సుప్రీం కోర్టే ఆదుకోవాలి! | supreme court should save us | Sakshi
Sakshi News home page

సుప్రీం కోర్టే ఆదుకోవాలి!

Published Mon, Mar 7 2016 11:53 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

supreme court should save us

రెండో మాట
 సర్దార్ పటేల్ మాత్రమే కాకుండా, ముసాయిదా రాజ్యాంగంలో కొందరు స్వార్థపరులు దొంగచాటుగా ‘దూర్చిన’ ఈ సెడిషన్ క్లాజును మితవాద వర్గానికి చెందిన కేఎం మున్షీ సహా, టీటీ కృష్ణమాచారి, సేఠ్ గోవిందదాస్ వంటి ఉద్దండులు కూడా వ్యతిరేకించారని మరచిపోరాదు. బ్రిటిష్ వాడి చేతి చలవగా ఎలాంటి మార్పులు లేకుండా భారత శిక్షాస్మృతిలో చేరిన సెడిషన్ మొదటి ముసాయిదా రాజ్యాంగంలో 13వ అధికరణ కింద వచ్చి చేరింది. కృష్ణమాచారి అసలు సెడిషన్ అన్న పదాన్నే వ్యతిరేకించాలని చెప్పారు.

 ‘భారత రిపబ్లిక్ రాజ్యాంగం అవతరించడానికి కొద్దిమాసాలకు ముందు ముసాయిదా మీద సుదీర్ఘంగా చర్చించిన నిర్ణయసభలో ‘‘రాజద్రోహం/ దేశద్రోహం’’ (సెడిషన్)క్లాజును చేర్చాలా, వద్దా అన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. ఎందుకంటే, భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేసే క్రమంలో ఈ సెడిషన్ ఒక ఆధారం కాబట్టి అది రాజ్యాంగ నిర్ణయ సభలోని కొందరు సభ్యుల హేళనకూ, అపహాస్యానికీ గురికావలసి వచ్చింది. ఫలితంగా సర్దార్ వల్లభ్ భాయి పటేల్ ముసాయిదా నుంచి సెడిషన్ క్లాజును తొలగించాలని ఆ మరుసటి రోజునే ముసాయిదాతో నిబంధన చేర్చారు.’
                                                                                                          కె. వెంకటరమణన్, 28-2-2016 (ప్రముఖ విశ్లేషకుడు)

 ‘వయసు పెరిగినా బుర్ర పెరగనందువల్ల’ (ప్రధాని నరేంద్ర మోదీ మాటలలోనే) వారి వారి అవసరాలకు తగినట్టుగా స్వతంత్ర భారత పాలకులంతా స్వప్రయోజనాల కోసం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూనే ఉన్నారు. కొందరు ఎమర్జెన్సీని రుద్ది అధికారాన్ని కాపాడుకున్నారు. మరి కొందరు పాలనా నిర్వహణలో తమ వైఫల్యాలను వేలెత్తి చూపినందుకు నేరుగా భారత శిక్షాస్మృతిలోని సెడిషన్ క్లాజునే ప్రయోగిస్తున్నారు. కాలం చెల్లిన బ్రిటిష్ వలస పాలన అవశేషంగా దేశ రాజకీయాలు అందిపుచ్చుకున్న సెడిషన్ క్లాజు దుమ్ము దులిపి దేశ యువత గొంతు నులిమివేయడానికి సాహసించారు. ఏ వల్లభ్‌భాయి పటేల్, ఏ సెడిషన్ క్లాజును నిరసించవలసి వచ్చిందో; అలాంటి పటేల్‌కు తామే వారసులమని చెప్పుకుంటూ, 200 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి చూపిన ఉత్సాహం ఆ దుర్మార్గపు క్లాజును చట్టం నుంచి తొలగించడం గురించి చూపలేకపోయారు.

 సెడిషన్ అన్న పదాన్నే ఈసడించారు
 సర్దార్ పటేల్ మాత్రమే కాకుండా, ముసాయిదా రాజ్యాంగంలో కొందరు స్వార్థపరులు దొంగచాటుగా ‘దూర్చిన’ సెడిషన్ క్లాజును మితవాద వర్గానికి చెందిన కేఎం మున్షీ సహా, టీటీ కృష్ణమాచారి, సేఠ్ గోవిందదాస్ వంటి ఉద్దండులు కూడా వ్యతిరేకించారని మరచిపోరాదు. బ్రిటిష్ వాడి చేతి చలవగా ఎలాంటి మార్పులు లేకుండా భారత శిక్షాస్మృతిలో చేరిన సెడిషన్ మొదటి ముసాయిదా రాజ్యాంగంలో 13వ అధికరణ కింద వచ్చి చేరింది. ఈ అధికరణ తరువాత తుది రాజ్యాంగ ప్రతిలో భావ ప్రకటనా స్వేచ్ఛ సహా స్వతంత్ర భారత పౌరుడికి హామీ ఇచ్చిన సప్త స్వాతంత్య్రాలను (ఉపన్యాస, భావ ప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత సమావేశాలు, యూనియన్లు/సహకార సంఘాలు ఏర్పరచుకునే స్వేచ్ఛ, దేశమంతటా తిరిగే హక్కు, దేశంలో ఏ ప్రాంతంలో అయినా నివసించే హక్కు, నచ్చిన వృత్తినీ, వ్యాపకాన్ని ఎంచుకునే స్వేచ్ఛ) ఈ ఒక్క సెడిషన్ క్లాజు కింద పాలకులు తొక్కిపడవేయవచ్చు.

లేదా యుద్ధకాలానికి వర్తింప చేయవలసిన లేదంటే అంతరంగిక కల్లోలాలకు వర్తింప చేయవలసిన ఎమర్జెన్సీ ప్రకటన కింద కూడా కాల రాయవచ్చు. ఇందుకు పాలకులు చెప్పే కారణాలు ఏమైనా ఆ మిష కింద, తమను ఎన్నుకున్న పాపానికి పౌర హక్కులను స్తంభింప చేయవచ్చు. స్వాతంత్య్రానికి ముందు లోకమాన్య తిలక్, గాంధీజీలకి జరిగిన అవమానాలు, అరెస్టులు, సెడిషన్ కేసులు  ఎలాగో; నవతరం యువకులకు, రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరించే ఉద్యమకారులకు అలాంటి అవమానాలు, అరెస్టులు, సెడిషన్‌లు తప్పడం లేదు.

పేద, బడుగు, మధ్య తరగతి వర్గాల సమస్యలు పరిష్కారం అయ్యే దాకా ఈ ప్రశ్న హక్కుకు మరణం గానీ, మరణశిక్ష గానీ వర్తించదు. ప్రభుత్వాలు (ఏ బ్రాండ్ అయినా) వాటి ‘‘నిర్ణయాలను, చర్యలను పౌరులు ప్రశ్నించే, విమర్శించే హక్కును నిషేధించజాలవు’’(ప్రొ. మనూభాయి షా వర్సెస్ ఎల్‌ఐసి కేసులో సుప్రీంకోర్టు తీర్పు, 1993). జేఎన్‌యూ విద్యార్థి కన్హయ్యకుమార్ ప్రసంగం అనంతర పరిణామాలు, హైదరాబాద్ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన పాలక మండలి ప్రవర్తన, కేంద్ర రాష్ట్రాల వైఖరి.. పైన ఉదహరించిన సుప్రీంకోర్టు తీర్పునకు, రాజ్యాంగ నిబంధనలకు పచ్చి వ్యతిరేకం కాదా? భారత శిక్షాస్మృతిలోని సెడిషన్ క్లాజు (124-ఎ) సెక్షన్‌ను ముసాయిదా రాజ్యాంగం మీద జరిగిన చర్చలో ప్రసంగించి నప్పుడు మున్షీ, ‘పచ్చి దుర్మార్గపు సెక్షన్’గా వర్ణించారు. ‘ఈ దుర్మార్గపు సెక్షన్‌ను ఎలా వాడకంలో పెట్టారో ఒక కేసు నాకు గుర్తుంది.

ఒక జిల్లా మేజిస్ట్రేట్‌ను ఒకరు విమర్శిస్తే, సెడిషన్ 124-ఎ సెక్షన్ కింద శిక్షించమని ప్రభుత్వం ఆదేశించింది. ఆ సెక్షన్ ఎలా దుర్వినియోగం అవుతున్నదో గ్రహించినందున అప్పటి నుంచి ప్రజాభిప్రాయం కూడా మారిపోయింది. ఇప్పుడు మనకు ప్రజాస్వామ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సెడిషన్ పదమే ఈ సభలోని సభ్యులకే కాదు, ప్రపంచంలోని న్యాయస్థానాలన్నింటా అనుమానాలు రేకెత్తించింది. ఇంగ్లండ్‌లో 150 ఏళ్ల నాడు వెలుగు చూసిన ఈ చట్టం మేరకు ఒక సభ పెట్టినా లేదా ఒక ఉరేగింపు తలపెట్టినా దాన్ని రాజద్రోహంగా పరిగణించారు. ఒక అభిప్రాయాన్ని ప్రకటించినా సెడిషన్‌గానే పరిగణించారు. కనుకనే మన ముసాయిదా రాజ్యాంగంలోని సెడిషన్ పదాన్నే తొలగించడం జరిగింది. వాస్తవానికి ప్రభుత్వ నిర్ణయాలను, చర్యలను విమర్శించడం ప్రజాస్వామ్య సారం. అందుకే ముసాయిదా క్లాజుకు సవరణను ప్రతిపాదించవలసి వచ్చింది. అంతేగానీ గాయపడిన ప్రభుత్వాల అహంభావానికీ, స్వాతిశయానికీ, ఆడంబర ప్రదర్శనకు చేదోడు కావడం సెడిషన్ ఉద్దేశం కాదని నీహరేందు దత్ మజుందార్ వర్సెస్ బ్రిటిష్ చక్రవర్తి కేసులో ఫెడరల్ కోర్టు అభిప్రాయపడింది. కనుకనే సవరణ ద్వారా రాజ్యాంగ అధికరణ నుంచి సెడిషన్‌ను తొలగించాలని కోరాం. అలాకాని పక్షంలో పాత రోజుల మాదిరిగానే మనమూ సెడిషన్‌ను కొనసాగించదలిచామన్న తప్పుడు అభిప్రాయం జనంలో కలిగించిన వారమవుతాం’ అని మున్షీ పేర్కొన్నారు (చూ. కాన్‌స్టిట్యూట్ అసెంబ్లీ డిబేట్స్ అధికార నివేదిక, వాల్యూం-7 బుక్-2).

 ఇక టీటీ కృష్ణమాచారి అసలు సెడిషన్ అన్న పదాన్ని వ్యతిరేకించాలని ఈసడింపుతో చెప్పారు.  ప్రముఖ భారత రాజ్యాంగ భాష్యకారుడు హెచ్. ఎం. సీరవాయి పలు కేసులను విశ్లేషించారు. కొన్ని సందర్భాలలో (అతి అసాధారణ కేసులలో) మినహా సుప్రీంకోర్టు కూడా సెడిషన్‌ను సమర్థించ లేదు. అసలు ఈ విషయం  మీద రోజులు తరబడి  చర్చించవలసిన అవసరం రావడం ద్వారానే భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు న్యాయవ్యవస్థ తీర్మానించుకోవాలి. కేదార్‌నాథ్‌సింగ్ వర్సెస్ బిహార్ స్టేట్ (1962), గోడ్సే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1971) ఇందుకు ఉదాహరణలు.

 కోర్టులూ ఇందుకు వ్యతిరేకమే
 రాజ్యాంగ నిర్ణయ సభలో సెడిషన్ మీద అంత చర్చ జరిగిన తరువాత కూడా, పటే ల్ వంటి హేమాహేమీలు దీనిని తొలగిస్తూ నిబంధన చేర్చిన తరువాత కూడా ఇది 2016లో సైతం పాలకులకు వాటంగా అక్కరకు వచ్చిందంటే మోదీ అన్నట్టు, ‘వయసు పెరిగినా బుర్ర పెరగలేదనే’ తీర్మానించుకోక తప్పదు. చివరికి రామ్‌నందన్ వర్సెస్ స్టేట్ కేసులో కోర్టు (1958) ఐపీసీ 124-ఎ సెక్షన్‌ను కొట్టిపారేసిందని మరచిపోరాదు. వివిధ కోర్టులలో, డివిజన్ బెంచ్‌లలో ఈ సెడిషన్ మీద ఇంతకాలం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నందుననే పాలకులకు ఎత్తుబిడ్డ అయింది. విద్యార్థులు ‘తిరుగుబాటు’కు బాహాటంగా పిలుపిచ్చిన ఉదాహరణలు చివరికి వీడియోలలో కూడా, ఫోరెన్సిక్ నిపుణులకు సహితం దొరకనందుకే సెడిషన్ పేరిట ప్రభుత్వం చేసిన ఆరోపణలు వీగిపోబట్టే విద్యార్థులు బెయిల్ మీద విడుదల కాక తప్పలేదు. సెడిషన్ కింద బెయిళ్లు ఉండవు. చివరికి తప్పుడు సెడిషన్ బనాయింపుల నేపథ్యంలో కలాలను కట్టడి చేసే దుష్ట సంప్రదాయానికి రెండు తెలుగు రాష్ట్రాలలో తెర లేపే ప్రయత్నం కూడా జరుగుతున్నది.

ఇలాంటి వికృత చేష్టలను కనిపెడుతున్న సుప్రీంకోర్టు, కొన్ని హైకోర్టులకు కూడా ధర్మాసన చైతన్యాన్ని కాపాడుకోవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కన్హయ్యకుమార్ కేసు విచారణలో పాటియాలా (ఢిల్లీ)కోర్టు ఆవరణలో కొందరు లాయర్లు ప్రదర్శించిన అమానుష ప్రవర్తన ఇందుకు తొలి గుర్తింపు కావచ్చు. ‘కొందరు సంఘ వ్యతిరేక శక్తులు లాయర్లుగా నమోదు కాకుండా నిరోధించేందుకు, కోర్టులలో కొట్లాటలకు, ఆందోళనలకు, రాళ్లు రువ్వుకోవడానికి, తిట్ల పురాణాలు విప్పడానికి వీలు కాకుండా ప్రక్షాళన చేయడానికి ’ ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని నెలకొల్పాలని నిర్ణయించవలసి వచ్చిందని మరువరాదు. ఇస్లామిక్ ఉగ్రవాదులు, హిందూత్వ ఉగ్రవాదులు సమాజాలని విభజించేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో సుప్రీం నిర్ణయాన్ని అంతా హర్షించాలి. కన్హయ్యకుమార్ విడుదలైన మరునాడే అతడిని హత్య చేయాలంటూ వచ్చిన ప్రకటనలను వ్యవస్థకు తీవ్ర హెచ్చరికగానే భావించాలి. అందుకు రివార్డులు ప్రకటించడాన్నే సెడిషన్‌గా భావించాలి. అసలా చట్టాన్నే సుప్రీంకోర్టు కొట్టివేయాలి. తిలక్ విచారణలో బ్రిటిష్ న్యాయమూర్తి స్ట్రాచీ ఆడిన సెడిషన్ నాటకం వేరు. కానీ నేడు సుప్రీం కోర్టు ధర్మాసన చైతన్య స్ఫూర్తితో సెడిషన్ చట్టానికి భరతవాక్యం పలకాలి.
 రాజ్యాంగ విరుద్ధంగా సమాజ సంపదను పాలక  వర్గాలు ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టడం ఈ పరిస్థితికి  కారణం. ఇలాంటి సమయంలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటనలు స్వాతంత్య్ర ఫలాల పరిరక్షణకు తగినంత శక్తిని పుంజుకోకపోగా, చీలికల వైపు ప్రయాణించడం మరో కారణం. ఇప్పటికైనా వామపక్షాలు చీలికలకు స్వస్తి చెప్పి ముందుకు సాగితే సెక్యులర్ సమాజానికి శాశ్వత రక్షకులు కాగలుగుతారు. ప్రధాన పక్షాలు కమ్యూనిస్టు, మార్క్సిస్టు పార్టీలు ఏకం కావాలి. ఇది సాధ్యం కానంత వరకూ ఇస్లామిక్, హిందూత్వ ఉగ్రవాదుల మధ్య భారత్ నలిగిపోక తప్పదు.
 http://img.sakshi.net/images/cms/2015-07/41437415774_Unknown.jpg
సీనియర్ సంపాదకులు  ఏబీకే ప్రసాద్
 abkprasad2006@yahoo.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement