
దేశంలో 46 శాతం మందికి జీవనోపాధి
రైల్వే, ప్రభుత్వ రంగ సంస్థల్లో తగ్గిన ఉద్యోగులు
ఐటీ, ప్రైవేట్ బ్యాంకుల్లో పెరుగుదల
ఆర్‌బీఐ పీఎల్‌ఎఫ్ సర్వే నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలో ఉపాధి అవకాశాల కల్పనలో ఇప్పటికీ వ్యవసాయ రంగమే అగ్రగామిగా ఉన్నట్లు రిజర్వు బ్యాంకు రూపొందించిన నివేదిక వెల్లడించింది. 1991లో సరళీకృత ఆర్థిక విధానాలు అమలు చేసిన తరువాత దేశంలో ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. దీంతో వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడే వారి శాతం తగ్గినప్పటికీ నేటికీ అత్యధిక శాతం మందికి ఇవే ఉపాధి కల్పిస్తుండటం గమనార్హం.
దేశంలో వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలను ఆర్బీఐ ‘పీరియడిక్ లేబర్ ఫోర్స్ (పీఎల్‌ఎఫ్)’ సర్వే నివేదిక వెల్లడించింది. రైల్వే, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గగా ఐటీ కంపెనీలు, ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది.

పీఎల్‌ఎఫ్ నివేదికలోని ప్రధానాంశాలు..
1993–94లో దేశంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై 64 శాతం మంది ఆధారపడగా 2018–19 నాటికి అది 42.5 శాతానికి తగ్గింది. 2023–24 నాటికి మాత్రం వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు
పొందుతున్న వారి సంఖ్య కొంత పెరిగి 46.2 శాతంగా నమోదైంది.
అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థగా భారతీయ రైల్వే తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. అయినప్పటికీ రైల్వేలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 1991–92లో రైల్వే శాఖలో 16.52 లక్షల మంది ఉద్యోగులు ఉండగా 2023–24లో 11.90 లక్షలకు తగ్గింది.
బ్యాంకింగ్ రంగంలోనూ ఉపాధి అవకాశాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. 1991–92లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 8.47 లక్షల మంది ఉద్యోగులు ఉండగా ప్రైవేట్ బ్యాంకుల్లో 63 వేల మంది మాత్రమే ఉన్నారు. కానీ 2023–24 నాటికిప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కంటే ప్రైవేట్ బ్యాంకుల్లోనే ఉద్యోగులు ఎక్కువ మంది ఉండటం గమనార్హం. 2023–24లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 7.46 లక్షల మంది ఉద్యోగులు ఉండగా ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో 8.74 లక్షల మంది పని చేస్తున్నారు.
ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రాలో 2020 నాటికి 11.49 లక్షల మంది ఉద్యోగులు ఉండగా 2024 డిసెంబర్‌లో వీరి సంఖ్య 15.34 లక్షలకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment