పర్యావరణ పరిరక్షణలో భాగంగా కర్బన ఉద్గారాల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కర్బన ఉద్గారాల విషయంలో ‘కాలం చెల్లిన వాహనాల’ వాటా గణనీయంగానే ఉంది. దేశంలో 4.50 కోట్లకు పైగా పాత వాహనాలు రోడ్లపై తిరుగున్నాయి. కాలుష్యానికి కారణమవుతున్న డొక్కు వాహనాలను రోడ్లపైకి అనుమతించరాదని నిపుణులు తేల్చిచెబుతున్నారు. 2021–22 బడ్జెట్‌లో ‘వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన 9 లక్షలకు పైగా డొక్కు వాహనాలను ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి తుక్కు(స్క్రాప్)గా మార్చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి చెందిన పాత వాహనాలను, పాత అంబులెన్స్‌లను తుక్కుగా మార్చడానికి, వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడానికి అదనంగా నిధులు సమకూరుస్తామని 2023–24 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు అందుబాటులో ఉన్న విధానం ఏమిటో తెలుసుకుందాం..
పాత వాహనాలు అంటే?
► రవాణా వాహనం(సీవీ) రిజిస్ట్రేషన్ గడువు సాధారణంగా 15 సంవత్సరాలు ఉంటుంది. ఈ తర్వాత ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోవడంలో విఫలమైతే స్క్రాపింగ్ పాలసీ ప్రకారం ఆ వాహనం రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. అప్పుడు దాన్ని తుక్కుగా మార్చేయాల్సిందే.
► ప్యాసింజర్ వాహనాల(పీవీ) రిజిస్ట్రేషన్ గడువు 20 ఏళ్లు. గడువు ముగిశాక వెహికల్ అన్‌ఫిట్ అని తేలినా లేక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను రెన్యువల్ చేసుకోవడంలో విఫలమైనా రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. వెహికల్‌ను స్క్రాప్‌గా మార్చాలి.
► 20 ఏళ్లు దాటిన హెవీ కమర్షియల్ వాహనాలకు(హెచ్‌సీవీ) ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లలో ఫిట్‌నెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
► ఇతర కమర్షియల్ వాహనాలకు, వ్యక్తిగత, ప్రైవేట్ వాహనాలకు జూన్ 1 నుంచి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ టెస్టులో ఫెయిలైన వాహనాలను ఎండ్–ఆఫ్–లైఫ్ వెహికల్(ఈఎల్‌వీ)గా పరిగణిస్తారు.
► ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గిన వాహనాలపై 10 శాతం నుంచి 15 శాతం దాకా గ్రీన్ ట్యాక్స్ విధిస్తారు.
► రిజిస్ట్రేషన్ అయిన తేదీ నుంచి 15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, మున్సిపల్ కార్పొరేషన్ల, రాష్ట్ర రవాణా సంస్థల, ప్రభుత్వ రంగ సంస్థల, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలకు చెందిన అన్ని వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి, తుక్కుగా మార్చాలని స్క్రాపింగ్ పాలసీ నిర్దేశిస్తోంది.
► ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4.50 కోట్లకు పైగా పాత వాహనాలు రోడ్లపై తిరుగున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వాస్తవానికి వీటన్నింటినీ తుక్కుగా మార్చాలి.
► ప్రతి నగరంలో కనీసం ఒక స్క్రాపింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వాహనదారులకు ప్రోత్సాహకాలు
► కాలం చెల్లిన వాహనాన్ని తుక్కుగా మార్చేందుకు ముందుకొచ్చిన వాహనదారులకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఇందుకోసం ఏం చేయాలంటే..
► తొలుత ఏదైనా రిజిస్టర్డ్ స్క్రాపింగ్ కేంద్రానికి వాహనాన్ని తరలించి, తుక్కుగా మార్చాల్సి ఉంటుంది.
► ఆ వాహనం స్క్రాప్ విలువ ఎంత అనేది స్క్రాపింగ్ కేంద్రంలో నిర్ధారిస్తారు. సాధారణంగా కొత్త వాహనం ఎక్స్–షోరూమ్ ధరలో ఇది 4–6 శాతం ఉంటుంది. ఆ విలువ చెల్లిస్తారు. స్క్రాపింగ్ సర్టిఫికెట్ అందజేస్తారు.
► స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉన్న వాహనదారులు కొత్త వ్యక్తిగత వాహనం కొనుగోలు చేస్తే 25 శాతం వరకూ రోడ్డు ట్యాక్స్ రిబేట్, వాణిజ్య వాహనం కొంటే 15 శాతం వరకూ రోడ్డు ట్యాక్స్ రిబేట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉన్న వాహనదారులకు కొత్త వాహనం విలువలో 5 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని వాహనాల తయారీ సంస్థలను కోరింది.
► పాత వాహనాన్ని తుక్కుగా మార్చి, కొత్తది కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ ఫీజులోనూ మినహాయింపు ఇస్తారు.
స్క్రాప్ రంగంలో కొత్తగా 35,000 ఉద్యోగాలు!
పాత వాహనాలను తుక్కుగా మార్చేయడం ఇప్పటికే ఒక పరిశ్రమగా మారింది. కానీ, ప్రస్తుతం అసంఘటితంగానే ఉంది. రానున్న రోజుల్లో సంఘటితంగా మారుతుందని, ఈ రంగంలో అదనంగా రూ.10,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, కొత్తగా 35,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ అంచనా వేస్తోంది.
ప్రత్యామ్నాయాలు ఏమిటి?
పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలను దశల వారీగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. ప్రత్యామ్నాయ వాహనాలు క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి. విద్యుత్‌తో నడిచే (ఎలక్ట్రిక్) వాహనాల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌లో పలు రాయితీలు ప్రకటించారు. రాబోయే రోజుల్లో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి. సమీప భవిష్యత్తులో ఇథనాల్, మిథనాల్, బయో–సీఎన్‌జీ, బయో–ఎల్‌ఎన్‌జీ వాహనాలు విరివిగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఎన్నెన్నో ప్రయోజనాలు
► కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చడం ప్రధానంగా పర్యావరణానికి మేలు చేయనుంది. కాలుష్య ఉద్గారాలు భారీగా తగ్గుతాయి. ఆధునిక వాహనాలతో ఉద్గారాల బెడద తక్కువే.
► పర్యావరణహిత, సురక్షితమైన, సాంకేతికంగా ఆధునిక వాహనాల వైపు వాహనదారులను నడిపించాలన్నది ప్రభుత్వ ఆలోచన.
► పాత వాహనాల స్థానంలో కొత్తవి కొంటే వాహన తయారీ రంగం పుంజుకుంటుంది. ఈ రంగంలో నూతన పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయి.
► కొత్త వాహనాలతో యజమానులకు నిర్వహణ భారం తగ్గిపోతుంది. చమురును ఆదా చేయొచ్చు. తద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు.
► స్క్రాప్ చేసిన వెహికల్స్ నుంచి ఎన్నో ముడిసరుకులు లభిస్తాయి.
► ఆటోమొబైల్, స్టీల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు తక్కువ ధరకే ఈ ముడిసరుకులు లభ్యమవుతాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment