న్యూఢిల్లీ: ఏడు మెగా టెక్స్‌టైల్ పార్క్‌ల ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అపెరల్ (పీఎం–ఎంఐటీఆర్‌ఏ) పార్క్ స్కీమ్ కింద ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు రూ.4,445 కోట్ల కేటాయింపులతో ఈ స్కీమ్ అమలు ప్రతిపాదనను 2021–22 బడ్జెట్‌లో ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్కొక్క పార్క్ ద్వారా లక్ష ప్రత్యక్ష, రెండు లక్షల పరోక్ష ఉపాధి అవకాశాల కల్పన ప్రధాన ఉద్దేశ్యం. పార్క్‌ల ఏర్పాటుకు ముందుకు వస్తున్న రాష్ట్రాల్లో వీటి ఏర్పాటు జరుగుతుంది.
1,000 ఎకరాలకుపైగా అందుబాటులో ఉన్న భూమి, టెక్స్‌టైల్స్‌కు సంబంధించి ఇతర సౌలభ్యత, తగిన పర్యావరణ వ్యవస్థను పరిగణనలోకి తీసుకుని పార్క్‌ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలను స్వీకరించడం జరుగుతోందని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో ఇటువంటి ప్రాజెక్టుల అత్యాధునిక సాంకేతికతను అలాగే భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, స్థానిక ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షిస్తాయని టెక్స్‌టైల్ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తెలుగురాష్ట్రాలుసహా తమిళనాడు, పంజాబ్, ఒడిస్సా, గుజరాత్, రాజస్తాన్, అస్సోం, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు పార్క్‌ల ఏర్పాటుకు తమ ఉత్సుకతను తెలియజేసినట్లు కూడా మంత్రిత్వశాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment