్ల ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభకులూ, దాన్ని కొనసాగించడం ద్వారా లబ్ధి పొంద గోరుతున్నవారూ... సామ్రాజ్యవాద కూటమీ, వారి చంకలో దూరిన ‘ఉక్రెయిన్’ నాయకులే. అందుకే ఉక్రెయిన్ సంక్షోభానికి అమెరికానే కారణమనీ ఉత్తర కొరియా అభిశంసించాల్సి వచ్చింది. అంతేగాదు, ‘శాంతిభద్రతల’ పేరిట ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందనీ, ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని కోల్పోతే అది సహించగల స్థితిలో లేదనీ ఉత్తర కొరియా ఈ సందర్భంగా ప్రకటిం చాల్సి వచ్చింది. చరిత్రలో ప్రజా కంటకులుగా మారిన పాలకులు ఎవరైనా వారి ఆఖరి ‘మజిలీ’ బంకర్లే. నాడు సోవియట్‌ను నాశనం చేసే కుట్రలో భాగంగా నాజీ హిట్లర్, నేడు రష్యాను ధ్వంసం చేసే ఎత్తుగడలో జెలెన్స్కీ– ‘బంకర్ల’ను ఆశ్రయించాల్సి వచ్చింది. చరిత్రలో మరొక సారి ఈ గౌరవం తిరిగి రష్యాకే దక్కడం అనుపమానమైన విశేషంగా పరిగణించక తప్పదు. ఉక్రెయిన్ ప్రస్తుత నాయకత్వం తన పతనావస్థ నుంచి ఇంకా కోలుకునే స్థితి లేదు. అమెరికా ‘నాటో’ కూటములు ఉక్రెయిన్ను రక్షించలేవనీ ఇప్పటికే అర్థమవుతోన్నా, ఇక్కడి మీడియా తన వైఖరిని సవరించుకోవడం లేదు. ఎందుకంటే, అమెరికా పెంచి పోషించిన టెర్రరిస్టు బుర్ర ఎలా పని చేస్తుందో ఎక్కడిదాకానో అక్కర్లేదు... ఆసియా వాసి అయిన డేవిడ్ హెడ్లీని బొంబాయి హోటల్లో అమె రికా జరిపిన కుట్రలో ఎలా భాగస్వామిని చేసిందో మనకు తెలుసు. ఇస్లామిక్ ఉగ్రవాదం, తదితర అంతర్జాతీయ ప్రధాన ఘటనలను గురించి సాధికారిక కథనాలను అందించిన ప్రసిద్ధ జర్నలిస్టు కారె సోరెన్సేన్... బొంబాయి హోటల్‌పైన దాడిలో అమెరికా ప్రయో గించిన టెర్రరిస్టు డేవిడ్ హెడ్లీ గురించి ‘ద మైండ్ ఆఫ్ ఎ టెర్రరిస్ట్: స్ట్రేంజ్ కేస్ ఆఫ్ డేవిడ్ హెడ్లీ’ గ్రంథం వెలువరించాడు. అందులో ఆ దాడికి సంబంధించిన ప్రతి ఒక్క ఘట్టం గురించి పూసగుచ్చి వివ రించాడు. నేడు ఉక్రెయిన్ కథనాలూ ఇందుకు ఏ మాత్రం భిన్నంకావు. మరొక మాటలో చెప్పాలంటే... అమెరికా, ‘నాటో’ కూటమి హస్తం నుంచి రష్యన్–ఉక్రెయిన్ పూర్తిగా విమోచన పొందిననాడు ప్రపం చానికి కూడా శాంతి అని భావించాలి. ఈ సందర్భంగా ప్రపంచ శ్రామికవర్గ విమోచననే శ్వాసించిన కారల్ మార్క్స్ చెప్పిన మాటలు మరొక్కసారి మననం చేసుకోదగ్గవి. ‘‘శ్రామిక ప్రజలూ, ఆస్తీ – రెండు పరస్పర వ్యతిరేక దృక్పథాలు. కానీ ఒక ఒరలోనే వాటి ఉనికి. ఎందుకంటే, ప్రపంచంలోని వ్యక్తిగత ఆస్తికి (ప్రైవేట్ ప్రాపర్టీ) ఉభయులూ సృష్టికర్తలే. అయితే ఈ పరస్పర విరుద్ధ ప్రయోజనాలుగల ఈ ఒరలో ఎలా ఇమడటం అన్నది అసలు ప్రశ్న. అందుకే ప్రైవేట్ ఆస్తి వ్యక్తికీ, సమాజానికీ ప్రధాన శత్రువు అనేది! ఎందుకంటే ధన సంచులకే అంకితమైపోయిన బుర్రలు యంత్రాలనే పొగుడుతూంటాయిగానీ, ఆ యంత్రాలను నడిపించే కార్మిక శక్తిని గుర్తించడానికి ఇష్టపడవు’’ అన్నాడు. అందుకే ప్రపంచ మహా రచయితలలో ఒకరు, సంపన్న వర్గానికి చెందిన ఫ్రెంచ్ రచయిత బాల్జాక్ తన వర్గానికీ, ఆ వర్గ ప్రయోజనాలకీ, వారి రాజ కీయ స్వప్రయోజనాలకూ విరుద్ధంగా తిరగబడవలసి వచ్చింది. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
బుద్ధి చెప్పువాడు గుద్దిన నేమయా?!
ఇటీవల సింగపూర్ పార్లమెంటులో ఆ దేశ ప్రధాని లీ సీన్ లూంగ్ భారత్ ప్రస్తావన తేవడం మన దేశంలో రాజకీయ దుమారం రేపింది. ఉన్నత విలువలు, ఆదర్శాలతో నెహ్రూ రూపుదిద్దిన ఇండియాలో నేడు సగం మంది పార్లమెంటు సభ్యులు నేర చరిత్ర ఉన్నవారేనని లీ సీన్ అనడంపై భారత ప్రభుత్వ వర్గాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. గౌరవ పార్లమెంటేరియన్ల అవినీతి చర్యల గురించి ఒకటి కాదు, పదుల సంఖ్యలో సాధికారికమైన ఫిర్యాదుల్ని నమోదు చేసి, నివారణ చర్యల్ని నివేదికలు ప్రతిపాదించినా ఫలితం శూన్యం కావడం వల్లనే సింగపూర్ ప్రధాని తమ దేశస్థుల్ని హెచ్చరిస్తూ బహుశా ఆ ప్రకటన విడుదల చేయవలసి వచ్చి ఉంటుంది! ‘బుద్ధి చెప్పువాడు గుద్దిన నేమయా’ అని వేమన అన్నట్లు.. సింగపూర్ ప్రధానిపై మనం ఆగ్రహం వ్యక్తం చేయడం కాదు... ఆయన మాటలపై ఆలోచన సారించాలి. ‘‘భారత పార్లమెంటు సభ్యుల్లో సగం మంది నేర చరితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారని.. ఇండియా, ఇజ్రాయిల్‌లలో నేడు ఇదే పరిస్థితి కొనసాగుతోంద’’ని సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్ తమ పార్లమెంటులో (15.2.2022) ప్రకటించారు. దేశ ప్రధాన ప్రతిపక్షమైన వర్కర్స్ పార్టీ ఉదాహరించిన వివరాల ఆధారంగా ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. అలాంటి దుఃస్థితి వైపు సింగపూర్ ప్రయాణించకుండా జాగ్రత్త పడవలసిన అవసరాన్ని ఆయన గుర్తు చేస్తూ భారతదేశాన్ని ఉదాహరించారు. అందుకు భారత ప్రభుత్వ వర్గాలు తీవ్ర అభ్యంతరం తెల్పాయి. మన ‘భాగోతం’ మనకు తెలుసు కాబట్టి, ‘ఉన్నమాటంటే ఉలుకెక్కువ’. అందుకే వేమన మహాకవి శతాబ్దాల క్రితమే ‘బుద్ధి చెప్పువాడు గుద్దిన నేమయా’ అని హెచ్చరించాల్సి వచ్చింది! అందుకే మన దేశంలో ‘డబ్బున్న వాడి వీపు పుండైనా ప్రపంచానికి వార్తయిపోతుంది, పేదవాడింట్లో పెళ్లయినా లోకానికి తెలియదు’ అంటారు! ఇప్పుడీ నీతి పాఠం ఎకాఎకిన మన ఇంటి ఆవరణలోకే ప్రవేశించాల్సి వచ్చింది. ఏళ్లూ, పూళ్లూగా కరెక్షన్ దూరమై, కరప్షన్‌కు దగ్గరవుతూ వచ్చిన సగంమంది పార్లమెంటు సభ్యుల దుఃస్థితిని దఫదఫాలుగా ఎవరో సింగపూర్ ప్రధానమంత్రి వచ్చి చెప్పకుండానే పలు భారత సాధికార విచారణ సంస్థలు, సంఘాలు, పౌర సమాజాలు బహిర్గతం చేస్తున్నా, శరీరాలతోపాటు మనస్సులూ మొద్దుబారుతూ వస్తున్నాయి. అందుకే ‘బుద్ధి చెప్పేవాడు ఒక గుద్దు గుద్దినా’ లబోదిబోమన కూడదన్నాడు వేమన! నిలవని వాద ప్రతివాదాలు ఇంతకూ ఈ ‘జబ్బు.. వ్యక్తి లోపం వల్ల వచ్చిందా, వ్యవస్థ లోపంవల్ల పుట్టుకొస్తుందా అంటే ‘చెట్టు ముందా, విత్తు ముందా’ అన్న వాదనలోని ఔన్నత్యం వైపు ‘మోరలు’ చాచవలసిందే! ఎందుకంటే తుమ్మ చెట్టుకు ముళ్లు మొక్కతోనే పుడతాయి. దానికి ఆ లక్షణం సహజం. అలాగే వ్యవస్థ, దానిని అనుసరించి వ్యక్తీ! అందుకే, దేశ అత్యున్నత శాసన వేదికగా, దేశానికి దిక్సూచీగా ఉండవలసిన భారత పార్లమెంటరీ వ్యవస్థ, దాని గౌరవ సభ్యులూ గాడి తప్పి వ్యవహరించడానికి అసలు కారణం... ‘భారత పౌరులమైన మేము, మేముగా రచించుకుని, రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకున్నందున అందుకు అనుగుణంగానే’ లౌకిక సెక్యులర్ వ్యవస్థను రక్షించుకుని కాపాడుకునే బాధ్యత కూడా తమపైనే ఉందని ప్రకటించు కోవడమేనని రెండో మాటకు తావు లేకుండా స్పష్టం చేసుకున్నారు. అందువల్ల మరో ‘మడత పేచీ’కి ఇక్కడ ఆస్కారం లేదు! అయినా, నిరంతరంగా గౌరవ పార్లమెంటులలో సగం మందికి పైగా లౌకిక రాజ్యాంగ ఉల్లంఘనలకు, అవినీతికి పాల్పడుతూ ఉండటానికి కారణం వ్యవస్థలోని లొసుగులు, ‘రబ్బరులా’ సాగదీసే పార్ల మెంటేరియన్ల నిలవని వాద ప్రతివాదాలూ! కనుకనే బుద్ధి చెప్పేవాళ్లు ఎవరైనా నాలుగు గుద్దులు వేయడం, మనం భరించాల్సి రావటం సహజం! అనుమానాలకు తావిస్తున్నామా? గౌరవ పార్లమెంటేరియన్ల అవినీతి చర్యల గురించి ఒకటి కాదు, పదుల సంఖ్యలో సాధికారికమైన ఫిర్యాదుల్ని నమోదు చేసి, నివారణ చర్యల్ని నివేదికలు ప్రతిపాదించినా ఫలితం శూన్యం కావడం వల్లనే సింగపూర్ ప్రధాని తమ దేశస్థుల్ని హెచ్చరిస్తూ బహుశా ఆ ప్రకటన విడుదల చేయవలసి వచ్చి ఉంటుంది! చివరికి మన ప్రవర్తన కూడా ఎలా తయారైందంటే.. ఇరుగు పొరుగు సఖ్యతను సదా కోరుకొంటూ ఆసియా దేశాల భద్రతకు అగ్రస్థానంలో ఉండి నాయకత్వం వహిం చాల్సిన మనం ఆ అవకాశాన్ని ఆసియావాసులు కాని వలస సామ్రాజ్య పాలకులైన ఆంగ్లో–అమెరికన్ల చొరవకు మరోసారి మనమే అవకాశం కల్పిస్తోంది. అదే మన ఇరుగుపొరుగు దేశాలలో అనేక అనుమానాలకు దారి తీస్తోందన్న గ్రహింపు మనకు తక్షణం అవసరం. పైగా ఆంగ్లో–అమెరికన్ వలస సామ్రాజ్యవాద వ్యూహా లలో ఆసియా–ఆఫ్రికా ఖండ దేశాల ప్రయోజనాలకు విరుద్ధంగా బాహా టంగా ఇజ్రాయిల్‌తో ‘పెగసస్’ గూఢచర్యంలో పాలుపంచుకుని అభాసుపాలవుతున్న మన రక్షణ వ్యవస్థ ప్రయోజనాలనే మన గౌరవ సుప్రీంకోర్టు ప్రశ్నించి, ఊగించి శాసించవలసిన పరిస్థితి వచ్చింది. అలా చివరకు దేశ పరువు ప్రతిష్ఠలకు ఎంతటి హాని కల్గిందో ప్రశ్నించుకోవలసిన అగత్యంలో మనం ఉన్నాం! గుజరాత్ ఒక ఉదాహరణ సుప్రీం విశిష్ట సలహాదారు రాజూ రామచంద్రన్ గుజరాత్ మైనారిటీ లపై సాగిన ఊచకోతలపై సుప్రీంకోర్టుకు సమర్పించిన సుదీర్ఘ సమగ్ర నివేదిక గతి ఏమైనట్టు? ఎందుకు ఇప్పటిదాకా దాని అతీగతీ తెలి యనివ్వకుండా ‘చెదలు’ పట్టించాల్సి వచ్చింది? ఆ నివేదిక పూర్తి పాఠాన్ని ప్రజలకు అందనివ్వకుండా చేసిందెవ్వరు? నాటి గుజ రాత్లో మైనారిటీలపై జరిగిన దుర్మార్గాలకు బాధ్యులైన పాలకుల్ని ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరాన్ని రామచంద్రన్ తన నివేదికలో సుప్రీంకోర్టుకు ఎందుకు సలహా ఇవ్వవలసి వచ్చింది? అంతటి తీవ్రమైన అభియోగాన్ని గుజరాత్ పాలకులపై మోపి శిక్షార్హులుగా ప్రకటించిన సుప్రీం సలహాదారు నివేదికను చివరికి ఎలా పాలకులు తొక్కిపట్టి ‘చెదలు’పట్టించారు? తుదకు నాటి బీజేపీ గుజరాత్ పాల కులకు అండగా భారత చట్టాలు అమలు జరగాల్సిన తీరుతెన్నుల్ని నిర్ధారించవలసింది, విచారించవలసింది లాయర్లు, సుప్రీం సలహా దారులూ కాదని, విచారణ అనేది పోలీసుల పనిగానీ, లాయర్ల పని కాదని అరుణ్ జైట్లీ లాంటి బీజేపీ నాయకుడు వాదించ సాహ సించారు! చివరికి జరిగిన పని – సుప్రీం విచారించకుండానే రామ చంద్రన్ నివేదికను పక్కన పెట్టించేయడం. ఈ భాగోతాన్ని క్షుణ్ణంగా ఆనాటి ‘ఇండియా’ పత్రికలో (2012 మే 7) రోహిత్ ఖాన్, వైద్య నాథన్ సమగ్రంగా ప్రచురించారు. ఆత్మవిమర్శనంటేనే ఏవగింపా! భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ఇజ్రాయిల్ మాజీ ప్రధాని బెన్ గురియన్ తమ దేశాలు స్వాతంత్య్రం పొందడానికి చేసిన కృషితో పోలిస్తే ఆ తరువాత దేశాధికారంలోకి వచ్చిన రాజకీయవేత్తల తరం... తరువాతి పాలకుల నైతిక విలువలు క్షీణదశకు దారి తీశాయని సింగపూర్ ప్రధాని వ్యాఖ్యానించడం మన నేటి పాలకుల అసమ్మతికి కారణం అయి ఉంటుంది, అది భారత రాజకీయాలలో ప్రత్యక్ష జోక్యంగా భావించడమూ సహజం. కానీ, ఆత్మవిమర్శన అనేది ఈ తరం భారత నాయకులలో కొందరికి ఏవగింపుగా మారి నందున, సవరణకు వారి మనస్సు ఇష్టపడదు. ఎందుకంటే తుమ్మ చెట్టుకు ముళ్లు మొక్కతోనే పుడతాయి, దానికి ఆ లక్షణం దాని వినాశంతోనే గానీ పోదట! ఎందుకంటే, కనీసం ఎద్దుకు ఏడాదిపాటు నేర్పితే మాట తెలిసి నడుచుకుంటుందటగానీ మూఢునికి ముప్పయ్యే ళ్లయినా, వాడి మూఢత్వం పోదట. కనుకనే ‘బుద్ధి చెప్పేవాడు ఓ గుద్దు గుద్దినా తప్పులేదన్న’ మాటను తన నాటి అనుభవాల్ని బట్టి వేమన ఖరారు చేసి ఉంటాడు! దేశ పౌరహక్కుల చట్టంపై పాలకులు ‘చురకత్తి’ పెట్టి బెదిరిస్తున్నప్పటినుంచీ వేమన్న గుర్తుకు రాని క్షణ మంటూ ఈ రోజు వరకూ లేదు సుమా! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కోవిడ్ ఎప్పటికైనా ముగిసేనా?
త్వరలోనే జనం మాస్కులు మరిచిపోవచ్చునని ఒక మాట. అయినా తగిన జాగ్రత్తలు తప్పవని మరో మాట. తీవ్రమైన మూడో దండయాత్ర తర్వాత కొన్ని రోజుల్లోనే నెమ్మదిస్తుందని ఒక సంస్థ ప్రకటన. ‘ఒమిక్రాన్’ అదుపుతప్పి, జనావాసాలను చుట్టబెట్టడంవల్ల దాని వ్యాప్తిని అరికట్టడం అసాధ్యమయ్యేలా ఉందని కొందరు నిపుణుల ఆందోళన. వీటన్నింటికి తోడు రానున్న ‘కోవిడ్’ వేరియంట్లు వ్యాక్సిన్ రక్షణకు కూడా లొంగక పోవచ్చునన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమానం. ఇలాంటి వ్యాఖ్యానాలు ప్రజల్లో కొత్త భయాల్ని రేకెత్తించే అవకాశం లేకపోలేదని వైద్య నిపుణులు కూడా భావిస్తున్నారు. అయితే ఒకమాట: లాభాల వేటలో ప్రజల ఆరోగ్యాల్ని శాసిస్తున్న అరాచక వ్యవస్థ ఉన్నంతకాలమూ కరోనా లాంటి వైరస్‌లూ పోవు, ఆ పేరిట రోజుకొక తీరున తలెత్తే వాటి ‘మహమ్మారులూ’ పోవు. అమెరికా పాలకవర్గాలనూ, వారి అను మతితో ప్రజల అవసరాలనూ అక్కడి 84 ఫార్మా కంపెనీలు ఆడింది ఆటగా, పాడింది పాటగా శాసిస్తున్నాయి. లాభాల వేటలో ప్రజల ఆరోగ్యాల్ని శాసిస్తున్న అరాచక వ్యవస్థ ఉన్నంతకాలమూ కరోనా లాంటి వైరస్‌లూ పోవు, ఆ పేరిట రోజుకొక తీరున తలెత్తే వాటి ‘మహమ్మారులూ’ పోవు. ఈ సత్యం తెలిసి కూడా ఫార్మా కంపెనీల లాభాల వేటలో భాగస్వాములయ్యో, లేదా మోసపోతూనో ‘ఆకుకు అందని పోకకు పొందని’ పరిష్కారాలను కొందరు డాక్టర్లు రక రకాలుగా సూచిస్తున్నారు. సరిపడా ఉండాల్సిందేనా? ఈ అవకాశవాద హెచ్చరికలకు తాజా ఉదాహరణ– కొలది రోజుల నాడు (12 ఫిబ్రవరి 2022) అమెరికాలో సర్జన్ జనరల్‌గా ప్రాక్టీసులో ఉన్న గౌరవ వివేక మూర్తి వ్యాఖ్యలు. ‘మాస్క్’లు ఇక త్వరలోనే పోతాయని ఆయన అన్నారు. అయితే చిలవలు–పలవలుగా పుట్టు కొస్తున్న కొత్త మహమ్మారులనూ, వాటి కొత్త అవతారాలనూ అణచి వేయగల వ్యాక్సిన్లు, బూస్టర్ డోసులు మాత్రం సరిపడా సంఖ్యలో ఉండాల్సి వస్తుందని చెప్పారు. అప్పుడే ప్రజల మరణాల సంఖ్యను తగ్గించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ, ప్రపంచ ఫార్మా కంపెనీలనూ, ప్రభుత్వాలనూ లాభాల వేట కోసం శాసిస్తున్న ఆ 84 ఫార్మా కంపెనీలను అదుపు చేయగల మొనగాడి కోసమే ప్రపంచం ఇంకా ఎదురుచూస్తోంది. కానీ ఆ కంపెనీల అవసరం పాలక వర్గాలకు ఎంత ఉందో, ఆ కంపెనీలకు పాలక వర్గాల అవసరమూ అంతే ఉంది. అందుకే ఈ ముసుగులో గుద్దులాట సమసిపోవడం లేదు. కనుకనే, సర్జన్ జనరల్ వివేక మూర్తి ఆశిస్తున్నట్లు మాస్కులు త్వరలోనే పోయినా ‘కరోనా’ జాగ్రత్తలు అనివార్యమని అటో ఇటో తెగని ‘భట్టిప్రోలు పంచాయతీ’తో తృప్తి పడవలసి వస్తోంది! అందరూ కోవిడ్ బాధితులేనా? నిజానికి, ‘కరోనా’ వైరస్‌కు పరిష్కారం పేరిట అమెరికన్ 84 ఫార్మా కంపెనీలు, వాటికి ఆసరాగా వివిధ దేశాల్లో అదే పేరిట లాభాల వేట కోసం ‘అర్రులు చాచి’ కూర్చున్న పెక్కు వందిమాగధ ప్రైవేట్ కంపెనీలు సహా అక్కడి కోర్టులో పెక్కు కేసులు ఎదుర్కొంటున్న సంగతి మనం మరవరాదు. చివరికి భారత పాలకులు కూడా తప్పుకోలేని కేసులలో ఇరుక్కుపోవలసి వచ్చింది. చివరికి సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, అలాగే ఇతర ‘కోవిడ్–19’ లాంటి లక్షణాలు కనిపించిన వారికల్లా నిర్ధారణలతో నిమిత్తం లేకుండానే ‘కోవిడ్’ బాధితుల కింద జమకట్టే మనస్తత్వమూ పెరిగి పోయింది. అందుకే హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ హృద్రోగ నిపుణులు డాక్టర్ సోమరాజు హార్ట్ పేషెంట్స్‌కు ఇటీవలి కాలంలో రెండు నాణ్యమైన ఔషధాలను సూచించారు. 1. ఏడాదికొకసారి ఇన్ ఫ్లూయెంజా ఇంజెక్షన్, 2. ఐదేళ్లకొకసారి వేసుకోవాల్సిన న్యూమో నియా వ్యాక్సినేషన్. ‘కోవిడ్–19’కు తొలి కేంద్రంగా భావించిన చైనా ఆ వ్యాధిని అరికట్టడంలో అంత వేగంగానూ స్పందించి, అదుపు చేసుకుంది. ఆ పిమ్మట అందుకు సంబంధించిన కొత్త వేరియంట్స్ ఏవి తలెత్తినా వెంటనే స్పందించి అదుపు చేసుకోవడానికి అలవాటుపడింది. ఒక విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థకే వ్యాధి పరిష్కారాల విషయంలో చైనా అనుభవం, దాని ప్రతిపాదనలే నేడు దిక్సూచిగా ఉపయోగ పడుతున్నాయి. అలాగే నిన్నగాక మొన్ననే (28 జనవరి 2022) దక్షిణాఫ్రికాలో సరికొత్త ‘కోవిడ్’ ప్రబలినట్టూ, అందువల్ల ప్రజలు ఎక్కువ సంఖ్యలో మరణిస్తున్నట్టూ, దాని వ్యాప్తి అదుపు తప్పు తున్నట్టూ మొదటిగా సోవియట్తోపాటు, చైనా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థను ఏకకాలంలో హెచ్చరించాయి. ప్రభావం తక్కువని చెప్పలేం? కోవిడ్ మూడో దండయాత్ర 14 రోజుల్లో తీవ్ర స్థాయికి చేరి తర్వాత నెమ్మదిస్తుందని ఒక సంస్థ ప్రకటించగా, కొత్తగా తలెత్తిన ‘ఒమిక్రాన్’ అదుపుతప్పి, జనావాసాలను చుట్టబెట్టడంవల్ల దాని వ్యాప్తిని అరి కట్టడం అసాధ్యమయ్యేలా ఉందని కొందరు నిపుణులు తీవ్ర ఆందో ళనను వ్యక్తం చేశారు. ప్రపంచాల్ని లాభాల వేట కోసం కేంద్రంగా మార్చుకున్న ప్రపంచ ఫార్మా కంపెనీలు ఉనికిలో ఉంటూ శాసిస్తు న్నంత కాలం రాబోయే మరిన్ని ‘కోవిడ్’ రూపారూపాల ప్రభావం తక్కువ స్థాయిలో ఉంటుందన్న ‘గ్యారంటీ’ ఇవ్వలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. పైగా ‘ఒమిక్రాన్’ కన్నా రాబోతున్న ‘కోవిడ్–19’ కొత్త వేరియంట్ మరింత ‘మహమ్మారి’గా మారే అవకాశం ఉందని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటిస్తూ హెచ్చరిస్తున్నందున ఏదీ ఇంకా ఆరోగ్య సంస్థల, వైద్య ఆరోగ్య నిపుణుల అదుపులోకి పూర్తిగా వచ్చినట్టు భావించకుండా అజాగ్రత్తగా ఉండరాదు. ఒక్క ‘ఒమిక్రాన్’ వేరియంట్ వల్లనే వారం రోజుల్లోగా రెండున్నర కోట్ల కోవిడ్ కేసులు కొత్తగా నమోద య్యాయన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన మరింత ఆందోళన కరంగా తయారైంది. అందువల్ల కొత్తగా తలెత్తగల వేరియంట్ల తీవ్రత తక్కువగా ఉండొచ్చునన్న ‘ఊహాగానాలు’ నమ్మదగినవి కావని ప్రపంచ ఆరోగ్య సంస్థ సందిగ్ధంగా ప్రకటించడం మరింత ఆందో ళనకు దారితీస్తోంది. నిర్దిష్ట అస్థిమితం అయితే అదే సమయంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పే మాటలు కూడా మరిన్ని అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఎందుకంటే, రేపు రాబోయే వేరియంట్ల రూపాలు తీవ్రంగా ఉంటాయా, తక్కువ స్థాయిలో ఉంటాయా అన్న మీమాంస కన్నా ఒక మానసిక స్థితికి ‘ప్రజలు సిద్ధమైతే మెరుగేమో’ అని అనుమానం ప్రకటిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తేలిక ధోరణిని ప్రదర్శిస్తోందిలా: ‘‘మీరు శాశ్వతంగా మాస్క్ ఎల్లప్పుడూ ధరించనక్కర్లేదు. భౌతికంగానూ మరీ దూరంగానూ ఉండనక్కర్లేక పోవచ్చు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ నియమాల్ని పాటించాల్సిందే.’’ ఇలా కర్ర విరక్కుండా పాము చావకుండా ఉండేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ తీర్పు ఉందంటే, ప్రజల మానసిక స్థితి ఎక్కడ స్థిరపడుతుందో చెప్పలేని విచిత్ర పరిస్థితి నేడు! అంతేగాదు, రానున్న ‘కోవిడ్’ రకరకాల వేరియంట్లు వ్యాక్సిన్ రక్షణకు కూడా లొంగక పోవచ్చునన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమానం ప్రజల్లో కొత్త భయాల్ని, ఆందోళనలను రేకెత్తించే అవకాశం లేకపోలేదని వైద్య నిపుణులు కూడా భావిస్తున్నారు. అంతేగాదు, కోవిడ్ వేరియంట్ అంతిమంగా ఒక రూపం తొడిగి స్థిరపడే ముందు అస్థిమితంగా ఉంటుందని కూడా నిపుణులు హెచ్చరిస్తుండటం వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దిష్టమైన అభిప్రాయం కూడా ‘అస్థిమితం’గా మారడం ప్రజల మనస్సుల్ని కలవరపెట్టే అంశమని చెప్పక తప్పదేమో! అందుకే అన్నాడేమో మహాకవి... ఇంత మాలోకం మధ్య స్వార్థ రాజకీయ పాలకుల మధ్య, వారి ఆశీస్సులతో ఎదుగుతున్న ఫార్మా కంపెనీల లాభాల వేటను రక్షించడానికే ‘న్యాయస్థానాలూ, రక్షక భట వర్గాలూ, చెరసాలలూ, ఉరికొయ్యలూ ఏర్పడ్డాయి. ఆ స్వార్థపూరిత రేఖను ఇవి కాపాడక తప్పదు’. ఇప్పుడు మనం పచ్చినిజం నీడలోనే ఉన్నామని గ్రహించి, మేల్కొనక తప్పని ముహూర్తాలు ముంచు కొచ్చాయి. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఆదర్శ జీవితానికి కొలమానం
సుప్రసిద్ధ ఫొటో జర్నలిస్టుగా, ప్రజల జీవనాన్ని, వారి సంస్కృతిని జీవితాంతం తన కెమెరాకన్నులో బంధించి పేద ప్రజల బతుకు చిత్రాన్ని అక్షర సత్యంగా నాలుగు దశాబ్దాలకు పైగా అందిస్తూ వచ్చిన ప్రజా కళాకారుడు భరత్ భూషణ్. ఆయన నిజ జీవితంలో కూడా తిరుగులేని ఒక ఆదర్శ శిఖరం! భరత్ దశాబ్దాలుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ కూడా తన కెమెరా కన్నుకు క్షణం విశ్రాంతి నివ్వలేదు. విద్యావంతురాలైన పేదింటి మహిళా రత్నం సుభద్రను ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం తర్వాత రెండు కుటుంబాలకు కనపడకుండా నెలల తరబడి కాదు, కొన్నేళ్లపాటు అజ్ఞాత జీవితాన్ని కూడా గడుపుతూ ఆమె జీవితాన్ని తీర్చిదిద్దాడు. ఈ జంటను కాపాడుకుంటూ వారి ఆదర్శానికి ఒక దిక్సూచిగా నిలబడవలసిన ధర్మం నాకూ, నా భార్య సుధారాణిపైన పడింది. అలా వారి అజ్ఞాత దాంపత్యం కొత్త చిగుళ్లు తొడిగింది. కలవారి కుటుంబంలో పుట్టిన భరత్, పేద కుటుంబంలో పుట్టిన విద్యావంతురాలైన సుభద్రను చేసుకోవడంతో ఎదురైన కొత్త కష్టాలను ధైర్యంతో, మనో నిబ్బరంతో ఎదు ర్కొంటూ వచ్చాడు. ‘ఉదయం’ దినపత్రిక ద్వారా (1984–86) మొదలైన మా స్నేహం వయోభేదంతో నిమిత్తం లేకుండా, ప్రాంతా లతో సంబంధం లేకుండా ఎదుగుతూ వచ్చింది. అందు వల్ల భరత్ భౌతికంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగమైన తెలంగాణకు చెందినా, ఏ కోశానా ప్రాంతాల స్పృహ లేకుండా తెలుగువాళ్లుగా స్నేహ బాంధవ్యం పెరిగి బలపడుతూ వచ్చింది. ఈ బంధం, ఆత్మీయతల అనుబంధంగా పెరుగుతూ వచ్చింది కనుకనే హైదరాబాద్ లోని మా ఇల్లు భూషణ్ దంపతుల సొంతిల్లుగానే మారిపోయింది. ఈ చరిత్ర మన జర్నలిస్టు మిత్రులలో చాలా కొద్దిమందికే తెలుసు. మొన్న భరత్ పేద ప్రజా జీవితాలకు అంకితమైన ఫొటో జర్నలిస్టుగా కన్నుమూసే వరకూ మా కుటుంబాల ఆత్మీయతలు ఎక్కువ మందికి తెలియవు. మొన్నమొన్న భరత్ కన్నుమూసే వరకు, చివరి క్షణాల వరకూ భరత్, సుభద్రలు, వారి కుమార్తె అనుప్రియ, కొడుకు అభినవ్ నాతో భరత్ ఆరోగ్య విషయాల గురించి చెబుతూనే ఉన్నారు. వృద్ధాప్యం వల్ల నేను ఎక్కువసార్లు భరత్ ఇంటికి వెళ్లి ఇంతకు ముందులా అతడిని పరామర్శిస్తూ ముచ్చటలాడటం కుదరలేదు. అందువల్ల కేవలం ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం తెలుసుకుంటూ ఉండేవాడిని. తను ఏ చిన్న ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకున్నా విధిగా నాకు ఫోన్ చేస్తూ మీరు కూడా వస్తే ‘నాకు దండి’గా ఉంటుందని చెప్పేవాడు. కానీ నా ఆరోగ్య పరిస్థితి, వృద్ధాప్య దశవల్ల నేను వాటిలో కొన్నింటికీ వెళ్లేవాడిని కాదు. ఐనా విధిగా సమాచారం మాత్రం భరత్ అందిస్తూనే ఉండేవాడు. అరుదైన ప్రజల, పేదసాదల ఫొటో జర్నలిస్టుగా, కళాకారుల్లో అరుదైన సమాజ స్పృహ తీవరించి ఉన్న వ్యక్తిగా భరత్‌ను నేను పరిగణిస్తాను. అంతేగాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, తరువాత ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా తెలంగాణ వాసి అయిన భరత్‌కు తెలిసినంత లోతుగా తెలంగాణ సంస్కృతీ వైభవానికి చెందిన అనంతమైన పార్వ్శాలు మిగతా తెలంగాణ కళాకారులకు తెలియ వంటే ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజా జీవితానికి చెందిన అనేక కోణాలను, చివరికి ఇళ్ల తలుపు చెక్కల సొగసుల్ని, వంటింటి సామాన్ల తీరు తెన్నుల్ని అక్షరబద్ధమూ, చిత్రాక్షర బద్దమూ చేసి చూపరుల్ని ఆశ్చర్యచకితులను చేశాడు భరత్. (క్లిక్: నిబద్ధ కెమెరా సైనికుడు.. సెల్యూట్ మై ఫ్రెండ్!) అందుకే ఏ తెలంగాణ చిత్రకారునికన్నా, ఫొటో జర్నలిస్టుకన్నా లోతైన అవగాహనతో భరత్ తెలంగాణ ప్రజా జీవన చిత్రాలను ప్రాణావశిష్టంగా మలిచారని చెబితే అతిశయోక్తి కాదు. భరత్ కుంచెలోనూ, కలం లోనూ విలక్షణమైన ఈ శక్తియుక్తులను పెంచి పోషించింది అభ్యుదయ భావ సంప్రదాయాలేనని మనం గుర్తించాలి. సబ్బు ముక్క, తలుపు చెక్క కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. అలాగే తెలంగాణ పల్లెపట్టుల్లో తలుపు చెక్కల సౌందర్యాన్ని ఫొటో జర్నలిజం ద్వారా చిత్రబద్ధం చేశాడు భరత్. మహాకవి కాళోజి అన్నట్లు ‘‘చావు నీది, పుట్టుక నీది/ బతుకంతా దేశానిది’’. ఈ సత్యాన్ని ఎన్నటికీ మరవకండి! అందులోనే నిజం ఉంది, నిజాయితీ ఉంది!! (చదవండి: ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు) - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
పౌరహక్కులే దేశానికి అరిష్టమా?!
ఒక దేశ పౌరుడిగా నెరవేర్చవలసిన కొన్ని బాధ్యతలుంటాయి. అవి నెరవేరుస్తూనే తన హక్కుల కోసం కూడా అతడు నిలబడాల్సి ఉంటుంది. అది కూడా తన బాధ్యతలో భాగం చేసుకున్నవాడే సమాజ శ్రేయస్సు గురించీ, సాటి మానవుడి గురించీ ఆలోచించగలడు, వారి కోసం పాటుపడగలడు. బాధ్యతగా ఉండటమంటే కేవలం ‘బుద్ధిగా’ తన పని తాను చూసుకోవడం కాదు. కానీ పాలకులకు కావాల్సింది ఎందులోనూ తలదూర్చని, అంటే ఏ ఉద్యమాల్లోనూ తలదూర్చని, సమాజంలో తమ వాటా కోసం పోరాడని వాళ్లు మాత్రమే. అలా ఉండటం కంటే ‘బాధ్యత లేనివాళ్లు’గా ఉండటమే దేశానికి మంచిది. ఎందుకంటే, ఆలోచన కూడా ఆత్మ నిర్భరతలో భాగమే! ‘అసలైన’ ఆత్మ నిర్భరతే నిజమైన స్వాతంత్య్రం! ‘‘భారతదేశం స్వాతంత్య్రం సాధించిన తర్వాత గత డెబ్భై అయిదేళ్లలో ఎంతసేపూ పౌర హక్కుల గురించి మాట్లాడుతూ, ఆ హక్కుల కోసమే కొట్లాడుతూ ఉండటం వల్ల దేశం బలహీనపడుతూ వచ్చింది. హక్కుల కోసం పోరాటం పేరిట ఇన్నేళ్లూ కాలం గడిపేశాం. మన పౌరులు తమ బాధ్యతల్ని మరచిపోయి భారతదేశాన్ని బలహీనపర్చడంలో పెద్ద పాత్ర వహించారు. 2047వ సంవత్సరం నాటికి, మనం 24 ఏళ్లలో కోల్పోయిన గత వైభవాన్ని తిరిగి పొందాలంటే దేశాన్ని నూతన శిఖరాలకు చేర్చడానికి బాధ్యతలు శిరసావహించే మార్గంలో యువత నడవాలి.’’ – ప్రధాని మోదీ ఢిల్లీలో 20 జనవరి 2022న జారీ చేసిన ప్రకటన కానీ ఇంతకూ అసలు విశేషమేమంటే, ప్రధానమంత్రి ఒక దేశ బాధ్యతాయుత ప్రథమ పౌరునిగా తాను పేర్కొన్న ‘పౌర బాధ్యతల’ అధ్యాయంలో... దేశాన్ని వెనక్కి కాకుండా ముందుకు నడిపించడానికి అనుసరించాల్సిన శాస్త్రీయ దృక్పథం గురించిన ప్రస్తావన నామ మాత్రంగా కూడా లేకపోవడం! ప్రజలు తమకు తాముగా అంకితం చేసుకున్న (‘ఉయ్ ది పీపుల్’) రాజ్యాంగానికి ఏ రాజకీయ పక్షానికి చెందిన నాయకులైనా ఎలా తూట్లు పొడవగలరో డాక్టర్ అంబేడ్కర్ ఎంతో దూరదృష్టితో హెచ్చరించారు: ‘‘రాజ్యాంగ రూపాన్ని మార్చ కుండానే ఆచరణలో రాజ్యాంగం లక్ష్యాలకు పాలకులు తూట్లు పొడుస్తూ ముందుకు సాగిపోవచ్చు. ఎందుకంటే, రాజ్యాంగబద్ధమైన నైతికత అనేది స్వభావసిద్ధంగా అలవడే లక్షణం కాదు. అలాంటి ఉత్తమ లక్షణం పాలకులు అలవర్చుకుంటే తప్ప అబ్బేది కాదు’’ అంటూనే అంబేడ్కర్... ‘ప్రజాస్వామ్యం’ అనే మాట భారతదేశానికి సంబంధించినంతవరకూ ప్రధానంగా ‘ప్రజాస్వామ్య వ్యతిరేక’ లక్షణం కలిగివున్నదని వర్ణించారు. ‘‘అధికార స్థానాలు ఆక్రమించేవారు ఎవరైనా తమ ఇష్టం వచ్చిన రీతిలో పాలించడానికి స్వేచ్ఛ లేదు’’ అని అంబేడ్కర్ తెగేసి చెప్పారు. కానీ, భారత రాజ్యాంగానికి, అందులోని నిర్దేశిత బాధ్యతలకు పాల కులు అనుకూలంగా నడుచుకుంటున్నారా అన్నది జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం నాడు మనం నిశితంగా పరిశీలించు కోవలసిన ఘడియ! దేశంలోని దళిత వర్గాలన్నీ పరాయి బ్రిటిష్ వలస సామ్రాజ్య పాలనా దాష్టీకాలను అనుభవించాయి. అయితే స్వాతంత్య్రానంతర పాలనలో నూతన రాజ్యాంగం రచనలో అంబే డ్కర్ ఆధ్వర్యంలో మెట్టువాటాను పంచుకున్న దళిత బహుజన వర్గాలకు ఆచరణలో సమాన హక్కులు పొంది, అను భవించే హక్కు ఉంది. అందువల్లనే దేశ పాలకులు ఏ వర్గం వారైనా, ఏ రంగు వారైనా ఇందుకు భిన్నంగా నడుచుకోవడానికి వీల్లేదన్నది ఏ పాలకుడి నిర్దేశమో కాదు, రాజ్యాంగ నిర్దేశమని మరచిపోరాదు. ‘కరోనా’ వైరస్ వ్యాప్తి పేరిట ఒక వైపున దిక్కూమొక్కూ లేని కోట్లాదిమంది ప్రజలు, అందులోనూ 16 కోట్లమందికి పైగా నిరు పేదలు... మందుల పేరిట యథేచ్ఛగా సాగుతున్న నిలువుదోపిడీకి బలైపోతున్నారు. మరోవైపున ఇదే అదనుగా ప్రపంచ అపర కుబేరుల సంపద రెట్టింపు అయింది. వారిలో భాగంగానే భారతదేశ కుబేరుల సంఖ్య 102 నుంచి 142కు డేకి, ‘చంపుడు కల్లం’గా (ఇనీక్వాలిటీ కిల్స్) మారిన పరిస్థితిని ‘ఆక్స్‌ఫామ్’ సంస్థ తాజా అంతర్జాతీయ వార్షిక నివేదిక (17 జనవరి 2022) వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో ‘పౌర హక్కుల రక్షణ’ పేరిట దేశంలోని యువత నడుపుతున్న ఆందోళనోద్యమాల వల్లనే దేశం బలహీనపడిందని పాలకులు వాపోవడం దుస్సహం! సరిగ్గా ఈ దశలోనే సుప్రసిద్ధ హిందీ రచయిత సంపత్ సరళ్ – పాలకులు చేపట్టిన ‘స్వయంపోషక ఆర్థిక వ్యవస్థ’ నినాదం చాటున సాగుతున్న ‘పరాయి ఆర్థిక వ్యవస్థ పోషణ’ తతంగాన్ని ఎండగడుతూ గొప్ప వ్యంగ్య రచన చేశారు. (దీని తెలుగు అనువాదం: వేములపల్లి రాధిక). హిందీలో వాగాడంబరాన్నే ‘వాణీ విలాసం’ అంటారని చెబుతూ, ఆ ‘విలాసం’ ఎలాంటిదో, దాని పోకడ ఎలా ఉంటుందో వర్ణించారు. దేశ పాలకుల ‘ఆత్మ నిర్భరత’ (స్వయం పోషక స్థితి) ఎన్ని రూపాలలో, మరెన్ని రూపాంతరాలలో మన ముందు సాక్షాత్క రిస్తుందో చూపారు. ‘‘చర్ఖావాలే (గాంధీ) దేశాన్ని ఏ కంబంధ హస్తాల నుండి విడిపించారో చాయ్‌వాలే తిరిగి వాళ్ల చేతుల్లోనే పెట్టా’’రని మరెవరో కాదు, స్వయానా చాయ్‌వాలే పార్టీకి చెందిన ‘స్వదేశీ జాగరణ్ మంచ్’ పెద్ద మనిషే ఫిర్యాదు చేస్తాడు. ఏమని? ‘మేం స్వదేశీ నినాదంతో సింహాసన మెక్కిస్తే ఏం చేశాడు? విదేశీ కంపెనీల కోసం దేశాన్ని ప్రైవేట్‌పరం చేయడంలో మునిగితేలు తున్నారంటాడు. కాగా, మల్టీ నేషనల్ ఇంటింటా తిష్ఠ వేసుకునుందని ఎవడైనా అంటే, వాడు ‘దేశ ద్రోహి’ అన్న ముద్ర వేస్తారు. అందుకే ఈ పరిణామాన్నే రచయిత సంపత్ సరళ్... కుంటి దయ్యం ముందు ఇంట్లోవాళ్లనే మింగిందన్న సామెతను నిజం చేసేట్టుగా చిత్రిస్తాడు. ‘ఆత్మనిర్భరత’ (స్వయం పోషకం) నినాదం అనేది ‘పరాయి పోషకమే స్వయం పోషక నినాదం’ అన్నట్టుగా కరోనా వైరస్ లాగా రూపాంతరాలు తొడుగుతోంది! ఈ దుఃస్థితి క్రమంగా ఎలా పాకి పోతోందో సంపత్ సరళ్ ఇంకా ఇలా వివరించాడు: ‘‘మా దేశాన్ని స్వావలంబిత దేశంగా మార్చిపెట్టమని విదేశస్థులకు మొర పెట్టుకునే దేశ నాయకుడు ‘లోకల్ నుండి ఓకల్’కు మారి మనకు హోంవర్క్ ఇస్తే... ఆయన భక్త సమూహంలో ఒక కుహనా జాతీయవాది ఎన్ని రూపాల్లో ఎలా సందేశాలు పంపుతాడో చూడండి: ‘తన చైనీస్ మొబైల్ నుండి / నా కొరియన్ మొబైల్‌కు ఇంగ్లండ్ రాజభాషలో / అమెరికన్ వాట్సాప్ ద్వారా నాకొక సందేశం పంపాడు – భారతదేశాన్ని స్వావలంబన దేశంగా మారుద్దామని! సరిగ్గా – ఆ సమయంలో ‘సర్దార్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ చైనాలో తయారైన విగ్రహమని చాలామందికి గుర్తులేదు! ఎందు కంటే ‘విగ్రహాలు సందేశాలు చదవలేవు’ గనుక, పటేల్ విగ్రహం తయారైంది చైనాలోనే అన్నది చాలామందికి తెలియదు, తెలిసినా మర్చిపోయి ఉంటారు. అంతేగాదు, మనకు పెట్టుబడులు గుప్పించే ప్రపంచ కుబేరుల పెద్ద బిల్ గేట్స్ మరిన్ని పెట్టుబడులు గుప్పించా లంటే ‘భారతదేశానిది స్వయంపోషక ఆర్థిక విధానమే’నని చెబు తూనే ఉండటం మన చెవులకూ ఎంతో ‘ఇంపు’గానే ఉంటుందని చెబుతూ ‘మన ఆర్థిక శాఖ వారు తమ కార్యాలయం ముందు కొలంబస్ విగ్రహం ప్రతిష్ఠించాలని అనుకుంటున్నారని శరద్ జోషీ చెప్పకనే చెప్పాడు! ఎందుకనంటే– ఒకవేళ కొలంబసే అమెరికాని కనుక్కొని ఉండకపోతే మనం అప్పెక్కడ నుంచి తెచ్చుకోగలం అన్నది శరద్ జోషీ పీకులాట. అందుకే మన ‘ఆత్మనిర్భరతా’ (స్వయంపోషక వ్యవస్థ) నినా దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని సమర్థించాలంటే– ముందు ‘చర్ఖావాలే (గాంధీజీ) దేశాన్ని ఏ కబంధ హస్తాల నుండి విడిపించారో చాయ్‌వాలే తిరిగి వాళ్ల చేతుల్లోనే పెడుతున్నారన్న స్వదేశీ జాగరణ్ మంచ్’ పెద్దమనిషొకడు చేసిన తీవ్రమైన ఫిర్యాదునూ, విదేశీ కంపెనీల కోసం దేశాన్ని ప్రైవేట్‌పరం చేయడంలో మునిగి తేలు తున్నారన్న అభియోగాన్నీ పాలకులు ఎలా సమర్థించుకుంటారో ఆచరణలో చూసి తీరాల్సిందే! ఎందుకంటే, ‘కుంటి దయ్యం ఇంట్లో వాళ్లనే ముందు మింగేయకముందే’ జాగ్రత్త పడటం జరూరుగా జరగాల్సిన పని గనుక! దీన్నిబట్టి, స్వయంపోషక ఆర్థిక వ్యవస్థకు ఏకైక రక్షణ... పరాయి పెట్టుబడిని పోషించుకుంటూ పోవడమేనని అర్థం చేసుకోవాలా?! -ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఇక ‘గురుత్వాకర్షణ’ సుంకాలు!
సముద్రం ఒడ్డున ఉన్న ప్రజలకు ఉప్పునూ, చల్లటి ప్రాంతంలో శీతల పానీయాన్నీ అమ్మాలంటుంది పెట్టుబడీదారీ వ్యవస్థ. దానికి లాభాలే ముఖ్యం. ఆ లాభం అనేదాని కోసం అది ఎంతదూరమైనా వెళ్తుంది. ఎంతదూరం అంటే, ఈ భూమ్మీద మనుషులు నిలబడి ఉండటానికి కారణం గురుత్వాకర్షణ శక్తి కాబట్టి, దానికి కూడా పన్ను కట్టమని ఒత్తిడి చేసేంత! ఇది వ్యంగ్యంలా కనబడుతున్నప్పటికీ, ఈ అసమ సమాజంలో పేద మనిషి ఎన్నిరకాలుగా దోపిడీకి గురవుతున్నాడో అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. అందుకే ప్రపంచం మరింత బాగు పడాలంటే, సోషలిస్టు సమాజం తన విస్తృతిని పెంచుకోవాలి. పెట్టుబడిదారీ సమాజం సమానత్వ దృష్టిని అలవర్చుకోవాలి. ధనిక వర్గ రాజకీయ సామాజిక ఆర్థిక దోపిడీ వ్యవస్థల్లో అమలు జరిగే ఏకైక ప్రామాణిక ఎత్తుగడ ఏమిటంటే, యావత్తు సమాజానికి చెందవలసిన సమష్టి వనరులను కొద్దిమంది ప్రైవేట్ ప్రయోజనాల రక్షణకు వినియోగిం చడం! ప్రజా ప్రయోజనాల ఉమ్మడి రక్షణకు వినియోగ పడాల్సిన దేశ నిధుల్ని ప్రైవేట్ ప్రయోజనాల్ని రక్షించేందుకు దారి మళ్లించి ప్రభుత్వ రంగ పనులు జరక్కుండా కుంటుపరుస్తుంటారు. ఈ దారి ‘మళ్లింపు’ చర్యలనే ప్రజాబాహుళ్యం వ్యతిరేకించాల్సి వస్తోంది. అయినా వర్గ ప్రయోజనాల రక్షణకు కట్టుబడిన పాలకులు ప్రైవేట్ పెట్టుబడులకే పనులు ధారాదత్తం చేస్తారు. – అమెరికన్ మేధావి, విద్యాధికుడు, తత్వవేత్త నోమ్ చామ్స్కీ అలాంటి దారిమళ్లింపు ‘నైపుణ్యం’లో భాగంగా ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కొందరు వాడుకునే పరిస్థితి వస్తే! న్యూటన్ భౌతికవాద శాస్త్రం ఆధారంగా, చెట్టుమీద ఉన్న కాయ పైకి ఎగిరి పోకుండా భూమ్మీదనే ఎందుకు పడుతోందన్న ప్రశ్నకు శాస్త్రీయమైన సమాధానాన్ని కనుగొని, భూమి ఆకర్షణ శక్తినే గురుత్వాకర్షణ శక్తిగా నామకరణం చేసి దాన్ని శాశ్వతంగా స్థిరపరిచాడు. కానీ మనకాలంలో ఈ గురుత్వాకర్షణ శక్తి ధనిక వర్గ సమాజాల్లో ఒకరకంగానూ, సోషలిజం పునాదిగా ఉన్న సమాజాల్లో మరొక విధంగానూ పని చేస్తూంటుంది. తమిళ మిత్రులు, సుప్రసిద్ధ కథకులైన ముత్తులింగం గారు లిఖించిన ‘ఐదు కాళ్ల మనిషి’ అనే పుస్తకంలో గురుత్వాకర్షణ సుంకం కథా కమామీషు ఉన్నాయి (తెలుగు అనువాదకులు అవినేని భాస్కర్ సౌజన్యంతో.) ఇంత గాథకు అసలు పూర్వ రంగాన్ని తెలుసుకోవడం మరింత ఆసక్తిదాయకంగా ఉంటుంది. బడుగు దేశాల ప్రజలను సంపన్న దేశాలు ఇప్పటికీ ఎంత చులకనగా భావిస్తున్నాయో తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ ఇది. కోవిడ్ –19 వైరస్ సంహారక వ్యాక్సీన్లు మురిగిపోతున్న దశలో, వాటిని బడుగు, వర్ధమాన దేశాల మీద లాభాల వేటలో ఉన్న విదేశీ, ప్రైవేట్ కంపెనీలు రుద్దాయని ఐక్యరాజ్య సమితి శిశు వైద్య నిధుల సంస్థ (14 జనవరి 2022) వెల్లడించింది. ప్రపంచంలోని అనేక పేద దేశాలు, ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలు ఐక్యరాజ్య సమితి సమర్థించిన ‘కోవాక్స్’ టీకా పథకంపై ఆధారపడుతున్నాయి. ఆఫ్రికా దేశాల్లో 10 శాతం మంది ప్రజలకు కూడా టీకాలు అందకుండా మురిగిపోయాయి! చివరికి ఇండియాలో పరిస్థితి కూడా మెరుగ్గా లేదని రోజుకొక తీరున బయటపడుతున్న పరస్పర విరుద్ధమైన కథనాలు చెప్పకనే చెబుతున్నాయి. అమెరికాలో విషక్రిముల వ్యాప్తిని కంట్రోల్ చేసే సర్వాధికారాలు మందుల గుత్త వ్యాపారంలో ఉన్న 84 ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. అమెరికా పాలక వర్గాలు, వాళ్లు రిపబ్లికన్స్ అయినా, డెమో క్రాట్స్ అయినా ఆ కంపెనీల నిర్ణయం పైననే ఆధారపడే దౌర్భాగ్యం ఉంది. ఆ కంపెనీల శాసనమే ప్రపంచ ఫార్మా కంపెనీల్ని కూడా నడుపుతోందని మరచిపోరాదు. ఈ దుస్థితికి కొనసాగింపు అన్నట్టుగా మనం చెప్పుకుంటున్న కథలో ‘స్పేస్ షిప్’ వ్యాపారులు అయిన కాడికి కొన్ని గంటల పాటు రోదసీ యాత్రకు ఉత్సాహపడే విద్యా ర్థులు, బోధకులను దండుకుంటుంటారు. రోదసి నుంచి తిరిగి భూమ్మీదకు వారిని సురక్షితంగా దించుతారు. కానీ వారిని సంవత్స రాల తరబడి తీర్చలేని భారీ బకాయిల్లోకి నెట్టే పథకమే గురుత్వా కర్షణ సుంకం అన్నది వారికి తెలియదు. ఈ సరికొత్త సుంకం ఎలా పెరుగుతూ పోతుంది, మరెలా తీర్మానం అవుతుంది లాంటి అంశాల్ని ముత్తులింగం ప్రస్తావిస్తారు. ఒక్కసారి ‘గురుత్వాకర్షణ సుంకం’ కట్టమని మీకు నోటీసుల మీద నోటీసులు వస్తే ఏం చేస్తారన్నది ప్రశ్న! పైగా ఈ విచిత్రమైన ‘గురుత్వాకర్షణ సుంకం’ నోటీసు అందుకునే ఇంటి సభ్యుల సంఖ్యను బట్టి, వారు పెరిగే బరువును బట్టి కూడా సుంకం ‘పాపపు బండి’లా పెరుగుతూ ఉంటుందట! ఈ సుంకాన్ని వరుసగా ఎనిమిది నెలల పాటు చెల్లించడానికి నిరాకరించిన వ్యక్తికి వేసిన శిక్ష ఎలాంటిదో, దానికి ‘స్పేస్ షిప్’ వ్యాపారులు ఇచ్చిన సమాధానం ఏమిటో మరీ వింతగా ఉంటాయి. ‘‘స్పేస్ షిప్లో యాత్రకు వచ్చిన వ్యక్తిని సురక్షితంగా భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల దింపేశాం. ఆ వ్యక్తి ఒకసారి భూమి ప్రదక్షిణ చేసి వచ్చాడు కాబట్టి, తాను మనసు మార్చుకుని మీరు చెప్పినట్టే సుంకం కట్టేస్తాని ఒప్పుదలయ్యాడు. అలా మా బాకీని వడ్డీతో సహా కట్టేశాడు.’’ అయితే అతనికి ఓ చిక్కు సమస్య ఎదురైంది. స్పేస్‌షిప్ ప్రయాణం కోసం అయిన ఖర్చు, స్పేస్ సూట్ ఖరీదు, ఇతర ఖర్చులు మొత్తానికి ఇప్పుడు నెలనెలా వాయిదాల పద్ధతిలో కడుతున్నాడు. అయితే ఇలా అతను మొత్తం 2,196 మాసాలు కడుతూ ఉండాలి. ‘అమ్మో! అన్ని మాసాల పాటా?’ అంటే– ‘అవును, మొత్తం చెల్లించడానికి 183 సంవత్సరాలు పడుతుం’దని స్పేస్‌షిప్ వ్యాపారి అంటాడు. ‘మనిషి అన్నేళ్లు బతుకుతాడా’ అని ఔత్సాహిక యువకుడంటే – ‘అవన్నీ మాకు తెలీదు గానీ, అతని పిల్లలు కడతామని హామీ ఇచ్చా’రని స్పేస్‌షిప్ వ్యాపారి అంటాడు. అలా ఆ యువకుడు రాజీపడి బిల్లులు చెల్లిస్తూండగానే, భూప్రయాణ శాఖ అన్న కొత్త శాఖ నుంచి మరికొన్ని బిల్లులు వచ్చి మీద పడతాయి. వాటి సారాంశం ఏమంటే – భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఆ దూరాన్ని కూడా లెక్కగట్టి అందుకయ్యే ఖర్చుల్ని కూడా ‘గురుత్వాకర్షణ సుంకం’ కిందనే కట్టమంటారు! అందుకే మన ప్రాచీన సాహిత్యంలో కూడా కొందరు లౌకిక వాదులు ఉండబట్టే అందరూ పెద్ద మనుషులేగానీ రొయ్యల బుట్ట ఖాళీ అయిందన్న అర్థంలో సామెత ఒకటి పుట్టుకొచ్చింది! ఇలాంటి గాథలు చదివే ఓపిక ఉండాలే గానీ ‘పురాణవైర గ్రంథమాల’లో కొల్లలు, కొల్లలు. పశ్చిమ యూరప్ అంతా అంధ యుగాలలో మగ్గుతున్నపుడు– ఈజిప్టు, గ్రీస్, రోమ్ ప్రాచీన సంçస్కృతులు, వాటి నాగరికతలకు ప్రాచ్య దేశాల సంస్కృతికి చాలా దగ్గరి సంబంధాలున్నాయి. సమాజ పరిస్థితుల్ని, ప్రజల దైన్యాన్ని కళ్లారా చూసి కలత చెందిన కొందరు రోమన్ రాచరికాల్లో టైబీరియస్ గ్రాచస్ లాంటి సెనేటర్ ఒకరు. ఇటలీలో ప్రజలపై సంపన్నుల అరాచకాలకు అడ్డూ అదుపూ లేదని భావించిన మరుక్షణమే ఇటాలియన్ కష్టజీవులైన రైతు వ్యవసాయ కార్మికులకు దేశంలోని అదనపు భూమినంతా పంచి, ప్రజా పాలకు నిగా మన్ననలు పొంది, ప్రజావాణిగా ప్రజల చేత సెనేట్‌కు ఏక గ్రీవంగా ఎన్నికయ్యాడు! తన దేశ సంపన్న వర్గాలకు గ్రాచస్ తుది సందేశంలో ఇలా వెలువరించాడు: ‘‘మీ అక్రమ సంపాదనను, సౌభా గ్యాన్ని, విలాసాల్ని కట్టిపెట్టి ప్రజలకిచ్చి, జీవితాల్ని సార్థకం చేసు కోండి. అప్పుడే మీరు ప్రపంచాన్ని జయించగలరు. అంతేగానీ అరం గుళం నేలైనా ‘ఇది నాది’ అని చెప్పి కాలు మోపుకొనే స్థితి లేదని మీరు (సంపన్న వర్గం) గ్రహించా’’లని దండోరా వేయించాడు. అలాగే రైతాంగం పట్ల మన కృష్ణదేవరాయల లాంటి కారుణ్య ప్రభువులు కూడా ఉంటారు. చరిత్ర అందించిన ఈ అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ‘ప్రపంచ చరిత్ర పాఠాలు’ అన్న ఉద్గ్రంథంలో సుప్రసిద్ధ చరిత్రకారులు విల్ డూరాంట్, ఏరియల్ డూరాంట్ దంపతులు ఇంతవరకు జరిగిన చరిత్రను క్లుప్తంగా ఇలా క్రోఢీకరించి ఉంటారు: ‘‘పెట్టుబడిదారీ విధానం ప్రపంచాన్ని ఎక్కడికి తీసుకువెడుతోందో నన్న భీతి వల్ల సోషలిజం స్వేచ్ఛా వాతావరణాన్ని తన పరిధిలో విస్తృతం చేయక తప్పలేదు. అలాగే సోషలిజం వల్ల సమానత్వ దృష్టిని పెంచుకోవలసిన అవసరాన్ని గుర్తించక పెట్టుబడిదారీ వ్యవస్థకు తప్పలేదు’’! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
చట్టాలలో అస్పష్టత ఎవరి పుణ్యం?!
న్యాయస్థానాలు జారీ చేసే ఉత్తర్వులు ఆచరణకు నోచుకున్నప్పుడే వాటికి విలువా, గౌరవమూ ఉంటాయి. పాలకవర్గం ఆ ఉత్తర్వులను సైతం ఖాతరు చేయకపోతే దేశంలో గందరగోళం నెలకొని ఉన్నట్టే! ఆ గందరగోళమే చట్టాలు చేయడంలోనూ ప్రతిఫలిస్తోంది. ఎన్నో చట్టాలు సరైన చర్చలు లేకుండానే ఆమోదం పొందుతున్నాయి. ఫలితంగా చట్టాల లక్ష్యమేమిటో జనానికి తెలియకుండా పోతోంది. స్వాతంత్య్రోద్యమ కాలం నాటి స్ఫూర్తి, పారదర్శకత అడుగంటడమే ఈ విలువల పతనానికి కారణం. వలస పాలనావశేషాలు తొలగిపోనంతవరకూ వ్యవస్థలో మార్పు రాదు. అందుకే భారత న్యాయవ్యవస్థను పేద ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా, వలస పాలనావశేషాలకు దూరంగా పునర్నిర్మించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ‘‘కోర్టులు జారీచేసే ఉత్తర్వులు ఆచర ణలో అమలు జరిగినప్పుడే వాటికి విలువా, గౌరవమూ... క్రమంగా కార్యనిర్వాహక వర్గమైన దేశ పాలకవర్గం కోర్టు ఉత్తర్వులను ‘బేఖాతరు’ చేసే ధోరణిలో ఉంది. అంతేగాదు, చట్టాలు చేయడంలోనూ, దేశంలో పార్లమెంటరీ చర్చల నిర్వహణలోనూ అనుసరిస్తున్న తీరుతెన్నులు సక్రమంగా లేవు. ఇందువల్ల దేశంలో తగాదాలు (లిటిగేషన్) పెరిగి, దేశ పౌరులకు, కోర్టులకు, తదితర సంబంధిత వర్గాలకు అసౌకర్యం కలుగుతోంది. చట్టాలు ఎందుకు చేస్తున్నామో స్పష్టత లేనందునే ఈ గందరగోళమంతా. దేశ చట్టాలను చట్ట సభలలో క్షుణ్ణంగా చర్చించిన, ఆమోదించిన రోజులున్నాయి. కానీ దురదృష్టవశాత్తూ కొంతకాలంగా చట్ట సభల్లో జరుగుతున్నదేమిటో మీకు తెలుసు, గుణాత్మకమైన చర్చలు జరగడం లేదు. ఫలితంగా రూపొందుతున్న కొత్త చట్టాల ఉద్దేశంగానీ, లక్ష్యంగానీ బొత్తిగా బోధపడటం లేదు.’’ – 16 ఆగస్టు 2021 – 27 డిసెంబర్ 2021 తేదీలలో గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇవి. ఆ మాటకొస్తే, చట్టాలు రూపొందిస్తున్న తీరు, పార్లమెంటులో చర్చ లేకుండానే ‘తూతూ మంత్రం’గా ఆమోద ముద్ర వేస్తున్న తీరు గురించి ఒక్క ప్రధాన న్యాయమూర్తి రమణే కాదు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా నిరసన తెలపక తప్పలేదు. చట్టసభలలో చర్చలన్నవి ఎంతో పేలవంగా తయారయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘చట్ట సభలలో నేడు పేరుకు జరుగుతున్న చర్చలు ఇంతగా పతనమవడాన్ని నేడు కళ్లారా చూడవలసి వస్తోంది. సమగ్రమైన చర్చలు జరక్కుండానే చట్టాలు రూపొందిస్తున్నారు. ప్రజాస్వామ్యా నికి ఆధారమే చర్చలూ, సరైన వాదనలూ. అయినా సభలో చర్చలు నిరాటంకంగా జరక్కుండా అడ్డుకోవడం తీవ్ర అభ్యంతరకరం. ఈ ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థల హుందాతనాన్ని, గౌరవ ప్రతిష్ఠలను దెబ్బతీయడమే’’ అని స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించడం గమనార్హం! వీటన్నింటికంటే ప్రధానమైనది, ఒకనాటి పత్రికలు సమాజంలో నెలకొల్పిన పాత్రికేయ ప్రమాణాలుగానీ, వాస్తవాలపై ఆధారపడిన పరిశోధనాత్మక జర్నలిజంగానీ ఈ రోజున మనకు మృగ్యమని పేర్కొంటూ గౌరవ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ నేడు సమాజంలో వాస్తవిక సంచలనం కలిగించగల ఒక్క వ్యాసమన్నా మీడియాలో చోటు చేసుకుందా అని ప్రశ్నించారు. ఒకనాడు భారీ కుంభకోణాలకు సంబంధించిన కథనాలు చదవడానికి పాఠకులు ఉవ్విళ్లూరేవారనీ, కానీ ప్రస్తుత కాలంలో ఏది నిజమో, ఏది కట్టుకథో తెలుసుకోవడం గగనమై పోతోందనీ కూడా జస్టిస్ రమణ ఎత్తి పొడిచారు. అంతేగాదు, ఇటీవలనే ‘మాధవన్ కుట్టి అవార్డుల’ ప్రదానోత్సవం సందర్భంగా గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ (18 డిసెంబర్ 2021), నేడు దేశంలో వాస్తవాల కోసం ఒక పత్రికపైనో, ఒక చానల్పైనో పాఠకుడు ఆధారపడే పరిస్థితి లేదనీ, పాత్రికేయ విలువలు, ప్రమాణాలూ పడిపోతున్నాయనీ, కనీసం ఒక ఘటనపై వాస్తవాలు తెలుసుకోవాలంటే కనీసం నాలు గైదు పత్రికలు చదవాల్సి వస్తోందనీ వ్యాఖ్యానించారు. కానీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలోనే జాతీయోద్యమ కాలంనాటి సామాజిక విలువలు, స్ఫూర్తి మనం ఎందుకు, ఎవరి వలన కోల్పోవలసి వచ్చిందన్న ప్రశ్నకు నేటి తరం స్వార్థపరులైన రాజకీయ పాలకులు ఎవరూ సూటిగా సమాధానం చెప్పగల పరిస్థితుల్లో లేరు. చివరికి అనేకమంది ప్రజాస్వామిక, సామాజిక కార్యకర్తల చొరవ ఫలితంగా, పౌర హక్కుల ఉద్యమకారుల నిరంతర పోరాటాల ఫలితంగా అమలులోకి వచ్చిన ‘సమాచార హక్కు చట్టాన్ని’ సహితం నీరుగార్చి పాలకులు జీవచ్ఛవంగా మార్చిన విషయం మరిచిపోరాదు. చివరికి ఒక విదేశీ గూఢచారి వ్యవస్థ సలహా సంప్రదింపులపై ఆధారపడి దేశీయ పౌరహక్కుల ఉద్యమాలనూ, పౌరహక్కులనూ అణగదొక్కేందుకు, అరబ్ ప్రజలను అణచడంలో అమెరికాకు ‘తైనాతీ’గా పనిచేస్తున్న ఇజ్రాయెల్‌ను మన పాలకులు ఆశ్రయించడం... మన దేశంలోనే కాదు, ప్రపంచ సభ్యదేశాలలో ‘పెగసస్’ కుంభకోణం ద్వారా వెల్లడయిందని మరచిపోరాదు. చివరికి మన సుప్రీంకోర్టు చేతిలో దేశ పాలకులు చిక్కుపడిపోయి ‘పెగసస్’ కుంభకోణం నుంచి బయటపడగల పరిస్థితులు దాదాపు శూన్యంగా కన్పిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయ మూర్తులైన ఎన్.వి. రమణ, జస్టిస్ అబ్దుల్ నజీర్ భారత న్యాయ వ్యవస్థను బడుగు వర్గాలయిన పేద ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా, వలస పాలనావశేషాలకు దూరంగా పునర్నిర్మించు కోవలసిన అవసరం ఉందనీ, మన సమాజ వాస్తవాలకు సన్ని హితంగా మలచుకోవలసిన సమయం వచ్చిందనీ హెచ్చరించడం విశేషం. కనీసం 75 సంవత్సరాల స్వాతంత్య్ర ముహూర్తం కూడా గడిచిపోతున్న సందర్భంలోనైనా మనం కళ్లు తెరవవలసి ఉంది. ప్రజాబాహుళ్య విశాల ప్రయోజనాలకు అనుగుణంగా విదేశీ న్యాయ శాస్త్ర అనుభవాల నుంచి మంచిని గ్రహిస్తూనే, ఒక స్వతంత్ర దేశంగా భారతదేశ న్యాయ వ్యవస్థను వలస పాలనావశేషాలకు కడు దూరంగా పునర్నిర్మించుకోవలసిన అవసరం గురించి 1986 నాటి ఎం.సి. మెహతా కేసులో ఆనాటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి పి.ఎన్. భార్గవ గుర్తు చేసిన వాస్తవాన్ని మనం మరవకూడదు. ఈ అనుభవాల నుంచి భారత న్యాయ వ్యవస్థకు రాజ్యాంగంలోని 141వ అధికరణ కింద ఒనగూడిన ప్రత్యేక సదుపాయమే ‘ప్రజా ప్రయో జనాల వ్యాజ్యం’ పౌర హక్కు అని మరచిపోరాదు. ఇలా ఎన్ని రకాల హక్కులు దేశ పౌరులకు సమకూడినా– ఈ పెట్టుబడిదారీ భూస్వామ్య జమిలి వ్యవస్థ... ఆచరణలో రద్దు కానంత వరకూ... రాజకీయ పార్టీలు ఎన్ని ముసుగుల్లో అధికార పెరపెరతో ఎన్నికల్లో పాల్గొన్నా, వలస పాలనా చట్ట అవశేషాలు– దేశాధికారం ఎవరి చేతుల్లో ఉన్నా... ప్రజా బాహుళ్యానికి ఒరిగేది ఏమీ ఉండదు. ఎందుకంటారా? ప్రసిద్ధ ఆంగ్ల కవయిత్రి మౌమిత ఆలం ‘లైవ్ వైర్’కు రాసిన ‘పొరపాటు’ కవితకు ‘ఉదయమిత్ర’ అనువాదంలోని ఆవేదనను పరిశీలించండి: ‘‘ఔను, వాళ్లెవరినైనా చంపగలరు రాజ్యం వాళ్లకు హామీపడింది! ఎవరినైనా, ఎప్పుడైనా, ఎందుకైనా చంపగలరు చావడానికి మనకు కారణాలుంటాయేమోగానీ చంపడానికి వాళ్లకు ఏ కారణమూ ఉండనక్కర్లేదు ఇంట్లో పనిచేసుకుంటున్న అఖ్లాన్నీ రైల్లో ప్రయాణిస్తున్న పెహ్లూన్ని చంపగలరు లక్షలాదిమంది పేర్లూ, చరిత్రనూ తుడిచేసి నిలువెత్తు జీవితాల్ని నంబర్ల కిందకు కుదించేసి అనేకానేకుల్ని అనాధ శవాలుగా మార్చేయగలరు... ఇంతకూ ఎవరువాళ్లు? వాళ్లు దేశ ప్రేమికులండోయ్! ఏ శిక్షా పడకుండా సొంత ప్రజలనే చంపగలరు! గుర్తించడానికి నిరాకరించో ‘పొరపాటు’ గుర్తింపు పేరుమీదనో ఎవరినైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా చంపగలరు! సర్వకాల సర్వావస్థలకు అతీతులు వాళ్లు సుమా! అవును, వాళ్లెవరినైనా చంపగలరు రాజ్యం వాళ్లకు హామీపడింది!’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
‘త్రికేంద్రీకరణ’ మనకు కొత్త కాదు!
ఒకే రాష్ట్రంలో, ఒకే భాషా ప్రాంతాల మధ్య ప్రాంతీయ అసమానతలను రూపుమాపగల ఏకైక పరిష్కారం ఏమిటంటే, పరిపాలనా వ్యవస్థ ఆయా ప్రాంతాలకు సామీప్యంలో ఉండటమే! సాక్షాత్తూ మనదేశంలోనే రెండేసి, మూడేసి రాజధానులు, ఆ స్థాయిలోనే ప్రత్యేక కోర్టులూ ఏర్పాటు చేసుకుని ప్రజలకు సన్నిహితంగా పాలన జరుగుతున్న ఉదాహరణలున్నాయి. ఆంధ్రలోనే గతంలో రెండేసి రాజధానులు, రెండేసి ప్రత్యేక న్యాయస్థానాలు కొనసాగించిన దశ కూడా ఉందన్న సంగతి మరచిపోరాదు. ఉదాహరణకు కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఆంధ్రలోని మచిలీపట్నంలో ఒక రాజధాని, విజయవాడలో ఒక రాజధాని, రెండేసి ప్రత్యేక కోర్టులు కూడా నడిచాయి. కాబట్టి పలు రాజధానుల ఏర్పాటు ఆంధ్రకు కొత్త కాదన్నది చారిత్రక సత్యం. ఆంధ్రులకు, తెలుగు భాషకు ఉన్న చారిత్రక నేపథ్యం అతి సుదీర్ఘమైనది. క్రీస్తుపూర్వం 5000–500 ఏళ్ల మధ్యకాలంలో నడిచిన పురాచరిత్ర ఆంధ్రుల, తెలుగు భాషా సంస్కృతులకు అద్దం పడుతూ వచ్చింది. కాగా క్రీస్తుపూర్వం 500 నుంచి క్రీస్తు శకం 624 వరకూ కొనసాగుతూ వచ్చిన వీరి చరిత్రను ప్రాచీన ఆధునిక దశగా చరిత్రకారులు నిర్ధారించారు. అలాగే మధ్యయుగ దశలో వీరి చరిత్రను క్రీస్తుశకం 624–1368 కాలానికి చెందినదిగా పేర్కొన్నారు. ఇక ఆ తర్వాత ముసునూరు నాయకుల కాలాన్ని క్రీ.శ. 1325–1368 దశ గాను, రెడ్డిరాజుల కాలాన్ని క్రీ.శ. 1324–1448 దశ గానూ, విజయనగర రాజుల కాలాన్ని 1336–1660 దశ గానూ, చరిత్రకారులు పేర్కొ న్నారు. కాగా, ఆధునికాంధ్ర తొలిదశ 1724–1857 గానూ, కోస్తా ఆంధ్ర, రాయలసీమ చారిత్రక దశను క్రీ.శ.1858–1956 గానూ పేర్కొన్నారు. ఇక సమకాలీన ఆంధ్రప్రదేశ్ చారిత్రక దశను 1956– 2000గా పేర్కొన్నారు. ఆంధ్రుల భాషా సంస్కృతుల ప్రాదుర్భావ దశను భారత పురాచరిత్ర పితామహుడైన హెచ్.డి. సంకాలియా విశేషంగా కొనియాడారు. ఈ కోణంలోనే నాటి ఆంధ్రప్రదే శ్ను‘యావద్భారత దేశానికే ప్రాచీన చారిత్రక రాజధాని’గా సాధికారి కంగా ఆయన పేర్కొన్నారు! ఆ తర్వాత సంకాలియా దారిలోనే సుప్రసిద్ధ ఆధునిక కవి, సాహితీ చరిత్రకారుడైన ఆరుద్ర.. ఆంధ్రుల చరిత్ర, వారి భాషా సంస్కృతుల చారిత్రక పూర్వ రంగాన్ని క్రీ.శ.12వ శతాబ్ది చాళుక్య యుగం నుంచి ఆధునిక యుగారంభం 1900 దాకా 12 యుగాలుగా 12 సంపుటాలలో వెలువరించారు. ఆంధ్రుల ఈ సుదీర్ఘ చారిత్రక కాలచక్ర గతికి తెలుగు ప్రజల భాషా సంస్కృతులు దోహదపడిన అపూర్వమైన ఆధారాలతో (క్రీ.పూ.5000 నుంచి క్రీ.శ. 2016దాకా) ప్రొఫెసర్ వకుళాభరణం రామకృష్ణ ఒక అద్భుత సంపుటాన్ని తీసుకొచ్చారు. తెలుగువారైన ఆంధ్రులకు సుదీర్ఘకాలంపాటు సొంత రాజధాని లేకుండా పోయింది. ఎంతో ప్రాచీన భాషా సంస్కృతులతో దీపించిన ఆంధ్రులకు తమిళనాడులో భాగంగా ఉన్నందున ‘మదరాసీల’న్న ముద్రపడింది. దీంతో ఆంధ్రులు ‘రాజధానులు’ లేని రాజ్యంలో కాలం వెళ్లబుచ్చుకోవాల్సి వచ్చింది. క్రమంగా ఈ దుఃస్థితి, చారిత్రక స్పృహ గల ఇద్దరు నాయకుల దూరదృష్టి వల్ల తొలగిపోయింది. వారే పొట్టి శ్రీరాములు, నందమూరి తారకరామారావు. తెలుగు ప్రజలు, విశిష్ట భాషా సంస్కృతులున్న జాతి అన్న స్పృహను వీరిద్దరూ, యావద్భారత దేశానికి చాటి చెప్పడమే కాకుండా కార్యరంగంలోకి దిగి నిరూపించారు. ఇది ఇలా ఉండగా, ఆంధ్రలోనే రెండేసి రాజధానులు, రెండేసి ప్రత్యేక న్యాయస్థానాలు చెలాయించిన దశ కూడా ఉందన్న సంగతి మరచిపోరాదు. ఉదాహరణకు కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఆంధ్రలోని మచిలీపట్నంలో ఒక రాజధాని, విజయవాడలో ఒక రాజధాని, రెండేసి ప్రత్యేక కోర్టులు కూడా నడిచాయన్నది కాదనలేని మరొక సత్యం. అసలు ఒకే భాష మాట్లాడే ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలకు, వేర్పాటు ధోరణులకు కారణం అవకాశవాద రాజకీ యాలు, అధికార రంధి గల రాజకీయ నాయకులే కారణమని ఆనాడే కాదు, ఈనాడూ రుజువవుతోంది. కనుకనే ఒకే రాష్ట్రంలో, ఒకే భాషా ప్రాంతాల మధ్య ప్రాంతీయ అసమానతలను రూపు మాపగల ఏకైక పరిష్కారం ఏమిటంటే, పరిపాలనా వ్యవస్థ ఆయా ప్రాంతాలకు సామీప్యంలో ఉండటమే! ఈ దృష్ట్యానే, సాక్షాత్తూ మనదేశంలోనే రెండేసి, మూడేసి రాజధానులు, ఆ స్థాయిలోనే ప్రత్యేక కోర్టులూ ఏర్పాటు చేసుకుని ప్రజలకు సన్నిహితంగా పాలన జరుగుతున్న ఉదాహరణలున్నాయి. ఈ వివరాల్ని ‘సాక్షి’ అనేకసార్లు పాఠకుల సౌకర్యార్థం ప్రచురించింది. కానీ నిద్రపోతున్నట్టు నటించేవాళ్లను, ‘పుట్టుగుడ్డివాళ్లు’గా నటిస్తున్న కొన్ని పత్రికలు, వాటి సంపాదకులను నమ్మించలేము! ఇంతకూ బుద్ధుని పేరిట అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్టు కోతలుకోస్తున్న చంద్రబాబు ఆ బుద్ధుడు బూజు పట్టిపోతున్నా గుడ్లు అప్పగించి చూస్తుండిపోయారే గాని సంరక్షించే చర్యలు తీసుకోలేదు. పైగా రైతుల త్యాగాలతో అమరావతి నిర్మాణం ప్రారంభమైందని అంటూనే అదే రైతుల భూములను అర్ధరాత్రిపూట దొంగచాటుగా ఎందుకు తగలపెట్టించారు? పైగా దానికి కారకు లంటూ ఆరోపణలు మోపి వైసీపీ, కాంగ్రెస్ నాయకులపైన కేసులు పెట్టించారు. రైతాంగాన్ని మోసగించి అమరావతి భూముల్ని టీడీపీ అనుయాయులకు కారు చౌకగా కట్టబెట్టిన వైనం ప్రజలు గ్రహిం చారు. అమరావతి రైతాంగానికి జరిగిన ఈ మోసాన్ని లెక్కలతో సహా నిరూపిస్తూ అప్పటి రాష్ట్ర హైకోర్టులో సుప్రసిద్ధ మాజీ న్యాయ మూర్తులు, ఈ వ్యాసకర్త జమిలిగా రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. కాని చంద్రబాబుకు కోర్టుల్ని ‘మేనేజ్’ చేసే లక్షణం వెన్నతోపెట్టిన విద్య కాబట్టే... ఆ రోజుకీ, ఈ రోజుకీ మా రిట్ పిటిషన్ అతీగతీ తేలకుండా అలా మూలుగుతూనే ఉంది! తీరా ముఖ్యమంత్రి పదవి ఊడిపోయిన చంద్రబాబు... ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక వనరులు సమకూడాలంటే అమరావతి భూముల్ని జగన్ ప్రభుత్వం అమ్ముకుంటే చాలునని, ఉచిత సలహా ఇవ్వడానికి సాహసించారు! పదేళ్ళ దాకా ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ కార్యరంగంగా ఉంటుందని చెప్పినా వినకుండా చంద్రబాబు బిచాణా ఎత్తేశారు. మరోవైపున అమరావతి భూములు కాజేసి తన అనుయాయులకు చేతులు ‘తడిపితే’ గాని తన ముఖ్యమంత్రిత్వం ఆంధ్రలో నిలవదన్న భీతి బాబు గుండెల్లో గూడుకట్టుకుంది. దీని ఫలితం గానే నూతనంగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైతాంగానికి ఇన్ని తిప్పలు తప్పలేదు. ఈ నేపథ్యంలోనే 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి ప్రజలు తిరుగులేని మెజారిటీని కట్టబెట్టారు. వైఎస్ జగన్‌కు అధికార పగ్గాలను రాష్ట్ర ప్రజలు కట్టబెట్టింది తాను తలపెట్టిన అఖండ పాదయాత్ర ఫలితమే. నిర్దిష్టమైన కార్యాచరణకు తగిన నవరత్నాలతో ప్రణాళికను రూపొం దించుకుని, పాద యాత్రలో గడించిన అనుభవాల ఆధారంగా మాట తప్పకుండా ప్రభుత్వ పాలనా రథాన్ని వినూత్న పద్ధతులతో వైఎస్ జగన్ నడిపిస్తున్నారు. గ్రామసీమల్లో ఎక్కడికక్కడ ప్రజలకు అందు బాటులో ఉండే గ్రామ సచివాలయాల స్థాపనతోనే వికేంద్రీకృత పాలనకు బలమైన అంకురార్పణ జరిగింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు (ఉత్తర, పశ్చిమ, దక్షిణాంధ్ర ప్రాంతాలు) మూడు రాజధానులు ఏర్పర్చడం ఇప్పుడెంతో అవసరం. దూరాభారాలతో నిమిత్తం లేని ప్రాంతీయ రాజధానుల ఏర్పాటుతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు ప్రబలే అవకాశాలు ఉండవు. ఆ మాటకొస్తే మదరాసు నుంచి విడిపోయిన తర్వాత ప్రత్యేక ఆంధ్ర కాలంలో బెజవాడ, కర్నూలు, గుంటూరు.. ఆ తర్వాత హైదరాబాద్ రాజధానులుగానే వ్యవహరించాయి! కాబట్టే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది అమరా వతి ఒక్కటే కాదని, అది ఒక వర్గానికి చెందిన రాజధానిగా ఉండ కూడదని ప్రజలు గ్రహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే 13 జిల్లాలకు చెందినదని, రాయలసీమ, ఉత్తరాంధ్రలు వెనుకబడిన ప్రాంతాలని తెలిసికూడా అమరావతిని కొద్దిమంది మోతుబరుల ‘రియల్ ఎస్టేట్’గా మార్చడం తగదన్నది క్రమంగా ప్రజలు అనుభవంలో తెలుసుకున్న సత్యం. ఇది ఇప్పటికీ, ఎప్పటికీ తెలుసుకోవలసిన వాస్తవం. అమరావతి ఆది నుంచి బౌద్ధ విద్యా కేంద్రంగానే వర్ధిల్లింది కానీ, రియల్ ఎస్టేట్‌గా కాదు. నలందాకు నకలే అమరావతి. నాగా ర్జునుడి కేంద్రాలు, నాగార్జున విశ్వవిద్యాలయ స్థాపన వెనక రహ స్యమూ ఇదేనని గుర్తించాలి -ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఈ ప్రమాదాలు యక్షప్రశ్నలేనా!
భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ దంపతులు, వారి సిబ్బందితో సహా ప్రయాణిస్తున్న ప్రత్యేక సైనిక రవాణా రష్యన్ హెలికాప్టర్ తమిళ నాడులోని నీలగిరి కొండల్లో ఆకస్మిక ప్రమాదానికి గురై కూలిపోయింది. విమానం కెప్టెన్ మినహా అందరినీ బలిగొన్న ఆ ప్రమాదం రష్యన్ సైనిక వాహనాల వినియోగం, వాటి సాంకేతిక నాణ్యతపై పలు సందేహాలను రేకెత్తిస్తోంది. పౌరవిమానయాన దుర్ఘటనలకు, సైనిక రవాణా సంబంధిత హెలికాప్టర్ల పతనానికి కారణాలను శోధించే విచారణ సంస్థలు వెలువరించే ఏ నివేదికలూ ఒక పట్టాన వాస్తవాలను బహిర్గతం కానివ్వవు. ఆ నివేదికల్లో దాగి ఉన్న పలు వాస్తవాలను ప్రజలు ఎప్పటికి తెలుసుకోగల్గుతారన్నది మరొక యక్షప్రశ్నగానే మిగిలిపోతోంది. ఈ నెల 8వ తేదీన కూలిపోయిన ప్రత్యేక సైనిక రవాణా రష్యన్ హెలికాప్టర్ ‘ఎంఐ– 17వీ5’ తమిళనాడులోని నీలగిరి కొండల్లో అకస్మాత్తుగా అంత ర్థానమైన విషయం తెలిసిందే, ఈ దుర్ఘటనలో 13 మంది సైనిక సిబ్బందిని (భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా) దేశం కోల్పోయింది. ఈ సందర్భంగా భారత రక్షణశాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక ప్రకటన చేశారు. ఈ ప్రమాద నేపథ్యంలో, రష్యన్ హెలికాప్టర్ల కోసం భారత ప్రభుత్వం గతంలో కుదుర్చుకున్న ఒప్పందం గురించి గానీ, వాటి సామర్థ్యం గురించి కానీ ఎవరూ ఎలాంటి ఊహాగానాలు చేయరాదని ఆయన కట్టడి చేశారు. కాని గత పదేళ్ళుగా ఈ రష్యన్ సైనిక రవాణా హెలికాప్టర్ల వల్ల సంభవించిన వరసవారీ ఘటనలు వాటి సామర్థ్యాన్ని అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తూ వస్తున్నాయి. ఈ సందర్భంగా 1966–2021 మధ్యకాలంలో రష్యాకి చెందిన పౌర, సైనిక రవాణా హెలికాప్టర్ల వల్ల ఎన్ని దుర్ఘటనలు సంభవించాయో వివరిస్తూ సుప్రసిద్ధ ఐటీ, మీడియా సంస్థలు గూగుల్, వికీపీడియాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కొన్ని సివిలియన్ హెలికాప్టర్లు, కొన్ని సైనిక రవాణా హెలి కాప్టర్ల పతనానికి సంబంధించి కొందరు రాజకీయ పాలకులు, సైనికా ధికారులు చెప్పే కథనాలు తీవ్రమైన గందరగోళం కలిగిస్తున్నాయని వైమానిక నిపుణులు పేర్కొంటున్నారు. పరస్పర విరుద్ధమైన ఈ కథనాలవల్ల ఎవరి తొందరపాటు నిర్ణయాలు ఈ దుర్ఘటనలకు కార ణమో చెప్పలేని దుస్థితిని ఎదుర్కొనవలసి వస్తుందని ప్రముఖ రిటైర్డ్ ఎయిర్‌లైన్ ఇన్స్ట్రక్టర్ పైలట్, వైమానిక భద్రతా సలహాదారు కెప్టెన్ ఎ. మోహన్ రంగనాథన్ వివరించారు. ప్రమాదాల బారిన అధునాతన హెలికాప్టర్లు ఎందుకంటే రష్యన్ ప్రత్యేక హెలికాప్టర్లు ‘మనకెంత ముద్దయినా’, గత పదేళ్ళకు పైగా ఆ ప్రత్యేక హెలికాప్టర్లు అనేక ప్రమాదాలకు కారణమయ్యాయని చెప్పక తప్పదు. రష్యాతో 2008లో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత 2011లో భారత వైమానిక దళానికి ఈ ప్రత్యేక హెలికాప్టర్లను అందజేయడం మొదలైంది. 2012 నుంచి వాటి సేవల్ని మనం పొందుతున్నాం. అది మొదలు అధునాతనమైన ‘ఎంఐ–17 వి5’ రష్యన్ హెలికాప్టర్లు అనేక దుర్ఘటనలకు కారణమయ్యాయన్నది నిపుణుల అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఈ రష్యన్ సైనిక, రవాణా హెలికాప్టర్లను ఎన్నిదేశాలు వినియోగిస్తున్నాయన్నది ఇక్కడ ప్రధానం కాదు, అవి ఆయా దేశాల్లో ఎన్ని ప్రమాదాలకు కారణమయ్యాయ న్నదే ఇక్కడ కీలకం. ముఖ్యంగా కెప్టెన్ మోహన్ రంగనాథన్ అంచనా ప్రకారం, సైనిక రక్షణ హెలికాప్టర్ ప్రమాద కారణాల విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఎన్నటికీ లేదు! అలాగే అధికారంలో ఉన్న రాజకీయ పాల కులు తమ ప్రత్యేక విమాన ప్రయాణాలకు సంబంధించిన ప్రమాద కారణాలను తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఎందు కంటే తమ కార్యక్రమాల్ని ముగించుకుని రావడంలో ఎవరి తొందర వారిది! పైలట్ల మానసిక స్థితిపై తీవ్ర ఒత్తిడి తమ ప్రయాణాలు, కార్యక్రమాలపై రాజకీయ నాయకుల తొందర, దాంతో తీసుకుంటున్న ఆకస్మిక నిర్ణయాలు హెలికాప్టర్లను నడిపే పైలట్ల మానసిక స్థితిపైన తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే హెలికాప్టర్ని నడిపి తీరాల్సిందే అని ఒత్తిడి చేసే రాజకీయ పాలకుడిని ఆ సమయంలో ఏ పైలట్ కూడా శాసిం చలేడు. ఇందుకు గతంలోనూ ఎన్నో ఉదాహరణలున్నాయి. 2001లో మాజీ కేంద్ర పౌర విమానయాన మంత్రి మాధవరావు సింథియా తన అవసరం కొద్దీ కాన్పూరు వెళ్లవలసి వచ్చింది. కానీ, వాతావరణం ఏమాత్రం సహకరించని ఘడియల్లో పైలట్‌ను ఆయన బలవంతాన ఒత్తిడిచేసి బయలుదేరడంతో విమానం కూలి అందు లోని వారంతా ప్రాణాలు విడిచారు. అలాగే 2002లో లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి భారీవర్షంలో పైలట్‌ను ఒత్తిడికి గురిచేసి బయలుదేరి నప్పుడు ఆ హెలికాప్టర్ కాస్తా కుప్పకూలింది. గగనతల ప్రమాదాలకు అసలు కారణాల గురించి ఇన్ని అనుభవాలు చెప్తున్న గుణపాఠం ఏమిటో కూడా కెప్టెన్ మోహన్ రంగనాథన్ ఈ సందర్భంగా వివ రించారు. ‘పైలట్‌ను ఎన్నడూ మేం ఒత్తిడి చేయలేదు అని పాలకులు పైకి చెప్పడం అయితే చెబుతారు. కానీ విచారణ నివేదికలు మాత్రం ఆ ప్రమాద కారణాల్ని బహిరంగంగా వెల్లడించకుండా చడీ చప్పుడూ లేకుండా వాటిని తొక్కి పడతాయి’. అలాగే ఈ నెల 8వ తేదీన భారత సర్వసేనాధిపతి బిపిన్ రావత్ వినియోగించిన రష్యన్ సైనిక రవాణా వాహనం అననుకూల వాతా వరణ పరిస్థితుల్లో ప్రయాణించవలసి రావడానికి కారణం కూడా అలాంటిదే అయిఉండాలి! ఏది ఏమైనప్పటికీ, ఇటీవల తూర్పు అరు ణాచల్ప్రదేశ్లో, ఉత్తరాఖండ్‌లోని కేదారనాథ్‌లో, గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్ దగ్గర్లో ఇవే రష్యన్ సైనికరవాణా హెలి కాప్టర్లు పరస్పరం ఢీకొని వైమానికదళ సభ్యులు ప్రాణాలు విడవ వలసి వచ్చింది! ఇందువల్ల రష్యన్ సైనిక రవాణా హెలికాప్టర్ల విని యోగ సాంకేతికతలోనే తీవ్రమైన లోపం ఉండి ఉండాలన్న నిపుణుల అంచనాను విశ్వసించవలసి వస్తోంది! అంతేకాదు... చివరికి పాకిస్తాన్ సైన్యం వాడుతున్న ‘మిగ్–17’ రష్యన్ సైనిక రవాణా హెలికాప్టర్ కూడా గిల్గిత్–బల్తిస్తాన్లోని ‘నల్తార్’ ప్రాంతంలో ఆకస్మికంగా కుప్పకూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న నార్వే, ఫిలిప్పైన్, మలేషియన్, ఇండోనేషియా రాయ బారులు, వారి భార్యలతోపాటు, పాకిస్తాన్ సైన్యం పైలట్లు ఇద్దరు కూడా చనిపోయారు! బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన రష్యన్ ‘మిగ్– 17’ హెలికాప్టర్ కూడా ఇలాగే కూలిపోయిందని సాధికార వార్తా సంస్థలు ప్రకటించాయి. బ్లాక్‌బాక్స్ వివరాలు వెల్లడించరెందుకు? ఇలా 1955 నుంచి 2021వ సంవత్సరం దాకా ప్రపంచ దేశాలలో సైనిక వైమానిక రవాణా హెలికాప్టర్ల ద్వారా జరిగిన దుర్ఘటనలపై ప్రపంచ మీడియా వ్యవస్థలు సాధికార నివేదికలను ప్రచురించాయి! చివరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కర్నూలు సమీపం లోని కొండల్లో వాతావరణ పరిస్థితులు వికటించిన ఫలితంగా చెట్లను ఢీకొని కూలిపోయింది. వై.ఎస్. అర్ధంతరంగా దివంగతులయ్యారు. అయితే, ఆయన ప్రయాణించిన హెలికాప్టర్‌లోని ‘బ్లాక్‌బాక్స్’లో నిక్షిప్తమై ఉన్న వివరాల్ని మాత్రం వెల్లడించకుండా, అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇంటిలిజెన్స్ శాఖ జాయింట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన అధికారి ‘చాలా జాగ్రత్త’ పడ్డారు! ఆమాట కొస్తే ఆ బాక్స్‌లోని వివరాల్ని ‘తూ.తూ’ మంత్రంగా తేల్చారు! అందువల్ల ఆ బ్లాక్‌బాక్స్ వివరాల్ని మభ్యపర్చడం ద్వారా ఆరోజుకీ, ఈ రోజుకీ వాస్తవాలను బయటపడనీయకుండా కనుమరుగుచేశారు. ఆ పరిస్థితుల్లో ఆ ప్రమాదానికి సంబంధించిన అనేక వాస్తవాలు కనుమరుగయ్యాయన్నది ‘బ్లాక్ బాక్స్’ వివరాల్ని తొక్కిపెట్టిన ఆఫీ సర్కి మాత్రమే తెలియాలి. అందుకే కెప్టెన్ మోహన్ రంగనాథన్ అన్నట్టు అటు పౌరవిమానయాన దుర్ఘటనలకు, సైనిక రవాణా సంబంధిత హెలికాప్టర్ల పతనానికీ కారణాలను విచారించే విచారణ సంస్థలు వెలువరించే ఏ నివేదికలు కూడా ఒకపట్టాన వాస్తవాలను బహిర్గతం కానివ్వవు. ఆ నివేదికల్లో దాగిఉన్న పలు వాస్తవాలను ప్రేక్ష కులైన ప్రజలు ఎప్పటికి తెలుసుకోగల్గుతారన్నది మరొక యక్షప్రశ్న గానే మిగిలిపోతోంది. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
అధికార భాషకు పట్టంకట్టిన మూర్తులు
దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో అధికార భాషా సంఘం ఉనికిలో ఉన్నప్పటికీ ఆ సంఘానికీ, దాని కార్యకలాపాలకూ, అన్ని స్థాయిల్లోనూ తెలుగుభాష వాడకాన్ని స్థానిక అధికారులు పెంచడానికీ అవసరమైన బడ్జెట్ లేదు. ఆ పరిస్థితుల్లో అధికార భాషగా తెలుగు వాడకాన్ని పెంచడానికి అవసరమైన తొలి బడ్జెట్‌ను నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేటాయించింది. ప్రత్యేక బడ్జెట్ ఎంత కావాలని వైఎస్సార్ అడగగా, సంవత్సరానికి కనీసం రూ. 2 కోట్లు అవసరమని చెప్పాము. ఆయన దానికి సమ్మతించారు. కాబట్టే ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాలలోనూ సాధికారికంగా భాషా సంఘం ఆధ్వర్యంలో, ఉధృతంగా అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్యం కలిగించాము. నాటి ఉన్నతాధికారుల సహకారం ఫలితంగా అనేక జిల్లాలలో అధికారుల స్థాయిలో తెలుగు వాడకం పెరిగింది. సమీప జిల్లాలను ఒకచోట కలిపి ప్రాంతీయ సదస్సులు జరిపి తెలుగు భాష వాడకాన్ని పెంచడానికి అవగాహన కల్పించాం. ఇంత కృషికీ, ఆచరణకూ దోహదపడింది... వైఎస్సార్–రోశయ్య చేసిన ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులే! ‘దేశభాషలందు తెలుగులెస్స’ అనీ, అది కండగల భాష అనీ, దేశంలోని పాలకులంతా దానిని కొలవడానికి పోటాపోటీలు పడింది అందుకేననీ శ్రీకృష్ణదేవరాయలు వందల సంవత్సరాల క్రితమే ఎంతో గర్వంతో చాటి చెప్పారు. కానీ ఆచరణలో క్రమంగా పాలకుల అనాదరణవల్ల తెలుగు భాష సౌరు, సొగసూ తరిగిపోతూ వచ్చింది. చివరికి ఏ స్థాయికి మన పాలకులు దిగజారవలసి వచ్చిందంటే... అధికార భాషా సంఘం ఉనికిలో ఉన్నప్పటికీ ఆ సంఘానికీ, దాని కార్యకలాపాలకూ, అన్ని స్థాయిల్లోనూ తెలుగుభాష వాడకాన్ని స్థానిక అధికారులు పెంచడానికీ అవసరమైన బడ్జెట్ అంటూ లేదు. తెలుగు భాష వాఢకానికి వారే స్ఫూర్తి ఆ పరిస్థితుల్లో అధికార భాషా సంఘం ఉద్యమ స్ఫూర్తితో భాష వాడకాన్ని పెంచడానికి అవసరమైన తొలి బడ్జెట్‌ను అధికారికంగా ప్రకటించింది. కీర్తిశేషులైన వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, రోశయ్య నాటి ఆర్థికమంత్రిగా ఉండేవారు. అప్పటి దాకా పేరుకు అధికార భాషా సంఘం ఉన్నా ప్రయోజనం లేక పోయింది. ఈ దశలో ఆ సంఘానికి అధ్యక్షునిగా వైఎస్సార్ నన్ను నియమించినప్పుడు–నా పని (వ్యాసకర్త) అప్పటికి ‘చీకట్లో చిందు లాట’గా మారింది. ఎందుకంటే అంతవరకూ అధికార భాషా సంఘా నికి లేని ఒక ప్రత్యేక బడ్జెట్ కోసం నేను ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయవలసి వచ్చింది, అప్పుడు వైఎస్సార్, నన్ను రోశయ్యతో మాట్లాడుకుని ఏర్పాటు చేసుకోమని చెప్పారు. కానీ, రాష్ట్ర ముఖ్య మంత్రి ఒకమాట చెబితే తప్ప ఎలా కేటాయించగలనని రోశయ్య పటుపట్టారు. ఆర్థిక మంత్రి రోశయ్య ‘చిక్కడు–దొరకడ’న్న సామెత అప్పుడే నాకు గుర్తుకొచ్చింది. ఈలోగా అధికార భాషా సంఘం అభ్యర్థనను సుకరం చేస్తూ తెలుగు భాషా ప్రేమికులైన నాటి ఉన్నతాధికారులు డాక్టర్ రమా కాంతరెడ్డి, సెక్రటరీ కృష్ణారావు భాషా సంఘం చేస్తున్న కృషికి మన సారా దోహదం చేశారు. ప్రత్యేక బడ్జెట్ ఎంత కావాలని వైఎస్ అడ గగా, సంవత్సరానికి కనీసం రూ. 2 కోట్లు అవసరమని చెప్పాము. అందుకు ఆయన మరోమాట లేకుండానే సమ్మతించారు. కాబట్టే ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాలలోనూ సాధికారికంగా భాషా సంఘం ఆధ్వర్యంలో, ఉధృతంగా అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్యం కలిగించాము. దీని ఫలితంగా అనేక జిల్లాలలో అధికారుల స్థాయిలో తెలుగు వాడకం పెరిగింది. మాండలికాలకు పట్టం కట్టిన భాషా సంఘం ఈ సదస్సులు క్రమంగా రాష్ట్రేతర ఆంధ్రులను, అక్కడి తెలుగు భాషా భిమానుల్ని సహితం కదిలించివేశాయి. మన భక్త రామదాసు బరంపురం వాసి కావడంతో తెలుగు–ఒడిశా సంబంధాలు కూడా మరింతగా సన్నిహితం కావడానికి దోహదకారి అయింది. అందుకే మనం మనం బరంపురం అన్న రావిశాస్త్రి వ్యాఖ్య విశేష ప్రచారంలోకి వచ్చింది. భాషా సంఘం ప్రత్యేక బడ్జెట్ కేటా యింపులతో ప్రారంభించిన ప్రత్యేక సదస్సుల సందర్భంగా, పలు ప్రోత్సాహకాల స్వేచ్ఛా వాడకం కూడా నమోదు కావడం మరో విశేషం. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాల్లోనూ ఒకసారి కాదు, రెండేసి సార్లు భాషా సంఘం తిరిగింది. సమీప జిల్లాలను ఒకచోట కలిపి ప్రాంతీయ సదస్సులు జరిపి తెలుగు భాష వాడకాన్ని పెంచడానికి అవగాహన కల్పించాం. ఒక్కమాటలో చెప్పాలంటే – ఇంత కృషికీ ఆచరణ దోహదపడింది... వైఎస్ రాజశేఖరరెడ్డి– రోశయ్య చేసిన ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులేనని మరచిపోరాదు! ప్రముఖ భాషా సాహిత్యకారుడు వేటూరి ప్రభాకర శాస్త్రిగారు ఏనాడో (1917) అన్నట్టుగా ఆయా మండలాల్లో వాడే భాషలు ఇతరులకు తెలియనంత మాత్రాన ఆ భాష చెడ్డదనడం, స్థాయి తక్కు వదనడం తప్పు. ‘మారడం, మార్పు చెందడం భాషకు అత్యంత సహజం’! అందుకే మన కాళోజి నారాయణరావు మాతృ భాషను, మాండలిక భాషనే సమర్థించాల్సి వచ్చింది... ‘‘తెలుగు బాస ఎన్ని తీర్లు తెలుగు యాస ఎన్ని తీర్లు వాడుకలున్నన్ని తీర్లు వాడుక ఏ తీరుగున్నా తెలుగు బాస వాడుకయే అన్ని తీర్ల వాడుకకు పరపతి – పెత్తనమొకటే’ ... అన్నారు కాళోజీ! ఇలా కింది స్థాయి వరకు తెలుగు అధికారులంతా, అధికార భాషగా భాష వాడకాన్ని పెంచడానికి అవసరమైన ప్రత్యేక బడ్జెట్‌ను తొలిసారిగా ఆమోదించిన ఘనత వైఎస్ – రోశయ్యల హయాంకే దక్కింది! చివరికి న్యాయస్థానాల్లో తీర్పులు సహితం తెలుగులోనే వచ్చేలా చేయడం ఈ ప్రత్యేక బడ్జెట్ వల్లనే సాధ్యమైంది. ఎందుకంటే బౌద్ధం నాగరీక ధర్మం కాబట్టే అది కాలు పెట్టిన దేశాలన్నిటా అక్కడి సంస్కృతులను నాగరీకరించి మరీ సుసంపన్నం చేయడంతోపాటు, అది వాటితో ఏకమై, తనతో ఇముడ్చుకోగలిగింది. అంతవరకూ అర్ధ నాగరిక, బర్బర, యక్షనాగుల జాతిని మహాభారతం సహితం ‘అంధక జాతి’ అని పిలవగా ఆ మాటను సవరించి ‘ఆంధ్ర జాతి’గా పరిగణించిన ఖ్యాతి ఒక్క బౌద్ధానికే దక్కిందని మరచిపోరాదు. కనుకనే బౌద్ధం పునర్వికాసానికి, భారత రాజ్యాంగ నిర్మాతలలో అగ్రగణ్యుడైన డాక్టర్ అంబేడ్కర్ చరమదశలో పూనుకున్నారు. దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది దళితుల్ని బౌద్ధులుగా ఆయన పరివర్తింప జేశారు. ఇలా దక్షిణ భారతదేశంలో బౌద్ధ పునర్వికాసానికి తోడ్పడిన వారెందరో ఉన్నారు. అందుకే అన్నాడు మహాకవి గురజాడ.. ‘బౌద్ధాన్ని భారతదేశ సరిహద్దులు దాటించి దేశం ఆత్మహత్య చేసు కుంది’ అని! ఇప్పుడీ ఆత్మహత్యా ప్రయత్నంలో భాగమే భారతీయ భాషల సంరక్షణలో ఎదురవుతున్న సంకటం! వర్తక వ్యాపారానికి లాభాల వేటలో ప్రపంచీకరణ పేరిట ఇంగ్లిష్ భాషా పెత్తనాన్ని స్థిరపరచడం కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగు తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసంఖ్యాకమైన దేశీయ భాషల సహజ పురోభివృద్ధికి కృత్రిమ ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ సందర్భం గానే ఐక్యరాజ్యసమితి విద్యా సాంస్కృతిక శాఖ నిద్ర మేల్కొని దేశీయ మాతృ భాషల సంరక్షణకు పదే పదే హెచ్చరికలు జారీ చేయవలసి వచ్చింది. ప్రపంచ భాషా పటంలో ప్రతి పదమూ ఒక ఆణిముత్య మనీ, దాని సొగసును, సోయగాన్నీ రక్షించుకోవడం మాతృభాషా ప్రేమికుల కర్తవ్యమనీ ఐరాస విద్యా సాంస్కృతిక శాఖ ఆదేశించిం దన్న సంగతిని మనం ఎన్నటికీ మరవరాదు! అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగావకాశాల కల్పన కోసం ఇంగ్లిష్ భాషకు ప్రాధాన్యం కల్పించడం ఎంత అవసరమో.. ప్రాంతీయ భాషగా తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేయడం అంతే అవసరం. ఈ ముందు చూపు ఏపీ ప్రభుత్వానికి ఉన్నందునే ఆంధ్ర, ఆంగ్ల భాషల మేలు కలయికగా పాఠశాల, కళాశాల స్థాయిలో భాషా మాధ్య మాన్ని పరివర్తింపచేశారని మర్చిపోరాదు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ప్రజాభీష్టంతోనే మూడు రాజధానులు...
మూడు ప్రాంతాల్లో, మూడు రాజధానుల నిర్మాణ ప్రయత్నాలను అడుగడుగునా ఎదుర్కోవడానికి ఏపీలో ప్రతిపక్షం కుయుక్తులు పన్నుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం తలపెట్టిన మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం– ‘భారతదేశ పాలనావ్యవస్థ చరిత్రలోనే సాటిలేనిద’ని మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు ప్రశంసించారు. నూతన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం అధికార వికేంద్రీకరణ చట్టాన్ని రూపొందించాల్సి వచ్చిందని జస్టిస్ చంద్రు గుర్తించారు. ఈ కోణంలోనే రాజధానుల బిల్లును తాత్కాలికంగా వెనక్కు తీసుకున్న సందర్భంలో కూడా, నూతన రాష్ట్రానికి వికేంద్రీకరణే సరైన విధానమని సీఎం జగన్ స్పష్టపరిచారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ఎందుకు తలపెట్టవలసి వచ్చిందో వివరిస్తూ మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు విలువైన, సమగ్రమైన విశ్లేషణను వెలిబుచ్చారు. పేరు ప్రతిష్ఠలున్న మరొక వర్తమాన న్యాయమూర్తి ఎవరూ ఇలాంటి విశ్లేషణను అందించలేకపోయారు. ఇటీవల వ్యవసాయ రంగంలో ‘సంస్కరణల’ పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు చట్టాల్ని వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల శాసనసభలు తీర్మానాలు చేసినప్పుడు, ఆ శాసనసభల అధికారాల్నీ కొందరు ప్రశ్నించారు. కానీ శాసనసభల అధికారాన్ని ఇలా ప్రశ్నించడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా విమర్శించాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యంలో దేశ సార్వభౌమాధికారం అనేది ప్రజల చేతుల్లో కేంద్రీకృతమై ఉంటుందని జస్టిస్ చంద్రు వివరించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఒక్కటే రాజధాని అని హడావిడిగా చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరస్కరించడమే కాదు.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ప్రయోజనాల దృష్ట్యా మూడు రాజధానుల నిర్మాణ అవసరాన్ని కూడా గుర్తించవలసి వచ్చిందని జస్టిస్ చంద్రు భావించారు. అర్ధంతరంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించి, విభజిత ప్రాంతాన్ని నట్టేట్లో వదిలిన ఫలితంగా 2020లో జగన్ నాయకత్వంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నూతన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం అధికార వికేంద్రీకరణ చట్టాన్ని రూపొందించాల్సి వచ్చిందని జస్టిస్ చంద్రు గుర్తించారు. దురదృష్ట కరమైన విషయం ఏమిటంటే కొన్ని రోజుల క్రితం ఒక ప్రముఖ జాతీయ వార్తాపత్రికలో మూడు రాజధానులపై జస్టిస్ చంద్రు చేసిన విలువైన వ్యాఖ్య పెద్దగా ఎవరి దృష్టిలోనూ పడలేదు. జగన్ ప్రభుత్వాన్ని. దాని ప్రజాహిత నిర్ణయాలను మూడు ప్రాంతాల్లో, మూడు రాజధానుల నిర్మాణ ప్రయత్నాలను అడుగడు గునా ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కుయుక్తులు పన్నుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం తలపెట్టిన మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం– ‘భారతదేశ పాలనా వ్యవస్థ చరిత్రలోనే సాటిలేనిద’ని జస్టిస్ చంద్రు ప్రశంసించాల్సి వచ్చింది. చివరికి తన వరుస ప్రజావ్యతిరేక చర్యల కారణంగా, రాష్ట్ర శాసనపరిషత్‌లో టీడీపీ సభ్యుల సంఖ్య కూడా క్రమంగా కుదేలయిపోయింది. అధికారపార్టీ సభ్యులు 11 మంది ఏకముఖంగా ఇటీవలే మండలికి ఎన్నిక కావడంతో నామమాత్రపు ప్రతిపక్షం సంఖ్య కూడా కనుమరుగయ్యే దుఃస్థితి టీడీపీకి ఎదురైంది! ఈ మింగలేని, కక్కలేని దుర్గతితో చిక్కు బడిపోయిన చంద్రబాబు వర్గం న్యాయస్థానాల్ని ప్రభావితం చేసే దుష్ట పన్నాగంతో ఆఖరి తురుఫు ముక్క కూడా వాడేయడానికి సాహసించింది. రాష్ట్రంలో ‘రాజ్యాంగ సంక్షోభం’ ఏర్పడిందన్న మిషపైన ఎలాగోలా ఏపీలో రాష్ట్రపతి పాలనను రుద్దించడానికి కూడా ప్రయత్నించింది. కానీ గతంలో బొమ్మై కేసులో (కర్ణాటక), సుప్రీంకోర్టులోని మెజా రిటీ సభ్యులతో కూడిన ధర్మాసనం ‘రాజ్యాంగ సంక్షోభం’ అన్న మిషపై కోర్టుకెక్కి రాష్ట్రపతి పాలనను రుద్దించాలని చూసిన ప్రతిపక్షం పాత్రను తుత్తునియలు చేసింది. బొమ్మై ప్రభుత్వానికి మెజారిటీ ఉందో లేదో తేల్చవలసింది శాసనసభే గానీ, కోర్టు కాదని సుప్రీం కోర్టు నాటి విచారణ సందర్భంగా ప్రతిపక్షానికి లెంపలు వాయించి మరీ పంపింది! అలాగే ఆంధ్రప్రదేశ్‌లో గత సర్కారు అనుసరించిన కేంద్రీకృత ధోరణులకు ప్రజలు విసిగిపోయారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నికరపరిచిన ప్రజాతీర్పు చంద్ర బాబుపై వ్యతిరేకతను కళ్ళకు కట్టి చూపింది. అందుకే జగన్ బాధ్యతగల ప్రజా ముఖ్యమంత్రిగా రాజధానిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి హైదరాబాద్ లాంటి సూపర్ రాజధాని మోడల్ నూతన ఆంధ్రప్రదేశ్‌కు వద్దనీ, అలాంటి చారిత్రక తప్పిదానికి మరోసారి పాల్పడరాదనీ ప్రజలు ఎన్నికల్లో తీర్పిచ్చారు. కాబట్టే నూతన రాష్ట్రానికి వికేంద్రీకరణే సరైన విధానమని వైఎస్ జగన్ ప్రభుత్వం తేల్చుకుంది. అయితే కొందరు రియల్ ఎస్టేట్ కుబేరులు, అధికార వికేంద్రీకరణ పథకం మూలంగా తమ వ్యాపార లావాదేవీలకు నష్టం వాటిల్లుతుందని అప్పుడే గగ్గోలు పెట్టడం ప్రారంభమైంది. నిజానికి తాము చేసే ప్రచారం ఫలిస్తే, ఆ పేరిట మరిన్ని లాభాలను రియల్ ఎస్టేట్ ద్వారా పొందడం సాధ్యమని వారికీ తెలుసు. భారత రాజ్యాంగ నిర్మాతలలో అగ్రగణ్యుడైన డాక్టర్ అంబేడ్కర్ మొత్తం రాజ్యాంగ నిర్ణయ సభా చర్చలన్నిటా ప్రజావసరాలను ఏకరువు పెడుతూ వచ్చారు. దేశంలో అట్టడుగున ఉన్న దళిత, గిరిజన, అణగారిన జాతుల, పేదసాదల, వ్యవసాయ కార్మికుల జీవితాలను ఉద్ధరించే వాదనలు, ప్రతిపాదనలే చేస్తూ వచ్చారు. చివరికి కేంద్రమంత్రివర్గంలో సభ్యుడై ఉండి కూడా పాలకవర్గ నిర్ణయాలు గాడితప్పి, రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధంగా ముందుకు సాగుతుండడం గమనించి, ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. వస్తూ వస్తూ అంబేడ్కర్ ఒక బలమైన హెచ్చ రిక చేసి మరీ బయటపడ్డారు. ప్రజలు ధన, మాన, ప్రాణ త్యాగాలతో నిర్మించుకున్న స్వాతంత్య్రాన్ని, ‘ప్రజలమైన మేము’గా రూపొందించుకున్న సెక్యులర్ రాజ్యాంగ లక్ష్యాలకు పాలకులు ఆచరణలో విఘాతం తలపెట్టే పక్షంలో...‘పార్లమెంటు భవనాన్ని కూల్చడానికి సహితం ప్రజలు వెనుకాడరు సుమా’ అని అంబేడ్కర్ హెచ్చరించిన సంగతం మనం మరచిపోరాదు! ఇంతకూ ఇటీవల ఒక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ గౌరవ రాష్ట్ర హైకోర్టులో కూడా ఒకే రాష్ట్రంలో మూడు రాజధానులూ, మూడు న్యాయస్థానాలూ సాధ్యమా, అలా ఎక్కడైనా ఉన్నాయా, అన్న ప్రశ్న, అనుమానాలూ సహజంగా తలెత్తాయి. ఈ విషయం గతంలో కూడా ప్రస్తావనకు వచ్చినపుడు ఇదే పత్రిక (సాక్షి)లో ఈ వ్యాసకర్త వివిధ దేశాల్లో వివరాలను, మనదేశంలోని వాటి వివరాలను ప్రకటించారు. అమరావతి మొత్తం ఏకైక రాష్ట్ర రాజధాని కావడం వల్ల కర్నూలు, విశాఖపట్నం కేంద్రాలు ఒక్కొక్కటి అమరావతికి 700 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాయి. అలా కాకుండా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులుంటే ఆయా రాజధానుల చుట్టూ ఉన్న నగరాలు, గ్రామాలలో అభివృద్ధి లోటుపాటుల్ని సరిదిద్దడానికి వీలుగా ఉంటాయి. ఈ దృష్ట్యానే ఉత్తరప్రదేశ్‌కు ప్రయాగ న్యాయరాజధాని గానూ, లక్నో పరిపాలనా రాజధానిగానూ ఉన్నాయి. మహారాష్ట్రకు ముంబై, నాగపూర్ రాజధానులు, కర్ణాటకు బెలగావి(బెల్గాం), బెంగళూరు రాజధానులుగా ఉంటున్నాయి. అలాగే మలేషియా రాజధానులు కౌలాలంపూర్, పుత్రజయ; జెకోస్లావేకియా రాజధానులు ప్రాగ్, బ్రనో; బొలీవియా రాజధానులు లాపాజ్, సుక్రీ; చిలీ రాజధానులు శాంటియాగో, వల్పరాజో; శ్రీలంక (కొలంబో, శ్రీ జయవర్ధనీ పుత్రకోటి), టాంజానియా (దార్ ఇ సలామ్, డొడోమా) నిక్షేపంగా పాలనను అందిస్తున్నాయి. కాగా, అసమానతల బెడద వల్లనే తమిళ నాడులో దక్షిణ తమిళనాడు విడిపోవాలని కోరుతున్న వ్యక్తి పి. చిదంబరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు స్వార్థ ప్రయోజ నాలకు బలిచేసిన వ్యక్తి కూడా ఈ చిదంబరమే! ఇది చరిత్ర, చెరపరాని చరిత్ర, వినదగిన చరిత్ర. - ఏబీకే ప్రసాద్ abkprasad2006@yahoo.co.in -
ఇప్పుడు గుర్తొచ్చిన జాతీయ ప్రయోజనం!
వ్యవసాయ సంస్కరణ చట్టాల రద్దుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటనతో భారత రైతాంగం చరిత్రాత్మక విజయం నమోదు చేసింది. పంజాబ్, హరియాణాతో పాటు అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కూడా త్వరలో ఎన్నికలు జరుగబోతున్నందున రైతు ఉద్యమం కొనసాగితే అసలు ఉనికి కే ప్రమాదం అని కేంద్రం గ్రహించింది. దాని ఫలితమే– కొత్త సాగు చట్టాల రద్దు నిర్ణయం. కానీ వచ్చే పార్లమెంటు సమావేశంలో చట్టాల ఉపసంహరణ బిల్లు అనంతరం తమ నిర్ణయం అమలులోకి వస్తుందని మోదీ పేర్కొన్నారు. దీంతో ఆందోళనల రద్దుకు రైతులు ససేమిరా అన్నారు. ఎన్నికలకూ, సమస్యలకూ ముడిపెట్టడం అలవాటైపోయిన దేశం కాబట్టి రైతుల అప్రమత్తతే వారికి శ్రీరామరక్ష. త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పాలక పార్టీ నాయకులిద్దరి మధ్య జరిగిన సంభాషణను ప్రసిద్ధ వ్యంగ్య చిత్ర కారుడు మంజుల్ ఎలా నమోదు చేశాడో చూడండి: ‘జాతీయ ప్రయో జనాల దృష్ట్యా మనం చట్టాల్ని రూపొందించాం కదా! అదే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆ చట్టాల్ని తిరిగి మనమే రద్దు చేద్దాం! ఏమంటావ్?’ అని! ఇంక అనేదేముంది– అది ‘నాలుక గాదు, తాటిమట్ట’ అంటారు! ఎందుకంటే మడతపడిన నాలుకను సరిచేయడం అంత తేలిక కాదు. కాబట్టే సంవత్సరం పైగా ఒక్క పంజాబ్, హరియాణా రైతులే కాకుండా యావద్భారత రైతాంగ ప్రతినిధులు... బీజేపీ పాలకులు తలపెట్టిన రైతాంగ వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలని « జరుపుతున్న ధర్నాలు జయప్రదమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకోవడానికి పాలకులు రైతుల నెత్తిన మోపిన ప్రమాదకర షరతు ఒకటుంది. వచ్చే పార్లమెంటు సమావేశంలో చట్టాల ఉపసంహరణ బిల్లు అనంతరం తమ నిర్ణయం అమలులోకి వస్తుందని! మధ్యలో ఈ ఆ షరతు ఎందుకు? అంటే పంజాబ్, హరియాణాతో పాటు తమ ఉనికిని ప్రాణం పోస్తున్న ఉత్తరప్రదేశ్‌లో కూడా త్వరలో ఎన్నికలు జరుగ బోతున్నాయి. ఈ తరుణంలో 2019 ఎన్నికల తరువాత ఎన్నడూ లేనంత ఫికరు బీజేపీ పాలకులను అతలాకుతలం చేస్తోంది! దానికితోడు బీజేపీలోనే తమ భవిష్యత్తుపై అలుముకుంటున్న చీకట్లను తొలగించుకోవడానికి ఒక వర్గం పార్టీ ఉనికికోసం ఎత్తుగడలు మార్చుకొనే యత్నంలో ఉంటోంది. మరొకవర్గం మొండిగా రైతాంగ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోడానికి ఇప్పటికీ ససేమిరా అంటోంది. ఈ వైరుధ్యాల మధ్య నుంచే ప్రధాని నరేంద్రమోదీ చట్టాల ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రకటించారు. పైగా ఇంతవరకూ రైతాంగాన్ని తాను మనోవేదనకు గురిచేసినందుకు ‘క్షమాపణ’ వేడుకుంటున్నానని చెప్పడం హర్షించదగిన పరిణామం. అయితే పాలకుల మొండి వైఖరి ఫలితంగా ప్రాణాలు కోల్పోయిన సుమారు 700 మంది రైతు ఆందోళనకారుల్ని గురించి మాత్రం ప్రధానమంత్రి ప్రకటనలో కనీస విచారం కూడా వ్యక్తం కాకపోవడం ఆశ్చర్యకరం. అందుకనే చట్టాల ఉపసంహరణ ప్రకటనను తమ విజయంగా ఆహ్వానించిన రైతాంగ ప్రజలు పోరాట బాట వీడేది లేదని తేల్చిచెప్పారు. తమ పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తూ ప్రత్యేక చట్టాన్ని పాలకులు ప్రకటించేదాకా, ఇతర రైతాంగ సమస్యల పరిష్కారం గురించి సంతృప్తికరమైన వివరణను పార్లమెంటులో ప్రకటించేదాకా తాము విశ్రమించేది లేదనేశారు. ‘మనల్ని పాలిస్తున్న పాలకులేమీ రుషి తుల్యులు ఏమీ కారు. వారెప్పుడూ తమ రాజకీయలబ్ధిని లాభనష్టాల కోణం నుంచే ఆలోచిస్తూంటార’ని వీరు వ్యాఖ్యానించారు. ఈ లాభనష్టాల నాణానికి విరుద్ధంగా వారి ఆలోచనా పంధా కొనసాగి ఉంటే 700 మంది రైతుల ప్రాణాలు కోల్పోయేదాకా పాలకులు గుడ్లప్పగించి చూస్తుండేవారు కాదు. అందుకే ప్రధాని తాజా ప్రకటనను మంచివైపుగా పడిన ఒక అడుగు అనిమాత్రమే పరిగణించాలని రైతు ఉద్యమ ప్రతినిధుల్లో ఒకరైన ధర్మేంద్ర మాలిక్ చెప్పారు. కాగా బీజేపీ పాలనకు సైద్ధాంతిక నాయకత్వం వహిస్తున్న ఆరెస్సెస్‌కు అనుబంధంగా ఉన్న ‘భారతీయ కిసాన్ సంఘ్’ వ్యవ సాయ చట్టాలను ఉపసంహరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం గమనార్హం. రైతాంగ ప్రయోజ నాలకు దీర్ఘకాలంలో నేటి ప్రభుత్వ నిర్ణయం (చట్టాల ఉపసంహరణ) నష్టం కలిగిస్తుందని ఆరెస్సెస్ వాదించింది. అందువల్ల పాలక వ్యవస్థకు పట్టుకున్న ప్రధా నమైన చీడ అంతా వేరే ఉందని రైతాంగ ఉద్యమకారులు భావించ డమే కాదు... పార్లమెంటులో పాలకుల తుది నిర్ణయం వెలువడేదాకా తాము సమ్మెను మాత్రం ఉపసంహరించబోమని స్పష్టం చేశారు. ఎందుకంటే, దీపం పేరు చెప్పి, కొవ్వొత్తుల ‘మహిమ’ చూపి ప్రజల్ని మోసగించే రోజులు పోయాయి. ‘తీతువుపిట్ట’ల్లాంటి మధ్య వర్తుల రాయబారాలకూ, మోసాలకూ లోనయ్యేకాలమూ అంతరి స్తోంది. దీపం పేరు చెబితే చీకటి పోదు! అయిదు దశాబ్దాలుగా రైతన్నల వెతల్ని దగ్గరగా గమనిస్తున్నానని’ ప్రధాని మోదీ చెబుతూనే ఇంకోవైపునుంచి ‘అన్నదాతల సాధికారత కోసమే సాగు చట్టాలు తీసుకొచ్చామ’ని సమర్థించుకున్నారు. కాబట్టి, పార్లమెంటులో సాగు చట్టాలను ఉపసంహరించే దాకా రైతాంగం విశ్రమించబోదని అర్థ మవుతోంది! అర్ధంతరంగా వ్యవసాయం, రైతాంగం నడ్డి విరిచే మూడు చట్టాలను రద్దు చేస్తూనే మరోవైపునుంచి అదే ప్రకటనలో మోదీ ‘వాస్తవానికి ఎన్నెన్నో రైతుసంఘాలు, వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, పురోగమన భావాలుగల రైతులు కొత్తసాగు చట్టాలకు అండగా నిలిచారన్నారు. ఒక వర్గం రైతులు మాత్రమే వ్యతి రేకిస్తూ వచ్చారనీ, కాని వారు కూడా మనవాళ్లే కాబట్టి ఒప్పించేందుకు పదే పదే ప్రయత్నించామనీ, చట్టాలను రెండేళ్లపాటు నిలిపివేస్తామనీ చెప్పారేగాని, వాటి పూర్తి ఉపసంహరణకు సిద్ధమని మాత్రం చెప్ప లేదు! అందుకనే పాలకుల పరస్పర విరుద్ధ ప్రకటనల దృష్ట్యా రైతాంగ ప్రజలు తిరుగులేని హామీని పాలకులు ప్రకటించి ఆచరణలో అమలుపరిచేంతవరకూ విశ్రమించబోరని రైతాంగ సంయుక్త కిసాన్ మెర్చా ప్రకటించాల్సివచ్చింది. ఆ మాట కొస్తే నిజానికి దేశ రాజ్యాంగ చట్టం ఆదేశిక సూత్రాల విభాగంలో అధికరణలు 38 నుంచి 45వరకూ పౌర హక్కులలో అంతర్భాగమైన రైతాంగ సాగు ప్రయోజనాల రక్షణకు ఉద్దేశించినవే నని మరచిపోరాదు! అంతేగాదు, రాజ్యాంగంలోని ‘పౌరబాధ్యత’ల అధ్యాయంలో శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోమని, మూఢవిశ్వా సాలకు హారతి పట్టవద్దనీ చెప్పిందేగాని మరోలా ప్రవర్తించమనీ చెప్పలేదు! మరొకమాటలో చెప్పాలంటే 2014లో బీజేపీ అధికార పీఠాలు అలంకరించినప్పటి నుంచీ ఈ రోజుదాకా తీసుకున్న చర్య లలో హెచ్చుభాగం దేశ మౌలిక ప్రయోజనాలకు, రాజ్యాంగ ఆదేశా లకూ విరుద్ధమైనవిగానే భావించాలి. ఒక వైపున యూపీలో బీజేపీ పాలనా ప్రయోజనాల కోసం పెద్దకరెన్సీ నోట్లను ఆకస్మికంగా రద్దు చేసి కరెన్సీ సంక్షోభానికి తెరలేపారు. దీంతో గ్రామీణస్థాయిలోని, పట్టణాలలోని బ్యాంకులవద్ద దేశ పౌరులు గంటలు, రోజుల తరబడి పడిగాపులు పడి వృద్ధులు కూడా సాయంత్రం దాకా క్యూలలో నిల బడి సొమ్మసిల్లిపడిపోయిన ఫలితంగా దాదాపు 200 మంది దాకా ప్రాణాలు విడిచిన దారుణ పరిస్థితుల్నీ చూశాం! ఈ సంక్షోభం ఫలి తాల్ని నేటికీ దేశం అనుభవిస్తూనే ఉంది. ఇజ్రాయెల్‌ని నమ్మి పెగసస్ గూఢచర్యంతో వియ్యమంది దేశప్రజల ముందు చులకనైపోయారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికే చిక్కిపోయారు! ఈ లోగా దేశ ఆర్థిక పరిస్థితులు అదుపు తప్పిపోయాయి. విదేశీ బ్యాంకులలో దాచుకున్న భారత మోతుబరుల దొంగఖాతాలను దేశానికి రప్పించడం ద్వారా కోట్లాది రూపాయలను కుటుంబానికి రూ. 15 లక్షల చొప్పున పంచి దారిద్య్ర భారాన్ని రూపుమాపేస్తానని బీరాలు పలికిన బీజేపీ పాల కులు తీరా ఆచరణలో నోరెళ్లబెట్టుకోవలసి వచ్చింది! చివరికి దేశ పాలనా వ్యవస్థ ఒకనాటి వెర్రిబాగుల సంస్థానంగా మారిన ‘పుంగ నూరు’ సంస్థానంగా తయారైంది. కొన్ని దేశాలలోని ప్రభుత్వాలకు ఒక్కోదానికి ఒక్కో అవివేకపు ఖ్యాతి ఉంటుంది! ‘సంచి లాభాన్ని కాస్తా చిల్లి కూడదీసినట్టుగా పాలకుడు ఎంత గొప్పవాడనుకున్నా పాలన దిబ్బ రాజ్యంగా మారకూడదు! కవి సినారె అన్నట్టు ‘ఏది పలి కినా శాసనమైతే ఎందుకు వేరే జనవాక్యం? ఏది ముట్టినా బంగారమే అయితే ఏది శ్రమశక్తికి మూల్యం?’’! ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఈ ఒప్పందం ఆదర్శం, అనుసరణీయం
దేశాల మధ్య, ఒకే దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య జలవిద్యుత్ పంపిణీ సమస్యలకు ‘సంప్రదింపుల’తో ఇచ్చిపుచ్చుకునే ప్రవృత్తి చాలా అవసరం. ‘నిర్బంధ మధ్యవర్తిత్వం కన్నా పరస్పర సహకారం, సౌభ్రాతృత్వం ద్వారానే’ తగాదాలు పరిష్కారం కావాలనీ, అవుతాయనీ ఆంధ్ర, ఒడిశా ముఖ్యమంత్రులు ఇటీవలే మార్గం చూపారు. రెండు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలపై వీరిరువురు చరిత్రాత్మక సంధి కుదుర్చుకున్నారు. ఉమ్మడి ప్రయోజనాలే లక్ష్యంగా జలవనరులు, సరిహద్దు విద్యుత్ తదితర అంశాలను పరిష్కరించుకోవడంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవగాహనకు వచ్చారు. ఈ ఒప్పందాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ‘ఒజ్జబంతి’గా భావించాలి. ఏపీ, ఒడిశాల మధ్య దశాబ్దాలుగా పరి ష్కారానికి నోచుకోకుండా కొన్ని కీలక సమ స్యలు వాయిదాపడి ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి సంబం ధించి, ఉభయ రాష్ట్రాలు నిర్ణయాత్మకమైన చరిత్రాత్మక సంధి కుదుర్చు కోవడానికి తొలిసారిగా ఇటీవలే అంకురార్పణ జరిగింది. రెండు రాష్ట్రాల ప్రజల ఉమ్మడి ప్రయోజనాలే లక్ష్యంగా జలవనరులు, సరి హద్దు విద్యుత్ తదితర అంశాలను పరిష్కరించుకోవడంపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించారు. మొదటిసారిగా ఫలవంతమైన చర్చలు జరిగినందుకు సంతోషం ప్రకటిస్తూ, ఇవి త్వరలోనే సత్ఫలితా లనివ్వ గలవని ఏపీ, ఒడిశా సీఎంలు వైఎస్ జగన్, నవీన్ పట్నాయక్‌లు ప్రకటించారు. – (పత్రికా వార్తలు 9–11–21) ఫెడరల్ వ్యవస్థ, రాజ్యాంగ విలువలు బతికిబట్టకట్టాలంటే అంతర్ రాష్ట్ర ప్రజలకూ, విద్యుత్ పంపిణీకి సంబంధించిన వివాదాల పరి ష్కారం కీలకమవుతుంది. అలాగే రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల మధ్య, ఒకే ప్రాంతంలోని పలు గ్రామాల మధ్య జల వివాదాల పరి ష్కారం కూడా ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో, ఆంధ్ర– ఒడిశాల మధ్య 60 ఏళ్ల తర్వాత చరిత్రాత్మక ఒడంబడిక కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ‘ఒజ్జబంతి’గా భావించాలి. వలస పాలనలోనూ, దేశ స్వాతంత్య్రానంతరమూ అనేక న్యాయస్థానాలు ప్రాంతాల మధ్య జలవిద్యుత్ పంపిణీ వ్యవస్థను ఎలా పరిష్కరించు కోవచ్చునో పెక్కు సందర్భాలలో సూచనలు చేస్తూ వచ్చాయి. దాదాపుగా 60 ఏళ్లపాటు నిద్రమత్తులో ఉన్న పాలకుల చండితనాన్ని వదిలించడానికి ఏ వ్యవస్థ కూడా ప్రయత్నించలేదు. ఈ పరిస్థితుల్లో దేశాలమధ్యనే కాకుండా, ఒకే దేశంలోని ప్రాంతాల మధ్య నెలకొన్న జల, విద్యుత్ పంపిణీ వ్యవస్థల తీరు తెన్నుల్ని, వాటిపై వివాదాలను కూడా సవరించడానికి ప్రపంచ స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి. 1966లో హెల్సెంకీ అంతర్జాతీయ మహాసభ ఈ విషయ మైన కొన్ని శాశ్వత నిర్ణయాలు ప్రకటించి, యావత్ ప్రపంచానికీ ఆదేశించి ఉందని మరచిపోరాదు. అలాగే చరిత్రను మనం మరచిపోకపోతే... వలస పాలనలో బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయాలను కూడా ధిక్కరించి గోదావరి, మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాలకు చెందిన ప్రజాబాహుళ్యం మౌలిక సమస్యను గుర్తించి పరిష్కరించిన సర్ ఆర్థర్ కాటన్ మనకు గుర్తుకు రాక మానడు. ఈ రెండు ప్రాంతాల రైతాంగం కరువు భూములకు సేద్య ధారలు అందించిన వ్యక్తిని మనం ఎన్నటికీ మరచిపోలేం. మను షులు తోటి మనుషుల్ని కుక్కల్లా పీక్కుతినేలా చేసిన ‘ధాత’ కరువు నుంచి ప్రజా బాహుళ్యాన్ని రక్షించడానికి 19వ శతాబ్దంలోనే గోదావరి ఆనకట్ట నిర్మాణాన్ని తలపెట్టిన మహనీ యుడు కాటన్. ఈ కారణం చేతనే ఆనాటినుంచి ఈనాటిదాకా గోదావరి మండలంలో ప్రజలు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సందర్భంగా వల్లించే స్తోత్రాలలో ‘కాట నాయ నమః’ అని తలచుకుంటూనే ఉండటం మరో విశేషం! అలాగే కొండల్ని పిండిచేసి, మహానదుల గమనాల్నే ప్రజాసేవకు మళ్లించగల మహనీయులుగా స్వతంత్ర భారతదేశ చరిత్రలో మోక్ష గుండం విశ్వేశ్వరయ్య, శొంఠి రామమూర్తి, డాక్టర్ కె.ఎల్. రావు లాంటి వారు వెలుగొందారు. వీరు దేశంలోని జల, విద్యుత్ ప్రాజె క్టుల నిర్మాణ రంగంలో మహోద్దండ పిండాలు! బ్రహ్మపుత్రా నదీ జలాలను భారతదేశంలోకి పారించి ఏడాది పొడవునా అన్ని ప్రాంతా లకు, ఆరుగాలమూ అందేటట్టు భారతదేశం నడిబొడ్డులో మహా సాగర నిర్మాణానికి ఏతమెత్తినవాడు కాటన్. ఎందుకంటే, నీటికి రాజ కీయం తెలియదు. విద్యుత్ ప్రవాహం భౌతికశాస్త్ర సూత్రాలపై తప్ప కేవలం రాజకీయ ఆదేశాలపై సాగదని విశ్వసించినవాళ్లు మన ఇంజ నీర్లూ, ప్రాజెక్టుల నిర్మాణ నిపుణులూ! 1966 నాటి హెల్సెంకీ అంత ర్జాతీయ సంధిపత్రం, నిర్ణయాలు, నిబంధనలు కూడా ఇదే సత్యాన్ని చాటి చెప్పాయి. దేశాల మధ్య, ఒకే దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య జలవిద్యుత్ పంపిణీ సమస్యలకు ‘సంప్రదింపుల’తో ఇచ్చి పుచ్చుకునే ప్రవృత్తి చాలా అవసరం. ఈ ఇచ్చి పుచ్చుకునేతత్వం వల్లే సమస్యలకు పరిష్కారం సాధ్యమనీ, ‘నిర్బంధ మధ్యవర్తిత్వంకన్నా పరస్పర సహ కారం, సౌభ్రాతృత్వం ద్వారానే’ తగాదాలు పరిష్కారం కావాలనీ హెల్సెంకీ ప్రపంచ మహాసభ అప్పట్లోనే సూత్రీకరించింది. అంతేకాదు, అంతర్జాతీయ జల, విద్యుత్ పంపిణీకి సంబంధిం చిన తగాదాలు న్యాయస్థానాల తీర్పులతోనే సంతృప్తికరంగా పరి ష్కారం కాజాలవు. ప్రపంచదేశాల జల తగాదాలను, సరిహద్దు వివా దాలను నిశితంగా అధ్యయనం చేసిన నిపుణుడు బార్బర్ (1959) ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నాడు. రివర్బోర్డులు ఉండి కూడా తగా దాలు తీరడం లేదు. కనుకనే ‘నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు’ అన్న సామెత పుట్టుకొచ్చి ఉంటుంది. ఇప్పుడు ‘ఎత్తిపోతల పథకాల’ ద్వారా పల్లంలోని నీరుసైతం ఎత్తులకు ఎగబాకి పోగలుగుతోంది! కనుకనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తన హయాంలో దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ తలపెట్టలేని విధంగా డజన్ల కొద్దీ ప్రాజెక్టులను ప్రాంతాల వారీగా ఆచరణసాధ్యం చేయడానికి ప్రయత్నించారు. ఈ ప్రాజెక్టులను తన హయాంలోనే నిర్మించి ఆచరణలో ప్రజల అనుభ వంలోకి రావడానికి ఉద్యమించిన మేటి నాయకుడు వైఎస్సార్. ప్రాజె క్టుల నిర్మాణంలో ఆయన రాజకీయాలకు, ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా వ్యవహరించగలిగారు. కాబట్టే కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య పేరిట వెలిగొండ ప్రాజెక్టును ఆయన ఆనాడు ఆవిష్కరించారు అదే స్ఫూర్తిని ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ ‘నవరత్నాల సాక్ష్యంగా కొనసాగిస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం, పేదల అభ్యున్నతి కోసం, అనేక సంక్షేమ పథకా లను ప్రకటించి అమలు చేస్తున్నారు. ఈ పథకాల అమలు ద్వారా రాష్ట్రవ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే ఉద్దండ పిండంగా గుర్తింపు పొంది, తన వ్యక్తిత్వ ప్రతిభతో ఆదర్శ జీవిగా వైఎస్ జగన్ నిలబడ గల్గుతున్నారు. ఆ స్ఫూర్తితోనే మన పొరుగునే ఉన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ అయిన ఏపీ సీఎం... రెండు రాష్ట్రాల మధ్య ఆరు దశాబ్దాలుగా పేరుకుపోయిన ప్రతిష్టంభనను ఛేదించగలిగారు! ఈ విశాలదృష్టి లేనందునే బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునళ్ల చుట్టూ ఇన్నా ళ్లుగా కాళ్ళకు బలపం కట్టుకొని తిరగవలసి వచ్చింది. అమెరికాలో మసాచూసెట్స్ రాష్ట్రానికీ దాని దిగువన ఉన్న కనెక్టికట్ రాష్ట్రానికి మధ్య జల, విద్యుత్ కేటాయింపుల విషయంలో సంవత్సరాల తరబడీ తలెత్తిన తగాదాల సందర్భంగా ఆ రెండు రాష్ట్రాల పాలకులకు జస్టిస్ బట్లర్ తన చరిత్రాత్మక తీర్పుతో హితబోధ చేశాడు. ‘ఉభయత్రా స్థానిక పరిస్థితులను బట్టి స్వార్థాలు బలిసి ఉంటాయి. కాబట్టి పరీవాహక ప్రాంత రాష్ట్రాల హక్కులకు సంబం ధించిన చట్టాలు తగాదాల పరిష్కారానికి తోడ్పడవు, హక్కుల సమా నతా సూత్రం ప్రాతిపదికపైన మాత్రమే నీటి తగాదాలు పరిష్కారం కావాలి. అంతేగాదు, నీ రాష్ట్రంలోని రెండు ప్రాంతాల మధ్య జల వివాదాల పంపిణీపై తగాదా వస్తే నీవు ఏం చేస్తావో ఆలోచించుకొని, ఆ సూత్రాన్నే రెండు రాష్ట్రాల మధ్య తలెత్తే జల వివాదానికి కూడా వర్తింపచేసుకోమన్నారు, జస్టిస్ బట్లర్! ఆ ఇంగిత జ్ఞానంతోటే, ప్రజాప్రయోజనాల దృష్టితోటే వైఎస్ జగన్–నవీన్ పట్నాయక్‌లు... దశాబ్దాలుగా నానుతున్న ఆంధ్ర– ఒడిశాల తగాదాలకు భరతవాక్యం చెబుతూ చారిత్రక ఒడంబడికకు శ్రీకారం చుట్టగలిగారు! కాబట్టి, ఇకపై పరస్పరం నిందలు మోపుకొనే నీలి మాటలకు, గాలి మాటలకు విలువుండదు! చిత్రకారుడి సజీవ చిత్రానికి ఎంత విలువ ఉంటుందో, ఆంధ్ర–ఒడిశాల చారిత్రక ఒప్పం దానికి ఆచరణలో అంత విలువ రాగలదని, రావాలని ఆశిద్దాం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
వారి నిర్బంధంలో న్యాయముందా?
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ముంబైలోని ఆర్థర్రోడ్ జైలు నుంచి విడుదలయ్యాడు. కానీ అతడి విడుదలపై ఉత్తర్వు జారీ చేసినప్పటికీ ఆర్యన్ ఒకే ఒక్కరోజు అదనంగా గడపవలసివస్తే్తనే న్యాయస్థానం బాధపడిపోయింది. కానీ, ప్రజాకార్యకర్తలపై, జర్నలిస్టులపై నిరాధారమైన అరెస్టుల కారణంగా, వారు ఏళ్ల తరబడి నిర్బంధంలో మగ్గుతున్నారు. వారి తక్షణ విడుదలకు, రక్షణకు గౌరవ న్యాయస్థానం ఇప్పటిదాకా పూచీపడటం లేదు. ఇవి న్యాయస్థాన చరిత్రలో చెరగని మచ్చలుగా మిగిలిపోతున్నాయి. అందుకే దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రస్తుతం తన పరువుకు సంబంధించిన అగ్నిపరీక్షను ఎదుర్కోబోతోంది! అక్రమకేసులు, అక్రమ అరెస్టుల మూలంగా జైళ్ల లోపల, వెలుపల కూడా నిరవధికంగా మగ్గుతున్న ప్రజాకార్యకర్తలను, ఉద్యమకారులను, కవులను, జర్నలిస్టులను, కళాకారులను, అందరినీ విడుదల చేయించవలసిన బాధ్యతను సుప్రీంకోర్టు విస్మరించరాదు. ‘దురదృష్టవశాత్తు దక్షిణాసియా రాజ కీయ నాయకత్వానికి పరిణామాలను ముందుగానే పసిగట్టగల దార్శనికత గానీ, సమయానికి మేల్కొని అన్నిరకాల మత దురభిమా నాలకు వ్యతిరేకంగా నిలబడేట్టు చేయగల సత్తాగానీ లేకుండా పోయింది. రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రాంత పాలకులు మత దురభి మానాలనూ ప్రజల్లో పరస్పర విద్వేషాలనూ, అసహనాన్నీ కడు వేగంగా వ్యాపింపజేస్తున్నారు. దీని ఫలితంగా ఆయా సమాజాల్లో జరిగే కాసింత మంచి విషయం కూడా నిలువునా దగ్ధమవుతోంది. ఈ దుష్పరిణామం దక్షిణాసియాలో భాగమైన భారత ప్రజలు కోరుకుం టున్న సామాజిక, ఆర్థికాభివృద్ధి అవకాశాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. దేశ విభజన జరిగిన 75 సంవత్సరాల తర్వాత కూడా భారత ప్రజల మధ్య సఖ్యత కొరవడటమే కాదు, విభిన్న మతాల మధ్య సహజీవ నానికి, సహిష్ణుతలకు సైతం నేడు పెను ప్రమాదం దాపురించిందని గమనించాలి.’’ – ప్రొ‘‘ సయద్ మునీర్ ఖస్రూ, చైర్మన్, ‘ఇనిస్టిట్యూట్ ఫర్ పాలసీ, అడ్వొకసీ అండ్ గవర్నెన్స్’ న్యూఢిల్లీ, పలు దేశాల్లో విద్యాధిక సలహాదారు ప్రొఫెసర్ మునీర్ ఖస్రూ హెచ్చరిస్తున్న ప్రమాదానికి ప్రత్యక్ష సాక్ష్యంగా సుప్రసిద్ధ హేతువాది నరేంద్ర దాభోల్కర్ హత్య కని పిస్తుంది. ఈయన హత్య జరిగి ఎనిమిదేళ్లయింది, ప్రసిద్ధ సామాజిక సేవకురాలు, హేతువాద పత్రిక ‘లంకేశ్’ సంపాదకురాలైన గౌరీ లంకేశ్ హత్య జరిగి నాలుగేళ్లయింది. కానీ వీరిద్దరి హంతకుల ఆచూకీ గురించిన విచారణ తతంగం ఇప్పటిదాకా ఒక కొలిక్కి రాలేదు. ఇలాంటి అనేక అంశాల కారణంగా దేశ అత్యున్నత న్యాయస్థానం తన పరువుకు సంబంధించిన అగ్నిపరీక్షను ప్రస్తుతం ఎదుర్కొన బోతోంది! దేశంలోని పలు జైళ్లలో దీర్ఘకాలంగా మగ్గుతున్న నిందితు లకు న్యాయస్థానాలు జారీచేస్తున్న బెయిల్ ఉత్తర్వులను కూడా సకా లంలో సంబంధిత అధికారులకు అందజేయడంలో జాప్యం జరుగు తోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానిస్తూ, అండర్ ట్రయల్ ఖైదీల బెయిల్ విషయంలో జాప్యం అనేది మానవ స్వేచ్ఛను ఉల్లంఘించడంగా విమర్శించవలసి వచ్చింది. అంతేకాదు, నేటి సాంకేతికయుగంలో కూడా కోర్టుల ఆదేశాలను జారీ చేయడానికి అవలంబిస్తున్న విధా నాలను ఆయన తప్పు పట్టారు. పాతకాలంలో పాలకుల ఉత్తర్వులు జారీచేయడానికి ఎగిరి వచ్చే పావురాల కోసం అప్పట్లో ఎదురు చూసేవారు కదా! అయితే నేటికాలంలో కూడా మంజూరైన బెయిల్ కోసం ఇంకా నిందితులు ఆకాశంవైపు మోరలెత్తి ఎదురు చూడడం హాస్యాస్పదమని జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం వ్యాఖ్యానించవలసి వచ్చింది! హేతువాద, ప్రజా ఉద్యమాల నాయకులైన దాభోల్కర్, గౌరీ లంకేశ్, ప్రొఫెసర్ కల్బుర్గి, గోవింద పన్సారేల దారుణ హత్యల ఉదంతం కానీ, ప్రజాఉద్యమాలకు అండగా నిలిచిన పలువురు పత్రికా విలేక రులపై జరిగిన హత్యా ఘటనలు కానీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ హత్యలకు కారకులను బహిర్గతం చేసి శిక్షించడంలో కూడా సుప్రీంకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ చొరవ తీసుకోవలసిన అవసరం ఉంది. ఇంతమంది ప్రజా కార్యకర్తలు, జర్నలిస్టులపై దారుణ హత్యలు నమోదై ఉండగా ఒక బాలీవుడ్ సూపర్‌స్టార్ కొడుకు ఆర్యన్, ఆర్థర్రోడ్ జైలునుంచి విడుదల కావడానికి కోర్టు ఉత్తర్వు జారీ ప్రక్రియలో ఆలస్యంతో ఒకే ఒక్కరోజు అదనంగా గడపవలసివస్తేనే న్యాయస్థానం బాధపడి పోయింది. అదే సమయంలో, ప్రజాకార్యకర్తలపై, జర్నలిస్టులపై నిరా ధారమైన అరెస్టులతో వారు సంవత్సరాల తరబడిగా నిర్బంధంలో మగ్గిపోతున్నారు, ఇలాంటివారి తక్షణ విడుదలకు రక్షణకు గౌరవ న్యాయస్థానం ఇప్పటిదాకా పూచీపడకపోవడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భాలు న్యాయస్థాన చరిత్రలో చెరపరాని మచ్చగా మిగిలిపోతున్నాయి. ఇది ప్రజాతంత్రవాదులకు, న్యాయస్థానాల పట్ల ఇంకా గౌరవం మిగుల్చుకున్న ప్రజాస్వామ్యవాదులకు మనస్తాపం కల్గించే పరిణామం. ఈ అంశంపై దేశ ఉన్నత న్యాయస్థానం గుర్తించి తిరుగులేని నిర్ణయానికి రాగలదని ఆశిస్తున్నాం. కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ, పౌరుల సమాచారహక్కు చట్టాలు లేక కాదు... ఉన్న చట్టాలను చాపచుట్టి నేలమాళిగల్లో భద్ర పరిచే ఏర్పాట్లకు కేంద్ర పాలకులు సిద్ధమయ్యారు. అందుకనే ఇప్పటిదాకా (11–10–2021) ఈ చట్టం అమలులోకి రాకుండా చేసినందున దాదాపుగా 2 లక్షల ఆర్టీఐ కేసులు పరిష్కారం కాకుండా నిలిచిపోవలసి వచ్చింది. ఈ వ్యవహారాన్ని దేశ అత్యున్నత న్యాయ స్థానం గుర్తించి చర్య తీసుకోవలసిన అవసరం ఉంది. సమాచార హక్కు చట్టాన్ని అమలుపర్చవలసిన సమాచార కమిషన్లకు సిబ్బంది లేరన్న సాకు ఎంతవరకు నిజమో, అందుకు కారణాలేమిటో గౌరవ సుప్రీంకోర్టు మొహమాటం లేకుండా పరిశీలించాల్సి ఉంది! అంతేకాదు, దేశ పౌరుల సమాచార హక్కును నిరాకరిస్తే, అది పౌరుల ప్రాథమిక హక్కుల్ని నిరాకరించిన ట్లే. పైగా ‘జాతీయ భద్రత’ పేరు చాటున ‘పెగసస్’ లాంటి విదేశీ నిఘా సాఫ్ట్వేర్ కార్య కలాపాలను దేశంలో అనుమతించబోమని, ఇది దేశ భద్రతకు సంబం ధించిన సమస్య అనీ, అందువల్ల ప్రభుత్వ వాదనను విశ్వసించ బోమని సుప్రీంకోర్టుæ ధర్మాసనం స్పష్టం చేయవలసివచ్చింది! పైగా, ఈ విషయానికి సంబంధించినంతవరకూ, ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాల సంతలో న్యాయస్థానం తలదూర్చబోదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. తన నిర్ణయానికి అనుగుణంగానే 1973 నాటి ‘కేశవానంద భారతి’ కేసులో జస్టిస్ హెచ్.ఆర్. ఖన్నా చెప్పిన తీర్పును చీఫ్ జస్టిస్ ఉటంకించాల్సి వచ్చింది. జస్టిస్ ఖన్నా ఆనాడు ‘న్యాయమూర్తుల ప్రాథమిక బాధ్యత భారత రాజ్యాంగ చట్టాన్ని నిర్భయంగాను లేదా సానుకూలంగానూ గౌరవించడమే... అలా చేయడంలో వారు ఒక రాజకీయ సిద్ధాంతాన్నో లేదా ఏదో ఒక ఆర్థిక సిద్ధాంతాన్నో అనుసరించి తమ నిర్ణయాన్ని ప్రకటించరాద’ని అన్నారు. అయితే దేశ రాజకీయ, ఆర్థిక విధానాలపై ఒక అవగాహన, స్పష్టతలేని న్యాయమూర్తుల పట్ల, వారి తీర్పుల పట్ల జస్టిస్ కృష్ణయ్యర్ తీవ్రంగా విభేదిస్తూ వచ్చారు. అలాగే ప్రస్తుత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కూడా ‘పెగసస్’ నిఘా సాఫ్ట్‌వేర్‌ని రూపొం దించిన ఎస్ఓఎస్ భారత పాలకుల అనుమతితో ఇండియాలో సాగి స్తున్న గూఢచర్యం విషయంలో, భారత పౌరుల రాజ్యాంగ హక్కుల రక్షణకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించడం హర్షించదగ్గ పరి ణామం. పాలకుల విధాన నిర్ణయాల వల్ల దేశ పౌరుల రాజ్యాంగ హక్కులకు కలుగుతున్న ప్రమాదం పట్ల న్యాయస్థానం మూగనోము పట్టజాలదని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఈ స్పష్టతకు అనుగుణంగానే, అక్రమకేసులు, అక్రమ అరెస్టుల మూలంగా జైళ్ల లోపల, వెలుపల కూడా నిరవధికంగా మగ్గుతున్న ప్రజాకార్యకర్తలను ఉద్యమకారులను, కవులను, జర్నలిస్టులను, కళాకారులను అందరినీ విడుదల చేయించవలసిన బాధ్యతను సుప్రీంకోర్టు విస్మరించరాదు. ఈ బాధ్యతను తప్పకుండా చేపట్టాలని చీఫ్ జస్టిస్‌కు ప్రజాపక్షంగా ఇదే మా విజ్ఞాపన! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
‘ఈ నిఘా’తోనే అసలు ముప్పు!
వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై నిఘా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. వ్యక్తుల ప్రైవేటు బతుకు వారివారి సొంతం. అది అవధులు దాటి సమాజ ప్రయోజనాలకు విఘాతం కల్గిస్తే తప్ప.. వ్యక్తిగత ‘గోప్యత’కు, భావప్రకటనా స్వేచ్ఛకూ భంగం కలిగించడానికి తాము వ్యతిరేకమని న్యాయ మూర్తులు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. పెగసస్ గూఢచర్యంపై భారత సర్వోన్నత న్యాయస్థానం తక్షణ, సంపూర్ణ విచారణకు నిర్ణయించడానికి ఇదే కారణం. పౌరులపై, ప్రముఖులపై నిఘా ఆరోపణలు ‘నిజమా, కాదా’ అన్న ప్రశ్నకు కేంద్ర పాలకులు ఈ రోజుదాకా సమాధానం ఇవ్వకుండా ‘మూగనోము’ పట్టి కూర్చుంటున్నారు. కానీ, మన జాతీయ భద్రతకే ప్రమాదం ముంచుకొస్తున్న సమయంలో, తన వంతుగా మూగనోము పట్టి, ప్రేక్షక పాత్రను పోషించలేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘‘ఇతర దేశాలలో ఇజ్రాయెల్ జరిపే గూఢ చర్యం నిమిత్తం ఆయా దేశాలలో ‘కూపీలు’ తీయడానికి ఉపయోగించే ప్రత్యేక నిఘా సాఫ్ట్వేర్ ‘పెగసస్’. దీన్ని ఆయా దేశాల ప్రభుత్వాలకు మాత్రమే ఇజ్రాయెలీ కంపెనీలు విక్రయించుకోవచ్చు. పెగసస్ గూఢ చర్య వ్యవహారం భారత ప్రభుత్వ సొంత వ్యవహారం.’’ – భారతదేశంలో ఇజ్రాయెల్ రాయబారిగా కొత్తగా నియమితులైన నోర్ గిలాన్ ప్రకటన (28–10–2021) ఇటీవలి చరిత్రను అవలోకిస్తే, ఇజ్రాయెల్‌ను అరబ్బుల మధ్య ఒక ప్రత్యేక దేశంగా అమెరికా, బ్రిటన్లు సృష్టించిన విషయం గుర్తు కొస్తుంది. పశ్చిమాసియాను, అరబ్ దేశాలను యథేచ్ఛగా దోచుకొని అక్కడి ఇంధన వనరులను తరలించుకుపోయే సాధనంగా ఇజ్రాయె ల్ని అమెరికా, బ్రిటన్లు వినియోగించుకుంటూ వస్తున్నాయని మర చిపోరాదు. అదే ప్రయోగం మనదేశంలో ఇప్పుడు అంతర్గతంగా జరు గుతోందా అని అనుమానం కలుగుతోంది. కనుకనే ఈ అను భవం దృష్ట్యా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పెగసస్ గూఢ చర్యంపై తక్షణ, సంపూర్ణ విచారణకు నిర్ణయించవలసి వచ్చిందనిపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రభుత్వ అనుమతితో ఎన్.ఎస్.వో. అనే పేరుతో నడుస్తున్న గూఢచర్య సంస్థ తాలూకు నిఘా సాఫ్ట్వేర్ పెగసస్ భారత ప్రభుత్వ అనుమతితోనే దేశంలోకి అడుగుపెట్టింది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను, ఆందోళనలను తలపెట్టిన రాజకీయ పక్షాలు, పౌరహక్కుల సంస్థలు, ప్రతిపక్షాల కార్యకలాపాల పైన ఒక కన్నువేయడానికి పాలకవర్గం ‘పెగసస్’ ద్వారా గూఢ చర్యా నికి ఒడిగట్టిందని ఆరోపణలు పెల్లుబికాయి. కాని, గత రెండు న్నర సంవత్సరాలకు పైగా తన నిఘా విధానాలపై ప్రబలిపోతున్న అను మానాలు, ఆరోపణలు ‘నిజమా, కాదా’ అన్న ప్రశ్నకు మాత్రం కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా ‘మూగ నోము’ పట్టింది. దేశభద్రతకు సంబంధించిన ఈ పరిణామాలపట్ల ఆందోళన చెందిన సుప్రసిద్ధ పాత్రికేయులు, పత్రికాసంస్థలు రంగంలోకి దిగి సుప్రీంకోర్టులో ‘రిట్’ పిటీషన్లు దాఖలు చేశాయి. దీంతో ‘డొంకంతా’ కదిలింది. అంతకుముందు అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తులు వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై నిఘా పట్ల తీవ్ర అభ్యంతరం తెలుపుతూ వచ్చారు. వ్యక్తుల ప్రైవేటు బతుకు వారివారి సొంతం. అది అవధులు దాటి సమాజ ప్రయోజనాలకు విఘాతం కల్గిస్తే తప్ప వ్యక్తిగత ‘గోప్యత’కు, వీరి భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కల్గించడానికి తాము వ్యతిరేకమని కొందరు గౌరవ న్యాయ మూర్తులు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. కాగా భారత ప్రభుత్వ అనుమతితోనే భారతదేశ అంతరంగిక వ్యవహారాల్లో, తాము జోక్యం చేసుకుని ఈ గూఢచర్యానికి దిగామని ‘పెగసస్’ సంస్థ తాజాగా అంగీకరించింది. దీనికి ఇజ్రాయెల్ ప్రభుత్వ అనుమతి కూడా ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత పాలకవర్గాల సమ్మతితో నడుస్తున్న ‘పెగసస్’ గూఢచర్యం తంతు ‘నిగ్గు’ తేల్చడానికీ, మొత్తం వ్యవహారం గుట్టుమట్టులు తేల్చడానికి సుప్రీం గౌరవ ప్రధాన న్యాయమూర్తి సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.వి. రవీంద్రన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యు లతో కూడిన నిపుణుల కమిటీని ఆయన నియమించారు. ఈ కమిటీకి పలు శాఖలకు చెందిన సాంకేతిక నిపుణులు సహాయ సహకారాలు అందిస్తారు. ఫలితంగా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికికీ, సెక్యులర్ రాజ్యాంగ విలువల రక్షణకూ శాశ్వతమార్గం ఏర్పడగలదన్న ఆశా భావాన్ని పలు ప్రతిపక్షాలు, పౌర హక్కుల సంస్థలు, నిపుణులు, ప్రజా ఉద్యమాలకు చెందిన ఆందోళనకారులు వ్యక్తం చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని, పౌరహక్కులను కూడా విదేశీ నిఘా సాఫ్ట్వేర్ ‘పెగసస్’ ద్వారా కాలరాసే దుర్గతిని అనుమతించ రాదని సీనియర్ జర్నలిస్టు నాయకులు కొంత కాలం క్రితం‘రిట్’ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ని కోర్టు గౌరవించి రంగంలోకి దిగవలసి వచ్చింది. దీని పర్యవసానంగానే ‘జాతీయ భద్రత కన్నా మించింది లేదనీ’ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మన జాతీయ భద్రతకే ముప్పు వాటిల్లుతున్న ప్రమాదం ముంచుకొస్తున్న సమయంలో, తన వంతుగా మూగనోము పట్టి, ప్రేక్షక పాత్రను పోషించలేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తన నుంచి ఈ అంశానికి సంబంధించి సానుకూల సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈషణ్మాత్రం కూడా ఆశిం చరాదనీ గౌరవ సుప్రీంకోర్టు ఘాటుగా హెచ్చరించాల్సి వచ్చింది! అదే సమయంలో న్యాయస్ధానం మరొక విషయాన్ని కూడా స్పష్టం చేసింది. ‘గోప్యత అనేది ఒక్క జర్నలిస్టులకు, లేదా సామాజిక కార్యకర్తలకు మాత్రమే వర్తించేదికాదు, ఈ ప్రాథమిక హక్కుకు భంగం కలగడం అనేది, ‘నా గోప్యతను దెబ్బతీయడానికి ఫలానా ప్రమాదం పొంచి ఉందన్న అనుమానం పౌరుడికి కల్గడమే’ తప్ప మరేమీ కాదు. గోప్యతకు భంగం కలిగిస్తే, పౌరులు తమ ప్రాథమిక హక్కులను స్వేచ్ఛగా ఇకపై అనుభవించలేమన్న భావనకు దారి తీస్తుందని గుర్తించాలని కూడా కోర్టు హెచ్చరించాల్సి వచ్చింది. పత్రికలు, జర్నలిస్టులు, రానున్న పరిణామాలను ముందస్తుగానే పసికట్టి, ప్రజల్ని అప్రమత్తుల్ని చేస్తారు. కాబట్టి అలాంటి వారిపైన పాలకవర్గాలు ‘నిఘా’ పెట్టడమంటే పత్రికల గురుతర బాధ్యతపైన దాడి చేయడమేననీ, వారి నోళ్లు నొక్కడంగానే భావించాలనీ కోర్టు అభిప్రాయపడింది. ప్రజాస్వామ్య మనుగడకు మీడియా ఒక ప్రధా నమైన దీపస్తంభమని మరచిపోరాదంటూ, పాలకవర్గాలను సుప్రీం కోర్టు ధర్మాసనం మరోసారి హెచ్చరించాల్సి వచ్చింది. జర్నలిస్టులకు తమ వార్తలకున్న ఆధారాన్ని సంరక్షించుకోవాల్సిన ధర్మం ఉంటుంది. వీరి వృత్తి ధర్మ నిర్వహణపై నిఘా పెట్టడం అంటే, ‘పెగసస్’ ద్వారా ప్రభుత్వం మనదేశంలో సాగిస్తున్న రహస్య కార్యకలాపాలకు సంబం ధించిన విశ్వసనీయ సమాచారాన్ని రాబట్టడాన్ని అడ్డుకోవడమే అవు తుంది. పైగా ఈ బాధ్యతలో ఉన్న పాత్రికేయుల శక్తిని నిర్వీర్యం చేయ డమే అవుతుందని కోర్టు (27–10–2021) హెచ్చరించాల్సి వచ్చిం దని మరువరాదు! అంతేగాదు, పత్రికాస్వేచ్ఛ అనేది ‘ప్రజాస్వామ్య వ్యవస్థ మను గడకోసం’ చేసిన ఎన్నో త్యాగాల ఫలితంగా దక్కిన హక్కు అని న్యాయస్థానం గుర్తుచేయాల్సి వచ్చింది. ఇటు ఎన్. రామ్ ప్రభృతులు, మరోవైపు నుంచి ఎడిటర్స్ గిల్డ్– ఇజ్రాయెలీ గూఢ చర్య సాఫ్ట్వేర్ ‘పెగసస్’ వ్యవహారంలో ఇరుక్కున్న భారత ప్రభుత్వ పాత్ర గురించిన వివాదంలో స్వతంత్ర దర్యాప్తు విధిగా అవసరమని భావించడం జరిగింది. మనదేశంలో కూడా ఇజ్రాయెల్ ఆధారంగా శరవేగంగా సంభ విస్తున్న పరిణామాల్ని జాగ్రత్తగా పరిశీలించగల వారికి ప్రసిద్ధ తెలుగు సామెత గుర్తుకు రాకతప్పదు. ‘నువ్వులు చల్లి ఆవాలు పండమంటే సాధ్యమా’ అన్నది! అందుకే దాస్యమనేది ప్రతి ఆత్మలో పెరిగే ఓ కలుపుమొక్క అన్న సామెత పుట్టుకొచ్చి ఉంటుంది. ఎంతటి ‘ప్రజాస్వామ్య దేశమైనా’ సరే... శాస్త్రీయ సోషలిజం ప్రవక్త కారల్ మార్క్స్ ఒక సత్యాన్ని లోకానికి అందించి పోయాడు. ప్రతీ యుగంలోనూ పాలకవర్గం భావాలు ఆనాటి పాలనా వ్యవస్థ భావాలే. అంటే ఆనాటి సమాజంలో ఏ వర్గం బలమైన భౌతికశక్తిగా పెత్తనం చలాయిస్తూ ఉంటుందో, ఆ శక్తే యావత్ సమాజంపై పెత్తనం చలాయించే ప్రధానమైన మేధాశక్తిగా చలామణీ అవుతూ ఉంటుంది. ఆ శక్తే స్త్రీ– పురుషుల మధ్య సంబంధ బాంధవ్యాలను కూడా శాసించే నిర్ణాయక శక్తిగా పెత్తనం సాగిస్తూ ఉంటుంది! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
నిజాలతోనే... నిరంకుశత్వానికి అడ్డుకట్ట
