అప్పటి వరకు అమ్మనాన్న, కుటుంబ సంరక్షణలో సాఫీగా సాగిపోయే జీవితం ఒక్కసారిగా తలకిందులైతే..! 16 ఏళ్ళ వయసులో తాన్యా జీవితం అలాగే అయ్యింది. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం, తండ్రి వదిలేసి వెళ్లటంతో తల్లి దేవేశ్వరి నాయల్ తాన్యాను, ఆమె తమ్ముడిని పెంచటానికి అనేక ఆర్థికపరమైన సవాళ్ళను ఎదుర్కొంది. ఆ సమయంలో కూలిపోతున్న కలల ప్రపంచాన్ని నిర్మించుకోవడానికి తాన్యా తల్లికి చేదోడుగా ఉండి, తను కూడా సొంతకాళ్లపై నిలబడింది. ఫ్యాషన్ డిజైనర్‌గా, విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగింది.
జీవితంలోని ఏదో ఒక దశలో చీకటి క్షణాలు కమ్ముకుంటాయి. ఇలాంటప్పుడు కూడగట్టుకున్న ధైర్యం నిలిచిన విధానం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. తనను తాను నిలదొక్కుకోవడమే కాకుండా తల్లికి చేదోడుగా ఉంటూ ఎదిగిన తాన్యా యువతకు స్ఫూర్తిగా నిలిచే ఓ పాఠం.
ముంచెత్తే సవాళ్లు
పదహారేళ్ల వయసు అంటే ఎన్నో కలలతో కూడుకున్నది. కుటుంబం నుంచి భద్రతను కోరుకునే కాలం. అలాంటి సమయంలో ఇల్లు అభద్రతలో కూరుకు΄ోయింది. వయసులో ఉండటం కారణంగా చుట్టూ నిండా ముంచెత్తే సవాళ్లను ఎదుర్కొంది. అయినప్పటికీ జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం, అచంచలమైన స్ఫూర్తితో, ఆమె తన పరిస్థితుల సంక్లిష్టతలను బ్యాలెన్స్ చేసుకోగలిగింది. సరైన చదువు లేకపోవడంతో తగిన ఉపాధి దొరకక దేవేశ్వరినాయల్ చాలా కష్టపడేది. దీంతో కుటుంబ ఆర్థిక ఒత్తిడి ఆమె తట్టుకోలేకపోయేది. ఈ క్లిష్ట సమయంలో తాన్య ఒక ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును అభ్యసిస్తూనే చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్పే బాధ్యతను తీసుకుంది. ఇంతలో, కొత్త అవకాశాల కోసం తమ ఇంటిని వదిలిపెట్టారు. తాన్య నాటి రోజులను గుర్తుచేసుకుంటూ–‘పరిచయస్తుల ద్వారా మా అమ్మతో కలిసి రాష్ట్ర దూరదర్శన్ కేంద్రానికి చేరుకున్నాను. అక్కడ, గిరిజనుల దుస్తులను డిజైన్ చేయడానికి నాకు ఆఫర్ వచ్చింది. అప్పటి సెంటర్ డైరెక్టర్ అనుపమ్ జైన్, ఆమె తల్లి మధ్య జరిగిన సంభాషణలో నాకో మార్గం కనిపించింది. దూరదర్శన్ సిబ్బందికి ఒక సాధారణ టిఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని జైన్ మాతో చెప్పింది. ఇది మా జీవితాలకు ఒక మలుపుగా మారింది’ అంటుంది తాన్యా.
అంకిత భావం
దేవేశ్వరి గర్వాలీ, హిందీ భాష రెండింటిలోనూ నిష్ణాతులు. ఆమె భాషా ప్రావీణ్యం దూరదర్శన్ లోని ఒక అధికారి దృష్టిని ఆకర్షించింది. మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అనేక మంది స్థానిక కళాకారులు హిందీ రాకపోవడంతో ఇబ్బంది పడుతుండేవారు. వారి ఆలోచనలను హిందీలోకి అనువదించడం ద్వారా దేవేశ్వరి భాషా అంతరాన్ని తగ్గించేవారు. అలా దేవేశ్వరి, తాన్య స్థిరమైన ఆదాయం పొందడం అక్కడ నుంచే మొదలైంది. తాన్య అంకితభావం, నైపుణ్యం దూరదర్శన్ కేంద్రంలో కళాకారుల కోసం దుస్తులను రూపొందించే అవకాశాన్ని కూడా సంపాదించిపెట్టింది. కుటుంబం ప్రధాన జీవనోపాధిగా ఆమె పాత్రను మరింత పటిష్టం చేసింది. ఎంతోమందికి ఇబ్బంది అనిపించే బాధ్యతను తాన్యా అతి చిన్న వయసులోనే అలా తీసుకుంది. (కీర్తి సురేష్ మెహిందీ లెహెంగా విశేషాలు, ఫోటోలు వైరల్)
సామాజికంగా ఉన్నతంగా!
చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నప్పుడు, దేవేశ్వరి గుండెలో ఆమె మాజీ భర్త పట్ల ద్వేషం ఉండేది. ఆమె తన గౌరవాన్ని తిరిగి పొందాలని చదువుతో తన పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకురావాలనుకుంది. నిశ్శబ్ద ప్రతీకారంతోనే సామాజికంగా ఉన్నతంగా నిలబడాలని ఆశించింది. వివిధ మార్గాల్లో ఆదాయ వనరులతో ఆమె తాన్య, తరుణ్‌ను మర్చంట్ నేవీలోకి పంపగలిగింది. పోరాటం నుండి విజయం వరకు తాన్య ప్రయాణం అనేక మైలురాళ్లతో సాగింది. వాటిలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆమె పేరు పొందుపరచడం. (Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్!)
నేడు, తాన్య తన స్వంత సంస్థ అయిన ‘తంతి’ వ్యవస్థాపకురాలు. ఈ పదం సంస్కృతం నుండి తీసుకున్నది. ఒక చిన్న వెంచర్‌గా ప్రారంభమైన ‘తంతి’ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న వ్యాపారం. డిజైనర్లు, టైలర్లు, మహిళలతో సహా 53 మందికి వ్యాపారం ద్వారా ఉపాధి కల్పిస్తోంది. ఉత్తరాఖండ్‌లో తాన్యా నాయల్ పేరు ఇప్పుడు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆ పేరు ఒక్కటి చాలు, ఆమె స్థాయి ఏంటో ఇట్టే చెప్పేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment