Science and Technology
-
రూ. 20,000 కోట్ల నిధులు వాడుకోండి..
పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ)పై దేశీ కార్పొరేట్లు మరింత దృష్టి సారించాలని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ తాజాగా పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయించిన రూ. 20,000 కోట్లు నాణ్యమైన ప్రతిపాదనకు వినియోగించుకోవాలని సూచించారు.ప్రయివేట్ రంగ ఆధారిత ఆర్‌అండ్‌డీకి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రూ. 20,000 కోట్లు కేటాయించిన విషయాన్ని బడ్జెట్ తదుపరి సీఐఐ సభ్యులతో ఏర్పాటు చేసిన ఇష్టాగోష్టి సందర్భంగా ప్రస్తావించారు. ఏడాది చివరికల్లా మొత్తం నిధులను వినియోగించుకునేలా అత్యుత్తమ ప్రతిపాదనలతో తరలిరావలసిందిగా ఆహ్వానించారు.పర్యావరణహిత ఇంధనాలవైపు ప్రయాణంలో ప్రయివేట్ రంగం చేయూత నివ్వాలని కోరారు. ఇదేవిధంగా అణు విద్యుత్ విషయంలో ప్రభుత్వం పరిశ్రమతో కలసి పనిచేయనున్నట్లు తెలియజేశారు.2025-26 బడ్జెట్‌ను ప్రకటిస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రైవేట్ రంగ ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఒక కార్పస్‌గా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు రూ.20,000 కోట్లు కేటాయించారు. గత జూలై బడ్జెట్లోనూ ఆమె రూ. లక్ష కోట్ల పరిశోధనాభివృద్ధి నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. -
2027లో చంద్రయాన్–4
న్యూఢిల్లీ: చంద్రుడిపై శిలలను సేకరించి భూమిపైకి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన చంద్రయాన్–4 మిషన్‌ను 2027లో చేపట్టనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. మిషన్‌లో భాగంగా రెండు వేర్వేరు ప్రయోగాలుంటాయన్నారు. ఎల్వీఎం–3 రాకెట్ ద్వారా ఐదు రకాల సాంకేతిక వస్తు సామాగ్రిని కక్ష్యలోకి పంపి, అక్కడే వాటిని అసెంబుల్ చేయిస్తారని వివరించారు. వచ్చే ఏడాది గగన్‌యాన్ మిషన్‌లో ప్రత్యేకంగా రూపొందించిన అంతరిక్ష నౌకలో ఇద్దరు భారత వ్యోమగాములను దిగువ భూకక్ష్యలోకి పంపి, తిరిగి సురక్షితంగా తీసుకువస్తామని చెప్పారు. ఈ ఏడాదిలో గగన్‌యాన్ మానవరహిత మిషన్ లో భాగంగా వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపిస్తామన్నారు. దీంతోపాటు, 2026లో సముద్రయాన్‌లో భాగంగా ముగ్గురు శాస్త్రవేత్తలను 6 వేల మీటర్ల లోతులో సముద్రం అడుగు భాగానికి పంపిస్తామని వెల్లడించారు. వీరు సముద్రగర్భంలో వనరులు, కీలక, అరుదైన ఖనిజాల అన్వేషణతోపాటు, సముద్ర జీవజాలంపై పరిశోధనలు జరుపుతారని చెప్పారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 1969లో అవతరించగా మొదటి లాంఛ్ ప్యాడ్ రెండు దశాబ్దాల అనంతరం 1993లో కార్యరూపం దాల్చిందని చెప్పారు. మరో దశాబ్ద కాలం తర్వాత 2004లో రెండో లాంఛ్ ప్యాడ్‌ను నిర్మించామన్నారు. విస్తరణ, మౌలిక వనరుల కల్పన, పెట్టుబడుల విషయంలో ఇస్రో గణనీయమైన ప్రగతి సాధించిందని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. భారత అంతరిక్ష ఆర్థిక రంగ ప్రస్తుతం 8 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుందని వివరించారు. దీనిని వచ్చే పదేళ్లలో 44 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లి, ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. -
ఏఐ నామ సంవత్సరం
2024లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కొన్ని ముందడుగులు వడివడిగా పడ్డాయి. కృత్రిమ మేధ, అంతరిక్ష పరిజ్ఞాన రంగాల్లో ప్రగతి మిగిలిన వాటికంటే ప్రస్ఫుటంగా కనిపించింది. అత్యాధునిక జనరేటివ్ ఏఐ టెక్నాలజీలు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలోకి కూడా చేరిపోయాయి. అంతరిక్ష ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించేలా స్పేస్ఎక్స్ సంస్థ నేల వాలుతున్న రాకెట్‌ను భారీ టవర్ సాయంతో ఒడిసిపట్టుకోవడం ఈ ఏడాది హైలైట్స్‌లో ఒకటి. ఇస్రో కూడా పునర్వినియోగ లాంచ్ వెహికల్ ‘పుష్పక్’ను పరీక్షించింది. ఇక, నికోబార్ ద్వీపంలో నివసిస్తున్నవారు లావోస్‌లోని వారికి జన్యుపరంగా దగ్గరి బంధువులని తేలడం 2024లో మరో విశేషం.గూగుల్ డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో డెమిస్ హసాబిస్కు 2024 రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు దక్కడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.కృత్రిమ మేధను వేర్వేరు శాస్త్ర రంగాల్లో సమర్థంగా ఉపయోగించే అవకాశం ఉందనేందుకు ఈ అవార్డు ఒక గుర్తింపు అనుకోవాలి. హసాబిస్ కృత్రిమ మేధ మోడల్ ద్వారా కొత్త ప్రొటీన్లను సృష్టించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. కొత్త మందులు, టీకాల తయారీకి ఈ ఆవిష్కరణ దారులు తెరిచింది. స్మార్ట్ ఫోన్లే సూపర్ కంప్యూటర్లుభారత దేశంలోనూ ఏఐ టెక్నాలజీలు వేగం అందుకుంటు న్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏఐ కేంద్రంగా ఒక పథకాన్ని ఆవిష్కరించింది కూడా. బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ)కి చెందిన సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సెప్టెంబరులో ఏఐ, కంప్యూటింగ్ రంగాలను తీవ్రంగా ప్రభావితం చేయగల గొప్ప ఆవిష్కరణ ఒకదాని గురించి ప్రకటించింది. ప్రస్తుతం మనం వాడుతున్న కంప్యూటర్లలో కేవలం రెండే ‘కండక్టన్స్ దశ’ల ద్వారా కంప్యూటింగ్, స్టోరేజీలు జరుగుతూంటే... ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు 16,500 కండక్టన్స్ దశల్లో కంప్యూటింగ్, స్టోరేజీ చేయగల సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశారు. అంటే, అత్యంత సంక్లిష్ట మైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వంటి ఏఐ టెక్నాలజీలను కూడా సూపర్ కంప్యూటర్లు లేకుండానే వాడుకునే అవకాశం వస్తుంది.స్మార్ట్‌ఫోన్ , ల్యాప్‌టాప్‌ల ద్వారానే భవిష్యత్తులో సూపర్ కంప్యూటర్ల స్థాయి లెక్కలు చేసేయవచ్చు. శ్రీతోష్ గోస్వామి నేతృత్వం లోని బృందం దీన్ని సుసాధ్యం చేసింది. న్యూరో మార్ఫిక్ కంప్యూటింగ్ అని పిలుస్తున్న ఈ ప్లాట్‌ఫామ్ మన మెదడు పనితీరును అనుకరిస్తుంది.ఏఐ వినియోగం వివిధ రంగాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నైతిక, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన కొన్ని అంశాలు తలెత్తుతున్నాయి. భారత్ ఈ అంశాల విషయంలో చిన్న ముందడుగు వేసింది. కొన్ని ఏఐ టెక్నాలజీల వాడకానికి ముందు కంపెనీలు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని సూచించింది. తద్వారా డీప్‌ఫేక్‌లు వ్యాప్తి చెందకుండా, అల్గారిథమ్ ద్వారా వివక్ష జరక్కుండా జాగ్రత్త పడవచ్చునన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఈ చర్య సృజనాత్మకతను దెబ్బతీస్తుందన్న కంపెనీల అభ్యంతరంతో ప్రస్తుతానికి ఈ అంశాన్ని పక్కనపెట్టింది ప్రభుత్వం. ఇంకోవైపు యూరోపియన్ యూనియన్ ఏఐ విషయంలో ఆగస్టులోనే ఒక చట్టం చేసింది. ఏఐ సేవలందించే వారు హాని చేయకుండా కట్టడి చేయడం దీని ఉద్దేశం.పునర్వినియోగ రాకెట్అంతరిక్ష రంగం విషయానికి వస్తే భారత్ పునర్వినియోగ రాకెట్ విషయంలో కీలకమైన ప్రగతి సాధించింది. రెండు నెలల క్రితం స్పేస్ఎక్స్ సంస్థ 70 మీటర్ల పొడవైన రాకెట్ సాయంతో ‘తన స్టార్‌షిప్’ అంతరిక్ష నౌకను ప్రయోగించడం ఈ ఏడాది హైలైట్స్‌లో ఒకటి. సూపర్ వేగంతో నేల వాలుతున్న రాకెట్‌ను ‘మెకాజిల్లా’ పేరుతో నిర్మించిన భారీ టవర్ సాయంతో ఒడిసిపట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతరిక్ష నౌకలు, ఉపగ్రహాలను ప్రయోగించేందుకు రాకెట్లను మళ్లీ మళ్లీ వాడవచ్చు అన్నది స్టార్‌షిప్ ప్రయోగంతో రుజువైంది. భవిష్యత్తులో ఈ సూపర్హెవీ అంతరిక్ష రాకెట్... విమానం మాదిరి అరగంటలో పైకెగరి ఇంధనం నింపి తిరిగి వచ్చేలా చేయాలని స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ ప్రయ త్నిస్తున్నారు. భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో కూడా పునర్వినియోగ లాంచ్ వెహికల్ ఒకదాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉంది. తన పుష్పక్ రెక్కల విమానం ద్వారా జూన్ నెలలో నిట్టనిలువుగా ల్యాండ్ అవడం పరీక్షించింది కూడా. గత ఏడాది అమృత్ కాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2035 నాటికల్లా భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటుందనీ, 2040 నాటికి జాబిల్లి పైకి వ్యోమగామిని పంపుతామనీ సంకల్పం చెప్పుకుంది. 2024లో ఆ దిశగా అధికారిక అనుమతులు జారీ అయ్యాయి. 2028 నాటికి అంతరిక్ష కేంద్రపు తొలి భాగాన్ని ప్రయో గించనున్నారు. 2035 నాటికి అంతరిక్ష కేంద్రం తుదిరూపు సంతరించుకుంటుంది. మానవ సహిత అంతరిక్ష యానం కూడా దీంతో సమాంతరంగా నడుస్తుంది. 2026 లోగా నాలుగు గగన్‌యాన్ ప్రయోగాలు జరగనున్నాయి. చైనాతో పోలిస్తే ఇంకా వెనుకే...శాస్త్ర రంగంలో భారత్ కొన్ని విజయాలు సాధించినప్పటికీ, చైనా కంటే వెనుకబడి ఉండటం కఠోర సత్యం. చంద్రుడిపై ప్రయోగాలను చైనా ఇప్పటికే ముమ్మరం చేసింది. జూన్ లో చంద్రుడిపై రాతి నమూ నాలను సేకరించే విషయంలో విజయం సాధించింది. జాబిల్లికి అటువైపున ల్యాండ్ అయిన ఛాంగ్–ఈ అంతరిక్ష నౌక రోబోటిక్ డ్రిల్ ద్వారా 1.9 కిలోల బరువైన రాతి నమూనాలు సేకరించింది. అసెండింగ్ మాడ్యూల్ ద్వారా పైకెగిరి ఆర్బిటర్‌తో అనుసంధానమైంది. భూమికి తిరిగి వచ్చింది. దాదాపు ఇలాంటి ప్రయోగాన్నే 2027లో నిర్వహించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. ఏఐ, అంతరిక్ష రంగాల్లో మానవ ప్రగతి ఇలా ఉంటే... భారతీయ జన్యు వైవిధ్యతను అంచనా కట్టేందుకు జ్ఞానేశ్వర్ చౌబే (బనారస్ హిందూ యూనివర్సిటీ), హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) సీనియర్ శాస్త్రవేత్త కె.తంగరాజ్ జరిపిన అధ్యయనం ప్రకారం... ప్రస్తుతం నికోబార్ ద్వీపంలో నివసిస్తున్నవారు లావోస్ దేశంలోని మోన్ ఖ్మేర్ భాష మాట్లాడేవారికి జన్యుపరంగా దగ్గరి బంధువులని తేలింది. సుమారు ఐదు వేల ఏళ్ల క్రితం వీరు నికోబార్ ద్వీపానికి వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అండమాన్ , ఓంగి జనాభా ఎప్పుడో 70 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి వలసవచ్చిన వారని భారతీయ శాస్త్రవేత్తలు ఇప్పటికే రుజువు చేసిన సంగతి చెప్పుకోవాల్సిన అంశం. భారతీయుల మూలాలను నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం హరప్పా, మొహెంజొదారోల్లో లభ్యమైన ఎముకల అవశేషాల నుంచి డీఎన్ఏ వెలికి తీయాలని ఆంత్రోపాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాను కోరింది. సైన్స్ పరిశోధనలను మానవ కల్యాణం కోసం ఎలా ఉపయోగించవచ్చు అనేందుకు ఒక ఉదాహరణ ప్రవీణ్ వేముల ప్రయోగాలు అని చెప్పాలి. బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టెమ్‌సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ కు చెందిన ఈ శాస్త్రవేత్త రైతులను హాని కారక క్రిమి, కీటక నాశినుల నుంచి రక్షించేందుకు ఓ వినూత్నమైన పదార్థాన్ని సిద్ధం చేశారు. చర్మంపై పూసుకోగల ఈ పదార్థం కీటక నాశినుల్లోని ప్రమాదకరమైన రసాయనాల నుంచి రక్షణ కల్పిస్తుంది. రెయిన్ కోట్లా కుట్టుకోగల కీటకనాశిని నిరోధక వస్త్రాన్ని కూడా అభివృద్ధి చేశాడీ శాస్త్రవేత్త. ఈ వస్త్రానికి అంటుకుంటే చాలు,ఎలాంటి హానికారక రసాయనమైనా నిర్వీర్యమైపోతుంది. నవంబరు నెలలోనే ప్రవీణ్ వేముల ఈ ‘కిసాన్ కవచ్’ కోటును తన స్టార్టప్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేశారు. వచ్చే ఏడాది ఇలాంటి ప్రజోప యోగ ఆవిష్కరణలు మరిన్ని జరుగుతాయని ఆశిద్దాం.దినేశ్ సి.శర్మ వ్యాసకర్త జర్నలిస్ట్, సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కొత్త డివైస్ : ఇది కట్టుకుంటే నొప్పులు మాయమట!
జిమ్‌లో వ్యాయామం చేసేవారికి, మైదానాల్లో ఆటలాడే వారికి ఒక్కోసారి కీళ్లు పట్టేసి నొప్పులు తలెత్తడం మామూలే! ఇళ్లల్లో రోజువారీ పనులు చేసుకునేటప్పుడు కూడా ఒక్కోసారి నొప్పులు తలెత్తుతుంటాయి. ఇలాంటి నొప్పులకు నొప్పినివారణ మాత్రలు వాడటం, పైపూతగా ఆయింట్మెంట్లు పూసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇకపై వాటితో పని లేకుండా, ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరాన్ని నొప్పి ఉన్నచోట పెట్టుకుని, దీనికి ఉన్న బెల్టుతో బిగించి కట్టుకుంటే చాలు, సత్వరమే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అమెరికన్ కంపెనీ ‘థెరాబాడీ’ ఇటీవల ‘రికవరీ థెర్మ్‌క్యూబ్’ పేరిట ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మనం కోరుకున్న విధంగా చల్లదనం లేదా వెచ్చదనాన్ని ఎంచుకోవడానికి స్విచ్‌లు ఉంటాయి. నొప్పి ఉన్న చోట ఈ క్యూబ్‌ను అదిమిపెట్టి బిగించి బెల్ట్ కట్టుకుంటే చాలు, రెండు గంటల్లోనే పూర్తిగా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇవీ చదవండి : చలి పులి వచ్చేస్తోంది నెమ్మదిగా...ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది! -
‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: నేషనల్ కంప్యూటింగ్ మిషన్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన మూడు సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆవిష్కరించారు. శాస్త్రీయ పరిశోధనలను సులభతరం చేసేందుకు రూ.130 కోట్లతో పుణె, ఢిల్లీ, కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే వాతావరణ పరిశోధనల కోసం రూ.850 కోట్లతో రూపొందించిన హై-పెర్ఫామెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్‌ను సైతం ప్రధాని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. శాస్త్ర సాంకేతిక అభివృద్దిలో భారత్ కొత్తపుంతలు తొక్కుతుందని తెలిపారు. ఈ రోజును శాస్త్ర, సాంకేతిక రంగంలో చాలా గొప్ప విజయాలు సాధించిన రోజుగా అభివర్ణించారు. సాంకేతికత, కంప్యూటింగ్ సామర్థ్యంపై ఆధారపడని రంగం ఏదీ లేదని ప్రధాని మోదీ అన్నారు. ఈ విప్లవంలో మన వాటా బిట్లు, బైట్లలో కాకుండా టెరాబైట్లు, పెటాబైట్లలో ఉండాలని తెలిపారు. మనం సరైన వేగంతో సరైన దిశలో పయనిస్తున్నామని ఈ ఘనత నిరూపిస్తోందని పేర్కొన్నారు.With Param Rudra Supercomputers and HPC system, India takes significant step towards self-reliance in computing and driving innovation in science and tech. https://t.co/ZUlM5EA3yw— Narendra Modi (@narendramodi) September 26, 2024 ‘2015లో జాతీయ సూపర్కంప్యూటింగ్ మిషన్‌ను ప్రారంభించాం. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ ముందంజలో ఉంది. ఇది ఐటీ, తయారీ, ఎమ్ఎస్ఎమ్ఈలు, స్టార్టప్‌లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.టెక్నాలజీలో పరిశోధనలు సామాన్యులకు ఉపయోగపడేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దేశం పెద్ద విజన్ కలిగి ఉంటేనే ఉన్నత విజయాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగలదు. పేదలకు సాధికారత కల్పించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచాలి’ అని పేర్కొన్నారు. -
Narendra Modi: మనమే ప్రపంచ సారథులం
న్యూయార్క్: ‘‘అన్ని రంగాల్లోనూ ఇతరులను అనుసరించిన పాత రోజులను దాటుకుని గత పదేళ్లలో భారత్ ఎంతో ప్రగతి సాధించింది. ఇతర దేశాలకు మార్గదర్శకత్వం వహించే స్థాయికి చేరుకుంది. ప్రపంచ సారథిగా ఎదుగుతోంది. అవకాశాల ఇంకెంతమాత్రమూ కోసం ఎదురు చూడటం లేదు. అవకాశాలను సృష్టించుకుంటూ సాగుతోంది. అంతులేని అవకాశాలకు నెలవుగా మారింది. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో ఇతర దేశాలను ముందుండి నడిపిస్తోంది’’ అని ప్రధాన నరేంద్ర మోదీ అన్నారు. ఈ అద్భుత ప్రగతిలో విదేశాల్లోని భారతీయులది అత్యంత కీలక పాత్ర అంటూ కొనియాడారు. వారి త్యాగాలు వెలకట్టలేనివని అభిప్రాయపడ్డారు. అమెరికాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం న్యూయార్క్‌లో భారతీయ అమెరికన్లతో ప్రధాని భేటీ అయ్యారు. స్థానిక నాసౌ వెటరన్స్ కొలోజియం స్టేడియంలో జరిగిన ఈ సమావేశానికి ఎన్నారైలు పోటెత్తారు. న్యూయార్క్, పరిసర న్యూజెర్సీ నుంచేగాక మొత్తం 42 రాష్ట్రాలనుంచి 13,000 మందికి పైగా సభకు హాజరయ్యారు. సమావేశం ఆద్యంతం ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆయన వేదికపైకి చేరుకున్న తర్వాత కూడా నిమిషాల పాటు కరతాళ ధ్వనులు ఆగకుండా కొనసాగాయి. అనంతరం మోదీ మాట్లాడుతూ వారి అభిమానం తనను కదిలించివేసిందన్నారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మన భారతీయులు నాపై ఇలా చెప్పలేనంతటి ఆదరాభిమానాలు, ఆప్యాయత కురిపిస్తూనే ఉన్నారు. దీనికి శాశ్వతంగా రుణపడిపోయాను’’ అని చెప్పారు. భారత, అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో ఇండయన్ అమెరికన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మోదీ ప్రసంగం గంటా పది నిమిషాల పాటు సాగింది. ప్రసంగం పొడవునా సభికులు పదేపదే చప్పట్లు కొడుతూ, నినాదాలు చేస్తూ సందడి చేశారు. అంతకుముందు వేదికపై ‘ద ఎకోస్ ఆఫ్ ఇండియా – అ జర్నీ త్రూ ఆర్ట్ అండ్ ట్రెడిషన్’ పేరిట 382 మంది జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కళాకారుల ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. గ్రామీ అవార్డు విజేత చంద్రికా టాండన్, గాయక సంచలనం రెక్స్ డిసౌజా, తెలుగు సినీ దర్శకుడు, గాయకుడు దేవీశ్రీ ప్రసాద్ తదితరులు వీటిలో పాల్గొన్నారు. భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్నాం ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గి వరుసగా మూడోసారి పాలనా పగ్గాలు చేపట్టడాన్ని మోదీ ప్రస్తావించారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోందన్నారు. భారత ప్రగతి కోసం ఈసారి అత్యంత భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్నట్టు చెప్పారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టిన తాను ఈ స్థాయికి ఎదుగుతానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ‘‘విధి నన్ను రాజకీయాల్లోకి తీసుకొచి్చంది. అనుకోకుండా గుజరాత్‌కు సీఎం అయ్యాను. ఆ రాష్ట్రానికి అత్యధిక కాలం పాటు సేవలందించిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించాను. తర్వాత దేశ ప్రజలు నన్ను ప్రధానిని చేసి మరింత పెద్ద బాధ్యత కట్టబెట్టారు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘దేశ ప్రగతికి, సుపరిపాలనకు నా జీవితాన్ని అంకితం చేశాను. అధ్యక్షుడు జో బైడెన్ శనివారం నన్ను దగ్గరుండి ఆహా్వనించి మరీ తన ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆయన చూపిన గౌరవం నన్నెంతగానో కదిలించింది. అది 140 కోట్ల పై చిలుకు భారతీయులకు దక్కిన గౌరవం. అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులకు, వారి నిరంతర కృషికి దక్కిన గౌరవం’’ అన్నారు. దశాబ్దాల క్రితం తొలిసారి తాను అమెరికాకు వచ్చిన రోజులను మోదీ గుర్తు చేసుకున్నారు. ప్రపంచ శాంతిలో కీలక పాత్ర అంతర్జాతీయంగా ఆధిపత్యం సాగించడం భారత అభిమతం కాదని మోదీ అన్నారు. అయితే ప్రపంచ ప్రగతిలో, శాంతి సాధనలో కీలక పాత్ర పోషించేందుకు మాత్రం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ‘అందరికీ సమ దూరం’ అన్నది పాత విధానం. ‘అందరితోనూ సమాన సాన్నిహిత్యం’ అన్నదే నవభారత నినాదం’ అని వివరించారు. ఇది యుద్ధాలకు సమయం కాదని పునరుద్ఘాటించారు. ‘‘భారత్ అంటే ఫైర్ కాదు. ప్రపంచానికి వెలుగునిచ్చే సూరీడు’’ అన్నారు. బోస్టన్, లాస్ ఏంజెలెస్ నగరాల్లో నూతనంగా కాన్సులేట్లను ప్రారంభించనున్నట్టు ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు. గతేడాది ప్రకటించిన సియాటెల్ కాన్సులేట్ ఇప్పటికే ప్రారంభమైందని గుర్తు చేశారు. అమెరికాకు ఫార్మా, విద్యా రంగాల్లో రాజధానిగా బోస్టన్‌కు పేరుంది. ఇక లాస్ ఏంజెలెస్ హాలీవుడ్‌కు పుట్టిల్లన్నది తెలిసిందే.పుష్ప... వికసిత భారత్! ‘‘వికసిత భారత్ అంటే ‘పుష్ప’. ప్రోగ్రెసివ్, అన్‌స్టాపబుల్, స్పిరిచ్యువల్, హ్యుమానిటీ, ప్రాస్పరస్’’ అంటూ మోదీ కొత్త నిర్వచనమిచ్చారు. దీనికి సభికుల నుంచి బ్రహా్మండమైన స్పందన వచి్చంది. అలాగే, ‘‘ఏఐ అంటే కూడా ఆస్పిరేషనల్ ఇండియా. ఏఐ అంటే అమెరికన్ ఇండియన్స్’’ అని కొత్త నిర్వచనాలిచ్చారు.అమెరికాను మించిన భారత 5జీ మార్కెట్ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ అద్భుత ప్రగతి సాధిస్తూ దూసుకెళ్తోందని మోదీ అన్నారు. ఫలితంగా కేవలం రెండేళ్ల వ్యవధిలోనే భారత 5జీ మార్కెట్ అమెరికాను కూడా మించిపోయిందని వివరించారు. మేడిన్ ఇండియా 6జీ టెక్నాలజీపై కూడా భారత్‌లో పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ‘‘ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత మొబైల్ బ్రాండ్లన్నీ దాదాపుగా భారత్‌లోనే తయారవుతున్నాయి. భారత సెమీ కండక్టర్ చిప్‌లను అమెరికా దిగుమతి చేసుకునే రోజులు ఎంతో దూరంలో లేవు. ప్రపంచమంతా మేడిన్ ఇండియా చిప్‌ల మీదే ఆధారపడి నడవనుంది. ఇది మోదీ గ్యారెంటీ’’ అన్నారు. -
తెలుగింటి.. వెలుగులు! ఇంతకూ ఎవరా అమ్మాయిలు..?
అమ్మానాన్నలు వెంట లేకుండానే... టీచర్లు తోడు లేకుండానే ఈ అమ్మాయిలు ధైర్యంగా దేశం దాటి చైనా వెళ్లారు. శాస్త్ర సాంకేతిక సదస్సులో 38 దేశాల నుంచి హాజరైన బృందాలలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. తెలుగు వారి తెలివితేటలను నిరూపించుకున్నారు. అంతర్జాతీయ ప్లాట్‌ఫారంపై అదరగొట్టారు. భావి శాస్త్రవేత్తలుగా భళా అనిపించుకున్నారు. ఎంచక్కా తిరిగి వచ్చారు. తమ అనుభవాలను సాక్షితో సంతోషంగా పంచుకున్నారు.ఇంతకూ ఎవరా అమ్మాయిలు..?ఆంధ్రప్రదేశ్, కాకినాడకు చెందిన సాయిశ్రీ శ్రుతి చిట్టూరి, లక్ష్మీ ఆశ్రిత నామ, సంజన పల్లా, వైష్ణవి వాకచర్లలకు అంతర్జాతీయ వేదికపై భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. చైనీస్ అసోషియేషన్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, చైనా ఎడ్యుకేషన్ క్యాంప్ రెగ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన యూత్ సైన్స్ టెక్నాలజీ వర్క్‌షాపులో ఈ స్టూడెంట్స్ పాల్గొన్నారు. సదస్సులో పాల్గొని ఇటీవలే తిరిగి వచ్చారు.ఆలోచనలను పంచుకున్నాం..దక్షిణాఫ్రికా, నేపాల్, ఆస్ట్రేలియా, మంగోలియా తదితర దేశాలæవిద్యార్థినుల పరిశోధన అంశాలపై ఆలోచనలు పంచుకోవడానికి మాకు మంచి అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఒకే వయస్సు వాళ్లం ఒక చోట చేరి ఎంపిక చేసుకున్న అంశాలపై విశ్లేషించుకోవడానికి ఈ సదస్సు ఉపకరించింది.– వైష్ణవి. ఎంపీసీ విద్యార్థిని, కాకినాడపురాతన జీవశాస్త్రంపై పరిశోధన..ఈ వర్క్‌షాపు ద్వారా వివిధప్రాంతాల విశిష్టత, ఆయాప్రాంతాల్లో జీవరాశుల స్వభావం, స్థితిగతులపైప్రాథమికంగా కొంత అవగాహన ఏర్పరుచుకుకో గలిగాం. భవిష్యత్తులో శాస్త్రవేత్తలం కావాలనే మా సంకల్పానికి ఈ వర్క్‌షాపు కచ్చితంగా ఉపయోగమే.– సంజన, బైపీసీ విద్యార్థిని, కాకినాడఎనిమిదో ఏడు..చైనా ఏటా ప్రపంచ స్థాయిలో 2017 నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ వర్క్‌షాపు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలు, వివిధ భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆలోచనలను పంచుకోవాలి. అలా భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారీ అమ్మాయిలు. భావి శాస్త్రవేత్తలకు దిక్సూచి: విశ్వం ఆవిర్భావం నుంచి నేటివరకూ ప్రపంచంలో చోటు చేసుకున్న మార్పులపై నిరంతరం పరిశోధనలు కొనసాగడం ఈ వర్క్‌షాపు లక్ష్యం. ఈ వర్క్‌షాపు లో ఎంపీసీ స్టూడెంట్స్ (శృతి, వైష్ణవి) ‘చేజింగ్ ద సన్’ అంశాన్ని, బైపీసీ స్టూడెంట్స్ (లక్ష్మి ఆశ్రిత, సంజన) ఫాజిల్స్ ను ఎంపిక చేసుకున్నారు. వివిధ దేశాల నుంచి ఎంపికైన వారితో తమ అభి్రపాయాలను పంచుకుని విజయ వంతంగా తిరిగి వచ్చారు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, కాకినాడ. ఫొటోలు: తలాటం సత్యనారాయణ -
Naba Mohammadi: మోటారు పాఠం.. జపాన్ చేర్చుతోంది!
బోటనీ పాఠమంటే.. బోరు..బోరు.. హిస్టరీ రొస్టు్ట కంటే రెస్ట్ మేలు.. అని పాడుకుంటే పొరపాటే.. పాఠం సరిగా వింటే విదేశీయానం, విమోనమెక్కే యోగం దక్కుతుందని నిరూపించింది కరీంనగర్ జిల్లా శంకరపట్నంకు చెందిన నబా మొహమ్మదీ. ఇటీవల హైదరాబాద్‌లో ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఏకంగా ఈ ఏడాది నవంబరులో జపాన్ లో జరిగే సకుర సైన్స్ ఫెస్టివల్ లో పాల్గొనబోతోంది. ఇదంతా ఎలా సాధ్యమైంది? కేవలం సైన్స్ మీద ఉన్న ఆసక్తి.. మోటారు పాఠం వినడం వల్లే అంటుంది. నబా..! తనకు సైన్స్‌పై ఉన్న ఆసక్తి తనను జపాన్ గడ్డపై కాలు మోపేలా చేస్తుందని ‘సాక్షి’కి చెప్పింది.ఏంటా మోటారు కథ...!నబా ప్రస్తుతం శంకరపట్నంలోనే ఇంటర్ సెకండియర్ చదువుతోంది. దాదాపు నాలుగేళ్ల క్రితం తాను 9వ తరగతిలో ఉండగా.. విన్న ఫిజిక్స్ పాఠం తన ఆలోచన తీరును మార్చివేసింది. 8 వ తరగతి వరకు బేసిక్ సైన్స్ విన్న తాను.. తొలిసారిగా మోటారు ఎలా పనిచేస్తుందో తన గురువులు చెప్పిన పాఠానికి ముగ్ధురాలైంది. విద్యుచ్ఛక్తి, అయస్కాంత శక్తిని కలిపి మోటారు నడిపే విధానం తెలుసుకోవడం తనకు సైన్స్ ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిన్న సూత్రం ఆధారంగా ప్రపంచంలోని ఎన్నో మోటార్లు ఎలా నడుస్తున్నాయన్న విషయంపై తనకు పూర్తి అవగాహన వచ్చింది. అది మొదలు సైన్స్పాఠాలను మరింత శ్రద్ధగా చదువుతూ విశ్లేషణ చేసుకునేది. ప్రతీది తనకు అర్థమయ్యేందుకు అదనపు పుస్తకాలు, యూట్యూబ్ చూసేది. ఇటీవల జిల్లా స్థాయిలో ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో కరీంనగర్ నుంచి మొదటి స్థానంలో నిలిచింది. అదే ఊపులో రాష్ట్రస్థాయికి ఎంపికై టాప్–5లో టాప్–2 స్థానం దక్కించుకుంది. ఫలితంగా నవంబరులో జపాన్ లో జరిగే సుకుర సైన్స్ ఫెస్టివల్లో పాల్గొనే అరుదైన అవకాశం చేజిక్కించుకుంది.తాను కూడా ఏదైనా సాధించాలంటే..!అదే ఉత్సాహంతో తాను కూడా ఏదైనా సాధించాలని తలచింది. అంధులకు దారి చూపేందుకు ప్రత్యేక డివైజ్ రూపొందించింది. ఇది ప్రస్తుతంప్రోటోటైప్ దశలోనే ఉంది. దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. దీనికి త్వరలోనే పేటెంట్ కూడా దరఖాస్తు చేసుకుంటానని నబా ‘సాక్షి’కి వివరించింది. జపాన్ పర్యటనలో అక్కడ శాస్త్ర సాంకేతిక రంగాలను గమనించి, వాటిని ఇక్కడఅమలు చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. తాను ఈ ప్రగతి సాధించడం వెనక తన తండ్రి షాబీర్, ఫిర్దౌస్ సుల్తానాలు ఎంతోప్రోత్సహించారని, సంప్రదాయ కుటుంబమైనా, బాలికనైన తనను అన్ని కాంపిటీషన్లకు పంపించారని తెలిపింది. అదే సమయంలో తనకు పాఠాలు చెప్పిన గురువులకు తానెప్పుడూ రుణపడి ఉంటానని, పెద్దయ్యాక శాస్త్రవేత్తనవుతాననీ, అంధులకు చూపునవుతాననీ వారికి దారిచూపేందుకు రూపొందించిన ఉపకరణాన్ని మరింత అభివృద్ధి చేస్తాననీ చెప్పింది. భవిష్యత్తులో శాస్త్రవేత్తగా ఎదగడమే తన కల అని వివరించింది నబా. – బి. అనిల్‌కుమార్, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
పరిశోధనల్లో చైనాతో పోటీ పడగలమా?
అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మక జర్నల్స్ అయిన ‘నేచర్’, ‘ఎకనమిస్ట్’లు శాస్త్రరంగంలో చైనా అత్యంత శక్తిమంతంగా ఎదుగుతోందని ప్రకటించాయి. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మూడో అతిపెద్ద శక్తిగా భారత్ కొనసాగిన విషయం తెలిసిందే. అణు, అంతరిక్ష, వ్యాక్సిన్ అభివృద్ధి రంగాల్లో భారత్ రాణించిందన్నదీ వాస్తవమే. కానీ చైనా పలు కీలక రంగాల్లో భారత్‌తోపాటు అమెరికా, యూరప్‌లను సైతం అధిగమించింది. అంతరిక్ష రంగంలో చైనా మన కన్నా కనీసం పదేళ్లు ముందుంది. 2003లో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర జరపడమే కాదు, సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. ప్రపంచ టాప్–10 జాబితాలో భారతీయ పరిశోధన సంస్థలు లేవన్నది గమనార్హం. నిద్రాణంగా ఉన్న భారత్‌కు చైనా పురోగతి ఓ మేలుకొలుపు కావాలి.ఉన్నత విద్యా రంగంలో భారత్ గతంలో ఎన్నడూ లేని స్థాయి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వైద్యం, పరిశోధన రంగాల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న పరీక్షల పద్ధతి, ప్రామాణికత రెండూ లీకేజీల పుణ్యమా అని ప్రశ్నార్థకంగా మారాయి. నీట్‌తోపాటు భారతీయ విశ్వవిద్యాలయాల్లో, జాతీయ పరిశోధన సంస్థల్లో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశ్న పత్రం కూడా లీక్ అయ్యింది. పరిశోధన రంగంలో ప్రాథమిక స్థాయిలో చేరే విద్యార్థుల కోసం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఐఐటీల వంటి సంస్థలు కూడా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌పై ఆధారపడుతూంటాయి. పీహెచ్‌డీల్లో ప్రవేశానికి ఈ పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. బోధన వృత్తుల్లో స్థిరపడే వారికి కూడా. ఈ పరీక్షలను విశ్వసనీయతతో, సకాలంలో నిర్వహించడం భారతదేశ ఉన్నత విద్య, పరిశోధన రంగాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒకపక్క ఈ అనూహ్య పరిస్థితిని ఎదుర్కొంటుండగా, ఇంకోపక్క అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పుల్లో చైనా కంటే భారత్ బాగా వెనుకబడిపోతూండటం గమనార్హం. పరిశోధన పత్రాల్లో టాప్ప్రపంచంలో ఒక దేశపు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల సత్తాను నిర్ధారించేది ఉన్నత విద్య, పరిశోధన రంగాల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల విస్తృతి ఎంత? అన్నది. ఎంత ఉత్పత్తి అవుతోంది? నాణ్యత ఏమిటి? అన్నది నిర్ధారించేందుకు చాలా మార్గాలున్నాయి. పరిశోధన వ్యాసాల ప్రచురణ, సాధించిన పేటెంట్లు, నోబెల్ వంటి అంతర్జాతీయ అవార్డులు, పారిశ్రామిక రంగానికి బదిలీ అయిన టెక్నాలజీలు, పరిశోధనల ద్వారా సమాజానికి ఒనగూరిన లబ్ధి... ఇలా చాలా మార్గాలున్నాయి. పరిశోధన పత్రాల ప్రచురణే ప్రధాన అంశంగా ఏటా రీసెర్చ్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న వారి జాబితాను ‘నేచర్’ జర్నల్ ప్రచురిస్తుంటుంది. ఈ జాబితాలో అత్యున్నత స్థాయి పరిశోధన ఫలితాల ఆధారంగా 500 సంస్థలు ఉంటాయి. ఏటా జనవరి 1 నుంచి డిసెంబరు 31 మధ్య పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 145 అంతర్జాతీయ జర్నళ్లలో ప్రచురితమైన పరిశోధన పత్రాలను పరిశీలించి, ఒక స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం ఈ జాబితాను సిద్ధం చేస్తుంది. నేచర్ ప్రచురించిన తాజా జాబితాలో దేశాల పరిశోధన సామర్థ్యాల ఆధారంగా అమెరికా, జర్మనీ, యూకే, జపాన్ , ఫ్రాన్స్, కెనడా, దక్షిణ కొరియాలను కూడా అధిగమించి చైనా అగ్రస్థానంలోకి చేరింది. భారత్ తొమ్మిదో స్థానంలో ఉంటూ... టాప్ 10 దేశాల్లో ఒకటిగా ఉన్నామన్న సంతృప్తి మాత్రమే మనకు మిగిల్చింది. భారత్ వంతు గత ఏడాది చైనా వంతు కంటే ఎక్కువ కావడం కూడా గమనార్హం. అయితే సంస్థల స్థాయిలో పరిశోధన పత్రాలను పరిశీలిస్తే నిరాశే మిగులుతుంది. అంతర్జాతీయంగా టాప్ పది పరిశోధన సంస్థల్లో ఏడు చైనావి కావడం... హార్వర్డ్ (రెండో స్థానం), మ్యాక్స్ ప్లాంక్ సొసైటీ (మూడో స్థానం), ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (ఏడో స్థానం) మాత్రమే టాప్ 10లోని ఇతర సంస్థలు కావడం గమనార్హం. మసాచూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలు సైతం 14, 15 స్థానాల్లో నిలిచాయి. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అగ్రస్థానంలో ఉంది. టాప్–10లో లేము!టాప్ సంస్థల్లో భారతీయ పరిశోధన సంస్థలు చాలా దిగువన ఉన్నాయి. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ 174వ స్థానంలో ఉంటే, ఐఐటీ–బాంబే 247లో ఉంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 275లో, టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ 283వ స్థానంలోనూ ఉన్నాయి. హోమీ భాభా నేషనల్ ఇన్ స్టిట్యూట్(296), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–కోల్‌కతా (321), ఐఐటీ–గౌహతి (355), ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్(363), ఐసర్–భోపాల్(379), ఐఐటీ–కాన్పూర్(405), ఐఐటీ–మద్రాస్(407), ఐఐటీ–ఢిల్లీ (428), ఐసర్–పుణె (439), జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్(450), అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నొవేటివ్ రీసెర్చ్(487) ర్యాంకింగ్ కూడా దిగువలోనే ఉండటం గమనార్హం. ర్యాంకింగ్‌ల మాట ఇలా ఉంటే, పరిశోధనలు చేస్తున్న రంగాల విషయం చూద్దాం. భౌతిక, రసాయన, భూ, పర్యావరణ రంగాల్లో చైనా అగ్రస్థానంలో ఉండగా... అమెరికా, యూరప్ రెండూ జీవ, వైద్య శాస్త్రల్లో ముందంజలో ఉన్నాయి. అప్లైడ్ సైన్సెస్ రంగంలోనూ చైనా నుంచే అత్యధిక పరిశోధన పత్రాలు ప్రచురితమవుతుండటం విశేషం.చైనా కొన్ని భారీ సైన్స్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు కూడా పెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్డ్–అపెర్చర్ రేడియో టెలిస్కోపు అలాంటిదే. కృష్ణ పదార్థం ఉనికిని గుర్తించేందుకు చేపట్టిన భారీ భూగర్భ పరిశోధన ఇంకోటి. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలోనూ పలు చైనా సంస్థల్లో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. అంతరిక్ష రంగం విషయానికి వస్తే... చైనా మన దేశం కంటే కనీసం పదేళ్లు ముందుందని చెప్పాలి. 2003లో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర జరపడమే కాదు, సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే జాబిల్లి నుంచి రాతి నమూనాలను విజయవంతంగా వెనక్కు తెచ్చిన రోబోటిక్ మిషన్ చేపట్టింది.మన స్పందన ఎలా ఉండాలి?శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో చైనా పురోగతికి మనం ఎలా స్పందించాలి? పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్నట్లే వీటిని తిరస్కరించడం సులువైన పని అవుతుంది. జాబితా తయారీలో పలు లోటుపాట్లు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇది వాస్తవ పరిస్థితిని మార్చదు. ఇంకో పద్ధతి కూడా ఉంది. ఈ జాబితాను ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం. టాప్ దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది కాబట్టి, దాని ఆధారంగా మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. చైనా ఈ ఘనతలన్నీ సాధించేందుకు ఏం చేసింది? ఎక్కడ తప్పటడుగులు వేసిందన్నది నిజాయితీగా పరిశీలించి గుణపాఠాలు నేర్చుకోవాలి. ‘నైన్ లీగ్’ లేదా ‘ప్రాజెక్ట్ 211’లో భాగంగా దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, ప్రపంచస్థాయి పరిశోధన శాలలను అభివృద్ధి చేసేందుకు చైనా భారీగా నిధులు ఖర్చు పెడుతోంది. ఐసర్ వంటి సంస్థల అభివృద్ధికి భారత్ చేసిన ప్రయత్నంతో ఎన్నో లాభాలు వచ్చినా ఈ విషయంలో చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. పరిశోధన పత్రాల ప్రచురణకు చైనా నగదు బహుమతులను ప్రకటించి తప్పు చేసిందని చెప్పాలి. దీనివల్ల అనైతిక పద్ధతులు పెరిగిపోయాయి. భారత్ ఇలాంటి పని చేయకుండా ఉండటం అవసరం. భారత్‌లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో పురోగతిని అడ్డుకుంటున్న కొన్ని సాధారణ విషయాల్లో జీడీపీలో కొంత శాతాన్ని ఈ రంగాలకు కేటాయించకపోవడం కూడా ఉంది. నిధుల పంపిణీ పద్ధతులు, కొత్త పరిశోధన సంస్థల ఏర్పాటు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు ప్రోత్సాహం వంటివి స్తంభించిపోయి ఉన్నాయి. నేషనల్ సైన్స్ అకాడమీలు, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం, టెక్నాలజీ ఫోర్కాస్టింగ్ ఏజెన్సీ వంటివి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సెల్ఫీ పాయింట్ల వద్ద విజయోత్సవాలను నిర్వహించడంలో బిజీగా ఉండిపోయాయి. నిద్రాణంగా ఉన్న ఇలాంటి వారందరికీ చైనా పురోగతి ఓ మేలుకొలుపు కావాలి. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
సైన్స్, టెక్నాలజీలో మహిళా గ్రాడ్యుయేట్లు పెరగాలి
న్యూఢిల్లీ: దేశీయంగా టెక్నాలజీ రంగంలో లింగ అసమానతలు గణనీయంగా ఉంటున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఈషా అంబానీ తెలిపారు. మహిళలంటే ఉపాధ్యాయ వృత్తిలాంటివి మాత్రమే చేయగలరంటూ స్థిరపడిపోయిన అభిప్రాయాలే ఇందుకు కారణమని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా టెక్నాలజీ రంగంలో మహిళల వాటా 36 శాతమే ఉండగా, స్టెమ్ గ్రాడ్యుయేట్స్‌లో 43 శాతం, మొత్తం సైంటిస్టులు, ఇంజినీర్లు, టెక్నాలజిస్టుల్లో 14 శాతం మాత్రమే ఉందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ విభాగాల్లో మహిళా గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని ’ గాల్స్ ఇన్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) డే’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈషా తెలిపారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో పరిస్థితిని సరిదిద్దుకునే అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోవాలని ఆమె పేర్కొన్నారు. -
Jahnavi Falki: 'సామాన్య శాస్త్రానికి' తను ఒక మారుపేరు!
సైన్స్‌ను సామాన్యుల దగ్గరికి తీసుకుపోవడానికి ‘బెంగళూరు సైన్స్ గ్యాలరీ’ ద్వారా ప్రయత్నిస్తోంది జాహ్నవి ఫాల్‌కి. ‘సైంటిఫిక్ స్టోరీ టెల్లర్’గా దేశవిదేశాల్లో పేరు తెచ్చుకున్న జాహ్నవి సైన్స్‌కు సంబంధించిన డాక్యుమెంటరీలు తీసింది. పుస్తకాలు రాసింది. ‘అడగడం’ ‘తెలుసుకోవడం’ అనే ప్రక్రియ జాహ్నవికి ఎంతో ఇష్టమైనది. ఆమెకు బాగా నచ్చే మాట.. రైట్ క్వశ్చన్. రిసెర్చ్ వర్క్ నుంచి కెరీర్‌కు సంబంధించి డైరెక్షన్‌ను మార్చుకోవడం వరకు ‘రైట్ క్వశ్చన్’ అనేది ఆమెకు ఎంతో ఉపయోగపడింది. అమెరికాలోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరకు తీసుకెళ్లింది. అక్కడ భారతదేశ శాస్త్ర సాంకేతిక చరిత్రను అధ్యయనం చేసింది. ఆ చరిత్రపై బాగా ఇష్టాన్ని పెంచుకుంది. తాను తెలుసుకున్న విషయాలను, తన అభిప్రాయాలను నలుగురితో పంచుకోవడానికి వివిధ మాధ్యమాలను ఎంచుకుంది. 'బాంబే యూనివర్శిటీ’లో సివిక్స్ అండ్ పాలిటిక్స్ చదువుకున్న జాహ్నవి ‘జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో సైన్స్ అండ్ టెక్నాలజీ హిస్టరీలో డాక్టరేట్ చేసింది. సామాజిక శాస్త్రాల అధ్యయనం ద్వారా సామాజిక కోణంలో సైన్స్‌ను అర్థం చేసుకుంది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే ‘సైన్స్ అనేది ఒంటరి కాదు’ సైన్స్‌ను ప్రభావితం చేసే అంశాలు సమాజంలో ఎన్నో ఉంటాయి. ఆ అంశాలకు సైన్స్‌కు మధ్య ఉండే అంతః సంబంధాన్ని లోతుగా అధ్యయనం చేసింది. ‘ఆటోమిక్ స్టేట్ బిగ్ సైన్స్ ఇన్ ట్వంటీయత్ సెంచరీ ఇండియా సైన్స్’ పుస్తకం జాహ్నవికి ఎంతో పేరు తెచ్చింది. ‘కీ కాన్సెప్ట్స్ ఇన్ మోడ్రన్ ఇండియన్ స్టడీస్’కు కో–ఎడిటర్‌గా వ్యవహరించింది. ‘సైక్లోట్రాన్’ పేరుతో సైన్స్ డాక్యుమెంటరీ తీసింది. సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కథలు చెప్పడం తనకు ఇష్టమైన పని. ‘మెనూ గురించి తెలుసుకోవాలంటే మనం మొదట ఉండాల్సింది టేబుల్ దగ్గర’ అంటున్న జాహ్నవి ‘సైన్స్’ అనే మెనూ గురించి తెలుసుకోవడానికి ‘సైన్స్ గ్యాలరీ’ అనే టేబుల్ దగ్గరికి ప్రజలను తీసుకువస్తుంది. లండన్‌లోని కింగ్స్ కాలేజీ ఫ్యాకల్టీగా పనిచేసిన జాహ్నవి 2018లో ‘బెంగళూరు సైన్స్ గ్యాలరీ’ ఫౌండింగ్ మెంబర్‌గా నియమితురాలైంది. ఉరుకుల పరుగుల పోటీ ప్రపంచానికి కాస్త దూరంగా.. సృజనాత్మకంగా ఆలోచించేలా, సైన్స్‌కు దగ్గరయ్యేలా యువతను ఆకట్టుకోవడానికి ‘బెంగళూరు సైన్స్ గ్యాలరీ’ ద్వారా ప్రయత్నిస్తోంది జాహ్నవి. ‘మ్యూజియం’ వాతావరణం ఆమెకు కొత్త కాదు. ‘సైన్స్ మ్యూజియం లండన్’ ఎక్స్టర్నల్ క్యురేటర్‌గా పనిచేసి ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది. ‘మా టార్గెట్ ఆడియెన్స్ పదిహేనేళ్ల పైబడిన వారు అయినప్పటికీ అండర్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లపై కూడా దృష్టి సారిస్తాం. అంతరిక్షానికి సంబంధించి సమకాలీన, భవిష్యత్ విషయాలపై దృష్టి పెట్టేలా గ్యాలరీ తోడ్పడుతుంది’ అంటుంది జాహ్నవి. శాస్త్రీయ విషయాలతో యువత మమేకం కావడానికి డిజిటల్ ఎగ్జిబిషన్ ద్వారా ప్రయత్నిస్తోంది జాహ్నవి. ‘బ్రేకింగ్ ది వాల్స్ బిట్విన్ సైన్స్ అండ్ కల్చర్’ శీర్షికతో నిర్వహించిన ఆన్లైన్ సైన్స్ గ్యాలరీకి కూడా మంచి స్పందన వచ్చింది. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ జాహ్నవిని హ్యుమానిటీస్ విభాగంలో ‘ఇన్ఫోసిస్ ప్రైజ్’తో సత్కరించింది. సైన్స్‌ను జాహ్నవి అర్థం చేసుకున్న కోణాన్ని, చేపడుతున్న కార్యక్రమాలను ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ప్రశంసించింది. ఇవి చదవండి: Ruchira Gupta: చీకటి కూపం నుంచి వెన్నెల దారుల్లోకి.. -
‘ఇస్రో’ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి
సాక్షి, బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. వాతావరణ రంగంలో సేవలందించేందుకు గాను జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ సాయంతో ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతమైంది. ప్రయోగంలో భాగంగా ఇన్శాట్-3డీఎస్లోని 6-ఛానల్ ఇమేజర్, 19-ఛానల్ ఇమేజర్ భూ చిత్రాలను తీసింది. ఆ చిత్రాల సాయంతో దేశ వాతావరణ పర్యవేక్షణ, అంచనా సామర్థ్యాలను గుర్తించేందుకు ఉపయోగపడతాయి.ఇన్శాట్-డీఎస్ తీసిన చిత్రాలు వాతావరణ అంచనా, వాతావరణ పర్యవేక్షణ, వాతావరణ పరిశోధనల కోసం కీలకమైన డేటాను అందించడానికి ఉపయోగపడతాయని ఇస్త్రో ప్రకటించింది. 6-ఛానల్ ఇమేజర్ భూమి ఉపరితలం, వాతావరణ చిత్రాలను ఒడిసిపట్టింది. ఈ చిత్రాల సాయంతో భూమి ఉపరితల ఉష్ణోగ్రత, వృక్ష ఆరోగ్యం, నీటి ఆవిరి పంపిణీ వంటి వివిధ వాతావరణ, ఉపరితలాల సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది. 19-ఛానల్ ద్వారా సేకరించే చిత్రాల సాయంతో భూమి వాతావరణం ద్వారా విడుదలయ్యే రేడియేషన్‌ను వివిధ వాతావరణ భాగాలు, నీటి ఆవిరి, ఓజోన్, కార్బన్ డయాక్సైడ్, ఇతర వాయువుల వంటి లక్షణాల ద్వారా విడుదలయ్యే రేడియేషన్ గురించి తెలుసుకునేందుకు సహా పడతాయి. -
ముందు ఉట్టి కొడదాం!
'ఉట్టి కొట్టలేనమ్మ.. స్వర్గానికి నిచ్చెనలు వేసింది' అన్న చందంగా, భూమిపై బతకడం చేతకాని మనిషి అంతరిక్షంలో కాలనీలు కట్టి కాపరం చేస్తానంటున్నాడు. ఆ దిశగా ఆధునిక మానవుడు పరిశోధనలు ముమ్మరం చేస్తున్నాడు. కానీ, అది అంత తేలిక కాదు, పైగా మనిషిని మనిషే చంపుకొని తినే దారుణమైన పరిస్థితులు వస్తాయని కొందరు శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. కరోనా వంటి ఊహాతీతమైన వ్యాధులు వచ్చి, మనిషిని పట్టి పీడిస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా ఎటువంటి వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని మనిషి భయపడుతూనే ఉన్నాడు. కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తూ వుంటే శాస్త్రవేత్తలు సైతం కంగారుపడిపోతున్నారు. సామాన్య మానవులు బెంబేలెత్తి పోతున్నారు. ఇది ఇలా ఉంటుండగానే, భూమి నుంచి దూరంగా వెళ్ళి, వేరే స్పేస్ లో జీవించవచ్చు అనే విశ్వాసాన్నీ పెంచుకుంటున్నాడు. ఇది కొత్తగా పుట్టిన కోరిక కాదు. ఎప్పటి నుంచో మనిషి ఆలోచిస్తున్నాడు. కరోనా కాలానికి ముందే కొందరు శాస్త్రవేత్తలు అంతరిక్ష జీవనాన్ని ప్రచారంలోకి తెచ్చారు. సాధ్యాసాధ్యాలపై ఇంకా విస్తృతంగా అధ్యాయనాలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త ప్రపంచంలోకి అడుగు పెడదాం, కొత్త లోకాల్లో విహరిద్దాం అని మనిషి ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. భూమిపై ఏదైనా విపత్తు వచ్చినా, పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా వసతులు, వనరులు సరిపోకపోయినా.. పైకెళ్లి జీవించాలనే ఆలోచనలకు శాస్త్రవేత్తలు మరింత పదునుపెడుతున్నారు. అంగారక గ్రహం లేదా చంద్రమండలంపై కాలనీలు నిర్మంచి జీవించవచ్చు అని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు కూడా! భూమి నుంచి ఆహారాన్ని పంపించే పరిస్థితులపైనా దృష్టి సారిస్తున్నారు. ఇవ్వన్నీ సాధించడానికి సుదీర్ఘకాలం వేచి చూడాల్సిందేనని అర్థం చేసుకోవాలి. ఆ మధ్య ఎడిన్ బర్గ్ యూనివర్సిటీకి చెందిన చార్లెస్ కొకెల్ కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. పాత విషయాలను కొన్నింటిని గుర్తు చేశారు. నిజంగా భూమి నివాసయోగ్యం కానప్పుడు అంతరిక్షం వైపు చూడవచ్చు. కానీ, దానిని సాధించాలంటే ఇంకా ఎన్నో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు. 19వ శతాబ్దంలో నార్త్ వెస్ట్ పాసేజ్‌ను వెతకాడానికి కెప్టెన్ సర్ జాన్ ఫ్రాంక్లిన్ బయలుదేరారు. సాంకేతిక సమస్య తలెత్తడంతో దారి తప్పారు. అత్యుత్తమ సాంకేతికత అందుబాటులో ఉన్నా, వారంతా ఒకరినొకరు చంపుకుతినే దారుణమైన దుస్థితి వచ్చిందని ప్రొఫెసర్ చార్లెస్ కొకెల్ గుర్తుచేస్తున్నాడు. అంతరిక్షంలో కూడా అటువంటి పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నాడు. వనరులు, వసతులతో పాటు ఆహారకొరత ప్రధాన సమస్యగా నిలుస్తుందని ఆయన భావిస్తున్నాడు. డాక్టర్ కామెరన్ స్మిత్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అంతరిక్షంలో మానవ మనుగడ వేళ్లూనుకోవాలంటే? వ్యవసాయ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. గ్రహాంతర వాసులకోసం వెతుకులాట కూడా ఇప్పటికే మొదలైంది. అంతరిక్షంలోకి వెళ్లబోయే ముందు, ఈ భూమిని పవిత్రంగా, పచ్చగా కాపాడుకోవడం ముఖ్యం. స్వార్థం శృతి మించి, కోరికలు, విలాసాలు ఆకాశాన్ని అంటిన ఆధునిక మానవుడు సహజ వనరులను ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్నాడు. తత్ఫలితంగా అడువులు అంతరించి పోతున్నాయి, జీవనదులు ఇంకిపోతున్నాయి. భూమి క్రుంగిపోతోంది, సముద్ర మట్టాలు పెరిగి పోతున్నాయి. అగ్ని గోళాలు బద్ధలై పోతున్నాయి. ఒక్కటేమిటి? విశ్వరూపమే మారిపోతోంది. ప్రకృతిని అందినకాడికి అంతం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో రుతువుల గమనం మారిపోయింది. భూమి వేడెక్కిపోతోంది. అతివృష్టి అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలు ప్రబలి పోయాయి. ఆణువణువూ కాలుష్య కాసారంగా మారింది. పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం అంతా కలుషితమై పోయింది. ఇంటాబయటా అంతా కాలుష్యమే. దీనికి ముందుగా మనిషి మనసే అత్యంత కలుషితమై పోయింది. అందుకే, కొంగ్రొత్త వింత వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మంచినీరే కాదు, మంచిగాలి కూడా కొనడానికి కూడా దొరకని దుస్థితి వచ్చేసింది. పల్లెల ముఖచిత్రం మారిపోయింది. చేతివృత్తులు ఎగిరిపోయాయి. వ్యవసాయ విధానమే మారిపోయింది. ఆహారరక్షణపై శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. అంతరిక్షానికి ఆహార సరఫరా సంగతి తర్వాత చూద్దాం. ముందుగా, భూమిపై పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార ఉత్పత్తి జరగడమే ప్రమాదంలో పడింది. ఆధునిక మానవుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మమై పోతోంది. భూమిని పాడుచెయ్యడమే కాక, గ్రహాలను సైతం పాడు చెయ్యడానికి మనిషి తయారవుతున్నాడని కొందరు శాస్త్రవేత్తలు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో, కరోనా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలకుండా చూడడం శాస్త్రవేత్తల ప్రథమ కర్తవ్యం. ప్రకృతిని, భూభాగాన్ని రక్షించుకోవడం మానవాళి ప్రాథమిక అవసరం. సహజ వనరులను నిలబెట్టు కోవడం అత్యంత ముఖ్యమైన అంశం. వీటన్నిటిపై దృష్టి సారించడమే అందరి తక్షణ కర్తవ్యం. సమాంతరంగా అంతరిక్ష పరిశోధనలు కొనసాగించుకోవచ్చు. అన్నింటి కంటే ముందుగా, మంచి వైపు మనిషి మారితే? అంతా మంచే జరుగుతుందని విశ్వసిద్దాం. - మాశర్మ -
Sia Godika: 'సామాజిక సేవ నుంచి సైన్స్ వరకు'..
'బెంగళూరుకు చెందిన సియా గోడికా పేరు వినిపించగానే ‘సోల్ వారియర్స్’ గుర్తుకు వస్తుంది. ‘సోల్ వారియర్స్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా పేదలకు పాదరక్షలను అందిస్తుంది సియా. ‘చేంజ్‌మేకర్’గా గుర్తింపు పొందిన సియా గోడికా చదువులోనూ ప్రతిభ చూపుతోంది. ‘ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్’ గురించి ఆమె చేసిన సైన్స్ వీడియో ‘బ్రేక్‌త్రూ జూనియర్ చాలెంజ్’లో బహుమతి గెలుచుకుంది'. సైన్స్, మ్యాథమెటిక్స్‌కు సంబంధించి క్రియేటివ్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌కు ఇచ్చే ప్రైజ్ ఇది. సేవామార్గంలో ప్రయాణించడంతో పాటు క్రియేటివ్ థింకింగ్ కోసం పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటుంది సియా. సైన్స్‌కు సంబంధించిన సరికొత్త విషయాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటుంది. ‘ఇంట్లో పిల్లలకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటే గొప్ప విజయాలు సాధించవచ్చు’ అని చెప్పడానికి సియా ఒక ఉదాహరణ. సేవాకార్యక్రమాలకు తమ వంతుగా సహాయపడడం నుంచి సైన్స్ సంగతులు చెప్పడం వరకు సియా గోడికాకు ఎన్నో రకాలుగా ఆమె తల్లిదండ్రులు సహకారం అందించారు. ఇవి చదవండి: Rest Mom Face: పేరెంటింగ్ ప్రపంచంలో కొత్త మంత్రం -
కైలాసగిరికి మరో మకుటం
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖపట్నంలోని కైలాసగిరిని రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మరో అడుగు పడింది. ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా ఉన్న కైలాసగిరి.. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించే విధంగా మరిన్ని హంగులు సంతరించుకుంటోంది. తాజాగా సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం పురుడుపోసుకుంటోంది. కేంద్ర సాంస్కృతికశాఖ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సుమారు ఎకరా విస్తీర్ణంలో రూ.4.69 కోట్లతో ఈ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాయి. 3డీ ఆర్ట్ గ్యాలరీ, సిలికా విగ్రహాలు, సైన్స్ వర్కింగ్ మోడల్ ప్రదర్శనలు, శాస్త్రీయ థీమ్‌లు తదితరాలతో.. ఏడాదిలో ఇది అందుబాటులోకి రానుంది. ఈ మ్యూజియం నిర్మాణానికి ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కైలాసగిరిని ముఖ్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ఇక్కడ పర్యాటకులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో పలు అభివృద్ధి పనులకు ఇక్కడ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కేంద్ర సాంస్కృతికశాఖ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మ్యూజియం గ్రాంట్æస్కీం కింద సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎస్సీఏపీ) ఆధ్వర్యంలో అధునాతనమైన సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రూ.4.69 కోట్లతో ఏర్పాటు చేస్తున్న దీనికి.. రూ.3.75 కోట్లను ఎస్సీఏపీకి కేంద్ర సాంస్కృతికశాఖ కేటాయించగా మిగిలిన సుమారు రూ.కోటిని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ పనుల్ని ఏడాదిలో పూర్తిచేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారని ఆయన చెప్పారు. జీవీఎంసీ కార్పొరేటర్ స్వాతి, ఎస్సీఏపీ సీఈవో డాక్టర్ కె.జయరామిరెడ్డి, వీఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రవీంద్ర, కార్యదర్శి బి.కీర్తి తదితరులు పాల్గొన్నారు. -
Year End 2023: ఆవిష్కరణల ఏడాది
అంతరిక్ష అన్వేషణ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దాకా, గ్లోబల్ వారి్మంగ్ నుంచి పలు మానవ వికాసపు మూలాల దాకా శాస్త్ర సాంకేతిక రంగాల్లో 2023లో పలు నూతన ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. ప్రపంచం దృష్టిని తమవైపుకు తిప్పుకోవడమే గాక భవిష్యత్తుపై కొంగొత్త ఆశలు కూడా కల్పించాయి. వినాశ హేతువైన గ్లోబల్ వారి్మంగ్‌లో కొత్త రికార్డులకూ ఈ ఏడాది వేదికైంది! 2023లో టాప్ 10 శాస్త్ర సాంకేతిక, పర్యావరణ పరిణామాలను ఓసారి చూస్తే... 1. చంద్రయాన్ దశాబ్దాల కృషి అనంతరం భారత్ ఎట్టకేలకు చందమామను చేరింది. తద్వారా చంద్రయాన్–3 ప్రయోగం చరిత్ర సృష్టించింది. పైగా ఇప్పటిదాకా ఏ దేశమూ దిగని విధంగా చంద్రుని దక్షిణ ధ్రువంవైపు చీకటి ఉపరితలంపై దిగిన రికార్డును కూడా చంద్రయాన్–3 సొంతంచేసుకుంది. ఇంతటి ప్రయోగాన్ని ఇస్రో కేవలం 7.5 కోట్ల డాలర్ల వ్యయంతో దిగి్వజయంగా నిర్వహించడం ప్రపంచాన్ని అబ్బురపరిచిందనే చెప్పాలి. చంద్రుని ఉపరితలంపై సల్ఫర్ జాడలున్నట్టు చంద్రయాన్–3 ప్రయోగం ధ్రువీకరించింది. రెండు వారాల పాటు చురుగ్గా పని చేసి దాన్ని ప్రయోగించిన లక్ష్యాన్ని నెరవేర్చింది. 2. కృత్రిమ మేధ ఈ రంగంలో కీలక ప్రగతికి 2023 వేదికైంది. 2022 చివర్లో ఓపెన్ఏఐ విడుదల చేసిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ ఈ ఏడాది అక్షరాలా సంచలనమే సృష్టించింది. ఆకా శమే హద్దుగా అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోయింది. లీవ్ లెటర్లు ప్రిపేర్ చేసినంత సులువుగా సృజనాత్మకమైన లవ్ లెటర్లనూ పొందికగా రాసి పెడుతూ వైవిధ్యం చాటుకుంది. అప్పుడప్పుడూ తడబడ్డా, మొత్తమ్మీద అన్ని అంశాల్లోనూ అపారమైన పరిజ్ఞానం, నైపుణ్యంతో యూజర్ల మనసు దోచుకుంది. గూగుల్ తదితర దిగ్గజాలు కూడా సొంత ఏఐ చాట్బోట్లతో బరిలో దిగుతుండటంతో ఏఐ రంగంలో మరిన్ని విప్లవాత్మక పరిణామాలు వచ్చేలా ఉన్నాయి. 3. ఆదిమ ‘జాతులు’! మనిషి పుట్టిల్లు ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం... ఆఫ్రికా. అంతవరకూ నిజమే అయినా, మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామని ఇప్పటిదాకా నమ్ముతున్న సిద్ధాంతం తప్పని 2023లో ఓ అధ్యయనం చెప్పింది. మన మూలాలు కనీసం రెండు ఆదిమ జాతుల్లో ఉన్నట్టు తేలి్చంది! 10 లక్షల ఏళ్ల కింద ఆఫ్రికాలో ఉనికిలో ఉన్న పలు ఆదిమ జాతులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి దారి తీసినట్టు డీఎన్ఏ విశ్లేషణ ఆధారంగా అది చెప్పడం విశేషం! మూలవాసులైన అమెరికన్లు దాదాపు 20 వేల ఏళ్ల కింద ఉత్తర అమెరికాకు వలస వెళ్లి యురేషియాకు తిరుగు పయనమైనట్టు మరో అధ్యయనం తేల్చింది. 4. గ్రహశకలం ఓసిరిస్ నాసా ప్రయోగించిన ఒసిరిస్ రెక్స్ రోబోటిక్ అంతరిక్ష నౌక ఏడేళ్ల ప్రయాణం అనంతరం బెన్నూ గ్రహశకలంపై దిగింది. అక్కడి దాదాపు పావు కిలో పరిమాణంలో రాళ్లు, ధూళి నమూనాలను సేకరించి భూమికిపైకి పంపింది. అవి సెపె్టంబర్ 24న అమెరికాలోని ఉటా ఎడారి ప్రాంతంలో దిగాయి. వాటిని విశ్లేషించిన సైంటిస్టులు నీటితో పాటు భారీ మొత్తంలో కార్బన్ జాడలున్నట్టు తేల్చారు. బెన్నూ గ్రహశకలం భూమి కంటే పురాతనమైనది. దాని నమూనాల విశ్లేషణ ద్వారా భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన కీలకమైన రహస్యాలు వెలుగు చూడవచ్చని భావిస్తున్నారు. 5. అత్యంత వేడి ఏడాది చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అత్యంత వేడి ఏడాదిగా 2023 ఓ అవాంఛనీయ రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా ప్రతి నెలా ఇప్పటిదాకా అత్యంత వేడిమి మాసంగా నమోదవుతూ వచి్చంది! ఫలితంగా ఏడాది పొడవునా లిబియా నుంచి అమెరికా దాకా తీవ్ర తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు ఉత్పాతాలు సృష్టిస్తూనే వచ్చాయి. పైగా నవంబర్‌లో అయితే 17వ తేదీన భూ తాపంలో చరిత్రలోనే తొలిసారిగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! 2 డిగ్రీల లక్ష్మణ రేఖను తాకితే సర్వనాశనం తప్పదని సైంటిస్టులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం వణికిస్తోంది. 6. సికిల్ సెల్‌కు తొలి జన్యుచికిత్స సికిల్ సెల్, బెటా థలస్సీమియా వ్యాధులకు తొలిసారిగా జన్యు చికిత్స అందుబాటులోకి వచి్చంది. వాటికి చికిత్స నిమిత్తం కాస్జెవీ 9క్రిస్పర్ కేస్9) జన్యు ఎడిటింగ్ టూల్ వాడకానికి బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం లభించింది. ఈ థెరపీ ద్వారా రోగులకు నొప్పి నిదానించిందని, ఎర్ర రక్త కణాల మారి్పడి ఆవశ్యకత కూడా తగ్గుముఖం పట్టిందని తేలింది. కాకపోతే ఈ చికిత్స ఖరీదే ఏకంగా 20 లక్షల డాలర్లు! పైగా భద్రత అంశాలు, దీర్ఘకాలిక పనితీరు తదితరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 7. ఊబకాయానికి మందు మధుమేహానికి ఔషధంగా పేరుబడ్డ వెగోవీ ఊబకాయాన్ని తగ్గించే మందుగా కూడా తెరపైకి వచ్చి సంచలనం సృష్టించింది. బరువును తగ్గించడం మాత్రమే గాక గుండెపోటు, స్ట్రోక్ తదితర ముప్పులను కూడా ఇది బాగా తగ్గిస్తుందని తేలడం విశేషం. వీటితో పాటు పలురకాల అడిక్షన్లకు చికిత్సగా కూడా వెగోవీ ప్రభావవంతంగా ఉపయోగపడుతోందని తేలింది. అయితే దీని వాడకం వల్ల థైరాయిడ్ క్యాన్సర్ వంటి సైడ్ ఎఫెక్టులు రావచ్చంటున్నారు! 8. పాపం పక్షిజాలం ప్రపంచవ్యాప్తంగా జంతుజాలానికి, మరీ ముఖ్యంగా పక్షిజాలానికి మరణశాసనం రాసిన ఏడాదిగా 2023 నిలిచింది! ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొద్దీ పక్షి జాతుల జనాభాలో ఈ ఏడాది విపరీతమైన తగ్గుదల నమోదైనట్టు సైంటిస్టులు తేల్చారు. గత నాలుగు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్న ఈ ధోరణి 2023లో బాగా వేగం పుంజుకున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది. పురుగుమందుల విచ్చలవిడి వాడకమే పక్షుల మనుగడకు ముప్పుగా మారిందని తేలింది! 9. మూల కణాధారిత పిండం అండం, శుక్ర కణాలతో నిమిత్తం లేకుండానే కేవలం మూల కణాల సాయంతో మానవ పిండాన్ని సృష్టించి ఇజ్రాయెల్ సైంటిస్టులు సంచలనం సృష్టించారు. అది కూడా మహిళ గర్భంతో నిమిత్తం లేకుండా ప్రయోగశాలలో వారీ ఘనత సాధించారు. ఈ నమూనా పిండం ప్రయోగశాలలో 14 రోజుల పాటు పెరిగింది. ఆ సమయానికి సహజంగా తల్లి గర్భంలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఎదిగిందని తేలింది. మానవ పునరుత్పత్తి రంగంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రయోగాలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నారు. 10. కార్చిచ్చులు 2023లో కార్చిచ్చులు కొత్త రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా కెనడాలోనైతే పెను వినాశనానికే దారి తీశాయి. వీటి దెబ్బకు అక్కడ గత అక్టోబర్ నాటికే ఏకంగా 4.5 కోట్ల ఎకరాలు బుగ్గి పాలయ్యాయి! అక్కడ 1989లో నమోదైన పాత రికార్డుతో పోలిస్తే ఇది ఏకంగా రెట్టింపు విధ్వంసం. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, నార్వే వంటి పలు ఇతర దేశాల్లోనూ కార్చిచ్చులు విధ్వంసమే సృష్టించాయి. వీటి దెబ్బకు జూన్ నెలంతా అమెరికాలో వాయు నాణ్యత ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది. హవాయి దీవుల్లో కార్చిచ్చుకు ఏకంగా 100 మంది బలయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Kerala Stampede: కొచ్చిన్ వర్సిటీలో తొక్కిసలాట... నలుగురు విద్యార్థుల దుర్మరణం
కొచ్చి: కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఘోరం జరిగింది. వర్సిటీ టెక్ ఫెస్ట్‌లో భాగంగా శనివారం రాత్రి జరిగిన సంగీత విభావరిలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు కాగా ఇద్దరు అబ్బాయిలు. మరో 64 మందికి విద్యార్థులు పైగా గాయపడ్డారు. నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు చెబుతున్నారు. వర్షం, మెట్లే కారణం! సంగీత విభావరి వర్సిటీ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో ఏర్పాటైంది. ప్రఖ్యాత నేపథ్య గాయని నికితా గాంధీ తదితరులు రావడంతో ఏకంగా 2 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. దాంతో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. విభావరి ఊపులో ఉండగా ఉన్నట్టుండి వర్షం కురవడంతో వెనక వైపున్న వాళ్లంతా తల దాచుకునేందుకు ముందుకు తోసుకొచ్చారు. ఆ తాకిడిని తాళలేక వేదిక ముందున్న వాళ్లంతా బయటికి పరుగులు తీశారు. అదే సమయంలో బయట తడుస్తున్న వాళ్లు కూడా లోనికి తోసుకొచ్చారు. దాంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆడిటోరియంలోకి వచ్చేందుకు, వెళ్లేందుకు ఒకటే ద్వారం ఉండటంతో చూస్తుండగానే అక్కడ తోపులాట పెరిగిపోయింది. పలువురు విద్యార్థులు ఎత్తయిన మెట్ల మీది నుంచి పడిపోయారు. వారిని మిగతా వారు తొక్కుకుంటూ పరుగులు తీయడంతో పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆరుగురి పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురు అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దారుణంపై కేరళ సీఎం పినరాయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇద్దరు మంత్రులను వెంటనే వర్సిటీకి పంపించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఆదేశించారు. ఉదంతంపై లోతుగా దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు. విద్యార్థులు భారీగా రావడం, ఆకస్మిక వర్షమే ప్రమాదానికి దారి తీసినట్టు వర్సిటీ వీసీ డాక్టర్ శంకరన్ అభిప్రాయపడ్డారు. -
ఆత్మకథపై ఇస్రో చైర్మన్ సంచలన నిర్ణయం.. ఆ వివాదమే కారణమా?
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) చైర్మన్ 'ఎస్ సోమనాథ్' (S.Somanath) ‘నిలవు కుడిచ సింహగల్' (వెన్నెల తాగిన సింహాలు) పేరుతో మలయాళంలో తన ఆత్మకథను రాసారు. తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సమస్యలను యువతరానికి అందించి వారిలో స్ఫూర్తి నింపడానికి ఈ పుస్తకం రాసారు. ప్రచురణకు సిద్దమైన ఈ పుస్తకం ఇప్పుడు నిలిచిపోయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సోమనాథ్ ఆత్మకథలో ఇస్రో మాజీ చీఫ్ కె.శివన్‌పై కొన్ని విమర్శలు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. తాను ఇస్రో చైర్మన్ పదవిని చేపట్టకుండా అడ్డుకునేందుకు శివన్ ప్రయత్నించారని సోమనాథ్ తన పుస్తకంలో ఆరోపించినట్టు తెరపైకి రావడంతో సోమనాథ్ స్పందించారు. పుస్తకంలో పేర్కొన్న అంశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని, శివన్ తన ఎదుగుదలను అడ్డుకున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదని వెల్లడించారు. స్పేస్ కమిషన్ సభ్యుడిగా ఎంపికైతే ఇస్రో చైర్మన్ పదవి వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఆ సమయంలో మరో డైరెక్టర్‌ను నియమిస్తే అలాంటి అవకాశాలు తగ్గుతాయని మాత్రమే పుస్తకంలో పేర్కొన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఏడుసార్లు రిజెక్ట్.. విరక్తితో ఆత్మహత్యాయత్నం.. ఇప్పుడు లక్ష కోట్ల కంపెనీకి బాస్ పుస్తకం ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. నా పబ్లిషర్ కొన్ని కాపీలను విడుదల చేసి ఉండవచ్చు.. కానీ ఈ వివాదం తర్వాత, ప్రచురణను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తాను రాసిన పుస్తకం విమర్శనాస్త్రం కాదని, జీవితంలో సమస్యలను అధిగమించి తమ కలలను సాధించాలనుకునే వ్యక్తులకు స్ఫూర్తిదాయకమైన కథ అని ఇస్రో చైర్మన్ వెల్లడించారు. -
చంద్రయాన్-3 ల్యాండింగ్ వాయిదా..?
అహ్మదాబాద్(గుజరాత్): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్-3 ఆగస్టు 23, సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ఇదిలా ఉండగా అహ్మదాబాద్ ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ M దేశాయ్ ఒక వేళ చంద్రుడిపై పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ల్యాండర్ మాడ్యూల్ స్థితిగతులు సరిగ్గా లేకపోయినా ఆగస్టు 27కి వాయిదా వేస్తామని తెలిపారు. ఆగస్టు 23న భారత్ కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టాల్సి ఉంది. నిర్ణీత సమయానికి రెండు గంటల ముందు ల్యాండర్ స్థితిగతులను చంద్రుడిపై వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తామని ఒకవేళ పరిస్థితులు ఏ మాత్రం ప్రతికూలంగా ఉన్నా చంద్రయాన్-3 ల్యాండింగ్ ఆగస్టు 27 కు వాయిదా వేస్తామని తెలిపారు ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ M దేశాయ్. ప్రస్తుతానికైతే చంద్రయాన్-3లో ఎటువంటి లోపాలు తలెత్తలేదని నిర్ణీత సమయానికే ల్యాండ్ అవుతుందని అన్నారు. సోమవారం ఇస్రో చైర్మన్, స్పేస్ డిపర్ట్మెంట్ సెక్రెటరీ ఎస్.సోమ్‌నాథ్ కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌కు చంద్రయాన్ స్థితిగతుల గురించి వివరించారు. ఈ రెండు రోజులు కూడా చంద్రయాన్-3 స్థితిగతులను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నామని ల్యాండర్ నిర్ణీత సమయానికే చంద్రుడిపై కాలుమోపుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా చంద్రయాన్-3 విజయవంతమవుతుందని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ దేశం చరిత్ర సృష్టిస్తుందన్నారు. చివరి దశలో క్రాష్ ల్యాండింగ్ కావడంతో ఇస్రోతో సంబంధాలు తెగిపోయిన చంద్రయాన్-2తో చంద్రయాన్-3 కక్ష్యలో సంబంధాలు పునరుద్ధరించింది. అమెరికా, రష్యా, చైనా ఇదివరకే చంద్రుడిపై అడుగుపెట్టినా దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించనుంది. చంద్రయాన్-1 చంద్రుడి ఉపరితలంపై నీరు ఉండటాన్ని గుర్తించి సంచలనాన్ని సృష్టించగా ఆ ప్రయోగంలోని కొన్నిఅంశాలను ఆయా అగ్రదేశాలు తమ ప్రయోగాలకు ఇన్‌పుట్స్‌గా స్వీకరించాయని గుర్తుచేశారు. చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్ కారణంగా విఫలమవగా చంద్రయాన్-3 2020 జనవరిలో ప్రారంభమైందని 2021లోనే దీన్ని ప్రయోగించాల్సి ఉండగా కోవిడ్-19 కారణంగా ప్రయోగం వాయిదా పడుతూ వచ్చిందని తెలిపారు. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ఇందులో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని ఒకవేళ అన్ని పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారినా కూడా చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అయన అన్నారు. ఇది కూడా చదవండి: మీరు ఏ చాయ్‌వాలా గురించి అనుకున్నారో? -
మనిషి నడవగలుగుతున్నాడు..అద్భుతం చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ!
సరిగ్గా 12 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంతో మంచానికి పరిమితమైన తాను తిరిగి ఇక నడవలేనని అనుకున్నాడు. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి. ఎలా అంటారా? నెదర్లాండ్‌లోని లైడెన్‌లో నివాసం ఉంటున్న గెర్ట్ జన్ ఓస్కామ్ (Klara Sesemann) 2011లో సైక్లింగ్ చేసే సమయంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మెడ విరగడంతో శరీరంలోని ఇతర భాగాలకు సంబంధాలు తెగిపోవడంతో అతని శరీరం చచ్చుబడిపోయింది. దీంతో అతను నడవలేడు, కూర్చోలేడని చికిత్స చేసిన డాక్టర్లు తేల్చి చెప్పారు. డాక్టర్లు చెప్పినట్లుగా ఓస్కామ్ కొన్ని సంవత్సరాలు అలాగే మంచానికే పరిమితమయ్యాడు. కానీ అనూహ్యంగా సైన్స్, టెక్నాలజీ అద్భుతం చేయడంతో ఇప్పుడు సాధారణ మనిషిలా నడుస్తున్నాడు. ఓస్కామ్ బ్రెయిన్, వెన్నుముక, పాదాలలో ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్స్‌ను అమర్చండంతో సాధ్యమైందని డాక్టర్లు చెబుతున్నారు. చదవండి👉 ఇంట్లో ఇల్లాలు, ఇంటింటికీ తిరిగి సబ్బులమ్మి.. 200 కోట్లు సంపాదించింది! సైన్స్ టెక్నాలజీ ఓస్కాముకు ఎలా ప్రాణం పోసింది నివేదిక ప్రకారం.. స్విట్జర్లాండ్‌కు చెందిన లాసాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జోసిలిన్ బ్లాచ్ బ్రెయిన్ ( న్యూరోసర్జన్) పై పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల ముఖ్య ఉద్దేశం ఏదైనా ప్రమాదంలో బ్రెయిన్ సమస్య తలెత్తిన వారికి మళ్లీ పునర్జన్మనిచ్చేలా టెక్నాలజీ సాయంతో బ్రెయిన్ ఇంప్లాంట్ చేయనున్నారు. ఇందుకోసం డిజిటల్ బ్రిడ్జ్ పేరుతో పరికరాన్ని సైతం తయారు చేశారు. అయితే జూలై 2021లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓస్కామ్పై లౌసాన్‌లోని ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్లు టెక్నాలజీకల్ డివైజ్ (Brain implants)ను అమర్చారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ జోసెలిన్ బ్లాచ్ మాట్లాడుతూ ఈ బ్రెయిన్ ఇంప్లాంట్ పరిశోధనలు ప్రారంభ దశలో ఉన్నాయని, ఓస్కామ్ తరహా బ్రెయిన్ సమస్యలు, పక్షవాతం ఉన్న రోగులకు చికిత్స అందించే ఈ ప్రక్రియ అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని అన్నారు. చదవండి👉 హైదరాబాద్‌లో ఆ ఏరియా ఇళ్లే కావాలి.. కొనుక్కునేందుకు ఎగబడుతున్న జనం? బ్రెయిన్ ఇంప్లాంట్ ఆపరేషన్ ఎలా జరిగింది ముందుగా ప్రొఫెసర్ బ్లోచ్...ప్యారలైజ్తో బాధపడుతున్న జాన్ పుర్రెలో 5సెంటీమీటర్ల వ్యాసార్ధంలో రెండు గుండ్రటి రంద్రాలు పెట్టి.. ఆ రంద్రాల సాయంతో ప్రమాదాలతో బ్రెయిన్లోని కదలికల్ని నియంత్రించే బాగాన్ని కత్తిరించారు. అనంతరం వైర్లెస్ రెండు డిస్క్ ఆకారపు ఇంప్లాంట్లను (డిజిటల్ బ్రిడ్జ్) బ్రెయిన్లో అమర్చారు. అవి జాన్ ఏం చేయాలని అనుకుంటున్నాడో తెలుసుకొని అతను తన తలకు పెట్టకున్న హెల్మెట్‌లో ఉన్న రెండు సెన్సార్లకు సిగ్నల్స్ అందిస్తాయి. దీంతో ముందుగా ప్రోగ్రామ్ చేయబడి బ్రెయిన్ ఇంప్లాంట్ సాయంతో జాన్ కదిలేలా చేస్తోంది. ఇలా బ్రెయిన్‌తో పాటు వెన్నుపూస,పాదలలో ఇంప్లాంట్ చేయడంతో నడిచేందుకు సాధ్యమైంది. కొన్ని వారాల శిక్షణ తర్వాత అతను వాకర్ సహాయంతో నిలబడి నడవగలడని సైంటిస్ట్‌లు గుర్తించారు. ప్రాజెక్ట్‌కి నాయకత్వం వహించిన లౌసాన్‌లోని ఎకోల్ పాలిటెక్నిక్ ఫెడరేల్ (EPFL)కి చెందిన ప్రొఫెసర్ గ్రెగోయిర్ కోర్టిన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో అతని కదలికలు వేగవంతం అవుతాయని చెప్పారు. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను ఓస్కామ్ మాట్లాడుతూ 40 ఏళ్ల వయస్సులో నడుస్తున్నందుకు ఆనందంగా ఉన్నాను. ‘ నన్ను నేను పసిబిడ్డగా భావిస్తున్నారు. మళ్లీ నడవడం నేర్చుకుంటున్నాను.ఇది సుదీర్ఘ ప్రయాణం. ఇప్పుడు నేను నిలబడి నా స్నేహితుడితో కలిసి టీ తాగ గలుగుతున్నాను. ఆ ఆనందం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను అని సంతోషం వ్యక్తం చేశారు. చదవండి👉 రూ.2000 నోట్లను వదిలించుకోవడానికి వీళ్లంతా ఏం చేశారో చూడండి! -
వారధి కట్టాల్సిన సమయమిది!
దేశంలో ఉన్న ఎన్నో సమస్యలకు సైన్స్, సృజనాత్మకతల సమర్థ మేళవింపుతో మంచి పరిష్కారాలు కనుక్కోవచ్చు. అయితే శాస్త్రవేత్తలు రూపొందించినవే కాదు, గ్రామీణ స్థాయిలో అతితక్కువ ఖర్చుతో కూడుకున్న, కేవలం అవసరానికి తగ్గ సృజనాత్మక పరిష్కారాలూ మనదగ్గర ఉన్నాయి. వీటన్నింటినీ సాధారణ ప్రజలు వారి అవసరానికి తగ్గట్టు అభివృద్ధి పరిచారు. మరి ఈ అట్టడుగు స్థాయి పరిష్కారాలూ, డీప్ టెక్ వంటి అత్యాధునిక పరిష్కారాలూ వేర్వేరుగా ఎదగాల్సిందేనా? ఈ రెండింటినీ మేళవించలేమా? ఈ కీలకమైన ప్రశ్నకు సమాధానం వెతికేందుకు ఒక ప్రయత్నం మొదలైంది. ఢిల్లీలో జరిగిన ‘పీపుల్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇన్నొవేషన్స్’ ఇందుకు వేదికైంది. భారత్ కేవలం 140 కోట్ల జనాభా ఉన్న దేశం మాత్రమే కాదు, సవాలక్ష సమస్యలతో కూడినది కూడా. సైన్స్, సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకతల సమర్థ మేళవింపు, వినియోగాలతో ఈ సమస్యలకు పరిష్కారాలు కను క్కోవచ్చు. కూడు, గూడు, ఆరోగ్యం, స్వచ్ఛమైన గాలి, నీరు, సమాచార వినిమయం, విద్యుత్తు, విద్య, వ్యవసాయం వంటి అనేక మౌలిక అంశాలకు సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు అవ సరం. అలాగని వీటికి పరిష్కారాలు, సాంకేతిక పరిజ్ఞానాలు అస్సలు లేవని కాదు. ఉన్నవి అందరికీ అందుబాటులో లేవు, లేదా భరించ గలిగే స్థాయిలో లేకపోవచ్చు. ఈ రెండు సాధ్యమైనా అవి అంత సుస్థిరమైనవి కాకపోవచ్చు. ఒకవైపు మనకు సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత పరిష్కారం ఉండ వచ్చు కానీ, కొత్త పరికరాలు, పరిష్కారాలన్నీ ఆధునిక టెక్నాలజీలతో కూడుకున్నవి. ఇప్పుడేమో అన్నింటికీ ‘డీప్ టెక్’ అన్నది అలవడి పోతోంది. ఇవన్నీ ఇంజినీరింగ్ రంగంలోని వేర్వేరు శాఖల్లో వచ్చిన తాజా మార్పుల ఆధారంగా రూపొందినవే. డీప్ టెక్ అన్నా అది కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, హ్యాప్టిక్స్, రోబోటిక్స్, బ్లాక్‌చెయిన్, బిగ్ డేటా వంటి ఎదుగుతున్న ఇంజినీరింగ్ రంగ సాంకేతిక పరిజ్ఞానాలే. ఇంకోవైపు... గ్రామీణ స్థాయిలో అతితక్కువ ఖర్చుతో కూడు కున్న, కేవలం అవసరానికి తగ్గ సృజనాత్మక పరిష్కారాలూ ఉన్నాయి. వీటన్నింటినీ శాస్త్రవేత్తలు కాకుండా... స్థానిక సమస్యలకు సాధారణ ప్రజలు అభివృద్ధి చేసిన పరిష్కారాలు. ప్రశ్న ఏమిటంటే... ఈ అట్టడుగు స్థాయి పరిష్కారాలూ... డీప్ టెక్ వంటి అత్యాధునిక పరి ష్కారాలూ... వేర్వేరుగా ఎదగాల్సిందేనా? రెండూ కలిసి పనిచేయగల స్థితి ఉందా?. ఈ కీలకమైన ప్రశ్నకు సమాధానం వెతికేందుకు ఇప్పుడిప్పుడే ఒక ప్రయత్నం మొదలైంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న టెక్నాలజీ ఇన్క్యుబేటర్ ‘సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ ప్లాట్‌ఫామ్స్’; ప్రొఫెసర్ అనిల్ గుప్తా స్థాపించిన ‘గ్రాస్‌రూట్ ఇన్నొవేషన్స్ అగ్మెంటేషన్ నెట్వర్క్’ (జీఐఏఎన్) సంయుక్తంగా ఇటీవల ఏర్పాటు చేసిన ‘పీపుల్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇన్నొవేషన్స్’ ఇందుకు వేదికైంది. అట్టడుగు స్థాయి సృజనాత్మక ఆవిష్కరణలు, శాస్త్రాధారిత ఆవిష్కరణలు రెండింటినీ ప్రదర్శించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలో ఇరు పక్షాలు ఒకరి నుంచి ఇంకొకరు నేర్చుకునేందుకు, సామాజిక అవసరాల కోసం పరస్పర సహకారంతో కృషి చేసేందుకు అవకాశం కల్పించడం కూడా ఇందులో ఉన్నాయి. బహుళార్థక ఆహార శుద్ధి యంత్రాన్ని తయారు చేసిన ధరమ్వీర్‡ కంబోజ్ (యమునా నగర్), గ్యాస్‌బండను సులువుగా మోసుకెళ్లేం దుకు మడిచే యంత్రం సిద్ధం చేసిన ముష్తాక్ అహ్మద్ దార్(కశ్మీర్)... కుంగుబాటు సమస్య పరిష్కారానికి ఓ వేరబుల్ యంత్రాన్ని తయారు చేసిన స్టిమ్ వేదా న్యూరోసైన్సెస్‌కు చెందిన యల్లాప్రగడ రమ్య, లక్ష్య సహాని, సీలింగ్ ఫ్యాన్‌కు చిన్న పరికరాన్ని అమర్చడం ద్వారా వాయు కాలుష్యాన్ని తొలగించగల ‘స్వచ్ఛ.ఐఓ’ స్థాపకుడు కరణ్ రావులతో ఇక్కడ చెట్టాపట్టాలేసుకుని తిరగడం చూస్తాం. ఇలాంటి వేదికలు ఇరు పక్షాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు బాగా ఉపయోగపడతాయి. ఒక వర్గం టెక్నాలజీ సంస్థలు, ఇన్‌క్యుబేటర్స్, వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ వంటి అధికారిక సంస్థల నుంచి వచ్చే ఆవిష్కరణలు ఒక వర్గంగా ఉంటే... అట్టగు వర్గాల సృజనశీలుర సామాజిక, విద్య, ఆర్థిక నేపథ్యం వేర్వేరుగా ఉంటోంది. తమ ఆవిష్కరణలను పరిశీలించే, పరీక్షించే, నిర్ధారించే ఏర్పాట్లు వీరి వద్ద అస్సలు ఉండవు. చాలామంది పాఠశాల విద్య కూడా పూర్తి చేసి ఉండరు. అయితే ఇవి వాస్తవికంగా ఉంటాయి. బాగా అవసరం అనుకున్న సమస్యలకు పరిష్కారాలుగా ఉంటాయి. తగిన సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో వీటిని మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కొన్నేళ్లుగా అట్టడుగు వర్గ సృజనశీలురకు జీఐఏఎన్ వంటి సంస్థలు సహాయ, సహకారాలు అందిస్తున్నాయి. ఉదాహరణకు ధరమ్వీర్ కంబోజ్ ఫుడ్ ప్రాసెసర్ ఇప్పుడు వందల మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేరింది. వారు మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు ఏటా కోట్లలో ఆదాయమూ సంపాదిస్తున్నారు. అంతేకాదు... ఈ ఫుడ్ ప్రాసెసర్ ఇప్పుడు ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలకు ఎగుమతి అవుతోంది కూడా. ఒకప్పుడు ఢిల్లీ వీధుల్లో రిక్షా తొక్కిన ధరమ్వీర్ ఇప్పుడు ఈ స్థాయికి చేరడం నిజంగానే స్ఫూర్తిదాయకం. బంకమట్టితో చేసిన ఫ్రిడ్జ్లాంటి పరికరం ‘మిట్టీ కూల్’ కూడా ఇలాంటి ఓ గ్రాస్‌రూట్ ఉత్పత్తే. మార్కెట్లోనూ ఇది మంచి విజయం సాధించింది. సామాజిక అవసరాలకు టెక్నాలజీ ఆసరా.. సామాజిక అవసరాల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కొత్తేమీ కాదు. 1970లలోనే మొదలైంది. దేశంలోని సైన్స్ అండ్ టెక్నా లజీ సంస్థలు గ్రామీణ పేదలకు చేసిందేమీ లేదన్న స్పృహ కలిగిన శాస్త్రవేత్తలు కొంతమంది పారిశ్రామికవేత్తలతో కలిసి కొన్ని కార్య క్రమాలు చేపట్టారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు) అధ్యాపకుడు ఏకేఎన్ రెడ్డి ‘అప్లికేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టు రూరల్ ఏరియాస్’ (అస్త్ర) పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. అధిక సామర్థ్యమున్న పొయ్యి ఒకదాన్ని ఏకేఎన్ రెడ్డి అభివృద్ధి చేశారు. కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. 1980లలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం కూడా సామాజిక అవస రాల కోసం టెక్నాలజీ వాడకాన్ని మొదలుపెట్టంది. రైల్వే రిజర్వేషన్ల కంప్యూటరీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ టెలిఫోన్ ఎక్సేంచీజీలు, వాతావరణ అంచనా కోసం సూపర్ కంప్యూటర్ల వాడకం అప్పుడే మొదలైంది. భారతీయుల సమస్యకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారానికి ‘సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్’ (సీ–డాట్) ఓ అద్భుత నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో టెలిఫోన్ల సంఖ్య తక్కువగా ఉండటం, నెట్వర్క్ కూడా అంత బాగా లేకపోవడం తెలిసిందే. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న టెలిఫోన్ ఎక్సేంచీజీలను వాడు తూండటం దీనికి కారణం. ఈ విదేశీ ఎక్సేంచీజీలు అధిక ఉష్ణో గ్రతలను, ఎక్కువ కాల్స్‌ను తట్టుకునేలా డిజైన్ చేయలేదు. ఎయిర్ కండీషనర్ ఉంటేనే వీటిని ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉండేది. కాల్స్ సంఖ్య ఎక్కువైతే పని చేయడం ఆగిపోయేది. ఈ సమస్యలకు పరిష్కా రంగా అతితక్కువ విద్యుత్తును ఉపయోగించుకునే సర్క్యూట్ల ద్వారా సీ–డాట్ ఓ డిజిటల్ స్విచ్‌ను తయారు చేసింది. ఫలితంగా బయటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీ సెల్సియస్ దాటినా టెలిఫోన్ ఎక్సేంచీజీలు నిరాఘాటంగా పనిచేసేవి. ఈ నేపథ్యంలో అసంఘటిత రంగంలో ఉన్న సృజనశీలురను వెలికితీసేందుకు అహ్మదాబాద్ ఐఐఎం అధ్యాపకుడు ప్రొఫెసర్ అనిల్ గుప్తా ఓ వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. 1990లలో అట్ట డుగు వర్గాల అసలైన సృజనలను గుర్తించి, పరీక్షించి, నిర్ధారించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఈ సృజనశీలురను అధికారిక వ్యవస్థలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలతో అనుసంధానించేందుకూ, తద్వారా వారి ఉత్పత్తులు, ఆవిష్కరణలను మరింత మెరుగు పరిచేం దుకూ ఏర్పాట్లు చేశారు. ఇరవై ఏళ్లుగా వేల మంది సృజనశీలురలను గుర్తించడం... వారి ఆవిష్కరణలను వాణిజ్య స్థాయికి తీసుకురావడం జరిగింది. ఇన్నొవేషన్ ఫెస్టివల్ కూడా సృజన శీలురలను టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లతో అనుసంధానిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఏతావాతా... అడ్డంకులను బద్దలు కొట్టాల్సిన సమయమిది! దినేశ్ సి. శర్మ, వ్యాసకర్త విజ్ఞానశాస్త్ర వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
శాస్త్ర,సాంకేతిక రంగాల్లో భారత్ అమోఘ ప్రగతి
సాక్షి, పుట్టపర్తి/ పుట్టపర్తి అర్బన్: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ అమోఘ ప్రగతి సాధిస్తోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ సోమనాథ్ అన్నారు. మంగళవారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరిగిన సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 41వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. గతంలో రాకెట్ ప్రయోగాలు, డిజైన్, తయారీ, పరికరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడేవాళ్లమని, ప్రస్తుతం సొంతగా రాకెట్ ప్రయోగాలు చేస్తూ ప్రపంచానికి సవాల్ విసురుతున్నామని చెప్పారు. భారతదేశం త్వరలోనే అతిపెద్ద ఐటీ, మెడిసిన్ ఎగుమతిదారుగా మారనుందన్నారు. అనంతరం 22 మంది విద్యార్థులకు డాక్టరేట్లు, 17 మందికి బంగారు పతకాలు అందజేశారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి: కిషన్ రెడ్డి సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరఫున∙తాము కూడా భాగస్వామ్యం అవుతామని తెలిపారు. సత్యసాయిబాబా 97వ జయంత్యుత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన సౌండ్ అండ్ లైట్, మల్టీమీడియా షోను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. సత్యసాయి బాబా జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఈ షో ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. -
సైన్సు అవార్డుల్లో కోతలా?
శాస్త్ర ప్రపంచం ప్రతిష్ఠాత్మకంగా భావించే శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ విజేతల పేర్లను సాంప్రదాయికంగా ‘సీఎస్‌ఐఅర్’ ఫౌండేషన్ డే అయిన సెప్టెంబర్ 26న ప్రకటిస్తుంటారు. ఈసారి వారి పేర్లను అప్పుడు ప్రకటించలేదు. పైగా ప్రధాని చేతుల మీదుగా బహూకరించకుండా వారున్న చోటికే అవార్డు పంపించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో 100కి పైగా అవార్డులను దశలవారీగా ఎత్తివేయాలన్న సిఫార్సులూ సాగాయి. ఇటీవలి వారాల్లో ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉత్తమ పీహెచ్డీ థీసిస్ అవార్డులను, ఉత్తమ పరిశోధనా పత్రం అవార్డులను ఇవ్వవద్దని వారి ఫ్యాకల్టీలను ఆదేశించాయి. ఇలాగైతే 2047 నాటికి భారత్ శాస్త్ర ప్రగతిలో స్వావలంబన దేశంగా మారేనా? సృజనాత్మక కృషికి ప్రోత్సాహం ఇలాగేనా? శాంతి స్వరూప్ భట్నాగర్ (ఎస్ఎస్బీ) ప్రైజ్‌ను 1957లో నెలకొల్పారు. భారత శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా సంస్థ (సీఎస్ఐఆర్) ప్రథమ డైరెక్టర్ పేరిట దీన్ని ఏర్పర్చారు. అనువర్తిత లేదా ప్రాథమిక పరిశోధనలో అసాధా రణ ప్రతిభ ప్రదర్శించిన వారికి భారత ప్రభుత్వం ఏటా ఈ అవార్డును బహూకరిస్తుంటుంది. అవార్డులు గెలుచుకున్న వారి పేర్లను సాంప్రదాయికంగా సీఎస్ఐఆర్ ఫౌండేషన్ రోజైన సెప్టెంబర్ 26న ప్రకటిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మాత్రం కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి జితేంద్ర సింగ్ విజేతల పేర్లను చివరిక్షణంలో ప్రకటించకుండా నిలిపివేశారు. దేశంలోని శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన విభాగాల సెక్రటరీలు, మంత్రులు హాజరైన అత్యున్నత స్థాయి సమావేశానికి ఆ మినిట్స్‌ని పంపించారు. ప్రధాని నరేంద్రమోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ అవార్డు ఎకో సిస్టమ్ మార్పు గురించి ఈ సమావేశం జరిగింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో 100కి పైగా అవార్డులను దశలవారీగా ఎత్తివేయాలని ఈ సమావేశం సిఫార్సు చేసింది. ఒక్కొక్క ఎస్ఎస్బీ ప్రైజ్ విజేతకు ఇస్తున్న రూ. 15 వేల అదనపు నగదు ఉపకార వేతనం స్థానంలో భారీ మొత్తాన్ని ఒకేసారి అందించడం, లేదా నెలవారీ పారితోషికంపై గరిష్ఠంగా 15 సంవత్సరాల పరిమితి విధించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ ప్రతిపాదనను కూడా ఈ సమావేశ మినిట్స్ బహిర్గత పరిచాయి. శాంతిస్వరూప్ భట్నాగర్ ప్రైజ్‌కి గరిష్ఠ అర్హతా వయస్సు ప్రస్తుతం 45 సంవత్సరాల వరకు ఉంటోంది. 15 సంవత్సరాల పరిమితి విధించడం వల్ల అది 60 సంవత్సరాల వరకు పెరిగే అవకాశం ఉంది. శాంతిస్వరూప్ భట్నాగర్ ప్రైజ్‌ను కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతించిందని ఈ సంవత్సరం సీఎస్ఐఆర్ సంస్థాపక దినం రోజున ప్రకటించడానికి ప్రయత్నించారు. కానీ సీఎస్ఐఆర్ సొసైటీ సమావేశాన్ని అక్టోబర్ 15న ప్రధాని అధ్యక్షతన నిర్వహించినప్పుడు, తదుపరి ఎస్ఎస్బీ అవార్డు ప్రదాన ఉత్సవాలు జరిపే తేదీని ఇంకా నిర్ణయించాల్సి ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ప్రకటించారు. మూడు వారాల తర్వాత 2019–21 సంవత్సరానికి గాను ఈ అవార్డులను 37 మందికి వారు ఉన్న చోటకే అవమానకరంగా పంపించారు. కాగా 2012–2015, 2016–2018 సంవత్సరాలకుగానూ 2016, 2019లలో ప్రధాని ఈ అవార్డును జాతీయ సైన్సు దినోత్సవం (ఫిబ్రవరి 28/29న) సందర్భంగా విజ్ఞాన్ భవన్లో బహూకరించారు. 2020లో ప్రచురితమైన సీఎస్ఐఆర్ డాక్యుమెంట్ ప్రకారం, ఇంతవరకు ఎస్ఎస్బీ ప్రైజ్‌ని గెలుచుకున్న 560 మందిలో అప్పటికి 244 మంది మూడు జాతీయ సైన్సు అకాడమీలకు ఫెలోలుగా ఎంపికయ్యారు. 143 మంది ఇటలీలోని థర్డ్ వరల్డ్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్(టీడబ్ల్యూఏఎస్)కు ఫెలోలుగా ఎంపికయ్యారు. 64 మందికి టీడబ్ల్యూఏఎస్ ప్రైజ్ వచ్చింది. 25 మంది రాయల్ సొసైటీ ఫెలోషిప్‌కి ఎంపికయ్యారు. మరో 15 మంది అమెరికాకు చెందిన నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ విదేశీ అసోసియేట్స్‌గా ఎంపిక య్యారు. మరో 30 మంది ఇన్ఫోసిస్ సైన్స్ ప్రైజ్ అందుకున్నారు. కనీసం 100 మంది పద్మ పురస్కారాన్ని స్వీకరించారు. శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ గెలుచుకున్న వారి ప్రతిభను ఈ డేటా తేటతెల్లం చేస్తోంది. భట్నాగర్ లారెట్స్ (1958–2018) అనే శీర్షికతో ప్రచురితమైన పుస్తకం ఎస్ఎస్బీ ప్రైజ్ చరిత్రను వివరిస్తుంది. ఈ ప్రైజ్‌ని 1958లో బహుకరించారు. తొలి గ్రహీతకు ఒక ఫలకం, రూ. 10,000 నగదును బహుమతిగా ఇచ్చారు. తొలి బహుమతి పుచ్చుకున్నది భట్నాగర్ సమకాలికుడు అయిన సర్ కేఎస్ కృష్ణన్ (1940). 60 ఏళ్ల వయసులో ఈయనకు తొలి ప్రైజ్ దక్కింది. రెండో సంవత్సరం అంటే 1959లో ఇద్దరు గణిత శాస్త్రజ్ఞులు కె చంద్రశేఖరన్, సీఆర్ రావులకు ఈ ప్రైజ్ దక్కింది. ఆనాటికి వీరి వయస్సు 39 సంవత్సరాలు మాత్రమే. ప్రస్తుతం, ఏడు రంగాలకు కలిపి ఈ అవార్డును ఇస్తున్నారు. ప్రైజ్ మొత్తం 2008లో రూ. 5 లక్షలకు పెరిగింది. ఒక సబ్జెక్టులో ఎంత మందికి అవార్డు ఇచ్చారనే దాంతో సంబంధం లేకుండా ఎంపికైన ప్రతి ఒక్కరికీ తలా రూ. 5 లక్షలను ఇస్తూ వచ్చారు. దీనికి తోడుగా, దశాబ్దం క్రితం బహుమతి గ్రహీతలందరికీ రూ. 15,000 ఉపకార వేతనం ఇవ్వడం మొదలెట్టారు. గత విజేతలకూ దీన్ని వర్తింపజేశారు. ఎస్ఎస్బీ అవార్డు గ్రహీతలకు నెలవారీ చెల్లింపులు జరపాలనేది మెరుగైన ప్రతిభ కనబర్చినవారికి నగదు ప్రోత్సాహకం ఇవ్వాలన్న భావనలోంచి వచ్చింది. నాలుగు నేషనల్ సైన్స్, ఇంజినీరింగ్ అకా డమీలలో కనీసం రెండింటిలో రీసెర్చ్ ఫెలోస్‌గా ఎంపికైన యూని వర్సిటీ టీచర్లకు నెలకు రూ. 15 వేల నగదు ప్రోత్సాహకం ఇవ్వడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, యూజీసీ, శాస్త్ర సాంకేతిక శాఖ (డీఎస్టీ) ఆసక్తి చూపాయి. ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలకు జేసీ బోస్ ఫెలోషిప్ కింద మరొక రూ. 25,000లను అందించే మరొక పథకంతో డీఎస్టీ ముందుకొచ్చింది. అత్యంత ప్రతిభావంతుడైన భారత శాస్త్రవేత్తకు సీఎస్ఐఆర్ లేదా యూజీసీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ పథకం కింద, దాంతోపాటు డీఎస్టీ – జేసీ బోస్ ఫెలోషిప్ కింద అందే ద్రవ్యపరమైన ప్రయోజనాలు ఇవే మరి. ఈలోగా, మెరుగైన ఐఐటీలు కొన్ని తమ సొంత చెయిర్ ప్రొఫెస ర్షిప్లను నెలకొల్పాయి. ఇవి కూడా ద్రవ్యపరమైన ప్రయోజనాలను అర్హులైన శాస్త్రవేత్తలకు ఇస్తూ వచ్చాయి. ఇలాంటి ప్రోత్సాహకాలను స్ఫూర్తిగా తీసుకుని పలు ఇతర సైన్స్ విభాగాలు, మంత్రిత్వ శాఖలు తమతమ సొంత ప్రతిభ ఆధారిత ప్రోత్సాహక పథకాలతో ముందు కొచ్చాయి. సెప్టెంబర్ 16న జరిగిన సమావేశం, ఇలాంటి అన్ని స్కీములను మదింపు చేస్తూనే, వీటిని కుదించాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వ సంస్థల్లోని ప్రైవేట్ విరాళాల మద్దతు కలిగిన అవార్డులకు కూడా ఈ సమీక్షను వర్తింపజేశారు. ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహాదారుతో సంప్రదించి, నోబెల్ అవార్డు ప్రమాణాల్లో ఒక అవార్డును ఏర్పర్చాలని చైర్మన్ చేసిన సూచనను కూడా మినిట్స్ పేర్కొంది. అయితే 2003లో రూ. 25 లక్షల నగదుతో ఏర్పర్చిన ఇండియన్ సైన్స్ అవార్డును 2010లో తీసేశారనే విషయాన్ని ఆ సమావేశంలో పాల్గొన్న ఏ ఒక్కరూ పేర్కొనలేదు. ఈలోగా ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ సంస్థ 2008లో రూ. 25 లక్షల మొత్తంతో తొలి సైన్స్ ప్రైజ్‌ని ఐఐటీ కాన్పూర్‌కి చెందిన గణిత శాస్త్ర జ్ఞుడు మణీంద్ర అగర్వాల్‌కు బహూకరించింది. 2009లో ఇన్ఫోసిస్ ప్రైజ్ పరిధిని విస్తృత పరిచి నగదు మొత్తాన్ని రెట్టింపు చేశారు. ఆరు విభాగాల్లో వీటిని అందిస్తున్నారు. ఒక్కో ప్రైజు లక్షరూపాయల విలు వను కలిగి ఉంటుంది. దీనికి పన్ను కూడా మినహాయించారు. ఇటీవలి వారాల్లో, ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు మరొక అడుగు ముందుకేశాయి. అత్యుత్తమ పరిశోధనా పత్రానికి, అత్యుత్తమ పీహెచ్డీ థీసెస్‌కి ఇస్తున్న అవార్డును సైతం నిలిపి వేయాలని వాటి ఫ్యాకల్టీలకు ఆదేశాలు జారీ చేశాయి. ఈ రెండు అవార్డులూ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసినవే. అన్నిటికంటే మించి డీఎస్టీ అందిస్తున్న కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన స్కాలర్ షిప్పులను కూడా ఉన్నట్లుండి రద్దుచేయడం దారుణమనే చెప్పాలి. 2047 నాటికి భారత్‌ని స్వావలంబన సాధించిన దేశంగా మార్చడానికి సృజనాత్మక కృషి జరపాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. కానీ శాస్త్రీయ ప్రతిభకు గుర్తింపునిచ్చే ప్రభుత్వ అవార్డులను చాలావరకు రద్దు చేయాలని ప్రధాని స్వయంగా ఆయా మంత్రిత్వ శాఖలను కోరారంటే నమ్మశక్యం కావడం లేదు. ప్రభుత్వ ఆలోచనల్లో ఉన్నదాన్ని కార్పొరేట్ రంగం ఇప్పటికే అమలు చేసేసిందని ప్రభుత్వం లెక్కించి ఉండవచ్చు. కాబట్టే ప్రభుత్వ రంగంలో ఉన్న అవార్డులను కూడా కుదించాలని అది నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అరుణ్ కుమార్ గ్రోవర్ మాజీ వైస్ చాన్స్‌లర్, పంజాబ్ యూనివర్సిటీ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్డీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్డీ కోర్సును హైదరాబాద్ ఐఐటీ ప్రవేశపెట్టింది. ఈ మేరకు శ్రీ విశ్వేశ్వర యోగా పరిశోధన సంస్థ (ఎస్‌వీవైఆర్‌ఐ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశోధనలు చేసే రీసెర్చ్ స్కాలర్లకు ప్రతినెలా రూ.75 వేల పారితోషికంతో పాటు, విదేశాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొనేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో యోగా, ఆయుర్వేదం, సంగీతం, నృత్యం, భారతీయ భాషలు, కళలు, అర్కిటెక్చర్, శిల్పం వంటి అంశాలపై పరిశోధనలు చేయనున్నారు. ఈ మేరకు ఒప్పంద పత్రంపై హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీఎస్ మూర్తి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలో హైదరాబాద్ ఐఐటీ కీలక మైలురాయిని అధిగమిస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ ఐఐటీలో హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్డీ కోర్సు ప్రవేశపెట్టామని హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాధిపతి మోహన్‌రాఘవన్ పేర్కొన్నారు. ఒప్పంద పత్రాలను ప్రదర్శిస్తున్న బీఎస్ మూర్తి, ఎస్‌వీవైఆర్‌ఐ సంస్థ ప్రతినిధులు -
రాకాసి హస్తం కాదు.. విశ్వం ఆవిర్భావానికి కారణ భూతం..!
చూడటానికి అచ్చం రాకాసి హస్తంలా ఉంది కదూ! నిజానికిది ఈ విశ్వావిర్భావానికి కారణ భూతంగా అంతరిక్ష శాస్త్రవేత్తలు భావించే ధూళి మేఘం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎప్పట్లాగే కాలంలో వెనక్కు వెళ్లి భూమికి 7,000 కాంతి సంవత్సరాల దూరంలోని పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్‌ను ఇలా క్లిక్‌మనిపించింది. దీన్ని ఇంత స్పష్టంగా మనం చూడగలగడం ఇదే తొలిసారి. చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల తయారీపై... 2035 నుంచి ఈయూ నిషేధం -
She Is- Women In STEAM: స్ఫూర్తినిచ్చే సూపర్‌స్టార్స్.. ఆ 75 మంది మహిళలు..
అక్షరాలు అంటే వెన్నెల్లో ఆడుకునే అందమైన అమ్మాయిలే కాదు... అగ్నిజ్వాలలు కూడా. ఆ వెలుగు ఎన్నో రకాల చీకట్లను పారదోలుతుంది. ‘షీ ఈజ్–ఉమెన్ ఇన్ స్టీమ్’ పుస్తకంలో ఎన్నో జీవితాలు ఉన్నాయి. ఎన్నో పోరాటాలు ఉన్నాయి. స్ఫూర్తినిచ్చే ఎన్నో విజయాలు ఉన్నాయి... డెబ్భై అయిదేళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని ఎల్సా మేరి డిసిల్వా ‘షీ ఈజ్–ఉమెన్ ఇన్ స్టీమ్’ అనే పుస్తకాన్ని తీసుకువచ్చారు. ‘స్టెమ్’(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మాథమెటిక్స్)కు విస్తరణ ఈ స్టీమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్స్ అండ్ మ్యాథమేటిక్స్). సైన్స్ నుంచి సమాజసేవ వరకు వివిధ రంగాలలో విశేష కృషి చేసిన డెబ్భై అయిదు మంది మహిళలను ఈ పుస్తకం ద్వారా పరిచయం చేశారు డిసిల్వా. పరిచయం అనడం కంటే వారి పర్సనల్, ప్రొఫెషన్ స్ట్రగుల్‌ను కళ్లకు కట్టారు అనడం సబబుగా ఉంటుంది. ఈ పుస్తకంలో చోటు చేసుకున్న వివిధ రంగాల మహిళలు... అదితి చతుర్వేది–టెక్నాలజీ పాలసీ ఆనంది అయ్యర్–క్లైమెట్ సైన్స్ అండ్ కమ్యునికేషన్ అంజలి మల్హోత్ర–ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ అను ఆచార్య–హెల్త్ సైన్స్ అనుపమ్ కపూర్–హ్యూమన్ రిసోర్స్ అనుశ్రీ మాలిక్–ఎన్విరాన్మెంట్ సైన్స్ అపూర్వ బెడెకర్–మెడికల్ డివైజ్ అర్చన చుగ్–బయోలాజికల్ సైన్స్ ఆర్తి కశ్యప్–డిజైన్ అండ్ టెక్నాలజీ అజ్రా ఇస్మాయిల్–డిజైన్ అండ్ టెక్నాలజీ విజయలక్ష్మీ బిస్వాల్–హెల్త్ సైన్సెస్ బినేష్ పయట్టటి–ఎన్విరాన్మెంట్ సైన్స్ బిను వర్మ–ఎడ్యుకేషన్ బృంద సొమయ–ఆర్కిటెక్చర్చర్ చంద నిమ్బకర్–బయోలాజికల్ సైన్స్ చెర్లీ పెరైర–ఎన్జీవో దీప్తి గుప్త–ఇంజనీరింగ్ దర్శన జోషి–ఫిజిక్స్ మనిషా ఆచార్య–ఇన్నోవేషన్ రాఖీ చతుర్వేది–బయోలాజికల్ సైన్స్ శుభాంగి వుమ్బర్కర్–కెమికల్ సైన్స్ అర్చన శర్మ–ఇంజనీరింగ్ భారతి సింఘల్–బయోలాజికల్ సైన్స్ కల్పన నాగ్‌పాల్–ఫార్మాస్యూటికల్ సైన్స్ ప్రీతి షరన్–ఇంజనీరింగ్ షమిత కుమార్–ఎన్విరాన్మెంట్ సైన్స్ దుర్బసేన్గుప్త– బయోకెమిస్త్రీ ఏక్తా వివేక్ వర్మ–జెండర్ బేస్డ్ వాయిలెన్స్ గాయత్రి జోలి–డిజైన్ అండ్ టెక్నాలజీ గీత మెహత–డిజైన్ అండ్ టెక్నాలజీ గీతారాయ్–బయోలాజికల్ సైన్స్ జీవన్‌జ్యోతి పండ–బయోలాజికల్ సైన్స్ కైయిత్కి అగర్వాల్–ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ కరణ్ శైవ–సస్టేనబుల్ డెవలప్మెంట్ కవితా గోంసాల్వేజ్–డిజైన్ అండ్ టెక్నాలజి కిరణ్ బాలా–ఎన్విరాన్మెంట్ సైన్స్ కిరణ్ మన్రల్–ఆర్ట్స్ అండ్ కమ్యునికేషన్ లిజీ ఫిలిప్–సివిల్ ఇంజనీరింగ్ మాధవీలత గాలి–సివిల్ ఇంజనీరింగ్ మిథాలి నికోర్–ఎకనామిక్స్ మోనాలి హజ్ర–ఎన్విరాన్మెంట్ సైన్స్ మోనాలీసా ఛటర్జీ–ఫార్మాస్యూటికల్ సైన్స్ నమ్రత రాణా–క్లైమెట్ సైన్స్ అండ్ కమ్యునికేషన్స్ నందితాదాస్ గుప్త–ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నీలమ్–సోషల్ ఇంపాక్ట్ నిహారిక మల్హోత్ర–హెల్త్ సైన్స్ నిష్మ వాంగూ–నానోసైన్స్ అండ్ నానో టెక్నాలజీ పద్మ పార్థసారథి–ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ ప్రీతి అఘలయం–కెమికల్ ఇంజనీరింగ్ అర్పిత మోండల్–ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ జైదీప్ మల్హోత్ర–హెల్త్ సైన్స్, రాధిక–హెల్త్ సైన్స్ రంజని విశ్వనాథ్–కెమికల్ సైన్స్ రష్మీ పుట్చ–డిజైన్ అండ్ టెక్నాలజీ రీతూపర్ణ మండల్–సెమీ కండక్టర్స్ రుమ పాల్–హెల్త్ సైన్స్ సంఘమిత్ర బందోపాధ్యాయ–న్యూరోసైన్స్ షెలక గుప్త–కెమికల్ ఇంజనీరింగ్ శిలో శివ్–ఆర్ట్స్ అండ్ కమ్యునికేషన్ శిల్పి శర్మ–ఎన్విరాన్మెంట్ సైన్స్ షీతల్ కక్కర్ మెహ్ర–సోషల్ ఇంపాక్ట్ శ్రుతి పాండే–ఆర్కిటెక్చర్ శ్యామల రాజారామ్–ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజి శిమ్మి దర్నిజ–ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజి శ్రీదేవి ఉపాధ్యాయుల–కెమికల్ ఇంజనీరింగ్ సుసన్–బయోలాజికల్ సైన్స్ స్వర్ణలత జె– కమ్యూనిటి సర్వీస్ తృప్తిదాస్–ఎన్విరాన్మెంట్ సైన్స్ వందన ననల్–ఫిజిక్స్ వనమాల జైన్–డిజైన్ అండ్ టెక్నాలజీ వర్ష సింగ్–సైకాలజి విశాఖ చందేరె–క్లీన్ ఎనర్జీ యమ దీక్షిత్– క్లైమేట్ సైన్స్ అండ్ కమ్యునికేషన్స్ జైబున్నిసా మాలిక్ – కంప్యూటర్ సైన్స్. ‘ఎన్నో ఏళ్లుగా కార్పొరేట్, డెవలప్మెంట్ సెక్టర్లో పనిచేసిన నేను వివిధ రూపాల్లో ఉండే పురుషాధిక్యతను చూశాను. మహిళ అనే కారణంతో వారి ప్రతిభను పట్టించుకోని వారిని చూశాను. రకరకాల అనుభవాలు ఈ పుస్తకం తీసుకురావడానికి కారణం అయ్యాయి’ అంటోంది పుస్తక రచయిత్రి ఎల్సా మేరి డిసిల్వా. ‘షీ–ఈజ్’ బుక్సిరీస్లో ఇంకా ఎన్నో పుస్తకాలు రానున్నాయి. మహిళాశక్తిని ప్రపంచానికి చాటనున్నాయి. చదవండి: ఎంపవర్మెంట్: డైనమిక్ సిస్టర్స్ -
Scientific Literature: శాస్త్ర సాహిత్యం
మనకు శాస్త్ర సాహిత్యం కొత్తదేమీ కాదు. కాకుంటే, శాస్త్ర సాంకేతిక రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో కూడా మనకు ఆశించిన స్థాయిలో శాస్త్ర సాహిత్యం రాకపోవడమే శోచనీయం. క్లిష్టమైన శాస్త్రీయ అంశాలను సామాన్యులకు తేలికగా అర్థమయ్యేలా సాహిత్య రూపంలో అందించిన కవులు, రచయితలు తెలుగువాళ్లలో చాలామందే ఉన్నారు. తెలుగులో తొలి శాస్త్ర కావ్యం గణిత శాస్త్రానికి సంబంధించినది. క్రీస్తుశకం పదకొండో శతాబ్దికి చెందిన కవి పండితుడు పావులూరి మల్లన్న ‘గణితశాస్త్ర సంగ్రహం’ రాశాడు. మహావీరాచార్యుడు సంస్కృతంలో రాసిన గణిత గ్రంథాన్ని మల్లన్న పద్యాల్లో అనువదించాడు. ఆయన కృషికి మెచ్చిన రాజరాజ నరేంద్రుడు ఆయనకు నవఖండవాడ అనే అగ్రహారాన్ని బహూకరించాడట. ప్రజల్లో విజ్ఞానాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే ఉద్దేశంతో హైదరాబాద్ కేంద్రం 1906లోనే మునగాల రాజా నాయని వేంకట రంగారావు పోషణలో విజ్ఞాన చంద్రికా మండలి ఏర్పడింది. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు దీనికి ప్రధాన సంపాదకుడిగా వ్యవహరిస్తూ, తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వాన్ని అందించారు. విజ్ఞాన చంద్రికా మండలి చరిత్ర, శాస్త్ర విషయాలకు సంబంధించిన ఎన్నో గ్రంథాలను ప్రచురించింది. ఆచంట లక్ష్మీపతి రాసిన ‘జీవశాస్త్రము’, ‘జంతుశాస్త్రము’, ‘కలరా’, ‘చలిజ్వరము’; మంత్రిప్రగడ సాంబశివరావు రాసిన ‘పదార్థ విజ్ఞానశాస్త్రము’, వేమూరి విశ్వనాథశర్మ రాసిన ‘రసాయన శాస్త్రము’ వంటి గ్రంథాలను విజ్ఞాన చంద్రికా మండలి అప్పట్లోనే వెలుగులోకి తెచ్చింది. ఇంచుమించు అదేకాలంలో కృష్ణా జిల్లా వ్యవసాయ సంఘం గోపిశెట్టి నారాయణస్వామి నాయుడు సంపాదకత్వంలో ‘వ్యవసాయము’ మాస పత్రికను ప్రారంభించింది. తెలుగులో అదే తొలి వ్యవసాయశాస్త్ర పత్రిక. తర్వాత కొంతకాలానికి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసే కాళీపట్నం కొండయ్య 1935లో ‘విజ్ఞానం’ మాసపత్రికను ప్రారంభించి, దాదాపు ఐదేళ్లు నడిపారు. అంతేకాదు, జేమ్స్ జీన్స్ రాసిన ‘యూనివర్స్ అరౌండ్ అజ్’ను తెలుగులో ‘విశ్వరూపం’ పేరిట తెలుగులోకి అనువదించారు. శాస్త్రవేత్తలు, విజ్ఞానశాస్త్ర విద్యార్థులు కాకుండా, సాధారణ పాఠకులకు అర్థమయ్యే శాస్త్రీయ అంశాలను వివరిస్తూ వెలువడే ఇలాంటి గ్రంథాలు జనరంజక శాస్త్ర గ్రంథాలుగా పేరుపొందాయి. శాస్త్ర సాంకేతిక అంశాలను సామాన్యులకు చేరవేయడాన్నే పనిగా పెట్టుకుని ఒక ఉద్యమంలా రచనలు సాగించిన రచయితలు మనకు ఉన్నారు. వీరిలో సాహిత్యరంగంలో దిగ్గజాలుగా గుర్తింపు పొందినవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో వసంతరావు వెంకటరావు ఒకరు. ఆయన 1949లో ‘ఆధునిక విజ్ఞానం’ రాశారు. శాస్త్ర విషయాలను పద్యాలు, పాటల రూపంలో పిల్లలకు సైతం అర్థమయ్యే రీతిలో విరివిగా రాసి, ‘భౌతికశాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి’గా ప్రసిద్ధుడయ్యారు. విస్సా అప్పారావు ‘విజ్ఞానం–విశేషాలు’ పుస్తకం రాశారు. అలాగే ఆయన పిల్లల కోసం నక్షత్రాల గురించి పుస్తకం రాశారు. లండన్‌లో డాక్టరేట్ చేసిన శ్రీపాద కృష్ణమూర్తి ‘విజ్ఞాన సాధన’, ‘విజ్ఞాన వీధులు, ‘ఇంటింటా విజ్ఞాన సర్వస్వము’, ‘రాకెట్లు–ఆకాశయానము’, ‘వైజ్ఞానిక గాథాశతి’ వంటి పుస్తకాలను రాశారు. ఖగోళ శాస్త్రంపై ఏవీఎస్ రామారావు ‘వినువీధి’ పుస్తకం రాశారు. తాపీ ధర్మారావు ‘పెళ్లి–దాని పుట్టుపూర్వోత్తరాలు’, ‘దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు?’ వంటి శాస్త్ర పరిశోధన పుస్తకాలను రాశారు. డాక్టర్ ఉప్పల లక్ష్మణరావు ‘నిత్యజీవితంలో భౌతికశాస్త్రం’, ‘జంతుశాస్త్రం’ వంటి శాస్త్ర గ్రంథాలను రష్యన్ నుంచి తెలుగులోకి అనువదించారు. శాస్త్రీయ దృక్పథం గల తెలుగు రచయితల్లో ఒకరైన కొడవటిగంటి కుటుంబరావు ‘బుద్ధికొలత వాదాన్ని’ ప్రతిపాదించారు. మహీధర రామమోహనరావు ‘సైన్స్ ప్రపంచం’ పత్రికను నడిపారు. ఆయన కుమారుడు మహీధర నళినీమోహన్ పిల్లలకు అర్థమయ్యే రీతిలో శాస్త్ర సాంకేతిక విషయాలపై ‘నిప్పు కథ’, ‘టెలిగ్రాఫు కథ’, ‘టెలిఫోను కథ’, ‘విద్యుత్తు కథ’, ‘ఆలోచించే యంత్రాలు’, ‘ఇతర లోకాల్లో ప్రాణులు’ వంటి అనేక పుస్తకాలు రాశారు. పాత్రికేయ రచయిత నండూరి రామమోహనరావు ఖగోళ, మానవ పరిణామ శాస్త్ర అంశాలపై ‘విశ్వరూపం’, ‘నరావతారం’ వంటి పుస్తకాలు రాశారు. పాల్ డి క్రూఫ్ రాసిన ‘మైక్రోబ్ హంటర్స్’ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. దీనిని జమ్మి కోనేటిరావు తెలుగులో ‘క్రిమి అన్వేషకులు’ పేరిట అనువదించారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ పిల్లల కోసం‘ప్లాస్టిక్ ప్రపంచం’ వంటి పుస్తకాలు రాశారు. వృత్తిరీత్యా వైద్యులైన డాక్టర్ గాలి బాలసుందరరావు, డాక్టర్ జి.సమరం, డాక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు వైద్య, ఆరోగ్యశాస్త్ర అంశాలపై విరివిగా పుస్తకాలు రాశారు. ఇదివరకు ‘భారతి’, ‘పుస్తక ప్రపంచం’ వంటి సాహిత్య పత్రికలు సైతం శాస్త్ర సాంకేతిక వ్యాసాలను విరివిగా ప్రచురించేవి. పూర్తిగా శాస్త్ర సాంకేతిక అంశాల కోసం తెలుగులో ‘సైన్స్‌వాణి’, ‘సైన్స్ ప్రపంచం’ వంటి పత్రికలు వెలువడేవి. ఇప్పుడవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పటికాలంలో ప్రధాన స్రవంతి సాహిత్యంలో గుర్తింపు పొందిన రచయితలెవరూ శాస్త్ర సాంకేతిక అంశాలపై రచనలు సాగించడం లేదు. చక్కని శైలి గల రచయితలు శాస్త్ర సాంకేతిక అంశాల రచనలు చేస్తే పాఠకులు ఆదరించకుండా ఉండరు. ఈ అంశాలపై ఇదివరకటి పుస్తకాలను ఎన్నిసార్లు పునర్ముద్రణ చేసినా పాఠకులు ఇంకా వాటిని కొంటూ ఉండటమే ఇందుకు నిదర్శనం. తెలుగులో శాస్త్ర సాంకేతిక రచనలు ఇంకా విరివిగా రావాల్సిన అవసరం ఉంది. దీనిని సాహిత్య అకాడమీలు, ప్రచురణకర్తలు, రచయితలే గుర్తించాల్సి ఉంది. -
శాస్త్రవేత్తల విజయాలను గుర్తించాలి
అహ్మదాబాద్: పరిశోధన, ఆవిష్కరణల్లో భారత్‌ను ప్రపంచానికి కేంద్ర స్థానంగా మార్చేందుకు కృషి చేయాలని సైంటిస్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పురోగతి కోసం ఆధునిక విధానాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ దేశాల్లో సైంటిస్టుల కృషికి తగిన గుర్తింపు లభిస్తుందని, మన దేశంలో మాత్రం అలాంటి పరిస్థితి లేకుండాపోయిందని విచారం వ్యక్తం చేశారు. మన శాస్త్రవేత్తలు సాధించిన విజయాలను మనం గుర్తించడం లేదని అన్నారు. భారత శాస్త్రవేత్తల విజయాలు, ఘనతలను గుర్తించి, సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరముందన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శనివారం ప్రారంభమైన సెంటర్–స్టేట్ సైన్స్ సదస్సులో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. స్థానిక సమస్యలకు స్థానిక పరిష్కారాలు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మన పరిశోధనలను స్థానిక స్థాయికి తీసుకెళ్లాలని మోదీ చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణల్లో మన దేశాన్ని గ్లోబల్ సెంటర్‌గా మార్చడానికి కలిసి పనిచేయాలన్నారు. విద్యా సంస్థల్లో ఇన్నోవేషన్ ల్యాబ్‌ల సంఖ్య భారీగా పెరగాలన్నారు. ‘‘2015లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకింగ్‌లో భారత్ స్థానం 81. కేంద్రం కృషి వల్లే ఇప్పుడు 46కు చేరింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులకు మాతృభాషల్లో బోధించేలా ప్రయత్నాలు జరగాలి. ప్రపంచస్థాయి ప్రయోగశాలల ఏర్పాటుకు రాష్ట్రాలు ముందుకొస్తే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సహకరిస్తుంది’’ అని ప్రధాని చెప్పారు. -
మేడిన్ ఇండియా కాదు.. మేక్ ఫర్ వరల్డ్: డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి
(గరికిపాటి ఉమాకాంత్) సాక్షి, తిరుపతి: ‘శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం గత ఏడేళ్లుగా ఎంతో పురోగతి సాధించింది. మన అవసరాలకు మించి ఉత్పత్తులను తయారుచేస్తున్నాం. ఇప్పటివరకు మేడ్ ఇన్ ఇండియా (దేశంలో తయారీ) దిశగా సాగాం. ఇప్పుడు ప్రపంచం కోసం తయారీ (మేక్ ఫర్ వరల్డ్) దిశగా మన ప్రయోగాలు, ఆవిష్కరణలు చేస్తున్నాం’ అని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్ డాక్టర్ జి,సతీష్‌రెడ్డి వెల్లడించారు. ‘ప్రపంచ దేశాల అవసరాల కోసం తయారయ్యే ఉత్పత్తులకు మన దేశమే కేంద్రం కావాలి. ప్రపంచానికి మనమే దిక్సూచి కావాలి. రక్షణ శాఖ ఆ దిశగానే సరికొత్త ఆలోచనలు ఉన్నవారిని, పరిశోధనలు చేస్తున్న వారిని ప్రోత్సహిస్తోంది. త్వరలోనే భారత్ రక్షణ ఉత్పత్తుల ఎగుమతిదారుగా ఎదుగుతుంది. దేశంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే సంక్లిష్టమైన, కీలకమైన ఆయుధ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంపై డీఆర్డీవో దృష్టి పెట్టింది. 5 బిలియన్ డాలర్ల (రూ.39 వేల కోట్ల) విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేయడమే లక్ష్యంగా డీఆర్డీవో పని చేస్తోంది’ అని ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. ఆత్మ నిర్భర్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ ప్రాజెక్టులో భాగంగా సొంతంగా రక్షణ ఉత్పత్తులు తయారీపై దృష్టి సారించాం. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, జనాభా, డిమాండ్.. ఈ ఐదూ మూల సూత్రాలుగా భారత్ ఎవరిపైనా ఆధారపడకుండా ఎదగడమే ప్రాజెక్టు లక్ష్యం, అందులో భాగంగా ధ్వనికంటే వేగంగా దూసుకెళ్లే బ్రహ్మోస్ క్షిపణిలో ఎలక్ట్రానిక్ వ్యవస్థలన్నింటినీ భారత్‌లోనే తయారు చేశాం. ప్రపంచంలోనే దీర్ఘ శ్రేణి కలిగిన తుపాకీ (అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్)ను కూడా అభివృద్ధి చేయగలిగాం. సేవా రంగంలోనూ డీఆర్డీవో సేవలు దేశ రక్షణతో పాటు సామాజిక సేవా రంగంలోనూ డీఆర్డీవో విస్తృత సేవలు అందిస్తోంది. కోవిడ్ సంక్షోభ సమయంలో వైద్య రంగంలోని ఉత్పత్తులపై దృష్టి సారించాం. శానిటైజర్, గ్లౌజులు, పీపీఈ కిట్లు తయారు చేశాం. ప్రధానమంత్రి సూచన మేరకు వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు తయారు చేశాం. సాంకేతికతను పెంపొందించుకొని ఒక్క రోజులో 30 వేల వెంటిలేటర్లను తయారు చేసే స్థాయికి ఎదిగాం. మూడు నెలల్లోనే దేశ అవసరాలను అధిగమించాం. ఎన్నో దేశాలకు శానిటైజర్లు, పీపీఈ కిట్లు, కరోనా రక్షణ పరికరాలను పెద్దసంఖ్యలో ఎగుమతి చేశాం. డేర్ టు డ్రీం దేశంలో నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు డీఆర్డీవో ‘డేర్ టు డ్రీం’ పేరిట వినూత్న ఆలోచనలను ఆహ్వానిస్తోంది. మంచి స్టార్టప్‌లు, ఆలోచనలు ఇచ్చిన వారికి రూ.10 లక్షల వరకు ప్రైజ్ మనీ ఇస్తోంది. ఆలోచనలను ఆవిష్కరణల రూపంలోకి తెచ్చేందుకు అవసరమైన నిధులు, మెకానిజం కూడా డీఆర్డీవో అందిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల నుంచే లబ్ధ ప్రతిష్టులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వాళ్ళే వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్టులై ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులు, విద్యార్ధుల మధ్య బంధం తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధం వంటిది. నేను కూడా సర్కారు బడిలోనే చదివాను. నెల్లూరు జిల్లాలోని మారుమూల పల్లెలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. స్కూలు టీచర్ ఎస్ఆర్ నరసింహం గారు లెక్కలు ఎక్కువగా నేర్పారు. ఆట పాటలతో పాటు క్రికెట్‌కు కూడా ఆయనే గురువు. అమ్మ కోరిక మేరకే ఇంజనీరింగ్ అప్పట్లో మా ఊళ్ళో మొదటి గ్రాడ్యుయేట్ నేనే. మా అమ్మ ఎప్పుడూ నువ్వు ఇంజనీర్ కావాలని అంటుంటేది. అమ్మ కోరిక మేరకే ఇంజనీర్‌ను అయ్యాను. అబ్దుల్ కలాం డీఆర్డీవో చైర్మన్‌గా ఉన్నప్పుడే ఉద్యోగంలో చేరాను. ఆయనే స్ఫుర్తి. దేశ భక్తితో పాటు దైవ భక్తి కూడా ఉండాలి ప్రతి ఒక్కరికీ దేశ భక్తితో పాటు దైవ భక్తి కూడా ఉండాలి. సైన్స్‌ను, సత్సంప్రదాయాలను సమానంగా గౌరవించాలి. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఎన్నో రహస్యాలను మన పురాణాలు, ఇతిహాసాల్లో ఎప్పుడో చెప్పారు. సైన్స్ అభివృద్ధి చెందక ముందే జీరోను కనుగొన్న చరిత్ర మన సొంతం. నంబర్ వన్‌గా నిలవడమే యువత లక్ష్యం శాస్త్ర, సాంకేతిక, విద్య, వైద్య రంగాల్లో నంబర్ వన్‌గా నిలవడమే యువత ముందున్న లక్ష్యం. 75 కోట్ల మంది యువత ఉన్న ఏకైక దేశం. ఆ యువ శక్తిని, మేథో సంపత్తిని సమృద్ధిగా వినియోగించుకుని తిరుగులేని శక్తిగా ఆవిర్భవించాలి. గతంలో ఐఐటీ పూర్తి చేసుకున్న నిపుణులు 75 శాతం మంది విదేశా>లకు వెళ్లిపోయే వాళ్లు. ఇప్పుడు 75 శాతం మంది ఇక్కడే ఉంటున్నారు. ఇది మన దేశం సాధించిన ప్రగతికి నిదర్శనం. -
బైడెన్ కేబినెట్లో చరిత్ర సృష్టించనున్న భారతీయ సంతతి మహిళ
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన మరో మహిళకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక బాధ్యతలకు ఎంపిక చేశారు. భారతీయ అమెరికన్, భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ ఆరతీ ప్రభాకర్‌ను ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ (ఓఎస్టీపీ) సలహాదారుగా నామినేట్ చేశారు. ఈ నామినేషన్ చారిత్రాత్మకమైంది. ఓఎస్‌టీపికీ సెనేట్ ధృవీకరించిన డైరెక్టర్‌గా నామినేట్ చేసిన తొలి మహిళ, వలసదారు ప్రభాకర్ అని వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. దీనికి సెనేట్ ఆమోదం లభిస్తే చీఫ్ అడ్వైజర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా బాధ్యతలు చేపట్టనున్నారు ప్రభాకర్. అలాగే బైడెన్ సర్కార్‌లో పనిచేయనున్న మూడవ ఆసియా అమెరికన్‌గా కూడా ఆమె నిలుస్తారు. ముఖ్య సలహాదారుగా, సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రెసిడెంట్స్ కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్‌కు కో-చైర్‌గా, ప్రెసిడెంట్ క్యాబినెట్ సభ్యునిగా ఉంటారని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. బైడెన్ ప్రభుత్వంలో ఇప్పటికే పలువురు భారత సంతతి వ్యక్తులు పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మరో ఇండో-అమెరికన్ ప్రభాకర్ చేరడం విశేషం. ఇప్పటిదాకా ఈ పదవిలో ఉన్న ఎరిక్ ల్యాండర్ రాజీనామా నేపథ్యంలో ప్రభాకర్‌ను ఈ పదవికి బైడెన్ నామినేట్ చేశారు. తెలివైన, అత్యంత గౌరవనీయమైన ఇంజనీర్, గొప్ప భౌతిక శాస్త్రవేత్త అని డాక్టర్ ప్రభాకర్‌ను అధ్యక్షుడు బైడెన్ అభివర్ణించారు. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ల ద్వారా అవకాశాలను విస్తరించేందుకు, కష్టతరమైన సవాళ్లను పరిష్కరించి, అసాధ్యాలను సుసాధ్యం చేసేందుకు భారతీయ అమెరికన్లు సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీకి నాయకత్వం వహిస్తారని ఆయన అన్నారు. కాగా ప్రభాకర్ కుటుంబం ప్రభాకర్ మూడేళ్ల వయసులో భారతదేశం నుండి అమెరికాకు వలస వెళ్లింది. మొదట చికాగోకు వెళ్లి ఆపై ఆమె 10 సంవత్సరాల వయస్సులో టెక్సాస్‌లోని లుబ్బాక్‌లో స్థిరపడింది. ఆమె టెక్సాస్ టెక్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పొందారు. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి అప్లైడ్ ఫిజిక్స్‌లో పీహెచ్డీ పట్టా పుచ్చుకున్న తొలి మహిళ. ఇక్కడే లక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ కూడా చేశారు. ఆఫీస్ ఆఫ్ టెక్నాలజీ అసెస్మెంట్లో కాంగ్రెషనల్ ఫెలోగా లెజిస్లేటివ్ శాఖలో కరియర్‌ను ప్రారంభిచారు. డాక్టర్ ప్రభాకర్ రెండు వేర్వేరు ఫెడరల్ ఆర్ అండ్‌డీ ఏజెన్సీలకు నాయకత్వం వహించారు. అనేక రంగాలలో స్టార్టప్‌లు, పెద్ద కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ల్యాబ్‌లు, ఎన్జీవోతో కలసి పనిచేసి విశేష సేవలందించారు. ముఖ్యంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఐఎస్టి)కి నాయకత్వం వహించిన మొదటి మహిళ కూడా ఆరతీప్రభాకర్. ఆ తరువాత డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ డైరెక్టర్‌గా పనిచేశారు. -
విఠలాచార్య సినిమాల్లోలా..! నడుస్తాను..రివ్వున ఎగురుతాను!
ఫొటో కనిపిస్తున్నది విఠలాచార్య సినిమాల్లోని కంకాళంలా ఉంది కదూ! ఇది కంకాళం కాదు, మోడర్న్ గరుడావతారం. అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్) శాస్త్రవేత్తలు ‘లియోనార్డో’ పేరిట రూపొందించిన రోబో ఇది. దీనిలోని ప్రత్యేకత ఏమిటంటే, ఇది మనిషిలా నేల మీద రెండుకాళ్లతో నడవగలదు. డేగలా ఆకాశంలో రివ్వున ఎగరగలదు. ఒకరకంగా ఇది రోబో ద్రోన్. ఎంత ఎత్తు ఎగిరినా, భూమ్మీద ఎలాంటి ఉపరితలంపైన అయినా ఇట్టే వాలగలిగేలా దీన్ని తీర్చిదిద్దారు. అంగారకుని ఉపరితలంపై కూడా వాలేందుకు అనువుగా దీనికి మరిన్ని మెరుగులు దిద్దుతున్నట్లు ‘కాల్టెక్’ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
నిప్పులకొలిమిలా భగభగలు.. అయినా జీవరాశి ఉనికి!
మిగతా గ్రహాల్లాగే అక్కడా సముద్రాలు, జీవరాశి ఉనికి ఉండేది ఒకప్పుడు. కానీ, సూర్యుడికి దగ్గరగా ఉండడంతో ఆ అధిక వేడిమికి సముద్రాలు ఆవిరైపోవడం, జీవరాశి కనుమరుగైపోవడం.. భూమికి సిస్టర్ గ్రహాంగా అభివర్ణించే శుక్ర గ్రహం విషయంలో జరిగి ఉంటుందనేది ఖగోళ శాస్త్రవేత్తల అంచనా. కానీ, ఇప్పుడు ఆ అంచనాలను తలకిందులు చేసే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. వీనస్‌పై జీవరాశికి ఆస్కారమే లేదని వాదిస్తున్న సైంటిస్టులు.. ఇప్పుడక్కడ జీవరాశికి ఆస్కారం ఉందనే వాదనను తెరపైకి తెచ్చారు. పలు అధ్యయనాల తర్వాత ఫొటోసింథటిక్ మైక్రోఆర్గానిజమ్స్(కిరణజన్య సంయోగ సూక్ష్మజీవులు) ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. సౌర వ్యవస్థలో ముందు వరుసలో ఉండడం, పైగా గ్రీన్ హౌజ్ ప్రభావం వల్ల హాట్ గ్యాస్ బెలూన్లా కార్బన్ డై యాక్సైడ్‌తో నిండిపోయింది శుక్ర గ్రహం. దరిమిలా 462 డిగ్రీ సెల్సియస్ సెంటిగ్రేడ్(863 డిగ్రీల ఫారన్‌హీట్) గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యి నిప్పుల కొలిమిని తలపిస్తుంది. అలాంటిది ఈ గ్రహంపైనా జీవరాశి ఉనికిని పసిగట్టారు సైంటిస్టులు. శుక్ర గ్రహం వాతావరణంలో జీవరాశి ఉనికి ఉన్నట్లు గుర్తించారు. శుక్ర గ్రహం మేఘాల నుంచి సూర్యకాంతి చొచ్చుకెళ్లినప్పుడు.. ఫొటోసింథటిక్ మైక్రోఆర్గానిజమ్స్ పెరిగే అవకాశం ఉందని తేల్చారు. 1. A new study has revealed that the sunlight passing through Venus' clouds could support the growth of photosynthetic microorganisms. Moreover, photosynthesis could even occur during the night time thanks to the planet's thermal energy! pic.twitter.com/j5NfFYmPF5 — The Weather Channel India (@weatherindia) October 11, 2021 సోలార్ ఎనర్జీతో పాటు గ్రహం ఉపరితలం నుంచి థర్మల్ ఎనర్జీ పుట్టడం, కాంతి తరంగదైర్ఘ్యం కారణంగా ఫొటోసింథటిక్ పిగ్మెంట్స్‌ను గుర్తించారు. ఇది అచ్చం భూమి మీద సూర్యకిరణాల వల్ల ఏర్పడే ప్రక్రియలాగే ఉంటుందని చెబుతున్నారు. అధ్యయనానికి సంబంధించిన వివరాలను కాలిఫోర్నియా స్టేట్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాకేష్ మొఘల్ వెల్లడించారు. ఆమ్ల, ద్రావణ(వాటర్) చర్యల వల్ల మైక్రోబయాల్ పెరిగే అవకావం ఉందని చెప్తున్నారు వాళ్లు. Astrobiology జర్నల్‌లో శుక్ర గ్రహంపై జీవరాశి ఉనికికి సంబంధించిన కథనం తాజాగా పబ్లిష్ అయ్యింది. చదవండి: శుక్రుడు మా వాడు.. రష్యా సంచలన ప్రకటన -
కృత్రిమ మాంసం, రక్తం, పాలు, పెరుగు తయారీ!
మాయాబజార్ సినిమాలో ‘చిన్నమయ’ ఒక్క మంత్రమేస్తే.. ఖాళీ అయిన గంగాళాలు గారెలు,అరిసెలతో నిండిపోతాయి. నిజజీవితంలోనూ ఇలా జరిగితే ఎంతబాగుండు కదా..కాకపోతే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ఏంటీ.. నిజమే.. కాకపోతే సైన్స్ మంత్రానికి టెక్నాలజీ యంత్రాన్ని జోడిస్తే అసాధ్యమేమీ కాదు.. ఓ మంత్రం.. లేదా యంత్రంతో మనిషి తనకు కావాల్సినవన్నీ సృష్టించుకోవడం కల్పన కావొచ్చు. స్టార్‌ట్రెక్ లాంటి సినిమాల్లోనూ ‘రెప్లికేటర్’అనే యంత్రం అక్షయ పాత్ర లాగా ఏది కావాలంటే అది తయారు చేసి పెడుతుంది. ఇలాంటిది తయారయ్యేందుకు ఇంకో వందేళ్లు పట్టొచ్చేమో కానీ, ఈ దిశగా శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. ప్రకృతితో సంబంధం లేకుండా.. మానవ శ్రమ, కాలుష్యాలకు దూరంగా పాలు, మాంసం మాత్రమే కాదు.. ఏకంగా కార్లనే ముద్రించి తయారు చేసేందుకు సిద్ధమవుతోంది శాస్త్ర ప్రపంచం. వైఢూర్యాలు కాదు.. వజ్రాలే! భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉండే వజ్రాలు కార్బన్‌తో తయారవుతాయి. ఈ విషయం చాలావరకు తెలిసిందే. అయితే ఒక్కో వజ్రం వెనుక కోట్ల ఏళ్ల చరిత్ర ఉంటుంది. అన్నేళ్లు విపరీతమైన ఒత్తిడి, ఉష్ణోగ్రతల్లో నలిగితే గానీ.. కార్బన్ కాస్తా వజ్రంగా మారదు. అయితే భూమి లోపలి పొరల్లాంటి పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి వజ్రాలను చౌకగా తయారుచేయాలన్న ప్రయత్నం సాగుతోంది. జిర్కోన్ వంటి మూలకాల సాయంతో తయారు చేయగలిగారు. సహజమైన వజ్రాలతో అన్ని రకాలుగా సరిపోలినా కానీ వీటిపై ఆదరణ మాత్రం పెద్దగా పెరగలేదు. ఇదే సమయంలో సహజ వజ్రాల మైనింగ్‌లో ఇమిడి ఉన్న అనేక నైతిక అంశాల కారణంగా ఇప్పుడు డీబీర్స్ వంటి కంపెనీలు గనులను నిలిపేయాలని నిర్ణయించాయి. 2018లోనే డిబీర్స్ పూర్తిగా కృత్రిమ వజ్రాలతోనే ఆభరణాలను తయారు చేయాలని తీర్మానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆభరణాల తయారీ సంస్థ పండోరా కూడా ఈ ఏడాది ఇకపై తాము గనుల్లోంచి వెలికితీసిన వజ్రాలను వాడబోమని ప్రకటించనుంది. పాలు, పెరుగు కూడా.. పాలలో ఏముంటాయి? కొవ్వులు, కొన్ని విటమిన్లు, ఖనిజాలు, నీళ్లు అంతేనా? ఒకట్రెండు ప్రోటీన్లు ఉంటాయనుకున్నా వీటన్నింటినీ తగుమోతాదులో కలిపేస్తే పాలు తయారు కావా? అన్న ప్రశ్న వస్తుంది. ఇంత పనికి.. ఆవుల్ని, గేదెలను మేపడం, వాటి వ్యర్థాలను ఎత్తి పారేసి శుభ్రం చేసుకోవడం, పితికిన పాలను ఫ్యాక్టరీల్లో శుద్ధి చేసి ప్యాకెట్లలోకి చేర్చి ఇంటింటికీ పంపిణీ చేయడం అవసరమా? అంటున్నారు ఈ కాలపు శాస్త్రవేత్తలు కొందరు. జంతువులతో ఏమాత్రం సంబంధం లేకుండానే పాలను పోలిన పాలను తయారుచేయడం పెద్ద కష్టమేమీ కాదన్నది వీరి అంచనా. పెర్ఫెక్ట్ డే అనే కంపెనీ కొన్ని రకాల శిలీంద్రాల్లో మార్పులు చేయడం ద్వారా అవి పాల లాంటి ద్రవాలను ఉత్పత్తి చేసేలా చేయగలిగారు. ఇమాజిన్ డెయిరీ కూడా పశువుల అవసరం లేని పాల ఉత్పత్తుల తయారీకి ప్రయత్నిస్తోంది. కాకపోతే ఈ కంపెనీ మనం బ్రెడ్ లాంటివాటిని తయారు చేసేందుకు వాడే ఈస్ట్ సాయం తీసుకుంటోంది. ఈ కృత్రిమ పాలను ఐస్‌క్రీమ్‌గా మార్చి అందరికీ అందించేందుకు పెర్ఫెక్ట్ డెయిరీ ఇప్పటికే కంపెనీలతో చర్చలు జరుపుతోంది. అంతెందుకు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈ రకమైన కొత్త రకం పాలు, పాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి కూడా! కృత్రిమ మాంసం.. భూమ్మీద ఉన్న వ్యవసాయ భూమిలో సగం భూమిని మాంసం ఉత్పత్తి కోసం వినియోగిస్తున్నారు. పశువులకు అవసరమైన దాణా, గింజలు, వాటి పోషణకు అవసరమైన నీరు తదితర ఇతర వనరుల కోసం ఇంత భూమిని వాడుకుంటున్నాం. ఇవేవీ లేకుండా ఒక ఫ్యాక్టరీ, పెరుగుదలకు ఉపయోగపడే ఎంజైమ్స్‌తో కావాల్సినంత మాంసం సృష్టించేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఓ మోస్తరు విజయం సాధించాం. పదేళ్ల కిందటే ఖైమా కొట్టిన మాంసం లాంటి పదార్థాన్ని తయారు చేయగలిగినా కొన్ని ఇబ్బందులతో ఆ టెక్నాలజీ ముందుకు సాగలేదు. తాజాగా 2018లో ఇజ్రాయెల్ కంపెనీ ఆలెఫ్ ఫామ్స్ తొలిసారి ల్యాబ్‌లోనే స్టీక్ (మాంసపు ముక్క)ను తయారు చేసింది. మరింకేం అలెఫ్ ఫామ్స్ లాంటివి ఊరుకొకటి పెట్టేస్తే సరిపోతుంది కదా అంటే.. దానికి ఇంకొంచెం సమయం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ల్యాబ్‌లో పెంచిన మాంసం ఖరీదు చాలా ఎక్కువ. 2011తో పోలిస్తే రేటు గణనీయంగా తగ్గినా మరింత తగ్గితే గానీ అందరికీ అందుబాటులోకి రాదు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌లోనే ఇంకో కంపెనీ వాణిజ్యస్థాయిలో చికెన్ ముక్కలను తయారు చేసి దుకాణాలకు సరఫరా చేస్తోంది. ఆఖరికి రక్తం కూడా.. మన శరీరపు ఆరోగ్యం గురించి ఠక్కున చెప్పేయగల శక్తి రక్తానికి ఉందంటారు. అవయవాలన్నింటికీ శక్తినిచ్చే ఆక్సిజన్‌ను సరఫరా చేయడంతో పాటు మలినాలు, వ్యర్థాలను బయటకు పంపేందుకు సాయపడుతుంది రక్తం. యుద్ధంలో లేదా ప్రమాద సమయాల్లో కోల్పోయే రక్తాన్ని దాతల రక్తంతో భర్తీ చేసేందుకు అవకాశం ఉన్నా అది స్వచ్ఛమైన వ్యవహారం కాదు. పైగా మన సొంత రక్తం పనిచేసినట్లు ఇతరుల రక్తం పనిచేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. ఈ నేపథ్యంలోనే అన్నీ మంచి లక్షణాలు ఉన్న కృత్రిమ రక్తాన్ని తయారు చేసేందుకు 50 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన రెండు వేర్వేరు పరిశోధనల పుణ్యమా అని 50 ఏళ్లుగా సాధ్యం కాని కృత్రిమ రక్తం తయారీ త్వరలో వీలయ్యే అవకాశం ఏర్పడింది. 2017లో మానవ మూలకణాలను రక్త కణాలుగా మార్చే పద్ధతులను రెండు బృందాలు సమర్పించాయి. ఈ రెండు సక్రమంగా పనిచేస్తాయని రుజువైతే.. త్వరలోనే కృత్రిమ రక్తం అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తల అంచనా. ఫ్యాక్టరీల్లో ఫర్నిచర్ కలప.. గ్రామీణ ప్రాంతాల్లో వంటకు మొదలుకొని కాగితం, ఫర్నిచర్ తయారీల వరకు కలప వినియోగం విస్తృతంగా జరుగుతోంది. కానీ దీనికోసం రోజూ వందల ఎకరాల అటవీభూమి నాశనమవుతోంది. ఇలా కాకుండా.. దృఢమైన కలపను పరిశోధనశాలలోనే తయారు చేయగలిగితే? అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ అద్భుతం సాధ్యమే అంటున్నారు. మొక్కల కణాలను గ్రోత్మీడియంలో ఉంచి పెంచడమే కాకుండా.. అవి కలప మాదిరిగా అతుక్కునేలా చేయగలిగారు. మొక్కల హార్మోన్లు కనీసం రెండు కణాల్లో లిగ్నిన్ (కలపకు దృఢత్వాన్ని ఇచ్చేది) పెరుగుదలను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించారు. ఈ హార్మోన్లను నియంత్రించడం ద్వారా ఉత్పత్తి చేసే కలప లక్షణాలను నిర్ణయించొచ్చు. అంతా బాగానే ఉంది కానీ.. ప్రస్తుతానికి ఈ ఆలోచన చాలా ప్రాథమిక దశలోనే ఉంది. ఇంకొన్నేళ్ల తర్వాతే కృత్రిమ కలపతో టేబుళ్లు, కుర్చీలు, తలుపులు తయారవుతాయి! -
అద్భుత విజయం: పక్షవాతానికి గురైన వ్యక్తి నుంచి..
కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు అరుదైన ఘనత సాధించారు. పక్షవాతానికి గురై పూర్తిగా మాట్లాడే శక్తిని కోల్పోయిన వాళ్ల నుంచి.. చెప్పదల్చుకున్న విషయాల్ని బయటకు రప్పించే టెక్నాలజీని రూపొందించారు. ‘స్పీచ్ న్యూరోప్రోస్థెసిస్’ Speech Neuroprosthesisతో అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ.. బ్రెయిన్ నుంచి గొంతు ద్వారా సిగ్నల్స్ సేకరించి, అటుపై పేషెంట్లు చెప్పదల్చుకున్న విషయాన్ని ఎదురుగా ఉన్న తెరపై వేగంగా డిస్ప్లే చేస్తాయి. ఫ్లోరిడా: కాలిఫోర్నియా యూనివర్సిటీ(UCSF) న్యూరోసర్జన్ డాక్టర్ ఎడ్వర్డ్ ఛాంగ్ నేతృత్వంలోని బృందం పదేళ్ల పరిశోధనల తర్వాత ఈ విజయాన్ని సాధించింది. ఇంతకు ముందు ఇలాంటి పరిశోధనలే జరిగినప్పటికీ.. చేతి కండరాల కదలికల ద్వారా చెప్పదల్చుకున్న విషయాన్ని రాబట్టడం లాంటి ఫలితాలొచ్చాయి. కానీ, కాలిఫోర్నియా బృందం సాధించిన విజయంలో.. నేరుగా స్వర వ్యవస్థకే అనుసంధానమై ఉండడం వల్ల ఒక్కో అక్షరం కాకుండా, ఒకేసారి ఎక్కువ పదాలను తెరపై చూపించేందుకు ఆస్కారం ఏర్పడింది. తద్వారా సాధారణ వ్యక్తి మాట్లాడగలిగినట్లే.. పెరాలసిస్ బారినపడ్డ వ్యక్తి నుంచి(75 శాతం) సందేశాలను ఆశించొచ్చు. పైగా ఇది సంక్లిష్టమైన పద్ధతి కాదని, పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని డాక్టర్ ఎడ్వర్డ్ ఛాంగ్ వెల్లడించారు. ‘స్టెనో’ పేరుతో కొనసాగిన ఈ ప్రాజెక్ట్‌కు ఫేస్బుక్ స్పాన్సర్ చేసింది. పక్షవాతానికి గురైన వ్యక్తి నుంచి సహజంగా పదాలను బయటకు తెప్పించడం నిజంగా ఓ అద్బుత విజయంగా పేర్కొంటూ న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో బుధవారం ఈ పరిశోధనకు సంబంధించిన విషయాల్ని ప్రచురించింది. కేవలం పక్షవాతానికి గురైమాత్రమే కాదు.. ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో, షాక్‌లతో మాట్లాడలేని స్థితికి చేరుకుంటుంటారు. వాళ్ల కోసం ఈ న్యూరాల్ టెక్నాలజీ ఉపయోగపడొచ్చని ఆ జర్నల్‌లో పలువురు వైద్యు నిపుణులు అభిప్రాయపడ్డారు. జుకర్‌బర్గ్ ఖుష్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా(సిగ్నల్స్ చేరివేత ద్వారా) పేషెంట్ చెప్పాలనుకున్న విషయం తెరపై దానికదే టైప్ కావడం ఈ న్యూరల్ టెక్నాలజీ ప్రత్యేకం. ఇక తమ సౌజన్యంతో రూపొందించిన ఈ న్యూరల్ టెక్నాలజీ ఘన విజయంపై ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టాడు. ‘బ్రావో’ పేరుతో జరిగిన ఈ అధ్యయనంలో 15 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో గాయపడి కదల్లేని స్థితికి చేరుకున్న ఓ వ్యక్తిపై కాలిఫోర్నియా ప్రొఫెసర్లు పరిశోధనలు చేశారు. ‘నాకేం దాహంగా లేదు, నా వాళ్లను పిలవండి, బాగానే ఉన్నా’ లాంటి పదాల్ని ఆ వ్యక్తి వ్యక్తం చేశాడు. -
సైన్స్ అండ్ టెక్నాలజీ వర్సిటీ ఏర్పాటు దిశగా కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో తొలిసారిగా నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం(డీఎస్టీ) చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. అటానమస్ ఇన్స్టిట్యూట్ల నుంచి ఆర్థిక సాయాన్ని పొంది అధునాతన పరిశోధనలతో కూడిన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. టెక్నాలజీ భవన్లో ఆయన శనివారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమవుతున్న పరిశోధనా పత్రాల్లో భారత్ మూడో ర్యాంకులో ఉందన్నారు. అంతేగాక నాణ్యమైన పరిశోధనా పత్రాలను వెల్లడించడంలో 9వ స్థానంలో ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే నాటికి టాప్-5 లోకి వచ్చే విధంగా కృషి జరగాలన్నారు. ప్రధాని మోదీ సైతం సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ప్రత్యేక దృష్టి పెట్టారని, వ్యక్తిగతంగా ఆ విభాగాన్ని పరిశీలిస్తున్నారని చెప్పారు. -
సాంకేతిక రంగాల్లో మనదే కీలక పాత్ర
సాక్షి ప్రతినిధి, వరంగల్: శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతీయ యువత కీలకపాత్ర వహిస్తోందని.. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో రాణిస్తూ సత్తా చాటుతోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో యువ శాస్త్రవేత్తలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, నిపుణుల కొరత ఉన్నా.. మన దేశం మాత్రం 1.3 బిలియన్ జనాభాతో ఒక అత్యున్నత స్థాయి శక్తిగా ఆవిర్భవించే స్థాయికి చేరిందని తెలిపారు. (చదవండి: బస్సులో గవర్నర్ తమిళిసై ప్రయాణం) దార్శనికత, ముందు చూపు ఉన్న ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకెళ్తోందని, ఇందులో యువతే కీలకపాత్ర అని వెల్లడించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’వేడుకలను గవర్నర్ తమిళిసై శుక్రవారం హన్మకొండలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రారంభించారు. తొలుత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ జాతీయ పతాకాన్ని ఎగుర వేశాక రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు పసునూరి దయాకర్, బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్‌రావు, జెడ్పీ చైర్మన్ ఎం. సుధీర్ కుమార్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీసు కమిషనర్ పి. ప్రమోద్ కుమార్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. -
ఆనంద్.. మంచి కాఫీలాంటి శాటిలైట్
తన 50 ఏళ్ల చరిత్రలో ‘ఇస్రో’ తొలిసారిగా మన ప్రైవేట్ సంస్థల శాటిలైట్లను నింగిలోకి పంపనుంది. ఈ నెల 28న పీఎస్ఎల్వీ–సి51 ద్వారా పంపే ఈ శాటిలైట్లలో బెంగళూరు స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ ‘పిక్సెల్’ రూపొందించిన ‘ఆనంద్’ ఒకటి. పాతికేళ్లు కూడా నిండని ఎవ్యాస్ అహ్మద్, క్షితిజ్ ఖండేల్వాల్లు ఈ కంపెనీ రథసారథులు. ‘పిక్సెల్’ విజయప్రస్థానం... చిన్నప్పుడు ఆకాశం అంటే అంతులేని ఆసక్తి ఎవరికి మాత్రం ఉండదు. చిక్కమగళూరు(కర్నాటక) అబ్బాయి ఎవ్యాస్ అహ్మద్ కూడా అంతే. ఆ ఆసక్తి తాను చదువుకున్న బిట్స్ పిలాని(రాజస్థాన్) వరకు కొనసాగింది. బిట్స్ పిలానిలో ‘హైపర్‌లూప్ ఇండియా’ ప్రాజెక్ట్ వ్యవస్థాపక సభ్యులో అహ్మద్ కూడా ఒకరు. ‘హైపర్‌లూప్ ఇండియా’తో తన కలలకు శాస్త్రీయ పునాది ఏర్పడింది. వేరు వేరు క్యాంపస్‌లలో నుంచి వచ్చిన విద్యార్థులతో పరిచయం, పరిజ్ఞానం పెంచుకునే ప్రయత్నాలు జరిగాయి. టెక్ దిగ్గజం ఎలాన్ మాస్క్‌కు చెందిన ‘స్పేస్ఎక్స్’ స్పాన్సర్ చేసే ‘హైపర్‌లూప్ పోడ్ కాంపిటీషన్’లో ప్రపంచం నలుమూలల నుంచి స్టూడెంట్స్, నాన్ స్టూడెంట్స్ టీమ్‌లు పాల్గొంటాయి. ఈ పోటీలో పాల్గొనడాన్ని ప్రతిష్ఠాత్మక విషయంగా భావిస్తాయి. హైపర్‌లూప్ కాన్సెప్ట్ ప్రకారం సబ్‌స్కేల్ ప్రోటోటైప్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ నిర్మించడం, డిజైన్ చేయడం ఈ పోటీ ముఖ్య ఉద్దేశం. ‘హైపర్‌లూప్ ఛాలెంజ్’లో బిట్స్ పిలాని టీమ్‌కు పాల్గొనే అవకాశం వచ్చింది. కాలిఫోర్నియాలోని ‘స్పేస్ఎక్స్’ ప్రధానకార్యాలయంలో తమదైన హైపర్‌లూప్ టెక్నాలజీ(అత్యంగా వేగంగా ఒక మైలు దూరం వ్యాక్యూమ్ ట్యూబ్‌లో ప్రయాణం చేసే సాంకేతిక జ్ఞానం) డెమో ఇచ్చారు. ఫైనల్ వరకు వెళ్లారు. ఈ పోటీ పుణ్యమా అని టెక్స్టార్ ఎలాన్ మాస్క్‌ను కలుసుకునే అవకాశం వచ్చింది. ‘మాస్క్‌తో మాట్లాడడం ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. నా కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలనే పట్టుదల పెరిగింది’ అంటాడు ఆరోజుని గుర్తు చేసుకుంటూ 22 సంవత్సరాల అహ్మద్. హైపర్‌లూప్ కాంపిటీషన్లో పాల్గోవడం వల్ల తన పరిమిత అవగాహనలోని ఖాళీలకు జవాబులు దొరికాయి. ఆ తరువాత ‘ఏఐ ఎక్స్‌ప్రైజ్ కాంపిటీషన్’లో పాల్గొన్నాడు. సాంకేతిక అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పోటీలు నిర్వహించే ఈ సంస్థను 1994లో కాలిఫోర్నియాలో స్థాపించారు. జెమ్స్ కామెరూన్, లారీపేజ్లాంటి ప్రముఖులు ఈ సంస్థకు ట్రస్టీలుగా ఉన్నారు. ‘ఎక్స్‌ప్రైజ్’లో పాల్గొన్న సందర్భంలోనే అహ్మద్‌కు ‘శాటిలైట్ ఇమేజరీ’ గురించి ఆలోచన వచ్చింది. రిమోట్ లొకేషన్లలో, పైప్‌ల నుంచి గ్యాస్ లీకేజిలను గుర్తించడానికి ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాకుండా గనులలో అక్రమ తవ్వకాలను గుర్తించడానికి, వ్యవసాయానికి సంబంధించిన ట్రెండ్స్ గురించి తెలుసుకోవడానికి, విత్తడానికి సరిౖయెన సమయాన్ని ఎంచుకోవడానికి...ఒకటి రెండు అని ఏమిటి! చాలా రకాలుగా శాటిలైట్ ఇమేజరీలను వాడుకోవచ్చు అనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన నుంచి పుట్టిందే స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ పిక్సెల్. బిట్స్‌పిలానిలో తనతో పాటు చదువుకున్న క్షితిజ్ ఖండెల్వాల్తో కలిసి 2019లో బెంగళూరులో ‘పిక్సెల్’ స్టార్టప్ ప్రారంభించాడు అహ్మద్. అయితే నిధుల సమస్య పెద్ద సవాలుగా మారింది. వీరు ఎంత సీరియస్‌గా తమ ప్రాజెక్ట్ గురించి వివరించినా అందరూ తేలిగ్గా తీసుకునేవారు. దీనికి కారణం వారి వయసు. నిధుల సమస్యను అధిగమించడానికి రాజస్థాన్ గవర్నమెంట్, ఇతరుల కోసం కొన్ని ప్రాజెక్ట్‌లు చేశారు. కొద్ది కాలం తరువాత ‘పిక్సెల్’ ప్రాజెక్ట్ గురించి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. తొలిరోజుల్లో పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించని ‘పిక్సెల్’ టీమ్ ఇండస్ తరువాత ఇండియన్ స్పేస్ స్టార్టప్‌లలో హైయెస్ట్ ఫండింగ్‌లో ఉంది. తాము అత్యున్నత ప్రమాణాలతో జెనరేట్ చేసే ఇమేజరీ డాటా యూఎస్ నుంచి యూరప్ వరకు వినియోగదారులకు అనేకరకాలుగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు ‘పిక్సెల్’ సీయివో,సీటీవో అహ్మద్, క్షితిజ్లు. మూడు రోజుల తరువాత పిక్సెల్ వారి ‘ఆనంద్’ ఆకాశంలోకి దూసుకెళ్లబోతుంది. వెళుతూ వెళుతూ ఒక గట్టి నమ్మకాన్ని ఇచ్చివెళుతుంది. పట్టుదల ఉంటే కన్న కలలు సాకారమవుతాయి. జీవితాన్ని ఆనందంతో నింపుతాయి. -
సైన్స్ అండ్ టెక్నాలజీకి 20 శాతం అధికం
న్యూఢిల్లీ: శాస్త్ర, సాంకేతిక శాఖకు కేంద్ర ప్రభుత్వం 2021–22 బడ్జెట్లో రూ.14,793.66 కోట్లు కేటాయించింది. 2020–21 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే ఇది 20% అధికం కావడం విశేషం. అలా గే ఎర్త్ సైన్సెస్ శాఖకు ప్రత్యేకంగా రూ.1,897.13 కోట్లు కేటాయించారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ పరిధిలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ), డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ), డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (డీఎస్ఐఆర్) ఉన్నాయి. దే శంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో ఈ విభాగాలన్నీ కీలకంగా పనిచేశాయి. 2021–22 బడ్జెట్లో డీఎస్టీకి రూ.6,067.39 కోట్లు, డీబీటీకి రూ.3,502.37 కోట్లు, డీఎస్ఐఆర్కు రూ.5,224.27 కోట్లు కేటాయించారు. 2020–21 బడ్జెట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు రూ.14,473.66 కోట్లు కేటాయించగా, తర్వాత దాన్ని రూ.11,551.86 కోట్లుగా సవరించారు. ఇండియాలో ‘డీప్ ఓషన్ మిషన్’ను ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఇందుకోసం ఐదేళ్లలో రూ.4,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. సముద్రాలపై అధ్యయనం, సర్వే, సముద్రాల్లోని జీవవైవిధ్యాన్ని పరిరక్షించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని వెల్లడించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు బడ్జెట్ కేటాయింపులు 2021-22 రూ.14,793.66 2020-21 రూ.11,551.86 అంతరిక్ష విభాగానికి రూ.13,949 కోట్లు అంతరిక్ష విభాగానికి కేంద్రం రూ.13,949 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది గతేడాది రూ.8,228 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.4,449 కోట్లు ఎక్కువ కేటాయించడం గమనార్హం. ఈ మొత్తంలో రూ.700 కోట్లను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ రంగ సంస్థ ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’కు కేటాయించారు. గగన్‌యాన్ ప్రాజెక్టు ద్వారా నలుగురు మానవులను అంతరిక్షంలోకి పంపడానికి రష్యాలోని జెనెరిక్ స్పేస్ ఫ్లయిట్ ఆస్పెక్ట్‌లో శిక్షణ ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. డిసెంబర్ 2021లో మానవరహిత అంతరిక్ష నౌకను పరీక్షిస్తామని వెల్లడించారు. హోం శాఖకు రూ.1,66,547 కోట్లు కేంద్ర హోంశాఖకు 2021–22 బడ్జెట్లో రూ. 1,66,547 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 11.48 శాతం అధికం. ఇందులో మెజారిటీ నిధులు కేంద్ర సాయుధ బలగాల నిర్వహణకు, జనగణనకు సంబంధించిన కార్యకలాపాలకు వినియోగించనున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో హోం శాఖకు రూ.1,49,387 కోట్లు కేటాయించగా ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.1,66,547 కోట్లకు పెంచారు. ఇం దులో కేంద్ర సాయుధ పోలీస్ బలగాలైన సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్‌ఎఫ్‌లకు రూ.1,03,802.52 కోట్లు, జనాభా లెక్కలకు రూ.3,768.28 కోట్లు కేటాయించారు. -
ఐక్యరాజ్య సమితి సమర్పించు...
‘రీసెట్ ఎర్త్’ పేరుతో ఐక్యరాజ్య సమితి కొత్త ప్రాజెక్ట్ చేపట్టింది. ఇందులో భాగంగా 10 నుంచి 15 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారి కోసం ఒక మొబైల్ గేమ్‌ను రూపొందించారు. ఓజోన్ పొర విలువను తెలియజేసే గేమ్ ఇది. ‘ఓజోన్ పొర రక్షణకు సంబంధించిన ప్రచారం అనేది ఒక తరానికి సంబంధించిన విషయం కాదు. అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది’ అంటున్నారు ప్రాజెక్ట్ బాధ్యుల్లో ఒకరైన మెక్ సెక్. -
గాల్లోని తేమ నీరవుతుంది ఇలా..
భూమిపై నీటి వనరులు రోజురోజుకూ తరిగిపోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారాలను కనుగొనే దిశగా పరిశోధకులు ఎప్పటినుంచో ప్రయోగాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే గాల్లోంచి నీటిని ఒడిసిపట్టేందుకు ఇప్పటికే బోలె డన్ని యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ వీటన్నింటికీ కరెంటు కావాలి. భారీ సైజు యంత్రాలూ కావాలి. పెద్ద పెద్ద తెరలు అవసరమవుతాయి. అయితే ఇవేవీ లేకుండానే గాల్లోని ఆవిరిని నీరుగా మార్చేయవచ్చని అంటోంది సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యూఎస్). ప్రత్యేకమైన ప్లాస్టిక్ పోగులు, సూక్ష్మ రంధ్రాలతో అత్యధిక ఉపరితలాన్ని కలిగిన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్‌లతో ఈ అద్భుతాన్ని సాధించవచ్చని ఎన్‌యూఎస్ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించారు. కిలో ఏరోజెల్‌తో రోజుకు 17 లీటర్ల నీరు.. ఈ పద్ధతిలో ఒక కిలో ఏరోజెల్ పదార్థంతో రోజుకు 17 లీటర్ల నీటిని పొందొచ్చు. ఈ పదార్థం ఒక స్పాంజ్ మాదిరిగా గాల్లోని తేమను కాస్తా నీరుగా మారుస్తుంది. ఈ పదార్థం సేకరించిన నీటిని స్పాంజ్ మాదిరిగా పిండి సేకరించాల్సిన అవసరం లేదు. తగుమోతాదులో నీరు చేరిన వెంటనే దానంతట అదే నీరు బయటకు వచ్చేస్తుంది. ఏరోజెల్‌లోని పదార్థాలు నీటి అణువులను ఆకర్షించడం.. వికర్షించడం రెండూ చేయగలగడం దీనికి కారణం. ఏరోజెల్‌ను ఎండలో ఉంచినప్పుడు దాని పనితీరు మరింత మెరుగ్గా ఉందని, సేకరించిన ఆవిరిలో 95 శాతాన్ని నీరుగా మారుస్తోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ హో గిమ్ వీ తెలిపారు. పంటకు పూత.. చీడకు చెక్! చీడపీడలు ఆశిస్తే పంట నాశనమవుతుంది. రసాయనాలతో క్రిమికీటకాలను చంపేసి పంటను కాపాడుకుందామంటే.. పర్యావరణానికి ముప్పు కలుగుతుం ది. అయితే దీనికి క్రాప్‌కోట్(పంట పూత)ను ప్రత్యామ్నాయంగా పేర్కొంటోంది కాలిఫోర్ని యాకు చెందిన స్టారప్ కంపెనీ క్రాప్ ఎన్‌హ్యాన్స్‌మెంట్! ఈ కంపెనీ తయారు చేసిన పదార్థాన్ని పంటలపై పిచికారీ చేస్తే.. చీడపీడలకు పంట అస్సలు కనపడకుండా పోతుందట! క్రాప్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ కంపెనీ చెట్ల నుంచి వెలికితీసిన ఒక పదార్థాన్ని నీటితో కలిపి వాడుతుందట. పంటలపై ఈ పదార్థాన్ని పిచికారి చేస్తే.. 12 నుంచి 24 గంటల్లో నీరు మొత్తం ఆవిరైపోతుంది. చెట్ల నుంచి వెలికితీసిన పదార్థపు పూత పంటలపై నిలిచిపోతుంది. ఈ పూత కాస్తా మొక్కలను చీడపీడలకు కనపడకుండా చేస్తాయని కంపెనీ చెబుతోంది. ఎలా అన్న ప్రశ్నకు కంపెనీ కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. కానీ... ప్రత్యేక పదార్థపు పూత పూసిన మొక్కల ఉపరితలాలను ఆహారంగా, పునరుత్పత్తి కేంద్రాలుగా క్రిమికీటకాలు గుర్తించడం లేదన్న విషయం తమకు స్పష్టమైందని కంపెనీ సీటీవో దామియన్ హాడుక్ తెలిపారు. క్రిమి కీటకాలను బట్టి పరిస్థితి మారుతోందన్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి తాము అభివృద్ధి చేసిన పూత 6 వారాల పాటు పనిచేస్తుందని వివరించారు. మొక్కలకు, జంతువులకు నష్టం లేదు! ప్రత్యేక పదార్థపు పూత పూసినప్పటికీ మొక్కల కిరణజన్య సంయోగ క్రియకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని హాడుక్ చెప్పారు. మొక్కకు, మనుషులకు, జంతువులకు ఈ పూత ద్వారా ఎలాంటి నష్టమూ ఉండదన్నారు. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, ఇండోనేసియా, ఆఫ్రికా, యూరప్‌లలో తాము క్షేత్ర స్థాయి పరిశీలనలు నిర్వహించామని చెప్పారు. -
5 కంపెనీలు.. లక్ష ఉద్యోగాలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: శాస్త్రీయ పురోగతి మూలంగా అభివృద్ధిపథంలో తెలంగాణ అగ్ర భాగాన ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరా బాద్‌లో ఏర్పాటయ్యే సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్ ద్వారా ప్రయోగశాలల్లో పురుడు పోసుకునే ఆవిష్కరణలు పౌరుల జీవితాల్లో మార్పులు తెస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్(రిచ్) ఆధ్వర్యంలో నడిచే సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్‌ను శుక్రవారం కేటీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో రాష్ట్రంలో 5 పెద్ద కంపెనీలను ఏర్పాటు చేయడం ద్వారా సంపదతోపాటు లక్ష ఉద్యోగాలు సృష్టించడంపై దృష్టి సారించామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణను లైఫ్ సైన్సెస్, వ్యవసాయం, డిజిటల్ టెక్నాలజీ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తామని పేర్కొన్నారు. రిచ్ ద్వారా రాష్ట్రంలోని జాతీయ పరిశోధనాసంస్థలు, స్టార్టప్‌లు, పౌర సంఘాలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒకేతాటిపైకి తెచ్చి స్థానికంగా నెలకొన్న సంక్లిష్ట సవాళ్లకు పరిష్కారం చూపుతామన్నారు. తద్వారా స్థానికుల జీవితాల్లో పరివర్తన సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఏరోస్పేస్, డిఫెన్స్, ఆహార, వ్యవసాయ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో రిచ్ ఆవిష్కరణ వ్యవస్థలను ఏర్పాటు చేసిందని చెప్పారు. పునరుద్ధరణీయ ఇంధనం, వ్వర్థాల నిర్వహణ, ఎమర్జింగ్ టెక్నాలజీ రంగాలకు కూడా రిచ్ తన కార్యకలాపాలు విస్తరించిందని కేటీఆర్ గుర్తు చేశారు. స్టియాక్ నిర్ణయం మేరకే మెగా క్లస్టర్ దేశంలో శాస్త్ర పరిశోధన, ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఉద్దేశంతో ప్రధానమంత్రి శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణల సలహామండలి(పీఎం స్టియాక్) నిర్ణయం మేరకు హైదరాబాద్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ కె.విజయ రాఘవన్ వెల్లడించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేస్తున్న నాలుగు నగరాల్లో ఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ, పుణే ఈ జాబితాలో ఉన్నాయన్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలను ఆధారంగా చేసుకుని మెగా క్లస్టర్లు సమర్థవంతమైన శాస్త్రీయ ఫలాలను అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడో అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా భారత్ ‘దక్షిణ, మధ్య ఆసియా దేశాల్లో అత్యంత వినూత్న దేశంగా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అగ్రస్థానానికి చేరే సత్తా భారత్‌కు ఉంది. తెలంగాణ కొత్త రాష్ట్రమైనా అన్ని రంగాల్లోనూ ఆవిష్కరణల మీద దృష్టిని కేంద్రీకరిస్తుండటంతో దేశంలోనే అత్యధిక వృద్ధిరేటును సాధిస్తోంది. అందుకే క్లస్టర్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేశాం. హైదరాబాద్‌లో 200పైగా కంపెనీలతో కూడిన అతిపెద్ద బయో క్లస్టర్ జీనోమ్ వ్యాలీ ఉంది. మరోవైపు ఫార్మా రంగానికి రాజధానిగా పేరు సంపాదించింది. దేశంలోని ఫార్మా ఉత్పత్తుల్లో 35 శాతం ఇక్కడ నుంచే వస్తున్నాయి. విత్తన రాజధానిగా, డిజిటల్ టెక్నాలజీ హబ్‌గా పేరు సంపాదించడంతోపాటు 60కి పైగా ప్రభుత్వ, బహుళ జాతి, ప్రైవేటు పరిశోధన సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి’అని విజయ రాఘవన్ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, కేంద్ర శాస్త్రీయ విభాగం కార్యదర్శి డాక్టర్ అరబింద మిత్రా, రిచ్ డైరెక్టర్ జనరల్ అజిత్ రంగ్నేకర్ పాల్గొన్నారు. -
రక్తపోటు మందుతో దీర్ఘాయువు?
రక్తపోటు నివారణకు ఉపయోగించే మందు ఆయువును పెంచేం దుకు దోహదపడుతుందని జపాన్‌లోని ఒసాకా వర్సిటీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మెటోలజోన్ అనే ఈ మందును వాడినప్పుడు కణస్థాయిలో ఆయువును పెంచే ప్రక్రియలు జరుగుతాయని, ఏలిక పాములపై ఈ మందు ప్రయోగించామని, ఇవే ఫలితాలు మానవుల్లోనూ ఇస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మైటోకాండ్రియా మన వయసు పెరిగే కొద్దీ సక్రమంగా పనిచేయదు. మైటోకాండ్రియాను మరమ్మతు చేసి ఆయువు పెంచేందుకు చాలాకాలంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మైటోకాండ్రియా సక్రమంగా పనిచేయకపోతే శరీర వ్యవస్థలో మరమ్మతు చేసేందుకు ఓ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ ప్రక్రియను మందుల ద్వారా ప్రారంభిస్తే మైటోకాండ్రియా సక్రమంగా పనిచేసి మనం ఎక్కువ కాలం సమస్యల్లేకుండా బతకొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో ఒసాకా వర్సిటీ శాస్త్రవేత్తలు ఏలికపాములపై జరిపిన పరిశోధనలకు ప్రాధాన్యమేర్పడింది. మైటోకాండ్రియా మరమ్మ తు ప్రక్రియ మొదలైనప్పుడు ఏలికపాము కాస్తా వెలుగులు చిమ్మేలా జన్యుమార్పులు చేసి.. పలు వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులను వాటిపై ప్రయోగించారు. మెటోలజోన్ అనే రక్తపోటు మందు వాడినప్పుడు ఏలికపాముల్లో మైటోకాండ్రియా మరమ్మతు ప్రక్రియ ప్రారంభమైందని, వాటి జీవన కాలమూ పెరిగిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కేజ్ నకాడై తెలి పారు. మైటోకాండ్రియా మరమ్మతు ప్రక్రియకు ఉపయోగపడే హెచ్ఎస్పీఏ–6 జన్యువు ఉత్తేజితం అవుతున్నట్లు తెలిసింది. చలిలో వ్యాయామం.. వేగంగా కరిగేను కొవ్వు! చలి ఎక్కువవుతున్న కొద్దీ మనలో చాలామంది దుప్పట్లు కప్పేసుకుంటాం. ఉదయా న్నే చేసే వ్యాయామానికి సెలవులు ప్రకటించుకుంటాం. కానీ చలి వాతావరణంలో వ్యాయామం చేయడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుందని చెబుతోంది కెనెడాలోని లారెన్షియన్ యూనివర్సిటీ పరిశోధన. మీరెప్పుడైనా హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ) గురించి తెలుసా..? వ్యాయామం చేసే తీరులో ఇదో పద్ధతి. కొన్ని నిమిషాల పాటు తీవ్రస్థాయిలో వ్యాయామం చేయడం ఆ తర్వాత కొంత విరామం.. తక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామం ఇలా సాగుతుంది ఈ హెచ్ఐఐటీ. కొవ్వులను వేగంగా కరిగించేందుకు ఇది మేలైన వ్యాయామం అని ఇటీవల ప్రాచుర్యం పొందింది. ఈ వ్యాయామంపై ఉష్ణోగ్రతల ప్రభావం ఏంటన్నది తెలుసుకునేందుకు లారెన్షియన్ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. పరిసరాల ఉష్ణోగ్రత 21ల డిగ్రీ సెల్సియస్‌గా ఉన్నప్పుడు హెచ్ఐఐటీ చేస్తున్న వారితో పోలిస్తే సున్నా డిగ్రీ సెల్సియస్‌లో అంటే నీరు గడ్డకట్టే పరిస్థితుల్లో వ్యాయామం చేసే వారిలో కొవ్వులు ఆక్సీకరణం చెందే వేగం దాదాపు 3.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. జీవక్రియల విషయంలోనూ చలి వాతావరణంలో చేపట్టిన హెచ్ఐఐటీ ప్రభావశీలంగా ఉందని, రక్తంలో చక్కెర మోతాదుల నియంత్రణకు, కొవ్వులు కరిగేందుకు, హానికారక ట్రైగ్లిజరైడ్స్ తగ్గేందుకూ ఇది ఉపయోగపడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
శభాష్ షంషేర్.. నీ సేవలు అద్భుతం..
శోకం నుంచి శ్లోకం పుట్టిందట. షంషేర్ ఆవేదన, ఆలోచనల్లో నుంచి పుట్టిందే... ఎర్లీ రిస్క్ వోరల్ క్యాన్సర్ డిటెక్టర్ క్విట్‌పఫ్. పదమూడు సంవత్సరాల వయసు నుంచే అద్భుతాలు చేస్తున్న నిఖియ షంషేర్ పరిచయం... స్కూల్ప్రాజెక్ట్లో భాగంగా క్యాన్సర్ హాస్పిటల్‌కు వెళ్లింది పద్నాలుగు సంవత్సరాల నిఖియ షంషేర్. అక్కడ ఒక వార్డ్‌లో నోటిక్యాన్సర్ పేషెంట్‌ను చూసింది. అతడి దవడ సగం తీసేశారు. మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతను బతకడం కష్టమట...ఈ దృశ్యం షంషేర్‌ను కదిలించింది, చాలాకాలం వెంటాడింది. నోటి క్యాన్సర్ గురించి అధ్యయనం మొదలుపెట్టింది. కొత్త కొత్త విషయాలు తెలిశాయి. పేద,మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే దేశాల్లో నోటి క్యాన్సర్ ఎక్కువగా ఉంది. మన దేశంలో నోటి క్యాన్సర్ బారిన పడుతున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. పొగాకు వినియోగం, మద్యం సేవించడం, వక్క నమలడం....మొదలైనవి ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలవుతున్నాయి. మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం వల్ల మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి మాత్రమే కాదు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి వారిని సమస్యల వలయంలో నెడుతున్నాయి. వ్యాధిని ముందుగా గుర్తించడం కోసం రొటిన్ చెకప్‌లకు వెళ్లే అలవాటు మనలో చాలామందికి లేదు. ప్రారంభదశలో గుర్తించగలిగితే వ్యాధిని సమర్థవంతంగా నయం చేయవచ్చు అంటున్నాయి పరిశోధనలు. ప్రమాదఘంటికలు మోగుతున్న దశలోనే జాగ్రత్తపడే సాధనాన్ని కనిపెడితే? అలా షంషేర్ పరిశోధనల్లో నుంచి పుట్టుకు వచ్చిన సాధనమే ‘క్విట్‌పఫ్’ అనే ఎర్లీ రిస్క్ వోరల్ క్యాన్సర్ డిటెక్టర్. రిస్క్‌లో ఉన్నామా? ఉంటే ఈ ఏ దశలో ఉన్నాం? అనేది ఈ ‘క్విట్‌పఫ్’ కనిపెడుతుంది. దీనివల్ల మిడిల్ నుంచి హైరిస్క్ ఉన్నవాళ్లు వెంటనే వైద్యుడిని సంప్రదించడానికి వీలవుతుంది. ‘క్విట్‌పఫ్ లక్ష్యం పొంచి ఉన్న ప్రమాదం గురించి హెచ్చరించడం మాత్రమే కాదు అలవాట్లలో మార్పు తీసుకురావడం కూడా’ అని చెబుతోంది బెంగళూరులోని ‘గ్రీన్వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్’ విద్యార్థి అయిన షంషేర్. అయితే ఈ ‘క్విట్‌పఫ్’ ప్రయాణం నల్లేరు మీద నడక కాలేదు. ఎన్నోసార్లు ప్రయోగం విఫలం అయింది. ఒక దశలో నిరాశ కమ్మేసేది. మళ్లీ ఉత్సాహం కొని తెచ్చుకొని ప్రయోగాల్లో మునిగిపోయేది షంషేర్. మొత్తానికైతే సాధించింది! ప్రయోగదశలో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. షంషేర్ మాటలు విని తేలిగ్గా తీసుకునేవాళ్లే. అనుమతి ఇచ్చే వాళ్లు కాదు. ఆమె చిన్నవయసులో ఉండడం దీనికి కారణం. ఎట్టకేలకు బెంగళూరులోని ‘విక్టోరియా హాస్పిటల్’లో అనుమతి దొరికింది. 500 మందికి పైగా క్రానిక్ స్మోకర్లు, నాన్స్మోకర్లపై పరీక్షలు నిర్వహించింది. ‘క్విట్‌పఫ్’ అనుకున్న ఫలితాలను ఇస్తోంది. రాబోయే సంవత్సరాల్లో ఇది మార్కెట్లో అందుబాటులో ఉండబోతుంది. ఈలోపు మరిన్ని మెరుగులు దిద్దే పనిలో ఉంది. ఒక వైపు చదువు, మరోవైపు ‘క్విట్‌పఫ్’ ప్రాజెక్ట్‌పై పనిచేయడానికి షంషేర్ చాలా కష్టపడాల్సి వచ్చింది. రిసెర్చ్గ్రాంట్, తనకు వచ్చిన అవార్డ్ సొమ్మును ప్రాజెక్ట్ కోసం ఉపయోగించింది. ఒక క్లాసులో 50 మంది విద్యార్థులు ఒకే పాఠ్యపుస్తకాన్ని షేర్ చేసుకోవడం, చెప్పులు లేకుండా స్కూలుకు వచ్చే విద్యార్థులు, స్కూలు బ్యాగు కొనలేని పేద విద్యార్థులను చూసింది షంషేర్. ప్రయోగసహితంగా పాఠ్యబోధన జరిగితే వచ్చే ఫలితం బాగుంటుందనేది నమ్మకం కాదు శాస్త్రీయ నిజం. దురదృష్టవశాత్తు చాలా స్కూళ్లల్లో ‘పాఠ్యబోధన’ అనేది ఏకధాటి ఉపన్యాసం అవుతుంది. క్లాసుల్లో ఒక్క ప్రయోగం కూడా జరగలేదు. దీంతో చాలామంది విద్యార్థులు పరీక్ష తప్పారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. చివరికి చదువుకు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి వచ్చింది. దీని నుంచి మార్పు తీసుకురావడానికి పదమూడు సంవత్సరాల వయసులోనే ఫిలోంత్రపిక్ ప్రాజెక్ట్ ‘యెర్న్ టు లెర్న్’ చేపట్టింది. తల్లిదండ్రులు, స్నేహితులు, స్వచ్ఛంద కార్యకర్తల సహాయంతో స్కూళ్లలో సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్‌ల ఏర్పాటుకు కృషి చేసింది. దీనివల్ల ఎంతోమంది విద్యార్థుల చదువు మెరుగుపడింది. తన ఇ–కామర్స్ వైబ్‌సైట్ ‘క్నిక్నాక్స్’ ద్వారా వచ్చిన ఆదాయంలో వందశాతం సేవాకార్యక్రమాలకు ఉపయోగిస్తుంది. టీనేజర్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే గ్లోబల్ సైన్స్ కాంపిటీషన్ ‘జూనియర్ ఛాలేంజ్’లో టాప్‌స్కోరర్‌గా నిలిచింది. తన ఫేస్బుక్ పేజీలో ‘స్పేస్‌టైమ్ అండ్ గ్రావిటీ’పై చేసిన వీడియో పోస్ట్‌కు అనూహ్య స్పందన వచ్చింది. తాను చేస్తున్న సేవాకార్యక్రమాలకు ‘డయానా లెగసీ అవార్డ్’ ‘ఔట్‌స్టాండింగ్ యూత్ ఎకనామిక్ సిటిజన్‌షిప్’ (జర్మనీ) అవార్డ్...మొదలైన ప్రతిష్ఠాత్మకమైన అవార్డులతో పాటు ప్రజల హృదయాలను గెలుచుకున్న షంషేర్‌కు అభినందనలు తెలియజేద్దాం. -
2020 పేరు చెబితే మానవాళికి గుర్తొచ్చేది కరోనా..
2020 పేరు చెబితే మానవాళికి గుర్తొచ్చేది, ప్రాణాంతకమైన వైరస్ విజృంభణ. అది సృష్టించిన కల్లోలం కారణంగా ప్రపంచం ఛిన్నాభిన్నమై సుమారు 15 లక్షల మంది మృత్యు వాత పడ్డారు. ప్రపంచం యావత్తూ కనీవినీ ఎరుగని ఆర్థిక వినాశనాన్ని చవిచూసింది. దాన్ని అదుపులోకి తేవడం, మానవాళిని కాపాడటం లక్ష్యంగా సైన్స్ ఎలా పరుగులు తీసిందో, పరిశోధన, అభివృద్ధికి ప్రపంచ భాగస్వామ్యాలు ఏవిధంగా దోహదపడ్డాయో మానవాళి గుర్తుంచుకుంటుంది. ఈ నేపథ్యంలో 2020ని సైన్స్ సంవత్సరంగా అభివర్ణించాలి. కోవిడ్–19 కారణంగా మానవాళి అత్యుత్తమ సామర్థ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. మహమ్మారి వ్యాపిస్తున్న కొద్దీ దాని ప్రభావాన్ని తగ్గించేందుకు పరిశోధన ప్రయత్నాలు వేగం అందుకున్నాయి. మానవాళి భద్రతతో ఎలాంటి రాజీ పడకుండానే ఆ మహ మ్మారిని నిలువరించే చికిత్సలు, వ్యాక్సిన్లు, డయాగ్నస్టిక్స్ అభివృద్ధి చేయడంలో ప్రపంచస్థాయి భాగస్వామ్యాలు ఏర్పాటైనాయి. ప్రభుత్వం, వ్యాపార సంస్థలు, దాతృత్వ సంస్థలు చేయి కలిపి ఈ ప్రయత్నం అంతటికీ అవసరం అయిన వనరులు కూడగట్టడం ప్రారంభించాయి. అందుకే ఒక్క సైన్స్ మాత్రమే కాదు, అంతర్జాతీయ భాగ స్వామ్యాలు కూడా ఈ ఏడాదిలో చెప్పుకోదగినవని నేనంటాను. మానవాళి జీవితాలను కాపాడటానికి దోహదపడే విజయాలు సాధించినందుకు మాత్రమే కాదు, కనీవినీ ఎరుగని వేగంతో ప్రయత్నాలు చేసేందుకు అంకితభావం ప్రదర్శించినందుకు కూడా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను అభినందించాలి. శాస్త్రవేత్తలు తమ వ్యక్తిగత పురస్కారా లకన్నా బృందకృషికి పెద్దపీట వేశారు. ఎలాంటి వేగాన్నయినా మనం అందుకోగలమనీ, వేగం వల్ల నాణ్యత దెబ్బ తినదనీ శాస్త్రవేత్తలు నిరూపించారు. శాస్త్ర, ఆరోగ్య సంరక్షణ భాగస్వామ్యాల ఫలాలు అందరికీ సమానంగా అందాలని నేను భావిస్తాను. మనం మరింత సమానత్వం గల ప్రపంచాన్ని సృష్టించుకుని ప్రతీ ఒక్కరికీ ఆ ఫలాలు అందేలా చూడాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక మండలి చైర్మన్ హోదాలో నేను ఈ అంశంపై అన్ని దేశాలు, నిధులు అందిస్తున్న ఏజెన్సీలు, శాస్త్రవేత్తలు, దాతలతో చర్చిస్తున్నాను. ఇది మనందరి నిబద్ధత. ఈ మహమ్మారి సమయంలో సైన్స్ కమ్యూనిటీ యావత్తూ సామాజిక సమస్యలను పరిష్కరించే దిశగా అలుపు లేకుండా స్థిరమైన చర్యలు చేపట్టింది. గత ఆరున్నర సంవత్సరాల కాలంగా మా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో సాధించిన విజయం– శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇన్నోవేటర్ల ప్రయత్నాల ఫలమేనని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ విజయానికి చిహ్నంగానే 2015 సంవత్సరం నుంచి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) నిర్వహిస్తున్నాం. మన జీవితాల నాణ్యత పెంచడానికి అవసరమైన పరిష్కారాలు అందించే విషయంలో ‘సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత శాస్త్రాలు’ (స్టెమ్) సాధించిన పురోగతిని ప్రజలకు తెలియజేసి వారందరినీ ఇందులో భాగస్వా ములను చేయడం ఐఐఎస్ఎఫ్ నిర్వహణ లక్ష్యం. సైన్స్ అధ్యయనం మరింత ప్రయోజనకరంగా ఉండేందుకు వీలుగా ప్రజల్లో ఉత్సుకతను పెంచడం కోసం విజ్ఞాన భారతి (విభా) సహకారంతో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఎర్త్ సైన్సుల మంత్రిత్వ శాఖలు ఈ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశాయి. శాస్త్రీయ స్ఫూర్తిని ప్రజ్వరిల్లచేసేందుకు ప్రత్యేకంగా విద్యార్థి సమాజానికి చేరువ కావడం ఈ ఉత్సవం లక్ష్యం. ఒక చిన్న ప్రయత్నంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు విద్యార్థులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, మీడియా, సాధారణ ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ, అందరూ ఎదురుచూసే ఒక వార్షిక శాస్త్రీయ సమ్మేళనంగా పరిణతి చెందింది. విభిన్న సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన ప్రజలందరూ వచ్చి జీవశాస్త్రాల విభాగంలో జరుగుతున్న కార్యక్రమాలు, సాధించిన విజయాలు, వస్తున్న ఆవిష్కరణలపై ప్రత్యక్ష అనుభవం పొందేలా చేస్తున్న బహిరంగ ప్రజావేదిక ఇది. ప్రతీ సంవత్సరం ఇది మరింత పెద్దదిగా, మెరుగైనదిగా విస్తరిస్తూ ఉండటం నాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది. అందరూ ఎంతో ఉత్సుకతతో ఎదురుచూసే సైన్స్ కార్యక్రమంగా ఇది రూపాంతరం చెందింది. ఇందులో జరుగుతున్న శాస్త్రీయ కార్యక్రమాలు ప్రపంచ రికార్డులను ఛేదించి ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పేజీల్లో స్థానం సంపాదించాయి. ఈ ఏడాది డిసెంబర్ 22 నుంచి 25 వరకు వర్చువల్ విధానంలో జరుగుతోంది. శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్ఐఆర్) ఆధ్వర్యం లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ (సీఎస్ఐఆర్–నిస్టాడ్స్) ఈ భారీ ఆన్లైన్ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. స్వయంసమృద్ధ భారతదేశాన్ని ఆవిష్కరించి, తద్వారా ప్రపంచ సంక్షేమానికి తోడ్పాటు అందించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘స్వయంసమృద్ధ భారత్, ప్రపంచ సంక్షేమం కోసం సైన్స్’ అనే ప్రధాన థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన దేశానికి గల సున్నితమైన శక్తిని ప్రపంచానికి చాటడం కోసమే నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతోంది. యువ శాస్త్రవేత్తలను ఆకర్షించేం దుకు స్టెమ్ నిర్వహించే వివిధ కోర్సులకు చెందిన 41 విభిన్న కార్యక్రమాలను ఇందులో చేర్చడం జరిగింది. 2020 సంవత్సరం కోవిడ్–19 వ్యాక్సిన్ల పరిశోధన సంవత్సరం అయితే, ప్రపంచవ్యాప్తంగా అది అత్యంత అవసరం అయిన ప్రజలు దాన్ని ఏవిధంగా అధిగమించారో తెలియజేసే సంవత్సరం 2021. ఈ ఉత్సవం సందర్భంగా మనం ఈ మహమ్మారిని తుదముట్టించేందుకు మనం చేస్తున్న ప్రయత్నాలు రెట్టింపు చేయడానికీ, జీవితాలను కాపాడే సైన్స్‌లో సహకారాన్ని మరింతగా పెంచడానికీ ప్రతిజ్ఞ చేద్దాం. 2020 సంవత్సరం కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించివుండొచ్చు, అయినా శాస్త్రీయ విజయగాథకు కూడా అది ప్రతీక. మానవాళి ఎదుర్కొనే ముప్పును నిలువరించేందుకు శాస్త్రవేత్తలు ఎంత దీటుగా స్పందించారన్నది ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంది. కోవిడ్–19కి సంబంధించిన పరీక్షలు, చికిత్సలు, వ్యాక్సిన్లు అన్నీ అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు చేరేలా చూడటమే ఇప్పుడు మన ముందున్న సవాలు. ఈ ఏడాది వ్యాక్సిన్లు, పరీక్షలు, చికిత్సలపై శక్తియుక్తులన్నీ ధారపోసి కృషి చేసిన శాస్త్రవేత్తలందరినీ గొంతెత్తి అభినందిస్తున్నాను. డాక్టర్ హర్షవర్ధన్ వ్యాసకర్త కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి -
డయాబెటిస్‌కు.. టెస్టోస్టిరాన్‌కు లింకు!
ఆస్ట్రేలియా: పురుష హార్మోన్ టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్లతో మధుమేహం బారిన పడకుండా నివారించొచ్చా..? అది సాధ్యమే అంటున్నారు ఆస్ట్రేలియాలోని అడిలైడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. సుమారు వెయ్యి మందిపై తాము ప్రయోగాలు నిర్వహించి ఈ అంచనాకు వచ్చామని చెబుతున్నారు. ఈ స్థాయిలో ఇదివరకు ఎన్నడూ ప్రయోగాలు జరగలేదని పేర్కొంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈ పురుష హార్మోన్ స్థాయి తక్కువగా ఉన్న వారు మధుమేహం బారిన పడొచ్చని ఇప్పటికే కొన్ని పరిశోధనలు స్పష్టం చేశాయి. టెస్టోస్టిరాన్ తక్కువగా ఉన్నప్పుడు లైంగిక కోరికలు తగ్గడంతో పాటు కండరాలు బలహీనపడతాయి. ఎముకలు గుల్ల బారడమూ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అడిలైడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధనలు చేశారు. 50 నుంచి 74 ఏళ్ల మధ్య వయసున్న సుమారు వెయ్యి మందిని ఎంపిక చేసి.. రెండు గుంపులుగా విడదీశారు. ప్రయోగాలకు ఎంపికైన వారందరూ అధిక బరువు లేదా ఊబకాయం సమస్యతో బాధపడుతున్న వారే. ఒక వర్గానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్ ఇచ్చారు. వెయ్యి మంది అనుసరించేందుకు కొన్ని వ్యాయామాలను సూచించారు. రెండేళ్ల పరిశీలనల తర్వాత పరిశీలించగా ఇరు వర్గాల్లోని వారు సగటున నాలుగు కిలోల బరువు తగ్గారు. సుమారు 22 శాతం మందిలో ఎర్ర రక్త కణాల సంఖ్య ఎక్కువయ్యాయి. రెండో గుంపు వారిలో 21 శాతం మంది మధుమేహం బారిన పడగా.. టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్లు తీసుకున్న వారిలో 12 శాతం మందికి మాత్రమే మధుమేహం వచ్చింది. హార్మోన్ తీసుకున్న వారి రక్తంలో చక్కెర మోతాదు గణనీయంగా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి మధుమేహం నుంచి తప్పించుకునేందుకు కొంతమందికి టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్లు ఓ మార్గం కావచ్చని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. కొత్త సోలార్ సెల్స్ భలే! ఖరీదైన సిలికాన్‌తో తయారయ్యే సోలార్సెల్స్కు సమర్థమైన ప్రత్యామ్నాయం లభించింది.పెరోవెక్సైట్ అనే వినూత్న పదార్థంతో తయారు చేసిన సరికొత్త సోలార్ సెల్స్ ఏకంగా 30 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నట్లు తాజా పరిశోధనల ద్వారా స్పష్టమైంది. నిజానికి పెరోవెస్కైట్ అనేది ఇటీవలే గుర్తించిన పదార్థమేమీ కాదు. దశాబ్దకాలం కిందటే దీన్ని సౌరశక్తి ఉత్పత్తికి వినియోగించొచ్చని గుర్తించారు. కాకపోతే అప్పట్లో ఈ పదార్థంతో తయారైన సోలార్ సెల్స్ సామర్థ్యం చాలా తక్కువగా ఉండేది. పెరోవెస్కైట్ ప్రత్యేకత ఏంటంటే.. చాలా చౌకగా లభిస్తుంది. దృశ్య కాంతి నుంచి పరారుణ కిరణాల వరకు అన్ని రకాల రేడియోధార్మికతను శోషించుకుని విద్యుత్తుగా మార్చగలదు. సిలికాన్ మాదిరిగా తయారీ కష్టం కాదు. ఎక్కడ కావాలంటే అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జర్మనీలోని హెల్మ్హోల్ట్ –జెంట్రమ్ శాస్త్రవేత్తలు తయారు చేసిన పెరోవెక్సైట్ సోలార్ సెల్స్ 30 శాతం సామర్థ్యాన్ని సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఐదేళ్ల కింద ఈ సెల్స్ సామర్థ్యం 13.7 శాతం మాత్రం ఉంది. -
ఉటా ఎడారిలో మిస్టరీ దిమ్మె!
అమెరికా: ఉటా ఎడారిలో అకస్మాత్తుగా ఓ లోహపు దిమ్మె ప్రత్యక్షమైంది. ఎక్కడి నుంచి ఊడిపడిందో ఎవరికీ తెలియదు కానీ.. ఇది సుమారు 12 అడుగుల పొడవుందని ఉటా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ వాళ్లు ప్రకటించారు. ఎడారి ప్రాంతంలోని అడవి గొర్రెల సంతతిని లెక్కించేందుకు గత బుధవారం తాము హెలికాప్టర్లో సర్వే నిర్వహించిన ప్పుడు ఉటా నైరుతి దిక్కున ఎర్ర రాళ్ల మధ్య ఈ లోహపు దిమ్మె కనిపించిందని అధికారులు తెలిపారు. ఈ దిమ్మెను అక్కడికి ఎవరు తెచ్చారో? ఎలా తెచ్చారో తెలియలేదని, అక్కడ పాతిన ఆనవాళ్లూ ఏవీ కనిపించ లేదన్నారు. ఈ దిమ్మె కచ్చితంగా ఎక్కడుందో చెప్పేందుకు కూడా అధికారులు ఇష్టపడటం లేదు. ఎందుకంటే మనుషులు వెళ్లలేని ప్రాంతంలో అది ఉందని, ఒకవేళ ఎవరైనా వెళ్లినా వాళ్లను రక్షించేందుకు మళ్లీ తామే వెళ్లాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అచ్చం ఆ సినిమాలో ఉన్నట్లే... ఉటా ఎడారిలో గుర్తించిన లోహపు దిమ్మె అచ్చం 1968లో విడుదలైన ‘‘2001: ఎ స్పేస్ ఒడెస్సీ’’ చిత్రంలో గ్రహాంతర వాసులకు చెందినదిగా చూపిన నిర్మాణం మాదిరిగానే ఉండటంతో ఈ వార్తపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఉటా హైవే ఫేస్బుక్ పేజీలో ఈ మిస్టరీ నిర్మాణంపై పలువురు హాస్యాన్ని జోడించి మరీ కామెంట్లు పెట్టారు. మరోవైపు ఈ నిర్మాణంపై అధికారులు స్పందిస్తూ ఇది చట్ట వ్యతిరేకమని, తగిన అనుమతుల్లేకుండా ఇలా ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేయడం ఎర్త్ లాను ఉల్లంఘించడమేనని హెచ్చరిస్తున్నారు. ఆ దిమ్మె ఏమిటి? అక్కడకు ఎలా వచ్చిందన్నది ప్రస్తుతానికైతే మిస్టరీనే! స్ప్రే చేస్తే చాలు.. కదులుతాయి! శరీరం లోపలి భాగాలకు నేరుగా మందులు అందించేందుకు హాంకాంగ్ సిటీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. అయస్కాంత పదార్థపు స్ప్రేతో ఏ వస్తువునైనా మిల్లీ రోబోగా మార్చేయగలగడం ఇందులోని కీలక అంశం. పాలివినైల్ ఆల్క హాల్, గ్లుటెన్, ఇనుప రజనుతో తయారైన ఈ స్ప్రే చేసిన వస్తువును శరీరంలో కావాల్సిన చోటికి నడిపించవచ్చు లేదా దొర్లేలా చేయవచ్చు. పాక్కుంటూ కూడా వెళ్లగలదు. కేవలం మిల్లీమీటర్లో నాలుగో వంతు మందం ఉండే ఈ స్ప్రేను మాత్రలపై ఉప యోగించడం ద్వారా మందులను నేరుగా శరీర భాగాలకు ఇవ్వాలన్నది తమ ఆలోచన అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ షెన్ యాజింగ్ తెలిపారు. ఎం–స్ప్రే అని పిలిచే ఈ కొత్త పదార్థం శరీరంలోకి ప్రవేశించిన తరువాత అవసరమైన సమయంలో తనంతట తానే నాశనమై వ్యర్థంగా బయటకు వచ్చేస్తుంది. గమనాన్నీ నియంత్రించొచ్చు.. అంతేకాదు.. ఎం–స్ప్రే కోటింగ్ ఉన్న వస్తువు ఏ రకంగా ప్రయాణించాలో నిర్ణయించవచ్చని, అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి కోటింగ్‌పై కణాల అమరికను మార్చడం ద్వారా ఇది సాధ్యమని యాజింగ్ వివరిస్తున్నారు. కొన్ని మాత్రలకు తాము ఈ కోటింగ్ ఇచ్చి ఎలుకలపై ప్రయోగించామని, ఆ తరువాత ఇవి ఎలుకల శరీరంలో ఎలా ప్రయాణించాయో స్పష్టంగా గమనించగలిగామని, కావాల్సిన ప్రాంతానికి చేరుకోగానే కోటింగ్ కరిగిపోయి మందు మాత్రమే విడుదలైందని చెప్పారు. ఈ స్ప్రేను వైద్య రంగంలో ఉపయోగించడమే కాకుండా మిల్లీ రోబోల తయారీ ద్వారా కదిలే సెన్సర్లుగానూ వాడుకోవచ్చునని యాజింగ్ అంటున్నారు. గుండెజబ్బుల చికిత్స కోసం శరీరంలోకి చొప్పించే క్యాథిటర్ను కూడా ఈ కోటింగ్ ద్వారా నియంత్రించవచ్చని తెలిపారు. -
క్రిస్పర్ క్యాస్–9తో.. కేన్సర్‌కు చెక్
సాక్షి, హైదరాబాద్: కేన్సర్‌పై పోరులో ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. జన్యు ఎడిటింగ్ టెక్నాలజీ క్రిస్పర్ క్యాస్–9 సాయంతో కేన్సర్ కణాలను విజయ వంతంగా మట్టుబెట్ట గలిగారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాలు విజయవంతమైన నేపథ్యంలో ఇంకో రెండేళ్లలోనే ఈ కొత్త పద్ధతిని మానవ వినియో గానికి సిద్ధం చేస్తామని ఇజ్రాయెల్ శాస్త్రవేత్త డాన్ పీర్ పేర్కొన్నారు. ఇదే జరిగితే కేన్సర్ చికిత్సకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న కీమోథెరపీ చరిత్ర పుటల్లో కలిసిపోతుందని అంచనా. దుష్ప్రభావాలు ఉండవు... మన జన్యువుల్లో అవసరానికి తగ్గట్లు మార్పుచేర్పులు చేసుకొనేందుకు క్రిస్పర్ క్యాస్–9 ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీని ఇప్పటికే అరుదైన వ్యాధుల చికిత్స కోసం ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెల్ అవీవ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాన్ పీర్ ఈ టెక్నాలజీని కేన్సర్ చికిత్సకు ప్రయోగా త్మకంగా వాడి విజయం సాధించారు. పైగా ఈ టెక్నాలజీ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవని, కేన్సర్ కణాలు మాత్రమే మరణించేలా డీఎన్ఏలో మార్పులు చేయగలిగామని డాన్ పీర్ తెలిపారు. ఇంకోలా చెప్పాలంటే ఇదో అందమైన కీమోథెరపీ అని ఆయన అభివర్ణించారు. పరిశోధన వివరాలు సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురితమ య్యాయి. ఈ పద్ధతిని ఉపయోగించి కేన్సర్ కణాలను చంపేస్తే మరోసారి వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉండదని డాన్ పీర్ తెలిపారు. ఆయుష్షు పెరుగుతుంది.. క్రిస్పర్ క్యాస్–9 సాయంతో తాము అభివృద్ధి చేసిన కేన్సర్ చికిత్స వల్ల కేన్సర్ రోగుల జీవితకాలం మరింత పెరుగుతుందని, మూడుసార్లు ఉపయోగిస్తే చాలు.. ఈ టెక్నాలజీ కేన్సర్ కణతిని నాశనం చేయవచ్చని డాన్ పీర్ చెబుతున్నారు. కేన్సర్ కణాల డీఎన్ఏను ఈ టెక్నాలజీ ద్వారా కత్తిరించవచ్చని, ఫలితంగా ఆ కణాలు మరణిస్తాయని తెలిపారు. ప్రస్తుతం కేన్సర్ చికిత్సకు ఉపయోగించే కీమోథెరపీతో అనేక దుష్ప్రభావాలు ఉంటా యని, క్రిస్పర్ క్యాస్–9 టెక్నాలజీతో ఆ సమస్య లేదని స్పష్టం చేశారు. మెదడు, గర్భాశయ కేన్సర్లు ఉన్న వందలాది ఎలుకలపై తాము పరిశోధనలు చేపట్టామని, చికిత్స అందుకున్న ఎలుకల జీవితకాలం.. కంట్రోల్ గ్రూపులోని ఎలుకల కంటే రెండు రెట్లు ఎక్కువైందని పీర్ వివరించారు. అన్ని రకాల కేన్సర్లకు ఈ టెక్నాలజీని ఉపయోగించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని, అన్నీ సవ్యంగా సాగితే రెండేళ్లలో ఇది మానవ వినియోగానికి అందుబాటులోకి వస్తుందని వివరించారు. రోగి శరీరం నుంచి సేకరించిన పదార్థం (బయాప్సీ) ఆధారంగా సాధారణ ఇంజెక్షన్ ద్వారా చికిత్స కల్పించవచ్చా? లేక కణతిలోకి నేరుగా ఇంజెక్షన్ ఇవ్వాలా? అన్నది తెలుస్తుందని వివరించారు. జన్యువుల సూచనలను ప్రొటీన్లుగా మార్చే ఎంఆర్ఎన్ఏను ఈ టెక్నాలజీలో కత్తెరల మాదిరిగా వాడుకుంటామని, కేన్సర్ కణాలను గుర్తించే నానోస్థాయి కొవ్వు పదార్థాలను కూడా కలిపి ఇంజెక్షన్ ఇస్తామని చెప్పారు. -
4జీ సేవలు.. డిజిటల్ భారతం
భారత్‌లో ఇంటర్నెట్ సేవలు పాతికేళ్ల కిందట ప్రారంభమయ్యాయి. అప్పట్లోనే మొబైల్ఫోన్లూ వాడుకలోకి వచ్చాయి. తొలినాళ్లలో సంపన్నులకే పరిమితమైన ఇంటర్నెట్, మొబైల్ సేవలు అనతికాలంలోనే దేశంలోని సామాన్యులకూ అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో 2008 చివర్లో 3జీ నెట్వర్క్ సేవలు ప్రారంభం కావడంతో స్మార్ట్ఫోన్లు వాడుకలోకి వచ్చాయి. స్మార్ట్ఫోన్లలోనే నేరుగా ఇంటర్నెట్ వాడుకునే సౌలభ్యం ఉండటంతో సోషల్ మీడియా శరవేగంగా విస్తరించడం మొదలైంది. కాలక్రమంలో 4జీ సేవలు కూడా అందుబాటులోకి రావడంతో ‘డిజిటల్’ వేగం మరింతగా పెరిగింది. ప్రపంచమంతా డిజిటల్‌మయంగా మారుతుండటంతో భారత ప్రభుత్వం 2015లో ‘డిజిటల్ ఇండియా’ ప్రచారం ప్రారంభించింది. దేశంలో స్మార్ట్ఫోన్ల వాడకం కూడా మొదలైంది. గడచిన ఐదేళ్లలో దేశంలో డిజిటల్ పరుగు మరింతగా వేగం పుంజుకుంది. తాజా లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి నాటికి ప్రస్తుతం మన దేశంలో మొబైల్ఫోన్లు వాడుతున్న వారు 106 కోట్ల మంది ఉంటే, ఇంటర్నెట్ యూజర్లు 68.76 కోట్ల మంది ఉన్నారు. దేశ జనాభాలో దాదాపు 78 శాతం మంది వద్ద మొబైల్ ఫోన్లు ఉన్నాయి. గత ఏడాది జనవరి నాటితో పోల్చుకుంటే దేశంలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 1.50 కోట్లు (1.4 శాతం) తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఈ ఏడాది వ్యవధిలో దేశంలో సోషల్ మీడియా యూజర్ల సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం. గత ఏడాదితో పోల్చుకుంటే, ఈ ఏడాది సోషల్ మీడియా యూజర్ల సంఖ్య ఏకంగా 13 కోట్లు (48 శాతం) పెరిగింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికి పైగా సోషల్ మీడియా యూజర్లు ఉన్నారు. సోషల్ మీడియా యూజర్ల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ప్రజల్లో పెరిగిన చైతన్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నింగి నుంచి నేల మీదకు... దేశంలో మొబైల్ సేవలు ప్రారంభమైనప్పుడు ధరలు విపరీతంగా ఉండేవి. తొలిసారిగా 1995లో ఈ సేవలు మొదలైనప్పుడు ప్రీపెయిడ్ సిమ్‌కార్డు కోసమే రూ.4,900 వెచ్చించాల్సి వచ్చేది. కాల్ ధర నిమిషానికి రూ.17 ఉండేది. ఔట్గోయింగ్కే కాదు, ఇన్కమింగ్ కాల్‌కు కూడా ఇదే ధర. తొలిసారిగా దేశంలో ఈ సేవలు ప్రారంభమైనప్పుడు కోల్‌కతాలోని రైటర్స్ బిల్డింగ్ (పశ్చిమ బెంగాల్ సచివాలయం) నుంచి అప్పటి ముఖ్యమంత్రి జ్యోతి బసు ఢిల్లీలోని సంచార్ భవన్లో ఉన్న నాటి టెలికం మంత్రి సుఖ్‌రామ్‌కు తొలి మొబైల్ ఫోన్‌కాల్ చేశారు. అప్పట్లో రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సమాజంలోని అత్యంత సంపన్నులు మాత్రమే మొబైల్ఫోన్లతో కనిపించేవారు. తొలినాటి మొబైల్ ఫోన్లన్నీ బేసిక్ ఫోన్లే. వాటి ద్వారా కాల్ చేసుకోవడానికి, ఎస్ఎంఎస్ పంపుకోవడానికి తప్ప మరే వెసులుబాటూ ఉండేది కాదు. అయినా, అప్పట్లో వాటి ధరలు చుక్కలను తాకేవి. తొలినాటి మొబైల్ హ్యాండ్సెట్లలో భద్రతాపరమైన లోపాలూ ఉండేవి. వాటిలో ఎలాంటి ట్రాకింగ్ సౌకర్యం ఉండేది కాదు. చోరీలకు గురైన మొబైల్ ఫోన్లను తిరిగి పొందటం కల్లగానే ఉండేది. దేశంలో క్రమంగా మొబైల్ఫోన్లకు, సిమ్‌కార్డులకు డిమాండ్ పెరుగుతూ వస్తున్న రోజుల్లో మొబైల్ఫోన్లు, సిమ్‌కార్డుల స్మగ్లింగ్ కూడా బాగానే జరిగేది. స్మగుల్డ్ హ్యాండ్ సెట్లు కస్టమ్స్ కళ్లుగప్పి మార్కెట్లోకి రావడంతో, సహజంగానే వాటి ధర సగానికి సగం తక్కువగా ఉండేది. ‘సిమ్’కార్డులతో జీఎస్ఎం సేవలు కొనసాగుతుండగానే, 2002లో ‘సిమ్’ అవసరం లేని సీడీఎంఏ సేవలు మొదలయ్యాయి. రిలయన్స్, టాటా, హచ్ వంటి సంస్థలు సీడీఎంఏ సేవలను అందిస్తూ, 2జీ టెలికం సేవల మార్కెట్లో 20 శాతం వాటాను కైవసం చేసుకునే స్థాయికి ఎదిగాయి. సీడీఎంఏ సేవలు మొదలవడంతో మొబైల్ కాల్ ధరలు, ఎస్ఎంఎస్ ధరలు గణనీయంగా తగ్గి, దేశంలోని సామాన్యులకు సైతం ఇవి అందుబాటులోకి వచ్చాయి. మరో రెండేళ్లు తిరిగే సరికి– అంటే 2004 నాటికి దేశంలో తొలిసారిగా మొబైల్ కనెక్షన్ల సంఖ్య ల్యాండ్‌ఫోన్ కనెక్షన్ల సంఖ్యను అధిగమించడం జరిగింది. దేశంలో 2008లో 3జీ సేవలు మొదలవడంతో స్మార్ట్ఫోన్లు వాడుకలోకి రావడం మొదలైంది. ఇంటర్నెట్, మొబైల్ సేవలను అందించే సంస్థలు పోటాపోటీగా ధరలు తగ్గిస్తూ రావడంతో పాటు 2012 నాటికి 4జీ సేవలు అందుబాటులోకి రావడంతో 2014 నాటికి మొబైల్ఫోన్ల డిమాండ్ దేశంలో తారస్థాయికి చేరుకుంది. బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లకు దీటుగా కారుచౌక ధరల్లో చైనా స్మార్ట్ఫోన్లు కూడా కుప్పలు తెప్పలుగా మార్కెట్లోకి రావడం మొదలైంది. మొబైల్ సేవల ధరలు దాదాపు పూర్తిగా నింగి నుంచి నేలపైకి వచ్చాయి. స్మార్ట్ఫోన్లు పల్లెలకు సైతం చేరడం ప్రారంభమైంది. రిలయన్స్ జియో 2016లో మొదలైన తర్వాత మొబైల్ సేవల్లో మరింత వేగం పుంజుకుంది. ఫలితంగా, గత ఏడాది నాటికి భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా అవతరించింది. భారత్‌లో ఇంటర్నెట్ ప్రస్థానం... మన దేశంలో ఇంటర్నెట్ ప్రస్థానం తొలి ఐదేళ్లలో మందకొడిగానే సాగింది. దేశంలో 1995 నుంచి ఇంటర్నెట్ సేవలు మొదలైనా, 2000 నాటికి ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య కేవలం 2 కోట్లు మాత్రమే ఉండేది. మరో పదేళ్లు గడిచే సరికి– అంటే 2010 నాటికి ఈ సంఖ్య 10 కోట్లకు, 2015 నాటికి 31.70 కోట్లకు చేరుకుంది. గడచిన ఐదేళ్లలో రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి, ఈ సంఖ్య గణనీయంగా పెరిగి, 62.7 కోట్లకు చేరుకుంది. గత ఏడాది చివరినాటి లెక్కల ప్రకారం ఇంటర్నెట్ సేవలను క్రియాశీలంగా ఉపయోగించుకునే యాక్టివ్ యూజర్ల సంఖ్య 49.30 కోట్లుగా ఉంటే, వీరిలో పట్టణ ప్రాంతాల్లోని వారు 29.30 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని వారు 20.00 కోట్లుగా ఉన్నట్లు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) ప్రకటించింది. కనీసం నెలకు ఒకసారైనా ఇంటర్నెట్ను ఉపయోగించుకునే వారిని యాక్టివ్ యూజర్లుగా పరిగణనలోకి తీసుకున్నామని, వీరిలో 70 శాతం మంది దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక ప్రయోజనం కోసం ఇంటర్నెట్ సేవలను వినియోగించుకుంటున్న వారేనని వెల్లడించింది. దేశంలోని యాక్టివ్ యూజర్లలో 43.3 కోట్ల మంది పన్నెండేళ్ల పైబడిన వయసు గలవారు కాగా, 7.1 కోట్ల మంది 5–11 ఏళ్ల లోపు చిన్నారులే కావడం గమనార్హం. గత ఏడాది మార్చి–నవంబర్ మధ్య కాలంలోనే ఇంటర్నెట్ యూజర్ల సంఖ్యలో 5.30 కోట్ల పెరుగుదల నమోదైందని, దీంతో భారత్... అమెరికాను అధిగమించి ఇంటర్నెట్ యూజర్ల సంఖ్యలో ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకుంది. అయితే, మన దేశంలోని యూజర్లలో పురుషులకు, మహిళలకు అంతరం చాలా ఎక్కువగా ఉంటోంది. యాక్టివ్ యూజర్లలో 71 శాతం మంది పురుషులైతే, మహిళలు 29 శాతం మంది మాత్రమే. ఇదిలా ఉంటే, దేశంలో అత్యధికంగా 97 శాతం మంది మొబైల్ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందుతున్నారు. మొబైల్ మాత్రమే కాకుండా పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ద్వారా ఇంటర్నెట్ వినియోగించుకునే వారి సంఖ్య 30.3 కోట్లుగా ఉన్నట్లు ఐఏఎంఏఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో ఇంటర్నెట్ వినియోగంలో వృద్ధి రేటు ఇదే స్థాయిలో కొనసాగితే, 2025 నాటికి దేశంలో యాక్టివ్ యూజర్ల సంఖ్య 97.4 కోట్లను అధిగమించగలదని ఐఏఎంఐఐ అంచనా వేస్తోంది. సమాచారానికి ఆధారం సమాచారం కోసం వార్తాపత్రికలు, టీవీ చానళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇంటర్నెట్పై ఆధారపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడచిన రెండేళ్లలో మన దేశంలో వార్తా పత్రికల ప్రింట్ ఎడిషన్ల మార్కెట్లో 4.4 శాతం పెరుగుదల నమోదైంది. ఇదేకాలంలో సమాచారం కోసం ఇంటర్నెట్పై ఆధారపడే వారి సంఖ్యలో 19 శాతం పెరుగుదల నమోదైంది. న్యూస్ వెబ్సైట్లు, పోర్టల్స్ వృద్ధికి ఇదొక ఆశాజనకమైన పరిణామమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంటర్నెట్ యూజర్లలో స్థానిక భాషల్లో కంటెంట్‌ను వినియోగించుకునే వారు మన దేశంలో 60 శాతానికి పైగానే ఉంటున్నారు. ఇదిలా ఉంటే, ‘కరోనా’ మహమ్మారి తాకిడి మొదలైన తర్వాత వార్తల కోసం యూజర్లు ఇంటర్నెట్లో గడిపే సమయం గణనీయంగా పెరిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ‘కరోనా’ వ్యాప్తికి ముందు మూడు నెలలు– జనవరి నుంచి మార్చి వరకు చూసుకుంటే, యూజర్లు వారానికి సగటున 27 నిమిషాలు ఇంటర్నెట్లో వార్తల కోసం వెచ్చించేవారు. మార్చి చివర్లో లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఈ సమయం 40 నిమిషాలకు పెరిగిందని ‘బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ (బీఏఆర్సీ) వెల్లడించింది. వార్తలను చదువుకోవడం, వార్తలకు సంబంధించిన వీడియో క్లిపింగ్స్‌ను చూడటమే కాకుండా, నచ్చిన వార్తలను సామాజిక మాధ్యమాల్లో పంచుకునే వెసులుబాటు ఉండటంతో చాలామంది ఇంటర్నెట్లో వార్తల వెదుకులాట సాగిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ‘కరోనా’ వ్యాప్తి తర్వాత దేశంలో న్యూస్ యాప్స్ వినియోగం ఏకంగా 50 శాతం మేరకు పెరిగిందని, న్యూస్ వెబ్‌సైట్స్ వినియోగం 42 శాతం మేరకు పెరిగిందని ‘బీఏఆర్సీ’–నీల్సన్ అధ్యయనంలో వెల్లడైంది. సామాజిక మాధ్యమ చైతన్యం ఇంటర్నెట్ సేవలు విస్తృతం కావడమే కాకుండా, స్మార్ట్ఫోన్లు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో భారత యూజర్లలో సామాజిక మాధ్యమ చైతన్యం కూడా పెరుగుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 40 కోట్లకు పైగా సోషల్ మీడియా యూజర్లు ఉన్నారు. వీరిలో అత్యధికంగా 79.3 శాతం యూజర్లు ఫేస్బుక్, 7.35 శాతం యూట్యూబ్, 5.32 పింటరెస్ట్, 3.9 శాతం ఇన్స్టాగ్రామ్, 1.91 శాతం ట్విట్టర్ వేదికలను వినియోగిస్తున్నారు. ఇవే కాకుండా, స్మార్ట్ఫోన్లను వినియోగించుకునే వారిలో వాట్సాప్ యూజర్ల సంఖ్య ఈ ఏడాది 40 కోట్లను అధిగమించడం విశేషం. సామాజిక మాధ్యమాలను ఎక్కువగా సమాచారాన్ని, సామాజిక పరిణామాలపై అభిప్రాయాలను పంచుకోవడానికి, వినోదానికి, నైపుణ్యాల ప్రదర్శనకు ఉపయోగించుకుంటు న్నారు. కొంతమంది వీటిని వ్యాపార విస్తరణ వేదికలుగా, ఆదాయ మార్గాలుగా కూడా ఉపయోగించుకుంటున్నారు. ‘యూట్యూబ్’ వీడియోలను స్వయం ఉపాధి మార్గంగా ఎంచుకున్నవారు కూడా మన దేశంలో పెద్దసంఖ్యలోనే ఉన్నారు. సోషల్ మీడియా యూజర్లలో భారతీయులు గత ఏడాది రోజుకు సగటున 2.4 గంటల కాలం గడిపేవారు. ఏడాది వ్యవధిలోనే ఈ సమయం ఏకంగా 87 శాతానికి పెరిగి, రోజుకు 4 గంటలకు చేరుకుంది. ‘కరోనా’ లాక్డౌన్ కాలానికి ముందు రోజుకు సగటున 150 నిమిషాలు గడిపేవారు కాస్తా, లాక్డౌన్ కాలం మొదలైనప్పటి నుంచి రోజుకు 280 నిమిషాలు గడుపుతున్నట్లుగా ‘హ్యామర్కాఫ్ కన్జూమర్ స్నాప్‌చాట్ సర్వే’ వెల్లడించింది. ఇదిలా ఉంటే, ‘కరోనా’ దెబ్బకు సినిమా థియేటర్లు మూతబడటంతో ఈ ఏడాది ఓవర్ ది టాప్ (ఓటీటీ) ద్వారా సినిమాలు చూసేవారి సంఖ్య ఏకంగా 71 శాతం పెరిగినట్లు ఈ సర్వేలో తేలింది. లాక్డౌన్ సమయంలో ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు మొదలవడంతో వాట్సాప్, జూమ్ వంటి వాటి వినియోగం పెరగడం కూడా ఈ పెరుగుదలకు దోహదపడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘కరోనా’తో ఈ–కామర్స్‌కు ఊపు భారత రిటైల్ మార్కెట్ వార్షిక విలువ 800 బిలియన్ డాలర్లు (రూ.58.47 లక్షల కోట్లు). ఇందులో ఈ–కామర్స్ వాటా 3.5 శాతం మాత్రమే. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ–కామర్స్ సంస్థలు నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు రకరకాల వస్తువులను ఆన్లైన్లో విక్రయిస్తున్నా, ఆన్లైన్లో వీటిని తెప్పించుకునేవారు మన దేశంలో తక్కువే. నేరుగా దుకాణాలకు వెళ్లి షాపింగ్ చేయడానికే భారతీయులు మొగ్గు చూపుతారు. దుకాణాలకు, షాపింగ్ మాల్స్‌కు వెళ్లడం, కలియదిరగడం, బేరాలు చేయడం చాలామందికి కాలక్షేపం. ‘కరోనా’ ఈ పరిస్థితిలో పెను మార్పు తెచ్చింది. దేశంలో లాక్డౌన్ మొదలైన తర్వాత ఈ–కామర్స్ సంస్థల అమ్మకాలు ఏకంగా 90 శాతం మేరకు పెరిగాయి. ఈ–కామర్స్ రంగంలో ఆశాజనకమైన మార్పులు కనిపిస్తున్నాయని, రానున్న ఐదేళ్లలో ఈ రంగం సగటున 30 శాతం వృద్ధితో ముందుకు దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సామాజిక మాధ్యమాలకు అలవాటుపడిన యువతలో చాలామంది సమాచారం కోసం, వినోదం కోసం మాత్రమే వీటికి పరిమితం కాకుండా ఆన్లైన్ గేమ్‌లకు బానిసలవుతున్నారనే ఆందోళనా వ్యక్తమవుతోంది. ఇటీవల ప్రభుత్వం పబ్జీ, టిక్‌టాక్ వంటి యాప్స్‌ను బ్యాన్ చేసింది గాని, వీటి వాడకం తారస్థాయిలో ఉన్నప్పుడు వీటి ద్వారా దుస్సాహసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్నవారు, వీటి ఉచ్చులో చిక్కుకుని మానసిక కుంగుబాటుతో ఆత్మహత్యలకు పాల్పడ్డవారు చాలామందే ఉన్నారు. సామాజిక మాధ్యమాలలో మితిమీరి సమయం గడిపేవారిలో చాలామంది మానసిక సమస్యల బారిన పడుతున్నారని పలు వార్తాకథనాలు, గణాంకాలు చెబుతున్నాయి. -
అశోక్ ఖేమ్కా మళ్లీ ట్రాన్స్ఫర్ అయ్యారు...
న్యూఢిల్లీ: హరియాణా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ముఖ్య కార్యదర్శి అశోక్ ఖేమ్కా మళ్లీ ట్రాన్స్ఫర్ అయ్యారు. అదేంటి ట్రాన్స్ఫర్ అయితే అందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఆయన ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయింది తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అశోక్ తన 28 ఏళ్ల సర్వీసు కాలంలో ఏకంగా 53 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. హరియాణా ప్రభుత్వం తాజాగా ఆయన్ను ఆర్కైవ్స్ విభాగానికి ట్రాన్స్ఫర్ చేసింది. ఆఖరి సారిగా క్రీడలు, యువజన వ్యవహారాల విభాగంలో 15 నెలలపాటు పనిచేశాక ఆయన మార్చిలో ట్రాన్స్ఫర్ అయ్యారు. ‘మళ్లీ ట్రాన్స్ఫర్ అయ్యాను. రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్న మరుసటి రోజే సుప్రీంకోర్టు ఆదేశాలు, నియమాలు మరోసారి ఉల్లంఘనకు గురయ్యాయి. సర్వీసులో ఆఖరు దశకు చేరుకున్నాను. నిజాయితీకి దక్కిన గౌరవం ఇది’అని బుధవారం అశోక్ ట్వీట్‌చేశారు. -
మేడకు నేర్పిన నడకలివీ..
నెమలికి నేర్పిన నడకలివీ’ అన్నాడు ఓ సినీకవి. దాన్ని ఇప్పుడు మనం ‘మేడకు నేర్పిన నడకలివీ’ అని అనుకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు ఎటూ కదలని భవనాలు మొదలైన వాటిని ‘స్థిరా’స్తులుగా చెప్పుకొనేవారు. ఇప్పుడవి కదులుతూ ‘చరా’స్తులుగా మారాయి. దానికి ఉదాహరణగా నిలుస్తోంది రంగంపేటలో ఓ రెండంతస్తుల మేడ. అదేంటో తెలుసుకుందామా.. సాక్షి, రంగంపేట (తూర్పుగోదావరి) : పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం అసాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తూ అబ్బురపరుస్తోంది. ‘స్థిర’ ఆస్తులుగా చెప్పుకొనే భవనాలు ‘చర’ ఆస్తులుగా మారి అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. జీవరాశులే కాదు.. నేను కూడా నడుస్తున్నాను చూడండంటూ రంగంపేటలోని ఓ రెండంతస్తుల మేడ 26 అడుగులు వెనక్కు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. రాజానగరం నుంచి సామర్లకోట వరకూ ఏడీబీ రోడ్డును ఆరులైన్ల రోడ్డుగా అభివృద్ధి చేస్తున్న విషయం విదితమే. ఈ విస్తరణలో రంగంపేట మెయిన్ రోడ్డు పక్కన ఉన్న రెండంతస్తుల భవనం తొలగించాల్సి ఉంది. అది ఇష్టం లేని ఆ భవన యజమాని పోతుల రామ్‌కుమార్ దాన్ని వెనక్కు జరపాలని నిశ్చయించుకున్నారు. దాంతో చెన్నైకి చెందిన ఏజే బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ కంపెనీకి, విజయవాడకు చెందిన ఒక సబ్ కాంట్రాక్టర్‌కు భవనాన్ని 33 అడుగులు వెనక్కి జరిపేందుకు కాంట్రాక్టు ఇచ్చారు. బీహార్ రాష్ట్రానికి చెందిన టెక్నిషియన్లు మేడను వెనుకకు జరిపే పనులు ప్రారంభించారు. ఈ మొత్తం పనులు పూర్తి కావడానికి రెండు నెలలకు అగ్రిమెంట్ చేసుకున్నట్టు రామ్‌కుమార్ తెలిపారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న రెండు భవనాలు పక్కపక్కన ఉండేవి. వెనక్కి నడిచిన పెద్ద భవనం ఇప్పుడిలా.. ఇప్పటికి పనులు ప్రారంభించి 57 రోజులు కాగా 33 అడుగులకు గాను 26 అడుగులు మేడ వెనక్కి జరిగింది. మరో వారం రోజుల్లో మేడ మొత్తం 33 అడుగులు వెనక్కి జరుగుతుందని రామ్‌కుమార్ తెలిపారు. ఈ భవనం కదులుతున్న తీరు గమనిస్తే.. భవనం ఫ్లోరింగ్ మొత్తం తవ్వి పిల్లర్లకు 350 రోలింగ్ జాకీలు అమర్చారు. ఆ జాకీలపై భవనాన్ని ఉంచి మరికొన్ని భారీ జాకీలను మేడకు దన్నుగా ఉంచి ఒక్కొక్క జాకీ వద్ద ఇద్దరు వ్యక్తులు జాకీలను తిప్పడంతో భవనం అతి సూక్ష్మంగా వెనక్కి కదులుతోంది. అలా ఇంతవరకూ 26 అడుగులు వెనక్కు జరిగింది. మేడ మొత్తం 33 అడుగులు వెనక్కి నడిచిన తరువాత భవనాన్ని 2 అడుగుల ఎత్తు కూడా భవనాన్ని చేయిస్తామని రామ్‌కుమార్ తెలిపారు. మేడ వెనక్కి జరుగుతున్న తీరును తిలకించేందుకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తరలివస్తున్నారు. దాంతో ఈ ప్రాంతం జనసందోహంతో కళకళలాడుతుంది. -
ప్రయోగాలపై పట్టింపేదీ..?
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా ఉంది జిల్లాలో ఇన్స్పైర్ మానక్ పరిస్థితి. బాలశాస్త్ర వేత్తలను తయారు చేసేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంపై హెచ్ఎంలు, సైన్స్ ఉపాధ్యాయులు దృష్టి పెట్టడంలేదు. ప్రాజెక్టుల తయారీకి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తున్నా.. జిల్లాలోని 841 పాఠశాలలకుగాను.. ఇప్పటివరకు మూడు పాఠశాలలే దరఖాస్తు చేశాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల పర్యవేక్షణ లోపం, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. ‘ఇన్స్పైర్ మానక్’కు స్పందన కరువు సాక్షి, నల్లగొండ: పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసి శాస్త్ర సాంకేతిక రంగాల వైపు మళ్లించేందుకు ఏటా కేంద్ర ప్రభుత్వం ఇన్స్పైర్ మానక్ (మిలియన్ మైండ్స్ ఆన్ మెంటింగ్ నేషనల్ అసిరెన్స్ నాలెడ్జ్) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించేందుకు విద్యార్థులను పాఠశాలస్థాయి నుంచే ప్రయోగాల బాట పట్టించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, అధికారులు దృష్టి సారించని కారణంగా ఇన్స్పైర్ మానక్ కార్యక్రమానికి జిల్లాలోని పాఠశాలల నుంచి స్పందన కరువైంది. జిల్లా వ్యాప్తంగా ప్రాథమికోన్నత, ఉన్నత, గురుకుల, కస్తూరిబా, ప్రైవేట్ పాఠశాలల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఫిబ్రవరిలో కేంద్రశాస్త్ర సాంకేతిక మండలి ఆదేశాలు జారీ చేసింది. కానీ జిల్లాలోని రెండు మూడు పాఠశాలలు మినహా దరఖాస్తులు అందలేదు. అంటే ఉపాధ్యాయులు, అధికారులు ఇన్స్పైర్ మానక్‌పై ఎంత దృష్టి పెట్టారనేది స్పష్టమవుతోంది. బాలశాస్త్రవేత్తలను తయారు చేసేలా.. బాలలను చిన్నప్పటి నుంచే శాస్త్ర సాంకేతిక రంగంవైపు మళ్లించాలన్న ఉద్దేశంతో కేంద్రంలోని శాస్త్ర సాంకేతిక మండలి ఏటా ఇన్స్పైర్ మానక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా పాఠశాలల నుంచి సైన్స్ ప్రాజెక్టుల తయారీకి ఆన్లైన్లో దరఖాస్తుల్ని ఆహ్వానిస్తుంది. ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి 3 ప్రాజెక్టులు, ఉన్నత పాఠశాలల నుంచి 5 ప్రాజెక్టుల చొప్పున తయారు చేసేందుకు అవకాశం ఉంది. ఏఏ ప్రాజెక్టులు తయారు చేస్తారు అనే దానిపై ఆన్లైన్లో ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థులతో ఆయా పాఠశాలల హెచ్ఎం, సైన్స్ ఉపాధ్యాయుడు కలిసి ప్రాజెక్టులను తయారు చేస్తామని దరఖాస్తు చేయాల్సి ఉంది. ఇందులో జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు గురుకుల, కస్తూరిబా, మోడల్ స్కూళ్లు, ప్రయివేట్, ఎయిడెట్ పాఠశాలలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరిలో దరఖాస్తులకు ఆహ్వానం.. ఇన్స్పైర్ మానక్ కార్యక్రమంలో భాగంగా సైన్స్ ప్రాజెక్టుల తయారీకి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూలై 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి సూచించింది. కాగా జిల్లాలోని 841 పాఠశాలలు ఉండగా అందులో కేవలం రెండు మూడు పాఠశాలలు మాత్రమే ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31 చివరి తేదీ. ఇటు అధ్యాపకులగానీ, అటు విద్యాశాఖ ఉన్నతాధికారులుగానీ ఇన్స్పైర్ మానక్‌పై దృష్టి సారించని కారణంగా విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా నిర్లక్ష్యం ఇన్స్పైర్ మానక్ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టుల తయారీకి ఒక్కో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నేరుగా ఆయా విద్యార్థుల అకౌంట్లలోనే రూ.10వేలను జమ చేస్తుంది. అందులో రూ.5వేలు ప్రాజెక్టును తయారు చేసేందుకు ఖర్చు చేయాల్సి ఉండగా, మిగిలిన రూ.5వేలు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇన్స్పైర్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎవరిపైనా రూపాయి భారం పడని పరిస్థితి. ప్రభుత్వం నిధులు ఇచ్చినా ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధికారుల నుంచి స్పందన కరువవుతోంది. నష్టపోనున్న విద్యార్థులు.. బాల శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు ప్రభుత్వం రూ.కోట్లను ఖర్చు చేస్తోంది. ఉపాధ్యాయులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నీరుగారడంతోపాటు విద్యార్థులు కూడా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాక ఒకవేళ ఆయా పాఠశాల విద్యార్థులు పంపిన ప్రాజెక్టు రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రదర్శనలో ఎంపికైతే ఒక్కో ప్రాజెక్టుకు రూ.20వేల పైచిలుకే డబ్బులను కూడా కేంద్రమే చెల్లిస్తుంది. దానికితోడు రాష్ట్రపతిని కలిసే అవకాశం కలవడంతో పాటు జాతీయ స్థాయిలో శాస్త్రజ్ఞుల సలహాలను కూడా పొందే అవకాశం ఈ ప్రాజెక్టుల తయారీ ద్వారా లభించనుంది. ఇన్ని అవకాశాలను అధ్యాపకుల, అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా స్పందిస్తే మేలు.. విద్యాశాఖ అధికారులు, ఆయా పాఠశాలల అధికారులు, సైన్స్ ఉపాధ్యాయులు స్పందించి విద్యార్థుల ప్రయోగాల తయారీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ పక్క దేశం అన్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు పోతుంటే జిల్లా నుంచి బాల శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు విద్యాశాఖ తనవంతు పాత్రగా జిల్లా నుంచి సైన్స్ ప్రయోగాల తయారీకి పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని దరఖాస్తుల కార్యక్రమాన్ని ముమ్మరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఇన్స్పైర్ మానక్ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో మేలు. చిన్నప్పటి నుంచే సైన్స్ ప్రయోగాలు చేయడం వల్ల వారు బాలశాస్త్రవేత్తలు అయ్యే అవకాశం ఉంటుంది. కేంద్రంలోని శాస్త్ర సాంకేతిక మండలి ఏటా ఇన్స్పైర్ మానక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రాజెక్టుల తయారీకి సంబంధించిన వివరాలను దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31 చివరి తేదీ. ఇప్పటి వరకు కొన్ని పాఠశాలలు మాత్రమే దరఖాస్తు చేసుకున్న మాట వాస్తవమే. ఇంకా పాఠశాలలు ముందుకు వస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – లక్ష్మీపతి, జిల్లా సైన్స్ అధికారి, నల్లగొండ -
సమస్యల పరిష్కారంలో టెక్నాలజీ కీలకం
లక్నో నుంచి సాక్షి ప్రతినిధి: యుగాలుగా గణితం మొదలుకొని లోహ శాస్త్రం వరకూ అనేక శాస్త్ర రంగాలపై తనదైన ముద్ర వేసిన భారతదేశం.. రేపటి తరం టెక్నాలజీలను అం దుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే విజ్ఞానాన్ని సృష్టించే సంస్థలు కృషి, భాగస్వామ్యం కూడా అత్యవసరమని అన్నారు. శనివారం లక్నోలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఐఐఎస్ఎఫ్ సమావేశాలను శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల కుంభమేళాగా అభివర్ణించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. దేశంలో సామాజిక సమస్యల పరిష్కారంలో టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన టీకా కార్యక్రమానికి శీతలీకరణ పరిజ్ఞానం సాయపడిందన్నారు. సాంకేతిక పరిజ్ఞాన రంగా ల్లో ఎంత పురోగతి సాధిస్తున్నా మౌలిక శాస్త్ర పరిశోధనలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రపతి శాస్త్రవేత్తలకు సూచించారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 175 గిగావాట్ల విద్యుదుత్పత్తికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసిందని, ఇందు లో 100 గిగావాట్ల వరకూ ఉండే సౌరశక్తి సద్వినియోగానికి కూడా వినూత్న టెక్నాలజీ సాయపడుతోందని వెల్లడించారు. మహిళా ప్రాతినిధ్యం పెరగాలి..:దేశం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ఎంతో పురోగతి సాధిస్తున్నా.. ఇందులో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం తక్కువగా ఉండటంపై రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోనే ప్రతిష్టాత్మక సీఎస్ఐఆర్లో మహిళా శాస్త్రవేత్తలు 18.3 శాతం మాత్రమే ఉన్న విషయాన్ని రాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్రం చర్యల కారణంగా గత ఐదేళ్లలో దాదాపు 649 మంది శాస్త్రవేత్తలు విదేశాల నుంచి తిరిగి వచ్చారని తెలిపారు. సైన్స్‌కు ఎల్లలు లేవని, ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఇతర దేశాల శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు చేస్తూ ఉండటం దీనికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్‌నాయక్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. డీఎన్ఏను వేరు చేయడం ద్వారా రికార్డు గిన్నిస్‌లో స్థానం సాధించిన లక్నో విద్యార్థులు లక్నో నుంచి సాక్షి ప్రతినిధి: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో శనివారం సరికొత్త గిన్నిస్ రికార్డు నమోదైంది. జీవమున్న ప్రతి ప్రాణిలో ఉండే డీఎన్ఏను 550 మంది విద్యార్థులు ఏకకాలంలో వేరు చేయడం ద్వారా ఈ రికార్డు ఏర్పడింది. గతేడాది అమెరికాలోని సియాటిల్ చిల్డ్రన్ ఇన్స్టిట్యూట్లో 302 మంది విద్యార్థులు ఓ పండు నుంచి డీఎన్ఏను వేరు చేయడం ద్వారా గిన్నిస్ రికార్డ్ నమోదు చేయగా.. ఈసారి 500కు పైగా ఈ ప్రయత్నం చేసి విజయం సాధించారు. లక్నో శివార్లలోని జి.డి.గోయాంక పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు చెందిన రిషినాథ్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. శనివారం ఉదయం 12 గంటల ప్రాంతంలో ప్రయోగం మొదలు కాగా.. ఫలితం వెల్లడయ్యేందుకు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. మొత్తం 550 మంది విద్యార్థులను 13 గుంపులుగా విభజించి ఈ ప్రయోగం నిర్వహించారు. ముందుగా అందించిన కిట్లు, అరటిపండు ముక్కలతో విద్యార్థులు ప్రయోగాన్ని 90 నిమిషాల్లో పూర్తి చేశారు. గిన్నిస్ రికార్డుల ప్రతినిధుల నిశిత పరిశీలన తర్వాత కొత్త గిన్నిస్ రికార్డు స్థాపితమైనట్లు రిషినాథ్ ప్రకటించారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విభాగం, విజ్ఞాన భారతిల పేరుతో ఈ రికార్డు నమోదైంది. -
భారతీయ విద్యార్థులకు డేవిడ్సన్ ఫెలోషిప్
వాషింగ్టన్: సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో భారత సంతతికి చెందిన విద్యార్థులు తమ సత్తా నిరూపిస్తున్నారు. తాజాగా ఆరుగురు విద్యార్థులు తమ ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక డేవిడ్సన్ ఫెలోస్ స్కాలర్షిప్– 2018 అందుకున్నారు. డేవిడ్సన్ ఇన్స్టిట్యూట్ అందించే ఈ స్కాలర్షిప్ ప్రపంచంలో 10 అతిపెద్ద స్కాలర్‌షిప్‌ల్లో ఏడోది. ఏటా సైన్స్, మేథ్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, సంగీతం, సాహిత్యం, తత్వశాస్త్రం వంటి వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన 18 ఏళ్లలోపు విద్యార్థులకు దీన్ని అందజేస్తారు. శుక్రవారం వాషింగ్టన్లో ఆ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా వ్యాప్తంగా ఈ స్కాలర్షిప్కు ఎంపికైన 20 మంది విద్యార్థులు నగదును అందుకున్నారు. ఆ ఆరుగురు వీరే.. వర్జీనియాకు చెందిన కావ్య కొప్పరపు (18) కేన్సర్ చికిత్సలో నూతన ఆవిష్కరణలు చేసింది. కనెక్టికట్‌కు చెందిన రాహుల్ సుబ్రమణియన్ (17) దోమల్లో వచ్చే మార్పులతో ఆధారంగా ముందుగానే జికా వైరస్‌ను అంచనా వేసి హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థను అభివృద్ధి చేశాడు. వీరిద్దరు రూ.36.7 లక్షల చొప్పున నగదు అందుకున్నారు. న్యూజెర్సీకి చెందిన ఇషాన్ త్రిపాఠీ (16) కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో ఇండోర్‌లో గాలి నాణ్యత పెంచి లక్షలాది మంది జీవితాలను వ్యాధుల నుంచి కాపాడాడు. అరిజోనాకు చెందిన సచిన్ కోనన్ (17) భూకంపాలు వంటి విపత్తులు సంభవించినప్పుడు శిథిలాల కింద చిక్కుకుపోయిన బాధితులను వేగంగా గుర్తించే వ్యవస్థను అభివృద్ధి చేశాడు. కణాల గమనంలో మార్పు వల్లే గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని నిరూపించిన వర్జీనియాకు చెందిన మరిస్సా సుమతిపాల (18) వైద్యశాస్త్ర విభాగంలో స్కాలర్షిప్కు ఎంపికైంది. ఈ ముగ్గురికి రూ.18.3 లక్షల చొప్పున నగదు లభించింది. జన్యువులను మరింత మెరుగ్గా విశ్లేషించే వ్యవస్థను కనుగొన్నందుకు కాలిఫోర్నియాకు చెందిన రాజీవ్ మువ్వా (18) రూ.7లక్షలు అందుకున్నాడు. -
శాస్త్ర సాంకేతిక పరిశోధకులకు ఫెలోషిప్ పెంపు
సాక్షి, అమరావతి: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ (పీఎంఆర్ఎఫ్) కింద కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధకులకు ఇస్తున్న ఫెలోషిప్ మొత్తాన్ని భారీగా పెంచడంతోపాటు దీనికి జాతీయ సమన్వయకర్త బాధ్యతలను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించింది. ఫెలోషిప్‌పై విద్యార్థులకు అవగాహన కలిగించాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆయా యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలకు సూచించింది. ఈ కొత్త మార్గదర్శకాలు 2019 ఫెలోషిప్ ఎంపికలకు వర్తిస్తాయని వివరించింది. పరిశోధనాసక్తిని తెలియచేసేలా ప్రాజెక్ట్ అభ్యర్థి.. పరిశోధన చేయదలుచుకున్న అంశానికి సంబంధించి ప్రాజెక్టును రూపొందించుకొని సమర్పించాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ శాస్త్ర, సాంకేతిక అంశాలకు చెందినదై, జాతీయ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని రూపొందించి ఉండాలి. ప్రాజెక్ట్ అభ్యర్థికి పరిశోధనపై గల ఆసక్తి, పరిశీలన సామర్థ్యాలకు దర్పణం పట్టేలా ఉండాలి. అంతేకాకుండా సెలెక్షన్ కమిటీ ఫీడ్‌బ్యాక్ తీసుకునేందుకు ఈ ప్రాజెక్టుతోపాటు ఇద్దరు నిపుణుల పేర్లను రిఫర్ చేయాల్సి ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలపై ఆయా అభ్యర్థులు ఎంచుకొనే సబ్జెక్టులకు ఒక్కోదానికి ఒక్కో విద్యా సంస్థను నోడల్ ఇన్స్టిట్యూట్గా కేంద్ర మానవ వనవరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎంపిక చేస్తుంది. ఆ సంస్థలు ఆయా పరిశోధనాంశాలను పర్యవేక్షిస్తాయి. ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు ఈ పీఎంఆర్ఎఫ్ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులు ఈ వెబ్సైట్ ద్వారా సమర్పించిన దరఖాస్తులు సంబంధిత నోడల్ ఇన్స్టిట్యూట్లకు చేరతాయి. ఆయా నోడల్ ఇన్స్టిట్యూట్లు నియమించే నిపుణుల కమిటీలు ఇంటర్వ్యూలు చేసి అర్హులైన అభ్యర్థుల జాబితాలను రూపొందిస్తాయి. ఇంటర్వ్యూలను అవసరమైతే వీడియో కాన్ఫరెన్సుల ద్వారా కూడా నిర్వహించనున్నారు. జాబితాల్లోని వారిని మరింత వడపోసేందుకు జాతీయ సమన్వయ కమిటీ (ఎన్సీసీ) రాతపరీక్షలు, చర్చాగోష్టులు తదితర మార్గాల ద్వారా ఫెలోషిప్‌కు అర్హులను ఎంపిక చేస్తుంది. అనంతరం వారికి విద్యా సంస్థలను కేటాయించనున్నారు. ఎంపిక మార్గదర్శకాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్లు) రూపొందించనున్నాయి. అనుకున్న మేర పరిశోధన సాగితేనే మరుసటి ఏడాదికి రెన్యువల్ ఆశించిన మేర అభ్యర్థి పరిశోధన సాగిస్తేనే మరుసటి ఏడాదికి ఫెలోషిప్ రెన్యువల్ అవుతుంది. పరిశోధకుడు వారంలో ఒకరోజు తమకు సమీపంలోని ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధన చేయాలి. జాతీయ సమన్వయ కమిటీ (ఎన్సీసీ) పీఎంఆర్ఎఫ్ను అమలుచేసే వ్యవస్థగా ఉంటుంది. పరిశోధనలకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులుచేర్పులు చేసే అధికారం ఎన్సీసీకి ఉంటుంది. ఎంతమందిని పరిశోధనలకు అనుమతించాలన్న నిర్ణయమూ ఎన్సీసీ పరిధిలోనే ఉంటుంది. ఫెలోషిప్ ఇలా.. పీఎంఆర్ఎఫ్ కింద మొదటి రెండేళ్లు 70 వేల చొప్పున, మూడో ఏడాది రూ.75 వేలు, చివరి రెండేళ్లు రూ 80 వేల చొప్పున ఇవ్వనున్నారు. దీంతోపాటు రీసెర్చ్ గ్రాంట్ కింద ఏటా రూ.2 లక్షల చొప్పున ఐదేళ్లకు రూ.10 లక్షలు అందిస్తారు. ఈ పరిశోధనల కాలపరిమితి ఇంటిగ్రేటెడ్ కోర్సుల విద్యార్థులకు నాలుగేళ్లు, బీటెక్ విద్యార్థులకు ఐదేళ్లు ఉంటుంది. ఎంటెక్, ఎంఎస్, ఎంఈ కోర్సులు పూర్తిచేసినవారికి కూడా నాలుగేళ్ల కాలపరిమితి వర్తిస్తుంది. -
పాఠశాలలో అసాంఘిక కార్యక్రమాలు
లావేరు : లావేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సైన్స్‌ల్యాబ్‌లో పరికరాలను కొందరు అపరిచిత వ్యక్తులు పగులగొట్టారు. అంతటితో ఆగకుండా గోడలు, కిటికీ తలుపులపై అశ్లీల పదజాలంతో రాతలు రాశారు. పాఠశాల ఆవరణలో అంసాంఘిక కార్యకలాపాలు నిర్వహించారు. సోమవారం పాఠశాల హెచ్ఎం పట్నాన రాజారావు, ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చే సరికి గోడలపై అసభ్య రాతలు, వరండాలో మద్యం సీసాలు గుర్తించారు. కిటికీ తలుపులు పగులగొట్టి ల్యాబ్‌లోకి రాళ్లు విసిరినట్లు గుర్తించారు. దీనిపై హెచ్ఎం రాజారావు ఉపాధ్యాయులతో కలసి లావేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కృష్ణారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఐఐటీల్లో నయా జోష్..!
దేశంలో శాస్త్ర సాంకేతిక విద్యకు దిక్సూచిలవి.. యావత్ యువతరం చోటు కోసం కలలుగనే, పోటీ పడే విద్యా కుసుమాలవి... విద్యార్థులను బట్టీ చదువులు, మార్కుల యంత్రాలుగా మార్చడంపై కాకుండా యువ మస్తిష్కాలను నూతన ఆవిష్కరణలవైపు నడిపించే ‘ఫ్యాక్టరీ’లవి... ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి, ‘గూగుల్’ సుందర్ పిచాయ్, ‘ఫ్లిప్‌కార్ట్’ సచిన్ బన్సల్, ‘సాఫ్ట్ బ్యాంక్’ నికేష్ అరోరా వంటి ఎందరినో ప్రపంచానికి అందించిన కేంద్రాలవి... అవే...దేశ అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా కీర్తిప్రతిష్టలు అందుకుంటున్న ఐఐటీలు (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు). ఇప్పుడు ఈ సంస్థలు పూర్వ వైభవానికి మరిన్ని హంగులు అద్దుకుంటూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దేశంలోని 23 ఐఐటీలలో ఉన్న సీట్లు దాదాపు ఏడు వేలు! కానీ పోటీ పడే విద్యార్థుల సంఖ్య మాత్రం లక్షలకు లక్షలు! ఈ ఒక్క విషయం చాలు దేశంలో ఐఐటీలకు ఉన్న క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకునేందుకు. అయితే దశాబ్దాలుగా ఒకే రకమైన కోర్సులు, సిలబస్‌తో నడుస్తున్న ఈ సంస్థలు మారుతున్న కాలానికి అనుగుణంగా అడుగులేస్తున్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలు అనుసరించే బోధనా పద్ధతులు పాటించడంతోపాటు వేర్వేరు సమస్యల పరిష్కారానికి వేర్వేరు శాస్త్ర విభాగాలు కలసికట్టుగా పరిశోధనలు చేయడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సైన్స్ ఇంజనీరింగ్‌లతోపాటు కళలు, హ్యుమానిటీస్ అంశాల్లోనూ కోర్సులు ప్రారంభిస్తున్నాయి. కోర్సు పూర్తి చేసే విషయంలో విద్యార్థులకు స్వేచ్ఛ, సౌలభ్యం అందించేందుకు చర్యలు చేపట్టాయి. ఫలితంగా యువతరం మోసుకొచ్చే కొత్త ఆలోచనలు, పద్ధతులతో పరిశోధనలూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రొఫెసర్లుగా యువతకు ప్రాధాన్యం... ఐఐటీ ప్రొఫెసర్లంటే తల నెరసిన వారే ఉంటారన్న పాతకాలపు ఆలోచనలకు తెరదించుతూ యాజమాన్యాలు యువతరానికి పెద్దపీట వేస్తున్నాయి. దీంతో ఐఐటీ అధ్యాపకుల సగటు వయసు 1980 ప్రాంతంలో 60 ఏళ్లు కాగా.. ఇప్పుడు అది 40కు తగ్గిపోయింది. గత ఐదేళ్లలో స్వదేశానికి తిరిగొచ్చిన యువ శాస్త్రవేత్తల్లో అత్యధికులు ఐఐటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లలో చేరుతున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 2007–12తో పోలిస్తే ఆ తరువాతి ఐదేళ్లలో విదేశాల నుంచి తిరిగొస్తున్న శాస్త్రవేత్తలకు ఇచ్చే ఫెలోషిప్‌లు 70 శాతం పెరిగాయంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది. కలివిడిగా.. వడివడిగా... పరిశోధనలంటే సామాన్యులకు ఉపయోగపడేవి కావన్న ఒకప్పటి అంచనాను తారుమారు చేస్తూ ఐఐటీ, ఐఐఎస్సీలు దేశానికి వ్యూహాత్మక ప్రాధాన్యమున్న ప్రాజెక్టులతోపాటు పరిశ్రమల సమస్యలను పరిష్కరించేందుకు, టెక్నాలజీతో సామాన్యుడి కష్టాలు తీర్చేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఫలితంగా మునుపటి కంటే వేగంగా ఐఐటీ కేంద్రంగా కొత్త స్టార్టప్‌లు, కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఐఐఎస్సీ గతంలోనే వేర్వేరు శాస్త్ర విభాగాలు కలసికట్టుగా పనిచేసేలా వాతవరణ మార్పులపై ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఇదే తరహాలో ఇంధనం, నీటి సమస్యల పరిష్కారానికీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు ధ్వనికంటే వేగంగా దూసుకెళ్లే విమానాల కోసమూ ప్రత్యేక కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఐఐటీ మద్రాస్‌లోనూ 2014లో కంబషన్ (ఇంధనం మండే ప్రక్రియ)పై మొదలుపెట్టి.. నానో మెటీరియల్స్, కంప్యూటేషనల్ బ్రెయిన్ రీసెర్చ్, బయోలాజికల్ సిస్టమ్స్ ఇంజినీరింగ్, డేటా సైన్సెస్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లోనూ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరిన్ని కేంద్రాల ఏర్పాటు ఆలోచనలతో ముందుకొచ్చిన వారికి రూ. 2 కోట్ల నగదు బహుమతి కూడా ఇస్తోంది. ముందు వరుసలో ఐఐటీ బాంబే... ఐఐటీ బాంబే 2017లో తొలిసారి ఖగోళ శాస్త్రంలో కోర్సును ప్రారంభించింది. ఇదే సంస్థలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి విదేశాల్లో ఖగోళశాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించిన వరుణ్ భలేరావును చదువు చెప్పేందుకు ఎంపిక చేసుకుంది. ఏడాది తిరిగేలోగా మరో నలుగురు మాజీ ఐఐటీయన్లు ఆయనకు జతకూడారు. వేర్వేరు అంశాల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన వీరు ఇప్పుడు ఖగోళశాస్త్రంలో కొత్త ఆవిష్కరణలకు పునాదులు వేస్తున్నారు. లడాఖ్‌లోని 18 ఏళ్ల పురాతన ఆప్టికల్ టెలిస్కోప్ దానంతట అదే పనిచేసేలా సరికొత్త ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌ను వారు రూపొందిస్తున్నారు. అంతేకాదు... భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో కలసి గురుత్వ ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ప్రయోగాలూ చేపట్టారు. భలేరావు మాదిరిగానే.. న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆంథ్రోపాలజీ చదివిన అనూష్ కపాడియా.. ఇప్పుడు ఐఐటీ బాంబేలో సామాజిక శాస్త్రాల్లో విద్య నేర్పుతున్నారు. ఐఐటీ, ఐఐఎస్సీల్లో గత కొన్నేళ్లుగా జరుగుతున్న వినూత్న పరిశోధనల్లో కొన్ని... ► మానవ మెదళ్ల మాదిరిగా పనిచేసే మైక్రోచిప్‌ల తయారీపై ఐఐటీ ఢిల్లీలో మనన్ సూరీ అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తున్నారు. అతితక్కువ ఖర్చుతో సమాచారాన్ని దీర్ఘకాలంపాటు నిల్వ చేసుకోగల మెమరీని అభివృద్ధి చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. నానో ఎలక్ట్రానిక్స్, నానో టెక్నాలజీలపై ఫ్రాన్స్‌లో పీహెచ్డీ చేసిన మనన్ సూరికి మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) గతేడాది 35 ఏళ్ల వయసులోపు ఉన్న అద్భుత శాస్త్రవేత్తగా అవార్డు అందించింది. ► జల విద్యుత్ తయారీలో కీలకమైన టర్బైన్లను ప్రస్తుత పరిమాణంకంటే పదిరెట్లు తక్కువ సైజులో, అది కూడా వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న కార్బన్ డయాక్సైడ్తో పనిచేయించేలా ప్రయోగాలు జరుగుతున్నాయి. 2012లో బెంగళూరులోని ఐఐఎస్సీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన ప్రమోద్ కుమార్ కార్బన్ డయాక్సైడ్ను ఒక ప్రత్యేక స్థితికి తీసుకెళ్లడం ద్వారా టర్బయిన్లలో వాడుకోవచ్చునని అంటున్నారు. ద్రవ, వాయు స్థితులకు మధ్యలో ఉండే ఈ ప్రత్యేక స్థితిలో కార్బన్ డయాక్సైడ్ను వాడినప్పుడు తక్కువ సైజున్న టర్బయిన్లతోనే సమర్థంగా విద్యుదుత్పత్తి చేయవచ్చని అంచనా. ఈ టర్బయిన్ సంప్రదాయేతర ఇంధన వనరులతోపాటు అణు రియాక్టర్లలోనూ అత్యంత కీలక పాత్ర పోషించనుందని అంచనా. ► 2007లో ఐఐటీ బాంబే నుంచి పట్టభద్రుడైన నిషాంత్ డోంగరి ప్రస్తుతం హైదరాబాద్ ఐఐటీలో పనిచేస్తూ క్షిపణి రక్షణ వ్యవస్థలపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇప్పటికే వినూత్న సౌరశక్తి పరికరాల తయారీతోపాటు రూఫ్‌టాప్ సోలార్ ప్యానళ్ల సమర్థ వినియోగం వంటి అంశాల్లో సేవలందించేందుకు ‘ప్యూరెనర్జీ’ పేరుతో కంపెనీ స్థాపించారు. ► స్మార్ట్ఫోన్లలో ఇంటర్నెట్ వేగాన్ని పదుల రెట్లు ఎక్కువ చేసే 5జీ టెక్నాలజీకి తగిన ప్రమాణాలను రూపొందించే విషయంలో ఐఐటీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కూచి కిరణ్ విజయం సాధించారు. గతేడాదే ఈ టెక్నాలజీపై పేటెంట్‌కు కిరణ్‌తోపాటు ఇతర శాస్త్రవేత్తలు దరఖాస్తు చేశారు. — సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఉద్యోగాలు ఎందుకు మారుతున్నారో తెలుసా.?
లండన్: అవసరం ఉన్నా లేకున్నా చాలా మంది ఉద్యోగాలు మారుతుంటారు. అయితే కొత్తదనం కోరుకునే వారే తరచూ ఇలా చేస్తుంటారని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడైంది. స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జ్యూరిచ్, యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ యాంగిలియా(యూఈఏ) శాస్త్రవేత్తలు.. ఇలా జాబ్‌లు మారడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసుకోవడానికి పరిశోధనలు చేశారు. ఎక్కువ మంది తమ వ్యక్తిగత కారణాలతో ఉద్యోగాలు మారుతుంటే, మరికొంత మంది కొత్తదనం కోసం మారుతున్నట్లు తేలింది. అయితే ఇలా మారే వారిలో వయసు తక్కువగా ఉండి, మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నవారే ఎక్కువగా ఉంటున్నారట. అవకాశాలు కూడా ఇందుకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. తమ విద్యార్హతల కంటే తక్కువ స్థాయి ఉద్యోగాల్లో ఉన్నవారు అంతకంటే మంచి పొజిషన్ కోసం వెతుకుతుండగా, ఉద్యోగుల్ని ఎంపిక చేసే సంస్థలు సైతం నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తుండడంతో ఉద్యోగులు సులభంగా ఒక చోట నుంచి మరో చోటుకు మారుతున్నారని వివరించారు. -
కొబ్బరి పొట్టు.. సేంద్రియ కంపోస్టు!
పంట పొలంలో, కుండీ మట్టిలో నీటి తేమను ఎక్కువ కాలం పట్టి ఉంచడానికి శుద్ధి చేసిన కొబ్బరి పొట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. శుద్ధి చేసే ప్రక్రియలో గతంలో రసాయనాలను వాడేవారు. అయితే, కేంద్ర కాయిర్ బోర్డు రసాయనాలు వాడకుండా కొబ్బరి పొట్టును శుద్ధి చేసి సేంద్రియ ఎరువులా పంటలకు వాడుకునే వినూత్న పద్ధతిని ఇటీవల రూపొందించింది. కృషీవల కొబ్బరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఈ పద్ధతిలో సేంద్రియ కంపోస్టును తయారు చేస్తూ.. కొబ్బరి రైతులకు మంచి మార్గాన్ని చూపుతోంది. కొబ్బరి పంట రైతుకు అనేక విధాలుగా ఆదాయాన్ని అందిస్తుంది. కాయలతోపాటు కాండం, ఆకులు, ఈనెలు, చిప్పలు, డొక్కలు.. ఇలా అన్నీ రైతులకు ఉపయోగపడుతూ ఆదాయాన్నందించేవే. కొబ్బరి డొక్కల నుంచి ‘పీచు’ తీసి.. ఆ పీచుతో అనేక ఉత్పత్తులను తయారు చేస్తారు. కేజీ పీచు తీసేటప్పుడు సుమారు 6 నుంచి 8 కేజీల కొబ్బరి పొట్టు వస్తుంది. ఇలా వచ్చిన పొట్టును నేరుగా వ్యవసాయంలో వినియోగించకూడదు. దీనిలో కర్బనం–నత్రజని నిష్పత్తి మొక్కలకు అనుకూలంగా ఉండదు. ‘లెగ్నిన్’ అధిక మోతాదులో ఉండటం వలన దీన్ని నేరుగా మొక్కలకు వేస్తే పంటలకు హాని జరుగుతుంది. ఎలక్ట్రిక్ కండక్టవిటీ(ఈసీ)ని తగ్గించాలి. దీన్ని శుద్ధి చేసి కంపోస్టుగా మార్చి వేసుకుంటే పంటలకు మేలు జరుగుతుంది. కొబ్బరి పొట్టు రైతుకు మేలు చేసే విధంగా తయారు చేసుకోవడంలో వివిధ పద్ధతులు, విధానాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. సెంట్రల్ కాయిర్ బోర్డు ‘ఫ్లూరోటస్ సాజర్ కాజూ’అనే శీలింధ్రాన్ని ఉపయోగించి పొట్టును వేగంగా కుళ్లబెట్టే ప్రక్రియను అభివృద్ధి చేసింది. తొలినాళ్లలో ఈ శిలీంధ్రం, రాతి భాస్వరం పొరలు, పొరలుగా వేసి కుళ్లబెట్టేవారు. తరువాత కొద్దిపాటి యూరియాను పొరల మధ్య చల్లడం ద్వారా మరింత వేగంగా పొట్టును కుళ్లబెట్టవచ్చని తేల్చారు. ఈ కొత్త పద్ధతిలో రసాయనిక పదార్థాలకు బదులు.. ఫ్లూరోటస్ సాజర్ కాజూ, అజోల్లా, వేపపిండిలను వినియోగిస్తూ వేగంగా కొబ్బరి పొట్టును కుళ్లబెట్టే విధానం అభివృద్ధి చేశారు. ఇటీవల కోనసీమలో కొంతమంది రైతులు ఏర్పాటు చేసుకున్న కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో చేసిన ప్రయోగం సత్ఫలితాన్నిచ్చింది. కొబ్బరి పొట్టు కంపోస్టును తయారు చేసి రైతులకు, పట్టణాల్లో ఇంటిపంటల సాగుదారులకు అందించడానికి ఈ సంస్థ ఏర్పాట్లు చేసుకుంటున్నది. టన్ను కొబ్బరి పొట్టు (బేబీయార్న్ తొలగించింది), 10 కేజీల అజోల్లా, 30 కేజీల వేపపిండి, 5 కేజీల ఫ్లూరోటస్ సాజర్ కాజూ లను పొరలు, పొరలుగా వేసి తడపటం ద్వారా 30 రోజుల్లో మంచి నాణ్యమైన కొబ్బరి పొట్టు కంపోస్టును తయారు చేస్తున్నారు. ప్రతి రోజూ స్వల్పమోతాదులో నీరు చల్లాల్సి ఉంటుంది. అనంతరం ఈ కొబ్బరి పొట్టు బాగా కుళ్లి మంచి కంపోస్టు ఎరువుగా తయారవుతుంది. శిలీంధ్రం, అజోల్లాలతో శాస్త్రీయ పద్ధతిలో కుళ్లబెట్టిన కొబ్బరి పొట్టు కంపోస్టు వాడటం వల్ల అనేక లాభాలున్నాయి. – నిమ్మకాయల సతీష్‌బాబు, సాక్షి, అమలాపురం కొబ్బరి పొట్టు కంపోస్టుతో ప్రయోజనాలు ► మంచి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన సేంద్రియ పదార్థం ► తక్కువ బరువు– విమానాల్లో సైతం రవాణాకు అనుకూలం ► విదేశాలకు ఎగుమతికి క్వారంటెయిన్ ఇబ్బందులు లేవు ► అధిక మోతాదులో పొటాషియంతోపాటు అనేక పోషకాలు కలిగిన సేంద్రియ ఎరువు ► జీవన ఎరువులు, శీలింధ్రనాశనులు కలిపి వినియోగానికి అనుకూల పదార్ధం ► అత్యంత తక్కువ ధరకు లభించే ఎరువు కొబ్బరి తోటలున్న ప్రాంతాల్లో లభించే వ్యర్థ పదార్థం ► సులువైన తయారీ విధానం నూతన ఉపాధి అవకాశాల కల్పనకు తోడ్పడుతోంది ► ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం పొందవచ్చు ► మిద్దె పంటలు, ఇంటి పంటలకూ అనుకూలమైన సేంద్రియ ఎరువు. భూమిలో నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుంది కొబ్బరి పొట్టు కంపోస్టును వినియోగించడం ద్వారా పంట భూమిలో నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచుకునే అవకాశముంది. మెట్ట, నీటి సౌలభ్యం తక్కువుగా ఉన్న మాగాణి భూముల్లో మంచి పంటలు పండించుకోవచ్చు. దీని తయారీ విధానం, ఖర్చు చాలా తక్కువ. మంచి పోషకాలు కలిగిన కంపోస్టును మొక్కలకు అందించేందుకు ఇది దోహదపడుతుంది. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే ఖరీదైన ఉత్పత్తులకన్నా.. కొబ్బరి పొట్టుతో పెద్దగా ఖర్చులేకుండా సేంద్రియ పద్ధతిలో కంపోస్టును తయారు చేసుకొని వినియోగించుకోవచ్చు. – అడ్డాల గోపాలకృష్ణ (94402 50552), కన్వీనర్, రైతుమిత్ర రూరల్ టెక్నాలజీ పార్కు, అమలాపురం అజొల్లా -
ఇలా చేయకపోతే గుండెపోటు ఖాయం
మేరీల్యాండ్ : ఈ యాంత్రిక జీవితంలో డబ్బు సంపాదనపై ఉన్నంత ధ్యాస ఆరోగ్యంపై ఉండటం లేదు. ఏదైనా రోగం వచ్చేంత వరకు అలా ఉండిపోయి వచ్చిన తర్వాత ఆలోచించడం పరిపాటిగా మారింది. వ్యాయామాలు చేయడం మంచిదని తెలిసినా తీరికలేకో, బద్ధకం వల్లో చాలా మంది ఒళ్లు వంచడానికి దూరంగా ఉంటున్నారు. ఫలితంగా లేని పోని రోగాలతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. సరైన వ్యాయామం లేకపోవడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే కాదు గుండెపోటు వంటి ప్రమాదకరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నొక్కి వక్కాణిస్తున్నారు. 6 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు వ్యాయామం చేయని వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శారీరక శ్రమ చేసేవారిలో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువంటున్నారు. మధ్య వయస్కులు వారానికి కనీసం 150 నిమిషాలన్నా శరీరానికి తగినంత పని చెప్పాలంట. నడక, పరుగు, సైకిల్ తొక్కడం లాంటివి చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవంటున్నారు నిపుణులు. మధ్య వయస్కులు ఎవరైతే ఆరు సంవత్సరాలు శారీరక శ్రమ చేస్తారో వారికి గుండెపోటు వచ్చే అవకాశం 23 శాతం తక్కువగా ఉంటుందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్త చియాడీ న్యుమేలే తెలిపారు. -
కదలకుండా కూర్చుంటే కష్టాలే!
టోక్యో : కాసేపు కదలకుండా ఒక చోట కూర్చున్నామంటే చాలు కాళ్లు చేతులూ తిమ్మిర్లు పట్టి ఇబ్బంది పెడతాయి. ఇక కొన్ని గంటలపాటు ప్రయాణం చేయాల్సివచ్చినప్పుడు కదలకుండా అలానే కూర్చుండిపోతాము. అలా కూర్చుంటే సిరల్లో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లు, చేతులు, పొత్తికడుపు కింది భాగాల్లో రక్తం గడ్డకడుతుందని జపాన్‌లోని కుమమోటో యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఇలా గడ్డకట్టడాన్ని వైద్య పరిభాషలో వీనస్ థ్రాంబోఎంబోలిసమ్స్(వీటీఈ) అంటారు. 2016 ఏప్రిల్‌లో జపాన్‌లో భూకంపం సంభవించిన తర్వాత చాలామంది ఆసుపత్రి పాలయ్యారు. దీంతో 21 మెడికల్ ఇన్స్టిట్యూట్ల నుంచి రోగుల డేటాను పరిశోధన కోసం కేటాయించారు. వీరిలో దాదాపు 51 మంది వీటీఈ కారణంగా చికిత్స చేయించుకున్నారని గుర్తించి, వారి నుంచి వివరాలు సేకరించగా.. అందులో 42 మంది రోగులు ఒక రాత్రిమొత్తం కార్లలో ఉండిపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తేలింది. దీనిపై ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని శాస్త్రవేత్తలో ఒకరైన సీజీ హోకిమోటో తెలిపారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఎటువంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయో చెప్పేందుకు ఇది ఒక మంచి ఉదాహరణ అని, ఎక్కువ సమయం ప్రయాణం చేయాల్సి వస్తే అప్పుడప్పుడూ లేచి నడుస్తుండాలని సీజీ సూచించారు. -
వారానికి 10 గ్లాసుల వైన్ తాగుతున్నారా..?
లండన్: మందుబాబులు..మీరు వారానికి 10 గ్లాసుల వైన్ తాగుతున్నారా..? అయితే ఇక మీ జీవితంలో రెండు ఏళ్ల ఆయుషు తగ్గిపోయినట్లేనని అంటున్నారు కేంబ్రిడ్జి యూనివర్సీటీ పరిశోధకులు. ఇటీవలే వారు మద్యంపై వైద్య పరంగా ఓ విస్తృతమైన పరిశోధన చేశారు. వారి అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వ్యక్తి వారానికి పది లేదా అంత కంటే ఎక్కువ గ్లాసుల వైన్‌ను సేవిస్తే రెండేళ్ల ఆయుషు తగ్గుతుందని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పరిశోధన కోసం19 దేశాలకు చెందిన దాదాపు ఆరు లక్షల మందిని పరిశీలించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 40 ఏళ్ల ఓ వ్యక్తి వారానికి 5 పెగ్గుల మద్యాన్ని సేవిస్తే తన జీవిత కాలంలో ఆరు నెలలు నష్టపోతాడని, 10 గ్లాసుల వైన్ తాగితే రెండేళ్లు, 18 గ్లాసులు తాగితే ఐదేళ్ల ఆయుషును కోల్పోతారని యూనివర్సీటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యూనివర్సీటీ శాస్త్రవేత్త డాక్టర్ ఎంజెలా వుడ్ మాట్లాడుతూ..ఇప్పటికే మద్యం సేవించేవారు తాగడం తగ్గించాలని లేదంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మితిమీరిన మద్యం తాగడం వల్ల లివర్ క్యాన్సర్, రక్త పోటు లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. 60 ఏళ్లు దాటిన వారికి మద్యం సేవించడం వల్లే ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు పరిశోధనలో తేలిందన్నారు. -
ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు
సాక్షి, నెల్లూరు : జీఎస్ఎల్వీ -ఎఫ్8 రాకెట్ ప్రయోగం విజవంతం కావాలని కోరుతూ ఇస్రో చైర్మన్ డా.శివన్ బుధవారం చెంగాల పరమేశ్వరీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగం కోసం 27 గంటల పాటు కౌంట్‌డౌన్ చేపట్టిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 4 గంటల 56 నిమిషాలకు జీఎల్‌ఎస్‌వీ-ఎఫ్8 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఈ ప్రయోగ సన్నాహాల్లో భాగంగా శాస్రవేత్తలతో డా. శివన్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాది చివర్లో చంద్రయాన్-2 ప్రయోగం చేయాబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే నెలలో పీఎస్ఎల్వీ రాకెట్‌ను ప్రయోగంచనున్నట్లు తెలిపారు. కాగా ఇస్రో చైర్మన్‌గా జనవరిలో బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కె. శివన్‌కు ఇది తొలి ప్రయోగం. -
నాసా లోకస్ ప్రాజెక్టుకు శ్రీచైతన్య విద్యార్థులు
అల్గునూర్(మానకొండూర్): నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడిస్ట్రేషన్(నాసా) అమెరికాలోని కాలిఫోర్నియా లోకస్ ప్రాజెక్టుకు తిమ్మాపూర్ మండలంలోని శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని చైర్మన్ శ్రీధర్‌రావు తెలిపారు. ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల వల్లే ఇది సాధ్యమైందని, పాఠశాలకు పేరు తెచ్చిన విద్యార్థులను మంగళవారం జరిగిన కార్యక్రమంలో అభినందించారు. నాసా శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ప్రజంటేషన్ ఇచ్చే అరుదైన అవకాశం రావడం గొప్ప విషయమన్నారు. ప్రీతిరెడ్డి, నిత్యారెడ్డి, స్నేహా, సంజన, హర్షిత, సాయిభార్గవి, ఐశ్వర్య, శివానీ, గోపిక, అశ్రిత్‌సాయిని అభినందించారు. పాఠశాల డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం విజయలక్ష్మి, ఆర్ఐ మహిపాల్‌రెడ్డి, అకాడమిక్ కో–ఆర్డినేటర్ మహేశ్, ఏవో అమరేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ విమలారెడ్డి, డీన్ కరుణాకర్‌రెడ్డి, నాసా ఇన్చార్జి ఇందిర, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
వడ వంటి ఆకారం నుంచి చందమామ!
బోస్టన్: వడ ఆకారంలో ఉండే రాయి నుంచి వచ్చిన మేఘాలతో చంద్రుడు ఏర్పడ్డట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సినెస్టియా అని పిలిచే ఈ రాయికి ఆవిరయ్యే గుణం ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు భావిస్తున్నట్లు పేలుడు సంభవించడం వల్ల ఏర్పడలేదని ఓ అధ్యయనంలో తేలింది. ‘అరుణగ్రహం పరిమాణంలో ఉండే ఓ పదార్థం, పురాతన భూమిని ఢీకొనడం వల్ల చందమామ ఏర్పడిందని అందరూ నమ్ముతున్న సిద్ధాంతం’ అని అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన సైమన్ లాక్ పేర్కొన్నారు. అయితే ఇదంతా తప్పు అని లాక్ చెబుతున్నారు. ఢీకొనడం వల్ల చంద్రుడు ఏర్పడేందుకు చాలా తక్కువ అవకాశాలున్నాయని వివరించారు. వారి పరీక్షల ప్రకారం భూమి, చంద్రుడికి సంబంధించి ‘ఫింగర్ప్రింట్లు’ దాదాపు సారూప్యంగా ఉన్నాయని, దీంతో ఇవి రెండు ఒకే వస్తువు నుంచి ఏర్పడినట్లు భావిస్తున్నారు. -
2050 నాటికి మనిషికి మరణమనేది ఉండదు!
పుట్టిన వాడు గిట్టక తప్పదు...గిట్టిన వాడు పుట్టక తప్పదని కురుక్షేత్రంలో అర్జునుడికి కృష్ణుడు గీతను బోధిస్తాడు. అంతే మరి పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే. మళ్లీ పుడతాడో లేదో మనకు తెలియదు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు మాత్రం పుట్టిన మనిషి చనిపోకుండా చిరకాలం జీవించేలా చేయవచ్చని అంటున్నారు. మనిషికి మరణమనేది లేకుండా కాలాతీతంగా జీవించ వచ్చని అందుకు పరిశోధనలు కూడా మొదలయ్యాయని లాన్ పియర్సన్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. కృత్రిమ మేధస్నును ఉపయోగించి, ల్యాబ్‌లో మనిషి అవయవాలు, కణాలను తయారు చేస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే 2050 కల్లా ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని పియర్సన్ వెల్లడించారు. 1970 తర్వాత పుట్టిన ప్రతి మనిషి చిరంజీవిలా మరణమనేది లేకుండా బతకవచ్చని తెలిపారు. ప్రతి మనిషి మరణం లేకుండా బతకాలని కోరుకుంటారనీ అన్నారు. కాకపోతే ఇది ధనిక, సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2060 వచ్చేసరికి మధ్య తరగతి వర్గాల ప్రజలకు , 2070 కల్లా పేద దేశాల్లో సైతం ఈ పద్దతి అమల్లోకి వస్తుందని తెలిపారు. భవిష్యత్తులో వృద్దాప్యం అనేది కూడా ఎవరికి తెలియకుండా పోతుంది. నవ యవ్వనంతో ఉండగలిగేలా శరీర కణాలను, అవయవాలను సృష్టిస్తున్నామని అన్నారు. దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో హిబ (HIBA హైబ్రిడ్ ఇంటిలిజెన్స్ బయోమెట్రిక్ అవతార్)ను ప్రదర్శించారు. అనేక పరిశోధనల అనంతరం దీన్ని సృష్టించారు. మానవ మేధస్సు, కాన్షియస్నెస్ ద్వారా మనుషులు కలుస్తారనే దానికి నిదర్శనమే హిబ. అప్పుడే తనకు మరణమంటూ లేని మనిషిని తయారు చేయాలనే ఐడియా వచ్చిందని పియర్సన్ తెలిపారు. మనిషిని చిరకాలంగా ఉండేలా చేసేందుకు మూడు పద్దతులున్నాయని తెలిపారు. మానవ శరీరాన్ని కృత్రిమంగా తయారు చేయడం ఒకటి. ల్యాబ్‌లో శరీరఅవయవాలను, కణాలను తయారు చేసి అమర్చడం. రోబోలను తయారు చేసి వాటికి చనిపోయిన మానవుని మేధస్సును జోడించడం ఇంకో పద్దతి. ఊహా జనిత ప్రపంచాన్ని సృష్టించి అందులో మానవ మేధస్సును, వారి జ్ఞాపకాలను భద్రపరచి కంప్యూటర్ ద్వారా మనిషిని బతికేలా చేయడం. ఇలా వారి మేధస్సును, జ్ఞాపకాలను భద్రపరిచే చిప్‌ను స్టేక్(stack), దీన్ని మరో శరీరంలోకి ప్రవేశపెట్టడం స్కిన్(skin) అంటారు. తద్వారా మనిషి చనిపోయినా... మళ్లీ తన జీవితం తనకే ఉంటుంది. -
రకుల్‌కు లక్కీచాన్స్
తమిళసినిమా: సినీ తారలకు ముఖ్యంగా కథానాయికలు ఇక్కడ లేకుంటే అక్కడ, అక్కడ కాకుంటే మరో భాషలో అవకాశాలను చేజిక్కింకుంటూనే ఉంటారు. వారికున్న అడ్వాంటేజ్ అదే. నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌నే తీసుకుంటే మొదట్లో ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు. అయితే టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగింది. అక్కడిప్పుడు కాస్త డల్ అనుకుంటున్న సమయంలో కోలీవుడ్‌లో బిజీ అయిపోయింది. నిజానికి స్పైడర్ చిత్రం రకుల్‌ను చాలా నిరాశపరచింది. అంతే కాదు విజయ్‌తో రొమాన్స్ చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి పోయింది. దీంతో రకుల్ మరింత డీలా పడిపోయిందనే చెప్పాలి. అలాంటి సమయంలో సూర్య బ్రదర్స్ ఆదుకున్నారు. కార్తీతో నటించిన ధీరన్ అధికారం ఒండ్రు చిత్ర విజయం రకుల్ప్రీత్సింగ్లో నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ఇక సూర్యకు జంటగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడం ఈ అమ్మడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అంతే కాదు కార్తీతో మరోసారి కొత్త దర్శకుడు రజత్ రవిచంద్రన్ దర్శకత్వం వహించే చిత్రంలో నటించే చాన్స్‌ను దక్కించుకుంది. ఇదిలా ఉంటే హిందీలో నటించిన అయారి చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఆజయ్దేవ్గన్తో మరో చిత్రం చేయనుంది. ఇలాంటి పరిస్థితుల్లో కోలీవుడ్‌లో మరో బిగ్ అవకాశం రకుల్‌ప్రీత్‌సింగ్ తలుపుతట్టింది. అదే వరుస విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్‌తో జత కట్టడానికి రకుల్ రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. శివకార్తికేయన్ ప్రస్తుతం పోన్‌రామ్ దర్శకత్వంలో సమంతతో కలిసి సీమరాజా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. తదుపరి ఇండ్రు నేట్రు నాళై చిత్రం ఫేమ్ రవికుమార్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ఆయనకు జంటగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. ఇది సైంటిఫిక్ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం అట. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్ పాత్ర చాలా డిఫెరెంట్‌గా ఉంటుందని చిత్ర దర్శకుడు అంటున్నారు. చిత్రం ఆబాలగోపాలాన్ని అలరించే విధంగా ఉంటుందట. దీనికి సంగీతమాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతబాణీలు కట్టనున్నారు. చిత్రం జూన్‌లోగానీ జూలైలో గానీ సెట్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. -
‘విజ్ఞానా’నికి బూజు.!
వైరా : వంద అక్షరాల్లోని భావాన్ని ఒక్క చిత్రంలో చూపవచ్చు. వంద చిత్రాల సారాంశాన్ని ఒక ప్రయోగంతో వివరించవచ్చు. విద్యాశాఖలో మేధావులు నమ్మే విలువైన మాటలివి. ఆ దిశగా సత్ఫలితాలు సాధించడానికి ఏర్పాటు చేసిన ప్రయోగాత్మక బోధన.. చివరకు ప్రచార ఆర్భాటంగానే మిగిలింది. అంతంత మాత్రం నిధులు, అందీ అందని ప్రయోగ పరికరాలు, నిధులు దున్వినియోగం వెరసీ విద్యార్థులకు సైన్స్ విద్య అందడం లేదు. మౌఖిక బోధనతోనే పాఠాలు చెప్పి సరిపెడుతున్నారు. దీంతో విలువైన విజ్ఞాన పరికరాలకు దుమ్ము పడుతోంది. సులువుగా అర్థమయ్యేలా.. నియోజకవర్గంలో మొత్తం 37 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో వైరా మండలంలో 9, కొణిజర్ల మండలంలో 7, ఏన్కూరు మండలంలో 8, కారేపల్లి మండలంలో 13 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 6,550 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రాథమిక విద్య నుంచే విద్యార్థులకు పాఠ్యాంశాలపై మక్కువ పెంచడంతోపాటు సులభంగా అర్థమయ్యే వీలుగా ప్రభుత్వం ప్రయోగాత్మక బోధనకు శ్రీకారం చుట్టింది. తద్వారా పాఠ్య పుస్తకాల్లోని అంశాలను కృత్యాధారంగా, ప్రయోగాత్మకంగా బోధించాలని ఆదేశించింది. కొంతకాలం కిందట ప్రయోగ పరికరాలు, రసాయనాల కొనుగోలుకు ఉన్నతాధికారులు అనుమతించారు. ఈ మేరకు పాఠశాలలకు నేరుగా నిధులను విడుదల చేశారు. అందులో కొంత సొమ్ము వెచ్చించి పరికారాలు కొనుగోలు చేయాలనేది ఉద్దేశ్యం. అయతే ఎక్కడా ఆ లక్ష్యం నెరవేరలేదు. అందిన నిధులు అరకొర కావడం, ఆ నిధులతోనే మరిన్నీ కార్యక్రమాలు చేపట్టాల్సి రావడంతో అసలు సమస్య తలెత్తింది. కొన్ని చోట్ల కొనుగోలు చేసిన పరికారలు వాడక మూలనపడ్డాయి. ఫలితంగా లక్ష్యం కుంటుపడటంతో పాటు, విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. నిధులున్నా పరికరాల్లేవ్.. 2009–10 విద్యాసంవత్సరం నుంచి 2018వరకు ఉన్నత పాఠశాలలకు ఇచ్చిన నిధుల వివరాలను పరిశీలిస్తే.. 2009–10లో ఉన్నత పాఠశాలలకు రూ.4,687 చొప్పున, 2010–11లో రూ.17,125 చొప్పున, 2011–12లో రూ. 15వేల చొప్పున సైన్స్ పరికరాల కోసం నిధులు విడుదల చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. 2008 నుంచి 2010 వరకు ఆర్వీఎం ద్వారా ప్రాథమిక పాఠశాలలకు రూ.10వేల చొప్పున, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.50వేల చొప్పున నిధులు విడుదల చేశారు. ఏటా లక్షలాది రూపాయిల సొమ్ము పాఠశాలల నిర్వహణ, ప్రయోగ పరికరాల కోసం కేటాయిస్తున్నా.. ఆశించిన ఫలితం దక్కడం లేదు. ప్రయోగాత్మక బోధన కరువు... విద్యా బోధనలో కృత్యాధార, ప్రయోగాత్మక బోధనలు రెండూ కీలకం. ప్రస్తుత కృత్యధార బోధన జరుగుతోంది. గతంతో పోల్చుకుంటే పదేళ్ల కిందట పాఠ్య పుస్తకాల్లో చిత్రాలు తక్కువగా ఉండేవి. ప్రయోగత్మక బోధన లేకపోవడంతో కేవలం పాఠ్యాంశాలను చదివి చిన్నారులు ఊరుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రయోగాత్మక బోధనకు అవసరమైన ప్రయోగ పరికరాలను సమకూర్చడంతోపాటు, ఆ విధంగా బోధన జరిగేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సైన్స్ పరికరాలతో విద్యాబోధన చేయాలి.. ఉపాధ్యాయులు తప్పనిసరిగా సైన్స్ పరికరాలతోనే విద్యాబోధన చేయాలి. మారిన పుస్తకాల్లోని అంశాలతో ప్రయోగాలు చేస్తే పాఠాలు బోధించే పరిస్థితి లేదు. ప్రతి పాఠశాలలో ప్రయోగశాల ద్వారా బోధన చేయాల్సిందే. – కె. వెంకటేశ్వర్లు, ఎంఈఓ, వైరా -
తొలి ఆంగ్లేయుడు శ్వేతజాతీయుడు కాదా..?
లండన్ : పురాతన బ్రిటిషర్లు శ్వేతజాతీయులు కాదని డీఎన్ఏ పరీక్షల ద్వారా తేలింది. పదివేల సంవత్సరాల క్రితం మరణించిన వ్యక్తి ఎముకలపై తొలిసారిగా నిర్వహించిన అత్యంతాధునిక జన్యు పరీక్షలు, ఫేషియల్ రీకన్స్ర్టక్షన్ టెక్నిక్స్ ద్వారా అసాధారణ విషయాలు వెలుగుచూశాయి. తొలితరం ఆంగ్లేయులు నలుపు వర్ణంతో, ఉంగరాల జుట్టు, నీలి కళ్లు కలిగిఉన్నారని తెలిసింది. బ్రిటన్‌లోని సోమర్సెట్ చెద్దార్ లోయలో లభించిన అతిపురాతన మానవ కళేబరంపై పరీక్షలు నిర్వహించిన శాస్త్రవేత్తలు విస్తుగొలిపే అంశాలను వెల్లడించారు. తాము పరిశీలించిన మానవ కళేబరం జీవించి ఉంటే సదరు వ్యక్తి ‘బ్లాక్’ అని స్పష్టం చేశారు. ఆంగ్లేయులు శ్వేతజాతీయులు కాదని, కాలక్రమేణా వారి చర్మం వర్ణం మారిఉండవచ్చని తమ పరిశోధనలో తేలినట్టు వారు పేర్కొన్నారు. 1903లో సోమర్సెట్లోని చెద్దార్లో లభించిన కళేబరం, వాటి ఎముకలు అప్పటి నుంచి సంచలనంగానే మారాయి. వందేళ్లకు పైగా శాస్త్రవేత్తలు ‘చెద్దార్ మెన్’ కథను వెలికితీసే పనిలో పడ్డారు. అతని ముఖకవళికలు, పూర్వాపరాలు, తన పూర్వీకుల గురించి ఎలాంటి విషయాలు వెలుగుచూస్తాయనేది ఎప్పటికప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. నేచురల్ హిస్టరీ మ్యూజియం, యూనివర్సిటీ కాలేజ్ లండన్ నిర్వహించిన జన్యు పరీక్షల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయని మ్యూజియం శాస్త్రవేత్త డాక్టర్ టామ్ బూత్ చెప్పారు. -
సైన్స్ అండ్ టెక్నాలజీకి అరకొర నిధులే..
ఆధునిక సాంకేతికతను వినియోగించే దేశంగానే భారత్ మిగిలిపోకూడదు.. సొంతంగా టెక్నాలజీని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలి’’ అని ఆర్థిక సర్వేలో ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించింది. అయితే కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం అది అంతగా ప్రతిఫలించలేదు. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ రంగాల్లో పరిశోధనల కోసం అత్యున్నత స్థాయి నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో ప్రకటించడం కొంత సానుకూల పరిణామం. అలాగే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వినియోగంపైనా ఆర్థిక మంత్రి ఆసక్తి కనబరిచారు. బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ నిర్వహణలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఈ టెక్నాలజీతో లావాదేవీల నిర్వహణలో అవినీతి, అక్రమాల్ని పూర్తిస్థాయిలో అడ్డుకోగలమని కేంద్రం భావిస్తోంది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అంటే.. ‘అన్ని లావాదేవీలను నమోదు చేసేందుకు ఉపయోగపడే ఒక పద్దుల పుస్తకం. ఇది ఒకే చోట కాకుండా.. నెట్‌వర్క్‌లో ఎన్ని కంప్యూటర్లు ఉంటాయో అన్నింటిలోనూ రహస్య సంకేత భాషలో నిక్షిప్తమై ఉంటుంది. అందరూ అనుమతిస్తేగానీ ఈ పద్దుల పుస్తకంలో చిన్న మార్పైనా చేయడం సాధ్యం కాదు. ఎవరైనా చేయాలనుకుంటే వెంటనే అందరికీ తెలిసిపోతుంది’. ప్రభుత్వ పథకాల అమలులో ఈ టెక్నాలజీని వినియోగించాలన్నదే కేంద్రం భావన. 1.5 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం ఇక దేశంలో జనాభా కంటే ఎక్కువ మొబైల్స్ అందుబాటులో ఉన్నా.. ఇంటర్నెట్ విషయంలో గ్రామీణ భారతం ఎంతో వెనుకంజలో ఉంది. ఈ లోటు భర్తీకి నేషనల్ నాలెడ్జ్ సెట్‌వర్క్ పేరుతో గ్రామ పంచాయతీల్ని అనుసంధానించే ప్రాజెక్టును గత ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే లక్ష గ్రామ పంచాయతీల్ని అనుసంధానించినట్లు ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన 1.5 లక్షల గ్రామాల్ని శరవేగంగా భారత్ నెట్లోకి చేర్చే చర్యలు ముమ్మరం చేస్తామని ఈ బడ్జెట్లో ప్రకటించడం ఆహ్వానించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ కనెక్టివిటీ పెంచేందుకు ఐదు లక్షల వైఫై హాట్స్పాట్ల ఏర్పాటు ప్రకటన, డిజిటల్ ఇండియా పథకానికి కేటాయింపులు రెట్టింపు చేయడం, 5జీ మొబైల్ టెక్నాలజీ పరీక్షలకు చెన్నై ఐఐటీలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వంటివి శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన ఇతర ముఖ్యాంశాలు. మొదటి నుంచి భారతదేశంలో పరిశోధనలకు బడ్జెట్లో కేటాయింపులు నామమాత్రమే.. స్థూల జాతీయోత్పత్తిలో కనీసం ఒక్క శాతం నిధుల్ని పరిశోధనలకు కేటాయించాలని శాస్త్రవేత్తలు చాలాకాలంగా కోరుతున్నారు. అమెరికా, చైనా వంటి దేశాల్లో స్థూల జాతీయోత్పత్తిలో మూడు నుంచి నాలుగు శాతం నిధులు శాస్త్ర, సాంకేతిక రంగాలకు కేటాయిస్తుండగా.. మన వద్ద అవి అరశాతం దాటకపోవడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్ -
ప్రాంతీయ భాషలోనే సైన్స్
కోల్‌కతా: శాస్త్ర సాంకేతికాంశాలను విస్తృతపరిచేందుకు వ్యవహారిక భాష వినియోగం పెరగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతలోనూ సైన్స్‌పై ఆసక్తి పెరుగుతుందన్నారు. భాష ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునేందుకు అడ్డంకి కారాదన్నారు. ప్రతి శాస్త్రవేత్త, పరిశోధనకారుడు నవభారత నిర్మాణం దిశగా తన సృజనాత్మకతకు పదునుపెట్టాలన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ సత్యేంద్రనాథ్ బోస్ 125వ జయంతి స్మారక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా కోల్‌కతాలో ఏర్పాటుచేసిన కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భారత శాస్త్రవేత్తలు, పరిశోధనకారులు తమ మేధస్సును దేశ ప్రజలకోసం, వారి సామాజిక–ఆర్థిక అవసరాల కోసం వినియోగించాలని పిలుపునిచ్చారు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘మన యువతలో సైన్స్‌పై ఆసక్తిని, అభిరుచిని పెంచేందుకు సైన్స్ కమ్యూనికేషన్‌ను మరింత విస్తృతపరచాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం భాష అడ్డంకి కారాదు’ అని అన్నారు. ‘2018లో ప్రతి భారతీయుడు మన పూర్వీకులు కన్న నవభారత స్వప్నాన్ని నెరవేర్చేందుకు ప్రతినబూనాలి. 2018 సంవత్సరాన్ని వాటర్‌షెడ్ సంవత్సరంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినందున శాస్త్రవేత్తలు ఈ దిశగా సృజనాత్మక అంశాలపై దృష్టిపెట్టాలి. విద్యాసంస్థలు, పరిశోధన–అభివృద్ధి సంస్థలు ఒకే వేదికపైకి రావటం ద్వారా పరిశోధన మరింత విజయవంతమయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. భారత శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు దేశానికి గర్వకారణమన్న ప్రధాని.. ఇస్రో 100 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపినప్పుడు ప్రపంచమంతా ఆసక్తిగా గమనించిందన్నారు. నీరు, విద్యుత్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో కొత్త ఆవిష్కరణలకోసం ఎదురుచూస్తున్నామన్నారు. బెంగాల్ పవిత్రమైన గడ్డపై వివిధ రంగాల ప్రముఖులు పుట్టారని మోదీ ప్రశంసించారు. ఆచార్య జేసీ బోస్, మేఘనాథ్ సాహా, ఎస్ఎన్ బోస్ వంటి మహామహులు జన్మించారని.. ఇప్పటికీ వీరి ప్రయోగాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. 1894, జనవరి 1న జన్మించిన భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ 1920ల్లో క్వాంటమ్ మెకానిక్స్‌లో విశేషమైన ప్రయోగాలు చేశారు. రెండు ఉప కణాలను నిర్వచించే విషయంలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌తో కలిసి విస్తృత పరిశోధనలు చేశారు. ఈ ప్రయోగంలో కనుగొన్న కణాలకు బోస్ పేరుతో ‘బోసాన్స్’గా పిలుస్తున్నారు. మన సైంటిస్టులే బెస్ట్: హర్షవర్ధన్ భారత శాస్త్రపరిశోధన సంస్థలు అందులో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, పరిశోధకులు ప్రపంచంలోని ఉత్తమ జాబితాలో ఉన్నారని.. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. సత్యేంద్రనాథ్ బోస్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి.. ప్రపంచ నానో టెక్నాలజీలో భారత్ మూడో స్థానంలో ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. -
ఆపిల్స్, టమాటాలతోఊపిరితిత్తులకు మేలు!
ధూమపానం మానేసిన వారికి ఎప్పుడూ ఓ సందేహం ఉంటుంది. కొద్దోగొప్పో పాడైన తమ ఉపిరితిత్తులను ఆరోగ్యవంతంగా చేయవచ్చా? అని. ఈ సందేహంపై జాన్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ ప్యారిస్ శాస్త్రవేత్తలు ఒక స్పష్టత ఇచ్చారు. తినే ఆహారంలో టమాటాలతోపాటు అధిక స్థాయిలో పండ్లు ముఖ్యంగా ఆపిల్స్ తింటే ఊపిరితిత్తులకు జరిగిన నష్టాన్ని తగ్గిస్తుందని వారు అంటున్నారు. దాదాపు పదేళ్లపాటు తాము పరిశీలన జరిపామని.. ఈ కాలంలో ఆపిల్స్, టమాటాలు ఎక్కువగా తిన్న మాజీ ధూమపాన ప్రియుల్లో ఊపిరితిత్తుల పనితీరు ఇతరులతో పోలిస్తే మెరుగ్గా ఉందని వెనెస్సా గార్షియా లార్సెన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. జర్మనీ, నార్వే, యునైటెడ్ కింగ్‌డమ్‌లకు చెందిన కొంతమందిపై ఈ పరిశోధన జరిగింది. వారు తీసుకునే ఆహారం, ఊపిరితిత్తుల పనితీరును పదేళ్ల అంతరంలో రెండు సార్లు పరిశీలించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని చెప్పారు. సగటున రోజుకు రెండు టమాటాలు లేదంటే మూడుకంటే ఎక్కువసార్లు పండ్లు తినేవారి ఊపిరితిత్తులు... ఒకటి కంటే తక్కువ టమాటాలు, పండ్లు తినే వారికంటే నెమ్మదిగా సమస్యలకు గురవుతున్నట్లు తెలిసిందన్నారు. టమాటాలు, పండ్లు ఊపిరితిత్తులకు మేలుస్తాయని, అలాగే ధూమపానం వల్ల ఊపిరితిత్తులకు జరిగిన నష్టాన్ని సరిచేసేందుకు ఇవి ఉపయోగపడతాయని తమ పరిశోధన చెబుతోందన్నారు. -
ఈగ.. యముడి మెరుపు తీగ
వాషింగ్టన్: దోమలు, బొద్దింకలు, ఇతర పురుగులు మన ఇంట్లోకి వస్తే వాటిని చంపడమో.. బయటకు తరమడమో చేస్తే గానీ మనకు నిద్రపట్టదు. అయితే ఇళ్లల్లోకి వచ్చే ఈగలను మనం అంతగా పట్టించుకోం. దీనికి కారణం అవి అంత ప్రమాదకరమైనవి కావని మనందరి అభిప్రాయం. కానీ మన అభిప్రాయం తప్పంటున్నారు శాస్త్రవేత్తలు. వివిధ జాతులకు చెందిన హానికరమైన బ్యాక్టీరియాలను వందల సంఖ్యలో మన ఇళ్లల్లోకి ఈగలు మోసుకొస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీంతో పలు రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయని అధ్యయనం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా విహారయాత్రల్లో ఈగల గోల ఎక్కువగా ఉంటుంది.. అక్కడికి తీసుకెళ్లిన ఆహారం, ఇతర వంట పదార్థాలపై అవి వాలిపోతాయి. అయితే ఇలా ఈగలు వాలిన ఆహారాన్ని తినవద్దని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సుమారు 116 ఈగ జాతులపై పరిశోధన చేశారు. దీనిలో భాగంగా ఈగల కాళ్లు, రెక్కలను పరిశీలించగా.. కాళ్లపై అధిక శాతం హానికరమైన సూక్ష్మజీవులు ఉన్నట్లు గుర్తించారు. ఈగలు వాలినప్పుడు ఇవి ఒకచోట నుంచి మరోచోటుకి వ్యాప్తి చెందుతున్నాయని వర్సిటీ పరిశోధకులు స్టీఫెన్ షుస్టెర్ వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
బుల్లి చేతులు.. బడా ఆవిష్కరణలు
విజయనగరంఅర్బన్ : వారంతా పదో తరగతిలోపు విద్యార్థులు. కానీ వాళ్ల ఆలోచనలు మాత్రం శాస్త్రవేత్తలను తలపించాయి. సందర్శకులను అబ్బుర పరిచాయి. విజయనరం ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక కోటలోని ఆదివారం నిర్వహించిన విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో వివిధ పాఠశాలలకు చెందిన 250 మంది విద్యార్థులు 66 వైజ్ఞానిక పరిశోధనా నమూనాలను ప్రదర్శించారు. వ్యవసాయ రంగం నుంచి అంతరిక్షయానం వరకు అన్ని అంశాలకు చెందిన నమూనాలు ఆకట్టుకున్నాయి. గంట్యాడ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన ‘వ్యర్థ పదార్థాలతో ఇటుకల తయారీ’, లొట్లపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన ‘చెరకు పంట–పొదుపైన సాగు’, న్యూ సెట్రల్ స్కూల్ విద్యార్థుల ‘పెరటి సాగు నీటి పొదుపు’, ఫోర్ట్ సిటీ స్కూల్ విద్యార్థుల ‘అంతరిక్షయానంలో శాటిలైట్స్’ ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకొన్నారు. తొలుబొమ్మల ద్వారా గ్రామీణ వాతారణలో ప్రజాజీవనం, మహారాజా అటానమస్ కళాశాల వివిధ విభాగాల ప్రయోగశాలను ప్రదర్శనలో ఉంచారు. ఫిజిక్స్ విభాగంలో భౌతిక శాస్త్రంలోని తాజా పరిశోధనలు పెట్టారు. కళాశాలకు చెందిన యంగ్ ఎంటర్ప్రైజెస్ బృందం తయారు చేసిన మహిళా అలంకార వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల బ్యాటరీ బైక్ నమూనా, ఎంఆర్‌పీజీ కళాశాల ఎకనమిక్స్ విద్యార్థుల జీఎస్టీపై అవగాహన సదస్సు, ఎంఆర్ అటానమస్ కళాశాల విద్యార్థుల కరెన్సీ నోట్ల ప్రదర్శన, విశాలాంధ్ర పుస్తక ప్రదర్శన సందర్శులకు ఆహ్లాదాన్ని పంచాయి. ఆకట్టుకున్న టెర్రాకోట మట్టి కళాకృతులు పట్టణంలోని ఏటీకె సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆశ్రమం పొందుతున్న వృద్ధులు తయారు చేసిన టెర్రాకోట మట్టి కళాకృత్యాల ప్రదర్శన ఆకట్టుకుంది. సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఖలీలుల్లా ఫరీఫ్, ప్రధాన కార్యదర్శి ఎం.విజయభాస్కర్ ప్రోత్సహంతో ఆశ్రమంలో ఉన్న వృద్ధులు ఈ కళాకృత్యాలను తయారు చేశారు. ఇంట్లో అలకంరణ వస్తువుల నుంచి విని యోగపు వస్తువుల వరకు పలురకాల ప్రదర్శనలో ఉంచారు. -
తెలంగాణావాసికి శాంతి స్వరూప్ పురస్కారం
హైదరాబాద్ సిటీ: నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన నరేశ్ పట్వారీకి ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం లభించింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ శుక్రవారం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. నరేశ్ పట్వారీ ప్రస్తుతం ఐఐటీ ముంబైలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు పతకంతో పాటు రూ.5లక్షల నగదు అందజేస్తారు. 65 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ప్రతి నెలా రూ.15 వేల నగదు అందజేస్తారు. -
కల్లూరుకు చేరిన పర్యావరణ రైలు
పామిడి : పర్యావరణ అంశాలతో కూడిన ఎగ్జిబిషన్ ట్రైన్ గుల్బర్గా నుంచి శనివారం ఉదయం 9 గంటలకు గార్లదిన్నె మండలం కల్లూరు రైల్వేస్టేషన్‌కు చేరింది. ఈ సందర్భంగా 10 గంటలకు గుంతకల్ అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ సుబ్బరాయుడు రిబ్బన్ కట్‌చేసి ట్రైన్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. రైల్వే ఫ్యాకల్టీలు ట్రైన్‌లోని పర్యావరణ అంశాలతో కూడిన సైన్స్ ఎగ్జిబిషన్‌పై అవగాహన కల్పించారు. వాతావరణంలోని మార్పులు, వాతావరణ కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై వారు డెమో ఇచ్చారు. రెండురోజులపాటు కల్లూరులో ఈ ట్రైన్ ఎగ్జిబిషన్ ఉంటుందని స్టేషన్ మాస్టర్ రాజేంద్రనాయుడు తెలిపారు. -
మైండ్‌ను దొంగిలించే రోజులొస్తున్నాయి?
జెనీవా: మన మదిలో చెలరేగే ఆలోచనల్ని, భావాల్ని ఇతరులు తెలుసుకోగల, మార్చగల, దొంగిలించగల రోజులు రాబోతున్నాయి. ‘మైండ్ రీడింగ్ టెక్నాలజీ’తో పరిశోధకులు దాన్ని సుసాధ్యం చేయబోతున్నారు. మెదడు పనితీరును శాస్త్రీయంగా డీకోడ్ చేయడం ద్వారా ఇది సాధ్యం కానుంది. ఈ విషయాన్ని ‘సైంటిఫిక్ అమెరికా’ అనే మేగజీన్ ప్రచురించింది. అయితే, ఈ మైండ్ రీడింగ్ టెక్నాలజీ వాస్తవరూపం దాలిస్తే.. మానవాళికి పెనుముప్పని మరో వర్గం శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన ఆలోచనలను ఇతరులు నియంత్రించడం జరిగితే ఎదురయ్యే అనర్ధాలను అంచనా కూడా వేయలేమంటున్నారు. అందువల్ల ఇప్పటినుంచే మానవహక్కులకు సంబంధించిన కొత్త చట్టాలను రూపొందించాలని స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వర్సిటీ చెందిన శాస్త్రవేత్త మార్సిలో ఐనెకా కోరుతున్నారు. -
అహింసా పరమోధర్మః
ఆత్మీయం ధర్మాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నింటిలోను అహింస సర్వోత్తమమైన ధర్మం. హింసను మించిన పాపం లేదు. కరుణను మించిన పుణ్యం లేదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. హింస అంటే మరో జీవిని చంపడం లేదా గాయపరచడం ఒక్కటే కాదు... ఒకరికి అయిష్టమైన పనులను వారితో బలవంతంగా చేయించడం కూడా హింస కిందికే వస్తుంది. అలాగే ఇతరుల మనసుకు బాధ కలిగించే మాటలను వాడటం కూడా హింసే. ఎవరికీ, ఎప్పుడూ ఏ రకమైన బాధని కలిగించకుండా ఉండగలగటమే అహింస. త్రికరణశుద్ధిగా అహింసను పాటించేవారి దగ్గర ప్రతి ఒక్కరు శత్రుత్వాన్ని వదిలి ప్రశాంతంగా ఉంటారని యోగసూత్రం చెబుతోంది. అంటే అహింసాచరణుల సన్నిధిలో కూడా ప్రశాంతంగా ఉండటమే కాదు – పులి, జింక కూడా కలసిమెలసి ఉంటాయి వారి ఆశ్రమంలో. యోగాంగాలలో ఒకటి అహింస. ఆయుధాలను వదిలేయడమే అహింస అనుకోవచ్చు. కానీ, అహింసే ఒక పదునైన ఆయుధం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, గాంధీజీ ఆ విషయాన్ని రుజువు చేశారు. కత్తిపట్టి యుద్ధం చేయడానికి ఎంతో ధైర్యం అవసరం. కానీ, అహింసను ఆయుధంగా స్వీకరించడానికి అంతకంటే ఎక్కువ ధైర్యం అవసరమని గాంధీ మహాత్ముడు చెబుతాడు. -
ఒక్క క్లిక్‌తో.. విలువైన సమాచారం
నిడమర్రు: ఎన్నో భాషల్లోని విలువైన విజ్ఞాన సంపదను ‘భారత జాతీయ డిజిటల్ లైబ్రరీ’ ద్వారా పొందవచ్చు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో ఖరగ్‌పూర్ ఐఐటీ సమన్వయంతో ప్రాథమిక విద్య నుంచి పీజీ స్థాయి వరకూ అవసరమైన విలువైన విజ్ఞాన సంపదను ఇందులో నిక్షిప్తం చేశారు. వివిధ రకాల పోటీ పరీక్షలు, ఉమ్మడి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ డిజిటల్ లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన వివరాలు మీకోసం. 70 భాషల్లో..జాతీయ డిజిటల్ లైబ్రరీ ద్వారా ఒక్క క్లిక్‌తో విలువైన విద్యా సంబంధిత సమాచారం ఎప్పుడైన ఎక్కడైనా చాలా సులువుగా పొందవచ్చు. ఈ విజ్ఙాన సంపదను 70 భాషల్లో 60 పైగా అంశాలపై 15 లక్షల ఈ– బుక్స్, వేలాది వీడియో పాఠాలు, 10 వేలకు పైగా ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన డిజిటల్ తరగతులు, 2 లక్షల ఆడియో పాఠాలు, టెక్నాలజీ, సైన్స్, వ్యవసాయం, విలువలతో కూడిన విద్య వంటి ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ’టెక్నికల్ రిపోర్ట్స్, మోనోగ్రాఫ్, టెక్నికల్ మాన్యువల్, ఆల్బమ్స్, న్యాయ శాస్త్ర తీర్పులు వంటివి పలు డాక్యుమెంట్స్, వీడియోలు, సాఫ్ట్వేర్ రూపంలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆంగ్లభాషపై పట్టు సాధించొచ్చు..ఆంగ్ల భాషకు సంబంధించిన సంప్రదాయ పద్ధతులు, స్పీకింగ్ లెర్నింగ్, ఉచ్ఛారణకు సంబంధించిన ఆడియో/వీడియో పాఠాలు అందుబాటులో ఉన్నాయి. భారత విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు ఈ స్టడీ మెటేరియల్ బాగా ఉపయోగపడుతుంది. విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు రాసే జీఆర్‌ఏ, టోఫెల్ వంటి పరీక్షలకు సన్నద్ధమయ్యేవారికి ఈ లైబ్రరీలోని ఈ– బుక్స్ చాలా ఉపయోగకరం..ఎన్నో భాషల్లో ..పలు భారతీయ భాషల్లో టెక్నాలజీ, విజ్ఞాన శాస్త్రం, గణితం, ఆర్ట్స్ గ్రూపులకు సంబంధించిన పాఠ్యాంశాలు, సైకాలజీ, తత్వశాస్త్రం, సోషల్ సైన్స్, రిలీజియన్, చరిత్ర, భూగోళ శాస్త్రాలకు సంబంధించిన వేలాది పుస్తకాలు, రికార్డ్స్, వీడియోలు, ప్రాక్టికల్స్ ఈ లైబ్రరీ ద్వారా పొందవచ్చు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు..జాతీయ విద్యా పరిశోధనా శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) రూపొందించిన ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకూ హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రచురితమైన ప్రతి పుస్తకం ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఈ – గ్రంథ్ నుంచి 50 వేలకు పైగా వ్యవసాయ రంగానికి సంబంధిత ఈ– బుక్స్, ఆర్టికల్స్, శాస్త్రవేత్తల కథనాలు పొందవచ్చు. రిజిస్ట్రేషన్ ఇలా..భారత జాతీయ డిజిటల్ లైబ్రరీ సేవలు పొందాలంటే జ్టి్టpట://జీnఛీ .జీజ్టీజుజp.్చఛి.జీn అనే వెబ్సైట్లో ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఈ– మెయిల్ ఐడీ, పాస్వర్డ్ నమోదు చేసి రిజిస్ట్రేషన్ కాలం క్లిక్ చెయ్యాలి. తర్వాత కన్ఫర్మ్ చేసుకునేందుకు మీ ఈ–మెయిల్ ఇన్‌బాక్స్‌కి ఓ మెసేజ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తయినట్టు. ఇలా మీరు జాతీయ డిజిటల్ లైబ్రరీ సేవలు ఉచితంగా పొందవచ్చు. -
భగ్గుమంటున్న సూరీడు
శివరాత్రితో చలి నిష్క్రమించాక తీరిగ్గా వచ్చే అలవాటున్న వేసవి పిలవని పేరంటంలా ముందే వచ్చి ఠారెత్తిస్తోంది. వాస్తవానికి ఫిబ్రవరి నెలాఖరునుంచే ఎండలు మండుతున్నాయి. గత కొన్ని వారాలుగా అవి క్రమేపీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు లండన్, పెన్సిల్వేనియాలలోని శాస్త్రవేత్తలతోపాటు భారత వాతావరణ విభాగం చేస్తున్న హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. ఈసారి మాత్రమే కాదు...మున్ముందు కూడా భారత్‌లో భారీ వడగాడ్పులుంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మహానగరాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందని వారంటున్నారు. ఈసారి వేసవిలో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉండొచ్చు గనుక అందుకు అనుగుణమైన కార్యాచరణ ప్రణాళికను పాటించాలని భారత వాతావరణ విభాగం, జాతీయ విపత్తు నివారణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంసీ) రాష్ట్రాలను కోరాయి. రెండేళ్లనాడు దేశంలో వడగాడ్పుల వల్ల దాదాపు 2,500మంది మరణించారు. అందులో దాదాపు 2,000 మరణాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంభవించినవే. ఇవి అధికారిక గణాంకాలు. రికార్డుల కెక్కని మరణాలు కూడా కలుపుకుంటే ఇవి మరిన్ని రెట్లు ఎక్కువ ఉంటాయని చెప్పవచ్చు. మృతుల్లో అధిక శాతంమంది రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద వర్గాలవారే. ఎండలు మండుతున్నా, వడగాడ్పులు వీస్తున్నా ఏదో ఒక పని చేస్తే తప్ప ఇల్లు గడవని జీవితాలు వారివి. ఆ వర్గాల్లో ఉండే నిరక్షరాస్యత వల్ల కావొచ్చు... వారికి పలుకుబడి అంతగా లేకపోవడంవల్ల కావొచ్చు ఆ మరణాల్లో చాలా భాగం వడగాడ్పుల జాబితాలో చేరవు. వడగాడ్పులు కూడా ఇతర ప్రకృతి వైపరీత్యాలైన వరదలు, భూకంపాలు, చలిగాలులు వగైరాల వంటివే. అయితే ప్రభుత్వాలు మాత్రం ఇతర వైపరీత్యాలు వచ్చినప్పుడు స్పందించినట్టుగా వడగాడ్పుల విషయంలో వ్యవహరించవు. వాటి దృష్టిలో అసలు ఈ గాడ్పులు ప్రకృతి వైపరీత్యమే కాదు. 2012 వరకూ చలిగాలుల్ని కూడా ప్రకృతి వైపరీత్యాలుగా పరిగణించలేదు. ఆ ఏడాది ఉత్తరాదిన చలిగాలులకు అధిక సంఖ్యలో ప్రజలు మరణించాక తొలిసారి అది కూడా ప్రకృతి వైపరీత్యాల జాబితాలోకి వెళ్లింది. వడగాడ్పుల తీవ్రత దక్షిణాదిలోనే ఎక్కువుంటుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాల్లోనే అధికం. వడగాడ్పుల్ని ప్రకృతి వైపరీత్యంగా చూడాలన్న డిమాండు కొంతకాలంగా వినబడుతున్నా కేంద్రం ఆ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అదే జరిగితే వడదెబ్బ తగిలినవారికి వైద్య సదుపాయం కల్పించడం, మరణాలు సంభవించిన పక్షంలో వారి కుటుం బాలకు లక్షన్నర చొప్పున పరిహారం ఇవ్వడం వీలవుతుంది. ఆ అవకాశం లేక పోవడం వల్ల ఆ కుటుంబాలు చెప్పనలవికాని ఇబ్బందులు పడుతున్నాయి. వడగాడ్పుల వల్ల కేవలం మరణాలే కాదు... ఇతరత్రా అనారోగ్య సమస్యలు కూడా పుట్టుకొస్తాయి. ఇక రక్తపోటు, మధుమేహం, హృద్రోగం, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారికి ఆ సమస్యల తీవ్రత మరింత పెరుగుతుంది. తాగునీటి సమస్య లేకుండా చూడటం, పశు దాణా లభ్యమయ్యేలా చూడటం కూడా కీలకం. అందుకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు రూపొందించాలి. ఉన్నంతలో వేసవి తాపం పెరుగుతున్న దశలోనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించి రాష్ట్రాలను కదిలించడం మేలు కలిగించే విషయం. సాధారణ స్థాయి ఉష్ణోగ్రతకు మించి అయిదారు డిగ్రీలు మించితే వడగాడ్పుగా పరిగణిస్తారు. ఈసారి కూడా రాష్ట్రాలకు పంపిన కార్యాచరణ ప్రణాళిక అనేక చర్యలను సూచిం చింది. వడగాడ్పులపై వాతావరణ విభాగం అందజేసే సమాచారం ఆధారంగా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేయడం, ఉష్ణోగ్రతలు ఆరు డిగ్రీల సెల్సియస్ లేదా అంతకన్నా ఎక్కువగా పెరిగితే రెడ్ అలెర్ట్ జారీ చేయడం వంటివి ఇందులో కొన్ని. దీన్ని అమల్లో పెట్టాక జాతీయ గ్రామీణ ఉపాధి పథకంకింద చేపట్టే పనుల్లో నిర్దిష్ట సమయాల్లో కూలీలతో పనిచేయించడాన్ని నిలిపేయిస్తారు. అలాగే నిర్మాణ రంగంలోనూ, ఇతరత్రా రంగాల్లోనూ పని స్థలాల్లో ప్రథమ చికిత్సకు అవసరమైన వన్నీ అందుబాటులో ఉంచడాన్ని తప్పనిసరి చేస్తారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వగైరాల్లో రీహైడ్రేషన్ సౌకర్యం కల్పిస్తారు. ఆసుపత్రుల్లో అదనపు బెడ్ల ఏర్పాటు, కూలర్లు సమకూర్చడం వంటి చర్యలు తీసుకుంటారు. వడదెబ్బ మరణాలను ధ్రువీకరించేందుకు స్థానికంగా కమిటీల ఏర్పాటు, వడగాలుల సమాచారాన్ని అందించడంతోపాటు ప్రజానీకంలో చైతన్యం కలగజేసేందుకు, వడదెబ్బ మృతుల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు నోడల్ అధికారిని నియమిస్తారు. నాలుగేళ్లక్రితం అహ్మదాబాద్, నాగపూర్, భువనేశ్వర్ తదితర నగరాలను ఎంచు కుని వడగాడ్పుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి స్థానిక సంస్థలనూ, స్వచ్ఛంద సంస్థలనూ అందులో భాగస్వాముల్ని చేసి అమలు చేశాక మెరుగైన ఫలితాలు వచ్చాయని వెల్లడైంది. తెలుగు రాష్ట్రాలతోపాటు అనేక చోట్ల నిరుడు ఆ విధానాన్నే అనుసరించడంవల్ల వడదెబ్బ మృతుల సంఖ్య 50 శాతం తగ్గింది. నిజానికి ఈ శతాబ్దంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2016 రికార్డయింది. గాడి తప్పిన ప్రకృతిని సరిచేయడం ఏ ఒక్క దేశం వల్లనో సాధ్యం కాదు. అది సమష్టిగా జరగాల్సిన కృషి. పర్యావరణం క్షీణించడానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న డిమాండుకు అమెరికా, ఇతర పారిశ్రామిక దేశాలు తలొగ్గి ఎంతో కాలం కాలేదు. ఆ తర్వాత కూడా ఏ మేరకు కోత విధించుకుం టాయో చెప్పడంలోనూ తాత్సారం చేశాయి. ఈలోగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ సానుకూల దృక్పథాన్ని ధ్వంసం చేసే చర్యలకు దిగారు. వాతావరణ ఒప్పందాలకు సంబంధించిన విధానాలను రద్దు చేసే కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేశారు. వెనకో ముందో ఇతర సంపన్న దేశాలు కూడా ఈ బాట పట్టే అవ కాశం లేకపోలేదు. కాబట్టి రానున్నది మరింత గడ్డుకాలం. కనుక ప్రకృతి వైపరీ త్యాల విషయంలో మరింత అప్రమత్తత, వాటివల్ల కలిగే నష్టం కనిష్ట స్థాయికి పరి మిత మయ్యేలా చూడటం తప్పనిసరి. -
ఫ్యూచర్ కోసం.. ఫీచర్ కార్లు
కొత్త కారు మార్కెట్లోకి వచ్చిందంటే చాలు.. దాంట్లో ఏయే ఫీచర్లు ఉన్నాయి? మైలేజీ బాగుంటుందా? ఇంటీరియర్ ఎలా ఉంది అనే విషయాలను మనం ఆసక్తిగా గమనిస్తాం. టెక్నాలజీ రోజు రోజుకూ మారిపోతున్న ఈ తరుణంలో భవిష్యత్తులో వచ్చే అవకాశమున్న కార్ల గురించి మరీ ఎక్కువ ఆసక్తి ఉండటం సహజం. మరి.. ఒకేచోట కొన్ని పదుల సంఖ్యలో కొత్త కార్లు కొలువుదీరితే...? అబ్బో సూపర్ అంటున్నారా? నిజమే. ఇటీవలే ముగిసిన జెనీవా మోటర్ షోలో జరిగింది ఇదే. ఇక్కడ ప్రదర్శించిన కొన్ని కార్లు, వాహనాల వివరాలను ఇప్పటికీ కొన్నిసార్లు ముచ్చటించుకున్నప్పటికీ మరికొన్ని ఫ్యూచర్కార్ల గురించి స్థూలంగా. స్కిల్లా : ఇటలీకి చెందిన రవాణా వాహనాల డిజైనింగ్ సంస్థకు చెందిన 16 మంది విద్యార్థులు సిద్ధం చేసిన కాన్సెప్ట్ కారు ఇది. వీరిలో ఐదుగురు భారతీయ విద్యార్థులూ ఉండటం విశేషం. 2030 నాటికల్లా ఇలాంటి కారును మార్కెట్లోకి తీసుకురావాలన్నది కంపెనీ లక్ష్యం. అయితే ఇందులో కేవలం ఇద్దరు మాత్రం ప్రయాణించగలరు. పూర్తిగా విద్యుత్తుతోనే నడుస్తుంది. బ్రష్‌లెస్ ఎలక్ట్రిక్ మోటర్ల సాయంతో నడవడం వల్ల అతితక్కువ విద్యుత్తుతో ఎక్కువ దూరం ప్రయాణించగలదు. ఐ–ట్రిల్ : టయోటా కంపెనీ అభివృద్ధి చేస్తున్న కాన్సెప్ట్ కారు ఇది. టాటా నానో కారును పోలిన డిజైన్ ఉన్నప్పటికీ ఎన్నో శక్తిమంతమైన ఫీచర్లు ఉన్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 250 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. ఈ మూడు చక్రాల వాహనంలో ముగ్గురు ప్రయాణించవచ్చు. వెనుకవైపున ఉన్న రెండు చక్రాలు... వంపులకు అనుగుణంగా పైకి, కిందకు కూడా కదులుతాయి. తద్వారా ఒకపక్కకు ఒరిగిపోయే అవకాశాలు ఏమాత్రం ఉండవు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్