ప్రజా సమస్యలపైన, సమాజంలో అక్రమాలు, అన్యాయాలపైన కర్ణాటకలో ఒక సుప్రసిద్ధ వారపత్రిక సంపాదకురాలిగా గౌరీ లంకేశ్ సాగిస్తూ వస్తున్న పోరును అధికార స్థానాల్లో ఉన్నవారు సహించలేకపోయారు. గౌరి భావాలనే కాదు, ఆమెనే అంతమొందించాలని కిరాయి మూకలను పురమాయించారు. గౌరీ లంకేశ్‌ను అంతమొందించిన కుట్ర కేసు విచారణ సందర్భంగానే సుప్రీంకోర్టు కుట్రదారుల ‘నసాళానికి’ అంటే తీర్పు ఇచ్చింది. ‘ఎందుకు’ అన్న ప్రశ్నను ఎందుకు వేయవలసిన అవసరం ఉంటుందో విచ్ఛిన్నమవుతున్న వ్యక్తిత్వాలకు ఓ పెద్ద గుణపాఠం! అధికారంలో ఉన్నది సామ్రాజ్యవాద వలస ప్రభుత్వమైనా, స్వతంత్ర భారత ప్రభుత్వ పాలకులైనా సరే.. వారికి మనం నిజాన్ని దాచుకోకుండా కుండబద్ధలుకొట్టి బోధపడేట్టు చేయాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్న మాటలు అక్షర సత్యాలు. సుప్రసిద్ధ నవలా రచయిత, హేతువాది గోపీచంద్ తన సమర్థ సాహితీయాత్రలో భాగంగా లిఖించిన ‘అసమర్థుని జీవయాత్ర’ నవలా రచన సందర్భంగా మనకు కొన్ని ప్రశ్నలు సంధించారు. ప్రపంచంలో ఇంతమంది మేధావులున్నారు గదా వీళ్ళలో ఒక్కరయినా అన్నం తేలిగ్గా దొరికే పద్ధతి ఎందుకు కనిపెట్టరు? ఏ వాసన చూడటం వల్లో. ఏ గాలి పీల్చడం వల్లో, ఏ నీళ్ళు తాగడం వల్లో మనకు ప్రాణాలు నిలిచేటట్టు ఎందుకు చెయ్యరు?... జీవితం ప్రవాహం. ఇదొక మహాసంగ్రామం. ఈ సంగ్రామంలో పిరికివాళ్ళకు, అసమర్థులకు చోటు లేదు అని ప్రక టిస్తూ రాసిన గొప్ప నవలే ‘అసమర్థుని జీవయాత్ర!’. ఈ నవలను తన తండ్రి, తెలుగునేలపై తొలి హేతువాద సాహితీ పరులలో ఉద్దండుడైన త్రిపురనేని రామస్వామి గారికి గోపీచంద్ ఈ నవలను ఎందుకు అంకితమివ్వవలసి వచ్చిందో చెప్పారు. ‘ఎందుకు’ అన్న ప్రశ్న నేర్పినందుకు అని రాశారు. అలా ప్రశ్న వేయగల వాళ్ళే సమర్థులని వేయలేని వాళ్ళు అసమర్థులనీ తేల్చేశాడు! ఆ ప్రశ్నించే తేకువ, తెగువ లేనివాళ్ళు అసమర్థులని గౌరీ లంకేశ్ హత్యకేసు విచా రణలో గౌరవ సుప్రీంకోర్టు, బెంచ్ కొద్దిరోజుల క్రితం ఇచ్చిన తీర్పు నిరూపించింది. భావాలను కాదు... భౌతికంగా అంతమొందించారు! ప్రజా సమస్యలపైన, సమాజంలో అక్రమాలు, అన్యాయాలకు వ్యతి రేకంగా, కర్ణాటకలో ఒక సుప్రసిద్ధ వారపత్రిక సంపాదకురాలిగా గౌరీ లంకేశ్ సాగిస్తూ వస్తున్న పోరును అధికార స్థానాల్లో ఉన్నవారు సహించలేకపోయారు. లంకేశ్ భావాలనే∙కాదు, ఆమెనే అంతమొం దించాలని కిరాయిమూకలను పురమాయించారు. గౌరీ లంకేశ్‌ను అంతమొందించిన కుట్ర కేసు విచారణ సందర్భంగానే దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కుట్రదారుల ‘నసాళానికి’ అంటే తీర్పు ఇచ్చింది. ‘ఎందుకు’ అన్న ప్రశ్నను ఎందుకు వేయవలసిన అవసరం ఉంటుందో విచ్ఛిన్నమవుతున్న వ్యక్తిత్వాలకు ఓ పెద్ద గుణపాఠం! గౌరి తండ్రిపేరు లంకేశ్. ఆయన పేరిట ‘లంకేశ్’ అనే వార పత్రికను ప్రారంభించింది. కర్ణాటక సరిహద్దుల్ని దాటి దేశవ్యాపితం గానే దాని పేరు ప్రతిష్టలు ఇనుమడించాయి. ఫలితంగా అనేక జాతీయ, అంతర్జాతీయ ప్రసిద్ధ అవార్డులూ ఆమె పొందారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు, అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా ఎలు గెత్తి చాటగల ధైర్యసాహసాలకు పాలక వర్గాలనుంచి ఎదురవుతున్న, పెరిగిపోతున్న దాష్టీకాలకు తీవ్ర నిరసన ఎదురైంది. దాంట్లో భాగంగానే గతంలో పాలకుల నుంచి పొంది ఉన్న జాతీయస్థాయి అవార్డులన్నింటినీ సుప్రసిద్ధ కవులు, రచయితలు, పాత్రికేయులు తమ బిరుదబీరాలతో సహా పాలకుల మొహం మీదే విసిరికొట్టి నిరసన తెలిపి ప్రజల ప్రశంసలకు పాత్రులైన విషయం కూడా తెలిసిందే. అందుకే పాలకుల అన్యాయాలు, దాష్టీకాలపై ‘ఎందుకు’ అన్న ప్రశ్న అడగాల్సిన అవసరం ఉంది! అది ఎంతో విశిష్టమైన ప్రశ్న. అంతేకాదు, గౌరీ లంకేశ్‌కు ముందు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన మేధావులు, ప్రజాస్వామ్య పరిరక్షకులు, పౌరహక్కుల నాయకులైన గోవింద పన్సారే, డాక్టర్ దభోల్కర్, ప్రొఫెసర్ కల్బుర్గి వంటి ఎందరో మేధావులను కూడా గౌరీ లంకేశ్ కన్నా ముందే కిరాయిమూకల ద్వారా హతమార్చిన వైనాన్ని ఇక్కడ మరచిపోరాదు! నిషేధాలు, నిర్బంధాలపై తలంటిన న్యాయస్థానం ఇంతవరకూ ఈ హంతకుల ఆచూకీ తెలియకుండా పాలక వర్గాలు గోప్యతను నటిస్తూండడమూ రహస్యం కాదు. అందుకే ఒక సుప్రీం కోర్టు సుప్రసిద్ధ మాజీ న్యాయమూర్తి, బొంబాయి హైకోర్టు న్యాయ మూర్తి ఒకరూ.. ఒకనాడు బ్రిటిష్ హయాంలో ఆదివాసీలపై శ్వేత పాలకులు సాగించిన దాష్టీకాలకు నిరసనగా, బీమా కోరెగావ్‌లో జరుపుకుంటూ వస్తున్న సభలపై ఆంక్షలు, నిషేధాలు విధించే పాలకుల్ని తీవ్రంగా విమర్శించాల్సి వచ్చింది. ఆ సభలతో నిమిత్తం లేని ఇతర ప్రజాతంత్రవాదుల్ని, ప్రసిద్ధ కవులనూ ఆ సభలకు హాజర య్యారన్న మిషపైన అన్యాయంగా రెండేళ్ళకు పైగా వివిధ జైళ్లలో కుక్కి, నానా అగచాట్లకు గురిచేస్తున్నారు. దీన్ని సుప్రీంకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ప్రశ్నించవలసిన సమయం కూడా వచ్చింది. ‘అసమర్థుని జీవయాత్ర’లో గోపీచంద్ ‘సీతారామారావు’ పాత్ర ద్వారా నిరూపించినట్టుగా ఈ ‘మహాసంగ్రామంలో పిరికివాళ్ళకూ, అసమర్థులకూ చోటులేదన్న’ నిర్ణయానికి ఇంకెన్నాళ్లు తలవంచుతూ పోవాలో.. ఎందుకు అని ప్రశ్నించగల ధైర్యాన్ని నేర్పే తల్లిదండ్రులను పూజించుకోవాలో తెలుసుకొనే జ్ఞానం దేశంలో పరిఢవిల్లే రోజుకోసం ఎదురుచూడాలి! విశిష్ట వ్యక్తిత్వంతో తనదైన ముద్రను దశాబ్దాలుగా వేనోళ్ళ చాటుకొంటూ వచ్చిన సుధామూర్తి అన్నట్టు ‘నిన్ను చుట్టు ముడుతున్న అగ్నికి మరింత ఆజ్యం పోయడం ద్వారానే అగ్నిని ఆర్పగలం’. అందుకే దేశంలో ప్రజాస్వామ్యం, సత్యం(నిజం) చెట్ట పట్టాలు కట్టుకుని ముందుకు సాగినప్పుడే పాలక నిరంకుశ ధోరణు లకు అడ్డుకట్ట వేయగలమనీ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. అధికారంలో ఉన్నది సామ్రాజ్యవాద వలస ప్రభుత్వమైనా, స్వతంత్ర భారత ప్రభుత్వ పాలకులైనా సరే.. వారికి మనం నిజాన్ని దాచుకోకుండా కుండబద్దలుకొట్టి బోధపడేట్టు చేయాలన్నారు. ప్రజలు బతికి బట్టకట్టాలంటే సత్యాన్ని పలికి తీరాల న్నారు జస్టిస్ చంద్రచూడ్. సమాచార హక్కుకు మంగళమేనా? సత్యాన్వేషణలో ఉన్న భారతపౌరులు ‘సమాచార హక్కు చట్టం’ని ఉపయోగించుకోకుండా, పాలకులు నిర్వీర్యం చేసిన దాని ఫలితం గానే లక్షలాది మందికి కోరిన సమాచారం అందకుండా పోయింది. సమాచారం ఎందుకు అందించలేకపోయారని అడిగితే, సమాచార కమిషన్లకు ‘సిబ్బంది కరువయ్యార’న్న ఒకే ఒక సమాధానం! అందాకా దేనికి? రెండేళ్లుగా దేశంలోని జర్నలిస్టులపైన ప్రజాతంత్ర కార్యకర్తలపైన, పౌరహక్కుల ఉద్యమకారులను వేధించడానికి, కేసులుపెట్టి బాధించడానికీ ఇజ్రాయెల్ స్పై కంపెనీ ‘పెగసస్’ను భారత పాలకులు రహస్యంగా వినియోగస్తున్నట్టు వెల్లడికావడం మరో సంచలనం! ఇంతకూ మన పాలకులు ‘పెగసస్’ గూఢచర్యాన్ని దేశ ప్రజలపైన వినియోగిస్తున్నారా లేదా అన్న విషయాన్ని ఈ క్షణం దాకా పార్లమెంటుకు గానీ, సుప్రీంకోర్టు ప్రశ్నలకు గానీ సమాధానం చెప్ప కుండా పాలకులు దాచేస్తున్నారు. బహుశా అందుకే, ఇలాంటి నగ్నసత్యాలను తన కాలంలో కూడా కాచి వడపోసిన తర్వాతనే ప్రపంచ శాస్త్రీయ సోషలిజం సిద్ధాంతకర్త కారల్‌మార్క్స్ ఇలా చెప్పి ఉంటాడు... ‘మన సామాజిక వ్యవస్థ మూలంలోనే కుళ్ళిపోయి తిష్ఠవేసింది. ఈ వ్యవస్థ సమాజంలోని దైన్య స్థితిగతులను ఏమాత్రం మార్చకుండా కొంతమంది సంపదను మాత్రమే పెంచుకుంటూ పోతుంది’. అందుకే సుప్రసిద్ధ బ్రిటిష్ నాటకకర్త, సాహితీ దిగ్గజం జార్జి బెర్నార్డ్‌షా ‘ఈ ప్రపంచంలో ఇంతవరకూ ఏ మానవుడూ చేయని మహాప్రస్థానం మార్క్స్ చేశాడు! అదే యావత్ ప్రపంచం మనస్సునే మలచే యజ్ఞం’ అని కీర్తించాడు!! -ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఈ అభిజాత్యం సబబేనా?
‘మా’ సంస్థను బహుళార్థసాధక, సాంస్కృతిక సంస్థగా రూపొందించే ఉద్దేశంతో... ప్రత్యామ్నాయ ఎజెండాతో ముందుకు వచ్చినంత మాత్రాన తోటి కళాకారుడిగా ప్రకాష్ రాజ్‌ని న్యూనపరిచే సంస్కృతి ‘మా’ లోని ‘పొట్టిబావల’కు ఉండకూడదు! ఉభయ వర్గాల మధ్య జరిగిన శషభిషల మధ్య నలిగిపోయి, ఆంధ్ర– కన్నడల ఉమ్మడి చారిత్రక బంధాలకే చేటుకూడినంత పనయింది! కనీసం ‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు’ అని గుర్తుచేసిన కృష్ణదేవరాయలు కూడా ‘మా’ సభ్యులకు గుర్తు రాకపోవడం ఆశ్చర్యం. ప్రకాష్‌రాజ్ నోట... చివరికి నేను తెలుగువాడిని కాదన్న మాట ఇప్పుడు తెలిసివచ్చిందన్న ప్రకటనలోని బాధను, మనోవేదనను ఇప్పటికైనా ‘మా’ తెలుసుకోవాలి. ‘అంటరానితనంబునట్టి భారతజాతి ప్రపంచ సభ్యతనే కోల్పోయింద’ ని భావిం చిన మహాకవి జాషువా. అలా తామె పుట్టరాని చోట పుట్టామన్న అనంతమైన బాధను ఎందుకు గుండె బరువుతో మరింత కొంత ముందుకు సాగి ఇలా వ్యక్తం చేయవలసి వచ్చిందో గమనించండి. ‘ఎంత కోయిలపాట వృ«థయయ్యెనో కదా/ చిక్కు చీకటి వన సీమలందు / ఎన్ని వెన్నెల వాగులింకిపోయెనో కదా/ కటిక కొండల మీద మిటకరించి/ ఎన్ని కస్తూరి జింక లీడేరెనో కదా/ మురికి తిన్నెల మీద పరిమళించి/ ఎన్ని ముత్తెపురాలు ఖిన్నమయ్యెనో కదా/ పండిన వెదురు జొంపములలోన / ఎంత గంధవహన మెంత తంగెటి జున్ను / యెంత రత్నకాంతి యెంత శాంతి/ ప్రకృతి గర్భమందు! భగ్నమై పోయెనో / – పుట్టరాని చోట పుట్టుకతన’’! ఎందుకంతగా జాషువా భగ్నహృదయుడు కావలసి వచ్చింది? మనుషులు ఎదిగారు గానీ మనసులు ఎదగలేదని ‘పొట్టిబావ’ లాంటి ఒక బొటనవేలంత ఎత్తుకు మించని ఒకానొక ‘మా’ సంస్థ తన స్థాయిని మించి యావదాంధ్ర ప్రేక్షక లోకాన్ని కల్లోల పరచడానికి ఎందుకు ప్రయత్నించింది! ఈ కల్లోలంలో భాగంగానే సుప్రసిద్ధ కళాకారుడు, కన్నడ అభ్యుదయ కథా రచయిత, ప్రగతిశీల ఉద్యమా లకు వెన్నుదన్నుగా ఉన్న ప్రకాష్‌రాజ్ ‘ఓహో నేను తెలుగువాణ్ణి కాను, ఇప్పుడు గుర్తించాల్సి వచ్చింద’న్న బరువైన ప్రకటన ఎందుకు విడుదల చేయవలసివచ్చింది? ‘మా’ సంస్థను బహుళార్థసాధక, సాంస్కృతిక సంస్థగా రూపొందించే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ ఎజెండాతో ముందుకు వచ్చినంత మాత్రాన తోటి కళాకారుడిగా ఆయనను న్యూనపరిచే సంస్కృతి ‘మా’ లోని ‘పొట్టిబావల’కు, మిగతా ‘మా’ సభ్యులకు ఉండకూడదు! పరస్పరం ఉభయ వర్గాల మధ్య జరిగిన శషభిషల మధ్య నలిగిపోయి మరుగున పడిన ఆంధ్ర– కన్నడల ఉమ్మడి చారిత్రక బంధాలకే చేటుకూడినంత పనయింది! యావత్తు దక్షిణాపధాన్నే తెలుగు (16వ శతాబ్దం దాకా) ఏలుతూ వచ్చిన కాలం మరుగున పడిపోయింది. ప్రాంతాలకు, కులాలకు, మతాలకు, వర్గ, వర్ణ వివక్ష రంగులు పులిమి ఏలుతున్న కాలంలో ఆ వివక్షలకు దూరంగా ఉండి కన్నడ ప్రపంచంలో కళా, సాంస్కృతిక రంగాలలో, భావ విప్లవంలో భాగంగా అత్యంత అభినవ భావాలతో సంస్కృతీ పరులకు, ఉద్యమకారులకు ప్రకటనలలోనే కాదు, ఆచరణలో స్ఫూర్తిగా నిలబడుతున్న వ్యక్తి ప్రకాష్ రాజ్. ఎప్పుడైతే ‘పొట్టిబావల’ సంస్థగా మారిన ‘మా’లో ఫలానావారు స్థానికులు, మిగతావారు బయటివారనీ, కళాకారుల మధ్య వివక్షకు తావిచ్చారో, ఆ క్షణంలోనే ప్రకాష్‌రాజ్‌కు తాను ‘కన్నడవాడినే కానీ, తెలుగువాడిని కాను కాబోలు’ నని అంతవరకూ లేని భావన, బాధ కలుగజొచ్చాయి. ఈ పరిణామమే ప్రకాష్‌రాజ్ ‘మా’ నుంచి తప్పు కోవడానికి కారణమై ఉండాలి! గత వైభవ చరిత్రతో సంబంధాలు తెగిపోయిన దరిమిలా కనీసం ‘‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు’’ అని గుర్తుచేసిన కృష్ణదేవరాయలు కూడా ‘మా’ సభ్యులకు గుర్తు రాకపోవడం ఆశ్చర్యం. రాయల తెలుగుదేశమే ప్రకాష్రాజ్దీ. ఆంధ్ర– కన్నడల మధ్య అభేదాన్ని గుర్తు చేస్తూ రెండూ ఒకేదేశం, అదే తెలుగు సువిశాల దేశం అని ప్రకటించాడు రాయలు! 16వ శతాబ్దంలో రాయల యుగం ముగిసేదాకా ఆంధ్ర– కర్ణాటకలు ఒక తల్లి బిడ్డలే. ఏక రక్త సంబంధీకులు. ఆనాటి రాయలకు అమరావతి (కర్ణాటక) నగరంతోపాటు, రాయలసీమలోని పెనుగొండ కూడా రాజధాని, రెండవ రాజధానిగా ఉండేవని మరచిపోరాదు! అందుకే సుప్రసిద్ధ సాహితీవేత్త రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ ఆర్ద్రతతో... ఆంధ్ర– కన్నడ రాజ్యలక్ష్ముల అరతి నీలపుదండ పెనుగొండ కొండ’’ అని చాటవలసి వచ్చింది! పెనుగొండ రెండవ రాజధానిగా ఏలిన రాయలు రాయలసీమ నలుమూలలా అనేక చెరువులు తవ్వించి కరువుసీమను పంటసీమగా రూపొందించినవాడు. ఈ విషయంలో కూడా కాకతీయులు నిర్మించుకున్న చెరువులను రాయలు రాయల సీమకు ఆదర్శంగా తీసుకున్నాడని మరువరాదు. అంతేకాదు, ఆంధ్ర –కన్నడ ప్రాంతాలు ఉమ్మడిగా ఒక గొడుగు నీడనే ఎదిగినంత కాలం రాయలయుగ పరివ్యాప్తి ఉత్తరాన గజపతుల దిశవరకూ వ్యాప్తి చెందింది. బహమనీ సుల్తానుల చెరనుంచి తెలంగాణలోని వరం గల్ను విముక్తి గావించిన చారిత్రక సత్యాన్నీ మరువరాదు! ఇంతటి సంయుక్త ఉమ్మడి వైభవోజ్వల చరిత్రను మరిచినప్పుడు మాత్రమే ఈనాటివారిలో పిదప బుద్ధులు పుట్టుకొస్తున్నాయి. ప్రాంతీయ తగాదాలు ముదిరిపోతున్నాయి. దారీతెన్నులేక ఎక్కడి కక్కడ ప్రాంతాలు, మతాలు, కులాలు, వర్గాలుగా ఏర్పడి మానవతా వైఖరికి చెల్లుచీటి ఇచ్చుకుంటున్నారు. బహుశా అందుకే ఒక సంద ర్భంగా ప్రకాష్‌రాజ్ ఈ ప్రపంచంలో బతకలేని మనుషులు చాలా మంది ఉన్నారు. కొంచెం ఆలస్యమైనా, మోసపోయినా ఆ లిస్టులో నేనూ, మీరూ, ఎవరైనా చేరుకోవచ్చునని ప్రకటించాల్సి వచ్చింది. అంతేకాదు, ద్రోహం అనేది ఇతరులకు చేయనక్కర్లేదు, మనకు మనమే చేసుకోవచ్చునని కూడా ప్రకటించాడు! ఇలా అనేక సామాజిక అంశాలపైన పరిణామాలపైన ప్రకాష్ రాజ్ ఒక చేయి తిరిగిన ప్రసిద్ధ రచయితగా అనంతమైన అభ్యుదయ కోణాల్ని ఆవిష్కరించాడు. రైతాంగ సమస్యలు, మహిళా సమస్యలు, పెట్టుబడిదారీ, ఫ్యూడల్ వ్యవస్థను, దోపిడీ సమాజంలోని పెక్కు పరి ణామాల పట్ల, పౌరహక్కుల ఉద్యమాలు, ప్రజాస్వామ్య హక్కులు, వాటిపై ఎక్కుపెట్టిన ప్రజాతంత్ర శక్తుల పోరాటాలపైన, ఆ హక్కుల సాధనలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారులపైన పరోక్షంగానే కాదు ప్రత్యక్షంగానే ధైర్యసాహసాలతో ఒక ప్రజాకళాకారునిగా బాహా టంగా నిరసన తెలుపుతూ వచ్చినవాడు ప్రకాష్‌రాజ్. కర్ణాటక ఉద్యమకారిణి, ప్రసిద్ధ పత్రికా సంపాదకురాలైన గౌరి లంకేష్ హత్యను, ప్రొఫెసర్ కల్బుర్గి, తదితర పౌరహక్కుల నాయకుల హత్యల్ని, రాజ్యహింసను, బాహటంగా నిరసించి, ఉద్యమించిన కళానిధి ప్రకాష్‌రాజ్ అని గుర్తుకు తెచ్చుకుంటే ఒకనాడు శ్రీశ్రీ... కాంగ్రెస్ ఉనికిని ప్రశ్నిస్తూ ‘పొట్టిబావ కాంగిరేసు మేజరయ్యేదె ప్పుడు’ అని వేసిన ప్రశ్నే ‘మా’లోని పొట్టిబావ’లకూ ఎదురయింది. అందుకే ప్రకాష్‌రాజ్ ‘భాష అనేది ఒక అభివ్యాప్తి రూపం. సుఖ దుఃఖాల్ని వ్యక్తపరచుకునే ఒక మాధ్యమం. బసవన్న 12వ శతాబ్దపు గొప్ప వచనకారుడు, దార్శనికుడు. బింద్రే, కువెంపు, తేజస్వి, లంకేష్, కె.ఎస్.ఎన్ వంటి ప్రముఖ కన్నడ కవులూ, రచయితలూ ఇలాంటి ఆలోచనా సరళికి, జీవితాన్ని ధారపోసిన రచయితల్ని తెలుసు కోకుండానే, కేవలం వ్యాపార లావాదేవీలకు మాత్రమే భాషను నేర్చుకొనే మనఃస్థితి ఉన్నందువల్ల, మన అస్తిత్వాన్నే పోగొట్టుకుని అనామకులుగా నిలబడిపోయాం’ అన్నాడు. అంతేకాదు ‘జీవితంలో కొన్నింటిని ఏ కారణం వల్లనూ మార్చలేం. నేను పుట్టిన కులానికీ, నాకూ ఏ సంబంధం లేదు. అది నామీద వృ«థాగా మోపబడింది అని దాన్ని మార్చవచ్చు. నా మతం నాకు నచ్చలేదని మరో మతాన్ని ఎంచుకోవచ్చు. కానీ ఎవరికీ తన మాతృభాషను మార్చు కోవడానికి కుదరదు’ అన్నది ప్రకాష్‌రాజ్ భావన! అలాగే ప్రకృతి ఎంత కిలాడిదో వివరిస్తూ మనిషిలోని దురాశను ప్రకృతిపరంగా అందంగా చెప్పిన కళాకారుడు ప్రకాష్‌రాజ్. పూవు కాయగా మారటం, కాయ పండుగా మారే విధానం ఉందే... దీన్ని మనకు అర్థం చేయించేది ప్రకృతి. ప్రకృతి మీకు ఎంత కావాలో అంతే ఇస్తుంది. మీ ఆశకు మరికొంచెం ఇస్తుంది. కానీ దురాశను మాత్రం ఇవ్వదు. దీన్ని మనం తెలుసుకొని ఉండాల్సింది. నేర్చుకొని ఉండా ల్సింది అన్నాడు. ఇన్ని గుణపాఠాలు, స్వీయానుభవం నుంచి చెప్పిన ప్రకాష్‌రాజ్ నోట చివరికి నేను తెలుగువాడిని కాదన్న మాట ఇప్పుడు తెలిసివచ్చిందన్న ప్రకటనలోని బాధను, మనోవేదనను ఇప్పటికైనా ‘మా’లోని ‘పొట్టి బావ’లు తెలుసుకోవడం అందరికీ శ్రేయస్కరం. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ముసురుకుంటున్న చీకట్లు!
కరెంట్ కోత, లైట్లు లేక కొవ్వత్తులతో కాలక్షేపం... ఒకప్పుడు నిత్యానుభవం. కొన్నేళ్ళుగా దూరమైన ఆ అనుభవం త్వరలోనే మళ్ళీ దేశమంతటా ఎదురుకాక తప్పేలా లేదు. వస్తున్న వార్తలను బట్టి చూస్తే, ఒకప్పటిలా మళ్ళీ విద్యుత్ కోతలు దేశమంతటా నిత్యకృత్యం కానున్నాయి. దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వలు తగ్గాయి. సొంతంగా విద్యుదుత్పత్తి చేద్దామంటే బొగ్గు కొరత. థర్మల్ విద్యుత్కేంద్రాలు మూతపడే పరిస్థితి. పోనీ... ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్తే కొందామంటే, అనూహ్యమైన విద్యుత్ కొనుగోలు రేట్ల మోత. యూనిట్‌కు పాతిక రూపాయలు పెట్టినా, విద్యుత్ లభించని దుఃస్థితి. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అందుకే, గృహావసర విద్యుత్ వినియోగం తగ్గించుకొని, విద్యుత్ ఆదా చేయాల్సిందిగా అన్ని ప్రభుత్వాలూ ప్రజలను అభ్యర్థించాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో ప్రజలకు విద్యుత్ కోతలు తప్పవన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యం ఇది. మన దేశంలో 135 థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. అవన్నీ మునుపెన్నడూ లేనంత బొగ్గు నిల్వల కొరతను ఎదుర్కొంటున్నాయనీ, విద్యుత్ కొరత తప్పదనీ సాక్షాత్తూ ‘భారతీయ కేంద్ర విద్యుత్ అథారిటీ’ డేటాయే స్పష్టం చేస్తోంది. దేశవ్యాప్తంగా అవసరమైన విద్యుత్తులో 70 శాతాన్ని ఇవే ఉత్పత్తి చేస్తాయి. కానీ, బొగ్గు నిల్వల తీవ్ర కొరత కారణంగా ఈ 135 థర్మల్ ప్లాంట్లలో 106, అంటే దాదాపు 80 శాతం ప్లాంట్లు సంక్షోభ, లేదా అతి తీవ్ర సంక్షోభ స్థితిలో ఉన్నాయి. సాధారణంగా 14 రోజులకు సరిపడా నిల్వలుండాలని భారత ప్రభుత్వం మాట. కానీ, ఇప్పుడు రెండు రోజులకు మించి లేవు. తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లలోని బొగ్గు, లిగ్నైట్ గనులున్న ప్రాంతాల్లో అధిక వర్షపాతం వల్ల బొగ్గు రవాణాకు చిక్కులొచ్చాయి. వర్షాకాలానికి ముందే తగినంత బొగ్గు నిల్వలు చేసుకొనే దూరదృష్టి లేకుండా పోయింది. మరోపక్క విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే బొగ్గుతో నడిచే విద్యుత్కేంద్రాలు సైతం చతికిలబడ్డాయి. షిప్పింగ్ ఆలస్యాల కారణంగా అంతర్జాతీయ గొలుసుకట్టు సరఫరా దెబ్బతింది. అంతర్జాతీయ బొగ్గు రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కనీసం 40 శాతం మేర బొగ్గు ధరలు పెరిగినట్టు లెక్క. కొన్నిచోట్ల ఒక టన్ను 60 డాలర్లుండేది ఇప్పుడు దాదాపు 120 డాలర్లు అయిందని కథనం. దాంతో, అవసరమైన అంతర్జాతీయ బొగ్గును కొనే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఆ రేట్లకు కొనలేక, తమ సామర్థ్యంలో సగం కన్నా తక్కువ విద్యుత్తునే ఆ కేంద్రాలు ఉత్పత్తి చేస్తున్న పరిస్థితి. కేరళలో 4, మహారాష్ట్రలో 13 థర్మల్ విద్యుత్కేంద్రాలు మూతబడ్డాయి. పంజాబ్‌లో దాదాపు సగం థర్మల్ విద్యుత్కేంద్రాలు ఆగిపోయాయి. ఇక, దక్షిణాదినా పలు విద్యుత్కేంద్రాలు మూతబడే పరిస్థితి. ఇప్పటికే రాజస్థాన్‌లో రోజుకో గంట, పంజాబ్‌లో 3 గంటలు, ఢిల్లీలో విడతల వారీగా విద్యుత్ కోత నడుస్తోంది. అలాగే, కేరళ, గుజరాత్, తమిళనాడు, అతి తీవ్రమైన బొగ్గు కొరత ఉన్న జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు సైతం పవర్ కట్ బాటలోకి వస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ విద్యుత్ సంక్షోభంపై ఇప్పటికే కేంద్రానికి వివరంగా లేఖ రాశారు. కోవిడ్ తర్వాత విద్యుత్ డిమాండ్ 15 శాతం పెరిగిందనీ, రాష్ట్ర అవసరాల కోసం విద్యుత్ కొనాలన్నా అందుబాటులో లేదనీ వాస్తవాల్ని వివరించారు. 20 ర్యాక్‌ల బొగ్గు కేటాయింపు సహా అనేక తక్షణ పరిష్కారాలూ సూచించారు. ఢిల్లీ సహా కొందరు ఇతర ముఖ్యమంత్రులూ తమ కష్టాలు కేంద్రానికి విన్నవించారు. కానీ, సంక్షోభ పరిష్కారానికి కేంద్రం మీనమేషాలు లెక్కించింది. చైనా లాంటి చోట్ల ఇప్పటికే విద్యుత్ సంక్షోభం కనిపిస్తున్నా, మన పాలకులు అంతా బాగుందన్నారు. సమాచార లోపం వల్లే అనవసర భయాలన్నారు. ఎట్టకేలకు సోమవారం కేంద్ర హోమ్‌మంత్రి సారథ్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరపాల్సి వచ్చింది. నిజానికి, విద్యుత్ లాంటి విషయాల్లో వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం చేసే బాధ్యత కేంద్రానిది. కానీ, ఆ పని సమర్థంగా చేస్తున్నట్టు కనిపించదు. రాష్ట్రాలు విద్యుత్ కోసం అధిక రేట్లకైనా సరే ప్రైవేట్ సంస్థల వద్దకు పరిగెత్తాల్సిన పరిస్థితి కల్పించే కుట్ర ఈ కొరతకు కారణమని కొందరి వాదన. 1957 నాటి చట్టంలో తేనున్న సవరణలతో అరణ్యాలు, గిరిజన భూముల్ని కేంద్రం సేకరించి, బొగ్గు గనుల తవ్వకాలకు ప్రైవేట్ వారికి కట్ట బెట్టడానికే ఇదంతా అని ఆరోపిస్తున్నవారూ లేకపోలేదు. వాటిలో నిజానిజాలు ఏమైనా, కరోనా అనంతరం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న వేళ విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలపై అజాగ్రత్త స్వయంకృతమే. పాలకులు ‘ఆత్మ నిర్భర భారత్’ నినాదంతో సరిపెట్టకుండా, బొగ్గు, చమురు, సహజవాయువుల దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు తగిన పరిస్థితులు కల్పించాలి. ఇవాళ మంచినీటి లానే విద్యుత్ కూడా! విద్యుత్ లేకపోతే నాగరక జీవి మనుగడే కష్టం. అందుకే, విద్యుత్ రంగంలోనూ ఆచరణవాదంతో సంస్కరణలు తేవడమూ ముఖ్యం. మన దేశ విద్యుత్ అవసరాల్లో 90 శాతం శిలాజ ఇంధనాల నుంచి తీర్చుకుంటున్నాం. భవిష్యత్తుకు ఇది సరి కాదు. ఎక్కడైనా బొగ్గు నిల్వలు శాశ్వతంగా ఉండవు కాబట్టి, ఎప్పటికైనా పునర్వినియోగ విద్యుత్ వైపు మళ్ళాల్సిందే. దేశవ్యాప్తంగా సౌరశక్తి అనే ఉచిత, సహజ వనరును సమర్థంగా ఉపయోగించుకొని, సోలార్ పవర్ ఉత్పత్తి పెంచుకుంటే, సమస్యలుండవు. పవన విద్యుదుత్పత్తి పైనా గట్టిగా దృష్టి పెట్టక తప్పదు. ఆ మధ్య ఆక్సిజన్ కొరత... ఇప్పుడు బొగ్గు కొరత. కళ్ళ ముందున్నా సరే... సమస్యను గుర్తించడానికి నిరాకరిస్తే, కాలం గడిచేకొద్దీ కష్టమే! -
ఆలోచింపజేస్తున్న... ఆ హెచ్చరిక!
కరోనా పేరిట మందుల కంపెనీలతో తమకు జరుగుతున్న అన్యాయాల గురించి అనేక దేశాలు రకరకాల అనుభవాలను వెల్లడిస్తున్నాయి. జబ్బు స్వభావంతో, దాని లక్షణాలతో నిమిత్తం లేకుండా అమెరికాలో నేడు ‘ఫ్లూ’ పేరిట, కోవిడ్–19 పేరిట మూకుమ్మడిగా ప్రజలకు వ్యాక్సిన్లు వేస్తున్నారని అఖిల అమెరికా మెడికల్ బోర్డు ఇటీవల హెచ్చరించింది. కోవిడ్ నైతిక విలువలకు విరుద్ధంగా ఇంజక్షన్లను విచ్చలవిడిగా ప్రయోగించేవారిని అంతర్జాతీయ వైద్య నిపుణులు నిలదీశారు. ‘ముందుగా ప్రజలకు భారీ ఎత్తున టీకాలు వేద్దాం. ఆ తర్వాతనే టీకాలపై రీసెర్చ్ మొదలుపెడదాం’ అనే వైఖరిని తప్పుబట్టారు. ప్రజలకు నిజాలు చెప్పే అమెరికన్ డాక్టర్ల మెడికల్ లైసెన్స్‌లను రద్దు చేస్తామని బడా ప్రైవేట్ మందుల కంపెనీల తరఫున బెదిరింపులు రావడం ప్రమాదకర పరిణామమని డాక్టర్ పాల్ క్రీగ్ రాబర్ట్స్ చేసిన హెచ్చరిక అందరికీ కనువిప్పు కావాలి. ప్రపంచంలో దఫదఫాలుగా ఇప్పటిదాకా దేశాల్ని చుట్టుముట్టిన వైరస్‌లన్నీ మనం భావిస్తున్నట్టుగా అంత త్వరగా అంతరించిపోలేదు. అలాగే కరోనా వైరస్ కూడా తొందరగా వదిలించుకోగలిగింది కాదని, ఎన్ని లాక్డౌన్లు ప్రకటించుకున్నా అది తొలగిపోయేది కాదనీ రుజువయింది. అందుకనే మా ప్రజలు నిరం తరం లాక్డౌన్లకు నిరసనగా వేలాదిగా వీధులలో ఊరేగింపులు తీయ వలసి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలపై అణచివేత చర్యల వల్ల లాభం లేదనేది రుజువైంది. ఇతర దేశాల అనుభవం కూడా ఇదే. – న్యూజిలాండ్ ప్రభుత్వ ప్రకటన, వెల్లింగ్టన్ (04–10–2021) ఇప్పుడు న్యూజిలాండే కాదు, కరోనా వైరస్ పేరిట జరుగుతున్న రకరకాల సవాలక్ష మందుల కంపెనీల మోసాల మూలంగా తమకు జరుగుతున్న అన్యాయాల గురించి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు కూడా రకరకాల అనుభవాలను వెల్లడిస్తున్నాయి. కరోనా వైరస్ పేరిట భారీ ఎత్తున ప్రజారోగ్యంపై సాగుతున్న దోపిడీ గురించి, సాక్షాత్తు టీకాల వ్యాపారం వల్ల ప్రజలకు జరుగుతున్న కష్ట నష్టాలను అధికార స్థాయిలో ఏకరువు పెడుతూ అఖిల–అమెరికా మెడికల్ బోర్డు ప్రపంచ ప్రజలకు ఒక హెచ్చరికను (సెప్టెంబర్ 9న) విడుదల చేసింది. ఈ బోర్డు అఖిల అమెరికా కుటుంబ వైద్యసంస్థ, అమెరికా ఇంటర్నల్ మెడిసిన్ బోర్డు, అమెరికా శిశువైద్యాధికారుల బోర్డుల సంయుక్త సంస్థ. జబ్బు స్వభావంతో, దాని లక్షణాలతో నిమిత్తం లేకుండా అమె రికాలో నేడు ‘ఫ్లూ’ పేరిట, కోవిడ్–19 పేరిట మూకుమ్మడిగా ప్రజ లకు వ్యాక్సిన్లు వేస్తున్నారని అఖిల అమెరికా మెడికల్ బోర్డు హెచ్చ రించింది. ఈ వ్యాక్సిన్ల వ్యాపారాన్ని 80కి మించి ప్రైవేట్ గుత్త కంపెనీలు సాగిస్తున్నాయి. ఇదే సందర్భంలో అమెరికాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రాష్ట్రస్థాయి మెడికల్ బోర్డుల సంయుక్త ఫెడరేషన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఫ్లూ, కరోనా టీకాలకు సంబం ధించి కంపెనీల తరపున సమాచారాన్ని ప్రచారంలో పెడుతున్నారని ప్రొఫెషనల్స్‌ను హెచ్చరించింది. ఇలాంటి ప్రచారం వృత్తిరీత్యా వైద్యులు, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వైద్య సేవకుల నైతిక విలు వలకు, ధర్మానికే విరుద్ధమని రాష్ట్రస్థాయి మెడికల్ బోర్డుల సమాఖ్య హెచ్చరించవలసి వచ్చింది. ఈ హెచ్చరికను అభిల భారత మెడికల్ బోర్డు సమర్పించింది. కోవిడ్ నైతిక విలువలకు విరుద్ధంగా ఇంజక్షన్లను విచ్చలవిడిగా ప్రయోగించేవారిని అంతర్జాతీయ వైద్య నిపుణులు నిలదీశారు. ‘ముందుగా ప్రజలకు భారీయెత్తున టీకాలు వేద్దాం. ఆ తర్వాతనే టీకాలపై రీసెర్చ్ మొదలుపెడదాం’ అనే వైఖరిని తప్పుబట్టారు. అంతేకాదు ఇంతవరకూ శాస్త్రీయ నిరూపణలేని టీకాలను విచ్చల విడిగా ‘ఫ్లూ’ పేరిట కరోనా (కోవిడ్) ఇంజక్షన్ల పేరిట అమ్మడంగానీ, వాటిని కోట్లాది ప్రజలకు ఇవ్వచూపడంగానీ న్యూరెంబర్గ్ నిబంధన లను (న్యూరెంబర్గ్ కోడ్) ఉల్లంఘించడమేనని కూడా అఖిల అమెరికా మెడికల్ బోర్డ్‌ల సంయుక్త ఫెడరేషన్ (సెప్టెంబర్ 9)న ప్రకటించింది. ఈ విషయంలో ప్రజలకు నిజాలు చెప్పే అమెరికన్ డాక్టర్ల మెడికల్ లైసెన్స్‌లను రద్దుచేస్తామని కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటానికి దిగిన బడా ప్రైవేట్ మందుల కంపెనీల తరపున బెదిరింపులు వెలు వడ్డాయి. ఇది అత్యంత ప్రమాదకర పరిణామమంటూ కోవిడ్ టీకాల సామర్థ్య వైఫల్యాన్ని ఎండగడుతూ డాక్టర్ పాల్ క్రీగ్ రాబర్ట్స్ (7–9–2021) రాసిన ప్రత్యేక సమాచారాన్ని సుప్రసిద్ధ ‘లా యాని మేటెడ్ జర్నల్’ ప్రచురించింది. అంతేగాదు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండానే ఫ్లోరిడా అంతటా కరోనా పేరిట వైద్య వ్యాపార కేంద్రాలను ఆ రాష్ట్ర గవర్నర్ రాన్ డిశాంటిస్ ఎలా తెరిచారో వెల్లడించాల్సి వచ్చింది. అదే తంతు భారతదేశంలో కూడా ప్రారంభమై కొనసాగుతోం దని భారత బార్ అసోసియేషన్ వెల్లడించాల్సి వచ్చింది. మన దేశంలో ‘ఫ్లూ’ను పోలిన కరోనా వైరస్‌ను అదుపు చేయడానికి దేశీయ ‘హైడ్రోక్లోరోక్విన్’, ఐవర్‌మెక్టిన్‌లను వాడకుండా పక్కన పెట్టేశారు. దీంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ భారతదేశంలో లక్షలమంది మరణానికి కారకురాలని మన ఇండియన్ బార్ అసోసియేషన్ అభిశంసించింది. పై రెండు దేశీయ ‘ఫ్లూ’ సంబంధిత వ్యాధుల నివారణకు తోడ్పడగల ‘హైడ్రో క్లోరోక్విన్’, ‘ఐవర్‌మెక్టిన్’లను వాడడం వల్ల ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాలలో కోవిడ్ కేసులు దాదాపు 94 – 98 శాతం తగ్గిపోయాయని బార్ అసోసియేషన్ ఉదాహరించింది. ఈ దేశీయ ప్రయోగం సత్ఫలితాలను యావత్తు దేశ ప్రజలకూ చేరకుండా చేసే బాధ్యతను న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, ఏఎంఎ, బైడెన్, స్కూమర్, పెలోసీ వగైరా కుట్రదారులు తలెత్తుకున్నారని బార్ అసోసియేషన్ పేర్కొంది. ఈ కుట్రను డాక్టర్ పాల్‌క్రీగ్ రాబర్ట్స్ మరిం తగా వివరించారు. అమెరికా మాజీ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్లకు ప్రధాన వైద్య సలహాదారుగా పనిచేస్తూ వస్తున్న డాక్టర్ ఫాసీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వాళ్ళను అనుసరించి అనుకూల వార్తలు వండే పత్రికలూ, వాటిని భుజాన వేసుకుతిరిగే రాజకీయవేత్తలూ, కోవిడ్ పేరుతో భారీ సంఖ్యలో బడా ప్రైవేట్ ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ల ద్వారా లాభాలు గుంజుకోవడానికి అల్లిన పెద్ద కుట్రగా డాక్టర్ పాల్ క్రీగ్ రాబర్ట్స్ ప్రపంచానికి వెల్లడించారు (‘లా ఏనిమేషన్ వరల్డ్’ 31.08.2021). ఫ్లూ సంబంధిత కోవిడ్ లాంటి వైరస్ల నివారణకు తక్షణోపాయంగా విధిగా ప్రయోగించాల్సిన హైడ్రోక్లోరోక్విన్, ఐవర్‌మెక్టిన్‌లను అడ్డుకొని. వాడకంలోకి రాకుండా పనిగట్టుకొని నిషేధించడం ద్వారా లక్షలాది ప్రజల మరణానికి కారకులయ్యారని డాక్టర్ రాబర్ట్స్ సాధికారికంగా తన విశ్లేషణలో ఆరోపించారు! పైగా తక్షణ ప్రాణరక్షణ æమందుల్ని నిషేధించిన డాక్టర్లను శిక్షించకుండా, ప్రాణాల్ని కాపాడటానికి తోడ్పడే మందుల్ని ఉపయోగించే వైద్యుల్ని శిక్షించ బూనడం దుర్మార్గమనీ,ఈ విషయంలో పశ్చిమ రాజ్యాల ప్రవర్తన అత్యంత ప్రజాస్వామ్య వ్యతిరేకమూ, పారదర్శకతకు విరుద్ధమని డాక్టర్ రాబర్ట్స్ తన విశ్లేషణలో వివరించారు. ఈ విషాదకర పరిణామాల్ని చూస్తుంటే షేక్స్పియర్ రాసిన ‘టెంపెస్ట్’ నాటకంలోని ‘నరకలోకం ఖాళీ అయింది. ఇక దెయ్యాలన్నీ ఇక్కడనే తిష్ఠ వేస్తా’యన్న సూక్తి గుర్తుకొస్తుంది. రకరకాల రూపాలతో వ్యాపిస్తున్న ఆ కోవిడ్ వైరస్‌కు పరిష్కారం ఏమిటి? అంటే గడచిన ప్రపంచ చరిత్రను కల్లోలపరిచిన 300 వైరస్ల నిరోధానికి 15–16 శతాబ్దాల నుంచి ఈ క్షణం దాకా జరుగుతోన్న ప్రయత్నాలలో భాగంగానే, కరోనా వైరస్‌కు కూడా అంతిమ పరిష్కారం లభిస్తుందని తీర్మానించుకొనక తప్పదు. సాంకేతిక పరిజ్ఞానం, దాని ఫలితాలు మానవాళికి అందుబాటులోకి రావడానికి ఇప్పుడు సాధ్యమవుతున్నంత వేగంగా గతంలో అంతిమ ఇంజెక్షన్లు సాధ్యం కాకపోయి ఉండవచ్చు. కానీ నేటి సాంకేతిక దశలో కూడా పరిష్కారంలో ఇది ఆఖరి మాట అని నిర్ధారించడం అంత సులభం కాకపోవచ్చు. ఈలోగా ప్రజలకు ఏర్పడే తాత్కాలిక కష్టాల్ని సాకుగా తీసుకుని దాన్ని ప్రజల పౌరహక్కుల్ని అణచడానికి ఒక సదవకాశంగా భావించే పాలకులు ఉంటారు. బహుశా అందుకనే, అమెరికా రాజ్యాంగ పితామహులలో ఒకరూ, ప్రజల హక్కుల పత్రానికి జనకుడైన జేమ్స్ మాడిసన్ చేసిన హెచ్చరిక అన్ని దేశాలకూ, ప్రజలకూ పాఠంగా నిలిచిపోతుంది. ఏదో ఒక పరిణామం పేరిట ప్రజా స్వేచ్ఛా స్వాతంత్య్రాలపై పాలకులు ఎక్కుపెట్టజూసే తొలి ప్రయోగానికే ప్రజలు అప్రమత్తులై పోవాలని మాడిసన్ చెప్పారు. ఇది చరిత్రాత్మక చిరకాల హెచ్చరిక! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
అది వారి హక్కు! వేసే ‘ముష్టి’ కాదు!!
జనాభాలో 50 శాతంగా ఉన్న మహిళలకు చట్టసభల్లో ‘ముష్టి’ 30 శాతం సీట్లు ఇవ్వడానికి కూడా పాలకులకు చేతులు రావడం లేదు. ఈ నేపథ్యంలో మహిళలకు న్యాయస్థానాల్లోనూ 50 శాతం దక్కవలసిందేనని, ఇది ‘దానం’ కాదు ‘మహిళల హక్కు’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ వక్కాణించారు. అయితే, భారత సమాజం ప్రగతిశీలకం కావడానికి ఏ మార్పుల్ని ఆశిస్తున్నామో, ఆ మార్పులకు యువ సీఎం వైఎస్ జగన్ నవరత్నాల దీప్తితో ఆంధ్రప్రదేశ్‌లో పెక్కు ప్రజాహిత సంస్కరణల ద్వారా శ్రీకారం చుట్టి ప్రశంసలు పొందుతున్నారని మరచిపోరాదు. ఈ సంస్కరణలు అట్టడుగు పేదవర్గాలకూ, నిరుపేద మహిళలకూ సానుకూలమైన నిష్పక్షపాత సంస్కరణలుగా కొనసాగుతున్నాయని గుర్తించాలి. భర్త బూర్జువాగా, భార్య శ్రమజీవి అయిన కార్మికురాలిగా ఉంటున్న స్థితి పోవాలంటే ఆకాశంలో సగానికి అన్నింటిలోనూ సగభాగం దక్కాల్సిందే మరి! భిన్నత్వంలో ఏకత్వమంటే అర్థం ఏమిటి? భిన్నత్వమంటే అసమానతా కాదు, ఒకర్ని తక్కువగాను, ఇంకొకర్ని ఎక్కువగానూ చూడడం కాదు. ప్రకృతి ముందు ఏదీ, ఎవరూ ఒకరికన్నా ఎక్కువా కాదు, మరొకరు తక్కువా కాదు గదా! ఆ లెక్కన నిప్పు ఎక్కువా, నీరు ఎక్కువా? ప్రకృతిలోని పక్షులు, సీతాకోక చిలు కలు, జంతువులు, చీమలు, ఏనుగుల్లో ఏది ఎక్కువ, ఏది తక్కువ? అలాగే సముద్రాలు, కొండలు, గ్రామాల్లో ఏది ఎక్కువ, ఏది తక్కువ? చలికాలం, వేసవి, వానాకాలం, వసంత రుతువుల్లో ఏది గొప్పది, ఏది కాదు? ఒక్కముక్కలో పగలు, రాత్రి, ఏది ఎక్కువ, ఏది తక్కువ? అలాగే ఈ కుటుంబాలలో కూడా ప్రతి ఒక్క పురుషునికి, స్త్రీకి ఎవరి స్థానం వారిదే, ఎవరి వ్యక్తిత్వం వారిదే. అందువల్ల సమా జంలో సమానన్యాయం, సమానత్వం లేకపోతే సామూహిక సద్వర్తనం దుర్లభం. అందువల్ల విభిన్న వ్యక్తుల మధ్య ఐక్యత అనేది పరస్పర న్యాయం, సదవగాహన, గౌరవం ఉన్నప్పుడే సాధ్యం. 1970లలో మహిళా హక్కుల కోసం నిరంతరం, పోరుసల్పుతూ వచ్చిన తొలి భారత మహిళా నాయకులలో ఒకరుగా సామాజిక శాస్త్ర వేత్త కమలా భాసిన్ సుప్రసిద్ధురాలు. ఆమె వెలిబుచ్చిన భావాలతో ఏకీభవిస్తూ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ గత కొద్ది రోజులుగా దేశంలోని మహిళా హక్కుల రక్షణ గురించి నొక్కి చెబుతున్నారు. వలస పాలనావశేషంగా మిగిలి పోయిన భారతదేశ ప్రస్తుత న్యాయవ్యవస్థను స్వతంత్ర భారత న్యాయవ్యవస్థగా రూపొందించుకోవలసిన అవసరం గురించి ఆయన ప్రస్తావించడం ప్రజాబాహుళ్యానికి ఎంతో ఉపయోగకారి. గత నెల చీఫ్ జస్టిస్ చేసిన రెండు ప్రకటనలూ, నూతన మార్గంలో దేశ ప్రగతిని ఆశిస్తున్న అభ్యు దయ శక్తులలో మరింత చైతన్యానికి దోహదపడగల అవకాశం ఉంది. దేశం 75 ఏళ్ళ అమృతోత్సవం జరుపుకుంటున్నవేళ, దేశ చట్టసభలలో ఇన్నేళ్లుగా జనాభాలో 50 శాతంగా ఉన్న మహిళలకు కనీసం ‘ముష్టి’ 30 శాతం సీట్లు ఇవ్వడానికి కూడా ఈ రోజుకీ పాల కులకు చేతులు రాని దుస్థితిలో ప్రధాన న్యాయమూర్తి దేశంలోని మహిళలందరికీ న్యాయస్థానాల్లో 50 శాతం దక్కవలసిందేనని, ఇది ‘దానం’ కాదు ‘మహిళల హక్కు’ అని స్థిరంగా ప్రకటించారు! దేశంలోని ప్రస్తుత న్యాయవ్యవస్థను సామ్రాజ్యవాద వలస పాల కులు ప్రవేశపెట్టి, స్వతంత్ర భారత న్యాయవ్యవస్థ పురోగతికి అవ రోధం కలిగించి ‘భారతీయ న్యాయవ్యవస్థ’గా రూపొందకుండా చేశారు. దాని ఫలితంగా భారత సమాజం ఆచరణలో ఎదుర్కొం టున్న పెక్కు సమస్యలను చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ అనేక ఉదాహర ణలతో ప్రజల దృష్టికి, పాలకుల దృష్టికి తీసుకువచ్చారు. ‘‘నేడు ఇన్నేళ్ళ స్వాతంత్య్రం తరువాత కూడా దేశంలోని సామాన్య పౌరులు తమ అభిప్రాయాలకు కోర్టులలో విలువలేదని భావిస్తున్నారు. వాద ప్రతివాదాలు అంతూ పొంతూ లేకుండా సుదీర్ఘంగా కొనసాగడం, సామాన్య కక్షిదారులకు ఖర్చులు తడిసిమోపడవుతుండడం, పైగా ప్రసంగాలు వారి మాతృభాషలో కాకుండా ఇంగ్లిష్‌లో కొనసాగు తూండడం, ఇక తీర్పులైతే సుదీర్ఘంగా సాగడం లేదా అర్థం కాని అతి సాంకేతిక పదజాలంతో ఉండడం వంటి కారణాలతో ఇవి రొడ్డ కొట్టుడుగా తయారవుతూ వచ్చాయి.’’ అందువల్ల వలస పాలనావ శేషంగా సంక్రమించిన ఈ మైకం నుంచి మన న్యాయస్థానాలు ఇక నైనా మేలుకొని మన న్యాయవ్యవస్థ దేశీయ ప్రయోజనాల రక్షణకు నడుం కట్టవలసిన సమయం వచ్చిందని ప్రధాన న్యాయమూర్తి (19–9–2021) వక్కాణించారు. మన కోర్టుల్ని చూసి, న్యాయమూర్తులను చూసి న్యాయాన్ని ఆశించి వచ్చే పేదలు బెదిరిపోని పరిస్థితులు రావాలనీ, పేదసాదలకు నిర్మొహమాటంగా వాస్తవాల్ని ప్రకటించుకునే భాగ్యం కలగాలనీ ఆయన ఆశిస్తున్నారు! ఎందుకంటే, ఈ రోజు దాకా మనం అనుస రిస్తూ, ఆచరిస్తున్న విధానాలు, న్యాయసూత్రాలూ వలస పాలనా రోజుల నాటివి కనుకనే ఆచరణలో స్వతంత్ర భారత సమాజ పౌరుల వాస్తవ పరిస్థితులకు పరమ విరుద్ధమని ఆయన భావిస్తున్నారు. మహిళా హక్కుల పరిరక్షణ కోసం సరికొత్తగా ఆయన మరో బాంబు వదిలారు. దేశ న్యాయ వ్యవస్థలో కూడా 50 శాతం స్థానాలు మహిళ లకే ఉండాలని, అది వారి హక్కేగాని ‘దానధర్మం’ కాదని మొదటి సారిగా ప్రకటించడమే కాదు... వేలాది సంవత్సరాలుగా అణచివేతకు గురైన మహిళలు ఈ హక్కుకు అర్హులని చెబుతూ శాస్త్రీయ సోషలిజం పితామహుడు, కమ్యూనిస్టు మానిఫెస్టో సిద్ధాంత కర్త కారల్‌మార్క్స్ ప్రపంచ కార్మిక లోకాన్ని చైతన్యవంతుల్ని చేస్తూ, ‘ఏకమై ఉద్యమిం చండి మీకు సంకెళ్ళు తప్ప కోల్పోయేదేమీలేదు...’ అన్న చరిత్రాత్మక సందేశాన్ని గుర్తు చేశారు. ప్రపంచ మహిళల్లారా ఐక్యంగా ఉద్యమిం చండి, మీరు కోల్పోయేదేమీ లేదు, సంకెళ్లు తప్ప అని మహిళల పరంగా ఉద్బోధించడం ఓ కొత్త మలుపు. ఈ సందర్భంగా ఒక సమకాలీన సత్యాన్ని మరుగున పడకుండా ఉదాహరించాల్సిన అవసరం ఉంది. ప్రధాన న్యాయమూర్తి భారత సమాజం ప్రగతిశీలం కావడానికి ఏ మార్పుల్ని ఆశిస్తున్నారో, ఆ మార్పులకు ఇప్పటికే దేశంలో ఇతర రాష్ట్రాలకన్నా ముందుగానే ముందుచూపుతో యువ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవ రత్నాల దీప్తితో ఆంధ్రప్రదేశ్‌లో పెక్కు ప్రజాహిత సంస్కరణల ద్వారా శ్రీకారం చుట్టి, దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నారని మరచి పోరాదు. ఈ సంస్కరణలు కులాలతో, మతాలతో పార్టీలు, ప్రాంతా లతో సంబంధం లేకుండా సకల ప్రజా బాహుళ్యంలోని అట్టడుగు పేదవర్గాలకూ, నిరుపేద మహిళలకూ సానుకూలమైన నిష్పక్షపాత సంస్కరణలుగా నమోదవుతున్నాయని మరిచిపోరాదు. ఈ సంస్కరణలు మార్క్స్, అంబేడ్కర్, మౌలానా ఆజాద్ భావాల మేలుకలయిక. అందుకే మార్క్స్, ఎంగెల్స్‌లు అన్నారు. ‘ధనిక వర్గసమాజపు కుటుంబ వ్యవస్థలో భర్త ఆనే వాడు భార్యపై దాష్టీకం చెలాయించగల ఒక బూర్జువా అయితే, భార్య శ్రమజీవి అయిన ఒక కార్మికురాలు (ప్రొలిటేరియట్). ఎందుకంటే, ధనికవర్గ సామాజిక వ్యవస్థలో న్యాయచట్టాలనేవి, ఆ వ్యవస్థపై పెత్తనం ఏ వర్గం చెలాయిస్తుం టుందో ఆ వర్గ ప్రయోజనాలనే తు.చ. తప్ప కుండా కాపాడటానికి ఎలాంటి ‘కొత్త’కి చోటివ్వని న్యాయచట్టాన్నే కోరుకుంటాయి. అందుకే ‘ప్రజల హక్కు’ అన్న భావననే అది సహించదు పైగా చంపేస్తుంది’. కనుకనే ‘పెట్టుబడి అనేది ఇతరుల శ్రమ ఆధారంగా బతకజూసే నిర్జీవ పదార్థం. శ్రమజీవుల శ్రమపై బతికేదే పెట్టుబడి. అలా ఎన్నాళ్లు బతికితే అన్నాళ్లూ ఇతరుల శ్రమను దోచుకుని బలుస్తూనే ఉంటుం ద’ని మార్క్స్ సూత్రీకరించారు. అందుకే ఆయనను ఆధునిక అరి స్టాటిల్ అన్నారు. మానవుణ్ణి మార్క్స్ మొత్తం తాత్విక ప్రపంచానికే కేంద్ర బిందువుగా చేశాడు. ఇంతవరకు తత్వశాస్త్రజ్ఞులు ప్రపంచాన్ని భిన్న కోణాల నుంచి రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మన కర్తవ్యం మానవుణ్ణి తాత్వికకోణానికి కేంద్ర బిందువును చేసి యావత్తు మానవాళిని ఉన్నత స్థానంలో నిలిపి మానవ ప్రగతికి అతడినే మూల కారణం చేయాలి. అదొక్కటే... స్వార్థపరులు మాన వాళి అణచివేతకు ఎక్కుపెట్టిన దుష్టశాసనాలను బదాబదులు చేయ గల ‘పాశుపతాస్త్రం’ అని మార్క్స్ 150 ఏళ్లకు ముందే ప్రవచించాడు. ఆ సంగతి మరవరాదు. ‘మహిళా విమోచన’ అనేది యావత్తు మానవాళి స్వేచ్ఛకోసం వేసే తొలి అడుగు అని మార్క్స్ నిర్వచించారు. ఈ సత్యాన్ని మనం గ్రహించడానికి ఏళ్లూ పూళ్లూ గడిపినా దేశ రాజకీయ (వి)నాయకులకు మాత్రం నేటికీ మనసొప్పడం లేదు. ఎందుకని? ‘పుచ్చిపోతున్న విత్త నాలను బతికించలేమ’న్నది సామెత. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in