Public Sector Undertakings
-
రూ.10 నాణెం చెల్లుతుంది
సాక్షి, అమరావతి: రూ.10 నాణెం చెల్లుబాటుపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి ముందుకు రావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఏపీఎస్‌ఆరీ్టసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలు పది రూపాయల నాణేలను స్వీకరించడం ద్వారా ప్రజలకు భరోసా కలి్పంచేలా తక్షణం పత్రికా ప్రకటన విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. బుధవారం విజయవాడలో 32వ స్టేట్ లెవెల్ సెక్యూర్టీ మీటింగ్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ కమల్ పి పట్నాయక్ మాట్లాడుతూ ప్రజల్లో నెలకొన్న అపోహల వల్ల రాష్ట్రంలో తీవ్రమైన చిల్లర కొరత నెలకొని ఉందన్నారు.ఇటువంటి పరిస్థితుల్లోనే కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రకటన విడుదల చేసిన తర్వాత రూ.10 నాణేల చెలామణి ఏడు రెట్లు పెరిగిందని చెప్పారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశానికి చైర్మన్‌గా వ్యవహరించిన రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌ను కోరారు. ఇప్పటికే ఆర్బీఐ పలు ప్రకటనలు చేసినా వినియోగం ఆశించినంత పెరగలేదని, ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. రూ.10 నోట్లతో పోలిస్తే నాణేల జీవిత కాలం రెండు దశాబ్దాలుపైన ఉంటుందని తెలిపారు.రూ.10 నాణేలు చెల్లవనే ప్రచారం ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా ఉందని, హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ పరిధిలో రూ.22 కోట్ల విలువైన రూ.10 నాణేలు మింట్, కరెన్సీ చెస్ట్‌ల్లో మూలుగుతున్నాయన్నారు. ప్రస్తుతం దేశంలో 14 డిజైన్లలో పది రూపాయల నాణేలు చెలామణిలో ఉన్నాయని, ఇవన్నీ కూడా చెల్లుతాయని ఆర్బీఐ అధికారులు స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన విశ్వజిత్ ఆర్బీఐ లిఖిత పూర్వకంగా ఈ ప్రతిపాదనను పంపిస్తే తక్షణంచర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వంతో చర్చిస్తామని హామీనిచ్చారు.రూ.10 నాణేల చెలామణి పెంచే విధంగా బ్యాంకులు కూడా ప్రోత్సహించాలని ఆర్బీఐ కోరింది. అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు, డీమార్ట్, మోడరన్ సూపర్ బజార్, రైస్ మిల్లుల వ్యాపారులకు రూ.10 నాణేలను కమల్ పి పట్నాయక్, కుమార్ విశ్వజిత్ చేతుల మీదుగా అందజేశారు. -
యువత ఆశల్ని కేంద్రం చిదిమేసింది
న్యూఢిల్లీ: పెట్టుబడిదారులైన కొందరు మిత్రుల కోసం కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది యువత ఆశల్ని చిదిమేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. రెండేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లోని 2 లక్షల ఉద్యోగాలను లేకుండా చేసిందని విమర్శించారు. దేశంలో నిరుద్యోగిత రికార్డు స్థాయికి చేరుకుందని తెలిపారు. దేశానికి గర్వకారణమైన ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగం సంపాదించడం ప్రతి నిరుద్యోగ యువతకు కల..అలాంటి వాటిని ప్రభుత్వం వదిలేసిందన్నారు. రాహుల్ గాంధీ ఆదివారం ఈ మేరకు పలు ట్వీట్లు చేశారు. ‘2014లో పీఎస్‌యూల్లో 16.9 లక్షల ఉద్యోగాలుండగా 2022 వచ్చే సరికి వాటి సంఖ్య 14.9 లక్షలకు పడిపోయింది. బీఎస్ఎన్ఎల్లో 1,81,127 ఉద్యోగాలు, సెయిల్‌లో 61,928, ఎంటీఎన్ఎల్లో 34,997, ఎస్ఈసీఎల్లో 29,140, ఎఫ్‌సీఐలో 28,063, ఓఎన్జీసీలో 21,120 ఉద్యోగాలు తగ్గిపోయాయి. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉద్యోగిత పడిపోతుందా?’అని ఆయన ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలిస్తామంటూ తప్పుడు వాగ్దానాలు చేసిన ప్రభుత్వం.. ఉద్యోగాల కల్పనను మరిచిపోయి 2 లక్షల ఉద్యోగాలను లేకుండా చేసిందన్నారు. ఇదే సమయంలో పీఎస్‌యూల్లో కాంట్రాక్టు నియామకాలు పెరిగిపోయాయి. ఇలా కాంట్రాక్టు ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వడం రిజర్వేషన్ హక్కును లాగేసుకోవడం కాదా? ఇది ఈ సంస్థలను ప్రైవేట్‌పరం చేసే కుట్ర కాదా?’అని రాహుల్ ప్రశ్నించారు. ఒక వైపు పారిశ్రామిక వేత్తల రుణాల మాఫీ, మరోవైపు పీఎస్‌యూల్లో ప్రభుత్వ ఉద్యోగాల తొలగింపు! అమృత్కాల్ అంటే ఇదేనా’అని ప్రభుత్వాన్ని నిలదీశారు. -
ఆర్థిక పటిష్టత ప్రాతిపదికనే ఎల్ఓసీలు
న్యూఢిల్లీ: తమ ఆర్థిక పటిష్టత, శక్తిసామర్థ్యాల ప్రాతిపదికనే ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌యూ) ‘లెటర్ ఆఫ్ కంఫర్ట్’ను జారీ చేయాలని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఎల్ఓసీల జారీ విషయంలో కొన్ని సడలింపులు ఇవ్వాలని కోరుతూ చమురు, విద్యుత్ రంగంలోని కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కోరిన నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది. సొంత ఆర్థిక బలం ఆధారంగా ఎల్ఓసీల జారీ సాధారణ వ్యాపార ఆచరణలో ఒక భాగం. ఇది సంస్థలు వాటి క్యాపెక్స్ లేదా వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం పోటీ రేట్ల వద్ద నిధులను సమీకరించుకోడానికి అలాగే జాయింట్ వెంచర్లు లేదా అనుంబంధ సంస్థలు లేదా గ్రూప్ కంపెనీల వ్యాపార ప్రయోజనాలను పరిరక్షించుకోడానికి దోహదపడుతుంది. ఇన్ఫ్రా ప్రాజెక్టుల కోసం నిధుల టై–అప్ కోసం బ్యాంకులకు ’లెటర్ ఆఫ్ కంఫర్ట్’ (ఎల్ఓసీ) జారీ చేయడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (ఎన్బీఎఫ్సీ) గత సంవత్సరం ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. -
Raisina Dialogue: అన్నీ అమ్మేసే తొందరేమీ లేదు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలోనూ (పీఎస్ఈ) హడావిడిగా వాటాలు విక్రయించేయాలన్న తొందరలో ప్రభుత్వమేమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. టెలికం సహా వ్యూహాత్మకమైన నాలుగు రంగాల్లో ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైజినా డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. పీఎస్ఈ పాలసీ ప్రకారం అటామిక్ ఎనర్జీ, అంతరిక్షం, రక్షణ; రవాణా, టెలికం; విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు; బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవల విభాగాలను నాలుగు వ్యూహాత్మక రంగాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ పాలసీ ప్రకారం ‘అన్నీ హడావిడిగా అమ్మేసేయాలన్న తొందర్లో ప్రభుత్వం లేదు. అలాగే గుండుసూదుల నుంచి పంటల దాకా ప్రతి వ్యాపారాన్ని ప్రభుత్వమే నడిపిస్తుందనీ ఈ పాలసీలో ఏమీ లేదు. కాబట్టి తన అవసరం లేని రంగాల్లో ప్రభుత్వం ప్రమేయం ఉండదు. కానీ వ్యూహాత్మక ప్రయోజనాలు ఇమిడి ఉన్న రంగాల్లో.. ఉదాహరణకు టెలికం వంటి వాటిల్లో ఉంటుంది. ప్రభుత్వ యాజమాన్యంలో, ప్రొఫెషనల్‌గా నడిచే ఒక టెలికం కంపెనీ ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు. వ్యూహాత్మక రంగాల్లోనూ తమంతట తాము నిలదొక్కుకోగలిగేంత పెద్ద సంస్థల్లో ప్రభుత్వం కొనసాగుతుందని ఆమె వివరించారు. అలా కాకుండా మరీ చిన్నవి.. నిలదొక్కుకోలేనివి ఉంటే వాటిని పెద్ద సంస్థల్లో విలీనం చేసే అవకాశాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. కేంద్రం గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 65,000 కోట్లు సమీకరించాలని భావించింది. కానీ దీన్ని తర్వాత రూ. 50,000 కోట్లకు సవరించింది. తాజా బడ్జెట్లో దాన్ని కాస్త స్వల్పంగా పెంచుతూ రూ. 51,000 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
Vehicle scrapping policy: డొక్కు బండ్లు తుక్కుకే..
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కర్బన ఉద్గారాల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కర్బన ఉద్గారాల విషయంలో ‘కాలం చెల్లిన వాహనాల’ వాటా గణనీయంగానే ఉంది. దేశంలో 4.50 కోట్లకు పైగా పాత వాహనాలు రోడ్లపై తిరుగున్నాయి. కాలుష్యానికి కారణమవుతున్న డొక్కు వాహనాలను రోడ్లపైకి అనుమతించరాదని నిపుణులు తేల్చిచెబుతున్నారు. 2021–22 బడ్జెట్లో ‘వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన 9 లక్షలకు పైగా డొక్కు వాహనాలను ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి తుక్కు(స్క్రాప్)గా మార్చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి చెందిన పాత వాహనాలను, పాత అంబులెన్స్‌లను తుక్కుగా మార్చడానికి, వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడానికి అదనంగా నిధులు సమకూరుస్తామని 2023–24 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు అందుబాటులో ఉన్న విధానం ఏమిటో తెలుసుకుందాం.. పాత వాహనాలు అంటే? ► రవాణా వాహనం(సీవీ) రిజిస్ట్రేషన్ గడువు సాధారణంగా 15 సంవత్సరాలు ఉంటుంది. ఈ తర్వాత ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడంలో విఫలమైతే స్క్రాపింగ్ పాలసీ ప్రకారం ఆ వాహనం రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. అప్పుడు దాన్ని తుక్కుగా మార్చేయాల్సిందే. ► ప్యాసింజర్ వాహనాల(పీవీ) రిజిస్ట్రేషన్ గడువు 20 ఏళ్లు. గడువు ముగిశాక వెహికల్ అన్‌ఫిట్ అని తేలినా లేక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను రెన్యువల్ చేసుకోవడంలో విఫలమైనా రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. వెహికల్‌ను స్క్రాప్‌గా మార్చాలి. ► 20 ఏళ్లు దాటిన హెవీ కమర్షియల్ వాహనాలకు(హెచ్‌సీవీ) ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లలో ఫిట్‌నెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ► ఇతర కమర్షియల్ వాహనాలకు, వ్యక్తిగత, ప్రైవేట్ వాహనాలకు జూన్ 1 నుంచి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ టెస్టులో ఫెయిలైన వాహనాలను ఎండ్–ఆఫ్–లైఫ్ వెహికల్(ఈఎల్వీ)గా పరిగణిస్తారు. ► ఫిట్నెస్ పరీక్షలో నెగ్గిన వాహనాలపై 10 శాతం నుంచి 15 శాతం దాకా గ్రీన్ ట్యాక్స్ విధిస్తారు. ► రిజిస్ట్రేషన్ అయిన తేదీ నుంచి 15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, మున్సిపల్ కార్పొరేషన్ల, రాష్ట్ర రవాణా సంస్థల, ప్రభుత్వ రంగ సంస్థల, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలకు చెందిన అన్ని వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి, తుక్కుగా మార్చాలని స్క్రాపింగ్ పాలసీ నిర్దేశిస్తోంది. ► ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4.50 కోట్లకు పైగా పాత వాహనాలు రోడ్లపై తిరుగున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వాస్తవానికి వీటన్నింటినీ తుక్కుగా మార్చాలి. ► ప్రతి నగరంలో కనీసం ఒక స్క్రాపింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహనదారులకు ప్రోత్సాహకాలు ► కాలం చెల్లిన వాహనాన్ని తుక్కుగా మార్చేందుకు ముందుకొచ్చిన వాహనదారులకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఇందుకోసం ఏం చేయాలంటే.. ► తొలుత ఏదైనా రిజిస్టర్డ్ స్క్రాపింగ్ కేంద్రానికి వాహనాన్ని తరలించి, తుక్కుగా మార్చాల్సి ఉంటుంది. ► ఆ వాహనం స్క్రాప్ విలువ ఎంత అనేది స్క్రాపింగ్ కేంద్రంలో నిర్ధారిస్తారు. సాధారణంగా కొత్త వాహనం ఎక్స్–షోరూమ్ ధరలో ఇది 4–6 శాతం ఉంటుంది. ఆ విలువ చెల్లిస్తారు. స్క్రాపింగ్ సర్టిఫికెట్ అందజేస్తారు. ► స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉన్న వాహనదారులు కొత్త వ్యక్తిగత వాహనం కొనుగోలు చేస్తే 25 శాతం వరకూ రోడ్డు ట్యాక్స్ రిబేట్, వాణిజ్య వాహనం కొంటే 15 శాతం వరకూ రోడ్డు ట్యాక్స్ రిబేట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉన్న వాహనదారులకు కొత్త వాహనం విలువలో 5 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని వాహనాల తయారీ సంస్థలను కోరింది. ► పాత వాహనాన్ని తుక్కుగా మార్చి, కొత్తది కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ ఫీజులోనూ మినహాయింపు ఇస్తారు. స్క్రాప్ రంగంలో కొత్తగా 35,000 ఉద్యోగాలు! పాత వాహనాలను తుక్కుగా మార్చేయడం ఇప్పటికే ఒక పరిశ్రమగా మారింది. కానీ, ప్రస్తుతం అసంఘటితంగానే ఉంది. రానున్న రోజుల్లో సంఘటితంగా మారుతుందని, ఈ రంగంలో అదనంగా రూ.10,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, కొత్తగా 35,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ అంచనా వేస్తోంది. ప్రత్యామ్నాయాలు ఏమిటి? పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలను దశల వారీగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. ప్రత్యామ్నాయ వాహనాలు క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి. విద్యుత్‌తో నడిచే (ఎలక్ట్రిక్) వాహనాల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్లో పలు రాయితీలు ప్రకటించారు. రాబోయే రోజుల్లో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి. సమీప భవిష్యత్తులో ఇథనాల్, మిథనాల్, బయో–సీఎన్జీ, బయో–ఎల్ఎన్జీ వాహనాలు విరివిగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నెన్నో ప్రయోజనాలు ► కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చడం ప్రధానంగా పర్యావరణానికి మేలు చేయనుంది. కాలుష్య ఉద్గారాలు భారీగా తగ్గుతాయి. ఆధునిక వాహనాలతో ఉద్గారాల బెడద తక్కువే. ► పర్యావరణహిత, సురక్షితమైన, సాంకేతికంగా ఆధునిక వాహనాల వైపు వాహనదారులను నడిపించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ► పాత వాహనాల స్థానంలో కొత్తవి కొంటే వాహన తయారీ రంగం పుంజుకుంటుంది. ఈ రంగంలో నూతన పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయి. ► కొత్త వాహనాలతో యజమానులకు నిర్వహణ భారం తగ్గిపోతుంది. చమురును ఆదా చేయొచ్చు. తద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు. ► స్క్రాప్ చేసిన వెహికల్స్ నుంచి ఎన్నో ముడిసరుకులు లభిస్తాయి. ► ఆటోమొబైల్, స్టీల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు తక్కువ ధరకే ఈ ముడిసరుకులు లభ్యమవుతాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో పీఎస్‌యూలు
నాగ్‌పూర్: అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) పెద్ద ఎత్తున పాలు పంచుకోనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పవర్ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ కోసం పీఎస్‌యూలతో జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసుకునేలా న్యూక్లియర్ రంగ నిబంధనలను ప్రభుత్వం సరళీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. 108వ భారతీయ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. అణు విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించే దిశగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐఎల్), ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జాయింట్ వెంచర్లకు వెసులుబాటు కల్పిస్తూ 2015లో అటామిక్ ఎనర్జీ చట్టాన్ని ప్రభుత్వం సవరించిందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా దాదాపు అన్ని అణు విద్యుత్ ప్లాంట్లను నిర్వహించే ఎన్పీసీఐఎల్ మరింతగా కార్యకలాపాలు విస్తరించేలా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ న్యూక్లియర్ ఎనర్జీ, నాల్కో పవర్ కంపెనీ మొదలైన వాటితో జేవీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో అణు విద్యుత్ స్థాపిత సామర్థ్యం 6,780 మెగావాట్లుగా ఉంది. మరో 21 యూనిట్ల ఏర్పాటుతో 2031 నాటికి దీన్ని 15,700 మెగావాట్లకు చేర్చుకోవాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. -
రోజ్‌గార్ మేళాల ద్వారా 1.47 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: రోజ్‌గార్ మేళాల కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, స్వతంత్య్ర సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల్లో కొత్తగా 1.47 లక్షల మందిని నియమిస్తూ నియామకపత్రాలు అందజేశామని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో ఈ విషయం వెల్లడించారు. ఇంకా భర్తీకాని పోస్టులకుగాను నియామక ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టంచేశారు. 2020–21 కాలానికిగాను దేశంలో నిరుద్యోగిత 4.2 శాతంగా నమోదైందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అదే కాలానికి దేశంలోని మొత్తం జనాభాలో ఏదైనా ఒక వృత్తిలో నిమగ్నమైన జనాభా(వర్కర్ పాపులేషన్ రేషన్–డబ్లూపీఆర్) 52.6 శాతంగా నమోదైందని తెలిపారు. కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు, కోవిడ్ సంక్షోభం నుంచి దేశార్థికాన్ని ఆదుకునేందుకు ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద కేంద్రప్రభుత్వం రూ.27 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని అమలుచేసిందన్నారు. ఈ పథకం కింద లబ్దిపొందాలనుకునే సంస్థల రిజిస్ట్రేషన్ గడువు ఈ ఏడాది మార్చి 31నాడే ముగిసిందన్నారు. 60 లక్షల ఉద్యోగాల సృష్టి కోసం రూ.1.97 లక్షల కోట్లతో ఉత్పత్తి ప్రోత్సాహక రాయితీ పథకం తెచ్చామని మంత్రి చెప్పారు. -
Bharat Jodo Yatra: ప్రైవేటీకరణకు అడ్డుకట్ట: రాహుల్
సాక్షి, బళ్లారి: ప్రభుత్వ రంగ సంస్థల విచ్చలవిడి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ అన్నారు. తాము అధికారంలోకి వస్తే దీనికి అడ్డుకట్ట వేస్తామని ప్రకటించారు. ఆయన భారత్ జోడో పాదయాత్ర బుధవారం కర్ణాటకలో కొనసాగింది. చిత్రదుర్గం జిల్లాలో అవయవ దానం చేసిన వారి పిల్లలు, కుటుంబీకులతో రాహుల్ కలిసి నడిచారు. గొప్ప దాతల సంబంధీకులతో కలిసి నడవడం ఎంతో గర్వకారణంగా ఉందంటూ అనంతరం ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. కన్నడ నట దిగ్గజం దివంగత రాజ్‌కుమార్, ఇటీవల మరణించిన ఆయన కుమారుడు పునీత్ రాజ్‌కుమార్ నేత్రదానం లక్షలాది మంది కన్నడిగులకు ఆదర్శంగా నిలిచిందంటూ కొనియాడారు. అంతకుముందు గిరియమ్మనహళ్లి వద్ద రాహుల్ నిరుద్యోగ యువతతో, రైతులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు పథకం తీసుకొస్తామన్నారు. విద్య, ఆరోగ్య రంగాల్లో అపారమైన ఉపాధి అవకాశాలున్నాయన్నారు. యువత సొంత వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు పెట్టుకునేందుకు ప్రత్యేక ఆర్థిక సాయం అందజేసే వ్యవస్థను తెస్తామని చెప్పారు. -
కేజీ బ్లాకులో వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ కేజీ బేసిన్‌లోని గ్యాస్ బ్లాకులో వాటాను విదేశీ సంస్థలకు విక్రయించనుంది. సముద్ర అంతర్భాగంలో అత్యధిక పీడనం, అధిక టెంపరేచర్‌గల ఈ బ్లాకులో వాటాను గ్లోబల్ సంస్థలకు ఆఫర్ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు టెండర్లకు తెరతీసింది. సవాళ్లతో కూడిన ఈ గ్యాస్ డిస్కవరీ నుంచి ఉత్పత్తిని చేపట్టేందుకు వీలుగా సాంకేతికత, ఆర్థిక సామర్థ్యంగల సంస్థల కోసం చూస్తోంది. ఈ బాటలో గ్లోబల్ దిగ్గజాలకు ఆహ్వానం పలుకుతోంది. దీన్ దయాళ్ వెస్ట్(డీడీడబ్ల్యూ) బ్లాకుతోపాటు కేజీ–డీ5 ప్రాంతంలోని క్లస్టర్–3లో అత్యంత లోతైన డిస్కవరీల నుంచి గ్యాస్‌ను వెలికితీసేందుకు భాగస్వామ్యం కోసం ప్రాథమిక టెండర్లను ప్రకటించింది. వచ్చే నెల(జూన్) 16కల్లా ఆసక్తిగల సంస్థలు తమ సంసిద్ధత(ఈవోఐ)ను వ్యక్తం చేస్తూ బిడ్స్‌ను దాఖలు చేయవలసిందిగా ఆహ్వానించింది. భాగస్వాములపై కన్ను: కేజీ–55 బ్లాకులోని యూడీ–1 డిస్కవరీలో గ్యాస్ నిల్వలను కనుగొన్న ఓఎన్జీసీ 2017 ఆగస్ట్‌లో 80 శాతం వాటాను సొంతం చేసుకుంది. గుజరాత్ ప్రభుత్వ కంపెనీ జీఎస్పీసీ నుంచి ఈ వాటాను రూ. 7,738 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. మరోవైపు యూడీ డిస్కవరీ అభివృద్ధి విషయంలో కంపెనీకి అవసరమైన నైపుణ్యం, సాంకేతికత లేకపోవడంతో అత్య ధిక ఒత్తిడి, టెంపరేచర్‌గల డీడీడబ్ల్యూ బ్లాకులోనూ తగినస్థాయిలో విజయవంతం కాలేకపోయింది. ఓఎన్జీసీ రూ.31,000 కోట్ల పెట్టుబడులు ఇంధన రంగంలో దేశ అవసరాలను మరింతగా తీర్చే లక్ష్యంతో రానున్న మూడేళ్లలో రూ.31,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు ఓఎన్జీసీ ప్రకటించింది. భవిష్యత్తు ఉత్పత్తి విధానానికి గురువారం ఓఎన్జీసీ బోర్డు ఆమోదం తెలిపింది. చమురు, గ్యాస్ వెలికితతకు సంబంధించి సమగ్రమైన కార్యాచరణను సంస్థ రూపొందించింది. -
28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు మద్దతు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని ట్రేడ్ యూనియన్లు ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు టీఆర్ఎస్కేవీ కార్మిక విభాగం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. సార్వత్రిక సమ్మె విజయవంతానికి అన్ని ట్రేడ్ యూనియన్లతో ఆదివారం మంత్రుల నివాసంలోని క్లబ్‌హౌజ్‌లో తెలంగాణ రాష్ట్ర సన్నాహక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ పీఎస్‌యూల ప్రైవేటీకరణ, కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ వ్యతిరేక చర్యలను ప్రజా క్షేత్రంలో ఎండగడతామన్నారు. లాభాలతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కుట్ర పూరితంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని నిర్ణయించిందన్నారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, టీఆర్ఎస్కేవీ, ఐఎఫ్టీయూ, రైల్వే, బ్యాంక్, బీడీఎల్, హెచ్ఏఎల్, పోస్టల్, బీఎస్ఎన్ఎల్ తదితర సంస్థల కార్మిక సంఘాల ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్, పీఎస్‌యూ కార్మిక సంఘాల రాష్ట్ర కన్వీనర్ వి.దానకర్ణాచారి, రాష్ట్ర కో–ఆర్డినేటర్ ఎల్.రూప్ సింగ్ పాల్గొన్నారు. -
పీఎస్‌యూల ఆదాయాలు పెంచుతాం
ముంబై: ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల ఆదాయాలు పెంచేందుకు ప్రణాళికలు వేసినట్లు ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కె.కరాద్ తాజాగా స్పష్టం చేశారు. అంతేకాకుండా డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ ద్వారా ఉద్యోగాల సృష్టి జరుగుతున్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా పీఎస్‌యూలు 14 లక్షల మందికి ఉపాధి కలి్పంచినట్లు తెలియజేశారు. డిజిన్వెస్ట్‌మెంట్ అంటే కంపెనీలు నష్టాలు నమోదు చేస్తున్నట్లుకాదని వ్యాఖ్యానించారు. పీఎస్‌యూల ఆదాయం పెంపు, ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం విభిన్నతరహా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియా నిర్వహించిన వర్చువల్ సదస్సులో తెలియజేశారు. ఇటీవల మానిటైజేషన్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం రూ. 6 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు ప్రకటించినట్లు ప్రస్తావించారు. గత నెలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రోడ్లు, విద్యుత్, రైల్వేలుసహా పలు రంగాలకు చెందిన మౌలిక ఆస్తులకు సంబంధించి జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్(ఎన్ఎంపీ)ను ప్రకటించిన విషయం విదితమే. సంపద సృష్టి పెట్రోలియం, సహజవాయు శాఖ సెక్రటరీ తరుణ్ కపూర్ సైతం పీఎస్‌యూలు ఉద్యోగ కల్పన చేస్తున్నట్లు సదస్సులో పేర్కొన్నారు. దేశానికి సంపదను సృష్టించడమే కాకుండా వాటాదారులకు డివిడెండ్లను పంచుతున్నట్లు ప్రస్తావించారు. దేశాభివృద్ధిలో ప్రభుత్వ రంగ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలియజేశారు. ఇది కొనసాగుతుందని చెప్పారు. మానవ వనరుల శిక్షణకు పీఎస్‌యూలు ఉపయోగపడుతున్నట్లు పేర్కొన్నారు. ఉదాహరణకు ఓఎన్జీసీలో పనిచేసిన నిపుణులు తదుపరి కంపెనీని వీడి ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందుతున్నట్లు వెల్లడించారు. -
ఈ ఏడాది ఎయిరిండియా సహా 10 సంస్థల అమ్మకం
కోవిడ్‌పరమైన అవాంతరాలను అధిగమించి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కనుంది. మార్చి ఆఖరు నాటికి పలు సంస్థలను ప్రైవేటీకరించడం పూర్తి చేయాలని కేంద్రం యోచిస్తోంది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే సీఐఐ సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ఎయిరిండియా, బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పవన్ హన్స్, బీఈఎంఎల్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ తదితర 10 సంస్థల విక్రయం ఈ ఏడాది పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. యాజమాన్యం, నియంత్రణ చేతులు మారిన పక్షంలో ఆయా సంస్థలకు మెరుగైన వేల్యుయేషన్లు లభించడానికి పాండే వివరించారు. ఎయిరిండియా తదితర సంస్థల విక్రయానికి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం మదింపు, ఆర్థిక బిడ్లను ఆహ్వానించే దశలో ఉందని పేర్కొన్నారు. దాదాపు రూ. 6 లక్షల కోట్ల విలువ చేసే మౌలిక సదుపాయాల ఆస్తుల మానిటైజేషన్ (విక్రయం లేదా లీజుకివ్వడం వంటివి) ప్రణాళికను ఖరారు చేయడంపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని పాండే తెలిపారు. -
ఆర్థిక శాఖ పరిధిలోకి డీపీఈ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలను ఆర్థికంగా పటిష్టం చేసి.. త్వరితంగా ప్రైవేటీకరణ చేసేందుకు వీలుగా కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వరంగ సంస్థల విభాగం (డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్/డీపీఈ)ను కేంద్ర ఆర్థిక శాఖలో విలీనం చేసింది. దీంతో ప్రభుత్వరంగ సంస్థలపై ఆర్థిక శాఖకు పూర్తి నియంత్రణకు మార్గం ఏర్పడింది. ఈ నిర్ణయంతో ఆర్థిక శాఖ కింద ప్రస్తుతం ఆరు విభాగాలు ఉన్నట్టు అవుతుంది. డీపీఈ ఆర్థిక శాఖ కిందకు రావడం వల్ల మూలధన నిధుల వ్యయాలపై మెరుగైన పర్యవేక్షణకు అవకాశం ఏర్పడుతుంది. ఆస్తుల విక్రయం, ప్రభుత్వరంగ సంస్థలు ఆర్థికంగా బలపడేందుకు వీలుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఉప విభాగంగా ‘డీపీఈ (లోక్ ఉద్యమ్ విభాగ్)’ను చేర్చినట్టు కేబినెట్ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర మంత్రివర్గం విస్తరణకు ముందుగా ఈ నిర్ణయం చోటు చేసుకుంది. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ కింద ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, వ్యయాలు, పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ, ఆర్థిక సేవల విభాగాలున్నాయి. గతంలో వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల ఉపసంహరణ శాఖను ఏర్పాటు చేయగా.. దాన్ని సైతం ఆర్థిక శాఖలో విలీనం చేసిన విషయం విదితమే. దీనికితోడు విదేశీ పెట్టుబడుల నిర్వహణ విభాగాన్ని కూడా ఆర్థిక శాఖ కిందకు తీసుకొచ్చారు. భారీ పరిశ్రమల శాఖ కింద 44 సంస్థలు భారీ పరిశ్రమల శాఖ ప్రధానంగా క్యాపిటల్ గూడ్స్ రంగానికి సంబంధించి కొనసాగనుంది. బీహెచ్ఈఎల్, సిమెంట్ కార్పొరేషన్, స్కూటర్స్ ఇండియా, హెచ్ఎంటీ, మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ తదితర 44 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు భారీ పరిశ్రమల శాఖ కింద కొనసాగుతాయి. ఈ శాఖ కింద ఉన్న కంపెనీల్లో చాలా వరకు మూతపడి, పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనల్లో ఉన్నవి కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో రూ.1.75 లక్షల కోట్లను సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వరం 2021–22 బడ్జెట్లో నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. ఎల్ఐసీ మెగా ఐపీవోతోపాటు ఐడీబీఐలో వాటాల ఉపసంహరణ, బీపీసీఎల్, బీఈఎంల్, రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా సంస్థ ప్రైవేటీకరణ జాబితాలో ఉన్నాయి. -
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణే శరణ్యమా?
మొదటి ప్రపంచ యుద్ధం తరువాత, ముఖ్యంగా యుద్ధంలో వినాశకరమైన ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించడానికి, వారి అభివృద్ధి వేగాన్ని వేగవంతం చేయడానికి, వారి ఆర్థిక వ్యవస్థలను మహా మాంద్యం నుండి కాపాడటానికి ప్రభుత్వ రంగ ఆధారిత ఆర్థిక కార్యకలాపాలు ఉనికిలోకి వచ్చాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటికి సుదీర్ఘకాలం బ్రిటిష్ సామ్రాజ్య బానిసత్వంలో ఉండటం, ఆదాయ అసమానతలు, ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధిలో అసమతుల్యత, పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత వంటి తీవ్రమైన సామాజిక, ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. అంతేకాకుండా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో చాలా వెనుకబడి ఉండటం, మౌలిక సదుపాయాలు లేకపోవడం, సాంకేతిక పరిజ్ఞానం ఇలాంటి విషయాలలో చాలా వెనుకబాటుతనం భారతదేశ అభివృద్ధిలో వెనకబడిపోవడానికి ప్రధాన కారకాలుగా చెప్పవచ్చు. ఈ సమయంలో, ప్రభుత్వ రంగం స్వావలంబన, స్థిరమైన ఆర్థిక వృద్ధికి అభివృద్ధి సాధనంగా భావించారు. అందువల్ల, దేశం ఒక ప్రణాళికాబద్ధమైన ఆర్థిక అభివృద్ధి విధానాన్ని అనుసరించింది, దీనిలో పీఎస్‌యూలకు పెద్ద పాత్ర ఉంది. ఆర్థికంగా లాభం పొందలేనటువంటి రంగాలలోనూ, వివిధ ప్రాంతాలలోనూ ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పి సంతులిత అభివృద్ధే ధ్యేయంగా కేంద్రప్రభుత్వం పని చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు దేశ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పునాదులను నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించాయి. క్రమక్రమంగా ప్రజల ఆదాయం పెరగడం, జీవన ప్రమాణాలలో పెరుగుదల కారణంగా, ప్రజల ఆకాంక్షలు కూడా గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. తద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువ శాతం ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి కేంద్ర బిందువుగా పనిచేశాయి. సంక్షేమ ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేయడంతో సంస్థ లాభాలపై ప్రతికూల ప్రభావాన్ని కొంత మేరకు చూపించడం జరిగింది. 1990లో అంతర్జాతీయ చెల్లింపుల విషయంలో వచ్చిన లోటు కారణంగా ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేయటానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి రుణం కోరడం జరిగింది. ఆ సంస్థ నిబంధనల ప్రకారం దేశంలో ప్రైవేటీకరణను వేగవంతం చేసి ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. సరళీకరణ ప్రభావంతో ప్రభుత్వ రంగ సంస్థలకు దేశీయంగా, అంతర్జాతీయ సంస్థల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సిరావడంతో, అవి ఒత్తిడికి లోనై నష్టాల బారిన పడ్డాయి. ఇకపోతే 1991 సరళీకృత విధానంతో ప్రజలకు చేరవేసే పథకాల అమలులో కూడా సరికొత్త విధానాలకి గీటురాయి ఏర్పడింది. 2019 ఫారూచ్యన్ 500 కంపెనీలలో 7 పీఎస్‌యూలు స్థానం సంపాదించుకున్నప్పటికీ, 70 ఇతర పీఎస్‌యూలు తీవ్రమైన నష్టాలను చవిచూస్తున్నాయి. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏకస్వామ్యం ఉన్న టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, ఓడరేవులు, విమానాశ్రయాలు, విమానయాన సంస్థలతో సహా అనేక రంగాలను క్రమంగా ప్రైవేటీకరణకు దశలవారీగా తెరిచేశారు. ఇటీవల, రక్షణ వంటి వ్యూహాత్మక రంగాలలో ప్రైవేట్ పెట్టుబడులు అనుమతించారు. అంతేకాకుండా ఓఎన్జీసీ, ఐఓసీ, గెయిల్, ఎన్టీపీసీలతో సహా పలు ’మహారత్న’.. ’నవరత్న’ కంపెనీలు ప్రభుత్వ వాటా 51 శాతం కంటే తగ్గడంతో ప్రైవేట్ కంపెనీలుగా మారే అవకాశం ఉంది. ఇటీవల రాజ్యసభలో మంత్రి ప్రకాష్ జవదేకర్ వీటిలో, 2018–19 ఆర్థిక సంవత్సరంలో నష్టపోతున్న మొదటి మూడు పీఎస్‌యూలలో ప్రభుత్వ క్యారియర్ ఎయిర్ ఇండియా, టెలికాం కంపెనీలు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), మహా నగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎమ్టీఎన్ఎల్), ఉన్నాయని పేర్కొన్నారు. వీటిలో బీఎస్ఎన్ఎల్ రూ. 14,904 కోట్లు కోల్పోయింది; ఎయిర్ ఇండియా నష్టాలు రూ. 8,474 కోట్లు, ఎంటీఎన్ఎల్ నష్టాలు రూ. 3,390 కోట్లు ఉన్నట్లుగా కూడా తెలిపారు. భారతదేశంలో, 31 మార్చి 2019 నాటికి 70 ప్రభుత్వ రంగ యూనిట్లు (పీఎస్‌యూ) నష్టాల్లో ఉన్నాయి. వీటి మొత్తం భారం రూ. 31,000 కోట్లకు పైగా ఉంది. ఈ పీఎస్‌యూలను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడం నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రజల సంక్షేమం కోసం ఈ రంగాలను పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్ భాగస్వామ్యంతో పునరుద్ధరించినట్లయితే ఎక్కువగా ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాల సంస్థల్లో జవాబుదారీతనాన్ని కూడా తీసుకో వచ్చినట్లయితే ఈ సంస్థలు ఉద్యోగ కల్పనతో పాటు, దేశ అవసరాలకు సరిపోయే విధంగా ఉత్పత్తి చేయడానికి దోహదం చేస్తాయి. డాక్టర్ చిట్టేడి కృష్ణారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం డాక్టర్ మారం శ్రీకాంత్, అసోసియేట్ ప్రొఫెసర్, ఎన్ఐఆర్డీ, హైదరాబాద్ -
వ్యాపారాలకు చేయూతే ప్రభుత్వ బాధ్యత
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూ) భారీ స్థాయిలో ప్రైవేటీకరించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా సమర్థించుకున్నారు. వ్యాపార సంస్థలకు కావాల్సిన తోడ్పాటు అందించడం మాత్రమే ప్రభుత్వ బాధ్యతని, సొంతంగా వ్యాపారాలు నడపడం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు కట్టే పన్నుల నిధులతో.. నష్టాల్లో ఉన్న సంస్థలను నడిపే బదులు ప్రజోపయోగకరమైన సంక్షేమ పథకాలకు వెచ్చించడం శ్రేయస్కరమని ప్రధాని పేర్కొన్నారు. ప్రభుత్వమనేది ప్రధానంగా అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని ప్రధాని పేర్కొన్నారు. చమురు.. గ్యాస్, విద్యుత్ తదితర రంగాల్లో 100 పైగా పీఎస్‌యూలు .. సామర్థ్యానికన్నా తక్కువగా పనిచేయడమో లేక వనరులను సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితుల్లోనో ఉన్నాయని ఆయన చెప్పారు. వీటిల్లో వాటాలు విక్రయించడం తదితర మార్గాల ద్వారా రూ. 2.5 లక్షల కోట్ల మేర పెట్టుబడి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. 2021–22 బడ్జెట్లో ప్రైవేటీకరణ ప్రతిపాదనలపై జరిగిన వెబినార్‌లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. ‘ఎంటర్‌ప్రైజ్‌లు, వ్యాపారాలకు తోడ్పాటునివ్వడం ప్రభుత్వ బాధ్యత. సొంతంగా వ్యాపార సంస్థలను పెట్టడం, వాటిని నిర్వహించడం వంటివి తప్పనిసరిగా చేయాల్సిన అవసరం లేదు‘ అని ఆయన స్పష్టం చేశారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా.. రక్షణ, టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, బ్యాంకింగ్ తదితర వ్యూహాత్మకమైన నాలుగు రంగాలు మినహా మిగతా అన్ని రంగ్లాలోని పీఎస్‌యూలను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని చెప్పారు. వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ సంస్థలు నామమాత్ర సంఖ్యలో కొనసాగుతాయన్నారు. పెట్టుబడులు, అంతర్జాతీయంగా పాటించే అత్యుత్తమ విధానాలు, మరింత ప్రతిభావంతులైన మేనేజర్లు, ఆధునికత వంటి సానుకూల పరిణామాలు ప్రైవేట్ రంగం రాకతో సాధ్యపడగలవని మోదీ చెప్పారు. ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. -
పీఎస్‌యూల ఆస్తుల విక్రయానికి ఈ–ప్లాట్ఫార్మ్..!
ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్‌యూల)లకు కీలకం కాని, నిరుపయోగంగా ఉన్న భూములు, ఆస్తుల విక్రయానికి ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆస్తుల నగదీకరణలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల వద్ద మిగులుగా ఉన్న భూములు, ఆస్తులను కేంద్రం విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఆస్తులకు సంబంధించి కొన్నింటికి న్యాయ వివాదాలు ఉండటం, ఇతరత్రా కారణాల వల్ల ఈ ఆస్తుల విక్రయం ఆశించినంతగా ఉండటం లేదు. ఈ సమస్యలను అధిగమించడానికి, సత్వరంగా ఆస్తులను విక్రయించడానికి ఆన్లైన్–ప్లాట్ఫార్మ్ను ఏర్పాటు చేయడమే సరైన మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్లాట్ఫార్మ్ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించాలనేది కేంద్రం ఆలోచన. ఈ–ప్లాట్ఫార్మ్పై బడ్జెట్లో ప్రకటన! పీఎస్‌యూలకు సంబంధించి కీలకం కాని ఆస్తులను విక్రయించడానికి ఈ–బిడ్డింగ్ ప్లాట్ఫార్మ్ను రూపొందించాలని కేంద్రం ఇటీవలనే ప్రభుత్వ రంగ సంస్థ, ఎమ్ఎస్టీసీని ఆదేశించిందని సమాచారం. పీఎస్‌యూల భూములు, ఆస్తులకు సంబంధించి ఈ ప్లాట్ఫార్మ్.. వన్–స్టాప్ షాప్‌గా పనిచేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్లాట్ఫార్మ్ ఏర్పాటుకు కనీసం నెల రోజులు పడుతుందని, దీనికి సంబంధించిన ప్రకటన ఈ ఏడాది బడ్జెట్ ప్రతిపాదనల్లో ఉండే అవకాశాలున్నాయని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్లాట్ఫార్మ్కు దీపమ్(డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్) సమన్వయ సహకారాలనందిస్తుంది. వ్యూహాత్మక వాటా విక్రయానికి ఉద్దేశించిన పీఎస్‌యూల ఆస్తులను తొలుతగా ఈ ప్లాట్ఫార్మ్ ద్వారా విక్రయించే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటికే కొన్ని ఆస్తులను గుర్తించారు. బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్, బీఈఎమ్ఎల్ తదితర సంస్థల ఆస్తులు దీంట్లో ఉన్నాయి. డిజిటల్ టెక్నాలజీ ఉత్తమం.... కీలకం కాని, వృ«థాగా ఉన్న పీఎస్‌యూల భూములను, ఆస్తులను విక్రయించాలని గత కొన్నేళ్లుగా పీఎస్యూలపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. న్యాయ సంబంధిత వివాదాలు, ఇతరత్రా కారణాల వల్ల పీఎస్‌యూలు ఈ ఆస్తుల విక్రయంలో విఫలమవుతున్నాయి. ఈ వ్యవహారం ఒకడుగు ముందుకు, మూడు అడుగులు వెనక్కు.. అన్న చందంగా తయారైంది. ఇలాంటి ఆస్తుల విక్రయానికి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. ఈ ప్లాట్ఫార్మ్ ఎలా పనిచేస్తుందంటే.. ► ఈ–బిడ్డింగ్ ప్లాట్ఫార్మ్ ఏర్పాటు చేస్తారు ► విక్రయించే పీఎస్‌యూల భూములు, ఆస్తులను ఈ ప్లాట్ఫార్మ్పై నమోదు చేస్తారు ► ఎమ్‌ఎస్‌టీసీ, దీపమ్ల పర్యవేక్షణ ఉంటుంది ► రూ.100 కోట్లకు మించిన ఆస్తులనే అమ్మకానికి పెడతారు. ► వేలంలో పాల్గొనే సంస్థలు ఎమ్‌ఎస్‌టీసీ వద్ద నమోదు చేసుకోవాలి ► అసెట్ వేల్యూయార్చే ఆస్తుల విలువ నిర్ధారిస్తారు ► ఆస్తుల కొనుగోళ్లకు ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానిస్తారు ► ఈ–వేలం నిర్వహిస్తారు ► వేలం అనంతర ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేస్తారు -
ఎగుమతులకు 12 రంగాల ఎంపిక
న్యూఢిల్లీ: దేశీయ అవసరాలను స్థానికం గానే తీర్చుకోవడంతోపాటు (స్వీయ సమృద్ధి), ఎగుమతులకు అవకాశమున్న 12 రంగాలను ఎంపిక చేసినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. భారత్‌లో తయారీ కార్యక్రమం కింద ఈ 12 రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. భారత్ తన అవసరాలకు తనపైనే ఆధారపడడం వల్ల నాణ్యమైన ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయారు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆహార శుద్ధి, సహజ సాగు, ఐరన్, అల్యూమినియం, కాపర్, ఆగ్రో కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ మెషినరీ, ఫర్నిచర్, లెదర్ అండ్ షూ, ఆటో విడిభాగాలు, టెక్స్టైల్స్, కవరాల్స్, మాస్క్‌లు, శానిటైజర్లు, వెంటిలేటర్ల విషయంలో భారత్ అంతర్జాతీయ సరఫరాదారుగా అవతరించగలదని మంత్రి చెప్పారు. ఈ రంగాల్లో భారత్ పోటీ పడగలదని, ఇతర దేశాలతో పలిస్తే మన దేశానికి సానుకూలతలు ఉన్నట్టు పేర్కొన్నారు. నేడు బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి సమావేశం ప్యాకేజీలోని పథకాల అమలుపై చర్చ న్యూఢిల్లీ: దేశీ ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌యూ)ల చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (శుక్రవారం) సమావేశంకానున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రూ. 21 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా అమలుకానున్న పలు పథకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా జరిగే ఈ మీటింగ్‌లో రుణాల జారీ, తగ్గిన వడ్డీ రేట్ల ప్రయోజనం బదలాయింపు, మారటోరియం వంటి పలు ఇతరాత్ర అంశాలపై చర్చించనున్నారు. -
1 నుంచి ఇంటర్వ్యూలు వద్దు
జూనియర్ స్థాయి కొలువులకు వర్తింపు న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, అనుబంధ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల్లో(పీఎస్‌యూ) జూనియర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించకూడదని కేంద్రం ఆదేశించింది. నైపుణ్య, శరీరదారుఢ్య పరీక్షలు కొనసాగించవచ్చని పేర్కొంది. ఇంటర్వ్యూల రద్దు ప్రక్రియను ఈ నెల 31క ల్లా కచ్చితంగా పూర్తి చేయాలని సిబ్బంది, శిక్షణ విభాగం(డీఓపీటీ) అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు సర్క్యులర్ పంపింది. భవిష్యత్తులో ఉద్యోగ ప్రకటనల్లో ఇంటర్వ్యూల ప్రస్తావన ఉండదు. ఇంటర్వ్యూల రద్దు .. గ్రూప్ సీలోని అన్ని పోస్టులు, గ్రూప్ బిలోని నాన్ గెజిటెడ్, వాటికి సమానమైన అన్ని పోస్టులకు వర్తిస్తుందని వివరించింది. నిర్దిష్ట పోస్టులకు ఇంటర్వ్యూ జరపాలనుకుంటే పూర్తి వివరాలను సంబంధిత మంత్రి ఆమోదంతో జనవరి 7 లోపల తమకు పంపాలని డీఓపీటీ తెలిపింది. వేతనాల కోడ్‌కు తుది మెరుగులు: కేంద్రం దేశవ్యాప్తంగా ఏకీకృత కనీసం వేతనం నిర్ణయించేందుకు వీలుకల్పించే వేతనాల లేబర్ కోడ్ రూపకల్పన ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని అంతర్ మంత్రిత్వ శాఖ కమిటీ బుధవారం సమావేశమై చిన్నపరిశ్రమల బిల్లుకు తుది మెరుగులు దిద్దనున్నారు. 40 మందికంటే తక్కువ మంది కార్మికులు ఉన్న పరిశ్రమలకు ఈ బిల్లు కింద 14 కార్మిక చట్టాల నుంచి మినహాయింపు ఇస్తారు. బిల్లుకు రూపకల్పన చేశాక ఆమోదం కోసం కేబినెట్‌కు పంపుతారు. వేతానాల చట్టం, చె ల్లింపులు-వేతనాల చట్టం, బోనస్ చెల్లింపు చట్టం తదితర చట్టాల్లోని నిబంధనలను క్రోడీకరించి వేతనాల కోడ్ తేవాలని కార్మిక శాఖ ప్రతిపాదించడం తెలిసిందే. కాగా, ఉద్యోగినులకు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచడానికి ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లు ముసాయిదాకు కార్మిక శాఖ తుదిమెరుగులు దిద్దుతోంది. సంప్రదింపుల కోసం దీన్ని త్వరలో వివిధ మంత్రిత్వ శాఖలకు పంపనున్నారు. -
ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఉద్యోగాలకు ‘గేట్’వే
గేట్లో సాధించిన స్కోర్‌తో ఐఐటీలు/ఎన్ఐటీలు వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో ఎంఈ/ఎంటెక్, పీహెచ్డీ వంటి కోర్సులు అభ్యసించొచ్చు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఉద్యోగాన్ని సాధించి అత్యుత్తమ కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ రంగ కంపెనీలు గేట్-2014 స్కోర్ ఆధారంగా ఉద్యోగ నియామకాలకు ప్రకటనలు విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ వివరాలు.. పి.శ్రీనివాసులు రెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్, వాణి ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ గతంలో పబ్లిక్ సెక్టార్ కంపెనీలు.. వాటిల్లో ఉద్యోగాలకు వేర్వేరుగా ప్రత్యేక రాత పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపట్టేవి. ఇందులో భాగంగా రాత పరీక్షతోపాటు అభ్యర్థుల ఆప్టిట్యూడ్, వ్యక్తిత్వం, భావవ్యక్తీకరణ సామర్థ్యాలు వంటి అంశాల్లో ప్రతిభను పరీక్షించేవారు. ఇలా ప్రతి పీఎస్‌యూ సొంత ఎంపిక విధానాన్ని అనుసరించడం వల్ల అటు కంపెనీలు, ఇటు అభ్యర్థులు వ్యయప్రయాసలకు లోనయ్యేవారు. ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి 2010 నుంచి ప్రభుత్వ రంగ కంపెనీలు గేట్లో వచ్చిన స్కోర్‌ను ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. తుది ఎంపికలో గేట్ స్కోర్‌తోపాటు గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు కల్పిస్తున్నాయి. విజయం సాధించండిలా ప్రాథమిక సూత్రాల అవగాహన కీలకం: మిగతా ప్రవేశ పరీక్షల్లా కాకుండా గేట్ పరీక్షలో ప్రశ్నలు ఎక్కువ శాతం ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటాయి. అభ్యర్థి సంబంధిత సబ్జెక్టుల్లోని ప్రాథమిక భావనలను ఎలా అర్థం చేసుకున్నాడో తె లుసుకునేలా ప్రశ్నలు అడుగుతారు. గేట్ పరీక్షలో మొత్తం 100 మార్కులకు 65 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతోపాటు న్యూమరికల్ ప్రశ్నలు కూడా ఉంటాయి. న్యూమరికల్ ప్రశ్నలను ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టనున్నారు. విద్యార్థుల అవగాహన లోపంతో లేదా సరైన ప్రాక్టీస్ లేకపోవడం వల్ల గుర్తించే తప్పు జవాబులను ముందుగానే ఊహించి ఆప్షన్స్‌లో పొందుపరచడం ఈ పరీక్షలో ప్రత్యేక అంశం. ఒక విద్యార్థి చేసే సామాన్య తప్పుల మూలంగా వచ్చిన జవాబు పొందుపరిచిన ఆప్షన్స్‌లో ఉండే అవకాశం చాలా ఎక్కువ. అందువల్ల ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఎటువంటి తప్పులు దొర్లకుండా మొట్టమొదటి ప్రయత్నంలోనే సరైన జవాబును పొందే విధంగా తగినంత ప్రాక్టీస్ చేయాలి. 2014 నుంచి గేట్ పూర్తిగా ఆన్లైన్ పరీక్షగా మారింది. అందువల్ల ముందుగా కొన్ని ఆన్లైన్ పరీక్షలు ప్రాక్టీస్ చేయడం మంచిది. బట్టీ తరహా, జ్ఞాపకశక్తి ఆధారిత పరీక్షలకు గేట్ పరీక్షలో ప్రాధాన్యత చాలా తక్కువ. అందువల్ల సంబంధిత యూనిట్లలోని ప్రాథమిక భావనలు, ఫండమెంటల్స్తోపాటు విశ్లేషణాత్మక అధ్యయనం తప్పనిసరి. గేట్లో ఉత్తీర్ణత కోసం ఇంజనీరింగ్ మూడో ఏడాది నుంచి ప్రిపరేషన్ ప్రణాళికను రూపొందించుకోవాలి. గత 10-15 ఏళ్లుగా అడిగిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం వల్ల గేట్లో మంచి స్కోర్ సాధించవచ్చు. అభ్యర్థులకు సూచనలు ఈ కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవాళ్లు ముందుగా గేట్-2014కు దరఖాస్తు చేసుకోవాలి. వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి కంపెనీలు నిర్దేశించిన వయసును మించకూడదు. ఓబీసీ (ఎన్సీఎల్)కు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, శారీరక వికలాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. గేట్ అడ్మిట్ కార్డ్‌పై ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఆయా కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసేటప్పుడు స్కాన్ చేసిన పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో (500 కేబీ)ను సిద్ధంగా ఉంచుకోవాలి. సంబంధిత వివరాలన్నీ పూర్తిచేశాక చివరలో ఉండే సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయాలి. తర్వాత యూనిక్ అప్లికేషన్ ఐడీ వస్తుంది. పూర్తిచేసిన దరఖాస్తును ప్రింటవుట్ తీసుకుని దానిపై ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో అతికించాలి. సంతకం కోసం ఉన్న ఖాళీలో సంతకం చేయాలి. ఈ ప్రింటవుట్ దరఖాస్తును ఇంటర్వ్యూ వరకు భద్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా గేట్‌కు దరఖాస్తు చేసుకున్నాక దాని ప్రింటవుట్ కూడా తీసుకుని భద్రపరచుకోవాలి. గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్/ఇంటర్వ్యూకు ఎంపికైతే గేట్ ప్రింటవుట్ దరఖాస్తు, అడ్మిట్ కార్డ్, స్కోర్ కార్డ్ తీసుకువెళ్లాలి. దరఖాస్తు చేసుకునేటప్పుడు గేట్ దరఖాస్తులో ఏ వివరాలైతే (పేరు, పుట్టిన తేదీ, చిరునామా) నింపారో అవే వివరాలను సంబంధిత కంపెనీల దరఖాస్తులోనూ నింపాలి. కొన్ని కంపెనీలు దరఖాస్తు రుసుం వసూలు చేస్తుండగా, మరికొన్ని ఎలాంటి ఫీజు తీసుకోవడం లేదు. అభ్యర్థులు ఏడాది శిక్షణ తర్వాత కనీసం మూడేళ్లపాటు పనిచేస్తామనే హామీని కంపెనీకి ఇవ్వాలి. దీని ప్రకారం నిర్దేశించిన రుసుమును బాండ్ రూపంలో చెల్లించాలి. అయా కంపెనీల్లో ఏ విభాగాల్లో అయితే నియామక ప్రకటనలు వెలువడ్డాయో అదే ఇంజనీరింగ్ బ్రాంచ్ పేపర్‌తో గేట్ రాయాలి. కెరీర్ ఈ ప్రభుత్వ రంగ కంపెనీలన్నీ మంచి పని వాతావరణం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా అభ్యర్థి చదువుకున్న ఇంజనీరింగ్‌కు సంబంధించి విధులను నిర్వహించే అవకాశం ఈ ఉద్యోగాలలో లభిస్తుంది. ఎలాంటి ఒడిదుడుకులు లేని స్థిరత్వం గల ఉద్యోగాలను ఈ కంపెనీలు అందిస్తున్నాయి. ప్రవేశస్థాయిలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, ఇంజనీర్ ట్రైనీ, గ్రాడ్యుయేట్ ఇంజనీర్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఇంజనీర్, ప్రొబేషనరీ ఆఫీసర్ తదితర పేర్లతో అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. ఆ తర్వాత పనితీరు అనుభ వాన్ని బట్టి అత్యుత్తమస్థాయికి చేరుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులను ఆయా కంపెనీలు అప్రెంటీస్లుగా లేదా ట్రైనీలుగా నియమించుకుంటున్నాయి. ఈ కాలంలో స్టైపెండ్ ఇస్తాయి. కొన్ని కంపెనీల్లో వసతి సౌకర్యం కూడా లభిస్తుంది. శిక్షణా కాలం కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది. పీఎస్‌యూ కంపెనీలు వేతనాల విషయంలో కార్పొరేట్ కంపెనీలతో ఏ మాత్రం తీసిపోకుండా పోటీ పడుతున్నాయి. ముఖ్యమైన కంపెనీల్లో ప్రారంభ వేతనంగా ఏడాదికి సగటున ఏడు లక్షల రూపాయల నుంచి ఎనిమిది లక్షల రూపాయలు లభిస్తున్నాయి. చాలా పీఎస్‌యూలు మొదట అభ్యర్థులను కొంతకాలం శిక్షణకు నియమిస్తాయి. తర్వాత నిర్దిష్ట వేతనంతో శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తాయి. పూర్తికాల ఉద్యోగులుగా ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని అలవెన్సులు, సౌకర్యాలు వర్తిస్తాయి. 2014 గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు కల్పిస్తున్న సంస్థలు హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విభాగాలు.. అర్హత: మెకానికల్; సివిల్; ఎలక్ట్రికల్; ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్; ఇన్స్ట్రుమెంటేషన్: అర్హత: జనరల్, ఓబీసీ-ఎన్సీఎల్ అభ్యర్థులు 60 శాతం మార్కులతో, సంబంధిత బ్రాంచ్‌తో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ఒక విభాగానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ నమోదుకు ప్రారంభ తేదీ: నవంబర్ 5, 2013 దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 7, 2014 వెబ్సైట్: www.hpclcareers.com పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎలక్ట్రికల్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీల కోసం పవర్‌గ్రిడ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. అర్హత: 65 శాతం మార్కులతో ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ (పవర్)/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/పవర్ సిస్టమ్స్ బ్రాంచ్‌తో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత. సంబంధిత కోర్సులు ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులూ అర్హులే. ఎంపిక విధానం: గేట్-2014 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈక్రమంలో గేట్ స్కోర్‌కు 85 శాతం, గ్రూప్ డిస్కషన్‌కు 3 శాతం, ఇంటర్వ్యూకు 12 శాతం వెయిటేజ్ ఉంటాయి. శిక్షణ: ఎంపికైనవారికి ఏడాది శిక్షణ ఉంటుంది. దీన్ని పూర్తిచేసుకున్నవారిని ఇంజనీర్‌గా నియమిస్తారు. వేతనాలు: శిక్షణలో * 24900- * 50500 వరకు పేస్కేల్ ఉంటుంది. దాదాపుగా శిక్షణలో ఏడాదికి 7,65,000 రూపాయలు, శిక్షణ తర్వాత ఏడాదికి 13.4 లక్షల రూపాయలు పే ప్యాకేజ్ ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జనవరి మొదటి వారం, 2014 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి రెండోవారం, 2014 జీడీ/ఇంటర్వ్యూ: ఏప్రిల్/మే 2014 వెబ్సైట్: www.powergridindia.com. ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. ట్రైనీ ఇంజనీర్: ఎలక్ట్రికల్(130); సివిల్(25); మెకానికల్ (25). అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచ్‌తో బీఎస్సీ ఇంజనీరింగ్ లేదా బీటెక్ ఉత్తీర్ణత. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: జనవరి 7, 2014 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 21, 2014 వెబ్సైట్: www.nhpcindia.com/career.htm మజగావ్ డాక్ లిమిటెడ్ మజగావ్ డాక్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్(టెక్నికల్) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (టెక్నికల్): మెకానికల్ (24 పోస్టులు); ఎలక్ట్రికల్ (14 పోస్టులు); ఎలక్ట్రానిక్స్ (7 పోస్టులు). అర్హత: 60 శాతం మార్కులతో మెకానికల్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ సంబంధిత బ్రాంచ్‌ల్లో బీటెక్ ఉత్తీర్ణత. ఫైనలియర్ విద్యార్థులూ అర్హులే. వేతన శ్రేణి: * 16,400 - * 40,500 వార్షిక వేతనం: ఏడాదికి కనీసం 5.25 ల క్షల రూపాయల నుంచి గరిష్టంగా 12.9 లక్షల రూపాయల వరకు. ఎంపిక విధానం: గేట్-2014లో స్కోర్ ఆధారంగా అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలుస్తారు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: అక్టోబర్ 15, 2013 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 29, 2013 ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్ 18, 2014 వెబ్సైట్: www.mazagondock.gov.in ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ విభాగాలు: ఆఫీసర్స్/ఇంజనీర్స్: కెమికల్(పెట్రోకెమికల్స్/పాలిమర్); సివిల్; కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ; ఎలక్ట్రికల్; ఇన్స్ట్రుమెంటేషన్; మెకానికల్. అసిస్టెంట్ ఆఫీసర్స్/అసిస్టెంట్ ఇంజనీర్స్: కెమికల్ (పెట్రో కెమికల్, పాలిమర్); సివిల్; ఎలక్ట్రికల్; ఇన్స్ట్రుమెంటేషన్; మెకానికల్; మెట్లర్జికల్. అర్హత: జనరల్, ఓబీసీ (ఎన్సీఎల్) అభ్యర్థులు 65 శాతం (ఎస్సీ/ఎస్టీ, శారీరక వికలాంగులకు 55 శాతం) మార్కులతో సంబంధిత బ్రాంచ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ఫైనలియర్ విద్యార్థులూ అర్హులే. అభ్యర్థులు పై రెండు పోస్టు ల్లో ఏదో ఒకదానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వేతన శ్రేణి-ఆఫీసర్స్/ఇంజనీర్స్: నెలకు * 24,900తోపాటు ఇతర అలవెన్సులు. వార్షిక వేతనం * 10.50 లక్షల రూపాయలు. వేతన శ్రేణి-అసిస్టెంట్ ఆఫీసర్స్/అసిస్టెంట్ ఇంజనీర్స్: నెలకు * 20,600 బేసిక్ పేతోపాటు ఇతర అలవెన్సులు. వార్షిక వేతనం ఏడు లక్షల రూపాయలు. ఎంపిక: గేట్-2014 స్కోర్‌తోపాటు గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ:డిసెంబర్18, 2013 దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 2, 2014 వెబ్సైట్: www.iocl.com. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మెకానికల్, కెమికల్ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భ ర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: డిసెంబర్ 20, 2013 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 31, 2014 వెబ్సైట్: www.bpclcareers.in ఎన్టీపీసీ లిమిటెడ్ పోస్టు: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఇంజనీర్ విభాగాలు: ఎలక్ట్రికల్; మెకానికల్; సివిల్; ఇన్స్ట్రుమెంటేషన్; ఎలక్ట్రానిక్స్. అర్హత: 65 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచ్ తో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ఫైనలియర్ విద్యార్థులూ అర్హులే. ఎంపిక విధానం: గేట్-2014 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది. జీడీలో, ఇంటర్వ్యూల్లో నిర్దేశిత మార్కులు సాధించాలి. వేతన శ్రేణి: *24,900-*50,500 వరకు. ఏడాది శిక్ష ణలో నెలకు * 24,900 బేసిక్ పే ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి నెలకు *25,650 బేసిక్ పే అందిస్తారు.వీటికి అదనంగా ఇతర బెనిఫిట్స్ ఉంటాయి. ఎంపిక విధానం: గేట్ -2014 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: డిసెంబర్ 20, 2013 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 18, 2014 వెబ్సైట్: www.ntpccareers.net.