ప్రపంచంలో వేగంగా వస్తున్న మార్పులను అనుసరించి భారతీయ సమాజం కూడా ఆధునికీకరణ చెందుతోంది. విద్య, వైద్యం, ఆరోగ్య, వాణిజ్య, పారిశ్రామిక, పర్యావరణ, సాంకేతిక రంగాల్లో స్త్రీలు దూసుకుపోతున్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు స్త్రీలు అంకురార్పణ చేస్తున్నారు. సుమారు వందమంది మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చంద్రయాన్–3 మిషన్‌లో కీలక సేవల్ని అందించారు. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిణామంలోనూ స్త్రీలు వారి ప్రతిభను చూపుతూనే వున్నారు. ఇది వారి వ్యక్తిత్వంలోని ఔన్నత్యం. వివక్ష, అణిచివేత వారిని నిలువరించలేక పోతున్నాయి. అయితే స్త్రీల రాజకీయ ప్రాతినిధ్యం కూడా పెరిగినప్పుడే సమానత్వం పునాదిగా కలిగిన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది.
అన్ని రంగాల్లో ప్రాముఖ్యతను సాధించేందుకు, వివక్షకు వ్యతిరేకంగా స్త్రీలు యుద్ధం చేస్తూనే ఉన్నారు. గత రెండు సంవత్సరాల్లో ప్రకటించిన శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులలోస్త్రీలకు ఒక్కటి కూడా లభించలేదు. వీటిని ప్రతి సంవత్సరం 45 ఏళ్ళ లోపు వయసున్న 12 మంది అసాధారణ యువ శాస్త్రవేత్తలకు ఇస్తున్నారు. ఈ అంశంపై పలువురు మహిళా శాస్త్రవేత్తలు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏ రంగంలో అయినా సామర్థ్యాలను అంచనా వేసేటప్పుడు హేతుబద్ధత అవసరం.
1958 నుండి ఆరు దశాబ్దాలుగా 592 మంది భట్నాగర్ పుర స్కారాన్ని స్వీకరించారు. ఇప్పటి వరకు 20 మంది మహిళా శాస్త్ర వేత్తలకు మాత్రమే ఈ అవార్డు లభించింది. మహిళలు తమ కుటుంబ, సమాజ బాధ్యతలు పూరించేందుకుగానూ కోల్పోయిన కెరీర్ సంవ త్సరాలను వారి జీవ సంబంధ వయస్సుతో నిర్ణయించకుండా, ‘అకడమిక్’ వయసుతో పరిగణించాలని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
నోబెల్ బహుమతి గ్రహితల్లో స్త్రీకి ప్రాధాన్యం లేకపోవడంపై 2019లో ‘నేచర్’లో ఒక వ్యాసం ప్రచురితమైంది. ఈ వివక్షను వారు సైద్ధాంతికంగా అధ్యయనం చేసినపుడు పలు ఆసక్తికర విషయాలు వెల్లడైనాయి. మహిళలకు అందుబాటులో వున్న వనరులు తక్కువగా ఉండటంతో, వారి ప్రచురణలు పురుషులతో పోల్చినప్పుడు తక్కు వగా వుంటున్నాయి.
అధ్యాపక రంగంలో వున్న మహిళలు పురుషు లతో సమానంగా వారి ప్రచురణార్థం ఖర్చు చేసుకోలేక ప్రచురణలో వెనుకబడుతున్నారు. అసంఘటిత కార్మిక రంగంలో స్త్రీల ఉత్పాదక తపై పరిశోధన గావించిన క్లాడియా గోల్పిన్‌కు ఆర్థిక శాస్త్రంలో 2023లో నోబెల్ బహుమతి లభించిన నేపథ్యంలో ఈ చర్చ ప్రాధా న్యత సంతరించుకుంది. అయితే ఈ సంవత్సరం వివిధ రంగాల్లో నోబెల్ బహుమతి పొందినవారిలో మహిళా ప్రాతినిధ్యం పెరిగింది.
మానవ నాగరికతను పరిశీలించినపుడు, ప్రతి కీలకమైన పరి ణామంలో స్త్రీ ప్రధాన భూమిక పోషించింది. బ్రిటీష్ వారి అణచి వేతను ఎదుర్కోవలసినప్పుడు ముందుండి పోరాటాన్ని నడిపించిన ధీర వనితలు ఎందరో దేశం కోసం అసువులు బాశారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి కుల మతాలకు తావులేకుండా కొల్లిపర సీతమ్మ, కొర్రపాటి అంతమ్మ, నాదెళ్ళ రంగమ్మ, మల్లంపాటి రత్నమాణి క్యమ్మ, దోనేపూడి బాలమ్మ, గొర్రెపాటి సరస్వతమ్మ, మానేపల్లి సరళా దేవి, సూరపనేని వెంకట సుబ్బమ్మ, మిక్కిలినేని వరలక్ష్మమ్మ మొద లుగు మహిళామణులు స్వాతంత్య్రోద్యమ సమరాన్ని ముందుండి నడి పారు. పోరాటాలను భారతీయ మహిళలకు కొత్తగా నేర్పించా ల్సిన పనిలేదు. వారి మాతృత్వం, కరుణ, సమానత్వం వారి వ్యక్తిత్వ వికాసానికి పునాది.
ఇటీవలే నూతన పార్లమెంటు భవనంలో చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తొలి బిల్లును ప్రవేశపెట్టారు. ఇది చారిత్రాత్మక నిర్ణయం. అసలు చట్ట సభల్లో 33 శాతం మహిళలకు కేటాయించాల్సిన ఆవశ్యకత భారతదేశానికి ఎందుకు కలిగిందో ఆలోచించాలి. 1970లో లోక్‌సభలో వీరి ప్రాధాన్యం 5 శాతంగా వుండగా, 2009లో అత్యధికంగా 15 శాతం మంది మహిళా ప్రతినిధులు లోక్‌సభలో ప్రవేశించారు.
12.7 శాతం ప్రతినిధులు రాజ్యసభలో సభ్యత్వం పొందగలిగారు. ఈ గణాంకాలు భారతీయ సమాజం సమానత్వానికి ఎంత దూరంలో వుందో స్పష్టం చేస్తున్నాయి. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవు తోంది. అయినా రాజకీయ రంగంలోని లింగవివక్షను రూపు మాపాలంటే, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అసమానతలను రూపు మాపాల్సి ఉంటుందని గుర్తించాలి.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అన్నట్లు ఆర్థిక స్వావలంబన భారతీయ సమాజంలో స్త్రీకి యింకా పూర్తిగా లభించలేదు. అందుకే వారి రాజకీయ ప్రాతినిధ్యం పది నుండి పదిహేను శాతానికి పరిమి తమైంది. నూతన నారీ శక్తి వందన చట్టం అమలులోకి వస్తే లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని మొత్తం సీట్లలో 33 శాతం మహిళలకు రిజర్వ్ అవుతాయి. ఎక్కువమంది స్త్రీలు నాయకులుగా ఈ దేశానికి అవసరం. స్త్రీ నాయకురాలైనపుడు వ్యవస్థలో నీతి, నిజాయితీ, నిస్వార్థ సేవ, మాతృస్వామ్య గుణం వర్ధిల్లుతాయి. వీరి సారథ్యంలో దేశం నిష్పాక్షికంగా పురోగతి సాధిస్తుంది.
స్త్రీ సాధికారికతను వారి సుస్థిత ఆర్థిక ప్రగతి, పురోగతి నిర్దేశిస్తాయి. బహిరంగ ప్రదేశాల్లో భద్రత, సమానత్వం పెంపొందించడం ద్వారా మరింత మహిళా భాగస్వామ్యం మెరుగుపరచడానికి అవకాశం వుంటుంది. అదే విధంగా అసంఘటిత స్త్రీలు, విద్యాధికు లతో పోల్చినపుడు ఓటు హక్కును వినియోగించుకోవడంలో స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విద్యావంతులైన స్త్రీలు రాజకీయ నాయకురాళ్ళుగా మరింత ఉత్సా హంగా భాగస్వాములు కావాల్సి వుంది.
ఈ లక్ష్యాలు నెరవేరడానికి స్త్రీపై పెట్రేగిపోతున్న దమనకాండను నిలువరించాలి. విద్యార్జన కొరకు స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్తున్న వారిపై జరుగుతున్న లైంగిక దాడుల నుండి సమాజం రక్షణ కల్పించాలి. ఆనాడే వారు అభివృద్ధిలో కీలక భాగస్వాములు కాగలుగుతారు. వారి జీవన గమనాన్ని నిర్దేశించే చట్టాల రూపకల్పనలో వారి వాణి బలంగా వినిపించాల్సి వుంది.
రాజకీయాల్లో స్త్రీ పాత్రపై విశ్లేషించినపుడు పలు ఆసక్తికర అంశాలు ముందుకు వస్తున్నాయి. కేవలం ప్రాతినిధ్యం వలన రాజ కీయ సమానత్వం సాధ్యమేనా? క్రియాశీలక నిర్ణయాధికారానికి స్త్రీలు ఆయా రాజకీయ పార్టీల్లో సమర్థులుగా పరిగణింపబడుతున్నారా? మహిళల నేతృత్వంతో అభివృద్ధి ఆకాంక్షిస్తున్న వేళ కేవలం రాజకీయ ప్రాతినిధ్యం సరిపోదు. ఆయా పార్టీలు రాజకీయ అవగాహనా తరగ తులు నిర్వహించి వారిని ప్రోత్సహించవలసి వుంది.
అనేక సందర్భాల్లో డిబేట్స్‌లో గానీ, సోషల్ మీడియాలో గానీ నాయకమణులుగా గొంతు విప్పుతున్న స్త్రీలు టార్గెట్ అవుతున్నారు. ఇది రాజకీయ చైతన్యవంతులుగా ముందుకు వస్తున్న వారిని నీరు గార్చుతుంది. వ్యక్తిగత దూషణలు శృతిమించుతున్నాయి. ఒక పార్టీకి ప్రతినిధులుగా ఎదిగిన స్త్రీలు కూడా అవతలి పార్టీలలో వున్న మహిళా నాయకురాళ్ళను దారుణంగా దుర్భాషలాడుతుండడం గమ నిస్తున్నాము.
ఆయా రాజకీయ పార్టీల వేదికను గౌరవిస్తూనే, పార్టీల కతీతంగా స్త్రీలందరూ ఐక్యంగా నైతిక విలువలు పెంపొందించాలి. వ్యక్తిగత పోరు వల్ల రాజకీయాలలో వున్న స్త్రీ గౌరవం ఇనుమడించే అవకాశం లేదు. నేటి స్త్రీలు ఆయా రాజకీయ పార్టీల ఎజెండాలకు తలాడించే వారుగా వున్నారో లేదా స్వతంత్ర భావవ్యక్తీకరణ ద్వారా స్ఫూర్తిదాయకంగా వుండదల్చుకున్నారో నిర్ణయించుకోవాల్సిన సందర్భం యిది. రాజకీయ ప్రవేశం స్త్రీ ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఇనుమడింప జేసేదిగా వుంటే మరింత మంది మహిళా మణులు ఈ రంగంలో కదంతొక్కే అవకాశం వుంటుంది.
మహిళా మణులు పురుషాధిక్య సమాజం చేతిలో పావులుగా మిగిలిపోతున్నారనే బాధ కలుగుతుంది. ఈ పరిస్థితి మారాలి. పార్టీ లకు అతీతంగా మహిళా నాయకురాళ్ళు ఎదుర్కొంటున్న అణచివేతకు వ్యతిరేకంగా గొంతెత్తాలి. అదే విధంగా అణగారిన మహిళలను ముందుకు నడిపించాలి. చట్టాల్ని రూపొందించే ప్రక్రియలో భాగస్వా మ్యమే అసమానతల్ని రూపుమాపే కార్యాచరణకు పునాది. సమా నత్వం పునాదిగా కలిగిన సమాజాన్ని నిర్మిద్దాం.
డా‘‘ కత్తి సృజన
వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్,
పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment