ఒకరు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్ అయ్యారు.. మరొకరు హెల్త్ కోచ్ అయ్యారు ఇంకొకరు పాకశాస్త్ర ప్రావీణ్యతను చాటుతున్నారు. పై చదువులు చదివి ఇంట్లో కూర్చున్న మహిళలు ఇంటర్నెట్‌లో ప్రభావశీలురుగా మారారు. ఇంటినుంచే వ్యాపారాన్ని అభివృద్ధి వైపుగా పరుగులు తీయిస్తున్నారు.
సాధారణంగా గృహిణి జీవితం ఉదయం 4–5 గంటలకు నిద్రలేచి, ఇల్లు–వాకిలి శుభ్రం చేసుకొని, పిల్లలను స్కూల్‌కు పంపించి, అందరికీ అవసరమైనవి చేసి పెడుతుండగానే సాయంత్రం అవుతుంది. తిరిగి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. సాయంత్రం టీ, టిఫిన్లు, పిల్లల హోంవర్క్‌లు, రాత్రి భోజనం సిద్ధం చేయడం. రాత్రి పది–పదకొండు గంటలలోపు అన్నీ శుభ్రం చేసి అలసిపోయి అదే చిరునవ్వుతో అందరికీ గుడ్‌నైట్ చెప్పి నిద్రపోవడం. ఇలా ఇల్లు, పెద్దలు, భర్త, పిల్లల గురించి ఆలోచిస్తూ తమని తాము విస్మరించుకునే మహిళలకు ఇప్పుడు ఇంటినుంచే పని చేసే అవకాశాలు పెరుగుతున్నాయి.
మంగళూరుకు చెందిన లిండా ఫెర్నాండేజ్ క్రెస్టా గృహిణి. నాలుగేళ్లుగా కామిక్ రీల్స్ చేస్తూ ప్రజాదరణ పొందింది. క్రెస్టాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.3 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అనేక బ్రాండ్లు ఆమెను సంప్రదిస్తూనే ఉన్నాయి. ఈ రోజు మంగళూరు వీధుల్లో ఆమె హోర్డింగులు కూడా పెట్టారంటే ఆమెకున్న ఆదరణ ఏ స్థాయిలో ఉందో చెప్పుకోవచ్చు. ‘గృహిణిగా ఉండటం ఎప్పుడూ కష్టమనిపించలేదు. కానీ, నా కొడుకుకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనుకున్నాను. దీంతో పాటు ఇంటి బాధ్యతనూ నిర్వర్తించాలనుకున్నాను. అందుకు మా కుటుంబమూ మద్దతు ఇస్తూ వచ్చింది’ అని చెబుతుంది క్రెస్టా.
హోమ్ చెఫ్
నాజ్ అంజుమ్ హైదరాబాద్‌లో నివాసముంటున్న హోమ్ చెఫ్. ఏడేళ్ల క్రితం అంజుమ్ తన పేరుతో హోమ్ కిచెన్‌ను ప్రారంభించింది. ఈ రోజుల్లో గృహిణుల ఆలోచనే మారిపోయింది అనడానికి అంజుమ్ ఒక ఉదాహరణ. కాలంతో పాటు సమాజం ఆలోచనా విధానం కూడా మారింది. ఇంట్లో కూర్చున్నా నాకు సోషల్‌మీడియా చాలా ఆర్డర్లు తెచ్చిపెడుతోంది అని చెబుతుంది అంజుమ్.
‘నాకు ముగ్గురు పిల్లలు. ఉదయం 4 గంటలకు నిద్రలేచి, వారిని స్కూల్‌కి రెడీ చేసి, పంపించిన తర్వాత కిచెన్ బాధ్యత తీసుకుంటాను. 80 రూపాయలతో నా పని ప్రారంభించాను. మా చుట్టూ ఉన్నవారు నా వంటలు తిని మెచ్చుకునేవారు. మా అపార్ట్‌మెంట్ వాసులు సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేయమని సలహా ఇచ్చారు. అలా చేసిన వంటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేదాన్ని. ఆర్డర్‌లు వరుసగా రావడం ప్రారంభించాయి. ఈ రోజు సోషల్‌మీడియాలో హైదరాబాద్ ఫుడ్ సూపర్ హిట్‌గా పేరొందింది. దీంతో ఒక గృహిణిగా ఉన్న నేను ఉద్యోగినిగా మారిపోయాను’’ అని ఆనందంగా చెబుతుంది అంజుమ్.
గృహిణి నుంచి ఒక మహిళ గృహ నిర్వాహకురాలిగా మారింది. ఈ ౖహె టెక్ ప్రపంచంలో గృహిణి తనకంటూ కొత్త బిరుదును సంపాదించుకుంటుంది. ఇప్పుడు తనను తాను పని చేసే గృహిణి అని పిలవడానికి ఇష్టపడుతుంది. ఇంట్లో ఉంటూ డబ్బు సంపాదిస్తూ, బాధ్యతలను నెరవేర్చడంలో తనదైన ప్రత్యేక శైలిని కలిగి ఉంది. మారుతున్న కాలంలో ఈ తరహా ఆలోచన గృహిణితో పాటు ఇంట్లో అందరికీ నచ్చుతోంది.
చేతి కళకు ఆదరణ
నేటి యాంత్రిక యుగంలో చేతితో తయారు చేసిన వస్తువులు దొరకడం కష్టం. నాణ్యమైన సంప్రదాయ పనితనం కోసం అన్ని వైపుల నుండి డిమాండ్ వస్తోంది. ప్రావీణ్యం కలిగిన మహిళలు తమ నైపుణ్యాలను ఉపయోగించుకుంటున్నారు. అదే సమయంలో చాలా మంది గృహిణులు తమ జ్ఞానం ఆధారంగా హోమ్ ట్యూషన్, బ్యూటీపార్లర్ వంటి సేవలను కూడా అందిస్తున్నారు.
జర్నల్ ఆఫ్ కల్చరల్ ఎకానమీలో ప్రచురించిన ఒక అధ్యయనం సోషల్ మీడియాలో లైక్‌లు, షేర్లు గృహిణిని ‘అందం’ గా మార్చేశాయి అని నిర్వచించింది. సంప్రదాయ గృహిణులు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో ఆకర్షణీయంగా మాత్రమే కాకుండా వ్యాపారవేత్తలుగా కూడా మారారు. ఈ చిన్న ఆరంభం మహిళను ఉద్యోగ గృహిణిని చేసింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2020–21లో దేశంలో కేవలం 32 శాతం వివాహిత మహిళలు మాత్రమే ఉపాధి పొందుతున్నారు. వివాహిత మహిళల్లో 68 శాతం మంది గృహిణులుగా ఉన్నారు. మారిన కాలంలో ఇప్పుడు గృహిణిగా ఇంట్లో ఉంటూనే ఆర్థిక స్వావలంబన సాధిస్తోంది. ఇది ‘ఆమె’ నైపుణ్యాన్ని మరింతగా పెంచుతుంది. భారతదేశంలో చాలా మహిళలు నైపుణ్యం ఉన్నవారే. కొందరు కుట్లు–ఎంబ్రాయిడరీ చేయడంలో, కొందరు వంటలలో, మరికొందరు పెయింటింగ్‌లో నిష్ణాతులు. పనిచేసే గృహిణికి ఆమె ప్రతిభే ఆదాయ వనరుగా మారుతోంది.
గృహిణి నిర్వచనంలోనే మార్పు..
కరోనా లాక్‌డౌన్ కారణంగా సోషల్ మీడియా గృహిణులకు డబ్బు సంపాదించే శక్తిని ఇచ్చింది. ఇప్పుడు అదే రోజువారీ దినచర్యగా మారిపోయింది. యుఎస్ జనరల్ సోషల్ సర్వే 1972 నుండి 2020 వరకు ఒక సర్వే నిర్వహించింది. ఇందులో శ్రామిక మహిళలు, పని చేసే గృహిణులు ఎంతో సంతోషంగా ఉన్నారని భావించారు. వీళ్లలో ఎక్కువ మంది మధ్య, ఉన్నత తరగతికి చెందిన 40 ఏళ్ల పైబడిన వారు. ఉద్యోగరీత్యా గృహిణిగా ఉన్నా ఇంటి నిర్వహణ, సంపాదనతో పాటు భవిష్యత్తు కోసం పొదుపు చేస్తున్నామనే విషయాలను ఈ సర్వే వెల్లడి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment