Budget 2021
-
Vehicle scrapping policy: డొక్కు బండ్లు తుక్కుకే..
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కర్బన ఉద్గారాల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కర్బన ఉద్గారాల విషయంలో ‘కాలం చెల్లిన వాహనాల’ వాటా గణనీయంగానే ఉంది. దేశంలో 4.50 కోట్లకు పైగా పాత వాహనాలు రోడ్లపై తిరుగున్నాయి. కాలుష్యానికి కారణమవుతున్న డొక్కు వాహనాలను రోడ్లపైకి అనుమతించరాదని నిపుణులు తేల్చిచెబుతున్నారు. 2021–22 బడ్జెట్లో ‘వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన 9 లక్షలకు పైగా డొక్కు వాహనాలను ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి తుక్కు(స్క్రాప్)గా మార్చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి చెందిన పాత వాహనాలను, పాత అంబులెన్స్‌లను తుక్కుగా మార్చడానికి, వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడానికి అదనంగా నిధులు సమకూరుస్తామని 2023–24 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు అందుబాటులో ఉన్న విధానం ఏమిటో తెలుసుకుందాం.. పాత వాహనాలు అంటే? ► రవాణా వాహనం(సీవీ) రిజిస్ట్రేషన్ గడువు సాధారణంగా 15 సంవత్సరాలు ఉంటుంది. ఈ తర్వాత ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడంలో విఫలమైతే స్క్రాపింగ్ పాలసీ ప్రకారం ఆ వాహనం రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. అప్పుడు దాన్ని తుక్కుగా మార్చేయాల్సిందే. ► ప్యాసింజర్ వాహనాల(పీవీ) రిజిస్ట్రేషన్ గడువు 20 ఏళ్లు. గడువు ముగిశాక వెహికల్ అన్‌ఫిట్ అని తేలినా లేక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను రెన్యువల్ చేసుకోవడంలో విఫలమైనా రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. వెహికల్‌ను స్క్రాప్‌గా మార్చాలి. ► 20 ఏళ్లు దాటిన హెవీ కమర్షియల్ వాహనాలకు(హెచ్‌సీవీ) ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లలో ఫిట్‌నెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ► ఇతర కమర్షియల్ వాహనాలకు, వ్యక్తిగత, ప్రైవేట్ వాహనాలకు జూన్ 1 నుంచి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ టెస్టులో ఫెయిలైన వాహనాలను ఎండ్–ఆఫ్–లైఫ్ వెహికల్(ఈఎల్వీ)గా పరిగణిస్తారు. ► ఫిట్నెస్ పరీక్షలో నెగ్గిన వాహనాలపై 10 శాతం నుంచి 15 శాతం దాకా గ్రీన్ ట్యాక్స్ విధిస్తారు. ► రిజిస్ట్రేషన్ అయిన తేదీ నుంచి 15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, మున్సిపల్ కార్పొరేషన్ల, రాష్ట్ర రవాణా సంస్థల, ప్రభుత్వ రంగ సంస్థల, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలకు చెందిన అన్ని వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి, తుక్కుగా మార్చాలని స్క్రాపింగ్ పాలసీ నిర్దేశిస్తోంది. ► ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4.50 కోట్లకు పైగా పాత వాహనాలు రోడ్లపై తిరుగున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వాస్తవానికి వీటన్నింటినీ తుక్కుగా మార్చాలి. ► ప్రతి నగరంలో కనీసం ఒక స్క్రాపింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహనదారులకు ప్రోత్సాహకాలు ► కాలం చెల్లిన వాహనాన్ని తుక్కుగా మార్చేందుకు ముందుకొచ్చిన వాహనదారులకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఇందుకోసం ఏం చేయాలంటే.. ► తొలుత ఏదైనా రిజిస్టర్డ్ స్క్రాపింగ్ కేంద్రానికి వాహనాన్ని తరలించి, తుక్కుగా మార్చాల్సి ఉంటుంది. ► ఆ వాహనం స్క్రాప్ విలువ ఎంత అనేది స్క్రాపింగ్ కేంద్రంలో నిర్ధారిస్తారు. సాధారణంగా కొత్త వాహనం ఎక్స్–షోరూమ్ ధరలో ఇది 4–6 శాతం ఉంటుంది. ఆ విలువ చెల్లిస్తారు. స్క్రాపింగ్ సర్టిఫికెట్ అందజేస్తారు. ► స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉన్న వాహనదారులు కొత్త వ్యక్తిగత వాహనం కొనుగోలు చేస్తే 25 శాతం వరకూ రోడ్డు ట్యాక్స్ రిబేట్, వాణిజ్య వాహనం కొంటే 15 శాతం వరకూ రోడ్డు ట్యాక్స్ రిబేట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉన్న వాహనదారులకు కొత్త వాహనం విలువలో 5 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని వాహనాల తయారీ సంస్థలను కోరింది. ► పాత వాహనాన్ని తుక్కుగా మార్చి, కొత్తది కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ ఫీజులోనూ మినహాయింపు ఇస్తారు. స్క్రాప్ రంగంలో కొత్తగా 35,000 ఉద్యోగాలు! పాత వాహనాలను తుక్కుగా మార్చేయడం ఇప్పటికే ఒక పరిశ్రమగా మారింది. కానీ, ప్రస్తుతం అసంఘటితంగానే ఉంది. రానున్న రోజుల్లో సంఘటితంగా మారుతుందని, ఈ రంగంలో అదనంగా రూ.10,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, కొత్తగా 35,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ అంచనా వేస్తోంది. ప్రత్యామ్నాయాలు ఏమిటి? పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలను దశల వారీగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. ప్రత్యామ్నాయ వాహనాలు క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి. విద్యుత్‌తో నడిచే (ఎలక్ట్రిక్) వాహనాల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్లో పలు రాయితీలు ప్రకటించారు. రాబోయే రోజుల్లో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి. సమీప భవిష్యత్తులో ఇథనాల్, మిథనాల్, బయో–సీఎన్జీ, బయో–ఎల్ఎన్జీ వాహనాలు విరివిగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నెన్నో ప్రయోజనాలు ► కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చడం ప్రధానంగా పర్యావరణానికి మేలు చేయనుంది. కాలుష్య ఉద్గారాలు భారీగా తగ్గుతాయి. ఆధునిక వాహనాలతో ఉద్గారాల బెడద తక్కువే. ► పర్యావరణహిత, సురక్షితమైన, సాంకేతికంగా ఆధునిక వాహనాల వైపు వాహనదారులను నడిపించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ► పాత వాహనాల స్థానంలో కొత్తవి కొంటే వాహన తయారీ రంగం పుంజుకుంటుంది. ఈ రంగంలో నూతన పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయి. ► కొత్త వాహనాలతో యజమానులకు నిర్వహణ భారం తగ్గిపోతుంది. చమురును ఆదా చేయొచ్చు. తద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు. ► స్క్రాప్ చేసిన వెహికల్స్ నుంచి ఎన్నో ముడిసరుకులు లభిస్తాయి. ► ఆటోమొబైల్, స్టీల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు తక్కువ ధరకే ఈ ముడిసరుకులు లభ్యమవుతాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ. 19,675 కోట్లు ఖర్చు
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ల కొనుగోలుకు ఈనెల 20వ తేదీ దాకా రూ. 19,675 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేశామని సామాజిక కార్యకర్త అమిత్ గుప్తా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ సమాధానమిచ్చింది. 2021–22 కేంద్ర బడ్జెట్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 35,000 కోట్లను కేటాయించింది. ఈ ఏడాది జనవరి 16న మనదేశంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. కోవిన్ పోర్టల్ ప్రకారం దేశంలో ఇప్పటిదాకా 140 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. మే 1 నుంచి డిసెంబరు 20వ తేదీ దాకా 117.56 కోట్ల డోసులను ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో (సీవీసీ) ప్రజలకు ఉచితంగా అందజేశామని, 4.18 కోట్ల డోసులను మాత్రం ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రజలు తీసుకున్నారని ఆరోగ్య శాఖ వివరించింది. జూన్ 21న మార్చిన నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ తయారీ సంస్థలు తమ నెలవారీ ఉత్పత్తి సామర్థ్యంలో 25 శాతం టీకాలను ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా అమ్ముకోవచ్చు. 60 శాతం మందికి డబుల్ డోస్ దేశంలో అర్హులైన వారిలో (18 ఏళ్లకు పైబడిన వారిలో) 60 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం వెల్లడించారు. 89 శాతం మంది కనీసం ఒక డోసు తీసుకున్నారని తెలిపారు. కాగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య గురువారం 300 దాటింది. -
ద్రవ్యలోటు రూ.5.26 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) సెప్టెంబర్ ముగిసే నాటికి రూ.5.26 లక్షల కోట్లకు చేరింది. బడ్జెట్లో నిర్దేశించుకున్న లక్ష్యంతో పోల్చితే ఈ పరిమాణం 35 శాతానికి చేరింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. 2021–22లో రూ.15,06,812 కోట్ల వద్ద ద్రవ్యలోటు ఉంటుందని ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనావేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలతో పోల్చితే ఇది 6.8 శాతం. అంచనాలతో పోల్చితే సెప్టెంబర్ నాటికి ద్రవ్యలోటు రూ.5,26,851 కోట్లకు (35 శాతం) చేరిందన్నమాట. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత ద్రవ్యలోటు పరిస్థితి అదుపులో ఉండడం గమనార్హం. కరోనా కష్టాల నేపథ్యంలో పడిపోయిన ఆదాయాలు– పెరిగిన వ్యయాల నేపథ్యంలో గత ఏడాది ఇదే కాలానికి ద్రవ్యలోటు అప్పటి బడ్జెట్ అంచనాలను దాటి ఏకంగా 114.8 శాతానికి ఎగసింది. 2020–21లో 3.5 శాతం తొలి (బడ్జెట్) అంచనాలను మించి ద్రవ్యలోటు 9.3 శాతానికి ఎగసింది. తాజా సమీక్షా కాలానికి సంబంధించి ముఖ్య గణాంకాలను పరిశీలిస్తే... 2020–21తో పోల్చితే పురోగతి ► 2021 సెప్టెంబర్ నాటికి ప్రభుత్వ ఆదాయాలు రూ.10.99 లక్షల కోట్లు. బడ్జెట్ మొత్తం ఆదాయ అంచానల్లో ఈ పరిమాణం 55.5 శాతానికి చేరింది. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఇదే కాలంలో బడ్జెట్ మొత్తం ఆదాయ అంచనాల్లో సెప్టెంబర్ నాటికి ఒనగూరింది కేవలం 25.2 శాతమే కావడం గమనార్హం. మొత్తం ఆదాయాల్లో పన్నుల విభాగం నుంచి తాజా సమీక్షా కాలానికి (2021 సెప్టెంబర్ నాటికి) వచ్చింది రూ.9.2 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాల్లో ఇది 59.6 శాతం. అయితే గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఇదే కాలానికి బడ్జెట్ మొత్తం పన్ను వసూళ్ల అంచనాల్లో సెప్టెంబర్ నాటికి ఒనగూరింది కేవలం 28 శాతమే కావడం గమనార్హం. ► ఇక సమీక్షా కాలంలో ప్రభుత్వ వ్యయాలు రూ.16.26 లక్షల కోట్లు. 2021–22 బడ్జెట్ మొత్తం వ్యయ అంచనాల్లో ఇది 46.7 శాతం. వెరసి ద్రవ్యలోటు సెప్టెంబర్ నాటికి రూ.5.26 లక్షల కోట్లకు చేరిందన్నమాట. సెప్టెంబర్‌లో మౌలిక రంగం స్పీడ్ 4.4 శాతం ఎనిమిది మౌలిక పారిశ్రామిక రంగాల గ్రూప్ ఉత్పత్తి సెప్టెంబర్‌లో 4.4 శాతం పెరిగింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ఈ ఎనిమిది రంగాల వృద్ధితీరు 2020లో కేవలం 0.6 శాతం. అప్పటి అతి తక్కువ లో బేస్ పరిస్థితిలో కూడా మౌలిక రంగం కేవలం 4.4 శాతం పురోగమించడం గమనార్హం. లో బేస్ కారణంతోనే 2021 ఆగస్టులో వృద్ధిరేటు భారీగా 11.5 శాతంగా ఉంది. మౌలిక రంగాల తీరు సమీక్షా నెల్లో వేర్వేరుగా చూస్తే... సహజవాయువు ఉత్పత్తి 27.5 శాతం పురోగతి సాధిస్తే, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తి 6 శాతం ఎగసింది. ఇక సిమెంట్ ఉత్పత్తి 10.8 శాతం పెరిగింది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 1.7 శాతం క్షీణించింది. ఎరువుల రంగం స్వల్పంగా 0.02 శాతం పురోగమించింది. విద్యుత్ ఉత్పత్తి కూడా ఇదే విధంగా 0.3 శాతం పెరిగింది. స్టీల్ రంగం పనితీరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇక బొగ్గు ఉత్పత్తి వృద్ధి రేటు 8.1 శాతం. -
ఏడు మెగా టెక్స్టైల్ పార్క్‌ల ఏర్పాటుకు నోటిఫికేషన్
న్యూఢిల్లీ: ఏడు మెగా టెక్స్టైల్ పార్క్‌ల ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ (పీఎం–ఎంఐటీఆర్‌ఏ) పార్క్ స్కీమ్ కింద ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు రూ.4,445 కోట్ల కేటాయింపులతో ఈ స్కీమ్ అమలు ప్రతిపాదనను 2021–22 బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్కొక్క పార్క్ ద్వారా లక్ష ప్రత్యక్ష, రెండు లక్షల పరోక్ష ఉపాధి అవకాశాల కల్పన ప్రధాన ఉద్దేశ్యం. పార్క్‌ల ఏర్పాటుకు ముందుకు వస్తున్న రాష్ట్రాల్లో వీటి ఏర్పాటు జరుగుతుంది. 1,000 ఎకరాలకుపైగా అందుబాటులో ఉన్న భూమి, టెక్స్‌టైల్స్‌కు సంబంధించి ఇతర సౌలభ్యత, తగిన పర్యావరణ వ్యవస్థను పరిగణనలోకి తీసుకుని పార్క్‌ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలను స్వీకరించడం జరుగుతోందని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో ఇటువంటి ప్రాజెక్టుల అత్యాధునిక సాంకేతికతను అలాగే భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, స్థానిక ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షిస్తాయని టెక్స్టైల్ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తెలుగురాష్ట్రాలుసహా తమిళనాడు, పంజాబ్, ఒడిస్సా, గుజరాత్, రాజస్తాన్, అస్సోం, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు పార్క్‌ల ఏర్పాటుకు తమ ఉత్సుకతను తెలియజేసినట్లు కూడా మంత్రిత్వశాఖ వెల్లడించింది. -
Ap Budget 2021: సర్వ హితం
సాక్షి, అమరావతి: సర్వ జనుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్ రూపుదిద్దుకుంది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ఈ బడ్జెట్లో అగ్రతాంబూలం దక్కింది. బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, బ్రాహ్మణులు, మైనార్టీలు.. ఇలా ప్రతి ఒక్కరి సంక్షేమానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది కంటే అన్ని వర్గాలకు నిధుల కేటాయింపు పెరగడం విశేషం. పేద, వెనుకబడిన, బలహీనవర్గాల అవసరాలను, ప్రాధాన్యతలను నెరవేర్చేలా కేటాయింపులు జరిగాయి. ఇప్పటికే ఇచ్చిన హామీల్లో 90 శాతంపైగా నెరవేర్చిన ఘనతను దక్కించుకున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. నవరత్నాలతోపాటు వివిధ పథకాల ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి.. భారీగా నిధులు బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాలు, గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఎస్సీ సబ్‌ప్లాన్‌కు గత ఆర్థిక సంవత్సరంలో రూ.14,218.76 కోట్లు కేటాయించగా.. ఈసారి 17,403.14 కోట్లకు పెంచింది. తద్వారా గతేడాది కంటే రూ.3,184.38 కోట్లను ఎస్సీల కోసం అదనంగా కేటాయించింది. ఎస్టీ సబ్‌ప్లాన్‌కు 2020–21లో రూ.4,814.50 కోట్లు కేటాయించగా ఈసారి 27 శాతం(రూ.1,316.74 కోట్లు) అదనంగా పెంచుతూ రూ.6,131.24 కోట్ల మేర కేటాయింపులు జరిపింది. ఎస్సీ సబ్‌ప్లాన్‌కు 17,403.14కోట్లు ఎస్టీ సబ్‌ప్లాన్‌కు 6,131.24కోట్లు గతేడాది కంటే 3,184.38కోట్లు అదనం గతేడాది కన్నా 27 శాతం అదనపు నిధులు -
AP Budget 2021: మహిళలే మహరాణులు
సాక్షి, అమరావతి: మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. మహిళలు ఆర్థిక, సామాజిక స్వావలంబన సాధించే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ కొత్త అధ్యయానికి నాంది పలికారు. బడ్జెట్లో సింహభాగం నిధులను రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం కేటాయించింది. మహిళల అభ్యుదయానికి వివిధ పథకాల ద్వారా కేటాయిస్తున్న నిధుల వివరాలతో ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. 2021–22 బడ్జెట్లో మహిళలకు రూ. 47,283.21కోట్లు కేటాయించింది. శాఖల వారీగా కేటాయింపులను ఆ నివేదికలో పొందుపరిచింది. రెండు విభాగాలు.. 53 పథకాలు మొత్తం 53 పథకాల కింద బాలికలు, మహిళలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. వాటిని రెండు విభాగాలుగా నివేదిక రూపంలో వెలువరించారు. 100 శాతం నిధులను బాలికలు, మహిళలకు కేటాయించే పథకాల వివరాలను మొదటి విభాగంలో పొందుపరిచారు. అందులో 24 పథకాలు ఉన్నాయి. వాటికి మొత్తం రూ.23,463.10 కోట్లు కేటాయించారు. బాలికలు, మహిళలకు 30 శాతం నుంచి 99 శాతం వరకు నిధుల కేటాయించిన పథకాలను రెండో విభాగంలో పొందుపరిచారు. అందులో 29 పథకాలు ఉన్నాయి. వాటికి మొత్తం రూ.23,820.11 కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి శాఖదే అగ్రస్థానం బాలికలు, మహిళలకు నిధుల కేటాయింపులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మొదటి స్థానం సాధించింది. ఆ శాఖ రూ.13,072.27 కోట్లు కేటాయించడం విశేషం. రూ.6,337.44 కోట్ల కేటాయింపులతో వైఎస్సార్ ఆసరా రెండో స్థానంలో నిలిచింది. జగనన్న అమ్మ ఒడి పథకం రూ.6,107.36 కోట్ల కేటాయింపులతో మూడో స్థానంలో ఉంది. -
22న సీఎం కేసీఆర్ కీలక ప్రకటనలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 22న సోమవారం శాసనసభలో పలు కీలక ప్రకటనలు చేసే అవకాశముంది. బడ్జెట్ 2021–22పై శని, సోమవారాల్లో అసెంబ్లీలో అధికార, విపక్ష పార్టీల సభ్యులు చర్చించనున్నారు. తర్వాత సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ శాసనసభలో బడ్టెట్‌పై ప్రసంగిస్తారు. ప్రతిపాదనలకు సంబంధించి సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఇదే సమయంలో పలు కీలక ప్రకటనలు చేయనున్నారని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ)కు సంబంధించిన ఫిట్మెంట్ శాతాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 29 శాతం నుంచి 31 శాతం వరకు ఫిట్మెంట్ ప్రకటించే విషయమై పరిశీలన జరుపుతున్నట్టు సమాచారం. దీనికితోడు కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో పలు ముందుజాగ్రత్త చర్యలపైనా సీఎం కీలక నిర్ణయాలు వెలువరిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో వారం రోజులుగా కరోనా కేసులు గణనీయంగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో 8వ తరగతి వరకు తరగతి గది బోధనను నిలిపివేసే అంశంపై కేసీఆర్ ప్రకటన చేస్తారని సమాచారం. ఈ విద్యార్థులను వచ్చే విద్యా సంవత్సరంలో ఎలా ప్రమోట్ చేయాలన్న అంశంపైనా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. పీఆర్సీకు ‘సాగర్’కోడ్ అడ్డంకి కాదు ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ప్రకటనకు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కోడ్ అడ్డంకిగా మారదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. సాగర్ ఉప ఎన్నిక కోడ్ నల్లగొండ జిల్లా పరిధిలో మాత్రమే అమల్లో ఉంటుందని, మొత్తం రాష్ట్రానికి వర్తించదని చెబుతున్నాయి. రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసిందని, పీఆర్సీ ప్రకటిస్తే ఓటర్లు ప్రభావితం కావడానికి అవకాశం లేదని అధికారులు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సడలించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే.. ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. నల్లగొండ ఎమ్మెల్సీ స్థానం ఫలితాలు శనివారం, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం ఫలితాలు ఆదివారం నాటికి వెల్లడికానున్నాయి. -
తెలంగాణ బడ్జెట్‌కు వేళాయే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈనెల 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. రెండు వారాల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నట్టు సమాచారం. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లకు ఈ నెల 14న పోలింగ్ జరగనుంది. ఆ మరునాడే బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. తొలిరోజున గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాక సభ వాయిదా వేస్తారు. అదే రోజున బీఏసీ సమావేశం నిర్వహించి.. ఎప్పటివరకు సమావేశాలు జరపాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. 16న సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతిపట్ల సంతాప తీర్మానం తర్వాత సభ వాయిదా పడనుంది. 17న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, చర్చ, సమాధానం ఒకేరోజు పూర్తి చేసి.. 18న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో బడ్జెట్‌పై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలోనే సమావేశాల నిర్వహణపైనా చర్చించినట్టు తెలిసింది. బడ్జెట్ సమావేశాల తేదీలపై అధికారంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. మార్చి మధ్యలో నిర్వహిస్తామని సీఎం పేర్కొన్నారు. ఈ లెక్కన ఈ నెల 14 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ బిజీగా ఉంటున్నందున ఆ తర్వాతే సమావేశాలు మొదలవుతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో అన్ని పద్దులపై సుదీర్ఘంగా చర్చలు కాకుండా స్వల్ప వ్యవధిలోనే ముగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నాయి. సమావేశాల్లోనూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోనున్నారు. -
వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడాలంటే...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు ఏమాత్రం పెంచలేదు. పైపెచ్చు ప్రధానమంత్రి కిసాన్ యోజనకు గతంలో రూ.75 వేల కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.65 వేల కోట్లు కేటాయించారు. రైతు వ్యవసాయ సంక్షేమంలోనూ నిధులు తగ్గించారు. అనేక పబ్లిక్ రంగ పరిశ్రమల నుండి ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరిం చుకుంటామని ప్రకటించారు. వ్యవసాయ రంగంలో పెట్టుబ డులు పెట్టడానికి కార్పొరేట్ కంపెనీలకు, మల్టీ నేషనల్ కంపె నీలకు అవకాశం కల్పించారు. కరోనా సమయంలోనే 100 కార్పొరేట్ కంపెనీల ఆదాయం రూ.12 లక్షల కోట్లకు పైగా పెరిగింది. వాస్తవంగా మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? వాటిని పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేయాలి? ప్రధాన సమస్యలను అసలు పట్టించుకుం టున్నారా? ఈ రోజు ఢిల్లీ లాంటి అనేక నగరాల్లో ఆక్సిజన్ శాతం తగ్గిపోతున్నది. దీనివల్ల అనేక శ్వాస సంబంధమైన రోగాలు వస్తున్నాయి. వాతావరణం వేడెక్కడం వల్ల అనేక పక్షులు, జంతువులు మనలేకపోతున్నాయి. భూగర్భ జలాలు ఇంకి పోయాయి. భవిష్యత్తులో ప్రజల ప్రాణాలను కాపాడాలంటే మొదట చేయాల్సింది వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం. చట్టాలు ఉన్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. కానీ ప్రభు త్వాలకు చిత్తశుద్ధి లేకపోతే ఎవరూ ఏమి చేయలేరు. కాలుష్య నివారణ చట్టాలను గట్టిగా అమలు చేయడం వల్ల కార్పొరేట్ కంపెనీలకు ఇబ్బంది కలుగుతుంది. కొంత ఆర్థికభారం వారిపై పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆరోగ్యానికి కేటాయించిన బడ్జెట్ నుండి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి, భూగర్భ జలాల స్థాయిని పెంచడానికి ఎక్కువశాతం ఉపయోగించాలి. కార్పొరేట్ కంపెనీల కాళ్ళకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీసే ప్రభుత్వం ఉన్నప్పుడు కాలుష్య నివారణ చర్యలు తీసుకుంటారని ఆశించడం అత్యాశే అవుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు, పంటలు ఎవరి ప్రయోజనాల కోసం? నేడు హైబ్రిడ్ విత్తనాలు వచ్చి ఎరువులు, పురుగు మందుల వాడకం పెరిగి ఆహారధాన్యాలు విషతుల్యం అవుతు న్నాయి. ప్రజలకు ఆరోగ్యకరమైన పంటలను, కూరగాయలను, పండ్లను అందించాలంటే ఎరువులు, పురుగు మందుల వాడ కాన్ని తగ్గించాలి. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలి. పశువులకు అధిక పాల కొరకు ఇచ్చే ఇంజెక్షన్లను రద్దు చేయాలి. ఆహారధాన్యాలను, కూరగాయలను, పండ్లను, కొబ్బరి నీళ్లను విషతుల్యం చేసే అన్ని రకాల మందులను, ఇంజెక్షన్లను నిషే ధించాలి. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పంటలను ప్రోత్స హించాలి. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగిస్తే వారు ప్రజల ఆరోగ్యం కోసం పంటలు ఉత్పత్తి చేయరు. లాభాల దిశగా వ్యవసాయ రంగాన్ని మరల్చుతారు. రైతులతో ఒప్పందాలు చేసుకొని, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు సరఫరా చేస్తారు. రైతుల పంటలను కొనుగోలు చేస్తారు. కనీస మద్దతు ధర ఇస్తామన్న వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేస్తామని చెప్పడం లేదు. కాబట్టి భవిష్యత్తులో కనీస మద్దతు ధర ఉండే పరిస్థితి పోతుంది. కొంతకాలానికి అధిక లాభాల కోసం ఎరువులు, విత్తనాల ధరలు పెంచి మరోవైపు పంటల ధరలను తగ్గిస్తారు. క్రమంగా రైతు అప్పుల్లో మునిగిపోతాడు. ఇప్పుడు కేంద్రం చేసిన చట్టాల ప్రకారం రైతుకు కోర్టుకు వెళ్లే అధికారం కూడా లేదు. చివరకు రైతు భూముల్ని అమ్ముకునే పరిస్థితి వస్తుంది. కంపెనీలు రైతుల భూముల్ని కొని పెద్దపెద్ద వ్యవసాయ క్షేత్రాలుగా చేస్తారు. దీనివల్ల రైతులు కూలీలుగా మారుతారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారధాన్యాల గురించి గానీ, కల్తీలేని పాల గురించి గానీ ఎవరూ ఆలోచించరు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం ద్వారా మొదట జరిగేది కార్మికుల తొలగింపు. నిర్వహణ ఖర్చుల తగ్గింపు పేరుతో నలుగురు పనిచేస్తున్న చోట ఇద్దరితోనే సరిపోతుందనే నెపంతో అనేక మంది ఉద్యోగం కోల్పోతారు. ప్రస్తుతం ఉన్న నిరుద్యోగ సమస్యకు ఇది అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. నిరుద్యోగులు పెరిగితే, రైతులకు కనీస మద్దతు ధర దొరక్కపోతే ఏమవుతుంది? ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీని ప్రభావం మార్కెట్ మీద పడి రవాణా ఖర్చులు పెరిగిపోతాయి. ఫలితంగా అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ప్రజలు కనీస అవసరాలు తీరడానికి ఇబ్బంది పడతారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గితే ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. అందుకే ప్రభుత్వం ప్రజల కొనుగోలు శక్తి పెంచే ప్రయత్నాలు చేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనకు ప్రణాళికలు వేయాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని ఆశిద్దాం. విదేశీ పెట్టుబడులకు గేట్లు బార్లా తీయడం వల్ల క్రమంగా మన ఆర్థిక వ్యవస్థ వారి గుప్పిట్లోకి పోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి ఆర్థిక వ్యవస్థ విదేశీయుల చేతిలోకి వెళ్తే వారి రాజకీయ జోక్యం పెరుగుతుంది. చివరకు మనం స్వతంత్రం కోల్పోయే ప్రమాదం కూడా రావచ్చు. జస్టిస్ బి. చంద్రకుమార్ వ్యాసకర్త హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి మొబైల్ : 94940 12734 -
బడ్జెట్‌పై కాంగ్రెస్ పెడార్థాలు తీస్తోంది
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఇటీవల తాము ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ప్రతిపక్షాలు అపార్థాలు సృష్టిస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ రహదారుల నిర్మాణం, పేదలకు పక్కా ఇళ్లు, ఉచితంగా వంటగ్యాస్, రేషన్ పంపిణీ వంటివి చేపడుతున్నా మోదీ ప్రభుత్వం ధనికులకు అనుకూల మంటున్నాయని విమర్శించారు. శుక్రవారం మంత్రి రాజ్యసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు సమాధానమిచ్చారు. కోవిడ్ మహమ్మారితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమైన తరుణంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధనకు బడ్జెట్ ఒక ఆయుధమని ఆమె అభివర్ణించారు. ‘స్వల్పకాలిక తక్షణ పరిష్కారాలను వెదకడానికి బదులుగా ఆర్థిక వ్యవస్థపై గుణాత్మక ప్రభావం చూపే ఉద్దీపనను, గట్టి ఉద్దీపనను కల్పించేందుకు ఈ బడ్జెట్లో ప్రయత్నం జరిగింది. ఈ క్లిష్ట సమయంలో సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు స్వల్ప కాలిక చర్యలు తీసుకుంటూనే మాధ్యమిక, దీర్ఘ కాలిక స్థిరవృద్ధి సాధనకు చర్యలు ప్రకటించాం’ అని తెలిపారు. దేశంలోని పేదలు, బడుగు వర్గాలకు సాయపడేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నా, ప్రభుత్వం కొందరు పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తోందన్న ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం ఆగడం లేదు’ అని అన్నారు. ‘మా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మార్కెట్‌ప్లేస్, యూపీఐలను కొందరు ధనికులు, కొందరు అల్లుళ్లే వినియోగిస్తున్నారా?’ అంటూ మంత్రి వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. బడ్జెట్లో పేర్కొన్న అంకెలపై మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అనుమానం వ్యక్తం చేయడంపై ఆమె స్పందిస్తూ..‘యూపీఏ హయాంలో అభివృద్ధి సాధించినట్లు చూపేందుకు కృత్రిమ గణాంకాలతో వ్యయాన్ని పెంచారు. సబ్సిడీని ప్రభుత్వ బడ్జెట్ నుంచి కంపెనీలకు తరలించారు. కానీ, 2021–22 బడ్జెట్లో పారదర్శకత పాటిస్తూ వ్యయ వివరాలన్నీ స్పష్టంగా పేర్కొన్నాం’అని తెలిపారు. -
సెన్సెక్స్–నిఫ్టీ.. రేసు గుర్రాలు
ముంబై: కోవిడ్–19 నేపథ్యంలోనూ కంపెనీలు పటిష్ట ఫలితాలు సాధిస్తుండటం, వృద్ధికి ఊతమిచ్చే బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రకటించడం వంటి అంశాలతో దేశీ స్టాక్ మార్కెట్లు రేసు గుర్రాల్లా పరుగెడుతున్నాయి. వీటికి జతగా విదేశీ ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో కొనుగోళ్లకు ఎగబడుతుండటంతో వరుసగా ఆరో రోజు మార్కెట్లు ర్యాలీ బాటలో సాగాయి. సెన్సెక్స్ 617 పాయింట్లు జంప్‌చేసి 51,349 వద్ద ముగిసింది. నిఫ్టీ 192 పాయింట్లు ఎగసి 15,116 వద్ద నిలిచింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ 51,523 వద్ద, నిఫ్టీ 15,160 వద్ద సరికొత్త రికార్డులను అందుకున్నాయి. విదేశీ మార్కెట్లలోనూ బుల్లిష్ ట్రెండ్ నెలకొనడంతో దేశీయంగా సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. బ్లూచిప్స్ స్పీడ్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, మెటల్, ఐటీ, రియల్టీ 3.2–2 శాతం మధ్య ఎగశాయి. పీఎస్‌యూ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ 1–0.5 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, హిందాల్కో, శ్రీ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, ఎయిర్టెల్, గెయిల్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, విప్రో, ఐసీఐసీఐ, ఎల్అండ్టీ 7.4–2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే బ్రిటానియా, హెచ్‌యూఎల్, కొటక్ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, ఐటీసీ 2–0.4 శాతం మధ్య నీరసించాయి. ఎఫ్‌అండ్‌వోలో డెరివేటివ్ కౌంటర్లలో కంకార్, రామ్‌కో సిమెంట్, ఎక్సైడ్, అదానీ ఎంటర్, నౌకరీ, సెయిల్, కోఫోర్జ్, మదర్సన్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, భారత్ ఫోర్జ్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, అమరరాజా 7–5 శాతం మధ్య పురోగమించాయి. కాగా.. మరోపక్క భెల్, పీఎన్బీ, మణప్పురం, ఐడియా, గోద్రెజ్ సీపీ, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, బీవోబీ 3.7–1.2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. నేటి ట్రేడింగ్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నగదు విభాగంలో దాదాపు రూ. 1,877 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 505 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. 2.5 లక్షల కోట్లు ప్లస్ మార్కెట్ల తాజా ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు రూ. 2.5 లక్షల కోట్లు జమయ్యింది. గత 6 రోజుల్లో రూ. 16.7 లక్షల కోట్లు బలపడింది. దీంతో బీఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం రూ. 202.82 లక్షల కోట్లకు చేరింది. ఇది కూడా రికార్డు కావడం విశేషం! స్టాక్స్ విశేషాలివీ n బడ్జెట్లో బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 74 శాతానికి పెంచడంతో బజాజ్ ఫిన్సర్వ్ వరుసగా ఆరో రోజు ర్యాలీతో 52 వారాల గరిష్టానికి చేరింది. n క్యూ3లో నిర్వహణ లాభం 28% పెరగడంతో శ్రీ సిమెంట్ షేరు కొత్త గరిష్టాన్ని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 1.01 లక్షల కోట్లకు చేరింది. 6 రోజుల్లో ఈ షేరు 23% ర్యాలీ చేసింది. n క్యూ3లో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఎంఅండ్ఎం, బజాజ్ ఎలక్ట్రికల్స్, గుజరాత్ గ్యాస్, అఫ్లే ఇండియా కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. n ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో 23.5% వాటాను సొంతం చేసుకోవడంతో అదానీ ఎంటర్ప్రైజెస్ 52 వారాల గరిష్టానికి చేరింది. -
ఆందోళన ఆపండి.. రైతులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనను ఇకనైనా విరమించాలని రైతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కొత్త సాగు చట్టాలకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఆందోళనలో భాగస్వాములైన సిక్కు రైతులను దూషిస్తూ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. మన రైతులను మనమే కించపర్చుకోవడం దేశానికి ఏమాత్రం మంచి చేయదని పేర్కొన్నారు. కొత్త చట్టాలను కొందరు రాజకీయ అంశంగా మార్చేశారని విమర్శించారు. రైతుల ఆందోళన వెనుక ఉన్న అసలైన కారణాలపై ప్రతిపక్షాలు మౌనం వహిస్తున్నాయని మండిపడ్డారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోదీ సోమవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎఫ్‌డీఐకి (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి) మరో నిర్వచనం ఇచ్చారు. విదేశీ విధ్వంసకర సిద్ధాంతం(ఫారిన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ) అనే కొత్త ఎఫ్‌డీఐ దేశంలో ఆవిర్భవించిందని అన్నారు. ఈ సిద్ధాంతం నుంచి దేశాన్ని రక్షించుకొనేందుకు అప్రమత్తంగా ఉండాలన్నారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. వారంతా ఆందోళన్ జీవులు ‘‘దేశంలో ఆందోళన్ జీవి అనే కొత్త జాతి పుట్టుకొచ్చింది. నిష్ణాతులైన నిరసనకారులు ప్రతి ఆందోళనలో కనిపిస్తున్నారు. వారంతా ఆందోళనల నుంచి లాభం పొందాలనుకునే పరాన్నజీవులు. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి లేకపోతే వారు బతకలేరు. రైతుల ఆందోళనలో పాల్గొంటున్న సిక్కులను ఖలిస్తాన్ ఉగ్రవాదులు అని సంబోధించడం తగదు. సిక్కుల సేవలు దేశానికి గర్వకారణం. పంజాబ్‌లో ఏం జరిగిందో మనం మర్చిపోకూడదు. దేశ విభజన వల్ల పంజాబ్ తీవ్రంగా నష్టపోయింది. 1984లో జరిగిన అల్లర్లలో సిక్కులు బాధితులయ్యారు. సంస్కరణలతో తోడ్పాటు కొత్త వ్యవసాయ చట్టాల వల్ల కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ), మండీ వ్యవస్థకు ఎలాంటి విఘాతం కలుగదు. ఈ చట్టాలతో మండీలు మరింత ఆధునికంగా మారుతాయి. కనీస మద్దతు ధర భవిష్యత్తులోనూ కచ్చితంగా కొనసాగుతుందని నేను హామీ ఇస్తున్నా. దేశంలో 80 కోట్ల మందికి రేషన్ సరుకులు ఎప్పటిలాగే అందుతాయి. దయచేసి తప్పుడు ప్రచారం సాగించకండి. కొత్త వ్యవసాయ చట్టాలతో వారు తమ పంటలను దేశంలో ఎక్కడైనా విక్రయించుకొనే స్వేచ్ఛ లభిస్తుంది. తద్వారా మంచి ధర పొందుతారు. పంటల సేకరణ విధానంలో సంస్కరణలు అవసరమని గతంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ చెప్పారు. రైతన్నలు కొత్త చట్టాలను అర్థం చేసుకోవాలి. రైతులు ఆందోళన ఆపేయాలి. చర్చల కోసం అన్ని ద్వారాలు తెరుద్దాం. చర్చల కోసం మిమ్మల్ని మరోసారి ఈ సభ నుంచే ఆహ్వానిస్తున్నా. కొత్త సాగు చట్టాలకు ప్రతిపక్షాలు, ప్రభుత్వం, ఆందోళనకారులు ఒక అవకాశం ఇవ్వాలి. రైతులకు మేలు చేస్తాయో లేదో చూడాలి. లోపాలుంటే తొలగించడానికి సిద్ధం. కశ్మీర్లో స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించడం సంతోషకరం. దీన్ని కాంగ్రెస్ నాయకులు ‘జి–23 సలహా’గా చూడొద్దు’’ అని ప్రధాని మోదీ కోరారు. తేదీ, సమయం మీరే నిర్ణయించండి: సంయుక్త కిసాన్ మోర్చా కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వంతో తదుపరి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని సంయుక్త కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు శివ్‌కుమార్ కక్కా సోమవారం ప్రకటించారు. చర్చల తేదీ, సమయాన్ని మీరే నిర్ణయించండి అని కేంద్రాన్ని కోరారు. దేశంలో ఆందోళన జీవి అనే కొత్త జాతి పుట్టుకొచ్చిందన్న ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఆందోళనకు ముఖ్యమైన పాత్ర ఉందని గుర్తుచేశారు. ప్రభుత్వంతో చర్చలను తాము ఎప్పుడూ నిరాకరించలేదని చెప్పారు. ప్రభుత్వం పిలిచినప్పుడల్లా తాము వెళ్లామని, కేంద్ర మంత్రులతో చర్చించామని వెల్లడించారు. ‘‘కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కొనసాగుతుందని ప్రభుత్వం ఇప్పటికే వందల సార్లు చెప్పింది. అలాంటప్పుడు దానికి చట్టబద్ధత కల్పించడానికి అభ్యంతరం ఏమిటి?’’ అని రైతు సంఘం నేత అభిమన్యు కోహర్ ప్రశ్నించారు. చర్చలకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానం రావాల్సి ఉందన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించకుండా ప్రభుత్వం ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహన్) పంజాబ్ ప్రధాన కార్యదర్శి సుఖ్‌దేవ్ సింగ్ విమర్శించారు. ఆకలితో వ్యాపారమా? దేశంలో ఆకలితో వ్యాపారం సాగించాలనుకుంటే సహించబోమని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ తికాయత్ హెచ్చరించారు. కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. ఎంఎస్పీపై ప్రధాని మోదీ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. రైతులు ఆందోళన విరమించాలన్న ప్రధానమంత్రి వినతిపై రాకేశ్ తికాయత్ సోమవారం ప్రతిస్పందించారు. ‘‘దేశంలో ఆకలితో వ్యాపారం చేయాలనుకుంటే అంగీకరించే ప్రసక్తే లేదు. ఆకలి పెరిగితే పంటల ధరలు పెరుగుతాయి. ఆకలితో వ్యాపారం చేయాలనుకుంటున్న వారిని దేశం నుంచి తరిమికొట్టాలి’’ అని అన్నారు. ఎంఎస్పీ ఉండదని రైతులు కూడా చెప్పడం లేదని, దానికి చట్టబద్ధత కావాలని మాత్రమే ఆశిస్తున్నారని గుర్తుచేశారు. మూడు సాగు చట్టాలను రద్దు చేసి, ఎంఎస్పీ కోసం కొత్త చట్టం చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని సూచించారు. రైతుల పోరాటం రాజకీయ ప్రేరేపితం అన్న మోదీ వ్యాఖ్యలను తికాయత్ తప్పుపట్టారు. రైతుల్లో కులం, మతం ఆధారంగా చీలిక తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. సింఘు వద్ద తాత్కాలిక స్కూల్ ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వద్ద రైతుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక పాఠశాల దాదాపు 15 రోజుల తర్వాత పునఃప్రారంభమైంది. పంజాబ్‌లోని ఆనంద్ సాహిబ్‌కు చెందిన రైతులు ఈ పాఠశాలను డిసెంబర్లో ఏర్పాటు చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న రైతుల పిల్లలు చదువుకునేందుకు ఈ స్కూల్‌ను ఒక టెంట్లో నెలకొల్పారు. జనవరి 24న ఈ స్కూల్‌ను మూసివేశారు. ఫిబ్రవరి 5న మళ్లీ తెరిచారు. 1 నుంచి 7వ తరగతి వరకు బోధిస్తున్నారు. -
పీఎం ఫసల్ బీమా యోజనకు రూ.16వేల కోట్లు
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పిఎంఎఫ్‌బివై) పథకానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ.16,000 కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2021-22 బడ్జెట్ లో 305కోట్లు ఎక్కువగా కేటాయించారు. దేశంలోని వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వ తన నిబద్ధతను తెలియజేస్తుందని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ అభిప్రాయపడింది. ఈ పథకం ద్వారా రైతుల విత్తనాలు వేసిన దగ్గర నుంచి పంటకోతకు వచ్చే వరకు ఆ పంటకు రక్షణ లభిస్తుంది. పిఎంఎఫ్‌బివై ప్రయోజనాలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులు భీమా చేసిన పంటలకు నష్టం కలిగితే దీని ద్వారా భీమా అందిస్తారు. ప్రకృతి విపత్తు కారణంగా రైతు పంట నాశనమైతే వారికి ఈ పథకం కింద భీమా లభిస్తుంది. ఖరీఫ్ పంటలో 2శాతం, రబీ పంటకు 1.5శాతం, హార్టికల్చర్ కు 5శాతం రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల క్రితం 13 జనవరి 2016న భారత ప్రభుత్వం పీఎం ఫసల్ బీమా యోజన పథకాన్ని పీఎం తీసుకొచ్చింది.(చదవండి: భవిష్యత్ ఇంధనంగా హైడ్రోజన్) కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద పంట బీమా పథకం ఇది. ప్రీమియం విషయంలో మూడో అతిపెద్ద బీమా పథకం. ప్రతి ఏడాది 5.5 కోట్లకు పైగా రైతుల దరఖాస్తులు చేసుకుంటారు. ఈ పథకానికి రైతులు ఎవరైనా దరఖాస్తు చేయొచ్చు. అన్ని రకాల ఆహార పంటలకు ఇది వర్తిస్తుంది. పంట నష్టపోయిన రైతులు 72 గంటల్లో దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్‌కు లేదా క్రాప్ ఇన్స్యూరెన్స్ యాప్‌లో రిపోర్ట్ చేయాలి. అర్హులైన రైతుల బ్యాంకు అకౌంట్‌కు బీమా డబ్బులు వస్తాయి. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను https://pmfby.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. -
ఆర్టీసీకి కోవిడ్ సాయం లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నష్టాలకు కేంద్రం నుంచి ఆర్థిక చేయూత ఉంటుందని ఆశించిన ఆర్టీసీకి నిరాశే ఎదురైంది. తాజా బడ్జెట్లో ఆర్టీసీలకు కోవిడ్ నష్టాలకు సాయం చేసే అంశాన్ని పొందుపరచలేదు. రోడ్డు రవాణా సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 30 శాతం వాటా ఉన్న నేపథ్యంలో.. కోవిడ్ నష్టాలకు ఎంతోకొంత సాయం అందుతుందన్న ఆర్టీసీ ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. కోవిడ్ వల్ల ఆర్టీసీ దాదాపు రూ.2 వేల కోట్ల వరకు నష్టపోయిందని ఇటీవల సంస్థ తేల్చింది. అందులో కొంత మొత్తం కేంద్రం నుంచి వస్తుందని ఆశించింది. ఆ మేరకు బడ్జెట్లో ప్రకటన ఉంటుందని ఎదురుచూసింది. కానీ, బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి ఎలాంటి ప్రకటన చేయకపోవడం, తర్వాత బడ్జె ట్ పుస్తకంలో అది కనిపించకపోవటంతో ఇక సాయం అందదన్న నిర్ణయానికి వచ్చింది. 2019లో సమ్మె జరిగిన సమయంలో కేంద్ర ప్రభుత్వ వాటా, ఆర్థిక సాయం అంశం పలుమార్లు చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. స్వయంగా ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ వాటా, ఆర్థిక సాయంపై ప్రశ్నించారు కూడా. కోవిడ్ మహమ్మారి రూపంలో దేశవ్యాప్తంగా ప్రజారవాణాకు నష్టం వాటిల్లిన నేపథ్యం లో.. మళ్లీ కేంద్రం వాటా, సాయం అంశం చర్చకు వచ్చింది. సాయం లేకపోగా నష్టం చేసే చర్యలా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా బడ్జెట్లో నగరాల్లో ప్రజా రవాణాను బలోపేతం చేసే పేరుతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంశాన్ని పొందుపరిచిన విషయం తెలిసిందే. ప్రైవేటు సంస్థలు బస్సులను నిర్వహించేలా దీన్ని రూపొందిస్తున్నారు. తాజాగా దీనిపై కార్మిక సంఘాల వైపు నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం తాజా బడ్జెట్లో ప్రతిపాదించినట్లుగా నగరాల్లో ప్రజా రవాణా బలోపేతం పేరుతో పీపీపీ పద్ధతిలో ప్రైవేటు ఆపరేటర్లకు అవకాశం కల్పిస్తే అది తుదకు ఆర్టీసీని నిర్వీర్యం చేసినట్టే అవుతుందని ఆర్టీసీ బోర్డు మాజీ సభ్యుడు, సీనియర్ కార్మిక నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆర్టీసీలో వాటా ఉన్నందున కేంద్రం ఆర్థిక రూపంలో సాయం చేయాలని, కానీ ఇలా ఆర్టీసీలను నష్టపరిచే నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన డిమాండ్ చేశారు. -
పల్లెకూ ఉంది ఓ బడ్జెట్
సత్తెనపల్లి: బడ్జెట్ అంటే బోలెడు లెక్కలు. ఆదాయ మార్గాలను అన్వేషించాలి. అవసరాలకు తగిన నిధులు కేటాయించాలి. రూపాయి రాక.. పోక వివరాలు పక్కాగా ఉండాలి. అది కేంద్ర బడ్జెట్ అయినా.. పల్లె పద్దు అయినా లెక్క పక్కాగా ఉండాల్సిందే. పంచాయతీల ఆదాయ మార్గాలు, పల్లెల ప్రగతికి ఉపకరించే నిధులు, వాటి పద్దుల బడ్జెట్ ఎలా ఉంటుందంటే.. కేంద్ర సహకారమే కీలకం పల్లెలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులే కీలకంగా ఉంటాయి. జనాభా ప్రాతిపదికన వీటిని కేటాయిస్తారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఇప్పటికే రెండు దఫాలుగా విడుదలయ్యాయి. ఒక్కో వ్యక్తికి సగటున రూ.550 నుంచి రూ.600 వరకు వస్తోంది. ప్రస్తుతం ఈ నిధుల్లో పంచాయతీలకు 70 శాతం, మండలాలకు 20 శాతం, జెడ్పీకీ 10 శాతం వంతున కేటాయిస్తారు. ఈ నిధుల్లో 50 శాతం టైడ్ ఫండ్స్ రూపంలో పంచాయతీలు కేంద్ర నిబంధనల ప్రకారం వ్యయం చేయాల్సి ఉంటుంది. వీటిని పారిశుద్ధ్యం, తాగునీటి వనరులు, సిబ్బంది జీతభత్యాలు తదితర అవసరాలకు వెచ్చించాల్సి ఉంటుంది. మిగిలిన 50 శాతం అన్‌టైడ్ ఫండ్స్‌ను ఒక్క జీతభత్యాలకు కాకుండా ఏ ఇతర పనికైనా వెచ్చించవచ్చు. ఉపాధి హామీ పథకం కింద కొన్ని నిధులు అందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో సచివాలయ భవనాలు, రహదారులు, ఇతర నిర్మాణాలు, భూగర్భ జల వనరుల పెంపు తదితరాలను ఈ పథకం కిందే అభివృద్ధి చేస్తున్నారు. అన్ని పంచాయతీలకు సమానంగా డబ్బులు ఇస్తారు. సాధారణ నిధుల వినియోగం ఇలా.. మొత్తం 47 రకాల పన్నులు విధించడానికి పంచాయతీ పాలకవర్గాలకు అధికారం ఉంది. పన్ను విధింపు, అమలుకు గ్రామ సభల్లో తప్పనిసరిగా ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇందులో ఇంటి పన్ను, వృత్తి, వినోదం, భూమి రిజిస్ట్రేషన్, వేలం, కాటా రుసుము తదితరాలు ఉన్నాయి. పన్నేతర ఆదాయం కింద చెరువుల వేలం, పరిశ్రమలు, మార్కెట్ యార్డు ప్రకటనలు, సెల్‌ఫోన్ టవర్లు తదితరాల నుంచి ఆదాయం లభిస్తుంది. వృత్తి పన్ను రూపంలో రాష్ట్ర పన్నుల శాఖ వసూలు చేసిన మొత్తంలో 95 శాతం తిరిగి పంచాయతీలకు ప్రభుత్వం కేటాయిస్తుంది. పంచాయతీలో తలసరి రూ.4 అందిస్తుంది. వినోదపు పన్నును 60:40 నిష్పత్తిలో ఇస్తారు. గనుల తవ్వకానికి సంబంధించి వసూలయ్యే సీనరేజిలో 25 శాతం చెల్లిస్తుంది. ఖర్చులకు ఉందో ఆడిట్ ఖర్చు పెట్టే ప్రతి రూపాయికీ ఆడిట్ రూపంలో లెక్క సమర్పించాల్సి ఉంటుంది. ఆదాయం మొత్తాన్ని ఖర్చు చేయడానికి స్వేచ్ఛ ఉన్నప్పటికీ లెక్క మాత్రం తప్పకూడదు. వ్యయ నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర, పంచాయతీరాజ్ నిబంధనలు పాటించి తీరాలి. -
నీతి ఆయోగ్ సూచన మేరకే పెట్టుబడుల ఉపసంహరణ
సాక్షి, హైదరాబాద్: నీతి ఆయోగ్ సూచన మేరకే విశాఖ స్టీల్ ప్లాంట్ సహా దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ వెల్లడించారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ వల్ల ఎవరికీ నష్టం జరగదని, అవసరమైతే కంపెనీ ఉద్యోగులతో మాట్లాడతామన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ వల్ల దేశానికి, ఉద్యోగులకు, కంపెనీ అభివృద్ధికి ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో కేంద్రం పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ నిర్ణయాన్నిబట్టి అన్ని కంపెనీలను కేంద్రం అమ్మేస్తోందనే భావన, ప్రచారం సరైంది కాదన్నారు. కేంద్ర బడ్జెట్లోని అంశాలను వివరించేందుకు చేపడుతున్న ప్రచారంలో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ నేతలు కె.లక్ష్మణ్, డి.ప్రదీప్ కుమార్, జంగారెడ్డి, కృష్ణ సాగర్‌రావు, డా. ప్రకాశ్‌రెడ్డిలతో కలసి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. కంపెనీల పనితీరు ప్రాతిపదికనే... ప్రభుత్వరంగ కంపెనీల పనితీరును కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రాధాన్యత–ప్రాధాన్యేతర, వ్యూహాత్మక–వ్యూహాత్మకేతర అంశాల ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ, ఏపీకి ఎలాంటి నష్టం జరగలేదని, తాము సహకార సమాఖ్య విధానాన్ని నమ్ముతామన్నారు. తెలంగాణ, ఏపీకి అనేక ప్రాజెక్టులు కేటాయించినట్లు చెప్పారు. బడ్జెట్లో తెలంగాణలోని రైల్వే లైన్లకు కేటాయింపులున్నాయని, ప్రస్తుతం రూ. 29 వేల కోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. అలాగే 2,111 కి.మీ. నిడివిగల రోడ్ల నిర్మాణం కోసం రూ. 20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రూ. 13 ,990 కోట్లు వచ్చాయని, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు 15 ఆర్థిక సంఘం నిధుల కింద రూ. 9,172 కోట్లు వస్తాయని, ఆత్మనిర్భర భారత్ కింద తెలంగాణకు రూ. 400 కోట్లు ఏటా వస్తాయని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పోలవరానికి నిధుల కేటాయింపులు... కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు నిధులిచ్చామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. పోలవరానికి ఒప్పందం మేరకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. స్టార్టప్‌లు, ఇతరత్రా రూపాల్లో ఇస్తున్న ప్రోత్సాహకాల ద్వారా తెలంగాణ, ఏపీకి ఎంతో మేలు జరుగుతుందన్నారు. పెట్రో ఉత్పత్తులపై కేంద్ర పన్నుల కన్నా రాష్ట్ర పన్నులే ఎక్కువ ఉన్నాయన్న విషయాన్ని గమనించాలన్నారు. గ్యాస్ ధర అంతర్జాతీయ మార్కెట్ విలువను బట్టి మారుతూ ఉంటుందన్నారు. పన్నులు పెంచని బడ్జెట్ సాక్షి, హైదరాబాద్: పేదలపై ఎలాంటి ఆర్థిక భారం మోపకుండా ఈ ఏడాది బడ్జెట్ రూపొందించామని కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. కోవిడ్‌తో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో పన్నులు పెంచకుండా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో శనివారం బడ్జెట్–2021పై జరిగిన చర్చలో మంత్రి పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనురాగ్సింగ్తోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొ న్నారు. ఠాకూర్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వేగంగా ఉందని, నెలకు సగటున రూ.లక్ష కోట్లు జీఎస్టీ వసూలు అవుతోందన్నారు. గతేడాది కంటే ఈసారి 34 శాతం అధికంగా మూలధన వ్యయం పెంచామని స్పష్టం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు సమం చేసే దిశగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేశంలో అతిత్వరలో 3 ఆటోమొబైల్ తయారీ కేంద్రాలు రాబోతున్నాయని తెలిపారు. స్క్రాపింగ్ పాలసీతో మరింత మైలేజీ గల వాహనాలను కొనుగోలు చేయవచ్చన్నారు. కొత్త వ్యవసాయ చట్టం రైతులకు లాభం చేకూరుస్తుందని, కానీ ప్రతిపక్ష పార్టీలు రైతులను తప్పుదోవపట్టిస్తున్నాయన్నారు. ఇన్నేళ్లలో రైతుల కోసం ఏ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం మాదిరిగా ఖర్చు చేయలేదని వివరించారు. బడ్జెట్ పట్ల సీఎం, మంత్రులు సంతోషంగానే ఉన్నారు సాక్షి, హైదరాబాద్: ‘కేంద్ర బడ్జెట్‌తో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందిలేదు. సీఎం, మంత్రులు సంతోషంగానే ఉన్నారు. వాళ్లు బడ్జెట్‌పై ఏమీ మాట్లాడలేదు, స్పందించలేదు కదా. బడ్జెట్ బాగోలేదంటూ సీఎం మీకు ఫోన్‌చేసి చెప్పలేదు కదా’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. శనివారం బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం సందర్భంగా బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులపై కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్‌ను ప్రశ్నించినప్పుడు సంజయ్ ఈవిధంగా స్పందించారు. -
రాయని డైరీ.. నిర్మలా సీతారామన్ (ఆర్థిక మంత్రి)
‘‘ఊరెళ్లాలి మేడమ్ సెలవు కావాలి’’ అన్నాడు అనురాగ్ ఠాకూర్ సడన్‌గా వచ్చి! ‘‘ఏమైంది అనురాగ్?!’’ అన్నాను. ‘‘ఏం కాలేదు మేడమ్’’ అన్నాడు. ‘‘ఏం కానప్పుడు నువ్వు ఫిబ్రవరి 15 తర్వాత గానీ, మార్చి 8 లోపు గానీ, ఏప్రిల్ 8 తర్వాత గానీ ఊరెళ్లొచ్చు కదా అనురాగ్’’ అన్నాను. అవి సెషన్స్ ఉండని రోజులు. అయినా ఊరెళ్లడానికి సెలవు తీసుకునే వయసు కాదు అనురాగ్ది. నాకన్నా పదిహేనేళ్లు చిన్నవాడు కదా అని మాత్రమే అతడికి ఇస్తే సెలవు ఇవ్వాలి. ‘‘నువ్వేమీ బడి పిల్లాడివి కాదు అనురాగ్. బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థికమంత్రికి సహాయ మంత్రివి. ప్రతిపక్షాలు ప్రశ్నలు అడిగే సమయానికి ఊరెళతానంటే ఎలా! బడ్జెట్ సెషన్స్ కానివ్వు..’’ అన్నాను. ‘‘బడ్జెట్ సెషన్స్ బోర్ కొడుతున్నాయి మేడమ్’’ అన్నాడు!! ‘‘బడ్జెట్ సెషన్స్ బడ్జెట్ హల్వాలా ఎలా ఉంటాయి అనురాగ్!’’ అన్నాను. ‘‘ఓ.. హల్వా! రెండు వారాలైంది కదా మేడమ్. మాలో ఎవరికైనా హల్వా చేయడం వచ్చా అని కూడా అడిగారు మీరు..’’ అన్నాడు. నిజమే! నిన్న మొన్న హల్వా చేసినట్లుంది. సినిమాల్లో డాక్టర్ ఆపరేషన్ చేస్తుంటే చుట్టూ చిన్న డాక్టర్లు చేరి మాస్కుల్లోంచి కళ్లు అప్పగించి చూస్తున్నట్లు నా ఫైనాన్స్ స్టాఫ్ అంతా నా చుట్టూ చేరి హల్వా తయారవుతున్న బాణలిలోకి తొంగి చూస్తున్నారు తప్పితే చూడ్డం వచ్చని గానీ, రాదని గానీ చెప్పలేదు! నా వెనుక భుజం మీద నుంచి ఎవరో చెక్క గరిట అందించారు. హల్వాను మెల్లిగా గరిటెతో పైకీ కిందికీ తిప్పుతున్నాను. పిల్ల డాక్టర్లు హల్వా మీదకు వంగి చూస్తున్నారు. ‘హల్వాని ఎలా తిప్పుతాం అబ్బాయిలూ.. పైకీ కిందికా, పక్కలకా..’ అని మా హల్వా డాక్టర్లని అడిగితే, ‘అసలు తిప్పుతామా మేడమ్’ అని తిరిగి నన్నే అడిగాడు ఒక డాక్టర్. ఆ అడిగిన డాక్టర్ ఎవరా అని తలతిప్పి చూశాను. అనురాగ్ ఠాకూరే! ‘కొంచెం చూస్తుంటావా అనురాగ్, బ్రేక్ తీసుకుంటాను..’ అన్నాను. ‘అలాగే మేడమ్’ అని కదా నా సహాయకుడిగా అతడు అనవలసింది.. ‘అందరం బ్రేక్ తీసుకుందాం మేడమ్..’ అన్నాడు! ‘అవును మేడమ్ అందరం బ్రేక్ తీసు కుందాం.. హల్వా కింద స్టౌ మంటను ఆపేసి..’ అనే మాట వినిపించింది! ఆ మాట అన్నది అనురాగ్ డాక్టర్ కాదు. ఇంకో హల్వా డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్. ఫైనాన్స్ సెక్రెటరీ. ‘అరె సుబ్రహ్మణియన్.. నువ్వెప్పుడొచ్చావ్?’ అన్నాను. ‘మీ చేతికి గరిటె ఇచ్చింది నేనే మేడమ్’ అన్నాడు. ‘బ్రేకులు మనం తీసుకోవచ్చు సుబ్రహ్మణియన్. స్టౌ మీద ఉన్న హల్వాకు బ్రేక్‌లు ఇవ్వకూడదు’ అని చెప్పాను. ఆ రోజంతా హల్వాతోనే గడిచిపోయింది. నా టీమ్‌లో స్టౌ వెలిగించడం వచ్చిన వాళ్లు కూడా లేనట్లున్నారు. ‘హల్వా సూపర్‌గా ఉంది మేడమ్’ అనైతే అన్నారు. ‘మీరు కూడా నేర్చుకుని చేసి చూడండయ్యా.. ఇంకా సూపర్‌గా వస్తుంది’ అన్నాను. మోటివేట్ అయినట్లు లేదు. ఈ మగపిల్లలు మాటలు ఎన్నైనా చెబుతారు. వంట మాత్రం నేర్చుకోరు. సండే కావడంతో రిలాక్సింగ్‌గా ఉంది. మొన్న మాన్సూన్ సెషన్స్కైతే శని, ఆది వారాల్లో కూడా పని చేశాం. ‘‘నమస్తే ఆంటీ..’’ అంటూ వచ్చింది పక్కింట్లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్న అమ్మాయి. సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నట్లుంది. ‘‘రామ్మా.. కూర్చో..’’ అన్నాను. ‘‘ఆంటీ, వృద్ధి రేటు 11 శాతం వరకు ఉంటుంది అన్నారు కదా మీరు. అంత ఎలా పెరుగుతుంది ఆంటీ!’’ అంది. ‘‘అబ్బాయిలు వంట నేర్చుకుంటే పెరుగుతుందమ్మా..’’ అన్నాను. పెద్దగా నవ్వింది. ‘‘అవునాంటీ.. వృద్ధి రేటు పెరగడానికైనా ఈ బాయ్స్ వంట నేర్చుకోవాల్సిందే..’’ అంది. -
వారంతా బడ్జెట్‌పై మాట్లాడలేదు.. అంటే!..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంతి కే.చంద్రశేఖర్‌రావుతో సహా అగ్ర నాయకులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాట్లాడలేదని, అంటే! బడ్జెట్‌పై వారు సంతోషంగా ఉన్నట్లు స్పష్టం అవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ప్రధాని నరేంద్రమోదీ అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనురాగ్ బడ్జెట్ రూప కల్పనలో కీలకపాత్ర పోషించారు. ప్రతిపక్షాలు కావాలనే దేశవ్యాప్తంగా విమర్శలు చేస్తున్నాయి. సంక్షేమం పేరుతో ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు. సంక్షేమం ముఖ్యమే కానీ, అభివృద్ధి అంతకన్నా ముఖ్యం. సంక్షేమ పథకాల నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. అభివృద్ధి కూడా కుంటుపడుతోంది. కరోనా విపత్తులోనూ బడ్జెట్ నిధులను కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంది. బడ్జెట్‌ను రాజకీయ కోణంలో చూడకూడదు. మోదీ నేతృత్వంలో శక్తివంతమైన భారత్ కోసం పని చేస్తున్నాం. అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో బీజేపీ పనిచేస్తుంది’’ అని అన్నారు. -
వంటింట్లో గ్యాస్ మంట
సాక్షి, హైదరాబాద్ : వంటింట్లో గ్యాస్ మంట పుట్టిస్తోంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలకు అనుగుణంగా ధరలను పెంచుతుండటంతో సిలిండర్ ధర ఆకాశానికి చేరుతోంది. రెండు నెలల వ్యవధిలోనే గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధర రూ. 125 మేర పెరిగింది. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా రాయితీలు చెల్లించాల్సిన కేంద్రం... వాటిని ఇవ్వకపోవడంతో సామాన్యులపై మోత తప్పడం లేదు. నిజానికి గత ఏడాది నవంబర్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 646.50గా ఉండగా చమురు సంస్థలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఒక్క డిసెంబర్లోనే రూ. 100 మేర ధర పెంచాయి. దీంతో సిలిండర్ ధర రూ. 746.50కు చేరింది. జనవరిలో ఈ ధరలు స్ధిరంగా కొనసాగినా తాజాగా మరోసారి చమురు కంపెనీలు ధరను రూ. 25 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో సిలిండర్ ధర రూ. 771.50కి చేరింది. కరోనా సమయానికి ముందు వరకు ఒక్కో సిలిండర్ ధరలో రూ. 520 చొప్పున వినియోగదారుడు చెల్లిస్తే ఆపై ఎంత ధర ఉన్నా ఆ సొమ్మును కేంద్రం వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేది. ఈ లెక్కన రూ. 200 నుంచి రూ. 220 వరకు తిరిగి వినియోగదారుల ఖాతాల్లో జమ అయ్యేవి. ఈ విధానాన్ని కేంద్రం తొలి రోజుల్లో విజయవంతంగా నిర్వహించినా క్రమేణా రాయితీ డబ్బుల జమను తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుతం రూ. 40 మాత్రమే వినియోగదారుని ఖాతాలో జమ చేస్తోంది. రాయితీల్లో భారీగా కోత పడటంతో సిలిండర్ ధర పెరిగినప్పుడల్లా ఆ భారమంతా వినియోగదారులపైనే పడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.18 కోట్ల గృహావసర సిలిండర్లు వినియోగంలో ఉండగా ప్రతిరోజూ సగటున 1.20 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతోంది. పెరిగిన ధరలు, రాయితీల్లో కోతతో ఏటా రూ. వేల కోట్ల మేర సామాన్యుడిపై భారం పడుతోంది. పెట్రో ధరల దూకుడు... రాష్ట్రంలో పెట్రో ధరలు మండుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతుండటంతో పెట్రోల్ ధర పది రోజుల వ్యవధిలోనే రూ. 1.27 పైసలు పెరిగింది. జనవరి 25న పెట్రోల్ ధర రూ. 89.15 ఉండగా ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రల్ ధర రూ. 90.42కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకు సగటున 13 నుంచి 15 కోట్ల లీటర్ల మేర పెట్రోల్ వినియోగం ఉంటోంది. ఈ లెక్కన పది రోజుల్లోనే వినియోగదారులపై రూ. 19 కోట్ల మేర భారం పడింది. ఇక డీజిల్ ధర సైతం పెట్రోల్‌తో పోటీ పడుతోంది. ఈ పది రోజల వ్యవధిలోనే దాని ధర సైతం రూ. 1.34 మేర పెరిగింది. గత నెల 25న లీటర్ ధర రూ. 82.80 ఉండగా అది ప్రస్తుతం రూ. 84.14కి చేరింది. -
విద్యకు ‘కరోనా’ కోత!
కరోనా మహమ్మారి కాటేసిన తరువాత ప్రపంచ దేశాలన్నిటా సకల రంగాలూ దెబ్బతిన్నాయి. విద్యారంగం అందులో ప్రధానమైనది. ఈ కరోనా సమయంలోనే కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన చేసే నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించింది. కనుక కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యకు అత్యంత ప్రాముఖ్యత వుంటుందని అందరూ ఆశించారు. కానీ జరిగింది అందుకు విరుద్ధం. కరోనా వచ్చి విద్యారంగానికి కొత్త అడుగులు నేర్పింది. అంతక్రితం కేవలం వృత్తి, ఉద్యోగాలు చేసుకునే వారినుద్దేశించి ప్రవేశపెట్టిన దూరవిద్య లాక్డౌన్ల పుణ్యమా అని ఇప్పుడు హైస్కూల్ మొదలు పీజీ వరకూ అందరికీ తప్పనిసరి అవస రంగా మారింది. ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ద్వారా నేర్చుకునే అవసరం పెరిగింది. ఉన్నత విద్య బోధించే క్యాంపస్‌లు ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. ఈ స్థితిలో విద్యారంగానికి నిధుల అవసరం చాలా ఎక్కువుంటుంది. ఎందుకంటే కొత్త అవసరానికి తగ్గట్టు అత్యధిక విద్యాసంస్థలు ఇంకా తయారుకాలేదు. చాలా తక్కువ విద్యాసంస్థలు మాత్రమే ఆ దోవన పోతున్నాయి. ఆర్థికంగా వెనక బడిన కుటుంబాల విద్యార్థులకు సబ్సిడీతోగానీ, ఉచితంగాగానీ ల్యాప్‌టాప్‌లు అందించాలన్న డిమాండ్ కూడా వస్తోంది. న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. విద్యార్థులందరికీ అవసర మైన ఉపకరణాలు అందుబాటులో లేకపోతే చదువుల్లో అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ స్థితిలో విద్య కోసం కేటాయింపుల్ని భారీగా పెంచాల్సివుండగా ప్రస్తుత బడ్జెట్లో అవి గణనీయంగా తగ్గాయి. విద్యకు ఈసారి ఆరు శాతం కోతపడిందని గణాంకాలు చెబుతున్నాయి. నిరుడు రూ. 99,311 కోట్లు కేటాయించగా, ఈసారి అది కాస్తా రూ. 93,300 కోట్లకు పడిపోయింది. సమగ్ర శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) పరిస్థితి కూడా అంతే. నిరుడు రూ. 38,750 కోట్లు కేటాయించిన ఆ పథకానికి ఈసారి కేవలం రూ. 31,050 కోట్లతో సరిపెట్టారు. ఈ పథకంకింద రాష్ట్రాలకూ, కేంద్ర పాలిత ప్రాంతాలకూ కొండ ప్రాంతాల్లోనూ, మారుమూల ప్రాంతాల్లోనూ నడిచే సాధారణ, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేస్తారు. దళిత, ఆదివాసీ పిల్లల్లో డ్రాపౌట్ల శాతం ఎక్కువగా వుంటున్నదని గుర్తించి, వారికి అవసరమైన సదుపాయాల కల్పన కోసం చేసిన కేటాయింపులు కాస్తా తగ్గితే దాని ప్రభావం ఎలావుంటుందో చెప్పన వసరం లేదు. ఉన్నత విద్యకూ రూ. 1,000 కోట్ల మేర కోత పెట్టారు. ఉన్నత విద్యా నిధి సంస్థ (హెచ్ఈఎఫ్ఏ)కు నిరుడు రూ. 2,100 కోట్లు కేటాయించగా, అదిప్పుడు రూ. 1,000 కోట్లు మాత్రమే. మార్కెట్ రుణాలు సేకరించి, ఆ నిధులతో కేంద్రీయ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు పదేళ్లలో చెల్లించేవిధంగా రుణాలివ్వాలని 2016లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆనాటి బడ్జెట్లో ప్రతిపాదించారు. కానీ ఇప్పుడది నామమాత్ర మొత్తానికి పరిమితమైంది. అయితే మధ్యాహ్న భోజనం, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు వగైరాలకు నిధులు స్వల్పంగా పెరిగాయి. అలాగే కొత్తగా వంద సైనిక స్కూళ్లు నెలకొల్పబోతున్నట్టు చెప్పారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విద్యారంగానికే ప్రభుత్వాలు కోత పెడతాయని నిరుడు మే నెలలో విడుదల చేసిన నివేదికలో ప్రపంచ బ్యాంకు జోస్యం చెప్పింది. ఆ మాట చెబుతూనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మాదిరి చర్యలు తీసుకోవద్దని హితవు పలికింది. కరోనా వైరస్ తీసుకొచ్చిన కొత్త ఇబ్బందుల నేపథ్యంలో పిల్లల ఆరోగ్యం, వారి సామాజిక సంరక్షణ వగైరాలకు అదనంగా వ్యయం చేయాల్సివుంటుంది గనుక ఇది అవసరమని తెలిపింది. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని పట్టించుకున్న దాఖలా లేదు. నూతన జాతీయ విద్యావిధానం సాంకేతిక వనరులను సమృద్ధిగా వినియోగించుకుని మన విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పింది. జాతీయ విద్యా సాంకేతిక వేదిక నెలకొల్పి దాని ఛత్రఛాయలో సాంకేతికత సాయంతో విద్యార్థులకు ప్రామాణికమైన, ప్రయోగ ఆధారిత విద్యను అలవాటు చేస్తామని వాగ్దానం చేసింది. ఆన్లైన్, ఈ–లెర్నింగ్ వేదికల్లో పాఠశాలలు మొదలు కళాశాలల వరకూ విద్యార్థులందరికీ సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకోబోతున్నట్టు చెప్పింది. జాతీయ పరిశోధనా సంస్థను నెలకొల్పి ఉన్నత విద్యారంగంలో మెరుగైన పరిశోధనలను ప్రోత్సహిస్తామని తెలిపింది. ఇన్ని చేయడానికి సిద్ధపడుతూ నిధులు గణనీయంగా తగ్గించటంలోని ఆంతర్యమేమిటో అర్థం కాదు. అంత పెద్ద పెద్ద ఆశయాల మాటెలావున్నా కరోనా అనంతర పరిస్థితుల్లో అటు ఉపాధ్యాయులకూ, ఇటు విద్యార్థులకూ అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పెంచటం కోసం ప్రైవేటు రంగ సహాయ సహకారాలు తీసుకోవటం అవసరమవుతుంది. నిధుల కోత వల్ల అదైనా ఇప్పుడు సాధ్యమవు తుందా? అసలు కరోనా కారణంగా దీర్ఘకాలం విద్యకు దూరమైన పిల్లలను మళ్లీ బడులవైపు మళ్లించటానికి ప్రభుత్వం దగ్గరున్న కార్యక్రమాలేమిటో కూడా నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఎక్కడా చెప్పలేదు. ఐక్యరాజ్యసమితి 2030నాటికి ప్రపంచ దేశాలన్నీ సాధించాలని నిర్దేశించిన సుస్థిర లక్ష్యాల్లో విద్య కూడా వుంది. ఒకపక్క విద్యాహక్కు చట్టం రూపొందించుకున్నాం. దాన్ని సమర్థ వంతంగా అమలు చేయడానికి ఇంకేం చేయాలని ఆలోచించాల్సిన తరుణంలో నిధుల కోతతో విద్యా రంగాన్ని మరింత నీరుగార్చటం విచారకరం. సమస్యలున్న మాట వాస్తవమే అయినా వాటి ప్రభావం విద్యారంగంపై పడకుండా చూడటమే వర్తమాన అవసరం. -
ఆ రాబడులే రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు కీలకం
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరంలోని చివరి మూడు నెలల రాబడులే రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు కీలకం కానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగుల పీఆర్సీతో పాటు నిరుద్యోగ భృతి అమలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వచ్చే ఆదాయాన్ని బట్టి 2021–22 బడ్జెట్ అంచనాలు, కేటాయింపులు ఉంటాయని ఆర్థిక శాఖ చెబుతోంది. ఇప్పటివరకు 2020–21 బడ్జెట్లో అప్పులు, ఆదాయం మొత్తం కలిపి రూ.1.04 లక్షల కోట్లు ఖజానాకు చేరగా, జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల ఆదాయం నిలకడగా వస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం రూ.1.35 లక్షల కోట్ల వరకు చేరవచ్చని ఆ శాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు. మరికొంత మొత్తం అప్పుల రూపంలో సమకూరినప్పటికీ 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను రూ.1.83 లక్షల కోట్ల నుంచి రూ.1.43 లక్షల కోట్ల వరకు సవరించాల్సి ఉంటుందని వారంటున్నారు. అంచనాలు తలకిందులు కరోనా కొట్టిన దెబ్బతో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అంచనాలు తలకిందులయ్యాయి. అంతా సవ్యంగా ఉంటే మరో రూ.30 వేల కోట్ల వరకు సొంత పన్నుల ఆదాయం పెరిగేది. ఈ పరపతి భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు మరింత ఉపయోగపడేది. కానీ, కరోనా కాటుతో కీలక రంగాలు దెబ్బ తినడం, ఉపాధి రంగంపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆర్థిక ఆశలు ఆవిరి అయ్యాయి. అయితే గత ఆరు నెలలుగా (జూలై, 2020 నుంచి) వస్తుసేవల పన్ను (జీఎస్టీ), ఎక్సైజ్ ఆదాయం నిలకడగా ఉండడం, ఈ రెండూ కలిపి సగటున రూ.4,000 కోట్ల వరకు ఆదాయం వస్తుండడంతో కొంత మేర ప్రభుత్వ ఖజానా ఊపిరి పీల్చుకుంది. వీటికి తోడు గత రెండు నెలలుగా స్టాంపు, రిజిస్ట్రేషన్ల గల్లా కూడా కళకళలాడుతోంది. డిసెంబర్లో రూ.661 కోట్లు, జనవరిలో రూ.800 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల ద్వారా సమకూరాయి. దీంతో ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో రూ.2 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. మొత్తం మీద ఈ మూడు శాఖల ద్వారా నెలకు సగటున రూ.5వేల కోట్ల చొప్పున రూ.15 వేల కోట్ల వరకు వస్తాయని ఆ శాఖ లెక్కలు కడుతోంది. సగటున రూ.10 వేల కోట్ల రాబడి గత 3 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ రాబడులను పరిశీ లిస్తే సగటున నెలకు రూ.10 వేల కోట్ల వరకు ఖజానాకు సమకూరుతోంది. అక్టోబర్‌లో రూ.10,178 కోట్లు, నవంబర్‌లో రూ.10,239 కోట్లు, డిసెంబర్లో రూ.20,103 కోట్లు వచ్చాయి. అయితే, డిసెంబర్లో సొంత పన్నులు, కేంద్ర సాయం, ఇతర ఆదాయాలు కలిపి రూ.10 వేల కోట్లకు పైగా ఉండగా, మరో రూ.10 వేల కోట్లు అప్పులు కింద సమకూర్చుకోవాల్సి వచ్చింది. ఈ లెక్కన జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా సగటున రూ.10 వేల కోట్లు చొప్పున మూడు నెలల్లో రూ.30 వేల కోట్ల వరకు వస్తాయని, అప్పులు ఇంకో రూ.7–8 వేల కోట్ల వరకు తెచ్చుకున్నా, అంతా కలిపి రూ.1.45 లక్షల కోట్ల వరకు బడ్జెట్ చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికారులు లెక్కలు గడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2020–21 వార్షిక బడ్జెట్‌ను రూ.1.43 లక్షల కోట్ల వరకు సవరించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మరోవైపు 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను వచ్చే నెలలో శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ఆర్థిక శాఖ జనవరి, ఫిబ్రవరి రాబడులను బట్టి కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వసూలైన జీఎస్టీ, ఎక్సైజ్ ఆదాయాలు నెలల వారీగా..(రూ.కోట్లలో) (మొత్తం వార్షిక బడ్జెట్ అంచనాల్లో డిసెంబర్ నెలాఖరు వరకు జీఎస్టీ 53.7% రాగా, ఎక్సైజ్ డ్యూటీ ఆదాయం 65.27 శాతానికి చేరింది) -
200 లక్షల కోట్లను దాటేసిన ఇన్వెస్టర్ల సంపద
సాక్షి,ముంబై: బడ్జెట్ 2021 తరువాత దలాల్ స్ట్రీట్ సరికొత్త రికార్డులకు నెలవుగా మారింది. కీలక సూచీలు సరికొత్త జీవితాకాల గరిష్టాలను నమోదు చేసిన నేపథ్యంలో పెట్టుబడిదారుల సంపద కూడా రికార్డుస్థాయికి చేరింది. గురువారం ఆరంభంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ ప్రపంచ మార్కెట్ల సానుకూ సంకేతాలతో మిడ్ సెషన్ నుంచి లాభాల్లోకి మళ్లింది. దీంతో సెన్సెక్స్ 50,474 గరిష్ట స్థాయిని టచ్ చేసింది. అనంతరం సరికొత్త గరిష్టాల దిశగా సెన్సెక్స్ దూకుడును కొనసాగిస్తోంది. ఫలితంగా బిఎస్ఇ-లిస్టెడ్ సంస్థల ఆర్కెట్ క్యాప్ మొదటిసారి రూ .200 లక్షల కోట్లు దాటింది. అంతకుముందు రూ .198.3 లక్షల కోట్లతో పోలిస్తే పెట్టుబడిదారుల సంపద తాజాగా రూ .200.11 లక్షల కోట్లకు పెరిగింది. నేటి సెషన్లో 350 పాయింట్లకు పైగా జంప్ చేసిన సెన్సెక్స్, 50614 వద్ద, నిఫ్టీ 14,900 వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేసాయి. ఐటిసి, ఎంఅండ్ ఎం, ఒఎన్‌జిసి, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టిపిసి టాప్ గెయినర్స్గాఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 256 పాయింట్లు ఎగిసి 50522 వద్ద, నిఫ్టీ 85 పాయింట్ల లాభంతో 14874 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. కాగా బడ్జెట్ తర్వాత సెన్సెక్స్ గత నాలుగు సెషన్లలో 4,189 పాయింట్లు సాధించగా పెట్టుబడిదారుల సంపద రూ .13.99 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ 2014 నవంబర్ 28 న తొలిసారిగా రూ.100 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. తాజాగా ఇది రెట్టింపై 200 లక్షల కోట్లకు చేరింది. -
బడ్జెట్ తర్వాత పెట్రో సెగ షురూ
సాక్షి, ముంబై: 2021 బడ్జెట్ అనంతరం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి మళ్లీ షాకిస్తున్నాయి. బడ్జెట్లో ఇంధనంపై అగ్రి సెస్సు విధించిన నేపథ్యంలో పెట్రోల ధరలపై చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అగ్రి సెస్ ప్రభావం వినియోగదారుల మీద ఉండదని స్పష్టం చేశారు. కానీ గురువారం రోజు పెట్రోల్ ధర 35 పైసలు పెరిగింది. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 86.65కు చేరింది. డీజిల్ ధర రూ. 76.83కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.20 పైసలకు చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.83.67 పైసలుగాఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.89.13 పైసలుండగా, డీజిల్ ధర రూ.82.04 కోల్‌కత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ.88.01,, లీటర్ డీజిల్ ధర రూ.80.41 హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ 90.10 పైసలుండగా, డీజిల్ ధర రూ.83.81 అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.78పైసలుండగా, డీజిల్ ధర రూ.85.99 పెట్రోల్, డీజిల్‌పై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీలను తగ్గిస్తున్నామని కాబట్టి, వినియోగదారులపై అగ్రి సెస్ సంబంధిత అదనపు భారం పడదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చినా, పెటట్రోల్ ధరలు మరింత భారం కావాడం వినియోగదారులనుబెంబేలెత్తిస్తోంది. కాగా బడ్జెట్లో పెట్రోల్ మీద రూ.2.50, డీజిల్ మీద 4 రూపాయల చొప్పున అగ్రి ఇన్ఫ్రా సెస్ విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రైల్వేకు కేటాయింపుల్లో భారీగా తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ ప్రభావం రైల్వేపై పడింది. గతేడాది కేంద్ర బడ్జెట్లో రైల్వేకు భారీగానే కేటాయింపులు జరిపిన కేంద్రం.. ఈసారి కొంత కోత పెట్టినట్టు కనిపిస్తోంది. రైల్వేకు సంబంధించిన కేటాయింపులను బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వెబ్సైట్లో ఉంచారు. గతేడాది కంటే దాదాపు రూ.2 వేల కోట్ల మేర కేటాయింపుల్లో కోత పడ్డట్టు కనిపిస్తోంది. ప్రాజెక్టుల వారీగా పరిశీలించినా.. కేటాయింపులు కొన్నింటికే పరిమితమయ్యాయి. కోవిడ్ వల్ల ఎదురైన ఆర్థిక ఆటంకాలతో కేటాయింపులు కుంచించుకుపోయాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సంవత్సరం పనులను వేగంగా నిర్వహించి రెండు, మూడు ప్రాజెక్టులు అందుబా టులోకి తేవాలని నిర్ణయించినా, వాటికి తగ్గ నిధులు మాత్రం దక్కలేదు. దేశవ్యాప్తంగా 56 ప్రాజెక్టులను ప్రాధాన్యమైనవిగా నిర్ధారించి వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు ప్రారంభించేలా చూడనున్నట్టు రైల్వే తాజాగా ప్రకటించింది. అందులో తెలంగాణకు సంబంధించి సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ డబ్లింగ్, భద్రాచలం రోడ్–సత్తుపల్లి కొత్తలైన్లకు చోటు దక్కింది. కానీ ఈ రెండు ప్రాజెక్టులకు కూడా గత బడ్జెట్ కంటే నిధులు తక్కువే కేటాయించటం గమనార్హం. గత బడ్జెట్లో కొత్త లైన్లకు రూ.2,856 కోట్లు కేటాయిస్తే ఈసారి కేవలం రూ.205 కోట్లే దక్కాయి. డబ్లింగ్ పనులకు గతంతో పోలిస్తే రూ.3,836 కోట్లకు గాను కేవలం రూ.868 కోట్లే దక్కాయి. ఆ ఊసే లేదు.. రాష్ట్రప్రభుత్వం–రైల్వే మధ్య సమన్వయం కొరవడి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు పనులు ముందుకు సాగని నేపథ్యంలో.. కొత్త బడ్జెట్లో దాని ఊసే లేదని తెలుస్తోంది. ఇప్పటికే రైల్వే శాఖ తన వాటాకు మించి నిధులు వెచ్చించింది. రాష్ట్ర ప్రభుత్వం భారీగా బకాయిపడింది. ఆ నిధులు వస్తే పనులు జరుపుతామని ఇప్పటికే పలుమార్లు రైల్వే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. కానీ ఇప్పటివరకు నిధులు రాకపోవటంతో ఈసారి బడ్జెట్లో ఆ ప్రాజెక్టును విస్మరించినట్టు కనిపిస్తోంది. ఇక కాజీపేట వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాపు విషయంలోనూ అదే జరిగింది. దక్షిణ మధ్య రైల్వేకు కేటాయింపులు ఇలా.. పని తాజా బడ్జెట్ (అంకెలు రూ.కోట్లలో) గత బడ్జెట్ (అంకెలు రూ.కోట్లలో) కొత్త లైన్లకు 205 2,856 డబ్లింగ్ పనులకు 868.10 3,836 ట్రాఫిక్ వసతులకు 72.65 154 ఆర్ఓబీ/ఆర్యూబీల నిర్మాణం 562.86 584 ట్రాకుల పునరుద్ధరణ 862 900 ప్రయాణికుల వసతుల మెరుగుకు 199.49 672 ప్రధాన ప్రాజెక్టుల కేటాయింపులు ఇలా.. మునీరాబాద్–మహబూబ్‌నగర్ 149 240 మనోహరాబాద్–కొత్తపల్లి 325 235 భద్రాచలం రోడ్–సత్తుపల్లి 267 520 అక్కన్నపేట– మెదక్ 83.63 - డబ్లింగ్ పనులు కాజీపేట–విజయవాడ 300 404 కాజీపేట–బల్లార్షా 475 483 సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ 100 185 విజయవాడ–కాజీపేట బైపాస్ 286 - మంచిర్యాల–పెద్దంపేట ట్రిప్లింగ్ 4.50 - చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ 50 5 అంతా గందరగోళం.. రైల్వేకు సంబంధించి బడ్జెట్ పింక్ బుక్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టాక వివరాలు అందిస్తారు. బుధవారం రాత్రి 8 వరకు కూడా ఆ సమాచారం అందకపోయేసరికి, గురువారమే వివరాలు వస్తాయని మీడియాకు వెల్లడించి అధికారులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ తర్వాత రాత్రి 9 సమయంలో బడ్జెట్ వివరాలను ఢిల్లీ నుంచి వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. దీంతో వాటిని క్రోడీకరించే సమయం లేదని పేర్కొన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివరాలను గురువారమే వెల్లడించగలమని తేల్చి చెప్పారు. -
వ్యవసాయాన్ని వెనక్కినెట్టిన బడ్జెట్
నూతన చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న వేలాదిమంది రైతులకు, దేశ రైతాంగానికి ఈ ఏడు బడ్జెట్ మిశ్రమ సంకేతాలను పంపించింది. ఒకవైపు వ్యవసాయం, సహకారం, రైతుల సంక్షేమానికి పెట్టే వ్యయంపై 2021–22 బడ్జెట్ 8.5 శాతం కోత విధించింది. మరోవైపు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకంపై ఈ బడ్జెట్లో 13 శాతం కోత విధించారు. రైతులకు నగదు బదిలీ చేసే ఈ పథకానికి గత ఏడాదితో పోలిస్తే 10 వేల కోట్ల రూపాయలను తగ్గించివేశారు. కౌలురైతులు, మహిళారైతులు, ఆదివాసీ రైతులు వంటి భూమి పట్టాలేని వారిని కూడా ఈ పథకంలో చేర్చాలని డిమాండ్ చేస్తుండగా ఉన్న పథకంపైనే కోత వేశారని మహిళా కిసాన్ అధికార్ మంచ్ నాయకురాలు కవితా కురుగంటి వాపోయారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులు కనీస మద్దతు ధర ద్వారా కనీస రాబడి కోసం ప్రశ్నిస్తున్న తరుణంలో వారి మనోభావాలను గౌరవిస్తూ వ్యవసాయ రాబడులను పెంచడానికి కొన్ని ఏర్పాట్లను 2021–22 బడ్జెట్లో చేరుస్తారని అందరూ భావించారు. పైగా గ్రామీణ కొనుగోలు డిమాండ్‌ను పెంపొందించడానికి తగుచర్యలు తీసుకోవాలని పలువురు ఆర్థికవేత్తలు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ప్రత్యక్ష నగదు మద్దతు ద్వారా, ఆందోళన చేస్తున్న రైతులు చేతిలో మరింత నగదును అందించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాస్త ఉదారంగా వ్యవహరిస్తారని భావించారు. దీనికి బదులుగా ఈ సంవత్సరం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేటాయింపులను రూ. 75 వేల కోట్లనుంచి 65 వేల కోట్లకు తగ్గించేశారు. ఈ పథకం కింద భూ యజమానులకు సంవత్సరానికి మూడు వాయిదాల్లో రూ.6 వేల నగదును రైతుల ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. ఈ పథకంలో ఈ సారి భూమిలేని కౌలు రైతులను కూడా చేరుస్తారని నేను ఆశించాను. గత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో వ్యవసాయం మాత్రమే దేశానికి వెలుగు చూపినందున ఒక్కొక్క రైతుకు నగదు బదిలీ కింద చెల్లించే మొత్తాన్ని ఈ యేడు రూ.18 వేలకు పెంచుతారని అందరూ భావించారు. దీనికోసం అదనంగా రూ. 1.5 లక్షల కోట్లను బడ్జెట్లో కేటాయించవలసి ఉంటుంది. అయితే వ్యవసాయ రంగానికి ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్ దాదాపు గత యేడు బడ్జెట్‌కు సరిసమానంగానే ఉండటం గమనార్హం. గత సంవత్సరం వ్యవసాయరంగానికి సవరించిన అంచనా ప్రకారం రూ. 1.45 లక్షల కోట్లను కేటాయించగా ఈ ఏడు రూ. 1.48 లక్షల కోట్లను కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పరపతి పరిమితిని రూ. 15 లక్షల కోట్లనుంచి రూ. 16.5 లక్షల కోట్లకు పెంచి నప్పటికీ రైతులను రుణ ఊబి నుంచి బయటపడేసేందుకు మరికొన్ని చర్యలు చేపట్టాలని దేశంలో కొనసాగుతున్న వ్యవసాయ దుస్థితి సూచించింది. దీనికి గాను వ్యవసాయంలో ప్రభుత్వ రంగ మదుపులను పెంచాల్సి ఉంది. ఆర్బీఐ లెక్కల ప్రకారం 2011–12 నుంచి 2017–18 మధ్య కాలంలో వ్యవసాయంలో ప్రభుత్వ రంగ మదుపులు మొత్తం బడ్జెట్లో కేవలం 0.4 శాతం మాత్రమే కావడం గమనార్హం. కాబట్టి పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధింపు ద్వారా వ్యవసాయ మదుపు నిధిని సృష్టించాలనే ఆర్థిక మంత్రి ప్రతిపాదనను స్వాగతించాల్సిందే కానీ రైలు, రోడ్డు, మూలధన మదుపు వంటివాటిపై చేసే ప్రకటనలకు మల్లే వ్యవసాయ మదుపుపై కూడా నిర్దిష్టమైన ఏర్పాట్లు చేయడం ఉత్తమమార్గంగా ఉంటుంది. వ్యవసాయరంగానికి ఇప్పుడు అత్యంత ప్రాధాన్యమైన విషయం ఏమిటంటే తగిన మార్కెటింగ్ మౌలిక వసతులను ఏర్పర్చడమే. భారత్‌లో వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు (ఏపీఎంసీ) క్రమబద్ధీకరించే 7 వేల మండీలు ఉంటున్నాయి. దేశంలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక మండీ చొప్పున ఏర్పర్చాలంటే ఇప్పటికిప్పుడు 42 వేల మండీలు అవసరం అవుతాయి. అయితే 22 వేల గ్రామ సంతలను మెరుగుపర్చి వాటిని ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ–నామ్)తో అనుసంధానం చేయాలనే ప్రభుత్వ వాగ్దానానికి ఇప్పటివరకు ప్రోత్సాహం లభించలేదని తెలుసుకున్నప్పుడు, గ్రామీణ మార్కెటింగ్ మౌలిక వసతులను ఏర్పాటు ఇక ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడని అంశంగా మనముందుకొస్తోంది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు నిరసన ప్రదర్శనలను నెలల తరబడి కొనసాగిస్తున్న సమయంలో 2021–22 బడ్జెట్ రంగంలోకి వచ్చింది కాబట్టి ఇటీవలి సంవత్సరాల్లో గోధుమ, వరి, కాయధాన్యాలు, పత్తి వంటి పంటలకు కనీస మద్దతు ధర ఎలా అందించాము అనే విషయాన్ని ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రస్తావిస్తూ లబ్ధిదారుల సంఖ్యను కూడా వెల్లడించారు. అయితే సంపూర్ణంగా సాగు చట్టాలను రద్దు చేయాలని పోరాడుతున్న రైతులు ప్రభుత్వం చెబుతున్న కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేసి తమ హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం 23 పంట లకు గాను ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరకంటే తక్కువ ధరను పెట్టి వ్యాపారం చేయడానికి వీలు ఉండదని దీనర్థం. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులపై కనీసం 50 శాతం లాభాన్ని కనీస మద్దతు ధర అందిస్తోందని ప్రభుత్వం చెబుతున్న వివరాలను ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న రైతులు సవాలు చేశారు. స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల ప్రకారం రైతులు పెట్టే విస్తృత ఖర్చులపై 50 శాతం లాభాన్ని కనీసమద్దతు ధర ఇవ్వాల్సి ఉంటుంది. స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదించినట్లుగా రైతులకు కనీస మద్దతు ధర అంది ఉంటే 2020–21 బడ్జెట్లో అదనంగా రూ. 14,296 కోట్ల మేరకు పంజాబ్ రైతులు లబ్ధి పొందేవారు. మొత్తంమీద చూస్తే రైతుల చేతికి మరింత నగదు అందేలా చేస్తేనే ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనేది సాధ్యపడుతుంది. ఇది దానికదేగా మరింత గ్రామీణ డిమాండును సృష్టిస్తుంది. ప్రాణాంతక కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను ప్రశ్నార్థకం చేస్తున్న సమయంలో, గ్రామీణ డిమాండును సృష్టించి ఉంటే అది మొత్తం ఆర్థిక వ్యవస్థకు వరంలాగా పనిచేయడమే కాకుండా, ఆర్థికాభివృద్ధిని రాకెట్లాగా ముందుకు తీసుకెళ్లేది. ఉజ్వలంగా ప్రకాశించే వ్యవసాయ రంగం భారీ స్థాయిలో వ్యవసాయ అవకాశాలను సృష్టించడమే కాకుండా అనేక మంది జీవితాలను నిలబెట్టి ఉండేది. కాబట్టి ఒక్క వ్యవసాయ రంగమే ఆర్థిక వృద్ధికి సజీవ కేంద్రంగా మారగలిగి ఉండేది. నూతన వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ రెండున్నర నెలలకుపైగా ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న వేలాదిమంది రైతులకు, దేశ రైతాంగానికి ఈ యేడు బడ్జెట్ మిశ్రమ సంకేతాలను పంపించింది. ఒకవైపు వ్యవసాయం, సహకారం, రైతుల సంక్షేమానికి పెట్టే వ్యయంపై 2021–22 బడ్జెట్ 8.5 శాతం కోత విధించింది. మరోవైపు కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకంపై ఈ బడ్జెట్లో 13 శాతం కోత విధించారు. రైతులకు నగదు బదిలీ చేసే ఈ పథకానికి గత సంవత్సరంతో పోలిస్తే 10 వేల కోట్ల రూపాయలను తగ్గించివేశారు. మరోవైపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగంలో రైతులకు కనీస మద్దతు ధరను చెల్లించడంలో తమ ప్రభుత్వం ఘనమైన రికార్డును కలిగి ఉందని నొక్కి చెప్పారు. అలాగే లక్ష కోట్ల మేరకు వ్యవసాయ మౌలిక వసతుల నిధిని ప్రభుత్వ నిర్వహణలోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలకు అందిస్తామని మంత్రి తెలిపారు. అయితే ప్రభుత్వ నూతన సాగు చట్టాలు ఇంతవరకు కొనసాగుతున్న మండీల వ్యవస్థను, కనీస మద్దతు రేట్లను కుప్పగూల్చి సన్నకారు రైతులను కార్పొరేట్ సంస్థల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తాయని రైతులు భయాందోళనలకు గురైనందువల్లనే సాగు చట్టాల రద్దుకోసం పోరాడుతున్నారనే విషయం మర్చిపోరాదు. అయితే ఇటీవలి సంవత్సరాల్లో బడ్జెట్ ప్రసంగాల మాదిరి కాకుండా తాజా బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయానికి సంబంధించిన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యత లభించకపోవడం గమనార్హం. సోమవారం బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన గంట తర్వాతే వ్యవసాయరంగానికి కేటాయింపుల గురించి ఆర్థిక మంత్రి తడిమారు. పైగా వ్యవసాయ రంగ విశ్లేషకులను తాజా బడ్జెట్ పెద్దగా ప్రభావితం చేయలేదు. పీఎమ్ ఆషా, ధరల మద్దతు పథకం వంటి పథకాలకు ఈ ఏడు బడ్జెట్లో 20 నుంచి 25 శాతం దాకా కోత విధించారు. రైతులకు ఏటా తలసరి 6 వేల రూపాయలను అందిస్తున్న పీఎమ్ కిసాన్ పథకాన్ని ఈసారి 9 కోట్లమంది రైతులకే పరిమితం చేస్తూ సవరించారు. ప్రభుత్వం వాస్తవానికి 14.5 కోట్ల రైతు కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించుకుంది ఇది కూడా కోత పడటం రైతులు జీర్ణింప చేసుకోలేకున్నారు. కౌలురైతులు, మహిళారైతులు, ఆదివాసీ రైతులు వంటి భూమి పట్టాలేని వారిని కూడా ఈ పథకంలో చేర్చాలని మేం డిమాండ్ చేస్తుండగా ఉన్న పథకంపైనే కోత వేశారని మహిళా కిసాన్ అధికార్ మంచ్ నాయకురాలు కవితా కురుగంటి వాపోయారు. మౌలిక వసతుల నిధి పేరుతో ప్రకటించిన భారీ మొత్తాలు వాస్తవానికి బడ్జెట్ కేటాయింపుల్లో భాగం కాదని వీటిని రుణాల రూపంలో తీసుకోవలసిన ఫైనాన్స్ ప్రాజెక్టులని రైతులకు వీటితో ఒరిగేదేమీ లేదని రైతునేతలు చెబుతున్నారు. ఈ కోణంలో చూస్తే ఈ ఏటి బడ్జెట్ కూడా రైతాంగాన్ని సంతృప్తిపర్చే బడ్జెట్‌గా కనిపించడం లేదనే చెప్పాలి. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com