శాస్త్ర, సాంకేతికానికి బూస్ట్!
న్యూఢిల్లీ: శాస్త్ర, సాంకేతిక రంగంలో పరిశోధనలకు ఊతం లభించేలా ఈసారి బడ్జెట్‌లో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రాధాన్యం పెంచారు. శాస్త్రీయ పరిశోధనల నిమిత్తం మొత్తం రూ. 7,288 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే ఇది 1,793 కోట్లు ఎక్కువ. శాస్త్ర, సాంకేతిక శాఖలో సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్‌టీ), బయోటెక్నాలజీ(డీబీటీ) విభాగాలు, శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన కేంద్రం(సీఎస్‌ఐఆర్) అనే మూడు ఉప విభాగాలున్నాయి.
వీటిలో డీఎస్‌టీకి తాజా బడ్జెట్‌లో అత్యధికంగా రూ.3,401 కోట్లు, సీఎస్‌ఐఆర్‌కు రూ.2,281 కోట్లు, డీబీటీకి రూ.16,06 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులను పెంచడం, లేదా తగ్గించడమూ చేయొచ్చంటున్నారు. అదేవిధంగా తాజా బడ్జెట్‌లో భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు రూ. 1,179 కోట్లు కేటాయించారు. సముద్ర అధ్యయనానికి రూ. 669 కోట్లు, వాతావరణ అధ్యయనానికి రూ. 425 కోట్లు కేటాయించారు. కాగా, 2014-15 బడ్జెట్‌లో శాస్త్ర, సాంకేతిక శాఖకు రూ. 6,725 కోట్లు కేటాయించారు. అయితే, తర్వాత సమీక్షలో వాటిని రూ. 5,495 కోట్లకు కుదించారు.