
నాగ్‌పూర్: అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) పెద్ద ఎత్తున పాలు పంచుకోనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పవర్ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ కోసం పీఎస్‌యూలతో జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసుకునేలా న్యూక్లియర్ రంగ నిబంధనలను ప్రభుత్వం సరళీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. 108వ భారతీయ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు.
అణు విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించే దిశగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐఎల్), ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జాయింట్ వెంచర్లకు వెసులుబాటు కల్పిస్తూ 2015లో అటామిక్ ఎనర్జీ చట్టాన్ని ప్రభుత్వం సవరించిందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా దాదాపు అన్ని అణు విద్యుత్ ప్లాంట్లను నిర్వహించే ఎన్‌పీసీఐఎల్ మరింతగా కార్యకలాపాలు విస్తరించేలా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ న్యూక్లియర్ ఎనర్జీ, నాల్కో పవర్ కంపెనీ మొదలైన వాటితో జేవీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో అణు విద్యుత్ స్థాపిత సామర్థ్యం 6,780 మెగావాట్లుగా ఉంది. మరో 21 యూనిట్ల ఏర్పాటుతో 2031 నాటికి దీన్ని 15,700 మెగావాట్లకు చేర్చుకోవాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment