సామ్రాజ్యవాదులు ఇండియాలో తమ ఉనికిని కాపాడుకోవడానికిగానూ పౌరుల ప్రతి కదలికనూ, న్యాయమైన వారి నిరసనలనూ అడ్డుకున్నారు. దానికోసం దేశద్రోహమనే నల్లచట్టాన్ని తెచ్చారు. అయితే దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతూ ఆ వలస పాలనావశేషాలు మనల్ని ఇంకా వదిలిపోవడం లేదు. ఒక కిరాతక చట్టానికి కూడా ‘అమృతోత్సవం’ జరుపుకోవలసి రావడం ఒక దుర్భర సన్నివేశం! సమకాలీన ప్రభుత్వ నిర్ణయాలనూ, పనితీరునూ విమర్శించగల స్వేచ్ఛ ఉండటమే ప్రజాస్వామ్యానికి కీలకమనీ... ప్రజాస్వామ్యంలోని ఈ కీలకమైన లక్షణాన్నే దేశద్రోహ చట్టం చంపేస్తుందనీ... అది అభిశంసననూ, ప్రతిపక్షాన్నీ శత్రువుగా భావిస్తుందనీ కె.ఎం.మున్షీ ఏనాడో చెప్పిన మాటలను మనం మరిచిపోకూడదు.
కీలెరిగి వాత పెట్టమన్నారు! అదెప్పుడో చేయవలసిన పని. అయినా పాలకుల, అధికారగణాల స్వార్థపూరిత రాజకీయ, నిరంకుశ విధానాలు, ఆచరణ మూలంగా గత 75 సంవత్సరాలుగా యథేచ్ఛగా పట్టిపీడిస్తూ వచ్చిన వలస పాలనావశేషాలు మనల్ని ఇంకా వదిలిపోవడం లేదు. ‘దేశద్రోహం’ అనే ముసుగులో మిగిలిపోయిన ఒక కిరాతక చట్టానికి కూడా ‘అమృతోత్సవం’ జరుపుకోవలసి రావడం ఒక దుర్భర సన్నివేశం! స్వతంత్ర భారతానికే ఎంతమాత్రమూ పొసగని సందర్భం! ఈ దుర్మార్గపు చట్టం గురించి 1951లో నేటికి 71 ఏళ్ళ క్రితమే పంజాబ్ హైకోర్ట్ ఘాటుగా వ్యాఖ్యానించింది. ‘124–ఎ’ నేర నిబంధనను ‘ఇది అత్యంత ప్రమాదకరం’ అని బాహాటంగా ప్రకటించింది! అయినా సరే, ఈ 75 ఏళ్ళలోనూ కాంగ్రెస్, బీజేపీ పాలకులు ఆ వలస చట్టాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం యధేచ్ఛగా వాడుకుంటూనే వచ్చారు. ఈ క్షణంలోనూ వాడు కొంటున్నారు.
ఈ విశృంఖలత్వానికి అడ్డుకట్ట కట్టేందుకు సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తీ, మరికొందరు దేశభక్తులయిన న్యాయ మూర్తులూ సిద్ధమయ్యారు. ప్రజలకు సిద్ధించవలసిన న్యాయాన్ని దక్కనివ్వకుండా అడ్డుకునే ధోరణి దేశంలో అరాచకానికి ‘రాచబాట’ వేస్తుందనీ, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి వివాదాల తక్షణ పరిష్కారమే సమాధానమనీ ప్రకటించారు. తమకు సకాలంలో న్యాయం జరగనప్పుడు ప్రజాబాహుళ్యం అన్యమార్గాలు వెతుక్కు న్నప్పుడు దేశ న్యాయవ్యవస్థే కుప్పకూలిపోయే ప్రమాద ముందని గౌరవ న్యాయమూర్తులు ప్రకటించాల్సి వచ్చింది. దేశప్రజల గౌరవాన్నీ, హుందాతనాననీ, ఓర్పునూ, వారి హక్కుల్నీ గుర్తించి, గౌరవించినప్పుడు మాత్రమే దేశంలో శాంతి నెల కొంటుందని వారు హితవు చెప్పవలసి వచ్చింది.
సామ్రాజ్యవాదులు, ఇండియాలో తమ ఉనికిని కాపాడు కోడానికిగానూ పౌరుల ప్రతి కదలికనూ, న్యాయమైన వారి నిరసనలనూ అడ్డుకోవడానికి నల్లచట్టాన్ని ఇష్టారాజ్యంగా వాడుకుంటూ వచ్చారు. పౌరులు తమ హక్కుల్ని రక్షించుకోవడానికి చేసే ప్రయత్నాలను ‘దేశద్రోహం’గా చిత్రించడానికి ‘124–ఎ’లోని తుచ్ఛమైన నిబంధనలను అడ్డూ అదుపూ లేకుండా వాడుకున్నారు. వారి కోవలోనే ఇప్పటికీ దేశ స్వాతంత్య్రానంతరం 75 ఏళ్ల తర్వాత కూడా మన పాలకులు, వారి వందిమాగధ నిరంకుశ అధికార గణం వలస చట్టాన్నీ, అందులోని ప్రజా వ్యతిరేక నిబంధనలనూ జాగ్రత్తగా కాపాడుకుంటూ, వినియోగించుకుంటూ వస్తున్నారు.
విద్రోహ రాజకీయానికి ‘పుట్టుకతోనే పుట్టిన రాజపుండు’ ఇది. కనీసం 1951లో పంజాబ్ హైకోర్టు హెచ్చరిక తర్వాతనైనా దేశ పాలకులకు చీమకుట్టినట్టు కూడా కాలేదు. ఈ తప్పుడు చట్టనిబంధనల కిందనే వలస పాలకులు జాతీయ నాయకులైన బాలగంగాధర తిలక్, గాంధీ తదితరులను అరెస్ట్ చేశారు. ‘దేశద్రోహ’ నేరారోపణ కింద అరెస్టులతో విజయకుమార్ సిన్హా లాంటి భగత్‌సింగ్ సహచరులను అండమాన్ దీవులలో నిర్బంధించారు.
భారతీయ జనతా పార్టీ పాలనలో 2014–19 మధ్యకాలంలో అత్యధిక కేసులు పౌరహక్కుల నాయకులపైన, ముఖ్యంగా జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థుల పైన, వారి నాయకులపైన పెట్టారు. వలస పాలకుల ‘దేశద్రోహ’ చట్టం ముసుగు కిందనే కేసులు బనాయించి ఈ రోజుకీ వేధిస్తూనే ఉన్నారు. అలాగే ‘మిలార్డ్’ అనే పద ప్రయోగం కనుమరుగవడానికి న్యాయస్థానాలు ఈ 75 ఏళ్ళలోనే తంటాలు పడాల్సి వచ్చింది! నిజానికి మహదానంద ఘడియలలో జరుపుకోవాల్సిన స్వాతంత్య్ర దినోత్సవ 75 ఏళ్ళ అమృతోత్సవాల సమయంలో కూడా బీజేపీ పాలకులూ, పాలనా యంత్రాంగమూ ఈ క్షణం దాకా వలస పాలకుల దేశద్రోహ చట్టాన్ని సమర్థిస్తూనే ఉన్నారు. గట్టిగా ఆందోళన వచ్చినప్పుడల్లా చట్ట ‘‘నిబంధనలను పునః పరిశీలించే’’ విషయం అలోచిస్తామనీ కప్పదాట్లు వేస్తున్నారు. వలస పాలనావశేషాన్ని కాపాడటానికే సిద్ధమైనట్లు వారి మాటలూ, ఆచరణా వెల్లడిస్తున్నాయి!
బహుశా ఇలాంటి పాలకుల ప్రవర్తనను చూసే భారత రాజ్యాంగ నిర్ణయ సభ ప్రధాన బోధకుడు, రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బాహాటంగా ఇలా ప్రకటించి ఉంటాడు: ‘‘రాజ్యాంగ నిబంధనలకు, వాటి నైతికతకు కట్టుబడి ఉండే తత్వం పౌరుల్లో సహజంగా నెలకొని ఉండే గుణం కాదు. అందువల్ల ఆ సద్గుణాన్ని మనం పెంచి పోషించాలి. ఈ విషయంలో మన ప్రజలు రాటుతేలాల్సి ఉంది. ఎందుకంటే, మన భారతదేశం ప్రధానంగా ప్రజాస్వామ్య వ్యతిరేక భావాలతో కూడుకుని ఉంది. అందువల్ల భారతదేశంలో ప్రజాస్వామ్య లక్షణం అనేది పైపై ‘సోకే’ సుమా!’’
కనుకనే బాలగంగాధర తిలక్, గాంధీలను ‘దేశద్రోహ’ (వలస) చట్టం కింద అరెస్టు చేసి, కోర్టులలో విచారిస్తున్న సమయంలో... భారత రాజ్యాంగం మౌలిక ప్రజాస్వామిక లక్షణాల్ని సమర్థిస్తూ సుప్రసిద్ధ జాతీయవాది కె.ఎం.మున్షీ రాజ్యాంగ నిర్ణయ సభలో మాట్లాడుతూ– వలస చట్టంలోని ‘దేశద్రోహం’ పదాన్ని అరువు తెచ్చుకుని స్వతంత్ర భారతంలో దాన్ని ఉపయోగించడానికి వీల్లేదని ప్రకటించారు. ఆ పదం పౌరుల అభిప్రాయ ప్రకటననూ, పౌరస్వేచ్ఛను అణచివేస్తుందనీ భారత శిక్షాస్మృతిలోని ఇండియన్ పీనల్ కోడ్‌లోని ‘124–ఎ’ సెక్షన్‌ను మనం కొనసాగించదలచామన్న తప్పుడు అర్థాన్ని ప్రజల మనస్సుల్లో కల్పించినట్టవుతుందనీ, ఆ సెక్షన్ రద్దు కావలసిందేననీ, మున్షీ కోరారని మరచిపోరాదు!
1950వ దశాబ్దంలో రెండు హైకోర్టులు పౌరస్వేచ్ఛను ‘124–ఎ’ హరించి వేస్తుందని స్పష్టమైన తీర్పు ఇచ్చాయి. అయితే 1962లో ‘కేదార్‌నాథ్ సింగ్ వర్సెస్ బిహార్ స్టేట్’ కేసులో సుప్రీంకోర్టు అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం దీనికి విరుద్ధమైన తీర్పును వెలువరించింది. భారత రాజ్యాంగ సభ స్ఫూర్తిని తిరస్కరిస్తూ శాంతి ప్రయోజనాల దృష్ట్యా వలస చట్టంలోని ‘124–ఎ’ సెక్షన్ ఉండాల్సిందేనంది. ఈ వాదనను పూర్తిగా తిరస్కరిస్తూ మద్రాసు హైకోర్టులోని సుప్రసిద్ధ న్యాయవాది సుహ్రిత్ పార్థసారధి ఇలా స్పష్టం చేశారు: ‘‘రాజ్యాంగ నిర్ణయ సభలో మున్షీ స్పష్టం చేసినట్టుగా– సమకాలీన ప్రభుత్వ నిర్ణయాలనూ, పనితీరునూ విమర్శించగల స్వేచ్ఛ ఉండటమే ప్రజాస్వామ్యానికి కీలకం. ప్రజాస్వామ్యంలోని ఈ కీలకమైన లక్షణాన్నే దేశద్రోహ(సెడిషన్) చట్టం చంపేస్తుంది. అది అభిశంసననూ, ప్రతిపక్షాన్నీ శత్రువుగా భావిస్తుంది. ఒక్కమాటలో ప్రజాస్వామ్య రిపబ్లిక్ మౌలిక పునాదినే సెడిషన్ కుళ్లబొడుస్తుంది.’’
ఇదిలా ఉండగా ‘చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం’(ఉపా) పేరిట జరుగుతున్నది ఏమిటంటే, శాంతియుతంగా చేస్తున్న భిన్నాభిప్రాయ ప్రకటన స్వేచ్ఛను కూడా హరించడం! అందుకని తక్షణం జరగాల్సిన పని పౌరస్వేచ్ఛకు రాజ్యాంగం ఇచ్చిన విస్పష్టమైన హామీలను పునరుద్ఘాటించాలి. దానికిగానూ పౌరులకు ఉన్న భావ ప్రకటనా స్వేచ్ఛను అరమరికలు లేకుండా గౌరవించ డమూనని బాధ్యతగల న్యాయమూర్తులు, న్యాయవాదులూ భావిస్తు న్నారు. చివరికి మన పాలకులు ఎలా తయారయారంటే, ఒక్కసారైనా సుమతీ శతక కారుణ్ణి తలచుకోవడం శ్రేయస్కరం అనిపిస్తుంది.
సమయం చూసుకొని, ఏ సమయానికి ఏది తగినదో దానికి టంకప్పొడల్లే ఠక్కున అతుక్కుపోయే మాటలు ఆ క్షణానికి పలికి, తాను బాధపడకుండా తప్పించుకు తిరిగే నాయకుడే లోకంలో ధన్యుడన్నాడు. బద్దెన! ఎంత అనుభవమండీ! నేటి భారత ప్రజల అనుభవం కూడా ఇదే సుమా! కాకపోతే ఏమిటి చెప్పండి, తాజ్‌మహల్‌నట ‘తేజోమహల’ని పిలవాలట!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment