వేడెక్కనున్న పార్లమెంట్‌ | Parliament Budget Session set to begin from Today | Sakshi
Sakshi News home page

వేడెక్కనున్న పార్లమెంట్‌

Published Fri, Jan 29 2021 4:10 AM | Last Updated on Fri, Jan 29 2021 12:07 PM

Parliament Budget Session set to begin from Today - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రెండు నెలలకు పైగా కొనసాగుతున్న రైతు ఆందోళనలకు సంఘీభావంగా మూడు వ్యవసాయ చట్టాల రద్దు లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై దాడికి సిద్ధం కావడంతో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు వేడెక్కనున్నాయి. శుక్రవారం ప్రారంభం కానున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి కోవింద్‌ ప్రసంగిస్తారు. రైతు ఆందోళనలకు సంఘీభావంగా కాంగ్రెస్, ఆప్‌ సహా 17 ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్టు చేసిన ప్రకటన సమావేశాలు వాడీవేడిగా సాగనున్నట్టు సంకేతమిచ్చింది. శుక్రవారం ఉదయం ఉభయ సభల ఉమ్మడి సమావేశం రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్‌ సెషన్‌ ప్రారంభమవుతుంది.

ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలబడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగిత రహిత కార్యకలాపాలు ఉండాలన్న లక్ష్యంతో బడ్జెట్, ఎకనామిక్‌ సర్వే సహా అన్ని పత్రాలు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వెంటనే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ప్రయివేటు మెంబర్స్‌ బిజినెస్‌ కూడా పునరుద్ధరించారు. వర్షాకాల సమావేశాల్లో వారాంతపు సెలవులు లేకుండా సాగగా.. బడ్జెట్‌ సమావేశాల్లో శని, ఆదివారాలను వారాంతపు సెలవులుగా పునరుద్ధరించారు.

బడ్జెట్‌ సమావేశాల్లో వచ్చే బిల్లులు ఇవే..
ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్‌లను చట్టాలుగా మార్చడానికి ప్రభుత్వం బిల్లులను ప్రతిపాదించనుంది. నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ ఆర్డినెన్స్‌ 2020, మధ్యవర్తిత్వం; సయోధ్య (సవరణ) ఆర్డినెన్స్‌–2020, జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ (సవరణ) ఆర్డినెన్స్‌–2021 తదితర ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులు ప్రతిపాదించనుంది. వీటితో పాటు మరికొన్ని బిల్లులు రానున్నాయి. బడ్జెట్‌ సెషన్‌ తొలి విడత సమావేశాలు 29వ తేదీతో మొదలై ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయి. మంత్రిత్వ శాఖల ప్రతిపాదిత నిధుల పద్దులను పరిగణనలోకి తీసుకుని స్థాయీ సంఘాలు తమ నివేదికలు సిద్ధం చేసేందుకు వీలుగా తొలి విడత సమావేశాలను ఫిబ్రవరి 15న వాయిదా వేస్తారు. మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 8 వరకు రెండో విడత సమావేశాలు కొనసాగుతాయి.

చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది: మంత్రి ప్రహ్లాద్‌
రాష్ట్రపతి ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి చేసే ప్రసంగాన్ని బహిష్కరిస్తామని కాంగ్రెస్‌ సహా 16 ప్రతిపక్షాలు ప్రకటించడాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తప్పుపట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మీరు అడిగితే దేనిపైన అయినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించిన సమయం మేరకు చర్చించేందుకు మేం సిద్ధం. సమగ్రంగా చర్చించేందుకు సిద్ధం. ఇలా బహిష్కరించడం అవాంఛనీయం..’అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement