![Chandrayaan-4 to launch in 2027 says Jitendra Singh](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/CHANDRA-YAAN.jpg.webp?itok=HH4LNI31)
2026లో సముద్రయాన్ ∙కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వెల్లడి
న్యూఢిల్లీ: చంద్రుడిపై శిలలను సేకరించి భూమిపైకి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన చంద్రయాన్–4 మిషన్‌ను 2027లో చేపట్టనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. మిషన్‌లో భాగంగా రెండు వేర్వేరు ప్రయోగాలుంటాయన్నారు. ఎల్‌వీఎం–3 రాకెట్ ద్వారా ఐదు రకాల సాంకేతిక వస్తు సామాగ్రిని కక్ష్యలోకి పంపి, అక్కడే వాటిని అసెంబుల్ చేయిస్తారని వివరించారు.
వచ్చే ఏడాది గగన్‌యాన్ మిషన్‌లో ప్రత్యేకంగా రూపొందించిన అంతరిక్ష నౌకలో ఇద్దరు భారత వ్యోమగాములను దిగువ భూకక్ష్యలోకి పంపి, తిరిగి సురక్షితంగా తీసుకువస్తామని చెప్పారు. ఈ ఏడాదిలో గగన్‌యాన్ మానవరహిత మిషన్ లో భాగంగా వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపిస్తామన్నారు. దీంతోపాటు, 2026లో సముద్రయాన్‌లో భాగంగా ముగ్గురు శాస్త్రవేత్తలను 6 వేల మీటర్ల లోతులో సముద్రం అడుగు భాగానికి పంపిస్తామని వెల్లడించారు. వీరు సముద్రగర్భంలో వనరులు, కీలక, అరుదైన ఖనిజాల అన్వేషణతోపాటు, సముద్ర జీవజాలంపై పరిశోధనలు జరుపుతారని చెప్పారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 1969లో అవతరించగా మొదటి లాంఛ్ ప్యాడ్ రెండు దశాబ్దాల అనంతరం 1993లో కార్యరూపం దాల్చిందని చెప్పారు. మరో దశాబ్ద కాలం తర్వాత 2004లో రెండో లాంఛ్ ప్యాడ్‌ను నిర్మించామన్నారు. విస్తరణ, మౌలిక వనరుల కల్పన, పెట్టుబడుల విషయంలో ఇస్రో గణనీయమైన ప్రగతి సాధించిందని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. భారత అంతరిక్ష ఆర్థిక రంగ ప్రస్తుతం 8 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుందని వివరించారు. దీనిని వచ్చే పదేళ్లలో 44 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లి, ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment