సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల తన ప్రమాణ స్వీకారంలో జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నిర్మొహమాటంగా చేసిన ఒక ప్రకటన దేశ ప్రజల్లో ఆశలు రేకెత్తించేదిగా ఉంది. పాలక విధానాల ఫలితంగా దేశం నేడు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా దేశ దిశాగతిని మార్చడానికి తోడ్పడగల నిర్ణయాలు చేసే అవకాశం తన స్థాయిలో ఉందని ఆ ప్రకటన ద్వారా ఆయన సూచనప్రాయమైన భరోసాను ఇచ్చారు. తన ఎదుగుదలలో గాంధీ, నెహ్రూల ప్రజాస్వామ్య భావాల ప్రభావమే గాక కారల్ మార్క్స్ రూపొందించిన ప్రపంచ ప్రసిద్ధ మేనిఫెస్టో ప్రభావం కూడా ఉండి ఉండవచ్చునని అనిపిస్తోంది! కనుకనే చంద్రచూడ్ ‘సామాన్య పౌరుల ప్రయోజనాల పరిరక్షణే’ తన ధ్యేయంగా బాహాటంగా ప్రకటించుకోగలిగారు.
‘‘పేదసాదల కోసం మా ప్రభుత్వం అన్నీ చేస్తోందని మన పాలకులు చెప్పుకోవచ్చు గాక. కానీ అలాంటి ‘కోతలు’ బ్రిటిష్ పాలకులు కూడా కోస్తూండేవారు. కానీ అసలు నిజం – పేదల ప్రయోజనాలు మాత్రం స్వతంత్ర భారత ప్రభుత్వం కూడా నెరవేర్చడం లేదు. ఈ సత్యాన్ని మన పాలకులు హుందాగా అణకువతో ఒప్పుకుని తీరాలి’’
– మహాత్మాగాంధీ (1947 డిసెంబర్)
‘‘వెయ్యిన్నొక్క కత్తుల కన్నా ప్రజాభిప్రాయం అనేది అత్యంత బలమైన ఆయుధం. హైందవాన్ని క్షుద్ర పూజాదికాలతో రక్షించు కోలేము. పరాయి పాలన నుంచి విముక్తి పొందిన దేశం మనది. ఈ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కంటికి పాపలా కాపాడుకోవాలి. ఎలా? నీలో మానవత్వం, ధైర్య సాహసాలు, నిరంతర జాగరూకత ఉన్నప్పుడే నీ ధర్మం నీవు నెరవేర్చగలుగుతావు. ఈ అప్రమత్తత మనలో కొరవడిన నాడు, మనం అత్యంత ప్రేమతో సాధించుకున్న స్వాతంత్య్రం కాస్తా చేజారిపోతుంది. కానీ దురదృష్టవశాత్తూ దేశంలో ప్రస్తుత అశాంతికి అంతటికీ కొందరు కారణమని వింటున్నాను. భారత దేశం హిందువులకు ఎంతగా పుట్టినిల్లో, ముస్లిములకూ అంతే పుట్టినిల్లు అని మరచిపోరాదు. అలాగే ఎవరికి వారు తమ మతమే గొప్పదనీ, అదే నిజమైనదనీ భావించడం తప్పు. ఈ భావననే చిన్నప్పటి నుంచీ పిల్లల్లో కూడా నూరిపోయడం వల్ల అదే నిజమన్న ధోరణిని వారిలో పెంచిన వారవుతున్నారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకునేదే నిజమైన ప్రజా ప్రభుత్వం. ప్రజల దారిద్య్రాన్ని, నిరుద్యోగ పరిస్థితిని పట్టించుకోని పాలకులు ఒక్క రోజు కూడా అధికారంలో ఉండటానికి వీలు లేదు’’.
– మహాత్మాగాంధీ (అదే ఏడాది మరొక సందర్భంలో)
‘‘దేశం కోసమే నా తపన అంతా. 365 రోజులూ పని చేస్తున్నా. నేను పునాది రాయి వేసిన ప్రాజెక్టులను నేనే ప్రారంభిస్తున్నా. ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం’’.
– ప్రధాని నరేంద్రమోదీ (19.11.2022)
‘దేశం కోసమే నా తపనంతా..’ అనేంతగా ‘ఆత్మవిశ్వాసం’ కొంద రిలో పెల్లుబికి వస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సందర్భంగా ఆయన నిర్మొహమాటంగా చేసిన ఒక ప్రకటన దేశ ప్రజల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని ఆలోచింపజేసేదిగా ఉంది. జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబర్ 10 వరకు ఆ పదవిలో ఉంటారు. ఆ లోపుగా.. దేశం నేడు పాలక విధానాల వల్ల ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా దేశ దిశాగతిని మార్చడానికి ఆయన తన స్థాయిలో తోడ్పడగల నిర్ణయాలు చేసే అవకాశం ఉంది. ఆయన ప్రకటన సూచన ప్రాయంగా అదే తెలియజేస్తోంది. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన భరోసాను పాలకవర్గాలు హరించేస్తున్న సమయంలో చంద్ర చూడ్.. ‘ఆధార్’ పత్రం పేరిట పాలకులు పౌరహక్కుల్ని కత్తిరించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఏనాడో ఎదుర్కొని అడ్డుకట్ట వేశారు.
‘ఆధార్’ కార్డు పేరిట పౌరులకు ప్రశ్నించే హక్కును హరించడం ఎలా సాధ్యమో ఆయన నిరూపించారు. ‘ఆధార్’ కార్డు చెల్లుతుందంటూ ధర్మాసనంలోని మిగతా నలుగురు సభ్యులు మెజారిటీతో నిర్ణయిం చగా, అది ఎలా రాజ్యాంగ విరుద్ధమో నిరూపించి నెగ్గుకొచ్చిన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్! కనుకనే ఇప్పుడు దేశ ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ పదవీ స్వీకారం చేసిన రోజున కూడా ‘సామాన్యుల సేవే తన తొలి ప్రాధాన్యమని’ ప్రకటించారు. ఆ ప్రకట నలో ఆయన పాలకులకు చేదోడువాదోడుగా ఉపయోగపడే ‘సీల్డ్ కవర్’ తతంగానికి కోర్టులు స్వస్తి చెప్పించాలని కూడా సూచించారు. న్యాయ వ్యవస్థపై కూడా ప్రజల నమ్మకం సడలిపోతున్న సమయంలో ఆయన ఇస్తున్న భరోసా నమ్మకాన్ని కలిగిస్తోంది.
చంద్రచూడ్ ఎదుగుదలలో గాంధీ, నెహ్రూల ప్రజాస్వామ్య భావాల ప్రభావమే గాక వర్గరహిత సామాజిక వ్యవస్థ ప్రతిష్ఠాపన లక్ష్యంగా ప్రపంచ శ్రమజీవుల ప్రయోజనాల రక్షణకు కారల్ మార్క్స్ రూపొందించిన ప్రపంచ ప్రసిద్ధ మేనిఫెస్టో ప్రభావం కూడా ఉండి ఉండవచ్చు! కనుకనే చంద్రచూడ్ ‘ప్రతి అంశంలోనూ సామాన్య పౌరుల ప్రయోజనాల పరిరక్షణే’ తన ధ్యేయంగా బాహాటంగా ప్రక టించుకోగలిగారు.
ఎలాగంటే ధనికవర్గంలో జన్మించిన ఫ్రెంచి మహా రచయిత బాల్జాక్ ఫ్రెంచి సామాజిక పరిణామ క్రమాన్నే సామాన్య ప్రజల ప్రయోజనాల రక్షణ కోసం మార్చేసిన వాడు. అందుకే మార్క్స్ అతణ్ణి సమాజ వాస్తవిక పరిస్థితులకు అద్దంపట్టిన మహా రచయితగా వర్ణించాడు. ధనిక, పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలు క్రమంగా ఏ దారుణ పరిస్థితుల వైపుగా సామాజిక వ్యవస్థల్ని నడిపిస్తాయో తన రచనల ద్వారా ధనికుడైన బాల్జాక్ వర్ణించడాన్ని మార్క్స్ ప్రశంసించాడు. అంతేగాదు, ధనిక వర్గ నాగరికతకూ, దాని అధీనంలో జరిగే నేరాలకూ మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయో కూడా మార్క్స్ అనేక సదృశాలతో నిరూపించాడు. అలాంటి ధనిక వర్గ సమాజాల్లో ‘ఎవరికివారే యమునాతీరే’గా ప్రజావసరాలతో నిమిత్తం లేకుండా జరిగే వస్తూత్పత్తి లాగానే నేరగాళ్లు వరుసగా నేరాలు సృష్టిస్తుంటారు. వాటితోపాటు నేర చట్టానికి దోహదం చేస్తారు. ఈ క్రమంలోనే నేర చట్టాన్ని గురించి ప్రొఫెసర్ గారు ఉపన్యాసాలు దంచేయడానికి ముందుకొస్తారు.
ఆ తర్వాత ఆ ఉపన్యాసాలన్నింటినీ సంకలనం చేసుకుని ఓ గ్రంథం సిద్ధం చేసుకుని దాన్ని జనరల్ మార్కెట్‌లోకి ఓ ప్రత్యేక వస్తువు(కమాడిటీ)గా విడుదల చేస్తాడు. అమ్మి సొమ్ము చేసుకుంటాడు! అంతేనా, అలాంటి సమాజంలోని నేరగాడు మొత్తం పోలీస్ వ్యవస్థ సృష్టికి, తద్వారా క్రిమినల్ జస్టిస్, ఆ పిమ్మట జడ్జీలు, ఉరి తీసే తలార్లు, ఆ పిమ్మట జ్యూరీ వ్యవస్థ వగైరాల ఏర్పాటుకు కారణమౌతాడు. అటుపైన ‘తాటి తోనే దబ్బనం’ అన్నట్టుగా చిత్రహింసలు మొదలై, ఆ హింసాకాండ నిర్వహణకు గానూ అందుకు తగిన వృత్తి నిపుణుల సృష్టి అవసరం అవుతుంది (ఇలాంటివారు అవసరం అవబట్టే రా.వి. శాస్త్రి ‘సారో కథలు’, ‘సారా కథలూ’ రాయాల్సి వచ్చింది).
అందుకే మార్క్స్ అంటాడు: ‘‘శ్రామిక వర్గాలు, సంపన్న వర్గాలు భిన్న ధ్రువాలు. రెండూ ప్రైవేట్ ఆస్తుల సృష్టి కారకులే!’’ అని. అందువల్ల ఈ రెండు ఒకే నాణేనికి రెండు ముఖాలని సరిపెట్టుకుంటే చాలదు. ప్రైవేట్ ఆస్తి ప్రత్యేక సంపదగా తనకు తాను రక్షించుకొనక తప్పదు, అలాగే శ్రామిక జీవులూ తమను తాము రక్షించుకొనక తప్పదు. కనుకనే వారిది అమానుషమైన దుఃస్థితి. ఈ స్థితిలోనే ప్రైవేట్ ఆస్తిపరుడు స్వార్థపరుడు అవుతాడు, కాగా తన అమానుష మైన దుఃస్థితిని వదిలించు కోవాలనుకున్న శ్రమజీవి సమాజానికి శత్రువుగా కన్పిస్తాడు. కనుకనే శ్రమజీవిని దోచుకోవడంపై ఆధార పడిన ప్రైవేట్ ఆస్తి రద్దు అయితేనే శ్రమజీవులకు బతుకు. అయితే అసమ సమాజ వ్యవస్థలోని అమానుష జీవన పరిస్థితులు రద్దు కాకుండా మాత్రం శ్రామికులకు శాశ్వత విమోచనం దుర్లభమని మార్క్స్–ఎంగెల్స్‌లు నిరూపించారు (కలెక్టెడ్ వర్క్స్: వాల్యూమ్ 4).
అందువల్ల జస్టిస్ చంద్రచూడ్‌ను ‘న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం కొనసాగేలా మీరు ఏం చర్యలు తీసుకొంటారన్న’ ప్రశ్నకు ‘చేతల్లోనే చూపిస్తానని’ భరోసా ఇచ్చారు. అంతవరకూ ప్రజల అస మ్మతిని ప్రజాస్వామ్యం మనుగడకు రక్షణ కవచంగా ప్రధాన న్యాయ మూర్తి సుప్రీంకోర్టును నిరంతరం తీర్చిదిద్దగలరని ఆశిద్దాం. సామా న్యుడికే తన ‘పెద్ద పీట’ అని చాటిన చంద్రచూడ్ దేశ దిశాగతిని తీర్చి దిద్దేందుకు తనకు సంక్రమించిన అనితరసాధ్యమైన అవకాశాన్ని 2024 ఎన్నికల సంవత్సరాని కన్నా ముందస్తుగానే తగినట్టుగా ఉపయోగించుకోగలరని ఆశిద్దాం!
ఏబీకే ప్రసాద్,సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment