కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష | CM Jagan Review on Union Budget with officials | Sakshi
Sakshi News home page

కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష

Published Mon, Feb 1 2021 8:24 PM | Last Updated on Tue, Feb 2 2021 2:12 AM

CM Jagan Review on Union Budget with officials - Sakshi

సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి చేసిన కేటాయింపులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేశారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. వివిధ రంగాల వారీగా బడ్జెట్‌ కేటాయింపుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్ర విభజన కారణంగా అనేక రంగాలవారీగా, మౌలిక సదుపాయాల రూపేనా భారీ నష్టం ఏర్పడిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌ పట్ల ఆశగా చూశామని చెప్పారు. అయితే ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఏమీ చేయలేదని అధికారులు తెలిపారు. పక్కనున్న తమిళనాడు, కర్ణాటకలాంటి రాష్ట్రాలతో సమాన స్థాయిలోకి రావడానికి అవసరమైన ప్రత్యేక దృష్టి కేంద్ర బడ్జెట్‌లో కనిపించలేదని వెల్లడించారు.

బడ్జెట్‌ సందర్భంగా వివిధ రంగాలకు, కార్యక్రమాలకూ చేసిన కేటాయింపులు అన్నిరాష్ట్రాల తరహాలోనే ఏపీకి వస్తాయి తప్ప, రాష్ట్రానికి ప్రత్యేకించి ఏమీ లేవని పేర్కొన్నారు. పీఎం కిసాన్, పీఎం ఆవాస్‌ యోజన, ఉపాధి హామీ పథకాలకు గతేడాదితో పోలిస్తే కేటాయింపులు తగ్గాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఆహారం, పెట్రోల్, ఎరువుల రాయితీలను కూడా తగ్గించిన విషయాన్ని అధికారులు నివేదించారు. కేంద్ర బడ్జెట్‌లో వివిధ రంగాల్లో చేసిన కేటాయింపుల్లో వీలైనన్ని నిధులను రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేయాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ శాఖలతో లైజనింగ్‌ చేసుకుని సకాలంలో నిధులు వచ్చేలా చూడాలని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ అధికారులు, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement