business development
-
కుకింగ్ టు కామెడీ క్వీన్స్..
ఒకరు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అయ్యారు.. మరొకరు హెల్త్ కోచ్ అయ్యారు ఇంకొకరు పాకశాస్త్ర ప్రావీణ్యతను చాటుతున్నారు. పై చదువులు చదివి ఇంట్లో కూర్చున్న మహిళలు ఇంటర్నెట్లో ప్రభావశీలురుగా మారారు. ఇంటినుంచే వ్యాపారాన్ని అభివృద్ధి వైపుగా పరుగులు తీయిస్తున్నారు. సాధారణంగా గృహిణి జీవితం ఉదయం 4–5 గంటలకు నిద్రలేచి, ఇల్లు–వాకిలి శుభ్రం చేసుకొని, పిల్లలను స్కూల్‌కు పంపించి, అందరికీ అవసరమైనవి చేసి పెడుతుండగానే సాయంత్రం అవుతుంది. తిరిగి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. సాయంత్రం టీ, టిఫిన్లు, పిల్లల హోంవర్క్‌లు, రాత్రి భోజనం సిద్ధం చేయడం. రాత్రి పది–పదకొండు గంటలలోపు అన్నీ శుభ్రం చేసి అలసిపోయి అదే చిరునవ్వుతో అందరికీ గుడ్‌నైట్ చెప్పి నిద్రపోవడం. ఇలా ఇల్లు, పెద్దలు, భర్త, పిల్లల గురించి ఆలోచిస్తూ తమని తాము విస్మరించుకునే మహిళలకు ఇప్పుడు ఇంటినుంచే పని చేసే అవకాశాలు పెరుగుతున్నాయి. మంగళూరుకు చెందిన లిండా ఫెర్నాండేజ్ క్రెస్టా గృహిణి. నాలుగేళ్లుగా కామిక్ రీల్స్ చేస్తూ ప్రజాదరణ పొందింది. క్రెస్టాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.3 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అనేక బ్రాండ్లు ఆమెను సంప్రదిస్తూనే ఉన్నాయి. ఈ రోజు మంగళూరు వీధుల్లో ఆమె హోర్డింగులు కూడా పెట్టారంటే ఆమెకున్న ఆదరణ ఏ స్థాయిలో ఉందో చెప్పుకోవచ్చు. ‘గృహిణిగా ఉండటం ఎప్పుడూ కష్టమనిపించలేదు. కానీ, నా కొడుకుకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనుకున్నాను. దీంతో పాటు ఇంటి బాధ్యతనూ నిర్వర్తించాలనుకున్నాను. అందుకు మా కుటుంబమూ మద్దతు ఇస్తూ వచ్చింది’ అని చెబుతుంది క్రెస్టా. హోమ్ చెఫ్ నాజ్ అంజుమ్ హైదరాబాద్‌లో నివాసముంటున్న హోమ్ చెఫ్. ఏడేళ్ల క్రితం అంజుమ్ తన పేరుతో హోమ్ కిచెన్‌ను ప్రారంభించింది. ఈ రోజుల్లో గృహిణుల ఆలోచనే మారిపోయింది అనడానికి అంజుమ్ ఒక ఉదాహరణ. కాలంతో పాటు సమాజం ఆలోచనా విధానం కూడా మారింది. ఇంట్లో కూర్చున్నా నాకు సోషల్‌మీడియా చాలా ఆర్డర్లు తెచ్చిపెడుతోంది అని చెబుతుంది అంజుమ్. ‘నాకు ముగ్గురు పిల్లలు. ఉదయం 4 గంటలకు నిద్రలేచి, వారిని స్కూల్‌కి రెడీ చేసి, పంపించిన తర్వాత కిచెన్ బాధ్యత తీసుకుంటాను. 80 రూపాయలతో నా పని ప్రారంభించాను. మా చుట్టూ ఉన్నవారు నా వంటలు తిని మెచ్చుకునేవారు. మా అపార్ట్మెంట్ వాసులు సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేయమని సలహా ఇచ్చారు. అలా చేసిన వంటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేదాన్ని. ఆర్డర్లు వరుసగా రావడం ప్రారంభించాయి. ఈ రోజు సోషల్‌మీడియాలో హైదరాబాద్ ఫుడ్ సూపర్ హిట్‌గా పేరొందింది. దీంతో ఒక గృహిణిగా ఉన్న నేను ఉద్యోగినిగా మారిపోయాను’’ అని ఆనందంగా చెబుతుంది అంజుమ్. గృహిణి నుంచి ఒక మహిళ గృహ నిర్వాహకురాలిగా మారింది. ఈ ౖహె టెక్ ప్రపంచంలో గృహిణి తనకంటూ కొత్త బిరుదును సంపాదించుకుంటుంది. ఇప్పుడు తనను తాను పని చేసే గృహిణి అని పిలవడానికి ఇష్టపడుతుంది. ఇంట్లో ఉంటూ డబ్బు సంపాదిస్తూ, బాధ్యతలను నెరవేర్చడంలో తనదైన ప్రత్యేక శైలిని కలిగి ఉంది. మారుతున్న కాలంలో ఈ తరహా ఆలోచన గృహిణితో పాటు ఇంట్లో అందరికీ నచ్చుతోంది. చేతి కళకు ఆదరణ నేటి యాంత్రిక యుగంలో చేతితో తయారు చేసిన వస్తువులు దొరకడం కష్టం. నాణ్యమైన సంప్రదాయ పనితనం కోసం అన్ని వైపుల నుండి డిమాండ్ వస్తోంది. ప్రావీణ్యం కలిగిన మహిళలు తమ నైపుణ్యాలను ఉపయోగించుకుంటున్నారు. అదే సమయంలో చాలా మంది గృహిణులు తమ జ్ఞానం ఆధారంగా హోమ్ ట్యూషన్, బ్యూటీపార్లర్ వంటి సేవలను కూడా అందిస్తున్నారు. జర్నల్ ఆఫ్ కల్చరల్ ఎకానమీలో ప్రచురించిన ఒక అధ్యయనం సోషల్ మీడియాలో లైక్‌లు, షేర్లు గృహిణిని ‘అందం’ గా మార్చేశాయి అని నిర్వచించింది. సంప్రదాయ గృహిణులు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో ఆకర్షణీయంగా మాత్రమే కాకుండా వ్యాపారవేత్తలుగా కూడా మారారు. ఈ చిన్న ఆరంభం మహిళను ఉద్యోగ గృహిణిని చేసింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2020–21లో దేశంలో కేవలం 32 శాతం వివాహిత మహిళలు మాత్రమే ఉపాధి పొందుతున్నారు. వివాహిత మహిళల్లో 68 శాతం మంది గృహిణులుగా ఉన్నారు. మారిన కాలంలో ఇప్పుడు గృహిణిగా ఇంట్లో ఉంటూనే ఆర్థిక స్వావలంబన సాధిస్తోంది. ఇది ‘ఆమె’ నైపుణ్యాన్ని మరింతగా పెంచుతుంది. భారతదేశంలో చాలా మహిళలు నైపుణ్యం ఉన్నవారే. కొందరు కుట్లు–ఎంబ్రాయిడరీ చేయడంలో, కొందరు వంటలలో, మరికొందరు పెయింటింగ్‌లో నిష్ణాతులు. పనిచేసే గృహిణికి ఆమె ప్రతిభే ఆదాయ వనరుగా మారుతోంది. గృహిణి నిర్వచనంలోనే మార్పు.. కరోనా లాక్డౌన్ కారణంగా సోషల్ మీడియా గృహిణులకు డబ్బు సంపాదించే శక్తిని ఇచ్చింది. ఇప్పుడు అదే రోజువారీ దినచర్యగా మారిపోయింది. యుఎస్ జనరల్ సోషల్ సర్వే 1972 నుండి 2020 వరకు ఒక సర్వే నిర్వహించింది. ఇందులో శ్రామిక మహిళలు, పని చేసే గృహిణులు ఎంతో సంతోషంగా ఉన్నారని భావించారు. వీళ్లలో ఎక్కువ మంది మధ్య, ఉన్నత తరగతికి చెందిన 40 ఏళ్ల పైబడిన వారు. ఉద్యోగరీత్యా గృహిణిగా ఉన్నా ఇంటి నిర్వహణ, సంపాదనతో పాటు భవిష్యత్తు కోసం పొదుపు చేస్తున్నామనే విషయాలను ఈ సర్వే వెల్లడి చేసింది. -
వ్యాపారం పేరుతో గోల్మాల్
సాక్షి, హైదరాబాద్ : వ్యాపార విస్తరణ పేరుతో తమ వద్ద రుణం తీసుకుని పథకం ప్రకారం మోసం చేయడంతో పాటు గ్యారంటీగా పెట్టిన ఆస్తుల్ని ఉద్దేశపూర్వకంగా విక్రయించారంటూ కరూర్ వైశ్యా బ్యాంక్ అధికారులు నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) ఫిర్యాదు చేశారు. సదరు బ్యాంకును రూ.25 కోట్ల మేర ముంచారనే ఆరోపణలపై సికింద్రాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యాపారుల్ని అధికారులు ఇందులో నిందితులుగా చేర్చారు. ఈ గోల్మాల్ వ్యవహారంలో బ్యాంకు అధికారుల పాత్రను అనుమానిస్తూ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ ఎస్డీ రోడ్లో ఉన్న వర్చ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను జైన్ హితీష్ రమేష్ కుమార్, రమేష్ కుమార్ ఒట్రమాల్ జైన్ డైరెక్టర్లుగా నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ తమ వ్యాపార నిర్వహణ, విస్తరణ కోసం కరూర్ వైశ్యా బ్యాంక్ సికింద్రాబాద్ శాఖ నుంచి 2014లో రూ.15 కోట్ల రుణం పొందారు. దీంతో పాటు మరో రూ.15 కోట్లకు బ్యాంక్ గ్యారంటీగా (ఐలాండ్ లెటర్ ఆఫ్ క్రెడిట్) తీసుకున్నారు. వ్యాపారంలో ముడిసరుకుల ఖరీదు, ఇతర అంశాల్లో ఐఎస్‌సీని వినియోగించుకుంటారు. ఇలా మొత్తం రూ.30 కోట్లు పొందిన రుణాన్ని 2015లో రూ.40 కోట్లకు పెంచారు. అప్పటి నుంచి రెండేళ్ల పాటు (2017 వరకు) ఈ రుణాలను రెన్యువల్ చేస్తూ వెళ్లారు. రుణాలు పొందే సమయంలో బ్యాంకు గ్యారంటీగా హైదరాబాద్, సంగారెడ్డి, గుంటూరు, కర్నూలు, మెదక్ జిల్లాల్లో ఉన్న ఏడు స్థిరాస్తుల్ని బ్యాంకునకు దఖలు చేశారు. 2017 తర్వాత ఈ రుణాలకు సంబంధించి చెల్లింపులు, ఇతర అంశాలు ఆగిపోవడంతో బ్యాంకు అధికారులు తదుపరి కార్యాచరణ ప్రారంభించారు. 2018 మార్చ్‌లో ఈ రుణాలకు సంబంధించిన ఖాతాలను నాన్ పెర్ఫార్మెన్స్ అకౌంట్స్ కిందికి చేర్చారు. రుణాల వసూలులో భాగంగా బ్యాంకు అధికారులు సర్ఫేసీ యాక్ట్ ప్రకారం తమ వద్ద తనఖా పెట్టిన ఆస్తుల్లో నాలుగింటిని విక్రయించారు. ఈ నేపథ్యంలోనే వ్యాపారులు తీసుకున్న రుణానికి, వాళ్లు తాకట్టు పెట్టిన ఆస్తులకు పొంతన లేదని తేలింది. ఆస్తుల విలువ చాలా తక్కువగా, అప్పు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. గత ఏడాది డిసెంబర్ నాటికి ష్యూరిటీగా పెట్టిన ఆస్తుల విక్రయం పోను వ్యాపారులు బ్యాంకునకు రూ.24.13 లక్షలకు పైగా చెల్లించాల్సినట్లు తేల్చారు. దీంతో ఆ సంస్థకు చెందిన బ్యాంకు స్టేట్మెంట్లు, వ్యాపార లావాదేవీలను అధికారులు పరిశీలించారు. ఫలితంగా వ్యాపారం కోసం తీసుకున్న రుణం పక్కదారి పట్టిందని, ఉద్దేశపూర్వకంగా ఆ దుర్వినియోగానికి పాల్పడినట్లు తేల్చారు. ఈ ఆరోపణలతో వ్యాపారులపై సీసీఎస్‌లో కరూర్ వైశ్యా బ్యాంకు ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు నేరం జరిగినట్లే తేల్చారు. దీంతో నిందితులపై చీటింగ్ సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారం సికింద్రాబాద్ కరూర్ వైశ్యా బ్యాంకు పాత్రను పోలీసులు అనుమానిస్తున్నారు. గ్యారంటీ పెట్టిన ఆస్తుల విలువకు, అప్పులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎలా గుర్తించలేకపోయారు? నిందితుల తమ ఆస్తులకు చూపిన మార్కెట్ విలువను రుణం మంజూరు సమయంలో ఎలా ధ్రువీకరించుకున్నారు? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి త్వరలో కొందరికి నోటీసులు జారీ చేయడానికి సీసీఎస్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. -
వాహన సర్వీసింగ్... ఇంటికే!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మెట్రో నగరాల్లో కారు లేదా బైక్ సర్వీసింగ్ అంటే పెద్ద ప్రహసనం. ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీలో ఎలాగైతే ఆర్డర్ చేసుకుంటున్నామో.. అంతే సులువుగా వాహన సర్వీసింగ్ సేవలందిస్తే? జస్ట్.. సింపుల్! ఆర్డర్ బుక్ చేసిన 20 నిమిషాల్లో ఇంటి వద్దకే టెక్నీషియన్ వచ్చి... బైక్, కార్ సర్వీసింగ్ చేసేస్తారు. ఇదే డూయర్స్ పని. మరిన్ని వివరాలు కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ మహేశ్ షేట్కర్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘బెంగళూరు, పుణే, హైదరాబాద్‌లో సేవలందిస్తున్నాం. వర్క్‌షాప్స్, టెక్నీషియన్స్, వాహన విడిభాగాల కోసం స్థానిక సర్వీసింగ్ సెంటర్లతో ఒప్పందం చేసుకున్నాం. 45 రోజులు వర్క్‌షాప్ నిర్వహించి, డిమాండ్‌ను పరిశీలించాక టెక్నీషియన్స్‌కు శిక్షణ ఇచ్చి డూయర్స్లో నమోదు చేస్తాం. ప్రస్తుతానికి మూడు నగరాల్లో కలిపి 200 వర్క్‌షాప్స్, 500 మంది టెక్నీషియన్స్ ఉన్నారు. వచ్చే ఏడాది కాలంలో వీటి సంఖ్యను 500కు చేరుస్తాం. ఆర్డర్ బుక్ కాగానే దగ్గర్లోని వర్క్‌షాప్‌కు అలర్ట్ వెళుతుంది. 20–40 నిమిషాల్లో టెక్నీషియన్ ఇంటికి చేరుకొని.. మైనర్ సర్వీసింగ్ అయితే అక్కడే పూర్తి చేస్తాడు. మేజర్ అయితే వర్క్‌షాప్‌కు తీసుకెళ్లి వాహన రిపోర్ట్, ఇన్వాయిస్ను కస్టమర్‌కు పంపిస్తాడు. ఓకే అయితే సర్వీసింగ్ ప్రారంభమవుతుంది. నెలకు 8–10 వేల ఆర్డర్లు... హోమ్ సర్వీసింగ్‌తో పాటూ బ్రేక్ డౌన్, టైర్ల మార్పు, పెయింటింగ్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి సేవలనూ అందిస్తున్నాం. ప్రస్తుతానికి మూడు నగరాల్లో కలిపి నెలకు 8–10 వేల ఆర్డర్లు వస్తున్నాయి. వీటిలో 60 శాతం బైక్, 40 శాతం కార్ సర్వీసింగ్ ఆర్డర్లు. బైక్‌కు 4 గంటలు, కార్కు 7 గంటల సమయం పడుతుంది. ధరలు రూ.150 నుంచి లక్షన్నర వరకున్నాయి. ఆథరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్‌తో పోలిస్తే 20–45 శాతం వరకు ధరలు తక్కువగా ఉంటాయి. ప్రతి నెలా ఆర్డర్లు, ఆదాయంలో 40% వృద్ధిని నమోదు చేస్తున్నాం. 6 నెలల్లో విజయవాడ, వైజాగ్‌లో.. ప్రస్తుతం హైదరాబాద్‌లో 25 వర్క్‌షాప్స్, 150 మంది టెక్నీషియన్స్ ఉన్నారు. నెలకు వెయ్యి ఆర్డర్లు వస్తున్నాయి. 3 నెలల్లో చెన్నై, ముంబై, ఢిల్లీ, గుర్గావ్ నగరాలకు విస్తరించనున్నాం. 6 నెలల్లో 50 వర్క్‌షాప్స్‌తో విజయవాడ, విశాఖపట్నంలో సేవలు ప్రారంభిస్తాం. ప్రస్తుతం మా కంపెనీలో 25 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో ఈ సంఖ్యను మూడింతలు చేస్తాం. ఏడాదిలో నిధుల సమీకరణ పూర్తి చేసి.. ఇంటి వద్దకే పెట్రోల్, డీజిల్ సరఫరా సేవలను ప్రారంభిస్తాం’’ అని’ మహేశ్ వివరించారు. -
నేటి నుంచి అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు
విశాఖ సిటీ: పారిశ్రామిక నవకల్పనలు, సాంకేతిక ఉత్పత్తి, పారిశ్రామికీకరణ అంశాలపై విశాఖపట్నంలో బుధవారం నుంచి 19 వరకు నిర్వహించే అంతర్జాతీయ మహిళా పారిశ్రామికాభివృద్ధి సదస్సుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సదస్సును ప్రారంభిస్తారు. తమ ఉత్పత్తుల్ని ప్రదర్శించడంతో పాటు వ్యాపార అభివృద్ధిపై చర్చించేందుకు దేశ విదేశాలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు రానున్నారు. భారత మహిళా పారిశ్రామిక వేత్తల సమాఖ్య (అలీఫ్ ఇండియా), దక్షిణాసియా మహిళాభివృద్ధి సంస్థతో కలిసి ఏపీ ప్రభుత్వం సదస్సును హోటల్ నోవాటెల్‌లో నిర్వహించనుంది. -
ఏయూను సందర్శించిన ఆస్ట్రేలియా బృందం
ఏయూక్యాంపస్ : ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందం మంగళవారం సాయంత్రం సందర్శించింది. ఆస్ట్రేలియా ట్రేడ్ కమిషనర్ టామ్ కాల్డర్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ (ఆస్ట్రేలియా ప్రభుత్వం) రామకృష్ణ దస్త్రాలలు వర్సిటీ రెక్టార్ ఆచార్య ఇ.ఎ.నారాయణతో సమావేశమయ్యారు. ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలతో ఏయూ సంయుక్తంగా పనిచేయడానికి సాధ్యాసాధ్యాలపై చర్చించారు. సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ విభాగాలలో కోర్సుల నిర్వహణపై విస్తృతంగా చర్చించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ద్వారా అందిస్తున్న కోర్సులు, విద్యార్థుల సంఖ్య, కళాశాల సామర్ధ్యాలు వంటి అంశాలను రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు వివరించారు. పలు విదేశీ విశ్వవిద్యాలయాలు ఏయూతో కలసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్.వి.రామచంద్రమూర్తి, విదేశీ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య బి.మోహనవెంకటరామ్, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఆచార్య డి.ఎస్.ఆర్.మూర్తి, ఆర్కిటెక్చర్ విభాగాధిపతి రేవతి, మీడియా రిలేషన్స్ అసోసియేట్ డీన్ చల్లా రామకృష్ణ, వాణిజ్య నిర్వహణ విభాగాధిపతి ఎం.మధుసూదన రావు, పీఆర్వో మార్కండేయులు పాల్గొన్నారు. -
సోషల్ మీడియాతో వ్యాపారాభివృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపారాభివృద్ధిలో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడీయా కీలక పాత్ర పోషిస్తున్నాయని, వీటిని ఉపయోగించుకొని చిన్న మధ్య స్థాయి కంపెనీలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని సెయైంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బి.వి.ఆర్.మోహన్ రెడ్డి తెలిపారు. మారుతున్న టెక్నాలజీతో వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకోవడం అనే అంశంపై టాటా డొకొమో ‘ డు బిగ్ సింపోజియం’ నిర్వహించింది. ఈ కార్యక్రమంలోమోహన్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ - మొబైల్ - ఇంటర్నెట్ (ఎస్ఎంఐ) వినియోగించుకోవడం ద్వారా మార్కెట్ వాటాను పెంచుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా టాటా డొకొమో ఎస్ఎంఐ సొల్యూషన్‌ను లాంఛనంగా ప్రారంభించింది.