నిబంధనల సరళీకరణ
ఉపగ్రహాల తయారీలో 74%, విడిభాగాల్లో 100% వరకు అనుమతి
నోటిఫై చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మూడు కేటగిరీల కింద ఉపగ్రహాల తయారీ, శాటిలైట్ లాంచ్ వాహనాలు తదితర విభాగాల్లోకి వంద శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించేలా నిబంధనలను సవరిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీని ప్రకారం ఉపగ్రహాల తయారీ, శాటిలైట్ డేటా ఉత్పత్తులు మొదలైన విభాగాల్లో 74 శాతం వరకు ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు.
అది దాటితే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, లాంచ్ వెహికల్స్, వాటికి సంబంధించిన సిస్టమ్స్, స్పేస్‌క్రాఫ్ట్‌ల ప్రయోగం కోసం స్పేస్‌పోర్టుల ఏర్పాటు వంటి విభాగాల్లో 49 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంటుంది. ఉపగ్రహాల విడిభాగాలు, సిస్టమ్స్/సబ్–సిస్టమ్స్ మొదలైన వాటి తయారీలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. ఇప్పటివరకు ఉన్న పాలసీ ప్రకారం ఉపగ్రహాల తయారీ కార్యకలాపాల్లో ఎఫ్‌డీఐలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉంటోంది. కొత్త సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఈ ఏడాది తొలి నాళ్లలోనే ఆమోదముద్ర వేసింది. వీటికి సంబంధించి కేంద్ర అంతరిక్ష విభాగం ఇన్–స్పేస్, ఇస్రో, ఎన్‌ఎస్‌ఐఎల్ వంటి పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరిపింది.
మస్క్ పర్యటన నేపథ్యంలో..
అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ వచ్చే వారం భారత్‌లో పర్యటించనున్న సందర్భంలో తాజా పరిణామం ప్రాధా న్యం సంతరించుకుంది. వేల కొద్దీ ఉపగ్రహాలతో ప్రపంచంలో ఎక్కడైనా హై–స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించేలా ఎలాన్ మస్క్ తలపెట్టిన శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టు స్టార్‌లింక్‌కు ప్రస్తుతం అనుమతులను జారీ చేసే ప్రక్రియ తుది దశలో ఉంది. ఏప్రిల్ 21, 22 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్న మస్క్ .. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలు భారతీయ స్పేస్ కంపెనీలతో కూడా సమావేశం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment