సాక్షి, గుంటూరు: మిచౌంగ్ తుపాను కారణంగా ఏపీలో దెబ్బతిన్న పంటలపై, రంగుమారిన వరి ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అలాగే ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందన్న భరోసా వాళ్లకు కల్పించాలని ఈ సందర్భంగా ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, అధికారులతో సీఎం జగన్ అన్నారు. అవసరమైతే కొన్ని నిబంధనలు సడలించైనా రైతులకు న్యాయం చేయాలని సూచించారాయన.
‘‘రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోంది. ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇదే విషయాన్ని రైతు సోదరులందరికీ తెలియజేసి, వారిలో భరోసాను నింపాలి. ధాన్యం కొనుగోలు విషయంలో లిబరల్‌గా ఉండాలి. కొన్ని నిబంధనలు సడలించి అయినా రైతులకు న్యాయం చేయాలి’’ అని సీఎం జగన్ అన్నారు.
రైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనుగోలుచేసి మిల్లులకు పంపే బాధ్యతను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకుంటుంది. ఆర్బీకేల వారీగా ఈ కొనుగోళ్లు జరుగుతాయి అని అన్నారాయన. ఆ సమయంలో ‘రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభించారా?’ అని అధికారులను సీఎం జగన్ ఆరా తీశారు. ఈ నెల 11 నుంచి 18 వరకు ఎన్యూమరేషన్ జరుగుతోందని, 19 నుంచి 22 వరకు సోషల్ ఆడిట్ కోసం ఆర్బీకేలలో లిస్ట్‌లు అందుబాటులో ఉంచుతామని అధికారులు సీఎం జగన్‌కు నివేదించారు.
Comments
Please login to add a commentAdd a comment