2024లో సైన్స్‌లో ఏం సాధించాం?
విశ్లేషణ
2024లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కొన్ని ముందడుగులు వడివడిగా పడ్డాయి. కృత్రిమ మేధ, అంతరిక్ష పరిజ్ఞాన రంగాల్లో ప్రగతి మిగిలిన వాటికంటే ప్రస్ఫుటంగా కనిపించింది. అత్యాధునిక జనరేటివ్ ఏఐ టెక్నాలజీలు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలోకి కూడా చేరిపోయాయి. అంతరిక్ష ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించేలా స్పేస్‌ఎక్స్ సంస్థ నేల వాలుతున్న రాకెట్‌ను భారీ టవర్ సాయంతో ఒడిసిపట్టుకోవడం ఈ ఏడాది హైలైట్స్‌లో ఒకటి. ఇస్రో కూడా పునర్వినియోగ లాంచ్ వెహికల్ ‘పుష్పక్’ను పరీక్షించింది. ఇక, నికోబార్ ద్వీపంలో నివసిస్తున్నవారు లావోస్‌లోని వారికి జన్యుపరంగా దగ్గరి బంధువులని తేలడం 2024లో మరో విశేషం.
గూగుల్ డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో డెమిస్ హసాబిస్‌కు 2024 రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు దక్కడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.కృత్రిమ మేధను వేర్వేరు శాస్త్ర రంగాల్లో సమర్థంగా ఉపయోగించే అవకాశం ఉందనేందుకు ఈ అవార్డు ఒక గుర్తింపు అనుకోవాలి. హసాబిస్ కృత్రిమ మేధ మోడల్ ద్వారా కొత్త ప్రొటీన్లను సృష్టించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. కొత్త మందులు, టీకాల తయారీకి ఈ ఆవిష్కరణ దారులు తెరిచింది.
స్మార్ట్ ఫోన్లే సూపర్ కంప్యూటర్లు
భారత దేశంలోనూ ఏఐ టెక్నాలజీలు వేగం అందుకుంటు న్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏఐ కేంద్రంగా ఒక పథకాన్ని ఆవిష్కరించింది కూడా. బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ)కి చెందిన సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సెప్టెంబరులో ఏఐ, కంప్యూటింగ్ రంగాలను తీవ్రంగా ప్రభావితం చేయగల గొప్ప ఆవిష్కరణ ఒకదాని గురించి ప్రకటించింది.
ప్రస్తుతం మనం వాడుతున్న కంప్యూటర్లలో కేవలం రెండే ‘కండక్టన్స్ దశ’ల ద్వారా కంప్యూటింగ్, స్టోరేజీలు జరుగుతూంటే... ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు 16,500 కండక్టన్స్ దశల్లో కంప్యూటింగ్, స్టోరేజీ చేయగల సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశారు. అంటే, అత్యంత సంక్లిష్ట మైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వంటి ఏఐ టెక్నాలజీలను కూడా సూపర్ కంప్యూటర్లు లేకుండానే వాడుకునే అవకాశం వస్తుంది.
స్మార్ట్‌ఫోన్ , ల్యాప్‌టాప్‌ల ద్వారానే భవిష్యత్తులో సూపర్ కంప్యూటర్ల స్థాయి లెక్కలు చేసేయవచ్చు. శ్రీతోష్ గోస్వామి నేతృత్వం లోని బృందం దీన్ని సుసాధ్యం చేసింది. న్యూరో మార్ఫిక్ కంప్యూటింగ్ అని పిలుస్తున్న ఈ ప్లాట్‌ఫామ్ మన మెదడు పనితీరును అనుకరిస్తుంది.
ఏఐ వినియోగం వివిధ రంగాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నైతిక, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన కొన్ని అంశాలు తలెత్తుతున్నాయి. భారత్ ఈ అంశాల విషయంలో చిన్న ముందడుగు వేసింది. కొన్ని ఏఐ టెక్నాలజీల వాడకానికి ముందు కంపెనీలు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని సూచించింది. తద్వారా డీప్‌ఫేక్‌లు వ్యాప్తి చెందకుండా, అల్గారిథమ్ ద్వారా వివక్ష జరక్కుండా జాగ్రత్త పడవచ్చునన్నది ప్రభుత్వ ఉద్దేశం.
అయితే ఈ చర్య సృజనాత్మకతను దెబ్బతీస్తుందన్న కంపెనీల అభ్యంతరంతో ప్రస్తుతానికి ఈ అంశాన్ని పక్కనపెట్టింది ప్రభుత్వం. ఇంకోవైపు యూరోపియన్ యూనియన్ ఏఐ విషయంలో ఆగస్టులోనే ఒక చట్టం చేసింది. ఏఐ సేవలందించే వారు హాని చేయకుండా కట్టడి చేయడం దీని ఉద్దేశం.
పునర్వినియోగ రాకెట్
అంతరిక్ష రంగం విషయానికి వస్తే భారత్ పునర్వినియోగ రాకెట్ విషయంలో కీలకమైన ప్రగతి సాధించింది. రెండు నెలల క్రితం స్పేస్‌ఎక్స్ సంస్థ 70 మీటర్ల పొడవైన రాకెట్ సాయంతో ‘తన స్టార్‌షిప్’ అంతరిక్ష నౌకను ప్రయోగించడం ఈ ఏడాది హైలైట్స్‌లో ఒకటి. సూపర్ వేగంతో నేల వాలుతున్న రాకెట్‌ను ‘మెకాజిల్లా’ పేరుతో నిర్మించిన భారీ టవర్ సాయంతో ఒడిసిపట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతరిక్ష నౌకలు, ఉపగ్రహాలను ప్రయోగించేందుకు రాకెట్లను మళ్లీ మళ్లీ వాడవచ్చు అన్నది స్టార్‌షిప్ ప్రయోగంతో రుజువైంది.
భవిష్యత్తులో ఈ సూపర్‌హెవీ అంతరిక్ష రాకెట్... విమానం మాదిరి అరగంటలో పైకెగరి ఇంధనం నింపి తిరిగి వచ్చేలా చేయాలని స్పేస్‌ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ ప్రయ త్నిస్తున్నారు. భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో కూడా పునర్వినియోగ లాంచ్ వెహికల్ ఒకదాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉంది. తన పుష్పక్ రెక్కల విమానం ద్వారా జూన్ నెలలో నిట్టనిలువుగా ల్యాండ్ అవడం పరీక్షించింది కూడా.
గత ఏడాది అమృత్ కాల్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2035 నాటికల్లా భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటుందనీ, 2040 నాటికి జాబిల్లి పైకి వ్యోమగామిని పంపుతామనీ సంకల్పం చెప్పుకుంది. 2024లో ఆ దిశగా అధికారిక అనుమతులు జారీ అయ్యాయి.
2028 నాటికి అంతరిక్ష కేంద్రపు తొలి భాగాన్ని ప్రయో గించనున్నారు. 2035 నాటికి అంతరిక్ష కేంద్రం తుదిరూపు సంతరించుకుంటుంది. మానవ సహిత అంతరిక్ష యానం కూడా దీంతో సమాంతరంగా నడుస్తుంది. 2026 లోగా నాలుగు గగన్‌యాన్ ప్రయోగాలు జరగనున్నాయి.
చైనాతో పోలిస్తే ఇంకా వెనుకే...
శాస్త్ర రంగంలో భారత్ కొన్ని విజయాలు సాధించినప్పటికీ, చైనా కంటే వెనుకబడి ఉండటం కఠోర సత్యం. చంద్రుడిపై ప్రయోగాలను చైనా ఇప్పటికే ముమ్మరం చేసింది. జూన్ లో చంద్రుడిపై రాతి నమూ నాలను సేకరించే విషయంలో విజయం సాధించింది.
జాబిల్లికి అటువైపున ల్యాండ్ అయిన ఛాంగ్–ఈ అంతరిక్ష నౌక రోబోటిక్ డ్రిల్ ద్వారా 1.9 కిలోల బరువైన రాతి నమూనాలు సేకరించింది. అసెండింగ్ మాడ్యూల్ ద్వారా పైకెగిరి ఆర్బిటర్‌తో అనుసంధానమైంది. భూమికి తిరిగి వచ్చింది. దాదాపు ఇలాంటి ప్రయోగాన్నే 2027లో నిర్వహించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది.
ఏఐ, అంతరిక్ష రంగాల్లో మానవ ప్రగతి ఇలా ఉంటే... భారతీయ జన్యు వైవిధ్యతను అంచనా కట్టేందుకు జ్ఞానేశ్వర్ చౌబే (బనారస్ హిందూ యూనివర్సిటీ), హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) సీనియర్ శాస్త్రవేత్త కె.తంగరాజ్ జరిపిన అధ్యయనం ప్రకారం... ప్రస్తుతం నికోబార్ ద్వీపంలో నివసిస్తున్నవారు లావోస్ దేశంలోని మోన్ ఖ్మేర్ భాష మాట్లాడేవారికి జన్యుపరంగా దగ్గరి బంధువులని తేలింది.
సుమారు ఐదు వేల ఏళ్ల క్రితం వీరు నికోబార్ ద్వీపానికి వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అండమాన్ , ఓంగి జనాభా ఎప్పుడో 70 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి వలసవచ్చిన వారని భారతీయ శాస్త్రవేత్తలు ఇప్పటికే రుజువు చేసిన సంగతి చెప్పుకోవాల్సిన అంశం. భారతీయుల మూలాలను నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం హరప్పా, మొహెంజొదారోల్లో లభ్యమైన ఎముకల అవశేషాల నుంచి డీఎన్‌ఏ వెలికి తీయాలని ఆంత్రోపాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాను కోరింది.
సైన్స్ పరిశోధనలను మానవ కల్యాణం కోసం ఎలా ఉపయోగించవచ్చు అనేందుకు ఒక ఉదాహరణ ప్రవీణ్ వేముల ప్రయోగాలు అని చెప్పాలి. బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టెమ్‌సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ కు చెందిన ఈ శాస్త్రవేత్త రైతులను హాని కారక క్రిమి, కీటక నాశినుల నుంచి రక్షించేందుకు ఓ వినూత్నమైన పదార్థాన్ని సిద్ధం చేశారు. చర్మంపై పూసుకోగల ఈ పదార్థం కీటక నాశినుల్లోని ప్రమాదకరమైన రసాయనాల నుంచి రక్షణ కల్పిస్తుంది.
రెయిన్ కోట్‌లా కుట్టుకోగల కీటకనాశిని నిరోధక వస్త్రాన్ని కూడా అభివృద్ధి చేశాడీ శాస్త్రవేత్త. ఈ వస్త్రానికి అంటుకుంటే చాలు,ఎలాంటి హానికారక రసాయనమైనా నిర్వీర్యమైపోతుంది. నవంబరు నెలలోనే ప్రవీణ్ వేముల ఈ ‘కిసాన్ కవచ్’ కోటును తన స్టార్టప్ ద్వారా మార్కెట్‌లోకి విడుదల చేశారు. వచ్చే ఏడాది ఇలాంటి ప్రజోప యోగ ఆవిష్కరణలు మరిన్ని జరుగుతాయని ఆశిద్దాం.
దినేశ్ సి.శర్మ
వ్యాసకర్త జర్నలిస్ట్, సైన్స్ అంశాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment