Sedition
-
నా ఓటమికి సంతోషించేవాళ్లు దేశ ద్రోహులే: వినేశ్ ఫోగట్
చంఢీఘఢ్: ప్యారిస్ ఒలింపిక్స్‌లో తనకు పతకం చేజారినందుకు బీజేపీ నేతలు సంతోషపడ్డారని ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రెజ్లర్ వినేశ్ ఫోగట్ అన్నారు. ఇలా దేశంపై అగౌరవం ప్రదర్శించేవారు దేశద్రోహానికి ప్రయత్నం చేసినట్లేనని అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలో భాగంగా కాంగ్రెస్ తరఫున తాను పోటీ చేసే స్థానం జులానాలోలో ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ ర్యాలీలో పాల్గొన్న ఆమె..తనపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించారు.‘‘గత ఏడాదిన్నర నుంచి బీజేపీ నేతల నుంచి తీవ్రమైన వ్యాఖ్యలు, విమర్శలను వింటూనే ఉన్నాం. ఆ వ్యాఖ్యలు వారి మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయి. నేను ప్యారిస్ ఒలింపిక్స్ పతకం కోల్పోవటం సంతోషంగా ఉందని చెబుతున్నారు. అంటేవారు దేశద్రోహానికి పాల్పడినట్లే. నేను గెలిచే మెడల్ నా కోసం కాదు. దేశం మొత్తానికి చెందినది. బీజేపీ నేతలు దేశం మొత్తాన్ని అగౌరవపరిచారు...నేను ప్యారిస్ నుంచి తిరిగి వచ్చాక పెద్ద రోడ్డు షో నిర్వహించారు. అందులో ఒక్కరు కూడా బీజేపీ చెందినవాళ్లు లేరు. రాష్ట్రంలో బీజేపీ సీఎం, డిప్యూటీ సీఎం ఉన్నారు. కానీ ఎవరూ నాకు మద్దతుగా నిలబడలేదు. సోషల్ మీడియాలో మాత్రం మనీ రివార్డులను ప్రకటించారు. వారు కేవలం ఓట్ల కోసమే చేశారు’అని అన్నారు. బీజేపీ నేత అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యపై ఆమె స్పందిస్తూ.. తాను దేశానికి పుత్రికను.. ఎల్లప్పుడు నేను అలాగే ఉంటానని కౌంటర్ ఇచ్చారు. ఆయన ఇటీవల వినేశ్‌ను కాంగ్రెస్ పుత్రిక అని విమర్శించారు. ఇక.. వినేశ్, భజరంగ్ పూనియాలో కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషన్ విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు. తనపై లైంగిక ఆరోపణలు చేస్తూ.. రెజ్లర్లు చేపట్టిన ఆందోళన వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని ఆరోపించారు. వినేశ్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకే దేవుడు పతకం చేజారేలా చేశాడని అన్నారు. -
ప్రధానిపై కథనం..సంజయ్ రౌత్‌పై కేసు
ముంబై: శివసేన(ఉద్ధవ్)నేత,రాజ్యసభ ఎంపీ సంజయ్‌రౌత్‌పై మహారాష్ట్రలోని యావత్మాల్ పోలిస్స్టేషన్లో రాజద్రోహం కేసు నమోదైంది. ప్రధాని మోదీపై పార్టీ పత్రిక సామ్నాలో అభ్యంతరకర ఆర్టికల్ రాశారన్న కారణంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. యావత్మాల్ బీజేపీ కన్వీనర్ నితిన్ భుటాడా ఫిర్యాదు మేరకు రౌత్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోమవారం(డిసెంబర్11)న రౌత్ సామ్నాలో ప్రధానిపై అభ్యంతరకర ఆర్టికల్ రాశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ పత్రిక సామ్నాకు రౌత్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. రౌత్‌పై రాజద్రోహం(ఐపీసీ 124ఏ)తో పాటు రెండు వర్గాల మధ్య విద్వేషాలు రేపేందుకు ప్రయత్నించారని ఐపీసీ153(ఏ) సెక్షన్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదీచదవండి..యాదవ్‌కు సీఎం పదవి..బీజేపీ బిగ్ స్కెచ్ -
మార్పు కోసం మార్పా?
భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య సంహిత పేర్లతో కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. క్రిమినల్ కేసుల విచారణలో జాప్యానికి దివ్యౌషధమని హోమ్ మంత్రి చెబుతున్న ఈ కొత్త చట్టాలు అసలుకే మోసం తెచ్చే ప్రమాదం ఉంది. పైగా పోలీస్ కస్టడీకి సంబంధించిన మార్పులు ఈ నాగరిక కాలానికి చెందినవి కావు. ఇంత భారీ మార్పులకు శ్రీకారం చుడుతున్న ఈ ముసాయిదా బిల్లులపై విస్తృత సంప్రదింపులు జరపలేదు. బ్రిటిష్ కాలపు చట్టాలను సంస్కరించాలంటే పారదర్శకత అవసరం. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లులు చూస్తే అది సంస్కరణల కోసం కాకుండా... ఏదో కొత్తది చేయాలి కాబట్టి చేస్తున్నట్లు కనిపిస్తోంది. భారతీయ శిక్షా స్మృతి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(నేర విచారణ ప్రక్రియ చట్టం), ఎవిడెన్స్ యాక్ట్‌ల సమూల ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు బిల్లులను ఒక్క వారం వ్యవధిలో సంపూర్ణంగా విశ్లేషించామని ఎవరైనా అంటే వారు అత్యంత మేధావులైనా కావాలి లేదా మోసకారులైనా(ఫ్రాడ్) అయివుండాలి. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లో 356 సెక్షన్లు ఉండగా, ఇరవై రెండింటిని రద్దు చేస్తు న్నారు, 175 సెక్షన్లలో మార్పులు/చేర్పులు చేస్తున్నారు, కొత్తగా ఎని మిది సెక్షన్లను చేరుస్తున్నారు. ఇక భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్)లో ఏకంగా 533 సెక్షన్లు ఉన్నాయి. మార్పులు/ చేర్పులు చేస్తున్న సెక్షన్ల సంఖ్య 160, రద్దు చేస్తున్నవి తొమ్మిది, కొత్తగా ప్రవేశపెడుతున్నవి తొమ్మిది. భారతీయ సాక్ష్య సంహితలో 170 సెక్షన్లు ఉండగా, 23 సెక్షన్లలో మార్పులు/చేర్పులు చేస్తున్నారు, తొమ్మిదింటిని రద్దు చేస్తున్నారు, ఒక సెక్షన్ కొత్తగా చేరుస్తున్నారు. నేనైతే మేధావిని కాదు, మోసకారిని కూడా కాదని అనుకుంటున్నా. కాబట్టి, ఈ మూడు కొత్త బిల్లుల సంపూర్ణ విశ్లేషణ చేసే సాహసాన్ని ఇతరులకు వదిలేసి, కొన్ని అసాధారణ విషయాలు, మంచి అంశాలు మాత్రం ప్రస్తావిస్తాను. అన్నింటికంటే ముందుగా... అత్యంత విచిత్రమైన అంశం గురించి చూద్దాం. దేశంలోని క్రిమినల్ కేసుల విచారణలో జాప్యానికి (ఐదు కోట్ల పెండింగ్ కేసుల్లో మూడింట రెండొంతులు క్రిమినల్ కేసులే) దివ్యౌషధమని హోమ్ మంత్రి చెబుతున్న కొత్త చట్టాలు అసలుకే మోసం తెచ్చే ప్రమాదం ఉండటం. ఈ మూడు చట్టాల్లోని మొత్తం 505 సెక్షన్లలో చేసిన మార్పులను దృష్టిలో పెట్టుకుంటే వీటిపై వాద ప్రతివాదనలు పెరిగిపోతాయి. ఇప్పటికే కేసుల భారంతో కునారి ల్లుతున్న న్యాయస్థానాలకు ఇది అదనపు భారమవుతుంది. కొత్త సెక్షన్ల నేపథ్యంలో వాదనలను కొత్తగా వినిపించాల్సిన పరిస్థితి వస్తుంది. కొత్తవాటికి అలవాటు పడేంత వరకూ ఇది కొనసాగుతుంది కాబట్టి విలువైన కోర్టు సమయం వృథా అవడం గ్యారెంటీ. బహుశా కొత్త చట్టాల తయారీ కమిటీలో ఉన్న న్యాయవాదులు గానీ, నిపుణులు గానీ దీన్ని గమనించలేదేమో. రెండో విషయం... చట్టాల్లో చేపట్టదలచిన మార్పుల గురించి విస్తృత స్థాయిలో చర్చించి ఉంటే సమస్య చాలావరకూ పరిష్కార మయ్యేది. పద్దెనిమిది నెలల కాలం పాటు పనిచేసిన ఈ కమిటీ ఇలాంటి చర్చలేవీ చేపట్టిన దాఖలాలు లేవు. మూడు లా కమిషన్ల నివే దికలపై, పలు సంస్థల సంప్రదింపులపై మాత్రమే కమిటీ ఆధారపడింది. కమిటీ సభ్యుల ప్రాతినిధ్యం కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు తగిన విధంగా లేదు. పైగా ఇలాంటి ప్రక్రియలో అతి ముఖ్యమైన పారదర్శకత, జవాబుదారీతనం అన్నవి అస్సలు లేకుండా పోయాయి. మూడో విషయానికి వద్దాం... ఈ కొత్త ప్రతిపాదనల్లో దేశద్రోహ నేరం ప్రభుత్వ మోసం మినహా మరోటి కాదు. గత ఏడాది సుప్రీంకోర్టు సెడిషన్ చట్టాల్లోని నిబంధనలపై దాదాపుగా స్టే విధించింది. అయితే కేంద్రం ఒక అఫిడవిట్ దాఖలు చేసి... సెడిషన్ చట్టాన్ని సమీక్షిస్తున్నాము కాబట్టి, ఆ ప్రక్రియ సాగుతున్నంత కాలం స్టే విధించవద్దని కోరింది. సర్వోన్నత న్యాయస్థానం ఈ ప్రకటనను నమోదు చేసింది. సెడిషన్ చట్టం తాలూకూ తీవ్రతను గణనీయంగా తగ్గించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు చర్యలు చెప్పకనే చెప్పాయి. అయితే కొత్త ప్రతిపాదనల్లో జరిగింది మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం. ఈ ఏడాది జూన్‌లో న్యాయ కమిషన్ దేశద్రోహ చట్టాన్ని కొనసాగించాల్సిందిగా సిఫారసు చేసింది. ఆ వెంటనే ప్రభుత్వం భారత న్యాయ సంహితకు సంబంధించిన 150వ సెక్షన్‌ను ప్రవేశ పెట్టింది. మాటల గారడీతో పాత చట్టం కంటే మరింత నిరంకుశమైన చట్టాన్ని ప్రతిపాదించింది. సార్వభౌమత్వానికి, భారత ఐక్యతలకు భంగం కలిగించడం అన్న విషయాలకు మరింత విస్తృతమైన నిర్వచ నాలను ఇచ్చింది. ‘‘ప్రభుత్వంపై ప్రేమ లేకపోవడం’’ అన్నదాన్ని మాత్రం తొలగించింది. దేశద్రోహ నేరాన్ని మోపేందుకు 1960లో సుప్రీంకోర్టు పెట్టిన పరీక్షను స్పష్టంగా తప్పింది. కేవలం మాటలు మాత్రమే దేశద్రోహానికి కారణం కాజాలవనీ, హింసను ప్రేరేపించడం, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం కూడా ఉన్నప్పుడు మాత్రమే దేశద్రోహం చట్టం అమలవుతుందని సర్వోన్నత న్యాయ స్థానం తెలిపిన విషయం గమనార్హం. కొత్త చట్టంలో వీటిని విస్మరించడం మాత్రమే కాకుండా... ఎలక్ట్రానిక్, ఆర్థికాంశాలను చేర్చింది. పైగా మాటలు, పుస్తకాలు, నాటకం, కథనం వంటి అంశాలకూ దేశ ద్రోహ నిర్వచనాన్ని అన్వయించింది. నాలుగో అంశాన్ని చూస్తే... పోలీస్ కస్టడీకి సంబంధించిన మార్పులు ఈ కాలానికి చెందినవి కావు. ప్రస్తుతం పోలీస్ కస్టడీ కోరడం లేదా ఇవ్వడమనేది అదుపులోకి తీసుకున్న పదిహేను రోజుల్లో జరగాలి. అది కూడా గరిష్ఠంగా 15 రోజుల వరకే లభిస్తుంది. సైద్ధాంతికంగా చూస్తే పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు కూడా బెయిల్ లభించవచ్చు కానీ ఆచరణలో ఇలా జరగదు. పోలీసుల విచారణ కొన సాగుతూ ఉంటుంది కాబట్టి ఇది సిద్ధాంతానికి విరుద్ధమన్నమాట. ప్రతిపాదిత కొత్త చట్టాల్లో పోలీసు కస్టడీ అవధి 15 రోజులుగానే ఉంచినా అదుపులోకి తీసుకున్న తరువాత 40 రోజుల్లో ఎప్పుడైనా (పదేళ్ల వరకూ జైలుశిక్ష పడే కేసుల్లో) కోరవచ్చు. ఒకవేళ కేసులో పదేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంటే అరెస్ట్ అయిన 60 రోజుల్లో ఎప్పుడైనా కస్టడీ కోరవచ్చు. అంటే, కొత్త చట్టాల ప్రకారం కనీసం 40 లేదా 60 రోజుల వరకూ బెయిల్ వచ్చే అవకాశమే లేకుండా పోతుంది. నిందితులు పోలీసుల కస్టడీలో ఉండటం అవసరమని ప్రాసిక్యూషన్ వాదిస్తూనే ఉంటుంది. పరిస్థితిని మరింత దిగజార్చే విషయం ఇంకోటి ఉంది. పోలీస్ కస్టడీని 40 లేదా 60 రోజుల కాలంలో నేరుగా 15 రోజులు కాకుండా... అప్పుడప్పుడూ కొన్ని రోజుల చొప్పున కూడా కోరవచ్చు. పౌరుల సురక్ష అంటే ఇదా? ఐదో అంశం... సామాజిక సేవ అంశాన్ని చేర్చారు. మంచిదే కానీ కొత్తదేమీ కాదు. కాకపోతే వ్యవస్థీకృతం చేయాల్సిన అవసరముంది. చిన్న చిన్న తప్పులకు మాత్రమే కాకుండా, మిగిలిన వాటికీ విస్తరించాల్సిన అవసరముంది. అయితే బీఎన్ ఎస్ఎస్లో దీనికి కొన్ని పరిమితులు విధించారు. విచిత్రమైన విషయం ఏమిటంటే... చిన్న చిన్న తప్పుల జాబితాలో క్రిమినల్ డిఫమేషన్ ను చేర్చడం. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి ఇటీవలే ఈ క్రిమినల్ డిఫమేషన్ ను తీవ్రమైన తప్పిదంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ కేసులోనే 135 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ తన సభ్యత్వాన్ని దాదాపుగా కోల్పోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఆరవ అంశం... ప్రతిపాదిత కొత్త చట్టాల్లో మూక హత్యలను చేర్చారు. మెచ్చదగిన విషయం. అయితే 2014 తరువాత ఈ రకమైన నేరాలు పెరిగేందుకు కారణమేమిటన్న విషయాన్ని చూడాలి. అలాగే ఇలాంటి నేరాల విచారణ పక్కాగా, రాజకీయ జోక్యం లేకుండా జరి గేందుకు అనువైన వాతావరణం ఉందా? అన్నది ప్రశ్న. దురదృష్టవశాత్తూ ప్రతిపాదిత కొత్త చట్టాల విస్తృతి, లోతు పాతులను దృష్టిలో ఉంచుకున్నా... చిన్న చిన్న వివరాలను విస్మరించిన వైనాన్ని చూసినా ఇదంతా ఏదో ఒక తంతు పూర్తి చేయాలి కాబట్టి చేస్తున్నట్లుగా కనపడుతుంది. సంస్కరణలపై చిత్తశుద్ధి మాత్రం వ్యక్తం కాలేదు. ‘ఎక్కడికి వెళ్తున్నావో తెలియనప్పుడు, ఏ దారీ నిన్ను ఎక్కడికి చేర్చదు’ అని హెన్రీ కిసింజర్ చెప్పిన మాట నిజం! అభిషేక్ సింఘ్వీ వ్యాసకర్త ఎంపీ, మాజీ అదనపు సాలిసిటర్ జనరల్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఆ చట్టాన్ని కొనసాగించాల్సిందే..అదే ఐక్యతను కాపాడుతోంది!
రాజద్రోహం చట్టం గురించి లాకమిషన్ ఒక ఆసక్తికరమైన నివేదిక ఇచ్చింది. ఆ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని, దాన్ని మరింత కఠినతరం చేసేలా కొన్ని గైడ్‌లైన్స్ ఇస్తే సరిపోతుందని లా కమిషన్ నివేదికలో పేర్కొంది. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదికలో సూచనలిచ్చింది. ఆ చట్టమే భారతదేశాన్ని ఐక్యతగా ఉంచడంలో ఉపకరిస్తోంది, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి, తీవ్రవాదాన్ని ఎదుర్కొనడంలో సహాయపడుతుందని వెల్లడించింది. అంతేగాదు రాజద్రోహం కేసులో విధించే జైలు శిక్షను మూడేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచాలని కమిషన్ నివేదికలో ప్రభుత్వాన్ని సూచించింది కూడా. రాజద్రోహం చట్టాన్ని సవాల్ చేస్తూ గతంలో దాఖలైన పిటిషన్లపై అభిప్రాయన్ని చెప్పాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు నేపథ్యంలో ఈ నివేదికి రావడం గమనార్హం. వలసవాద వారసత్వంగా ఉన్న రాజద్రోహం రద్దుకు సరైన కారణం లేదని జస్టిస్ రీతు రాజ్ అవస్తీ(రిటైర్డ్) నేతృత్వంలోని లా కమిషన్ పేర్కొంది. ఈ చట్టాన్ని తరుచు వలసవాద వారసత్వంగా చెబుతుంటారు. ప్రత్యేకించి భారతదేశ స్వాతంత్య్ర సమరయోధులకు వ్యతిరేకంగా ఉపయోగించిన నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుంటారు. వాస్తవానికి న్యాయవ్యవస్థ మొత్తం వలసవాద వారసత్వమే అని నివేదిక తేల్చి చెప్పింది. అలాగే సెక్షన్ 124ఏ దుర్వినియోగంపై అభిప్రాయాలను స్వీకరించామని, వాటిని అరికట్టేలా మోడల్ మార్గదర్శకాలను కేంద్రం జారీ చేయాలని సిఫార్సు చేస్తున్నామని నివేదికలో తెలిపింది. ఈ సందర్భంగా ఐపీసీ సెక్షన్ 124ఏకి కింద నేరానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు.. క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ 1973 సీర్పీసీ సెక్షన్ 196(3)కి సమానమైన సీర్పీసీ 154 సెక్షన్‌ని ఒక నిబంధనగా ప్రత్యామ్నాయంగా చేర్చవచ్చని సూచించింది. ఇది అవసరమైన విధానపరమైన భద్రతను అందిస్తుంది అని లా కమిషన్ చైర్మన్ అవస్తీ.. న్యాయమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్కు తన నివేదికలో తెలిపారు. చట్ట విరుద్ధ కార్యకలాపా చట్టం, జాతీయ భద్రతా చట్టం వంటి చట్టాలు ఐపీసీ సెక్షన్ 124ఏ కింద సూచించబడిన నేరాలకు సంబంధించిన అన్ని అంశాలను కవర్ చేయదని అందువల్ల రాజద్రోహం చట్టాన్ని కొనసాగించాలని లా కమిషన్ నొక్కి చెప్పింది. ఇదిలా ఉండగా దేశద్రోహ చట్టం హేతుబద్ధతను పునఃపరిశీలిస్తామని చెబుతూ కేంద్రం అఫడవిట్ దాఖలు చేయమడే గాక రాజ్యంగ చెల్లుబాటును నిర్ధారించే కసరత్తును వాయిదావేయాలని అభ్యర్థించింది. సుప్రీం కోర్టు వలస రాజ్యాల కాలం నాటి నిబంధననను గట్టిగా సమర్థించడం తోపాటు దానిని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయాలని కోరిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఈ చట్టాన్ని పునఃపరిశీలించేందుకు అంగీకరించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఒక తాజా పిటిషన్ దాఖలు చేసింది. కాగా, గతేడాది దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అజాది కా అమృతోత్సవాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వలసరాజ్యల యుగం నాటి చట్టం గురించి ప్రస్తావించారు. ఆ చట్ట ప్రయోజనాన్ని మించి పోయి ఉందని వెంటనే దాన్ని రద్దు చేయాలనే అభిప్రాయన్ని వెలిబుచ్చారు. కాగా, బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహ చట్టం చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ సహా మొత్తం 16 పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం తన అభిప్రాయాన్ని తెలిపాలని గతేడాది మేలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది. (చదవండి: ఐక్య ప్రతిపక్షం ఒంటరిగా బీజేపీని మట్టికరిపిస్తుంది: రాహుల్ గాంధీ) -
124–ఏ సెక్షన్‌ను ఎందుకు రద్దు చేయాలి?
‘‘ఇండియా తేరే తుకడే తుకడే కరేంగే’’ అని ఊరేగింపులలో బహిరంగంగా అరవడం దేశద్రోహం కాకపోతే, మరేమిటి? భారత పార్లమెంటుపై హంతక దాడికి పాల్పడిన ఉగ్ర వాదులనూ, వారిని ప్రేరేపించిన వారినీ, వారికి శిక్షణ ఇచ్చిన వారినీ హీరోలుగా కీర్తించడం దేశద్రోహం అవ్వక మరే మౌతుంది? ప్రభుత్వాన్ని పడగొట్టి శ్రామికవర్గ నియంతృత్వాన్ని స్థాపించే లక్ష్యంతో సొంత బలగాలను పెంచుకోవడం, సైన్యం దేశరక్షణ బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పుడు వారిపై దొంగ దాడులకు పాల్పడటం దేశద్రోహం కాకపోతే మరింకేమిటి? ముస్లింలు సురక్షితంగా ఉండేందుకూ, వారికి స్వయం పాలన ఒనగూడేందుకూ భారతదేశాన్ని మరోసారి విభజించి మొఘలి స్థాన్‌ను సృష్టించాలని ఒక ప్రొఫెసర్ రాస్తే అది దేశద్రోహం కాకుండా ఎలా ఉంటుంది? హత్య, అత్యాచారం, దోపిడీ అనేవి 150 ఏళ్లకు పైగా ఉన్న భారతీయ శిక్షాస్మృతి ప్రకారం నేటికీ శిక్షార్హమే అయినప్పుడు ఆ కాలం నాటిదే అయిన 124–ఏ సెక్షన్‌ను ఎందుకు రద్దు చేయాలి? (చదవండి: నల్ల చట్టానికి అమృతోత్సవాలా?) వలస పాలకుల కాలంలో 150 ఏళ్ల క్రితం నేరాలుగా పరి గణన పొందినవి నేడెలా నేరం కాకుండా పోతాయి? భారతదేశంలో దేశ వ్యతిరేక, సమాజ వ్యతిరేక, విదేశీ ప్రేరక... వ్యక్తులూ, సిద్ధాంత కర్తలూ, కార్యకర్తలూ ఉన్నారు. ప్రజాస్వామిక స్వేచ్ఛా భారతాన్ని వారి నుంచి రక్షించడానికి దేశద్రోహ ప్రసంగాలను, రచనలను, ప్రచారాలను, చర్యలను గుర్తించాలి, గమనించాలి, శిక్షించాలి. అందుకోసం రాజద్రోహాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 124–ఏను కొనసాగించాలి. న్యాయబద్ధంగా నిందితులను విచారించాలి. దోషులకు శిక్షలు విధించాలి. ఈ విషయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజుజు దృఢ వైఖరి సరైనది, ప్రశంసనీయమైనది. (క్లిక్: దేశద్రోహం కేసు నిందితుడిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా) – డాక్టర్ టి. హనుమాన్ చౌదరి; చైర్మన్, ప్రజ్ఞాభారతి -
నల్ల చట్టానికి అమృతోత్సవాలా?
సామ్రాజ్యవాదులు ఇండియాలో తమ ఉనికిని కాపాడుకోవడానికిగానూ పౌరుల ప్రతి కదలికనూ, న్యాయమైన వారి నిరసనలనూ అడ్డుకున్నారు. దానికోసం దేశద్రోహమనే నల్లచట్టాన్ని తెచ్చారు. అయితే దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతూ ఆ వలస పాలనావశేషాలు మనల్ని ఇంకా వదిలిపోవడం లేదు. ఒక కిరాతక చట్టానికి కూడా ‘అమృతోత్సవం’ జరుపుకోవలసి రావడం ఒక దుర్భర సన్నివేశం! సమకాలీన ప్రభుత్వ నిర్ణయాలనూ, పనితీరునూ విమర్శించగల స్వేచ్ఛ ఉండటమే ప్రజాస్వామ్యానికి కీలకమనీ... ప్రజాస్వామ్యంలోని ఈ కీలకమైన లక్షణాన్నే దేశద్రోహ చట్టం చంపేస్తుందనీ... అది అభిశంసననూ, ప్రతిపక్షాన్నీ శత్రువుగా భావిస్తుందనీ కె.ఎం.మున్షీ ఏనాడో చెప్పిన మాటలను మనం మరిచిపోకూడదు. కీలెరిగి వాత పెట్టమన్నారు! అదెప్పుడో చేయవలసిన పని. అయినా పాలకుల, అధికారగణాల స్వార్థపూరిత రాజకీయ, నిరంకుశ విధానాలు, ఆచరణ మూలంగా గత 75 సంవత్సరాలుగా యథేచ్ఛగా పట్టిపీడిస్తూ వచ్చిన వలస పాలనావశేషాలు మనల్ని ఇంకా వదిలిపోవడం లేదు. ‘దేశద్రోహం’ అనే ముసుగులో మిగిలిపోయిన ఒక కిరాతక చట్టానికి కూడా ‘అమృతోత్సవం’ జరుపుకోవలసి రావడం ఒక దుర్భర సన్నివేశం! స్వతంత్ర భారతానికే ఎంతమాత్రమూ పొసగని సందర్భం! ఈ దుర్మార్గపు చట్టం గురించి 1951లో నేటికి 71 ఏళ్ళ క్రితమే పంజాబ్ హైకోర్ట్ ఘాటుగా వ్యాఖ్యానించింది. ‘124–ఎ’ నేర నిబంధనను ‘ఇది అత్యంత ప్రమాదకరం’ అని బాహాటంగా ప్రకటించింది! అయినా సరే, ఈ 75 ఏళ్ళలోనూ కాంగ్రెస్, బీజేపీ పాలకులు ఆ వలస చట్టాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం యధేచ్ఛగా వాడుకుంటూనే వచ్చారు. ఈ క్షణంలోనూ వాడు కొంటున్నారు. ఈ విశృంఖలత్వానికి అడ్డుకట్ట కట్టేందుకు సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తీ, మరికొందరు దేశభక్తులయిన న్యాయ మూర్తులూ సిద్ధమయ్యారు. ప్రజలకు సిద్ధించవలసిన న్యాయాన్ని దక్కనివ్వకుండా అడ్డుకునే ధోరణి దేశంలో అరాచకానికి ‘రాచబాట’ వేస్తుందనీ, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి వివాదాల తక్షణ పరిష్కారమే సమాధానమనీ ప్రకటించారు. తమకు సకాలంలో న్యాయం జరగనప్పుడు ప్రజాబాహుళ్యం అన్యమార్గాలు వెతుక్కు న్నప్పుడు దేశ న్యాయవ్యవస్థే కుప్పకూలిపోయే ప్రమాద ముందని గౌరవ న్యాయమూర్తులు ప్రకటించాల్సి వచ్చింది. దేశప్రజల గౌరవాన్నీ, హుందాతనాననీ, ఓర్పునూ, వారి హక్కుల్నీ గుర్తించి, గౌరవించినప్పుడు మాత్రమే దేశంలో శాంతి నెల కొంటుందని వారు హితవు చెప్పవలసి వచ్చింది. సామ్రాజ్యవాదులు, ఇండియాలో తమ ఉనికిని కాపాడు కోడానికిగానూ పౌరుల ప్రతి కదలికనూ, న్యాయమైన వారి నిరసనలనూ అడ్డుకోవడానికి నల్లచట్టాన్ని ఇష్టారాజ్యంగా వాడుకుంటూ వచ్చారు. పౌరులు తమ హక్కుల్ని రక్షించుకోవడానికి చేసే ప్రయత్నాలను ‘దేశద్రోహం’గా చిత్రించడానికి ‘124–ఎ’లోని తుచ్ఛమైన నిబంధనలను అడ్డూ అదుపూ లేకుండా వాడుకున్నారు. వారి కోవలోనే ఇప్పటికీ దేశ స్వాతంత్య్రానంతరం 75 ఏళ్ల తర్వాత కూడా మన పాలకులు, వారి వందిమాగధ నిరంకుశ అధికార గణం వలస చట్టాన్నీ, అందులోని ప్రజా వ్యతిరేక నిబంధనలనూ జాగ్రత్తగా కాపాడుకుంటూ, వినియోగించుకుంటూ వస్తున్నారు. విద్రోహ రాజకీయానికి ‘పుట్టుకతోనే పుట్టిన రాజపుండు’ ఇది. కనీసం 1951లో పంజాబ్ హైకోర్టు హెచ్చరిక తర్వాతనైనా దేశ పాలకులకు చీమకుట్టినట్టు కూడా కాలేదు. ఈ తప్పుడు చట్టనిబంధనల కిందనే వలస పాలకులు జాతీయ నాయకులైన బాలగంగాధర తిలక్, గాంధీ తదితరులను అరెస్ట్ చేశారు. ‘దేశద్రోహ’ నేరారోపణ కింద అరెస్టులతో విజయకుమార్ సిన్హా లాంటి భగత్‌సింగ్ సహచరులను అండమాన్ దీవులలో నిర్బంధించారు. భారతీయ జనతా పార్టీ పాలనలో 2014–19 మధ్యకాలంలో అత్యధిక కేసులు పౌరహక్కుల నాయకులపైన, ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థుల పైన, వారి నాయకులపైన పెట్టారు. వలస పాలకుల ‘దేశద్రోహ’ చట్టం ముసుగు కిందనే కేసులు బనాయించి ఈ రోజుకీ వేధిస్తూనే ఉన్నారు. అలాగే ‘మిలార్డ్’ అనే పద ప్రయోగం కనుమరుగవడానికి న్యాయస్థానాలు ఈ 75 ఏళ్ళలోనే తంటాలు పడాల్సి వచ్చింది! నిజానికి మహదానంద ఘడియలలో జరుపుకోవాల్సిన స్వాతంత్య్ర దినోత్సవ 75 ఏళ్ళ అమృతోత్సవాల సమయంలో కూడా బీజేపీ పాలకులూ, పాలనా యంత్రాంగమూ ఈ క్షణం దాకా వలస పాలకుల దేశద్రోహ చట్టాన్ని సమర్థిస్తూనే ఉన్నారు. గట్టిగా ఆందోళన వచ్చినప్పుడల్లా చట్ట ‘‘నిబంధనలను పునః పరిశీలించే’’ విషయం అలోచిస్తామనీ కప్పదాట్లు వేస్తున్నారు. వలస పాలనావశేషాన్ని కాపాడటానికే సిద్ధమైనట్లు వారి మాటలూ, ఆచరణా వెల్లడిస్తున్నాయి! బహుశా ఇలాంటి పాలకుల ప్రవర్తనను చూసే భారత రాజ్యాంగ నిర్ణయ సభ ప్రధాన బోధకుడు, రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బాహాటంగా ఇలా ప్రకటించి ఉంటాడు: ‘‘రాజ్యాంగ నిబంధనలకు, వాటి నైతికతకు కట్టుబడి ఉండే తత్వం పౌరుల్లో సహజంగా నెలకొని ఉండే గుణం కాదు. అందువల్ల ఆ సద్గుణాన్ని మనం పెంచి పోషించాలి. ఈ విషయంలో మన ప్రజలు రాటుతేలాల్సి ఉంది. ఎందుకంటే, మన భారతదేశం ప్రధానంగా ప్రజాస్వామ్య వ్యతిరేక భావాలతో కూడుకుని ఉంది. అందువల్ల భారతదేశంలో ప్రజాస్వామ్య లక్షణం అనేది పైపై ‘సోకే’ సుమా!’’ కనుకనే బాలగంగాధర తిలక్, గాంధీలను ‘దేశద్రోహ’ (వలస) చట్టం కింద అరెస్టు చేసి, కోర్టులలో విచారిస్తున్న సమయంలో... భారత రాజ్యాంగం మౌలిక ప్రజాస్వామిక లక్షణాల్ని సమర్థిస్తూ సుప్రసిద్ధ జాతీయవాది కె.ఎం.మున్షీ రాజ్యాంగ నిర్ణయ సభలో మాట్లాడుతూ– వలస చట్టంలోని ‘దేశద్రోహం’ పదాన్ని అరువు తెచ్చుకుని స్వతంత్ర భారతంలో దాన్ని ఉపయోగించడానికి వీల్లేదని ప్రకటించారు. ఆ పదం పౌరుల అభిప్రాయ ప్రకటననూ, పౌరస్వేచ్ఛను అణచివేస్తుందనీ భారత శిక్షాస్మృతిలోని ఇండియన్ పీనల్ కోడ్‌లోని ‘124–ఎ’ సెక్షన్‌ను మనం కొనసాగించదలచామన్న తప్పుడు అర్థాన్ని ప్రజల మనస్సుల్లో కల్పించినట్టవుతుందనీ, ఆ సెక్షన్ రద్దు కావలసిందేననీ, మున్షీ కోరారని మరచిపోరాదు! 1950వ దశాబ్దంలో రెండు హైకోర్టులు పౌరస్వేచ్ఛను ‘124–ఎ’ హరించి వేస్తుందని స్పష్టమైన తీర్పు ఇచ్చాయి. అయితే 1962లో ‘కేదార్నాథ్ సింగ్ వర్సెస్ బిహార్ స్టేట్’ కేసులో సుప్రీంకోర్టు అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం దీనికి విరుద్ధమైన తీర్పును వెలువరించింది. భారత రాజ్యాంగ సభ స్ఫూర్తిని తిరస్కరిస్తూ శాంతి ప్రయోజనాల దృష్ట్యా వలస చట్టంలోని ‘124–ఎ’ సెక్షన్ ఉండాల్సిందేనంది. ఈ వాదనను పూర్తిగా తిరస్కరిస్తూ మద్రాసు హైకోర్టులోని సుప్రసిద్ధ న్యాయవాది సుహ్రిత్ పార్థసారధి ఇలా స్పష్టం చేశారు: ‘‘రాజ్యాంగ నిర్ణయ సభలో మున్షీ స్పష్టం చేసినట్టుగా– సమకాలీన ప్రభుత్వ నిర్ణయాలనూ, పనితీరునూ విమర్శించగల స్వేచ్ఛ ఉండటమే ప్రజాస్వామ్యానికి కీలకం. ప్రజాస్వామ్యంలోని ఈ కీలకమైన లక్షణాన్నే దేశద్రోహ(సెడిషన్) చట్టం చంపేస్తుంది. అది అభిశంసననూ, ప్రతిపక్షాన్నీ శత్రువుగా భావిస్తుంది. ఒక్కమాటలో ప్రజాస్వామ్య రిపబ్లిక్ మౌలిక పునాదినే సెడిషన్ కుళ్లబొడుస్తుంది.’’ ఇదిలా ఉండగా ‘చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం’(ఉపా) పేరిట జరుగుతున్నది ఏమిటంటే, శాంతియుతంగా చేస్తున్న భిన్నాభిప్రాయ ప్రకటన స్వేచ్ఛను కూడా హరించడం! అందుకని తక్షణం జరగాల్సిన పని పౌరస్వేచ్ఛకు రాజ్యాంగం ఇచ్చిన విస్పష్టమైన హామీలను పునరుద్ఘాటించాలి. దానికిగానూ పౌరులకు ఉన్న భావ ప్రకటనా స్వేచ్ఛను అరమరికలు లేకుండా గౌరవించ డమూనని బాధ్యతగల న్యాయమూర్తులు, న్యాయవాదులూ భావిస్తు న్నారు. చివరికి మన పాలకులు ఎలా తయారయారంటే, ఒక్కసారైనా సుమతీ శతక కారుణ్ణి తలచుకోవడం శ్రేయస్కరం అనిపిస్తుంది. సమయం చూసుకొని, ఏ సమయానికి ఏది తగినదో దానికి టంకప్పొడల్లే ఠక్కున అతుక్కుపోయే మాటలు ఆ క్షణానికి పలికి, తాను బాధపడకుండా తప్పించుకు తిరిగే నాయకుడే లోకంలో ధన్యుడన్నాడు. బద్దెన! ఎంత అనుభవమండీ! నేటి భారత ప్రజల అనుభవం కూడా ఇదే సుమా! కాకపోతే ఏమిటి చెప్పండి, తాజ్మహల్నట ‘తేజోమహల’ని పిలవాలట! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
Sedition Order: లక్ష్మణ రేఖను గౌరవించాలి.. దాటకూడదు!
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పదమైన రాజద్రోహ చట్టం విషయంలో ఇవాళ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ సమీక్షలు పూర్తయ్యేదాకా రాజద్రోహ చట్టాన్ని నిలిపివేయాలంటూ కేంద్రానికి చెప్పింది. అంతేకాదు కొత్త కేసులు.. అరెస్టులు నమోదు చేయొద్దని చెబుతూనే.. ఇప్పటికే రాజద్రోహం కింద అరెస్టయిన వాళ్లు బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించొచ్చని స్పష్టం చేసింది. ఈ పరిణామంపై పలువురు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు Kiren Rijiju కోర్టు ఆదేశాలపై.. ‘కోర్టులకు ఉన్న స్వతంత్ర్య హోదాను, వాటిని తీర్పును గౌరవిస్తామని అన్నారు. అంతేకాదు లక్ష్మణ రేఖను దాటకూడదు కదా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టం విషయంలో మేం చాలా స్పష్టంగా ఉన్నాం. మా ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశం ఏంటో కూడా న్యాయస్థానానికి తెలియజేశాం. న్యాయస్థానాలను, వాటి స్వతంత్ర్య హోదాను మేం గౌరవిస్తాం. కానీ, అంతా లక్ష్మణ రేఖను గౌరవించాలి. అంతేగానీ దాటకూడదు కదా అంటూ మంత్రి కిరెన్ రిజిజు మీడియాతో మాట్లాడారు. బ్రిటిష్ కాలంలో భారతీయుల అణచివేతకు కారణమైన ఐపీసీ సెక్షన్ 124-ఏను.. ఇప్పటికీ అమలు చేస్తుండడంపైనే ప్రధాన అభ్యంతరాలు వ్యక్తంకాగా, కేంద్రం మాత్రం ఈ సెక్షన్‌పై దోబుచులాడుతూ వస్తోంది. తాజాగా ఈ సెక్షన్ సవరణ సమీక్షకు తాము సిద్ధమంటూ అఫిడవిట్లో పేర్కొనడం.. ఆపై సుప్రీం కోర్టు జోక్యంతో రాజద్రోహం సెక్షన్‌కు ఇప్పుడు బ్రేకు పడింది. చదవండి: ‘రాజద్రోహం చట్టం’పై స్టే విధించిన సుప్రీంకోర్టు -
కాలం చెల్లిన చట్టాలు ఇంకానా?
రాజద్రోహం చట్టాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేసింది. ఈ నేపథ్యంలో 160 సంవత్స రాలకు పైగా చర్చ జరుగుతున్న ఈ చట్టం అమలు తీరు, దాని పర్యవసానాలపై పౌర సమాజం ఆసక్తితో ఉంది. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం వెలుగులో జీవిస్తున్న సమాజం మనది. మానవ సమాజ పరిణామ క్రమంలో మనుషులకు అవసరం లేనివి కాలగర్భంలో కలిసిపోతాయి. ఆ విధంగానే నల్ల చట్టాలు కూడా మిగలొద్దని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి ఎన్నో దేశాలు వాటిని రద్దు చేసుకున్నాయి. మరి మనది 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశం. రాజుల కాలం పోయింది. సంస్థానాలు కూలిపోయి నాయి. కానీ రాజులేని కాలంలో రాజద్రోహ చట్టాన్ని ఇంకా కాపాడుతున్నది ఎవరనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ రాజకీయ వాతావరణం ప్రజాస్వామ్య దేశంలో ఒక అవమానకరమైన పరిస్థితిని సూచిస్తుంది. అందుకేనేమో తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ భారత ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలానికే రాజద్రోహానికి కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు. భారత స్వతంత్ర ఆకాంక్షను అణచివేయడానికి బ్రిటిష్ వారు 1860లో ఇండియన్ పీనల్ కోడ్‌లో రాజద్రోహాన్ని పొందుపరిచారు. మహాత్మాగాంధీ, బాలగంగాధర తిలక్, జవహర్ లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి స్వతంత్ర సమరయోధులు రాజద్రోహం కింద ఆనాడు శిక్ష అనుభవించారు. స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం గురించి ఉద్యమిస్తున్న వారిని ఈనాడు అదే చట్టం కింద నిర్బంధించడం సిగ్గుచేటు. ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ ఈ చట్టం ఎత్తివేతకు అన్ని పార్టీలతో కార్యాచరణను ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఇందులో కలిసి రావాలని రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా మాతో జరిగిన చర్చల్లో ప్రతిపాదించడం జరిగింది. మావోయిస్టులే చర్చలకు సిద్ధమ వుతున్నప్పుడు ఈ చట్టం మరింత కాలం చెల్లినది అని చెప్పక తప్పదు. (చదవండి: కార్మిక హక్కులకు అసలు ప్రమాదం) చట్టం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని, ఈనాటి ప్రమాదాన్ని ముందే ఊహించిన కె.ఎం. మున్షీ లాంటివారు దీన్ని అత్యంత క్రూరమైన చట్టంగా అభివర్ణించారు. వ్యక్తి హక్కులను నిర్దాక్షిణ్యంగా అణిచివేసే ఈ చట్టం ప్రజా స్వామ్య మనుగడకు ప్రమాదకరమని రాజ్యాంగ సభలో మాట్లాడారు. ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్య మనుగడ ఉండదు. ప్రశ్న ప్రజాస్వామ్య ఉనికికి జీవగర్ర లాంటిది. పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుల అణచివేతకు కారణమవుతున్న రాజద్రోహాన్ని భారత శిక్షా స్మృతి నుండి తొలగించాలని ఇప్పటికే అనేక కేసులు దాఖలయ్యాయి. ఈ ప్రయత్నంలో న్యాయవ్యవస్థ సఫలీకృతం అయితే భారత ప్రజలకు ఒక భరోసా లభించినట్లే. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా గొంతు విప్పవలసిన సమయం ఇది. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకొనే ప్రజా ప్రభుత్వాలు ఏవైనా సరే ఈ సత్యం గ్రహించాలి. ప్రజాస్వామ్యం అంతిమసారం అదే. రాజ్యంగ స్ఫూర్తి కూడా అదే. (చదవండి: అసమ్మతి గళాలపై అసహనం) - డాక్టర్ చెరుకు సుధాకర్ తెలంగాణా ఇంటి పార్టీ అధ్యక్షులు -
దేశద్రోహ చట్టాన్ని పునఃసమీక్షిస్తాం
న్యూఢిల్లీ: దేశద్రోహ చట్టంలోని కొన్ని అంశాలపై పునఃసమీక్ష జరుపుతామని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దేశ సార్వభౌమత్వం, సమగ్రతల పరిరక్షణకు కట్టుబడి వివిధ వర్గాల అభిప్రాయాలు, ఆందోళనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. విద్రోహ చట్టంలోని సెక్షన్ 124ఏ చట్టబద్ధతపై రాజ్యాంగబద్ధ అనుమతి కలిగిన సాధికార సంస్థతో పరిశీలన జరిపిస్తామని పేర్కొంది. అప్పటి వరకు, ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవద్దని కోరింది. దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ..వలస పాలన భారాన్ని తొలగించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపింది. బ్రిటిష్ కాలం నాటి 1,500 చట్టాలను ఇప్పటికే తొలగించినట్లు కేంద్ర హోం శాఖ సోమవారం సుప్రీంకోర్టులో మూడు పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. తెలిపింది. కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో 1962లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ చట్టంపై మళ్లీ సమీక్ష అవసరం లేదంటూ ఇటీవల సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం..ఇంతలోనే యూటర్న్ తీసుకోవడం గమనార్హం.దేశద్రోహ చట్టం చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై 10వ తేదీన సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. చదవండి: (పెళ్లిలో ‘షేర్వాణీ’ రగడ) -
చెవిటి వాడి ముందు శంఖం ఊదడం ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ)కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న దాదాపు మూడువేల మందిపైన ‘దేశ ద్రోహం’ నేరం కింద జార్ఖండ్‌లోని ధన్‌బాద్ పోలీసులు మంగళవారం కేసు పెట్టారు. వాటన్నింటినీ ఎత్తివేస్తున్నట్లు మరుసటిరోజే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. భారత రాజ్యాంగం ప్రజలకు కల్పిస్తున్న హక్కుల గురించి రాసిన శిలా ఫలకాలను ఊరూరా ఏర్పాటు చేసినందుకు గత నవంబర్‌లో కూడా పదివేల మందిపై కుంతీ జిల్లా పోలీసులు ‘దేశ ద్రోహం’ నేరం కిందనే కేసులు పెట్టారు. వాటిని గత నెలలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హేమంత్ సోరెన్ కేబినెట్ నిర్ణయం తర్వాత కొట్టివేశారు. ఇలా తప్పుడు కేసులు పెట్టడం తప్పంటూ ముఖ్యమంత్రి స్వయంగా హెచ్చరించి వాటిని ఎత్తివేసినప్పటికీ జార్ఖండ్ పోలీసులు తమ వైఖరి మార్చుకోక పోవడం ఆశ్చర్యం. బ్రిటీష్ వలస పాలకుల కాలం నాటి మనస్తత్వం నుంచి ఇంకా బయట పడడం లేదు. ఈ మనస్తత్వం ఒక్క జార్ఞండ్‌కే పరిమితం కాలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించినా, వాటిపై నిరసన వ్యక్తం చేసినా అరెస్టులు చేసి దేశ ద్రోహం నేరం కింద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఇలా తప్పుడు కేసులు పెట్టి క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను దెబ్బతీస్తున్నారంటూ కోర్టులు ఎన్నిసార్లు హెచ్చరించినా పోలీసులు తమ మనస్తత్వాన్ని మార్చుకోవడం లేదు. 2014 నుంచి 2016 మధ్య దేశంలో కొన్ని వందల మంది మీద దేశ ద్రోహం నేరం కింద కేసులు పెట్టగా వాటిలో రెండంటే రెండు కేసులు మాత్రమే నిలబడ్డాయి. మిగితా వాటన్నింటినీ కోర్టులు కొట్టివేశాయి. ‘ప్రభుత్వాన్ని విమర్శించడం దేశద్రోహం ఎన్నటికీ కాదు. పైగా అది భావ ప్రకటనా స్వేచ్ఛ కింద రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కు’ అని 1962లో సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. 2016లో కూడా దేశ ద్రోహం కేసులు తన దృష్టికి వచ్చినప్పుడు ఈ తీర్పునే పునరుద్ఘాటించింది. ఇలాంటి తీర్పులన్నీ చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే అవుతున్నాయి. -
‘ఆ చట్టానికి నూకలు చెల్లలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటిష్ హయాం నాటి దేశ ద్రోహం చట్టాన్ని రద్దు చేసే ప్రతిపాదనకు సంబంధించి కాంగ్రెస్ సహా విపక్షాలు అడిగిన ప్రశ్నలపై ప్రభుత్వం సమాధానం తెలిపింది. దేశద్రోహ నేరానికి సంబంధించి ఐపీసీలో పొందుపరిచిన నిబంధనను రద్దు చేసే ప్రతిపాదన ఏమీ లేదని బుధవారం రాజ్యసభలో హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై విద్వేషపూరితంగా వ్యవహరించే వారిపై ప్రయోగించే పురాతన దేశ ద్రోహ చట్టాన్ని తొలగించే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలించడం లేదని మంత్రి పెద్దల సభలో పేర్కొన్నారు. కాగా, దేశద్రోహ చట్టాన్ని ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్ధులపై ప్రయోగిస్తోందని, ప్రభుత్వ విధానాలను తప్పుపట్టే వారిని వేధించేందుకు వాడుతుందని విపక్షాలు చాలాకాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. -
‘అధికారంలోకి వస్తే ఆ చట్టం మరింత పటిష్టం’
సాక్షి, న్యూఢిల్లీ : దేశద్రోహం చట్టాన్ని తొలగిస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పొందుపరచడం పట్ల కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే దేశద్రోహ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కులులో గురువారం ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ జాతి వ్యతిరేక శక్తుల వెన్నులో వణుకుపుట్టేలా దేశద్రోహం చట్టాన్ని పటిష్టం చేస్తామని చెప్పారు. నిత్యావసర ధరలు పెరగకుండా బీజేపీ ప్రధానులు వాజ్‌పేయి, మోదీ నియంత్రించడంతోనే ద్రవ్యోల్బణం ఎన్నికల అంశం కాలేదని చెప్పుకొచ్చారు. కాగా హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్ధానాలకు మే 19న తుది దశలో పోలింగ్ జరగనుండగా, ఈనెల 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. -
దేశద్రోహ చట్టాన్ని తొలగిస్తారా? రాహుల్‌పై కేసు నమోదు!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆగ్రా కోర్టులో కేసు నమోదైంది. దేశ ద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో పొందుపరచడాన్ని సవాలుచేస్తూ న్యాయవాది నరేంద్ర శర్మ కోర్టును ఆశ్రయించారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 55 పేజీలతో కూడా ఎన్నికల మ్యానిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. కేంద్రంలో తామ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భారత శిక్షాస్మృతి(ఐపీసీ) లోని దేశ ద్రోహ చట్టం 124ఎను తొలగిస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. ఈమేరకు న్యాయవాది పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం దీనిపై ఏప్రిల్ 16న విచారణ జరుపుతామని తెలిపింది. బ్రిటీష్ కాలంనాటి చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం దేశంలోని మేధావులు, విద్యార్థులపై బలవంతంగా ప్రయోగిస్తోందని రాహుల్ పలుమార్లు విమర్శించారు. ఈమేరకు దానిని తొలగిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. దీనిపై న్యాయవాది స్పందిస్తూ.. ఉగ్రవాదులంతా దేశంలో ఉండిపోవాలని రాహుల్ కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. దేశ ద్రోహ చట్టాన్ని తొలగిస్తే శాంతిభద్రతలు మరింత అద్వాన్నంగా తయారవుతాయని ఆయన పేర్కొన్నారు. కాగా దేశానికి వ్యతికంగా నినాదాలు చేసినా.. విద్వేషాన్ని ప్రదర్శించిన వారిని దేశద్రోహ చట్టం కింద అరెస్ట్ చేయడమే సెక్షన్ 124ఎ స్వరూపం. #Agra: A case has been filed by lawyer Narendra Sharma in CJM Court against Congress President Rahul Gandhi for promising in Congress manifesto to abolish Section 124A (Sedition) of the Indian Penal Code. (06.04) pic.twitter.com/1SqMzt1VWT — ANI UP (@ANINewsUP) April 7, 2019 -
కన్నయ్య కుమార్‌పై 1200 పేజీల ఛార్జ్‌షీట్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ (జేఎన్‌యూ) విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌పై ఛార్జ్‌షీట్ నమోదైంది. దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు 1200 పేజీలతో కూడిన అభియోగ పత్రాన్ని సోమవారం దాఖలు చేశారు. కన్నయ్య కుమార్‌తో పాటు విద్యార్థి సంఘం నాయకులు ఉమర్ ఖలీద్, అనీర్బన్ బట్టాచార్య పేర్లు కూడా ఛార్జ్‌షీట్‌లో ఉన్నట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ వెల్లడించారు. దేశద్రోహం(124ఎ), క్రిమినల్ కుట్ర(120బీ), అలర్లకు ప్రేరేపణ(147), అనుమతి లేకుండా సమావేశం కావడం(143) వంటి సెక్షన్ల ద్వారా వారిపై అభియోగాలు నయోదు చేశారు. పాటియాల హౌస్ కోర్టు దీనిపై మంగళవారం విచారణ చేపట్టనుంది. పార్లమెంట్‌పై దాడి ఘటనలో సూత్రధారి అప్జల్ గురుకు ఉరిశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ 2016 ఫిబ్రవరి 9న కన్నయ్యతో పలువురు విద్యార్థి నాయకులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు దేశ వ్యతిరేక నినాదాలు చేశారని ఢిల్లీ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్‌యిన వారికి మద్దతుగా జేఎన్‌యూ సహా, దేశ రాజధానిలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై కన్నయ్య కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తనపై మోదీ ప్రభుత్వం కక్ష్యసారింపుగా అభియోగాలు నమోదు చేసిందని విమర్శించారు. దేశ న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన అన్నారు. కాగా ఘటన జరిగిన మూడేళ్ల తరువాత అభియోగాలు దాఖలు చేయడం గమనార్హం. -
వర్సిటీ విద్యార్థులపై రాజ్యద్రోహం కేసు
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఎఎమ్‌యూ) రాజ్యద్రోహం ఆరోపణలతో మరోసారి వార్తల్లో నిలిచింది. కశ్మీర్లో ఇటీవల ఎన్కౌంటర్లో హతమైన నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ సభ్యుడు బషీర్ వనీకి మద్దతుగా వర్సిటీ విద్యార్థులు సభ ఏర్పాటుకు ప్రయత్నించారు. దీనిలో కీలమైన విద్యార్ధులు వసీం యాకుబ్ మాలిక్, అబ్దుల్ మీర్‌లపై యూపీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 124(ఎ) ప్రకారం రాజ్యద్రోహం కేసు నమోదు చేశారు. కశ్మీర్లో ఉగ్రవాద కర్యాకలపాలకు పాల్పడుతున్న వనీని ఇటీవల భద్రత ధళాలు మట్టుపెట్టిన విషయం తెలిసిందే. వనీ మృతికి నివాళిగా అతని మద్దతు దారులు కొంతమంది వర్సిటీలో సమావేశం నిర్వహించి.. దేశ సమగ్రతను దెబ్బతినే విధంగా నినాదాలు చేశారని పోలీసులు తెలిపారు. వనీ ఎన్కౌంటర్ తరువాత కొంత మంది కశ్మీరి యువకులు ఆయనకు మద్దతుగా సభ నిర్వహించాలని ప్రయత్నం చేశారని.. వారికి వర్సిటీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. విద్యార్థులపై రాజ్యద్రోహం కేసు పెట్టడంపై వర్సిటీ విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తమకున్న వాక్ స్వాతంత్ర్యన్ని ప్రభుత్వాలు హరిస్తున్నాయని విద్యార్థి సంఘం నేత ఫజీల్ హుస్సెన్ పేర్కొన్నారు. పీహెచ్డీ వద్దని మిలిటెన్సీలోకి.. 2016లో బుర్హాన్ వనీ హతమైన తరువాత మిలిటెన్సీ వైపు ఆకర్షితులైన విద్యావంతుల్లో బషీర్ వనీ ఒకడు. ముందునుంచి చదువుల్లో చురుకుగా ఉన్న బషీర్ వనీ ప్రతిష్టాత్మక సైనిక్ స్కూల్లో 11, 12వ తరగతులు పూర్తిచేశాడు. మెరిట్ విద్యార్థిగా పాఠశాల, కళాశాల రోజుల్లో ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. ఎన్సీసీ క్యాడెట్‌గా పంద్రాగస్టు, రిపబ్లిక్ డే కవాతుల్లో కూడా పాల్గొన్నాడు. 2010, 2016లో కశ్మీర్ లోయలో చెలరేగిన తీవ్ర నిరసనల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి వాడు, అలీగఢ్ యూనిర్సిటీలో పీహెచ్డీ చదువుతుండగా 2017 చివరన దక్షిణ కశ్మీర్‌కు చెందిన కొందరు విద్యార్థులతో ఏర్పడిన పరిచయంతో మిలిటెన్సీలో చేరాడు. ఈ ఏడాది జనవరి 3న అలీగఢ్ వర్సిటీని వదిలి వెళ్లాడు. అతని పేరు ఇప్పటికీ వర్సిటీ అధికారిక వెబ్సైట్లో కనిపిస్తోంది. భూగర్భశాస్త్రంలో పీహెచ్డీ చదువుతున్న వనీకి భోపాల్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ‘బెస్ట్ పేపర్ ప్రజెంటేషన్’ అవార్డు కూడా దక్కింది. హిజ్బుల్ టాప్ కమాండర్ వనీ హతం -
విమర్శిస్తే దేశద్రోహం కాదు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశాన్ని విమర్శించినంత మాత్రన దేశద్రోహంగా పరిగణించరాదని. హింస, చట్టవిరుద్ధ మార్గాల్లో ప్రభుత్వాన్ని కూలదోసే ఉద్దేశం ఉన్నట్టు వెల్లడైతేనే దేశద్రోహంగా పరిగణించాలని లా కమిషన్ స్పష్టం చేసింది. బ్రిటన్ నుంచి మనం ఐపీసీ సెక్షన్ 124ఏను సంగ్రహించగా ఆ దేశం పదేళ్ల కిందటే దేశద్రోహ చట్టాలను రద్దు చేసిందని పేర్కొంది. అలాంటి నియంతృత్వ చట్టాలను కొనసాగించేందుకు బ్రిటన్ సుముఖంగా లేదని తెలిపింది. దేశద్రోహంపై సలహా పత్రంపై లా కమిషన్ ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ వంటి దేశాల్లో రాజ్యాంగం ప్రాథమిక హక్కులుగా గుర్తించిన భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించేలా దేశద్రోహ చట్టాలను పునర్నిర్వచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. దేశాన్ని విమర్శించడం దేశద్రోహంగా పరిగణించరాదని, సానుకూల విమర్శలను దేశం స్వాగతించకుంటే స్వాతంత్ర్యం రాకముందు, వచ్చిన తర్వాత పరిస్థితులకు పెద్దతేడా ఉండదని వ్యాఖ్యానించింది. విమర్శించే హక్కు, సమర్ధించుకునే హక్కు భావప్రకటనా స్వేచ్ఛ కింద కాపాడాలని సలహా పత్రంలో లా కమిషన్ పేర్కొంది. -
మరోసారి చిక్కుల్లో పడ్డ హీరోయిన్
బెంగళూరు: కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. పాకిస్థాన్ నరకం కాదంటూ ఇటీవల రమ్య చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం చల్లారకముందే.. ఆమెపై క్రిమనల్ కేసు నమోదు చేయాలని స్థానిక కోర్టు..పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఆర్ఎస్ఎస్ బ్రిటీష్ వారికి సహకరించారంటూ రమ్య చేసిన వ్యాఖ్యలపై వసంత్ మరకడ అనే న్యాయవాది ప్రయివేట్ పిటిషన్ దాఖలు చేశారు. రమ్యపై చర్య తీసుకోవాలని ఆయన మంగళూరు సమీపంలోని బెల్తాన్ గడి కోర్టులో పిటిషన్లో కోరారు. అయితే అంతకు ముందు ఆయన రమ్యపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసేందుకు అంగీకరించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. వసంత్ స్టేట్మెంట్ను రికార్డు చేసిన కోర్టు రమ్యపై క్రిమినల్ కేసు నమోదు ఆదేశాలు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రమ్యకు సమన్లు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. మండ్య పట్టణంలో భారత రాష్ట్రీయ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘విద్యార్థిగళ నడె దేశద బెళవణిగె కడె’ ర్యాలీలో పాల్గొన్న రమ్య బీజేపీ, ఆర్ఎస్ఎస్ల వల్ల దేశానికి స్వాతంత్య్రం రాలేదని, కేవలం కాంగ్రెస్ పార్టీ పోరాటాల వల్ల మాత్రమే స్వాతంత్య్రం లభించిందని అన్నారు. అంతేకాకుండా బిజేపీ, ఆర్ఎస్ఎస్లు బ్రటీష్ వారికి సహకరించారని ఆరోపణలు చేశారు. ఇప్పటికే రమ్యపై దేశద్రోహం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. పాకిస్తాన్లో ఉన్న వారు కూడా మంచి వారేనంటూ వ్యాఖ్యలు చేసిన ఆమెపై కొడగు జిల్లా సోమవార పేటలోని జేఎంఎఫ్‌సీ కోర్టులో ప్రైవేటుగా దేశద్రోహం కేసు దాఖలైంది. న్యాయవాది విఠల్‌గౌడ ఈ ప్రైవేటు కేసును దాఖలు చేశారు. శత్రుదేశమైన పాకిస్తాన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన రమ్యపై సెక్షన్ 124/ఎ, 334ల కింద కేసు నమోదు చేయడంతో పాటు, ఆమెపై తక్షణమే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలంటూ విఠల్‌గౌడ న్యాయస్థానాన్ని కోరిన విషయం విదితమే. -
హార్దిక్ పటేల్ కు బెయిల్
-
హార్దిక్ పటేల్ కు బెయిల్
అహ్మదాబాద్: రాజద్రోహం కేసులో అరెస్టైన పటేళ్ల ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. దాదాపు 9 నెలల తర్వాత అతడికి బెయిల్ వచ్చింది. గుజరాత్ హైకోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆరు నెలల పాటు గుజరాత్ వెలుపల ఉండాలని ఆదేశించింది. రాజద్రోహం కేసులో సూరత్ పోలీసులు గతేడాది అక్టోబర్ లో అతడిని అరెస్టు చేశారు. బెయిల్ వచ్చినా హార్దిక్ జైల్లోనే ఉంటారని అతడి తరపు న్యాయవాది జుబిన్ భద్ర తెలిపారు. అతడిపై ఇతర కేసులున్నాయని చెప్పారు. పటేళ్ల ఉద్యమంలో భాగంగా.. అక్టోబర్ 3న తన అనుచరులతో మాట్లాడుతూ.. ‘ఆత్మహత్యలు చేసుకోవటం ఎందుకు? అవసరమైతే ఇద్దరు పోలీసులను చంపండి’ అంటూ హార్దిక్ పటేల్ వ్యాఖ్యలు చేయడంతో అతడిపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. సాధారణంగా.. రాజద్రోహం కేసులో కనీసం మూడేళ్లు.. గరిష్ఠంగా జీవిత ఖైదు శిక్ష పడుతుంది. -
'కన్హయ్య' కథ అడ్డం తిరిగిందా!
న్యూఢిల్లీ: కథ అడ్డం తిరిగిందా? కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ లు చెప్పినవన్నీ కట్టు కథలని తేలాయా? దేశవ్యాప్తంగా రాజకీయ కలకలం సృష్టించిన జేఎన్‌యూ వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఉగ్రవాది అఫ్జల్ గురు సంస్మరణ ర్యాలీ సందర్భంగా విద్యార్థి నేతలు జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది ముమ్మాటికి నిజమేనని సీబీఐ ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశీలనలో తేలింది. సీబీఐ ల్యాబ్ తుది రిపోర్టుకూడా తమకు అందినట్లు ఢిల్లీ పోలీసులు ధృవీకరిస్తున్నారు. (చదవండి: 'కన్హయ్యపై గట్టి సాక్ష్యాలున్నాయి') నాటి ఘటనకు సంబంధించి ఓ హిందీ న్యూస్ చానెల్ ప్రసారం చేసిన వీడియో ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ దృశ్యాలను చిత్రీకరించిన కెమెరా, మెమరీ కార్డు, సీడీలు, వైర్లు తదితర పరికరాలన్నింటినీ ఢిల్లీలోని ప్రఖ్యాత సీబీఐ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. నాలుగు నెలల సుదీర్ఘ పరిశీలన అనంతరం సదరు వీడియోల్లోని దృశ్యాలు నిజమైనవేనని, ఎలాంటి మార్పుచేర్పులు చేయలేదని నిపుణులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక జూన్ 8నే పోలీసులకు చేరినట్లు సమాచారం. సీబీఐ ల్యాబ్ నుంచి రిపోర్టు అందిన మాట వాస్తవేనని ప్రత్యేక కమిషనర్ అరవింద్ దీప్ మీడియాకు చెప్పారు. (చదవండి: మళ్లీ అఫ్జల్ గురు ప్రకంపనలు!) టీవీ చానెళ్లలో ప్రసారమైన దృశ్యాల ఆధారంగా కాకుండా రా వీడియో ఫుటేజి ఆధారంగానే తాము ఎఫ్ఐఆర్ నమోదు చేసినందున ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకంగా మారింది. ఇప్పుడు రిపోర్టు పోలీసులకు అనుకూలంగా రావడంతో జేఎన్ యూ విద్యార్థి నాయకుల భవిష్యత్ పై చర్చలు మొదలయ్యాయి. అయితే సున్నితమైన అంశం కావడంతో ఆచితూచి వ్యవహరించాలని పోలీసులు భావిస్తున్నారు. దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్భన్ భట్టాచార్యలు బెయిల్ పై బయటే ఉన్న సంగతి తెలిసిందే. (చదవండి: బెయిల్ పై విడుదలైన కన్హయ్య కుమార్) -
ఖడ్సేపై దేశద్రోహం కేసు పెట్టాలి: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే ఒక దేశద్రోహి అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఖడ్సేపై దేశద్రోహం కేసు పెట్టాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాడిన హార్థిక్ పటేల్ పై గుజరాత్ ప్రభుత్వం పెట్టిన దేశద్రోహం అభియోగాలను ఎత్తివేయాలని, ఆ అభియోగాలను ఖడ్సేపై పెట్టాలని ఆయన ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలు ఉన్న ఖడ్సే ఒక దేశద్రోహి అని ధ్వజమెత్తారు. దావూద్‌తో సెల్‌ఫోన్ సంభాషణలు, భూ అక్రమాల ఆరోపణలతో ఖడ్సే శనివారం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
రాజద్రోహం కేసులో సీనియర్ ఎడిటర్ అరెస్ట్
ఢాకా (బంగ్లాదేశ్): రాజద్రోహం కేసులో 81 ఏళ్ల ప్రముఖ సీనియర్ ఎడిటర్‌ను శనివారం బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ బెంగాలీ మేగజైన్ మౌచకే దిల్‌కు ఎడిటర్ అయిన షఫిక్ రెహ్మాన్ గతంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియాకు స్పీచ్ రైటర్‌గా పనిచేశారు. శనివారం తెల్లవారుజామున రిపోర్టర్లమంటూ ముగ్గురు వ్యక్తులు తమ ఇంటికొచ్చి రహ్మాన్‌ను తీసుకెళ్లారని అతని భార్య తలేయా రెహ్మాన్ చెప్పారు. కాగా, గతేడాది ఢాకాలో నమోదైన పెండింగ్ కేసు విషయంలో రహ్మాన్ అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అంతేకాకుండా గతేడాది ప్రధాని హసీనా కుమారుడు, సమాచార ప్రసారాల సలహాదారుడు సజిబ్ వాజీద్ హత్యకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజలను మళ్లించేందుకే ఈ అరెస్ట్ చేసినట్లు బీఎన్పీ కార్యదర్శి మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ విమర్శించారు. ఈ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, రహ్మాన్ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
కన్హయ్యపై మరో దేశద్రోహం కేసు!
మీరట్: జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ను సమస్యలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశద్రోహం కేసులో జైలుపాలై, మధ్యంతర బెయిల్ పై బయటకొచ్చిన అతడిపై మరో కేసు నమోదైంది. భారత సాయుధ దళాలను అవమానించాడంటూ కన్హయ్యపై భజరంగ్ దళ్ కార్యకర్త ఫిర్యాదుతో అతడిపై తాజాగా మరో దేశద్రోహం కేసు దాఖలు చేశారు. ఈ నెల 28న కోర్టులో విచారణకు రానుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కన్హయ్య కుమార్ భారత సైన్యానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడని రైట్ వింగ్ కార్యకర్త హేమంత్ సింగ్ ఆరోపించారు. భారత సైనికులు కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాల్లోని మహిళలపై అత్యాచారాలతో పాటు, దురాగతాలకు పాల్పడ్డారంటూ కన్హయ్య చేసిన వ్యాఖ్యలు దేశ వ్యతిరేక వ్యాఖ్యలుగా భావించి అతడిపై బులందర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళామని ఆయన తెలిపారు. అయితే అక్కడి పోలీసులు తమ ఫిర్యాదును స్వీకరించికపోవడంతో బులందర్ ఛీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించామని హేమంత్ సింగ్ తెలిపారు. సెక్షన్ 124-A (సెడిషన్) తో పాటు.. ఇండియన్ పీనల్ కోడ్ 153-B కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. తమ స్టేట్ మెంట్ రికార్డు చేసేందుకు మార్చి 28న హాజరు కావాలని కోర్టు చెప్పిందని అన్నారు. ఈ సందర్భంలో తాను కోర్టుకు టెలివిజన్ లో ప్రసారమైన కన్హయ్య కుమార్ తప్పుడు వ్యాఖ్యల వీడియో క్లిప్పులను సమర్పించినట్లు తెలిపారు. -
3 చానళ్లపై కేసులు
ఢిల్లీ సర్కారు నిర్ణయం జేఎన్‌యూ వివాదంపై నకిలీ వీడియోల ప్రసారం న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ వివాదాస్పద కార్యక్రమంపై నకిలీ వీడియోలను ప్రసారం చేసిన మూడు టీవీ చానళ్లపై క్రిమినల్ కేసులు దాఖలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. మూడు టీవీ చానళ్లు మార్పుచేసిన వీడియోలను ప్రసారం చేశాయంటూ మెజిస్టీరియల్ దర్యాప్తు నివేదిక ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ చానళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నియమించిన న్యాయబృందం సూచించిందని ఓ అధికారి ఒకరు చెప్పారు. అయితే చానళ్ల పేర్లను ఢిల్లీ మెజిస్ట్రేట్ సంజయ్ కుమార్ తన నివేదికలో పొందుపరచలేదన్నారు. ఫిర్యాదు ఆధారంగా సీఆర్పీసీ సెక్షన్ 200 ప్రకారం మేజిస్ట్రేట్ అభియోగాలను పరిగణనలోకి తీసుకుంటారన్నారు. మెజిస్టీరియల్ బృందం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఏడు వీడియో క్లిప్పింగులను పంపగా, అందులో మూడు బూటకమని తేలింది. ఆ వీడియోలను ఎడిట్ చేసి స్వరాన్ని జతచేసినట్లు నిర్ధారణ అయింది. కన్హయ్య జాతి వ్యతిరేక నినాదాలు చేసినట్లు విచారణ బృందం ఎలాంటి ఆధారాలను కనుగొనలేదు. కాగా, అంతకుముందు ఈ టీవీ చానళ్లపై చర్య తీసుకోవాలంటూ సీపీఎం నేత సీతారాంఏచూరి, జేడీయూ నేత కేసీ త్యాగి సీఎం కేజ్రీవాల్‌ను కలసి డిమాండ్ చేశారు. ఉమర్, అనిర్బన్‌ల విడుదలకు ఉద్యమిస్తా: రాజద్రోహం కేసు ఎదుర్కొం టూ జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యల విడుదల కోసం ఉద్యమిస్తానని కన్హయ్య చెప్పారు. అదే కేసుకు సంబంధించి కన్హయ్యకు ఇటీవలే ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆదర్శ్ అరెస్ట్.. కన్హయ్యను చంపినోళ్లకు రూ.11 లక్షలు రివార్డు ఇస్తామంటూ పోస్టర్లు అతికించిన పూర్వాంచల్ సేన అధ్యక్షుడు ఆదర్శ్ శర్మను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేశారు. కాగా.. ఆదర్శ్ బ్యాంకు ఖాతాలో రూ.150 మాత్రమే ఉన్నట్లు తెలిసింది. ఈ ముఖం బస్తర్ పోరుకు ప్రతిబింబం: సోనీ న్యూఢిల్లీ: ‘నా ఈ ముఖం బస్తర్‌లో జరుగుతున్న పోరుకు ప్రతిబింబం’ అని గతనెలలో ఛత్తీస్‌లో యాసిడ్ తరహా రసాయనంతో దాడికి గురైన ఆదివాసీ హక్కుల కార్యకర్త సోనీ సొరీ అన్నారు. జేన్యూ విద్యార్థులకు ఆమె సోమవారం సంఘీభావం ప్రకటించారు. వర్సిటీలో ప్రసంగిస్తూ.. ‘నాది, కన్హయ్యది ఒకే పరిస్థితి. ఇద్దరం తప్పుడు కేసులతో జైలుకు వెళ్లాం. నన్ను నక్సలైట్ల మద్దతుదారునని ఆరోపించారు’ అని సోని పేర్కొన్నారు. కస్టడీలో ఉండగా తనను పోలీసులు లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఆమె 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. -
సుప్రీం కోర్టే ఆదుకోవాలి!
రెండో మాట సర్దార్ పటేల్ మాత్రమే కాకుండా, ముసాయిదా రాజ్యాంగంలో కొందరు స్వార్థపరులు దొంగచాటుగా ‘దూర్చిన’ ఈ సెడిషన్ క్లాజును మితవాద వర్గానికి చెందిన కేఎం మున్షీ సహా, టీటీ కృష్ణమాచారి, సేఠ్ గోవిందదాస్ వంటి ఉద్దండులు కూడా వ్యతిరేకించారని మరచిపోరాదు. బ్రిటిష్ వాడి చేతి చలవగా ఎలాంటి మార్పులు లేకుండా భారత శిక్షాస్మృతిలో చేరిన సెడిషన్ మొదటి ముసాయిదా రాజ్యాంగంలో 13వ అధికరణ కింద వచ్చి చేరింది. కృష్ణమాచారి అసలు సెడిషన్ అన్న పదాన్నే వ్యతిరేకించాలని చెప్పారు. ‘భారత రిపబ్లిక్ రాజ్యాంగం అవతరించడానికి కొద్దిమాసాలకు ముందు ముసాయిదా మీద సుదీర్ఘంగా చర్చించిన నిర్ణయసభలో ‘‘రాజద్రోహం/ దేశద్రోహం’’ (సెడిషన్)క్లాజును చేర్చాలా, వద్దా అన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. ఎందుకంటే, భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేసే క్రమంలో ఈ సెడిషన్ ఒక ఆధారం కాబట్టి అది రాజ్యాంగ నిర్ణయ సభలోని కొందరు సభ్యుల హేళనకూ, అపహాస్యానికీ గురికావలసి వచ్చింది. ఫలితంగా సర్దార్ వల్లభ్ భాయి పటేల్ ముసాయిదా నుంచి సెడిషన్ క్లాజును తొలగించాలని ఆ మరుసటి రోజునే ముసాయిదాతో నిబంధన చేర్చారు.’ కె. వెంకటరమణన్, 28-2-2016 (ప్రముఖ విశ్లేషకుడు) ‘వయసు పెరిగినా బుర్ర పెరగనందువల్ల’ (ప్రధాని నరేంద్ర మోదీ మాటలలోనే) వారి వారి అవసరాలకు తగినట్టుగా స్వతంత్ర భారత పాలకులంతా స్వప్రయోజనాల కోసం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూనే ఉన్నారు. కొందరు ఎమర్జెన్సీని రుద్ది అధికారాన్ని కాపాడుకున్నారు. మరి కొందరు పాలనా నిర్వహణలో తమ వైఫల్యాలను వేలెత్తి చూపినందుకు నేరుగా భారత శిక్షాస్మృతిలోని సెడిషన్ క్లాజునే ప్రయోగిస్తున్నారు. కాలం చెల్లిన బ్రిటిష్ వలస పాలన అవశేషంగా దేశ రాజకీయాలు అందిపుచ్చుకున్న సెడిషన్ క్లాజు దుమ్ము దులిపి దేశ యువత గొంతు నులిమివేయడానికి సాహసించారు. ఏ వల్లభ్‌భాయి పటేల్, ఏ సెడిషన్ క్లాజును నిరసించవలసి వచ్చిందో; అలాంటి పటేల్‌కు తామే వారసులమని చెప్పుకుంటూ, 200 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి చూపిన ఉత్సాహం ఆ దుర్మార్గపు క్లాజును చట్టం నుంచి తొలగించడం గురించి చూపలేకపోయారు. సెడిషన్ అన్న పదాన్నే ఈసడించారు సర్దార్ పటేల్ మాత్రమే కాకుండా, ముసాయిదా రాజ్యాంగంలో కొందరు స్వార్థపరులు దొంగచాటుగా ‘దూర్చిన’ సెడిషన్ క్లాజును మితవాద వర్గానికి చెందిన కేఎం మున్షీ సహా, టీటీ కృష్ణమాచారి, సేఠ్ గోవిందదాస్ వంటి ఉద్దండులు కూడా వ్యతిరేకించారని మరచిపోరాదు. బ్రిటిష్ వాడి చేతి చలవగా ఎలాంటి మార్పులు లేకుండా భారత శిక్షాస్మృతిలో చేరిన సెడిషన్ మొదటి ముసాయిదా రాజ్యాంగంలో 13వ అధికరణ కింద వచ్చి చేరింది. ఈ అధికరణ తరువాత తుది రాజ్యాంగ ప్రతిలో భావ ప్రకటనా స్వేచ్ఛ సహా స్వతంత్ర భారత పౌరుడికి హామీ ఇచ్చిన సప్త స్వాతంత్య్రాలను (ఉపన్యాస, భావ ప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత సమావేశాలు, యూనియన్లు/సహకార సంఘాలు ఏర్పరచుకునే స్వేచ్ఛ, దేశమంతటా తిరిగే హక్కు, దేశంలో ఏ ప్రాంతంలో అయినా నివసించే హక్కు, నచ్చిన వృత్తినీ, వ్యాపకాన్ని ఎంచుకునే స్వేచ్ఛ) ఈ ఒక్క సెడిషన్ క్లాజు కింద పాలకులు తొక్కిపడవేయవచ్చు. లేదా యుద్ధకాలానికి వర్తింప చేయవలసిన లేదంటే అంతరంగిక కల్లోలాలకు వర్తింప చేయవలసిన ఎమర్జెన్సీ ప్రకటన కింద కూడా కాల రాయవచ్చు. ఇందుకు పాలకులు చెప్పే కారణాలు ఏమైనా ఆ మిష కింద, తమను ఎన్నుకున్న పాపానికి పౌర హక్కులను స్తంభింప చేయవచ్చు. స్వాతంత్య్రానికి ముందు లోకమాన్య తిలక్, గాంధీజీలకి జరిగిన అవమానాలు, అరెస్టులు, సెడిషన్ కేసులు ఎలాగో; నవతరం యువకులకు, రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరించే ఉద్యమకారులకు అలాంటి అవమానాలు, అరెస్టులు, సెడిషన్లు తప్పడం లేదు. పేద, బడుగు, మధ్య తరగతి వర్గాల సమస్యలు పరిష్కారం అయ్యే దాకా ఈ ప్రశ్న హక్కుకు మరణం గానీ, మరణశిక్ష గానీ వర్తించదు. ప్రభుత్వాలు (ఏ బ్రాండ్ అయినా) వాటి ‘‘నిర్ణయాలను, చర్యలను పౌరులు ప్రశ్నించే, విమర్శించే హక్కును నిషేధించజాలవు’’(ప్రొ. మనూభాయి షా వర్సెస్ ఎల్ఐసి కేసులో సుప్రీంకోర్టు తీర్పు, 1993). జేఎన్‌యూ విద్యార్థి కన్హయ్యకుమార్ ప్రసంగం అనంతర పరిణామాలు, హైదరాబాద్ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన పాలక మండలి ప్రవర్తన, కేంద్ర రాష్ట్రాల వైఖరి.. పైన ఉదహరించిన సుప్రీంకోర్టు తీర్పునకు, రాజ్యాంగ నిబంధనలకు పచ్చి వ్యతిరేకం కాదా? భారత శిక్షాస్మృతిలోని సెడిషన్ క్లాజు (124-ఎ) సెక్షన్‌ను ముసాయిదా రాజ్యాంగం మీద జరిగిన చర్చలో ప్రసంగించి నప్పుడు మున్షీ, ‘పచ్చి దుర్మార్గపు సెక్షన్’గా వర్ణించారు. ‘ఈ దుర్మార్గపు సెక్షన్‌ను ఎలా వాడకంలో పెట్టారో ఒక కేసు నాకు గుర్తుంది. ఒక జిల్లా మేజిస్ట్రేట్‌ను ఒకరు విమర్శిస్తే, సెడిషన్ 124-ఎ సెక్షన్ కింద శిక్షించమని ప్రభుత్వం ఆదేశించింది. ఆ సెక్షన్ ఎలా దుర్వినియోగం అవుతున్నదో గ్రహించినందున అప్పటి నుంచి ప్రజాభిప్రాయం కూడా మారిపోయింది. ఇప్పుడు మనకు ప్రజాస్వామ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సెడిషన్ పదమే ఈ సభలోని సభ్యులకే కాదు, ప్రపంచంలోని న్యాయస్థానాలన్నింటా అనుమానాలు రేకెత్తించింది. ఇంగ్లండ్‌లో 150 ఏళ్ల నాడు వెలుగు చూసిన ఈ చట్టం మేరకు ఒక సభ పెట్టినా లేదా ఒక ఉరేగింపు తలపెట్టినా దాన్ని రాజద్రోహంగా పరిగణించారు. ఒక అభిప్రాయాన్ని ప్రకటించినా సెడిషన్గానే పరిగణించారు. కనుకనే మన ముసాయిదా రాజ్యాంగంలోని సెడిషన్ పదాన్నే తొలగించడం జరిగింది. వాస్తవానికి ప్రభుత్వ నిర్ణయాలను, చర్యలను విమర్శించడం ప్రజాస్వామ్య సారం. అందుకే ముసాయిదా క్లాజుకు సవరణను ప్రతిపాదించవలసి వచ్చింది. అంతేగానీ గాయపడిన ప్రభుత్వాల అహంభావానికీ, స్వాతిశయానికీ, ఆడంబర ప్రదర్శనకు చేదోడు కావడం సెడిషన్ ఉద్దేశం కాదని నీహరేందు దత్ మజుందార్ వర్సెస్ బ్రిటిష్ చక్రవర్తి కేసులో ఫెడరల్ కోర్టు అభిప్రాయపడింది. కనుకనే సవరణ ద్వారా రాజ్యాంగ అధికరణ నుంచి సెడిషన్‌ను తొలగించాలని కోరాం. అలాకాని పక్షంలో పాత రోజుల మాదిరిగానే మనమూ సెడిషన్‌ను కొనసాగించదలిచామన్న తప్పుడు అభిప్రాయం జనంలో కలిగించిన వారమవుతాం’ అని మున్షీ పేర్కొన్నారు (చూ. కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డిబేట్స్ అధికార నివేదిక, వాల్యూం-7 బుక్-2). ఇక టీటీ కృష్ణమాచారి అసలు సెడిషన్ అన్న పదాన్ని వ్యతిరేకించాలని ఈసడింపుతో చెప్పారు. ప్రముఖ భారత రాజ్యాంగ భాష్యకారుడు హెచ్. ఎం. సీరవాయి పలు కేసులను విశ్లేషించారు. కొన్ని సందర్భాలలో (అతి అసాధారణ కేసులలో) మినహా సుప్రీంకోర్టు కూడా సెడిషన్‌ను సమర్థించ లేదు. అసలు ఈ విషయం మీద రోజులు తరబడి చర్చించవలసిన అవసరం రావడం ద్వారానే భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు న్యాయవ్యవస్థ తీర్మానించుకోవాలి. కేదార్‌నాథ్‌సింగ్ వర్సెస్ బిహార్ స్టేట్ (1962), గోడ్సే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1971) ఇందుకు ఉదాహరణలు. కోర్టులూ ఇందుకు వ్యతిరేకమే రాజ్యాంగ నిర్ణయ సభలో సెడిషన్ మీద అంత చర్చ జరిగిన తరువాత కూడా, పటే ల్ వంటి హేమాహేమీలు దీనిని తొలగిస్తూ నిబంధన చేర్చిన తరువాత కూడా ఇది 2016లో సైతం పాలకులకు వాటంగా అక్కరకు వచ్చిందంటే మోదీ అన్నట్టు, ‘వయసు పెరిగినా బుర్ర పెరగలేదనే’ తీర్మానించుకోక తప్పదు. చివరికి రామ్నందన్ వర్సెస్ స్టేట్ కేసులో కోర్టు (1958) ఐపీసీ 124-ఎ సెక్షన్‌ను కొట్టిపారేసిందని మరచిపోరాదు. వివిధ కోర్టులలో, డివిజన్ బెంచ్‌లలో ఈ సెడిషన్ మీద ఇంతకాలం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నందుననే పాలకులకు ఎత్తుబిడ్డ అయింది. విద్యార్థులు ‘తిరుగుబాటు’కు బాహాటంగా పిలుపిచ్చిన ఉదాహరణలు చివరికి వీడియోలలో కూడా, ఫోరెన్సిక్ నిపుణులకు సహితం దొరకనందుకే సెడిషన్ పేరిట ప్రభుత్వం చేసిన ఆరోపణలు వీగిపోబట్టే విద్యార్థులు బెయిల్ మీద విడుదల కాక తప్పలేదు. సెడిషన్ కింద బెయిళ్లు ఉండవు. చివరికి తప్పుడు సెడిషన్ బనాయింపుల నేపథ్యంలో కలాలను కట్టడి చేసే దుష్ట సంప్రదాయానికి రెండు తెలుగు రాష్ట్రాలలో తెర లేపే ప్రయత్నం కూడా జరుగుతున్నది. ఇలాంటి వికృత చేష్టలను కనిపెడుతున్న సుప్రీంకోర్టు, కొన్ని హైకోర్టులకు కూడా ధర్మాసన చైతన్యాన్ని కాపాడుకోవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కన్హయ్యకుమార్ కేసు విచారణలో పాటియాలా (ఢిల్లీ)కోర్టు ఆవరణలో కొందరు లాయర్లు ప్రదర్శించిన అమానుష ప్రవర్తన ఇందుకు తొలి గుర్తింపు కావచ్చు. ‘కొందరు సంఘ వ్యతిరేక శక్తులు లాయర్లుగా నమోదు కాకుండా నిరోధించేందుకు, కోర్టులలో కొట్లాటలకు, ఆందోళనలకు, రాళ్లు రువ్వుకోవడానికి, తిట్ల పురాణాలు విప్పడానికి వీలు కాకుండా ప్రక్షాళన చేయడానికి ’ ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని నెలకొల్పాలని నిర్ణయించవలసి వచ్చిందని మరువరాదు. ఇస్లామిక్ ఉగ్రవాదులు, హిందూత్వ ఉగ్రవాదులు సమాజాలని విభజించేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో సుప్రీం నిర్ణయాన్ని అంతా హర్షించాలి. కన్హయ్యకుమార్ విడుదలైన మరునాడే అతడిని హత్య చేయాలంటూ వచ్చిన ప్రకటనలను వ్యవస్థకు తీవ్ర హెచ్చరికగానే భావించాలి. అందుకు రివార్డులు ప్రకటించడాన్నే సెడిషన్గా భావించాలి. అసలా చట్టాన్నే సుప్రీంకోర్టు కొట్టివేయాలి. తిలక్ విచారణలో బ్రిటిష్ న్యాయమూర్తి స్ట్రాచీ ఆడిన సెడిషన్ నాటకం వేరు. కానీ నేడు సుప్రీం కోర్టు ధర్మాసన చైతన్య స్ఫూర్తితో సెడిషన్ చట్టానికి భరతవాక్యం పలకాలి. రాజ్యాంగ విరుద్ధంగా సమాజ సంపదను పాలక వర్గాలు ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టడం ఈ పరిస్థితికి కారణం. ఇలాంటి సమయంలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటనలు స్వాతంత్య్ర ఫలాల పరిరక్షణకు తగినంత శక్తిని పుంజుకోకపోగా, చీలికల వైపు ప్రయాణించడం మరో కారణం. ఇప్పటికైనా వామపక్షాలు చీలికలకు స్వస్తి చెప్పి ముందుకు సాగితే సెక్యులర్ సమాజానికి శాశ్వత రక్షకులు కాగలుగుతారు. ప్రధాన పక్షాలు కమ్యూనిస్టు, మార్క్సిస్టు పార్టీలు ఏకం కావాలి. ఇది సాధ్యం కానంత వరకూ ఇస్లామిక్, హిందూత్వ ఉగ్రవాదుల మధ్య భారత్ నలిగిపోక తప్పదు. సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్ abkprasad2006@yahoo.co.in -
నా సొంత కథను రాస్తున్నా..
'నేను ఇప్పుడు నా సొంత కథను రాస్తున్నా. జైలులోనే రాయడం ప్రారంభించా. నిజానికి నేను భారత్ నుంచి స్వాతంత్య్రాన్ని కోరుకోవట్లేదు. నా దేశంలో స్వేచ్ఛ కావాలంటున్నా. వ్యక్తిగతంగా ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఎన్ని భేదాభిప్రాయాలున్నా.. 'సత్యమేవ జయతే' అని ట్వీట్ చేసిన ప్రధానితో ఏకీభవిస్తా. ఏబీవీపీని శత్రువుగా కాకుండా ప్రతిపక్షంగానే చూస్తా. భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థలను నేను గౌరవిస్తాను. దేశానికి వ్యతిరేకంగా ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు. నిజాలు నెమ్మదిగా వెలుగులోకి వస్తాయి. సత్యానిదే విజయమన్న నమ్మకం ఉంది' అంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు జేఎన్ యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్. గురువారం సాయంత్రం జైలు నుంచి విడుదలైన కన్హయ్యకు భారీగా వచ్చిన మద్దతుదారులు స్వాగతంపలికారు. అక్కడి నుంచి నేరుగా జేఎన్ యూకు చేరకున్న అతనికి తోటి విద్యార్థులు, అధ్యాపకులు నీరాజనాలు పట్టారు. గంగా ధాబా నుంచి అడ్మినిస్ట్రేషన్ భవనం వరకూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏర్పాటుచేసిన వేదికపై కన్హయ్య కుమార్ మాట్లాడుతూ తన సొంత కథను రాస్తున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరితీతను నిరసిస్తూ కార్యక్రమం చేపట్టిన కారణంగా ఫిబ్రవరి 12న రాజద్రోహం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉంటోన్న కన్హయ్యకు ఢిల్లీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసిన సంగతి తెలిసిందే. కన్హయ్య గ్రామంలో సంబరాలు కన్హయ్య విడుదలతో ఆయన స్వగ్రామంలో కుటుంబీకులు, గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. బీహార్‌లోని బిహత్ గ్రామంలో సోదరులు తల్లిదండ్రులకు రంగులు పూశారు. గ్రామస్తులు 'కన్నయ్య అరెస్టైన తర్వాత మొదటిసారి ఆందోళన నుంచి ఉపశమనం దొరికింది' అంటూ తండ్రి జైశంకర్ సింగ్(61) సంతోషంగా చెప్పారు. వెంటనే గ్రామానికి రావాలని కుమారుడ్ని కోరలేదని, జేఎన్‌యూకి వెళ్లి మద్దతుగా నిలిచిన విద్యార్థులతో గడుపుతాడని సింగ్ తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఢిల్లీ అంతటా పోలీసు భద్రతను పటిష్టం చేశారు. జేఎన్‌యూ, ఢిల్లీ వర్సిటీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కోరారు. విడుదల తర్వాత ఎఐఎస్ఎఫ్, ఎఐఎస్ఏ, రాజకీయ పార్టీలతో కలిసి కన్హయ్య జంతర్‌మంతర్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో పర్యటించవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి. కన్హయ్యకు ఆప్ సర్కారు క్లీన్చిట్ జేఎన్‌యూ ఘటనలో కన్హయ్య ఏ తప్పు చేయలేదని ఢి ల్లీ ప్రభుత్వం నియమించిన విచారణ సంఘం క్లీన్ చిట్ ఇచ్చింది. ఎఫ్ఐఆర్లో నమోదుచేసిన 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలపై పోలీసులకు అనుమానాలున్నాయని తెలిపింది. కన్హయ్యకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు, వీడియోలు దొరకలేదని నివేదికలో పేర్కొంది. కన్నయ్య దేశ వ్యతిరేక నినాదాలు చేస్తుండగా చూశామంటోన్న వ్యక్తులు, వారి పాత్రపై విచారణ నిర్వహించాలని అభిప్రాయపడింది. కొన్ని వీడియోల్లో ఉమర్ ఖాలిద్ కనిపించాడని, అతని పాత్రపై మరింత విచారణ జరగాలని న్యూఢిల్లీ జిల్లా మెజిస్ట్రేట్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ తెలిపింది. ఉమర్, అనిర్బన్, అశుతోష్ లు అఫ్జల్‌గురు ఉరికి వ్యతిరేకంగా, కశ్మీర్‌పై నినాదాలు చేసినట్లు జేఎన్‌యూ భద్రతా సిబ్బంది చెప్పారంటూ నివేదికలో వెల్లడించారు. -
మాజీ సీఎం సలహాదారుపై దేశద్రోహం కేసు
న్యూఢిల్లీ: హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా సలహాదారు ప్రొఫెషర్ వీరేంద్ర సింగ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. జాట్ల ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని, హింస పెరిగేలా రెచ్చగొట్టాలంటూ ఇటీవల జాట్ ఉద్యమ నాయకుడితో వీరేంద్ర సింగ్ మాట్లాడిన ఫోన్ సంభాషణలు వెలుగు చూశాయి. అయితే ఫోన్ సంభాషణల్లో ఉన్నది తన గొంతేనని, తన మాటలను కత్తిరించి వేరే అర్థం వచ్చేలా రికార్డ్ చేశారని వీరేంద్ర సింగ్ చెప్పారు. ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్ల కోసం జాట్లు చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హింస వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరేంద్ర సింగ్ ఫోన్ సంభాషణలు బయటికి రావడం కలకలం రేపింది. హరియాణా పోలీసులు ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షించాల్సి వుంది. ఈ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ రాజేంద్ర సింగ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. -
మాటలలో తప్ప చేతలలో కానరాని దేశప్రేమ
ప్రపంచ మంతా తిరిగి చూసినా భారతీయులు తప్ప మరెవరూ ఉయోగించని కొన్ని పదాలు ఉన్నట్టు నేను గమనించాను. ‘నాన్-వెజిటేరియన్’ (శాకాహా రులు కానివారు) అనే పదం ఒక్క అగ్రకులాల, మధ్యతరగతి భారతీయులు మాత్రమే వాడే పదం. మరే ఇతర దేశస్తులకూ ‘నాన్-వెజ్’ అనే పదం తెలియనే తెలియదు. ఒక్క భారత విమానాల్లో తప్ప మరే విమానాల సిబ్బంది ‘వెజ్’ ఆహారం కావాలో, ‘నాన్-వెజ్’ ఆహారం కావాలో ఎంచుకోమని అడగరు. మిగతావారంతా ‘మాంసం’, లేదా ‘చేప’, లేదా ‘చికెన్’ మాత్రమే ఉన్నాయంటారు. అవే ప్రామాణిక భోజన పదార్థాలు. శాకాహారం కావాలంటే ప్రత్యేకంగా కోరవలసి ఉంటుంది. అలాగే, ‘జాతి వ్యతిరేక’ అనే పదం యూరప్ లేదా అమెరికాలో ఎక్కడా వినిపించదు. ఆ పదానికి వ్యతిరేకార్థమిచ్చే ‘జాతీయవాదం’ అనే పదానికి వారి భాషల్లోని అర్థం మంచిది కాకపోవడమే అందుకు కారణం. యూరప్‌లో రెండు గొప్ప యుద్ధాలకు కారణమైనది జాతీయవాదమే. జాతీయవాద స్వభావం కలిగినవారుగా గుర్తింపు పొందడమంటే ప్రతికూల ముద్రను వేయించు కోవడంగానే అక్కడ చూస్తారు. జాతీయవాదం అనే పదాన్ని మనం ఎంతో సులువుగా ప్రయోగించేస్తుంటాం. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలా ఆ పదాన్ని పార్టీ పేర్లలోనూ పెట్టుకుంటారు. కానీ ఏ ఒక్క యూరోపియన్ రాజకీయ పార్టీ జాతీయవాదమనే పదాన్ని ఉపయోగిస్తుందని అనుకోలేను. హిందీ, గుజరాతీలలో జాతీయవాదానికి సమానార్థక పదం ‘రాష్ట్రవాది’. అది కాస్త సౌకర్యవంతమైన పదం. ‘రాష్ట్ర’ అనేది వ్యక్తిలో కోరుకోదగిన పదం. అందుకు భిన్నంగా ‘జాతి’ అనే పదం తటస్థమైనది. ‘జాతీయవాదం’కు ఉర్దూలోనైతే కచ్చితమైన సమానార్థకాన్నిచ్చే ‘కవామ్ పరస్తి’ అనే పదం ఉంది. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు డిక్షనరీ జాతీయవాదాన్ని ‘ఇతర దేశాలకన్నా ఆధిక్యతను వ్యక్తంచేసే తీవ్ర దేశభక్తి రూపం’గా నిర్వచించింది. మరియం-వెబ్‌స్టర్ డిక్షనరీ దాన్ని ‘ఒక జాతిని మిగతా వారందరి కంటే ఎక్కువ చేసి మాట్లాడుతూ, మిగతా జాతుల, జాతీయాతీత శక్తుల సంస్కృతికి, ప్రయోజనాలకు విరుద్ధంగా తన సంస్కృతిని, ప్రయోజనాలను పెంపొందింపజేసేలా ప్రథమ ప్రాధాన్యా న్నిచ్చేట్టు చేసే’ గుణం. ఈ నిర్వచనం, భారత జాతీయవాదాన్ని కచ్చితంగా అభివర్ణిస్తుందని అనిపిస్తుంది. జాతీయవాద రక్షణ కోసం భారతీయులు ఎంతగా ఉద్వేగ భరితులవుతారో గత కొన్ని రోజులుగా మనం చూశాం. భరతమాత పట్ల మన దృష్టితో విభేదించే నినాదాల పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపాం. హింసకు దారితీయనంత వరకు ఈ అభ్యంతరంతో నాకొచ్చిన ఇబ్బందేమీ లేదు. దురదృష్టవశాత్తూ, ఈసారి కూడా చాలా సార్లు జరిగినట్టే అది హింసకు దారి తీయడం నన్ను ఆశ్చర్యపరచలేదు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వ్యవహారంపై రెండు రోజులు వరుసగా న్యాయవాదులు కోర్టులో ప్రవర్తించిన తీరు మన సంస్కృతికి పూర్తిగా అనుగుణంగానే ఉంది. అయితే నేను మరో విషయం గురించి రాయదల్చుకున్నాను. కాబట్టి ‘జాతీయవాదం’కే తిరిగి వస్తే, భారతీయులు ఇంకా ఏ ఏ ఇతర రూపాల్లో దాన్ని ప్రదర్శిస్తుంటారు? టెలివిజన్ చర్చలను బట్టి చూస్తే, నినాదాలను వ్యతిరేకించడంలోనూ, దేశ ఐక్యత, సమగ్రతల పరిరక్షణ విషయంలోనూ మన మధ్యతరగతిలోని అత్యధికులు జాతీయవాదులనేది స్పష్టమే. అయినాగానీ కేవలం 3 శాతం భారతీయులు మాత్రమే ఆదాయం పన్ను చెల్లిస్తారు. ప్రత్యేకించి ఈ విషయంలో ‘జాతీయవాదం’ బలంగా కనబడదు. అలాగే, పన్నులు చెల్లించేవారిలో అధికులు జీతాలు పుచ్చుకునే వ్యక్తులే. వారి పన్నును యాజమాన్యమే జీతంలోంచి మినహాయించేస్తుంది. తద్వారా పన్నుల దొంగతనానికి పాల్పడే అవకాశం వారికి లేకుండా చేస్తారు. ఈ వేతన మధ్యతరగతి వారు సైతం తమ ‘సాలరీ బ్రేక్-అప్’తో (జీతాన్ని వివిధ విభాగాలుగా చూపడం) పలు జిత్తులను ప్రయోగిస్తుంటారు. కానీ అ విషయాలను చర్చించే సందర్భం కాదిది. టీడీఎస్ అనేది కూడా భారతీయులకే ప్రత్యేకమైన పదబంధం. అది మధ్యతరగతి భారతీయులకే తెలుసు. ‘ఆదాయపు పన్నును మూలం నుంచే మినహాయించుకోవడం’ అని దానర్థం. నాకు తెలిసి మరే దేశంలోనూ ఇలాంటిది ఉన్నట్టు ఎరుగను. పౌరులు కొంత మేరకు దొంగతనం చేస్తారని ప్రభుత్వం ముందస్తుగా ఊహించి, ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి ముందే ఆదాయం పన్నును మినహాయించేసుకుంటుంది. అలా మినహాయించుకున్న డబ్బులో మీకు వాపసు ఇవ్వాల్సిన దాన్ని రాబట్టుకో వడం సులువేమీ కాదు. అయితే అది కూడా ఇక్కడ చర్చనీయాంశం కాదు. నినాదాలు చేసిన వారిపై ఆగ్రహంగా వ్యక్తమైన ఉద్వేగభరితమైన మన దేశ ప్రేమ, ఇతర విధాలుగా దేశం పట్ల శ్రద్ధ చూపడానికి విస్తరించదు. ఈ భూమండలం మీదే మనం అత్యంత మురికి జీవులం. మన పరమ పవిత్ర నది గంగను సుప్రీం కోర్టు ఆదేశిస్తే మాత్రమే శుభ్రం చేయగలం, అది కూడా ఎంతో కష్టంతో. పౌరులు స్వచ్ఛందంగా దేశం మీద తమ ప్రేమను చూపరు. దేశ చట్టాలను అలవోకగా ఉల్లంఘించడం కూడా భారతీయుల ప్రత్యేకతే. ‘చట్ట విరుద్ధ నిర్మాణం’, ‘దురాక్రమణ’ అనే పదాలే అందుకు ఉదాహరణ. 30 ఏళ్లుగా అమెరికా, యూరప్‌లకు ప్రయాణాలు సాగిస్తున్నాను. అయినాగానీ అలాంటి పనులు చేసే వ్యక్తులెవరూ నాకు తారసపడలేదు. ఇక్కడయితే ఆ పనులు చేయడం నినాదాల మీద అగ్రహం వెలిబుచ్చడమంత సర్వ సాధారణం. చూడబోతే మన జాతీయవాదం పరిమితమైనదిలా కనిపిస్తోంది. జేఎన్‌యూ సమస్యకు ప్రభుత్వ ప్రతిస్పందనగా మన విశ్వవిద్యాలయాలన్నీ జాతీయ జెండాను ఎగురవేయాలని శాసించారు. ఇదేమైనా సరైన ప్రభావాన్ని కలుగజేస్తుందా? భరతమాత పట్ల మన భావోద్వేగం సుదృఢమైనది. అయితే అది మన నిజ ఆచరణలో, ప్రవర్తనలో వ్యక్తం కావడం లేదు. మన సెంటి మెంట్లలోనే వ్యక్తమౌతోంది. ఇతరుల చర్యలకు మన ప్రతిచర్యగా మాత్రమే ఆ భావన ఎంత బలమైనదో తెలుస్తుందే తప్ప మన సొంత చర్యల ద్వారా మాత్రం కాదు. మన భారతీయుల విషయంలో జాతీయవాదానికి ఇంగ్లిషు నిర్వచనమే చాలా కచ్చితమైనదని అనుకుంటాను. ‘ఇతరులపై మన ఆధిక్యత’ గురించే ప్రధానంగా మనకు పట్టింపు ఎక్కువ. ‘ఇతరుల సంస్కృతికి, ప్రయోజనాలకు విరుద్ధంగా మన సంస్కృతిని, ప్రయోజనాలను పెంపొందింపజేయడా’నికే మన ప్రాధాన్యం. దేశం కోసం ఏమైనా చేయడం ద్వారానూ, త్యాగాల రూపంలోనూ వ్యక్తమయ్యే నిజమైన దేశ ప్రేమ మనలో లోపించిందని అనిపిస్తుంది. అరుపులు, ఆగ్రహం మాత్రమే మనం ప్రదర్శించేది. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
‘జేఎన్‌యూ’పై నిరసనల హోరు
ఢిల్లీలో భారీ ర్యాలీ; వేలాదిగా పాల్గొన్న విద్యార్థులు, జర్నలిస్టులు, పౌర సమాజం న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదం తీవ్రమవుతోంది. జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య అరెస్ట్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా ఢిల్లీసహా పలు నగరాలు, పట్టణాల్లో గురువారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. కన్హయ్యకుమార్ విచారణ సందర్భంగా ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టులో నెలకొన్న పరిస్థితి అసాధారణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అక్కడి హింసాత్మక ఘటనలపై తమ నివేదికను సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ల బృందం గురువారం జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనానికి అందించింది. పటియాలా కోర్టు ఘటనలో పోలీసుల వ్యవహార తీరుపై ఆ బృందంలోని సభ్యుడు, సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ అనుమానం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడినవారితో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తిహార్ జైలులో తన ప్రాణాలకు ముప్పుందని బెయిల్ అభ్యర్థనతో కన్హయ్య సుప్రీంకోర్టు తలుపుతట్టారు. దానిపై నేడు విచారణ జరగనుంది. హెచ్‌సీయూ టు జేఎన్‌యూ రాజద్రోహం కేసులో అరెస్టైన కన్హయ్యను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వేలాదిగా విద్యార్థులు, జర్నలిస్టులు, అధ్యాపకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, పౌర సమాజం సభ్యులు.. ఢిల్లీలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ‘లాంగ్ లివ్ జేఎన్‌యూ’, ‘కన్హయ్య.. వి ఆర్ విత్ యూ’, ‘హెచ్‌సీయూ టు జేఎన్‌యూ’ అని నినాదాలు చేస్తూ వేలాదిగా నిరసనకారులు మండీ హౌజ్ సర్కిల్ నుంచి జంతర్‌మంతర్ వరకు కదం తొక్కారు. జేఎన్‌యూలో పోలీస్ యాక్షన్‌ను నిరసిస్తూ, మోదీ సర్కారును విమర్శిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రముఖ జర్నలిస్ట్ సాయినాథ్, ఎన్ఎస్డీ మాజీ డెరైక్టర్ అనురాధా కపూర్ సహా జేఎన్‌యూ, ఢిల్లీ వర్సిటీ, అంబేడ్కర్ వర్సిటీల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, కళాకారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హైదరాబాద్ సహా పలు నగరాలు, పట్టణాల్లో పలు వర్సిటీల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ప్రతిగా ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో ఎబీవీపీ కార్యకర్తలు జాతివ్యతిరేకులను శిక్షించాలంటూ ప్రదర్శనలు చేపట్టారు. చెన్నైలో కన్హయ్యకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన తమిళ జానపద గాయకుడు కోవన్ సహా 57 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హెచ్‌సీయూలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి, నిరసన ప్రదర్శన నిర్వహించారు. పట్నాలో బీజేపీ కార్యకర్తలకు, సీపీఐ విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్, ఆర్జేడీ యువజన విభాగం కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. ‘పటియాలా’ హింస అసాధారణం పటియాలా హౌజ్ కోర్టులో బుధవారం చోటు చేసుకున్న హింస అసాధారణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అక్కడ శాంతిభద్రతల పరిస్థితిపై తాము దృష్టి పెట్టామంది. పటియాలా కోర్టులో బుధవారం లాయర్ల రౌడీయిజంపై తాము రూపొందించిన నివేదికను సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ల కమిటీ సీల్డ్ కవర్లో జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ ఏఎం సప్రేల ధర్మాసనానికి అందించింది. అయితే, సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, దుష్యంత్ దవే, హరేన్ రావల్, ప్రశాంత్ భూషణ్‌లు ఆ నివేదికపై సంతకం చేయగా..నివేదికను చదివిన తరువాతే సంతకం చేస్తానని కమిటీలో సభ్యుడైన ఢిల్లీ పోలీస్ తరఫు న్యాయవాది అజిత్ కే సిన్హా చెప్పారు. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కన్హయ్య కేసును కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించాలన్న పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరపనుంది. ‘తమ కళ్లముందే దాడి చేసిన వ్యక్తి కనిపిస్తుంటే అరెస్ట్ చేయకుండా వదిలేయడం కుమ్మక్కు కావడం కాదా?’ అని రాజీవ్ ధావన్ మీడియాతో అన్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా తిహార్ జైళ్లో ఉన్న కన్హయ్య కుమార్. కాగా, హింసకు పాల్పడిన లాయర్లను గుర్తించి, వారి లెసైన్సులను రద్దు చేస్తామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. బీజేపీ ఎమ్మెల్యే శర్మ అరెస్ట్.. పటియాలా కోర్టులో హింసలో పాలుపంచుకున్న బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. 8 గంటల పాటు ప్రశ్నించి, తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. కోర్టులో దాడులకు దిగిన విక్రమ్ సింగ్ చౌహాన్ సహా ముగ్గురు లాయర్లకు పోలీసులు సమన్లు జారీ చేసినప్పటికీ.. వారు గురువారం వరకు పోలీసుల ముందు హాజరుకాలేదు. కాగా, అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా జేఎన్‌యూలో జరిగిన కార్యక్రమానికి సంబంధించి ఒక హిందీ వార్తాచానెల్ ప్రసారం చేసిన కథనం ఆధారంగానే పోలీసులు కన్హయ్యపై కేసు నమోదు చేశారని సమాచారం. రౌడీ లాయర్‌కు సన్మానం సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. పటియాలా హౌజ్ కోర్టులో విచ్చలవిడి దాడులకు పాల్పడి, స్వేచ్ఛగా తిరుగుతున్న న్యాయవాది విక్రమ్ సింగ్ చౌహాన్‌ను ఢిల్లీ జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘం గురువారం సన్మానించింది. విక్రమ్ సింగ్ చౌహాన్ ప్రతినిధిగా ఉన్న కర్కర్దూమా కోర్టు బార్ అసోసియేషన్ ఆయనను పూలమాలతో సత్కరించింది. పటియాలా కోర్టులో హింసకు పాల్పడింది తమవారు కాదని, నల్ల కోట్లు వేసుకుని వచ్చిన బయటివ్యక్తులని పేర్కొంది. కొడుకుపై కక్షగట్టారు బిహార్‌లోని బిహత్ గ్రామంలో నివసిస్తున్న కన్హయ్య కుమార్ కుటుంబసభ్యులకు స్థానిక పోలీసులు భద్రత కల్పించారు. అయితే, తమకు కల్పించిన భద్రతను కన్హయ్య కుమార్ తండ్రి జైశంకర్ సింగ్ తిరస్కరించారు. జేఎన్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ అభ్యర్థిని ఓడించినందుకే తన కుమారుడిపై బీజేపీ, ఆరెస్సెస్‌లు కక్షకట్టాయని ఆయన ఆరోపించారు. కన్హయ్యకుమార్ టైస్ట్ కాదని తేలుతుందని, అయితే ఈ లోపే కస్టడీలో ఉన్న తన కొడుకు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని కన్హయ్య తల్లి మీనాదేవి ప్రశ్నించారు. కన్హయ్యకు చరిత్రకారుల మద్దతు న్యూఢిల్లీ: జేఎన్‌యూలో జరుగుతున్న ఆందోళనలకు చరిత్రకారులు, రచయితలు, కళాకారులు మద్దతు ప్రకటించారు. వర్సిటీ విద్యార్థి నేత కన్హయ్యపై రాజద్రోహం కేసు పెట్టడం అన్యాయమని రోమిలా థాపర్, జీత్ థాయిల్ వంటి ప్రముఖులు విమర్శించారు. విద్యాసంస్థల్లో వివాదాలను చర్చ ల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. కన్హయ్య విడుదలకు డిమాండ్ చేస్తూ.. దాదాపు 9వేల మంది కళాకారులు, చరిత్రకారులు, రచయితలు ఓ పిటిషన్‌పై సంతకం చేశారు. మరోవైపు జేఎన్‌యూలో పోలీసు చర్యను ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జితోపాటు యూకేలోని 8 ప్రముఖ వర్సిటీలు ఖండించాయి. జేఎన్‌యూలో ర్యాలీకి పలువురు కన్హయ్య చిత్రం ఉన్న టీ-షర్టులను వేసుకుని వచ్చారు. అటు పటియాలా కోర్టులో ఘర్షణకు దిగిన విక్రమ్ సింగ్ చౌహాన్ అనే న్యాయవాదిని కొందరు లాయర్లు సన్మానించటాన్ని ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్టు బార్ అసోసియేషన్ ఖండించింది. కాగాయూట్యూబ్లో జర్మనీకి చెందిన జేఎన్‌యూ విద్యార్థి సిల్వీ గిటారు వాయిస్తూ.. ‘మమ్మల్ని ఎంతగా అణిచేయాలని చూస్తే.. మా గొంతులు అంతలా నినదిస్తాయి. విఆర్ జేఎన్‌యూ’ అని ఆలపించిన గీతం వైరల్‌లా విస్తరించింది. అటు, భారతదేశంలో విషం చిమ్ముతున్న లష్కర్ చీఫ్ హఫీజ్ తోపాటు లష్కరే, జమాత్-ఉద్-దవాకు సంబంధించిన ట్విటర్ అకౌంట్‌ను ఆపేయాలని నిఘా వర్గాలు.. ట్విటర్ ఇండియాను కోరనున్నాయి. -
కన్హయ్య కుమార్ ను రక్షించనున్న అసలు వీడియో
న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ దేశద్రోహానికి పాల్పడ్డారనడానికి ఇదిగో సాక్ష్యం అంటూ న్యూస్ ఎక్స్, ఇండియా న్యూస్ ఛానళ్లు బుధవారం ప్రసారం చేసిన వీడియోను ఉద్దేశపూర్వకంగా తమకు అనుకూలంగానే ఎడిట్ చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. ‘ఆజాది (స్వేచ్ఛ), లేకే రహెంగే ఆజాది’ కుమార్ అన్న పదాలను ఈ ఛానళ్లు వక్రీకరించాయని ఏబీపి న్యూస్ ఛానెల్ వెల్లడించి, అసలు వీడియోను ప్రసారం చేసింది. ‘ఆకలి నుంచి స్వేచ్ఛ (ఆజాది) కావాలి. సంఘ్వాది (ఆరెస్సెస్) నుంచి స్వేచ్ఛ కావాలి. భూస్వామం, పెట్టుబడిదారి విధానం, బ్రాహ్మణిజం, మనుయిజం నుంచి స్వేచ్ఛ కావాలి’ అని కన్హయ్య కుమార్ నినదించినట్లు అసలు వీడియోలో ఉంది. ఇప్పుడు ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. తొందరపడి ఎడిట్ చేసిన వీడియోను ప్రసారం చేసిన నెటిజన్లు కొందరు ఆ వీడియోను తొలగించడమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పారు. క్షమాపణ చెప్పిన వారిలో స్వరాజ్య కాలమిస్ట్ రూపా సుబ్రమణ్యం కూడా ఉన్నారు. దీనికి ఢిల్లీ పోలీసులు కన్హయ కుమార్‌కు క్షమాపణలు చెప్పాలని సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. ఇక కుమార్ పట్ల ఢిల్లీ పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తారని మరో సీనియర్ జర్నలిస్ట్ బర్ఖాదత్ అన్నారు. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం గురువారం సమర్పించిన నివేదికలో అసలు కన్హయ్య కుమార్ పేరే లేదని తెల్సింది. అఫ్జల్ గురు సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ కార్యకర్త ఉమర్ ఖలీద్, మరికొంత మంది సహచరులు కలిసి అఫ్జల్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 18 విశ్వ విద్యాలయాల్లో నిర్వహించాలని ప్లాన్ వేసినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలో పేర్కొన్నారని, కన్హయ్య కుమార్ పేరును మాట మాత్రంగా కూడా ఎక్కడ ప్రస్తావించలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
కన్హయ్య కుమార్‌పై 'దేశద్రోహం' ఎత్తివేత!
న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్పై మోపిన దేశద్రోహం అభియోగాలను ఎత్తివేసే అవకాశముందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తున్నది. ఆయనపై విధించిన దేశద్రోహం అభియోగాలకు మద్దతుగా ఇప్పటివరకు ఎలాంటి బలమైన ఆధారాలు లభించలేదని కేంద్ర హోంశాఖకు చెందిన వర్గాలు తెలిపాయి. మరోవైపు ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి కార్యాలయానికి జేఎన్‌యూ వ్యవహారంపై నివేదించారు. కన్హయ్య కుమార్‌కు ఇప్పటివరకు క్లీన్చిట్ ఇవ్వలేదని, ఆయనకు వ్యతిరేకంగా తమ వద్ద గట్టి ఆధారాలు ఉన్నాయని బస్సీ మీడియాకు చెప్తున్నారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా జరిగిన కార్యక్రమంలో జాతివ్యతిరేక నినాదాలు చేయడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. అయితే తాను ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని, అఫ్జల్ గురుకు ఎప్పుడూ మద్దతు తెలుపలేదని కన్హయ్యకుమార్ స్పష్టంచేశారు. భారత రాజ్యాంగంపై తనకు అపారమైన నమ్మకముందని, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడలేదని ఆయన వివరణ ఇచ్చారు. దేశద్రోహం కేసులో ఢిల్లీ కోర్టు ఆయనకు మార్చి 2వతేదీవరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. -
ఏది దేశభక్తి? ఏది జాతి వ్యతిరేకత?
ఇటీవల హైద్రాబాద్ సెట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మబలిదానం మనసున్న మనుషుల్నీ-దళితులు, ఇతర అణగారిన ప్రజలకు సమ న్యాయం లభించాలని కాం క్షించేవారినీ తీవ్ర వేదనకూ, ఆగ్రహానికీ గురి చేసింది. తద్వారా మత అసహనాన్నీ, వివక్షనూ ప్రోత్సహించే శక్తులు కొంత ఆత్మరక్షణలో పడినట్లనిపించింది. రోహిత్ ఘటన తర్వాత ఆత్మవిమర్శ చేసుకునేందుకు బదులు, ఆర్.ఎస్.ఎస్ దాని అనుబంధ సంస్థలైన బీజేపీ, ఏబీవీపీ, భజరంగదళ్ వంటి శక్తులు ఈసారి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇదివరకు ఎన్నడూ లేనట్టి భౌతిక ఘర్షణను సృష్టించాయి. దశాబ్దాలుగా సైద్ధాంతికపరమైన, మేధోపరమైన చర్చలకు జేఎన్‌యూ మారుపేరుగా నిలుస్తూ వచ్చింది. అలాంటి విద్యాసంస్థలో ఈ చిచ్చుకు బీజేపీ పక్షనేతలైన ఎంపీలే కాకుండా స్వయంగా కేంద్ర హోం శాఖామాత్యులు సైతం తన వ్యాఖ్యలతో తోడైనారు. ఈ క్రమంలో విశ్వసనీయత లేని ట్వీట్లను, అమెరికాలో తలదాచుకుంటూ, తనపై శిక్ష తగ్గించుకునేందుకు కుహనా జాతీయవాదులతో చేయి కలిపిన హెడ్లీ వంటి వాని అనుమానాస్పద వ్యాఖ్యలను ప్రామాణిక సాక్ష్యాలుగా తీసుకుని ప్రచార యుద్ధం మొదలెట్టారు. తమ కూటమిలో లేని రాజకీయ పార్టీలను అన్నిటికీ మించి వామపక్షాలను దేశద్రోహులుగా, జాతి వ్యతిరేకులుగా, పాకిస్థానీ పంచమాంగదళంగా గోబెల్స్ ప్రచారం సాగిస్తున్నారు. జేఎన్‌యూ విద్యార్థి యూనియన్ అధ్యక్షుడిని ఏ విధమైన ఆధారాలూ చూపించకుండా, పాలకుల ఆదేశాల మేరకు అరెస్టు చేశారు. మరో 7గురు విద్యార్థులను నిర్బంధించారు. తమ (ఏబీవీపీ) అనుయాయుల చేత పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలిప్పించి, మొత్తం ఉద్యమాన్ని దేశద్రోహ ఉద్యమంగా సృష్టించే ప్రయత్నం చేశారు. అంతకంటే మిన్నగా, ఢిల్లీ కోర్టులో కేసు సందర్భంగా హాజరైన జేఎన్‌యూ విద్యార్థులపై, విలేకరులపై, మీడియా వారిపై కోర్టు ఆవరణలోనూ, బయటా న్యాయవాదులు, బీజేపీ వారు, వారి ఎంఎల్ఏ అందరూ కలిసి ప్రేక్షక పాత్ర వహిస్తున్న పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. ఈ కాషాయ భావజాలాన్ని, నిరంకుశ ధోరణిని అడ్డుకట్ట వేయకపోతే సాపేక్షంగా ఈ మాత్రంగానైనా మిగిలిన మన ప్రజాస్వామిక, లౌకిక, అభ్యుదయ సాంస్కృతిక విలువలు బతికి బట్టకట్టలేవు. దేశభక్తి అంటే ఏమిటి? మా తెలుగుజాతి మహా కవి గురజాడ ఎప్పుడో శ్రీశ్రీ అన్నట్లు.. అంతర్జాతీయ గీతం కాదగిన తన ‘దేశభక్తి’ గేయం ద్వారా మాకు ‘దేశమంటే మట్టికాదనీ, దేశమంటే మనుషుల’ నీ చాటి చెప్పారు. ఇది ప్రపంచం గౌరవించదగిన మహత్తర నిర్వచనం. ఇటీవలే సియాచిన్ (భారత్- పాక్ సరిహద్దులలోని) ప్రాంతంలో గస్తీ కాస్తున్న 10 మంది మన వీర సైనికులు తీవ్రమైన ప్రతికూల వాతావరణం లో మంచు గడ్డలు విరిగిపడి మరణించారు. అక్కడ శత్రుసేనల దాడులలో రక్తం చిందించినందువల్ల కాకుండా, దుర్భర వాతావరణ స్థితి వల్ల మరణించిన వారే ఎక్కువ. ఆ ప్రాంతంలో అదే స్థితిలో ఉన్న పాకిస్తాన్ కొన్నేళ్ల క్రితం సియాచిన్ని పరస్పర అంగీకారంతో ఒక నిరాయుధ జోన్‌గా ఉంచే విషయమై మన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ఈ ఒప్పందాన్ని ఆసరాగా తీసుకుని, మన దేశముద్దుబిడ్డలైన సైనికుల అనవసర మరణాలను నివారించి, జైజవాన్ అని మన దివంగత ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి అన్నట్లు వారి రక్షణకు తోడ్ప డటం దేశభక్తి. అంతే కానీ సియాచిన్ రక్షణ పేరిట మన సైనికులను భక్షణ చేయడం కాదు. అది దేశ ప్రజలపై భక్తి ఎంతమాత్రమూ కాదు. అందునా శరీరకష్టం తప్ప మరో జీవనోపాధి లేని, తరతరాలుగా సామాజిక న్యాయానికి నోచుకోని, అణగారిన కులాలను, ఆదివాసీలను, మైనారిటీలను, మహిళలను రక్షించి ఆదుకోవడమే దేశ భక్తి. సర్వ సృష్టి నిర్మాతలు, మనందరి ప్రాణదాతలైన వారి కష్టాన్ని దోచుకుంటూ, అడుగడుగునా వారిని అవమానాలకు గురిచేస్తూ వారి నికృష్ట జీవన శిథిలాలపై పాలకులు ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తూ, ఆ లేనివారిని పీడించి కలవారికి ఊడిగం చేయబూనటం దేశభక్తి కాదు. మళ్లీ మన గురజాడ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుందాం. ‘దేశాభిమానము నాకు కద్దని వట్టిగొప్పలు చెప్పుకోకోయ్/పూని ఏదైనా ఒక మేల్ చేసి జనులకు చూపవోయ్’. పరాయిపాలకుడు బ్రిటిష్‌వాడు తన పాలన ఎంత దౌర్భాగ్యంగా ఉండినప్పటికీ, తనపాలనపై కనీస నిరసన తెలిపినా, దాన్ని మొగ్గలోనే తుంచివేసే రాజద్రోహ చట్టాలను ప్రవేశపెట్టాడు. తన దేశంలో దాదాపు దశాబ్ది క్రితమే ఆ చట్టాన్ని రద్దు చేసుకున్నాడు. మన దేశంలో మాత్రం ఈ వలసపాలన నాటి చట్టం నేటికీ అమలవుతూనే ఉండటం శోచనీయం. ‘స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన కేంద్రీయ విశ్వవిద్యాలయంలోకి వీసీ, పాలనాబృందం ఆదేశాలు లేకుండానే పోలీసులు ఎందుకు ప్రవేశించినట్లు? మా విశ్వవిద్యాలయాల పాలనా నిర్వహణలో జోక్యం చేసుకుని, ఫలానా విద్యార్థులను బహిష్కరించమని, ఫలానా వారిపై కేసులు పెట్టవద్దని ఆదేశించిన కేంద్ర మంత్రికి, అలా చేయమని రికమెండ్ చేసిన మరో సహచర కేంద్ర మంత్రికి ఆ అధికారం ఎవరిచ్చారు?’ అని వాదించిన విద్యార్థులు ఉగ్రవాదులూ, దేశద్రోహులూనా? ఈ రోజున నడిరోడ్డున ఉగ్రవాదులూ, దేశద్రోహులూ కాని మామూలు హేతువాదులనూ, పాలక పార్టీలకు వంగి సలాములు కొట్టడానికి ఇష్టపడని విద్యావంతులను, మేధావులనూ ప్రభుత్వ వేధింపులకు గురి చేస్తున్నారు. చివరకు అధికార పార్టీ భావజాలాన్ని వ్యాపింపజేయడమే కర్తవ్యంగా వ్యవహరించే రాజ్యాంగేతర శక్తుల చేతుల్లో వీరు హతమవుతున్న సంఘటనలను చూస్తున్నాం. పాలకపార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ రకాల సాధువులు, సాధ్విలు మూకుమ్మడిగా.. ‘‘జేఎన్‌యూలో పెట్రేగుతున్న ‘అరాచక’శక్తులకు, ‘ఉగ్రవాద’ మూకలకు, జాతి శత్రువులకు, దేశద్రోహులకు (తమకు తోచిన, విశ్లేషణలు చేర్చి) యావజ్జీవిత కారాగార శిక్ష విధించడం కాదు. వారికి తుపాకి గుళ్లతో, ఉరికొయ్యలతో, ఉరితాళ్లతో సమాధానమివ్వాల’’ని నిర్భయంగా, బహిరంగంగా వ్యాఖ్యానిస్తుంటే మౌన ముద్ర దాలుస్తున్న పాలన నిరంకుశ మార్గాన వెళ్తున్నట్లే కదా. చివరగా ఈ విద్యార్థుల సహేతుకమైన పోరాటాలను, సైద్ధాంతిక రీత్యా కమ్యూనిస్టులు బలపరుస్తుంటే, సియాచిన్ మంచుగుట్టల దేశభక్తులు.. కమ్యూనిస్టులను దేశద్రోహులని, జాతి వ్యతిరేకులని విమర్శించడం చూస్తున్నాం. కమ్యూనిస్టులు బ్రిటిష్ వలసపాలనకు అనుకూలమైన జిన్నా ప్రతిపాదనను బలపరిచారనీ, భారతదేశంపై చైనా దాడి చేస్తే ఆ దాడిని బలపర్చారని, వారు దేశద్రోహులనీ, జాతి వ్యతిరేకులనీ పేర్కొంటూ అలవోకగా చరిత్రను వక్రీకరిస్తున్నారు. వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. భారత దేశానికి స్వాతంత్య్రం రావాలంటే భారత ప్రజలు మొత్తంగా ఆనాడు ప్రబలంగా ఉండిన హిందూ, ముస్లిం మతభేదాలను మరచి ఐక్యంగా బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి. 1940 నాటి పరిస్థితుల్లో, హిందువులు మెజారిటీగా ఉండిన స్వతంత్ర భారతదేశంలో తమ ముస్లిం మతస్థులకు న్యాయం జరగదని, తమ ముస్లిం రాజ్యంగా పాకిస్తాన్ కావాలని జిన్నా ప్రతిపాదించాడు. అప్పుడు ‘‘ముస్లిం మతానుయాయులలో విదేశీ జాతుల (ప్రజల) కూ, అలాగే హిందూమతం అధికంగా ఉండిన ప్రాంతాల్లోని అంగ, వంగ, కళింగ, ఆంధ్ర.. ఇత్యాది జాతులకు (అప్పటి లెక్క ప్రకారం మొత్తం బ్రిటిష్ ఇండియాలో 17 జాతులున్నాయి) ప్రత్యేక రాజ్యాంగం, పాలనా స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తిని ఇవ్వాలని అలాగే, ఈ జాతులలో ఎవరైనా, తాము స్వతంత్ర భారత దేశంలో ప్రజలమని భావిస్తే వారికి విడిపోయే హక్కు కూడా యివ్వాల’’ని కమ్యూనిస్టు పార్టీ 1943-45 నాటి తన తీర్మానాల్లో ప్రతిపాదించింది.’ అలా అయితే హిందూ ముస్లింల మధ్య పరస్పర విశ్వాసం పెరిగి, కాంగ్రెస్ ముస్లింలీగ్ రెండు కూడా ఐక్యంగా ఉద్యమించి స్వతంత్రాన్ని సాధించుకునే అవకాశం ఉంటుందనీ, అలాంటి హిందూ ముస్లిం ఐక్యత కోసం నాటి కమ్యూనిస్టులు చేసిన ప్రతిపాదన ఇది! పరమతద్వేషమే, పాకిస్తాన్ ద్వేషమే దేశభక్తిగా భావిస్తున్న శక్తులు చెప్తున్నట్లు నాడు కమ్యూనిస్టులు జిన్నాను ప్రశంసించలేదు. సరికదా, ఈ ప్రతిపాదనను జిన్నా కూడా వ్యతిరేకించాడు. ఇదీ చారిత్రక వాస్తవం. ఇక చైనా- ఇండియా తమ మధ్య సరిహద్దు వివాదాన్ని శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకో వాలన్నది సి.పి.యంగా తదుపరి రూపుదిద్దుకున్న నాటి పార్టీ ప్రతిపాదనే. నేటి మోదీ ప్రభుత్వం కూడా ఈ భౌతిక వాస్తవికతను గుర్తిస్తోంది. చైనాతో మనదేశ సరిహద్దు వివాదాన్ని శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నది. నాటి సి.పి.ఎం వాదనలోని సహేతుకత నేటికైనా ఈ మతోన్మాదులకు అర్థం కాకపోతే దేశానికే అనర్థం! చివరిగా.. నేను దేశద్రోహినా అని అడుగు తున్నాను. ఎందుకంటే భారతదేశం ఉంది కానీ భారత జాతి లేదు. ఎందువలన అంటే, భారతదేశం వివిధ జాతుల సమాఖ్య స్వరూపం. అంతేగానీ ఏకశిలా సదృశమైన నేషన్ స్టేట్ (జాతీయ రాజ్యం) కాదు. నాదేశం భారతదేశం అన్నట్లే- నా జాతి తెలుగుజాతి! తెలుగు జాతీయుడినైనభారతీయుణ్ణి నేను. అన్ని జాతు ల మాదిరే కశ్మీర్ కూడా మన దేశంలో ఒక జాతి! అందులో కొంత భాగం పాక్ అక్రమిత కశ్మీర్లో ఉంది. మరో భాగం మనదేశంలో ఉంది. మొత్తంగా కశ్మీరి జాతి ఏ దేశంలో ఉండాలో, తాము స్వతంత్ర జాతిగా ఉండాలో వారు స్వేచ్ఛగా శాంతియుతంగా పరిష్కరిం చుకునే అవకాశం రాకపోతే - ఈ కశ్మీర్ సమస్య రావణ కాష్టంలా నలుగుతూనే ఉంటుందనీ నా భావన. ఏపీ విఠల్ వ్యాసకర్త ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు -
అరుణ్ జైట్లీపై దేశద్రోహం కేసు
న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై విమర్శలు చేసిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై ఉత్తరప్రదేశ్‌లోని ఓ కోర్టు దేశద్రోహం అభియోగాలు మోపింది. జైట్లీ విమర్శలను సుమోటోగా స్వీకరించిన ఝాన్సీ జిల్లాలోని మహోబా సివిల్ కోర్టు న్యాయమూర్తి అంకిత్ జియోల్ ఆయనకు సమన్లు జారీచేశారు. నవంబర్ 19న కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. గ్యాంగ్‌రేప్ విషయంలో చాలాసందర్భాల్లో అసలు కన్నా కల్పితమైన ఆరోపణలే ఎక్కువగా ఉంటున్నాయని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్‌కు కూడా న్యాయమూర్తి జియోల్ సమన్లు జారీచేశారు. ప్రజల చేత ఎన్నుకోబడని వ్యక్తుల నియంతృత్వాన్ని భారత ప్రజస్వామ్యం అంగీకరించబోదని అరుణ్ జైట్లీ తన బ్లాగ్‌లో చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయని, భారత శిక్షాస్మృతి ప్రకారం 124ఏ సెక్షన్ దేశద్రోహం, సెక్షన్ 505 బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి అభియోగాలు మోపారు. ఆయన వ్యాఖ్యలు వివిధ పత్రికల్లో ప్రచురితమవ్వడంతో సెక్షన్ 190 ప్రకారం సుమోటోగా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపారు.