సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తన పదవీకాలంలో అయోధ్య, శబరిమల, సెక్షన్ 377, గర్భ విచ్ఛిత్తి వంటి ఎన్నో చరిత్రాత్మక తీర్పులతో వార్తల్లో నిలిచారు. భారత అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ అయిన చంద్రచూడ్ నిజజీవితంలో మాత్రం ఎటువంటి ఆడంబరాలకు పోకుండా చాలా సాదాసీదాగా గడుపుతారన్న విషయం కొద్ది మందికే తెలుసు. తాజాగా చంద్రచూడ్ చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు. డీవై చంద్రచూడ్ మంచి న్యాయమూర్తే కాదు మంచి మనిషి కూడా అని అప్పుడే అందరికి తెలిసింది.
భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ గతేడాది నవంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గతంలో పనిచేసిన జస్టిస్ వైవీ చంద్రచూడ్ కుమారుడే డీవై చంద్రచూడ్. ఆయన తండ్రి వైవీ చంద్రచూడ్ సుప్రీంకోర్టులో గరిష్టంగా ఏడేళ్ల సుదీర్ఘ కాలం సీజేఐగా పనిచేసిన రికార్డు కూడా ఉంది. అంతే కాదు డీవై చంద్రచూడ్ ఇప్పటికే సుప్రీంకోర్టులో గత రెండేళ్లుగా ఎన్నో కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఇందులో అయోధ్య తీర్పుతో పాటు పలు కీలక తీర్పులు ఉన్నాయి.
నాణానికి ఒకవైపే.. ఈ విషయాలు తెలుసా?
ఆయన తండ్రి గతంలో ఇచ్చిన రెండు తీర్పుల్ని తిరగ రాసిన చరిత్ర కూడా డీవై చంద్రచూడ్‌కు సొంతం. ఇవన్నీ నాణానికి ఒకవైపే. కానీ వ్యక్తిగతంగా చూస్తే ఆయనలో మనకి తెలియని మానవతామూర్తి ఉన్నారు. కన్నబిడ్డలు కాకపోయినా తల్లిలా లాలించే ఆయన మనసు చూస్తే ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు. ఈ విషయం గురించి విశ్రాంత జస్టిస్ అమర్ గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. డీవై చంద్రచూడ్ మంచి న్యాయమూర్తే కాదు మంచి మనిషి కూడా అని వ్యాఖ్యానించారు.
పిల్లలిద్దరూ వికలాంగులే, అయినా దత్తత
ఇటీవలే జస్టిస్ డీవై చంద్రచూడ్ తన ఇద్దరు దత్తత కూతుళ్లను సుప్రీంకోర్టుకు తీసుకువచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. వారిలో పెద్దకుమార్తె పేరు ప్రియాంక. చిన్న కూతురి పేరు మహీ. ఇద్దరూ వికలాంగులే. వీల్ ఛైర్లకే పరిమితం. కోర్టు ప్రారంభం కావడానికి అరగంట ముందే సుప్రీంకోర్టుకు వచ్చిన చంద్రచూడ్.. తన ఇద్దరు పిల్లలు ప్రియాంక, మహీలకు చాంబర్, కోర్ట్ హాల్, ఇతర న్యాయమూర్తుల చాంబర్స్ మొదలైనవి స్వయంగా చూపించారు. కోర్టులో న్యాయమూర్తి ఎక్కడ కూర్చుంటారు? న్యాయవాదులు ఎక్కడి నుంచి వాదనలు వినిపిస్తారు? సాధారణ పౌరులు ఎక్కడ కూర్చుంటారు? మొదలైన విషయాలను వారికి వివరించారు.
విజిటర్స్ గ్యాలరీ నుంచి తను కూర్చునే కోర్టు హాల్ వరకు పిల్లలను వెంట తీసుకెళ్లారు. దీంతో పిల్లలిద్దరూ ఎంతగానో సంతోషించారు. కూతుళ్లను వారి కోరిక మేరకు సీజేఐ తీసుకువచ్చారని తెలిసి న్యాయవాదులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఆ ఇద్దరు కూతుళ్లు దివ్యాంగులు కావడం, వాళ్లను చంద్రచూడ్ దంపతులు దత్తత తీసుకొని మరీ కన్నబిడ్డల్లా పెంచుకుంటున్నారని చాలామందికి అప్పుడే తెలిసింది. ఆ పిల్లల సొంత తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో చంద్రచూడ్ దంపతులు వాళ్లను దత్తత తీసుకున్నారట.
క్యాన్సర్‌తో మొదటి భార్య మరణం
1959లో జన్మించిన చంద్రచూడ్ 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన తండ్రి కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుమారు ఏడేళ్ల ఐదు నెలల పాటు సుధీర్ఘకాలం సేవలందించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన వ్యక్తి కుమారుడు కూడా సీజేఐగా కావడం భారత చరిత్రలో ఇదే తొలిసారి. 2024 నవంబర్ 10 వరకూ చంద్రచూడ్ సీజీఐగా కొనసాగనున్నారు.
ఇక ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే.. చంద్రచూడ్ మొదటి భార్య రష్మీ 2007లో క్యాన్సర్‌తో మరణించింది. ఆ తర్వాత కల్పనను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. వీరు మహి, ప్రియాంక అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. అప్పటికే మొదటి భార్యతో చంద్రచూడ్‌కు అభినవ్, చింతన్ అనే కుమారులున్నారు. అయనప్పటికీ దివ్యంగులైన ఆడపిల్లలను దత్తత తీసుకొని వాళ్లను కన్నబిడ్డలా చూసుకోవడం అభినందనీయం.
Comments
Please login to add a commentAdd a comment