Satellite Manufacturing Unit
-
‘స్పేస్’లో మరిన్ని ఎఫ్‌డీఐలకు సై
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మూడు కేటగిరీల కింద ఉపగ్రహాల తయారీ, శాటిలైట్ లాంచ్ వాహనాలు తదితర విభాగాల్లోకి వంద శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించేలా నిబంధనలను సవరిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీని ప్రకారం ఉపగ్రహాల తయారీ, శాటిలైట్ డేటా ఉత్పత్తులు మొదలైన విభాగాల్లో 74 శాతం వరకు ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. అది దాటితే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, లాంచ్ వెహికల్స్, వాటికి సంబంధించిన సిస్టమ్స్, స్పేస్‌క్రాఫ్ట్‌ల ప్రయోగం కోసం స్పేస్పోర్టుల ఏర్పాటు వంటి విభాగాల్లో 49 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంటుంది. ఉపగ్రహాల విడిభాగాలు, సిస్టమ్స్/సబ్–సిస్టమ్స్ మొదలైన వాటి తయారీలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. ఇప్పటివరకు ఉన్న పాలసీ ప్రకారం ఉపగ్రహాల తయారీ కార్యకలాపాల్లో ఎఫ్‌డీఐలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉంటోంది. కొత్త సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఈ ఏడాది తొలి నాళ్లలోనే ఆమోదముద్ర వేసింది. వీటికి సంబంధించి కేంద్ర అంతరిక్ష విభాగం ఇన్–స్పేస్, ఇస్రో, ఎన్ఎస్ఐఎల్ వంటి పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరిపింది. మస్క్ పర్యటన నేపథ్యంలో.. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ వచ్చే వారం భారత్‌లో పర్యటించనున్న సందర్భంలో తాజా పరిణామం ప్రాధా న్యం సంతరించుకుంది. వేల కొద్దీ ఉపగ్రహాలతో ప్రపంచంలో ఎక్కడైనా హై–స్పీడ్ ఇంటర్నెట్ను అందించేలా ఎలాన్ మస్క్ తలపెట్టిన శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టు స్టార్‌లింక్‌కు ప్రస్తుతం అనుమతులను జారీ చేసే ప్రక్రియ తుది దశలో ఉంది. ఏప్రిల్ 21, 22 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్న మస్క్ .. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలు భారతీయ స్పేస్ కంపెనీలతో కూడా సమావేశం కానున్నారు. -
ఆకాశంలో చైనా ఉపగ్రహ సమూహం
బీజింగ్: తమ స్నాతకోత్సవం ఫొటోలను ఆకాశం నుంచి తీయించుకోవాలని అనుకున్న ఆ విద్యార్థుల ఆలోచన కార్యరూపం దాల్చింది. భూమికి సుమారు 650 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న ఉపగ్రహాలకున్న శక్తివంతమైన కెమెరాలు వారి వినూత్న ఆలోచనను నిజం చేశాయి. చైనా ప్రభుత్వ అధీనంలోని ది చాంగ్‌గ్వాంగ్ శాటిలైట్ కంపెనీ లిమిటెడ్ ఈ ఏడాది జూలైలో చేసిన ఈ ప్రయోగం మిగతా కళాశాల విద్యార్థుల్లోనూ ఆసక్తి కలిగించింది. దాదాపు 12 వర్సిటీల విద్యార్థులు తమకు కూడా అలాంటి ఫొటోలే కావాలని కోరుతున్నారని అధికార గ్లోబల్ టైమ్స్ తెలిపింది. జిలిన్ ప్రావిన్స్‌లోని చాంగ్‌చున్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(సీయూఎస్‌టీ)కి చెందిన 100 మంది విద్యార్థులు సీయూఎస్‌టీ ఐటీ అనే అక్షరాలున్న ఎరుపు, పసుపు కార్డులను పట్టుకుని తమ వర్సిటీ ప్రాంగణంలో వరుసగా నిలబడ్డారు. సరిగ్గా 9.45 గంటలకు ది చాంగ్‌గ్వాంగ్ శాటిలైట్ కంపెనీ లిమిటెడ్(సీజీఎస్‌టీసీ)కు చెందిన జిలిన్–1 స్పెక్ట్రమ్01, జిలిన్–1 వీడియో07 ఉపగ్రహాలు వర్సిటీ ప్రాంగణం మీదుగా వచ్చినప్పుడు తమ కెమెరాలను ఆకాశం నుంచి క్లిక్‌మనిపించాయి. చైనాలోనే కాదు, ప్రపంచంలోని ఏ దేశంలోని వర్సిటీ స్నాతకోత్సవాన్నైనా ఏ సమయంలోనైనా ఆకాశం నుంచి ఫొటోలు తీయగల సత్తా సొంతం చేసుకునేందుకు సీజీఎస్‌టీసీ పథకం సిద్ధం చేసింది. 2030 నాటి ఆకాశంలో చైనా తొలి వాణిజ్య ఉపగ్రహ సమూహాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం, 138 ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను పంపనుంది. ఇవన్నీ భూ కక్ష్యలో తక్కువ ఎత్తులో ఉంటూ అత్యధిక రిజల్యూషన్ కలిగిన స్పష్టమైన చిత్రాలను పంపుతాయి. ఒక్కోటి 40 కిలోల బరువుండే 138 ఉపగ్రహాల్లో 2015 మొదలుకొని ఇప్పటి వరకు 31 శాటిలైట్లను సీజీఎస్‌టీసీ పంపించింది. 2021 చివరికల్లా మరో 29 ఉపగ్రహాలను పంపనున్నట్లు తెలిపింది. మరో 8 ఏళ్లలో, 2030కల్లా మిగతా 78 శాటిలైట్లను పంపేందుకు భారీగా నిధులను సమీకరించుకుంది. లక్ష్యం పూర్తయితే భూమిపైని ప్రతి అంగుళాన్ని రేయింబవళ్లూ ప్రతి 10 నిమిషాలకోసారి మ్యాపింగ్ చేయగలిగే సామర్థ్యం చైనా సొంతమవుతుంది. ఈ ఫొటోలు వ్యవసాయ, అటవీ ఉత్పత్తి సేవలు, పర్యావరణ పరిశీలన, జియోగ్రాఫికల్ ప్లానింగ్, ల్యాండ్ ప్లానింగ్ తదితర రంగాలకు ఎంతో ఉపయోగపడతాయి. కాగా, జిలిన్–1 ఉపగ్రహాలు తీసిన పంపిన చిత్రాలనే పాకిస్తాన్ 2020లో చైనా నుంచి కొనుగోలు చేసినట్లు సౌత్ ఏసియా మానిటర్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ చిత్రాల్లో కశ్మీర్లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత ఆర్మీ సైనిక క్యాంపుల వివరాలున్నాయని తెలిపింది. ఇప్పటికే భారత్‌తో సరిహద్దుల వెంబడి కయ్యానికి కాలుదువ్వుతూ తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్న చైనా..తాజాగా సమకూర్చుకునే సాంకేతికతతో మరింత రెచ్చిపోయే ప్రమాదముంది. భారత సైన్యం, కదలికలు, సాయుధ సంపత్తి జాడను చేజిక్కించుకుని భద్రతకు ముప్పు కలిగించే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నాగ్‌పూర్‌లో శాటిలైట్ల తయారీ
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో త్వరలోనే కృత్రిమ ఉపగ్రహాల తయారీ కేంద్రం రానుంది. ఇక్కడి మల్టీ మోడల్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్, కార్గో హబ్ (ఎంహెచ్ఏఎన్)లో దీన్ని నెలకొల్పనున్నారు. దాదాపు రూ.150 కోట్ల ఖర్చుతో కెనడాలోని ఎన్ఆర్ఐ మిలింద్ పింప్రికర్కు చెందిన కానియస్ అనే కంపెనీ ఈ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి గడ్కరీ, మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. మేకిన్ ఇండియా వీక్ సందర్భంగా నాగ్‌పూర్‌లో ఈ యూనిట్‌ను నెలకొల్పాలనుకోవడం సంతోషంగా ఉందని గడ్కరీ పేర్కొన్నారు. ఈ కేంద్రం స్థాపనతో దాదాపు 500 మందికి ఉపాధి లభించనుంది.