![Increasing need for IT professionals in India with Artificial Intelligence](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/AI-HAND--1616622645_0.jpg.webp?itok=cOwxUKJO)
దేశంలో పెరుగుతున్న ఐటీ నిపుణుల అవసరం
నైపుణ్యం గల యువత కోసం కంపెనీల యత్నాలు
పెరుగుతున్న క్యాంపస్ నియామకాలు
ఏఐ, సంబంధిత నైపుణ్యానికి ప్రాధాన్యత
వచ్చే ఏడాది క్యాంపస్ నియామకాలు 20 శాతం పెరిగే చాన్స్!
బీటెక్ విద్యార్థుల్లో చిగురిస్తున్న ఆశలు
సాధారణ సాఫ్ట్‌వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ప్రధాన దేశాల్లో నిపుణుల సంఖ్య (లక్షల్లో)
సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణలకున్న ప్రాధాన్యత దృష్ట్యా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఐటీ నిపుణుల అవసరం పెరుగుతోంది. దీంతో పలు సంస్థలు నైపుణ్యం గల యువత కోసం అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా క్యాంపస్ నియామకాల కోసం కాలేజీల బాట పడుతున్నాయి. మారిన సాంకేతికత అవసరాలకు సరిపోయే నైపుణ్యం ఉన్నవారికే కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్ వంటి నేపథ్యం ఉన్న వారిని అత్యధిక వార్షిక వేతనంతో ఎంపిక చేసుకుంటున్నాయి.
వచ్చే విద్యా సంవత్సరంలో క్యాంపస్ నియామకాలు 20% పెరిగే వీలుందని ఇటీవల నౌకరీ డాట్ కామ్ సర్వే వెల్లడించడం గమనార్హం. పలు దేశాలు భారత్‌లో గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాల(జీసీసీ) ఏర్పాటుపై దృష్టి పెడుతున్నాయి. దీంతో నైపుణ్యం యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. వేగంగా విస్తరిస్తున్న జీసీసీలకు అత్యుత్తమ మానవ వనరులు అవసరమని నిపుణులు చెబుతున్నారు. తాజా పరిస్థితులు బీటెక్ విద్యార్థుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.
దేశంలో ఏఐ నిపుణులు అంతంతే..
ఇండక్షన్ అనే సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాలు 2025 చివరి నాటికి దేశవ్యాప్తంగా 3.64 లక్షల ఉద్యోగాలు సృష్టించే వీలుంది. ప్రస్తుతం జీసీసీల్లో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 19 లక్షలు కాగా 2030 నాటికి ఇది 28 లక్షలకు చేరుతుందని అంచనా. స్కిల్ ఇండియా రిపోర్టు ప్రకారం 2026 నాటికి దేశంలో 10 లక్షల మందికి పైగా ఏఐ నిపుణుల అవసరం ఏర్పడుతుంది. 2023 ఆగస్టు లెక్కల ప్రకారం దేశంలో 4.16 లక్షల మంది ఏఐ నిపుణులు మాత్రమే ఉన్నారు.
అంటే 2026 నాటికి సుమారుగా మరో 6 లక్షల మంది అవసరం కానున్నారు. ఈ నేపథ్యంలోనే అనవసర ఆందోళనలు పక్కనపెట్టి ఏఐని ఆహ్వానించాలని, ఐటీ దిగ్గజ సంస్థకు చెందిన జాకర్ తెలిపారు. ఇవన్నీ గమనంలో ఉంచుకునే విద్యా సంస్థలు ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి కోర్సుల్లో ప్రవేశాలు పెంచుకుంటున్నాయి. కంపెనీలు సైతం ఏఐపై పట్టున్న వారికే ప్రాంగణ నియామకాల్లోనూ మంచి అవకాశాలు ఇస్తున్నాయి.
ప్రత్యేక నైపుణ్యమే ప్రధానం
దేశంలో ప్రతి ఏటా 15 లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో కేవలం 9 శాతం మాత్రమే ఐటీ రంగంలో మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్‌పై పట్టు వారినే కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సివిల్, మెకానికల్‌లో బీటెక్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా ఏఐ, తదితర టెక్నాలజీల్లో సర్టిఫికెట్ కోర్సులు చేస్తేనే క్యాంపస్ నియామకాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు.
ఏఐ, డేటా సైన్స్ రంగాల్లోని పట్టభద్రులకు క్యాంపస్ నియామకాల్లో సంప్రదాయ ఐటీ రంగాల నిపుణుల కన్నా 30 శాతం ఎక్కువ వేతనాలు లభిస్తున్నాయి. జీసీసీల్లో అత్యధిక డిమాండ్ కలిగిన టెక్నాలజీల్లో నైపుణ్యం ఉన్నవారికి మంచి ప్యాకేజీలు ఇస్తున్నారు. క్యాంపస్ నియామకాల్లో ఏఐ ఇంజనీరింగ్, జనరేటివ్ ఏఐ, డేటా ఫ్యాబ్రిక్స్, డి్రస్టిబ్యూషన్ ఎంటర్‌ప్రైజెస్, క్లౌడ్ నేటివ్ ప్లాట్‌ఫామ్స్, అటానమస్ సిస్టమ్స్, డెసిషన్ ఇంటెలిజెన్స్, హైపర్ ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ మెష్ నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సైబర్ సెక్యూరిటీలో ప్రారంభ వేతనం సగటున ఏడాదికి 9.57 లక్షలుగా ఉంది.
ఏఐ నైపుణ్యానికి కంపెనీల ప్రాధాన్యం
రెండేళ్ళుగా జేఎన్‌టీయూహెచ్‌లో ప్రాంగణ నియామకాలు పెరుగుతున్నాయి. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఎఐఎంల్‌తో పాటు ఏఐ అనుసంధానం ఉన్న కోర్సుల విద్యార్థులకు కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. అయితే సివిల్, మెకానికల్ విద్యార్థులు కూడా ఈ ట్రెండ్‌ను అర్థం చేసుకుని, ఏఐఎంల్ మైనర్ డిగ్రీ కోర్సులు చేస్తున్నారు. వీరికి కూడా ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి.
– ప్రొఫెసర్ పద్మావతి విశ్వనాథ్ (వైస్ ప్రిన్సిపల్, జేఎన్‌టీయూహెచ్)
స్థానిక వనరులపై ఐటీ సంస్థల దృష్టి
ఏఐ విస్తరణకు అనుగుణంగా డేటా కేంద్రాలు, మాడ్యూల్స్ అభివృద్ధి చేయాల్సి వస్తోంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో స్థానికంగా మానవ వనరులు అభివృద్ధి పరుచుకోవడంపై సంస్థలు దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగానే నైపుణ్యం వారి కోసం క్యాంపస్ నియామకాలు పెంచాయి.
– నవీన్ ప్రమోద్ (ఎంఎన్‌సీ కంపెనీ హెచ్‌ఆర్ మేనేజర్)
Comments
Please login to add a commentAdd a comment