ఏటా రూ.66వేలు ఆర్థిక తోడ్పాటు
ఐదేళ్లలో కోటి మంది లబ్ధిదారులు: కేంద్రం
న్యూఢిల్లీ: యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇంటర్న్‌షిప్ పథకాన్ని తీసుకొచ్చి0ది. ఏటా రూ.66,000 మేర ఆర్థికసాయం అందించనుంది. ఐదేళ్లకాలంలో మొత్తంగా కోటి మంది 21–24 ఏళ్ల యువత ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారని కేంద్రప్రభుత్వం గురువారం ప్రకటించింది. 2024–25 ఆర్థికసంవత్సరంలో తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.800 కోట్లు ఖర్చుచేయనుంది.
ఈ ఆర్థికసంవత్సరంలో డిసెంబర్ రెండో తేదీన ప్రారంభమయ్యే ఈ పథకం ద్వారా 1,25,000 మంది లబి్ధపొందే వీలుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. టాప్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే యువతకు బీమా సౌకర్యం సైతం కల్పించనున్నారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే pminternship.mca.gov.inలో యువత ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రూ.6,000 అదనం
నెలకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.60,000 ఆర్థికసాయం అందనుంది. దీనికి అదనంగా ఏడాదిలో ఒకసారి రూ.6,000 గ్రాంట్ ఇవ్వనున్నారు. దీంతో ఏడాదికి ప్రతి లబ్ధి దారుడు రూ. 66,000 లబ్ధి పొందనున్నారు. ఈ వెబ్‌పోర్టల్‌లో అక్టోబర్ 12వ తేదీ నుంచి 25వ తేదీలోపు అందుబాటులో ఉన్న సమాచారంతో దరఖాస్తులను నింపొచ్చు.
వీటిని అక్టోబర్ 26వ తేదీన షార్ట్‌లిస్ట్ చేస్తారు. తర్వాత అభ్యర్థులను అక్టోబర్ 27వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీలోపు కంపెనీలు ఎంపిక చేస్తాయి. ఎంపికైన అభ్యర్థు లు తమ నిర్ణయాన్ని నవంబర్ 8–15ల మధ్య తెలపాల్సి ఉంటుంది. ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా మూడు ఆఫర్స్ ఇస్తారు.
టాప్ 500 కంపెనీల ఎంపిక
గత మూడేళ్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) నిధి పథకంలో భాగంగా తమ నికరలాభాల్లో కొంతమేర సమాజసేవ కోసం సవ్యంగా ఖర్చుచేసిన టాప్ 500 కంపెనీలను ఈ పథకం కోసం కేంద్రం ఎంపికచేస్తుంది.
రిజర్వేషన్లూ వర్తిస్తాయి!
అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లనూ వర్తింపజేస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అలెంబిక్, మహీంద్రా అండ్ మహీంద్రా, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లు 1,077 ఆఫర్లను ఇప్పటికే ప్రకటించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment