
2024లో 34 శాతం పెరిగిన అవకాశాలు
బిజినెస్ డెవలప్‌మెంట్ ఉద్యోగాలకూ డిమాండ్
జాబ్‌సైట్ వర్క్‌ఇండియా నివేదిక
ముంబై: టెలీ కాలింగ్, బిజినెస్ డెవలప్‌మెంట్ తదితర ఆధునిక విక్రయ విభాగాల్లో గతేడాది 34 శాతం అధిక ఉపాధి అవకాశాలు లభించినట్టు జాబ్‌పోర్టల్ ‘వర్క్ ఇండియా’ నివేదిక వెల్లడించింది. సేల్స్ ఉద్యోగ మార్కెట్ భారత్‌లో మార్పును చూస్తున్నట్టు తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. 2023తో పోల్చితే ఈ విభాగంలో 2024లో జాబ్ పోస్టింగ్‌లు 17 శాతం పెరిగాయి.
సంప్రదాయ మార్గాల కంటే కొత్త తరహా డిజిటల్ ఛానళ్లపైనే కంపెనీలు ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. ఇలా ఆధునిక విక్రయ ఛానళ్లలో టెలీకాలింగ్, బిజినెస్ డెవలప్‌మెంట్‌లో గతేడాది ఉపాధి అవకాశాలు అంతకుముందు ఏడాదితో పోల్చితే గణనీయంగా (34 శాతం) పెరిగాయి. సంప్రదాయ సేల్స్ ఉద్యోగాలైన రిటైల్, ఫీల్డ్ సేల్స్ ఉద్యోగాలు మాత్రం అంతకుముందు ఏడాదితో పోల్చితే 2 శాతం తగ్గాయి.
2023, 2024 సంవత్సరాల్లో తన ప్లాట్‌ఫామ్‌పై నమోదైన 12.8 లక్షల జాబ్ పోస్టింగ్‌ల డేటా ఆధారంగా ఈ వివరాలను వర్క్‌ఇండియా విడుదల చేసింది. అన్నింటిలోకి టెలీకాలర్ ఉద్యోగాలకు బూమింగ్ వాతావరణం ఉన్నట్టు ఈ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. ఎందుకంటే 2023లో టెలీకాలర్ ఉద్యోగాలకు ఎక్కువ పోస్టింగ్‌లు నమోదు కాగా, 2024లోనూ అదే వాతావరణం కొనసాగింది. 22 శాతం అధికంగా టెలీకాలర్ జాబ్ పోస్టింగ్‌లు వర్క్‌ఇండియాపై లిస్ట్ అయ్యాయి. బిజినెస్ డెవలప్‌మెంట్ జాబ్‌లకు ఏకంగా 80 శాతం అధిక పోస్టింగ్‌లు వచ్చాయి.
మహిళలకు ప్రాధాన్యం..
టెలీకాలర్ ఉద్యోగాల్లో మహిళల నియామకాలు గణనీయంగా పెరిగాయి. 2024లో టెలీకాలింగ్, బిజినెస్ డెవలప్‌మెంట్‌లో మహిళల నియామకం 2023తో పోల్చితే 80 శాతం పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. సేల్స్‌లో మహిళలకు పెరుగుతున్న ప్రాతినిధ్యాన్ని సూచిస్తున్నట్టు తెలిపింది.
సేల్స్‌లో మార్పులు..
అమ్మకాల విషయంలో కంపెనీల్లో వస్తున్న మార్పును ఈ గణాంకాలు ప్రతిఫలిస్తున్నట్టు వర్క్‌ఇండియా నివేదిక తెలిపింది. అదే సమయంలో సంప్రదాయ సేల్స్ ఉద్యోగాలకు తగ్గడాన్ని ప్రస్తావించింది. టైర్, 3, 4 పట్టణాల మినహా మిగిలిన చోట సంప్రదాయ సేల్స్ ఉద్యోగాల పోస్టింగ్‌లు తగ్గినట్టు తెలిపింది. కొత్త తరహా సేల్స్ ఉద్యోగాల నియామకాల్లో బెంగళూరు, ముంబై ముందున్నాయి. 2023తో పోల్చితే 2024లో బెంగళూరులో 33 శాతం, ముంబైలో 26 శాతం చొప్పున జాబ్ పోస్టింగ్‌లు ఎక్కువగా వచ్చాయి. పట్టణాల్లో విక్రయ నైపుణ్యాలున్న వారికి పెరుగుతున్న డిమాండ్‌కు ఇది అద్దం పడుతున్నట్టు ఈ నివేదిక పేర్కొంది.